ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?[ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?
https://youtu.be/OFeb-uCup0Q [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత ప్రవక్తలు రారని స్పష్టం చేయబడింది. అయితే, అల్లాహ్ యొక్క ‘ఔలియాలు’ (స్నేహితులు) వస్తూనే ఉంటారని ఖురాన్ లో ఉందని, కానీ వారిని ఆరాధించడం, వేడుకోవడం లేదా వారి సమాధుల వద్ద మొక్కుబళ్ళు చెల్లించడం ఘోరమైన షిర్క్ అని వివరించబడింది. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఔలియాలుగా చేసుకోవద్దని, కేవలం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ ను మాత్రమే అనుసరించాలని సూరతుల్ ఆరాఫ్, సూరతుర్ రఅద్ వంటి ఆయత్ ల ఆధారంగా నొక్కి చెప్పబడింది.

సమాధానం: వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు అంతిమ, చిట్టచివరి ప్రవక్త అని చాలా స్పష్టంగా ఉంది. మరియు ఇక మీరు అడిగిన ప్రశ్న, అల్లాహ్ యొక్క ఔలియాల గురించి ఖురాన్ లో లేదా?

అల్లాహ్ యొక్క ఔలియాల ప్రస్తావన ఖురాన్ లో అనేక సందర్భాలలో ఉంది. కానీ, అల్లాహ్ ను వదిలి ఆ ఔలియాలను మనం వేడుకోవడం లేదా అల్లాహ్ తో పాటు ఆ ఔలియాలతో దువాలు చేయడం, దీని ప్రస్తావన లేదు. ఏముంది ఖురాన్ లో? ఉదాహరణకు మీరు సూరతు యూనుస్ చూశారంటే,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న అవ్లియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్)
వినండి! నిశ్చయంగా అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయమూ ఉండదు, వారు దుఃఖించరు కూడా.

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు ఎవరంటే, విశ్వసించి, దైవభీతితో ఉండేవారు.

ఇప్పుడు నేను తిలావత్ చేసిన రెండు ఆయతులు సూరత్ యూనుస్ 62, 63.

వినండి. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఔలియా, (అలా వినండి, ఇన్న నిశ్చయంగా, ఔలియా అల్లాహ్, అల్లాహ్ యొక్క ఔలియా, వలీలు), లా ఖవ్ఫున్ అలైహిమ్, వారికి ఎలాంటి భయము లేదు. వలా హుమ్ యహ్జనూన్, వారు ఎలాంటి చింతించనవసరము లేదు.

అల్లజీన ఆమనూ, ఎవరు ఆ ఔలియాలు? విశ్వసించిన వారు.
వ కానూ యత్తఖూన్, వారు పాపాలకు దూరంగా ఉండేవారు, భయభీతితో, అల్లాహ్ యొక్క భయభీతితో తమ జీవితం గడిపేవారు.

ఇక వారికి ఎలాంటి రందీ లేదు, ఎలాంటి చింత లేదు, బాధ లేదు, వారు భయపడవలసిన అవసరం లేదు అని అల్లాహ్ చెప్పాడు కదా, మరి ఏముంది వారికి? అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నెంబర్ 64 లో,

لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
(లహుముల్ బుష్రా ఫిల్ హయాతిద్ దున్యా వ ఫిల్ ఆఖిరహ్)
ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో వారి కొరకు శుభవార్తలు ఉన్నాయి.

అయితే గమనించారా? ఔలియా అల్లాహ్ ల యొక్క ప్రస్తావన ఖురాన్ లో ఉంది. వారి యొక్క ఘనత అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు.

కానీ ఈ రోజుల్లో మన ముస్లిం సోదర సోదరీమణులలో ఎంతో మంది అల్లాహ్ తో పాటు ఇతర ఔలియాలను ఏదైతే వేడుకుంటున్నారో, దువా చేస్తున్నారో, వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి అల్లాహ్ కు చేయవలసిన కొన్ని ఆరాధనలు, ఉదాహరణకు మొక్కుబడులు చెల్లించడం గానీ, మరికొన్ని దర్బారుల, దర్గాల వద్ద జంతువులను బలి ఇవ్వడం గానీ, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించు గాక కొన్ని దర్బారులు ఉదాహరణకు పాకిస్తాన్ లో ఖలందర్ షా దర్గా అని ఉంది, అక్కడ తవాఫ్ కూడా చేస్తారు. నవూజుబిల్లాహ్ సుమ్మ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, మనం ఎలాగైతే తవాఫ్ హజ్రే అస్వద్ నుండి మొదలుపెట్టి అక్కడే పూర్తి చేస్తామో, అలా అక్కడ కూడా వారు ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుండి ప్రారంభం చేస్తారు. ఇలాంటి ఘోరమైన షిర్క్ పనులు ఏవైతే జరుగుతున్నాయో, అల్లాహ్ దివ్య గ్రంథం ఖురాన్ లో వీటిని ఖండించాడు.

ఉదాహరణకు మీరు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ మూడు చూశారంటే,

اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ఇత్తబిఊ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఊ మిన్ దూనిహీ అవ్లియా, ఖలీలమ్ మా తజక్కరూన్)
మీ ప్రభువు వైపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన దానిని మీరు అనుసరించండి. దానిని వదిలి మీరు ఔలియాల వెంట పడకండి. మీరు చాలా తక్కువ గుణపాఠం నేర్చుకుంటున్నారు.

హితోపదేశం ఈ ఖురాన్, హదీసుల ద్వారా ఏదైతే తీసుకోవాలో, దాని నుండి మీరు చాలా తక్కువ హితోపదేశం పొందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించారా?

అయితే స్వయంగా ఆ ఔలియాలు, ఎవరైతే అల్లాహ్ యొక్క నిజమైన ఔలియాలు ఉన్నారో, వారి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. అందులో అనుమానం లేదు. కానీ ఆ ఔలియాలలో ఏ ఒక్క వలీ, ఇక్కడ గుర్తుంచుకోండి నిజమైన వలీ అయితే, ఏ ఒక్క వలీ కూడా మీరు నా సమాధి వద్దకు రండి, నా యొక్క దర్గాల వద్దకు రండి, నన్ను ఆరాధించండి, నాతో దువా చేయండి, నా వద్ద మొక్కుబడులు మీరు చెల్లించండి, ఇలాంటి ఏ ఒక్క మాట చెప్పలేదు.

ఒక్కసారి గనక మీరు సూరతుర్ రఅద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 16 లో గమనిస్తే,

قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا
(ఖుల్ మర్ రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, ఖులిల్లాహ్. ఖుల్ అఫత్తఖజ్తుమ్ మిన్ దూనిహీ అవ్లియాల లా యమ్లికూన లి అన్ఫుసిహిమ్ నఫ్ అన్ వలా దర్ర)
వారితో ప్రశ్నించండి, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? వారితో చెప్పండి, అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు వారికి ఈ ఆదేశం ఇవ్వండి, ఈ హెచ్చరిక చేయండి, వారికి తెలపండి, చెప్పండి వారితో, అల్లాహ్ ను కాదని మీరు వేరే వారిని ఔలియాలుగా చేసుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్లు? వారు స్వయం తమకు ఏ లాభం చేకూర్చలేరు, వారిపై వచ్చి పడిన ఏ నష్టాన్ని వారు దూరం చేసుకోలేరు.

ఔలియా అల్లాహ్, వారిని మనం విశ్వసించాలి. ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యమైన వలీలు ఉన్నారో, వారు అల్లాహ్ యొక్క సత్య వలీలు అని నమ్మాలి. కానీ, ఈ రోజుల్లో వలీల పేరు మీద ఏ దందాలు జరుగుతున్నాయో వాటిని స్వయంగా ఖురాన్ ఖండించినది అన్న విషయం కూడా తెలుసుకోవాలి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=16057

సహాబాలను తూలనాడటం, ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ఆరవ ప్రకరణం: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల(రదియల్లాహు అన్హుమ్)ను, మార్గదర్శక నాయకులను తూలనాడరాదు 

(1) సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) తూలనాడటం పట్ల వారింపు: 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ సంవిధానంలో ఉన్న నిబంధనలలో ఒకటేమిటంటే మహాప్రవక్త ప్రియ సహచరుల (రదియల్లాహు అన్హుమ్) విషయంలో వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండాలి. వారి గురించి నోరు జారకూడదు. అల్లాహ్ తన గ్రంథంలో తెలియజేసినట్లుగా ఉండాలి వారి వైఖరి. 

وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

వారి తరువాత వచ్చిన వారు (వారి గురించి) ఇలా వేడుకుంటారు: “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

ఇంకా వారు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఈ హితవును ఖచ్చితంగా పాటిస్తారు – 

“నా సహచరులను దూషించకండి. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా! మీలో ఏ వ్యక్తి అయినా ఉహుద్ పర్వతానికి సమానంగా బంగారం ఖర్చుచేసినా, వారిలో (అంటే నా ప్రత్యక్ష సహచరులలో)ని వారు దానం చేసిన ఒక ‘ముద్’కు, ఆఖరికి ‘ముద్’లో సగభాగానికి కూడా సమానం కాజాలదు.” (బుఖారీ, ముస్లిం) 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు సహాబాలను దూషించే రాఫిధీల (షియా వారి)తో, ఖవారిజ్ వర్గీయులతో తెగతెంపులు చేసుకుంటారు. వారితో ఎలాంటి స్నేహం, సుహృద్భావం కలిగి ఉండరు. తరచూ సహాబాలను కాఫిర్లు (అవిశ్వాసులు)గా ఖరారు చేసే వీరి ధోరణిని ఖండిస్తారు. వీరిలోని ఏ మంచితనాన్ని అంగీకరించరు. 

ప్రవక్త సహచరుల ఔన్నత్యం గురించి ఖుర్ఆన్ హదీసులలో చెప్పబడిన దానిని అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు శిరసావహిస్తారు. సహాబా ముస్లిం ఉమ్మత్ లో కెల్లా అత్యుత్తములని విశ్వసిస్తారు. ఉదాహరణకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లుగా – 

”మీ అందరిలోకెల్లా ఉత్తములు నా కాలానికి చెందినవారు.” (బుఖారీ, ముస్లిం) 

తన ఉమ్మత్ (అనుచర సమాజం) 73 వర్గాలుగా చీలిపోతుందని, వారిలో ఒకే ఒక వర్గం తప్ప మిగిలిన వారంతా నరకానికి పోతారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినపుడు, ఆ ఒక్క వర్గం ఏదంటూ ప్రియ సహచరులు (రదియల్లాహు అన్హుమ్) అడిగారు. సమాధానంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా అన్నారు : 

“ఈ రోజు నేను, నా సహచరులు ఏ పద్ధతిపై ఉన్నామో ఆ పద్ధతిపై స్థిరంగా ఉండేవారు.”
(ముస్నదె అహ్మద్, తిర్మిజి 2641 హసన్) 

ఇమామ్ ముస్లిం గురువుల్లో ప్రముఖులైన ఇమామ్ అబూజర్అ ఇలా అంటున్నారు:

“ఏ వ్యక్తి అయినా మహాప్రవక్త ప్రియసహచరులలో ఎవరినయినా తూలనాడుతున్నట్లు మీరు గమనిస్తే అతణ్ణి ధర్మవిహీనునిగా పరిగణించండి. ఎందుకంటే ఖుర్ఆన్ సత్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయత్ సత్యబద్దం. కాగా; వీటన్నింటినీ మన వరకూ చేర్చినవారు సహాబీలే (ప్రియ సహచరులే). కాబట్టి వారిని తూలనాడినవాడు ఖుర్ఆన్ హదీసులనే అసత్యంగా ఖరారు చేయదలుస్తున్నాడని అనుకోవాలి. కనుక అలాంటి వ్యక్తి స్వయంగా నిందార్హుడు. అతనిపై ధర్మవిహీనుడు, మార్గవిహీనుడన్న అభియోగం మోపటం చాలా వరకు సమంజసం, సత్యం.” 

అల్లామా ఇబ్నె హమదాన్ తన గ్రంథం ‘నిహాయతున్ ముబ్ త దీన్’లో ఇలా అంటున్నారు :

“ఎవరయితే ప్రవక్త సహచరులను దూషించటం ధర్మసమ్మతం అని భావిస్తూ మరీ దూషిస్తున్నాడో అతను ఖచ్చితంగా కాఫిర్ (అవిశ్వాసి). మరెవరయితే ధర్మసమ్మతం కాదని భావిస్తూ కూడా దూషిస్తాడో అతడు పాపాత్ముడు (ఫాసిఖ్ ).”

ఆయన గారి మరో పలుకు ఇలా ఉంది :

“ఎవరయితే ప్రవక్త ప్రియ సహచరులను దూషిస్తాడో, అతను నిశ్చయంగా కాఫిరే (దాన్ని అతను ధర్మసమ్మతమని భావించినా, భావించక పోయినా). అదేవిధంగా – ఎవరయితే ప్రవక్త సహచరుల (రదియల్లాహు అన్హుమ్)ను అవిధేయులుగా ఖరారు చేస్తాడో లేదా వారి ధర్మావలంబనలో లోపం ఎత్తిచూపిస్తాడో లేదా వారిని కాఫిర్లుగా ఖరారు చేస్తాడో, అతను ముమ్మాటికీ కాఫిర్ (అవిశ్వాసి). (షరహ్ అఖీదతుస్సిఫారీని – 2/388, 389) 

(2) ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు : 

మహిమోన్నతల దృష్ట్యాగానీ, స్థాయి రీత్యాగానీ సహాబా తర్వాత స్థానం, ఉమ్మత్ కు చెందిన మార్గదర్శక నాయకులది. వారే తాబయీన్, తబయె తాబయీన్, ఆ తర్వాత తరానికి చెందిన ఉలమా. వారంతా సహాబాను శాయశక్తులా అనుసరించారు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్దితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. (అత్ తౌబా : 100) 

కనుక వారిని దూషించటం, వారిలోని లోపాలను ఎత్తి చూపటం, వారిపై విమర్శనాస్త్రాలు సంధించటం ఎంతమాత్రం సమ్మతం కాదు. ఎందుకంటే వారంతా మార్గదర్శకులు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటం అయిన మీదట కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపునకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (అన్ నిసా : 115) 

‘కితాబుత్తహావియ’ వ్యాఖ్యాత (ఇమామ్ ఇబ్నె అబీ అజల్ హనఫీ) ఇలా అన్నారు: 

“అల్లాహ్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో స్నేహపూర్వక సంబంధాల తర్వాత తోటి విశ్వాసులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటం ప్రతి ముస్లింకూ తప్పనిసరి. ఈ విషయంలో ఖుర్ఆన్ సర్వ సాధారణమయిన ఆజ్ఞ ఉండనే ఉంది. అయితే మరీ ముఖ్యంగా ప్రవక్తల వారసులతో మనకు స్నేహబంధం ఉండాలి. అల్లాహ్ వారిని ధ్రువతారల మాదిరిగా చేశాడు. నేలలోని, సముద్రాలలోని చీకట్లలో వాటి ద్వారా మార్గం కనుగొనబడుతుంది. వారి మార్గదర్శకత్వంపై, వారి ధర్మావగాహనపై ముస్లింలందరికీ గురి ఉంది.” 

ఎందుకంటే వీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యుల, వారు వదలివెళ్ళిన మృత సంప్రదాయాలను పునరుజ్జీవింప జేసేవారు. వారి మూలంగానే దైవగ్రంథం నెలకొని ఉంది. దాని ఊపిరి మూలంగా వారు కూడా నిలబడి ఉన్నారు. వారి గురించి దైవగ్రంథంలో స్పష్టమయిన వివరణ వచ్చింది. వారు కూడా దానికి ప్రతినిధుల వంటి వారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అనుసరించటం అనివార్యం (వాజిబ్) అన్న విషయంలో వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాని ఒకవేళ వారిలో ఎవరి ఉవాచ అయినా ప్రామాణిక హదీసుకు వ్యతిరేకంగా మన ముందుకువస్తే, ఆ హదీసును పరిత్యజించటంలో ఆయన వద్ద తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది అని మనం భావించాలి. 

సాధారణంగా ఆ కారణం మూడు విధాలుగా ఉంటుంది. 

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం అయి ఉండవచ్చన్న విషయంపై అతనికి నమ్మకం కుదరక పోవచ్చు. 
  2. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ ప్రవచనం ద్వారా చెప్పదలచిన విషయంపై ఇదమిత్థంగా ఒక నిర్ధారణకు రాకపోయి ఉండవచ్చు. 
  3. అది రద్దు అయిపోయిన ఆజ్ఞ కావచ్చు అన్నది అతని నమ్మకం అయి ఉండవచ్చు. 

మొత్తానికి మనందరి మీద వారికి ఆధిక్యత ఉంది. మనకు వారు ఉపకారం చేసినవారు. వారు మనకన్నా ముందే విశ్వసించినవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందజేసిన ధర్మాన్ని వారు మన వరకూ చేర్చారు. మనకు అర్థం కాకుండా నిగూఢంగా ఉండిపోయే ఎన్నో విషయాలను వారు మనకు విడమరచి చెప్పారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతుష్టపరచుగాక! 

رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

కొంతమంది విద్వాంసుల (ఉలమా)చే ధర్మసూత్రాల అన్వయింపు (ఇత్తెహాదీ) ప్రక్రియలో దొర్లిన తప్పుల మూలంగా వారి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేయటం బిదతీల విధానం. ఇలాంటి వాటి కోసం ఇస్లాం విరోధులు కాచుకుని ఉంటారు. తద్వారా ఇస్లాం గురించి లేనిపోని సందేహాలు సృష్టించటానికి, ముస్లిముల మధ్య వైరభావం పుట్టించటానికి శాయశక్తులా యత్నిస్తారు. భావి తరాలవారు తమ పూర్వీకుల (సలఫ్) పట్ల విముఖతను, విసుగును వ్యక్తం చేసేలా కుట్ర పన్నుతారు. విద్వాంసులకు – నవ యువకులకు మధ్య విభేదాలను సృష్టిస్తారు. వారి మధ్య పూడుకోని అంతరాల అగాధాలను కల్పిస్తారు. నేడు సర్వత్రా జరిగేది కూడా ఇదే. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న నవయువకులు ఈ స్వార్థపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు ధర్మవేత్తల (ఫుకహా) యొక్క, ఇస్లామీయ ధర్మశాస్త్రం (ఫికప్) యొక్క స్థాయిని దిగజారుస్తారు. 

దానిని చదవటం, చదివించటం పట్ల, దానిలో ఉన్న శ్రేయోదాయకమయిన విషయాలను, సత్యాన్ని సంగ్రహించటం పట్ల తమ అనాసక్తతను, విసుగును ప్రదర్శిస్తూ ఉంటారు. మొత్తానికి వారు తమ ఫికహ్ (ధర్మశాస్త్రం)ను గర్వకారణంగా భావించాలి. తమ విద్వాంసులను గౌరవించాలి. మార్గవిహీనుల, స్వార్థపరుల దుష్ప్రచార జాలంలో మాత్రం చిక్కుకోరాదు. 


నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[36 నిముషాలు]
వక్త:సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఉమర్‌ (రజియల్లాహు అన్హు) గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగా: ఉమర్‌ (రజియల్దాహు అన్హు) ఓ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్‌!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వస్లలం)ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడు: ‘నీవు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్‌ అన్నాడు: ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడు: ‘దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్‌! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’.

ఉమర్‌ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్‌ బిన్‌ అరత్త్‌ (రజియల్లాహు అన్హు) వారింట్లో ఉన్నాడు. ఖుర్‌ఆన్‌ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్‌ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్‌ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్‌ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి? అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్‌ అన్నాడు: బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడు: ‘ఉమర్‌! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్‌ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్‌ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్‌ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అంది: “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వ అష్‌ హదు అన్న ముహమ్మదర్‌ రసూలుల్లాహ్‌“. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్‌ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్‌ అల్లాహ్‌ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.

ఉమర్‌ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పింది: నీవు అపరిశుద్దునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్‌ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి’ అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్‌ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవప్రదంగా ఉంది, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.

ఉమర్‌ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్‌! “అల్లాహ్‌! ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ లేదా అబూ జహల్‌ బిన్‌ హిషామ్‌ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.

ఆ తర్వాత ఉమర్‌ (రజియల్లాహు అన్హు) తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్‌ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా (రజియల్లాహు అన్హు) ప్రజలను గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్‌ అని వారన్నారు. అప్పుడు హంజా (రజియల్లాహు అన్హు) అన్నారు: ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్‌ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్‌ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.

సుహైబ్‌ రూమి (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చోగలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్‌) చేయగలిగాము’.

అబ్దుల్లాహ్ బిన్‌ మస్‌ఊద్‌ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు? ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

ముహమ్మద్ – అంతిమ ప్రవక్త (Muhammad, the final Prophet)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

సహాబా

ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు| విశ్వాస పాఠాలు | హదీసు 13 [వీడియో]

బిస్మిల్లాహ్

[8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُولُ اللهِ : (إِذَا أَسْلَمَ الْعَبْدُ فَحَسُنَ إِسْلَامُهُ كَتَبَ اللهُ لَهُ كُلَّ حَسَنَةٍ كَانَ أَزْلَفَهَا وَمُحِيَتْ عَنْهُ كُلُّ سَيِّئَةٍ كَانَ أَزْلَفَهَا ثُمَّ كَانَ بَعْدَ ذَلِكَ الْقِصَاصُ الْحَسَنَةُ بِعَشْرَةِ أَمْثَالِهَا إِلَى سَبْعِ مِائَةِ ضِعْفٍ وَالسَّيِّئَةُ بِمِثْلِهَا إِلَّا أَنْ يَتَجَاوَزَ اللهُ عَزَّ وَجَلَّ عَنْهَا)

13- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు. గతంలో చేసిన అతని ప్రతి పాపం మన్నించబడుతుంది. ఆ తర్వాత పుణ్యపాపాల ఫలితాల లెక్క కొత్తగా మొదలవుతుంది. ఒక సత్కార్య పుణ్యం పది రెట్ల నుండి ఏడువందల వరకు లభిస్తుంది. దుష్కార్య పాపము దానంతే లభిస్తుంది. అల్లాహ్ దయతలుస్తే మన్నించనూవచ్చు”. (నిసాయీ 4912).


ఈ హదీసులో:

కొందరు సంపూర్ణంగా ఇస్లాం ప్రకారం నడిచేవారుంటే మరికొందరు అసంపూర్ణంగా నడిచేవారుంటారు. అందుచేత వారిలో ఒకరిపై మరొకరికి ఘనత ఉంటుంది. అందుకే అది (ఇస్లాం, ఈమాన్) తరుగుతుంది, పెరుగుతుంది. ఇస్లాంలో ప్రవేశం ద్వారా పూర్వ పాపాలన్నీ మన్నించబడతాయి. అలాగే తౌబా (నిజమైన పశ్చాత్తాపంతో కూడిన క్షమాభిక్ష) ద్వారా పాపాలు మన్నించబడతాయి. అంతేకాదు సంకల్పశుద్ధి మరియు ప్రవక్త పద్ధతిని అనుసరించి చేసిన సత్కార్యాలు కూడా దుష్కార్యాలకు పరిహారమవుతాయి. అల్లాహ్ కారుణ్యం చాలా విశాలమైనది. అందుకే సత్కార్య పుణ్యాన్ని పది రెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు పెంచాడు. దుష్కార్య పాపం దానంతే ఉంచాడు. ఒక్కోసారి అల్లాహ్ దయతలచి సత్కార్యాలకు బదులుగా కాకుండా తనిష్టంతో పాపాల్ని మన్నిస్తాడు. కాని పెద్ద పాపాల మన్నింపుకై తప్పనిసరిగా తౌబా చేయవలసిందేనని ఆధారాలుగలవు. అవిశ్వాసుని ఏ ఒక్క కార్యం స్వీకరించబడదు అన్న విషయం తెలిసినదే. అయినా ఈ హదీసు ద్వారా కూడా తెలిసింది. ఈ హదీసులో దాసుడు అని సాధారణంగా చెప్పబడినది, అయితే స్త్రీలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

విశ్వాసి, అవిశ్వాసి కన్నా ఎక్కువ గౌరవ, మర్యాదలకు అర్హుడు | విశ్వాస పాఠాలు | హదీసు 12 [వీడియో]

బిస్మిల్లాహ్

[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ عَائذِ بنِ عَمرو أَنَّهُ جَاءَ يَومَ الْفَتحِ مَعَ أبِي سُفيانَ بنِ حَربٍ وَرَسُولُ اللهِ حَولَه أصْحَابُهُ فَقَالُوا: هَذَا أبُو سُفيانَ وَعَائِذُ بنُ عَمرو فَقَالَ رَسُولُ اللهِ : (هَذَا عَائِذُ بنُ عَمرو وَأبو سُفيَانَ ، الإسْلاَمُ أَعَزُّ مِنْ ذَلِكَ، الإسلاَمُ يَعْلُو وَلاَ يُعلى).

12- ఆయిజ్ బిన్ అమ్ర్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, మక్కా జయింపబడిన రోజు అతను అబూ సుఫ్యాన్ (*) తో కలసి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాడు. ఆయన చుట్టూ కూర్చొని ఉన్న సహచరులు (వీరు వస్తున్నది చూసి) అదిగో అబూ సుఫ్యాన్ మరియు ఆయిజ్ బిన్ అమ్ర్ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“వీరు ఆయిజ్ బిన్ అమ్ర్ మరియు అబూ సుఫ్యాన్. ఇస్లాం ధర్మం ఇతనికంటే గౌరవనీయమైనది, గొప్పది. ఇస్లాం ధర్మం ఎన్నటికీ అగ్రస్థానం లో ఉంటుంది తప్ప క్రిందికి వంగి ఉండదు సుమా”.

(సునన్ దార్ ఖుత్నీ, సుననుల్ కుబ్రా బైహఖీ. అల్ ఇర్వా 1268).

(*) ఆ సమయాన అబూ సుఫ్యాన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. కాని ఆయిజ్ బిన్ అమ్ర్  అప్పటికే ఇస్లాం స్వీకరించిఉన్నారు.


ఈ హదీసులో:

సర్వ మతాల్లోకెల్లా ఇస్లాం మాత్రమే అల్లాహ్ యొక్క సత్య ధర్మం. విశ్వాసి, అవిశ్వాసికన్నా ఎక్కువ గౌరవ, మర్యాదలకు అర్హుడు. ఆ అవిశ్వాసి ఎంత గొప్ప స్థానం, హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడైనా సరే. ఎందుకంటే ఇస్లాం వీటన్నిటికంటే గొప్పది. గౌరవం, ప్రతిష్ట, ప్రేమ మర్యాదల్లో విశ్వాసి, అవిశ్వాసులు సమానులు కాజాలరు. ముస్లిం వద్ద ఇస్లాం ఉన్నందువల్ల అతని మాటే వేరు.

విశ్వాసి, అవిశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడవుతాడు కాని అవిశ్వాసి, తన విశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడు కాడని కొందరు పండితులు సిద్ధాంతీకరించారు. కాని నిజమైన మాటేమిటంటే విశ్వాసి, అవిశ్వాసులిద్దరూ పరస్పరం ఆస్తిలో హక్కుదారులు కాజాలరు.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

సూరతుల్ కహ్‘ఫ్ తఫ్సీర్ | 26వ భాగం | చివరి క్లాస్| ఆయతులు 100 – 110 [వీడియో]

బిస్మిల్లాహ్

[53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సూరా అల్ కహఫ్ (ఆయతులు 100 – 110)

18:100 وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكَافِرِينَ عَرْضًا
ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము.

18:101 الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَن ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا
నా స్మరణ పట్ల వారి కళ్లు పొరలు క్రమ్ముకుని ఉండేవి. అప్పుడు వారు (సత్య వాక్కును) వినే స్థితిలో కూడా లేరు.

18:102 أَفَحَسِبَ الَّذِينَ كَفَرُوا أَن يَتَّخِذُوا عِبَادِي مِن دُونِي أَوْلِيَاءَ ۚ إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا
ఇప్పుడీ అవిశ్వాసులు, నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? (వినండి!) మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధంచేసి ఉంచాము.

18:103 قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْأَخْسَرِينَ أَعْمَالًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయే వారెవరో నేను మీకు చెప్పనా?

18:104 الَّذِينَ ضَلَّ سَعْيُهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ يَحْسَبُونَ أَنَّهُمْ يُحْسِنُونَ صُنْعًا
“తమ ప్రాపంచిక జీవితపు ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నప్పటికీ, తాము చేసేదంతా సజావుగానే ఉందని భ్రమ పడేవారే వారు.”

18:105 أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ وَلِقَائِهِ فَحَبِطَتْ أَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا
తమ ప్రభువు ఆయతులను, ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసి పుచ్చినవారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయదినాన మేము వారి కర్మల బరువును తూయము.

18:106 ذَٰلِكَ جَزَاؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا وَاتَّخَذُوا آيَاتِي وَرُسُلِي هُزُوًا
వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు (సత్యాన్ని) తిరస్కరించారు. నా ఆయతులను, నా ప్రవక్తలను పరిహసించారు.

18:107 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا
అయితే విశ్వసించి, సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు వనాలు ఉన్నాయి.

18:108 خَالِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلًا
వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడి కైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు.

18:109 قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا
(ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు : “ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే, అది అయి పోతుంది.” – మేము మళ్లీ దాని వంటిదే (మరో సముద్రం) దాని సహాయార్థం తెచ్చినాసరే.”

18:110 قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا
(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నేనూ మీలాంటి మానవ మాత్రుణ్ణే.(కాకపోతే) ‘మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్య దైవం’ అన్న సందేశం (వహీ) నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.”


యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1Ham7KTDLUrhABquy8NoCa

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

తప్పిపోయిన నమాజ్ (ఖదా నమాజ్) ఎలా చేయాలి? ఖదా నమాజ్ గురించి వివిధ ప్రశ్నలు మరియు సమాధానాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[6 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రధీతు బిల్లాహి రబ్బన్, వ బిల్ఇస్లామి దీనన్, వబి ముహమ్మదిన్ రసూలన్ | విశ్వాస పాఠాలు | 11వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

[13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ أَنَّ رَسُولَ اللهِ قَالَ: (يَا أَبَا سَعِيدٍ مَنْ رَضِيَ بِاللهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ نَبِيًّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ).

11- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )ఉపదేశించారని, అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ అబూ సఈద్! అల్లాహ్ ను తన పోషకునిగా విశ్వసించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా నమ్మినవాడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 1884).

ఈ హదీసులో:

ఈ మూడింటిని ఎవరైతే పూర్తి విశ్వాసముతో, స్వచ్ఛత, సంకల్పశుద్ధితో నోటి ద్వారా పలుకుతాడో తప్పక అల్లాహ్ అతనిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఎందుకనగా మూడు విషయాల్ని అతడు వాస్తవం చేసిచూపాడు. మరియు ధర్మానికి సంబంధించిన ముఖ్య పునాదుల్ని నమ్మాడు. అవిః అల్లాహ్ పట్ల విశ్వాసం. సత్యధర్మ స్వీకారం. సత్యవంతులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నమ్మకం.

—-

رَضيتُ بالله رَبّاً ، وبالإسلامِ ديناً ، وبمحمَدِ نَبِيًّا ، وَجَبَتْ له الجنَّةُ
“రధీతుబిల్లాహి రబ్బా, వబిల్ ఇస్లామి దీనా, వబి ముహమ్మదిన్ నబియ్యా“ ఎవరు ఈ దుఆ ఉదయం చదువుతారో, అతని చేయిని పట్టుకొని స్వర్గంలో ప్రవేశింపజేస్తానని ప్రవక్త పూచీ తీసుకున్నారు

والحديث فيه أخرجه الطبراني في “المعجم الكبير” (20/355) ، من طريق الْمُنَيْذِرِ صَاحِبِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – وَكَانَ يَكُونُ بِإِفْرِيقِيَّةَ – قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ قَالَ إِذَا أَصْبَحَ: رَضِيتُ بِاللهِ رَبًّا ، وَبِالْإِسْلَامِ دِينًا ، وَبِمُحَمَّدٍ نَبِيًّا ، فَأَنَا الزَّعِيمُ لِآخُذَ بِيَدِهِ حَتَّى أُدْخِلَهُ الْجَنَّةَ . والحديث حسنه بهذا اللفظ الشيخ الألباني في “السلسلة الصحيحة” (2686) .

ఎవరు అజాన్ లో షహాదతైన్ సందర్భంలో (లేదా చివరిలో) చదువుతారో వారి పాపాలు మన్నించబడతాయి. (సహీ ముస్లింలో 386)

أخرجه مسلم في “صحيحه” (386) ، من حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ، عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:

مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْمُؤَذِّنَ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ ، رَضِيتُ بِاللهِ رَبًّا ، وَبِمُحَمَّدٍ رَسُولًا ، وَبِالْإِسْلَامِ دِينًا ، غُفِرَ لَهُ ذَنْبُهُ .

మరెవరయితే ఎప్పుడైనా (సమయం నిర్థారిత కాకుండా, స్వచ్ఛమైన మనస్సుతో, అర్ధభావాలను తెలుసుకోని, ఆచరించి) చదువుతాడో అతని కొరకు స్వర్గం తప్పనిసరి. (అబూదావూద్ లోని సహీ హదీస్ 1368)

من حديث أبي سعيدِ الخدريَّ ، أن رسولَ الله – صلَّى الله عليه وسلم – قال: مَنْ قال: رَضيتُ بالله رَبّاً ، وبالإسلامِ ديناً ، وبمحمَدِ رَسولاً ، وَجَبَتْ له الجنَّةُ . والحديث صححه الشيخ الألباني في “صحيح أبي داود” (1368) .


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు? [ఆడియో]

బిస్మిల్లాహ్

[9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(2) ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు?

A) సహరీ వరకు
B) జొహ్ర్ వరకు
C) ఇఫ్తార్ వరకు

ఆన్సర్ : ఇఫ్తార్ వరకు (ఇది జఈఫ్ హదీస్ )

وتستغفر لهم الملائكةُ حتى يُفطروا

ఈ హదీసును తమ హదీసు గ్రంథాలలో ప్రస్తావించిన ఇమాముల్లో: ఇమాం అహ్మద్, 7917, ఇమాం బజ్జార్ 963, ముహమ్మద్ బిన్ నస్ర్ మిర్వజీ ఖియాము రమజాను 112లో, ఇమాం బైహఖీ షుఅబుల్ ఈమాన్ 3602లో

حَدَّثَنَا يَزِيدُ، أَخْبَرَنَا هِشَامُ بْنُ أَبِي هِشَامٍ، عَنْ مُحَمَّدِ (1) بْنِ الْأَسْوَدِ، عَنْ أَبِي سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمَنِ، عَنْ أَبِي هُرَيْرَةَ

ఈ హదీసును ఇంత మంది ఇమాములు ఉల్లేఖించినప్పటికీ ఇది జఈఫ్, దీనికి కారణం ఈ హదీసు పరంపరలో ఒకరు హిషామ్ బిన్ అబీ హిషామ్ జఈఫ్ అని హదీసు శాస్త్రవేత్తలందరూ ఏకీభవించారు. ఇక ముహమ్మద్ బిన్ అస్వద్ గురించి మజ్ హూలుల్ హాల్ అని చెప్పడం జరిగింది. ఇది జఈఫ్ అన్న విషయం మీకు తెలియజేస్తూ కొంత వివరణ ఇవ్వడానికే ఈ ప్రశ్న తీసుకురావడం జరిగింది.

అయితే దైవదూతలు సర్వ సామాన్యంగా విశ్వాసుల కొరకు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తావన సూర ఘాఫిర్ 40:7 లో వచ్చి ఉంది.

الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ * رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ * وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ

అర్ష్‌ (అల్లాహ్‌ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్న వారు (దైవదూతలు) స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: “మా ప్రభూ! నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించినవారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు.  “మా ప్రభూ! నువ్వు వారికి వాగ్దానం చేసివున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా (స్వర్గంలో స్థానం కల్పించు). నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. “వారిని చెడుల నుండి కూడా కాపాడు. యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడినవారిపై నీవు (అమితంగా) దయ జూపినట్లే. గొప్ప సాఫల్యం అంటే అదే!”

నుండి: https://teluguislam.net/2020/04/19/quiz-51/

ఇతరములు:

నిశ్చయంగా ధర్మం సులువైనది, దాని అనుసరణలో కాఠిన్య వైఖరి పాటించవద్దు | విశ్వాస పాఠాలు | 10వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం

[10 నిముషాలు]

రెండవ భాగం

[20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ قَالَ: (إِنَّ الدِّينَ يُسْرٌ وَلَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ إِلَّا غَلَبَهُ فَسَدِّدُوا وَقَارِبُوا وَأَبْشِرُوا وَاسْتَعِينُوا بِالْغَدْوَةِ وَالرَّوْحَةِ وَشَيْءٍ مِنْ الدُّلْجَةِ).

10 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

“నిశ్చయంగా ధర్మం సులువైనది. ఏ వ్యక్తి అయినా ధర్మం అనుసరణలో కాఠిన్య వైఖరి అవలంబిస్తే ధర్మమే అతనిపై ఆధిక్యత  సాధిస్తుంది. (హెచ్చుతగ్గులు లేకుండా) సంపూర్ణ విధానాన్ని అవలంభించండి. లేదా దాని (సంపూర్ణతకు) సమీపాన చేరండి. (మీకు లభించే ప్రతిఫలంతో) సంబర పడండి. ఉదయసాయంకాల, మరి కొంత రాత్రి సమయాల్లో (ఆరాధన చేయటం) ద్వారా సహాయాన్ని అర్థించండి”. (బుఖారి 39).

ఈ హదీసులో:

దీర్ఘ కాలం వరకు అల్లాహ్ ఆరాధన చేస్తూ ఉండడానికి మనిషి చురుకుగా ఉండే సమయాల సహాయం తీసుకోవాలి. అంటే ఆ సమయాల్లో ఆరాధనలు పాటించాలి. ఎల్లప్పుడూ చేస్తూ ఉండే అల్పమైన ఆచరణలు, కొంత కాలం చేసి వదిలేసే అధిక ఆచరణల కంటే మేలైనవి. ఇస్లాం ధర్మం ప్రత్యేకతల్లో ఒకటి ఏమిటంటే అది చాలా సులభమైన ధర్మం. దాని ఆదేశాలు, నివారణలు మనిషి పాటించగలిగినవే. (అంటే మనిషి శక్తికి మించినవి కావు). శక్తికి మించిన శ్రమ భారాన్ని, ప్రవక్త సాంప్రదాయానికి భిన్నంగా అదనపు ఆరాధనల పాటింపును నెత్తిన వేసుకోవడం నివారించబడినది. ఎలాంటి హెచ్చుతగ్గింపులు లేకుండా మధ్యేమార్గాన్ని అవలంభించాలన్న తాకీదు ఉంది. అదే రుజుమార్గం. మనిషి తన ఆరాధనలో పరిపూర్ణతకు చేరుకోలేక పోయినా దాని సమీపానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఉదయం చేసే ఆరాధన, సత్కార్యాల ఘనత తెలిసింది. ఆ సమయం సత్కార్యాల అంగీకార రీత్యా, మరియు వాటిని పాటించుట కూడా చాలా అనుకూలమైనది. రాత్రి పూట కొంత సమయం తహజ్జుద్ లో గడిపే ఘనత కూడా తెలిసింది. అది అల్లాహ్ దయతో సదుద్దేశాలు సంపూర్ణమగుటకు ఆయన సహాయం లభించును. అస్ర్ అయిన వెంటనే మరియు మగ్రిబ్ కు ముందు ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణ (జిక్ర్)లో ఉండుట అభిలషణీయం. మధ్యేమార్గంలో ఉండి, అల్లాహ్ ప్రసన్నత పొందే సత్కార్యాలు చేస్తూ, ప్రవక్త సంప్రదాయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తున్న విశ్వాసునికి మంచి శుభవార్తలు ఇవ్వబడ్డాయి.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw