ఉరుసులు, దర్గాల వాస్తవికత

బిస్మిల్లాహ్

దర్గాలు

1- దర్గాలు అంటే; కొంత మంది ప్రజలు ఒక పుణ్యాత్ముని సమాధిని ఎన్నుకొని, అక్కడ మహిమలు జరుగుతున్నాయని దానిపై గుంబద్‌లు, గోపురాలు నిర్మించి, అక్కడ అర్చకులుగా కొంత మంది కూర్చుని కొన్ని కార్యకలాపాలను నిర్వహించుకొనే స్థలాలను “దర్గాలు” అంటారు.

2- సమాధి చేయబడి ఉన్న వారి సంతానం నుండి ఒక వారసుణ్ణి “సజ్జాదా నషీన్‌(పీఠాధిపతి) గా ఎన్నుకుంటారు. వారినే “పీర్‌ సాహెబ్” అంటారు. మరియు సమాధి చేయబడిన వ్యక్తిని “వలీఅల్లాహ్” గా భావించి దర్గా నిర్మాణం చేస్తారు.

౩- కొంత మంది స్వార్థపరులు అడవుల్లో, కొండల్లో, లేక పట్టణము యొక్క పొలిమేరన ఒక సమాధిని ఉద్బవింపజేసుకొని, దానికి ఒక పుణ్యాత్ముని పేరుపెట్టి, ఆ సమాధి వల్ల అనేక “కరామత్‌లు” (మహిమలు) జరుగుతున్నాయంటూ కట్టుకథలు చెప్పుకుంటారు. ఇలా వివిధ రకాలుగా ‘దర్గా’లను నిర్మంచుకుంటారు.

దర్గాల అలంకరణ:

దర్గాల నిర్వాహకులు దర్గాల అలంకరణ కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. మొట్ట మొదట సమాధులను పటిష్టవంతం చేస్తారు. తరువాత దానిపై ఒక మహా కట్టడాన్ని నిర్మిస్తారు. మశీదుల గుంబద్‌ల వలే దానిపై కూడా గుంబద్‌లు నిర్మిస్తారు. పచ్చటి మరియు కాషాయ రంగులతో సమాధిని కలర్‌ చేస్తారు. చివరికి ఒక పటిష్టవంతమైన ఆరాధన నిలయంగా నిర్మిస్తారు. తరువాత ప్రతి ఏట ఆ సమాధులను ఆకర్ణణీయకంగా, మనోరంజకంగా రూపుదిద్దుతారు. దర్గాలను మరియు వాటిలో ఉన్న సమాధులను నీళ్ళతో కడిగి శుభ్రపరుస్తారు. తరువాత వాటిపైన సిల్కు చాదర్లు మరియు పూల దండలు కప్పుతారు, దర్గా మొత్తం ఎర్రటి మరియు పచ్చటి లైట్లతో అలంకరిస్తారు. పవిత్రంగా భావించి సమాధి చుట్టు దీపాలు వెలిగిస్తారు, సాంబ్రాణి పొగలు రేకెత్తిస్తుంటారు. అక్కడ “ముజావర్‌” గౌరవ మర్యాదలతో కూర్చొని, అక్కడికి ఆరాధన భావంతో వచ్చేవారి కోసం సమాధి పూజలు (ఫాతిహాలు) జరుపుతుంటారు.

ఉరుస్‌ ఆచారాలు:

అరబీ నిఘంటువులో “ఉర్స్‌” అర్దం: పెళ్ళి కొడుకు లేక పెళ్ళి మరియు సంతోషం అన్న అర్దాలున్నాయి. దీనినే ప్రజలు ఉరుస్‌ అని అంటుంటారు.

మన సమాజంలో ప్రసిద్ది చెందిన ‘ఉరుస్‌‘ అంటే: పుణ్యాత్ముల పేరున నిర్మించబడిన దర్గాల (సమాధుల) వద్ద ప్రతి ఏట మరణదినం (వర్ధంతి) ఉత్సవాలు నెరవేర్చి ‘ఉరుస్‌’ అనే వ్యతిరేకమైన పదాన్ని వాడుతున్నారు.

పుణ్యాత్ముడని భావించిన వ్యక్తి మరణించిన తేది ప్రకారం అతని సమాధిపై ‘సందల్‌ కి రస్మ్‌‘ పేరుతో పూల పందిరిని తయారు చేసుకొని ఊరంతా ఊరేగిస్తూ, మహా హంగామా చేసుకుంటూ, దర్గాకి చేరుకొని అక్కడున్న సమాధిపై దానిని ఉంచుతారు. అలాగే జండాను కూడా ఊరంతా ఊరేగిస్తూ తీసుకొచ్చి ఆ దర్గాలోనే ఒక చెట్టున పాతి పెడతారు. దానిని ‘ఝoడా చెట్టు’ అంటారు. మరియు “మలంగ్‌” అనే వ్యక్తి మూడు రోజుల వరకు కాళ్ళను, చేతులను దారాలతో బంధించుకొని ఆ దర్గాలోనే బస చేస్తాడు. ఆ మూడు రోజుల వరకు తినుటకై అతను పండ్లు ఫలాలు మరియు పాలు తీసుకుంటాడు. తరువాత చివరి రోజున ఫకీర్లుజర్బ్”  పేరున తమ శరీరాలలో కమ్మీలు, కత్తులు పొడుచుకునే ‘కనికట్టు‘ నాటకాలు బహిరంగంగా నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలను మూడురోజుల పాటు జరుపుతారు. తరువాత జనసంఖ్య రాకను బట్టి ఉరుసును 15 రోజుల వరకు పెంచుకుంటారు. మరియు ఆ రోజుల్లో సమాధి చుట్టుప్రక్కల మహా సంతను ఏర్పాటు చేస్తారు. ఆ సంతలో నలువైపుల నుండి వ్యాపారస్తులు అక్కడికి చేరుకొని తమ సామగ్రి అమ్మకాలు జోరుగా జరుపుకుంటారు. ఆ దర్గా సిబ్బంది ఆ వ్యాపారస్తుల నుండి బాడుగ పేరుతో సొమ్మును వసూలు చేస్తారు. ఆ సంతలో ప్రత్యేకమైన, ఆకర్షనీయమైన ఖవ్వాలీ పాడే గాయని, గాయకులు ఆటపాటల కచ్చేరీలు రాత్రంతా నిర్వహిస్తారు. ఆ రాత్రుల్లో మద్య పానీయాలు సేవించి, మతిపోయే గంజాయి త్రాగుడుతో అనేక మంది ప్రజలు ఊగుతూ తూగుతుంటారు. ఆ ‘ఉరుసుల’లో పిల్లలు, పెద్దలు మరియు వృద్దులు, ఆడా మగా, హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొంటారు. దీనిని పుణ్యాత్ముల పేరిట ‘“ఉరుస్‌” ఉత్సవాలు అని జరుపుకుంటారు.

ఈ ఆచారాలకు మరియు ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. కనుక ఇది ఇస్లామీయ ధర్మ ఆచారం అనటం కూడా ఘోరమైన పాపమే.

దర్గాల గురువులు మరియు వారి వాస్తవికత

సమాధి ఆధిపత్యానికి చెందిన పీర్‌సాహెబ్‌ (పీఠాధిపతి) చుట్టూ కొందరు ప్రత్యేకమైన శిష్యులు ఉంటారు, వారిని ‘ముజావర్లు” అంటారు. వీరే అక్కడికి వచ్చే ప్రజలకు గురువులు, ఆ సమాధులకు అర్చకులు. వీరు ఇస్లామీయ ధర్మఙ్ఞానం లేని మూర్ఖులు, మత్తుపానీయాలు సేవించే మస్తాన్లు, గంజాయి సిగరెట్లు కాల్చే గుణహీనులు, తంబాకు మరియు పాన్‌పరాక్‌ నమిలే  అసమర్థులు, ప్రజల విశ్వాసాలతో ఆడుకునే మంత్రగాళ్ళు, భయంభక్తి లేని షైతానులు, మోసగాళ్ళకే మోసగాళ్ళు, అమాయక ప్రజల సొమ్మును దోచుకొనే గజదొంగలు, పొట్టకొస్తే అక్షరం ముక్కరాని అజ్ఞానులు, లేనిపోని కట్టు కథలు “ఔలియాల కరామతులు” (మహిమలు) అంటూ ఉపన్యాసాలు పీకుతారు. అమాయక ప్రజలను మూఢ విశ్వాసాల లోయలోకి నెట్టుతారు. అలా సమాధి చేయబడి ఉన్నవారిని మరియు ఆ పీఠాధిపతిని దేవుని స్థాయికి పెంచి స్పష్టమైన షిర్క్‌ కార్యాకాలాపాలు నిర్వహస్తుంటారు.

అలాంటి గుణహీనులు సంతానం లేనివారికి సంతాన ప్రాప్తిని, నిరుద్యోగులకు ఉద్యోగాలను, కష్టాల నుండి రక్షణను, నష్టాల నుండి లాభాలను, దుఃఖాల నుండి సుఖాలను, అశాంతి నుండి శాంతిని, అస్వస్థత నుండి స్వస్థతను, చేతబడి నుండి రక్షణను, అపజయాల నుండి విజయాలను, అగౌరవం నుండి గౌరవాలను ప్రసాదిస్తారా! అంతే కాదు, దేవుని ఆరాధన లేకుండానే పరలోక మోక్షాన్ని, స్వర్గ ప్రవేశ పత్రాలను సయితం ప్రసాదిస్తామంటూ, ఆ పత్రాలను కొన్నవారికి స్వర్గమే నిలయమంటూ ప్రచారం కూడా చేస్తుంటారు.

ఇస్లాం ధర్మంలో సమాధుల కట్టడాలు , వాటిపై ముజావర్లుగా కూర్చోవటం నిషిద్ధం:

సమాధులను సున్నంతో లేక సిమెంట్‌తో పటిష్టవంతంగా నిర్మించడం, వాటిని గొప్ప స్థానానికి పెంచడం, అక్కడ పీఠాధీపతులు (ముజావర్‌)గా కూర్చోవడం అధర్మమైనది. మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటి గురించి కఠినంగా హెచ్చరించారు.

హజ్రత్ జాబిర్‌ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం):

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“సమాధిని పటిష్టవంతం చేయడాన్ని, దానిపై (ముజావర్లుగా) కూర్చోవటాన్ని, దానిపై కట్టడం నిర్మించడాన్ని నిషేధించారు” (ముస్లిం :970)

హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు:

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“ప్రతి ఆరాధ్య విగ్రహాన్ని పగలగొట్టు మరియు ప్రతి ఎత్తుగా ఉన్న సమాధిని నేలమట్టం చెయ్యి.” (ముస్లిం :969)

ఇక్కడ ఎత్తుగా కట్టబడిన సమాధిని సహితం నేలమట్టం చేయవలసిందిగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. అయిన మన అమాయక ముస్లింలు పుణ్యాత్ముల పేరుతో లేక మహానీయుల పేరుతో సమాధుల్ని ఎత్తుగా కట్టడమే కాకుండా, వాటిపై పటిష్టవంతమైన గోపురాలు కట్టి, ఆరాధ్య నిలయాలుగా చేసుకున్నారు. మరియు వాటి వద్ద ముజావర్లగా నియుక్తులై అమాయక ప్రజలను ధర్మం పేరుతో మోసగిస్తున్నారు.

సమాధుల ఆరాధన

అనేక మంది ప్రజలు మూఢ విశ్వాసాలకు గురికాబడి, సమాధుల వద్దకు జియారత్‌ పేరున, వాటి ఆరాధనకై పలు ప్రదేశాలకు ప్రయాణిస్తుంటారు. మరియు కొంత మంది ప్రజలు హజ్‌ ఆరాధనకు ప్రయాణించినట్లు సమాధుల ఆరాధనకై ప్రయాణిస్తారు. ఏ విధంగానయితే ఒక్క అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలో అదే విధంగా ఆ సమాధులను ఆరాధిస్తారు. అంటే: “దర్గాల వద్ద సజ్దాలు  చేయటం, వాటి చుట్టూ ప్రదక్షణలు చేయటం, అక్కడ తలనీలాలు అర్పించటం, వాటి ముందు భయంభక్తిని చూపటం, అక్కడ నమాజులు చదవటం, ఖుర్‌ఆన్‌ పారాయణం చేయటం, వారిని మొరపెట్టుకోవటం, వారి పేరుతో మొక్కుబడులు చెల్లించటం, వారి పేరున జంతువులను బలినివ్వటం, అక్కడ అన్నదానాల ఏర్పాటు చేయటం, తమ మొక్కుబడుల ప్రకారం అక్కడ బస చేయటం వంటి అనేక విధాల ఆరాధనలు పాటిస్తారు.

ఆ సమాధుల పట్ల అతిగా ప్రవర్తిస్తూ వాటిని చుంబించటం, అక్కడ కాల్చబడిన అగరబత్తీల వీబూదిని తబ్బరుక్‌గా  భావించి తినడం, దానిని శరీరంపై రుద్దుకోవటం, అక్కడ దీపాలుగా వెలిగించబడిఉన్న నూనెను, సమాధిపై ఉన్న పూలను తబ్బరుక్‌గా తీసుకోవటం, టెంకాయలు మరియు తీపు వస్తువులు ఆ సమాధుల కొరకు అర్పించి, వాటిపై ఫాతిహాలు చదివిన తరువాత తబ్బరుక్‌గా భావించటం వంటి అనేక విధాల కార్యకలాపాలు జరుపుతారు. దాని ప్రతిఫలంగా సమాధిలో ఉన్న ఆ “వలీఅల్లాహ్‌” సిఫారసు అల్లాహ్‌ వద్ద వారికి ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. మరియు అల్లాహ్ వద్ద వారు ఎవరికైనా సిఫారసు చేస్తే, వారి సిఫారసును అల్లాహ్‌ ధిక్కరించడని భావిస్తారు.

మరియు కొంత మంది ప్రజలు: అల్లాహ్‌కు చెందిన కొన్ని అద్భుతమైన శక్తులకు ‘ఔలియాలు‘ కూడా అర్హులని విశ్వసిస్తారు. మరియు ఆ పుణ్యాత్ములే వారిని నష్టాల నుండి ఆదుకుంటారు, కష్టాల నుండి రక్షిస్తారు అని విశ్వసిస్తారు. అందుకని వారు దేశవిదేశాలలో పేరు ప్రతిష్టలు పాందిన దర్గాలకు “జియారత్‌” పేరున తిరుగుతుంటారు. మరియు యా అలీ మదద్‌, యా ముష్కిల్‌ కుషా దస్తగీర్ , యా గౌస్‌ మదద్‌, యా ఖాజా గరీబున్‌ నవాజ్‌ వంటి షిర్క్‌ పదాలను వాడుతుంటారు.

దర్గాల నిర్మాణం మరియు వాటి సందర్శనం, వాటి కొరకు ప్రయాణించడం మరియు అక్కడ నిర్వహించే ఏ ఒక్క కార్యానికీ ఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు. అలైహి వసల్లం) ద్వారా ఎలాంటి ప్రామాణికమైన సాక్ష్యాధారాలు లేవు. పైగా ఆరాధన భావంతో ఇలాంటి ప్రదేశాలకు ప్రయాణించడం లేక సందర్శించడం ఇస్లాం ధర్మంలో నిషేధించడం జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“మీరు మూడు మసీదులకు తప్ప మరేచోటుకు (ఆరాధన భావంతో) ప్రయాణం చేయకండి. ఒకటి కాబతుల్లాహ్‌ (మక్కా మసీదు), రెండు మస్జిదే నబవి (మదీనా మసీదు), మూడు మస్జిదే అఖ్సా (జెరూసలేం మసీదు) ” (బుఖారీ:1115, ముస్లిం: 2475)

హజ్రత్  అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“మీ ఇండ్లను స్మశానవాటిక చేయకండి, నా సమాధిని మీరు (ప్రజలు) ఉత్సవ కేంద్రంగా చేయకండి. అయితే నా కొరకు దరూద్‌ దుఆ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా మీప్రార్ధన నాకు చేరుతుంది.” (అబూదావూద్‌: 2042)

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హ) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణ సమయాన ఇలా ప్రవచించారు:

“అల్లాహ్‌ యూదుల్ని, క్రైస్తవుల్ని శపించాడు. వారు తమ ప్రవక్తల సమాధుల్ని సజ్‌దా (ఆరాధ్య) నిలయాలుగా చేసుకున్నారు.” (బుఖారీ)

పైన ఇవ్వబడిన హదీసులను గమనించినట్లయితే ప్రవక్తల సమాధులను ఆరాధ్య నిలయాలుగా చేసుకోకూడదని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాంటప్పుడు పుణ్యాత్ముల సమాధులను ఆరాధన పరంగా గౌరవించడం, ఆరాధన పరంగా సమాధుల వద్దకు ప్రయాణించడం, అక్కడ ఉరుసుల పేరుతో సంబరాలు జరపడం వంటి అధర్మ కార్యాలు ధర్మం ఎలా ఔతుంది? మరియు యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ఆగ్రహానికి మరియు మార్గభ్రష్ఠత్వానికి గురికాబడిన ముఖ్య కారణం సమాధులను ఆరాధ్య నిలయాలుగా చేసుకోవడమే అన్న విషయం కూడా స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ద్వారా తెలుస్తున్నది.

అలాగే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాధి వద్దకు సహితం సంబరాల (ఉరుసు) కొరకు సమావేశం కాకూడదని హెచ్చరించారు. చివరకు ఆయనపై దరూద్‌ పంపాలనుకున్నా సమాధి వద్దకు రావలసిన అక్కర లేదు. మీరెక్కడ నుండి ఐనా నా కొరకు దరూద్‌ చదవండి, అది నా వద్దకు చేర్చబడుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేశారు.

ఇస్లామీయ సోదరులారా! ప్రవక్తల సమాధులనే ఉత్సవ స్థలాలుగా, ఆరాధ్య నిలయాలుగా చేసుకోవడం తప్పయితే, ‘ఔలియాల’ సమాధుల్ని ఉత్సవ కేంద్రాలుగా, ఆరాధ్య నిలయాలుగా చేసుకొనే ప్రశ్న ఎలా జనిస్తుంది? యదార్ధం ఏమిటంటే, కొంత మంది ప్రజలు తమ స్వార్ధాల కొరకు ఇస్లామీయ హద్దుల్ని దాటి దర్గాల సందర్శన పేరుతో వాటిని ఆరాధ్య నిలయాలుగా, ఉత్సవ ప్రదేశాలుగా చేసుకున్నారు. అలాంటివారంతా ప్రవక్త ముహమ్మద్‌ ( సల్లల్లాహు అలైహి వసల్లం) హితవుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందువలన సమాధుల కట్టడాలు, అక్కడ నిర్వహించే ఆరాధ్య కార్యాలు, ఖవ్వాలీల కచ్చేరీలు పూర్తిగా ఇస్లామీయ ధర్మానికి విరుద్ధం. కనుక ‘ఉరుసు’లను నిర్వహించడం, ఉరుసుల కొరకు చందాలు ఇవ్వటం, వారికి సహాయం చేయటం వంటి కార్యాలన్నీ ఇస్లామీయ నిజ ధర్మానికి వ్యతిరేకంగా సహాయం చేయటంతో సమానమే.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 100-108). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

%d bloggers like this: