ముహర్రం నెలలో “నెల్లూరు రొట్టెల పండగ” పేరుతో జరిగే షిర్క్ మరియు దురాచారాలు

బిస్మిల్లాహ్

[నెల్లూరు రొట్టెల పండగ పేరుతో జరిగే షిర్క్ మరియు అధర్మ కార్యాల గురుంచి ఈ పోస్టులో వివరించబడింది] 

నెల్లూరు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 12వందల సంవత్సరాల క్రితం పన్నెండు మంది అరబ్‌ ముస్లిములు వలస వచ్చారు అని కథనాలు చెప్పుకుంటారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు భావిస్తారు. మరియు కొన్ని రోజుల తరువాత వారందరూ షహీద్‌ కాబడ్డారనీ అంటారు. ఆ తరువాత వారందరినీ ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. తరువాత కొంత మంది ప్రజలు ఆ సమాధులనే దర్గాలుగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి “బారా షహీద్‌ మజార్‌ షరీఫ్‌” అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా “సయ్యద్‌ బాబా” అని “లాల్‌ దర్గా” పేరుతో ఉంది.

రొట్టెల పండుగ పేరుతో 10 నుండి 15 లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల పేరుతో ముహర్రం నెల 10, 11, 12వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.

అంటే అక్కడ వచ్ఛేవారి వివిధ మొక్కుబడుల ప్రకారం రొట్టెలకు పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు “పిల్లల రొట్టెలు” – ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్ధంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని వారి మూఢ నమ్మకం. అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని “నెల్లురు రొట్టెల పండుగ” అని అంటారు.

ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలకు పేర్లు పెట్టుకుంటారు. అంటే; ఉద్యోగం రొట్టెలు, ధనం రొట్టెలు, విదేశాలకు పోయే వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహం రొట్టెలు అని వివిధ సమస్యల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు అక్కడ ఉన్న దర్గాలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్‌ మరియు బిద్‌అత్‌ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు.

“బారా షహీద్ మజార్‌ షరీఫ్‌”కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణల రూపంలో ఆ దర్గాలపై నాణెములను(చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్లలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే? ఆ నాణెములను ప్రజలు తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.

అధికమైన సంఖ్యలో స్త్రీలు అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే? మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. మరియు ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే? ఎదో విధంగా తమ అదృష్టాలను పరిక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరియు వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.

కనుక అల్లాహ్  వాటిని ఖండిస్తూ ఇలా తెలియజేసాడు:

إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ

“ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్‌ వీటిని గురించి ఎట్టి ప్రమాణం  అవతరింప జేయలేదు. వారు కేవలం తము ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది?” (సూరతున్‌ నజ్మ్‌:23)

అల్లాహ్ ఇలా తెలియజేసాడు:

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!)వారికి ఇలా చెప్పు: “అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్‌ సబా:22).

అల్లాహ్‌ను మాత్రమే ప్రార్ధించాలి. భయం, భక్తి ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్‌ చేయడము, మొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్‌కే సొంతం చేసి ఆరాధించాలి. అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.

కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ

“మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తనూ పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్‌) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! కావున మీరు నన్నే ( అల్లాహ్‌నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.” (సూరతుల్‌ అంబియా:25)

అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ

“మీరు నిజంగానే ముస్లిములైతే అల్లాహ్‌నే నమ్ముకోండి” (సూరతుల్‌ మాయిదా:23)

మరోచోట అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

“అల్లాహ్‌ను నమ్మకున్నవారికి అల్లాహ్‌యే చాలు.” (సూరతు తలాఖ్ :3)

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎప్పుడైతే మీరు సహయం కొరకై మొరపెట్టుకుంటారో అప్పుడు అల్లాహ్‌ను మాత్రమే సహాయానికై ఆర్థించండి.” (తిర్మిజీ:2516, జిలాలుల్‌ జన్నహ్‌: 316-318).

ముఖ్య గమనిక: “రొట్టెల పండుగ పేరున మనం చేసే ఆచారాలు, ఆరాధనలు, మొక్కుబడులు ధర్మం కానే కావు. ఎవరైనా అల్లాహ్‌ పేరుపై తప్ప ఇతరులెవరి పేరుపై నైనా మొక్కుబడులు చెల్లిస్తే అది “షిర్క్” ఆచారమే అవుతుంది. ఒక వేళ ఎవరైనా తెలిసి తెలియక మొక్కుబడులు చేసుకొని ఉంటే, వాటిని నెరవేర్చకూడదు. దాని వల్ల ఎలాంటి నష్టంగాని లేక కీడుగాని జరగదు. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ విధేయత పట్ల మొక్కుబడి చేసుకున్నారో వారు ఆ మొక్కుబడిని తీర్చాలి. మరియు ఎవరైతే అల్లాహ్‌ అవిధేయత పట్ల మొక్కుకున్నారో వారు ఆ మొక్కబడిని తీర్చకూడదు.”” (బుఖారి :2602).


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 67-70). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

%d bloggers like this: