పరాచికానికైనా సరే మీలో ఎవ్వరూ మీ సోదరుని వైపు ఆయుధం ఎక్కుపెట్టరాదు | కలామే హిక్మత్

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు .

“మీలో ఎవ్వరూ మీ సోదరుని వైపు ఆయుధం ఎక్కుపెట్టరాదు.బహుశా షైతాని అతని చేయిని ఝుళిపించవచ్చు. ఇంకా, అది నరక కూపంలోపడిపోవచ్చు.” (ముస్లిం)

ఈ హదీనులో ముస్లిం హక్కుల గురించి నొక్కి పలకడం జరిగింది. ఏ ముస్లిమునైనా భయపెట్టడం, కలవరానికి గురిచెయ్యడం, లేదా అతను నొచ్చుకునేలా వ్యవహరించడం పట్ల వారించ బడింది.

మీ సోదరుని వైపు ఆయుధాన్ని ఎక్కు పెట్టరాదు.” ఇక్కడ సోదరుడంటే ముస్లిం అన్నమాట. ముస్లిములు పరస్పరం అన్నదమ్ములు. అల్లాహ్ సెలవిచ్చాడు :”ఇన్నమల్ మోమినీన ఇఖ్వ” (విశ్వాసులు పరస్పరం సోదరులు). ఆటపాటల్లో, పరాచి కానికయినా భయపెట్టే సంకల్పంతో కరవాలాన్ని, ఖడ్గాన్ని, లేక మరే ప్రమాదకరమైన ఆయుధాన్నయినా లేపటం హరాం (నిషిద్ధం).

“షైతాన్ అతని చేయిని ఝుళిపించవచ్చు” అంటే చేయి జారినా చేయి విసిరినా చేతిలోని ఆయుధానికి ఎదుటి వ్యక్తి గురికావచ్చు. ఇది ఘోర అన్యాయం అవుతుంది.ఒక ముస్లింను అకారణంగా చంపిన కారణంగా ఇతను నరకాగ్నికి ఆహుతి అవుతాడు.ఎందుకంటే అన్యాయంగా, అధర్మంగా ఏ ముస్లిమునైనా వధించటం మహాపాతకం.

అల్లాహ్ సెలవిచ్చాడు :

“ఉద్దేశ్యపూర్వకంగా ఎవడైతే ఒక విశ్వసించిన వాణ్ణి చంపుతాడో అతనికి బహుమానం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమయిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.(అన్ నిసా: 93)

ఏ ముస్లిం హత్యకయినా, గాయాని కయినా కారణభూతమయ్యే ప్రతి విధానాన్ని, ధోరణిని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధంగా (హరామ్)గా ఖరారు చేసినట్లు అసంఖ్యాకమయిన హదీసుల ద్వారా విదితమవుతోంది.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది :

ఎప్పుడయినా ఏ ముస్లిం అయినా మరో ముస్లిం వైపునకు ఇనుప ముక్కతో సంజ్ఞ చేస్తే దైవదూతలు అతన్ని శపిస్తారు – ఒకవేళ అతను సంజ్ఞ చేసిన వ్యక్తి అతని తోబుట్టువు అయినాసరే.”

ఇబ్నుల్ అరబీ ఏమంటున్నారో చూడండి – ‘కేవలం ఇనుప ముక్కతో సంజ్ఞ చేసినమాత్రానికే అతను శాపగ్రస్తుడయితే, ఇక ఆ ఇనుపముక్కతో ఎదుటి ముస్లింపైదాడి జరిపితే, అప్పుడతని పర్యవసానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో?’

వేళాకోళంగానే అయినా ఆయుధంతో సైగ చేసిన వ్యక్తి ధూత్కారిగా పరిగణించబడటానికి కారణమేమంటే, అతని, ఈ చేష్ట మూలంగా ఎదుటి వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. అదే ఒకవేళ అతను నిజంగానే ఎదుటి వ్యక్తికి కీడు తలపెట్టే ఉద్దేశ్యంతో చేస్తే అది మహాపరాధమే అవుతుంది. అందుకే ఒరలేని (నగ్న) ఖడ్గాలు ఇచ్చిపుచ్చుకోరాదని అనబడింది. అలా ఇచ్చిపుచ్చు కొంటున్నప్పుడు ఏమరుపాటు వల్ల ఖడ్గం చేజారి పోయి హాని కలిగే ప్రమాదముంది.

జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బృందం వైపుగా వెళుతుండగా, వారు ఒరలేని ఖడ్గాలను మార్పిడి చేసుకుంటూ కనిపించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఇలా మందలించారు- “ఇలాంటి చేష్ట చేయరాదని నేను మీకు చెప్పలేదా? మీలో ఎవరయినా ఖడ్గాలుమార్చుకుంటున్నప్పుడు ఒరలో పెట్టి మరీ ఇవ్వాలి.” (అహ్మద్, బజార్)

నేటి ఆధునిక కాలంలో ఎవరయినా వేళాకోళానికయినా సరే – రివాల్వర్ను ఎదుటివారికి గురిపెట్టడం, గుళ్లు నింపిన రివాల్వర్తో అనుభవం లేకుండా ప్రాక్టీసు చేయటం కూడా హదీసులో ప్రస్తావించబడిన ఖడ్గాల మార్పిడిలాంటిదే.ముక్తసరిగా హదీసు సారాంశం ఏమంటే ప్రతి ముస్లిం ప్రాణం అత్యంత విలువైనది, గౌరవప్రదమైనది. కాబట్టి అకారణంగా, అన్యాయంగా ఒక ప్రాణానికి హాని తలపెట్టడం దైవ సమక్షంలో పెద్ద నేరం అవుతుంది. అటువంటి వారి నుండి ప్రళయ దినాన కఠినంగా లెక్క తీసుకోవటం జరుగుతుంది.

[PDF డౌన్ లోడ్ చేసుకోండి]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి [వీడియో]

విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి | బులూగుల్ మరాం | హదీసు 1256
https://youtu.be/aWHz-iM7Tq4 [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1256. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆ పవిత్రమూర్తి సాక్షిగా చెబుతున్నాను తన స్వయం కొరకు ఇష్టపడేదే తన ఇరుగు పొరుగు లేక తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ ఏ దాసుడూ విశ్వాసి (మోమిన్) కాలేడు.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

ఈ హదీసులో విశ్వాస పరిపూర్ణత కొరకు ఒక షరతు విధించబడింది. అదేమంటే విశ్వాసి అయినవాడు తన కోసం ఇష్టపడే వస్తువునే తన పొరుగువారి కోసం లేదా తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి. సమాజంలో తన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించాలని అతను కాంక్షిస్తున్నపుడు ఇతరులు కూడా అలాగే కోరుకుంటారని అతడు తలపోయాలి. కనుక ఇతరుల గౌరవ ప్రతిష్ఠలకు తన తరపున విఘాతం కలగకుండా చూసుకోవాలి. తనకు శాంతీ సౌఖ్యాలు ప్రాప్తించాలని కోరుకున్నప్పుడు సాటి వ్యక్తుల కోసం కూడా అదేవిధంగా ఆలోచించాలి. వ్యక్తుల్లో ఇలాంటి సకారాత్మక ఆలోచనలున్నప్పుడు సమాజమంతా సుఖశాంతులకు నిలయమవుతుంది. ప్రగతి పథంలో సాఫీగా సాగిపోతుంది. అశాంతి అలజడులుండవు. ఒకరింకొకరి శ్రేయస్సును అభిలషించే వారుగా, ఒండొకరి యెడల సానుభూతి పరులుగా ఉంటారు. ఒక సత్సమాజానికి ఉండవలసిన ప్రధాన లక్షణమిదే.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

తోటి సోదరునికి సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు [వీడియో]

తోటి సోదరునికి సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు | బులూగుల్ మరాం | హదీసు 1263
https://youtu.be/32IJzghLRHc [15 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1263.హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:

ఎవరయినా సరే ప్రపంచంలోని ఆపదల్లో నుంచి, ఏదేని ఒక ఆపదనుంచి ఏ ముస్లింనయినా గట్టెక్కిస్తే అల్లాహ్ ప్రళయ దినాన ప్రళయదినపు గండాలలోని ఏదేని ఒక గండం నుంచి అతన్ని గట్టెక్కిస్తాడు. ఎవరయినా ప్రాపంచికంగా లేమికి గురైన ఒక వ్యక్తికి వెసులుబాటు కల్పిస్తే అల్లాహ్ ఇహపరాలలో అతని కోసం వెసులుబాటును కల్పిస్తాడు. ఎవరయినా ఒక ముస్లిం బలహీనతను కప్పిపుచ్చితే అల్లాహ్ ఇహపరాలలో అతని లోగుట్టు పై ఆచ్చాదన వేసి ఉంచుతాడు. ఒక దాసుడు తోటి సోదరుని సాయపడుతూ ఉన్నంత కాలం అల్లాహ్ అతన్ని ఆదుకుంటూనే ఉంటాడు.”

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

చెడు అనుమానానికి దూరంగా ఉండండి [వీడియో]

చెడు అనుమానానికి దూరంగా ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1284
https://youtu.be/yLseG7LgNmM [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1284. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకాకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు:

దురనుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం చాలా పెద్ద అబద్ధంగా పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం: దురనుమానం ఒక పెద్ద అసత్య విషయంగా పరిగణించబడటానికి కారణం ఏమిటంటే మనిషి తనలో తానే దాన్ని పెంచి పోషించుకుంటూ పోతాడు. ఆఖరికి అసలేమీ లేని దాన్ని గురించి ఏదో ఒక సందర్భంగా నోటితో చెప్పేస్తాడు. అందుకే విద్వాంసులు దీన్ని అభాండంగా, అపనిందగా ఖరారు చేశారు. ఒకరిపై అపనింద మోపటం నిషిద్ధం కదా! దీని ద్వారా తేటతెల్లమయిందేమిటంటే దురనుమానం అపనిందకు ఆనవాలు. అపనింద మహాపరాధం. పశ్చాత్తాపం చెందనిదే ఇది క్షమార్హం కాజాలదు. అందుకే వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దురనుమానాలు, సంకోచాలు పుట్టిపెరిగే సమాజంలో సదనుమానం, సద్భావన అనేవి నిలదొక్కుకోలేవు. అలాంటి సమాజంలోని సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, పరస్పర సహకార భావాల వాతావరణం కూడా ఏర్పడదు. ఒండొకరిని అడుగడుగునా శంకిస్తూ ఉంటారు. ఇది సమాజ అభ్యున్నతికి, వికాసానికి శుభ సూచకం కాదు సరికదా పతనానికి, అధోగతికి ఆనవాలు అవుతుంది. సత్సమాజ రూపకల్పనకు ఉపక్రమించినపుడు దురనుమానవు సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు సంహరించటం అవసరం.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ముస్లింను దూషించటం మహాపాపం.ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి ప్రతీక [వీడియో]

ముస్లింను దూషించటం మహాపాపం.ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి ప్రతీక| బులూగుల్ మరాం| హదీసు 1283
https://youtu.be/iNtNrlahhLM [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1283. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

ముస్లింను దూషించటం మహాపాపం. ఇక అతన్ని చంపటం అంటే అది అవిశ్వాసానికి, దైవధిక్కరణకు ప్రతీక” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

హదీసులో “ఫిస్ఖ్” అనే పదం ప్రయోగించబడింది. సాటి ముస్లింను దూషించినవాడు “ఫాసిఖ్‌” అవుతాడు. అంటే దైవవిధేయతా పరిమితిని దాటిపోయినవాడు, హద్దులను అతిక్రమిం చినవాడన్న మాట! హద్దులను అతిక్రమించినవాడు పాపాత్ముడు, అపరాధి అవుతాడు. ఇక ముస్లింను చంపటం అంటే విశ్వాసాన్ని (ఈమాన్‌ను) త్రోసిరాజనటమే. అకారణంగా ఎవరయినా సాటి ముస్లింను చంపడాన్ని తన కొరకు ధర్మసమ్మతం గావించుకుంటే అతడు ఇస్లాంతో తాను ఏకీభవించటం లేదని క్రియాత్మకంగా రుజువు చేస్తున్నాడు. కనుక అతని ఈ చేష్ట ‘కుఫ్ర్’ క్రిందికి వస్తుంది.

సహీహ్‌ ముస్లింలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు : “నా అనుచర సమాజ సభ్యులందరూ క్షేమంగా, నిక్షేపంగా ఉండదగ్గవారే. అయితే బహిరంగంగా, నిస్సంకోచంగా పాపాలకు ఒడిగట్టేవారు మాత్రం దీనికి అర్హులు కారు.పాపాత్మునికి పాపకార్యాలను గురించి జాగరూకపరచటం గురించి పండితుల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. తబ్రానీలో హసన్‌ పరంపర ద్వారా సేకరించబడిన ఒక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా సెలవిచ్చారు:

“మీరు ఎప్పటి వరకు పాపాత్ముని ఘోరకృత్యాలను చెప్పకుండా ఉంటారు? అతని బండారం బయటపెట్టి తగిన శాస్తి జరిగేలా చూడండి.” ఈ హదీసు వెలుగులో దుర్మార్గుని దౌష్ట్య్రం నుండి ప్రజలు సురక్షితంగా ఉండగలిగేందుకు అతని దుర్మార్గాలను ఎండగడితే అది ముమ్మాటికీ ధర్మసమ్మతమే.


యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ఒక ముస్లింకు మరొక ముస్లిం యెడల ఆరు బాధ్యతలున్నాయి [వీడియో]

ఒక ముస్లింకు మరొక ముస్లిం యెడల ఆరు బాధ్యతలున్నాయి | బులూగుల్ మరాం | హదీస్ 1236
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0kMzDmvxUmI – 36 minutes

1236. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: ఒక ముస్లింకు మరొక ముస్లిం యెడల ఆరు బాధ్యతలున్నాయి. అవేమంటే;
(1) అన్ని కలుసుకున్నప్పుడునువ్వు అతనికి సలాం చెయ్యి
(2) అతనెప్పడయినా నిన్ను ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు.
(3) అతనెప్పుడయినా సలహా కోరితే -శ్రేయోభిలాషిగా- మంచి సలహా ఇవ్వు.
(4) అతనెప్పుడయినా తుమ్మిన మీదట ‘అల్హమ్దులిల్లాహ్’ అని అంటే, సమాధానంగా నువ్వు ‘యర్ హముకల్లాహ్’ అని పలుకు.
(5) అతను రోగగ్రస్తుడైతే నువ్వతన్ని పరామర్శించు.
(6) అతను మరణిస్తే నువ్వతని అంత్యక్రియలలోపాల్గొను.

(ముస్లిం)

సారాంశం: ఈ హదీసులో ఒక ముస్లిం యొక్క ఆరు హక్కులు సూచించబడ్డాయి. ‘ముస్లిం’లోని వేరొక ఉల్లేఖనంలో ఐదింటి ప్రస్తావనే వచ్చింది. అందులో ‘శ్రేయోభిలాష’ గురించి లేదు. ఏదైనా వ్యవహారంలో ప్రమాణం చేయమని నిన్ను అతను కోరితే – అది నిజమయిన పక్షంలో – ప్రమాణం కూడా చెయ్యమని ఇంకొక హదీసులో ఉంది.మొత్తం మీద ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే సాటి ముస్లిం యెడల తనపై ఉన్న ఈ ఆరు బాధ్యతలను ప్రతి ముస్లిం నెరవేర్చాలి. వీటిని నెరవేర్చటం తప్పనిసరి (వాజిబ్) అని కొంతమంది పండితులు అభిప్రాయపడగా, నెరవేర్చటం వాంఛనీయం (ముస్తహబ్)అని మరి కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే హదీసులోని పదజాలాన్నిబట్టి వాటిని నెరవేర్చటం తప్పనిసరి అని అనటమే సమంజసం.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam) :
క్రింది లింక్ నొక్కి పుస్తకం పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
https://teluguislam.net/2010/10/06/bulugh-al-maram/

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ముస్లింలు విధిగా ఒకరినొకరు ప్రేమించాలి (Muslims loving each other)

హదీథ్׃ 14

وجوب محبة المسلم لأخيه

ముస్లింలు విధిగా ఒకరినొకరు ప్రేమించాలి (ప్రేమాభిమానలతో గౌరవించాలి)

عَنْ أَنَسٍ رضى الله عنه عَنِ النَّبِىِّ ^ قَالَ: لَا يُوْمِنُ أَحَدَكُمْ حَتَّى يُحِبَّ لِأَخِيْهِ مَا يُحِبُّ لِنَفْسِهِ (رواه البخاري)

అన్ అనస్ ఇబ్నె మాలికి రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఖాల, ″లా యూమిను అహదకుమ్ హత్తా యుహిబ్బ లిఅఖీహి, మా యుహిబ్బు లి నఫ్ సిహి″

తాత్పర్యం:- అన్ = ఉల్లేఖన, అనస్ ఇబ్నె మాలికి = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క సహచరుడు(సహాబి), రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక, అనిన్నబియ్యి = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రకటించారు,  ఖాల = తెలిపారు, లా = కాదు,  యూమిను = విశ్వాసి , అహదకుమ్ = మీలో ఎవరూ, హత్తా = అప్పటి వరకు,  యుహిబ్బ = కోరుకోవటం, లి = కోసం, అఖీహి = తోటి సోదరుడి, మా = ఏదైతే, యుహిబ్బు = కోరుకోవటం, లి = కోసం, నఫ్సిహి = తనకోసం .

అనువాదం:-అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా అన్నారు “మీలో ఒక్కరు కూడా అప్పటి వరకూ నిజమైన విశ్వాసి కాజాలరు. (ఎప్పటివరకూ అంటే) మీరు మీ కొరకు దేనినైతే ఇష్టపడతారో మీ తోటి ముస్లిం సోదరునికి కూడా (అలాంటిదే ఉండాలని) ఆవిధంగానే ఉండాలని (మనస్పూర్తిగా) కోరుకోనంతవరకు.” సహీబుఖారి హదీథ్ గ్రంథం

వివరణ:- ఈ హదీథ్, ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరులను విధిగా ప్రేమించాలనీ, గౌరవించాలనీ తెలియజేయు చున్నది. ఇస్లాంలో అనుమతించబడిన మేరకు – మన ముస్లిం సోదరుల ఆశలు, ఆశయాలు సాకారం అయ్యేలా మనం వారికి అన్ని విధాలా సహాయం చేయాలి, సహకరించాలి. ఈ హదీథ్ సోదర ముస్లింల పట్ల సమానత్వం వైపునకు, వారి పట్ల మసం చూపవలసిన పరస్పర గౌరవం, వినయం, వినమ్రత వైపుకు మన దృష్టిని మరల్చుచున్నది. మనలో నుండి తోటివారి పట్ల ద్వేషం, అసూయ, ఏహ్యభావం, హీనభావం మరియు మన తోటి ముస్లిం సోదరుల పట్ల మోసపూరిత ఆలోచనలను దూరం చేసుకోనంత వరకు, వారిపట్ల (సహజసిద్ధమైన) ప్రేమ, అభిమానం, గౌరవం మనలో పుట్టుకురావు అని గమనించాలి.

ఈ హదీథ్ ఆచరించడం వలన కలిగే లాభాలు:-

  1. మనతోటి ముస్లిం సోదరులను ప్రేమించడం లేక అసహ్యించుకోవడం (అంటే మన అంతరంగ మరియు బహిర్గత ప్రవర్తన) అనేవి అల్లాహ్ పట్ల మనలోని సంపూర్ణమైన విశ్వాసాన్ని పరీక్షించే గీటురాళ్ళ వంటి విషయాలలో ఇవి కూడా ఉన్నాయని గమనించాలి.
  2. తోటివారిపట్ల అసూయా, ద్వేషభావాలు – అల్లాహ్ పట్ల మనలోని విశ్వాసాన్ని తగ్గిస్తాయి.
  3. మన తోటివారు మంచిగా ఉండాలని కోరుకోవడం, అందుకని వారికి సహాయసహకారాలు అందజేయడం, వారిని చెడు మరియు తప్పుడు మార్గాల నుండి వారించడం అనేవి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే మనలో వారిపట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయనడానికి నిదర్శనం.
  4. ఇతరుల బాగోగుల గురించి ఆలోచించక, అన్ని మంచి విషయాలు మనకే సొంతం అవ్వాలనుకునే  స్వార్ధపరత్వం, నీచమనస్తత్వం గురించి ఈ హదీథ్ మనల్ని హెచ్చరిస్తున్నది.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:- ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పేరు అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహి అన్హు. వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సేవలో తన జీవితాన్ని గడిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క హదీథ్ లు ఎక్కువగా ఉల్లేఖించిన వారిలో వీరి పేరు కూడా ఉంది.

ప్రశ్నలు

  1. మీరు మీ కొరకు దేనినైతే ఇష్టపడతారో మీ తోటి ముస్లిం సోదరునికి కూడా     _____________________________________ (మనస్పూర్తిగా) కోరుకోవాలి.
  2. ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరులను_____ప్రేమించాలి మరియు గౌరవించాలి.
  3. సోదర ముస్లింల పట్ల సమానత్వం, పరస్పర గౌరవం, వినయం, వినమ్రతం చూపటమనేది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పాటించాలా? లేక వారి నుండి తమ అవసరాలు తీర్చుకోవడానికా?
  4. ఈ హదీథ్  అమలు చేయటం ద్వారా సమాజంలో ఎటువంటి మార్పులు వస్తాయి?

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా