హదీసు 1: సంకల్పంతోనే ఏ కార్యమైన | అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్

: عَنْ أَمِيرِ الْمُؤْمِنِينَ أَبِي حَفْصٍ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ

سَمِعْتُ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم يَقُولُ: ” إنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ، وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى، فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إلَى اللَّهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إلَى اللَّهِ وَرَسُولِهِ، وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَنْكِحُهَا فَهِجْرَتُهُ إلَى مَا هَاجَرَ إلَيْهِ

رَوَاهُ إِمَامَا الْمُحَدِّثِينَ أَبُو عَبْدِ اللهِ مُحَمَّدُ بنُ إِسْمَاعِيل بن إِبْرَاهِيم بن الْمُغِيرَة بن بَرْدِزبَه الْبُخَارِيُّ الْجُعْفِيُّ [رقم:1]، وَأَبُو الْحُسَيْنِ مُسْلِمٌ بنُ الْحَجَّاج بن مُسْلِم الْقُشَيْرِيُّ النَّيْسَابُورِيُّ [رقم:1907] رَضِيَ اللهُ عَنْهُمَا فِي “صَحِيحَيْهِمَا” اللذَينِ هُمَا أَصَحُّ الْكُتُبِ الْمُصَنَّفَةِ

అనువాదం 

విశ్వాసుల నాయకులు హజ్రత్ అబూ హఫ్స్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కధనం: చెబుతున్నారు: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇలా ఉపదేశిస్తుండగా విన్నాను.

“నిశ్చయంగా కర్మలు సంకల్పాల పరంగా ఉంటాయి. ప్రతి మనిషికీ అదే (ప్రతిఫలం) లభిస్తుంది ఏదైతే అతను సంకల్పం చేస్తాడో. ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం (‘హిజ్రత్’) వలసవెళతాడో ఆ వ్యక్తి ప్రస్థానం నిజంగానే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసమే అవుతుంది. మరి ఎవరి ‘హిజ్రత్’ ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశము లేక ఏ స్త్రీ నైనా వివాహమాడాలనే సంకల్పంతో కూడుకొని వుంటుందో అతని ‘హిజ్రత్’ తాను కోరుకున్న వాటి కోసమే అవుతుంది.” 

పుస్తక సూచనలు: సహీహ్ బుఖారీ-1, సహీహ్ ముస్లిం- 1907. తెలుగు రియాజుస్సాలిహీన్ -1, పేజి 1, హ1. (సహీహ్ బుఖారీ, దైవవాణి ఆరంభ ప్రకరణం, సహీహ్ ముస్లిం, పదవుల ప్రకరణం) 

పదాల విశ్లేషణ 

إنَّمَا ఇన్నమా: 

పరిమితముకై, అంటే కేవలం పేర్కొనబడిన దానిలో ఆదేశాన్ని నిరూపించి మిగితా వాటిని విడదీయటం లేక తొలగించడం. 

الْأَعْمَالُ  అల్ ఆమాలు: 

ఇది బహువచనం; దీనికి అల్ అమలు ఏకవచనం. దీని అర్ధం: కర్మ, పని, కార్యం. ‘అల్ ఆమాలు’లో ( అలిఫ్ లామ్ ) సంబంధిత దానికై, కర్మలకి సంబంధించిన. 

بِالنِّيَّاتِ బిన్నియ్యాతి: 

‘బ’కారణానికి : అంటే కర్మల యొక్క అంగీకారం సంకల్పము కారణంగా. 

يَنْكِحُ యని కిహు:
వివాహమాడుతున్నాడు/ మాడబోతున్నాడు. పెళ్ళి చేసుకుంటున్నాడు. చేసుకోబోతున్నాడు. 

النِّيَّاتِ అన్నియ్యాతు: 

అన్నియ్యతు దీనికి ఏకవచనం. భాషా పరంగా అర్ధం: ఉద్దేశం ఏదేని పైనను నిర్ణయం. 
ధార్మిక పరంగా : అల్లాహ్ సామిప్యాన్ని పొందుటకై ఏదైన కార్యము పట్ల సంకల్పము చేయడం . 

అల్ హిజరతు: 

భాషా పరంగా అర్ధం: వదులుట, విడనాడుట. వలస వెళ్ళుట. 
ధార్మిక పరంగా : షిర్క్ గల పట్టణం నుండి ఇస్లాం గల పట్టణం వైపుకు మారటం. నేరాల ప్రదేశము నుండి స్థిరత్వం గల ప్రదేశమునకు మారటం. 

يُصِيبُ యుసీబు: 

లభిస్తుంది / లభించబోతుంది, సోకుతుంది/ సోకబోతుంది. 

హదీసు ప్రయోజనాలు 

1. మనిషికి తన సంకల్పం ప్రకారం పుణ్యము గాని పాపము గాని ఇవ్వబడుతుంది, లేదా ఏదీ దక్కకుండా పోతుంది. దీనికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యము: 

فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إِلَى اللَّهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إِلَى اللَّهِ وَرَسُولِهِ 

ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం వలసవెళతారో, ఆవ్యక్తి ప్రస్థానం నిజంగానే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసమే అవుతుంది.’ 

2. కర్మలు సంకల్ప పరంగా ఫలితానికి దారి తీస్తాయి, ఒక విషయం వాస్తవానికి మెచ్చుకోదగినదిగా వుంటుంది. కాని మనషి సుసంకల్పం చేసుకుంటే అది విధేయత అవుతుంది. ఉదా: మనిషి సంకల్పం చేస్తాడు తినడం, త్రాగడం, మరియు అల్లాహు విధేయత చూపటం పట్ల భయభీతి కలిగి వుండాలని. అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశిస్తున్నారు: 

« تَسَخَرُوا فَإِنَّ فِي السَّحُورِ بَرَكَةً 

సహరి చేయ్యండి, సహరిలో ‘బర్కత్ ‘ ఉంది.” ఈ హదీసును ఆచరించటంలో విధేయత వుంది. 

3. హిజ్రత్ ప్రాముఖ్యత, దాని పట్ల ప్రవక్త ఉపమానం ఇవ్వటం తెలుస్తుంది. ఇంకా దాని ఘనతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచిస్తూ చెప్పారు: 

« أَمَا عَلِمْتَ … وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلَهَا » 

ఏమిటి నీకు తెలియదా హిజ్రత్ మునుపటి పాపాలను తుడిచి వేస్తుందని.” 

4. సహాబాల పేరు వచ్చినప్పుడు రదియల్లాహు అన్హు చెప్పాలని తెలుస్తుంది. 

5. కర్మల్లో ఇవి కేవలం అల్లాహ్ కే అనే చిత్తశుద్ధి వుండాలి. 

6. ఆరాధనల్లో ‘రియా’ (ప్రదర్శనా బుద్ధి) వుండకూడదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకారం « إنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ » “నిశ్చయంగా కర్మలు సంకల్పాల పరంగా ఉంటాయి.” ఎందుకంటే ‘రియా’ చిత్తశుద్ధికి విరుద్ధం. 

7. ప్రాపంచిక ప్రలోభాలకు దూరంగా వుండాలి. 

8. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉత్తమ బోధన, సూత్రాలుగాను, ఉదాహరణలుగాను. 

9. సంకల్పమును చక్కదిద్దుకుంటూ వుండాలి. సుఫియాన్ అస్సౌరి అంటున్నారు: ‘నా సంకల్పాన్ని చక్క దిద్దుకోవటం కంటే ఎక్కువ కఠినమైనది ఏది లేదు. ఎందుకంటే అది నా మీద తిరగబడుతుంది.’ 

10. స్వచ్ఛమైన హిజ్రత్ ఏమంటే అల్లాహ్ వారించిన వాటిని విడనాడాలి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాఖ్యం: “فَهِجْرَتُهُ إلَى مَا هَاجَرَ إلَيْهِ” “అతని వలస తాను కోరుకున్న వాటి కోసమే అవుతుంది.” అని చెప్పారు. అంతేకాని పరిధిని నిర్ధారించలేదు. ‘ఎవరి (హిజ్రత్) ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశము లేక ఏ స్త్రీ నయినా వివాహమాడాలనే సంకల్పంతో కూడుకొని వుంటుందో” అని చెప్పలేదు. 

హదీసు ఉల్లేఖులు 

హజ్రత్ అబూ హఫ్స్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు): 

విశ్వాసుల నాయకులు, అబూ హఫ్స్ ఉమర్ బిన్ ఖత్తాబ్ బిన్ నుఫైల్ బిన్ అబ్దుల్ ఉజ్జా అల్ ఖరషి, అల్ అదవి. వీరు ముస్లింల యొక్క రెండో ఖలీఫా (ధార్మిక పాలకులు). అజ్ఞాత కాలములో ‘ఖురైష్’ యొక్క రాయబారిగా ఉండేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవ సందేశహరులుగా ప్రకటించిన తరువాత ముస్లింల పట్ల అందరికన్న కఠోరంగా వున్నవారు వీరే. దైవ సందేశము వచ్చిన 6వ సంవత్సరములో వీరు ఇస్లాం స్వీకరించి ఇస్లాంకు మరియు ముస్లింలకు గొప్ప శక్తిగా మారారు. ఈయన ‘ఖురైష్’ మరియు ముష్రికీన్ల ముందు భహిరంగంగా ‘హిజ్రత్’ చేసారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోపాటు అన్ని యుద్ధాల్లో పాల్గొన్నారు. సిద్దీఖీ సామ్రాజ్య కాలము తరువాత 13వ హిజ్రి శకంలో ఆయన ఖలీఫాగా ప్రమాణము తీసుకోబడింది. ఈయన కాలములో ఇస్లామియ విజయాల పరిధి ఇరువై రెండున్నర లక్షల చదరపు మైళ్ళు వరకు విస్తరించుకుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దుఅ కారణంగా అల్లాహ్ ‘ఉమర్ ఫారూఖ్’ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాంకు గౌరవాన్ని ప్రసాదించాడు. వీరి గురించే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “నా తరువాత ఎవరైన ప్రవక్త వుంటే అది ఉమర్ అయ్యేవారు”. ఇస్లాం యొక్క ఈ దీపం ఫజర్ నమాజు చదువుతుండంగా ‘అబు లూలు మజూసి’ యొక్క దాడిలో ముహర్రం ఒకటవ తేది హి.శ 24న ‘షహీద్’ (అమరగతులై) య్యారు. (రి.సా. ఉర్దు – 1, పేజి:35) 

అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం(మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/

ఈ హదీసులో చెప్పిన విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి క్రింది వీడియో తప్పక వినండి:

ఖుర్ఆన్ ఎన్ని సదుద్దేశాలతో చదవచ్చు? వినవచ్చు? [వీడియో]

ఖుర్ఆన్ ఎన్ని సదుద్దేశాలతో చదవచ్చు? వినవచ్చు? [వీడియో]
https://youtu.be/79yNhE30HVM [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఖుర్ఆన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

విశ్వాస పాఠాలు – 1వ క్లాస్ – “ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి” [వీడియో]

బిస్మిల్లాహ్

[30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

دروس في العقيدة – విశ్వాస పాఠాలు

[آَمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِن رَبِّهِ وَالمُؤْمِنُونَ كُلٌّ آَمَنَ بِاللهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ المَصِيرُ] {البقرة: 285}

{ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించినదానిని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించినవారు కూడా దానిని హృదయ పూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారుః “మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము. ప్రభువా! క్షమాభిక్ష పెట్టుమని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవద్దకే మరలి వస్తాము}. (సూరె బఖర 2:285).

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ > قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَتَزَوَّجُهَا فَهِجْرَتُهُ إِلَى مَا هَاجَرَ إِلَيْهِ).

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్బు ఉల్లేఖించారుః “ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పం చేసుకుంటాడో, అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ఉదాహరణకుః) ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు వలసపోతాడో అతని వలస మాత్రమే నిజమయినది. ఎవరు ప్రపంచం కొరకు లేదా ఏదైనా స్త్రీని వివాహమాడటానికి వలసపోతాడో, అతని వలస ప్రపంచం కొరకు లేదా స్త్రీ కొరకు అనే పరిగణించబడుతుంది”. (బుఖారి 1, ముస్లిం 1907). విశ్వాస పాఠాలు

ఈ హదీసులో:

ఈ హదీసు ప్రతి ఆచరణకు పునాది లాంటిది. కర్మల అంగీకారం, తిరస్కారం మరియు అవి మంచివా లేదా చెడ్డవా అన్న విషయం మనోసంకల్పంపై ఆధారం పడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఒకప్పుడు ఆచరణ బాహ్యంగా (చూడటానికి) చాలా మంచిగా ఉండవచ్చు. కాని సత్సంకల్పం లేని కారణంగా అది చేసిన వానికి ఏ లాభమూ దొరక్కపోవచ్చు. దీనికి సంబంధించిన నిదర్శనాలు ఖుర్ఆనులో మరీ స్పష్టంగా ఉన్నాయిః

[أَلَا للهِ الدِّينُ الخَالِصُ] {الزُّمر:3} [مُخْلِصِينَ لَهُ الدِّينَ] {البيِّنة:5} [لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ] {الزُّمر:65}

{జాగ్రత్తా! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}. (సూరె జుమర్ 39:3).
{పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించు- కోవాలి}. (సూరె బయ్యినహ్ 98: 5).
{మీరు షిర్క్ చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి}. (సూరె జుమర్ 39: 65).

ఈ హదీసులో తెలిసిన మరో విషయం ఏమనగాః మనస్సు కార్యమే (సంకల్పశుద్ధియే) అన్నిటికి మూలం. మనిషి తాను చేసే ప్రతీ కార్యం తన ప్రభువు కొరకే ప్రత్యేకించి చేయుటకు, దాన్ని షిర్క్ దరిదాపులకు, ఇతర ఉద్దేశాలకు దూరంగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. ఆ కార్యం ద్వారా అల్లాహ్ సంతృప్తి, ఆయన దర్శనం పొందే ఉద్దేశ్యం మాత్రమే ఉంచాలి.

సర్వకార్యాలు, వాటి ఉద్దేశ్యాల్ని బట్టి ఉంటాయి తప్ప బాహ్య రూపంతో కాదు. ఎవరూ మరొకరి బాహ్య రూపం, బాహ్యాచరణలతో మోసపోకూడదు. అతని సంకల్పంలో కీడు చోటు చేసుకోవచ్చు. అయినా ప్రజల పట్ల సదుద్దేశం కలిగి ఉండటమే అసలైన విషయం.

ఆరాధనలు చేసేవారి పుణ్యాల్లో వ్యత్యాసం వారి మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని కూడా తెలుస్తుంది.

ప్రమాణం, మ్రొక్కుబడి, విడాకులు, అలాగే షరతులు, వాగ్థానం, ఒప్పందాల్లాంటి విషయాల్లో సంకల్పం (నియ్యత్) తప్పనిసరిగా ఉండాలి. మరచిపోయేవాడు, బలవంతం చేయబడినవాడు, అజ్ఞాని, పిచ్చివాడు మరియు చిన్న పిల్లలు చేసే పనులు (ఉద్దేశపూర్వకంగా ఉండవు గనక) వారిపై ఇస్లామీయ ఆదేశాలు విధిగా లేవు. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. వేరేది కూడా లభించవచ్చునా లేదా? అన్న విషయం సందిగ్ధంలో ఉంది. మనుషుల సంకల్పాలను అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు.

ప్రదర్శనాబుద్ధి, పేరుప్రఖ్యాతులు పొందే సంకల్పం ప్రశంసనీయమైనది కాదు అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అది అల్లాహ్ యేతరులతో ఏదైనా పొందే ఉద్దేశ్యం క్రింద లెక్కించబడుతుంది. సత్సంకల్పం లేనిదే ఏ కార్యాలూ, సత్కార్యాలుగా పరిగణింపబడవు. ఎవరైతే ప్రాపంచిక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి పరలోక లాభాన్ని విస్మరిస్తారో అతను పరలోక లాభాన్ని కోల్పోతాడు. మరెవరైతే పరలోక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి, దానితో పాటు ప్రాపంచిక ప్రయోజనం కూడా పొందాలనుకుంటాడో అతనికి ప్రాపంచిక లాభం లభిస్తుంది మరియు పరలోకంలో కూడా సత్ఫలితం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తాను చేసే ఆచరణ ద్వారా ప్రజల ప్రసన్నత పొందాలని ఉద్దేశిస్తాడో అతడు షిర్క్ చేసినవాడవుతాడు.

అల్లాహ్ చాలా సూక్ష్మజ్ఞాని అని మరియు అతి రహస్య విషయాలు కూడా ఎరుగువాడని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా దుష్టులను వారి దుష్సంకల్పం వల్ల హీనపరచకుండా వారి విషయం దాచి ఉంచి అల్లాహ్ తన దాసులపై చేసిన మేలు కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.

సాఫల్యానికి సబబు ఆచరణలు ఎక్కువ ఉండటం కాదు. అవి మంచివి అయి ఉండటం. ఇఖ్లాస్ (అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయనకే ప్రత్యేకించి) మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం చేయబడినప్పుడే ఏదైనా కార్యం సత్కార్యం అవుతుంది. చిన్న కార్యమైనా సరే ఇఖ్లాస్ తో కూడుకుంటే అదే చాలా గొప్పది. దీనికొక హదీసు కూడా సాక్ష్యముంది. మనిషి ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు తన నియ్యత్ (సంకల్పాన్ని) నిర్థారణ చేసుకోవాలి. ఫర్జ్ అయినా, నఫిల్ అయినా, ఏ కార్యమైనా నియ్యత్ లేనిది అంగీకరింపబడదు. నియ్యత్ కొరకు నోటితో పదాలు ఉచ్చరించుట అనవసరం, దేని విషయంలో స్పష్టమైన నిదర్శనం ఉందో అది తప్ప. (ఉదాః హజ్).


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

ఉపవాస సమయంలో దుఆ అంగీకరించ బడుతుంది [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[1:24 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (1:24 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

ఇతరములు:

ఉపవాసపు నియ్యత్ (సంకల్పం) ఎప్పుడు చేసుకోవాలి? [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[1:43 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (1:43 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

ఇతరములు:

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) [ఆడియో సీరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మొదటి చాప్టర్ 

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2tlGlu_q2lGAnhgxg-38Av

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

  1. భాగం 01 (హదీసు #1) (30 నిముషాలు)
  2. భాగం 02 (హదీసు #2,3,4) (28 నిముషాలు)
  3. భాగం 03 (హదీసు #5,6) (32 నిముషాలు)
  4. భాగం 04 (హదీసు #7,8) (31 నిముషాలు)
  5. భాగం 05 (హదీసు #9,10) (29 నిముషాలు)
  6. భాగం 06 (హదీసు #11,12) (30 నిముషాలు)

6 ఆడియోలు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
సకల అంతర్బాహ్య వాక్కర్మలలో , సర్వ కాల  సర్వావస్థల్లో  సంకల్ప శుద్ది  అవసరం [PDF]

హదీసులు మీ సౌకర్యం కోసం క్రింద ఇవ్వ బడ్డాయి:

అల్లాహ్‌ సెలవిచ్చాడు:

“వారు అల్లాహ్‌కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలని, జకాత్‌ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరియైన ధర్మం.” (అల్‌ బయ్యినహ్‌ : 5)

మరోచోట అల్లాహ్‌ సెలవిచ్చాడు :

“వాటి మాంసమూ అల్లాహ్‌ను చేరదు, వాటి రక్తమూ చేరదు. కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి.” (అల్‌ హజ్జ్‌ : ౩7)

ఇంకొకచోట ఆయన ఇలా ఆదేశించాడు :

“ప్రవక్తా  ప్రజలను ఇలా హెచ్చరించు : “మీరు దాచినా లేక బహిర్గతం చేసినా – మీ మనసుల్లో ఉన్నదంతా అల్లాహ్‌కు తెలుసు.” (ఆలి ఇమ్రాన్‌ : 29)


1. విశ్వాసుల నాయకులు హజ్రత్‌ అబూ హఫ్స్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

“ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అతని మనసులోని ఉద్దేశానికి అనుగుణంగా ప్రతిఫలం దొరుకుతుంది. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కోసం వలస పోయిన వ్యక్తి ప్రస్థానం – నిజంగానే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కోసం చేసిన ప్రస్థానంగా పరిగణించబడుతుంది. ఎవడైతే ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో లేక ఏ స్త్రీనయినా వివాహమాడాలనే సంకల్పంతో వలస పోతాడో అతడు – తాను కోరుకున్న వాటికోసం వలసపోయినట్టుగా భావించటం జరుగుతుంది.”

ఈ హదీసు ప్రామాణికతపై ఏకాభిప్రాయం ఉంది. హదీసు వేత్తల్లో అగ్రగణ్యులైన ఉభయులూ – అనగా అబూ అబ్దుల్లాహ్‌ ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ బుఖారీ మరియు అబుల్‌ హుసైన్‌ ముస్లిం బిన్‌ హజ్జాజ్‌లు – హదీసు సంకలన గ్రంథాలన్నిటిలోకెల్లా ప్రామాణికమైన తమ తమ గ్రంథాల్లో ఈ హదీసును పొందుపరచారు.


2. విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మె అబ్దుల్లాహ్‌ హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

“సైనిక పటాలం ఒకటి కాబాపైకి దండెత్తే ఉద్దేశ్యంతో బయలుదేరుతుంది. ఆ సైనిక పటాలం భూమండలంలోని ఒక ప్రదేశానికి చేరుకోగానే అక్కడి వారంతా భూమిలోనికి కూరుకుపోతారు.”

హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) అంటున్నారు – ఆ మాట విని నేను “ఓ దైవప్రవక్తా! వారంతా భూమిలో ఎందుకు కూర్చి వేయబడతారు? వారిలో బజారున పోయేవారు, వేరే ఇతరులు కూడా ఉంటారు కదా!” అని అడిగాను. (అంటే సైనికాధికారులతో పాటు సామాన్య సిపాయిలు లేదా బజారులో తిరిగే మామూలు మనుషులు కూడా ఉంటారని అర్ధం.) దానికి ఆయన “మొదటి నుంచి చివరిదాకా వారందరూ నేలలోకి కూర్చి వేయబడతారు. అయితే ఆ తరువాత వారంతా కూడా తమ తమ ఉద్దేశాల ఆధారంగా లేపబడతారు. (అంటే ప్రళయం సంభవించాక వారితో వారి సంకల్పాలనుబట్టి వ్యవహరించడం జరుగుతుంది)” అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీవి).


3. హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :

“మక్కా విజయం తరువాత హిజ్రత్‌ (వలస వెళ్ళవలసిన అవసరం) లేదు. అయితే దైవమార్గంలో పోరాటం మరియు సంకల్పం మాత్రం కొనసాగుతూ ఉంటాయి. దైవమార్గంలో పోరాడటం కోసం మిమ్మల్ని పిలవడం జరిగితే, మీరు (తక్షణమే) బయలు దేరండి.”(బుఖారీ,ముస్లిం)

దీని భావం ఏమిటంటే, (హిజ్రీ శకం 8వ యేట) మక్కా నగరం దారుల్‌ ఇస్లాం (ఇస్లామీయ రాజ్యం) అయిపోయింది. కనుక మక్కా విజయం తరువాత ఇక మక్కా నుండి వలస వెళ్ళాల్సిన అవసరం మిగిలి ఉండలేదు.


4. హజ్రత్‌ అబూ అబ్దుల్లాహ్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ అన్సారీ (రది అల్లాహు అన్హు) కథనం :

మేము ఒకానొక యుద్ధంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట ఉన్నాము. అప్పుడు ఆయన ఈ విధంగా ప్రవచించారు : “మదీనాలో కొంతమంది (యుద్దానికి) రాలేకపోయారు. అయితే మీరు ప్రయాణించిన ప్రతిచోటా, మీరు నడిచిన ప్రతి లోయలోనూ వారు మీతోపాటే ఉన్నారు. అనారోగ్యం వారిని ఆపి ఉంచింది.”

వేరొక ఉల్లేఖనంలో “పుణ్యంలో మీతో పాటు వారు కూడా భాగస్వాములయ్యారని ఉంది” (ముస్లిం)

బుఖారీ ఉల్లేఖనంలో హజ్రత్‌ అనస్‌ (రది అల్లాహు అన్హు) ఇలా ఉటంకిస్తున్నారు :

“మేము తబూక్‌ యుద్దానంతరం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట తిరిగి వచ్చాము. అప్పుడు ఆయన ఇలా అన్నారు : “కొందరు మన వెనక మదీనాలోనే ఆగిపోయి ఉన్నారు. అయితే మనం నడిచిన ప్రతి కనుమ, ప్రతి లోయలోనూ వారు మనతోపాటే ఉన్నారు. తగిన కారణం వల్ల వారు రాలేకపోయారు.”


5. హజ్రత్‌ అబూ యజీద్‌ మాన్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రది అల్లాహు అన్హు) (ఈయన, ఈయన తండ్రీ తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం:

“మా నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)


6. ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభవార్త పాందిన పదిమందిలో ఒకరైన అబూ ఇస్‌హాఖ్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఖాస్ (రది అల్లాహు అన్హు) కథనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను అంతిమ హజ్‌ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయి ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్లి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రొండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?” అని అడిగాను. దానికి ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను “సగం ధనం దానం చేయనా” అని అడిగాను. దానికి కూడా ఆయన “కూడదు” అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవ ప్రవక్తా!” అని విన్నవించుకోగా అందుకు ఆయన “మూడింట ఒక వంతు అయితే చేయగలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది” (అని అన్నారు). “ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగి దరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్టితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు” అని ఉపదేశించారు. అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)” అని సందేహపడగా దానికి ఆయన “(అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్‌! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు’ అని వేడుకున్నారు. కాని “సాద్‌ బిన్‌ ఖౌలా” దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)


7. హజ్రత్‌ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ సఖర్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

“అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు.” (ముస్లిం)


8. హజ్రత్‌ అబూ మూసా అబ్దుల్లాహ్‌ బిన్‌ ఖైస్‌ అష్‌అరీ (రది అల్లాహు అన్హు) కథనం :

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను “ఒకడు తన శూరత్వాన్ని ప్రకటించుకోవడానికి, మరొకడు తన వంశప్రతిష్టను చాటుకోవడానికి, ఇంకొకడు పరుల మెప్పు పొందడానికి పోరాడుతున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు దైవ మార్గంలో పోరాడుతున్నట్లు?” అని ప్రశ్నించడం జరిగింది. అందుకాయన “దైవవాక్కు (దైవధర్మం) ఉన్నతి కోసం పోరాడిన వాడు అల్లాహ్‌ మార్గంలో పోరాడినట్లు పరిగణించడం జరుగుతుంది” అని సమాధానమిచ్చారు. “(బుఖారి  – ముస్లిం)


9. హజ్రత్‌ అబూబక్రహ్‌ నుఫైబిన్‌ హారిస్‌ సఖఫీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :

“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు. (బుఖారీ -ముస్లిం)


10. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:

“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్‌ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్‌! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”

(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్‌హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.


11. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ (రది అల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :

“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్‌ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్‌ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్‌ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)


12. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రది అల్లాహు అన్హు) తెలియజేశారు:

“మీ పూర్వీకుల్లోని ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణానికి బయలుదేరారు. దారిలో రాత్రయింది. ఆ ముగ్గురూ ఒక గుహలో శరణు తీసుకుందామని అందులోకి వెళ్ళారు. అంతలోనే పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లిపడింది. దాంతో గుహ ముఖద్వారం మూసుకు పోయింది. దాంతో వారు ఆ ఆపద నుంచి బయటపడే మార్గం గురించి మాట్లాడుకున్నారు. ఆఖరికి తాము అంతకు మునుపు చేసుకున్న సత్కార్యాల ఆధారంగా అల్లాహ్‌ను వేడుకోవడం తప్ప ఆ విపత్తు నుండి బయట పడేందుకు వేరేమార్గం లేదన్న నిర్ణయానికి వచ్చారు.

వారిలోని ఒకడు ఇలా వేడుకున్నాడు : “దేవా! నాకు మరీ ముసలివారైన తల్లిదండ్రులుండేవారు. సాయంత్రం పూట అందరికంటే ముందు నేను నా తల్లిదండ్రులకే పాలు త్రాగించేవాడిని. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు గానీ, నా నౌకర్లకు గానీ త్రాపించేవాణ్డి కాను. ఒకరోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరూ నిద్రపోయారు. నేను ఆ పూట పాలు పితికి తీసుకు వచ్చాను. అప్పటికే వారు గాఢ నిద్రలో ఉండడం గమనించాను. వారిని మేల్కొలపడానికి నాకు మనసొప్పలేదు. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు, నౌకర్లకు పాలు త్రాగించడం కూడా నాకిష్టం లేదు. అందుకని నా పిల్లలు నా కాళ్ళ మీద పడి విలవిల్లాడినా కూడా (నేను వారికి త్రాపకుండా) పాలపాత్ర చేతిలో పట్టుకొని తెల్లవారే దాకా వాళ్ళ దగ్గరే నిలబడి, ఏ సమయం లోనైనా వారు మేల్కొంటారేమోనని ఎదురు చూడసాగాను. తెల్లవారిన తరువాత గాని వారు లేవలేదు. నిద మేల్కొని రాత్రి వారికోసం ఉంచబడిన పాలు తాగారు. ఓ అల్లాహ్! కేవలం నీ ప్రసన్నత కోసమే నేనీ పని చేసివుంటే మేము చిక్కుకున్న ఈ గుహ ముఖ ద్వారం నుండి బండ రాయిని తొలగించి మమ్మల్ని రక్షించు.”

అతని వేడుకోలు ఫలితంగా ఆ బండ రాయి కొద్దిగా జరిగింది. అయితే (అప్పటికీ, ఆ సందుగుండా వారు బయటికి రాలేకపోయారు.

తరువాత రెండో వ్యక్తి అభ్యర్థించుకో సాగాడు: “ఓ దేవా! నా బాబాయి కూతురు ఒకామె ఉండేది. నేనామెను అమితంగా ఇష్టపడేవాణ్ణి. (వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది): మగవారు ఆడ వారిని అమితంగా ప్రేమించినంతగా నేను ఆమెను ప్రేమించేవాడిని. ఒకసారి నేను ఆమె పొందుకోసం పరితపించాను. కాని అందుకామె ఒప్పుకోలేదు. ఆఖరికి దుర్భిక్షం ఆమెను గత్యంతరం లేక నా వద్దకు వచ్చేలా చేసింది. అప్పుడు ఆమె నాతో ఏకాంతంలో గడిపే షరతుపై నేనామెకు నూట ఇరవై దీనార్లు ఇచ్చాను (గత్యంతరం లేక ఆమె అవి తీసుకుంది). నా కోరిక తీర్చేందుకు సిద్ధమయ్యింది. నేనామెను ఆక్రమించుకున్నప్పుడు, (వేరొక ఉల్లేఖనం ప్రకారం) నేను ఆమె రెండు తొడల మధ్య కూర్చు న్నప్పుడు ఆమె నాతో; “అల్లాహ్‌కు భయపడు! అక్రమంగా కన్నెపొరను చీల్చకు అని అంది. ఆ మాటలు విన్న తడవుగా నేను ఆమె దగ్గర నుండి లేచి పోయాను. నిజానికి ఆమె నాకు ప్రజల్లో అత్యంత ప్రియతమమైనది. నేను ఆమె కిచ్చిన బంగారు దీనార్లను కూడా వదులుకున్నాను. ఓ దేవా! నేను కేవలం నీ ప్రసన్నత కోసమే ఇలా చేసి ఉన్నట్లయితే మాపై వచ్చిపడిన ఈ విపత్తు నుండి మమ్మల్ని రక్షించు.

రెండో వ్యక్తి వేడుకోలు తరువాత ఆ బండరాయి ఇంకొంచెం తొలగింది. అయినా గాని వారు బయటపడేందుకు మార్గం సుగమం కాలేదు.

ఆ తరువాత మూడో వ్యక్తి వేడుకోవడం ప్రారంభించాడు: “ప్రభూ! నేను కొంత మంది పని మనుషులను జీతానికి ఉంచుకున్నాను. నేను వారందరికీ జీతాలిచ్చేశాను. కాని వారిలో ఒకడు మాత్రం తన జీతం పుచ్చుకోకుండానే వెళ్ళిపోయాడు. నేను అతని జీతాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. దాంతో చాలా ధనం పోగయ్యింది. కొంత కాలానికి ఆ వ్యక్తి వచ్చి, “ఓ దైవ దాసుడా! నాకు నా జీతం ఇవ్వు” అనడిగాడు. దానికి నేను, “నువ్వు చూస్తున్నటువంటి ఈ ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు – అన్నీ నీ జీతం ఫలాలే (వాటిని నువ్వు తీసేసుకో)” అన్నాను. అందుకతను “ఓ దైవదాసుడా! నాతో పరాచికాలు వద్దు’ అంటూ చిన్నబోయాడు. నేను “ఇది పరాచికం కాదు (నిజం చెబుతున్నాను)” అన్నాను. అప్పుడు అతను (నా కోసం) ఏమీ వదలకుండా ఆ సంపదనంతా తరలించుకొని వెళ్ళిపోయాడు. ఓ అల్లాహ్! నేను ఈ పని కేవలం నీ ప్రసన్నతను దృష్టిలో పెట్టుకొనే చేసినట్టయితే మేము చిక్కుకున్నటువంటి ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడు.” దాంతో ఆ బండరాయి పూర్తిగా తొలగి పోయి గుహద్వారం తెరుచుకోవటంతో వారు ముగ్గురూ బయటపడ్డారు. (బుఖారీ -ముస్లిం)