తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి

బిస్మిల్లాహ్

22 వ అధ్యాయం
తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి.
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం చూడండి:

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).

అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్‌ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్‌ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).

అలీ బిన్‌ హుసైన్‌ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని  నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్‌ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:

“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్‌ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్‌ ముఖ్ తార్ ).

ముఖ్యాంశాలు:

1. సూరయే  తౌబా ఆయతు యొక్క భావం.

2. షిర్క్‌ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.

3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.

4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.

5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.

6. నఫిల్‌ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.

7. స్మశానంలో నమాజ్‌ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.

8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్‌ జఖ్‌)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్‌, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్  వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్‌ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.

సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్‌ భద్రతకై షిర్క్‌ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.


ఇది ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

%d bloggers like this: