నాలుకతో & చేతితో ఇతరులకు కష్టం, నష్టం కలిగించకూడదు : హదీథ్׃ 13
: فظ اللسان واليد من التعدي
عَنْ أَبِي مُوْسى الْأَشْعَرِيِّ رَضِي اللهُ عَنْهُ قَالَ : قُلْتُ ” يَا رَسُوْلُ اللهِ ! أَيُّ الْإِسْلَامِ أَفْضَلُ؟ “
قَالَ : “مَنْ سَلِمَ الْـمُسْلِمُوْنَ مِنْ لِسَانِهِ وَيَدِهِ”. رَوَاهُ الْبُخَارِي
అన్ అబి మూస అల్అషఅరీ రదియల్లాహు అన్హు ఖాల : ఖుల్తు “యా రసూలుల్లాహ్! ఐయ్యుల్ ఇస్లామి అఫ్దలు? ” ఖాల – “మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహి, వ యదిహి ” రవాహ్ అల్ బుఖారి.
తాత్పర్యం : – అన్ = ఉల్లేఖించారు, అబి మూస అల్అషఅరీ = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు = అల్లాహ్ ఆయనను ఇష్టపడుగాక, ఖాల = చెప్పారు, ఖుల్తు యా రసూలుల్లాహ్ = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను వారిలా ప్రశ్నించారు, ఐయ్యుల్ ఇస్లామి = ఇస్లాంలో ఏది, అఫ్దలు = ఉత్తమమైనది, ఖాల = చెప్పారు, మన్ = ఎవరు, సలిమ = భద్రత కలిగించటం, అల్ ముస్లిమూన = (ఇతర) ముస్లింలకు, మిన్ = నుండి, లిసానిహి = అతడి నాలుక, వ = మరియు, యదిహి = అతడి చేతి (నుండి).
అనువాదం :- అబిమూస అల్ అషఅరీ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను “ఇస్లాంలో ఉత్తమమైనది ఏది?” అని ప్రశ్నించగా, వారు ఇలా జవాబు చెప్పారు “ఇతర ముస్లింలు ఎవరి చేయి మరియు నాలుక నుండి భద్రత పొందుతారో (ఇతర ముస్లింలపై నోటితో మరియు చేతితో దాడి చెయ్యకపోవటం ఉత్తమమైనది)” సహీబుఖారి
వివరణ :- మన నాలుక (తిట్లు తిట్టడం,దుర్భాషలాటడం) ద్వారా ఇతర ముస్లింలకు ఎటువంటి కష్టం కలిగించకూడదనే విషయాన్ని ఈ హదీథ్ స్పష్టంగా తెలియజేస్తున్నది. మన హృదయభావాలను నిర్దిష్టంగా, స్పష్టంగా, ఖచ్ఛితంగా ప్రకటించే శక్తిసామర్ధ్యాలు ఒక్క నాలుకకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నాలుక ను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇంకా మన చేతుల ద్వారా ఇతర ముస్లింలకు ఎలాంటి కష్టం, నష్టం కలిగించకూడదని ఈ హదీథ్ స్పష్టంగా ప్రకటిస్తున్నది. మన ఆలోచనల, భావాల ఆచరణకు తరచుగా చేతులనే వాడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చేయి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ హదీథ్ ఆచరించడం వలన కలిగే లాభాలు:-
- ఎంత అల్పమైనవైనా సరే, ఇతరుల హక్కులను ఉల్లంఘించటం, అతిక్రమించడం ఎంత మాత్రమూ తగదు. “అల్లాహ్ జ్ఞానం నుండి మన ఆలోచనలు,మాటలు, చేతలు ఏ సమయంలోనూ తప్పించకోలేవు” అనే నగ్నసత్యాన్ని అన్నివేళలా గుర్తించుకోవలెను.
- ఇతరులకు హాని, అపాయం కలిగించనివారే ఉత్తమమైన ముస్లింలు.
- తిట్లు తిట్టడం, నిందలు మొపటం, శాపనార్ధాలు పెట్టడం, జుగుప్సాకరమైన కలహించే స్వభావం గల దుర్భాషలాడటం తగదు.
- ఇతరులకు ఇష్టంలేని వాటిని ప్రస్తావించడం కూడా వారికి హాని కలిగించడమే.
- ఇతరుల అనుమతి లేకుండా వారి వస్తువులను తాకకూడదు, అస్సలు తీసుకోకూడదు.
హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:
ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పూర్తి పేరు అబిమూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ బిన్ ముస్లిం అష్అరీ రదియల్లాహు అన్హు. బాగా ప్రసిద్ధి చెందిన ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లమ్) సహచరులలో వీరు కూడా ఒకరు. కూఫా పట్టణానికి గవర్నర్ గా సేవలందించారు. 50వ హిజ్రీ సంవత్సరంలో మరణించారు.
ప్రశ్నలు
- “యా రసూలుల్లాహ్! ఐయ్యుల్ ఇస్లామి అఫ్దలు?” ఖాల – “మన్ సలిమల్ ముస్లిమూన మిన్ ________, వ _________ ”
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ను “ఇస్లాంలో ఉత్తమమైనది ఏది?” అని ప్రశ్నించగా, వారు ఇలా జవాబు చెప్పారు “ఇతరులు ఎవరి ______మరియు ______ నుండి భద్రత పొందుతారో.
- ఇతర ముస్లింల పై నోటితో మరియు చేతితో దాడి చెయ్యక పోవటం _________
- మన నాలుక (తిట్లు తిట్టడం) ద్వారా ఇతరులకు _________ కలిగించకూడదు.
- మన హృదయభావాలను నిర్దిష్టంగా, స్పష్టంగా, ఖచ్చితంగా ప్రకటించే శక్తిసామర్ధ్యాలు ఒక్క _________ మాత్రమే ఉన్నాయి.
- మన చేతుల ద్వారా ఇతర ముస్లింలకు ఎలాంటి _________ కలిగించకూడదు.
- మన ఆలోచనల, భావాల _________ కు తరచుగా చేతులనే వాడటం జరుగుతుంది.
- ఎంత అల్పమైనవైనా సరే, ఇతరుల హక్కులను ఉల్లంఘించటం, అతిక్రమించడం ఎంత మాత్రమూ _________.
- “అల్లాహ్ జ్ఞానం నుండి మన ఆలోచనలు, మాటలు, చేతలు _________________”
Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – సయ్యద్ యూసుఫ్ పాషా