సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌).

అల్లాహ్‌ తన అంతిమ గ్రంథంలో వారిని కొనియాడుతూ ఇలా సెలవిచ్చాడు :

وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ

“ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించినవారితోనూ అల్లాహ్‌ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్‌ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (అత్‌ తౌబా : 100)

ఇంకా ఈ విధంగా స్తుతించాడు :

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) అల్లాహ్‌ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవ కృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగ పడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇన్‌జీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆపైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్‌ వాగ్దానం చేసి ఉన్నాడు. (అల్‌ ఫత్‌హ్‌ : 29)

ఇంకా అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ هُمُ الصَّادِقُونَ

وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ

(ముఖ్యంగా ఈ ‘పై’ సొమ్ము) తమ ఇల్లూ వాకిలి నుండీ, తమ ఆస్తి పాస్తుల నుండీ గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు చెందుతుంది. (ఎందుకంటే) వారు దైవానుగ్రహాన్ని దైవప్రసన్నతను ఆశిస్తూ దైవానికీ, ఆయన ప్రవక్తకూ తోడ్పడుతున్నారు. వారే సిసలయిన సత్యసంధులు. ఇకపోతే; వీరికంటే ముందే ఈ ప్రదేశం (మదీనా) లోనూ, విశ్వాసంలోనూ స్థానికులుగా ఉన్నవారు (వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది). వారు ఇల్లూ వాకిలిని వదలి తమ వైపునకు వలసవచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా తమ ఆంతర్యాలలో ఏ కాస్త కూడా సంకోచాన్ని రానివ్వరు. తాము ఎంతో అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ ఆంతర్యంలోని స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు. (అల్‌ హష్ర్  : 8, 9)

ఈ సూక్తులలో అల్లాహ్ ముహాజిర్లను, అన్సార్లను మెచ్చుకున్నాడు. వారిని సత్కార్యాల వైపు ముందంజవేసే వారుగా అభివర్డించాడు. తాను వారి పట్ల ప్రసన్నుణ్తి అయ్యానని, వారి కొరకు పిల్లకాలువలు ప్రవహించే ఉద్యాన వనాలను సిద్ధపరచి ఉంచానని తెలిపాడు. ఇంకా వారిలోని సుగుణాలను తెలుపుతూ వారు పరస్పరం దయాగుణం కలవారని, అవిశ్వాసులకు మాత్రం సింహస్వప్నమని చెప్పాడు. వారు అత్యధికంగా దైవసన్నిధిలో వంగేవారని, సాష్టాంగ ప్రణామాలు చేసేవారని, వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండేవని చెప్పాడు. వారిలోని మరో ప్రత్యేకత ఏమిటంటే; వారు దైవవిధేయతా చిహ్నంతో కనుగొనబడేవారు. అల్లాహ్‌ వారిని తన ప్రవక్త సహచర్యం కొరకు ఎంపిక చేశాడు – తద్వారా అవిశ్వాసులను మరింతగా ఉడికించాలని. వారిలో ముహాజిర్లు అనబడే వారి విశిష్టత ఏమిటంటే, వారు అల్లాహ్‌ ప్రీతి కొరకు, ధర్మసంస్థాపనార్థం తమ స్వదేశాన్ని, తమ ఆస్తిపాస్తులను వదలి ప్రస్థానం చేశారు. ఈ విషయంలో వారు నిజాయితీపరులని నిరూపించుకున్నారు. అన్సార్లు అనబడేవారి ప్రత్యేకత ఏమిటంటే వారు మదీనావాసులు. ముహాజిర్లను ఆదుకోవటంలో, దైవధర్మానికి తోడ్పడటంలో నికార్సయిన విశ్వాసులని నిరూపించుకున్నారు. వారిలోని ఓ గొప్ప సుగుణం ఏమిటంటే వారు తమ ముహాజిర్‌ సోదరులను అమితంగా ప్రేమించేవారు. వారి ప్రేమ నిష్కల్మషమయినది. వారి ఆంతర్యాలలో కల్లాకపటం ఉండేది కాదు. వారు ఎల్లప్పుడూ తమ ఆత్మలపై తమ ముహాజిర్‌ సోదరులకే ప్రాధాన్యత ఇచ్చారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేవారు. వారి మనసులలో పిసినారితనం, సంకుచిత స్వభావం ఏ కోశానా ఉండేవి కావు. అందుకే వారు విజయ భాగ్యానికి నోచుకున్నారు. ఇవి వారిలోని సర్వసామాన్యమయిన సుగుణాలు. అలాగే కొన్ని ప్రత్యేక సుగుణాల దృష్టా వారిలో కొందరు మరికొందరి కంటే గొప్పవారుగా కీర్తించబడ్డారు – ముఖ్యంగా ఇస్లాం కొరకు, ధర్మయుద్ధం కొరకు, హిజ్రత్ కొరకు ముందంజవేసిన కారణంగా!

వారిలో అందరికన్నా గొప్ప సహాబీలు (రది అల్లాహు అన్హుమ్)నలుగురు ధర్మ ఖలీఫాలు. అంటే హజ్రత్‌ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ (రది అల్లాహు అన్హుమ్). ఆ తరువాత అష్ర ముబష్షిరన్ – అంటే స్వర్గలోక శుభవార్త ప్రపంచంలోనే పొందిన ధన్యజీవులు. వారు (నలుగురు ధర్మఖలీఫాలతో పాటు) తల్హా జుబైర్‌, అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌, అబూ ఉబైదా బిన్‌ జర్రాహ్, సాద్‌ బిన్‌ అబీ వఖ్ఖాస్, సయూద్‌ బిన్‌ జైద్‌ (రది అల్లాహు అన్హుమ్). ముహాజిర్లకు అన్సార్లపై ఒకింత ప్రాధాన్యం ఉంది. బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నవారికి, అహ్లో బైఅతే రిజ్వాన్‌లో ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత వొసగబడింది. అలాగే మక్కా విజయానికి పూర్వం ఇస్లాం స్వీకరించి జిహాద్‌ చేసినవారు, మక్కా విజయం తర్వాత ఇస్లాం స్వీకరించిన సహాబీల కన్నా గొప్పవారు.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది

%d bloggers like this: