హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
రెండవ అధ్యాయం – హదీసులు # 13– 24
రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons
పశ్చాత్తాపం (తౌబా) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV132qYigRnubXEJQLDjCdjk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:
భాగం 01 (హదీసు #13,14) (32 నిముషాలు)
భాగం 02 (హదీసు #15,16,17,18) (36 నిముషాలు)
భాగం 03 (హదీసు #19,20) (34 నిముషాలు)
భాగం 04 (హదీసు #21) (44 నిముషాలు)
భాగం 05 (హదీసు #22,23,24) (38 నిముషాలు) – చివరి భాగం
హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
పశ్చాత్తాపం (తౌబా) [PDF]
హదీసులు మీ సౌకర్యం కోసం క్రింద ఇవ్వ బడ్డాయి:
విద్వాంసుల స్పష్టీకరణ : జరిగిపోయిన ప్రతి పాపానికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి, దాసుని పాపం అల్లాహ్‌కు మరియు ఆ దాసునికే పరిమితమై సాటి మానవుల హక్కుకి దానితో ఎలాంటి సంబంధం లేనట్లయితే అలాంటి వ్యక్తి పశ్చాత్తాపం అంగీకరించబడటానికి మూడు షరతులు ఉన్నాయి.
- ఒకటి : పశ్చాత్తాపం చెందుతున్న పాపానికి తను పూర్తిగా స్వస్తి పలకాలి.
- రెండు : జరిగిపోయిన పాపానికి సిగ్గుతో కుమిలిపోవాలి,
- మూడు : భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలా చేయనని గట్టిగా నిశ్చయించుకోవాలి.
ఈ మూడు నియమాల్లో ఏ ఒక్కటి లోపించినా అతని పశ్చాత్తాపం సరైనది కాదు.
ఒకవేళ జరిగిన పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే పశ్చాత్తాపం దైవ సన్నిధిలో అంగీకరించబడటానికి నాలుగు నిబంధనలున్నాయి.
- పై మూడు నిబంధన లతో పాటు నాల్గవ నిబంధన ఏమిటంటే, అతను తోటి మానవుని హక్కుని అతనికి తిరిగి ఇచ్చివేయాలి. పరులనుండి ధనం లేక మరేదైనా వస్తువు అధర్మంగా తీసుకొనివుంటే దాన్ని వాపసుచేయాలి. తోటి వ్యక్తులపై నీలాపనిందలు ఇత్యాదివి మోపి వున్నట్లయితే వారి శిక్షను తాను అనుభవించాలి లేదా క్షమాభిక్ష కోరి వారిని సంతోషపరచాలి. తోటి మనిషి వీపు వెనక చాడీలు చెప్పివుంటే అతణ్ణి నిర్దోషిగా నిలబెట్టాలి.
అయితే పాపాలన్నిటిపై పశ్చాత్తాపం చెందటం మాత్రం తప్పనిసరి. ఏవో కొన్ని పాపాలపై మాత్రమే పశ్చాత్తాపపడితే అహ్లే సున్నత్ వారి దృష్టిలో ఆయా విషయాల్లో అతని పశ్చాత్తాపం సరైనదే గాని ఇతర పాపాలు మాత్రం ఇంకా అతనిపై మిగిలే వుంటాయి.
పాపాలపై పశ్చాత్తాపం అవసరమన్న విషయమై ఖుర్‌ఆన్ హదీసుల్లో అనేక ఆధారాలున్నాయి. వాటిపై ముస్లిం సమాజ ఏకాభిప్రాయమూ ఉంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : “ఓ విశ్వాసులారా! మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్ వైపుకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు.” (నూర్ – ౩7)
మరోచోట అల్లాహ్ ఉపదేశిస్తున్నాడు : “మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపుకే మరలండి (పాపాల పశ్చాత్తాపపడండి).” (హూద్ – ౩)
ఇంకొకచోట ఇలా అంటున్నాడు : “విశ్వసించిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపుకు మరలండి.” (తహ్రీమ్ – 8)
13. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:
“అల్లాహ్ సాక్షి! నేను రోజుకు డెబ్భైకన్నా ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడుకుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉంటాను.” (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ప్రార్ధనల ప్రకరణం.)
ముఖ్యాంశాలు:
1. ఈ హదీసులో నిత్యం పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ మన్నింపు కోసం వేడుకుంటూ ఉండాలని పురికొల్పడం జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అత్యంత పునీతులు. అల్లాహ్ ఆయన వెనుకటి పాపాలను, జరగబోయే పాపాలను అన్నింటినీ మన్నించాడు. అసలు ఆయన చేత దొర్లిన పొరపాట్లను పాపాలు అనడం కూడా సబబు కాదు. అయితే సాధారణ వ్యక్తులకు సమ్మతమైనవిగా భావించబడే కొన్ని పనులు మహనీయులకు శోభాయమానం కావు. ఆయన గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదో ఒక దశలో స్వల్పమయిన పొరపాట్లు జరగవచ్చు. అలాంటి దైవప్రవక్తే రోజుకు డెబ్బైకన్నా ఎక్కువసార్లు పాపాల మన్నింపు కోసం వేడుకుంటుండగా పీకలదాకా పాపాల్లో మునిగివున్న మనం ఎలా ఉపేక్షించబడతాం!
2. నిరంతరం వీలైనంత ఎక్కువగా పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉండాలి. దీనివల్ల మనకు తెలియకుండానే మనవల్ల దొర్లిపోయే తప్పిదాలు మన్నించబడతాయి. రాబోయే హదీసులో కూడా పశ్చాత్తాప భావన గురించే నొక్కి వక్కాణించబడింది.
14. హజ్రత్ అగర్ర్ బిన్ యసార్ ముజనీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“ప్రజలారా! పాపాలపై పశ్చాత్తాపభావంతో అల్లాహ్ వైపుకు మరలండి. మన్నింపు కోసం ఆయన్ను వేడుకోండి. నేను అల్లాహ్ సన్నిధిలో రోజుకు వందసార్లు పశ్చాత్తాప భావంతో కుంగి పోతూ ఉంటాను.”
(సహీహ్ ముస్లింలోని ధ్యాన ప్రకరణం)
15. దైవప్రవక్త సేవకులు, హజ్రత్ అబూ హంజా అనస్ బిన్ మాలిక్ అన్సారీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“తన దాసుడు పాపాలపై పశ్చాత్తాప పడినందుకు అల్లాహ్, ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టుకొని తిరిగి పొందిన వ్యక్తి కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు.” (బుఖారీ – ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో తన ఒంటెపై ప్రయాణిన్తున్నాడు. దానిపైనే అతని ఆహారసామగ్రి, నీరు ఉన్నాయి. (మార్గమధ్యంలో) ఆ ఒంటె తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె దొరకదని భావించాడు. (వెతికి వేసారి) నిరాశతో తిరిగి వచ్చి ఓ చెట్టు నీడలో మేనువాల్చాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి అతని ముందు నిలబడింది. వెంటనే అతను దాని ముక్కుతాడు పట్టుకొని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్పైపోయి “ఓ అల్లాహ్! నీవే నా దాసుడివి, నేనునీ ప్రభువును” అన్నాడు. సంతోషం పట్టలేక ఆ వ్యక్తి మాటలు అలా తడబడ్డాయనుకుంటే నిశ్చయంగా అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపంపై అంతకన్నా ఎక్కువగానే సంతోషిస్తాడు.
(సహీహ్ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని పశ్చాత్తాప ప్రకరణం)
ముఖ్యాంశాలు:
1.పై హదీసులో కూడా పశ్చాత్తాపం ప్రోత్సహించబడింది, దాని ప్రాముఖ్యత గురించి నొక్కి వక్కాణించటం జరిగింది.
2. దాసుల పశ్చాత్తాప భావం చూసి అల్లాహ్ అమితంగా సంతోషిస్తాడు.
3. అసంకల్పితంగా దొర్లిపోయే పారబాట్లను తప్పుపట్టడం జరగదు. మాటల్లో చేవ తీసుకురావటం కోసం విషయాన్ని ప్రమాణం చేసి మరీ చెప్పటం ధర్మసమ్మళమే.
5. విషయాన్ని బోధపరిచేందుకు ఉదాహరణలు కూడా ఇవ్వవచ్చు.
16. హజ్రత్ అబూ మూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ అష్‌అరీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్పోధించారు:
“పగటిపూట పాపం చేసినవాడు రాత్రికి పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్ రాత్రివేళ తన చేయిని చాపుతాడు. అలాగే రాత్రి వేళ పాపం చేసినవాడు పగలు పశ్చాత్తాపం చెందుతాడని అల్లాహ్ పగటిపూట తన చేయిని చాచి ఉంచుతాడు. (ఈ పరంపర) సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించేంతవరకూ (అంటే ప్రళయం వచ్చేంత వరకు) కొనసాగు తూనే ఉంటుంది.” (ముస్లిం)
ముఖ్యాంశాలు:
‘పై హదీసులో అల్లాహ్‌కు చేయి కూడా ఉంటుందనే గుణం గురించి వివరించడమైనది. అయితే ఆ చెయ్యి ఎలా ఉంటుంది? దాన్ని ఆయన ఎలా చాపుతాడు? అనే విషయం వాస్తవిక స్వరూప స్వభావాల గురించి మనకు తెలియదు. దాన్ని మనం వివరించనూలేము. అయితే దాని వాస్తవిక స్వరూప స్వభావాలు తెలియకపోయినప్పటికీ ఊహాగానాలు, ఉపమానాలు ఇవ్వకుండా దానిపై విశ్వాసముంచటం అవసరం. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే, రేయింబవళ్ళలో ఎప్పుడైనా ఏదైనా తప్పిదం జరిగిపోతే ఏమాత్రం జాప్యం చేయకుండా మనిషి వెంటనే పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ దైవసన్నిధిలో మోకరిల్లాలి.
17. హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించక మునుపే తన పాపాలపై పశ్చాత్తాపం చెందే వాని పశ్చాత్తాపాన్ని అల్లాహ్ సమ్మతించి ఆమోదిస్తాడు.” (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ధ్యానం, ప్రార్ధనల ప్రకరణం)
ముఖ్యాంశాలు:
నిఘంటువు ప్రకారం “తౌబా” అంటే మరలటం అని అర్థం. మనిషి పాపం చేసినప్పుడు అల్లాహ్‌కు దూరమవుతాడు. తిరిగి “తౌబా” చేసుకున్నప్పుడు (పశ్చాత్తాప పడినప్పుడు), ఆయన వైపుకి మరలి ఆయన సాన్నిహిత్యం, ఆయన క్షమాభిక్ష కోసం పరితపిస్తాడు. ఈ మార్పును, ఈ మరలింపునే ‘తౌబా‘ (పశ్చాత్తాపం) అంటారు. అల్లాహ్ అతని వైపు దృష్టి సారిస్తాడంటే అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడని భావం.
18. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ తెలియజేశారు:
“జీవితంలోని అంతిమ ఘడియలు దాపురించక ముందువరకూ అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు.”
ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి హసన్‌గా ఖరారు చేశారు. (సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలో చరమ ఘడియలకంటే ముందు పశ్చాత్తాపం ఆమోదించబడుతుందన్న అధ్యాయంలో ఈ హదీసు ప్రస్తావించ బడింది)
ముఖ్యాంశాలు:
‘పై హదీసులో “గర్‌గరా” అనే పదం వాడబడింది. ఇది ఆత్మ శరీరాన్ని వదలి కంఠానికి చేరుకునేదానికి ధ్వన్యానుకరణం. అంటే జీవితపు చివరి శ్వాసలన్నమాట. ఈ హదీసును ‘హసన్’గా ఖరారు చేయడం జరిగిందంటే ఈ హదీసు పరంపరలో వైవిధ్యాలకు, లొసుగులకు తావులేదు గాని దీని ఉల్లేఖకులు సహీహ్ హదీసుల ఉల్లేఖకుల కంటే తక్కువ స్థాయికి చెందినవారని అర్ధం. హదీసువేత్తల దృష్టిలో సహీహ్ హదీసుల మాదిరిగా “హసన్” కోవకు చెందిన హదీసులు కూడా ఆచరించదగినవే.
You must be logged in to post a comment.