సఫర్ మాసం, దాని దురాచారాలు صفر وبدعاته [వీడియో]

బిస్మిల్లాహ్

ఇస్లామీయ ఈ రెండవ మాసంలో ఎంతో మంది అపశకునం పాటిస్తారు. ఇలా పాటించడం ధర్మమా అధర్మమా ఈ వీడియోలో తెలుసుకోండి.

సఫర్ (صفر) మాసం – ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.

ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463)

సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:

మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.

రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.

[24 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


సఫర్‌ నెల వాస్తివికత

సఫర్‌ నెల ఇస్లామీయ క్యాలండర్‌ ప్రకారం రెండవ నెల. అరబ్బులలో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్తగా రాక మునుపు సఫర్‌ నెలను అపశకునంగా భావించేవారు. మరియు ప్రాచీన అరబ్బులు ఈనెలలో ఆకాశం నుండి అనేక విపత్తులు, బాధలు, నష్టాలు అవతరిస్తాయని నమ్మేవారు. అందుకని ఈ నెలలో వివాహాలు, సంతోష సంబరాలు వంటి మంచి కార్యాలను నిర్వహించేవారు కాదు.

ప్రస్తుత కాలంలో మన ముస్లిం సమాజానికి చెందిన కొంత మంది అజ్ఞానులు, అలాంటి మూఢ నమ్మకాల వెంటపడి వారిలాగానే సఫర్‌ నెల పట్ల అపశకునాలకు చెందిన కొన్ని నమ్మకాలకు గురికాబడి ఉన్నారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి:

1-మొత్తం సంవత్సరంలో పది లక్షల ఎనభై వేల విపత్తులు ఆకాశం నుండి దిగి వస్తాయని భావిస్తారు. ఆ విపత్తలలో నుండి ఒక్క సఫర్‌ నెలలోనే తొమ్మిది లక్షల ఇరవై వేల విపత్తులకు గురికాబడతారని భావిస్తారు.

2-సఫర్‌ నెల రాగానే ప్రయాణాలను మానుకుంటారు, సంతోషకరమైన సంబరాలను జరుపుకోవడం అపశకునంగా భావిస్తారు.

౩-ఈ నెల మొదటి పదమూడు రోజులను “తేరతేది” అని పేర్కొంటూ, తీవ్రమైన విపత్తులకు గురికాబడే రోజులుగా భావిస్తారు.

4- ఈ నెలలో వివాహాలు చేసుకోరు, పెళ్ళి చూపులకు సహితం దూరంగా ఉంటారు. ఒక వేళ క్రొత్తగా వివాహాలు జరిగి ఉన్నా ఆ జంటలను పదమూడు రోజుల వరకు విడదీసి, ఒకరి ముఖాలను మరొకరు చూడడం అపశకునంగా భావిస్తారు. అలా కాదని వారు గనుక కలుసుకుంటే, వారిద్దరిలో ఒకరు చనిపోతారు, లేక జీవితాంతం వారి మధ్య తగాదాలు ఏర్పడతాయని భావిస్తారు.

యదార్ధం ఏమంటే? అలాంటి అపశకునాలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి వాస్తవికత లేదు. పైగా అలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే? నెలలను లేక సమాయాలను అపశకునాలకు విపత్తులకు ప్రత్యేకిస్తే, అల్లాహ్ ను తప్పుపట్టినట్లుగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. కనుక ఒక హదిసు ఖుద్సీలో ఇలా ఉంది:

“అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “ఆదాము పుత్రుడు (మానవుడు) కాలాన్ని (రోజులను, నెలలను, యేడాదిని) తిట్టుతున్నాడు. మరియు నేనే కాలాన్ని. నా చేతిలోనే రాత్రింబవళ్ళ మార్పిడి ఉన్నది.”,(బుఖారి;4452, ముస్లిం:41 70)

మరొక చోట ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“మీరు కాలాన్ని తిట్టకండి. నిశ్చయంగా అల్లాహ్ యే కాలము.” (ముస్లిం:4165)

ఆఖరి చహార్షుమ్బా 

సఫర్‌ నెలకు చెందిన చివరి వారంలో ఉన్న బుధవారాన్ని ఊరుబయటకు వెళ్ళి పచ్చగడ్డిపై నడవటం పుణ్య ఆచారంగా భావిస్తారు. ఎందుకంటే? ఆ రోజే ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లభించినది అని, మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సరదాగా ఆ రోజు పచ్చగడ్డిపై నడిచారని అంటారు. దాని కారణంగా ప్రజలు భార్యపిల్లలతో కలిసి పార్కులలో, తోటలలో షికార్లు చేస్తారు. దానిని ప్రవక్త ఆచారం అని అంటారు.

ఆ సాకుతో కొంత మంది ప్రజలు సఫర్‌ నెల చివరి బుధవారం తమ ఇండ్లలో మంచి వంటకాలు చేసుకొని, స్నానాలు చేసుకొని, క్రొత్త దుస్తులు ధరించి, బాగా అందంగా తయారయ్యి అందాల పోటీల సభలలో పాల్గొన్నట్లు ముస్తాబు అవుతారు. చిన్నాపెద్ద, ఆడామగా అనే  తేడా లేకుండా పార్కుల్లో, తోటల్లోకి పోయి ఏ విధంగా కలిసి మెలిసి షికార్లు చేస్తుంటారనేది మనం చెప్పనక్కర లేదు.

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి రోజులు:

సఫర్‌ నెల చివరి బుధవారం రోజున ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లబించిందా అంటే? దానికి జవాబు కానేకాదు. ఎందుకంటే? “అర్రహీఖుల్‌ మఖ్తూమ్‌” తెలుగు పేజి: 813లో ప్రవక్త గారి గురించి ఇలా ఉంది: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి అయిదు రోజుల ముందు బుధవారం రోజున ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) శరీర ఉష్ణోగ్రత (జ్వరము) మరింత పెరిగిపోయింది. ఆ కారణంగానే ఆయన బాధ బాగా ఎక్కువై అపస్మారక పరిస్థితి ఎర్పడింది.” నిజమేమంటే ఆ రోజే ఆయన అస్వస్థకు గురికాబడ్డారు. కాని మనం స్వస్థత చేకూరిందంటూ సంతోషాలు జరుపుకోవడం ధర్మమేనా? దాని వలన మనకు పుణ్యం ప్రాప్తిస్తుందా? లేక పాపం ప్రాప్తిస్తుందా? మనం ఆఖరి చహార్షుమ్బా పేరుతో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్రనే  తప్పుగా ప్రచారం చేయడం లేదా?

ప్రియమైన ముస్లిములారా! ఆఖరి చహార్షుమ్బా అంటూ ప్రత్యేకమైన ఎలాంటి పుణ్యకార్యం లేదు. మరియు సఫర్‌ నెల గురించి ఇస్లాం ధర్మంలో ఎలాంటి అపశకునాలు లేవు. అసలు అలాంటి అపశకునాలకు గురికాకూడదని ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు:

సఫర్ మాసం, దాని దురాచారాలు

“అంటు (వ్యాధులు), దుశ్శకునం అనేవి ఒట్టిమాటలే. అపశకునాలు లేవు, గుడ్లగుబ కేకల వలన ఎలాంటి ప్రభావం లేదు, మరియు సఫర్‌ (నెల) ఏమి కాదు…” (బుఖారి: 5316, ముప్లిం: 4116)


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 71-74). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

గడుస్తున్న రోజులతో గుణపాఠం (العبرة والموعظة من مرور الأيام) [వీడియో]

బిస్మిల్లాహ్

ఈ వీడియో భాద్యత భావం నేర్పుతుంది.

[25 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మీరు సుత్రా (తెర/అడ్డు) లేకుండా నమాజ్‌ చేయకండి

బిస్మిల్లాహ్

సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు-గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]

ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్‌ చేయకండి.”

“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్‌ ఉంటాడు.” [40]

ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్‌ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్‌ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]

కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని  స్తంభం దగ్గర నమాజ్‌ చేయటానికి ప్రయత్నించేవారు. [42]

అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్‌ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్‌ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్‌ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్‌ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్‌ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;

“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]

ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్‌ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్‌ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్‌ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]

తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్‌ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]

ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్‌ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్‌ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్‌ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్‌ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్‌ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]

హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :

[38] బుఖారీ, అహ్మద్‌

[39] బుఖారీ, ముస్లిం

[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.

[41] అబూదావూద్‌, జవాయెద్‌ బజ్జార్‌ – 54 పేజీ, హాకిమ్‌ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.

[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అయినా, ఒంటరిగా నమాజ్‌ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్‌ ఇమామ్‌ అహ్నద్‌”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్‌ అహ్మద్‌ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.

నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అహ్మద్‌ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.

నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్‌ మాసంలో వెళ్లాను.

అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.

[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా

[44][45] బుఖారీ, అహ్మద్‌

[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్‌

[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.

[48] ముస్లిం, అబూదావూద్‌

[49] నసాయి, అహ్మద్‌ – సహీ పరంపరతో

[50] బుఖారీ,ముస్లిం, అబూ యాలా – 3/107 – తఫ్సీర్ అల్‌ మక్తబతుల్‌ ఇస్లామీ 

[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.

[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.

[53] అహ్మద్‌, దారెఖు,త్నీ  తబ్రానీ – సహీ పరంపరతో.

ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.

ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్‌: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.

యిలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్‌ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!

54, బుఖారీ, ముస్లిం.

55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.


ఇది “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా)”  అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)

ఇతరములు: అజాన్ , నమాజు

ఉరుసులు, దర్గాల వాస్తవికత

బిస్మిల్లాహ్

దర్గాలు

1- దర్గాలు అంటే; కొంత మంది ప్రజలు ఒక పుణ్యాత్ముని సమాధిని ఎన్నుకొని, అక్కడ మహిమలు జరుగుతున్నాయని దానిపై గుంబద్‌లు, గోపురాలు నిర్మించి, అక్కడ అర్చకులుగా కొంత మంది కూర్చుని కొన్ని కార్యకలాపాలను నిర్వహించుకొనే స్థలాలను “దర్గాలు” అంటారు.

2- సమాధి చేయబడి ఉన్న వారి సంతానం నుండి ఒక వారసుణ్ణి “సజ్జాదా నషీన్‌(పీఠాధిపతి) గా ఎన్నుకుంటారు. వారినే “పీర్‌ సాహెబ్” అంటారు. మరియు సమాధి చేయబడిన వ్యక్తిని “వలీఅల్లాహ్” గా భావించి దర్గా నిర్మాణం చేస్తారు.

౩- కొంత మంది స్వార్థపరులు అడవుల్లో, కొండల్లో, లేక పట్టణము యొక్క పొలిమేరన ఒక సమాధిని ఉద్బవింపజేసుకొని, దానికి ఒక పుణ్యాత్ముని పేరుపెట్టి, ఆ సమాధి వల్ల అనేక “కరామత్‌లు” (మహిమలు) జరుగుతున్నాయంటూ కట్టుకథలు చెప్పుకుంటారు. ఇలా వివిధ రకాలుగా ‘దర్గా’లను నిర్మంచుకుంటారు.

దర్గాల అలంకరణ:

దర్గాల నిర్వాహకులు దర్గాల అలంకరణ కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. మొట్ట మొదట సమాధులను పటిష్టవంతం చేస్తారు. తరువాత దానిపై ఒక మహా కట్టడాన్ని నిర్మిస్తారు. మశీదుల గుంబద్‌ల వలే దానిపై కూడా గుంబద్‌లు నిర్మిస్తారు. పచ్చటి మరియు కాషాయ రంగులతో సమాధిని కలర్‌ చేస్తారు. చివరికి ఒక పటిష్టవంతమైన ఆరాధన నిలయంగా నిర్మిస్తారు. తరువాత ప్రతి ఏట ఆ సమాధులను ఆకర్ణణీయకంగా, మనోరంజకంగా రూపుదిద్దుతారు. దర్గాలను మరియు వాటిలో ఉన్న సమాధులను నీళ్ళతో కడిగి శుభ్రపరుస్తారు. తరువాత వాటిపైన సిల్కు చాదర్లు మరియు పూల దండలు కప్పుతారు, దర్గా మొత్తం ఎర్రటి మరియు పచ్చటి లైట్లతో అలంకరిస్తారు. పవిత్రంగా భావించి సమాధి చుట్టు దీపాలు వెలిగిస్తారు, సాంబ్రాణి పొగలు రేకెత్తిస్తుంటారు. అక్కడ “ముజావర్‌” గౌరవ మర్యాదలతో కూర్చొని, అక్కడికి ఆరాధన భావంతో వచ్చేవారి కోసం సమాధి పూజలు (ఫాతిహాలు) జరుపుతుంటారు.

ఉరుస్‌ ఆచారాలు:

అరబీ నిఘంటువులో “ఉర్స్‌” అర్దం: పెళ్ళి కొడుకు లేక పెళ్ళి మరియు సంతోషం అన్న అర్దాలున్నాయి. దీనినే ప్రజలు ఉరుస్‌ అని అంటుంటారు.

మన సమాజంలో ప్రసిద్ది చెందిన ‘ఉరుస్‌‘ అంటే: పుణ్యాత్ముల పేరున నిర్మించబడిన దర్గాల (సమాధుల) వద్ద ప్రతి ఏట మరణదినం (వర్ధంతి) ఉత్సవాలు నెరవేర్చి ‘ఉరుస్‌’ అనే వ్యతిరేకమైన పదాన్ని వాడుతున్నారు.

పుణ్యాత్ముడని భావించిన వ్యక్తి మరణించిన తేది ప్రకారం అతని సమాధిపై ‘సందల్‌ కి రస్మ్‌‘ పేరుతో పూల పందిరిని తయారు చేసుకొని ఊరంతా ఊరేగిస్తూ, మహా హంగామా చేసుకుంటూ, దర్గాకి చేరుకొని అక్కడున్న సమాధిపై దానిని ఉంచుతారు. అలాగే జండాను కూడా ఊరంతా ఊరేగిస్తూ తీసుకొచ్చి ఆ దర్గాలోనే ఒక చెట్టున పాతి పెడతారు. దానిని ‘ఝoడా చెట్టు’ అంటారు. మరియు “మలంగ్‌” అనే వ్యక్తి మూడు రోజుల వరకు కాళ్ళను, చేతులను దారాలతో బంధించుకొని ఆ దర్గాలోనే బస చేస్తాడు. ఆ మూడు రోజుల వరకు తినుటకై అతను పండ్లు ఫలాలు మరియు పాలు తీసుకుంటాడు. తరువాత చివరి రోజున ఫకీర్లుజర్బ్”  పేరున తమ శరీరాలలో కమ్మీలు, కత్తులు పొడుచుకునే ‘కనికట్టు‘ నాటకాలు బహిరంగంగా నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలను మూడురోజుల పాటు జరుపుతారు. తరువాత జనసంఖ్య రాకను బట్టి ఉరుసును 15 రోజుల వరకు పెంచుకుంటారు. మరియు ఆ రోజుల్లో సమాధి చుట్టుప్రక్కల మహా సంతను ఏర్పాటు చేస్తారు. ఆ సంతలో నలువైపుల నుండి వ్యాపారస్తులు అక్కడికి చేరుకొని తమ సామగ్రి అమ్మకాలు జోరుగా జరుపుకుంటారు. ఆ దర్గా సిబ్బంది ఆ వ్యాపారస్తుల నుండి బాడుగ పేరుతో సొమ్మును వసూలు చేస్తారు. ఆ సంతలో ప్రత్యేకమైన, ఆకర్షనీయమైన ఖవ్వాలీ పాడే గాయని, గాయకులు ఆటపాటల కచ్చేరీలు రాత్రంతా నిర్వహిస్తారు. ఆ రాత్రుల్లో మద్య పానీయాలు సేవించి, మతిపోయే గంజాయి త్రాగుడుతో అనేక మంది ప్రజలు ఊగుతూ తూగుతుంటారు. ఆ ‘ఉరుసుల’లో పిల్లలు, పెద్దలు మరియు వృద్దులు, ఆడా మగా, హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొంటారు. దీనిని పుణ్యాత్ముల పేరిట ‘“ఉరుస్‌” ఉత్సవాలు అని జరుపుకుంటారు.

ఈ ఆచారాలకు మరియు ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. కనుక ఇది ఇస్లామీయ ధర్మ ఆచారం అనటం కూడా ఘోరమైన పాపమే.

దర్గాల గురువులు మరియు వారి వాస్తవికత

సమాధి ఆధిపత్యానికి చెందిన పీర్‌సాహెబ్‌ (పీఠాధిపతి) చుట్టూ కొందరు ప్రత్యేకమైన శిష్యులు ఉంటారు, వారిని ‘ముజావర్లు” అంటారు. వీరే అక్కడికి వచ్చే ప్రజలకు గురువులు, ఆ సమాధులకు అర్చకులు. వీరు ఇస్లామీయ ధర్మఙ్ఞానం లేని మూర్ఖులు, మత్తుపానీయాలు సేవించే మస్తాన్లు, గంజాయి సిగరెట్లు కాల్చే గుణహీనులు, తంబాకు మరియు పాన్‌పరాక్‌ నమిలే  అసమర్థులు, ప్రజల విశ్వాసాలతో ఆడుకునే మంత్రగాళ్ళు, భయంభక్తి లేని షైతానులు, మోసగాళ్ళకే మోసగాళ్ళు, అమాయక ప్రజల సొమ్మును దోచుకొనే గజదొంగలు, పొట్టకొస్తే అక్షరం ముక్కరాని అజ్ఞానులు, లేనిపోని కట్టు కథలు “ఔలియాల కరామతులు” (మహిమలు) అంటూ ఉపన్యాసాలు పీకుతారు. అమాయక ప్రజలను మూఢ విశ్వాసాల లోయలోకి నెట్టుతారు. అలా సమాధి చేయబడి ఉన్నవారిని మరియు ఆ పీఠాధిపతిని దేవుని స్థాయికి పెంచి స్పష్టమైన షిర్క్‌ కార్యాకాలాపాలు నిర్వహస్తుంటారు.

అలాంటి గుణహీనులు సంతానం లేనివారికి సంతాన ప్రాప్తిని, నిరుద్యోగులకు ఉద్యోగాలను, కష్టాల నుండి రక్షణను, నష్టాల నుండి లాభాలను, దుఃఖాల నుండి సుఖాలను, అశాంతి నుండి శాంతిని, అస్వస్థత నుండి స్వస్థతను, చేతబడి నుండి రక్షణను, అపజయాల నుండి విజయాలను, అగౌరవం నుండి గౌరవాలను ప్రసాదిస్తారా! అంతే కాదు, దేవుని ఆరాధన లేకుండానే పరలోక మోక్షాన్ని, స్వర్గ ప్రవేశ పత్రాలను సయితం ప్రసాదిస్తామంటూ, ఆ పత్రాలను కొన్నవారికి స్వర్గమే నిలయమంటూ ప్రచారం కూడా చేస్తుంటారు.

ఇస్లాం ధర్మంలో సమాధుల కట్టడాలు , వాటిపై ముజావర్లుగా కూర్చోవటం నిషిద్ధం:

సమాధులను సున్నంతో లేక సిమెంట్‌తో పటిష్టవంతంగా నిర్మించడం, వాటిని గొప్ప స్థానానికి పెంచడం, అక్కడ పీఠాధీపతులు (ముజావర్‌)గా కూర్చోవడం అధర్మమైనది. మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటి గురించి కఠినంగా హెచ్చరించారు.

హజ్రత్ జాబిర్‌ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం):

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“సమాధిని పటిష్టవంతం చేయడాన్ని, దానిపై (ముజావర్లుగా) కూర్చోవటాన్ని, దానిపై కట్టడం నిర్మించడాన్ని నిషేధించారు” (ముస్లిం :970)

హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు:

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“ప్రతి ఆరాధ్య విగ్రహాన్ని పగలగొట్టు మరియు ప్రతి ఎత్తుగా ఉన్న సమాధిని నేలమట్టం చెయ్యి.” (ముస్లిం :969)

ఇక్కడ ఎత్తుగా కట్టబడిన సమాధిని సహితం నేలమట్టం చేయవలసిందిగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. అయిన మన అమాయక ముస్లింలు పుణ్యాత్ముల పేరుతో లేక మహానీయుల పేరుతో సమాధుల్ని ఎత్తుగా కట్టడమే కాకుండా, వాటిపై పటిష్టవంతమైన గోపురాలు కట్టి, ఆరాధ్య నిలయాలుగా చేసుకున్నారు. మరియు వాటి వద్ద ముజావర్లగా నియుక్తులై అమాయక ప్రజలను ధర్మం పేరుతో మోసగిస్తున్నారు.

సమాధుల ఆరాధన

అనేక మంది ప్రజలు మూఢ విశ్వాసాలకు గురికాబడి, సమాధుల వద్దకు జియారత్‌ పేరున, వాటి ఆరాధనకై పలు ప్రదేశాలకు ప్రయాణిస్తుంటారు. మరియు కొంత మంది ప్రజలు హజ్‌ ఆరాధనకు ప్రయాణించినట్లు సమాధుల ఆరాధనకై ప్రయాణిస్తారు. ఏ విధంగానయితే ఒక్క అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలో అదే విధంగా ఆ సమాధులను ఆరాధిస్తారు. అంటే: “దర్గాల వద్ద సజ్దాలు  చేయటం, వాటి చుట్టూ ప్రదక్షణలు చేయటం, అక్కడ తలనీలాలు అర్పించటం, వాటి ముందు భయంభక్తిని చూపటం, అక్కడ నమాజులు చదవటం, ఖుర్‌ఆన్‌ పారాయణం చేయటం, వారిని మొరపెట్టుకోవటం, వారి పేరుతో మొక్కుబడులు చెల్లించటం, వారి పేరున జంతువులను బలినివ్వటం, అక్కడ అన్నదానాల ఏర్పాటు చేయటం, తమ మొక్కుబడుల ప్రకారం అక్కడ బస చేయటం వంటి అనేక విధాల ఆరాధనలు పాటిస్తారు.

ఆ సమాధుల పట్ల అతిగా ప్రవర్తిస్తూ వాటిని చుంబించటం, అక్కడ కాల్చబడిన అగరబత్తీల వీబూదిని తబ్బరుక్‌గా  భావించి తినడం, దానిని శరీరంపై రుద్దుకోవటం, అక్కడ దీపాలుగా వెలిగించబడిఉన్న నూనెను, సమాధిపై ఉన్న పూలను తబ్బరుక్‌గా తీసుకోవటం, టెంకాయలు మరియు తీపు వస్తువులు ఆ సమాధుల కొరకు అర్పించి, వాటిపై ఫాతిహాలు చదివిన తరువాత తబ్బరుక్‌గా భావించటం వంటి అనేక విధాల కార్యకలాపాలు జరుపుతారు. దాని ప్రతిఫలంగా సమాధిలో ఉన్న ఆ “వలీఅల్లాహ్‌” సిఫారసు అల్లాహ్‌ వద్ద వారికి ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. మరియు అల్లాహ్ వద్ద వారు ఎవరికైనా సిఫారసు చేస్తే, వారి సిఫారసును అల్లాహ్‌ ధిక్కరించడని భావిస్తారు.

మరియు కొంత మంది ప్రజలు: అల్లాహ్‌కు చెందిన కొన్ని అద్భుతమైన శక్తులకు ‘ఔలియాలు‘ కూడా అర్హులని విశ్వసిస్తారు. మరియు ఆ పుణ్యాత్ములే వారిని నష్టాల నుండి ఆదుకుంటారు, కష్టాల నుండి రక్షిస్తారు అని విశ్వసిస్తారు. అందుకని వారు దేశవిదేశాలలో పేరు ప్రతిష్టలు పాందిన దర్గాలకు “జియారత్‌” పేరున తిరుగుతుంటారు. మరియు యా అలీ మదద్‌, యా ముష్కిల్‌ కుషా దస్తగీర్ , యా గౌస్‌ మదద్‌, యా ఖాజా గరీబున్‌ నవాజ్‌ వంటి షిర్క్‌ పదాలను వాడుతుంటారు.

దర్గాల నిర్మాణం మరియు వాటి సందర్శనం, వాటి కొరకు ప్రయాణించడం మరియు అక్కడ నిర్వహించే ఏ ఒక్క కార్యానికీ ఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు. అలైహి వసల్లం) ద్వారా ఎలాంటి ప్రామాణికమైన సాక్ష్యాధారాలు లేవు. పైగా ఆరాధన భావంతో ఇలాంటి ప్రదేశాలకు ప్రయాణించడం లేక సందర్శించడం ఇస్లాం ధర్మంలో నిషేధించడం జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“మీరు మూడు మసీదులకు తప్ప మరేచోటుకు (ఆరాధన భావంతో) ప్రయాణం చేయకండి. ఒకటి కాబతుల్లాహ్‌ (మక్కా మసీదు), రెండు మస్జిదే నబవి (మదీనా మసీదు), మూడు మస్జిదే అఖ్సా (జెరూసలేం మసీదు) ” (బుఖారీ:1115, ముస్లిం: 2475)

హజ్రత్  అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ఉరుసులు, దర్గాల వాస్తవికత

“మీ ఇండ్లను స్మశానవాటిక చేయకండి, నా సమాధిని మీరు (ప్రజలు) ఉత్సవ కేంద్రంగా చేయకండి. అయితే నా కొరకు దరూద్‌ దుఆ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా మీప్రార్ధన నాకు చేరుతుంది.” (అబూదావూద్‌: 2042)

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హ) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణ సమయాన ఇలా ప్రవచించారు:

“అల్లాహ్‌ యూదుల్ని, క్రైస్తవుల్ని శపించాడు. వారు తమ ప్రవక్తల సమాధుల్ని సజ్‌దా (ఆరాధ్య) నిలయాలుగా చేసుకున్నారు.” (బుఖారీ)

పైన ఇవ్వబడిన హదీసులను గమనించినట్లయితే ప్రవక్తల సమాధులను ఆరాధ్య నిలయాలుగా చేసుకోకూడదని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాంటప్పుడు పుణ్యాత్ముల సమాధులను ఆరాధన పరంగా గౌరవించడం, ఆరాధన పరంగా సమాధుల వద్దకు ప్రయాణించడం, అక్కడ ఉరుసుల పేరుతో సంబరాలు జరపడం వంటి అధర్మ కార్యాలు ధర్మం ఎలా ఔతుంది? మరియు యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ఆగ్రహానికి మరియు మార్గభ్రష్ఠత్వానికి గురికాబడిన ముఖ్య కారణం సమాధులను ఆరాధ్య నిలయాలుగా చేసుకోవడమే అన్న విషయం కూడా స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ద్వారా తెలుస్తున్నది.

అలాగే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాధి వద్దకు సహితం సంబరాల (ఉరుసు) కొరకు సమావేశం కాకూడదని హెచ్చరించారు. చివరకు ఆయనపై దరూద్‌ పంపాలనుకున్నా సమాధి వద్దకు రావలసిన అక్కర లేదు. మీరెక్కడ నుండి ఐనా నా కొరకు దరూద్‌ చదవండి, అది నా వద్దకు చేర్చబడుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేశారు.

ఇస్లామీయ సోదరులారా! ప్రవక్తల సమాధులనే ఉత్సవ స్థలాలుగా, ఆరాధ్య నిలయాలుగా చేసుకోవడం తప్పయితే, ‘ఔలియాల’ సమాధుల్ని ఉత్సవ కేంద్రాలుగా, ఆరాధ్య నిలయాలుగా చేసుకొనే ప్రశ్న ఎలా జనిస్తుంది? యదార్ధం ఏమిటంటే, కొంత మంది ప్రజలు తమ స్వార్ధాల కొరకు ఇస్లామీయ హద్దుల్ని దాటి దర్గాల సందర్శన పేరుతో వాటిని ఆరాధ్య నిలయాలుగా, ఉత్సవ ప్రదేశాలుగా చేసుకున్నారు. అలాంటివారంతా ప్రవక్త ముహమ్మద్‌ ( సల్లల్లాహు అలైహి వసల్లం) హితవుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందువలన సమాధుల కట్టడాలు, అక్కడ నిర్వహించే ఆరాధ్య కార్యాలు, ఖవ్వాలీల కచ్చేరీలు పూర్తిగా ఇస్లామీయ ధర్మానికి విరుద్ధం. కనుక ‘ఉరుసు’లను నిర్వహించడం, ఉరుసుల కొరకు చందాలు ఇవ్వటం, వారికి సహాయం చేయటం వంటి కార్యాలన్నీ ఇస్లామీయ నిజ ధర్మానికి వ్యతిరేకంగా సహాయం చేయటంతో సమానమే.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 100-108). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

నీ దేవుడు ఇతడేనా? (من هو إلهك) [వీడియో]

బిస్మిల్లాహ్

[ 3 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

“ఆ అల్లాహ్ యే  మిమ్మల్ని సృష్టించాడు, తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని మరణింపచేస్తాడు, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి! ఈ పనులలో దేన్నయినా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్‌ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు.” (సూరా అర్-రూమ్ 30:40)

ఇతరములు:

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు [వీడియో]

బిస్మిల్లాహ్

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్మతుల్లాహి అలైహి) యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర, మరియు ప్రత్యేకంగా గ్యారవీ (రబీఉస్సానీ నెల 11 వ రోజు) గురించి నిజమైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకోగలరు

[35నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


పరలోక చింత (ఫిక్రే  ఆఖిరత్) మాసపత్రిక – ఏప్రిల్ 2008 – [Download PDF]
క్లుప్త వివరణ: షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు

అల్లాహ్  ఆదేశం :-

إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّهِ

“అల్లాహ్ (త’ఆలా) నిషేధించినవి ఏమైనా ఉంటే అవి ఇవి మాత్రమే మరణించిన జంతువు రక్తం, పంది మాంసం, అల్లాహ్ యేతరులకు సమర్పించబడినది.” (అల్‌బఖరహ్  – 173)

ప్రియ సోదరులారా! ఇది ఇస్లామీయ నాల్గవ నెల రబీఉస్సానీ. కొందరు ఈ నెలను (తప్పుగా) గ్యారవీ నెలగా గుర్తిస్తారు. ఈనెలలో అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ పేర మొక్కు బడులు, నైవేద్యాలు చెల్లిస్తారు. అతని పేరుపై పెంచబడిన పశువులను అతని పేరుతో జబహ్‌ చేస్తారు. ఎందుకంటే ఈ నెలలోనే 11వ తేదీనాడు అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ మరణించారు. వారి సాన్నిహిత్యం పొందటానికి, వారిని సంతోష పరచటానికి ఈ మూఢాచారాలను నెరవేరుస్తారు. దీని ప్రాముఖ్యతను ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే నమాజ్‌, రోజాలను ఆచరించనివాడు కూడా వీళ్ళ దృష్టిలో పాపాత్ముడేమీ కాదు. కానీ గ్యారవీ చేయని వాడిని మాత్రం మహా పాపాత్ముడుగా భావించి దూషిస్తారు.

గ్యారవీ అనే ఈ మూఢాచారాన్ని కల్ఫించిన వాడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్‌ బరేల్వీ. వీడు అజ్ఞానకాలం నాటి ఒక ధర్మాన్ని స్థాపించాడు. దీన్ని నిర్మూలించటానికే అనేక మంది ప్రవక్తలు పంపబడ్డారు. చివరిగా మన ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ప్రజలకు దైవ ధర్మసందేశాన్ని అందజేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహుఅలైహి వసల్లం) మరణించిన 1260 సంవత్సరాల తర్వాత బరేల్వియత్‌ స్థాపించబడింది. అయినా ప్రజలు దీన్ని ధర్మంగా భావించి స్వీకరించారు.

గ్యారవీ స్థాపకుడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్‌ బరేల్వి ఈ మూఢాచారాన్ని స్థాపించి అబ్దుల్ ఖాదిర్‌ జీలానీని దైవస్థానానికి చేర్చివేశాడు. బరేల్వీ గ్రంధాల ప్రకారం అహ్మద్ రజాఖాన్‌ తన రచన కితాబుబరకాతి ఇస్‌తిమ్‌ దాద్‌లో ఇలా రాశాడు. “కష్టాల్లో, ఆపదల్లో ఎవరైనా నన్ను సహాయం అర్దిస్తే, నేను అతని కష్టాలను దూరం చేస్తానని, ఇంకా పిలిచేవాని పిలుపు విని అతని విన్నపాన్ని స్వీకరిస్తానని, మరియు అల్లాహ్‌ సాన్నిహిత్యం పొందటానికి నన్ను మధ్యవర్తిగా భావించడం తప్పని సరి అని అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ అన్నారు”. మరోచోట ఇలా వ్రాశాడు.“నేను నా జీవితంలో అబ్దుల్ ఖాదిర్‌ జీలానీని వదలి ఇతరులను ఎన్నడూ మొరపెట్టుకోలేదు. సహాయం అర్ధించలేదు. ఒకసారి ఇతన్ని  వదలి మహ్ బూబ్ అలీని పిలిచే ప్రయత్నం చేసాను. కాని నా నోట యాగౌస్‌ పాక్‌ అనే రాసాగింది.” (మల్ఫూజాత్‌ అహమద్‌ రజా/ 307)

ఇటువంటి అనేక చిన్న చిన్న కల్పిత సంఘటనలు అబ్దుల్ ఖాదిర్‌ జీలాని పై మోపబడ్డాయి. వాస్తవం ఏమిటంటే వీరందరూ అల్లాహ్ దాసులే, వీరి బలహీనత, అసహాయతకు సంబంధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి: అబ్దుల్ ఖాదిర్‌ జిలానీ ఒకసారి ఇలా అన్నారు. “నాకు అన్నిటికంటే ప్రజలకు అన్నం పెట్టటమంటే చాలా ఇష్టం. కాని ఏంచేయను బలహీనుణ్ణి , ప్రతి రోజు ప్రజలకు అన్నం పెట్టేంత ధనం నాదగ్గర లేదు.” (ఫత్‌హుర్రబ్బానీ షేఖ్‌ అబ్జుల్‌ ఖాదిర్‌ జీలానీ)

ఈ సంఘటన వల్ల తెలిసిన విషయం ఏమిటంటే షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీకి తన జీవితంలో తానుకోరింది చేసే శక్తి ఉండేదికాదు. ఎందుకంటే అల్లాహ్ శక్తి ముందు మానవులందరూ అసహాయులే. అటువంటప్పుడు షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలాని మరణానంతరం ప్రజల కష్టాలను దుఃఖాలను, కోరికలను ఏలా తీర్చగలరు?

ఈ గ్యారవీ మూఢాచారాన్ని ప్రోత్సహించే నిమిత్తం అనేక నిరాధారమైన కాల్పనిక కధలు ప్రచారం చేయబడ్డాయి. అంతేగాక ఇవి పరలోక సాఫల్యానికి సాధనాలుగా భావించ బడ్డాయి.

ఈ మూఢాచారానికి సంబంధించిన వాస్తవాలు అవాస్తవాలు ఇవి :-

1. షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ మరణం రబీఉస్సాని 11వ తేదీన సంభవించింది.

2. షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ జయంతి జరుపుకోవటం ఆయన ప్రీతి పొందే ఒక విధానం. అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ మరణ తేదీ గురించి సంబలీ గారు కితాబుహాలాత్‌ షేఖ్లో ఇలా రచించారు.

3. అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ గారి మరణ తేదీలో, నెలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు సఫర్‌ మాసంగా మరికొందరు రబీఉస్సానీగా మరికొందరు 27వ తేదిగా, 8వ తేదిగా, 9వ తేదీగా, 11వతేదీగా మరికొందరు 13,14 గా పేర్కొన్నారు. భారతదేశంలో దీన్ని 11 రబీఉస్సానీ నాడు జరుపు కుంటారు.

4. బాగ్దాద్‌లో 17 రబీఉస్సానీ నాడు జరుపుకుంటారు. మరణ తేదిలో ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా భారత దేశంలో మాత్రం 11వ తేదీన గ్యారవీగా జరుపుకుంటారు.

అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ మరణతేది గురించి హాఫిజ్‌ అబ్దుల్ అజీజ్‌ నక్ష్బందీ ముహమ్మద్‌ ముర్తుజాయీ ఇలా పేర్కొన్నారు. “షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ తన జీవితంలోని అధిక భాగం బాగ్దాద్‌లో గడిపారు. 91 సంవత్సరాల వయస్సులో 561 హిజ్రీలో 8 రబీఉస్తానీ ఆదివారం నాడు మరణించారు. తన మద్‌రసాలో ఖననం చేయబడ్డారు. మరికొందరు ఆయన మరణం శుక్రవారం జరిగిందని పేర్కొన్నారు. (హద్యదస్తగీర్‌ / 7)

ఇప్పుడు అసలు విషయం అంటే ఆయన్ను సంతోషపరచటానికి ఆయన మరణదినాన్ని జరుపుకోవటం గురించి ఆయన బోధనలను పరిశీలిస్తే ఆయన ఏ ఒక్కరి వర్ధంతిని జరుపుకోమని బోధించడం గానీ, చెప్పడంగానీ, ఉత్సాహం చూపడం గానీ చేయలేదని తెలుస్తుంది. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూబకర్‌ (రది అల్లాహు అన్హు), ఉమర్‌ (రది అల్లాహు అన్హు), హుసైన్‌ (రది అల్లాహు అన్హు)ల మరణదినాన్ని కూడా జరుపుకునే వారు కారు.

అందువల్లే అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ ఇలా అన్నారు.

“అంటే ఒకవేళ హుసైన్‌ (రది అల్లాహు అన్హు) మరణదినాన్ని జరుపుకోవటం ధర్మ సమ్మతమే అయితే అంతకుముందు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అబూబకర్‌ (రది అల్లాహు అన్హు)ల మరణదినాన్ని కూడా జరుపుకోవడం ధర్మసమ్మతం అయి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల ఆచరణ కూడా కొనసాగుతూ ఉండేది” (గునియతుత్తాలిబీన్‌)

షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ యొక్క ఈ అభిప్రాయం వల్ల ఆయన ఎవరి వర్ధంతిని జరుపుకోవడాన్ని ఏకీభవించేవారు కారని, ఇతరులకు ఆదేశించేవారు కారని తేలిపోయింది. వాస్తవం ఏమిటంటే ఈ మూఢాచారాల్లో కొన్ని అల్లాహ్ కు సాటి కల్పించే పనులు, దాసులై ధర్మాన్ని మార్పులు చేర్పులకు గురిచేయడం, ఇవన్నీ అల్లాహ్ కు సాటి కల్పించడానికి, ధర్మంలో అధర్మకార్యాలకు చోటు కల్పించడంతో సమానం, ఈ వేడుక, ఇటివంటి కార్యాలు ఇతని బోధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.

అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ ఇలా ఉపదేశించారు.

“అంటే అల్లాహ్‌ గ్రంధాన్ని, ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించండి. ధర్మంలో వింత విషయాలను కల్పించకండి. అల్లాహ్‌ కు ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. అవిధేయతకు పాల్పడకండి”

తన సంతానానికి కూడా ఈవిధంగానే బోధించారు. దీని గురించి ఈ క్రింది వీలునామాలో పేర్కొనడం జరిగింది.

వీలునామా

షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ 470 హిజ్రీలో జన్మించారు. 18 సంవత్సరాల వరకు విద్యాభ్యాసంలో నిమగ్నమయి ఉన్నారు. విద్యాభ్యాసం తరువాత 488 హిజ్రీలో బాగ్దాద్‌ చెరుకున్నారు. 91 సంవత్సరాల వరకు ఇస్లాం మరియు ముస్లింల సేవచేసి 561 హిజ్రీలో మరణించారు. మరణానికి కొన్ని రోజుల ముందు తన కొడుకు అబ్దుల్ వహ్హాబ్‌కు హితబోధ చేసారు. ఇవి సువర్ణాక్షరాలతో వ్రాయదగినవి.

ఇలా బోధించారు:- “కుమారా! అల్లాహ్‌ పైతప్ప ఇతరులెవ్వరి పైననూ ఆశలు పెట్టుకోకూడదు. అవసరం ఎటువంటిదైనా అల్లాహ్ యే తీర్చగలడు.కుమారా! అల్లాహ్ నే నమ్ముకోవాలి. ప్రపంచ ప్రజలందరూ కలసి నీకు లాభం చేకూర్చదలచినచో అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా రవ్వంత లాభం కూడా చేకూర్చలేరు. అదేవిధంగా అల్లాహ్‌ నీకు లాభం చేకూర్చదలిస్తే ప్రపంచంలోని ఏశక్తీ నీకు నష్టం కలిగించ లేదు. కుమారా! ఏకత్వంపైనే స్థిరంగా ఉండాలి. ఇందులోనే నీ సాఫల్యం ఉంది.” (ఫత్‌హుర్రబ్బానీ: అబ్టుల్‌ఖాదిర్‌ జీలానీ)

పై వీలునామాలో పేర్కొన్న ఒకొక్క పదం ఏకత్వాన్నే సూచిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఏపరిస్టితుల్లోనూ మతి మరుపువల్ల కూడా తన సంతానానికి గ్యారవీ చేయమని ఆదేశించలేదు.

మనం అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ బోధనలను తెలుసుకొని వారు చూపిన మార్గాన్నే అనుసరించి ఉంటే ఎంత బాగుండేది. వారి బోధనలకు వ్యతిరేకంగా, వారి పేరనే మొక్కు బడులు నైవేద్యాలు చెల్లిస్తున్నాం. అయితే మొక్కుబడులు నైవేద్యాలు కూడా ఆరాధనే, ఇవన్నీ అల్లాహ్ కే సొంతం ఇతరులకు ఇవి ఎంతమాత్రం చెల్లవు.

إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ

ఇమ్రాన్ భార్యఅల్లాహ్ ను ఇలా ప్రార్దించినపుడు:  ప్రభూ! నాగర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను. అది నీసేవకే అంకితం. నా ఈ కానుకను స్వీకరించు. నీవు అన్నీ వినేవాడవు. అన్నీ తెలిసినవాడవూను. (ఆలిఇమ్రాన్ – 35)

ఆ వెంటనే ఇలా ఆదేశించడం జరిగింది :-

فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنبَتَهَا نَبَاتًا حَسَنًا

“చివరకు ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక ఉత్తమ బాలికగా తీర్చి దిద్దాడు.” ( ఆలిఇమ్రాన్‌ – 37).

ఖుర్‌ ఆన్‌లోని ఈ వాక్యం ద్వారా తెలిసిందేమిటంటే మొక్కుబడులు, నైవేద్యాలు, సమర్పణలు మొదలైనవన్నీ కేవలం అల్లాహ్ కే చెందుతాయి. స్వీకరించబడతాయి కూడా. నిర్ణయం పాఠకులకు వదలి పెడుతున్నాము. ఈ గ్యారవీ ఆచారం షేఖ్‌ అబ్టుల్‌ ఖాదిర్‌ జీలానీ బోధనలకు, ఉపదేశాలకు అభిప్రాయాలకు, సిద్దాంతాలకు అనుగుణంగా ఉందా? ఉంటే సరే కాని ఒక వేళ వీటికి విరుద్దంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని వదలి వేయడం తప్పనిసరి.

అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక! అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ ఏకత్వంపై ఏకదైవారాధనపై స్థిరంగా ఉంచుగాక! అల్లాహ్‌ మనందరికీ అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ షిర్క్‌కి, కల్పితాలకూ, బిద్‌అత్‌ లకూ దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్‌!

ఇతరములు: బిద్అత్ (నూతనచారము)

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి
https://teluguislam.net/whatsapp/

తౌహీద్ (ఏక దైవారాధన) అంటే ఏమిటి? దాని రకాలు ఏమిటి? [వీడియో]

బిస్మిల్లాహ్

[ 40 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇతరములు: