షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు [వీడియో]

బిస్మిల్లాహ్

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్మతుల్లాహి అలైహి) యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర, మరియు ప్రత్యేకంగా గ్యారవీ (రబీఉస్సానీ నెల 11 వ రోజు) గురించి నిజమైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకోగలరు

[35నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


పరలోక చింత (ఫిక్రే  ఆఖిరత్) మాసపత్రిక – ఏప్రిల్ 2008 – [Download PDF]
క్లుప్త వివరణ: షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు

అల్లాహ్  ఆదేశం :-

إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّهِ

“అల్లాహ్ (త’ఆలా) నిషేధించినవి ఏమైనా ఉంటే అవి ఇవి మాత్రమే మరణించిన జంతువు రక్తం, పంది మాంసం, అల్లాహ్ యేతరులకు సమర్పించబడినది.” (అల్‌బఖరహ్  – 173)

ప్రియ సోదరులారా! ఇది ఇస్లామీయ నాల్గవ నెల రబీఉస్సానీ. కొందరు ఈ నెలను (తప్పుగా) గ్యారవీ నెలగా గుర్తిస్తారు. ఈనెలలో అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ పేర మొక్కు బడులు, నైవేద్యాలు చెల్లిస్తారు. అతని పేరుపై పెంచబడిన పశువులను అతని పేరుతో జబహ్‌ చేస్తారు. ఎందుకంటే ఈ నెలలోనే 11వ తేదీనాడు అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ మరణించారు. వారి సాన్నిహిత్యం పొందటానికి, వారిని సంతోష పరచటానికి ఈ మూఢాచారాలను నెరవేరుస్తారు. దీని ప్రాముఖ్యతను ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే నమాజ్‌, రోజాలను ఆచరించనివాడు కూడా వీళ్ళ దృష్టిలో పాపాత్ముడేమీ కాదు. కానీ గ్యారవీ చేయని వాడిని మాత్రం మహా పాపాత్ముడుగా భావించి దూషిస్తారు.

గ్యారవీ అనే ఈ మూఢాచారాన్ని కల్ఫించిన వాడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్‌ బరేల్వీ. వీడు అజ్ఞానకాలం నాటి ఒక ధర్మాన్ని స్థాపించాడు. దీన్ని నిర్మూలించటానికే అనేక మంది ప్రవక్తలు పంపబడ్డారు. చివరిగా మన ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ప్రజలకు దైవ ధర్మసందేశాన్ని అందజేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహుఅలైహి వసల్లం) మరణించిన 1260 సంవత్సరాల తర్వాత బరేల్వియత్‌ స్థాపించబడింది. అయినా ప్రజలు దీన్ని ధర్మంగా భావించి స్వీకరించారు.

గ్యారవీ స్థాపకుడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్‌ బరేల్వి ఈ మూఢాచారాన్ని స్థాపించి అబ్దుల్ ఖాదిర్‌ జీలానీని దైవస్థానానికి చేర్చివేశాడు. బరేల్వీ గ్రంధాల ప్రకారం అహ్మద్ రజాఖాన్‌ తన రచన కితాబుబరకాతి ఇస్‌తిమ్‌ దాద్‌లో ఇలా రాశాడు. “కష్టాల్లో, ఆపదల్లో ఎవరైనా నన్ను సహాయం అర్దిస్తే, నేను అతని కష్టాలను దూరం చేస్తానని, ఇంకా పిలిచేవాని పిలుపు విని అతని విన్నపాన్ని స్వీకరిస్తానని, మరియు అల్లాహ్‌ సాన్నిహిత్యం పొందటానికి నన్ను మధ్యవర్తిగా భావించడం తప్పని సరి అని అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ అన్నారు”. మరోచోట ఇలా వ్రాశాడు.“నేను నా జీవితంలో అబ్దుల్ ఖాదిర్‌ జీలానీని వదలి ఇతరులను ఎన్నడూ మొరపెట్టుకోలేదు. సహాయం అర్ధించలేదు. ఒకసారి ఇతన్ని  వదలి మహ్ బూబ్ అలీని పిలిచే ప్రయత్నం చేసాను. కాని నా నోట యాగౌస్‌ పాక్‌ అనే రాసాగింది.” (మల్ఫూజాత్‌ అహమద్‌ రజా/ 307)

ఇటువంటి అనేక చిన్న చిన్న కల్పిత సంఘటనలు అబ్దుల్ ఖాదిర్‌ జీలాని పై మోపబడ్డాయి. వాస్తవం ఏమిటంటే వీరందరూ అల్లాహ్ దాసులే, వీరి బలహీనత, అసహాయతకు సంబంధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి: అబ్దుల్ ఖాదిర్‌ జిలానీ ఒకసారి ఇలా అన్నారు. “నాకు అన్నిటికంటే ప్రజలకు అన్నం పెట్టటమంటే చాలా ఇష్టం. కాని ఏంచేయను బలహీనుణ్ణి , ప్రతి రోజు ప్రజలకు అన్నం పెట్టేంత ధనం నాదగ్గర లేదు.” (ఫత్‌హుర్రబ్బానీ షేఖ్‌ అబ్జుల్‌ ఖాదిర్‌ జీలానీ)

ఈ సంఘటన వల్ల తెలిసిన విషయం ఏమిటంటే షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీకి తన జీవితంలో తానుకోరింది చేసే శక్తి ఉండేదికాదు. ఎందుకంటే అల్లాహ్ శక్తి ముందు మానవులందరూ అసహాయులే. అటువంటప్పుడు షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలాని మరణానంతరం ప్రజల కష్టాలను దుఃఖాలను, కోరికలను ఏలా తీర్చగలరు?

ఈ గ్యారవీ మూఢాచారాన్ని ప్రోత్సహించే నిమిత్తం అనేక నిరాధారమైన కాల్పనిక కధలు ప్రచారం చేయబడ్డాయి. అంతేగాక ఇవి పరలోక సాఫల్యానికి సాధనాలుగా భావించ బడ్డాయి.

ఈ మూఢాచారానికి సంబంధించిన వాస్తవాలు అవాస్తవాలు ఇవి :-

1. షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ మరణం రబీఉస్సాని 11వ తేదీన సంభవించింది.

2. షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ జయంతి జరుపుకోవటం ఆయన ప్రీతి పొందే ఒక విధానం. అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ మరణ తేదీ గురించి సంబలీ గారు కితాబుహాలాత్‌ షేఖ్లో ఇలా రచించారు.

3. అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ గారి మరణ తేదీలో, నెలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు సఫర్‌ మాసంగా మరికొందరు రబీఉస్సానీగా మరికొందరు 27వ తేదిగా, 8వ తేదిగా, 9వ తేదీగా, 11వతేదీగా మరికొందరు 13,14 గా పేర్కొన్నారు. భారతదేశంలో దీన్ని 11 రబీఉస్సానీ నాడు జరుపు కుంటారు.

4. బాగ్దాద్‌లో 17 రబీఉస్సానీ నాడు జరుపుకుంటారు. మరణ తేదిలో ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా భారత దేశంలో మాత్రం 11వ తేదీన గ్యారవీగా జరుపుకుంటారు.

అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ మరణతేది గురించి హాఫిజ్‌ అబ్దుల్ అజీజ్‌ నక్ష్బందీ ముహమ్మద్‌ ముర్తుజాయీ ఇలా పేర్కొన్నారు. “షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ తన జీవితంలోని అధిక భాగం బాగ్దాద్‌లో గడిపారు. 91 సంవత్సరాల వయస్సులో 561 హిజ్రీలో 8 రబీఉస్తానీ ఆదివారం నాడు మరణించారు. తన మద్‌రసాలో ఖననం చేయబడ్డారు. మరికొందరు ఆయన మరణం శుక్రవారం జరిగిందని పేర్కొన్నారు. (హద్యదస్తగీర్‌ / 7)

ఇప్పుడు అసలు విషయం అంటే ఆయన్ను సంతోషపరచటానికి ఆయన మరణదినాన్ని జరుపుకోవటం గురించి ఆయన బోధనలను పరిశీలిస్తే ఆయన ఏ ఒక్కరి వర్ధంతిని జరుపుకోమని బోధించడం గానీ, చెప్పడంగానీ, ఉత్సాహం చూపడం గానీ చేయలేదని తెలుస్తుంది. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూబకర్‌ (రది అల్లాహు అన్హు), ఉమర్‌ (రది అల్లాహు అన్హు), హుసైన్‌ (రది అల్లాహు అన్హు)ల మరణదినాన్ని కూడా జరుపుకునే వారు కారు.

అందువల్లే అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ ఇలా అన్నారు.

“అంటే ఒకవేళ హుసైన్‌ (రది అల్లాహు అన్హు) మరణదినాన్ని జరుపుకోవటం ధర్మ సమ్మతమే అయితే అంతకుముందు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అబూబకర్‌ (రది అల్లాహు అన్హు)ల మరణదినాన్ని కూడా జరుపుకోవడం ధర్మసమ్మతం అయి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల ఆచరణ కూడా కొనసాగుతూ ఉండేది” (గునియతుత్తాలిబీన్‌)

షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ యొక్క ఈ అభిప్రాయం వల్ల ఆయన ఎవరి వర్ధంతిని జరుపుకోవడాన్ని ఏకీభవించేవారు కారని, ఇతరులకు ఆదేశించేవారు కారని తేలిపోయింది. వాస్తవం ఏమిటంటే ఈ మూఢాచారాల్లో కొన్ని అల్లాహ్ కు సాటి కల్పించే పనులు, దాసులై ధర్మాన్ని మార్పులు చేర్పులకు గురిచేయడం, ఇవన్నీ అల్లాహ్ కు సాటి కల్పించడానికి, ధర్మంలో అధర్మకార్యాలకు చోటు కల్పించడంతో సమానం, ఈ వేడుక, ఇటివంటి కార్యాలు ఇతని బోధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.

అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ ఇలా ఉపదేశించారు.

“అంటే అల్లాహ్‌ గ్రంధాన్ని, ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించండి. ధర్మంలో వింత విషయాలను కల్పించకండి. అల్లాహ్‌ కు ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. అవిధేయతకు పాల్పడకండి”

తన సంతానానికి కూడా ఈవిధంగానే బోధించారు. దీని గురించి ఈ క్రింది వీలునామాలో పేర్కొనడం జరిగింది.

వీలునామా

షేఖ్‌ అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ 470 హిజ్రీలో జన్మించారు. 18 సంవత్సరాల వరకు విద్యాభ్యాసంలో నిమగ్నమయి ఉన్నారు. విద్యాభ్యాసం తరువాత 488 హిజ్రీలో బాగ్దాద్‌ చెరుకున్నారు. 91 సంవత్సరాల వరకు ఇస్లాం మరియు ముస్లింల సేవచేసి 561 హిజ్రీలో మరణించారు. మరణానికి కొన్ని రోజుల ముందు తన కొడుకు అబ్దుల్ వహ్హాబ్‌కు హితబోధ చేసారు. ఇవి సువర్ణాక్షరాలతో వ్రాయదగినవి.

ఇలా బోధించారు:- “కుమారా! అల్లాహ్‌ పైతప్ప ఇతరులెవ్వరి పైననూ ఆశలు పెట్టుకోకూడదు. అవసరం ఎటువంటిదైనా అల్లాహ్ యే తీర్చగలడు.కుమారా! అల్లాహ్ నే నమ్ముకోవాలి. ప్రపంచ ప్రజలందరూ కలసి నీకు లాభం చేకూర్చదలచినచో అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా రవ్వంత లాభం కూడా చేకూర్చలేరు. అదేవిధంగా అల్లాహ్‌ నీకు లాభం చేకూర్చదలిస్తే ప్రపంచంలోని ఏశక్తీ నీకు నష్టం కలిగించ లేదు. కుమారా! ఏకత్వంపైనే స్థిరంగా ఉండాలి. ఇందులోనే నీ సాఫల్యం ఉంది.” (ఫత్‌హుర్రబ్బానీ: అబ్టుల్‌ఖాదిర్‌ జీలానీ)

పై వీలునామాలో పేర్కొన్న ఒకొక్క పదం ఏకత్వాన్నే సూచిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఏపరిస్టితుల్లోనూ మతి మరుపువల్ల కూడా తన సంతానానికి గ్యారవీ చేయమని ఆదేశించలేదు.

మనం అబ్దుల్ ఖాదిర్‌ జీలానీ బోధనలను తెలుసుకొని వారు చూపిన మార్గాన్నే అనుసరించి ఉంటే ఎంత బాగుండేది. వారి బోధనలకు వ్యతిరేకంగా, వారి పేరనే మొక్కు బడులు నైవేద్యాలు చెల్లిస్తున్నాం. అయితే మొక్కుబడులు నైవేద్యాలు కూడా ఆరాధనే, ఇవన్నీ అల్లాహ్ కే సొంతం ఇతరులకు ఇవి ఎంతమాత్రం చెల్లవు.

إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ

ఇమ్రాన్ భార్యఅల్లాహ్ ను ఇలా ప్రార్దించినపుడు:  ప్రభూ! నాగర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను. అది నీసేవకే అంకితం. నా ఈ కానుకను స్వీకరించు. నీవు అన్నీ వినేవాడవు. అన్నీ తెలిసినవాడవూను. (ఆలిఇమ్రాన్ – 35)

ఆ వెంటనే ఇలా ఆదేశించడం జరిగింది :-

فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنبَتَهَا نَبَاتًا حَسَنًا

“చివరకు ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక ఉత్తమ బాలికగా తీర్చి దిద్దాడు.” ( ఆలిఇమ్రాన్‌ – 37).

ఖుర్‌ ఆన్‌లోని ఈ వాక్యం ద్వారా తెలిసిందేమిటంటే మొక్కుబడులు, నైవేద్యాలు, సమర్పణలు మొదలైనవన్నీ కేవలం అల్లాహ్ కే చెందుతాయి. స్వీకరించబడతాయి కూడా. నిర్ణయం పాఠకులకు వదలి పెడుతున్నాము. ఈ గ్యారవీ ఆచారం షేఖ్‌ అబ్టుల్‌ ఖాదిర్‌ జీలానీ బోధనలకు, ఉపదేశాలకు అభిప్రాయాలకు, సిద్దాంతాలకు అనుగుణంగా ఉందా? ఉంటే సరే కాని ఒక వేళ వీటికి విరుద్దంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని వదలి వేయడం తప్పనిసరి.

అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక! అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ ఏకత్వంపై ఏకదైవారాధనపై స్థిరంగా ఉంచుగాక! అల్లాహ్‌ మనందరికీ అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ షిర్క్‌కి, కల్పితాలకూ, బిద్‌అత్‌ లకూ దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్‌ (త’ఆలా) మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్‌!

ఇతరములు: బిద్అత్ (నూతనచారము)

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి
https://teluguislam.net/whatsapp/

%d bloggers like this: