[ఇక్కడ డౌన్లోడ్ PDF]
ఖుత్బాయందలి ముఖ్యాంశాలు :
- 1) ఒక రాత్రిని ఆరాధన కోసం ప్రత్యేకం చేసుకోవడం సరికాదు.
- 2) షాబాన్ నెల ఉపవాసాల మహత్యం.
- 3) షాబాన్ నెల 15వ రాత్రి మహత్యం.
- 4) షబే బరాత్ గురించిన తప్పుడు మరియు కాల్పనిక హదీసులు.
- 5) షబే బరాత్ లో ఏం చెయ్యాలి?
- 6) షాబాన్ 15వ రాత్రి నిర్ణయాలు తీసుకోబడే రాత్రినా?
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
అల్లాహ్ జిన్నాతులను, మానవులను తన ఆరాధన కోసం సృష్టించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించింది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే“. (జారియాత్ : 56)
కానీ, ఆరాధన కోసం జీవితంలోని ఒక ప్రత్యేక కాలాన్ని లేదా ప్రత్యేక సంవత్సరాన్ని, లేదా ప్రత్యేక మాసాన్ని లేదా ప్రత్యేక వారాన్ని లేదా ప్రత్యేక దినాన్ని లేదా ప్రత్యేక రాత్రిని నిర్ణయించుకొని మిగతా జీవితమంతా (అల్లాహ్) ఆరాధన పట్ల అశ్రద్ధ చూపడం సరికాదు.
మానవ పుట్టుక అసలు ఉద్దేశ్యమే అల్లాహ్ ను ఆరాధించడం కాబట్టి (ఆరాధనకు) యోగ్యమైన వయస్సు నుండి జీవితపు ఆఖరి క్షణాల వరకు గూడా అల్లాహ్ ను ఆరాధిస్తూ గడపాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُنْ مِنَ السَّجِدِينَ وَاعْبُدُ رَبَّكَ عَلى يَأْتِيَكَ الْمَدِيْنُ ع
“నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ అతన్ని స్తుతిస్తూ వుండు. సాష్టాంగ పడేవారిలో చేరిపో. నిశ్చయమైనది (అనగా మరణం) వచ్చే వరకు. నీ ప్రభువును ఆరాధిస్తూ వుండు”. (హిజ్ర్ : 98 – 99)
అందుకే, ఎవరైతే తన జీవిత అసలు లక్ష్యం (అల్లాహ్ ను) ఆరాధించటం అని భావిస్తాడో అతనే సఫలీకృతుడు. అలాకాక, ఎవరైతే తన జీవిత లక్ష్యాన్ని కేవలం తన కోసం, తన ఇంటి వారికోసం ఇహలోకపు తళుకుబెళుకులు సమకూర్చుకోవడంగా భావిస్తాడో అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫల్యం పొంద లేడు.
నేడు పరిస్థితి ఎలా వుందంటే – ఒకటేమో, ముస్లిం సమాజంలోని అధికులు అల్లాహ్ ఆరాధన పట్ల అశ్రద్ద చూపివున్నారు. దీనికితోడు, వారికి కొంత మంది – ఒక సం॥లో రెండు సార్లు రాత్రి జాగారం చేసి, మూడు నాలుగు రోజులు ఉపవాసముంటే, ఈ ఆరాధన వారి మోక్షానికి, ఇహపరలోకాల సాఫల్యానికి సరిపోతుంది అని మాయమాటలు చెప్పి వారినింకా భ్రష్టు పట్టించారు.
కాని, వాస్తవానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆరాధన కోసం ఒక రాత్రిని ప్రత్యేకించు కోవడాన్ని (గట్టిగా) వారించారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“రాత్రిళ్లు నిలబడడం (నమాజు చేయడం)లో కేవలం శుక్రవారం రాత్రిని మరియు ఉపవాసం వుండడానికి శుక్రవారాన్ని ప్రత్యేకించుకోకండి. ఒకవేళ ఎవరైనా ఉపవాసముంటూ, మధ్యలో శుక్రవారం వస్తే అది వేరే విషయం“. (ముస్లిం : 1144)
అందుకే, ఏదైనా రాత్రిని ఆరాధన కొరకు ప్రత్యేకించు కోవడం సరైనదైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శుక్రవారం రాత్రి ఆరాధన కోసం ప్రత్యేకించుకోవడానికి అనుమతి ఇచ్చి వుండేవారు. ఎందుకంటే మొత్తం వారంలోని రాత్రిళ్ళలో శుక్రవారం రాత్రి ఉత్తమమైనది. అయినప్పటికీ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని వారించారు. దీని ద్వారా తెలిసేదేమిటంటే సంవత్సరంలో కేవలం ఒకటి రెండు రాత్రులు ఆరాధనలో గడిపి మిగతా సంవత్సరమంతా దీని పట్ల అశ్రద్ద చూపడం ఎంతమాత్రం సరికాదు.
స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అలవాటు కూడా ఇదే. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంవత్సరంలోని ప్రతి రాత్రీ ఆరాధించేవారు. పైగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితపు ప్రతి క్షణం ఆరాధనలోనే గడిచేది. కనుక మనం కూడా మన జీవితాన్ని ప్రతి క్షణం అల్లాహ్ ఆరాధనలో గడిపేందుకు ప్రయత్నించాలి. ఇది ఎలా సాధ్యపడుతుందంటే మనం వేసే ప్రతి అడుగు అల్లాహ్ సంకల్పాని కనుగుణంగా వుండాలి. చేసే ప్రతి కార్యం ఆయన మెప్పు కోసం వుండాలి.
ఆయెషా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు నమాజులో ఎంత (సుదీర్ఘంగా) నిలబడేవారంటే ఆయన కాళ్ళలో పగుళ్ళు ఏర్పడేవి. నేను – ఓ దైవ ప్రవక్తా! మీరు ఇలా ఎందుకు చేస్తారు (ఎందుకింతగా కష్టపడతారు)? అల్లాహ్ మీ మునుపటి మరియు రాబోయో తప్పిదాలను మన్నించేశాడుగా అని అనేదాన్ని, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో – (అల్లాహ్ నాకు ప్రసాదించిన దానికిగాను) నేను కృతజ్ఞుడైన దాసుడు కాకూడదా! అని అనేవారు. (బుఖారీ : 4837, ముస్లిం : 2820)
ముగైరా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు (నమాజులో) ఎంత సుదీర్ఘంగా నిలబడేవారంటే ఆయన కాళ్ళు వాచిపోయేవి. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ఇలా అనబడింది: అల్లాహ్ మీ మునుపటి మరియు రాబోయే తప్పిదాలను మన్నించేశాడు. అయినప్పటికీ మీరు ఇంత సుదీర్ఘంగా ఎందుకు నిలబడతారు? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ “నేను కృతజ్ఞుడైన దాసుణ్ణి కాకూడదు మరి!” అని అన్నారు. నేను (బుఖారీ: 4836, ముస్లిం : 2819)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎల్లప్పటి అలవాటేమిటంటే – ఆయన రాత్రిళ్ళు సుదీర్ఘంగా ఖియాం చేసేవారు. దీనితో ఆయన కాళ్ళలో పగుళ్ళు ఏర్పడేవి లేదా వాపు వచ్చేది. అంతేగానీ సంవత్సరంలో కేవలం రెండు మూడు రోజులు ఇలా చేసేవారు కాదు. మరి జీవితం గడపడానికి ఉత్తమ పద్దతి కేవలం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతే.
జాబిర్ బిన్ అబ్దుల్లా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుక్రవారం ఖుత్బా యందు ఇలా సెలవిచ్చేవారు – స్తోత్రం తర్వాత, (బాగా గుర్తుంచుకోండి!) అన్నిటికన్నా ఉత్తమమైన వాక్కు అల్లాహ్ గ్రంథము, అన్నిటి కన్నా ఉత్తమ పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతి, అన్నింటి కన్నా చెడు కార్యం (ధర్మంలో) క్రొత్తగా ఆవిష్కరించబడేది మరియు ప్రతి బిద్ అత్ మార్గభ్రష్టతే. (ముస్లిం : 867)
దీని ద్వారా తెలిసిందేమిటంటే – అల్లాహ్ గ్రంథం మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ లే అసలు ధర్మం. ఇక వీటికి విరుద్ధంగా ధర్మంలో క్రొత్తగా సృష్టించబడే ప్రతి కార్యం అత్యంత చెడు కార్యమే, అది ప్రజల దృష్టిలో ఎంత గొప్పదైనా సరే. దీని ద్వారా తెలిసిన మరో విషయమేమిటంటే – అల్లాహ్ గ్రంథం మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ ద్వారా ఆధారం దొరకని కార్యం బిద్అత్ మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టతకు ఆనవాలు. ధర్మంలో ‘బిద్ధతే హసన‘ అన్న బిద్అత్ ఏదీ లేదు. బిద్అత్ లన్నీ మార్గభ్రష్టతే మరియు వీటిని ఆచరించే వారిని అవి మార్గభ్రష్టులుగా చేసేస్తాయి.
షాబాన్ నెల మరియు ఉపవాసాల మహత్యం
షాబాన్ నెలలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ తప్ప, ఇతర మాసాల కన్నా ఎక్కువగా ఉపవాసాలుండేవారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిస్తూ వుండేవారు:
“ఈ నెలలో సత్కార్యాలు పైకి లేపబడతాయి. మరి నా ఆచరణలు (నా) ఉపవాస స్థితిలో పైకి లేపబడటాన్ని నేను ఇష్టపడతాను.”
అయినప్పటికీ, ఈ నెలను నాలుగు నిషిద్ధ మాసాలలో చేర్చడం సరైనది కాదు. ఆ మాసాల్లో యుద్ధాలు, హత్యలు రక్తం చిందించడం నిషేధం కాబడ్డాయి, అందరు విశ్లేషకులు, హదీసు వేత్తలు మరియు విద్వాంసుల ఏకాభిప్రాయం ఏమిటంటే ఆ నాలుగు నిషిద్ధ మాసాలు – జిల్ ఖాదా, జిల్ హిజ్జ, ముహర్రమ్ మరియు రజబ్. ఏ విశ్లేషకుడు కూడా షాబాన్ నెలను నిషిద్ధ మాసాల్లో చేర్చలేదు.
ఈ యావత్ నెలలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రత్యేకంగా పాటించిన ఆరాధన ఉపవాసమే. అది కూడా పూర్తి నెల పాటించారు అంతేగాని ఏదో ఒక రోజు ప్రత్యేకంగా కాదు. ఏదో ఒక రోజు ఉపవాసపు శ్రేష్ఠత కూడా వివరించలేదు.
ఆయెషా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరంతరంగా (ఏమాత్రం విడిచిపెట్టకుండా) ఉపవాసాలు వుండేవారు. ఆయన ఉపవాసాన్ని ఇక వదలరేమో అని మేము అనుకునేవాళ్ళం. అలాగే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకవేళ ఉపవాసం వదిలేస్తే చాలా రోజుల దాకా మానేసేవారు. చివరికి మాకు – ఆయన ఉపవాసం వుండరేమో అని అనిపించేది. నేను ఆయన్ని రమజాన్ తప్ప మరే నెలలోనూ పూర్తిగా ఉపవాసముండడం చూడలేదు. నేను ఆయన్ని – షాబాన్ నెల కన్నా ఎక్కువగా మరే నెలలోనూ ఉపవాసాలుండడం చూడలేదు. (బుఖారీ, ముస్లిం)
ఆయేషా (రజియల్లాహు అన్హ) ఇలా కూడా సెలవిచ్చారు:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఉపవాసాల కోసం అన్నిటి కన్నా ప్రియమైన నెల షాబాన్ నెల, తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ ఉపవాసాలు వుండేవారు. (అబూ దావూద్: 2431, సహీహ్ -అల్బానీ)
అలాగే, ఆమె ఇలా కూడా సెలవిచ్చారు:
నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను షాబాన్ నెలలో కన్నా ఎక్కువగా ఏ నెలలోనూ ఉపవాసాలుండగా చూడలేదు. ఆయన దానిలో (షాబాన్ నెలలో) కొద్ది రోజులు తప్ప అన్ని రోజులు ఉపవాసముండేవారు, పైగా ఆయన దానిలో పూర్తిగానే ఉపవాసముండేవారు. (తిర్మిజీ: 736, సహీహ్- అల్బానీ)
అంతేగాక, ఉమ్మె సలమా (రజియల్లాహు అన్హ) కథనం:
నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను రెండు నెలలు నిరంతరంగా ఉపవాసముండడం చూడలేదు. కేవలం షాబాన్ మరియు రమజాన్ నెలల్లో తప్ప. (తిర్మిజీ: 736, సహీహ్- అల్బానీ)
షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసముండడంలో దాగి వున్న మర్మం
ఉసామా బిన్ జైద్ (రజియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను నేను మిమ్మల్ని షాబాన్ నెలలో ఉపవాసమున్నంతగా మరే నెలలోనూ చూడలేదు (కారణం ఏమిటి?) అని అడిగారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – “రజబ్ మరియు రమజాన్ నెలల మధ్య ప్రజలు ఉపవాసాల గురించి అశ్రద్ధ చూపే నెల ఇది. మరి చూడబోతే, ఈ నెలలోనే ఆచరణలు అల్లాహ్ వైపునకు లేపబడతాయి. మరి నా ఆచరణలు (నేను) ఉపవాసం వున్న స్థితిలో పైకి లేపబడటాన్ని నేను ఇష్ట పడతాను” అని అన్నారు.
ఈ హదీసులన్నింటి ద్వారా తెలిసిన విషయమేమిటంటే – ఈ నెలలో అధికంగా ఉపవాసాలు ఉండాలి.
షబే బరాత్ గురించి ఏది సత్యం? ఏది అసత్యం?
షాబాన్ నెలలో ఉపవాసాల మహత్యం గురించి తెలుసుకున్నాక ఉదయించే ఒక ప్రశ్న ఏమిటంటే ఈ నెల 15వ తారీఖు ప్రాముఖ్యత ఏమిటి మరి?
వాస్తవం ఏమిటంటే – సత్యాసత్యాల గురించి ఏమాత్రం పట్టించుకో కుండా ఏ 3,4 విశిష్ఠ రాత్రుల గురించి వివరించడం జరుగుతూ వుంటుందో, వాటిలో షాబాన్ నెల 15వ తారీఖు రాత్రి కూడా ఒకటి. సాధారణంగా దీనిని ‘షబే బరాత్’ అని అంటూ వుంటారు.
ఈ రాత్రి గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఈ ప్రవచనం ప్రామాణిక పరంపరతో ఉల్లేఖించబడింది:
“అల్లాహ్ – షాబాన్ నెల 15వ తేదీ రాత్రి తన సృష్టితాల వైపునకు (దయతో) చూస్తాడు. తదుపరి బహుదైవారాధకుడు (ముష్రిక్) మరియు అసూయా పరుడు తప్ప మిగతా సృష్టితాలను అందరినీ క్షమిస్తాడు.” (తిర్మిజి, ఇబ్నె హిబ్బాన్, బైహఖీ)
ఈ కాలపు హదీసువేత్త అయిన షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీసుకు సంబంధించిన వేర్వేరు పరంపరలు పేర్కొన్న తర్వాత ఇలా వివరించారు: “దీని సారాంశం ఏమిటంటే ఈ హదీసు దీని వేర్వేరు పరంపరలతో కలిసి నిస్సందేహంగా ప్రామాణికమైనది (సహీహ్).” (అస్సహీహ : 1144)
మరో ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి:
“నిశ్చయంగా అల్లాహ్, షాబాన్ నెల 15వ తేదీ రాత్రి దాసులపై కరుణతో (దయతో) చూస్తాడు. నిజమైన విశ్వాసులు (మోమిన్)ను క్షమిస్తాడు, అవిశ్వాసులకు గడువు ఇస్తాడు మరియు అసూయాపరులను వారి మనసులను అసూయ నుండి శుద్ధి చేసుకొనే వరకు వదిలేస్తాడు”. (సహీహుల్ జామె లిల్ అల్బానీ : 1898)
ప్రియతమ సోదరులారా!
షాబాన్ 15వ తేదీ రాత్రి మహత్యాన్ని వివరించే ఒకే ఒక్క ప్రామాణిక హదీసు ఇది. ఇది తప్ప సాధారణంగా ఈ రాత్రి మహత్యాన్ని గురించి ధార్మిక సమ్మేళనాల్లో, పత్రికల్లో వివరించబడే హదీసులన్నీ అత్యంత బలహీనమైనవేకాక, కాల్పనికమైనవి కూడా. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షరీయతు ఇలాంటి పనికిమాలిన మాటల నుండి ఎంతో పరిశుద్ధంగా వుంది.
షబే బరాత్ ను పురస్కరించుకొని సాధారణంగా పేర్కొనబడే బలహీన, కాల్పనిక హదీసులలో కొన్ని ఇవి:
(1) “షాబాన్ నా మాసం మరియు రమజాన్ అల్లాహ్ మాసం” (జయీఫుల్ జామె – అల్బానీ : 3402, మౌజూ) దీనిని అల్బానీ రహిమహుల్లాహ్ కాల్పనికమైనది (మౌజూ) గా ఖరారు చేశారు.
(2) పేర్కొనబడే మరో ఉల్లేఖనం ఏమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక రాత్రి ఆయెషా (రజియల్లాహు అన్హ) ఇంట్లో వున్నారు. అకస్మాత్తుగా ఆయన అక్కణ్ణుంచి బయలుదేరారు. ఆయెషా (రజియల్లాహు అన్హ) కూడా ఆయన వెనుకనే వెళ్ళిచూస్తే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) బఖీ (మదీనా స్మశాన వాటిక)లో వున్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెను చూసి – (ఓ ఆయెషా!) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీపై దౌర్జన్యం చేస్తారని శంకించావా? అని అడిగారు. ఆమె – ఓ దైవ ప్రవక్తా! బహుశా మీరు మీ సతీమణులలో, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళారన్న అనుమానం కలిగింది అని అన్నారు. దీనిపై ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – “నిశ్చయంగా అల్లాహ్, షాబాన్ 15వ రాత్రి ఇహలోకపు ఆకాశానికి విచ్చేస్తాడు – తదుపరి ‘బనూ కల్బ్’ తెగ మేకల వెంట్రుకలకు సరిసమానంగా మానవులను క్షమిస్తాడు“. (తిర్మిజీ: 739, ఇబ్నె మాజ : 1389, జయీఫ్- అల్బానీ)
ఇతర ఇమాములతోపాటు స్వయానా ఇమామ్ తిర్మిజి కూడా ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత దీని బలహీనత ను సూచించారు. పైగా ఆయన ఇమామ్ బుఖారీ ద్వారా ఆయన దీనిని బలహీనమైనదని అనేవారని ఉల్లేఖించారు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయమేమిటంటే – ఆయెషా (రజియల్లాహు అన్హ) వివరించిన వృత్తాంతము – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బఖీ వెళ్ళి అక్కడి వారి కోసం ప్రార్ధించడం- మాత్రం ప్రామాణికమైనది. సహీహ్ ముస్లిం వగైరా గ్రంథాల్లో దీని గురించి వివరంగా వుంది, కానీ, దానిలో షాబాన్ నెల 15వ తేదీ రాత్రి గురించి ఏ మాత్రం లేదు. ఆ ప్రామాణికమైన పూర్తి వృత్తాంతం ఇలా వుంది:-
ఆయెషా (రజియల్లాహు అన్హ) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రాత్రి నా ఇంట్లో వున్నారు. తను కప్పుకొని వున్న దుప్పటిని, బూట్లను ఆయన తీసి ఆయన తలకు దగ్గరగా పెట్టారు. ఆయన ధరించివున్న దుప్పటి లోని కొంత భాగాన్ని పరుపుపై వేసి నడుంవాల్చారు. ఇలా కొంత సమయం దాటాక నేను నిద్రపోయానని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) భావించి మెల్లగా తన దుప్పటిని తీసుకొని, బూట్లు ధరించి, తలుపు తెరిచి బయటికి వెళ్ళి తలుపును మెల్లగా మూసేశారు. తదుపరి నేను లేచాను. నా శిరస్త్రాణం తలపై ధరించి, ఓణీ కప్పుకొని, దుప్పటి మడుచుకొని నేను కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక వెళ్ళాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బఖీ లోకి వెళ్ళారు. అక్కడ చాలా సేపు నిలబడివున్నారు. ఈ తరుణంలో మూడు సార్లు తన చేతుల్ని (దుఆ కోసం) పైకెత్తారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెను తిరగగా, నేను కూడా తిరిగాను. ఆయన త్వరత్వరగా నడుస్తే, నేను కూడా త్వరత్వరగా నడుస్తూ, ఆయన మెల్లగా పరుగెత్తితే నేను కూడా మెల్లగా పరుగెత్తుతూ, ఆయన వేగంగా పరుగెత్తితే నేను కూడా వేగంగా పరుగెత్తుతూ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కన్నా ముందుగా ఇంటికి వచ్చేశాను. కాసేపటికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా విచ్చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఓ ఆయెషా! ఏమయ్యింది నీకు, నీ శ్వాస ఎందుకు పెరిగి వుంది? అని అడిగారు. నేను – (అబ్బే) అలాంటి దేమీ లేదు అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా నీవైనా చెప్పు, లేదా అన్నీ తెలిసినవాడు, అత్యంత సూక్ష్మగ్రాహి అయిన అల్లాహ్ నాకంతా చెప్పేస్తాడు అని అన్నారు. నేను – నా తల్లిదండ్రులు మీకు అర్పితం! అని తదుపరి ఆయనకంతా వివరించాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “నాకు ముందుగా ఒక ఛాయ కదలడం నేను చూశాను. ఆ ఛాయ నీదా?” అని అన్నారు. నేను – అవును అని అన్నాను. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అర చేత్తో ఛాతీ మీద కొట్టారు. దీనికి నాకు కాస్త నొప్పి కలిగింది తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీపై దౌర్జన్యం చేస్తారని నీ అభిప్రాయమా? అని అన్నారు. నేను (నా మనస్సులో) అనుకున్నాను – జనాలు ఎంతగా దాచిపెట్టినా అల్లాహ్ మాత్రం అన్నీ తెలిసినవాడు, వాస్తవానికి అల్లాహ్ సమస్తం ఎరిగినవాడు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: నువ్వు నన్ను చూసిన సమయంలో జిబ్రయీల్ (అలైహిస్సలాం) నా దగ్గరి కొచ్చారు, ఆయన నీకు కనపడకుండా మెల్లగా నన్ను పిలిచారు. నేను కూడా నీకు కనపడకుండా మెల్లగా జవాబిచ్చాను. నువ్వు లోదుస్తులు తీసి వుండడంతో ఆయన లోపలికి రాలేక పోయారు. నేనేమో నీవు నిద్రపోయావని భావించాను. అందుకే నిన్ను లేపడం మంచిది కాదని భావించాను. అదిగాక నేను లేకపోవడం మూలంగా నువ్వు భయపడతావేమో అని అనుకున్నాను. (ఈ లోగా) జిబ్రయీల్ (అలైహిస్సలాం) నాతో – ‘మీరు బఖీ దగ్గరికి వచ్చి బఖీ వాసుల మన్నింపు కోసం ప్రార్దించమని మీ ప్రభువు ఆజ్ఞాపించాడు’ అని అన్నారు. నేను (ఆయెషా రజియల్లాహు అన్హ) – నేను వారి కోసం ఏమని ప్రార్థించనూ అని అడిగాను, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ నువ్వు ఈ విధంగా పలుకు అని అన్నారు : “అస్సలాము అలా అహ్లిద్దియారి మినల్ మోమినీన వల్ ముస్లిమీన్, వ యర్ హముల్లాహుల్ ముస్తఖ్ దిమీన మిన్నా వల్ ముస్త ఆఖిరీన్, వ ఇన్నా ఇన్షా అల్లాహు బికుమ్ లలాహికూన్”.(ముస్లిం : 974)
కనుక రుజువైనదేమిటంటే – బఖీ వృత్తాంతానికీ, షాబాన్ నెల 15వ తేదీ రాత్రికి ఏ విధమైన సంబంధం లేదు. దీని గురించి ఒక్క సహీహ్ హదీసులో కూడా వివరించబడలేదు. అందుకే బలహీన (జయీఫ్) హదీసులను ఆధారంగా చేసుకొని ఈ రాత్రిగానీ, దాని తర్వాత రోజు గానీ స్మశానానికి వెళ్ళడం సున్నత్ అని విశ్వాసముంచడం సరైనది కాదు.
(3) షాబాన్ నెల 15వ తేదీ రాత్రి మీరు (ఆరాధనలో) నిలబడండి (జాగారణ చేయండి) మరియు మరుసటి రోజు ఉపవాసం ఉండండి. ఎందుకంటే – ఆ రోజు షాబాన్ 15వ తేదీ) సాయంత్రం కాగానే అల్లాహ్ ఇహలోక ఆకాశంపైకి వచ్చి ఇలా ప్రకటిస్తాడు- ఎవరైనా మన్నింపు కోరుకొనే వారున్నారా? వారిని నేను మన్నిస్తాను. ఎవరైనా ఉపాధి కోరుకొనే వారున్నారా? నేను వారికి ఉపాధి ప్రసాదిస్తాను. ఎవరైనా వ్యాధిగ్రస్తులై వున్నారా? వారికి నేను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను. ఎవరైనా (ఏదైనా) అడిగే వారున్నారా? వారికది నేను ప్రసాదిస్తాను. ఎవరైనా ఎవరైనా ఇలా ఫజర్ సమయం వరకూ (ప్రకటిస్తూనే వుంటాడు) (జయీఫ్ అల్ జామె – అల్బానీ : 602, మౌజూ)
ఈ హదీసు కూడా కాల్పనిక, తప్పుడు హదీసు, దీనికి విరుద్ధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ప్రామాణికంగా ఉల్లేఖించబడిన ఈ హదీసును వివరిస్తూ వుండాలి.
“ఎంతో శుభవంతుడైన మన ప్రభువు ప్రతి రాత్రి మూడింట ఒక వంతు మిగిలి వున్నప్పుడు ఇహలోకపు ఆకాశంపైకి అవతరిస్తాడు. తదుపరి ఇలా ప్రకటిస్తాడు – నన్ను ప్రార్థించేవారు ఎవరున్నారు? నేను వారి ప్రార్థనలను స్వీకరిస్తాను. నన్ను ఏదైనా (కావాలని) అడిగేవారు ఎవరున్నారు? నేను వారికది ప్రసాదిస్తాను. నా మన్నింపు కోరుకొనేవారు ఎవరున్నారు? నేను వారిని మన్నిస్తాను”.
ముస్లిం లోని మరొక ఉల్లేఖనంలో అదనంగా ఇలా వుంది – “ఇలా (ఈ ప్రకటన) ఫజర్ వేళ వరకు కొనసాగుతూనే వుంటుంది.” (బుఖారీ: 1145, 6321, 7494 ముస్లిం: 758)
ఈ హదీసు ద్వారా – ప్రతి రాత్రికీ ఈ మహత్యం ఉందని తెలుస్తుంది. మరలాంటప్పుడు దీనిని కేవలం షాబాన్ నెల 15వ రాత్రికి ప్రత్యేకించడం తప్పు మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అభాండం మోపడమే అవుతుంది.
(4) అలీ (రజియల్లాహు అన్హు) హదీసు: దీనిలో ఆయన వివరించిన దేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెల 15వ రాత్రి 14 రకాతులు చదివారు. తదుపరి ఆయన కొన్ని సూరాలను పఠించారు. ఆ తర్వాత ఇలా సెలవిచ్చారు – నేను చేసినట్లే ఎవరైనా చేస్తే (ఇలాగే ఆచరిస్తే) స్వీకరించబడిన 20 హజ్జ్ లు మరియు 20 సం॥ల ఉపవాసాలకు లభించే అంత పుణ్యం లభిస్తుంది.
ఇబ్నుల్ జౌజి ఈ హదీసును అల్ మౌజుఅత్’లో సంగ్రహించి దీనిపై ఇలా వ్యాఖ్యానించారు: ఈ హదీసు కూడా కాల్పనికమైనది. దీని పరంపర కూడా అత్యంత చెడ్డగా వుంది. (అల్ మౌజుఆత్: 2వ సంపుటం, 445వ పేజి)
ఇమామ్ సుయూతీ ఇలా వివరించారు: ఈ హదీసును బైహఖీ ‘షోబుల్ ఈమాన్’ లో ఉల్లేఖించారు. దాదాపుగా ఇది కాల్పనికమైన తప్పుడు హదీసు. (తన్జిఉష్షరియ లి ఇబ్నె ఇరాక్: 2వ సంపుటం, 94వ పేజీ)
(5) సలాతుల్ అల్ ఫియా – దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలీ (రజియల్లాహు అన్హు)కు ఇలా వివరించారు:
ఏ వ్యక్తి అయినా ఈ రాత్రి 100 రకాతుల నమాజులు చదివి ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత ఇఖ్ లాస్ సూరా 10 సార్లు చదివితే – అల్లాహ్ అతని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. ఒకవేళ ‘లౌహే మహ్పూజ్’ లో అతను దురదృష్టవంతుడని వ్రాయబడివున్నప్పటికీ, అల్లాహ్ దానిని చెరిపేసి అదృష్టవంతుడని వ్రాస్తాడు. మరియు రాబోయే 1 సం॥ పాటు అతని పాపాలను లిఖించడం జరగదు.
“అల్ మౌజుఆత్”లో ఇబ్నుల్ జౌజి ఈ హదీసును గూర్చి ఎన్నో పరంపరలను పేర్కొన్న తర్వాత ఇలా వివరించారు :
ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కలిగిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజు చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా (ఏదైనా) ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గూర్చే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)
ఇమామ్ నవవీ ఇలా సెలవిచ్చారు:
‘సలాతుర్రగాయిబ్’ గా పేరుగాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషాల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజ్ మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్ లు. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వీటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక. (అల్ మజ్మూఅ లిన్నవవీ: 3వ సంపుటం, 379వ పేజీ)
ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు:
ఇదొక కాల్పనిక తప్పుడు హదీసు. దీనిలో వచ్చిన పుణ్యానికి సంబంధించిన పదజాలం ద్వారా (ఇదొక కాల్పనిక హదీసని) స్పష్టంగా తెలుస్తుంది. (అంతేగాక) బుద్ధి జ్ఞానాలున్న ఏ ఒక్కరు కూడా దీని కాల్పనికతను గూర్చి సందేహించరు. పైగా దీని ఉల్లేఖకులు గూడా అపరిచితులు. (ఫవాయెద్ అల్ మజ్మూఅ: 53వ పేజీ)
ఆయన ఇంకా ఇలా వివరించారు:
ధార్మిక పరిజ్ఞానులు, విశ్లేషకుల ఒక సమూహం – ఉదా. ‘ఇహ్యా’ గ్రంథకర్త – ఈ హదీసు విషయంలో పొరపాటుకు లోనయ్యింది. వాస్తవానికి – షాబాన్ నెల 15వ రాత్రి గురించి వివిధ పరంపరలతో ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులే. (అల్ ఫవాయిదుల్ మజ్మూఅ : 53వ పేజీ)
ముల్లా అలీ ఖారీ ఈ హదీసు గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా పేర్కొన్నారు: ఈ నమాజు గురించి బలహీన, కాల్పనిక హదీసులు తప్ప మరేమీ ఉల్లేఖించబడలేదు. అందుకే ‘ఖువ్వతుల్ ఖులూబ్’, ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ గ్రంథకర్తలు దీనిని సంగ్రహించడం గురించి మీరు మోసానికి గురి కావద్దు.
ఇంకా ఆయన ఇలా కూడా వివరించారు :
“ఈ బిద్దత్ నమాజ్ మొట్టమొదటగా 448 హి.శ.లో బైతుల్ మఖ్దిస్ నందు సృష్టించబడింది. అగ్ని పూజారులు కొందరు ఇస్లాం స్వీకరించారప్పుడు, వాళ్ళు ముస్లిములతో కలసి నమాజు చేసేటప్పుడు తమ ముందు అగ్నిని మండించేవారు. ఇలా వాళ్ళు ముస్లిములను కూడా సంతృప్తి పరచేవారు మరియు తమ భ్రష్ట విశ్వాసాలపై కూడా ఆచరించేవారు. వీళ్ళు సలాతుల్ అల్ ఫియా నమాజును కూడా ఆవిష్కరించారు. షాబాన్ నెల 15వ రాత్రి వాళ్ళు నమాజు చదువుతూ తమ ముందు అగ్ని మండించేవారు. దీని ద్వారా వారి ఉద్దేశ్యం – అగ్ని ముందు ఎక్కువ సేపు గౌరవంగా నిలవడడం. ఇంకా ఈ అగ్నిని ఆసరాగా చేసుకొని దీని ముసుగులో ఎన్నో చెడు పనులు చేసేవారు. దీనితో ఆ సమయంలోని సజ్జనులు – వీళ్ళు భూమిలోకి దిగద్రొక్కబడతారేమో అని భయపడ్డారు. అందుకే వారు – ఈ బిద్ అత్ ఆచరించబడుతున్న ప్రదేశం వదిలి దూరంగా వెళ్ళిపోయారు. అంతేగాక, దీని ముసుగులో వారు ఎన్నో నిషేధ కార్యాలను కూడా చేసేవారు“. (తొహ్ ఫతుల్ అహ్వజి- 3వ సంపుటం, 165వ పేజీ)
ఎంతో బాధాకరమైన విషయమేమిటంటే అగ్నిపూజారుల ద్వారా హిజ్ర 5వ శతాబ్దంలో ఆవిష్కరించబడి, దాని మహత్యం గురించి కాల్పనిక హదీసులు సృష్టించబడ్డ నమాజును ఈ రోజు ముస్లిములు షాబాన్ నెల 15వ రాత్రి ప్రత్యేకంగా నెలకొల్పుతారు మరియు ఎంతో జోరుగా ఈ తప్పుడు హదీసులను వివరిస్తారు.
ఈ హదీసు మరియు దీని లాంటి మరెన్నో హదీసులు నిస్సందేహంగా అతి బలహీన మరియు కాల్పనిక హదీసులు. ఇమాములలో ఉదా॥కు షౌకానీ, ఇబ్నుల్ జౌజి, ఇబ్నె హిబ్బాన్, ఖుర్తుబీ, సుయూతి మొ॥ వారు ఈ ఉల్లేఖనా లన్నింటినీ నమ్మదగ్గవి కావని ఖరారు చేశారు. మరిన్ని వివరాల కోసం- అల్ ఫవాయద్ అల్ మజ్మూఅ, అల్ మౌజుఅత్ అల్ కుబ్ర, తఫ్సీర్ అల్ ఖుర్తుబీ, అల్ అల్లాలి అల్ మస్నుఅ లను చూడవచ్చు.
కనుక, (ధర్మ) ప్రచార క్షేత్రంలో వున్నవారు- పరంపరల రీత్యా ప్రామాణి కంగా లేని ఈ (కాల్పనిక) ఉల్లేఖనాలను (ఇతరులకు) వివరించడం నుండి మరియు ముద్రించి పంచి పెట్టడం నుండి దూరంగా వుండాలి. ఏదైనా హదీసును (ఇతరులకు) వివరించడానికి ముందు, దాని పరంపరను గూర్చి అన్వేషించడం ఖచ్చితంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుకు సేవ చేయడమే అవుతుంది. అలా కాని పక్షంలో, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హెచ్చరిక ఎల్లప్పుడూ గుర్తుపెట్టు కోవాలి:
“ఎవరైనా, నేను చెప్పని మాటను నాకు ఆపాదిస్తే, అతను తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి”. (బుఖారీ: 109)
షబే బరాత్ లో ఏం చేయాలి?
ఇప్పుడు ఉదయించే ప్రశ్న ఏమిటంటే- షాబాన్ 15వ తేదీ రాత్రి మహ త్యాన్ని గురించి ఉల్లేఖించబడ్డ ప్రామాణిక హదీసు – “అల్లాహ్ షాబాన్ 15వ రాత్రి తన సృష్టితాల వైపు (దయతో) చూస్తాడు. తదుపరి బహుదైవారాధకుడు, ఆసూయపరులను తప్ప మిగతా అందరినీ క్షమిస్తాడు” లో సమావేశాలు ఏర్పాటు చేయడం గురించి వుందా? లేక ఏదైనా ప్రత్యేక ఆరాధన గురించి వుందా? లేదా ఈ హదీసులో దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చమని వచ్చిందా?
ఈ ప్రశ్నలకు జవాబు – పనికిమాలిన, కాల్పనిక ఉల్లేఖనాలను విడిచి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి స్వచ్ఛమైన షరీయతుపై విశ్వాసం వుంచే ప్రతి ఒక్కడూ ఇవ్వగలడు. ఈ హదీసును న్యాయంగా గనక పరిశీలిస్తే విశదమయ్యే విషయమేమిటంటే- ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిలో ఎలాంటి సమావేశం గురించి గానీ, ప్రత్యేక ఆరాధన గురించి గానీ, దీపాలంకరణ చేసి బాణసంచా కాల్చడం గురించి గానీ ప్రస్తావించలేదు. పైగా ప్రస్తావించింది కేవలం ఏమిటంటే – అల్లాహ్ యొక్క సువిశాల మన్నింపు గురించి. తమ విశ్వాసంలో షిర్క్ ను చేర్చనివారు, స్వీయ శతృత్వ కారణంతో తోటి ముస్లిం పట్ల ఈర్ష్య, అసూయ కలిగి వుండని వాళ్లు దీనికి అర్హులు.
అందుకే, ఈ రాత్రిలోని సువిశాల మన్నింపు యొక్క అర్హత పొందాలంటే- మనిషి ముందుగా తన విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. లాభ నష్టాల యజమాని కేవలం అల్లాహ్ అని గట్టిగా విశ్వసించాలి. కష్టాలను తీర్చేవాడు కూడా కేవలం ఆయనే అని విశ్వసించి కేవలం ఆయనపైనే నమ్మకం వుంచాలి. తమ ఆశలు నెరవేర్చే కేంద్రంగా దర్బారులను, మజార్లను కాక కేవలం అల్లాహ్ ను చేసుకోవాలి. పీర్లకు, సన్యాసులకు భయపడకుండా కేవలం అల్లాహ్ కు భయ పడాలి. మ్రొక్కుబడులు కూడా కేవలం అల్లాహ్ తోనే చేసుకోవాలి. ఆయనను తప్ప మరెవరినీ వేడుకోకూడదు. దీనితోపాటు, తోటి ముస్లిముల పట్ల ఈర్ష్య, అసూయలను వదిలి హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మనిషి సాఫల్యానికి ఇవి ఎంతో అవసరమైన విషయాలు. ఇక దీపాలంకరణ చేసి బాణసంచా కాల్చడమైతే వృధా ఖర్చే. కనుక మన ధర్మం వారించిన ఈ విషయం నుండి గూడా దూరంగా వుండడం తప్పనిసరి.
ఎంతో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే – షాబాన్ 15వ తేదీ రాత్రి మహత్యం గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా వివరించినదేమిటంటే ముష్రిక్ మరియు అసూయపరులను అల్లాహ్ క్షమించడు. వారు తప్ప మిగతా అందరిని ఆయన క్షమిస్తాడు. మరి ఈ రోజును ఎంతో మంది ప్రత్యేకంగా జరుపుకొంటారు. షబే బరాత్ ను పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించ బడతాయి, వాటిలో ఈ రాత్రి మహత్యం గురించి కాల్పనిక, తప్పుడు హదీసులు వివరించడంతోపాటు, ‘నాత్’ పఠించేవారు మరియు వక్తలు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను వేడుకుంటారు. సహాయం కోసం ఆయనను అర్థిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే – బాహాటంగా షిర్క్ చేస్తూ ‘అల్లాహ్ క్షమాపణ’పై ఆశపెట్టుకుంటారు!
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుకు ఆచరణ రీత్యా పరిహాసమాడబడుతుంది. మరి చూస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చాలా స్పష్టంగా – ముష్రిక్ ను క్షమించడం జరుగదు అని సెలవిచ్చివున్నారు. అయినప్పటికీ (షిర్క్ చేస్తూ) ఈ రాత్రి – నరకాగ్ని నుండి స్వేచ్ఛ పొందడానికి అనుమతి లభించిందని అనుకుంటారు.
ఎంత విచిత్ర పరిస్థితి ఇది! షిర్క్ నుండి పూర్తిగా పశ్చాత్తాప పడాల్సింది పోయి దీనిని క్రియాత్మకంగా ఆచరణలో పెట్టి దీని వైపునకు ప్రజలను ఆహ్వానించడం జరుగుతుంది!
షబే బరాత్ ‘మన్నింపు రాత్రి’ అయితే మరి దానిలో ఎందుకు ఆరాధించ కూడదు?
ఎవరైనా ఇలా ప్రశ్నించవచ్చు- ఈ రాత్రి మన్నింపుల రాత్రి అని స్వయంగా రుజువు చేశారు. మరి ఈ రాత్రి ప్రత్యేకంగా ఆరాధిస్తే వచ్చిన నష్టమేంటి?
దీనికి మా జవాబు ఏమిటంటే- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అల్లాహ్ మనకోసం ఆదర్శవంతునిగా ఖరారు చేశాడు. దీని అర్థం ఏమిటంటే- మనం ప్రతి రంగంలోనూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడుగుజాడల్లో నడుస్తూ ఆయనను అనుసరించాలి. అందుకే ఏ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ ఆరాధన చేశారు అన్న విషయం చూడాలి. ఇలా, మనం హదీసు గ్రంథాలు మరియు ఆయన జీవిత చరిత్రను వివరించే గ్రంథాలను తిరగేస్తే మనకు తెలిసే విషయం ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రాత్రి ప్రత్యేకంగా ఏమీ ఆరాధించలేదు, ప్రత్యేకంగా దీనిని జరుపుకోలేదు, సహాబాలను గూడా దీని గూర్చి ప్రోత్సహించలేదు.
అందుకే, మన ప్రియతమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని చేయలేదు కాబట్టి మనం కూడా చేయకూడదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని (ఈ రాత్రిని) ఉత్సవంగా జరుపుకోలేదు కాబట్టి మనం కూడా జరుపుకోకూడదు.
హాఫిజ్ ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: షాబాన్ 15వ రాత్రి ఖియాం మహత్యం గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు సహాబాల ద్వారా ఏదియూ (ప్రామాణికంగా) నిర్ధారించబడలేదు. (లతాయిఫుల్ మారిఫ్)
ఇమామ్ అబూ బక్ర్ తర్ తూషి, జైద్ బిన్ అస్లం (తాబయీ) ద్వారా ఇలా ఉల్లేఖించారు: మేము మా గురువులనూ, ధార్మిక పరిజ్ఞానులనూ షాబాన్ 15వ రాత్రి వైపునకు గానీ, మక్ హూల్ వివరించిన హదీసు వైపునకు గానీ మ్రొగ్గు చూపడం చూడలేదు. అంతేగాక వారు ఈ రాత్రి ఔన్నత్యం వేరే రాత్రుల కన్నా ఎక్కువైనదని కూడా విశ్వసించేవారు కాదు.
ఇబ్నె అబీ మలైకాకు ఓసారి జియాద్ అనే కథలు చెప్పేవాడొకడు ప్రజలతో ఈ రాత్రి ప్రతిఫలం లైలతుల్ ఖద్ర్ ప్రతిఫలానికి సమానం అని చెబుతూ వుంటాడు – అని చెప్పబడింది. దీనికి ఆయన- నేను గనక వాడి ద్వారా ఈ మాట వింటే, నా చేతిలో కర్ర గనక వుంటే వాణ్ణి తప్పకుండా శిక్షిస్తాను అని అన్నారు. (అల్ హవాదిస్ వల్ దిద్ అ)
చర్చ సారాంశమేమిటంటే – షాబాన్ నెల 15వ రాత్రి ఆరాధన మహత్యం గురించి ఏదియూ (ప్రామాణికంగా) నిర్ధారించబడలేదు. దీని గురించి వివరించ బడే విషయాలన్నీ అసత్యాలు మరియు కల్పితమైనవి.
ఆలోచించదగ్గ మరో విషయమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షాబాన్ 15వ రాత్రి మహత్యం గురించి – “అల్లాహ్ తన దాసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముష్రిక్ మరియు అసూయపరులను తప్ప అందరినీ క్షమిస్తాడు”- అని ఏదైతే సెలవీయబడిందో, అదే మహత్యం సోమవారం మరియు గురు వారాలకు గూడా ఇవ్వబడింది. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రతి సోమ మరియు గురువారాల్లో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి. తదుపరి షిర్క్ చేయని, తన సోదరుని పట్ల ఈర్ష్య, అసూయ కలిగి వుండని ప్రతి వ్యక్తిని క్షమించడం జరుగుతుంది. తమ మధ్య ఈర్ష్య, అసూయ కలిగివున్న ఇద్దరు వ్యక్తులు సంధి చేసుకొనే వరకు వారికి వ్యవధి నివ్వడం జరుగుతుంది“. (ముస్లిం : 2565)
కనుక షాబాన్ నెల 15వ తేదీ రాత్రి మన్నింపు హదీసును – ప్రత్యేకంగా ఈ రాత్రిని (ఉత్సవంగా) జరుపుకోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేయడానికి, ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ఆధారంగా చేయలేం. ఒకవేళ ఈ కార్యాలన్నింటికీ దానిని (ఆ హదీసును) ఆధారంగా తీసుకుంటే మరి అలాంటి మహత్యమే సోమ, గురువారాలకు కూడా ఇవ్వబడింది. కనుక, షబే బరాత్ ను జరుపుకొనే వారు సోమ, గురువారాలను కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారా మరి? ఆ రోజుల్లో కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారా?
అల్లాహ్ మనందరినీ క్షమించుగాక! మనందరినీ సత్యాన్ని అర్థం చేసుకొని దానికనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు అసత్యం నుండి దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!!
రెండవ ఖుత్బా
షాబాన్ 15వ తేదీ రాత్రి నిర్ణయాలు తీసుకొనబడే రాత్రినా?
షబే బరాత్ జరుపుకొనే వారు ఈ రాత్రిని నిర్ణయాలు గైకొనబడే రాత్రిగా భావిస్తారు. దానికి ఆధారంగా ఈ ఆయతను తీసుకుంటారు:
إلا الزلتُهُ في لَيْلَةٍ مُبَرَكَةِ إِلا لَنَا مُنْذِرِينَ فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيون
“నిశ్చయంగా మేము దీనిని (ఖురాన్ను) శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము. ఆ రాత్రి యందే కీలకమైన ప్రతి ఉత్తర్వూ జారీ చేయబడుతుంది”. (దుఖాన్ : 3-4)
అల్లాహ్ యొక్క ఈ ఆదేశంలో ‘శుభప్రదమైన రాత్రి’ గురించి వివరించ బడింది. దీనిలో దివ్య ఖురాన్ అవతరింపజేయబడడంతో పాటు సం॥ అంతా జరగబోయే సంఘటనల గురించి నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇక చూడాల్సిన విషయం ఏమిటంటే – ఆ శుభప్రదమైన రాత్రి అంటే ఏ రాత్రి? అని.
ఒకవేళ మనం, మన సంకల్పానికనుగుణంగా ఖురాన్ ను విశ్లేషించడం వదిలిపెట్టి, స్వయంగా ఖురాన్లోనే దాని విశ్లేషణను అన్వేషిస్తే ఈ ప్రశ్నకు సమాధానం మనకు దొరుకుతుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّا أَنْزَلْنَهُ فِي لَيْلَةِ الْقَدْرِ
“నిశ్చయంగా మేము దీనిని (ఖురాన్ ను) ‘లైలతుల్ ఖద్ర్’ (ఘనమైన రాత్రి) యందు అవతరింపజేశాము“. (ఖద్ర్ : 1)
దీని ద్వారా – శుభప్రదమైన రాత్రి అంటే ‘లైలతుల్ ఖద్ర్’ అని తెలుస్తుంది. ఇది రమజాన్ నెలలోని ఆఖరి పది రోజుల్లోని బేసి సంఖ్యల రాత్రుల్లో వస్తుంది. అదేరాత్రి మనిషి జీవితం, మరణం, జీవనోపాధి తదితర అంశాలను గురించి నిర్ణయాలు తీసుకోబడతాయి.
‘శుభప్రదమైన రాత్రి’ గురించి అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హు), ఖతాదా, ముజాహిద్, హసన్ మొ॥ వారు కూడా ఇలాగే విశ్లేషించారు. ఈ విశ్లేషణనే విద్వాంసులందరూ సరైన విశ్లేషణగా ఖరారు చేశారు. (తఫ్సీర్ ఖుర్తుబీ : 8వ సంపుటం,, 432-433 పేజీలు)
ఇమామ్ అబూ బక్ర్ ఇబ్నుల్ అరబీ ఇలా పేర్కొన్నారు: ధార్మిక పండితుల దృష్టిలో ‘శుభప్రదమైన రాత్రి’ అంటే ‘లైలతుల్ ఖద్ర్’ అని అర్థం. కానీ కొందరి దృష్టిలో మాత్రం ఇది షాబాన్ నెల15వ రాత్రి. కానీ ఇది అసత్యం. ఎందుకంటే అల్లాహ్ తన సత్య గ్రంధంలో – ‘రమజాను నెల ఖురాన్ అవతరింప జేయబడిన నెల’ అని వివరించి తదుపరి, ఈ నెలలోని ‘లైలతుల్ ఖద్ర్’ను ఖురాన్ అవతరించిన రాత్రిగా ఖరారు చేశాడు. ఇక దీనిని (ఈ సత్యాన్ని) వదిలిపెట్టి ఎవరైనా, శుభప్రదమైన రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ కాక మరో రాత్రి అని అంటే అతను అల్లాహ్ పై పెద్ద అభాండం మోపినట్లే. షాబాన్ 15వ రాత్రి మహత్యం గురించి లేదా ఆ రాత్రి నిర్ణయాలు తీసుకోబడతాయి- అన్న దాని గురించి వచ్చిన హదీసులన్నీ అత్యంత బలహీనమైనవి. కనుక వీటి జోలికి పోకండి. (అహముల్ ఖురాన్, ఇబుల్ అరబీ:4వ సంపుటం, 106వ పేజీ)
ఇమామ్ ఇబ్నె కసీర్ ఇలా పేర్కొన్నారు : ‘శుభప్రదమైన రాత్రి’ మరియు ‘నిర్ణయాలు తీసుకోబడే రాత్రి’ అంటే లైలతుల్ ఖద్ర్ అని అర్థం. ఇక ఎవరైనా, ఇక్రమా చెప్పినట్లు-దీని అర్థం షాబాన్ 15వ రాత్రి – అని అంటే అది సరైనది కాదు, ఎందుకంటే స్వయంగా ఖురాన్ ద్వారానే ‘ఈ రాత్రి రమజాన్ నెలలో వస్తుంది’ అని రూఢీ అవుతుంది. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 4వ సంపుటం, 163వ పేజీ)
కనుక షాబాన్ 15వ రాత్రిని నిర్ణయాలు తీసుకోబడే రాత్రిగా ఖరారు చేయడం ఎంతమాత్రం సరికాదు, దానికేమాత్రం విలువ లేదు.
ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరినీ ఆయన విధేయతకు కట్టుబడి, ఆయన అవిధేయతకు దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు మన అంతం ‘తౌహీద్ మరియు సత్యార్యాలపై’ కలుగజేయుగాక! ఆమీన్!
—
షాబాన్ నెల (The Month of Shaban) – Main page
షాబాన్ నెలకు సంబంధించిన పుస్తకాలు , ఆడియో, వీడియో , ఖుత్బాలు ..అన్నీ
https://teluguislam.net/2023/02/22/the-month-of-shaban/
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
You must be logged in to post a comment.