ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం & వీడియో పాఠాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [87 పేజీలు]

మహా ప్రవక్త జీవిత చరిత్ర – నసీరుద్దీన్ జామి’ఈ [20 వీడియోలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2VDi2Ej4R1q4NDm5Sl_NoM

వీడియో పాఠాలు (క్రొత్తవి)

వీడియో పాఠాలు (పాతవి)

విషయ సూచిక :

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

(1) అజ్ఞాన కాలంలో అరబ్ స్థితి

అరబ్బుల్లో బహుదైవారాధనే ఒక ప్రసిద్ధిచెందిన ధర్మంగా ఉండింది. సత్య ధర్మానికి వ్యెతిరేకంగా ఉన్న ఈ బహుదైవారాధన (షిర్క్)ను వారు పాటించినందువలన వారి ఆ కాలమును “అజ్ఞానకాలం” అనబడింది. అల్లాహ్ ను గాక, వారు పూజించే దేవతల్లో ప్రసిద్ధి చెందినవిః ‘లాత్’, ‘ఉజ్జా’, ‘మనాత్’, మరియు ‘హుబుల్’. అరబ్బుల మధ్య యూదమతాన్ని, క్రైస్తవ మతాన్ని అవలంబించినవారు మరియు పార్శీలు కూడా ఉండిరి. వారందరి మధ్య కొందరు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ‘దీనె హనీఫ్’ (బహుదైవారాధనకు అతీతంగా సవ్యమైన ధర్మం)పై స్థిరంగా ఉన్నవారు కూడా ఉండిరి.

ఇక వారి ఆర్థిక జీవతం అంటేః ఎడారివాసుల (అనాగరికుల) పూర్తి ఆధారం పశు సంపద, వాటిని మేపుటయే ఉండింది. నాగరికతలో ఉన్నవారి ఆధారం వ్యవసాయం, వ్యాపారంపై ఉండింది. ఇస్లాం ధర్మ జ్యోతి ప్రకాశించేకి కొంచం ముందు ‘మక్కా’ అరబ్ ద్వీపంలో ఒక పెద్ద వ్యాపార కేద్రంగా పేరుగాంచింది. మదీనా, తాయిఫ్ మరియు ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా నాగరికత ఉండినది.

సామాజిక వ్యవస్థః అన్యాయం విపరీతంగా వ్యాపించి యుండింది. బలహీనులకు ఎలాంటి హక్కు లేకపోవడం, ఆడ బిడ్డలను సజీవ సమాధి చేయడం, మానభంగాలకు పాల్పడడం, బలహీనుల హక్కు బలవంతుడు కాజేయడం, హద్దు లేకుండా భార్యలనుంచుకోవడం, వ్యభిచారం సర్వ సామాన్యమైయుండినది. తుచ్ఛమైన కారణాలపై సంవత్సరాల తరబడి తెగల్లో అంతర్ యుద్ధం జరిగేది. ఒకప్పుడు ఒక తెగకు సంబంధించిన సంతానంలో కూడా ఈ యుద్ధాలు జరిగేవి.

ఇది ఇస్లాంకు ముందు అరబ్ ద్వీపం యొక్క సంక్షిప్త స్వరూపం.

(2) ఇబ్నుజ్జబీహైన్ [1]

అబ్దుల్ ముత్తలిబ్ -ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత- అధిక ధన, సంతానం గలవారని ఖురైష్ అతన్ని చాలా గౌరవించేవారు. ‘అల్లాహ్ పది మగ సంతానం ప్రసాదిస్తే అందులో ఒకరిని దేవతలకు బలిస్తాన’ని అతను మ్రొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. పది మంది మగ సంతానం కలిగారు. అందులో ఒకరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తండ్రి అబ్దుల్లాహ్. అబ్దుల్ ముత్తలిబ్ తన మ్రొక్కుబడిని పూర్తి చేయదలుచుకున్నపుడు, ఖురైష్ అతని ముందుకు వచ్చి ఇది ప్రజలలో ఒక ఆచారముగా అయిపోతుందన్న భయంతో అతనికి అడ్డుపడి, పది ఒంటెల మరియు అబ్దుల్లాహ్ మధ్య చీటి (పాచిక) వేసి పది ఒంటెలను అబ్దుల్లాహ్ కు బదులుగా బలిదానమివ్వాలి, ఒక వేళ చీటి అబ్దుల్లాహ్ పేరున వస్తే, మళ్ళీ పది ఒంటెలను పెంచాలని ఏకీభవించారు. ఈ విధంగా చీటి వేశారు. కాని ప్రతి సారి అబ్దుల్లాహ పేరే వచ్చేది. పదవసారి అనగ వంద ఒంటెలు ఒకవైపు అబ్దుల్లాహ్ ఒక వైపు ఉండగా ఒంటెల పేరున చీటి వెళ్ళింది. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ ఒంటెలను బలి ఇచ్చాడు. అబ్దుల్ ముత్తలిబ్ కు మొదటి నుండి ఇతర సంతానముకన్నా అబ్దుల్లాహ్ యే హృదయానికి అతి చేరువుగా ఉండే. అతన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. ప్రత్యేకంగా ఈ బలిదానము యొక్క సంఘటన తర్వాత. అతను పెరిగి, పెండ్లీడుకు చేరిన తర్వాత అతని తండ్రి జుహ్రా కుటుంబానికి చెందిన ఆమిన బిన్తె వహబ్ తో అతని వివాహం చేశాడు. అబ్దుల్లాహ్ వైవాహిక జీవితం గడుపుతూ ఆమిన మూడు నెలల గర్భములో ముహమ్మదును మోస్తుండగా ఒకసారి వ్యాపార బృందముతో సీరియా దేశం వైపు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా దారిలోనే ఒక వ్యాదికి గురై మదీనలో నజ్జార్ వంశానికి చెందిన తన మేన మామల వద్ద ఆగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడే మరణించాడు. అంతిమ క్రియలు అక్కడే జరిగాయి.

ఇటు ఆమిన నెలలు నిండినవి, సోమవారం రోజున ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించారు. కాని నిర్ణీత తారీకు మరియు నెల ప్రస్తావన రాలేదు. రబీఉల్ అవ్వల్ మాసం తొమ్మిదవ తారీకు అని చెప్పబడింది. అదే నెల 12 అనీ ఉంది. అలాగే రమజాను నెల అని కూడా అనబడింది. తదితర అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాని అది క్రీ.శ. ప్రకారం 571 సంవత్సరం అన్నది నిజం. అదే సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ (ఏనుగుల సంవత్సరం) అని అంటారు.

[1]అనగా ఇస్మాఈల్ అలైహిస్సలాంను వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞతో జిబహ్ చేయబోయాడు. అబ్దుల్ ముత్తలిబ్ తన మ్రొక్కుబడిని పూర్తి చేయుటకు అబ్దుల్లాహ్ ను జిబహ్ చేయబోయాడు. అబ్దుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి అయితే ఇస్మాఈల్ అలైహిస్సలాం తాత ముత్తాతల్లో వస్తారు. ఈ విధంగా ఆయన బలికెక్కిన ఇద్దరి వ్యక్తుల కుమారుడు అని భావం.

(3) ఏనుగుల సంఘటన

సంక్షిప్తంగా ఏనుగుల సంఘటన ఏమిటంటేః యమన్ లో నజ్జాషి అను రాజు యొక్క ప్రతినిధి అబ్రహా హబ్షీ ఉండేవాడు. అరబ్బులందరూ మక్కా నగరంలో ఉన్న పవిత్ర కాబా గృహాన్ని గౌరవిస్తూ, దూర ప్రాంతాల నుండి దాని దర్శనానికి వస్తూ, హజ్ చేస్తున్నది చూసిన అబ్రహా, యమన్ దేశపు రాజధాని ‘సనఆ’ లో ఒక పెద్ద చర్చి నిర్మించాడు. హజ్ కొరకు వచ్చే అరబ్బులందరూ కాబాకు బదులుగా దీని దర్శనానికి రావాలని కోరాడు. అది విన్న బనీ కినాన (అరబ్ వంశాల్లోని ఒక వంశం)లోని ఒక వ్యక్తి రాత్రి సమయంలో అందులో ప్రవేశించి ఆ చర్చి గోడలకు మలినము పూసాడు. ఈ విషయం తెలిసిన అబ్రహా ఆగ్రహముతో మక్కా నగరములోని కాబా గృహాన్ని ధ్వసం చేయాలని పూనుకొని అరవై వేల సైన్యంతో వెళ్ళాడు. సైన్యంలో తన వెంట తొమ్మిది ఏనుగులను తీసుకొని, తాను అన్నిట్లో పెద్ద ఏనుగుపై పయనమయి మక్కా సమీపానికి చేరుకున్నాడు. అక్కడ సైన్యాన్ని సరిచేసుకొని మక్కాలో ప్రవేశించాలన్న ఉద్దేశంతో సిద్ధమయ్యాడు. కాని తను అధిరోహించిన ఏనుగు కాబా వైపునకు ఒక్క అడుగు వేయడానికి సిద్ధం లేనట్లు కూర్చుండి పోయింది. కాబా దిశకు గాకుండా వేరే దిశలో లేపినప్పడు లేచి పరుగెత్తేది. కాని కాబా దిశకు మార్చితే కూర్చుండి పోయేది. వారు ఈ ప్రయత్నాల్లో ఉండగా అల్లాహ్ వారిపై పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి వారిపై గులకరాళ్ళను విసిరాయి. అల్లాహ్ చివరికి వారిని పశువులు తినవేసిన పొట్టు మాదిరిగా చేశాడు. అది ఎలా అంటేః ప్రతి పక్షి వద్ద చణక గింజంత మూడు రాళ్ళుండేవి. ఒకటి వారి చుంచువులో, రెండు వారి కాళ్ళల్లో. అవి ఎవరిపై పడిన వారి అవయవాలు ముక్కలు ముక్కలయి దారి గుండా పడుతూ చివరికి సర్వనాశనమయ్యే- వారు. అల్లాహ్ అబ్రహాపై ఒక వ్యాదిని పంపాడు. దాని కారణంగా అతని వ్రేళ్ళు ఊడిపోయాయి. అతడు సనఆలో చేరుకునే సరికి ఆ రోగం ముదిరిపోయి, తన తడాక చూపింది. అక్కడే వాడు చనిపోయాడు.

ఇటు ఖురైషుల విషయం: అబ్రహ వస్తున్న విషయం విని, వారు భయపడి కొండల్లో, కొనల్లో పరుగెత్తుకు పోయారు. ఆ సైన్యంపై విరుచుకు పడ్డ ఆపదను చూసి అందరూ తృప్తి, శాంతితో తమ తమ ఇండ్లల్లోకి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మకు 50 రోజుల ముందు జరిగినది. (అందుకే ఈ సంవత్సరానికి ఆముల్ ఫీల్ అన్న పేరు వచ్చింది).

(4) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పోషణ

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించిన తరువాత, ఆయన పిన తండ్రి అయిన అబూ లహబ్ యొక్క బానిస సువైబ అను ఆమె ఆయనకు పాలు పట్టింది. ఆమె అంతకు ముందు హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కు కూడా పాలు పట్టింది. (ఇతను ప్రవక్త పెత్తండ్రి). ఈ విధంగా హంజా ప్రవక్త పాల సంబంధ సోదరుడయ్యాడు.

అరబ్బుల అలవాటేమనగా వారు తమ పసిపిల్లలకు గ్రామీణ వాతవర ణములో ఉంచి అక్కడ పాలు పట్టించేవారు. ఎందుకనగా శారీరకంగా, ఆరోగ్యంగా ఉండుటకు అచ్చట పూర్తి సహాయం లభించేది. ఇలా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరో దాయి వద్దకు చేరుకున్నారు. దాని వివరణ ఇలా ఉందిః ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించిన రోజుల్లో మక్కాలో ఉన్న శిశువులను పాలు త్రాగించడానికి తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో బనీ సఅద్ వారి ఒక బృందం వచ్చింది. ప్రతి స్త్రీ పసిపిల్లలున్న గృహాలను గాలించి, అట్లే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వచ్చి అతను అనాధ, పేదవాడు అని తెలుసుకొని వెను దిరిగింది. అందరి వలే హలీమ సఅదియా కూడా ఆయన్ని స్వీకరించక తిరిగి పోయింది. కాని అనేక గృహాలను గాలించినప్పటికీ, తన వెంట తీసుకెళ్ళడానికి శ్రీమంతుల బాలున్ని పొందలేక పోయింది. ఆమె ఉద్దేశ ప్రకారం, శ్రీమంతుల బాలున్ని పొందుతే, ఆ బాలుని ఇంటివారు పాలు పట్టినందుకు ఇచ్చే పైకం ద్వారా వారి పస్తుల్లో గడుస్తున్న రోజులకు సమాప్తం ఉండవచ్చు, ప్రత్యేకంగా అనావృష్టి వల్ల దారిద్ర్య రేఖకు దిగజారిన వారి జీవితం బాగు పడవచ్చన్న ఆశ ఆమెది. వేరే ఏ మార్గం దొరక్క అదే అనాథ బాలున్ని, వారు ఇచ్చే చిన్న పాటి పారితోషికాన్ని స్వీకరించటానికి తిరిగి ఆమిన (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తల్లి) ఇంటికి వచ్చింది. హలీమ తన భర్తతో మరీ నిదానంగా నడిచే (పరుగెత్తలేని), బక్కని గాడిద పై మక్కా వచ్చింది. కాని తిరుగు ప్రయాణంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన ఒడిలో తీసుకున్నాక, అదే గాడిద వేగంగా పరుగెత్తుతూ తోటి సవారీలను వెనుకేసి, తోటి ప్రయాణికులను కూడా ఆశ్చర్యంలో పడవేసింది. హలీమ ఉల్లేఖనం ప్రకారం, ఆమె వద్ద చాలా తక్కువ పాలుండేవి. ముందు నుండే ఆమె వద్ద ఉన్న స్వంత కొడుకు పాలు సరిపడక ఆకలితో ఎప్పుడూ ఏడ్చేవాడు. కాని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె పాలు త్రాగడం మొదలు పెట్టిన వెంటనే ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. బనూ సఅద్ అనే తన ప్రాంతంలో ఉన్న భూములు వర్షము లేక మాడిపోతున్న వేళ, శుభ బాలునికి పాలు పట్టే భాగ్యం పొందాక, అక్కడి భూములు పండాయి. పశువులు అధికమయ్యాయి. వారి స్థితిగతులు కలిమి నుండి లేమి, కష్టము నుండి సుఖములుగా మారాయి.

చూస్తూ చూస్తూ హలీమ రక్షణలో రెండు సంవత్సరాలు గడిచాయి. ఇతరులలో కానరాని అసాధారణ అలవాట్లు ఈ సుపుత్రునిలో చూస్తున్నందు వలన మరియు దూరదృష్టి అతనిలో ఏదో ఒక గొప్ప విషయాన్ని సూచిస్తున్నందు వలన, హలీమాకు మరి కొన్ని రోజులు ఈ బాలున్ని పోషించాలన్న తపన కలిగింది. (రెండు సంవత్సరాల్లో తిరిగి ఆమినకు అప్పజెప్పాలన్న మాటపై) హలీమ ఈ బాలుడ్ని తీసుకొని, అతని తల్లి, తాత దగ్గరికి మక్కా వచ్చింది. కాని అతని మూలంగా ఆమె స్థితిగతుల్లో ఏ మార్పు వచ్చిందో, ఏ శుభం చూసిందో అందుకని మరో రెండేళ్ళు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వద్దే ఉంచుకుంటానని ప్రాధేయపడితే, దానికి ఆమిన ఒప్పుకుంది. అదే అనాథశిశువుడు అయిన ముహమ్మదును మహా సంతోషం, మాహా భాగ్యంతో తీసుకొని హలీమా తమ బనీ సఅద్ ప్రాంతానికి తిరిగి వచ్చింది.

(5) “షఖ్ఖె సద్ర్” (హృదయ పరిచ్ఛేదం)

ముహమ్మద్ (ﷺ)కు సుమారు 4 సంవత్సరాల వయస్సు. ఒక రోజు గుడారానికి కొంత దూరాన తమ పాల సంబంధ తమ్ముడు అగు హలీమ సఅదియా కొడుకుతో ఆడుకుంటున్నాడు. హలీమ కొడుకు పరుగెత్తుకుంటూ తల్లి వద్దకు వచ్చాడు. అతని ముఖముపై భయాందోళన చిహ్నాలు స్ఫష్టంగా ఉన్నాయి. “అమ్మా! తొందర వచ్చేసెయి, అదిగో ఖురైషి తమ్మున్ని చూడు, అని అనసాగాడు. హలీమ ముహమ్మద్ (ﷺ) వైపు పరుగులు తీస్తూ అతని గురించి ప్రశ్నించింది. దానికి తన కొడుకు “నేను తెల్లని బట్టల్లో ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వారు ముహమ్మద్ ని మా మధ్య నుండి పక్కకు తీసుకెళ్ళి, పడుకోబెట్టి, అతని ఎద చీల్చి…. అని అంటుండగా హలీమ సంఘటన స్థలానికి చేరుకుంది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కదల కుండా నిలబడి ఉన్నాడు. రంగు పేలిపోయి ఉంది. ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. హలీమా వ్యాకులతతో జరిగిందేమిటని అడిగింది. “నేను క్షేమంగనే ఉన్నాను” అని ముహమ్మద్ ఇలా చెప్పాడుః “తెల్లని దుస్తుల్లో ఇద్దరు మనుషులు వచ్చి నన్ను తీసుకెళ్ళి నా ఎదను చీల్చి, అందులో నుండి గుండెను తీసి, దానిలో ఉన్న ఒక నల్లటి రక్తపు ముద్దను తీసి పారేసి, చల్లని జమ్ జమ్ నీటితో గుండెను కడిగి యధా విధిగా దాని స్థానంలో పెట్టేసి కుట్లువేసి సరిచేసి వెళ్ళిపోయారు. వారు ఇక కనబడలేదు. హలీమా ముహమ్మద్ (ﷺ)ను తీసుకొని తన గుడారంలో వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున -ముహమ్మద్ (ﷺ)ను వెంటబెట్టుకొని మక్కా వచ్చేసింది. సమయం కాని సమయంలో వచ్చిన హలీమాను చూసి ఆమిన ఆశ్చర్యానికి గురైంది. ఆమెనే స్వయంగా ఎంతో బతిమిలాడి తీసుకెళ్ళింది కదా. అయితే ఇలా హఠాత్తుగా రావడానికి కారణం ఏమిటని ఆమిన అడిగింది. హలీమా హృదయ పరిచ్ఛేద విషయాన్ని వివరంగా చెప్పింది.

ఒకరోజు ఆమిన తన అనాథ సుపుత్రుడిని తీసుకొని, బనూ నజ్జార్లోని ఆయన మేనమామలను సందర్శించడానికి మదీనకు పయనమయ్యింది. కొద్ది రోజులు అక్కడ ఉండి, తిరిగి వస్తుండగా ‘అబ్వా’ అనే ప్రాంతంలో అసువులు బాసింది. అక్కడే అంతిమ క్రియలు జరిగాయి. ఇలా ఆరు సంవత్సరాల వయసులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కన్నతల్లికీ వీడ్కోలు పలికారు.

ఆయన పోషణ, సంరక్షణ భారం తాత అబ్దుల్ ముత్తలిబ్ పై పడింది. ప్రేమతో ఆయన్ని చూసుకున్నారు. కంటి పాపలా ఆయన్ని కాసారు. ముహమ్మద్ ఎనిమిదవ ఏటలో తాత కూడా పరమపదించారు. అయితే పోతూ పోతూ తన తనయుడైన అబూతాలిబ్ కు ముహమ్మద్ సంరక్షణ భారం అప్పజెప్పి పోయాడు. అబూ తాలిబ్ అధిక సంతానం, తక్కువ సంపాదన గలవారైనప్పటికీ ముహమ్మద్ పోషణ బాధ్యత స్వీకరించారు. అతను, అతని భార్యలిద్దరూ తమ స్వంత సంతానంలాగా ఆయన్ని చూసుకునేవారు. ముహమ్మద్ కు కూడా పినతండ్రి అంటే ఎనలేని ప్రేమ. ఈ వాతవరణంలో ఆయన పెరుగుదల యొక్క తొలి దశ/ మెట్టు మొదలయింది. నిజాయితీగా జీవించ గలిగారు. అందుకే సత్యత, విశ్వసనీయత ఆయనకు మారుపేరుగా నిలిచాయి. “అమీన్” (విశ్వసినీయుడు) వస్తున్నాడు లేదా “సాదిఖ్” (సత్యసంధుడు) వస్తున్నాడు అని అంటే అతను ముహమ్మదే అని అనుకునేవారు ప్రజలు.

(6) యౌవనం, వర్తకం

యౌవనంలో అడుగుపెడుతూ, జీవిత వ్యవహారాల్లో, ఆర్థిక సంపాదనలో తన కాళ్ళపై నిలబడటానికి ప్రయత్నం మొదలు పెట్టారు. అందుకని కష్టపడడం, సంపాదించడం ఆరంభించారు. చిన్నపాటి పారితోషికానికి బదులుగా ఖురైషుల మేకలు మేపుటకై కాపరిగా పనిచేశారు.

(బాబాయి అబూ తాలిబ్ వర్తకులవడం చేత, అతని వెంట కొన్ని వర్తక పర్యటనలు చేసినందు వల్ల ఆయనకు వాణిజ్యంలో మంచి అనుభవం కలిగింది). అయితే మక్కాలో ఖదీజ బిన్తె ఖువైలిద్ అను ఓ శ్రీమంతురా- లుండేది. ఆమె విధవ కూడాను. ఒకసారి ఆమె తన వర్తక సామాగ్రి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అప్పజెప్పుతూ సీరియా దేశానికి వెళ్ళి వ్యాపారం చేయవలసిందిగా కోరింది. ఈ ప్రయాణంలో మైసర అను బానిస ఆమె వర్తక సామాగ్రికి బాధ్యుడుగా ఆయనతో ఉన్నాడు. ఆయనగారి శుభం, అయన విశ్వసనీయత వల్ల ఇంతకు ముందు ఎన్నడూ లేని అధిక లాభం వచ్చింది. ఖదీజా మైసరను ఈ ఎనలేని లాభాల గురించి అడిగింది. దానికి మైసర “ముహమ్మద్ సామా గ్రిని చూపించే, విక్రయించే బాధ్యత వహించారు. (ఆయన మాటా విధానాన్ని, నిజాయితీ, సచ్చీలతను చూసి) ప్రజలు మీ సామాగ్రిపై విరుచుకు పడేవారు. అందుకే ఏ అన్యాయం లేని ఇంతటి మహాలాభంతో తిరిగి వచ్చాము” అని సమాధానం చెబుతూ ఉంటే ఖదీజ పూర్తి శ్రద్ధగా అతని మాటలు వింటూ ఉండే. ఆమె ముందే కొన్ని విషయాలు ముహమ్మద్ గురించి విని యుండే. అందుకే ఈ మాటలు విని ఆమెకు మరింత అద్భుతమైన ఉత్సాహం కలిగింది. ఇంతటి సుగుణ సంపన్నునితో దాంపత్య జీవితం గడపాలన్న కోరిక ఆమెలో పుట్టింది. ఈ విషయం తెలిపి, ఆయన ఉద్దేశ్యమేంటో తెలుసు కోడానికి తన బంధువులైన ఒకామెను పంపింది. ఆయనకు ఖదీజ సందేశం అందింది, దానికాయన ఒప్పుకున్నారు. అప్పటికీ ఆయనకు పాతికేళ్ళు. పెద్దల సమక్షంలో పెళ్ళయింది. దాంపత్య జీవితంలో ఒకరికొకరు చాలా ఆనందం పొందారు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖదీజ ధనానికి బాధ్యుడుగా ఉండి వ్యాపారం చేస్తూ, తమ సామర్థ్యాన్ని, దక్షతని నిరూపించుకున్నారు. కొద్ది సంవత్సరాల్లో ఖదీజా –రజియల్లాహు అన్హా-కు సంతానం కూడా కలిగింది. వారిలో జైనబ్, రుఖయ్య, ఉమ్ము కల్సూమ్ మరియు ఫాతిమా అను నలుగురు కూతుళ్ళు. ఖాసిమ్ మరియు అబ్దుల్లాహ్ అను ఇద్దరు కొడుకులు. అయితే కొడుకులిద్దరూ పసితనం లోనే చనిపోయారు. (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మదీన జీవితంలో మారియా రజియల్లాహు అన్హాతో ఒక కుమారు డయ్యాడు. పేరు ఇబ్రాహీం. ఈ కొడుకు కూడా బాల్యంలోనే మరణించాడు).

(7) హిల్ఫుల్ ఫుజూల్

జుబైదా వంశానికి చెందిన యమన్ దేశస్తుడు ఒకతను తన సామాగ్రితో మక్కా వచ్చాడు. మక్కాలోని పేరు ప్రఖ్యాతి గల ఆస్ బిన్ వాయిల్ అతని ఆ సామాగ్రిని కొన్నాడు. కాని అతనికి పైకం చెల్లించ లేదు. అతని నుండి తన హక్కు తీసుకొనుటకు జుబైదాకు చెందిన వ్యక్తి ఏ న్యాయశీలుడిని పొందలేక పోయాడు. అందుకు అతను ఓ కొండపై ఎక్కి తన బాధను వెలకక్కాడు. అప్పుడు మక్కాలోని కొన్ని తెగలు లేచి బాధితులకు వారి హక్కు లభించాలని ఏకీభవించారు. దానికి వారు ఓ ఒప్పందం చేసుకున్నారు. అదేమిటంటేః మక్కావాసి అయినా లేదా మక్కాలో వచ్చే ఏ వ్యక్తి అయినా అతనికి ఏదైనా అన్యాయం జరిగిందంటే మనమందరం బాధితునికి తోడుగా నిలబడి అతనికి తన హక్కు లభించే వరకు దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా పోరాడాలి. ఖురైషువారు ఈ ఒప్పందాన్ని ‘హిల్ఫుల్ ఫుజూల్’ అని నామకరించారు. అయితే ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అందులో పాల్గొన్నారు. అప్పుడు ఆయన వయస్సు 20 సంవత్సరాలు.

(8) కాబా పునర్నిర్మాణం

ముహమ్మద్ –సల్లల్లాహు అలైహి వసల్లం- వయస్సు 35 సంవత్సరాలు ఉండగా ఖురైషువారు కాబా కట్టడాన్ని కొత్తగా నిర్మించాలని ఉద్దేశించారు. ఎందుకనగా అది పాత కాలపు కట్టడం కావడం చేత శిథిలావస్తకు చేరి, దాని గోడలు పగులుబారినవి. అంతకు మునుపే ఎప్పుడో ఓ తూఫాను మక్కాలో వచ్చి వరద తాకిడి మస్జిదె హరాం వరకు చేరి కాబా పునాదులను సయితం పెకిలించింది. అందుకే వారు కాబా యొక్క గౌరవార్థం దాని పునర్నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే దీని నిర్మాణంలో ధర్మసమ్మతమయిన సంపాదనే ఖర్చు పెట్టాలి అని ఏకీభవించారు. దాని నిర్మాణం మొదలు పెట్టి, హజ్రె అస్వద్ (నల్లరాయి) వద్దకు చేరుకున్నాక, హజ్రె అస్వద్ ను దాని స్థానంలో అమర్చే కీర్తి ఎవరికి దక్కాలన్న విషయంలో విభేదించి సుమారు నాలుగైదు రోజులు గడిసినా వివాదం చల్లారకుండా మరింత వేడెక్కి భయంకర యుద్ధానికే దారి తీసే సందర్భంలో ఓ విషయంపై ఏకీభవించారు. అదేమిటంటే; మస్జిదె హరాంలో రేపటి రోజు అందరికి ముందుగా ప్రవేశించే వ్యక్తిని న్యాయ- నిర్ణేతగా ఎన్నుకుందాము అని. ఆ వ్యక్తి ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అయి ఉండాలని అల్లాహ్ కోరాడు. వారు ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం-ను చూడగానే “ఇతను విశ్వసనీయుడు ముహమ్మద్, ఇతడిని మేము ఇష్టపడ్డాము” అన్న నినాదాలు చేశారు. ఆయన వారి దగ్గరకు వెళ్ళాక వారు విషయాన్ని తెలిపారు. అప్పుడు ఆయన ఓ దుప్పటి తెప్పించారు, అందులో హజ్రె అస్వద్ పెట్టారు. గొడవ చేసిన ప్రతి తెగ నాయకుడిని పిలిచి దుప్పటి ఓ అంచును పట్టుకోవాలని చెప్పారు. అందరూ పట్టుకున్నాక దాన్ని లేపి హజ్రె అస్వద్ పెట్టే చోటకి తీసుకెళ్ళమన్నారు. అందరూ కలసి దాన్ని అక్కడికి చేర్పించాక ఆయనే స్వయంగా హజ్రె అస్వద్ ను దుపట్టిలో నుండి తీసి దాని స్థానంలో అమర్చారు. ఈ వివేకవంతమైన పరిష్కారంతో అందరూ తృప్తి చెందారు.

ఖురైషువారికి ధర్మసంపద కొరత ఏర్పడింది. అందువల్ల ఉత్తరం వైపునుండి ఆరు మూరలు తగ్గించి లోపలికి అని గొడ లేపారు. ఆ వదలిన ప్రాంతాన్నే హిజ్ర్ లేదా హతీమ్ అని అంటారు. కాబా నిర్మాణం పూర్తి అయిన తర్వాత అది సుమారు చతురాస్కారంలో అయింది. వారికి ఇష్టమైన వారే అందులో ప్రవేశించటానికి దాని తలుపును పైకి ఎత్తారు. 15 మూరల ఎత్తు లేసిన తర్వాత ఆరు స్తంభాలపై దాని కప్పు వేశారు.

(9) ప్రవక్త పదవి

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నలబై సంవత్సరాల వయస్సుకు సమీపిస్తున్న కొద్దీ ఆయనలో ఏకాంత ప్రియత్వం పెరగ సాగింది. మక్కాకు తూర్పు దిశలో ఉన్న ఓ కొండ, అందులోని హిరా గుహలో ఉండి ఆయన అల్లాహ్ ఆరాధనలో రేయింబవళ్ళు గడిపేవారు. ఒక రాత్రి, అది రమజాను నెల 21వ రాత్రి, ఆయన అదే గుహలో ఉన్నారు. అప్పటికీ ఆయనకు నలబై సంవత్సరాలు పూర్తి అయినవి. జిబ్రీల్ దైవ దూత ఆయన వద్దకు వచ్చి “చదువు” అని అన్నాడు. నాకు చదవటం రాదన్నారాయన. ఆ దూత ఆయన్ను గట్టిగా కౌగలించుకొని వదిలి చదువు అన్నాడు. అప్పటికీ ఆయన నాకు చదువు రాదు అనే సమాధానమిచ్చారు. అందుకు జిబ్రీల్ రెండు, మూడు సార్లు గట్టిగా అదిమి వదిలారు, ఆ తర్వాత ఇలా చదివాడుః

{(ఓ ప్రవక్తా!) పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు, నీప్రభువు పరమ దయాళువు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు}. (అలఖ్ 96: 1-5).

(ఇలా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ప్రవక్త పదవి నొసంగబడినది). కాని ఈ సంఘటన తర్వాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హిరా గుహలో ఉండలేక పోయారు, కంపించిన హృద యంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. నాకు దుప్పటి కప్పండి, నాకు దుప్పటి కప్పండి అని ఖదీజాతో అన్నారు. కాసేపటికి భయం దూరమయింది. అప్పుడు జరిగిన సంఘటన సతీమణి ఖదీజకు వినిపిస్తూ నాకు నా ప్రాణ భయముంది అన్నారు. అది విని ఖదీజ ధైర్యం చెబుతూ, “ముమ్మాటికి అలా జరగదు. అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ మిమ్మల్ని ఎన్నాటికీ అవమాన పరచడు. మీరు బాంధవ్యం పెంపొందిస్తారు, ఇతరుల భారాన్ని భరిస్తారు, ఏమి లేనివారికి (సంపాదించి) ఇస్తారు. అతిథులను గౌరవిస్తారు, ఆపదల్లో ఉన్నవారికి న్యాయం లభించుటకు సహాయపడతారు”. అని చెప్పింది.

అల్లాహ్ ఆరాధన కొనసాగించడానికి, కొద్ది రోజుల తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి హిరా గుహకి వచ్చారు. ఆరాధన పూర్తి చేసుకొని తిరిగి మక్కా రావడానికి గుహ నుండి దిగి వస్తూ, పల్లపు ప్రాంతంలో ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది. తెలెత్తి చూసే సరికి జిబ్రీల్ భూమ్యాకాశాల మధ్యలో కుర్చీపై కుర్చున్నాడు. అతన్ని చూసి ప్రవక్త భయకంపితులై ఇంటికి వచ్చి నాకు దుప్పటి కప్పండి అని అన్నారు. అప్పుడే కొంత సేపటికీ ఈ వహీ అవతరించింది.

{వస్త్రం కప్పుకొని పడుకున్న ఓ మనిషి! లే, లేచి హెచ్చరించు. నీ పుభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. మాలిన్యానికి దూరంగా ఉండు}. (ముద్దస్సిర్ 74: 1-5).

ఆ తరువాత వహీ ఎడతెగకుండా రావడం మొదలయింది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ ప్రచారం ఆరంభించిన తొలి సందర్భంలోనే ఆయన గౌరవనీయులైన సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా విశ్వాస ప్రకటనను స్వీకరించింది. అల్లాహ్ మాత్రమే ఏకైక ఆరాధ్యుడని, ఆమె భర్త అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చింది. స్త్రీ పురుషుల్లో మొట్టమొదటిసారిగా ఇస్లాం స్వీకరించినవారు ఈ స్త్రీ మూర్తియే. ఆమె తర్వాత తమ ప్రాణ మిత్రుడైన అబూ బక్ర్ తో ప్రవక్త ఈ విషయం చెప్పినప్పుడు అతను కూడా నిస్సంకోచంగా విశ్వసించి, ఆయన్ను సత్యపరిచాడు. తల్లి మరియు తాత మరణానంతరం ఆయన్ను పోషించి, మంచి విధంగా చూసుకున్న పినతండ్రి అబూ తాలిబ్, అతను చేసిన మేలుకు బదులుగా ప్రవక్త అతని సంతానంలో ఒకడైన అలీని తన వద్ద ఉంచి పోషించసాగారు. అలీ చిన్న వయస్సులో ఉన్నప్పటికీ అతని హృదయం వికసించి తను కూడా విశ్వసించాడు. ఆ తర్వాత ఖదీజ రజి యల్లాహు అన్హా బానిస జైద్ బిన్ హారిస కూడా విశ్వాసుల్లో కలిశాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మ ప్రచార కార్యాన్ని గుప్తంగా నిర్వహించసాగారు. అప్పట్లో ఇస్లాం స్వీకరించేవారు తమ ఇస్లాంను రహస్యంగా ఉంచేవారు. ఏ ఒక్కరి విషయం వెల్లడైనా ఖురైషుల నానారకాల శిక్షలకు గురి కావలసి వచ్చేది. విశ్వాసులు ఇస్లాం నుండి తిరిగి అవిశ్వాసులవ్వాలని ఖురైషులు ఇలా చేసేవారు.

ఆ సందర్భంలో ప్రవక్త సహచరులు నమాజు గాని వేరే అల్లాహ్ ఆరాధన గాని ముష్రికులకు తెలియకూడదని మక్కా కనుమల్లో చేసేవారు.

(10) బహిరంగ ప్రచారం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిగత, రహస్య ప్రచారంలో మూడు సంవత్సరాలు గడిపాక, ఒక రోజు అల్లాహ్ ఈ వహీ పంపాడుః

{కనుక ప్రవక్తా! నీకు ఆజ్ఞాపించబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా ఎలుగెత్తి చాటు. షిర్క్ చేసేవారిని ఏ మాత్రం లెక్క చేయకు}. (హిజ్ర్ 15: 94).

ఈ ఆదేశానుసారం ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫా కొండపై ఎక్కి మక్కా వాసులను పిలిచారు. చాలా మంది పోగైనారు. వారి లో ఆయన పినతండ్రి అబూ లహబ్ కూడా ఉన్నాడు. అల్లాహ్, ఆయన ప్రవక్తకు అందరికన్నా ఎక్కువ కఠిన శత్రువుడు ఇతడే. ప్రజలందరు పోగైన తర్వాత “కొండ ఆవల మీ శత్రువులు, మీపై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారని నేనంటే మీరు నమ్ముతారా?”. అని ప్రవక్త అడిగారు. వారందరు “మేము మిమ్మల్ని సత్యసంధులుగా, విశ్వసనీయులుగానే చూశాము కనుక మీరు చెప్పేది ఖచ్చితంగా నమ్ముతాం” అని ఏకంగా అన్నారు. అప్పుడు ప్రవక్త “నేను మిమ్మల్ని మీ ముందు రానున్న భయకరమైన శిక్షల నుండి హెచ్చరిస్తున్నాను” అని చెబుతూ అల్లాహ్ అద్వితీయుని ఆరాధన వైపుకు పిలుస్తూ, విగ్రహారాధనను వదులుకోవాలని బోధించారు. ప్రజల మధ్య నుండి అబూ లహబ్ ఆగ్రహంతో ముందుకు వచ్చి “నీ చేతులు విరుగుగాకా, ఇందుకేనా మమ్మల్ని రప్పించింది అని దూషించ సాగాడు. అటు అల్లాహ్ ఈ సూరా అవతరింపజేశాడు.

{అబూ లహబ్ చేతులు విరిగి పోయాయి! అతడు సర్వ నాశనం అయి పోయాడు. అతడి ఆస్తిపాస్తులు, అతడి సంపాదన అంతా అతనికి పనికి రాకుండా పోయింది. చివరికి అతడు తప్పకుండా భగభగమండే అగ్నిలో పడవేయబడతాడు. అంతే కాదు (అతడితో పాటు) అతడి భార్య కూడా అందులో పడవేయబడుతుంది. ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ. ఆమె మెడలో బాగా పేనిన ఒక త్రాడు ఉంటుంది}. (లహబ్ 111: 1-5).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మప్రచారం కొనసాగిస్తునే ఉన్నారు. అయితే ఇప్పుడు వారి సమావేశాల్లో నిలబడి బహిరంగంగా వారిని ఇస్లాం వైపుకు పిలవడం, కాబా వద్ద నమాజు చేయడం ఆరంభించారు. ప్రజలు కలుసుకునే ప్రాంతాల్లో, బాజారుల్లోకి వచ్చి ప్రవక్త ఇస్లాం గురించి బోధించే వారు. అందువల్ల ఆయన ఎన్నో సార్లు నా నా రకాల బాధలకు గురయ్యారు. ఆయన్ని విశ్వసించినవారు కూడా అవిశ్వాసుల యాతనలకు బలిఅయ్యే వారు. వారిలో యాసిర్, సుమయ్యా మరియు వారిద్దరి కొడుకు అమ్మార్ (రజియల్లాహు అన్హుమ్)లు ప్రసిద్ధి చెందారు. చివరికి అమ్మార్ తల్లిదండ్రులు ఆ యాతనలను భరించలేక షహీద్ (అమరగతి) అయ్యారు. సుమయ్యా ఇస్లాంలో తొలి షహీద్ గా పేరునొందారు. అలాగే బిలాల్ బిన్ అబీ రిబాహ్ హబషీ రజియల్లాహు అన్హు కూడా ఉమయ్య బిన్ ఖలఫ్ మరియు అబూ జహల్ చేత ఘోరంగా శిక్షించబడ్డారు. వాస్తవానికి బిలాల్, అబూ బక్ర్ పిలుపు, ప్రోత్సహంతో ఇస్లాంలో ప్రవేశించారు. ఈ విషయం బిలాల్ యజమాని ఉమయ్యా బిన్ ఖలఫ్ కు తెలిసింది. అతడు ఆయనపై ఘోరమైన హింసా దౌర్జన్యాలు చేశాడు. ఇవన్నీ ఆయన ఇస్లాం వదలుకోవాలని. కాని ఆయన అతని మాటను ధిక్కరించి, ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉండిపోయారు. ఉమయ్యా బిలాల్ ను సంకెళ్ళలో బంధించి, మండే ఎడారి ఇసుకపై పడవేసి, బరువైన బండ ఆయన ఎదపై పెట్టేవాడు. (అయినప్పటికీ బిలాల్ నిరాకరించేవారు) అందుకు ఆయన మెడలో తాడు కట్టి అగ్ని కుర్పిస్తున్న ఎండలో, మాడు ఇసుకలో ఆయన్ని లాగేవాడు. (ఆ దౌర్జన్యుడు ఇంతటితో తృప్తి పడక) తన మిత్రులతో కలసి ఒకరెనుకొకరు అలసిపోయే వరకు బిలాల్ పై కొరడా దెబ్బల వర్షం కురిపించేవారు. అంతులేని బాధలకు గురయినప్పటికీ నోటితో మాత్రం “అహద్, అహద్” (అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే) అనే పదాలే వినవచ్చేవి. ఒకసారి అబూ బక్ర్ తన దారిన వెళుతూ బిలాల్ అనుభవిస్తున్న బాధను చూశారు. అప్పుడే ఉమయ్యాతో సంప్రదించి ఆయన్ని ఖరీదు చేసి అల్లాహ్ కొరకు ఆయనకు స్వేచ్ఛతనిచ్చారు.

ఈ దౌర్జన్యఖాండలు హెచ్చు పెరుగుతన్నందు వల్ల, వారు ఇప్పుడే తమ ఇస్లాంను మరియు వారు రహస్యంగా ఒక చోట కలిసి శిక్షణ పొందుతున్న విషయాల్ని బహిర్గతం చేయవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకు ఆదేశించారు. ఇది ఎంతో గొప్ప వివేకం. ఎందుకంటే ఇప్పుడే వారు తమ ఇస్లామును బహిర్గతం చేశారంటే ప్రవక్త వారికి ఇచ్చే శిక్షణ మరియు విద్యకు అవిశ్వాసులు అడ్డు పడుట నిస్సందేహం. అందు వల్ల రెండు వర్గాల మధ్య ఒక పెద్ద ఘర్షణ సంభవించవచ్చు. ముస్లింలు ఇంకా అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు గనక ఎక్కువ నష్టం వారికే వాటిల్లవచ్చు. అంతేమిటి బొత్తిగే అంతం కావచ్చు. అందుకే ముస్లిములు తమ ఇస్లాం బహిర్గతం చేయవద్దని ఆదేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మంచి ఉపాయం చేశారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం ధర్మ ప్రచారం, అల్లాహ్ ఆరాధన విరోధుల సమక్షంలో బహిరంగంగా చేసేవారు. వారు ఎన్ని విధాలుగా బాధించినా సహించేవారు.

(11) ప్రవక్త బాబాయి హంజా గారి ఇస్లాం స్వీకరణ

ఇస్లాం మరియు ముస్లిముల బద్ధశత్రువు, ముష్రికుల నాయకుడు అబూ జహల్ ఓ రోజు కాబా వద్ద ఉన్న ప్రవక్తను దూషించాడు, చాలా బాధ కలిగించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురు జవాబూ చెప్పలేదు, ఏ ఒక్కటీ మాట్లాడ లేదు. అప్పుడు ఒక స్త్రీ కూడా ఈ సంఘటనను చూసింది. కొంత సేపటికే షికారు కొరకు మక్కా బైటికి వెళ్ళిన హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ వచ్చాడు. ఆ స్త్రీ తాను చూసిన అబూ జహల్ చేష్టలు, ప్రవక్తను దూషించడమంతా అతనికి తెలియజేసింది. అది విన్న హంజా రజియల్లాహు అన్హు ఆగ్రహోదోగ్రుడై అబూ జహల్ ను వెతుకుతూ వెళ్ళాడు. ఓ చోట కొందరి మధ్య కూర్చుండి ఉండటాన్ని చూశాడు. హఠాత్తుగా అబూ జహల్ పై విరుచుకుపడి ధనుస్సుతో గట్టిగా కొట్టి అతని తలను గాయ పరిచి, ‘నేను ముహమ్మద్ ధర్మంపై ఉండగా నీవు ఆయన్ని దూషిస్తావా?’. హంజా రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరణకు ఇది ఓ సబబుగా అయింది. ఆయన ఇస్లాం స్వీకరణ వల్ల ముస్లిములకు ఓ రకమైన బలం, గౌరవం ప్రాప్తమయింది. ఎలా అనగా ఆయన మక్కావాసుల్లో ఓ ఉన్నత స్థానం, గొప్ప కీర్తి పేరు ప్రతిష్ఠ కలవారు.

(12) ఉమర్ బిన్ ఖత్తాబ్ ఇస్లాం స్వీకరణ

ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగాః ఉమర్ రజియల్లాహు అన్హు ఓ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వస్లలం-ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడుః ‘నీవు ముహమ్మద్ –సల్లల్లాహు అలైహి వసల్లం-ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహ్రా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్ అన్నాడుః ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడుః దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’. ఉమర్ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్ బిన్ అరత్త్ రజియల్లాహు అన్హు వారింట్లో ఉన్నాడు. ఖుర్ఆన్ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు ఖుర్ఆన్ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి?’ అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్ అన్నాడుః బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడుః ‘ఉమర్! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అందిః “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్”. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.

ఉమర్ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పిందిః ‘నీ అపరిశుద్ధునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవపదంగా ఉంది, ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.

ఉమర్ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్! “అల్లాహ్ ఉమర్ బిన్ ఖత్తాబ్ లేదా అబూ జహల్ బిన్ హిషామ్ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.

ఆ తర్వాత ఉమర్ -రజియల్లాహు అన్హు- తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా రజియల్లాహు అన్హు ప్రజల గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్ అని వారన్నారు. అప్పుడు హంజా రజియల్లాహు అన్హు అన్నారుః ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.

సుహైబ్ రూమి రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః ‘ఉమర్ రజియ- ల్లాహు ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చో గలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్) చేయ గలిగాము’.

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః ‘ఉమర్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.

(13) ప్రవక్తను పురికొలిపే ముష్రికుల ప్రయత్నం

దినదినానికి ఇస్లాంలో ప్రవేశించే వారి సంఖ్యం పెరగడం మరియు ప్రజల్ని ఇస్లాం నుండి నిరోధించడానికి చేసే ప్రయత్నాలు ఫలించక పోవడాన్ని చూసి ముష్రికులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఇస్లాం ప్రచారం నుండి అడ్డుకోడానికి వేరే పన్నాగాలు పన్నడం మొదలు పెట్టారు. ఇదే పనిగా, మక్కా నాయకుల్లో ఒకడైన అబుల్ వలీద్ ఉత్బా బిన్ రబీఆ, మస్జిదె హరాంలో ఒంటరిగా కూర్చొని ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ఇలా మాటను ఆరంభించాడుః సోదర పుత్రుడా! నీవు నీ జాతి వారి వద్దకు ఓ పెద్ద ఆపద తెచ్చి పెట్టావు. దాని కారణంగా ఐక్యంగా ఉన్నవారిలో చీలికలు సృష్టించావు. వారి దేవతలను, వారి ధర్మాన్ని విమర్శించావు. వారి తాతముత్తాతలను అవిశ్వాసులని అన్నావు. అయితే నేను కొన్ని విషయాలు నీ ముందు ఉంచదలిచాను. వాటిలో ఏ కొన్నైనా నీవు స్వీకరిస్తావని ఆశిస్తున్నాను. అందుకు ప్రవక్త “చెప్పండి అబుల్ వలీద్! వింటాను” అని సమాధానం ఇచ్చారు.

నాయనా! నీవు తీసుకొచ్చిన ఈ కొత్త పద్ధతుల ద్వారా ఏదైనా ధనం కూడబెట్టాలని అనుకుంటే మేము నీ కొరకు ధనబండారాలు సమకూరుస్తాము. చివరికి నీవు మాలో అందరికన్నా ఎక్కువ ధనవంతునివి అయిపోతావు. లేదా ఈ పని ద్వారా నీవు గౌరవ, ప్రతిష్ఠలు సంపాదించాలనుకుంటే మేము నిన్ను మా నాయకునిగా ఎన్నుకుంటాము. ఇక ఏ పని కుడా నీ సలహా లేనిది చేయనే చేయము. ఒకవేళ నీవు గొప్ప అధికారాన్ని కోరుకుంటే మేము నిన్ను మాకు రాజుగా ఎన్నుకొని నీకు కిరీటం కడతాం. ఇవేమీ కాకుండా నీవు ఏవైనా దుష్కళలు కంటూ ఉంటే పేరుగాంచిన వైద్యులను రప్పించి నీకు వైద్యం చేస్తాము. నీ బాగుగోలు కొరకు ఎంత ధనమైనా వెచ్చిస్తాము. ఈ విషయాలన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్రద్ధగా, నిశబ్దంగా వింటున్నారు. ఉత్బా తన ప్రసంగం ముగించాడు. అప్పుడు ప్రవక్త అడిగారుః నీవు ముగించావా అబుల్ వలీద్? అవును నేను ముగించాను అని అతడన్నాడు. సరే, ఇక నా మాట వింటావా? అని ప్రవక్త అడిగారు. అవును అని అతడన్నాడు.

అప్పుడు ప్రవక్త ﷺ సూర ఫుస్సిలత్ లోని ఈ ఆయతులు పఠించారు.

[حم ، تَنْزِيلٌ مِنَ الرَّحْمَنِ الرَّحِيمِ ، كِتَابٌ فُصِّلَتْ آَيَاتُهُ قُرْآَنًا عَرَبِيًّا لِقَوْمٍ يَعْلَمُونَ، بَشِيرًا وَنَذِيرًا فَأَعْرَضَ أَكْثَرُهُمْ فَهُمْ لَا يَسْمَعُونَ]. {فصِّلت 1-4}.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం చేస్తూ పోతున్నారు. ఉత్బా రెండు అరచేతులు వెనక భూమికి ఆనించి తల భుజము పై పెట్టుకొని గమ్మున వింటు ఉన్నాడు. ప్రవక్తగారు 38వ ఆయతు వరకు పారాయణం చేసి అందులో సజ్దా ఆదేశం ఉండగా పారాయణం నిలిపి వేసి సజ్దా చేశారు. సజ్దా నుండి లేచి, “అబుల్ వలీద్! నీవు ఏదైతే విన్నావో విన్నావు. అదే నా సమాధానం, ఇక నీ ఇష్టం” అని అన్నారు.

ఉత్బా టక్కున లేచి తన మిత్రుల వద్దకు వెళ్ళాడు. ఇతని రాకను చూసినవారు ‘అల్లాహ్ సాక్షిగా! పోయేటప్పుడు ఉన్న అబుల్ వలీద్ ముఖం ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు లేదు’ అని పరస్పరం అనుకుంటున్నారు. వారి వద్ద కూర్చున్న వెంటనే ఒకడు అడిగాడు, నీ వెనక ఏమి జరిగింది అబుల్ వలీద్! అతడు ఇలా సమాధానమిచ్చాడుః వెనక జరిగినది ఏమిటంటే; అల్లాహ్ సాక్షిగా! నేను విన్నటువంటి మాట ఎన్నడూ వినలేదు. అది చేతబడి కాదు. మంత్రజాలం కాదు. కవిత్వము అసలే కాదు. ఖురైషులారా మీరు నా మాట వినండి. అతడ్ని అతని మానాన వదలండి. అల్లాహ్ సాక్షిగా! అతడు చెప్పిన ఏ మాట నేను విన్నానో అది ఒక సంచలనం సృష్టిస్తుంది. అరబ్బులో ఎవరైనా అతడ్ని హతమారుస్తే మీ పని వేరే వారితో పూర్తి అయిందన్న మాట. ఒక వేళ అతను అరబ్బులను జయించాడంటే అతని రాజ్యం మీ రాజ్యం, అతని గౌరవం మీ గౌరవం, అతని ఉనికి మీ కొరకే ఎక్కువగా అదృష్టవంతగా ఉంటుంది’. అప్పుడు వారన్నారుః అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ తన నోట నీపై కూడా మంత్రం చేసేశాడు. అతడన్నాడుః ‘ఇది నా అభిప్రాయం, ఇక మీకు ఇష్టమైనది మీరు చేయండి’.

(14) హబషా (ఇథియోపియా) వైపునకు వలస

ఎవరి ఇస్లాం విషయం తెలిసేదో వారి పట్ల సామాన్యంగా, బలహీనులయిన ముస్లింల పట్ల ప్రత్యేకంగా పెరుగుతున్న అవిశ్వాసుల హింసా దౌర్జన్యాల కారణంగా, తమ ధర్మాన్ని కాపాడుతూ హబషా వైపు -అక్కడ శాంతిస్థానం లభిస్తుందన్న నమ్మకంతో- (ఆ దేశ రాజు) నజ్జాషీ వద్ద వలసపోవుటకు అనుమతించవలసినదిగా ప్రవక్తతో సహాబాలు (ప్రవక్త అనుయాయులు, సహచరులు) కోరారు. ముఖ్యంగా అనేక మంది ముస్లిములు తమ పట్ల మరియు తమ సంతానం పట్ల ముష్రికులతో భయంగా ఉన్నందు వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వలసపోవుటకు వారిని అనుమతించారు. ఇది ప్రవక్త పదవి లభించిన తర్వాత ఐదవ యేట జరిగిన సంఘటన. అప్పుడు సుమారు 70 మంది ముస్లింలు తమ భార్యా పిల్లలతో సహా వలసపోయారు. వారిలో ఉస్మాన్ రజియల్లాహు అన్హు తమ ఇల్లాలు అనగా ప్రవక్త ప్రియ కూతురు రుఖయ్యా రజియల్లాహు అన్హా కూడా ఉన్నారు. అయితే మక్కా అవిశ్వాస ఖురైషులు, ముస్లిములు అక్కడ కూడా ప్రశాంతంగా ఉండకూడదన్న దురుద్దేశంతో నజ్జాషి వద్దకు కొందరిని రాయబారులుగా, కానుకలతో పంపారు. తమ దేశం నుండి పారిపోయి వచ్చిన వారిని తమకు అప్పగించ వలసిందిగా వారు రాజును కోరారు. అంతేకాదు, ముస్లిములపై రాజు మరింత ఆగ్రహించుకోవాలని, ముస్లింలు ఈసా -అలైహిస్సలాం- (యేసు క్రీస్తు) మరియు ఆయన తల్లిని దూషిస్తారని వారిపై అపనింద వేశారు. నజ్జాషీ ఈ విషయంలో ముస్లింలను మందలించాడు. అందుకు వారు ఈసా అలైహిస్సలాం (యేసు క్రీస్తు) గురించి ఖుర్ఆన్ ఏమంటుందనేది స్పష్టపరచి, ఆయన గురించి ఉన్న సత్యాన్ని వెల్లడించారు. తద్వారా ఖుర్ఆనులోని సూరె మర్యం (19వ అధ్యాయం) పారాయణం చేశారు. ఈ వివరాలన్నీ విన్నాక ముస్లింలను గౌరవించి, సత్కరించి వారు తన దేశంలో ప్రశాంతంగా ఉండండని తృప్తినిచ్చి, ఖురైషు రాయబారులను తరిమేశాడు. ముస్లింలను వారికి అప్పగించడం కాని పని అని స్పష్ట పరిచాడు.

ఇదే సంవత్సరంలోని రమజాను మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్దకు వెళ్ళి, అక్కడ సమూహమైన ఖురైషుల యదుట సూరె నజ్మ్ (53వ అధ్యాయం) పారాయణం మొదలెట్టారు. వారు ఎల్లప్పుడూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాటను వినకూడదని ఇతరులకు బోధ చేసేవారు గనక, స్వయంగా ఎప్పుడూ అల్లాహ్ వచనాలు (ఖుర్ఆన్ ఆయతులను) వినడానికి నోచుకోలేదు, గనక ఎప్పుడైతే ఈ సూరా పారాయణం వారికి హఠాస్తంభవించిందో, ఆకర్శించే శక్తి గల అల్లాహ్ వచనం వారి చెవులకు తట్టిందో, ప్రతీ ఒక్కడూ పూర్తి శ్రద్ధతో వినసాగాడు. దాన్ని వినడం తప్ప మరే ఆలోచనే లేకుండింది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం {ఫస్జుదూ లిల్లాహి వఅబుదూహ్} ఆయతు చదివారో స్వయంగా సజ్దా చేశారు. వారిలో ఏ ఒక్కడు కూడా తనకు తాను అదుపులో ఉంచుకోలేక సజ్దాలో పడిపోయాడు.

ఇస్లామీయ ప్రచారానికి విరుద్ధంగా ఖురైషులు అనేక పన్నాగాలు పన్నారు. తీవ్రమైన శారీరక బాధ కలిగించుట, హింసించుట, పీడించుట. బెదిరించుట, జడిపించుట. ప్రేరేపించుట. ఆశలు చూపుట, పురిగొల్పుట. ఇలా నానా రకాల అఘాయిత్యాలు జరిపారు. అయినా ఇవన్నీ విశ్వాసులకు ఇస్లాం ధర్మంపై మరింత స్థిరత్వాన్ని కలిగిస్తూ, విశ్వాసుల సంఖ్యలో హెచ్చింపే అవసాగింది.

ఖురైషులు ఇస్లాంను అణచడానికి సరికొత్త ఉపయాలు ఆలోచించేవారు. ఇప్పుడు మరో రకమైన ఎత్తుగడకై తమ మెదడుకు పదను పెట్టి ఓ నిర్ణయానికి వచ్చారుః ముస్లిములు మరియు బనీ హాషింలతో సంపూర్ణ సంఘ బహిష్కరణకై ఒక ఒప్పందం వ్రాసి, అందరూ దానిపై సంతకాలు చేసి, దాన్ని కాబాలో వేలాడగట్టారు. అంటే వారితో వ్యాపార లావాదేవీలు చేయరాదు, వివాహ సంబంధాలు, పెళ్ళి పేరంటాలు పెట్టుకోరాదు. అన్నపానియాల సరఫరా చేయరాదు. ఏలాంటి సహాయ సహకారాలు అందించరాదు. అప్పుడు ముస్లింలు గత్యంతరం లేక మక్కా నగరాన్ని విడిచి పెట్టి సమీపములో ఉన్న ఒక కనుమలో శరణు తీసుకున్నారు. దానినే షిఅబె అబీ తాలిబ్ (అబూ తాలిబ్ కనుమ) అంటారు. అక్కడ ముస్లిములు ఎంతో కష్టభూయిష్టమైన జీవితం గడిపారు. నానారకాలుగా ఆకలి బాధలకు గురయ్యారు. ధనవంతులు చాలా ధనం ఖర్చు పెట్టారు. ఖదీజ రజియల్లహు అన్హా తన పూర్తి ఆస్తిని ఖర్చు చేసింది. ఆ సందర్భంలో వ్యాదులు ప్రభలిపోయాయి. అందువల్ల చాలా మంది చస్తూ చస్తూ బ్రతికారు. అయినా ముస్లింలు మరియు బనీ హాషిం ఎంతో సహనం, స్థయిర్యంతో మూడు సంవత్సరాలు గడిపారు. ఏ ఒక్కరూ సత్య ధర్మం నుండి వెనుదిరగ లేదు. చివరికి ఖురైషులోని కొందరు పెద్దలు -బనీ హాషింలోని కొందరితో వారికి దగ్గరి సంబంధం ఉండింది- వారు ముందుకు వచ్చి, ఇక ఈ ఒప్పందం చెల్లబోదు, దాన్ని చింపేయ్యాల్సిందే అని ఖురైష్ నాయకుల ముందు తేల్చి చెప్పారు. అందువల్ల ఆ ఒప్పంద పత్రాన్ని తెప్పించి చూసె సరికి దాన్ని చెదలు తినియుంది. బిస్మికల్లా హుమ్మ అని అల్లాహ్ పేరు తప్ప ఏమీ మిగల లేదు. ఈ విధంగా ముస్లింములు, బనీ హాషిం క్లిష్ట సమయం గడిపి, మక్కా తిరిగి వచ్చారు.

కాని ఖురైషులు దౌర్జన్య వైఖరిలో ఏ మార్పు రాలేదు; ముస్లిముల మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడడం, ప్రజల్ని ప్రవక్త వద్దకు రాకుండా చేయడం, ఖుర్ఆన్ వినడం నుండి ఆపడం లాంటివి. అంతే కాదు అరబ్ నలువైపుల నుండి ఎవరు వచ్చినా, ఎక్కడా వారు ప్రవక్తతో కలసి ఇస్లాం స్వీకరిస్తారో అని భయపడేవారు. ఇలాంటి ఓ సంఘటన స్వయంగా తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః అతను తన జాతిలో పేరుగల నమ్మదగిన నాయకుడు. ఒకసారి మక్కా వచ్చాడు. కొందరు ఖురైషు పెద్దలు అతని వద్దకు వచ్చి ముహమ్మద్ – ﷺ – గురించి అతడ్ని బెదిరిస్తూ అతని మాటలు వినబోకండి, అతని దగ్గరికే వెళ్ళకండి, చేతబడి లాంటి మాటలు అతనివి. వాటి వల్ల తండ్రి కొడుకుల మధ్య, సోదరుల మధ్య, భార్యభర్తల మధ్య చీలికలు ఏర్పడుతాయి అని ఆరోపించారు. తుఫైల్ అంటాడుః అల్లాహ్ సాక్షిగా! మాటిమాటికి వారు చెప్పడం వల్ల, నేను అతనితో మాట్లాడనని మరియు అతని ఏ మాటను విన అని నిశ్చయించుకున్నాను. అయినా పోతూ పోతూ ఏదైనా మాట చెవులో పడుతుందేమో అని ముందే చెవులలో దూది పెట్టుకున్నాను.

ఆ తర్వాత మస్జిదె హరాంకు వెళ్ళాను. ప్రవక్త కాబా వద్ద నమాజులో ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. నేను దాని కొంత భాగం వినాలని అల్లాహ్ కూడా నిశ్చయించినట్లుంది. అయితే కొంత మేరకు విన్నాను. అప్పుడు నా మనుసులో నేను అనుకున్నాను; నేను ఓ కవిని, తెలివిగలవాడిని, మంచిని చెడు నుండి వేరుగా గుర్తించగలను. ఈ మనిషి మాట వినకుండా నన్ను అడ్డుకునేది ఏమిటని? అతడు ఏదైనా మంచి విషయం చెప్పాడా అంగీకరిస్తాను. చెడు చెప్పినట్లయితే వదిలేస్తాను. ఆయన అక్కడ ఉన్నంత సేపు నేను అక్కడే ఉండి, ఆయన తమ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఆయన వెనక వెనకే వెళ్ళాను. ఆయన ఇంట్లో ప్రవేశించాక తర్వాత నేనూ ప్రవేశించాను. అక్కడ ఆయనతో ఇలా విన్నవించుకున్నానుః ముహమ్మద్! -సల్లల్లాహు అలైహి వసల్లం- మీ జాతివారు మీ గురించి నన్ను చాలా భయపెట్టించారు. చివరికి నేను మీ మాట వినకూడదని చెవులలో దూది పెట్టుకున్నాను. అయితే అల్లాహ్ మాత్రం నేను వినాలని నిర్ణయించాడు. అందుకు చాలా మంచి మాటలు విన్నాను. మీ విషయం ఏమిటో మీరే స్వయంగా చెబుతే బావుంటుంది. అప్పుడు ఆయన ఇస్లాం గురించి నాకు తెలిపాడు. ఖుర్ఆన్ పారాయణం చేసి వినిపించారు. అల్లాహ్ సాక్షిగా! దాని కంటే ఉత్తమమైన మాట గాని మరియు న్యాయమైన విషయం గాని నేను ఎప్పుడూ వినలేదు. అప్పుడే నేను ఇస్లాం స్వీకరించాను. సత్యం యొక్క సాక్ష్యం పలికాను.

ఆ తర్వాత తుఫైల్ తమ జాతివారి వద్దకు వెళ్ళి వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించి, దాని గురించి వివరాలు ఇవ్వగలిగారు. దాని ఫలితంగా వారి కుటుంబికులు ఇస్లాం స్వీకరించారు. తర్వాత వారి జాతివారిలో కూడా ఇస్లాం ప్రచారం చాలా మంచి విధంగా జరిగింది.

(15) దుఃఖ సంవత్సరం

ప్రవక్త బాబాయి అబూ తాలిబ్ పూర్తి శరీరంలో తీవ్రమైన వ్యాది సోకింది. అతడు మంచం పట్టాడు. కొద్ది రోజుల్లో సక్రాత్ (మరణవేధన)కు గురయ్యాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని తలకడన కూర్చున్నారు. చివరి గడియలో మరణానికి ముందు అతను “లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికితే బావుండునని ఆశిస్తున్నారు. కాని అతని చుట్టూ ఉన్న అతని దుష్ట స్నేహితులు, ప్రత్యేకంగా వారి నాయకుడు అబూ జహల్, వారందరూ లాఇలాహ ఇల్లల్లాహ్ చదవనిస్తలేరు. నిరాకరించడమే కాకుండా, “ఏమీ నీవు నీ తాత ముత్తాతల ధర్మాన్ని విడనాడుతావా? అబ్దుల్ ముత్తలిబ్ మతాన్ని త్యజిస్తావా? అని నిందిస్తున్నారు. చివరికి అబూ తాలిబ్ షిర్క్ పై చని పోయాడు. అవిశ్వాసుడై మరణించినందుకు ప్రవక్త దుఃఖం అధికమైంది. ప్రవక్త ఈ బాధ నుండి కోలుకోక ముందే సుమారు రెండు నెలలకే ఆయన ప్రియమైన పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా పరమపదించారు. అందువల్ల ప్రవక్త అమితంగా దుఃఖించారు. పరోక్షంగా సహాయం అందిస్తూ వచ్చిన అబూ తాలిబ్ మరియు జీవితాంతం తన కష్టాల్లో పాలుపంచుకొని, ప్రోత్సహించే సతీమణి ఖదీజాల మరణానంతరం అవిశ్వాసుల అఘాయిత్యాలు ప్రవక్తపై మరింత ఎక్కువయ్యాయి. (అయినా ప్రవక్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ధర్మ ప్రచారంలో నిమగ్నులయ్యారు).

ప్రవక్త పిలుపును అంగీకరించిన వారిలో అనేకులు బడుగువర్గానికి సంబంధించినవారు మరియ బానిసలు ఉండిరి. సామాన్యంగా ప్రతి కాలంలో ప్రవక్తల పిలుపును అంగీకరించేవారు వీరే ఉండేవారు. ఎందకనగా ఎవరినైనా అనుసరించడం వారికి కష్టతరమేమీ కాదు. కాని పెద్దలుగా చెలామణి అయినవారిని మరియు హోదా అంతస్తులు గలవారిని గర్వం, ఈర్ష్య, హోదాఅంతస్తుల ప్రేమ వైగారాలు సత్యం, ధర్మం పట్ల విధేయతకు అడ్డుగా ఉంటాయి మరియు ఇతరులకు అనుసరులుగా ఉండేందుకు ఆటంకం కలిగిస్తాయి.

(16) ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకొనుటకు ముష్రికుల కుట్రలు

ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకొనుటకు ముష్రికులు వివిధ పద్ధతులు అనుసరించారు. ఇస్లాం వ్యాప్తిని ఓ హద్దులో ఉంచుటకు విభిన్న మార్గాలు అవలంబించారు. ప్రజల్ని సత్యధర్మం నుండి ఆపడానికి శతవిధాల ప్రయత్నించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవిః

1. బెదిరింపులుః ఖురైషు నాయకులు కొందరు ప్రవక్తగారి పెదనాన్న అబూ తాలిబ్ వద్దకు వచ్చి ‘ముహమ్మద్ మాకు చాలా బాధ కలిగిస్తున్నాడు, మా దైవాలను విమర్శిస్తున్నాడు. మీరు అతడ్ని ఈ చేష్టల నుండి ఆపండి’ అని అన్నారు. అతను ప్రవక్తను రప్పించి, “నాయనా! నీవు వారికి బాధ కలిగిస్తున్నావని, వారి దైవాలను విమర్శిస్తున్నావని నీ చిన్నాన్న కొడుకులు అంటున్నారు. దీనిని మాకనుకోరాదు నాన్న”. దీనికి సమాధానంగా ప్రవక్త సూర్యుని వైపు సైగ చేసి దీని ఏదైనా ఒక జ్వాలను నా చేతిలో పెట్టినా నేను వీరి కొరకు నా ప్రచార కార్యక్రమాన్ని విడనాడ లేను. అప్పుడు అబూ తాలిబ్ చెప్పాడః నా కొడుకు అబద్ధం పలుకలేదు. అతడ్ని అతని మానన వదలండి.

2. అపనిందలుః ప్రవక్త పిచ్చివాడని, చేతబడి చేయువాడని, అబద్ధం పలికేవాడని మరియు పాతకాలపునాటి కట్టుకథలు తెచ్చువాడని అపనిందలు మోపారు. (వీటి సాక్ష్యాధారాలు ఖుర్ఆన్ లోనే ఉన్నాయి).

3. ఎగతాళి చేయడం, పరిహసించడం మరియు నవ్వడం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహచరులతో ఎగతాళి చేసేవారు, మరియు వారి దగ్గరి నుండి దాటినప్పుడు పరిహసించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల కించపరిచే మాటలు మాట్లాడేవారు. బలహీన వర్గానికి సంబంధించిన వారితో ఎప్పుడైనా ప్రవక్తను చూసినట్లైతే వీరేనా ఇతని అనుచరులు అని హేళన చేసేవారు.

4. ప్రవక్త బోధనలను వికృతంరూపమివ్వడం, సందేహాలు లేపడం, అసత్య వదంతుల వ్యాపింపజేయడం: ఖుర్ఆన్ కేవలం కొన్ని కట్టుకథల పుస్తకం మాత్రమే అని ఆరోపించేవారు. ఒక మనిషి ఇతనికి నేర్పుతున్నాడని ఆరోపించేవారు.

5. చితకబాదడం: ప్రవక్తను మరియు సహచరులను సత్యధర్మం నుండి ఆపడానికి పై ప్రయత్నాలు ఫలించనందు వల్ల శారీరక ఇబ్బందులు కలిగించే వారు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్ర్ లో నమాజ్ చేస్తుండగా ఉఖ్బా బిన్ అబీ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖబా భూజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారుః {ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?}.

ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్, వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూః ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటె ను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగోల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.

ఒక రోజు అబూ జహల్ అన్నాడుః ముహమ్మద్ ను నేను నమాజు చేస్తూ చూశానా (అతను సజ్దాలో పోయినప్పుడు) అతని మెడ మీద కాలు పెట్టి తొక్కుతాను అతని మూతి మీద మట్టి విసురుతాను. వాడనుకున్నట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేయుటకు వచ్చారు. వచ్చిరాగానే నమాజు మొదలుపెట్టారు. మెడను కాలుతో తొక్కాలని నిశ్చయించుకున్నవాడు, తన మీద చేయబడుతున్న దాడి నుండి తన్నుతాను కాపాడుకొంటున్నట్లు రెండు చేతులు మీదికి ఎత్తి టక్కున వెనక్కి తిరగాడు. నీకెమయింది అబుల్ హకం అని వారు అడుగుతే నాకు మరియు ముహమ్మదుకు మధ్య ఒక అగ్ని కందకము ఉండినది. (నేను ఏ కొంచం ముందుకు వెళ్ళినా దానికి ఆహుతి అయి పోయేవాణ్ణి అని చెప్పాడు).

6. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను బాధించడం: ప్రవక్త సల్లల్లాహ అలైహి వసల్లం సహచరులను బాధ కలిగించే, వారిని కఠినంగా శిక్షించేవారు. కొందరు బలహీన బానిసలను త్రాళ్ళతో కట్టి మండే ఎండలో వదిలేసేవారు. ఇంకెన్నో విధాలుగా పీడించేవారు.

అమ్మార్ రజియల్లాహు అన్హు మరియు అతని తల్లదండ్రిని నానారకాలుగా శిక్షించారు. చివరికి అతని తల్లిని ఘోరమైన విధంగా హత్య చేశారు. అతని తండ్రి కూడా అనేక రకాల శిక్షలను భరించలేక ప్రాణం కోల్పోయాడు. వారు ఖబ్బాబ్ బిన్ అరత్త్ రజియల్లాహు అన్హు యొక్క వెంట్రుకలు పట్టి లాగేవారు. అతని మెడను వడిబెట్టేవారు. మండుటెండలో దగదగ మండే పెద్ద బండపై పరుండబెట్టి దాని వెడిని భరించక కదలకుండా ఛాతిపై మరో పెద్ద బండ పెట్టేవారు. అలాగే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించినప్పుడు అతనిపై కూడా దౌర్జన్యం చేసి అతని హత్యాయత్నం చేశారు.

(17) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాయిఫ్ లో

ముస్లిముల పట్ల ఖురైషుల తలబిరుసుతనం, హింసా దౌర్జన్యాలు, వారిని అణచివేసే ప్రయత్నాలు మితిమీరుతున్నందు వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ ప్రయాణం చేస్తే బావుంటుందని ఆలోచించారు. అల్లాహ్ వారికి ఇస్లాం భాగ్యం ప్రసాదించవచ్చు. అయితే తాయిఫ్ ప్రయాణం సులభమేమీ కాదు. తాయిఫ్ చుట్టూ ఎత్తయినా పర్వతాలు, వాటి మధ్యలో చిక్కు దారిన ప్రయాణించడం చాలా కష్టం. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాహసించి అక్కడికి చేరుకున్నారు. తాయిఫ్ వాసుల ఎదురుకోలు, వారి సమాధానం మంచి విధంగా లేకుండింది. వారు ఆయన మాటను ఆలకించకనే తరిమివేశారు. అంతే కాదు, తుంటరి కుర్రగాళ్ళను ప్రేరేపించారు, ప్రవక్త తిరిగి వెళ్తున్నప్పుడు వారు ఆయనపై రాళ్ళు రువ్వారు. దాని వల్ల ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమయి, అది పాదరక్షల్లో నిలిచిపోయి చెప్పులు తీయడం కష్టమైంది. ప్రవక్తగారు కుంగిపోయి, దుఃఖిస్తూ(1) తిరిగి మక్కా వెళ్తుండగా జిబ్రీల్ అలైహిస్సలాం, పర్వతాల దూతతో ఎదురయి, ” మీ ఇష్ట ప్రకారం అతనికి ఆదేశించుటకు అల్లాహ్ మీ వైపు పర్వతాల దూతను పంపాడు” అని చెప్పాడు.

అప్పుడు పర్వతాల దూత మాట్లాడుతూః “ఓ ముహమ్మద్! నీవు ఇష్టపడితే (మక్కాను ఆవరించుకొని ఉన్న) ఈ రెండు కొండల్ని వారిపై పడవేస్తాను” అని చెప్పాడు. కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “వద్దు, వీరుగాకున్నా వీరి సంతానంలో కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి ఆయనతో ఎవరినీ సాటి కల్పించని వారిని అల్లాహ్ పుట్టిస్తాడని నాకు ఆశవుంది”.

[1] వారి దుష్పవర్తన వల్ల కాదు, ఇస్లాం స్వీకరించనందుకు

(18) చంద్రమండలం రెండు ముక్కలగుట

ముష్రికుల వ్యెతిరేకత, పోరాటాల్లో ఒక రకం; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లొంగదీయాలన్న ఉద్దేశ్యంతో మహిమలు కోరడం. అనేకసార్లు వారు మహిమలు చూపమని కోరారు. అయితే ఒకసారి చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చేసి చూపించాలని కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తో వేడుకున్నారు. అల్లాహ్ వారికి ఈ మహిమ చూపించాడు. ఖురైషులు చంద్రుని రెండు ముక్కల్ని వేరు వేరుగా చూశారు. చాలా సేపటి వరకు చూశారు. అయినా ఇస్లాం స్వీకరించలేదు. ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- మాపై మంత్రం చేశాడని వదంతి లేపారు. వారిలోని ఒక మనిషి వారికి ఇలా చెప్పాడుః ముహమ్మద్ మంత్రం చేసియుంటే అందరిపై చేయలేడు కదా, అయితే వేచించండి, ఏదైనా బిడారము వస్తే వారిని అడగవచ్చు, అంతలోనే ఒక బిడారము వచ్చింది. వారిని ప్రశ్నించారు. అవును మేము చూశామని వారు చెప్పారు. అయినా ఖురైషులు మొండివైఖరి అవలంభించి తమ అవిశ్వాసంపైనే ఉండిపోయారు.

(19) ఇస్రా, మేరాజ్ (గగన ప్రయాణం)(1)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెదనాన్న అబూ తాలిబ్ మరియు పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాల మరణం, తాయిఫ్ నుండి తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటన, ఆ తరువాత ఖురైషుల హింసాదౌర్జన్యాల హెచ్చింపు ఇవన్నీ ఒకటెనుకొకటి సంభవించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక రకాల బాధలు అనుభవిస్తున్న సందర్భంలో అల్లాహ్ వైపు నుండి ఆయన మనసుకు నెమ్మది, తృప్తి, శాంతి ప్రసాదించబడే రోజు ఆసన్నమయింది. ఆ రోజు రాత్రి ప్రవక్త ﷺ నిద్రిస్తున్న

[1] మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు ప్రయాణాన్ని “ఇస్రా” అని, అక్కడి నుండి గగన ప్రయాణాన్ని “మేరాజ్” అని అంటారు.

వేళ జిబ్రీల్ అలైహిస్సలాం “బురాఖ్” తీసుకొని వచ్చారు. దాని పోలిక గుఱ్ఱం లాంటిది. దానికి రెండు రెక్కలు. మెరుపు లాంటి దాని వేగం. దానిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను సవారి చేయించుకొని ఫాలస్తీనా దేశంలో బైతుల్ మఖ్దిస్ వెళ్ళారు. అక్కడి నుండి గగన ప్రయాణము చేసి పోషకుడైన అల్లాహ్ యొక్క చాలా నిదర్శనాలు చూశారు. అక్కడే ఐదు పూటల నమాజు విధి అయ్యింది. అదే రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశాంత హృదయంతో, దృఢ విశ్వాసంతో తిరిగి వచ్చారు. ఈ విషయాన్నే అల్లాహ్ ఇలా తెలిపాడుః

{కొన్ని నిదర్శనాలు చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదె హరాం నుండి మస్జిదె అఖ్సా వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. నిజానికి ఆయనే అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడునూ}. (బనీ ఇస్రాయీల్ 17: 1).

ఉదయం కాబా వద్దకు వచ్చి, రాత్రి జరిగిన సంఘటన ప్రజల ముందు చెప్పగా అవిశ్వాసులు పరిహసించి, ఘోరంగా తిరస్కరించారు. కొందరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లొంగదీయాలనే ఉద్దేశంతో బైతుల్ మఖ్దిస్ గురించి వర్ణించవలసినదిగా కోరారు. ప్రవక్త దానిలోని ఒక్కొక్క వస్తువును గురించి వివరించారు. ఇంతటి సూక్ష్మమైన వర్ణనతో ముష్రికులు తృప్తి చెందక మరో నిదర్శన అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నేను దారిలో ఒక బిడారాన్ని చూశాను. అది మక్కా వైపు వస్తుంద”ని చెప్పి, వారి ఒంటెల సంఖ్య, వారు ఇక్కడికి చేరుకునే సమయంతో సహా అన్ని వివరాలిచ్చారు. ప్రవక్త మాట / సూచన నూటికి నూరు పాల్లు నిజం అయింది. కాని అవిశ్వాసులు సత్యపరిచేకి బదులుగా, సత్యతిరస్కారం, తలబిరుసుతనంలోనే ఉండిపొయ్యారు.

ఇస్రా మరియు మేరాజ్ తరువాత రోజు జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త వద్దకు వచ్చి, ఐదు నమాజుల విధానం, వాటి సమయాలు తెలియజేశారు. అంతకు ముందు ఉదయం రెండు రకాతులు, సాయంకాలం రెండు రకాతుల నమాజు మాత్రమే ఉండినది.

ఖురైషుల పోరు రోజురోజుకు పెర్గుతూ పోతుంది. వారు సత్యం నుండి దూరమే అవుతున్నారు. ఆ సమయాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర ప్రాంతాల నుండి మక్కా వచ్చేవారికి ఇస్లాం ధర్మాన్ని తెలుపడంపై ఎక్కువ దృష్టి సారించారు. వారి నివాసాల్లో, వారు మజిలి చేసే చోట వారితో కలసి క్లుప్తంగా ఇస్లాం గురించి వివరించేవారు. ప్రవక్త పిన తండ్రి అబూ లహబ్ ఆయన -ﷺ- వెంట తిరుగుతూ ఆయన గురించి, ఆయన ప్రచారం గురించి ప్రజల్ని బెదిరించేవాడు.

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నుండి వచ్చి మజిలి చేసిన కొందరితో కలిసి వారిని అల్లాహ్ వైపు పిలిచారు. వారు ఆయన మాటలను శ్రద్ధగా విని, ఆయన్ను విశ్వసించి, అనుసరిస్తామని వారు ఏకీభవించారు. అయితే ఒక ప్రవక్త రానున్నాడు, అతని ఆగమన కాలం సమీపించిందని వారు ఇంతకు ముందే యూదులతో వినేవారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి ఇస్లాం బోధ చేశారో, యూదులు చెప్పే మాట గుర్తొచ్చి, ఆ ప్రవక్త ఈయనే అని తెలుసుకొని, ఈయన్ని విశ్వసించడంలో యూదులు మనకంటే ముందంజం వేయకూడదని వారు పరస్పరం అనుకొని తొందరగా విశ్వసించారు. వారు ఆరుగురు. ఆ తరువాత సంవత్సరం పన్నెండు మంది ప్రవక్తతో కలసి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకున్నారు. వారు తిరిగి మదీన వెళ్ళేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హును వారితో పంపారు. అతను వారికి ఖుర్ఆన్ నేర్పాలని మరియు ఇస్లాం ధర్మాదేశాలు బోధించాలని. అతను అక్కడి సమాజంపై మంచి ప్రభావం వేయగలిగారు. అంటే మదీనవాసులు అతని ప్రచారం పట్ల ఆకర్శితులయ్యే విధంగా అతను అక్కడ ఉండి ఇస్లాం బోధించగలిగారు. ఒక సంవంత్సరం తర్వాత అతను మక్కా వచ్చేటప్పుడు తన వెంట 72 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిశారు. అల్లాహ్ ధర్మ సహాయానికి ఎల్లవేళల్లో సిద్ధమేనని వారు శపథం చేసి తిరిగి మదీన వెళ్ళిపోయారు.

(20) కొత్త ప్రచారం కేంద్రం

మదీన పట్టణం ఇస్లాం మరియు ముస్లింలకు మంచి ఆశ్రయం, శాంతి స్థానంగా అయ్యింది. అక్కడికి మక్కా పీడిత ముస్లిముల హిజ్రత్(1) మొద లయ్యింది. ముస్లిములను హిజ్రత్ చేయనివ్వకూడదని ఖురైషు గట్టి పట్టు పట్టారు. హిజ్రత్ చేయబూనిన కొందరు ముస్లిములు నానా రకాల హింసా దౌర్జన్యాలకు గురయ్యారు. అందుకు ముస్లిములు రహస్యంగా హిజ్రత్ చేసేవారు. అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో అనుమతి కోరినప్పుడల్లా “తొందరపడకు, బహుశా అల్లాహ్ నీకొక ప్రయాణమిత్రుడు నొసంగవచ్చును” అని చెప్పేవారు. చివరికి చాలా మంది ముస్లిములు హిజ్రత్ చేశారు.

ముస్లిములు ఈ విధంగా హిజ్రత్ చేసి, మదీనలో వెళ్ళి స్థానం ఏర్పరుచుకుంటున్న విషయాన్ని చూసి ఖురైషులకు పిచ్చెక్కి పోయింది. అంతే కాదు, ముహమ్మద్ -ﷺ- ప్రతిష్ఠ, ఆయన ప్రచారం దినదినానికి వృద్ధి చెందుతున్నది చూసి వారు భయం చెందారు. అందుకని వారందరూ

1 హిజ్రత్ అంటే వలసపోవుట. అంటే తన స్వగ్రామంలో ఇస్లాం ధర్మ ప్రకారం జీవితం గడపడం కష్టతరమైతే, దాన్ని వదిలి వేరే ప్రాంతానికి ప్రయాణమగుట.

కలసి సమాలోచన చేసి ప్రవక్తను హతమార్చాలని ఏకీభవించారు. అబూ జహల్ ఇలా చెప్పాడుః మనం ప్రతి తెగ నుండి శక్తివంతుడైన ఒక యువకునికి కరవాలం ఇవ్వాలి. వారందరూ ముహమ్మదును ముట్టడించి, అందరు ఒకేసారి దాడి చేసి సంహరించాలి. అప్పుడు అతని హత్యానేరం అన్ని తెగలపై పడుతుంది. బనీ హాషిం అందరితో పగతీర్చుకొనుటకు సాహసించలేరు అని పథకం వేశారు. వారి ఈ పథకం, దురాలోచన గురించి అల్లాహ్ ప్రవక్తకు తెలియ జేశాడు. అల్లాహ్ అనుమతిని అనుసరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ బక్ర్ రజియల్లాహు అన్హుతో హిజ్రత్ కొరకు సిద్ధమయ్యారు. అలీ రజియల్లాహు అన్హును పిలిచి, ఈ రాత్రి నీవు నా పడకపై నిద్రించు, (నీకు ఏ నష్టమూ కలగదు). చూసే వారికి నేనే నిద్రిస్తున్నానన్న భ్రమ కలుగుతుంది అని చెప్పారు.

అవిశ్వాసులు తమ పథకం ప్రకారం, ప్రవక్త ఇంటిని చుట్టుముట్టారు. అలీ రజియల్లాహు అన్హును నిద్రిస్తున్నది చూసి ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అని భ్రమపడ్డారు. ఆయన బైటికి వచ్చిన వెంటనే ఒకే దాడిలో హత్య చేయాలని ఆయన రాక కొరకు ఎదిరి చూస్తున్నారు. వారు ముట్టడించి కాపుకాస్తున్న వేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య నుండి వెళ్ళారు. వారి తలలపై మన్ను విసురుతూ అక్కడి నుండి వెళ్ళారు. అల్లాహ్ వారి చూపులను పట్టుకున్నాడు. ప్రవక్త వారి ముందు నుండి దాటింది వారు గ్రహించలేక పోయారు. అక్కడి నుండి ప్రవక్త అబూ బక్ర్ రజియల్లాహు అన్హు వద్దకెళ్ళి, ఇద్దరూ కలసి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న సౌర్ గుహలో దాగి పోయారు. అటు ఖురైషు శక్తిశాలి యువకులు తెల్లారే వరకు నిరీక్షిస్తునే ఉండిపోయారు. తెల్లారిన తర్వాత ప్రవక్త పడక నుండి అలీ రజియల్లాహు అన్హు లేచి, వీరి చేతిలో చిక్కాడు. ప్రవక్త గురించి అడిగారు. అలీ రజియల్లాహు అన్హు ఏమీ చెప్ప లేదు. అతన్ని పట్టి లాగారు, కొట్టారు, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఖురైషులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెతకడానికి అన్ని దిక్కులా అన్వేషీలను పంపారు. ఆయన్ని జీవనిర్జీవ ఏ స్థితిలో పట్టు కొచ్చినా, అతనికి 100 ఒంటెల బహుమాణం అని ప్రకటించారు. కొందరు అన్వేషీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన మిత్రుడు ఉన్న గుహ వద్దకు చేరుకున్నారు. వారిలో ఏ ఒక్కడైనా వంగి తన పాదాల్ని చూసుకున్నా, వారిద్దర్ని చూసేవాడు. అందుకు అబూ బక్ర్ రజియల్లాహు అన్హు (ప్రవక్త పట్ల) కంగారు పడ్డారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా ధైర్యం చెప్పారుః “అబూ బక్ర్! ఏ ఇద్దరికి తోడుగా మూడోవాడు అల్లాహ్ ఉన్నాడో వారి గురించి నీకు రందేమిటి. దిగులు పడకు అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు”. వాస్తవంగా వారు ఆ ఇద్దరిని చూడలేదు కూడా. మూడు రోజుల వరకు అదే గుహలో ఉండి, మదీనాకు బయలుదేరారు. దూర ప్రయాణం, మండే ఎండలో ప్రయాణం సాగుతూ రెండవ రోజు సాయంకాలం ఒక గుడారం నుండి వెళ్ళుచుండగా అక్కడ ఉమ్మె మఅబద్ పేరుగల స్త్రీ ఉండెను. నీ వద్ద తిను త్రాగటకు ఏమై నా ఉందా అని ఆమెతో అడిగారు. నా వద్ద ఏమీ లేదు. ఆ మూలన బలహీన మేక ఉంది. మందతో పాటు నడవలేకపోతుంది. దానిలో పేరుకు మాత్రం పాలు కూడా లేవు అని చెప్పింది. పిదప ఆమె అనుమతి మేరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మేక వద్దకు వెళ్ళి దాని పొదుగును చెయితో తాకగానే అందులో పాలు వచ్చేశాయి. పెద్ద పాత్ర నిండ పాలు పితికారు. ఉమ్మె మఅబద్ మరీ ఆశ్చర్యంగా ఒక వైపు నిలుచుండి బిత్తర పోయింది. ఆ పాలు అందరూ కడుపు నిండా త్రాగారు. మరో సారి పాత్ర నిండా పితికి, ఉమ్మె మఅబద్ వద్ద వదిలి, ప్రయణమయ్యారు.

మదీనవాసులు ప్రతీ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎదిరి చూస్తూ మదీన బైటికి వచ్చేవారు. ప్రవక్త మదీన చేరుకునే రోజు సంతోషం తో, స్వాగతం పలుకుతూ వచ్చారు. మదీన ప్రవేశంలో ఉన్న ఖుబాలో మజిలి చేశారు. అక్కడ నాలుగు రోజులున్నారు. మస్జిదె ఖుబా పునాది పెట్టారు. ఇది ఇస్లాంలో మొట్టిమొదటి మస్జిద్. ఐదవ రోజు మదీన వైపు బయలుదేరారు. అన్సారులో అనేక మంది ప్రవక్త ఆతిథ్య భాగ్యం తనకే దక్కాలని చాలా ప్రయత్నం చేసేవారు. అందుకని ప్రవక్త ఒంటె కళ్ళాన్ని పట్టుకునేవారు. అయితే ప్రవక్త వారికి ధన్యావాదాలు తెలుపుతూ, వద లండి! దానికి అల్లాహ్ ఆజ్ఞ అయిన చోటనే కూర్చుంటుంది అని చెప్పే వారు. అది అల్లాహ్ ఆజ్ఞ అయిన చోట కూర్చుంది. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దిగలేదు. మళ్ళీ లేచీ కొంత దూరం నడిచింది. తిరిగి వచ్చి మొదటి ప్రాంతంలోనే కూర్చుంది. అప్పుడు ప్రవక్త దిగారు. అదే ప్రస్తుతం మస్జిదె నబవి ఉన్న చోటు. ప్రవక్త అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లా హు అన్హు వద్ద ఆతిథ్యం స్వీకరించారు. అటు అలీ రజియల్లాహు అన్హు ప్రవక్త వెళ్ళాక మూడు రోజులు మక్కాలో ఉండి, ఆ మధ్యలో ప్రవక్త వద్ద ఉన్న అమానతులు హక్కుదారులకు చెల్లించి మదీనకూ బయలు దేరాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుబాలో ఉండగా అక్కడికి వచ్చి కలుసుకున్నాడు.

(21) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో

ఒంటె కూర్చున్న స్థలాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని యజమానుల నుండి ఖరీదు చేసి అక్కడ మస్జిద్ నిర్మించారు. ముహాజి రీన్ మరియు అన్సారుల(1) మధ్య సోదర బాంధవ్యం ఏర్పరిచారు. ఒక్కో ముహాజిరును ఒక్కో అన్సారుతో కలిపి ఇతడు నీ సోదరుడు తన సొమ్ము లో కూడా నీ భాగమని తెలిపారు. ముహాజిరులు అన్సారులు కలసి పని చేసుకోవడం మొదలెట్టారు. వారి మధ్య సోదర బాంధవ్యం మరీ గట్టిపడింది.

[1] మదీనకు వలస వచ్చిన వారిని ముహాజిరీన్ అంటారు. వారి సహాయం చేసిన మదీన వాసులను అన్సార్ అంటారు.

మదీనాలో ఇస్లాం విస్తృతం కావడం మొదలయింది. కొందరు యూదులు ఇస్లాం స్వీకరించారు. వారిలో ఒకరు అబ్దుల్లాహ్ బిన్ సలాం రజియల్లాహు అన్హు. ఇతను వారిలో ఒక పెద్ద పండితుడు. మరియు వారి పెద్ద నాయకుల్లో ఒకరు.

ముస్లిములు మక్కా నగరాన్ని వదలి వెళ్ళినప్పటికీ వారికి వ్యతిరేకంగా ముష్రికుల విరోధం, పోరాటం సమాప్తం కాలేదు. ఖురైషులకు మదీన యూదులతో ముందు నుండే సంబంధం ఉండెను. అయితే వారు దాన్ని ఉపయోగించి ముస్లిముల

మధ్యగల ఐక్యతను భంగం కలిగించాలని, తృప్తిగా ఉండనివ్వకుండా మనోవ్యదకు గురి చేయాలని యూదులను ప్రేరేపించేవారు. అంతే కాదు, వారు స్వయంగా ముస్లిములను బెదిరిస్తూ, అంతమొందిస్తామని హెచ్చరించేవారు. ఈ విధంగా ముస్లిములకు ముప్పు ఇరువైపులా చుట్టుముట్టింది. అంటే మదీన లోపల ఉన్నవారితో మరియు బైటి నుండి

ఖురైషులతో. సమస్య ఎంత గంభీరమైనదంటే సహాబాలు ఆయుధాలు తమ వెంట ఉంచుకొని రాత్రిళ్ళు గడిపేవారు. ఈ భయాందోళన సందర్భంలోనే అల్లాహ్ యుద్ధానికి అనుమ తించాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గస్తీ దళాల్ని తయారు చేసి పంప సాగారు. వారు చుట్టు ప్రక్కల్లో శత్రువులపై దృష్టి ఉంచేవారు. ఒక్కోసారి వారి వ్యాపార బృంధాలను అడ్డుకునేవారు. వీటి ఉద్దేశం: ముస్లిములు అశక్తులు కారు అని తెలియజేయుటకు, వారిపై ఒత్తిడి చేయుటకు, ఇలా వారు సంధికి దిగి వచ్చి, ముస్లిములు స్వేచ్ఛగా ఇస్లాంపై ఆచరిస్తూ, దాని ప్రచారం చేసుకోవడంలో వారు అడ్డు పడకూడదని. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్కలో ఉన్న తెగలవారితో ఒప్పందం, ఒడంబడికలు కుదుర్చుకున్నారు.

(22) బద్ర్ యుద్ధం

ముస్లిములు మక్కాలో ఉన్నప్పుడు ముష్రికులు వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి చివరికి తమ స్వస్థలాన్ని వదలి వలస వెళ్ళే స్థితికి తీసుకొచ్చారు (అన్న విషయం తెలిసినదే). అందువల్ల వారు తమ జన్మస్థలాన్ని, తమ ధనాన్ని మరియు తమవారిని వదలి మదీనా వచ్చారు. అప్పుడు ముష్రికులు వారి ధనాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు ఇటు మదీనా వాసులపై దొంగ దాడులు చేస్తూ తృప్తిగా ఉండకుడాం చేయసాగారు.

అందుకే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరియా నుండి వస్తున్న ఖురైషు వాణిజ్య బృందాన్ని అడ్డుకొని, వారిని అదుపులో మరియు భయంలో ఉంచాలని నిశ్చయించి, 313 మంది సహాబాలతో కలసి వెళ్ళారు. అప్పుడు వారి వద్ద రెండు గుఱ్ఱాలు, 70 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఖురైషు బృందంలో 1000 ఒంటెలున్నాయి. 40 మంది ఉన్నారు. అబూ సుఫ్యాన్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు. కాని మస్లిములు అడ్డుకునే విషయాన్ని అబూ సుఫ్యాన్ గ్రహించి, ఈ వార్త మక్కా పంపుతూ, వారితో సహాయం కోరాడు. అంతే కాదు, అతడు తన బృందంతో ప్రధాన రహదారిని వదిలేసి వేరే దొడ్డిదారి గుండా వెళ్ళిపోయాడు. ముస్లిములు వారిని పట్టుకోలేక పోయారు. అటు వార్త తెలిసిన మక్కా ఖురైషులు, 1000 యుద్ధవీరులతో పెద్ద సైన్యం తయారు చేసుకొని బయలుదేరారు. వీరు దారిలో ఉండగానే అబూ సుఫ్యాన్ రాయబారి వచ్చి, వాణిజ్య బృందం ముస్లిముల నుండి తప్పించుకొని, క్షేమంగా చేరుకోనుంది. మీరు తిరిగి మక్కా వచ్చేసెయ్యండి అని చెప్పాడు. కాని అబూ జహల్ నిరాకరించాడు. తిరిగి మక్కా పోవడానికి ఒప్పుకోలేదు. ప్రయాణం ముందుకు సాగిస్తూ బద్ర్ వైపు వెళ్ళాడు.

ఖురైషు సైన్యం బయలుదేరిన విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసిన తర్వాత తమ సహచరులతో సమాలోచన చేశారు. అందరూ అవిశ్వాసులతో పోరాడుటకు సిద్ధమేనని ఏకీభవించారు. రెండవ హిజ్రి శకం, రమజాను మాసములోని ఒక రోజు రెండు సైన్యాలు పోరాటానికి దిగాయి. ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ముస్లింలు విజయం పొందారు. వీరిలో 14 మంది సహాబాలు షహీదు (అమరవీరు) లయ్యారు. ముష్రికుల్లో 70 మంది వధించబడగా, మరో 70 మంది ఖైదీలయ్యారు.

ఈ యుద్ధ సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూతురు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సతీమణి రుఖయ్యా రజియల్లాహు అన్హా మరణించారు. అందుకే ఉస్మాన్ రజియల్లాహు ఈ యుద్ధం లో పాల్గొన లేకపో యాడు. ప్రవక్త ఆదేశమేరకు అతను తన అనారోగ్యంగా ఉన్న భార్య సేవలో మదీనలోనే ఉండిపోయాడు. ఈ యుద్ధం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ రెండవ కూతురు ఉమ్మె కుల్సూమ్ రజియల్లాహు అన్హా వివాహం ఉస్మాన్ రజియ ల్లాహు అన్హుతో చేశారు. అందుకే అతను జిన్నూరైన్ అన్న బిరుదు పొందాడు. అంటే రెండు కాంతులు గలవాడు అని.

బద్ర్ యుద్ధంలో ముస్లిములు అల్లాహ్ సహాయంతో విజయం సాధించి, ముష్రికుఖైదీలతో మరియు విజయధనంతో సంతోషంగా తిరిగి మదీన వచ్చారు. ఖైదీల్లో కొందరు పరిహారం చెల్లించి విడుదలయ్యారు. మరి కొందరు ఏ పరిహారం లేకుండానే విడుదలయ్యారు. ఇంకొందరి పరిహారం; ముస్లిం పిలవాళ్ళకు చదువు నేర్పడం నిర్ణయమయింది. వారు ఇలా విడుదలయ్యారు.

ఈ యుద్ధంలో ముష్రికుల పేరుగాంచిన నాయకులు, ఇస్లాం బద్ధశత్రువులు హతమయ్యారు. వారిలో అబూ జహల్, ఉమయ్య బిన్ ఖల్ఫ్, ఉత్బా బిన్ రబీఆ మరియు షైబా బిన్ రబీఆ వైగారాలు.

(23) ప్రవక్త యొక్క హత్యాయత్నం

బద్ర్ యుద్ధంలో ముష్రికులు ఓడిపోయిన తర్వాత, ఒకరోజు ఉమైర్ బిన్ వహబ్, సఫ్వాన్ బిన్ ఉమయ్యతో ఓ సమావేశం జరిపాడు. ఉమైర్ బిన్ వహబ్ ఖురైష్ లోని షైతానుల్లో ఒకడు. ప్రవక్తను, ఆయన సహచరుల్ని చాలా బాధ కలిగించేవాడు. అతని కొడుకు వహబ్ బద్ర్ యుద్ధంలో ముస్లిముల చేతిలో బంధిగా అయిపోయాడు.

మాట సందర్భంలో సఫ్వాన్ ముష్రికుల హతుల గురించి ప్రస్తావిస్తూ ‘అల్లాహ్ సాక్షిగా! వారి తర్వాత జీవితంలో ఏ సుఖం లేదు’ అని అన్నాడు. అప్పుడు ఉమైర్ అన్నాడుః ‘నిజం! అల్లాహ్ సాక్షిగా! నా మీద అప్పు ఉంది. దాన్ని తేర్చడానికి నా వద్ద ఏమీ లేదు. ఇంకా పిల్లలున్నారు, వారిని చూసేవాడు ఉండడు అని భయం ఉంది. ఈ ఆటంకాలు గనక లేకుంటే ముహమ్మద్ వరకు చేరుకొని అతని హత్య చేసేవాడ్ని నేను’.

సఫ్వాన్ ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి, ‘నీ అప్పు బాధ్యత నేను తీసుకుంటాను. నీ సంతానాన్ని వారున్నంత వరకు నా సంతానంగా చూసుకుంటాను’ అని అన్నాడు. ఉమైర్ అన్నాడుః అట్లైతే ఈ విషయం నీవు, నేను తప్ప మరే వ్యక్తికీ తెలియకూడదు. అతడన్నాడుః సరే.

ఇక ఉమైర్ అక్కడి నుండి వెళ్ళి తన కరవాలానికి విషముతో సానం పట్టి మదీనకు పయనమయ్యాడు. అక్కడికి చేరుకొని, మస్జిదె నబవి బయట తన ఒంటెను కూర్చోబెడుతున్న, కరవాలం ధరించి ఉన్న ఉమైర్ ను, పరస్పరం సంభాషించుకుంటున్న ముస్లిముల ఓ గుంపు మధ్యలో ఉన్న ఉమర్ రజియల్లాహు అన్హు పసిగట్టి, ‘ఇదిగో అల్లాహ్ యొక్క కరడుగట్టిన శత్రువు ఉమైర్ బిన్ వహబ్ ఏదో కీడు పూనుకొనే వస్తున్నాడు’ అని అన్నాడు.ఉమర్ వెంటనే ప్రవక్త వద్దకు వెళ్ళి ‘దైవప్రవక్తా! ఇదిగో అల్లాహ్ యొక్క శత్రువు ఉమైర్ బిన్ వహబ్ కరవాలం ధరించి వచ్చాడు’ అని తెలియజేశాడు. ప్రవక్త చెప్పారుః “అతడ్ని రానివ్వు”.

ఉమర్ అతడ్ని ప్రవక్త వద్దకు ప్రవేశింపజేశాడు. ఉమర్ అతడ్ని గట్టిగా పట్టుకున్నది చూసిన ప్రవక్త “ఉమర్ అతడ్ని వదలు” అని ఆదేశించి, “నా దగ్గరికి రా ఉమైర్” అని పిలిచారు. అతడు దగ్గరికయ్యాక, “ఏ ఉద్దేశ్యంతో వచ్చావు ఉమైర్?” అని అడిగారు. ‘మీ చేతికి చిక్కిన మా ఖైదీల గురించి వచ్చాను. వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించండి’ అని చెప్పాడు. “నీవు ఎందు గురించి వచ్చావో నిజం చెప్పు” అని ప్రవక్త కోరారు. అయినా అతడు ‘ఏమీ లేదు, వారి గురించే వచ్చాను’ అని చెప్పాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారుః “కాదు, (అంటే నీవు చెప్పేది నిజం కాదు). నీవు మరియు సఫ్వాన్ బిన్ ఉమయ్య ఓ చోట కూర్చొని బద్ర్ హతులను గుర్తు చేశారు. అప్పుడు నీవు అన్నావుః నాకు గనక అప్పు మరియు నా సంతాన భయం లేకుంటే నేను ముహమ్మద్ ను హతమార్చేవాడిని, అప్పుడు సఫ్వాన్ బిన్ ఉమయ్య నీ అప్పు మరియు నీ సంతాన బాధ్యత తీసుకున్నాడు. దీనికి బదులుగా నీవు నన్ను హతమార్చాలని అని. కాని నీకు మరియు నీ ఈ ఉద్దేశ్యానికి మధ్య అల్లాహ్ అడ్డు పడ్డాడు”.

ప్రవక్త నోట ఈ మాట విన్న వెంటనే ఉమైర్ “అష్ హదు అన్నక రసూలుల్లాహ్” (నిస్సందేహంగా మీరు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను) అని పలికి, ప్రవక్తా! మీకు ఆకాశం నుండి వచ్చే విషయాలను మరియు మీపై అవతరింపజేయబడే వహీ (దివ్యావిష్కృతి)ని మేము తిరస్కరించేవారము. అయితే ఈ (మీ హత్యాయత్న) విషయం మాట్లాడుకునేటప్పుడు నేను మరియు సఫ్వాన్ తప్ప మరెవ్వరూ లేరు. అల్లాహ్ సాక్షిగా! ఈ విషయం మీకు అల్లాహ్ తప్ప మరెవ్వరూ తెలుపలేదు. అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, అతడు నాకు సన్మార్గం చూపాడు. అందుకని ఇక్కడికి తీసుకొచ్చాడు’ అని సత్య సాక్ష్యం పలికాడు.

అప్పుడు ప్రవక్త చెప్పారుః “మీ సోదరునికి ధర్మ విషయాలు నేర్పండి, ఖుర్ఆన్ నేర్పించండి. అతని ఖైదీని విడుదల చెయ్యండి”. సహచరులు అలాగే చేశారు. ఆ తర్వాత ఉమైర్ అన్నాడుః ‘ప్రవక్తా! ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడడంలో తీవ్ర ప్రయత్నం చేశాను. అల్లాహ్ ధర్మంపై ఉన్నవారికి చాలా బాధ కలిగించాను. మీరు గనక అనుమతిస్తే మక్కా వెళ్ళి వారిని అల్లాహ్ మరియు అల్లాహ్ సత్య ప్రవక్త మరియు ఇస్లాం వైపునకు పిలుస్తానని కోరుతున్నాను. అల్లాహ్ వారికి కూడా సన్మార్గం చూపవచ్చు’.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అనుమతి ఇచ్చాడు.

ఉమైర్ మదీన వెళ్ళిన తర్వాత సఫ్వాన్ ప్రజలకు ఇలా చెప్పేవాడుః ‘సంతోషించండి, బద్ర్ సంఘటనను మరిపించే ఓ శుభవార్త రానుంది’. అటునుండి వచ్చే బాటసారులను ఉమైర్ గురించి ఏదైనా వార్త ఉందా? అని అడిగేవాడు. అయితే ఒకసారి ఓ బాటసారి వచ్చి అతను ఇస్లాం స్వీకరించిన వార్త వినిపించాడు. ఈ వార్త విని అతనితో మాట్లడనని మరియు అతనికి ఎప్పుడూ ఏ లాభమూ చేకూర్చనని ప్రమాణం చేశాడు. అటు ఉమైర్ మక్కా చేరుకున్న తర్వాత అక్కడే ఉండి ప్రజల్ని ఇస్లాం వైపునకు పిలవడం మొదలెట్టాడు. అల్ హందులిల్లాహ్ అతని ద్వారా చాలా మంది ఇస్లాం స్వీకరించారు.

మరో సంఘటనః మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో ఓ ప్రయాణం నుండి తిరిగి వస్తుండగా ఒక ప్రాంతంలో బస చేశారు. ప్రతి ఒక్కడు ఏదైనా చెట్టు నీడ గురించి వెతికి అక్కడ నిద్రించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఓ చెట్టు క్రింద మకాం వేశారు. దాని ఒక కొమ్మకు తమ కరవాలాన్ని వ్రేలాడదీసి, నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రవక్త నిద్ర ఉన్న సందర్భంలో ముందు నుండే గోప్యంగా వెంటాడుతున్న ఓ అవిశ్వాసుడు గుట్టచప్పుడు కాకుండా వచ్చాడు. నిద్రలో ఉన్న ప్రవక్త తలాపిన నిలబడ్డాడు. ప్రవక్త కరవాలాన్ని తీశాడు. దానిని ఒరలో నుండి బైటికి తీసి, ప్రవక్త తలపై దాన్ని లేపాడు. ‘ముహమ్మద్, ఇక నా నుండి నిన్ను అడ్డుకునేవాడెవడు?’ అని అన్నాడు. అప్పుడే ప్రవక్త కళ్ళు తెరచి చూసే సరికి నగ్న ఖడ్గం పైకి ఎత్తి ఉన్న వ్యక్తిపై దృష్టి పడింది. అయినా ఎంతో నెమ్మదిగా అతని ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “అల్లాహ్” అని అన్నారు. అంతలోనే అతనిలో వనుకుడు మొదలయింది. ఖడ్గం అతని చేతి నుండి క్రింద పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గం తమ చేతులో తీసుకొని, నా నుండి నిన్ను ఎవరు అడ్డుకోగలడు? అని అడిగారు. అతడు తికమక చూస్తూ ఏమనలేక ‘ఎవడు లేడు’ అని అన్నాడు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడ్ని మన్నించారు. ఆ తర్వాత అతడు ఇస్లాం స్వీకరించాడు. మళ్ళీ తన జాతిలోకి వెళ్ళి ఇస్లాం ప్రచారం చేశాడు.

(24) ఉహుద్ యుద్ధం

బద్ర్ యుద్ధం తర్వాత ఒక సంవత్సరానికి, మస్లిముల మరియు అవి- శ్వాసుల మధ్య ఈ యుద్ధం జరిగింది. బద్ర్ యుద్ధంలో ఓటమికి పాలైన అవిశ్వాసులు, ముస్లిములతో ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించు- కున్నారు. అందుకే ఈ సారి 3000 సైనికులతో బయలుదేరారు. వారితో పోరాడడానికి ముస్లిముల వైపు నుండి 700 మంది పాల్గొన్నారు. ప్రారంభ దశలో ముస్లిములే గెలుపొందారు. అవిశ్వాసులు మక్కా దారి పట్టారు. కాని వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. కొండ వెనుక వైపు నుండి వచ్చి, ముస్లిములపై విరుచుకు పడ్డారు. ఇలా ఎందుకు జరిగిందంటేః అదే కొండపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరు విలుకాండ్రులను నియమించారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ స్థానాన్ని వదలకూడదని వారికి నొక్కి చెప్పారు. కాని వారు ముస్లిములు గెలుపొందినది, ముష్రికులు పారిపోవునది చూసి (యుద్ధం ముగిసిందన్న భ్రమలో పడి) విజయప్రాప్తి కోసం పరుగెత్తుకొచ్చారు. అందువల్ల ఆ స్థలం ఖాలీ అయిపోయింది. ఖురైషులకు మంచి అవకాశం లభించింది. కొండ వెనక నుండి తిరిగి దాని శిఖరంపై వచ్చి అక్కడి నుండి ముస్లిములపై దాడి చేశారు. అందుకే ఈ సారి ముష్రికులు గెలుపొందారు. ఈ యుద్ధంలో 70 మంది ముస్లిములు అమరవీరులయ్యారు. వారిలో ఒకరుః హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హు. ముష్రికుల వైపు నుండి 22 మంది చంపబడ్డారు.

(25) ఖందక యుద్ధం

ఉహద్ యుద్ధం తర్వాత కొద్ది రోజులకు మదీన యూదులు మక్కా వెళ్ళి ఖురైషుల్ని కలుసుకొని మీరు గనక మదీనా పై దాడి చేసి, ముస్లిములతో యుద్ధం చేస్తే ఈ సారి మేము (లోపల నుండి) మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్ధానం చేశారు. ఖురైషులు సంతోషంతో దీన్ని ఒప్పుకున్నారు. ఖురైషులు ఒప్పుకున్నాక ఇతర తెగవాళ్ళను కూడా పురికొలిపారు. వారు కూడా ఒప్పుకున్నారు. అరబ్బు దేశమంతటి నుండి యూదులు, ముష్రికులందరూ ఏకమై భారీ ఎత్తున మదీనా పై దండ యాత్రకు బయలుదేరారు. సుమారు పది వేల మంది సైనికులు మదీనా చుట్టు ప్రక్కన పోగు అయ్యారు.

శత్రువుల కదలిక గురించి ప్రవక్తకు వార్తలు అందుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో సలహా కోరారు. అప్పుడు ఈరాన్ దేశస్తుడైన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖందకం త్రవ్వాలని సలహా ఇచ్చారు. మదీన రెండు వైపులా ఖర్జూరపు తోటలు, ఒక వైపు కొండ ఉండగా మరో వైపు ఏమీ అడ్డుగా లేనందు వల్ల అదే వైపు ఖందకం త్రవ్వడం ప్రారంభించారు. ముస్లిములందరూ ఇందులో పాల్గొని అతి తొందరగా దాన్ని పూర్తి చేశారు. ముష్రికులు ఖందకానికి ఆవల ఒక నెల వరకు ఉండిపోయారు. మదీనలో చొరబడటానికి ఏ సంధు దొరకలేదు. ఆ కందకాన్ని దాటలేక పోయారు. అల్లాహ్ అవిశ్వాసులపై ఒకసారి తీవ్రమైన గాలిదుమారాన్ని పంపాడు. దాని వల్ల వారి గుడారాలు ఎగిరిపోయాయి. వారిలో అల్లకల్లోలం చెలరేగి భయం జనించింది. క్షణం పాటు ఆగకుండా పారిపోవడంలోనే క్షేమం ఉంది అనుకొని పరిగెత్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒక్కడే దాడి చేయుటకు వచ్చిన సైన్యాలను పరాజయానికి గురి చేసి, ముస్లిములకు సహాయ పడ్డాడు.

ముష్రికుల సైన్యాలు దారి పట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ఈ సంవత్సరం తర్వాత ఖురైష్ మీపై దాడి చేయరు. కాని మీరు వారి మీద దాడి చేస్తారు”. వాస్తవంగా ప్రవక్త చెప్పినట్లు ఖురైషు వైపు నుండి ఇదే చివరి దాడి అయ్యింది. (ఆ తర్వాత వారు ఎప్పుడు ముస్లింపై దాడి చేయుటకు సాహసించలేదు).

కందకం త్రవ్వే సందర్భంలో ముస్లిములు ఘోరమైన ఆకలికి గురి అయ్యారు. ఆకలి భరించలేక కడుపుపై రాళ్ళు కట్టుకోవలసి వచ్చింది. అప్పుడు జాబిన్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు కనీసం ప్రాణం కాపాడేంత పరిమాణంలోనైనా ప్రవక్తకు ఏదైనా తినిపించాలని కోరుకొని తన వద్ద ఉన్న ఓ చిన్న మేక పిల్లను కోశాడు. మాంసం తయారు చేసి భార్యకు ఇస్తూ దీని కూర వండి, అతితక్కవగా ఉన్న బార్లీ గింజల పిండితో రొట్టెలు చేసి పెట్టమని చెప్పాడు. వంట తయ్యారు అయ్యాక ప్రవక్త వద్దకు వెళ్ళి ‘మీకు మరో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడేంత భోజనం ఉంది’ అని తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త “ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది” అని కందకంలో పాల్గొన్న వారందరినీ పిలిచారు. మరియు స్వయంగా మాంసం ముక్కలు మరియు రొట్టెలు వడ్డించారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అయినా ఆ భోజనం ఎవరి చేయి పెట్టనట్లుగా మిగిలింది. అప్పుడు వారు సుమారు వెయ్యి మంది ఉండిరి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహిమల్లో ఒకటి.

(26) హుదైబియా ఒప్పందం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముస్లిములు మదీనకు వలస వచ్చినప్పటి నుండి, వారిని ఎన్నటికీ తిరిగి మక్కా రానివ్వకూడదని, మస్జిదె హరాం దర్శనం చేయనివ్వద్దని దృఢంగా ముష్రికులు నిశ్చయించుకున్నారు.

కాని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు మక్కాకు పయనం కావాలని హిజ్రి శకం ఆరవ ఏట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయించారు. వెళ్ళడానికి జిల్ ఖాద నెల నిర్ణయమయింది. అది గౌరవపదమైన నెల అని, అందరూ దాన్ని గౌరవిస్తారనీ. ఉమ్రా ఉద్దేశ్యంతో బయలుదేరారు. యుద్ధ ఆదేశం ఏ మాత్రం లేకుండినది. 1400 మంది సహాబాలు ఇహ్రామ్ దుస్తులు ధరించి, బలివ్వడానికి ఒంటెలు తమ వెంట తీసుకెళ్ళారు. వాస్తవానికి వీరు కాబా దర్శనానికి, దానిని గౌరవార్థమే బయలుదేరారన్న నమ్మకం చూసేవారికి కలగలాని, ఖురైషువారు వీరిని మక్కాలో ప్రవేశం నుండి నిరోధించుటకు ఊహించనూ వద్దని ఆయుధాలు కూడా ధరించలేదు. కేవలం ప్రయానికులు తమ ఖడ్గఒరలో ఉంచుకునే ఆయుధం తప్ప.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖస్వా పేరుగల తమ ఒంటెపై పయనమయ్యారు. సహచరులు ఆయన వెనక ఉన్నారు. మదీనవాసుల మీఖాత్ జుల్ హులైఫా చేరుకున్నాక, అందరూ బిగ్గరగా తల్బియా చదువుతూ ఉమ్రా యొక్క ఇహ్రామ్ సంకల్పం చేశారు. వాస్తవానికి కాబా దర్శన హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది. దాని దర్శనం మరియు ప్రదక్షిణం నుండి నిరోధించే హక్కు అప్పటి ఆచారం (దస్తూర్, ఖానూన్) ప్రకారం కూడా ఖురైషుకు ఏ మాత్రం లేదు. వారి శత్రువైనా సరే, అతడు కాబా గౌరవ ఉద్దేశ్యంతో వస్తే అతడ్ని ఆపవద్దు.

కాని ముస్లిములు మక్కా ఉద్దేశ్యంతో బయలుదేరారని విన్న వెంటనే ముష్రికులు యుద్ధానికై సిద్ధమయ్యారు. వారికి ఎంత కష్టతరమైన సరే ప్రవక్తను మక్కాలో రానివ్వకూడదని దృఢంగా నిర్ణయించుకున్నారు. వారి ఈ చేష్ట, వారు ముస్లిముల పట్ల శత్రుత్వంగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా- రనడానికి మరియు వారికి లభించవలసిన హక్కుల నుండి వారిని దూరం చేస్తున్నారు అనడానిక గొప్ప నిదర్శనం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిడారం నడుస్తూ నడుస్తూ మక్కాకు సమీపములో చేరుకుంది. కాని ఖురైషువారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల్ని మక్కాలో ప్రవేశించకుండా, కాబా ప్రదక్షిణం చేయకుండా నిరోధిస్తునే ఉన్నారు.

ప్రవక్తతో సంధి చేసుకొని ఏదో ఓ కొలికికి రావాలని రాయబార వ్యవహారాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల్లో (అంటే ముస్లిముల మరియు మక్కాలోని ముష్రికుల మధ్య) అనేక రాయబార బృందాలు వస్తూ పోయాయి. ఈ మధ్యలో ఖురైష్ యువకుల్లో నలబై మంది హఠాత్తుగా ముస్లిములపై విరుచుకుపడి వారిలో కొందరిని చంపుదాము అని అనుకున్నారు. కాని ముస్లిములు వారిని పట్టుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం వద్దకు తీసుకువచ్చారు. అయితే ప్రవక్త వారితో ఏ ప్రతికార చర్యకు పాల్పడకుండా వారిని వారి దారిన వదిలేసి వారిని మన్నించారు.

ఆ తర్వాత ప్రవక్త -ﷺ- ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హుని రాయబారిగా ఖురైష్ నాయకుల వద్దకు పంపి, మేము యుద్ధానికి కాదు వచ్చింది. కేవలం అల్లాహ్ గృహ దర్శనం, దాని గౌరవార్థం వచ్చాము అని తెలియజేశారు. ఉస్మాన్ మరియు ఖురైషుల మధ్య సంధి కుదరలేదు. అంతే గాకుండా వారు ఉస్మాన్ ని పోనివ్వకుండా తమ వద్దే నిర్బంధించారు. అందువల్ల ఉస్మాన్ హత్యకు గురయ్యాడు అన్న పుకారు పుట్టింది. ప్రవక్త -ﷺ-కు ఈ విషయం తెలిసిన వెంటనే “ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుండి కదిలేది లేదు” అని స్పష్టం చేసి, దీనికై ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరితో శపథం తీసుకున్నారు. అప్పుడు తమ ఒక చేతిని ఉస్మాన్ చేతిగా పరిగణించి తమ రెండవ చేయిని దానిపై కొట్టి శపథం చేశారు. ఈ శపథం “బైఅతుర్ రిజ్వాన్” అన్న పేరు పొందింది. ఓ చెట్టు క్రింద జరిగింది. ప్రవక్తగారు సహచరులతో చేసిన శపథం ఇలా ఉండిందిః ఉస్మాన్ కు వాస్తవంగా ఏదైనా కీడు జరిగింది అని తెలిస్తే గనక మీలో ఏ ఒక్కరూ పారిపోకుండా ముష్రికులతో పోరాడనిదే ఈ స్థలాన్ని వదలేది లేదు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసిన వార్త ఏమిటంటే ఉస్మాన్ క్షేమంగానే ఉన్నారు. హత్య చేయబడలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములతో యుద్ధానికి సిద్ధమన్నట్లు శపథం చేశారని తెలిసిన వెంటనే సుహైల్ బిన్ అమ్ర్ ను దౌత్యవేత్తగా పంపారు. అతను ప్రవక్తతో కూర్చుండి; ముస్లిములు ఈ సారి తిరిగి వెళ్ళిపోవాలని మరియు వచ్చే సంవత్సరం ఎప్పుడైనా రావచ్చనే విషయంపై సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. సంధి కుదిరింది. ప్రవక్త కూడా సంధి ఒప్పంద నిబంధనలను అంగీకరించారు. ఈ నిబంధనలు బాహ్యంగా ముష్రికుల పక్షంలో వారికి మాత్రమే అనుకూలమైనవిగా ఉండెను. అందుకే ముస్లిములు మండిపడ్డారు. వారి దృష్టిలో అవి అన్యాయం, దౌర్జన్యంతో కూడి ఉన్న నిబంధనలని. ముష్రికులకు అనుకూలమైనవిగా ఉన్నాయని అనిపించింది. కాని ప్రవక్త సంధి కుదరాలనే కోరేవారు. ఎందకుంటే ఇస్లాం ప్రశాంత వాతవరణంలో వ్యాపిస్తూ ఉంటే అనేక మంది ఇస్లాంలో ప్రవేశించవచ్చు అన్న విషయం ప్రవక్తకు తెలుసు. వాస్తవానికి జరిగింది కూడా ఇదే. ఈ యుద్ధవిరమణ కాలంలో ఇస్లాం విస్తృతంగా వ్యాపించింది.

అంతే కాదు, వాస్తవానికి ముస్లిముల మరియు ఖురైష్ ల మధ్య జరిగిన ఈ యుద్ధవిరమణ సంధి ఇస్లాం మరియు ముస్లిముల పాలిట గొప్ప సహాయంగా నిలిచింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవజ్యోతితో చూస్తూ ఉన్నారని కుడా ఈ సంఘటన గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఎలా అనగ నిబంధనలన్నిటీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరిస్తూ పోయారు. అదే సందర్భంలో కొందరి సహచరులకు అవి బాహ్యంగా ముష్రికులకు అనుకూలంగా కనబడినవి.

(27) మక్కా విజయం

హిజ్రి శకం ఎనిమిదవ ఏట (ముష్రిక్కులు తాము చేసిన వాగ్దానానికి వ్యెతిరేకం వహించినందుకు) మక్కాపై దాడి చేసి, జయించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయించారు. రమజాన్ 10వ తారీకున 10 వేల వీరులతో బయలుదేరారు. ఏలాంటి పోరాటం, రక్తపాతం లేకుండా మక్కాలో ప్రవేశించారు. ఈ ప్రవేశం చారిత్రకమైనది. చెప్పుకోదగ్గది. ఖురైషులు తమ ఇష్టానుసారం లొంగిపోయారు. అల్లాహ్ ముస్లిములకు సహాయపడ్డాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదె హరాం వెళ్ళి కాబా యొక్క తవాఫ్ చేసి, కాబా లోపల, వెలుపల, పైన ఉన్న విగ్రహాల న్నిటిని తొలగించి దాని లోపల రెండు రకాతుల నమాజు చేశారు. తర్వాత కాబా గడపపై వచ్చి నిలుచున్నారు. ఖురైషులు గడప ముందు నిలబడి, ప్రవక్త వారి గురించి ఏ తీర్పు ఇస్తారు అని వేచిస్తున్నారు. ప్రవక్త గంభీర స్వరంతో “ఓ ఖురైషులారా! నేను మీ పట్ల ఎలా ప్రవర్తిస్తానని భావిస్తున్నారు” అని అడిగారు. వారందరూ ఏక శబ్ధమై “మేలు చేస్తారనే భావిస్తున్నాము. ఎందుకంటే మీరు మంచి సోదరులు, మంచి సోదరుని సుపుత్రులు” అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “పోండి, మీరందరికి స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది” అని ప్రకటించారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన్ను, తన సహచరుల్ని బాధించి, నానా రకాలుగా హింసించి, స్వదేశం నుండి తరిమిన శత్రువుల్ని ఈ రోజు క్షమిస్తూ, మన్నిస్తూ ఒక గొప్ప ఉదాహరణ / ఆదర్శం నిలిపారు.

(28) బృందాల రాక, రాజులకు ఇస్లాం సందేశం

మక్కా విజయం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన మరియు ఇస్లాం ధర్మ ప్రచారం నలువైపులా వ్యాపించింది. ఇక సుదూర ప్రాంతాల నుండి బృందాలు వచ్చి ఇస్లాం స్వీకరించ సాగాయి.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్క దేశాల రాజులకు ఇస్లాం పిలుపునిస్తూ, ఉత్తరాలు వ్రాయించి పంపారు. వారిలో కొందరు ఇస్లాం స్వీకరించారు. మరి కొందరు ఇస్లాం స్వీకరించలేదు కాని ఉత్తమరీతి లో ఉత్తరాన్ని తీసుకొని మంచి విధంగా సమాధానమిచ్చారు. కాని ఈరాన్ రాజైన ఖుస్రౌ (Khosrau) ప్రవక్త పత్రాన్ని చూసి కోపానికి గురై దాన్ని చింపేశాడు. ప్రవక్తకు ఈ విషయం తెలిసింది. పిమ్మట ఆయన ఇలా శపించారుః “అల్లాహ్! అతని రాజ్యాన్ని కూడా నీవు చించేసెయి”. ఈ శాపనానికి ఏమంత ఎక్కువ సమయం గడువక ముందే అతని కొడుకు స్వయంగా తండ్రిని చంపేసి, రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు.

మిస్ర్ (Egypt) రాజు ముఖౌఖిస్ ఇస్లాం స్వీకరించలేదు. కాని ప్రవక్త రాయబారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించి, అతనితో ప్రవక్త కొరకు కానుకలు పంపాడు. అలాగే రోమన్ రాజు కూడా ప్రవక్త రాయబారికి మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి విధంగా ప్రవర్తించాడు.

బహ్రైన్ రాజు ముంజిర్ బిన్ సావీ ప్రవక్త పత్రాన్ని ప్రజలందరికీ విని పించాడు. వారిలో కొందరు విశ్వసించారు మరి కొందరు తిరస్కరించారు.

హిజ్రి శకం 10వ ఏట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేశారు.

ఆయన చేసిన ఏకైక హజ్ ఇదే. ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్ చేశారు. ఆయన హజ్ పూర్తి చేసుకొని మదీన తిరిగి వచ్చారు.

(29) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం

హజ్ నుండి వచ్చాక సుమారు రెండున్నర మాసాలకు ప్రవక్తకు అస్వస్థత అలుముకొన్నది. దిన దినానికి అది పెరగ సాగింది. నమాజు కూడ చేయించడం కష్టమయిపోయింది. అప్పుడు అబూ బక్ర్ ను నమాజు చేయించాలని ఆదేశించారు.

హిజ్రి పదకొండవ శకం, నెల రబీఉల్ అవ్వల్, 12వ తారీకు సోమవారం రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమోన్నతుడైన అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మొత్తం 63 సంవత్సరాలు జీవించారు. ప్రవక్త మరణ వార్త సహచరులకు అందగా వారికి సృహ తప్పినట్లయింది. నమ్మశక్యం కాక పోయింది. అప్పుడు అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు నిలబడి ప్రసం గించారుః వారిని శాంతపరుస్తూ, ప్రశాంత స్థితి నెలకొల్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరి లాంటి ఒక మానవుడే, అందిరికి వచ్చి నటువంటి చావు ఆయనకు వచ్చింది అని స్పష్టపరిచారు. అప్పుడు సహచరులు తేరుకొని, శాంత పడ్డారు. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు స్నానం చేయించి, కఫన్ దుస్తులు ధరియింపజేసి, ఆయిషా రజియల్లాహు అన్హా గదిలో ఖననం చేశారు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవికి ముందు 40 సం. ఆ తర్వాత 13 సం. మక్కాలో, 10 సం. మదీనలో గడిపారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం ముస్లిములందరూ ఏకంగా హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు గారిని ఖలీఫా (రాజు)గా ఎన్నుకున్నారు. మొదటి ఖలీఫయె రాషిద్ ఇతనే.

(30) ప్రవక్త పట్ల సహచరుల ప్రేమ

సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అధికంగా ప్రేమించేవారు. వారు తమ ఆత్మలకంటే, సంతానం కంటే మరియు తమ ఆధీనంలో ఉన్నవాటికంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమించేవారు. ఆయన ఆధారంగానే అల్లాహ్ వారిని అవిశ్వాస చీకట్ల నుండి ఇస్లాం కాంతిలో తీసుకొచ్చాడు. ప్రవక్త పట్ల సహచరుల ప్రేమను తెలిపే అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ముష్రికుల చేతిలో బందీ అయిన ఖుబైబ్ బిన్ అదీ రజియల్లాహు అన్హు అను గొప్ప సహచరుని వద్ద ఖురైష్ గుమిగూడారు. వారిలో అగ్ర నాయకుడైన అబూ సుఫ్యాన్ (అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు) ‘నీకు బదులుగా నీ ఈ స్థానంలో ముహమ్మద్ ఉండి అతడ్ని మేము హతమార్చుదుము. నీవు నీ ఇంట్లో ఉంటే బావుండునని భావిస్తున్నావా’ అని అడిగాడు. ఖుబైబ్ అన్నాడుః ‘లేదు, అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ప్రవక్త ఇక్కడ కాదు, తాను ఉన్న స్థానంలో ఉండగా ఆయనకు ముళ్ళు కుచ్చి అవస్త కలుగుతుండగా నేను నా ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు’.

ఉహద్ యుద్ధంలో ప్రవక్త చనిపోయారన్న వదంతి వ్యాపించింది. అప్పుడే ఒక స్త్రీ వచ్చింది. ఆమె తండ్రి చనిపోయాడని, తర్వాత కొడుకు, ఆ తర్వాత భర్త ఇంకా ఆ పిదప సోదరుడు కూడా చంపబడ్డారు అని తెలుపబడింది. అయినా ఆమె అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? “ప్రవక్త పరిస్తితి ఎలా ఉంది? అని. ఆయన క్షేమంగనే ఉన్నారని ఆమెకు సమాధానం దొరికినా ‘ప్రవక్తను నాకు చూపించండి’ అని కోరింది. ప్రవక్త వద్దకు వచ్చాక ఆయన దుస్తుల ఓ అంచును పట్టి ‘అల్లాహ్ ప్రవక్తా! నా తల్లిదండ్రులను మీకు అర్పింతును గాక! మీరు క్షేమంగా ఉన్న తర్వాత నాకు ఏ రందీ లేదు’. అని అంది.

ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, ‘ప్రవక్తా! నేను నా కంటే ఎక్కువ, నా భార్యపిల్లల కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని చూడనిదే తృప్తి కలగదు. అయితే నేను నా చావును మరియు మీ చావును గుర్తు చేసుకున్నప్పుడు మీరు ప్రవక్తలతో స్వర్గంలోని ఉన్నత స్థానంలో ఉంటారని నేను ఒక వేళ స్వర్గంలో ప్రవేశించినా మిమ్మల్ని చూడలేననే ఆవేధనే నన్ను కుమిలివేస్తుంది’ అని వాపోయాడు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీవు ప్రేమించేవారితో నీవు ఉంటావు”.

మీరు ప్రవక్తను ఎలా ప్రేమించేవారని అలీ రజియల్లాహు అన్హును ప్రశ్నించినప్పుడు, ‘అల్లాహ్ సాక్షిగా! ఆయన మాకు మా ధనసంతానం కంటే, మా తల్లదండ్రుల కంటే అంతే కాదు దాహంగా ఉన్నప్పుడే లభించే చల్లని నీటి కంటే ఎక్కువ ప్రేమ గలవారు’ అని సమాధానమిచ్చారు.

(31) ప్రవక్త ముస్లిమేతరులతో

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివిధ సంస్కృతుల, విభిన్న విశ్వాసాల మరియు భిన్న జాతులవారితో హృదయపూర్వకంగా సంతోషంతో మరియు వారి సంస్కృతులలో ఏ జోక్యం చేసుకోకుండా వారితో సహజీవనం చేశారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాని కొన్నిటిని క్రింద ప్రస్తావిస్తున్నాము.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనకు వచ్చినప్పటి నుండీ అక్కడున్న యూదులతో ఎంతో శాంతివంతమైన జీవితం గడిపారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీయ నైతిక విధానాన్ని వారి పట్ల అవలంభించేవారు. అందుకే ఆయన వారి రోగులను పరామర్శించేవారు, ఆయన పొరుగులో ఉన్న యూదుడు పెట్టే అనేక ఇబ్బందులను సహించేవారు. యూదుని శవాన్ని తీసుకువెళ్ళుచుండగా చూసి నిలబడేవారు. ఒకసారి ఓ యూదుని శవం వెళ్ళుచుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడ్డారు. ఇది యూదుని శవం కదా? అని సహచరులు అన్నారు. (అంటే యూదుని శవానికై మీరు ఎందుకు నిలబడ్డారు?) ప్రవక్త చెప్పారుః “అతను మనిషి కాడా?”.

ఆయన -ﷺ- మదీన వచ్చినప్పటి నుండి యూదులతో ఏ శత్రుత్వం లేకుండా ఉండే ప్రయత్నం చేసేవారు. అంతే కాదు ఆయన ఓ ఒప్పందంపై సంతకం చేశారు. దాని ద్వారా ఆయన ఇతరులతో ఎంత సామరస్యంగా జీవితం గడపడానికి కోరుకునేవారో తెలుస్తుంది.

ఇస్లామీయ రాజ్యం విస్తృతం అయినప్పుడు క్రిస్టియన్ అరబ్బు వంశాల కూటములు కొన్ని ఉండేవి. ప్రత్యేకంగా నజ్రాన్ లో. ప్రవక్త వారితో అతి ఉత్తమ రీతిలో ప్రవర్తించేవారు. ఇస్లామీయ ప్రభుత్వ ఛాయలో వారికి సంపూర్ణ శాంతియుతమైన జీవనం లభించాలని, వారి ధార్మిక విషయాల్లో వారికి స్వేచ్ఛ లభించాలని మరియు ఇతర రంగాల్లో కూడా వారికి స్వేచ్ఛా స్వతంత్రం లభించాలని వారితో ఒప్పందాలు చేశారు.

నజ్రాన్ వాసులతో జరిగిన ఒప్పందంలో ఇలా ఉంది. నజ్రాన్ మరియు దాని చుట్టుప్రక్కలో ఉన్నవారికి; వారు అక్కడ ఉన్నా, బైట ఉన్న వారి ధన, ప్రాణ, ధరిత్రి, ధర్మంలో అల్లాహ్ రక్షణ మరియు అల్లాహ్ యొక్క సందేశకర్త అయిన ప్రవక్త ముహమ్మద్ పూచి ఉంది. ఇంతే గాకుండా ఈ ఒప్పందంలో నజ్రాన్ క్రైస్తవుల సర్వ హక్కుల బాధ్యత, మరియు వారి శాంతిసౌఖ్యాలకు హాని కలిగే ఏ కార్యానికి పాల్పడేది లేదని కూడా ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేత వెలువడిన మదీన దస్తావీజులోని ఒప్పందాల ఓ భాగంలో: మదీనాలోని ముస్లిమేతరులు ముస్లింలవంటి నాగరికులే (సిటిజన్), ముస్లిములకు ఉన్నటువంటి హక్కులే వారికి ఉన్నాయి, ముస్లిములపై ఉన్నటువంటి విధులే వారిపై ఉన్నాయని ఉంది.

ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత వ్యవహారం మునాఫిఖుల(కపటుల)తో; ఆయనకు పేర్లతో సహా వారి గుర్తింపు ఉన్నప్పటికీ మరియు వారు ముస్లిముల మధ్య న్యూనతభావాన్ని సృష్టిస్తున్నారని, ముస్లిములను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పటికీ, ప్రవక్తగారు వారితో సహజీవితం గడపడాన్ని నిరాకరిస్తున్నట్లు చూడలేము. ఆయన వారితో కలసి ఉండేవారు. వారితో వ్యవహారాలు చేసేవారు. వారితో వినేవారు. శక్తి ఉన్నప్పటికీ వారికి వ్యతిరేకంగా బలప్రయోగం చేయలేదు. పౌరులకు సంబంధించిన ఏ ఒక హక్కు వారికి లేకుండా ఎన్నడూ ప్రవర్తించలేదు. ముస్లిముల మాదిరిగా వారు సర్వ నివాస హక్కులు పొందుతున్నారు. సామాజిక సమస్యల్లో ప్రవక్త వారికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అనుమతి ఇచ్చేవారు. బైతుల్ మాల్ నుండి వారికి లభించవలసిన వాట నొసంగేవారు.

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర మతస్థులతో ఏలాంటి కల్మషం, అసహ్యత లేకుండా ప్రేమశాంతియుతమైన జీవితం గడిపేవారు. అంతే కాదు, తమ వాచకర్మ, నోట ప్రవర్తన ద్వారా కూడా ఇతరులతో స్వేచ్ఛ, శాంతియతమైన జీవితం గడపాలని ప్రోత్సహించేవారు.

(32) విశ్వాసులు పరస్పరం సోదరులు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాల్లో ముస్లిముల మధ్య సోదరబాంధవ్యం, వారి మధ్య గట్టి సంబంధం ఉండుట విధిగా ఉంది అని తాకీదు చేశారు. పరస్పర కపటం, ద్వేషం, భిన్నత్వం, చీలికలు అనైక్యతలు ఉంచుకొనుట నుండి వారించారు. మరియు వారి మధ్య చీలికలకు, ద్వేష మరియు దూరాలకు దారి తీసే ప్రతీ దాని నుండి హెచ్చరించారు. ముస్లిం అవసరాన్ని తీర్చడానికి, అతని సహాయానికి, అతని మేలు, మద్దతుకు ఎల్లవేళల్లో సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను, ప్రవచనాలను అంతేకాదు, ఆయన ఆచరణలపై శ్రద్ధ వహిస్తే వాటిలో ముస్లిముల మధ్య ప్రేమరాగాల్ని వ్యాపించే బహిరంగ పిలుపు ద్యోతకమవుతుంది. ఇదిగో ఆయన విశ్వాసపరమైన ప్రేమను ఎలా స్వర్గానికి దారి అని తెలుపారో చూడండిః

“మీరు విశ్వాసులు కానంత వరకు స్వర్గంలో చేరరు, మరి పరస్పరం ప్రేమించుకోనంత వరకు విశ్వాసులు కాజాలరు. నేను మీకో విషయం తెలుపనా? అది గనక మీరు చేస్తే మీలో పరస్పరం ప్రేమానురాగాలు కుదురుతాయి; మీరు సలాంను విస్తృతం చేయండి”.

ఆయన -ﷺ- ముస్లిముల మధ్యలో ఎల్లప్పుడూ ప్రేమ విత్తనాలు నాటే మరియు కరుణ, వాత్సల్యం పెంచే ప్రయత్నం చేసేవారు. ప్రజల హృదయాల్లో ప్రేమ పునాదులను గట్టిగా నాటే అధిక కాంక్ష గలవారు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

“ఇద్దరు వ్యక్తులు కేవలం అల్లాహ్ కొరకు పరస్పరం ప్రేమించుకున్నట్లయితే వారిలో ఎవరు ఇతరుని పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడో అతడిని అల్లాహ్ అధికంగా ప్రేమిస్తాడు.

ఇంతే కాదు, ఇతరులను ప్రేమించడం, వారి కొరకు మంచిని ప్రేమించడంలోనే విశ్వాస గ్యారంటీ ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచారుః

“తన కొరకు ఇష్టపడినదే తన సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు మీలో ఎవరు విశ్వాసులు కాజాలరు”.

ప్రవక్త -ﷺ- ఇలా చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పరస్పరం కానుకలు పంపించుకుంటూ ఉండండి, అందువల్ల ప్రేమలు పెరుగుతూ ఉంటాయి”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి కావలసిన మార్గాలు, సాధనాలు కూడా నేర్పారు; మెతక హృదయులు అయి ఉండుట. ఇతరుల ప్రేమ భావాల్ని గ్రహించేగుణం దానిలో కలగవేయుట.

(33) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహజ గుణాలు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొట్టిగా గాని లేదా పొడుగ్గా గాని కాకుండా మధ్యరకమైన ఎత్తులో ఉండిరి. విస్తరించిన భుజాలు. సరితూగిన అవయవాలు. విశాలవక్షస్తుడు. చంద్రబింబం లాంటి అందమైన ముఖం. సుర్మా పెట్టుకున్నటువంటి కళ్ళు. సన్నటి ముక్కు. అందమైన మూతి. సాంద్రమైన గడ్డం.

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం, అంబర్ గ్రిస్ (ambergris) మరియు కస్తూరి లేదా ఇంకేదైనా సువాసనగల పదార్థం, ద్రవ్యాల సువాసన ప్రవక్త సువాసన కంటే ఎక్కవ ఉన్నది నేను ఎన్నడూ చూడలేదు/ ఆఘ్రాణించేలదు. ప్రవక్త చెయ్యి కంటే ఎక్కువ సున్నితమైన వస్తవును ఎప్పుడూ నేను ముట్టుకోలేదు.

ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, మందహాసంగా ఉండేవారు. తక్కువ సంభాషించేవారు. మధుర స్వరం గలవారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఆయన గురించి ఇలా చెప్పాడుః ఆయన అందరిలో అందమైన వారు. అందరికన్నా ఎక్కువ దాతృత్వ గుణం గలవారు, మరియు అందరి కన్నా గొప్ప శూరుడు.

(34) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సద్గుణాలు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా శూరులు, బలశాలి. అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః యుద్ధం చెలరేగి ఒకరిపై ఒకరు విరుచుకుపడేటప్పుడు మేము ప్రవక్త వెనక ఉండేవారము.

ఆయన అందరికన్నా ఎక్కువ ఉదారులు, ఔదార్యము ఉన్నవారు. ఆయన్ను ఏదైనా అడుగుతే ఎప్పుడూ లేదు, కాదు అనలేదు.

అందరికన్నా ఎక్కువ ఓర్పు, సహనం గలవారు. ఎప్పుడూ తమ స్వంత విషయంలో ఎవరితో ప్రతీకారం కోరలేదు. ఎవరినీ కోపగించలేదు. కాని అల్లాహ్ నిషిద్ధతాల పట్ల జోక్యం చేసుకున్నవాడిని అల్లాహ్ కొరకు శిక్షించేవారు.

ఆయన దృష్టిలో దూరపు – దగ్గరివారు, బలహీనులు – బలలవంతులు అనే తారతమ్యము లేదు. హక్కులో అందరూ సమానం. మరింత తాకీదు చేస్తూ ఇలా చెప్పారుః “ఏ ఒకరికి మరొకరిపై ఆధిక్యత, ఘనత లేదు. కేవలం తఖ్వా (అల్లాహ్ భయభీతి) తప్ప. మానవులందరూ సమానులే. గత కాలల్లో గతించిన జాతుల్లో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయు డవుతే శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అందుకే వారు నాశనం అయ్యారు. వినండి! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేసేవాన్ని”.

ఎప్పుడూ ఏ భోజనానికి వంక పెట్ట లేదు. ఇష్టముంటే తినేవారు. లేదా వదిలేవారు. ఒక్కోసారి నెల రెండు నెలల వరకు ఇంటి పొయ్యిలో మంటే ఉండకపోయేది. ఆ రోజుల్లో ఖర్జూరం మరియు నీళ్ళే వారి ఆహారంగా ఉండేది. ఒక్కోసారి ఆకలితో కడుపుపై రాళ్ళు కట్టుకునేవారు.

చెప్పుల మరమ్మతు చేసుకునేవారు. దుస్తులు చినిగిన చోట కుట్లు వేసుకునేవారు. ఇంటి పనుల్లో ఇల్లాలికి సహకరించేవారు. వ్యాదిగ్రస్తుల్ని పరామర్శించేవారు.

పేదరికం వల్ల పేదలను చిన్న చూపుచూసేవారు కారు. రాజ్యాధికారం వల్ల రాజులతో భయపడేవారు కారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుఱ్ఱం, ఒంటె, గాడిద మరియు కంచర గాడిదలపై ప్రయాణం చేసేవారు.

ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా అందరికన్నా ఎక్కువ మందహాసంతో ఉండేవారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేవారు. సువాసనను ప్రేమించే వారు. దుర్వాసనను అసహ్యించుకునేవారు. సర్వ సద్గుణాలను, ఉత్తమ చేష్టలను అల్లాహ్ ఆయనలో సమకూర్చాడు.

అల్లాహ్ ఆయనకు నొసంగిన విద్యా జ్ఞానం ముందువారిలో, వెనుక వారిలో ఎవ్వరికీ నొసంగ లేదు. ఆయన నిరక్షరాస్యులు. చదవలేరు, వ్రాయ లేరు. మానవుల్లో ఎవరూ ఆయనకు గురువు కారు. దివ్యగ్రంథం ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. దాని గురించి అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

[قُلْ لَئِنِ اجْتَمَعَتِ الإِنْسُ وَالجِنُّ عَلَى أَنْ يَأْتُوا بِمِثْلِ هَذَا القُرْآَنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا] {الإسراء:88}

{ఇలా అను ఓ ప్రవక్తా! ఒకవేళ మానవులూ జిన్నాతులూ అందరూ కలసి ఈ ఖుర్ఆను వంటిదానిని దేనినయినా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు. వారందరూ ఒకరికొకరు సహాయులు అయినప్పటికినీ}. (బనీ ఇస్రాఈల్ 7: 88).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నపటి నుండి చదవడం, వ్రాయడం నేర్చుకోకుండా నిరక్షరాస్యులవడం తిరస్కారుల అపోహాలకు ఒక అడ్డు కట్టుగా నిలిచింది. ఈ గ్రంథాన్ని ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- స్వయంగా వ్రాసారు, లేదా ఇతరులతో నేర్చుకున్నారు, లేదా పూర్వ గ్రంథాల నుండి చదివి వినిపిస్తున్నాడన్న అపోహాలు వారు లేపుతూ ఉంటారు. నిరక్షరాస్య మనిషి ఎలా ఇలా చేయగలడు? అందుకని వాస్తవంగా ఇది అల్లాహ్ వైపు నుండి అవతరించినదే.

(35) మహిమలు (Miracles)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించిన మహిమల్లో అతి గొప్పది దివ్య గ్రంథం ఖుర్ఆన్. ఇది ప్రళయం వరకూ మహిమగా నిలిచి ఉంది. అది భాషాప్రావీణులను, వాక్పుతులను అశక్తతకు గురి చేసింది. ఖుర్ఆన్ లో ఉన్నటువంటి పది సూరాలు, లేదా ఒక సూరా, లేదా కనీసం ఒక్క ఆయతైనా తేగలరా అని అల్లాహ్ అందరితో ఛాలెంజ్ చేశాడు. ముష్రికులు స్వయంగా తమ అసమర్థత, అశక్తతను ఒప్పుకున్నారు.

ఆయన మహిమల్లోః ఒకసారి ముష్రికులు మహత్యము చూపించమని కోరారు. ప్రవక్త అల్లాహ్ తో దుఆ చేశారు. చంద్రుణ్ణి రెండు వేరు వేరు ముక్కల్లో వారికి చూపించబడింది. (దీని వివరం పైన చదివారు).

కంకర రాళ్ళు ఆయన చేతులో సుబ్ హానల్లాహ్ పఠించాయి. అవే రాళ్ళు అబూ బక్ర్ చేతులో, తర్వాత ఉమర్ చేతులో, ఆ తర్వాత ఉస్మాన్ చేతులో పెట్టారు. అప్పుడు కూడా అవి తస్బీహ్ పఠించాయి.

ఎన్నో సార్లు ఆయన వ్రేళ్ళ నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి.

ప్రవక్త భోజనం చేసేటప్పుడు ఆ భోజనం కూడా తస్బీహ్ పఠిస్తున్నది సహచరులు వినేవారు.

రాళ్ళు, చెట్లు ఆయనకు సలాం చేసేవి.

ఒక యూదురాళు ప్రవక్తను చంపే ఉద్దేశ్యంతో మేక మాంసంలోని దండచెయి భాగంలో విషం కలిపి బహుమానంగా పంపింది. ఆ మాంసపు దండచెయి మాట్లాడింది.

ఒక గ్రామీణుడు ఏదైనా మహిమ చూపించండి అని కోరినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టును ఆదేశించగా అది దగ్గరికి వచ్చింది. మరోసారి ఆదేశించగా తన మొదటి స్థానానికి తిరిగి వెళ్ళింది.

ఏ మాత్రం పాలు లేని మేక పొదుగును చెయితో తాకగానే పాలు వచ్చేశాయి. దాని పాలు పితికి స్వయంగా త్రాగి, అబూ బక్ర్ కు త్రాపించారు.

అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు కళ్ళల్లో అవస్త ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని అతని కళ్ళల్లో పెట్టగా అప్పడికప్పుడే సంపూర్ణ స్వస్థత కలిగింది.

ఒక సహచరుని కాలు గాయపడంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కాలును చెయితో తుడిసారు. వెంటనే అది నయం అయ్యింది.

ప్రవక్త -ﷺ- అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కొరకు దీర్ఘాయుష్మంతుడుగను, అధిక ధన సంతానం గలవాడవాడిగను మరియు అల్లాహ్ వారికి శుభం (బర్కత్) ప్రసాదించాలని దుఆ చేశారు. అలాగే ఆయనకు 120 మంది సంతానం కలిగారు. ఖర్జూరపు తోటలన్నీ ఏడాదికి ఒక్కసారే ఫలిస్తాయి. కాని ఆయన ఖర్జూరపు తోట ఏడాదికి రెండు సార్లు పండేది. ఇంకా ఆయన 120 సంవత్సరాలు జీవించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు మెంబర్ పై ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి వచ్చి, అనావృష్టి దాపురించింది మీరు వర్షం కొరకు దుఆ చేయండని కోరగా, రెండు చేతులెత్తి దుఆ చేశారు. ఎక్కడా లేని మేఘాలన్నీ పర్వతాల మాదిరిగా ఒక చోట చేరి, వారం రోజుల పాటు కుండ పోత వర్షం కురిసింది. మరో జుమా రోజు ఖుత్బా సందర్భంలో వర్షం వల్ల నష్టం చేకూరుతుందని విన్నవించుకోగా రెండు చేతులెత్తి దుఆ చేశారు. అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలందరూ ఎండలో నడచి వెళ్ళారు.

ఖందక యుద్ధంలో పాల్గొన్న వెయ్యి మంది వీరులందరికీ సుమారు మూడు కిలోల యవధాన్యాల రొట్టెలు మరియు ఒక చిన్న మేక మాంసం తో ప్రవక్త వడ్డించారు. అందరూ కడుపు నిండా తృప్తికరంగా తిని వెళ్ళారు. అయినా రొట్టెలు మరియు మాంసంలో ఏ కొదవ ఏర్పడలేదు.

అదే యద్ధంలో బషీర్ బిన్ సఅద్ కూతురు తన తండ్రి మరియు మామ కొరకు తీసుకొచ్చిన కొన్ని ఖర్జూరపు పండ్లు వీరులందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తినిపించారు.

అబూ హురైరా రజియల్లాహు అన్హు వద్ద ఉన్న ఒకరి భోజనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి సైన్యానికి తినిపించారు.

హిజ్రత్ కు వెళ్ళే రాత్రి ఆయన్ను (సల్లల్లాహు అలైహి వసల్లం) హత్య చేయుటకు వేచిస్తున్న వంద మంది ఖురైషుల పై దుమ్ము విసురుతూ వారి ముందు నుండి వెళ్ళి పోయారు. వారు ఆయన్ని చూడలేకపోయారు.

హిజ్రత్ ప్రయాణంలో సురాఖా బిన్ మాలిక్ ఆయన్ను చంపడానికి వెంటాడుతూ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని శపించారు. అందుకు అతని గుఱ్ఱం కాళ్ళు మోకాళ్ళ వరకు భూమిలో దిగిపోయాయి.

(36) ప్రవక్త చరిత్రలోని నేర్చుకోదగ్గ విషయాలు

(37) పరిహాసం (Joke)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహసించే వారు, తమ ఇల్లాలితో వినోదంగా, ఉల్లాసంగా గడిపేవారు. చిన్నారులతో ఆనందంగా ఉండేవారు. వారి కొరకు సమయం కెటాయించేవారు. వారి వయసు, బుద్ధిజ్ఞానాలకు తగిన రీతిలో వారితో ప్రవర్తించేవారు. తమ సేవకుడైన అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హుతో కూడా ఒకప్పుడు పరిహసిస్తూ “ఓ రెండు చెవులవాడా” అని అనేవారు.

ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తా! నాకొక సవారి ఇవ్వండని అడిగాడు. ప్రవక్త పరిహాసంగా “మేము నీకు ఒంటె పిల్లనిస్తాము” అని అన్నారు. నేను ఒంటె పిల్లను తీసుకొని ఏమి చేయాలి? అని ఆశ్చర్యంగా అడిగాడతను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రతి ఒంటె, పిల్లనే కంటుంది కదా” అని నగుమోహంతో అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ముందు ఎల్లప్పుడూ మంద హాసంతో, నగుమోహంతో ఉండేవారు. వారి నుండి మంచి మాటే వినేవారు. జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నేను ఇస్లాం స్వీకరించినప్పటి నుండీ, ప్రవక్త వద్దకు ఎప్పుడు వచ్చినా ఆయన రావద్దని చెప్పలేదు. నేను ఎప్పుడు చూసినా చిరునవ్వే ఉండేది. ఒకసారి “ప్రవక్తా! నేను గుఱ్ఱంపై స్థిరంగా కూర్చోలేకపోతాను అని” విన్నవించు కున్నాను. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా రొమ్ము మీద కొట్టాడు. మళ్ళీ ఇలా దుఆ చేశారుః “అల్లాహ్ ఇతన్ని స్థిరంగా కూర్చోబెట్టు. ఇతడ్ని మార్గదర్శిగా, సన్మార్గగామిగా చెయ్యి”. ఆ తర్వాత నేను ఎప్పుడూ గుఱ్ఱం మీది నుంచి పడలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ బంధువులతో కూడా పరిహసించే వారు. ఒకసారి ప్రవక్త తమ కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళారు. అక్కడ హజ్రత్ అలీ రజియ్లలాహు అన్హు కన్పించక పోవడంతో. ఆయన ఎక్కడి వెళ్ళాడమ్మా! అని కూతుర్ని అడిగారు. దానికి ఫాతిమ రజియల్లాహు అన్హా సమాధానమిస్తూ “మా ఇద్దరి మధ్య చిన్న తగాద ఏర్పడింది. అందుకు ఆయన నాపై కోపగించుకొని, అలిగి వెళ్ళిపోయారు” అని అంది. ప్రవక్త అక్కడి నుండి మస్జిదుకు వచ్చారు. అతను అందులో పడుకొని ఉన్నారు. ఆయన మీది నుండి దుప్పటి తొలిగి పోయింది. ఆయన శరీరానికి మట్టి అంటుకొని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన శరీరానికి అంటుకొని ఉన్న మట్టిని తూడుస్తూ “అబూ తురాబ్ (మట్టివాడా)! లే అబూ తురాబ్! లే” అని అన్నారు.

(38) ప్రవక్త బాలలతో

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులకు, కూతుళ్ళకు ప్రవక్త ఉత్తమ సద్గుణాల్లో ఓ గొప్ప వంతు ఉండింది. ఒక్కోసారి ప్రవక్త తమ సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హాతో పరుగు పందెం పెట్టేవారు. ఆమె తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటే వద్దనేవారు కాదు. స్వయంగా ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారుః “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట నా స్నేహితురాళ్ళతో కలసి ఆడుకునేదాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి రాగానే ఆ బాలికలు భయపడి దాక్కునేవారు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నా దగ్గరకు పంపేవారు. నేను వారితో మళ్ళీ ఆడుకునేదాన్ని”.

బాలలతో అనురాగంగా కలిగి యుండి, వారిని ప్రేమగా చూసుకుంటూ ఒక్కోసారి వారితో ఆటలాడేవారు. షద్దాద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజులో తమ వెంట హసన్ లేదా హుసైన్ ను తీసుకొచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వెళ్ళి అబ్బాయిని కూర్చోబెట్టారు. అల్లాహు అక్బ్రర్ అని నమాజునారంభించారు. సజ్దాలో వెళ్ళి, చాలా ఆలస్యం అయినప్పటికీ లేవలేదు. నాకు అనుమానం కలిగి కొంచం తల లేపి చూశాను. ఆ అబ్బాయి ఆయన వీపుపై ఉన్నాడు. నేను మళ్ళీ సజ్దాలో ఉండిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించిన తర్వాత సహచరులుః ‘ప్రవక్తా! మీరు దీర్ఘంగా సజ్దా చేసినందుకు ఏదైనా సంఘటన జరిగిందా లేదా మీపై దివ్యవాణి (వహీ) అవతరణ జరుగుతుందా అని భావించాము’ అని అడిగారు. అందుకు ప్రవక్త చెప్పారుః “ఇవన్నీ ఏమి కాదు, విషయం ఏమిటంటేః అబ్బాయి నా వీపుపై ఎక్కాడు. అతను కోరిక తీరక ముందే తొందరగా లేవడం నాకు బావ్యమనిపించలేదు. అనసు రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ఉందిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఉత్తమ గుణం గలవారు. నాకో చిన్న తమ్ముడు ఉండేవాడు. అతని పేరు ఉమైర్. ప్రవక్త ప్రేమతో, అతని తృప్తి కొరకు ఇలా అనేవారుః “ఉమైర్ నీ నుఘైర్ ఎలా ఉంది”. నుఘైర్ అంటే బుర్ర పిట్ట. అతను దానితో ఆడుకునేవాడు.

(39) ప్రవక్త ఇల్లాలితో

ఇంటివారితో ప్రవక్త వ్యవహారంలో సర్వ సద్గుణాలు ఏకమయ్యాయి. ఆయన చాలా వినయనమ్రతతో మెదిలేవారు. తమ చెప్పులు స్వయంగా కుట్టుకునేవారు. అవసరమున్న చోట బట్టలకు మాసికలేసుకునేవారు. ఎప్పుడూ భోజనానికి వంకలు పెట్టేవారు కారు. ఇష్టముంటే తినే, లేదా వదిలేసేవారు. స్త్రీ జాతిని ఒక మనిషిగా గౌరవించేవారు. అంతే కాదు, తల్లి, భార్య, కూతురు, చెల్లి రూపాల్లో వివిధ గౌరవాలు ప్రసాదించేవారు. ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడుః నా సేవా సద్వర్తనలకు అందరికన్నా ఎక్కువ అర్హులేవరు అని. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అనే జవాబిచ్చారు. నాల్గవ సారి అడిగినప్పుడు “నీ తండ్రి” అని చెప్పారు. మరొసారి ఇలా చెప్పారుః “ఏ వ్యక్తి తన తల్లిదండ్రిలో ఒకరిని లేదా ఇద్దరిని పొంది, వారి సేవా చేసుకోకుండా నరకంలో ప్రవేశిస్తాడో అల్లాహ్ అతన్ని తన కరుణకు దూరమే ఉంచుగాకా!”.

ఆయన సతీమణి ఏదైనా పాత్ర నుండి త్రాగినప్పుడు, ఆయన ఆ పాత్ర తీసుకొని ఆమె ఎక్కడ తన మూతి పెట్టిందో అక్కడే తమ మూతి పెట్టి త్రాగేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారుః “మీలో మంచివారు తమ ఇల్లాలి పట్ల మంచి విధంగా మెలిగేవారు. నేను నా ఇల్లాలి పట్ల మీ అందరికన్నా మంచి విధంగా వ్యవహిరించేవాణ్ణి”.

(ఈనాడు మనం మన భార్యలతో ఉత్తమ రీతిలో వ్యవహరించి ఉంటే మరియు మన ఇల్లాలులు ప్రవక్త సతీమణుల లాంటి సద్గుణాలు అవలంబించి ఉంటే మన జీవితాలు సుఖశాంతులతో నిండి ఉండేవి. మనందరికి అల్లాహ్ ఈ భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్).

(40) ప్రవక్త కారుణ్యం

ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి కరుణ గుణం: ఆయన ఇలా ప్రవచించారుః “కరుణించేవారిని కరుణామయుడైన అల్లాహ్ కరుణిస్తాడు. మీరు భువిలో ఉన్నవారిపై కరుణ చూపండి. దివిలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు”. ప్రవక్తలో ఈ గొప్ప గుణం అధిక భాగంలో ఉండింది. చిన్నలు, పెద్దలు, దగ్గరివారు, దూరపువారు అందరితో గల ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యవహారాల్లో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన కరుణ, వాత్సల్యపు నిదర్శనం ఒకటిః ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిలవాళ్ళ ఏడుపు విని సామూహిక నమాజు దీర్ఘంగా కాకుండా, సంక్షిప్తముగా చేయించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ ఖతాదా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను నమాజు కొరకు నిలబడినప్పుడు దీర్ఘంగా చేయించాలని అనుకుంటాను, కాని పసి పిల్లవాని ఏడుపు విని నేను సంక్షిప్తంగా చేయిస్తాను. తన తల్లికి అతని వల్ల ఇబ్బంది కలగ కూడదని”.

తమ అనుచర సంఘం పట్ల ఆయన కరుణ, మరియు వారు అల్లాహ్ ధర్మంలో చేరాలన్న కాంక్ష యొక్క నిదర్శనం: ఒక యూద పిలవాడు వ్యాదిగ్రస్తుడయ్యాడు. అతడు ప్రవక్త సేవ చేసేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పరామర్శ కొరకు బయలుదేరి, అతని తలకడన కూర్చున్నారు. కొంత సేపటికి, “అబ్బాయీ! ఇస్లాం స్వీకరించు” అని చెప్పారుః అతడు తన తలాపునే నిలుచున్న తండ్రి వైపు చూశాడు. అబుల్ ఖాసిం (ప్రవక్త విశేషనామం, కునియత్) మాట విను అని అతని తండ్రి చెప్పాడు. ఆ అబ్బాయి అప్పుడే ఇస్లాం స్వీకరించాడు. మరి కొంత సేపటికే చనిపోయాడు. ప్రవక్త అతని వద్ద నుండి వెళ్తూ ఇలా అన్నారుః “ఇతన్ని అగ్ని నుండి కాపాడిన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు”.

(41) ప్రవక్త ఓపిక, సహనం

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు ఆయన ఓపిక, సహనాలతోనే జీవితం గడిపారు. ఈ (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా రజియల్లాహు అన్హా ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడుః నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారుః “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడుః అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు. అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉందిః ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడుః ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్ర్(6)లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖబా భూజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారుః

[أَتَقْتُلُونَ رَجُلًا أَنْ يَقُولَ رَبِّيَ اللهُ] {غافر:28}

{ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?}. (ఘాఫిర్ 28)

ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్, వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూః ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటె ను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగోల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.

వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడుః “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది. బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణిఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సంద ర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్టరోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది. ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి

1 అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.

పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త -ﷺ- ఇలా చెప్పారుః “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విష యంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రజియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం”.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మానవ గౌరవాల్లో కూడా శత్రు- వులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విజయధనం పంపిణి చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు”.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ రజియల్లాహు అన్హా మిగిలారు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారుః “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది”.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.

(42) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రార్థన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లవేళల్లో అల్లాహ్ ఆరాధన, ధ్యానం మరియు ఆలోచనలో ఉండేవారు. ఆయనకు ఏదైనా చింత, రంది కలిగినప్పుడు లేదా ఏదైనా ఆపద ఎదురైనప్పుడు బిలాల్ ను పిలిచి “నమాజుకు పిలుపునిచ్చి మాకు విలాసం, ఉల్లాసం కలుగజేయు బిలాల్” అని అనేవారు.

ఆయన రాత్రి తహజ్జుద్ చేస్తూ చాలా దీర్ఘంగా ఖియాం చేసేవారు. చివరికి పాదాలు వాపు ఎక్కేవి. ఖుర్ఆన్ చదువుతూ కొన్ని ఆయతులు మరీమరీ చదివేవారు. నమాజు స్థితిలో ఎక్కువగా ఎడ్వడం వల్ల గడ్డం తడి అయ్యేది. ఆయన సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః ప్రవక్తా! మీపై మీరు ఎందుకు ఇంతగా కష్టం తెచ్చుకుంటున్నారు. అల్లాహ్ మీ పూర్వపు మరియు వెనకటి పాపాలన్నియూ మన్నించాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పేవారుః “నేను ఆయనకు కృతజ్ఞుడైన దాసుడ్ని కాకూడదా?” రాత్రి అధిక శాతం అల్లాహ్ తో వేడుకోలులో, ఖుర్ఆన్ పారాయణంలో, దుఃఖిస్తూ గడిపేవారు.

అలాగే ఉపవాస విషయానికి వస్తే ప్రయాణంలోనైనా, నివాసంలోనైనా, చలికాలంలోనైనా, ఎండకాలంలోనైనా ఎక్కువగా ఉపవాసాలుండేవారు. మేము ఒకసారి విపరీతమైన ఎండలో ఉన్నాము. ఆరాధనలకు అర్హుడైన అల్లాహ్ సాక్షిగా! ఎండతాపాన్ని భరించలేక మా తలపై చేతులను పెట్టు- కుంటూ ఉంటిమి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇబ్ను రవాహ రజియల్లాహు అన్హు, వీరిద్దరు తప్ప ఎవరు ఉపవాసముండలేదు.

దానదర్మాలు విషయం హద్దు లేకుండా దాతృత గుణం గలవారు. ఆయన వద్ద ఉన్న ప్రతీది దానం చేసేవారు. పేదరికానికి భయపడకుండా ఖర్చు చేసేవారు. ఎప్పుడు ఏ ఒక్క యాచకున్ని లేదనలేదు. ఎప్పుడు ఎవరు ఏది అడిగినా ఏమీ ఇవ్వకుండా వట్టి చేతుల్తో పంపేవారు కాదు. అతనికి సహాపడేవారు. ఆయన సహచరులు అనేవారుః ప్రవక్తను ఎప్పుడు ఏ విషయం అడిగినా ఆయన దానిని కాదనలేదు.

(43) జుహ్ద్

జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది అఇష్టంగా వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదించేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకునేవారు. శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖన ప్రస్తావించారుః “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూ కోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ఇవన్ని యూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి”. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).

ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే దీనార్ తప్ప ఆ బంగారంలో ఒక దీనార్ కూడా నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారుః “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు”.

(44) ప్రవక్త తిండి మరియు వస్త్రాధారణ

తిండి విషయం, నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయం కాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.

ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.

అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న కంబళి మరియు మందమైన లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడిచేవాణ్ణి ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండేది.

ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు దానం చేసియున్న ఒక భూమి తప్ప. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవ ధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.

(45) ప్రవక్త న్యాయం

న్యాయ విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తార తమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబూ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే వినిపించు కునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారుః “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని అనుకునేవాణ్ణి”.

ఒకసారి ఉసైది బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు. వెంటనే ఉసైద్ అన్నాడుః ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచు కున్నాను. ప్రవక్త చెప్పారుః సరే తీర్చుకో. ఉసైద్ అన్నాడుః ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది. మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది. అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు. ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య ముద్దించు కోసాగాడు. మళ్ళీ చెప్పాడుః నేను కోరింది ఇదే ప్రవక్తా!

అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హును సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారుః “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడవుతే అతన్ని శిక్షించ కుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని”.

(46) ముహమ్మద్ ﷺ గురించి ఎవరేమన్నారు?

కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (orientalists) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ క్రింద తెలుపుతున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని, ఆయన ప్రవక్తపదవిని, ఆయన ఉత్తమ గుణాలను వారు ఒప్పుకున్న విషయాల్ని స్పష్టం చేస్తున్నాము. కొందరు ఇస్లామీయ విరోధులు, శత్రువులు చేస్తున్న దుష్ప్రచారానికి, పక్షపాతానికి ఈ ఇస్లాం ధర్మం దూరంగా ఉంది అని వారు తెలిపిన ఇస్లాం ధర్మ వాస్తవికతలను మీ ముందుంచుతున్నాము. (అయితే ఇస్లాంగానీ, ప్రవక్తగానీ వారి ప్రశంసలకు, సాక్ష్యాలకు ఆధారపడిలేరు. మరి ఇవి తెలిపే కారణం ఏమిటంటే; ఇస్లాంను అర్థం చేసుకోకుండా, దానిని చెడుగా భావించేవారు, వారి వంశం, లేదా వారి లాంటి మతాలపై ఉన్నవారిలో కొందరు ఇస్లాంను చదివి ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇస్లాం అధ్యాయనం చేసి, న్యాయంపై ఉండాలన్నదే మా ఉద్దేశం).

జోర్జ్ బర్నార్డ్ షా(*) తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహ మ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించే అంతటి శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.

ఇంకా ఇలా వ్రాశాడుః “అజ్ఞానం, దానిపై పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించిచదివాను. అతను వర్ణాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవమతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.

(*) నోట్: George Bernard Shaw. జననం 26/7/1856. మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.

థోమస్ కార్లైల్(**) తన ప్రఖ్యాతిగంచిన రచన “On Heroes, HeroWorship, and the Heroic in History”లో ఇలా వ్రాశాడుః “ముహమ్మద్ కుయుక్తుడు, మోసగాడు, అసత్యరూపి మరియు అతని ధర్మం కేవలం బూటకపు, బుద్ధి హీన విషయాల పుట్ట అన్న ప్రస్తుత మన వ్యూహం, మరియు ఇలాంటి వ్యూహాలను వినడం నేటి విద్యాజ్ఞాన యుగంలో మన కొరకే సిగ్గు చేటు. ఇలాంటి మూఢ, సిగ్గుచేటు విషయాలు ప్రభలకుండా పోరాడడం మన విధి. ఈ ప్రవక్త అందజేసిన సందేశం 12 వందల సంవత్సరాల నుండి రెండు వందల మిలియన్లకంటే ఎక్కువ మంది కొరకు ప్రకాశ వంతంగా ఉంది. ఈ సందేశాన్ని విశ్వసించి, దాని ప్రకారం తమ జీవితా లను మలచుకొని దానిపై చనిపోయిన ప్రజలు అసంఖ్యాకులు. ఇంతటి గొప్ప వాస్తవం అబద్ధం, బూటకం అని భావించగలమా?”.

(**) నోట్: Thomas Carlyle జననం 4/12/1795 స్కాట్ ల్యాండ్ లోని Ecclefechan గ్రామంలో. మరణం 5/2/1881 లండన్ లో ప్రఖ్యాతి గాంచిన చరిత్ర కారుడు, సాహిత్యపరుడు.

మన ఇండియా తత్వవేత్త రామ క్రిష్ణా రావు ఇలా చెప్పారుః “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.

కెనడాకు చెందిన ఓరియంటలిస్ట్ జ్వీమర్ (S.M. Zweimer) ఇలా వ్రాశాడుః “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు.

ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళ వాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆను మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం చెబుతున్నాయి.

సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.

ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభ మైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.

గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టోల్స్ టాయ్(#) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుందిః ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమాజాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.

(#) నోట్: Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828 మరణం 20/11/1910 జన్మ స్థలం Tula Oblast, Russia. ప్రపంచపు గొప్ప నవలా రచయితల్లో ఒకడితను. తత్వవేత్త కూడా.

ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడుతుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.

మహాప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వసల్లం యొక్క సంపూర్ణ జీవిత చరిత్ర పరిశీలన దృష్టితో చదివి ఆయన అనుకరణ భాగ్యం అల్లాహ్ సర్వమానవాలికి ప్రసాదించుగాక! ఆమీన్!!!


%d bloggers like this: