సహాబాలను తూలనాడటం, ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ఆరవ ప్రకరణం: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల(రదియల్లాహు అన్హుమ్)ను, మార్గదర్శక నాయకులను తూలనాడరాదు 

(1) సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) తూలనాడటం పట్ల వారింపు: 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ సంవిధానంలో ఉన్న నిబంధనలలో ఒకటేమిటంటే మహాప్రవక్త ప్రియ సహచరుల (రదియల్లాహు అన్హుమ్) విషయంలో వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండాలి. వారి గురించి నోరు జారకూడదు. అల్లాహ్ తన గ్రంథంలో తెలియజేసినట్లుగా ఉండాలి వారి వైఖరి. 

وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

వారి తరువాత వచ్చిన వారు (వారి గురించి) ఇలా వేడుకుంటారు: “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

ఇంకా వారు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఈ హితవును ఖచ్చితంగా పాటిస్తారు – 

“నా సహచరులను దూషించకండి. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా! మీలో ఏ వ్యక్తి అయినా ఉహుద్ పర్వతానికి సమానంగా బంగారం ఖర్చుచేసినా, వారిలో (అంటే నా ప్రత్యక్ష సహచరులలో)ని వారు దానం చేసిన ఒక ‘ముద్’కు, ఆఖరికి ‘ముద్’లో సగభాగానికి కూడా సమానం కాజాలదు.” (బుఖారీ, ముస్లిం) 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు సహాబాలను దూషించే రాఫిధీల (షియా వారి)తో, ఖవారిజ్ వర్గీయులతో తెగతెంపులు చేసుకుంటారు. వారితో ఎలాంటి స్నేహం, సుహృద్భావం కలిగి ఉండరు. తరచూ సహాబాలను కాఫిర్లు (అవిశ్వాసులు)గా ఖరారు చేసే వీరి ధోరణిని ఖండిస్తారు. వీరిలోని ఏ మంచితనాన్ని అంగీకరించరు. 

ప్రవక్త సహచరుల ఔన్నత్యం గురించి ఖుర్ఆన్ హదీసులలో చెప్పబడిన దానిని అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు శిరసావహిస్తారు. సహాబా ముస్లిం ఉమ్మత్ లో కెల్లా అత్యుత్తములని విశ్వసిస్తారు. ఉదాహరణకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లుగా – 

”మీ అందరిలోకెల్లా ఉత్తములు నా కాలానికి చెందినవారు.” (బుఖారీ, ముస్లిం) 

తన ఉమ్మత్ (అనుచర సమాజం) 73 వర్గాలుగా చీలిపోతుందని, వారిలో ఒకే ఒక వర్గం తప్ప మిగిలిన వారంతా నరకానికి పోతారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినపుడు, ఆ ఒక్క వర్గం ఏదంటూ ప్రియ సహచరులు (రదియల్లాహు అన్హుమ్) అడిగారు. సమాధానంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా అన్నారు : 

“ఈ రోజు నేను, నా సహచరులు ఏ పద్ధతిపై ఉన్నామో ఆ పద్ధతిపై స్థిరంగా ఉండేవారు.”
(ముస్నదె అహ్మద్, తిర్మిజి 2641 హసన్) 

ఇమామ్ ముస్లిం గురువుల్లో ప్రముఖులైన ఇమామ్ అబూజర్అ ఇలా అంటున్నారు:

“ఏ వ్యక్తి అయినా మహాప్రవక్త ప్రియసహచరులలో ఎవరినయినా తూలనాడుతున్నట్లు మీరు గమనిస్తే అతణ్ణి ధర్మవిహీనునిగా పరిగణించండి. ఎందుకంటే ఖుర్ఆన్ సత్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయత్ సత్యబద్దం. కాగా; వీటన్నింటినీ మన వరకూ చేర్చినవారు సహాబీలే (ప్రియ సహచరులే). కాబట్టి వారిని తూలనాడినవాడు ఖుర్ఆన్ హదీసులనే అసత్యంగా ఖరారు చేయదలుస్తున్నాడని అనుకోవాలి. కనుక అలాంటి వ్యక్తి స్వయంగా నిందార్హుడు. అతనిపై ధర్మవిహీనుడు, మార్గవిహీనుడన్న అభియోగం మోపటం చాలా వరకు సమంజసం, సత్యం.” 

అల్లామా ఇబ్నె హమదాన్ తన గ్రంథం ‘నిహాయతున్ ముబ్ త దీన్’లో ఇలా అంటున్నారు :

“ఎవరయితే ప్రవక్త సహచరులను దూషించటం ధర్మసమ్మతం అని భావిస్తూ మరీ దూషిస్తున్నాడో అతను ఖచ్చితంగా కాఫిర్ (అవిశ్వాసి). మరెవరయితే ధర్మసమ్మతం కాదని భావిస్తూ కూడా దూషిస్తాడో అతడు పాపాత్ముడు (ఫాసిఖ్ ).”

ఆయన గారి మరో పలుకు ఇలా ఉంది :

“ఎవరయితే ప్రవక్త ప్రియ సహచరులను దూషిస్తాడో, అతను నిశ్చయంగా కాఫిరే (దాన్ని అతను ధర్మసమ్మతమని భావించినా, భావించక పోయినా). అదేవిధంగా – ఎవరయితే ప్రవక్త సహచరుల (రదియల్లాహు అన్హుమ్)ను అవిధేయులుగా ఖరారు చేస్తాడో లేదా వారి ధర్మావలంబనలో లోపం ఎత్తిచూపిస్తాడో లేదా వారిని కాఫిర్లుగా ఖరారు చేస్తాడో, అతను ముమ్మాటికీ కాఫిర్ (అవిశ్వాసి). (షరహ్ అఖీదతుస్సిఫారీని – 2/388, 389) 

(2) ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు : 

మహిమోన్నతల దృష్ట్యాగానీ, స్థాయి రీత్యాగానీ సహాబా తర్వాత స్థానం, ఉమ్మత్ కు చెందిన మార్గదర్శక నాయకులది. వారే తాబయీన్, తబయె తాబయీన్, ఆ తర్వాత తరానికి చెందిన ఉలమా. వారంతా సహాబాను శాయశక్తులా అనుసరించారు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్దితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. (అత్ తౌబా : 100) 

కనుక వారిని దూషించటం, వారిలోని లోపాలను ఎత్తి చూపటం, వారిపై విమర్శనాస్త్రాలు సంధించటం ఎంతమాత్రం సమ్మతం కాదు. ఎందుకంటే వారంతా మార్గదర్శకులు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటం అయిన మీదట కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపునకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (అన్ నిసా : 115) 

‘కితాబుత్తహావియ’ వ్యాఖ్యాత (ఇమామ్ ఇబ్నె అబీ అజల్ హనఫీ) ఇలా అన్నారు: 

“అల్లాహ్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో స్నేహపూర్వక సంబంధాల తర్వాత తోటి విశ్వాసులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటం ప్రతి ముస్లింకూ తప్పనిసరి. ఈ విషయంలో ఖుర్ఆన్ సర్వ సాధారణమయిన ఆజ్ఞ ఉండనే ఉంది. అయితే మరీ ముఖ్యంగా ప్రవక్తల వారసులతో మనకు స్నేహబంధం ఉండాలి. అల్లాహ్ వారిని ధ్రువతారల మాదిరిగా చేశాడు. నేలలోని, సముద్రాలలోని చీకట్లలో వాటి ద్వారా మార్గం కనుగొనబడుతుంది. వారి మార్గదర్శకత్వంపై, వారి ధర్మావగాహనపై ముస్లింలందరికీ గురి ఉంది.” 

ఎందుకంటే వీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యుల, వారు వదలివెళ్ళిన మృత సంప్రదాయాలను పునరుజ్జీవింప జేసేవారు. వారి మూలంగానే దైవగ్రంథం నెలకొని ఉంది. దాని ఊపిరి మూలంగా వారు కూడా నిలబడి ఉన్నారు. వారి గురించి దైవగ్రంథంలో స్పష్టమయిన వివరణ వచ్చింది. వారు కూడా దానికి ప్రతినిధుల వంటి వారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అనుసరించటం అనివార్యం (వాజిబ్) అన్న విషయంలో వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాని ఒకవేళ వారిలో ఎవరి ఉవాచ అయినా ప్రామాణిక హదీసుకు వ్యతిరేకంగా మన ముందుకువస్తే, ఆ హదీసును పరిత్యజించటంలో ఆయన వద్ద తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది అని మనం భావించాలి. 

సాధారణంగా ఆ కారణం మూడు విధాలుగా ఉంటుంది. 

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం అయి ఉండవచ్చన్న విషయంపై అతనికి నమ్మకం కుదరక పోవచ్చు. 
  2. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ ప్రవచనం ద్వారా చెప్పదలచిన విషయంపై ఇదమిత్థంగా ఒక నిర్ధారణకు రాకపోయి ఉండవచ్చు. 
  3. అది రద్దు అయిపోయిన ఆజ్ఞ కావచ్చు అన్నది అతని నమ్మకం అయి ఉండవచ్చు. 

మొత్తానికి మనందరి మీద వారికి ఆధిక్యత ఉంది. మనకు వారు ఉపకారం చేసినవారు. వారు మనకన్నా ముందే విశ్వసించినవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందజేసిన ధర్మాన్ని వారు మన వరకూ చేర్చారు. మనకు అర్థం కాకుండా నిగూఢంగా ఉండిపోయే ఎన్నో విషయాలను వారు మనకు విడమరచి చెప్పారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతుష్టపరచుగాక! 

رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

కొంతమంది విద్వాంసుల (ఉలమా)చే ధర్మసూత్రాల అన్వయింపు (ఇత్తెహాదీ) ప్రక్రియలో దొర్లిన తప్పుల మూలంగా వారి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేయటం బిదతీల విధానం. ఇలాంటి వాటి కోసం ఇస్లాం విరోధులు కాచుకుని ఉంటారు. తద్వారా ఇస్లాం గురించి లేనిపోని సందేహాలు సృష్టించటానికి, ముస్లిముల మధ్య వైరభావం పుట్టించటానికి శాయశక్తులా యత్నిస్తారు. భావి తరాలవారు తమ పూర్వీకుల (సలఫ్) పట్ల విముఖతను, విసుగును వ్యక్తం చేసేలా కుట్ర పన్నుతారు. విద్వాంసులకు – నవ యువకులకు మధ్య విభేదాలను సృష్టిస్తారు. వారి మధ్య పూడుకోని అంతరాల అగాధాలను కల్పిస్తారు. నేడు సర్వత్రా జరిగేది కూడా ఇదే. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న నవయువకులు ఈ స్వార్థపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు ధర్మవేత్తల (ఫుకహా) యొక్క, ఇస్లామీయ ధర్మశాస్త్రం (ఫికప్) యొక్క స్థాయిని దిగజారుస్తారు. 

దానిని చదవటం, చదివించటం పట్ల, దానిలో ఉన్న శ్రేయోదాయకమయిన విషయాలను, సత్యాన్ని సంగ్రహించటం పట్ల తమ అనాసక్తతను, విసుగును ప్రదర్శిస్తూ ఉంటారు. మొత్తానికి వారు తమ ఫికహ్ (ధర్మశాస్త్రం)ను గర్వకారణంగా భావించాలి. తమ విద్వాంసులను గౌరవించాలి. మార్గవిహీనుల, స్వార్థపరుల దుష్ప్రచార జాలంలో మాత్రం చిక్కుకోరాదు. 


నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

%d bloggers like this: