షాబాన్ నెల యెుక్క వాస్తవికత! షాబాన్ సున్నతులేమిటి? దురాచారాలేమిటి? [పుస్తకం]

బిస్మిల్లాహ్

సంకలనం : ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

షాబాన్ సున్నతులేమిటి? దురాచారాలేమిటి?

షాబన్ ఇస్లమీయ క్యాలెండర్ ప్రకారం 8వ మాసం. దీనికి ముందు రజబ్ గౌరవప్రదమైన నాలుగు మాసాల్లో ఒకటి. దీని తర్వాత రమజాన్ చాలా ఘనతగల మాసం.

షాబాన్ లో సున్నతులు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ మాసంలో అధికంగా ఉపవాసాలు పాటించేవారు.

ఒక సందర్భంలో ఉసామా (రజియల్లాహు అన్హు) అడిగారు, ఓ ప్రవక్తా! మీరు షాబాన్ మాసంలో పాటించినన్ని ఉపావాసాలు వేరే ఏ మాసంలో పాటించేది చూడలేదు, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

“ఇది రజబ్ మరియు రమజాను మధ్యలో ఉన్న మాసం, ఇందులో ప్రజలు అశ్రద్ధకు లోనై ఉంటారు. ఈ మాసంలోనే ప్రజల కర్మలు అల్లాహ్ ఎదుట లేపబడతాయి. నేను ఉపవాస స్థితిలో ఉండగా నా కర్మలు లేపబడాలని నా కోరిక”

(నిసాయి 2357, ముస్నద్ అహ్మద్ 21753. షేఖ్ అల్బానీ హసన్ అన్నారు.)

సలఫ్ పద్ధతి: సహాబా, తాబిఈన్ తదితరులు అధికంగా ఉపవాసంతో పాటు ఖుర్ఆన్ కూడా ఎక్కువగా పారాయణం చేసేవారు. దీని తర్వాత రమజాను మాసం గనక, అందులో ఈ మంచి అలవాటు స్థిరపడిపోతుంది. (లతాఇఫుల్ మఆరిఫ్.)

సారాంశం:  ఈ మాసంలో అధికంగా ఉపవాసాలు పాటించడం ప్రవక్త సున్నత్.

దురాచారాలు:

షాబాన్ 15వ రాత్రి జాగారం. ప్రత్యేక నమాజులు. పగలు ఉపవాసం. సమాధుల సందర్శన. ఈ రాత్రి చనిపోయినవారి ఆత్మలు వస్తాయని మూఢనమ్మకం.అందుకు మస్జిదులు, ఇండ్ల అలంకరణ. ప్రత్యేక వంటకాలు.

దురాచార ఆధారాలు వాటి వాస్తవికతలు:

షాబాన్ 15వ రాత్రి చాలా ఘనత గలదని ఖుర్ఆనులో సూర దుఖాన్ (44) ఆయతు 3లోని “లైలతుమ్ ముబారక” (శుభప్రదమైన రాత్రి) అన్న పదాన్ని చూపిస్తారు.

జవాబు: 44:3లో దివ్వ ఖుర్ఆన్ శుభప్రదమైన రాత్రిలో అవతరించిందని ఉంది. అయితే ఆ శుభప్రదమైన రాత్రి షాబాన్ లో లేదు, రమజానులో ఉంది. ఎలా అంటే దివ్వ ఖుర్ఆన్ అవతరణ విషయం అల్లాహ్ సూర ఖద్ర్ (97)లో కూడా పేర్కొన్నాడు. మరియు సూర బఖర (2) ఆయతు 183 లో స్పష్టంగా తెలిపాడు: ఈ ఖుర్ఆన్ రమజానులో అవతరించిందని. 

(1) షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – మెదటి బాగం

ఖుర్ఆన్  లో వచ్చిన  ‘శుభప్రదమైన రాత్రి’ అంటే  షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రినా? లేక రమజాన్ నెలలో వచ్చే లైలతుల్  ఖద్ర్ నా?  ఖుర్ఆన్ వెలుగులో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్.

సూరహ్ అద్ దుఖాన్ ఆయాతును చూపించి షాబాన్ నెల 15 తేది రాత్రి షబెే బరాత్ శుభప్రదమైన రాత్రని చాలా మంది అపోహను కలిగివున్నారు.  ఆ ఆయతు మరియు తఫ్సీర్ లను చదివి సత్యాన్ని తెలుసుకుందాము

حمٓ  وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ
హా మీమ్‌. స్పష్టమైన   ఈ   గ్రంథం   తోడు!

إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةٍۢ مُّبَٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
నిశ్చయంగా   మేము   దీనిని   శుభప్రద   మైన   రాత్రియందు   అవత   రింపజేశాము.   నిస్సందేహంగా   మేము   హెచ్చరిక   చేసేవాళ్ళము.

فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيم
ఆ   రాత్రియందే   కీలకమైన   ప్రతి   ఉత్తర్వూ   జారీ   చేయబడు   తుంది.

أَمْرًۭا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ
మా   వద్ద   నుండి   ఆజ్ఞ   రూపంలో!   (ప్రవక్తలను)   పంపేది   కూడా   మేమే.

رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
నీ   ప్రభువు   దయానుగ్రహం   వల్ల.   ఆయన   సర్వం   వినేవాడు,   సర్వం   తెలిసినవాడు.

رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ
మీరు   గనక   నమ్మగలిగితే   ఆయనే   భూమ్యాకాశాలకు,   వాటి   మధ్యనున్న   సమస్తానికీ   ప్రభువు.

لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
ఆయన   తప్ప   మరో   ఆరాధ్య   దైవం   లేడు.   ఆయనే   బ్రతికిస్తున్నాడు,   ఆయనే   చంపుతున్నాడు.   ఆయనే   మీ   ప్రభువు,   పూర్వీకు   లైన   మీ   తాతముత్తాతలకు   కూడా   (ఆయనే)   ప్రభువు.

(ఖుర్’ఆన్  44 :1 – 8)

పై ఆయతులో వచ్చిన శుభప్రదమైన రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని భావం. ఈ లైలతుల్ ఖద్ర్ రమజాన్ నెల చివరి దశకంలోని బేసి రాత్రుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది.

దివ్య ఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల”  – అల్ బఖర – 185.అని చెప్పబడటం గమనార్హం.

అలాగే “మేము ఈ ఖుర్ఆన్ ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము” అని అల్ ఖద్ర్ సూరాలో సెలవీయబడటం కూడా గమనార్హమే.

ఆ ఘనమైన రేయినే ఈ సూరాలో శుభప్రదమైన రేయిగా పేర్కోనటం జరిగింది. అది శుభప్రదమైన రేయి అనటంలో సందేహానికి తావేలేదు. ఎందుకంటే

ِ إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ
నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును రమజాను నెలలో) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.

وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ
ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు?

لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ
ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది.

تَنَزَّلُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ
ఆ రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భూమికి) దిగివస్తారు.

سَلَٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ
ఆ రాత్రి అసాంతం శాంతియుతమైనది – తెల్లవారే వరకూ (అది ఉంటుంది).

ఖుర్’ఆన్ 97 :(1 – 5)

దివ్యఖుర్ఆన్ ఘనమైన రాత్రిన లేక శుభకరమైన రాత్రిన అవతరించిందంటే దాని భావం ఇదే. ఆ రాత్రి నుంచి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దాని అవతరణాక్రమం ఆరంభమయింది. అంటే తొట్టతొలిసారి ఈ రాత్రియందే ఈ గ్రంధం అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించింది. లేక దీని భావం ఇది:

ఈ రాత్రియందే దివ్యఖుర్ఆన్ “లౌహె మహ్ పూజ్” నుంచి క్రింది ఆకాశంలో ఉన్న ‘బైతుల్ ఇజ్జత్‘ లోకి దించబడింది. మరి అక్కణ్ణుంచి అవసరాల కనుగుణంగా కొద్దికొద్దిగా 23 ఏండ్ల వ్యవధిలో మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించింది.

కొంత మంది ‘శుభప్రదమైన రాత్రి’ ని షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిగా తలపోశారు. కాని ఇది సరైనది కాదు.

ఈ గ్రంధం రమజాన్ మాసంలోని ‘లైలతుల్ ఖద్ర్’ లో అవతరించినట్లు ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా రూఢీ అవుతున్నప్పుడు ఇతరత్రా రాత్రుల గురించి ఆలోచించటం ఎంతమాత్రం సరైంది కాదు.

రెండవ భాగంలో హదీసుల వెలుగులో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

(2) షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – రెండవ భాగం

మెదటి బాగంలో ఖుర్ఆన్ లో వచ్చిన  ‘శుభప్రదమైన రాత్రి’ అంటే రంజాన్ నెలలో చివరిదశలో వచ్చే  లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని తెలుసుకున్నాము. హదీసుల వెలుగులో  షబేబరాత్ కు సంభందించిన హదీసులు  ప్రామాణికమైనవేనా? తెలుసుకుందాం ఇన్ షా అల్లాహ్.

షాబాన్ 15వ రాత్రి (షబే బరాత్) కి సంబందించిన  హదీసుల్లో ఒకటి మాత్రమే సహీహ్ (హసన్) గా మరియు మిగితా హదీసులు ప్రామాణికమైనవి కావు.!

ఆ హదీసుల్లో కొన్నిటిని గురించి శ్రద్ధగా చదవి సత్యాన్ని తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

1)  మెుదటి హదీసు –

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా)  ఉల్లేఖించారు, ఒకసారి షాబాన్ 15 వ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  నా పడకపై లేకపోవడం వలన వెదుకుతూ ఉండగా  బఖీ స్మశానంలో అగుపించగా నేను అక్కడికెళ్లి కారణం అడుగగా – “ఈ రాత్రి అల్లాహ్ ప్రపంచం వైపు దృష్టిసారిస్తాడు, బని కల్బ్ వారి గొర్రెల వెంట్రుకల కంటే అధిక రెట్లో మానవుల పాపాలను క్షమిస్తాడు” అని చెప్పారు.

ఈ హదీసు ముస్నద్ అహ్మద్, తిర్మిది, ఇబ్నెమాజాలో ఉంది.

పై మూడు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా ద్వార ఉర్వా, ఉర్వా ద్వారా యహ్ యా, యహ్ యా ద్వారా హజ్జాజ్ విన్నట్లు ఉంది.

అయితే ఇమాం తిర్మిజి ఈ హదీసు చివరిలో ఎంతో స్పష్టంగా చెప్పారు: నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ ద్వారా విన్నాను ఆయన దీనిని బలహీనమైనదని, ప్రామాణికమైనది కాదని చెప్పారు, ఎందుకంటే ఉర్వా ద్వారా యహ్’యా మరియు యహ్’యా ద్వారా హజ్జాజ్ వినలేదు.

(తిర్మిజి, అబ్వాబుస్ సియాం, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్. 739)

2) రెండవ హదీసు 

హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

“షాబాన్ 15 వ రాత్రి  అల్లాహ్ యెుక్క ఆరాధనలో నిలబడు. మరునాడు నీవు ఉపవాసం పాటించు. అల్లాహ్ షాబాన్ 14 నాటి సూర్యాస్తమయం వెంటనే ప్రపంచపు ఆకాశంపై వచ్చి, ఫజ్ర్ వరకు తన పాపాల మన్నింపు కోరేవాడున్నాడా నేను అతడ్ని మన్నిస్తాను, ఉపాధి కోరేవాడున్నాడా నేను అతనికి ఉపాధిని ప్రసాదిస్తాను, ఆపదలో ఉన్నవాడెవడూ అతనికి స్వస్థత ప్రసాదిస్తాను అంటూ ఇలాంటి నినాదాలు ప్రకటిస్తాడు.”

(ఇబ్నుమాజా, కితాబు ఇఖామతిస్ సలాతి వస్సున్నతు ఫీహా,  బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్ 1388)

ఈ హదీసు గురించి షేఖ్ అల్బాని రహిమహుల్లాహ్ తెలిపారు ఇది దయీఫ్ మరియు మౌదూ అని (అంటే ప్రామాణికమైనది కాదు, కల్పించబడినది).

ఈ హదీసులో ఇబ్ను అబి సబ్రా అనే వ్యక్తి  గురించి  ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ ఇబ్నె ముయీన్ ఇలా చెప్పారు: అబూ సబ్రా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పని హదీసులు తానె చెప్పి ప్రవక్త వైపు ఆపాదించాడు. అందువలన అతనిని  కల్పిత హదీసుల బోధకుడిగా పేర్కోన్నారు.

3) మూడవ హదీసు హసన్ మరియు సహీగా కొందరు ఉలమాలు పేర్కొన్నారు.-

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉల్లేఖించారు: “షాబాన్ 15వ రాత్రి అల్లాహ్ (తఆలా) తన దాసుల పట్ల దృష్టి సారిస్తాడు.  అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు. కాని ఇద్దరి వ్యక్తుల పాపాలను క్షమించడు. వారిలో ఒకడు : అల్లాహ్ కు బాగాస్వామిని నిలబెట్టేవాడు (షిర్క్ చేసేవాడు) రెండో వాడు: మనసులో కపటం, కీడు గలవాడు.”

(ఈ హదీసు ఇబ్నెమాజా, ఇబ్ను హిబ్బాన్ లలో ఉంది.) ఈ హదీసు కొందరి దగ్గర దయీఫ్ గా వుంటే ఎక్కువ ఉలమాలు దీనిని ఇతర హదీసుల ఆదారంగా సహీగా ప్రకటించారు.

పై హదీసులు మరికొన్ని వేరే బలహీన, లేదా కల్పిత హదీసుల ద్వారా ఈ క్రింది విషయాలను సత్కార్యాలుగా భావించి, వాటిని ప్రత్యేకంగా 15వ షాబాన్ సందర్భంగా చేయటం పుణ్యకార్యం అని అంటారు:

 • 1- 15వ షాబాన్ రాత్రి జాగారం
 • 2- ప్రత్యేక నమాజులు
 • 3- పగలు ఉపవాసం పాటించడం.
 • 4- సమాధులను దర్శించడం
 • 5- గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని, అంతే కాదు ప్రత్యేక వంటకాలు చేసి, వాటిని ఆ ఆత్మలు తినిపోతాయని భ్రమపడడం జరుగుతుంది.

అయితే సోదర సోదరిమణులారా! పై ఐదు విషయాలు మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గానీ, సహాబాలు, తాబియిన్లు గానీ పాటించలేదు. అలాంటి మూఢనమ్మకాలు అసలు వారికి లేనే లేవు.

కొందరి అభిప్రాయమేమిటంటే ఆ రాత్రి ఇద్దరిని తప్ప అందరిని అల్లాహ్ క్షమిస్తాడు అని వచ్చిన హదీసు సహీ అయినప్పుడు నమాజు, రోజాలు పాటించడంలో తప్పు ఏమిటి అని అంటారు? కాని వాస్తవంగా ఆలోచిస్తే, ఆ హదీసులో అలాంటి భావమేమీ లేదు.

అలా అనుకుంటే సహీ బుఖారీ హదీసు నంబర్ 758లో ఈ విధంగా ఉంది:

“అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగం మిగిలి ఉండగా ప్రపంచపు ఆకాశం వైపునకు వచ్చి ఎవరైనా అడుగుతారా వారికి ఇస్తాను, ఎవరైనా దుఆ చేస్తారా అంగీకరిస్తాను, ఎవరైనా పాప మన్నింపు కోరుతారా మన్నిస్తాను అని ఫజ్ర్ వరకు ప్రకటిస్తూ ఉంటాడు.”

గమనించండి ఇది బుఖారీలోని హదీసు, ఏ ఒక్కరు దీనిని బలహీనమైనది అని అనలేదు, అనలేరు కూడా. కానీ  పై హదీసు కొందరు పండితులు బలహీనమైనదంటే మరి కొందరు సహీ అన్నారు.అయితే బుఖారీ హదీసు ప్రకారం ప్రతి రోజు మేల్కొని అల్లాహ్ ను వేడుకుంటూ మన్నింపు కూరుతూ అన్ని మేల్లు అడుగుతూ ఉంటే ఎంత బావుంటుంది. అలా కాకుండా నిరాధరమైన హదీసుల ఆధారంగా కేవలం ఒక రాత్రి, పగలు పాటించడం అసలు ఇది ప్రవక్త పద్ధతే కాదు. ప్రవక్త పద్ధతి కానప్పుడు పుణ్యానికి బదులుగా పాపం మూట గట్టుకున్నట్లవుతుంది. జాగ్రత్తా!

మూడవ భాగంలో హదీసుల వెలుగులో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

(3) షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – మూడవ భాగం

షాబాన్ నెల యెుక్క చేయవలసిన ఆచారాలు తెలుసుకుందాం! ఇన్ షా అల్లాహ్

నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –

అల్లాహ్ సుబానవతఆలా ఇలా ఉపదేశించాడు.

وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
నేను   జిన్నాతులను,   మానవులను   సృష్టించినది   వారు   నన్ను   ఆరాధించటానికి   మాత్రమే. 
(ఖుర్’ఆన్ – 51 : 56)

షాబాన్ నెల ఇది ఇస్లాం నెలలో 8వ నెల ఈ నెల యెుక్క విశిష్టత ఏమిటంటే ఎంతో ఘనత కల్గిన రంజాన్ నెలను తనతో పాటు తెస్తుంది. అంటే ఈ నెల తరువాత వచ్చేది రంజాన్ నెల.

షాబాన్ మాసంలో ఇస్లాం అనుమతిస్తున్న మనం చేయవలసిన సత్కార్యాల్లో అతి ముఖ్యమైనది ఉపవాసం. స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ లో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. చూసేవారికి నెలంతా ఉపవాసమున్నారా అనిపించేది.

షాబాన్ నఫిల్ ఉపవాసాల  మాసం

ఈ క్రింది హదీసులు చదవండి:

عن عَائِشَةَ تَقُولُ: ” كَانَ أَحَبَّ الشُّهُورِ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يَصُومَهُ: شَعْبَانُ، ثُمَّ يَصِلُهُ بِرَمَضَانَ “

ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: “ప్రవక్తకు ఉపవాసం ఉండటానికి చాలా ప్రీతికరమైన మాసం షాబాన్ మాసం, ఈ మాసంలో ఉపవాసం పాటిస్తూ రమజాను వచ్చేసేది.” (అబూదావూద్ 2431.)

وعن عائشة رَضِيَ اللهُ عنها قالت: لَمْ يكن النبي – صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – يَصُومُ مِنْ شَهْرٍ أكْثَرَ مِنْ شَعْبَانَ، فَإنَّهُ كَانَ يَصُومُ شَعْبَانَ كُلَّهُ

ఆయిషా (రజియల్లాహు అన్హా) ఇలా తెలిపారు: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెలలో (నఫిల్) ఉపవాసాలు పాటించినంతగా మరే ఇతర నెలలోనూ పాటించేవారు కాదు. నిశ్చయంగా ఆయన షాబాన్ నెల సాంతం ఉపవాసం పాటించేవారు“. వేరొక ఉల్లేఖనం ప్రకారం “షాబాన్ నెలలోని కొన్ని రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ ఆయన ఉపవాసం పాటించేవారు.”(బుఖారీ 1969, ముస్లిం 1156)

(మానవుల) కర్మలు పైకి లేపబడే  మాసం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించటానికి గల కారణాన్ని వేరొక హదీసు ఈ విధంగా వివరించింది:

«ذَلِكَ شَهْرٌ يَغْفُلُ النَّاسُ عَنْهُ بَيْنَ رَجَبٍ وَرَمَضَانَ، وَهُوَ شَهْرٌ تُرْفَعُ فِيهِ الْأَعْمَالُ إِلَى رَبِّ الْعَالَمِينَ، فَأُحِبُّ أَنْ يُرْفَعَ عَمَلِي وَأَنَا صَائِمٌ»

“ఇది రజబ్ మరియు రమజాను మధ్యలోని మాసం, ప్రజలు దాని పట్ల అశ్రద్ధగా ఉంటారు.దాసుల కర్మలు షాబాన్ మాసంలో అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి. నేను ఉపవాసంలో ఉన్న స్థితిలోనే నా కర్మలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడాలన్న కోరిక నాది.”

(నిసాఈ 2357, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు.)

ప్రతి సోమవారము మరియు గురువారాల్లో  మానవుల ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి. ఈ హదీసు పైన కూడా శ్రద్ద వహించాలి.హజ్రత్ అబూహురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“సోమ మరియు గురువారాల్లో (అల్లాహ్ సన్నిదిలో దాసుల) ఆచరణలు ప్రవేశపెట్టబడతాయి. అందుకని నేను ఉపవాసిగా ఉన్న స్ధితిలో నా ఆచరణ ప్రవేశపెట్టడాన్ని నేనిష్టపడతాను.”

(తిర్మిజి- హసన్ , రియాదుస్ సాలిహీన్ :1257#)

పై హదీసులో రెండు లాభాలున్నాయి:

1) ప్రజలు అశ్రద్ధగా ఉన్నప్పుడు అల్లాహ్ ఆరాధన ఘనత చాలా గొప్పగా ఉంది. ప్రత్యేకంగా ఉపవాసం, ఇందులో బాహ్యతనం లేదు. ఇఖ్లాస్ (చిత్తశుద్ధి) ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సత్కార్యం అందరూ చేస్తున్నప్పుడు వారిని చూసి చేయని వాడు కూడా ఆ సత్కార్యం చేయడానికి పూనుకుంటాడు, కాని ఎవరు చేయని సమయంలో సత్కార్యం చేయాలని ఆలోచన రావడం, ఆలోచన వచ్చినా నేను ఒక్కణ్ణి చేస్తే ఎవరేమంటారో అనే దురాలోచనకు దూరమైన ప్రత్యేక శ్రధ్ధతో, అల్లాహ్ సంతృష్టి ఉద్దేశ్యంతో చేయడం ఎంతో గొప్ప విషయే కాకుండా అత్యధిక పుణ్యానికి కూడా అర్హత కల్పిస్తుంది. ఇలాంటి వారికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంత గొప్ప శుభవార్త ఇచ్చారో ఈ హదీసు చదవండి:

إِنَّ مِنْ وَرَائِكُمْ زَمَانَ صَبْرٍ، للمُتَمَسِّكِ فِيهِ أَجْرُ خَمْسِينَ شَهِيدًا

“మీ తర్వాత ఓర్పుసహనాల ఓ కాలం రానుంది, ఆ కాలంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వ్యక్తికి 50 మంది అమరవీరుల పుణ్యం ఉంటుంది.”

(తబ్రానీ కబీర్ 10394, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 2234లో సహీ అన్నారు.)

అబూ దావూద్ 4341లోని హదీసులో ఉంది:

“మీ తర్వాత ఓర్పు సహనాల ఓ కాలం రానుంది, అప్పుడు (ధర్మంపై స్థిరంగా ఉంటూ) సహనం వహించడం నిప్పులను చేత్తో పట్టుకోవడంతో సమానం. అప్పుడు సత్కార్యాలు చేసే వ్యక్తికి మీలోని 50 మందికి లభించే పుణ్యం లభిస్తుంది.”

2) ఈ మాసంలో సత్కార్యాలు అల్లాహ్ సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి.

అల్లాహు అక్బర్! గమనించండి: సాయంకాలం యజమాని ముందు పొద్దంతా చేసిన పని గురించి లెక్క చెప్పవలసి ఉంది అని తెలిసినప్పుడు ఆ పొద్దంతా ఎలా పనిచేస్తాడు ఆ గుమస్త? మరి ప్రతి రోజు ఫజ్ర్ మరియు అస్ర్ లో రెండు సార్లు వారంలో ప్రతి సోమ, గురు రెండు రోజులు సంవత్సరంలో ఈ షాబాన్ మాసంలో మన కర్మలన్నీ అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడుతున్నప్పుడు మనం పాపాలకు ఎంత దూరంగా ఉండాలి. సత్కార్యాలు ఎంత ఎక్కువగా చేస్తూ ఉండాలి అర్థమవుతుంది కదా!

కాని ప్రజల సులభతరానికి, వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఎంతగా కాంక్షించేవారంటే, షాబాన్ 15 రోజులు గడిసిన తర్వాత ఉపవాసం పాటించకూడదని ఆదేశించారు.

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «إِذَا انْتَصَفَ شَعْبَانُ، فَلَا تَصُومُوا»

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) చెప్పారని అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “షాబాన్ సగం గడిచిపోయాక ఉపవాసం ఉండకండి.” (అబూదావూద్ 2337)

హదీసు వ్యాఖ్యానకర్తలు చెప్పారు: ప్రజలు షాబాన్ చివరి వరకు ఉపవాసాలు పాటించి, రమజానులో ఫర్జ్ (విధి) ఉపవాసాలు పాటించడంలో బలహీనులు కాకూడదని సగం షాబాన్ తర్వాత ఉపవాసాలు పాటించడం నుండి వారంచబడినది.

నాల్గవ భాగంలో ఖుర్ఆన్ మరియు  హదీసుల వెలుగులో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

(4)షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – నాల్గవ భాగం

షబే బరాత్ నాడు మరణించిన వారి ఆత్మలు ఇహాలోకంలోకి వస్తాయా?

నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –

మానవుడు మరణించాక ఆత్మలు ఇహాలోకానికి రావడం అనేది జరగదు.

మానవుడు మరణించినా, మానవుడుని జంతువులు తిన్నా, మానవుడుని అగ్నికి ఆహుతి చేసినా, మానవుడు బూడిదగా మారినా  మరణించిన వారు బర్జఖ్ లో ఉంటారు. ఇహాలోకంలోకి తిరిగి రావడం అనేది జరగదు. ఇది అల్లాహ్ సున్నత్ కి విరుద్ధం. చాలామందికి మృతుడు చనిపోతే ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలియదు.

మృతుడు చనిపోయిన వెంటనే బర్జఖ్ లో బంధించబడతాడు.

అల్లాహ్ సుబహానహు వతాఆలా ఇలా ఉపదేశించాడు.

وَمَا يَسْتَوِى ٱلْأَحْيَآءُ وَلَا ٱلْأَمْوَٰتُ ۚ إِنَّ ٱللَّهَ يُسْمِعُ مَن يَشَآءُ ۖ وَمَآ أَنتَ بِمُسْمِعٍۢ مَّن فِى ٱلْقُبُورِ
బ్రతికి   ఉన్నవారూ   చచ్చినవారు   (ఎన్నటికీ)   సమానులు   కాలేరు.
అల్లాహ్‌   తాను   కోరిన   వారికి   వినిపిస్తాడు.   సమాధుల్లో   ఉన్నవారికి   నువ్వు   వినిపించలేవు.

(ఖుర్’ఆన్ – 35 : 22)

ﺣَﺘَّﻰٰٓ ﺇِﺫَا ﺟَﺎٓءَ ﺃَﺣَﺪَﻫُﻢُ ٱﻟْﻤَﻮْﺕُ ﻗَﺎﻝَ ﺭَﺏِّ ٱﺭْﺟِﻌُﻮﻥِ
చివరికి వారిలో ఒకడికి మరణం సమీ పించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: “ఓ నాప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు; (Quran – 23:99)

ﻟَﻌَﻠِّﻰٓ ﺃَﻋْﻤَﻞُ ﺻَٰﻠِﺤًﺎ ﻓِﻴﻤَﺎ ﺗَﺮَﻛْﺖُ ۚ ﻛَﻼَّٓ ۚ ﺇِﻧَّﻬَﺎ ﻛَﻠِﻤَﺔٌ ﻫُﻮَ ﻗَﺎٓﺋِﻠُﻬَﺎ ۖ ﻭَﻣِﻦ ﻭَﺭَآﺋِﻬِﻢ ﺑَﺮْﺯَﺥٌ ﺇِﻟَﻰٰ ﻳَﻮْﻡِ ﻳُﺒْﻌَﺜُﻮﻥَ
“నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి.” అది కాని పని. నిశ్చయంగా, అది అతని నోటిమాట మాత్రమే!  ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్‌’జఖ్‌) ఉంటుంది.

(ఖుర్’ఆన్ – 23:100)

ﻓَﺈِﺫَا ﻧُﻔِﺦَ ﻓِﻰ ٱﻟﺼُّﻮﺭِ ﻓَﻼَٓ ﺃَﻧﺴَﺎﺏَ ﺑَﻴْﻨَﻬُﻢْ ﻳَﻮْﻣَﺌِﺬٍ ﻭَﻻَ ﻳَﺘَﺴَﺎٓءَﻟُﻮﻥَ
ఆ తరువాత బాకా ఊదబడిన దినమున వారిమధ్య ఎలాంటిసంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరినొకరు పలుకరించుకోరు కూడా!
(ఖుర్’ఆన్ – 23:101)

రెండు వస్తువులకు మద్యనున్న అడ్డును లేక తెరను ‘బర్జఖ్’ అని అంటారు. ఇది ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి మద్య విశ్వాసులకు ‘విరామంగా’ అవిశ్వాసులకు మరియు పాపత్ములకు కఠినంగా ఉంటుంది. మరణించిన క్షణం నుంచి ప్రపంచంతో  మనిషి సంబంధం తెగిపోతుంది. పరలోక జీవనం కూడా తక్షణం మెుదలవదు. ప్రళయం తర్వాత మానవులంతా తిరిగి బ్రతికించబడిన నాటి నుంచే ఈ ‘పరలోకం’ మెుదలవుతుంది. ఈ రెండు లోకాలకు మధ్యనున్న ‘అవస్థ’ ను బర్జఖ్ అవస్థ అంటారు.

మృతుడు సమాధిలో ఉన్నా, కాకులకు గద్దలకు ఆహారంగా మారినా, కాల్చివేయబడి మట్టిలో కలసిపోయిన, మరేమైనా – అది బర్జఖ్ అవస్దగానే పరగణించబడుతుంది. తుదకు అల్లాహ్ మానవులందరికీ ఓ కొత్త ఉనికిని ఇచ్చి అందరినీ మహాషర్ మైదానంలో సమావేశపరుస్తాడు.

సమాధులను దర్శించడం.

గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని, అంతే కాదు ప్రత్యేక వంటకాలు చేసి, వాటిని ఆ ఆత్మలు తినిపోతాయని భ్రమపడడం జరుగుతుంది. మరణించిన పూర్వికుల ఆత్మలు వస్తాయని, వారికి  ఇష్టమైన వంటకాలను వడ్డించటం, మత్తు పానీయాలు, సిగిరేట్, బీడికట్టలు తమ పూర్వికులు  ఇష్టంగా త్రాగేవారని  తదితర వస్తువులను పెట్టి వాటిపై ఫాతిహాలు చేయటం. తమ పూర్వికుల పేర్లు చెబుతూ సాంబ్రాణిని  అగ్గిమంటల పైన  చల్లటం ఇలాంటి మూఢనమ్మకాలు మన సమాజంలో  అల్పజ్ఞాన ముస్లింలు చేస్తూంటారు.

అయితే సోదర సోదరిమణులారా! పై విషయాలు మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గానీ, సహాబాలు, తాబియిన్లు గానీ పాటించలేదు. అలాంటి మూఢనమ్మకాలు అసలు వారికి లేనే లేవు. ఇలాంటి మూఢనమ్మకాలు ఇస్లాంలో చెల్లవు సహోదరులారా! మానవుడు మరణించిన తరువాత ఇహాలోకంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఇది కేవలం షైతాను క్రీడగా మాత్రమే పరిగణించబడుతుంది.

పాపాత్ముల కర్మలు, ,ఆత్మలు సిజ్జిన్ లో బంధించబడ్డాయి.

كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍۢ
ముమ్మాటికీ   (వారు   అనుకునేది   నిజం)   కాదు.   నిశ్చయంగా   పాపాత్ముల   కర్మల   చిట్టా   ‘సిజ్జీను’లో   ఉంది.

(ఖుర్’ఆన్  – 83 : 7)

‘సిజ్జిన్’ అనేది ఒక చెరసాల అని కొందరు అబిప్రాయపడ్డారు. అంటే కఠిన కారాగారం మాదిరిగా అది ఎంతో ఇరుకైన, దుర్భరమైన స్ధలం అన్నమాట! మరికొంత మంది ప్రకారం ‘సిజ్జిన్’ అనేది భూమండలంలో అత్యంత అధమస్ధానం. ఆ పాతాళ స్ధానంలో అవిశ్వాసుల, ముష్రిక్కుల, దుర్జనుల ఆత్మలు, వారి కర్మలు భద్రపరచబడతాయి.

పుణ్యాత్ముల కర్మలు, ఆత్మలు ఇల్లియ్యీన్ లో బద్రపరచబడ్డాయి.

كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ
ఎన్నటికీ   కాదు.   నిశ్చయంగా   పుణ్యాత్ముల   కర్మల   చిట్టా   ‘ఇల్లియ్యీన్‌’లో   ఉంది.

(Quran – 83 : 18)

‘ఇల్లియీన్’ అనేది ‘ఉలువ్వున్’ నుండి వచ్చింది. అంటే ఉన్నతమైనదని అర్ధం. ఇది ‘సిజ్జిన్’ కు వ్యతిరేక పదం. ఇది ఊర్ధ్వలోకాలలో లేదా స్వర్గంలో లేదా సిద్రతుల్ మున్తహా వద్ద లేదా దైవసింహాసనం (ఆర్ష్) దగ్గర ఉన్న ఒక ప్రత్యేక స్ధలం.

అక్కడ సజ్జనుల ఆత్మలు, వారి కర్మల పత్రాలు భద్రపరచబడ్డాయి. ధైవసాన్నిధ్యం పొందిన దైవదూతలు వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు.

5 (చివరి) భాగంలో ఖుర్ఆన్ మరియు  హదీసుల వెలుగులో మరిన్ని విషయాలను తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

(5) 15షాబాన్ నెల యెుక్క వాస్తవికత! – 5 (చివరి) భాగం

ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో  చివరి 5వ భాగం.

 • షబే బరాత్ సందర్భాన ప్రత్యేకంగా సమాధులను దర్శించవచ్చునా?
 • షాబాన్ 15వ తేదినాడు ఉపవాసం పాటించవచ్చునా?

నా ధార్మిక సోదర సోదరీమణులారా! అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు –

షబే బరాత్ సందర్భాన ప్రత్యేకంగా సమాధుల దర్శనం చేయవచ్చునా?

షబే బరాత్ సందర్భాన ప్రత్యేకంగా సమాధులను దర్శించటం ఇది ఒక బిద్ఆత్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సమాధుల దర్శనానికి ఒక ప్రత్యేక ఘడియను ఏర్పాటుచేసుకొన్నారు. అయితే సోదర సోదరీమణులారా!  మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గానీ, సహాబాలు గానీ, తాబిఈన్లు గానీ ఇలా ప్రత్యేక ఘడియను ఏర్పాటుచేసుకోలేదు.

ఈ బిద్అత్ కు పాల్పడే మన సోదరులు ఒక హదీసును చూపించి షబే బరాత్ సందర్భాన సమాధులను దర్శించాలని సాకుగా చూపుతారు కాని ఆ హదీసు దయీఫ్ (బలహీనంగా) గా వుంది. ఆ హదీసు యెుక్క సనద్  ఒకసారి చదవండి

ఆయిషా (రజియల్లాహు అన్హా)  ఉల్లేఖించారు, ఒకసారి షాబాన్ 15 వ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  నా పడకపై లేకపోవడం వలన వెదుకుతూ ఉండగా  బఖీ స్మశానంలో అగుపించగా నేను అక్కడికెళ్లి కారణం అడుగగా – “ఈ రాత్రి అల్లాహ్ ప్రపంచం వైపు దృష్టిసారిస్తాడు, బని కల్బ్ వారి గొర్రెల వెంట్రుకల కంటే అధిక రెట్లో మానవుల పాపాలను క్షమిస్తాడు” అని చెప్పారు. (ఈ హదీసు ముస్నద్ అహ్మద్, తిర్మిది, ఇబ్నెమాజాలో ఉంది.)

పై మూడు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా ద్వార ఉర్వా, ఉర్వా ద్వారా యహ్ యా, యహ్ యా ద్వారా హజ్జాజ్ ఉల్లేఖించినట్లు ఉంది.

అయితే ఇమాం తిర్మిజి ఈ హదీసు చివరిలో ఎంతో స్పష్టంగా చెప్పారు: నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ ద్వారా విన్నాను ఆయన దీనిని బలహీనమైనదని, ప్రామాణికమైనది కాదని చెప్పారు, ఎందుకంటే ఉర్వా ద్వారా యహ్’యా మరియు యహ్’యా ద్వారా హజ్జాజ్ వినలేదు.

(తిర్మిజి, అబ్వాబుస్ సియాం, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్. 739)

ఈ హదీసు ఎంతమాత్రము ప్రామాణికమైనది కాదు.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పగలు, రాత్రి అన్నివేళల్లో సమాధులను దర్శించేవారని సహీ హదీసులు బోదిస్తున్నాయి. ఇలాంటి హదీసుల ప్రకారం మనం ఎందుకు ఆచరించము?!

عَنْ عَائِشَةَ أَنَّهَا قَالَتْ: كَانَ رَسُولُ اللهِ ﷺ كُلَّمَا كَانَ لَيْلَتُهَا مِنْ رَسُولِ اللهِ ﷺ يَخْرُجُ مِنْ آخِرِ اللَّيْلِ إِلَى الْبَقِيعِ [مسلم ، الجنائز، ما يقال عند دخول القبور…]

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు నా వంతు వచ్చినప్పుడల్లా రాత్రి వేళ బఖీ దర్శించడానికి వెళ్ళేవారు”.

(ముస్లిం, జనాఇజ్, మా యుఖాలు ఇంద దుఖూలిల్ ఖుబూర్… 974).

సమాధుల దర్శనం యొక్క రెండు ఉద్దేశ్యాలు

 • 1-దర్శించే వ్యక్తి ప్రయోజనానికి
 • 2- సమాధిలో ఉన్నవారి ప్రయోజనానికి

1-దర్శించే వ్యక్తి ప్రయోజనానికి: సమాధుల దర్శనం ఇహలోకం పట్ల వ్యామోహాన్ని తగ్గిస్తుంది. పరలోకం పట్ల భయభక్తిని కలిగింపజేస్తుంది. చావును గుర్తు చేస్తుంది. ఈ విషయాలు సహీ హదీసుల ద్వారా రుజువై ఉన్నాయి. కాని …

నేడు మనం చేస్తున్న కార్యాలు చూసినట్లైతే ఖబరస్తాన్ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం. మన తాత ముత్తాతల సమాధులను నీటితో శుభ్రపరచటం, అక్కడ అలంకరణ చేసి విద్యుత్ దీపాలతో, పూలగుచ్చాలతో, అగర్బత్తి, సుగంధ సువాసనలను సమాధుల పై వెదజల్లి వారిపై ఫాతిహాలు చేయటం, మీఠాయిలు పంచటం చూస్తుంటే  మనకి పరలోకం పట్ల భయభక్తి కలిగేలాగా ఉందా???

మనం ముస్లింలుగా ఆలోచించాల్సిన విషయం. ఇస్లాం ఇలాంటి కార్యాలను చేయమని ఆజ్ఞాపించిందా? అల్లాహ్ మనందరిని క్షమించుగాక!

2- సమాధిలో ఉన్నవారి ప్రయోజనానికి: మనం వారి ప్రయోజనానికి చేయవలసినవి, సమాధులను సందర్శించినప్పుడు మరియు అన్ని సందర్భాల్లో వారి కొరకు అధికంగా దుఆ చేయడం, అంటే ఓ అల్లాహ్! వారికి సమాధి పరీక్ష, సమాధి శిక్ష నుండి రక్షణ కల్పించు, వారి సమాధిలో స్వర్గపు కిటికీలను తెరవు, వారి సమాధిని కాంతితో నింపు, వారి పాపాలన్నింటిని మన్నించు… లాంటి దుఆలు. ఇంకా ఖబరస్తాన్ లో ప్రవేశిస్తున్నప్పుడు:

అస్సలాము అలైకుం అహ్లద్ దియారి మినల్ ముఅ’మినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్ అస్అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియహ్.

ఈ బస్తీలో ఉన్న విశ్వాసులు, ముస్లిములందరిపై శాంతి కురియుగాక, అల్లాహ్ తలచినప్పుడు మేము కూడా మీ వెనక రానున్నాము, మా కొరకు మీ కొరకు అల్లాహ్ తో సంక్షేమాన్ని కోరుతున్నాను

షాబాన్ 15వ తేదినాడు ఉపవాసం పాటించవచ్చునా?

షాబాన్ 15వ తేదినాడు ప్రత్యేకంగా ఉపవాసం ఉండటం బిద్ఆత్. దీనికి సంబందించిన హదీసులు దయీఫ్ యే కాదు, కల్పితం కూడాను.

హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా సెలవిచ్చారు:

عَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: ” إِذَا كَانَتْ لَيْلَةُ النِّصْفِ مِنْ شَعْبَانَ، فَقُومُوا لَيْلَهَا وَصُومُوا نَهَارَهَا، فَإِنَّ اللَّهَ يَنْزِلُ فِيهَا لِغُرُوبِ الشَّمْسِ إِلَى سَمَاءِ الدُّنْيَا، فَيَقُولُ: أَلَا مِنْ مُسْتَغْفِرٍ لِي فَأَغْفِرَ لَهُ أَلَا مُسْتَرْزِقٌ فَأَرْزُقَهُ أَلَا مُبْتَلًى فَأُعَافِيَهُ أَلَا كَذَا أَلَا كَذَا، حَتَّى يَطْلُعَ الْفَجْرُ “

“షాబాన్ 15 వ రాత్రి  అల్లాహ్ యెుక్క ఆరాధనలో నిలబడు. మరునాడు నీవు ఉపవాసం పాటించు. అల్లాహ్ షాబాన్ 14 నాటి సూర్యాస్తమయం వెంటనే ప్రపంచపు ఆకాశంపై వచ్చి, తమ పాపాల మన్నింపు కోరేవారు ఎవరైనా ఉన్నారా నేను వారిని మన్నిస్తాను, ఉపాధి కోరేవారు ఎవరైనా ఉన్నారా నేను వారికి ఉపాధిని ప్రసాదిస్తాను, ఆపదలో ఉన్నవారెవరైనా ఉన్నారా వారికి స్వస్థత ప్రసాదిస్తాను అంటూ ఇలాంటి నినాదాలు ఫజ్ర్ వరకు; ప్రకటిస్తూనే ఉంటాడు.”

(ఇబ్నుమాజా, కితాబు ఇఖామతిస్ సలాతి వస్సున్నతు ఫీహా,  బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్ 1388)

ఈ హదీసు గురించి షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ తెలిపారు ఇది దయీఫ్ మరియు మౌదూ అని (అంటే ప్రామాణికమైనది కాదు, కల్పించబడినది).

ఈ హదీసులో ఇబ్ను అబి సబ్రా అనే వ్యక్తి  గురించి  ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ ఇబ్నె ముఈన్ ఇలా చెప్పారు: అబూ సబ్రా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పని హదీసులు తానె చెప్పి ప్రవక్త వైపు ఆపాదించాడు. అందువలన అతనిని కల్పిత హదీసుల బోధకుడిగా పేర్కోన్నారు.

ఇలాంటి పాపకార్యాల, బిద్ఆత్ ల నుండి మనం మన కుబుంబాలను,  బందు మిత్రులను రక్షించుకోవాలి. లేదా అంటే మనకు తెలియకుండానే పరలోకంలో తీవ్రంగా నష్టపోయే వారిలో చేరిపోతాం.

అల్లాహ్ సుబ్ హానహూ వతఆలా ముస్లిం సమాజాన్ని  షిర్క్, బిద్ఆత్ నుండి రక్షించుగాక! ఆమీన్ యా రబ్!!

(6) షాబాన్ నెల యెుక్క వాస్తవికత!

 శీర్షిక: షాబాన్ 15వ రోజు కొన్ని బిద’అత్ కార్యాల వాస్తవికత 

హజ్రత్ ఇమామ్ ముఖ్దసి (రహిమహుల్లాహ్) ఇలా ప్రకటించారు:​

“448వ హిజ్రీ శకంలో ఒక వ్యక్తి నాబ్లీస్ పట్టణం నుండి ‘బైతుల్ ముఖద్దస్’ కు వచ్చాడు. అతని పేరు ఇబ్నె ఉబై హుమైరా. అతడు చాలా చక్కగా ఖుర్’ఆన్ పారాయణం చేసేవాడు. అతను షాబాన్ 15వ రోజు రాత్రి ‘బైతుల్ ముఖద్దస్’ లో నఫిల్ నమాజును చదవడం ఆరంభించాడు. అతన్ని చూసి ఒకరు, ఇద్దరు, ముగ్గురు అంటూ ఒక పెద్ద జమాతుగా నిలబడి నమాజు నెరవేర్చారు. ఇలా ఆ రోజు నుండే ఈ బిద’అత్ ఆచరణ మొదలయ్యింది.”​

​[అల్ బాయిస్ ‘అలా ఇన్కారిల్ బిదయి వల్ హవాదిస్, పేజీ #124-125]​

 ప్రామాణిక ఆధారాల ద్వారా నిరూపణ కాని బిద’అత్ (ధర్మంలో కొత్తగా చొరబెట్టినవి) కార్యాలు:​​

​1. షబే బారాత్ నమాజు:​ ప్రతీ ఏటా షాబాన్ నెల 15వ తేది రాత్రి 100 రకాతుల నమాజు ప్రత్యేకంగా చేస్తారు.​

​2. ఆరు రకాతుల నమాజు:​ కష్టాలు తొలగిపోవాలని, వయస్సు పెరగాలని మరియు ప్రజలతో నిరుపేక్షంగా ఉండాలని సంకల్పం చేసుకుని ఈ నమాజు చేస్తారు.​

3. యాసీన్ సూరహ్:​ ఈ రాత్రిలో ప్రత్యేకంగా యాసీన్ సూరహ్ చదువుతారు. మరియు “అల్లాహుమ్మ యా జల్మన్ని వలా యమున్ను అలైహి యా జల్ జలాలి వల్ ఇక్రామ్” అనే పదాలను చదువుతూ ఉంటారు.​

​4. శుభప్రదమైన రాత్రి:​ కొంతమంది షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిని శుభప్రదమైన రాత్రిగా (ఖుర్’ఆన్ అవతరించిన రాత్రిగా) తలపోసారు. కానీ, ఇది ఏ మాత్రమూ సరైనది కాదు. ఖుర్’ఆన్ గ్రంథం రమదాన్ మాసంలోని ‘లైలతుల్ ఖద్ర్’ లో అవతరించినట్లు స్వయంగా ఖుర్’ఆన్ ద్వారా స్పష్టంగా రూఢీ అవుతున్నప్పుడు ఇతరత్రా రాత్రుల గురించి ఆలోచించడం ఎంతమాత్రమూ సరైనది కాదు.​

​ఇమామ్ షిఖైరి (రహిమహుల్లాహ్) ఈ రాత్రి గురించి ఇలా తెలియజేసారు:​

​”మహాపండితులు మరియు ముహద్దిసీన్లు ఈ రాత్రి (షబే బరాత్) ని లైలతుల్ ఖద్ర్ గా భావించడానికి ఎటువంటి యదార్ధము లేదు.”​

​[అస్ సున్నన్ వల్ ముబ్తిదిఆత్, పేజీ #146]​

​ఇమామ్ నజ్ముద్దీన్ అల్ గైతీ (రహిమహుల్లాహ్) గారు ఇలా తెలియజేసారు:​

​”హిజాజ్ పండితులు షాబాన్ నెల 15వ తేది రాత్రిన చేసే ప్రత్యేకమైన పుణ్యాల గురించి మరియు వాటి ఘునతను గురించి తిరస్కరించారు. వారిలో హజ్రత్ ఇబ్నె అబీ మలీకా మరియు మదీనా విద్వాంసులు ఆ రోజున చేసే ప్రత్యేకమైన కార్యాలన్నింటినీ బిద’అత్ గా ఏకీభవించారు.”​

​[అస్ సున్నన్ వల్ బిద’అత్ అష్ షిఖైరీ, పేజీ #145]​

​షాబాన్ 15వ రోజు గురించి కొన్ని నిరాధారమైన హదీసులు:

బిద’అత్ ఆచారాల్లో మునిగి తేలుతున్నవారు తాము చేస్తున్నది ధర్మమేనంటూ ఈ క్రింద ఇవ్వబడిన బలహీనమైన (దయీఫ్) ఆధారాలను చూపుతూ మూర్ఖంగా వితండవాదం చేస్తూ ఉంటారు.​

​హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం:​ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:​

​”షాబాన్ 15వ రోజు రాత్రి నమాజు చదవండి మరియు పగలు ఉపవాసం ఉండండి. ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత ప్రపంచపు (క్రింది) ఆకాశానికి అల్లాహ్ దిగి వస్తాడు మరియు ఇలా అంటాడు:​

​’ఎవరైతే నా పాపాలు మన్నించమని వేడుకుంటారో, నేను వారి పాపాలను మన్నిస్తాను. మరియు ఎవరైతే ఉపాధిని ప్రసాదించమని వేడుకుంటారో, వారికి ఉపాధి ప్రసాదిస్తాను. ఎవరైనా అస్వస్థతకు గురికాబడితే వారికి స్వస్థతను ప్రసాదిస్తాను. ఇంకా ఇలా, అలా సూర్యోదయం వరకూ ఇలా (ప్రసాదించే కార్యం) జరుగుతూ ఉంటుంది.”​

​[ఇబ్నెమాజ, అస్ సిల్సిలతుల్ దయీఫా, హదీసు #2132; అస్ సిల్సిలతుల్ దయీఫా వల్ మౌదూ’అ, హదీసు #5/154]​

​హజ్రత ఆయేషా (రదియల్లాహు అన్హ) ఉల్లేఖనం:​

“దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రాత్రి నాకు కనపడలేదు. అంతలో నేను (బయటకు వెళ్ళి చూస్తే) ఆయన బఖీ శ్మశానంలో కనపడ్డారు. అప్పుడు (నన్ను చూసి) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:​

‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నీకు అన్యాయం చేస్తారని అనుకున్నావా?’. దానికి నేను ‘మీరు ఇతర భార్యల వద్దకు పోయారేమో అని అనుకున్నాను.’ అని అన్నాను.​

​తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:​

​’షాబాన్ 15వ రోజు రాత్రి అల్లాహ్ ప్రపంచపు ఆకాశానికి దిగి వస్తాడు. బనీ కలబ్ (ఒక తెగ సంతానం పేరు) గొర్రెల వెంట్రుకల కంటే ఎక్కువ మనుషులను క్షమిస్తాడు…….”​

​[ఇబ్నెమాజ, దయీఫ్ హదీసు #1389;​ తిర్మిజీ, దయీఫ్ హదీసు #3684;​ దయీఫుల్ జామి’ఈ, దయీఫ్ హదీసు #1761]​

 పైన పేర్కొన్న హదీసులు దయీఫ్ (బలహీనమైనవి) మరియు నిరాధారమైనవి.​

​హజ్రత్ హాఫిజ్ ఇబ్నె దిహ్యా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేసారు:​

​”షాబాన్ 15వ రాత్రి ఆరాధనల గురించి ఏ ఒక్క హదీసు కూడా ప్రామాణిక ఆధార పూర్వకమైనది లేదు. కనుక ఇలాంటి ఉల్లేఖనాలను విశ్వసించకూడదు.”​

అలాగే హజ్రత్ ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) వారి ద్వారా కూడా షాబాన్ 15వ రాత్రి లేక పగలు చేసే ఆరాధనల గురించి ఎలాంటి ఆదేశాలు లేవు. మరియు నలుగురు ఇమామ్ ల కాలంలో ఆ కార్యాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే, నలుగురు ఇమాముల జనన మరణాలు 80 వ హిజ్రీశకం నుండి 214 వ హిజ్రీశకం మధ్యలో జరిగినవి. మరియు షాబాన్ 15వ రోజు బిద’అత్ కార్యాలు 448 వ హిజ్రీశకంలో ప్రారంభమైనవి. కనుక, ఇది నలుగురు ఇమామ్ ల దగ్గర బిద’అత్ కార్యాలుగానే భావించబడతాయి.​

​​కనుక, నా ప్రియమైన సోదర సోదరీమణులారా!​​

​​​దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సున్నత్ కు అనుగుణంగా లేని ఆచరణలు, ఉపాసనలు, కేవలం మార్గభ్రష్టత తప్ప మరేమీ కావు.​​​

 దివ్యగ్రంధమైన ఖుర్’ఆన్ లో అల్లాహ్ (సుబహానహు వ త’ఆలా) ఇలా తెలియజేసాడు.​​

 • ​​కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.​​
 • ​​(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి,​​
 • ​​వారు దహించే అగ్నిలోపడి కాలుతారు.​​
 • ​​వారికి సలసలకాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.​​
 • వారికి చేదు ముళ్ళగడ్డ (‘దరీ’అ) తప్ప మరొక ఆహారం ఉండదు.​​
 • ​​అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!​​

​​[సూరహ్ అల్-’గాషియహ్ (88), ఆయతు 2-7]​​

​​అంటే, ప్రళయదినాన కొంతమంది (ఈ ప్రపంచంలో బిద’అత్ పనులతో) కఠోర పరిశ్రమ చేసి అలసిపోయి ఉంటారు. అయినా వాళ్ళు మండే అగ్నికి ఆహుతి చేయబడతారు.​​

​దయచేసి జాగ్రత్తగా తెలుసుకోండి.

​​​”అహ్లుస్ సున్నత్ వల్ జమా’అత్” కు చెందిన వారెవ్వరూ కూడా ఇలాంటి అధర్మ కార్యాలు చేయరు. మరియు ఇటువంటి అధర్మ కార్యాలు చేస్తూ తమను తాము మాత్రం “అహ్లుస్ సున్నత్ వల్ జమా’అత్” కు చెందినవారము అని చెప్పుకునే వారు, వాస్తవంగా ఎన్నటికీ కూడా “అహ్లుస్ సున్నత్ వల్ జమా’అత్” కు చెందినవారు మాత్రం అవ్వరు. ఇలాంటి వారు కేవలం “బిద’అతీ” లుగా పరిగణించబడతారు.​​​

ఒక ముస్లిం “అహ్లుస్ సున్నత్ వల్ జమా’అత్” కి చెందినవాడు అంటే అతను కేవలం ఖుర్’ఆన్ మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి (ప్రామాణికమైన సహీహ్ హదీసుల పరంగా మరియు ధర్మపండితుల ప్రామాణికమైన తీర్పుల పరంగా) అనుగుణంగా అనుసరించేవాడు.​​​

​​​దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత అధర్మ వ్యక్తుల చేత జొప్పించబడిన ఇటువంటి నిరాధారమైన తప్పుడు ఆచారాలను మనం ఎలా ధర్మంగా భావించగలము. అలాంటి వాటిపై మనం ఏ రకంగా ఆచరించగలము???​​​

ఒకవేళ మనం అలాంటి బిద’అత్ కార్యాలను ఆచరించినా పుణ్యం మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ లభించదు, పైగా తౌబా (పశ్చాత్తాపం) కూడా చేసుకునేందుకు కూడా ఎలాంటి అవకాశం లేని ఘోరమైన పాపాలలో కూరుకుపోతాము.​​​

​మీరు ఇలాంటి బిద’అత్ కార్యాలను ఆరాధనలుగా భావిస్తున్న వారితో సహవాసం చేయకండి. దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారా గానీ, సహాబాల ద్వారా గానీ పైన పేర్కొన్న లాంటి బిద’అత్ కార్యాలకు నిజమైన ప్రామాణిక ఆధారం దొరకనంతవరకూ వాటిని మరియు ఈ కార్యాలను చేయండి అని చెప్పేవారిని ఏ మాత్రమూ అనుసరించకండి. ఎందుకంటే, అది ధర్మం కాని, ధర్మానికి చెందని విషయం మరియు ధర్మం కాని విషయాలను (మూర్ఖత్వంతో, మొండితనంతో, వితండవాదనతో) ధర్మంగా ఆచరించినా లేక ధర్మంగా బోధించినా వారు షైతాన్ సేవకులే.​

​​​కాబట్టి, పై విషయాలను మనమందరమూ చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకుని మన జీవితంలోని ప్రతీ ఆచరణను సవ్యమైన సున్నత్ విధానంలో ఆచరించేందుకు మరియు ఆ సున్నత్ విధానం గురించి సరైన జ్ఞానాన్ని సంపాదించేందుకు తప్పనిసరిగా సంపూర్ణ కృషి చేయాలి.​​​

​​​అల్లాహ్ (సుబహానహు వత’ఆలా) మనందరికీ సరైన విధంగా అర్ధం చేసుకునే సద్భుద్ధిని తద్వారా మన జీవితాలను కేవలం ఖుర్’ఆన్ మరియు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సున్నత్ కు అనుగుణంగా మార్చుకునే హిదాయత్ ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్.​​​​​


పై పుస్తకంతో పాటు క్రింద ఇచ్చిన రెండు ఆడియోలు తప్పకుండా వినండి :

%d bloggers like this: