

అల్లాహ్ తన షరీయత్‌లో తన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల ముస్లింలు నెరవేర్చవలసిన బాధ్యతలను విశదీకరించాడు. వాటిలో ఒకటి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్ సలాంలు పంపటం.
అల్లాహ్ ఖుర్‌ఆన్‌లో ఈ విధంగా ఆదేశించాడు :
إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దురూద్ పంపండి. అత్యధికంగా సలాములు (కూడా) పంపుతూ ఉండండి. (అల్ అహ్‌జాబ్ : 56)
ఇమామ్ బుఖారీ గారు అబుల్ ఆలియాతో ఇలా అన్నారు :
“అల్లాహ్ దురూద్ పంపించటమంటే అర్థం, ఆయన తన దూతల ముందు తన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను మెచ్చుకుంటాడు. దైవదూతలు దురూద్ పంపటమంటే భావం వారు “దుఆ” చేస్తారు. మనుషులు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)కు దురూద్ పంపటమంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) మన్నింపు కొరకు, కారుణ్యం కొరకు అల్లాహ్‌ను అర్థించటం అన్నమాట.”
పై సూక్తి ద్వారా మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) స్థాయి, అంతస్తు ఎంత గొప్పదో అర్ధమవుతోంది. ఊర్ధ్వ లోకాలలో అల్లాహ్ తన సమీప దూతల ముందు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను ప్రశంసించాడు. దైవదూతలు కూడా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఉన్నత స్థానాల కోసం ప్రార్థిస్తున్నారు. భూలోకవాసులు కూడా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) కారుణ్యం కొరకు ప్రార్థించవలసిందిగా అల్లాహ్ ఆదేశించాడు – ఆ విధంగా ఊర్థ్వలోకాల వారు, భూలోక వాసులు కూడా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను శ్లాఘించటంలో ఏకమవ్వాలన్నది అల్లాహ్ అభిమతం. ఎంతటి ఉన్నత స్థానం!
“సల్లిమూ తస్లీమా” అంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఇస్లామీయ అభివాదం పంపమని అర్థం. కాబట్టి ఎవరయినా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు దురూద్ పంపదలచినపుడు దురూద్‌తో పాటు సలామ్‌ని కూడా పంపాలి. కేవలం ఒక్క దానితో సరిపెట్టుకోకూడదు. కేవలం “సల్లల్లాహు అలైహి” అని అనరాదు. కేవలం ‘“అలైహిస్సలాం” అని కూడా అనరాదు. ఎందుకంటే రెండింటినీ ఒకేసారి పలకాలన్నది దైవాజ్ఞ.
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్ పంపమని ఎన్నో చోట్ల నొక్కి చెప్పబడింది. కొన్ని చోట్ల తప్పనిసరి (వాజిబ్) అని అనబడితే, కొన్నిచోట్ల అలా చేయటం అభిలషణీయం (ముస్తహబ్) అనీ, సున్నతె ముఅక్కదా అని కూడా వక్కాణించబడింది.
అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) తన పుస్తకం “జలాఅల్ అఫ్‌హామ్” లో 41 చోట్ల, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్, సలాంలను పంపటం మస్నూన్ (సున్నత్) అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలా అన్నారు :
“మొదటి చోట : అన్నిటికన్నా ముఖ్యమైన, గట్టిగా నొక్కి వక్కాణించబడిన చోటు నమాజ్ – నమాజ్‌లోని చివరి తషహ్హుద్ (చివరి ఖాయిదా)లో దురూద్ పంపాలి. ఈ విషయంలో ముస్లిములందరి మధ్యా ఏకాభిప్రాయం ఉంది. కాని ఇక్కడ అది వాజిబ్ (తప్పనిసరి) అనే విషయంలో మటుకు భేదాభిప్రాయం ఉంది.” (జలాయిల్ అఫ్‌హామ్ – పేజీ : 222, 223).
తరువాత ఆయన దురూద్ పంపవలసిన సందర్భాలేవో (ప్రసంగాల)లో జుమా ప్రసంగం, పండుగల ప్రసంగం, ఇస్తిస్ఖ ప్రసంగం, ముఅజ్జిన్ అజాన్ పలుకులకు సమాధానం పలికినప్పుడు, మస్జిద్లో ప్రవేశించినప్పుడు, మస్జిద్ నుండి వెడలినప్పుడు, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రస్తావన వచ్చినప్పుడు. ఆ తరువాత అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్ పంపటం వల్ల కలిగే సత్ఫలితాలను, ప్రయోజనాలను విశదీకరించారు. ఈ సందర్భంగా ఆయన 40 ప్రయోజనాలను ప్రస్తావించారు. (జిలాఉల్ అఫ్‌హామ్ – పేజీ : 302)
వాటిలో కొన్ని ప్రయోజనాలివి :
1. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్ పంపటమంటే అల్లాహ్ ఆదేశపాలన చేయటమే.
2. ఒకసారి దురూద్ పంపిన వానిపై అల్లాహ్ తరఫున పది కారుణ్యాలు అవతరి స్తాయి (ముస్లిం).
3. ‘దుఆ ప్రారంభంలో దురూద్ పంపటం వల్ల ఆ దుఆ స్వీకారయోగ్యమయ్యే అవకాశాలు పెరిగిపోతాయి.
4. దురూద్ పంపటంతో పాటు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)కు ప్రశంసాత్మకమయిన స్థానం కూడా ప్రసాదించమని వేడుకున్నట్లయితే, ఆ వ్యక్తి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) సిఫారసుకు హక్కుదారుడై పోతాడు.
5. దురూద్ (పంపటం) పాపాల మన్నింపునకు సాధనం.
6. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్, సలామ్‌లు పంపిన వ్యక్తి దానికి జవాబుగా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ‘ప్రతిసలాం’కు హక్కుదారుడై పోతాడు.
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దైవ కారుణ్యం మరియు శాంతి వర్షించుగాక!
ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 185-186)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
You must be logged in to post a comment.