ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్

[36 నిముషాలు]
వక్త:సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఉమర్‌ (రజియల్లాహు అన్హు) గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగా: ఉమర్‌ (రజియల్దాహు అన్హు) ఓ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్‌!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వస్లలం)ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడు: ‘నీవు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్‌ అన్నాడు: ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడు: ‘దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్‌! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’.

ఉమర్‌ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్‌ బిన్‌ అరత్త్‌ (రజియల్లాహు అన్హు) వారింట్లో ఉన్నాడు. ఖుర్‌ఆన్‌ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్‌ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్‌ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్‌ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి? అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్‌ అన్నాడు: బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడు: ‘ఉమర్‌! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్‌ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్‌ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్‌ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అంది: “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వ అష్‌ హదు అన్న ముహమ్మదర్‌ రసూలుల్లాహ్‌“. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్‌ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్‌ అల్లాహ్‌ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.

ఉమర్‌ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పింది: నీవు అపరిశుద్దునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్‌ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి’ అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్‌ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవప్రదంగా ఉంది, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.

ఉమర్‌ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్‌! “అల్లాహ్‌! ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ లేదా అబూ జహల్‌ బిన్‌ హిషామ్‌ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.

ఆ తర్వాత ఉమర్‌ (రజియల్లాహు అన్హు) తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్‌ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా (రజియల్లాహు అన్హు) ప్రజలను గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్‌ అని వారన్నారు. అప్పుడు హంజా (రజియల్లాహు అన్హు) అన్నారు: ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్‌ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్‌ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.

సుహైబ్‌ రూమి (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చోగలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్‌) చేయగలిగాము’.

అబ్దుల్లాహ్ బిన్‌ మస్‌ఊద్‌ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు? ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

ముహమ్మద్ – అంతిమ ప్రవక్త (Muhammad, the final Prophet)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

సహాబా

%d bloggers like this: