పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం – షేఖ్ హబీబుర్ రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం
షేఖ్ హబీబుర్ రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]
https://youtu.be/2Vh-tmsTEZc [38 నిముషాలు]
[డౌన్లోడ్ పిడిఎఫ్]

ఈ ప్రసంగం ఇస్లాంలోని పవిత్ర మాసాల (ముహర్రం, రజబ్, జుల్ ఖాదా మరియు జుల్ హిజ్జా) విశిష్టతను మరియు ఆ మాసాలలో పాపాలకు దూరంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరిస్తుంది. అల్లాహ్ పన్నెండు నెలల్లో నాలుగింటిని ప్రత్యేకంగా పవిత్రమైనవిగా ప్రకటించారని, ఈ కాలంలో చేసే సత్కార్యాలకు ప్రతిఫలం పెరగడమే కాకుండా, చేసే పాపాల తీవ్రత మరియు వాటి శిక్ష కూడా ఇతర సమయాల కంటే అధికంగా ఉంటాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. పాపాలు సంఖ్యాపరంగా పెరగకపోయినా, పవిత్ర స్థలాలు మరియు కాలాల గౌరవాన్ని బట్టి వాటి ప్రభావం తీవ్రమవుతుందని, ఇవి హృదయాలకు తుప్పు పట్టించి మనిషిని అల్లాహ్ కరుణకు దూరం చేస్తాయని ఆయన హెచ్చరించారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్ హమ్దులిల్లాహి మలికిల్ ఖుద్దూసిస్సలాం, ముజ్రిల్లయాలి వల్ అయ్యాం, వ ముజద్దిదిష్ షుహూరి వల్ ఆవాం. వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వ అలా ఆలిహిల్ కిరాం, వ సహ్ బిహిల్ బరరాతిల్ ఆలాం, వత్తాబియీన లహుమ్ బి ఇహసాన్.

సర్వస్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా! ఈరోజు అంశం మీకందరికీ తెలిసిందే, “పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం“. ఇస్లాంలో నాలుగు మాసాలను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రత్యేక పవిత్రతతో గౌరవించాడు. అవి జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం మరియు రజబ్. ఇందులో జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం వరుసగా వచ్చే మూడు నెలలు. రజబ్ ఇది జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉంటుంది. దీని ప్రస్తావన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ తౌబా ఆయత్ 36 లో ఇచ్చాడు:

إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثْنَا عَشَرَ شَهْرًا فِى كِتَٰبِ ٱللَّهِ يَوْمَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ مِنْهَآ أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا۟ فِيهِنَّ أَنفُسَكُمْ

నిశ్చయంగా అల్లాహ్ వద్ద నెలల సంఖ్య పన్నెండు. ఆకాశాలనూ, భూమినీ సృష్టించిన రోజు నుండి అల్లాహ్ గ్రంథంలో అవి పన్నెండే. వాటిలో నాలుగు పవిత్రమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఆ నెలలలో మీరు మీపై అన్యాయం చేసుకోకండి. (9:36)

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి. వాటిలో నాలుగు పవిత్రమైనవి. వాటిలో మూడు వరుసగా వచ్చే జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. మరొకటి జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉన్న రజబ్ మాసం.” ఇది సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లో ఉన్న హదీసు.

అభిమాన సోదరులారా! పవిత్ర మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల శిక్ష వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. అంటే పవిత్ర మాసాలలో పుణ్యాలు చేసినా వాటి ప్రతిఫలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలాగే పాపాలు చేసినా పాపాల శిక్ష వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. కాబట్టి పవిత్ర మాసాలలో చేసే ఒక సత్కార్యం ఇతర సాధారణ కాలాలలో చేసే అదే సత్కార్యం కంటే అల్లాహ్ వద్ద మరింత గొప్పది. అలాగే పవిత్ర మాసాలలో చేసే ఒక పాపం ఇతర సాధారణ కాలాలలో చేసే అదే పాపం కంటే మరింత తీవ్రమైనది మరియు భారమైనది.

ఒక ప్రశ్న: పవిత్ర మాసాలలో పాపం రెట్టింపు అవుతుందా? అంటే ఒక పాపం రెండు పాపాలకి సమానంగా, నాలుగు పాపాలకి సమానంగా, పది పాపాలకి సమానంగా అవుతుందా? ఈ ప్రశ్న. దీనికి సమాధానం ధార్మిక పండితులు ఇలా వివరించారు: పవిత్ర మాసాలలో సత్కార్యాలు మరియు పాపాలు రెట్టింపు అవుతాయని స్పష్టంగా తెలిపే సహీహ్ మరియు స్పష్టమైన హదీసులు లేవు. అయితే కొందరు పండితులు అల్లాహ్ ఈ విధంగా చెప్పినందున ఈ మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. సూరహ్ తౌబా ఆయత్ 36: “ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” కాబట్టి ఆ పవిత్ర మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి.

ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ ను వివరిస్తూ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఇలా పేర్కొన్నారు:

ఆ మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి అంటే ఈ పవిత్ర మాసాలలో పాపాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాసాలలో పాపం చేయడం ఇతర సమయాల్లో పాపం చేయడం కంటే మరింత తీవ్రమైనది మరియు ఎక్కువ భారమైనది. ఎలాగైతే పవిత్ర నగరమైన మక్కాలో చేసిన పాపాలు మరింత ఘోరమైనవిగా పరిగణించబడతాయో, అలాగే ఈ పవిత్ర మాసాలలో చేసిన పాపాలు కూడా మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ హజ్ లో సెలవిచ్చాడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍۭ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ
(వ మయ్ యురిద్ ఫీహి బి ఇల్ హాదిమ్ బిజుల్మిన్ నుజిఖ్ హు మిన్ అజాబిన్ అలీమ్)

ఎవడు అందులో (మస్జిదే హరామ్ లో) అన్యాయపూర్వకంగా మార్గభ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. (22:25)

అంటే పవిత్ర మాసాలలో పాపాల తీవ్రత, పాప భారం మరియు అల్లాహ్ దృష్టిలో వాటి ఘోరత పెరిగిపోతుంది. అందువల్ల ఈ మాసాలలో పాపాలకు దూరంగా ఉండి తౌబా, నమాజ్, ఖురాన్ పఠనం, జిక్ర్ మరియు ఇతర సత్కార్యాలను ఎక్కువగా చేయాలి.

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఇలా వివరించారు: పవిత్ర మాసాలలో పాపాలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల ఇమామ్ షాఫీ రహ్మతుల్లాహి అలైహి మరియు అనేకమంది పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ మాసాలలో హత్య జరిగినట్లయితే ‘దియత్’ (రక్త పరిహారం) మరింత కఠినంగా పరిగణించబడుతుంది. అలాగే హరమ్ ప్రాంతంలో హత్య చేసిన వారికి లేదా నిషిద్ధ బంధుత్వం (మహరమ్) కలిగిన వ్యక్తిని హత్య చేసిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ తర్వాత ఆయన ఖతాదా గారి మాటలను ఉటంకించారు. అవేమిటి? పవిత్ర మాసాలలో జరిగే అన్యాయం ఇతర సమయాల్లో జరిగే అన్యాయం కంటే మరింత పెద్ద పాపం మరియు ఎక్కువ భారమైనది.

అయితే అన్యాయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్ప పాపమే. అన్యాయం అన్యాయమే, ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో అది గొప్ప పాపమే అవుతుంది, ఘోరమైన పాపమే అవుతుంది. కానీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన ఇష్టానుసారం కొన్ని విషయాలకు మరింత గొప్పతనాన్ని మరియు ప్రాముఖ్యతను ప్రసాదిస్తాడు. అలాగే ఈ ప్రత్యేకత ఈ నాలుగు మాసాలకు అల్లాహ్ ప్రసాదించాడు.

ఇమామ్ ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు:

“ఈ పవిత్ర మాసాలలో పాపాలు చేసి మీరు మీపై అన్యాయం చేసుకోకండి. ఎందుకంటే అల్లాహ్ ఒక విషయాన్ని ఒక కోణం నుండి గౌరవప్రదంగా చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకత, పవిత్రత ఉంటుంది. కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ కోణాల నుండి దానిని గొప్పదిగా చేసినప్పుడు దాని పవిత్రత, దాని యొక్క గౌరవం మరింత పెరిగిపోతుంది. అందువల్ల అలాంటి సమయాల్లో లేదా ప్రదేశాల్లో చేసిన చెడు పనికి శిక్ష మరింత తీవ్రమైపోతుంది. అలాగే చేసిన సత్కార్యానికి ప్రతిఫలం కూడా మరింత గొప్పదిగా ఉంటుంది.”

అభిమాన సోదరులారా! పవిత్ర మాసంలో పవిత్ర స్థలమైన మక్కాలో అల్లాహ్ కు విధేయత చూపిన వారి ప్రతిఫలం సాధారణ నెలలలో అదే మక్కాలో విధేయత చూపిన వారి ప్రతిఫలంతో సమానం కాదు. అలాగే సాధారణ నెలలో మక్కాలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలం, సాధారణ నెలలో సాధారణ ప్రదేశంలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలంతో సమానం కాదు.

సారాంశం ఏమిటంటే పవిత్ర కాలాలు అంటే ఇది ముహర్రం, రజబ్, జుల్ ఖాదా, జుల్ హిజ్జా. పవిత్ర ప్రదేశాలు మక్కా, మదీనా వగైరా అల్లాహ్ వద్ద ప్రత్యేక గౌరవం కలిగినవి. అందువల్ల వాటిలో చేసే సత్కార్యాలకు మరింత గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. వాటిలో చేసే పాపాలు మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి. కాబట్టి ఈ పవిత్ర మాసాలలో ముస్లింలు పాపాలకు దూరంగా ఉండాలి. సత్కార్యాలలో అధికంగా పాల్గొనాలి. పాపం ఎప్పుడూ చేయకూడదు. పూర్తి సంవత్సరం పన్నెండు మాసాలు చేయకూడదు. ముఖ్యంగా, ప్రత్యేకంగా పవిత్ర మాసాలలో ఎందుకంటే దాని యొక్క తీవ్రత పెరిగిపోతుంది.

షరియత్ ఆధారాల ద్వారా నిరూపితమైన విషయం ఏమిటంటే పవిత్ర కాలాలలో మరియు పవిత్ర ప్రదేశాలలో సత్కార్యాల ప్రతిఫలం మరింత పెరుగుతుంది. ఉదాహరణకు రంజాన్ మాసం, జుల్ హిజ్జా మాసం అలాగే ఈ ముహర్రం మాసం వంటి పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం అధికంగా ఉంటుంది. అలాగే మస్జిదుల్ హరామ్ మక్కా, మస్జిద్ నబవీ మదీనా వంటి పవిత్ర ప్రదేశాలలో కూడా సత్కార్యాలకు ప్రత్యేకమైన గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.

జాబిర్ రజియల్లాహు అన్హు ద్వారా వచ్చిన ఒక సహీహ్ హదీసులో ఇలా ఉంది: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “నా మస్జిద్ అంటే మస్జిద్ నాబవి లో చేసిన ఒక నమాజ్, మస్జిదుల్ హరామ్ తప్ప ఇతర ఏ ప్రదేశంలో చేసిన వెయ్యి నమాజుల కంటే ఉత్తమమైనది. మరియు మస్జిదుల్ హరామ్ లో చేసిన ఒక నమాజ్ ఇతర ప్రదేశాలలో చేసిన లక్ష నమాజుల కంటే ఉత్తమమైనది.” ఈ హదీసును ప్రముఖ ముహద్దిసీన్లు సహీహ్ గా నిర్ధారించారు. ఈ హదీసు యొక్క సనద్ పరంపర సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

అభిమాన సోదరులారా! పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది, పవిత్ర ప్రదేశాలలో చేసిన ఆరాధనలు మరింత గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయి. అందువల్ల రంజాన్ మాసం, జుల్ హిజ్జా ముఖ్యంగా జుల్ హిజ్జా మొదటి పది రోజులు, ముహర్రం వంటి పవిత్ర కాలాలను మరియు మక్కా మదీనా వంటి పవిత్ర ప్రదేశాలను సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి చిన్న పెద్ద పాపం నుండి అవిధేయత నుండి దూరంగా ఉండాలి. దుష్ట క్రియలు పాపాలు గురించి పండితుల అభిప్రాయం ప్రకారం, ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారం మనం చేసే పాపాలు ఈ పవిత్ర కాలాలలో మాసాలలో అవి సంఖ్యాపరంగా పెరగవు. సంఖ్యాపరంగా పెరగవు అంటే ఒక పాపం పది పాపాలుగా లెక్కించబడవు. కానీ వాటి తీవ్రత లేదా స్వభావం పరంగా పెరుగుతాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ అన్ ఆమ్ లో సెలవిచ్చాడు:

مَن جَآءَ بِٱلْحَسَنَةِ فَلَهُۥ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجْزَىٰٓ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ

ఎవరైనా ఒక పుణ్యం చేస్తే అతనికి దాని పదింతల ప్రతిఫలం లభిస్తుంది. కానీ ఎవరైనా ఒక చెడు చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు. (6:160)

కాబట్టి రంజాన్ మాసంలో గానీ, ముహర్రం మాసంలో గానీ లేదా మరెక్కడైనా గానీ పాపాలు సంఖ్యాపరంగా పెరగవు, పాపం ఎప్పుడూ ఒకటిగానే లెక్కించబడుతుంది. ఇది అల్లాహ్ యొక్క అపారమైన కరుణ మరియు అనుగ్రహం. అయితే, అయితే ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. పాపం యొక్క తీవ్రత ప్రదేశం మరియు సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణమైన మాసంలో చేసే పాపం, పవిత్ర మాసంలో చేసే పాపం సమానం కావు. తీవ్రత పెరిగిపోతుంది. దాని ప్రభావం పెరిగిపోతుంది. పవిత్ర స్థలాలు మక్కా హరమ్ లో చేసే పాపం ఇతర నగరాలలో చేసే పాపం కంటే చాలా తీవ్రమైనది, పెద్దది. అలాగే పవిత్ర మాసాలలో చేసే పాపం ఇతర నెలలలో చేసే పాపం కంటే అత్యంత ఘోరమైనది మరియు తీవ్రమైనది అని మనం మర్చిపోకూడదు.

పాపాలు మక్కాలో కూడా పుణ్యాల వలే రెట్టింపు మొత్తం పరంగా అవుతాయని సామాన్య ప్రజలు చెబుతుంటారు. ఈ మాట సరైనది కాదు. ఎందుకంటే పాపాలు రెట్టింపు కావడం ఖచ్చితంగా నిషిద్ధం. అల్లాహ్ ఎలా సెలవిచ్చాడు: “ఎవరైనా ఒక పాపం చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది.” ఇది పాపాలు రెట్టింపు కావు అని స్పష్టంగా చెబుతున్న ఖురాన్ ఆయత్. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మక్కా వంటి పవిత్ర స్థలాల్లో పాపం యొక్క తీవ్రత పెరిగిపోతుంది. ఎందుకంటే సమయం మరియు స్థలం యొక్క పవిత్రతను బట్టి పాపం యొక్క తీవ్రత మారుతుంది. పాపం ఎంత తీవ్రమైతే శిక్ష కూడా అంత ఎక్కువగా ఉంటుంది. పాపం ఎంత చిన్నదైతే శిక్ష అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శిక్ష పెరగడం అనేది పాపం యొక్క తీవ్రత పెరగడం వల్ల జరుగుతుంది.

అందుకే మక్కా హరమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు – ఇది సూరహ్ హజ్ లో ఉంది ఆయత్ 25 లో: “మరియు ఎవరైనా అందులో అన్యాయంతో కూడిన ధర్మ విరుద్ధమైన పనిని చేయాలని సంకల్పిస్తే వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.” అలాగే పవిత్ర మాసాల గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” కావున ఆ మాసాలలో మీరు మీకు అన్యాయం చేసుకోకండి. దీని అర్థం ఏమిటి? పవిత్ర మాసాలు కానీ ఇతర సమయాల్లో కూడా తమకు తాము అన్యాయం చేసుకోవడం, పాపం నిషిద్ధమే. కానీ పవిత్ర మాసాల్లో దాని తీవ్రత మరియు శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది.

అభిమాన సోదరులారా! షేక్ ఇబ్నె ఉసైమీన్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు: మక్కాలో చేసిన పాపాలు సంఖ్యాపరంగా పెరగవు అయితే వాటి తీవ్రత గొప్పతనం పరంగా పెరుగుతాయి. అంటే వాటికి విధించబడే శిక్ష మరింత కఠినంగా మరియు బాధాకరంగా ఉంటుంది. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆయత్ సూరహ్ అన్ ఆమ్ 160: “ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది మరియు ఎవడు ఒక పాపం చేస్తాడో అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు.” ఈ ఆయత్ స్పష్టంగా పాపాలు సంఖ్యాపరంగా రెట్టింపు కావు అని తెలియజేస్తుంది.

అయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరొక చోట ఇలా సెలవిచ్చాడు: “వ మయ్ యురిద్ ఫీహి బి ఇల్ హాదిమ్ బిజుల్మిన్ నుజిఖ్ హు మిన్ అజాబిన్ అలీమ్.” ఎవడు హరమ్ ప్రాంతంలో అన్యాయపూర్వకంగా మార్గభ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. అంటే మక్కాలో చేసిన పాపానికి వచ్చే శిక్ష అదే పాపాన్ని మక్కా వెలుపల చేసినప్పుడు వచ్చే శిక్ష కంటే మరింత కఠినంగా ఉంటుంది. ఇందులో మక్కాలో పాపాల నుండి దూరంగా ఉండాలని తీవ్రమైన హెచ్చరిక ఉంది. ఈ ఆయత్ ద్వారా తెలిసేది ఏమిటంటే హరమ్ లో చేసిన పాపం అత్యంత ఘోరమైనది. కేవలం పాపం చేయాలనే సంకల్పం లేదా ఉద్దేశం కూడా తీవ్రమైన హెచ్చరికకు కారణమవుతుంది. మరి వాస్తవంగా ఆ పాపాన్ని చేసిన ఆ వ్యక్తి యొక్క పాప భారం ఎంత తీవ్రమై ఉంటుందో ఊహించవచ్చు.

అభిమాన సోదరులారా! ఇక సారాంశం ఏమిటంటే మక్కా లేదా హరమ్ ప్రాంతంలో పాపాల యొక్క తీవ్రత పెరిగిపోతుంది. హరమ్ ప్రాంతంలో పాపం చేయాలనే ఆలోచనకే అల్లాహ్ తీవ్రమైన హెచ్చరిక చేశాడు. అలాగే పవిత్ర మాసాలలో కూడా పాపం చేస్తే దాని తీవ్రత, దాని ప్రభావం పెరిగిపోతుంది ఎక్కువగా ఉంటుంది. కావున మనము ఈ పవిత్ర మాసాలను గౌరవించాలి. పవిత్ర మాసాలను గౌరవించడం అంటే ఏంటి? ప్రతి చిన్న పెద్ద పాపం నుండి అవిధేయత నుండి తప్పుల నుండి దూరంగా ఉండాలి. సదాచారాలు, సత్కార్యాలు, పుణ్యకార్యాలు, మంచి పనులు ఎక్కువగా చేయాలి. దుఆ లు, జిక్ర్, నఫిల్ ఉపవాసాలు, ఖురాన్ పారాయణము వగైరా వగైరా.

“ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” ఈ ఆయత్ లోని జుల్మ్ (దౌర్జన్యం) అంటే ఏమిటి? దౌర్జన్యం యొక్క అర్థం ఏమిటంటే ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాలలో మీరు అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఎందుకంటే వీటిలో అవిధేయత పాపం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనాన్ని హదీసును ఇలా తెలియజేశారు:

“అల్లాహ్ దౌర్జన్యాన్ని సంవత్సరపు పన్నెండు మాసాల్లోనూ నిషేధించాడు. తదుపరి నాలుగు మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశారు. ఎందుకంటే వీటిలో చెడు, అవిధేయతల పాపం పెరుగుతుంది మరియు మంచి సదాచారణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది.”

ఇమామ్ ఖతాదా ఈ ఆయత్ గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా వివరించారు: దౌర్జన్యం పాపం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉన్నప్పటికీ, కానీ ప్రత్యేకంగా నిషిద్ధ మాసాలలో దీని పాపం మరియు బరువు ఇతర మాసాల కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. తీవ్రత పెరిగిపోతుంది.

దైవదూతల్లో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్లో కొందరిని ప్రత్యేకంగా సందేశహరులుగా చేశాడు. గ్రంథాలలో దివ్య ఖురాన్ ను, యావత్ భూమిలో మసీదులను, అలాగే మాసాల్లో రంజాన్ నెల మరియు నిషిద్ధ మాసాలతో పాటు అనుకున్నట్లే దినాలలో శుక్రవారాన్ని, రాత్రుల్లో లైలతుల్ ఖదర్ ను అల్లాహ్ అనుకున్నట్లే ఏ మాసంలో పాప ఫలాన్ని అధికం చేయాలో మరియు దేనికి గొప్పతనం ప్రసాదించాలో పూర్తిగా అల్లాహ్ ఇష్టం. అంటే ఏ విధంగానైతే అల్లాహ్ మాసాలలో రంజాన్ యొక్క ప్రత్యేకత ఎంచుకున్నాడో ఖురాన్ గురించి, అలాగే పవిత్ర నాలుగు మాసాలు అల్లాహ్ ఎంచుకున్నాడో, దైవదూతల్లో జిబ్రయీల్ ను అల్లాహ్ ఎంచుకున్నాడో ఆ విధంగా ఈ మాసాలలో. అల్లాహ్ తన ఇష్టానుసారం అది పూర్తిగా అతని ఇష్టం. అందుకే అల్లాహ్ దేన్నైతే గొప్పదిగా భావిస్తాడో మీరు కూడా దానిని గొప్పదిగా భావించండి అని ఖతాదా రహ్మతుల్లాహి అలైహి వివరించాడు. అల్లాహ్ దేనికి గొప్పదిగా భావించాడో మనం కూడా దానిని గొప్పదిగా భావించాలి. ఈ వివరం ఇబ్నె కసీర్ భాగం రెండులో ఉంది.

ప్రియ సోదరులారా! సంవత్సరం పొడుగునా ప్రత్యేకించి ఈ నాలుగు మాసాల్లో మనం అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా ఉండాలి మరియు పాప కార్యాలను త్యజించాలి. ఎందుకంటే అవిధేయత మరియు పాప కార్యాల మూలంగా హృదయాలకు తుప్పు పడుతుంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ ముతఫ్ఫిఫీన్ లో సెలవిచ్చాడు:

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
(కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్ సిబూన్)
ఎంతమాత్రం కాదు! అసలు వారి హృదయాలకు వారు చేసిన దుష్కార్యాల తుప్పు పట్టింది. (83:14)

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఇన్నల్ ముఅమిన ఇజా అజ్ నబ జంబన్ కానత్ నుఖ్ తతన్ సౌదా ఫీ ఖల్ బిహి, ఫ ఇన్ తాబ వ నజఅ వస్తఘ్ ఫర సఖల మిన్ హా.” అంటే ఈ హదీసు తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా లో ఉంది. దానికి అర్థం ఏమిటంటే: విశ్వాసి ఏదైనా దుష్కార్యం పాపం చేసినప్పుడు అతని హృదయంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. తదుపరి ఒకవేళ అతను పశ్చాత్తాపం చెంది ఆ దుష్కార్యాన్ని త్యజించి పాపాన్ని వదిలి క్షమించమని అల్లాహ్ ను వేడుకుంటే అతని హృదయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ నల్లటి మచ్చ అల్లాహ్ తీసేసి కడిగేస్తాడు హృదయం నుంచి. ఒకవేళ అతను ఒక దుష్కార్యం తర్వాత మరో దుష్కార్యం ఒక పాపం తర్వాత మరో పాపం ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే అతని హృదయంలో నల్లటి మచ్చ పెరుగుతూ పోయి చివరికి పూర్తి హృదయాన్ని ఆక్రమించుకుంటుంది. దీనినే అల్లాహ్ ఖురాన్ లో రాన్ అన్నాడు: “కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్.” హృదయాలకు తుప్పు పట్టడం.

అభిమాన సోదరులారా! ఇక పాపాల ప్రమాదం లేకపోతే ప్రభావం సాధారణంగా ఎప్పుడు చేసినా చాలా కఠినంగా ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను సారాంశంగా, వివరణకు పోకుండా. పాపాల మూలంగా అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురవుతాము ఎప్పుడు పాపం చేసినా. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “ఇయ్యాక వల్ మాసియ ఫ ఇన్న బిల్ మాసియతి హల్ల సఖతుల్లాహి అజ్జ వజల్ల.” అల్లాహ్ కు అవిధేయత చూపకండి అంటే పాపం చేయకండి. ఎందుకు పాపాల వల్ల అల్లాహ్ ఆగ్రహానికి గురవుతాము. ఈ హదీసు ముస్నద్ అహ్మద్ లో ఉంది.

అలాగే అల్లాహ్ సెలవిచ్చాడు సూరహ్ హజ్ లో: అల్లాహ్ పరాభవం పాలుజేసిన వాడికి ఎవ్వరూ ఆదరించరు. అలాగే పాపాల మూలంగా దాసుడు సైతాన్ బందీ అయిపోతాడు సూరహ్ జుఖ్రుఫ్ ఆయత్ 36:

وَمَن يَعْشُ عَن ذِكْرِ ٱلرَّحْمَٰنِ نُقَيِّضْ لَهُۥ شَيْطَٰنًا فَهُوَ لَهُۥ قَرِينٌ
(వ మయ్ యఅషు అన్ జిఖ్రిర్ రహ్మాని నుఖయ్యిజ్ లహు షైతానన్ ఫహువ లహు ఖరీన్)
కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము, ఇక వాడు అతనికి సహవాసిగా ఉండిపోతాడు. (43:36)

సైతాన్. అలాగే పాపాల వల్ల మనిషి తన్ను తానే మర్చిపోతాడు సూరహ్ హషర్ ఆయత్ 19:

وَلَا تَكُونُوا۟ كَٱلَّذِينَ نَسُوا۟ ٱللَّهَ فَأَنسَىٰهُمْ أَنفُسَهُمْ ۚ أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْفَٰسِقُونَ
(వలా తకూనూ కల్లజీన నసుల్లాహ ఫ అన్సాహుమ్ అన్ఫుసహుమ్ ఉలాయిక హుముల్ ఫాసిఖూన్)
మరియు మీరు అల్లాహ్ ను మరిచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. వారి ఈ విస్మరణ కారణంగా అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరిచిపోయిన వారిగా చేసేశాడు. అలాంటి వారే పరమ అవిధేయులు. (59:19)

అలాగే పాపాల వల్ల జీవితం దుర్భరమైపోతుంది, మనశ్శాంతిని కోల్పోతాము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరహ్ తాహా లో:

وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِى فَإِنَّ لَهُۥ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُۥ يَوْمَ ٱلْقِيَٰمَةِ أَعْمَىٰ
(వ మన్ ఆరజ అన్ జిక్రీ ఫ ఇన్న లహు మఈషతన్ జంకా వ నహ్ శురుహూ యౌమల్ ఖియామతి అమా)
మరియు ఎవడు నా స్మరణ (ఖురాన్) పట్ల వైముఖ్యత చూపుతాడో అతని బ్రతుకు దుర్భరమవుతుంది. మరియు ప్రళయ దినాన మేము అతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. (20:124)

ప్రపంచంలో శిక్ష ఏమిటి? దుర్భరమైపోతుంది, అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, టెన్షన్ లో ఉంటాము ఈ ప్రపంచంలో. పరలోకంలో గుడ్డివానిగా లేపుతాము. అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ కు అడుగుతాడు:

قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِىٓ أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا
(ఖాల రబ్బి లిమ హషర్ తనీ అమా వ ఖద్ కుంతు బసీరా)
“ప్రభూ! నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటీ? నాకు చూపు ఉండేదికదా!” అని అతను అంటాడు (20:125)

అప్పుడు అల్లాహ్ సమాధానం ఇస్తాడు:

قَالَ كَذَٰلِكَ أَتَتْكَ ءَايَٰتُنَا فَنَسِيتَهَا ۖ وَكَذَٰلِكَ ٱلْيَوْمَ تُنسَىٰ
(ఖాల కజాలిక అతత్ క ఆయాతునా ఫనసీత హా వ కజాలికల్ యౌమ తున్ సా)

“జరగవలసిన విధంగానే జరిగింది. (ఒకప్పుడు) నీ వద్దకు వచ్చిన మా ఆయతులను (వచనాలను, సూచనలను, మహిమలను) నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు” అని అనబడుతుంది. (20:126)

ఇది పాపాల ప్రభావం. పాపాల వల్ల ప్రస్తుతం అనుభవించే వరాలు అల్లాహ్ లాక్కుంటాడు. దీనికి ఉదాహరణ ఆదమ్ అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం స్వర్గంలో ఉన్నారు. దీని వివరణ సూరహ్ బఖరా లో ఉంది ఆయత్ 30, 31, 32. అల్లాహ్ వరాలను అనుభవిస్తూ ఉన్నారు అల్లాహ్ నేమత్ లను సుఖంగా సంతోషంగా హాయిగా టెన్షన్ లేదు ఏమీ లేదు. అక్కడ తప్పు జరిగింది అల్లాహ్ ఆ వరం తీసేసుకున్నాడు భూమిపైన వేసేశాడు. అంటే ఇది ఉదాహరణ. అలాగే ఉహుద్ సంఘటన, ఉహుద్ లో కొంతమంది సహాబాలకి వారు చేసిన ఆ పొరపాటు మూలంగా ఇది అయిపోయింది మనకు తెలిసిన విషయమే. అభిమాన సోదరులారా చెప్పడం ఏమిటంటే పాపాల వల్ల ఉపాధిలో కొరత వస్తుంది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “వ ఇన్నర్ రజుల ల యుహ్రముర్ రిజ్ ఖ బి ఖతీఅతిన్ యఅ మలుహా.” అంటే మనిషి పాపం వల్ల అతనికి ఇవ్వబోయే ఆ రిజ్క్ కి మహ్రూమ్ అయిపోతాడు. అల్లాహు అక్బర్.

అభిమాన సోదరులారా ఇవి ఎప్పుడు పాపం చేసినా దాని ప్రభావం. మరి ఇటువంటి పాపాలు, ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి అవిధేయతలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి నేరాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను పాపాల ప్రభావం ప్రభావాలు కొన్ని చెప్పాను కొన్ని మాత్రమే. పాపం వల్ల రిజ్క్ మహ్రూమ్ అవుతాము. పాపం వల్ల అల్లాహ్ మనకు ఇప్పుడు ఇచ్చిన వరం ఇవ్వబోయే వరం రెండింటికి అల్లాహ్ దూరం చేసేస్తాడు. మనశ్శాంతి ఉండదు, శాంతి తీసేస్తాడు. ఇలాంటివి ఉన్నాయి కదా ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా ఇవి ఎప్పుడు పాపం చేసినా. ఇటువంటి పాపాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని ప్రభావం, దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఊహించుకోగలము.

ఇప్పుడు సుకూన్ అనేది శాంతి అనేది సుఖమైన జీవితం అనేది టెన్షన్ లేని జీవితం అనేది సాధారణంగా లేదు. ఎందుకు? డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా పేదవారు ధనవంతులు, మంచి హోదాలో ఉన్నవారు హోదా లేని ఉద్యోగం లేని వారు – అంటే పేదవారు మిడిల్ క్లాస్ వారు ధనవంతులు అందరూ మనశ్శాంతి కోల్పోయారు. అంటే డబ్బు ఉన్న వారికి శాంతి లేదు, డబ్బు లేని వారికి శాంతి లేదు. ఉద్యోగం ఉన్న వారికి శాంతి లేదు, ఉద్యోగం లేని వారికి శాంతి లేదు. కారణం ఏమిటి? కారణం ఈ పాపాలే.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ నాకు చెప్పడం కంటే ఎక్కువగా మీకు వినడం కంటే ఎక్కువగా ఇస్లాంను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి ప్రదేశంలో ప్రతి మాసంలో ముఖ్యంగా పవిత్ర మాసాలలో ప్రతి చిన్న పెద్ద పాపం నుండి మనల్ని అల్లాహ్ రక్షించుగాక. ఓ అల్లాహ్ అన్ని మాసాలలో ముఖ్యంగా ఈ పవిత్ర మాసాలలో మమ్మల్ని పాపాలు మరియు అవిధేయతల నుండి కాపాడు. నీ విధేయత మరియు నీ సంతృప్తిని పొందే సత్కార్యాలకు మాకు తౌఫీక్ ప్రసాదించు. మమ్మల్ని నీ సత్ ప్రవర్తన గల దాసులలో చేర్చు. ఆమీన్.

వ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

సుబ్ హానకల్లాహుమ్మ వ బి హమ్దిక అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46079


ఇస్రా మరియు మేరాజ్ యాత్ర – సలీం జామియీ [వీడియో & టెక్స్ట్]

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర ఇస్రా మరియు మేరాజ్ యాత్ర
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/ts0-ZZ_G9D0 [39 నిముషాలు]

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలోని ఇస్రా మరియు మేరాజ్ యాత్ర గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. ఇందులో ప్రవక్త యొక్క హృదయ శుద్ధి, బురాఖ్ పై ప్రయాణం, మస్జిద్ అల్-అక్సాలో ప్రవక్తలందరికీ ఇమామత్ చేయడం, ఏడు ఆకాశాలలో ఆదం, ఈసా, యహ్యా, యూసుఫ్, ఇద్రీస్, హారూన్, మూసా మరియు ఇబ్రాహీం (అలైహిముస్సలాం) వంటి ప్రవక్తలను కలవడం వంటి సంఘటనలు వివరించబడ్డాయి. అల్లాహ్ తో సంభాషణ, యాభై పూటల నమాజు ఐదుకు తగ్గించబడటం, స్వర్గ నరకాలలోని కొన్ని దృశ్యాలు, వడ్డీ, అనాథల సొమ్ము తినేవారికి, వ్యభిచారులకు మరియు చాడీలు చెప్పేవారికి విధించబడే శిక్షల గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ అద్భుత సంఘటనను మక్కావాసులు అపహాస్యం చేసినప్పుడు, అబూ బక్ర్ రజియల్లాహు అన్హు దానిని దృవీకరించి “సిద్దీఖ్” బిరుదును ఎలా పొందారో కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ
[అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్]

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర ఆరవ భాగంలోకి మనము ప్రవేశించాము. ఈ భాగంలో మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక గొప్ప యాత్ర, మేరాజ్ యాత్ర గురించి మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉంటున్నప్పటి సంఘటన ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదె హరాంలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దైవదూత అయిన జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించగా, జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. ప్రవక్త వారు మస్జిదె హరాంలో ఉన్న సందర్భంలో ప్రవక్త వారితో కలిసి మాట్లాడి, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ శుద్ధి సంఘటన కూడా ఈ సందర్భంలో చోటు చేసుకుంది.

ఇస్రా వ మేరాజ్ – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]

[డౌన్ లోడ్ PDF]

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

1) ఇస్రా వ మేరాజ్ ప్రాముఖ్యత
2) ఇస్రా వ మేరాజ్ తారీఖు
3) ఇస్రా వ మేరాజ్ లోని సంఘటనలు
4) ఇస్రా వ మేరాజ్ ఉద్దేశ్యము

ఇస్లామీయ సోదరులారా!

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ ఎన్నో అద్భుతాలను ప్రసాదించాడు. వాటిలో ఒక ముఖ్యమైన అద్భుతం – ఇస్రా వ మేరాజ్. ఈ అద్భుతంలో రెండు ముఖ్యమైన భాగాలు వున్నాయి. ఒక భాగం – ఇస్రా అని పిలువబడే ‘మస్జిదుల్ హరామ్’ నుండి ‘మస్జిదె అఖ్సా’ వరకు సాగిన ప్రయాణానికి సంబంధించినది. ఇక రెండవ భాగం – ‘మస్జిదె అఖ్సా’ నుండి ఆకాశాల కన్నా పైకి, అల్లాహ్ కోరుకున్నంత వరకు సాగిన ప్రయాణం. దీనిలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వర్గనరకాలతో పాటు, ఎన్నో అల్లాహ్ సూచనలు చూపించడం జరిగింది, ఎన్నో ప్రవక్తలను పరిచయం చేయడం జరిగింది మరియు ఐదు పూటల నమాజ్ విధి (ఫర్జ్) గా చేయబడ్డాయి – దీనినే ‘మేరాజ్‘ అని పిలుస్తారు.

ఇమామ్ తహావీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు : మేరాజ్ అనేది సత్యం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మెలకువ స్థితిలో, శరీర సమేతంగా సంచరింపజేయడం జరిగింది మరియు ఆకాశాల వరకూ, ఇంకా వాటికన్నా పైకి అల్లాహ్ కోరుకున్నంత వరకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అల్లాహ్ తాను కోరుకున్నట్లుగా ఆయనను గౌరవించి, తాను కోరుకున్న దానిని ఆయనకు ‘వహీ’ చేశాడు.

‘ఇస్రా’ గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ

“తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదుల్ హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకునిపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే మేమతనికి మా (శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.” (బనీ ఇస్రాయీల్ 17:1)

ఈ ఆయత్ ‘సుబ్ హాన’ అన్న పదంతో అల్లాహ్ ప్రారంభించాడు. దీని శాబ్దిక అర్థం ఏమిటంటే – ఆయన (అల్లాహ్) అన్ని లోపాలకు అతీతుడు. కానీ, అరబ్బీ భాషలో దీనిని ‘ఆశ్చర్యాన్ని‘ వెలిబుచ్చే సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా అల్లాహ్ శక్తిసామర్థ్యాలకు గాను ఆశ్చర్యం ప్రకటించబడుతోంది – ఆ శక్తిసామర్థ్యాలు ఏమిటంటే – అల్లాహ్ తన దాసుణ్ణి, ఆ రోజుల్లో 40 రేయింబవళ్ళలో పూర్తి చేయగలిగే ప్రయాణాన్ని రాత్రికి రాత్రే పూర్తి చేయించాడు. దీనిని వెల్లడించిన శైలి కూడా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మెలకువతో, శరీర సమేతంగా మేరాజ్ చేయించడం జరిగిందని నిరూపిస్తోంది. ఎందుకంటే – ఒకవేళ నిద్ర స్థితిలో, ఆత్మరూపంలో ఈ ప్రయాణం జరిగి వుంటే, దాని కోసం ‘సుబ్ హాన’ పదాన్ని ఉపయోగించి ఆశ్చర్యం ప్రకటించాల్సిన అవసరం వుండేది కాదు.

ఇదేగాక, అల్లాహ్ దీనిలో అబ్ద్ (దాసుడు) పదాన్ని వాడాడు. అంటే ఆయన దాసుణ్ణి సంచారం గావించాడు. ఈ పదం కూడా ఆత్మ, శరీరం – రెండింటినీ కలిపి వాడబడుతుంది. కేవలం ఆత్మ కోసం కాదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కలలో కాకుండా మెలకువతో శరీర సమేతంగా మేరాజ్ యాత్ర చేయించి గౌరవించడం జరిగిందనడానికి ఇది రెండవ ఆధారం.

ఇక దీని మూడవ ఆధారం ఏమిటంటే – ఒకవేళ ‘ఇస్రా వ మేరాజ్’ సంఘటన కలలో జరిగివుంటే, మరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కలను జనాలకు వివరించినప్పుడు వారు దానిని (నమ్మకుండా) తిరస్కరించేవారు కాదు. కనుక మక్కా అవిశ్వాసుల తిరస్కరణ ద్వారా మనకు తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో తన కలను వివరించలేదు, వారితో స్పష్టంగా తనకు మెలకువ స్థితిలో, శరీర సమేతంగా ‘ఇస్రా వ మేరాజ్’ చేయించడం జరిగిందని చెప్పారు.అందుకే వారు- మక్కా నుండి ఏలియా (బైతుల్ మఖ్దిస్)కు మేము 40 రేయింబవళ్ళలో పూర్తి చేసే యాత్రను ఈయన రాత్రికి రాత్రే అక్కడికెళ్ళి తిరిగి వచ్చేశారు! అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను పరిహసించారు.

సలాతుల్ రగాయిబ్ (రగాయిబ్ నమాజ్ ) – రజబ్ మాసంలో ఒక బిద్అత్

రజబ్ మాసంలో ఒక బిద్అత్ ‘సలాతుర్రగాయిబ్’ పేరుతో ప్రజల్లో ప్రసిద్ధిగాంచి వుంది. ప్రజలు తమ వైపు నుంచి సృష్టించి, దానిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆపాదించిన దీని స్వరూపాన్ని ముందు మీకు వివరిస్తాం. తదుపరి దీని గురించి ముహద్దిసీన్ (హదీసువేత్తలు)ల అభిప్రాయాలు మీ ముందుంచుతాం.

‘సలాతుర్రగాయిబ్’ గురించి వివరించబడే హదీసులో మొదట్లో ఇలా వుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: రజబ్ అల్లాహ్ మాసం, షాబాన్ నా మాసం మరియు రమజాన్ నా ఉమ్మత్ మాసం. తదుపరి, ఆ హదీసులో రజబ్ మాసపు కొన్ని విశిష్ఠతలు చెప్పబడిన తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని ఆయన వైపునకు కొన్ని విషయాలు ఆపాదించబడ్డాయి. అవేమిటంటే – ఏ వ్యక్తి అయినా రజబ్ మాసపు మొదటి గురువారం నాడు ఉపవాసముండి, శుక్రవారం రాత్రి మగ్రిబ్, ఇషాల మధ్య రెండు, రెండు రకాతుల చొప్పున 12 రకాత్లు -ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత మూడు సార్లు ఖద్ర్ సూరా, 12 సార్లు ఇఖ్లాస్ సూరా- చదివి, నమాజు పూర్తయిన తర్వాత 70సార్లు ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదున్నబీ ఉల్ ఉమ్మీ వ అలా ఆలిహి’ అని దరూద్ పఠించి, ఆ తర్వాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు – ‘సుబ్బూహు ఖుద్దూసు రబ్బుల్ మలాయికతి వర్రూహు’ అని పఠించి, తదుపరి తలపై కెత్తి ‘రబ్బిగ్ఫర్ వర్హమ్ వతజావజ్ అమ్మా తాలమ్ ఇన్నక అన్తల్ అజీజుల్ అజీమ్’ అని 70 సార్లు ప్రార్థించి, తదుపరి రెండవ సజ్జాలోకి వెళ్ళి ఇలానే చేసి, ఆ తర్వాత అతను అల్లాహ్ ను ఏది కోరినా అది ప్రసాదించబడుతుంది.

ఈ కాల్పనిక, తప్పుడు హదీసు గురించి హదీసువేత్తల వివరణలు ఇలా వున్నాయి :

1) ఇబ్నుల్ జౌజి రహిమహుల్లాహ్ ఈ హదీసును ‘అల్ మౌజుఆత్’ నందు పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు: ఈ హదీసు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరుతో (క్రొత్తగా) సృష్టించబడింది. అబద్ధాలకోరుగా పేరుగాంచిన ‘ఇబ్నె జహజమ్’ ను దీని వెనుక కుట్రదారుడుగా హదీసు వేత్తలు ఖరారు చేశారు. నేను, మా షేఖ్ అబ్దుల్ వహ్హాబ్ అల్ హాఫిజ్ నోటితో విన్నదేమిటంటే – దీని ఉల్లేఖకులు అపరిచితులు. స్వయంగా నేను కూడా ఎన్నో గ్రంథాలను తిరగేసాను, కానీ వీరి గురించి నాకు ఏ మాత్రం సమాచారం దొరకలేదు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం- 438 పేజి)

ఇమామ్ జహబీ, ఇబ్నుల్ జౌజి మాటలకు అదనంగా ఈ మాట కూడా జోడించి పేర్కొన్నారు: “ఈ హదీసును ఉల్లేఖించినవారు బహుశా పుట్టనే లేదేమో!” (తల్ ఖీస్ అల్ మౌజుఆత్ : 247వ పేజి)

అలాగే, ఇబ్నుల్ జౌజి ‘అస్సలాతుల్ అర్ ఫియ’ గురించి కాల్పనిక హదీసును పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు:

ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం అనుమానం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు (మజ్ హూల్) మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కల్గిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజును చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు, ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గురించే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)

2) ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: రజబ్ మాసంలో మొదటి శుక్రవారం రాత్రి చదివే ‘సలాతుర్రగాయిబ్’ గురించి ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులు. మెజారిటీ ఉలమాల దృష్టిలో ఇది నాల్గవ శతాబ్దం తర్వాత ఉద్భవించిన ఒక బిద్అత్. (లతాయిఫుల్ మారిఫ్ ఫీమాలిమవాసిముల్ ఆమ్ మినల్ వజాయిఫ్-123 పేజి)

3) ఇమామ్ నవవీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’గా పేరు గాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషా ల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజు మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వాటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక, (అల్ మజ్ఞ్ముఅ లిన్నవవీ : 3వ సంపుటం, 379పేజీ)

4) ముహమ్మద్ బిన్ తాహిర్ అల్ హిందీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’ ఏమాత్రం సందేహం లేని కాల్పనిక, అసత్య ఆచరణ. (తజ్కిరతుల్ మౌజుఆత్: 44వ పేజీ)

5) ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు: ఈ హదీసును కాల్పనిక తప్పుడు హదీసని నిర్దారించడంలో హదీసువేత్తలందరూ ఏకీభవించారు. ఇది కాల్పనికమవడంలో హదీసు విషయ పరిజ్ఞానం స్వల్పంగా వున్న వారికి సైతం ఏమాత్రం సందేహం లేదు. ఫీరోజాబాదీ మరియు మఖ్ దిసీలు కూడా – హదీసువేత్తలందరి దృష్టిలో ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అని స్పష్టం చేశారు.

6) మౌలానా అబ్దుల్ హై లక్నోవీ ఇలా పేర్కొన్నారు: సలాతుర్రగాయిబ్ కు సంబంధించిన హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు. ఈ విషయంలో హదీసువేత్తలందరూ లేదా మెజారిటీ హదీసు వేత్తల మధ్య ఏకాభిప్రాయం వుంది. కనుక, దీనిని వ్యతిరేకించే వారిని ఏ మాత్రం నమ్మలేం. వారెవరైనా కావచ్చు. (అల్ ఆసారుల్ మర్ ఫ్యూ అ : 74వ పేజీ)

వీరితోపాటు సుయూతీ, ఇబ్నె ఇరాక్ మరియు అల్ కర్మి మొ॥వారు కూడా దీనిని మౌజుఆత్ (కాల్పనికమైనవి)లో చేర్చారు. (అల్ లఆలి అల్ మస్నూఅ : 2వ సంపుటం, 47వ పేజి, తనజిహుష్షరియ : 2వ సంపుటం, 90వ పేజీ, అల్ ఫవాయెదుల్ మౌజుఅ: 72 పేజీ)

నుండి : జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

రజబ్ మాసపు క్రొత్త పోకడ (బిద్అత్)లు – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]

[డౌన్ లోడ్ PDF]

1) రజబ్ మాసం నిషేధిత మాసాల్లో ఒకటి
2) రజబ్ మాసంలోని కొన్ని బిద్అత్ (కొత్తపోకడ)లు
3) సలాతుల్ రగాయిబ్

4) రజబ్ మాసంలో ప్రత్యేక ఉపవాసాలు
5) రజబ్ మాసపు 27వ రాత్రి ఆరాధన లేదా మరుసటి దినపు ఉపవాసం
6) రజబ్ మాసంలో ఉమ్రా చేయడం ఉత్తమమా?
7) రజబ్ కే కుండే (రజబ్ మాసపు నైవేద్య వంటకాలు)

ఇస్లామీయ సోదరులారా! నిషేధిత నాలుగు మాసాల్లో రజబ్ మాసం కూడా ఒకటి.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)

అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.

ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?

దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)

ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.

ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.

దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.

ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)

అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.

మేరాజ్ కానుక – నమాజ్ (కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత) | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/meraj-kanuna-namaz
[PDF] [27 పేజీలు]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు: 

  • 1) నమాజ్ విధి గావించబడడం
  • 2) నమాజ్ ప్రాధాన్యత
  • 3) నమాజ్ మహత్యం
  • 4) నమాజ్ ను త్యజించేవారి శిక్ష మరియు దాని ఆజ్ఞ. 

ఇస్లామీయ సోదరులారా! 

ఈ రోజు జుమా ఖుత్బాలో (ఇన్షా అల్లాహ్) అల్లాహ్ సామీప్యం పొందడానికి అన్నింటికన్నా గొప్ప మాధ్యమం, కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత అయిన ఒక (ముఖ్యమైన) ఆచరణ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఏ ముస్లిమ్ అయినా ప్రాపంచిక ఆందోళనలకు, దు:ఖానికి గురై నిరుత్సాహ స్థితిలో ఈ ఆచరణ నిమిత్తం అల్లాహ్ ముందు నిలబడితే అతని ఆందోళన, దు:ఖాల భారం తగ్గి అతనికి అసలైన హృదయ ప్రశాంతత లభిస్తుంది. ఆ ఆచరణ పేరు నమాజ్. అల్లాహ్ దీనిని అర్హత కలిగిన ప్రతి ముస్లిమ్ పై విధిగా ఖరారు చేశాడు. 

విధిగా చేయబడిన ఆచరణలన్నీ ఈ భూమి మీదే విధిగా గావించబడగా, నమాజ్ ను మాత్రం అల్లాహ్ తన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వైపునకు పిలిచి, ఆకాశాలపై తాను అనుకొన్న చోట దానిని విధి (ఫర్జ్)గా చేయడం దీని ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను సూచిస్తుంది. . 

మేరాజ్ సంఘటనను గూర్చి చెబుతూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: 

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

మేరాజున్‌ నబీ పండుగ

బిస్మిల్లాహ్

12- మేరాజున్‌ నబి పండుగ

రజబ్‌ నెల 27వ తేది మేరాజున్‌ నబీ పవిత్రమైన సంఘటన జరిగిందని ఆ పండుగను జరుపుకునే వారి అభిప్రాయం. అందువలన వారు ప్రతి ఏటా మేరాజున్‌ నబీ రాత్రి ఒక పండుగ కొరకు ముస్తాబవుతారు. అలాగే తమ ఇండ్లల్లో ప్రత్యేకమైన వంటకాలు చేసుకుంటారు. మరియు ఫాతిహాలు అర్పిస్తారు. మసీదులను పచ్చటి మరియు ఎర్రటి లైట్లతో అలంకరిస్తారు, మసీదులలో ప్రత్యేకమైన నఫిల్‌ నమాజులు చదువుతారు. మరియు ఆ రాత్రంతా మేరాజున్‌ నబీ జరిగిన సంఘటను గురించి మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్ర గురించి ప్రసంగాల సభలు నిర్వహిస్తారు. మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రత్యేకమైన “దరూద్‌ దుఆ” లను చదువుతారు. ఆ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.

కొంతమంది ప్రజలు మేరాజున్‌ నబీ గురించి కొన్ని కల్పిత విషయాలు జొప్పించుకొని ప్రసంగాలు చేస్తారు, అంతే కాక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహివసల్లం) గారి పట్ల ధర్మ హద్దులు మీరి అతిగా పొగుడ్తారు. ఉదాహరణకు:

1- ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు అల్లాహ్‌ తన తేజస్సు తెరను తొలిగించాడు. కనుక అల్లాహ్‌ను అసలైన రూపంలో ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) కళ్ళారా దర్శించే భాగ్యాన్ని పొందినట్లు అంటారు.

2- ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్‌ రాత్రి అల్లాహ్‌ వద్దకు చేరుకునేందుకు తమ కాళ్ళ నుండి చెప్పులను తీయబోతే, అల్లాహ్‌ ఆయన్ని చెప్పులతో సహా ఆహ్వానించారు అని కథలు చెప్పుకుంటారు.

౩- మేరాజ్‌ రాత్రి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ ను స్వయంగా సందర్శించారు మరియు అల్లాహ్‌ మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మధ్య ఆలింగనము చేసుకునే వ్యత్యాసం మాత్రమే మిగిలిందని అంటారు.

4- అల్లాహ్‌ తన తేజస్సు తెరను తొలిగించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అల్లాహ్‌ను చూస్తే అల్లాహ్‌ కూడా ప్రవక్త రూపంలోనే ఉన్నారని అంటారు.

హజ్రత్ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి ఆయిషా (రజియల్లాహు అన్హ) గారు ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ను ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కళ్ళారా చూసారని అంటారో వారు అల్లాహ్‌ పై  అబద్దాన్ని అంటగట్టినట్టే”…. (బుఖారి: 259)

ఇలా అనేకమైన షిర్క్ కు చెందిన విషయాలను మేరాజ్‌ రాత్రిన అమాయక ప్రజల ముందు ప్రసంగిస్తారు. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని అల్లాహ్‌ స్థాయికి పెంచి అల్లాహ్‌ అంటే ప్రవక్త, ప్రవక్త అంటే అల్లాహ్‌ అని విశ్వసిస్తారు. ఇలా విశ్వసించటం క్రైస్తవుల విశ్వాసంకంటే హీనమైన విశ్వాసంగా తెలుస్తుంది. ఎందుకంటే? క్రైస్తవులు యేసు (అలైహిస్సలాం) వారిని అల్లాహ్‌ కుమారునిగా విశ్వసిస్తారు. కాని మన ముస్లిం ప్రజలలో కొంత మంది ప్రజలు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను పూర్తిగా అల్లాహ్‌ స్థాయికి పెంచి అనేక కవితాగానాలు రచించారు. మరియు ఆ రాత్రంతా వాటిని పాడుతుంటారు.

అందుకనే ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “మీరు నన్ను పొగడటంలో హద్దులు మీరకండి, ఎలాగైతే క్రైస్తవులు మర్యమ్‌ కుమారుడగు ఈసా(అలైహిస్సలాం) గారి పట్ల హద్దుమీరి పొగడ్తల్లో ముంచారో! నిశ్చయంగా నేను అల్లాహ్‌ దాసుడను మాత్రమే. కనుక మీరు నన్ను అల్లాహ్‌ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారి: ౩189)

13- పవిత్రమైన మేరాజ్‌ సంఘటన వాస్తవం

మేరాజున్‌ నబీ యాత్ర ఎప్పుడు జరిగిందని అడిగితే? దానికి సూటిగా ఒక జవాబుగా హిజ్రత్ కు ఒక ఏడాది ముందు జరిగిందని చెప్పవచ్చు.

కాని ఏ నెలలో? ఏ తేదిలో అని చెప్పడానికి స్పష్టమైన ఆధారం ఇస్లామీయ చరిత్రలో భధ్రపరచబడలేదు. కనుక ప్రవక్త గారి చరిత్రను రచించినవారిలో కూడా మేరాజ్‌ సంఘటన గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. వాటిలో కొన్నిటిని మీ ముందు ఉంచుతున్నాము:

1- దైవదౌత్యం ప్రసాదించబడిన సంవత్సరమే ఈ మేరాజ్‌ సంభవించిందని ఇమామ్‌ తబ్రీ కథనం.

2- దైవదౌత్యం అయిదు సంవత్సరాల తరువాత జరిగిందని ఇమామ్‌ నూవీ, ఇమామే ఖుర్తిబీ కథనం.

౩- దైవదౌత్యం పదవ సంవత్సరం రజబ్‌ నెల 27వ తేదిన సంభవించిందని, సులైమాన్‌ మన్సూర్‌పూరి కథనం.

4- హిజ్రత్ పదహారు మసాల ముందు రమజాన్‌ నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ పదునాలుగు మాసాల ముందు ముహర్రం నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ కు ఒక సంవత్సరం ముందు రబీఉల్‌ అవ్వల్‌ మాసంలో సంభవించిందని రచయితలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏదైనప్పటికి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారి తదనంతరం మేరాజ్‌ సంఘటన జరిగినట్లు స్పష్టమవుతుంది. మరియు హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారు దైవదౌత్య శకం పదవ సంవత్సరం రమజాన్‌ నెలలో మరణించినట్లు తెలుస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్‌ కంటే ఒక యేడాది ముందు మేరాజ్‌ సంఘటన సంభవించినదిగా భావించాలి. (వివరాలకు అర్రహిఖుల్‌ మఖ్తూమ్‌ – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర తెలుగు, 224-225 చూడండి).

మేరాజున్‌ నబీ సంఘటన ఏ నెలలో మరియు ఏ తేదిన జరిగిందో అన్న విషయం మన మహానీయులైన ధర్మ గురువులకే స్పష్టమైన జ్ఞానం లేదంటే మనం రజబ్‌ నెల 27వ తేదిన మేరాజున్‌ నబీ పండుగ జరుపుకోవడం ఎంతవరకు ధర్మం. అలాగే మేరాజ్‌ రాత్రి ఆరాధనలు మరియు పగలు ఉపవాసం గనక ఇస్లామీయ సాంప్రదాయం అనుకుంటే, ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అల్లిహి వసల్లం) మేరాజ్‌ తరువాత పన్నెండు సంవత్సరాల వరకు సహాబాల మధ్య బతికున్నారు, అయినా ఆయన మేరాజ్‌ జరిగిన పవిత్రమైన రోజు ఇలాంటి ఆరాధనలు ఎందుకు పాటించలేదు? తరువాత సహాబాలు మేరాజ్‌ రోజున పండుగగా ఎందుకు నిర్వహించలేదు. ఒకవేళ వారు ప్రతి సంవత్సరం మేరాజ్‌ రాత్రిని ఆరాధనల కొరకు మరియు పగలు ఉపవాసం కొరకు ప్రత్యేకం చేసుకొని పర్వదినంగా నిర్వహించి ఉంటే, మేరాజ్‌ జరిగిన మాసము మరియు తేది కూడా స్పష్టంగా తెలిసి ఉండేది కదా! మరియు ఆ రోజున చేసే కార్యాలకు, ఆరాధనలకు ప్రవక్త ఆమోదం కూడా లభించి ఉండేది కదా!.

నా ప్రియమైన ముస్లిం సోదరులారా! మనం పుణ్యాలు చేయుట కొరకు ఆశక్తి చూపాలి, కాని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గదర్శకం ప్రకారమే మనం ఆరాధనలు చెయ్యాలి. అప్పుడే అవి అల్లాహ్‌ వద్ద ఆమోదయోగ్యానికి నోచుకుంటాయి. మేరాజున్‌ నబీ అన్నది ఇస్లామీయ ధర్మానికి చెందిన ఒక విశ్వాసనీయ సంఘటన, మరియు ఎంతో అద్భుతమైన సంఘటన, ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చాలా కష్టాలకు, దుఃఖాలకు నష్టాలకు గురికాబడ్డారు. అంతలో హజ్రత్ ఖదీజా(రజియల్లాహు అన్హా) కూడా మృతి చెందారు. చివరికి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సంవత్సరానికి ఆముల్‌ హుజ్న్‌ (శోక సంవత్సరం) గా భావించారు. అప్పుడు అల్లాహ్‌ ఆయన శోకాన్ని, మరియు దుఃఖాన్ని దూరం చేయుట కొరకు ఈ మహోన్నతమైన మేరాజ్‌ గగన యాత్రను ఏర్పాటు చేసినట్లు ధర్మగురువులు భావిస్తారు.

అక్కడ ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అనేక మంది ప్రవక్తలను కలిసి మాట్లాడారు. స్వర్గం, నరకం మరియు అనేక అద్భుత విషయాలను చూసారు. తరువాత ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి ఉమ్మత్‌ కొరకు అల్లాహ్‌ ఒక మహోన్నత బహుమానంగా, ఐదు సమయాల నమాజులను విధిగా ప్రసాదించాడు. మరియు “సూరతుల్‌ బఖరా” చివరి ఆయతులను కూడా ప్రసాదించాడు.

మనం మేరాజున్‌నబి గురించి పవిత్రమైన సంఘటనగా విశ్వసించాలి, ఆ సంఘటన గురించి ఉన్న వాస్తవాలను యదాతధంగా నమ్మాలి. మరియు ప్రతి రోజు ఐదు సమయాల నమాజును విధిగా పాటించాలి. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గం, నరకం గురించి తెలియజేసిన విషయాలను నిత్యం గుర్తుంచుకొని భయభక్తితో జీవితాన్ని గడపాలి.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 83-87). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

బిద్అత్ (నూతనాచారం) – Bidah

రజబ్‌ నెల వాస్తవికత – రజబ్‌కీ కుండే (కుండల పండుగ)

బిస్మిల్లాహ్

10- రజబ్‌ నెల వాస్తవికత

రజబ్‌ అంటే: అరబీ భాషలో “గౌరవమైనది, పవిత్రమైనది”. కనుక అరబ్‌ వాసులు ఈ నెలను పవిత్రంగా భావించేవారు మరియు మూఢ (జాహిలియత్‌) కాలంలో ఈ నెలలో తమ ఆరాధ్యులైన విగ్రహాల పేరున జంతువులను బలినిచ్చేవారు. ఆ జంతువులను వారు ‘అతీరా’ అని పేర్కొనేవారు. కాని ఇస్లాం ధర్మం వచ్చిన తరువాత ఆ ఆచారాన్ని నిర్మూలించడం జరిగింది.

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) రాక మునుపే, అంటే అజ్ఞాన కాలం నుండే రజబ్‌, జిల్‌ ఖాదా, జిల్‌ హిజ్జా మరియు ముహర్రం నెలలను పవిత్రంగా భావించేవారు. ఆ నెలలలో దండయాత్రలు లేక యుద్దాలు, తగాదాలు వంటి కార్యాలు నిషేధించబడి యున్నవి. దానివల్ల ప్రజలు హజ్‌ నియమాలను శాంతి భద్రతతో నెరవేర్చుటకు అనుకూల మయ్యేది. తరువాత ఆ నిషేధిత ఆదేశం కూడా తొలిగిపోయింది. అనివార్యమైన స్థితిలో ధర్మయుద్దాలు చేయవచ్చునని ధర్మగురువులు ఏకీభవించారు. కాని ఇతర నెలలకంటే ఎక్కువగా ఈ నాలుగు నెలల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని పాపాలకు మరియు అల్లాహ్‌ ఎడల అవిధేయతకు గురికాకుండా జాగ్రత్త పడాలని హితోపదేశం చేశారు. (లతాయిఫుల్‌ మఆరిఫ్‌).

కనుక ఖుర్‌ఆన్‌ గ్రంథంలో అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ

“నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే కొనసాగుతున్నది) వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి”. (సూరతు తౌబా:36).

ప్రస్తుత కాలంలో కొంత మంది ముస్లింల చేత రజబ్‌ నెలలో ప్రత్యేకమైన నూతన కార్యాలను ఆరాధనలుగా జొప్పించుకున్నారు. అంటే; నఫిల్‌ ఉపవాసాలు, రగాయిబ్‌ నమాజ్‌, మరియు షబే మేరాజ్‌ పండుగ వంటి ఆరాధనలు. ఇలాంటి ఆరాధనలు నెరవేర్చుటకు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఆదేశించినట్లు హదీసు గ్రంథాలలో ఎక్కడ రుజువులు లేవు. అయినా కొంత మంది ప్రజలు కొన్ని బలహీనమైన, మనోకల్పిత హదీసులను ఆధారంగా చేసుకొని ఆరాధిస్తున్నారు. అలాంటి హదీసుల పట్ల అనేక ఇస్లామీయ ముఖ్య పండితులు ఇలా తెలియజేశారు:

ఇమామ్‌ హజ్రత్ ఇబ్ను హజర్‌ (రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలియజేశారు: “రజబ్‌ నెలలో పాటించే ఉపవాసాలకుగాని, నఫిల్‌ నమాజులకుగాని ఎటువంటి ఆధారపూర్వకమైన హదీసులు లేవు” (తబ్యీ నుల్‌ అజబ్‌: 71)

ఇమామ్‌ సుయూతి (రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలిపారు: “రజబ్‌ నెల ఉపవాసాల గురించి ఉన్న హదీసులన్నీ నిరాధారమైనవి, మనోకల్పితమైనవి కూడా. ” (అష్షమారీఖ్‌ ఫీ ఇల్మిత్‌ తారీఖ్‌-40).

హజ్రత్ అలీ బిన్‌ ఇబ్రాహీమ్‌ అల్‌ అత్తార్‌(రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలిపారు: “రజబ్‌ నెల ఉపవాసాల గురించి హదీసులన్నీ నిరాధారమైనవి, మనోకల్పితమైనవి.” (అల్‌ ఫాయిదుల్‌ మజ్మూఅ -440).

ఇమామ్‌ ఇబ్నుల్‌ జౌజి(రహ్మతుల్లాహి అలైహి) మరియు షేఖుల్‌ ఇస్లాం ఇమామ్‌ ఇబ్ను తైమియా (రహ్మతుల్లాహి అలైహి) మరియు ఇమామ్‌ ఇబ్నుల్ ఖయ్యూమ్‌ (రహ్మతుల్లాహి అలైహి) మరియు అనేక ప్రముఖ ధర్మ గురవుల అభిప్రాయం ప్రకారం: “రజబ్‌ నెలలో పాటించే ప్రత్యేకమైన ఆరాధనల ప్రాముఖ్యతకు ఎలాంటి విశ్వాసనీయ ఆధారాలు లేవు” అని తెలిపారు.

ప్రియమైన ముస్లిం సోదరులారా! మనం ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధేయతను మరియు ఆయన చూపిన మార్గాన్ని మాత్రమే అనుసరించాలి. క్రొత్త క్రొత్త ఆచారాలను, ఆరాధనలను వెలుగులోకి తెచ్చుకొని ఆరాధించడం ధర్మ సమ్మతం కాదు. ప్రతి నెలలో ధర్మ పరమైన ఆరాధనలు ఎలాగైతే పాటిస్తున్నామో, అలాగే రజబ్‌ నెలలో కూడా మనం ఆరాధనలు పాటించాలి.

11- రజబ్‌కే  కుండే

రజబ్‌కే కుండే పేరుతో ఒక పండుగ 1906వ సంవత్సరంలో భారతదేశం రాంపూర్‌ అనే పట్టణంలో ఆరంభమైనది. ఖుర్‌షీద్‌ అహ్మద్‌ మీనాయి అనే వ్యక్తి “దాస్తానే అజీబ్‌” అనే పేరున ఒక కట్టుకథ రచించాడు.

హజ్రత్‌ ఇమామ్‌ జాఫర్‌ సాదిఖ్‌ (రహ్మతుల్లాహి అలైహి) గారి గురించి ఆయన ఆదేశించినట్లుగా అతను ఇలా రాశాడు:

“ఎవరైతే రజబ్‌ 22వ తేదిన నా పేరున మొక్కుబడి చెల్లిస్తూ “కుండల ఆచారాన్ని” పాటించి, నా పేరున తన అవసరాన్ని వేడుకుంటే అతని అవసరం తప్పక తీరుతుంది. ఒక వేళ అతని అవసరం తీరకపోతే ప్రళయ దినాన నా దుస్తుల అంచు అతని చేతిలో ఉంటుంది.”

మన అమాయక ముస్లిం ప్రజలు ఆ కథను ఆధారంగా చేసుకొని, ప్రతి ఏట ‘కుండల పండుగ‘ పేరుతో మొక్కుబడి చెల్లిస్తూ రాత్రంతా హల్వా, పూరీలు అర్పిస్తారు. మరియు వాటిపై ఫాతిహాలు చేస్తారు. స్వతహాగా వారు తింటారు, ఇతరులను కూడా విందుగా ఆహ్వానిస్తారు.

1, ప్రియమైన ముస్లిములారా! మీరే ఆలోచించండి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయిన 1400 సంవత్సరాల తరువాత ఆరంభమైన ఈ కార్యం ఎలా పుణ్యపరమైనది?

2, ధర్మానికి చెందిన ప్రతి పుస్తకంలో మొక్కుకోవడం మరియు వేడుకోవడం, అల్లాహ్‌ యొక్క ఆరాధనే అవుతుందని ఉంది. ఆ ఆరాధన అల్లాహ్‌కు మాత్రేమే సొంతం చేయాలి. అల్లాహ్‌ను తప్ప ఇతరులను ‘మొక్కుకోవడం, మొరపెట్టుకోవడం షిర్క్‌ అవుతుంది. అలాంటప్పుడు హజ్రత్‌ ఇమామ్‌ జాఫర్‌ (రహ్మతుల్లాహి అలైహి) లాంటి మహా ధర్మ గురువులు ఇలాంటి బహుదైవారాధన గురించి ఆదేశమిచ్చినట్టు, దానిని ప్రోత్సహించినట్లు మనం ఎలా భావించగలం?

3, రజబ్‌ నెల 22వ తేదికి మరియు ఇమామ్‌ జాఫర్‌ (రహ్మతుల్లాహి అలైహి) గారికి సంబంధం ఏమిటి? ఆ రోజు ఆయన జననం కాదు మరియు మరణం కూడా కాదు. ఆయన 80 హిజ్రీ, రమజాన్‌ 8వ తేదిన జన్మించారు, 148 హిజ్రీ, షవ్వాల్‌ 15వ తేదిన మరణించారు. ఆయన జీవితంలో ఆ తేదిన ముఖ్యమైన సంఘటన జరిగినట్లు కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే; రజబ్‌ 22వ తేదిన కాతిబే వహీ హజ్రత్‌ ముఆవియా (రజియల్లాహు అన్హు) గారి మరణం జరిగింది. అలాంటప్పుడు ఇమామ్‌ జాఫర్‌ (రహ్మతుల్లాహి అలైహి) గారికి మరియు రజబ్‌ నెలకు ఎలాంటి పొంతన లేదు.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 79-82). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

బిద్అత్ (నూతనాచారం) – Bidah

రజబ్ నెల కల్పితాచారాలు, వడ్డీ తినుట, వ్యభిచారం, ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో]

బిస్మిల్లాహ్

31:22 నిమిషాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


బిద్అత్ (నూతనాచారం) – Bid’ah