అయ్యాముత్ తష్రీఖ్ ఘనత
కూర్పు: ముహమ్మద్ నసీర్పద్దీన్ జామిఈ
అయ్యాముత్ తష్రీఖ్ అనగా ఇస్లామీయ క్యాలెండర్ లోని 12వ నెల అయిన జుల్ హిజ్జా యొక్క 11, 12 మరియు 13 తేదీలు. ఇవి ఖుర్బానీ, అల్లాహ్ స్మరణ, తక్బీరాత్ మరియు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపే రోజులు. ఈ రోజులకు ఇస్లాంలో గొప్ప మహిమ ఉంది.
1) లెక్కించిన రోజులలో అల్లాహ్ ను స్మరించండి
అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:
وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి (సూరహ్ అల్-బఖరా: 203).
ముఫస్సిరీన్లలో (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలలో) ముఖ్యంగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా మరియు జుమ్హూర్ ఉలమా అభిప్రాయం ప్రకారం “అయ్యామిన్ మఅదూదాత్” అనగా అయ్యామె తష్రీఖ్.
2) ఖుర్బానీ మరియు ఇబాదత్ సంబంధం
అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:
لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَعْلُومَاتٍ
వారు తమ ప్రయోజనాలు పొందటానికి (హజ్ కు) రావాలి. ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి. (సూరహ్ అల్-హజ్: 28).
అధిక ముఫస్సిరీన్ల ప్రకారం “అయ్యామిమ్ మఅలూమాత్” అంటే జుల్ హిజ్జా మొదటి పది రోజులు; “అయ్యామిమ్ మఅదూదాత్” అంటే అయ్యాముత్ తష్రీఖ్. ఇక్కడ ఖుర్బానీ ప్రస్తావన వచ్చింది గనక, ఈ ఖుర్బానీ ఎన్ని రోజులు చేయవచ్చు అన్నది కూడా స్పష్టంగా తెలుసుకుందాం.
అయితే పండుగ రోజు (10వ జిల్ హిజ్జా) మరియు ఆ తర్వాత మూడు రోజులు, మొత్తం నాలుగు రోజులు ఖుర్బానీ చేయవచ్చు. దీనికి మొదటి ఆధారం ప్రవక్తవారి ఈ హదీసు «كُلُّ أَيَّامِ التَّشْرِيقِ ذَبْحٌ» అయ్యాముత్ తష్రీఖ్ యొక్క అన్ని రోజులు జిబహ్ చేయవచ్చును అంటే ఖుర్బానీ ఇవ్వవచ్చును. (ముస్నద్ అహ్మద్ 1651, సహీహ్ 2476).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:
«إِنَّ يَوْمَ عَرَفَةَ وَيَوْمَ النَّحْرِ وَأَيَّامَ التَّشْرِيقِ عِيدُنَا أَهْلَ الْإِسْلَامِ ، وَهِيَ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ»
నిశ్చయంగా అరఫా రోజు, నహ్ర ఖుర్బానీ రోజు మరియు అయ్యాముత్ తష్రీఖ్ ముస్లింల పండుగ రోజులు మరియు తినే త్రాగే రోజులు. (అబూ దావూద్ 2419. చివరి పదాలు ముస్లిం 1141లోనివి).
ఇమాం ఇబ్నె తైమియా, ఇమాం ఇబ్నె ఖయ్యిమ్, ఇమాం షౌకానీ, షేఖ్ బిన్ బాజ్ మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఈ మాటనే బలపరిచారు, మరియు రాజిహ్ అని చెప్పారు. సూర బఖరలోని 203వ ఆయతు ద్వారా కూడా ఈ మాట గ్రహించడం జరిగినది. (వివరాలు ఆ ఆయతు వ్యాఖ్యానం మరియు హదీసుల్లో చూడవచ్చు).
3) అయ్యాముత్ తష్రీక్ తినడం, త్రాగడం మరియు అల్లాహ్ స్మరణ రోజులు
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
أَيَّامُ التَّشْرِيقِ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ
అయ్యాముత్ తష్రీక్ అనేవి తినే, త్రాగే మరియు అల్లాహ్ స్మరణ చేసే రోజులు. (ముస్లిం: 1141).
ఈ హదీస్ స్పష్టంగా తెలియజేస్తుంది: ఈ రోజుల్లో అల్లాహ్ అనుగ్రహాలపై సంతోషం వ్యక్తం చేయడం షరియత్ లో సమ్మతం.
విశ్వాసులారా! లెక్కలేనన్ని సత్కార్యాలలో ఏదైనా సత్కార్యం గురించి అధికంగా చేయండి అని అల్లాహ్ చెప్పి ఉన్నాడా అంటే, అవును జిక్ర్ గురించి చెప్పి ఉన్నాడు. శ్రద్ధ వహించండి సురతుల్ జుముఅలోని ఈ ఆయత్:
﴿ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ﴾ [الجمعة ١٠]
ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి.
పైన ఉన్న ఆయతు అనువాదం ఇంతేనా, కాదు. అల్లాహ్ మరో శుభవార్త ఇచ్చాడు. అదే: మీరు సాఫల్యం పొందవచ్చు. అల్లాహు అక్బర్! మనం అల్లాహ్ ను ఎక్కువగా, అధికంగా స్మరిస్తూ ఉంటే సాఫల్యం లభించేది మనకే.
﴿ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ﴾
అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. (అహ్జాబ్ 33:35).
4) ఈ రోజుల్లో ఉపవాసం నిషేధం
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:
لَا تَصُومُوا هَذِهِ الْأَيَّامَ
(అయ్యాముత్ తష్రీక్ లో) ఉపవాసం పాటించకండి. (సహీహ్ 3573).
అందువల్ల సాధారణ ముస్లింలకు 11, 12, 13 జుల్ హిజ్జా రోజుల్లో ఉపవాసం పాటించడం యోగ్యం కాదు. అయితే హజ్ తముత్తు లేదా ఖిరాన్ చేసిన హాజీలకు ఖుర్బానీ చేయలేని పరిస్థితిలో ఉపవాసం పాటించే అనుమతి ఉంది.
5) అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజులు
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
إِنَّ أَعْظَمَ الْأَيَّامِ عِنْدَ اللَّهِ يَوْمُ النَّحْرِ، ثُمَّ يَوْمُ الْقَرِّ
అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజు యౌమున్ నహర్ (10వ జుల్ హిజ్జా), తరువాత యౌముల్ ఖర్ర్ (11వ జుల్ హిజ్జా). (అబూ దావూద్: 1765.
ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీహ్ అన్నారు.) “యౌముల్ ఖర్ర్” అనగా అయ్యాముత్ తష్రీక్ మొదటి రోజు; ఈ రోజున హుజ్జాజ్ మినా లో నివసిస్తారు.
6) తక్బీరాత్ అయ్యాముత్ తష్రీఖ్ ప్రాముఖ్యత – ఖుర్ఆన్ ఆధారం
وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
“గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి ” (సూరహ్ అల్-బఖరా: 203)
ఈ ఆయత్ ఆధారంగా సహాబాయె కిరామ్ రజియల్లాహు అన్హుమ్ అయ్యాముత్ తష్రీఖ్ రోజుల్లో గట్టిగా (బిగ్గరగా) తక్బీరాత్ పలికేవారు.
సహాబాయె కిరామ్ ఆచరణ
[1] హజ్రత్ ఇబ్ను ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హుమా మార్కెట్ లోకి వెళ్లి తక్బీర్ పలికేవారు; వారిని విని ప్రజలు కూడా తక్బీర్లు పలికేవారు. (బుఖారీ, కితాబుల్ ఈదైన్, బాబ్ ఫజ్జుల్ అమల్ ఫీ అయ్యామిత్ తష్రీక్).
[2] హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు మినా లో తన గుడారంలో గట్టిగా తక్బీర్ పలికేవారు; అది మినాలోని మస్జిదె ఖైఫ్ లో ఉన్నవారికి వినబడేది, అప్పుడు వారు తక్బీర్ పలికేవారు. ఇలా మొత్తం మస్జిద్ తక్బీర్లతో మారుమ్రోగేది, తరువాత బజార్ల వరకు ఆ ధ్వని వినిపించేది. (బుఖారీ, కితాబుల్ ఈదైన్).
తక్బీరాతె తష్రీఖ్ పదాలు
సహాబాయె కిరామ్ నుండి భిన్నమైన పదాలు మనకు లభించాయి. ప్రసిద్ధ పదాలు ఇవి:
الله أكبر الله أكبر لا إله إلا الله، والله أكبر الله أكبر ولله الحمد
(అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ , అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ )
అయ్యాముత్ తష్రీఖ్ లో చేయవలసిన అమలు
- అధికంగా జిక్ర్ చేయడం – తక్బీర్, తహ్లీల్, తహ్మీద్, తస్బీహ్, దురూద్ షరీఫ్.
- నమాజ్ ల తర్వాత తక్బీరాత్. (దీనినే తక్బీరె ముఖయ్యద్ అంటారు). ఉమ్మత్ యొక్క ఫుఖహా అభిప్రాయం ప్రకారం ఫర్జ్ నమాజ్ ల తరువాత తక్బీరాత్ పలకడం మష్రూ.
- ఖుర్బానీ మాంసం తినడం మరియు పంచడం.
- సంతోషం మరియు కృతజ్ఞత వ్యక్తం చేయడం.
ఈ రోజులు ఇబాదత్ తో పాటు ఆనందానికి కూడా సంబంధించినవి. ఇస్లాం సన్యాసాన్ని కాదు, షుక్ర్ మరియు జిక్ర్ తో కూడిన సమతుల్య జీవనాన్ని బోధిస్తుంది.
ఈ జుమా ఖుత్బా ద్వారా ప్రభావవంతమైన సందేశం
గౌరవనీయులైన ముస్లిములారా!
ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ ఈ రోజుల గురించి తెలిపిన ఆణిముత్యాలు కొన్ని ఇలా ఉన్నాయి.
[1] అయ్యాముత్ తష్రీఖ్ లో విశ్వాసుల కొరకు శారీరక అనుగ్రహం మరియు మానసిక అనుగ్రహం రెండూ ఏకంగా లభిస్తాయి. శారీరక అనుగ్రహాలంటే తిను, త్రాగుట మరియు హృదయ అనుగ్రహాలంటే జిక్ర్ మరియు షుక్ర్.
فَأَيَّامُ التَّشْرِيقِ يَجْتَمِعُ فِيهَا لِلْمُؤْمِنِينَ نَعِيمُ أَبْدَانِهِمْ بِالْأَكْلِ وَالشُّرْبِ، وَنَعِيمُ قُلُوبِهِمْ بِالذِّكْرِ وَالشُّكْرِ.
[2] పండుగ రోజులలో తినడం, త్రాగడం అనేవి కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు; వాటివల్ల మనకు శక్తి వచ్చి, ఆ శక్తితో అల్లాహ్ ను స్మరించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇదే నిజమైన కృతజ్ఞత. కానీ ఎవరు ఆ వరాలను పాపాలకు ఉపయోగిస్తారో, వారు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపినవారవుతారు. అలాంటి వారు ఆ అనుగ్రహాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.
أَنَّ الْأَكْلَ فِي أَيَّامِ الْأَعْيَادِ وَالشُّرْبِ إِنَّمَا يُسْتَعَانُ بِهِ عَلَى ذِكْرِ اللَّهِ تَعَالَى وَطَاعَتِهِ … فَمَنِ اسْتَعَانَ بِنِعَمِ اللَّهِ عَلَى مَعَاصِيهِ فَقَدْ كَفَرَ نِعْمَةَ اللَّهِ وَبَدَّلَهَا كُفْرًا، وَهُوَ جَدِيرٌ أَنْ تُسْلَبَ مِنْهُ
[3] మరో చోట చెప్పారు: ఈ రోజుల్లో మనం ఏ జంతువులను ఖుర్బానీ చేస్తామో అవి స్వయంగా అల్లాహ్ ను ఆరాధిస్తాయి, ఆయనకు విధేయులుగా ఉంటాయి. అయితే వాటి మాంసం తినడం ద్వారా మనలో విశ్వాసం పెరిగి, అల్లాహ్ ఆరాధన మరింత ఎక్కువగా చేసే బుద్ధి, ఎల్లవేళల్లో ఆయనకు విధేయులుగా ఉండే బుద్ధి కలగాలి. (ఇక్కడ అరబీ ఇవ్వలేకపోయాము మరీ సంక్షిప్తంగా చేసి అనువదించాము గనక).
[4] ఈ లోక జీవితం అంతా హజ్ యాత్ర రోజుల్లాంటిదే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మోమిన్ (విశ్వాసి) అల్లాహ్ నిషేధించిన కోరికలు, పాపాల నుండి దూరంగా ఉండాలి; ఇది ఇహ్రామ్ లో ఉన్న హజ్ యాత్రికుడిలా ఉంటుంది.
ఎవరు తమ జీవిత ప్రయాణంలో సహనంతో ఉండి, తమ కోరికలను అదుపులో పెట్టుకుంటారో, వారు జీవిత యాత్ర ముగిసినప్పుడు తమ ఆశల గమ్యాన్ని చేరుకుంటారు. అప్పుడు వారు తమ బాధ్యతను పూర్తి చేసి, అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినవారవుతారు. ఆ తర్వాత వారి రోజులు అన్నీ మినా రోజుల్లా మారిపోతాయి — ఆనందం, తినడం, త్రాగడం, మరియు అల్లాహ్ స్మరణతో నిండిన రోజులుగా.
كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
“గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది)“. (అల్ హాఖ్ఖహ్ 69:24).
فَإِنَّ الدُّنْيَا كُلَّهَا أَيَّامُ سَفَرٍ كَأَيَّامِ الْحَجِّ، وَهُوَ زَمَانُ إِحْرَامِ الْمُؤْمِنِ عَمَّا حُرِّمَ عَلَيْهِ مِنَ الشَّهَوَاتِ، فَمَنْ صَبَرَ فِي مُدَّةِ سَفَرِهِ عَلَى إِحْرَامِهِ وَكَفَّ عَنِ الْهَوَى، فَإِذَا انْتَهَى سَفَرُ عُمْرِهِ وَوَصَلَ إِلَى مِنَى الْمُنَى، فَقَدْ قَضَى تَفَثَهُ وَوَفَّى نَذْرَهُ، فَصَارَتْ أَيَّامُهُ كُلَّهَا كَأَيَّامِ مِنًى، أَيَّامَ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ عَزَّ وَجَلَّ. كما قال تعالى: كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
అయ్యాముత్ తష్రీక్ మనకు మూడు గొప్ప పాఠాలు నేర్పుతుంది:
- అల్లాహ్ జిక్ర్ — మన నాలుక ఎల్లప్పుడూ తక్బీర్లతో తడిసి ఉండాలి.
- అల్లాహ్ అనుగ్రహాలపై షుక్ర్ — తినే, త్రాగే ప్రతి విషయంలో అల్లాహ్ ను స్మరించాలి.
- ఉమ్మత్ ఐక్యత — ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా ఒకే జిక్ర్ మరియు ఒకే నినాదంతో ఏకమవ్వాలి.
سبحان ربك رب العزة عما يصفون وسالم على المرسلين والحمد لله رب العالمين