
Following the Sunnah is Compulsory [Sunnath par Amal Waajib]
సంకలనం : అల్లామ అబ్దుల్లా బిన్ బాజ్ (రహమతుల్లా అలై) (ibn Baz)
అనువాదకులు : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్ ,హైదరాబాద్,ఆంధ్ర ప్రదేశ్,ఇండియా
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [32 పేజీలు] [ఫైల్ సైజు: 1.4 MB] [మొబైల్ ఫ్రెండ్లీ]
విషయసూచిక
అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.
- తొలిపలుకులు [1p]
- మహా ప్రవక్త విధానాన్ని అనుసరించటం అనివార్యం. కాదనటం కుఫ్ర్ కి తార్కాణం [18p]
- మొదటి (అసలు) ప్రాతిపదిక దైవ గ్రంథం
- రెండవ ప్రాతిపదిక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధానం (సున్నత్)
- ప్రవక్త సహచరులు, వారి తరువాత వారు మరియు ఇస్లామీయ విద్వాంసులు దృష్టిలో సున్నత్ ఔన్నత్యం [10p]
- ఇదే మాసందేశం (పుస్తక పబ్లిషర్స్ నుండి) [1p]
తొలిపలుకులు
పొగడ్తలన్నీ సర్వలోకాల అధిపతియైన అల్లాహ్‌కే చెందును. ఆయన అంతిమ ప్రవక్తయైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మరియు ఆయన బాటన నడిచిన పుణ్యాత్ములపై అల్లాహ్ కారుణ్యం వర్షించు గాక, ఆమీన్…
మనందరికి తెలిసినట్లు ఇస్లాం (విధేయత) మాత్రమే అల్లాహ్ వద్ద స్వీకరించదగిన ధర్మము, ఇది అల్లాహ్ ఆరాధన మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పద్ధతిని (సున్నత్) అనుసరించడం ద్వారా పూర్తవుతుంది. ఈ విషయాన్ని దివ్యఖుర్‌ఆన్ మరియు స్వయంగా ప్రవక్తగారి కంటే బాగా ఎవరూ భోధించలేరన్నది వాస్తవం. ఈ చిన్న పాఠం మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.
ఈ వాస్తవాన్ని జనాలకు నచ్చ చెప్పేందుకు తన జీవితాన్ని ధారపోసిన గొప్ప పండితుల్లో సౌదీ అరేబియాకు చెందిన షేక్ బిన్ బాజ్ గారు (మరణం 1420 హిజ్రీ) ఒకరు .
అల్లాహ్ ఆయన ఆత్మకు శాంతి కలిగించుగాక ! ఆమీన్. ఆయన ఓ గొప్ప మేధావి, ధార్మిక పండితుడు మరియు ఇస్లామీయ చట్టానికి అనుగుణంగా జీవితం చాలించిన మహా మనిషి. తన రచనల ద్వారా ప్రసంగాల ద్వారా ఆలోచన ప్రక్రియ ద్వారా ఇస్లాంకు సేవలందించిన మహానీయుడు. నేటికి కోట్లాది మందికి మార్గదర్శకత్వం వహిస్తున్న దార్శనికుడు.
ఆయన వ్రాసిన ఈ చిరు పుస్తకాన్ని తెలుగు పాఠకులకు సమర్పించడానికి మేము చేస్తున్న ఈ కృషిని అల్లాహ్ స్వీకరించుగాక మరియు మనందరికి ఈ పుస్తకం ద్వారా సన్మార్గం చూపుగాక ! ఆమీన్ …
– హాఫిజ్ ముహమ్మద్ అబ్దుర్ రవూఫ్ ఉమరి
మహాప్రవక్త విధానాన్ని అనుసరించటం అనివార్యం. కాదనటం కుఫ్ర్ కి తార్కాణం
(ఈ మధ్య కొన్ని మిథ్యావాదాలు ప్రబలి ప్రవక్త విధానాన్ని అనుసరించే విషయమై విపరీతార్ధాలు తీస్తున్నాయి. అందుచేత మేము ఈ చిరు పుస్తకాన్ని ప్రచురించి ప్రవక్త సంప్రదాయాన్ని పాటించటం తప్పనిసరి అనీ, దాన్ని తిరస్కరించటం తిరస్కారానికి ఆనవాలు అని సృష్టంగా చెప్పదలిచాము. ప్రవక్త అనుయాయులైన ముస్లిం ప్రజానీకం ఈ ఘోర అపరాధానికి దూరంగా ఉండాలన్నదే మా అభిమతం).
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. శ్రేయాలు సదాచార సంపన్నులు, భయభక్తులు గల వారి కొరకే. మరియు సద్వర్తనులైన దాసులు, అతని ప్రవక్తలు, ఇంకా సకల లోకాల కొరకు కారుణ్యంగా ప్రభవింపచేయబడిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై శాంతీ శుభాలు వర్షించుగాక! వాస్తవానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రభవనం సమస్త మానవాళి కొరకు సాక్ష్యం! ఆయనపై ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై, ఆయన అనంతరం దైవ గ్రంథాన్ని దైవప్రవక్త సంప్రదాయాన్ని కంటికి రెప్పలా కాపాడేందుకు ఉనికిలోకి తీసుకురాబడే సజ్జనులందరిపై దేవుడు శాంతీశ్రేయాలను కురిపించుగాక!!
ధర్మాధర్మాలు, సత్యాసత్యాలను నిర్ధారించే ప్రమాణాలు (లేక సూత్రాలు) ప్రధానంగా నాలుగు (4) అన్న విషయంలో పూర్వపు పండితులు, తరువాయి పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది –
మొదటిది : దైవగ్రంథమైన ఖుర్‌ఆన్. దీనిలో ముందు నుంచి గానీ, వెనుక నుంచి గానీ అధర్మం జొరబడజాలదు.
రెండవది : మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సంప్రదాయం. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా తన మనోకాంక్షల కనుగుణంగా చెప్పరు. పైగా ఆయన చెప్పే ప్రతి ప్రవచనం దైవ సంకేతానికి (వహీ)కి లోబడి ఉంటుంది.
మూడవది : ముస్లిం సమాజానికి చెందిన పండితుల ఉమ్మడి అభిప్రాయం.
నాలుగవది : అంచనా కొంత మంది ఉలమా (పండితులు) “అంచనాతో ఏకీభవించరు. అంచనా ‘ప్రమాణబద్ధం కాదని వారి వాదన. అయితే అంచనాకి ఆధారభూతమైన అంశాలన్నీ ఎన్నదగ్గవైన పక్షంలో దాని ప్రామాణికతలో సందేహానికి తావుండదని అత్యధిక మంది పండితులు అభిప్రాయపడతారు. దీనికి సంబంధించిన నిదర్శనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి, ఎంత ప్రముఖమైన నిదర్శనాలంటే ఇక్కడ వాటిని పేర్కొనవలసిన అవసరం కూడా లేదు. అసలు చర్చనీయాంశం కూడా ఇది కాదు. మా చర్చనీయాంశం ప్రవక్త విధానాన్ని అనుసరించటం అవశ్యం అన్నదే.
మొదటి (అసలు) ప్రాతిపదిక దైవగ్రంథం :
విశ్వ ప్రభువు తరపున అవతరింపజేయబడిన పవిత్ర ఖుర్‌ఆన్‌లోని అనేక వచనాలలో చెప్పబడిన దాని ప్రకారం మనం ఈగ్రంధాన్ని అనుసరించటం విధి అవశ్యం. అలాగే అది నిర్ణయించిన హద్దులను అతిక్రమించకుండా ఉండటం అనివార్యం. విశ్వప్రభువు అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“ప్రజలారా! మా ప్రభువు తరపు నుండి మీ పై అవతరింపజెయ్యబడిన దానిని అనుసరించండి. మీ ప్రభువును కాదని ఇతర సంరక్షకులను అనుసరించకండి – కాని మీరు హితబోధను స్వీకరించటం అరుదు” (అల్ ఆరాఫ్-39)
అల్లాహ్ ఇంకా ఇలా సెలవిస్తున్నాడు :
“మేము ఈ (గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలు కల గ్రంధం. కనుక మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. తద్వారా మీరు కనికారానికి నోచుకునే అవకాశముంది”. (అల్‌అన్‌ఆమ్ – 155)
వేరొక చోట ఏమనబడిందో చూడండి :
“మీవద్దకు అల్లాహ్ తరపు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దాని ద్వారా అల్లాహ్ తన సంతోషం పొందగోరే వారికి శాంతిపథాలను చూపుతాడు. తన ఇచ్చానుసారం వారిని చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు వైపుకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపుకు నడుపుతాడు.” (అల్ మాయిద-15, 16)
పరమోన్నతుడైన అల్లాహ్ ఇంకా ఈ విధంగా అంటున్నాడు: –
“తమ ముందుకు హితబోధ వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా తిరస్కరించిన వారు వీరే. కాని యదార్ధం ఏమిటంటే, ఇది ఒక శక్తిమంతమైన గ్రంథం. అసత్యం దాని మీదకు ముందు నుండీ రాజాలదు, వెనుక నుండీ రాజాలదు. వివేకవంతుడు, స్తుతిపాత్రుడూ అయిన దేవుడే అవతరింపజేసిన గ్రంథం ఇది”. (హామీమ్-అస్-సజ్దా : 41, 42)
పరమ ప్రభువైన అల్లాహ్ ఈ విధంగా కూడా సెలవిచ్చి ఉన్నాడు :
“(ఓ ముహమ్మద్-(సల్లలాహు అలైహి వ సల్లం)) నీవు వారితో చెప్పు. “మిమ్మల్నీ, ఇంకా ఎవరెవరి వద్దకు చేరుతుందో వారందరినీ నేను హెచ్చరించడానికి గాను ఈ ఖుర్‌ఆన్ నా వద్దకు వహీ” ద్వారా పంపబడింది.” (అల్ అన్‌ఆమ్ -19)
వేరొకచోట అవతరించిన దైవాదేశం ఇది :
“సర్వ మానవులకు ఇదొక సందేశం. తద్వారా వారిని హెచ్చరించాలనీ” (ఇబ్రాహీమ్-52)
దివ్యఖుర్‌ఆన్ లో ఇంచుమించు ఇదే భావాన్ని స్ఫురింపజేసే ఆయతులు ఇంకా అనేకం ఉన్నాయి. ఇవిగాక మరికొన్ని హదీసులు కూడా దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌ను అనుసరించటం అవశ్యమని ధృవీకరిస్తున్నాయి. ఎవరయితే ఖుర్‌ఆన్ ఆదేశాలను శిరసావహించాడో అతడు సన్మార్గం పొందాడనీ మరెవరయితే ఖుర్‌ఆన్ పట్ల విముఖత చూపాడో అతడు మార్గభ్రష్టతకు లోనయ్యాడని కూడా ఈ హదీసుల ద్వారా రూఢీ అవుతోంది.
అంతిమ హజ్ యాత్ర సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు పలికిన నిర్ణయాత్మకమైన ప్రవచనాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఆ సందర్భంగా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:
“మీ మధ్య ఆ వస్తువును వదలి వెళుతున్నాను. మీరు దానికి కట్టుబడి ఉన్నంతవరకు మీరు ఎట్టి పరిస్థితిలోనూ మార్గభ్రష్టులవరు. అదే దైవ గ్రంథం.” (ముస్లిం)
‘సహీహ్ ముస్లింలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మరొక ప్రవచనం ఇలా ఉల్లేఖించబడింది.
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని జైద్‌బీన్ అర్‌ఖమ్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను మీ మధ్య రెండు అమూల్యమైన, స్వఛ్చమైన వస్తువులను వదలి వెళుతున్నాను. ఆ రెండింటిలో మొదటిది, దైవగ్రంథం. అందులో మార్గదర్శకత్వం ఉంది, కాంతి ఉంది. కాబట్టీ మీరు దైవగ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి. దానిపై స్థిరంగా ఆచరించండి. రెండవది : నా ఇంటి వారలు. నేను మీకు నా ఇంటివారల గురించి అల్లాహ్‌కు జ్ఞాపకం చేస్తాను. నేను మీకు నా ఇంటివారలగురించి అల్లాహ్‌కు జ్ఞాపకం చేస్తాను.”
మరో ఉల్లేఖనంలో “ఖుర్‌ఆన్ గురించి” అని ఉంది. ఖుర్‌ఆన్ అంటే అల్లాహ్ త్రాడు అన్నమాట. ఈ త్రాటిని ఎవరు గట్టిగా పట్టుకుంటారో వారు సన్మార్గాన్ని పొందారు. మరెవరు దాన్ని వదిలేశారో వారు మార్గం తప్పిపోయారు. ఈ అంశంపై ఎన్నో హదీసులు ఉన్నాయి. ఈ విషయంలో ఈ ఆధారాలు, నిదర్శనాలను కూలంకషంగా చర్చించవలసిన అవసరం లేదు. మహాప్రవక్త ప్రియ సహచరుల రిజ్వానుల్లాహి అలైహిమ్ అజమయీన్) మొదలుకుని విద్వాంసులు, విశ్వాసుల వరకు అందరూ ఒక విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అదేమంటే దైవగ్రంథానుసారం మసలుకోవటం అవశ్యం. అంతేకాదు, ధార్మిక వ్యవహారాలన్నీ దైవగ్రంథంతో పాటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయానికి లోబడి పరిష్కరించబడతాయి, పరిపాలనా వ్యవహారాలు సయితం దైవగ్రంథానికి, దైవప్రవక్త విధానానికి కట్టుబడి అమలవుతాయి.
రెండవ ప్రాతిపదిక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధానం (సున్నత్)
రెండవ ప్రామాణికమైన ప్రాతిపదిక దైవప్రవక్త(సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానం. అంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచరణలు లేక ప్రసంగాలు. అయితే ఇవన్నీ విశ్వసనీయ వర్గాల ద్వారా ఉల్లేఖించబడినవై ఉండాలి. ఆ విధంగా ధృవీకరించబడినవన్నీ “హదీసు”గా పరిగణించబడతాయి. దీన్నే సున్నత్ (మహాప్రవక్త విధానం, సంప్రదాయం)గా వ్యవహరిస్తాడు.
మహాప్రవక్త గారి ప్రియసహచరుల నుండి నేటి పండితుల వరకూ- అందరూ ఈ సిసలైన (హదీసు) ప్రాతిపదికను దృఢంగా విశ్వసించడమేగాక దీనిని తమ ‘స్వీకృతికి కొలబద్దగా పరిగణిస్తారు. ముస్లిం సమాజానికి దీని ప్రకారం శిక్షణను ఇస్తారు. ఇంకా ఈ “విద్య”ను ప్రాచుర్యంలోకి తెచ్చే ఉద్దేశ్యంతో వారు గ్రంథాలను సంకలనం చేశారు. ఫికహ్ సూత్రాలను, హదీసు పరిభాషను వివరించే గ్రంథాలలో దీనిని ప్రముఖంగా విశదీకరించారు.
“సున్నత్ (ప్రవక్త విధానం) ప్రామాణికమైనదనే విషయమై ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే, అసలు వాటిని గణించటమే గగనమైపోతుంది. వాటిలో కొన్ని ఆధారాల ప్రస్తావన ఖుర్‌ఆన్‌లోనూ ఉంది. అందులో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారికి విధేయత చూపి, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) అడుగుజాడలలో నడుచుకోవలసిందిగా ఆదేశించబడింది. ఈ ఆదేశం ఆయన సమకాలికులకు వర్తించినట్లుగానే ఆయన అనంతరం వచ్చే వారందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనే అంతిమ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం). కాబట్టి ఆయన అనుచరులందరూ ప్రళయదినం వరకూ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) కు విధేయులై ఉండవలసి ఉంది. ఎందుకంటారేమో? మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)గారు దివ్యఖుర్‌ఆన్‌కు తాత్పర్యం వంటివారు. ఆయన మాటలుగానీ, చేతలుగానీ, ఆయన ప్రసంగాలు గానీ – అన్నీ దివ్యఖుర్‌ఆన్‌లోని ఆయతులను ప్రతిబింభిస్తాయి.
‘సున్నతే’ గనక లేకుంటే నమాజులో ఎన్నిరకతులున్నాయో, వాటి స్వరూప స్వభావాలేమిటో, అవసరాలేమిటో ప్రజలకు తెలిసేది కాదు. అలాగే ఉపవాసాలు, జకాత్, హజ్ వంటి విధుల రూపురేఖలను కూడా ప్రజలు తెలుసకోలేకపోయేవారు. అదే విధంగా సున్నత్ లేకుంటే ప్రజలకు మంచిని పెంపొందించే, చెడులను అరికట్టే ఆజ్ఞల తీరుతెన్నులు బోధపడేవి కావు. లావాదేవీలేమిటో, ధర్మాధర్మాలేమిటో, అల్లాహ్ విధించిన హద్దులు, కట్టుబాట్లు ఏమిటో కూడా నెలకొల్పబట్టి సులువుగా అర్ధం చేసుకోగలుగుతున్నారు.
ఈ సందర్భంగా దివ్యఖుర్‌ఆన్‌లోని పలు వాక్యాలను ఉదాహరించి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానాన్ని అనుసరించటం అనివార్యమని నిరూపించవచ్చు. మచ్చుకు అలి ఇమ్రాన్ సూరాలో అల్లాహ్ ఇలా ఆదేశించాడు
“అల్లాహ్‌కూ, ప్రవక్తకూ విధేయత చూపండి. మీరు కరుణింపబడే అవకాశం ఉంది.” (ఆలి ఇమ్రాన్ : 132)
“నిసా” సూరాలో ఈ విధంగా సెలవీయబడింది :
“ఓ విశ్వసించిన వారలారా | అల్లాహ్‌కు, ప్రవక్తకూ, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు విధేయత చూపండి. మీ మధ్య ఏ విషయంలోనయినా వివాదం తల ఎత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్ మరియు అంతిమదినం మీద విశ్వాసం గలవారైతే (మీరు ఇలాగే చేయాలి). ఇదే సరైన పద్ధతి. ఫలితాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమమైనది.” (అన్ నిసా : 59)
“నిసా” సూరాలోనే వేరొక చోట పరమ ప్రభువు ఇలా ఆదేశిస్తున్నాడు :
“ప్రవక్తకు విధేయత చూపిన వాడు వాస్తవంగా అల్లాహ్‌కు విధేయత చూపినట్లే. కాని ఎవడయితే విముఖుడయ్యాడో అటువంటి వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు.” (నిసా సూరా, ఆయత్ నెం. 80)
మరి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానం మనకు ప్రమాణబద్ధం కాదనుకుంటే, (లేక) అది సురక్షితంగా లేదని ఊహించుకుంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారికి విధేయత చూపటం ఎలా సాధ్యమవుతుంది? ఏదైనా విషయంలో వివాదం తలెత్తినప్పుడు దాన్ని దైవగ్రంథం మరియు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానం వైపుకు మరలించటం ఎలా సంభవమవుతుంది?
ఒకవేళ మన ఆలోచనలు గనక ఇలా వక్రంగా సాగినట్లయితే ఇంకా ఎన్నో భయంకరమైన సందేహాలు పొడసూపుతాయి – అంటే అసలు ఉనికిలో లేని విషయాల గురించి అల్లాహ్ తన దాసులకు ఆదేశాలిచ్చాడన్నమాట! ఇదంతా మిధ్య అన్న మాట!! (అల్లాహ్ మన్నించుగాక!)
అల్లాహ్ అన్ నహ్ల్ సూరాలో ఏమని అంటున్నాడో చూడండి :
“ఈ జ్ఞాపికను నీ (ప్రవక్త) పై కూడా అవతరింపజేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని సృష్టంగా వివరించటానికి, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికి.” (అన్ నహ్ల్ 44)
అన్ నహ్ల్ సూరాలోనే మరోచోట ఇలా అనబడింది :
“మేము ఈ గ్రంథాన్ని నీపై ఎందుకు అవతరింపజేశామంటే, వారు గురి అయివున్న విభేదాల యదార్దాన్ని నీవు వారికి స్పష్టం చేయాలని. ఈ గ్రంథం తనను విశ్వసించే వారి కోసం మార్గదర్శకత్వంగానూ, కారుణ్యంగానూ అవతరించింది.” (నహ్ల్ సూరా, ఆయత్ నెం. 64)
ఆలోచించండి! మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నత్ ఉనికిలో లేని పక్షంలో, ప్రవక్తగారి సున్నత్ ప్రమాణబద్ధం కాని పక్షంలో దైవగ్రంథాన్ని విడమరచి చెప్పే బాధ్యతను అల్లాహ్ తన అంతిమ ప్రవక్తకు ఎందుకు అప్పగిస్తాడు?
దివ్యఖుర్‌ఆన్‌లోని నూర్ సూరాలో కూడా అల్లాహ్ ఇదే విధంగా ఆదేశిస్తున్నాడు :
(ఓ ముహమ్మద్! వారితో ఇలా అను) “అల్లాహ్‌కు విధేయులు కండి, దైవప్రవక్త ఆదేశాలను పాటించండి. కాని ఒకవేళ మీరు విముఖలవుతే, బాగా తెలుసుకోండి, దైవప్రవక్తపై పెట్టబడిన కర్తవ్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై మోపబడిన కర్తవ్య భారానికి మీరు బాద్యులు. దైవప్రవక్తకు విధేయులైతే మీరే మార్గదర్శకత్వం పొందుతారు. లేకపోతే స్పష్టంగా ఆజ్ఞను అందజేయటానికి మించి ఎక్కువ బాధ్యత దైవప్రవక్తపై లేదు.” (నూర్ సూరా, ఆయత్ నెం. 54)
నూర్ సూరాలోనే వేరొక చోట విశ్వ ప్రభువైన అల్లాహ్ ఆజ్ఞాపించాడు :
“నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, దైవప్రవక్తకు విధేయులుగా ఉండండి. తద్వారా మీరు కరుణింపబడే అవకాశం ఉంది.”(నూర్ సూరా, ఆయత్ నెం. 56)
అల్ ఆరాఫ్ సూరాలో అల్లాహ్ ఇలా ఆదేశించాడు :
ఓ ముహమ్మద్! ఇలా ప్రకటించు – “మానవులారా! నేను మీ అందరి వైపుకు వచ్చిన అల్లాహ్ సందేశహరుణ్ణి. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే మృత్యువును ఇస్తాడు. కనుక విశ్వసించండి అల్లాహ్‌ను, ఆయన పంపిన నిరక్షరాస్యుడైన ప్రవక్తను – అతను అల్లాహ్‌ను, ఆయన సూక్తులను విశ్వసిస్తాడు – అతనిని అనుసరించండి. మీరు సరియైన మార్గం పొందే అవకాశం ఉంది.” (అల్ ఆరాఫ్ : 158)
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయులై ఉంటూ, ఆయన విధానాన్ని అనుసరించినపుడే మనకు సన్మార్గం ప్రాప్తిస్తుందని, దైవ కారుణ్యం అవతరిస్తుందని ఈ ఆయతుల ద్వారా స్పష్టంగా బోధపడుతున్నది. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపనిదే సరైన మార్గం ఎలా లభిస్తుంది? కరుణింపబడే అవకాశం ఎక్కడుంటుంది? సున్నత్ (ప్రవక్త విధానం) సరైంది కాదనలేక అది ఉల్లేఖించబడిన వైనం నమ్మశక్యం కాదనో వంకలు పెట్టినప్పుడు మానవుడు మార్గదర్శకత్వానికి ఎలా పాత్రుడు కాగలుగుతాడు ?
సూరె నూర్‌లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :
“దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకు పోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అనీ భయపడాలి.”(అన్ నూర్ – 68)
హష్ర్ సూరాలో దైవాదేశం ఇలా ఉంది.
“దైవప్రవక్త మీకు ఇచ్చినదాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి పోకండి.” (అల్ హష్ర్ – 7)
ఈ భావార్థం గల ఆయతులు ఇంకెన్నో ఉన్నాయి. వీటన్నింటిలోనూ చెప్పబడిన విషయం ఒక్కటే – అదే, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి విధేయులై ఉండటం, ఆయనను అనుసరించటం, ఆయన ప్రసాదించిన దానిని స్వీకరించటం, ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం అవశ్యం, అనివార్యం అని ఈ ఆయతులు నొక్కి పలుకుతున్నాయి.
దైవగ్రంథం మరియు దైవప్రవక్త విధానం – ఈరెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయిన మూలాధారాలు. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. వీటిలో ఏ ఒక్కదానిని కాదన్నా రెండవదానిని కూడా కాదన్నట్లే. వాస్తవానికి ఇది ధిక్కారం. అవిశ్వాసం కిందికి వస్తుంది. ఇంకా ఈ ధిక్కార వైఖరి మార్గ విహీనతకు, మార్గభ్రష్టతకు దారితీస్తుంది. ఈ ధిక్కార పోకడకు పాల్పడిన వ్యక్తి విశ్వాసుల, పండితుల పరిధి నుండి వెలివేయబడిన వాడవుతాడు. (అంతే కాదు, దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం)-విధానాన్ని ప్రమాణబద్దమైనదిగా ఒప్పుకోనంతవరకూ నేనంటాను. పవిత్ర ఖుర్‌ఆన్ దైవగ్రంథం అని అసలు మనకు చెప్పింది ఎవరు?
హజ్రత్ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)గారే కదా! మరి ఆయనగారి హదీసులు, విధానాలే నమ్మశక్యం కానపుడు ఖుర్‌ఆన్ మాత్రం దైవగ్రంథం అని ఎలా నిరూపితం అవుతుంది? (దైవం మన్నించుగాక) అన్న ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతుంది.)
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపటం, ఆయన తీసుకు వచ్చిన వాటి ప్రకారం ఆచరించటం అవశ్యమవటం, ఆయన పట్ల అవిధేయత హరామ్ అవటం – ఇవన్నీ ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢీ అయినవి. పైగా ఈ ధర్మములు అందరికీ వర్తిస్తాయి. వారు మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి సమకాలీకులైనా, లేక ఆయన తదనంతరం ప్రళయదినం వరకు పుట్టేవారైనా – అందరికీ యథాతథంగా వర్తిస్తాయి. ఆ హదీసులలో మచ్చుకు కొన్ని ఇక్కడ పేర్కొంటున్నాము-
మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ అబూహూరైర (రది అల్లాహు అన్హు) చెప్పారు: “ఎవరు నాకు విధేయత చూపారో వారు అల్లాహ్‌కు విధేయత చూపారు. మరెవరు నా యెడల అవిధేయులుగా ఉన్నారో వారు అల్లాహ్ యెడల అవిధేయులయ్యారు.”
2. సహీహ్ బుఖారీలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు.
“నా అనుచర వర్గీయుల్లో నన్ను ధిక్కరించిన వారు తప్ప అందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు.” ఓ దైవప్రవక్తా! మిమ్మల్ని ధిక్కరించిన వాడు అంటే ఎవరు? అని ప్రశ్నించగా, “నాకు విధేయుడై ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరి నా యెడల అవిధేయుడుగా మెలగినవాడు నన్ను ధిక్కరించిన వాడవుతాడు” అని అన్నారు.
3. అహ్మద్, అబూదావూద్ మరియు హాకిమ్‌లు ప్రామాణికమైన ఆధారాలతో క్రింది హదీసును పేర్కొన్నారు – వారు ఇలా వ్రాశారు :
ప్రవక్త మహనీయులు (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని మఖ్ధమ్‌బిన్ మాదీకరబ్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“నిస్ససందేహంగా నాకు గ్రంథం వొసగబడింది. గ్రంథంతో పాటు దాని ఉపమానం (అంటే హదీసు. ఇది కూడా అల్లాహ్ సంకేతం ప్రకారమే అయి ఉంటుంది.) కూడా ప్రసాదించబడింది. జాగ్రత్త! అతి చేరువకాలంలోనే కడుపు నిండిన మనిషి ఒకడు బయలుదేరాడు. అతడు హాయిగా మెత్తని దిండుపై కూర్చుని – మీరు ఈ ఖుర్‌ఆన్‌ను మీ కొరకు అవసరమైనదని భావించండి. ఇందులో మీరు ధర్మసమ్మతమైనది (హలాల్)గా గ్రహించిన దానిని ధర్మసమ్మతంగా భావించండి. ఇందులో అధర్మమైనది (హరామ్)గా గ్రహించిన దానిని అధర్మమైనదిగా తలపోయండి” అని అంటాడు”.
(అంటే మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తరువాత కాలంలో జన్మించే వారిలో కొంతమంది; “మీకు ఖుర్‌ఆన్ మాత్రం చాలు అనే నినాదం విని హదీసులను త్రోసిపుచ్చటం మొదలెడతారు. ఉదాహరణకు : పాకిస్తాన్‌లో అబ్దుల్లా చక్‌డాల్వీ మరియు అతని మానస పుత్రులైన గులాం అహ్మద్ పర్వేజ్, డా. ఫజ్లుర్రహ్మాన్ తదితరులు ఇలాంటి నినాదమే ఇచ్చి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌ను త్రోసిరాజన్నారు) – అనువాదకుడు
అబూదావూద్, ఇబ్నుమాజ యెన్నదగ్గ ఆధారాలతో క్రింది ఉల్లేఖనాన్ని పొందుపరచారు;
మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని తన తండ్రి చెప్పినట్లు హజ్రత్ ఇబ్నె అబీ రాఫె చెప్పారు – “మీలో ఒకడు తప్పనిసరిగా ఇలా ఉంటాడు, అతడు తన దిండుకు ఆనుకుని ఆసీనుడవుతాడు. అతని వద్దకు నా ఆజ్ఞలలోని ఒక ఆజ్ఞ వస్తుంది. ఫలానా పనిని చేయాలనో లేక చేయకూడదనో నేను అందులో ఆజ్ఞాపించి ఉంటాను. అప్పుడతను, “అదేం మాకు తెలీదు (ఎందుకంటే) దైవగ్రంథంలో మా దృష్టికి వచ్చిన ఆజ్ఞను మాత్రమే మేము శిరసావహిస్తాము. అని అతనంటాడు”.
4. వేరొక ఉల్లేఖనంలో ఇలా వివరించబడింది. దానిని హసన్ బిన్ జాబీర్ గారు మఖ్‌దామ్ బిన్ మాదీకరబ్ నుండి సంగ్రహించారు : ఆయన ఇలా అంటున్నారు –
ఖైబర్ విజయం వరించిన నాడు ప్రవక్త మహనీయులవారు కొన్ని వస్తువులను హరామ్ (నిషిద్ధం)గా ఖరారు చేశారు. ఆ సందర్భంగానే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా పలికారు – “త్వరలోనే మీలోని ఒకడు నన్ను ధిక్కరించవచ్చు. వాడు హాయిగా ఆనుకుని కూర్చుని ఉంటాడు. నా హదీసును ఎవరయినా వినిపిస్తే ‘మీకూ-మాకూ మధ్య ఖుర్‌ఆన్ ఎలాగూ ఉంది కదా! అందులో దేనిని హలాల్‌గా పొందుతామో దానినే ‘హలాల్ పరిగణిద్దాము. మరి దేనిని “’హరామ్ గా పొందుతామో దానిని హరామ్‌గా భావిద్దాము’ అని అతను అంటాడు. జాగ్రత్త! దైవప్రవక్త దేనిని హరామ్ (నిషిద్ధం)గా చేశారో అది అల్లాహ్ హరామ్‌గా చేసిన దానితో సమానం.”
తరచూ మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు తన ప్రియ సహచరులను ఉద్దేశించి, “మీలో ఇక్కడ ఉన్నవారు ఇక్కడలేనివారికి” విషయాన్ని చేరవేయండి అని తాకీదు చేసేవారు. వారితో ఇంకా ఇలా అంటూ ఉండేవారు: “విషయాన్ని వినే వారిలో చాలామంది విషయాన్ని చేరవేసిన వారికన్నా బాగా గుర్తు పెట్టుకునే వారై ఉండవచ్చు. వివేకసంపన్నులై ఉండవచ్చు”. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా కూడా మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) గారు అరఫా రోజున తన సహచరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారని సహీహ్ హదీసుల ద్వారా తెలుస్తోంది
“ఇక్కడున్నవారు ఇక్కడలేని వారికి (నా సందేశాన్ని) అందజేయండి. ఎందుకంటే వినే వారిలో చాలామంది అందజేసిన వారికన్నా ఎక్కువ గుర్తు పెట్టుకోవచ్చు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) హదీసును విన్నవారిపై ఈ బాధ్యత పడి ఉండకపోతే, ప్రళయదినం వరకు ఆయన హదీసు మిగిలి ఉండకపోతే అసలు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) దానిని ప్రచారం చేసే బాధ్యతనే మనకు అప్పగించేవారు కాదు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే ప్రవక్త మహనీయ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి నోట ఎవరయితే హదీసును విన్నారో, ఇంకా ఎవరెవరి వద్దకయితే స్పష్టమైన ఆధారాల ద్వారా హదీసు చేరిందో వారందరిపై దాన్ని ఆచరించే, ప్రచారం చేసే బాధ్యత పడుతుంది. ఆ విధంగా అది వారందరి కొరకు “హుజ్జత్” అవుతుంది.
ప్రవక్తగారి ప్రియ సహచరులు (సహాబా-రది అల్లాహు అన్హుమ్) ప్రవక్తగారి మాటలను, చేతలను కేవలం తమ వరకే గుర్తు పెట్టుకోకుండా వారు తమ అనుయాయులకు హెచ్చుతగ్గులు లేకుండా వాటిని అందజేశారు. మరి ఆ అనుయాయులు తమ తరువాతి తరం వారికి ఈ అమానతును సురక్షితంగా అప్పగించారు. ఈ విధంగా ఒక తరం వారు ఇంకొక తరం వారికి వారసత్వంగా ఈ అమానతును యధాతథంగా అందజేసుకుంటూ వచ్చారు. ఉలమా (పండితులు) ఈ సున్నత్‌ను గ్రంథస్థం చేశారు. అత్యంత ప్రామాణికమైన ఉల్లేఖనాలను బలహీనమైన ఉల్లేఖనాల నుండి వేరు చేశారు. ప్రామాణికమైన హదీసులేవో, బలహీనమైనవి ఏవో పరీక్షించి నిర్ధారించడానికి కొన్ని సూత్రాలను సైతం క్రోడీకరించారు.
(ఈ ప్రక్రియలో భాగంగానే హదీసు సూత్రాలు – ముస్తలాహుల్ హదీస్, అస్మావుర్రిజాల్ యొక్క శాశ్వతమైన విద్యలు ఉనికిలోకి వచ్చాయి. ఈ అంశాల ఆధారంగా అనేక గ్రంథాలు రచించబడ్డాయి. ఆఖరికి బలహీనమైన హదీసుల గురించి, హదీసు అంశాల గురించి కూడా గ్రంథాలు వెలువడ్డాయి – అనువాదకుడు).
పండితుల, హదీసువేత్తల నిరంతర కృషి ఫలితంగా బుఖారీ షరీఫ్, ముస్లిం షరీఫ్‌లతో పాటు మరెన్నో హదీసు గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. ఆ విధంగా హదీసులు సురక్షితం గావించబడ్డాయి. ఏ విధంగానైతే పరమప్రభువైన అల్లాహ్ తన గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ని) నాస్తికుల, మీథ్యావాదుల ప్రక్షిప్తాల నుండి, స్వార్ధపరుల కల్తీ బారి నుండి కాపాడాడో అదే విధంగా హదీసు వేత్తలు హదీసుల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఖుర్‌ఆన్ కాపాడే విషయమై అల్లాహ్ స్వయంగా ఖుర్‌ఆన్‌లోనే ఈ విధంగా సెలవిచ్చాడు: .
“మేము ఈ ఖుర్‌అన్‌ను అవతరింజేశాము. మరి స్వయంగా మేమే దీనిని కాపాడుతాము”.
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు మరియు సున్నత్ కూడా ఇదే కోవకు చెందినది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (ఇవి కూడా అల్లాహ్ సంకేతానుసారమే అవతరింపజేయబడ్డాయి). అల్లాహ్ తన గ్రంథాన్ని రక్షించినట్లే సున్నత్‌ను కూడా రక్షించాడు.
అల్లాహ్ ఈ లక్ష్యం కొరకు ఉలమా (పండితుల) సమూహాన్ని ఉనికిలోకి తెచ్చి, హదీసులను సంరక్షించే సద్బుద్ధిని వారికి వొసగాడు. ఈ పండితులు నిరంతరం హదీసులకు రక్షా కవచంలా నిలబడ్డారు. మిధ్యావాదులు హదీసులలో ప్రక్షిప్తాలకు పాల్పడినప్పుడల్లా వాటిని ఖండించారు. అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఎవరు హదీసులకు వక్రభాష్యాలు చెప్పినా వాటిని ఖండించారు. అజ్ఞానులు ఎప్పుడు ఈ హదీసులలో బూటకపు ఉల్లేఖనాలను మిళితం చేసినా ఉలమా వాటిని ప్రామాణికమైన హదీసుల నుండి వేరుపరచారు. ఆ విధంగా ఇది కూడా దైవికంగా జరిగిన ఏర్పాటు అనటంలో సందేహం లేదు. ఎందుకంటే అల్లాహ్ హదీసులను తన గ్రంథం యొక్క తాత్పర్యంగా చేశాడు. దివ్యఖుర్‌ఆన్‌లో ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించటం సాధ్యం కాదు. అయితే హదీసులలో వాటి వివరాలు వస్తాయి. ఉదాహరణకు :- పాలు తాపే ఆదేశాలు, వారసత్వ పంపిణీకి సంబంధించిన వ్యవహారాలు, వివాహాది కార్యాలలోని ధర్మాధర్మాలు మొదలగునవి.
దీంతో పాటు మరెన్నో ఆదేశాలున్నాయి. సహీహ్ హదీసులలో వాటి ప్రస్తావన ఉంది. కాని ఖుర్‌ఆన్‌లో వాటి ప్రస్తావన లేదు.
ప్రవక్త సహచరులు, వారి తరువాత వారు మరియు ఇస్లామీయ విద్వాంసులు దృష్టిలో సున్నత్ ఔన్నత్యం
సహీహ్ హదీసులలో హజత్ అబూహురైర (రది అల్లాహు అన్హు)ఉల్లేఖనం ప్రకారం:
మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత అరేబియాలోని కొన్ని తెగలు ధర్మభ్రష్టమయ్యాయి. ఈ పరిస్థితిని గమనించిన హజ్రత్ అబూబకర్ (రది అల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షి! నమాజ్ మరియు జకాత్‌ల మధ్య తేడా కనబరచిన వానికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తాను”. ఈ మాట విన్న హజ్రత్ ఉమర్, “మీరు వారికి వ్యతిరేకంగా ఎలా పోరాడుతారు? వాస్తవానికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఈ విధంగా చెప్పి ఉన్నారు – “ప్రజలు లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించే వరకూ వారితో ధర్మయుద్ధం చేయమని నాకు ఆజ్ఞాపించబడింది. వారు ఈ కలిమాను గనక పఠిస్తే వారి ధన ప్రాణాలు నా తరపున సురక్షితం గావించబడతాయి. దీని (కలిమా) సత్యతమూలంగా వారికి రక్షణ లభిస్తుంది. ఇది విన్న హజ్రత్ అబూబకర్ (రది అల్లాహు అన్హు), “ఏమిటీ జకాత్ దాని (కలిమా) సత్యతలో అంతర్భాగం కాదా!? అల్లాహ్ సాక్షి! వాళ్లు గనక మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) జీవితకాలంలో చెల్లిస్తూ ఉండే ఒంటె త్రాడును ఆపి ఉంచినా నేను వారికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తాను.” ఇది వినగానే హజ్రత్ ఉమర్ (రది అల్లాహు అన్హు) నాకిప్పుడు విషయం బోధపడింది. నిస్సందేహంగా అల్లాహ్ ధర్మయుద్ధం విషయంలో హజ్రత్ అబూబకర్ (రది అల్లాహు అన్హు)కు సరియైన అవగాహనను ప్రసాదించాడు. ఇదే సత్యమని నాకు తెలిసిపోయింది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సహచరులు ఈ విషయంలో హజ్రత్ అబూబకర్‌తో ఏకీభవించటమే గాకుండా ధర్మభ్రష్టతకు పాల్పడిన వారితో జిహాద్ చేసి వారిని తిరిగి రుజువర్తనుల్ని చేశారు. తమ ధర్మభ్రష్టతపై మొండికేసిన వారిని తుదముట్టించారు.
ఈ వృత్తాంతం ప్రకారం సున్నత్ యెడల గౌరవం కలిగి ఉండటం, దానిని తు.చ. తప్పకుండా పాటించటం అవసరమని స్పష్టంగా తెలుస్తోంది.
ఒక “తాతమ్మ” హజ్రత్ అబూబకర్ (రది అల్లాహు అన్హు) సన్నిధికి వచ్చి తన వారసత్వపు సమస్యను గురించి నివేదించుకుంది. దైవగ్రంథంలోనయితే దీని గురించిన వివరాలు లేవు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) దీని గురించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా నాకు తెలీదు. దీని గురించి నేను ప్రజలను అడిగి తెలుసకుంటాను అని హజ్రత్ అబూబకర్ (రది అల్లాహు అన్హు) అన్నారు. ఈ వ్యవహారం గురించి ఆయన ప్రజలను దర్యాప్తు చేయగా కొంతమంది ప్రవక్త సహచరులు (రది అల్లాహు అన్హు) ధృవీకరించారు. మహాప్రవక్తవారు ‘తాతమ్మకు వారసత్వంలో ఆరవభాగం ఇప్పించారని వారు సాక్ష్యం పలకగా తదనుగుణంగా అబూబకర్ (రది అల్లాహు అన్హు) తీర్పు ఇచ్చారు.
హజ్రత్ ఉమర్ (రది అల్లాహు అన్హు) గారు శిస్తును, జకాతును వసూలు చేసే ప్రతినిధులకు తాకీదు చేస్తూ ఇలా అనేవారు.
“మీరు ప్రజల మధ్య అల్లాహ్ గ్రంథానుసారం తీర్పు చెయ్యండి. ఒకవేళ ఏ సమస్యకయినా పరిష్కారం దైవగ్రంథంలో మీకు కానరాకపోతే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సంప్రదాయం ప్రకారం పరిష్కరించాలి సుమా!”
ఒకసారి హజ్రత్ ఉమర్ (రది అల్లాహు అన్హు) గారికి ఒక మహిళ ఇమ్లాస్[1] కి సంబంధించిన సమస్య క్లిష్టతరంగా పరిణమించింది. అప్పుడాయన సహాబాను సంప్రతించగా, ముహమ్మద్ బిన్ సలమ, ముగైర బిన్ షాబ (రజి అల్లాహు అన్‌హుం)లు ఆయన సన్నిధికి వచ్చి, “ఈ వ్యవహారంలో ఒక బానిస లేక బానిసరాలికి స్వాతంత్రం వొసగటం తగిన పరిహారంగా మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తీర్పు ఇచ్చారంటూ సాక్ష్యమిచ్చారు. ఆ మేరకు హజ్రత్ ఉమర్ (రది అల్లాహు అన్హు) కూడా తీర్పు ఇచ్చారు.
[1] ఇమ్లాస్ అంటే ఒక స్త్రీ తన గర్భస్థ శిశువును ఒకరి ఒత్తిడి లేక వేధింపు మూలంగా (భ్రూణ హత్య చేయటం]
హజ్రత్ ఉస్మాన్ (రది అల్లాహు అన్హు) దగ్గరకు ఒక సమస్య వచ్చింది. భర్త చనిపోయిన మీదట భార్య తన ఇంట్లో ఎన్ని రోజులు “ఇద్దత్” (శోకం) పాటించాలి? అన్నది ఆ సందేహం. ఈ వ్యవహారంపై ఆయన దర్యాప్తు చేయగా అబూసయీద్ (రది అల్లాహు అన్హు) సోదరి అయిన ఫరీయ బిన్తె మాలిక్ బిన్ సనాన్ కబురంపిస్తూ, తన భర్త మరణించినపుడు అతని ఇంట్లోనే నిలకడగా ఉంది నిర్ణీత ఇద్దత్ గడువును పూర్తి చేయవలసిందిగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని ధృవీకరించారు. చివరకు హజ్రత్ ఉస్మాన్ (రది అల్లాహు అన్హు) కూడా ఈ మేరకే తీర్పు ఇచ్చారు.
అలాగే హజ్రత్ ఉస్మాన్ (రది అల్లాహు అన్హు) గారు, వలీద్ బిన్ ఉఖబ మద్యం సేవించారని తెలిసి సున్నత్ ప్రకారం శిక్ష విధించారు.
హజ్ యాత్రకు సంబంధించిన ఒకానొక క్రియ (తమత్తు) విషయం హజ్రత్ ఉస్మాన్ (రది అల్లాహు అన్హు) గారి అభిప్రాయం భిన్నంగా ఉందని హజ్రత్ అలీ (రది అల్లాహు అన్హు)గారికి తెలిసినపుడు హజ్రత్ అలీ (రది అల్లాహు అన్హు) హజ్ మరియు ఉమ్రా రెండింటికీ సంబంధించిన “ఇహ్రామ్” కట్టుకుని ఇలా చెప్పారు. “నేను ప్రజలలో ఏ ఒక్కరో వెలిబుచ్చిన అభిప్రాయం ఆధారంగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌ను త్యజించజాలను”.
మరి కొంతమంది హజ్రత్ అబూబకర్, హజ్రత్ ఉమర్ (రది అల్లాహు అన్హు)ల అభిప్రాయం ఆధారంగా హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రది అల్లాహు అన్హు) సన్నిధికి వచ్చి ‘తమత్తు”పై హజ్టె ఇఫ్రాద్ శ్రేష్టమైనదని నిదర్శనం ఇవ్వగా హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఇలా పలికారు: “త్వరలోనే ఆకాశం మీద నుండి మీపై రాళ్లు పడతాయి! దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ విధంగా చెప్పారని నేనంటూ ఉండగా, అబూబకర్,ఉమర్‌ల అభిప్రాయం ఇలా ఉందని మీరంటారా?!”
ఎవరైనా హజ్రత్ అబూబకర్, ఉమర్‌ల మాటపై ఆచరిస్తూ సున్నత్‌ను వ్యతిరేకించగా దైవానుగ్రహం విరుచుకుపడే ప్రమాదం కనిపించినపుడు, ఇక అబూబకర్, ఉమర్‌ల కన్నా తక్కువస్థాయి గల వ్యక్తి మాటలపై, సలహాలపై నడుస్తూ నున్నత్‌ను’ వ్యతిరేకించిన వారి స్థితి ఇంకెంత నికృష్ణంగా తయారవుతుందో కాస్త ఆలోచించండి.
మరి కొంతమంది కొన్ని హదీసుల విషయంలో హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రది అల్లాహు అన్హు)తో విభేదించగా, “ఏమిటీ, మనం ఉమర్‌ను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామా!?” అని అబ్దుల్లా బిన్ ఉమర్ (రది అల్లాహు అన్హు) ఆశ్చర్యం వ్యక్తపరిచారు.
ఇమ్రాన్ బిన్ హసీన్ (రది అల్లాహు అన్హు) హదీసు పాఠం ఇస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, “మీరు మాకు ఖుర్‌ఆన్ గురించి విశదీకరించండి” అని కోరాడు. ఇది విని ఆయన కోపగించుకున్నారు. పైగా ఆయన ఇలా అన్నారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నత్ ఖుర్‌ఆన్‌కు తాత్పర్యం వంటిది. సున్నతే గనక లేకుంటే జుహ్ర్‌లో నాలుగు రకాతులున్నాయనీ, మగ్రిబ్‌లో మూడు రకాతులనీ, ఫజ్ర్లో రెండు రకాతులనీ మనకు తెలిసేది కాదు. అలాగే జకాత్ తీరుతెన్నులను గురించి మనం తెలుసకోలేకపోయేవారం. అలాగే నేడు సున్నత్‌లో ఉన్న మరెన్నో అంశాలు మనకు తెలియకుండా పోయేవి”.
దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)గారి సున్నత్ పట్ల ప్రవక్త సహచరులకు గల భక్తి శ్రద్ధలు అపారం. ఒక్కో సున్నత్‌ను ఆచరణలో పెట్టాలని వారు ఉవ్విళ్లూరు తుండేవారు. ఏ సున్నత్‌నయినా ఎవరన్నా చిన్నచూపు చూస్తున్నట్లు అగుపిస్తే దైవానుగ్రహం ఎక్కడ విరుచుకు పడుతుందోనని వారు భీతిల్లేవారు. సున్నత్‌ను ఎవరయినా నిర్లక్ష్యం చేస్తే ఆగ్రహోదగ్రులయ్యేవారు. అలాంటి సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. ఉదాహరణకు ఒక సంఘటనను చూడండి :-
“అల్లాహ్ దాసీలను (మహిళలను) మస్జిద్లకు రాకుండా అడ్డుపడకండి” అని మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రది అల్లాహు అన్హు) వివరిస్తుండగా ఆయన కుమారులలో ఒకరు కల్పించుకుని, ‘అల్లాహ్ సాక్షి! మేము వాళ్లను తప్పకుండా అడ్డుకుంటాము’ అని అన్నాడు. దానిపై అబ్దుల్లా బిన్ ఉమర్ (రది అల్లాహు అన్హు) తీవ్రమైన ఆగ్రహాన్ని వెలిబుచ్చటమే గాక తన కొడుకుని తీవ్రంగా మందలించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు: – “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు” అని నేనంటూ ఉండగా “మేము తప్పక అడ్డుకుంటాము” అని నువ్వంటావా?!”
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రత్యక్ష సహచరులలో ఒకరైన అబ్దుల్లా బిన్ మగ్‌ఫిల్ ముజ్‌నీ (రది అల్లాహు అన్హు) గారు తన బంధువైన ఒక వ్యక్తి కంకరరాళ్లు విసురుతుండగా చూచి అతన్ని వారించారు. ఇంకా అతనికి ఇలా నచ్చజెప్పారు. “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కంకరరాళ్లు విసరడాన్ని వారించారు. ఎందుకంటే ఇవి వేటాడే వాటిని కూల్చడం గానీ, శత్రువును గాయపరచటం గానీ చేయలేవు. కాకపోతే వీటి మూలంగా పల్లు (దంతాలు) రాలటమో, కళ్లు పగలడమో జరుగుతుందని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చి ఉన్నారు.” మరి కొన్నాళ్ల తరువాత కూడా ఆ వ్యక్తి కంకరరాళ్లు విసరుతుండటం చూచి, “అల్లాహ్ సాక్ష్యం! నేను ఇక ఎన్నటికీ నీతో మాట్లాడను. దైవప్రవక్త గారు కంకరరాళ్లు విసరరాదని చెప్పారని నేను ఎంత మొత్తకున్నా నువ్వు మళ్లీ అదే పని చేస్తున్నావు” అని ఆయన తన అయిష్టాన్ని అసహనాన్ని అభివ్యక్తం చేశారు.
“మీరు ఎప్పుడయినా, ఎవరి ముందరయినా హదీసు పాఠం ఇస్తూ ఉండగా, “దీన్ని వదలండి, మాకు (కేవలం) పవిత్ర ఖుర్‌ఆన్ నుంచి ఏదైనా బోధించండి” అని అతనంటే అతడు మార్గవిహీనుడయ్యాడని మీరు తెలుసకోండి” అని ప్రముఖ తాబయీ అయూబ్ సక్తియానీ చెప్పినట్లు ఇమామ్ బైహఖీ నకలు చేశారు.
ఇమామ్ అవ్‌జాయి (రహమతుల్లా అలై) మాటల్లోనే చెప్పాలంటే సున్నత్ దైవగ్రంథానికి విపులీకరణ వంటిది. (భావమేమిటంటే) ఖుర్‌ఆన్‌లో క్లుప్తంగా ఉన్న దానిని ప్రవక్తగారి సున్నత్ వివరించి చెబుతుంది). నిక్షిప్తమై ఉన్న విషయాన్ని విడమరచి – అందరికీ అర్ధమయ్యేలా – చెబుతుంది. ఉదాహరణకు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.
“(ఓ ప్రవక్తా!) ఈ జ్ఞాపికను (ఖుర్‌ఆన్‌ను) నీపై అవతరింపజేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించటానికి, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికీనూ”. (ఆన్ నహ్ల్ – 44)
“నాకు గ్రంథం వొసగబడింది. దాంతో పాటు దాని ఉపమానం (సున్నత్) కూడా ప్రసాదించబడింది” అన్న ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి పలుకు ఇంతకు ముందు కూడా వచ్చింది.
ఆమిర్ షాబీ గారు జనుల ఉద్దేశ్యించి ఇలా పలికారని ఇమామ్ బైహకీ పొందు పరిచారు. “ఎప్పుడైతే మీరు చిహ్నాలను (అనగా సహీహ్ హదీసులను) వదలి వేశారో అప్పుడు మీరు వినాశం పొందారని తెలుసుకోండి”.
ఇమామ్ అవ్‌జాయి కొంతమంది సహచరులనుద్దేసించి ఇలా ప్రబోధించారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ద్వారా నీకు ఏదయినా హదీసు చేరినపుడు మరో మాట చెప్పడానికి నీవు భయపడాలి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారుఅల్లాహ్ తరపున నియుక్తులైన సందేశ ప్రదాత”. (దీనిని కూడా ఇమామ్ బైహఖీ గారే నకలు చేశారు.)
ప్రఖ్యాత ఇమామ్ సుఫియాన్ సవ్రీ చెప్పారని ఇమామ్ బైహఖీ ఉల్లేఖించారు: “జ్ఞానం అనేది ఏదైనా ఉంటే అది సాంతం చిహ్నాల (సహీహ్ హదీసుల) జ్ఞానమే”.
ఇమామ్ మాలిక్ (రహమతుల్లా అలై) ఇలా ఉపదేశించారు: “మనలో ప్రతి ఒక్కరిమాట స్వీరించవచ్చు లేక అతని మాట అతని పైనే రద్దు చేయవచ్చు. కాని ఈ సమాధివాసి విషయం అలా కాదు”. ఇలా పలుకుతూ ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి సమాధి వైపు సంజ్ఞ చేశారు. అంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి హదీస్ పై అమల్ చేయటమేగాని తిరస్కరించరాదు. తిరస్కరిస్తే అది కుఫ్ర్కి దారి తీస్తుంది.
ఇమామ్ అబూహనీఫా (రహమతుల్లా అలై) ఉపదేశించారు: “మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తరపున ఏదైనా హదీసు అందితే అది మాకు శిరోధార్యం అవుతుంది”.
ఇమామ్ షాఫయి (రహమతుల్లా అలై) ఒకసారి ఇలా అన్నారు: “మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా ఏదైనా సహీహ్ హదీసు అందగా నేను దాన్ని స్వీకరించకపోతే నాకు మతి చలించిందనుకోవాలి. ఈ మాటకు మిమ్మల్ని సాక్ష్యంగా పెడుతున్నాను. (అంటే నేను పిచ్చివాణ్ణి అయినపుడే ఇలా విపరీతంగా ప్రవర్తిస్తాను)”.
ఆయన ఇంకా ఇలా అన్నారు:
“నేను ఎప్పుడైనా ఏదైనా విషయంలో అభిప్రాయం వ్యక్తం చేయగా అది దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి హదీసుకు విరుద్ధంగా ఉంటే నా అభిప్రాయాన్ని గోడకేసి కొట్టండి”.
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహమతుల్లా అలై) తన సహచరులు కొంతమందిని ఉద్దేశ్యించి ఇలా ప్రబోధించారు:
“మీరు నన్ను గానీ, ఇమామ్ మాలిక్‌ని గాని, ఇమామ్ షాఫయిని గానీ అనుసరించకండి. దీనికి బదులు మేము ఎక్కడి నుంచి విషయాన్ని గ్రహించామో అక్కడి నుండి మీరూ గ్రహించండి”.
ఆయన ఈ విధంగా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి గురించి, ఆయన హదీసుల ప్రామాణికత గురించి క్షుణ్ణంగా తెలిసి కూడా సుఫియాన్ సూరీ అభిప్రాయల వైపుకు మొగ్గుచూపే ఈ జాతిని చూసి నాకు ఆశ్చర్యమేస్తుంది. వాస్తవానికి అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించి ఉన్నాడు-
“దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదయినా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష వదైనా అవతరిస్తుందేమో అనీ భయపడాలి”. (సూర నూర్ – 63)
తరువాత ఇమామ్‌గారు ఇలా అన్నారు: “చెడుగు (ఉపద్రవం) ఏమిటో మీకు తెలుసా? అదే షిర్క్ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ఏ ప్రవచనాన్నయినా మనిషి రద్దు చేసినవాడు మనిషి హృదయంలో వక్రత చోటు చేసుకుని అది అతన్ని వినాశం పాలుజేసే అవకాశం ఉంది”.
ప్రముఖ తాబయి హజ్రత్ ముజాహిద్ గారి పలుకులను ఇమామ్ బైహఖీ ఉటంకించారు – హజ్రత్ ముజాహిద్ ఇలా అన్నారు – “మీ మధ్య ఏదేని విషయంలో వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరలించండి అని ఖుర్‌ఆన్‌లో ఉంది. ఇక్కడ అల్లాహ్ అంటే భావం దైవగ్రంథం (ఖుర్‌ఆన్). దైవప్రవక్త అంటే భావం దైవప్రవక్త నెలకొల్పిన సంప్రదాయం వైపుకు మరలటం.”
హజ్రత్ ఇమామ్ జహ్‌రీ పలుకులను కూడా ఇమామ్ బైహఖి పొందుపరచారు: “మనకు పూర్వం గడచిన పండితులు, సున్నత్‌ను గట్టిగా పట్టుకొని ఉండటంలోనే మోక్షం ఉందని చెప్పేవారు”.
ఇంతకు ముందు ఉదాహరించబడిన సూరె నూర్‌లోని 63వ ఆయతుకు వ్యాఖ్యానం చెబుతూ అల్లామా ఇబ్నె కసీర్ ఇలా అన్నారు:
“దైవప్రవక్త ఆజ్ఞ అంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి మార్గం, పద్ధతి, విధానం, సంప్రదాయం, ధర్మం అని భావం. అంటే మనిషి యొక్క మాటలు, చేతలు అన్నీ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) మాటలు, చేతల కనుగుణంగా ఉన్నాయో లేదా అని పరీక్షించబడతాయి. ఉంటే అవి స్వీకారాయోగ్యమవుతాయి. లేకుంటే మరుగుపరచబడతాయి – ఆ మనిషి ఎంత గొప్పవాడైనా సరే!”
సహీహ్ బుఖారీ, ముస్తిం మరియు ఇతర ప్రామాణికమైన గ్రంథాల ద్వారా ధృవీకరించబడిన ఒక హదీసులో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఇలా ప్రవచించారు:
మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్‌రునా ఫహువ రద్దున్.
ఎవరయినా మేము ఆజ్ఞాపించని దానిని ఆచరిస్తే అటువంటి ఆచరణ త్రోసిపుచ్చబడుతుంది.
కాబట్టి ఇలాంటి పోకడలకు దూరంగా ఉండటమే గాకుండా వాటికి భయపడాలి. ఎందుకంటే మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)గారి షరీయత్‌ను “లోలోపలగానీ, బహిర్గతంగా గానీ వ్యతిరేకించినవాడు ఉపద్రవంలో చిక్కుకున్న వాడవుతాడు. అలాంటి వ్యక్తి హృదయంలో అవిశ్వాసం, కాపట్యం, అపసవ్యతలు జొరబడి అతడు దైవానుగ్రహానికి పాత్రుడయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ ఆగ్రహం అనేక విధాలుగా ఉండవచ్చు. మార్గభ్రష్టతకు పాల్పడి గందరగోళాన్ని సృష్టించినందుకు అతడు హతమార్చబడవచ్చు, లేక ఆంక్షలకు గురికావచ్చు లేదా నిర్బంధించబడనూ వచ్చు!
మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“నేను మరియు మీ యొక్క ఉపమానం అగ్నిని రాజేసిన వ్యక్తి లాంటిది. ఆ అగ్ని పరిసరాలను దేదీప్యమానం చేయగా దీపపు పురుగులు దాని చుట్టూ మూగి తమను తాము అగ్నికి ఆహుతి చేసుకోసాగాయి. అతను వాటిని ఆపసాగాడు. కాని అవి అతనిపై ఆధిక్యతను ప్రదర్శించి ఆత్మాహుతి చేసుకుంటాయి. నేనూ మరియు మీ యొక్క ఉపమానం కూడా ఇలాంటిదే. అగ్ని నుంచి కాపాడే ఉద్దేశ్యంతో నేను మిమ్మల్ని ఆపసాగాను. కాని మీరు నాపై ఆధిపత్యం చెలాయించి మిమ్మల్ని మీరు అగ్నికి ఆహుతి చేసుకుంటున్నారు”. (ఇహమ్ అహ్మద్)
అల్లామా సుయూతీగారు తన గ్రంథం “మిఫ్తాహుల్ జన్నతి ఫిల్ ఇహ్తే జాజ్ బిస్సున్నా లో ఇలా వ్రాశారు:
“అల్లాహ్ మీపై దయజూపుగాక! హదీసు సూత్రాల ప్రకారం ఏ హదీసు అయితే సహీహ్ హదీసుగా నిరూపించబడిందో – అది ఒకవేళ వాక్కు అయినా సరే, కర్మ అయినా సరే – దాని ప్రామాణికతను గనక ఎవరయినా త్రోసిపుచ్చితే అతడు కాఫిర్ అయిపోతాడు, ఇస్లాం పరిధి నుండి బహిష్మరించబడతాడు. ప్రళయదినాన అతడు యూదులు క్రైస్తవులతో పాటు లేపబడతాడు”.
సున్నత్ పట్ల గౌరవం, దాని ఆచరణ యొక్క ఆవశ్యకత, దాని పట్ల వ్యతిరేక భావం యొక్క దుష్పరిణామానికి సంబంధించిన ఎన్నో ఉల్లేఖనాలు సహాబాలు, తాబయీన్‌ల ద్వారా రూఢీ అవుతున్నాయి. ఆ మహనీయుల అనంతరం వచ్చిన పండితులు, విద్వాంసులు, హదీసువేత్తలు కూడా ఈ విషయంలో ప్రమాణబద్ధమైన ప్రకటనలు చేశారు….. ఈ అంశంపై నేను ఉదాహరించిన ఖుర్‌ఆన్ ఆయతులు, హదీసులు, ఉల్లేఖనాలు, ఉదంతాలు విషయావగాహనకు సరిపోతాయని ఆశిస్తాను. సత్యం కొరకు తహతహలాడే వారికి ఈ ఉదాహరణలు సంతృప్తిని కలిగిస్తాయని భావిస్తాను.
మేము మా కొరకు, సమస్త ముస్తిముల కొరకు ఈ సత్యార్యాలను చేసే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాము. అల్లాహ్‌ను ప్రసన్నుణ్ణి చేయడానికి ఆరాటపడే, ఆయన ఆగ్రహానికి దూరంగా ఉండాలని కాంక్షించే వారి కొరకు ప్రార్ధిస్తున్నాము. ఆయన మనందరినీ సన్మార్గంపై నడిపించాలని ప్రార్ధన! నిస్సందేహంగా ఆయన వినేవాడు, చేరువలో ఉన్నవాడు.
ఇదే మాసందేశం (పుస్తక పబ్లిషర్స్ నుండి)
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర వర్గానికి దేని గురించి ఆదేశించారో,దేనిని స్వయంగా ఆచరించి చూపించారో, మరి దేన్ని అనుమతించారో దాన్ని యధావిధిగా ఆచరించాలి. పవిత్ర ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని వారించిన దానికి దూరంగా ఉండండి.” (59:7)
దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) తన జీవిత కాలంలో చేయని దానిని మీరు మీ ఇష్టానుసారం చేసి కొత్త పుంతలు తొక్కకండి. అలా చేస్తే మీరు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానాన్ని నిర్లక్ష్యం చేసిన వారవుతారు. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా హెచ్చరించాడు: “విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను మించి పోయే యత్నం చేయకండి.” (49:1)
మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానమే ఆదర్శనీయం, అనుసరణీయం. దాన్ని కాదని ఇతరత్రా విధానాలను అనుసరించి, ఇతరుల అభిప్రాయాలను ప్రమాణంగా తీసుకుని మీ సదాచరణలను పాడు చేసుకోకండి. ఈ విషయాన్నే పరమ ప్రభువు తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు : “ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్‌కు, మరియు ఆయన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. ఇంకా, మీ ఆచరణలను వృధా చేసుకోకండి.” (47:99)
25.349808
55.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
You must be logged in to post a comment.