అయ్యాముత్ తష్రీఖ్ (హజ్జ్ మాసంలోని తష్రీఖ్ దినాల) ఘనత

అయ్యాముత్ తష్రీఖ్ ఘనత
కూర్పు: ముహమ్మద్ నసీర్పద్దీన్ జామిఈ

[పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి]


అయ్యాముత్ తష్రీఖ్ అనగా ఇస్లామీయ క్యాలెండర్ లోని 12వ నెల అయిన జుల్ హిజ్జా యొక్క 11, 12 మరియు 13 తేదీలు. ఇవి ఖుర్బానీ, అల్లాహ్ స్మరణ, తక్బీరాత్ మరియు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపే రోజులు. ఈ రోజులకు ఇస్లాంలో గొప్ప మహిమ ఉంది.

అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి (సూరహ్ అల్-బఖరా: 203).

ముఫస్సిరీన్లలో (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలలో) ముఖ్యంగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా మరియు జుమ్హూర్ ఉలమా అభిప్రాయం ప్రకారం “అయ్యామిన్ మఅదూదాత్” అనగా అయ్యామె తష్రీఖ్.

అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:

لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَعْلُومَاتٍ
వారు తమ ప్రయోజనాలు పొందటానికి (హజ్ కు) రావాలి. ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి. (సూరహ్ అల్-హజ్: 28).

అధిక ముఫస్సిరీన్ల ప్రకారం “అయ్యామిమ్ మఅలూమాత్” అంటే జుల్ హిజ్జా మొదటి పది రోజులు; “అయ్యామిమ్ మఅదూదాత్” అంటే అయ్యాముత్ తష్రీఖ్. ఇక్కడ ఖుర్బానీ ప్రస్తావన వచ్చింది గనక, ఈ ఖుర్బానీ ఎన్ని రోజులు చేయవచ్చు అన్నది కూడా స్పష్టంగా తెలుసుకుందాం.

అయితే పండుగ రోజు (10వ జిల్ హిజ్జా) మరియు ఆ తర్వాత మూడు రోజులు, మొత్తం నాలుగు రోజులు ఖుర్బానీ చేయవచ్చు. దీనికి మొదటి ఆధారం ప్రవక్తవారి ఈ హదీసు «كُلُّ أَيَّامِ التَّشْرِيقِ ذَبْحٌ» అయ్యాముత్ తష్రీఖ్ యొక్క అన్ని రోజులు జిబహ్ చేయవచ్చును అంటే ఖుర్బానీ ఇవ్వవచ్చును. (ముస్నద్ అహ్మద్ 1651, సహీహ్ 2476).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

«إِنَّ يَوْمَ عَرَفَةَ وَيَوْمَ النَّحْرِ وَأَيَّامَ التَّشْرِيقِ عِيدُنَا أَهْلَ الْإِسْلَامِ ، وَهِيَ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ»
నిశ్చయంగా అరఫా రోజు, నహ్ర ఖుర్బానీ రోజు మరియు అయ్యాముత్ తష్రీఖ్ ముస్లింల పండుగ రోజులు మరియు తినే త్రాగే రోజులు. (అబూ దావూద్ 2419. చివరి పదాలు ముస్లిం 1141లోనివి).

ఇమాం ఇబ్నె తైమియా, ఇమాం ఇబ్నె ఖయ్యిమ్, ఇమాం షౌకానీ, షేఖ్ బిన్ బాజ్ మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఈ మాటనే బలపరిచారు, మరియు రాజిహ్ అని చెప్పారు. సూర బఖరలోని 203వ ఆయతు ద్వారా కూడా ఈ మాట గ్రహించడం జరిగినది. (వివరాలు ఆ ఆయతు వ్యాఖ్యానం మరియు హదీసుల్లో చూడవచ్చు).

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

أَيَّامُ التَّشْرِيقِ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ
అయ్యాముత్ తష్రీక్ అనేవి తినే, త్రాగే మరియు అల్లాహ్ స్మరణ చేసే రోజులు. (ముస్లిం: 1141).

ఈ హదీస్ స్పష్టంగా తెలియజేస్తుంది: ఈ రోజుల్లో అల్లాహ్ అనుగ్రహాలపై సంతోషం వ్యక్తం చేయడం షరియత్ లో సమ్మతం.

విశ్వాసులారా! లెక్కలేనన్ని సత్కార్యాలలో ఏదైనా సత్కార్యం గురించి అధికంగా చేయండి అని అల్లాహ్ చెప్పి ఉన్నాడా అంటే, అవును జిక్ర్ గురించి చెప్పి ఉన్నాడు. శ్రద్ధ వహించండి సురతుల్ జుముఅలోని ఈ ఆయత్:

﴿ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ﴾ [الجمعة ١٠]
ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి.

పైన ఉన్న ఆయతు అనువాదం ఇంతేనా, కాదు. అల్లాహ్ మరో శుభవార్త ఇచ్చాడు. అదే: మీరు సాఫల్యం పొందవచ్చు. అల్లాహు అక్బర్! మనం అల్లాహ్ ను ఎక్కువగా, అధికంగా స్మరిస్తూ ఉంటే సాఫల్యం లభించేది మనకే.

﴿ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ﴾
అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. (అహ్జాబ్ 33:35).

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:

لَا تَصُومُوا هَذِهِ الْأَيَّامَ
(అయ్యాముత్ తష్రీక్ లో) ఉపవాసం పాటించకండి. (సహీహ్ 3573).

అందువల్ల సాధారణ ముస్లింలకు 11, 12, 13 జుల్ హిజ్జా రోజుల్లో ఉపవాసం పాటించడం యోగ్యం కాదు. అయితే హజ్ తముత్తు లేదా ఖిరాన్ చేసిన హాజీలకు ఖుర్బానీ చేయలేని పరిస్థితిలో ఉపవాసం పాటించే అనుమతి ఉంది.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

إِنَّ أَعْظَمَ الْأَيَّامِ عِنْدَ اللَّهِ يَوْمُ النَّحْرِ، ثُمَّ يَوْمُ الْقَرِّ
అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజు యౌమున్ నహర్ (10వ జుల్ హిజ్జా), తరువాత యౌముల్ ఖర్ర్ (11వ జుల్ హిజ్జా). (అబూ దావూద్: 1765.

ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీహ్ అన్నారు.) “యౌముల్ ఖర్ర్” అనగా అయ్యాముత్ తష్రీక్ మొదటి రోజు; ఈ రోజున హుజ్జాజ్ మినా లో నివసిస్తారు.

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
“గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి ” (సూరహ్ అల్-బఖరా: 203)

ఈ ఆయత్ ఆధారంగా సహాబాయె కిరామ్ రజియల్లాహు అన్హుమ్ అయ్యాముత్ తష్రీఖ్ రోజుల్లో గట్టిగా (బిగ్గరగా) తక్బీరాత్ పలికేవారు.

[1] హజ్రత్ ఇబ్ను ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హుమా మార్కెట్ లోకి వెళ్లి తక్బీర్ పలికేవారు; వారిని విని ప్రజలు కూడా తక్బీర్లు పలికేవారు. (బుఖారీ, కితాబుల్ ఈదైన్, బాబ్ ఫజ్జుల్ అమల్ ఫీ అయ్యామిత్ తష్రీక్).

[2] హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు మినా లో తన గుడారంలో గట్టిగా తక్బీర్ పలికేవారు; అది మినాలోని మస్జిదె ఖైఫ్ లో ఉన్నవారికి వినబడేది, అప్పుడు వారు తక్బీర్ పలికేవారు. ఇలా మొత్తం మస్జిద్ తక్బీర్లతో మారుమ్రోగేది, తరువాత బజార్ల వరకు ఆ ధ్వని వినిపించేది. (బుఖారీ, కితాబుల్ ఈదైన్).

సహాబాయె కిరామ్ నుండి భిన్నమైన పదాలు మనకు లభించాయి. ప్రసిద్ధ పదాలు ఇవి:

الله أكبر الله أكبر لا إله إلا الله، والله أكبر الله أكبر ولله الحمد
(అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ , అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ )

  1. అధికంగా జిక్ర్ చేయడం – తక్బీర్, తహ్లీల్, తహ్మీద్, తస్బీహ్, దురూద్ షరీఫ్.
  2. నమాజ్ ల తర్వాత తక్బీరాత్. (దీనినే తక్బీరె ముఖయ్యద్ అంటారు). ఉమ్మత్ యొక్క ఫుఖహా అభిప్రాయం ప్రకారం ఫర్జ్ నమాజ్ ల తరువాత తక్బీరాత్ పలకడం మష్రూ.
  3. ఖుర్బానీ మాంసం తినడం మరియు పంచడం.
  4. సంతోషం మరియు కృతజ్ఞత వ్యక్తం చేయడం.

ఈ రోజులు ఇబాదత్ తో పాటు ఆనందానికి కూడా సంబంధించినవి. ఇస్లాం సన్యాసాన్ని కాదు, షుక్ర్ మరియు జిక్ర్ తో కూడిన సమతుల్య జీవనాన్ని బోధిస్తుంది.

గౌరవనీయులైన ముస్లిములారా!

ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ ఈ రోజుల గురించి తెలిపిన ఆణిముత్యాలు కొన్ని ఇలా ఉన్నాయి.

[1] అయ్యాముత్ తష్రీఖ్ లో విశ్వాసుల కొరకు శారీరక అనుగ్రహం మరియు మానసిక అనుగ్రహం రెండూ ఏకంగా లభిస్తాయి. శారీరక అనుగ్రహాలంటే తిను, త్రాగుట మరియు హృదయ అనుగ్రహాలంటే జిక్ర్ మరియు షుక్ర్.

فَأَيَّامُ التَّشْرِيقِ يَجْتَمِعُ فِيهَا لِلْمُؤْمِنِينَ نَعِيمُ أَبْدَانِهِمْ بِالْأَكْلِ وَالشُّرْبِ، وَنَعِيمُ قُلُوبِهِمْ بِالذِّكْرِ وَالشُّكْرِ.

[2] పండుగ రోజులలో తినడం, త్రాగడం అనేవి కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు; వాటివల్ల మనకు శక్తి వచ్చి, ఆ శక్తితో అల్లాహ్ ను స్మరించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇదే నిజమైన కృతజ్ఞత. కానీ ఎవరు ఆ వరాలను పాపాలకు ఉపయోగిస్తారో, వారు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపినవారవుతారు. అలాంటి వారు ఆ అనుగ్రహాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.

أَنَّ الْأَكْلَ فِي أَيَّامِ الْأَعْيَادِ وَالشُّرْبِ إِنَّمَا يُسْتَعَانُ بِهِ عَلَى ذِكْرِ اللَّهِ تَعَالَى وَطَاعَتِهِ … فَمَنِ اسْتَعَانَ بِنِعَمِ اللَّهِ عَلَى مَعَاصِيهِ فَقَدْ كَفَرَ نِعْمَةَ اللَّهِ وَبَدَّلَهَا كُفْرًا، وَهُوَ جَدِيرٌ أَنْ تُسْلَبَ مِنْهُ

[3] మరో చోట చెప్పారు: ఈ రోజుల్లో మనం ఏ జంతువులను ఖుర్బానీ చేస్తామో అవి స్వయంగా అల్లాహ్ ను ఆరాధిస్తాయి, ఆయనకు విధేయులుగా ఉంటాయి. అయితే వాటి మాంసం తినడం ద్వారా మనలో విశ్వాసం పెరిగి, అల్లాహ్ ఆరాధన మరింత ఎక్కువగా చేసే బుద్ధి, ఎల్లవేళల్లో ఆయనకు విధేయులుగా ఉండే బుద్ధి కలగాలి. (ఇక్కడ అరబీ ఇవ్వలేకపోయాము మరీ సంక్షిప్తంగా చేసి అనువదించాము గనక).

[4] ఈ లోక జీవితం అంతా హజ్ యాత్ర రోజుల్లాంటిదే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మోమిన్ (విశ్వాసి) అల్లాహ్ నిషేధించిన కోరికలు, పాపాల నుండి దూరంగా ఉండాలి; ఇది ఇహ్రామ్ లో ఉన్న హజ్ యాత్రికుడిలా ఉంటుంది.

ఎవరు తమ జీవిత ప్రయాణంలో సహనంతో ఉండి, తమ కోరికలను అదుపులో పెట్టుకుంటారో, వారు జీవిత యాత్ర ముగిసినప్పుడు తమ ఆశల గమ్యాన్ని చేరుకుంటారు. అప్పుడు వారు తమ బాధ్యతను పూర్తి చేసి, అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినవారవుతారు. ఆ తర్వాత వారి రోజులు అన్నీ మినా రోజుల్లా మారిపోతాయి — ఆనందం, తినడం, త్రాగడం, మరియు అల్లాహ్ స్మరణతో నిండిన రోజులుగా.

كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది)“. (అల్ హాఖ్ఖహ్ 69:24).

فَإِنَّ الدُّنْيَا كُلَّهَا أَيَّامُ سَفَرٍ كَأَيَّامِ الْحَجِّ، وَهُوَ زَمَانُ إِحْرَامِ الْمُؤْمِنِ عَمَّا حُرِّمَ عَلَيْهِ مِنَ الشَّهَوَاتِ، فَمَنْ صَبَرَ فِي مُدَّةِ سَفَرِهِ عَلَى إِحْرَامِهِ وَكَفَّ عَنِ الْهَوَى، فَإِذَا انْتَهَى سَفَرُ عُمْرِهِ وَوَصَلَ إِلَى مِنَى الْمُنَى، فَقَدْ قَضَى تَفَثَهُ وَوَفَّى نَذْرَهُ، فَصَارَتْ أَيَّامُهُ كُلَّهَا كَأَيَّامِ مِنًى، أَيَّامَ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ عَزَّ وَجَلَّ. كما قال تعالى: كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ

  1. అల్లాహ్ జిక్ర్ — మన నాలుక ఎల్లప్పుడూ తక్బీర్లతో తడిసి ఉండాలి.
  2. అల్లాహ్ అనుగ్రహాలపై షుక్ర్ — తినే, త్రాగే ప్రతి విషయంలో అల్లాహ్ ను స్మరించాలి.
  3. ఉమ్మత్ ఐక్యత — ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా ఒకే జిక్ర్ మరియు ఒకే నినాదంతో ఏకమవ్వాలి.

سبحان ربك رب العزة عما يصفون وسالم على المرسلين والحمد لله رب العالمين

అలీ (రదియల్లాహు అన్హు) హితబోధ : ధర్మ జ్ఞానం యొక్క విశిష్టత

అల్-ఇస్తిఖామహ్ మ్యాగజైన్, సంచిక నం.6 – జుల్-ఖైదా 1417 హిజ్రీ / మార్చి 1997
మూలం: https://abdurrahman.org/2014/01/15/advice-of-alee/

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కుమైల్ ఇబ్న్ జియాద్ కు చేసిన ఈ హితబోధలో జ్ఞానం (ఇల్మ్) యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించారు. ఆయన మనుషులను మూడు రకాలుగా వర్గీకరించారు: సత్యమార్గాన్ని చూపే నిజమైన పండితులు, జ్ఞానాన్ని అభ్యసించేవారు, మరియు సరైన అవగాహన లేకుండా ఇతరులను గుడ్డిగా అనుసరించే సామాన్యులు. సంపదను మనమే రక్షించుకోవాలని, ఖర్చు చేస్తే అది తగ్గిపోతుందని, కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుందని, ఆచరించిన కొద్దీ అది పెరుగుతుందని తెలుపుతూ సంపద కంటే జ్ఞానమే అత్యుత్తమమైనదని ఆయన నొక్కి చెప్పారు. ధర్మాన్ని ప్రాపంచిక ప్రయోజనాల కోసం వాడుకునే వారి గురించి హెచ్చరిస్తూనే, అల్లాహ్ యొక్క సత్య మార్గాన్ని మరియు ఆయన ఆధారాలను కాపాడే అత్యంత విలువైన పండితులు భూమిపై ఎల్లప్పుడూ కొద్దిమందైనా ఉంటారని, వారే ఈ లోకంలో అల్లాహ్ యొక్క రాయబారులని ఆయన స్పష్టం చేశారు.

కుమైల్ ఇబ్న్ జియాద్ ఇలా అన్నారు: ‘అలీ ఇబ్న్ అబీ తాలిబ్ నా చేయి పట్టుకుని నన్ను ఎడారి వైపు తీసుకువెళ్ళారు. మేము అక్కడికి చేరుకోగానే, ఆయన కూర్చుని, ఒక దీర్ఘశ్వాస తీసుకుని ఇలా అన్నారు:

ఓ కుమైల్ ఇబ్న్ జియాద్! హృదయాలు పాత్రల లాంటివి. వాటిలో ఏది ఉత్తమంగా భద్రపరుస్తుందో అదే అత్యుత్తమమైనది. కాబట్టి నేను నీకు చెబుతున్నది జ్ఞాపకం పెట్టుకో.

ప్రజలు మూడు రకాలు: రబ్బానీ[1] అయిన పండితుడు (ఆలిమ్), మోక్ష మార్గంలో జ్ఞానాన్ని అభ్యసించేవాడు, మరియు పిలిచే ప్రతి ఒక్కరినీ గుడ్డిగా అనుసరించే గందరగోళానికి గురైన సామాన్య జనం. వీరు వీచే ప్రతి గాలికి వంగిపోతారు, వీరు జ్ఞానపు కాంతితో ప్రకాశించరు మరియు ఏ విధమైన దృఢమైన పునాది (ఆధారం) కలిగి ఉండరు.

సంపద కంటే జ్ఞానం అత్యుత్తమమైనది. జ్ఞానం నిన్ను రక్షిస్తుంది, కానీ సంపదను నువ్వే రక్షించుకోవాలి. జ్ఞానానికి జకాత్ ‘ఆచరణ’, అయితే ఖర్చు చేయడం వల్ల సంపద తగ్గిపోతుంది. పండితుడిని ప్రేమించడం ధర్మంలో (దీన్‌లో) ఒక భాగం. జ్ఞానం పండితునికి అతని జీవితకాలంలో విధేయతను తెచ్చిపెడుతుంది మరియు మరణం తర్వాత అతనికి సత్కీర్తిని కలిగిస్తుంది, కానీ సంపద వల్ల కలిగే ప్రయోజనం అది నశించగానే ఆగిపోతుంది. సంపదను కూడబెట్టే వారు బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయినవారితో సమానం, కానీ కాలం ఉన్నంత కాలం పండితులు సజీవంగానే ఉంటారు – వారి దేహాలు మాయమైనా, వారి ఆదర్శాలు (ఉదాహరణలు) హృదయాలలో నిలిచిపోతాయి.

ఇక్కడ, నిశ్చయంగా ఇక్కడే – (అని ఆయన తన ఛాతీ వైపు చూపించారు) – అపారమైన జ్ఞానం ఉంది, దీనిని మోయగలిగే వారు (వారసులు) నాకు దొరికితే ఎంత బాగుండు! కానీ దానికి బదులుగా తొందరగా గ్రహించే సామర్థ్యం ఉండి కూడా, నమ్మకానికి పాత్రులు కాని వారిని నేను చూశాను. వారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం ధర్మాన్ని ఉపయోగిస్తారు. సత్యవంతులను అనుసరిస్తున్నప్పటికీ, దాన్ని స్వీకరించే విషయంలో వారికి ఎలాంటి అంతర్దృష్టి (సరియైన అవగాహన) లేదు. వీరు అల్లాహ్ గ్రంథానికి వ్యతిరేకంగా, అల్లాహ్ యొక్క ఆధారాలనే వాడుకోవాలని ప్రయత్నిస్తారు.

ఏదైనా సమస్యాత్మకమైన విషయం ఎదురైనప్పుడు సందేహం వారి హృదయాలను చీలుస్తుంది. వారు ఇటు గానీ అటు గానీ ఉండరు. సత్యం ఎక్కడ ఉందో వారికి తెలియదు, ఒకవేళ వారు తప్పు చేస్తే ఎందుకు చేశారో కూడా వారికి తెలియదు. వారు తమకు ఏమాత్రం వాస్తవం తెలియని ఏదో ఒకదానితో తీవ్రమైన వ్యామోహంలో పడతారు – అందువల్ల వారు ఇతరులకు ఒక ఫితనా (పరీక్ష/విపత్తు) గా మారతారు.

నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికైతే ధర్మం (దీన్) పట్ల అవగాహన ప్రసాదిస్తాడో అతనే అత్యుత్తముడు. ఒక వ్యక్తికి తన ధర్మం గురించి తెలియకపోవడమే అతని అజ్ఞానానికి తగిన నిదర్శనం. అటువంటి వ్యక్తి ప్రాపంచిక సుఖాలకు తీవ్రంగా బానిస అవుతాడు, మనోవాంఛలను అనుసరించడానికి అలవాటు పడతాడు లేదా సంపదను పోగుచేయడం, కుప్పలు తెప్పలుగా కూడబెట్టడానికే అంకితమవుతాడు. అటువంటి వ్యక్తులు ధర్మం వైపు పిలిచే వారు కారు, వారు కేవలం మేత మేసే పశువుల లాంటి వారు. ఈ విధంగా జ్ఞానాన్ని మోసేవారు మరణించడంతో జ్ఞానం కూడా అంతరించిపోతుంది.

అవును! అల్లాహ్ యొక్క ఆధారాలు మరియు స్పష్టమైన సంకేతాలు అంతరించిపోకుండా ఉండటం కోసం, అల్లాహ్ కొరకు ఆధారాలతో నిలబడే వారు లేకుండా ఈ భూమి ఎప్పుడూ ఉండదు. వారు సంఖ్యలో చాలా తక్కువగా ఉంటారు, కానీ అల్లాహ్ దృష్టిలో అత్యంత విలువైనవారు. వారి ద్వారా, అల్లాహ్ తన ఆధారాలను వారి సమకాలీనులలో స్థిరపరుస్తాడు మరియు వాటిని వారిలాంటి వారి హృదయాలలో నాటుతాడు. వారితో, జ్ఞానం వాస్తవ పరిస్థితులను ఛేదిస్తుంది, తద్వారా సులభమైన జీవితానికి అలవాటు పడిన వారికి ఏది కష్టంగా అనిపిస్తుందో, దానిని వీరు తేలికగా భావిస్తారు; అజ్ఞానులను భయపెట్టే విషయాలతో వీరు ప్రశాంతంగా ఉంటారు. వారు ఈ లోకంలో తమ దేహాలతో జీవిస్తారు, కానీ వారి ఆత్మలు ఉన్నతమైన విషయాలకు అనుసంధానించబడి ఉంటాయి. వారు అల్లాహ్ భూమిపై ఆయన రాయబారులు మరియు ఆయన ధర్మం వైపు పిలిచేవారు (దాఈలు). ఆహా! వారిని చూడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నేను నా కోసం, నీ కోసం అల్లాహ్ క్షమాపణ కోరుతున్నాను. నీకు ఇష్టమైతే, నువ్వు ఇక వెళ్ళవచ్చు.” [2]

[1] రబ్బానీ (Rabbaanee): తన జ్ఞానానికి అనుగుణంగా ఆచరించే పండితుడు (ఆలిమ్) మరియు ప్రజల పరిస్థితి పట్ల అంతర్దృష్టి కలిగినవాడు – అతను ప్రజలకు లోతైన మరియు కష్టమైన విషయాల కంటే ముందు, జ్ఞానం యొక్క ప్రాథమిక విషయాలను నేర్పి, వారి స్థాయిని పెంచుతాడు.

[2] అబూ నుయైమ్ చే ‘హిల్వతుల్-ఔలియా‘ (1/79-80) లో, అల్-ఖతీబ్ అల్-బగ్దాదీ చే ‘అల్-ఫఖీహ్ వల్-ముతఫక్కిహ్‘ (1/49-50) లో, మరియు ఇబ్న్ కసీర్ చే ‘అల్-బిదాయహ్ వన్-నిహాయహ్‘ (9/47) లో ఉల్లేఖించబడింది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45477

సదకా (దానం) అనేది జీవనోపాధి పెరుగుదలకు ఒక కారణం – షేక్ ముహమ్మద్ అల్-వస్సాబి

జీవనోపాధికి ఎనిమిదవ ద్వారం: అస్-సదకాత్ (స్వచ్ఛంద దానాలు):

దానధర్మాలు మరియు నఫకాత్ (క్రమం తప్పకుండా చేసే ఖర్చు) – అంటే మీ కోసం, మీ భార్య, పిల్లలు, మీ తండ్రి, మీ తల్లి, మీ అత్తమామలు, సద్వర్తనులైన పొరుగువారు, కుమారులు, కుమార్తెలు, బంధువులు, విధవలు మరియు అనాథల కోసం మీరు చేసే ఖర్చు – ఈ రకమైన దానం అల్లాహ్ దృష్టిలో చాలా గొప్పది. ఇది జీవనోపాధిని (రిజ్క్ ను) కూడబెట్టే సాధనం మరియు ఉపాధి మార్గాలలో ఒక ద్వారం.

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

“ప్రతి రోజూ ఉదయం ప్రజలు నిద్రలేచినప్పుడు ఇద్దరు దేవదూతలు దిగివస్తారు. వారిలో ఒకరు, ‘ఓ అల్లాహ్, దానం చేసేవారికి (తగిన) ప్రతిఫలాన్ని ఇవ్వు,’ అని, మరొకరు ‘ఓ అల్లాహ్, (ధనాన్ని) పట్టి ఉంచుకునేవాడిని (పిసినారిని) నాశనం చేయి‘ అని ప్రార్థిస్తారు.”

[అల్-బుఖారీ, 1374; ముస్లిం, 1010 ద్వారా ఉల్లేఖించబడినది.]

కాబట్టి, మీ శక్తి మేరకు కొంచెమైనా సరే దానం చేయకుండా అల్లాహ్ యొక్క ఏ ఒక్క రోజు కూడా గడిచిపోకుండా చూసుకోండి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ‘కనీసం ఖర్జూర పండులోని సగభాగం దానం చేసైనా అల్లాహ్ కు భయపడండి (నరకాగ్ని నుండి రక్షణ పొందండి).‘ [ముత్తఫకున్ అలై – ఏకీభవించబడినది]

మరియు అల్లాహ్ (సుబ్ హానహు వ తఆలా) ఇలా అంటున్నాడు: ‘ఫ మై యఅమల్ మిస్కాల జర్రతిన్ ఖైరై యర. వ మై యఅమల్ మిస్కాల జర్రతిన్ షర్రై యర’ — ‘ఎవరైతే ఆవగింజంత మంచి చేస్తారో వారు దానిని చూస్తారు. మరియు ఎవరైతే ఆవగింజంత చెడు చేస్తారో వారు దానిని చూస్తారు.’

మరియు అల్లాహ్ (సుబ్ హానహు వ తఆలా) ఇలా కూడా అంటున్నాడు: ‘మీరు అల్లాహ్ మార్గంలో ఏది ఖర్చు చేసినా, ఆయన దానికి ప్రత్యామ్నాయాన్ని (బదులు) ఇస్తాడు మరియు ఆయనే ఉపాధినిచ్చే వారిలో శ్రేష్ఠుడు.’

‘ఆయన దానికి ప్రత్యామ్నాయాన్ని ఇస్తాడు’ అంటే అర్థం ఏమిటి? అంటే ఆయన మీకు దానికంటే మెరుగైన దానిని ఇస్తాడు. అది మీ నుండి వెళ్ళిపోయిందని, అంతమైపోయిందని అనుకోకండి. ఇన్షా అల్లాహ్, అది అంతకంటే గొప్ప రూపంలో మీ వద్దకు తిరిగి వస్తుంది.

షేక్ మళ్ళీ ఇలా అంటున్నారు: మీరు ఏది ఖర్చు చేసినా, అల్లాహ్ మీకు దానికి బదులు ఇస్తాడు మరియు ఆయనే ఉపాధినిచ్చే వారిలో శ్రేష్ఠుడు. మరియు ఆయన ఇలా ప్రార్థిస్తున్నారు: ఓ అల్లాహ్, ఓ లోకనాథా, దానం చేసే వ్యక్తికి మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించు.

ముస్లిం గ్రంథంలో అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో దైవప్రవక్త ఇలా చెప్పారు: మీకు పూర్వం ఉన్న ప్రజలలో ఒక వ్యక్తి ఒక తోటను కలిగి ఉండేవాడు. ఆకాశం నుండి మేఘాల మధ్య ఒక దేవదూత, ‘ఫలానా వ్యక్తి తోటకి నీరు ఇవ్వు’ అని అరవడం వేరే వ్యక్తి విన్నాడు. వెంటనే ఆ మేఘం నుండి నీరు ఒక కాలువలోకి కురిసి, ఆ తోట వైపు పారింది. ఆ తోట యజమాని చేతిలో పార పట్టుకుని నీటిని మరియు మట్టిని సరిచేస్తున్నాడు. అప్పుడు ఆ బాటసారి తోట యజమానితో, ‘అల్లాహ్ నిన్ను కరుణించుగాక, నీ పేరేమిటి?’ అని అడిగాడు.

అతను ఫలానా వ్యక్తి కుమారుడనైన ఫలానా అని తన పేరు చెప్పాడు. తర్వాత, ‘నువ్వు నా పేరు ఎందుకు అడుగుతున్నావు?’ అని అడిగాడు.

దానికి ఆ బాటసారి: “మేఘాల నుండి వచ్చిన ఒక స్వరం, ‘ఫలానా వ్యక్తి (నీ పేరు చెప్పి) తోటకి నీరు ఇవ్వమని’ చెప్పడం నేను విన్నాను. అల్లాహ్ నిన్ను కరుణించుగాక, అసలు నువ్వు ఈ తోట విషయంలో ఏమి చేస్తావు?” అని అడిగాడు.

అప్పుడు ఆ తోట యజమాని ఇలా అన్నాడు: “నేను పంట పండించి, కోసినప్పుడు, అందులో మూడవ వంతు (1/3) నా కోసం మరియు నా కుటుంబం కోసం తీసుకుంటాను. మరొక మూడవ వంతు తిరిగి తోట సాగు కోసం ఖర్చు చేస్తాను. మిగిలిన మూడవ వంతు దానం (సదకా) చేస్తాను.”

దీనిని గమనించండి. సాధారణంగా వర్షం ద్వారా పండే పంటలో (ఎలాంటి కృత్రిమ నీటిపారుదల లేకుండా) పదవ వంతు (1/10) మాత్రమే దానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ స్ప్రింక్లర్లు లేదా ఇతర సాగునీటి పద్ధతుల ద్వారా అయితే పదవ వంతులో సగం (1/20) ఇవ్వాలి.

కానీ ఇతను 1/10 లేదా 1/20 కాకుండా, ఏకంగా 1/3 వంతు (మూడవ వంతు) దానం చేశాడు. అంటే అతను దానం కోసం ఎక్కువ కేటాయించాడు. అందుకే అల్లాహ్ అతని తోట కోసం ప్రత్యేకంగా వర్షాన్ని ఎలా కురిపించాడో చూడండి. అతని పొరుగువారి కంటే అతని తోటకే ప్రత్యేకంగా వర్షం కురిసింది. దీనికి అర్హత సాధించడానికి అతను ఏమి చేశాడు? అతను సదకా (దానం) చేశాడు. కాబట్టి సదకా సంపదను తగ్గించదు.

ఒకసారి మేము దావా (ఇస్లాం ప్రచారం) కోసం ఒక ప్రాంతానికి వెళ్ళాము. అల్హముదులిల్లాహ్, మేము ఎల్లప్పుడూ ప్రజలను అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త సున్నత్ వైపు పిలవడానికి, అల్లాహ్ ను, తీర్పు దినాన్ని మరియు సత్కార్యాలను గుర్తు చేయడానికి వెళ్తుంటాము. అక్కడ పర్వతాలు, చెట్లు పచ్చగా ఉండటం మేము చూసాము, మాషా అల్లాహ్, అది చాలా అందమైన దృశ్యం. వారి వ్యవసాయం చాలా బాగుంది. దానికి కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది, ఎందుకంటే వారి పొరుగున ఉన్న భూములు మాత్రం దుమ్ముతో, నిస్సారంగా ఉన్నాయి, కానీ వీరి భూమి పచ్చగా ఉంది. దారిలో మేము దానికి కారణం చూసాము. అక్కడ ప్రతి కొంత దూరానికి నీటి చల్లదనం లభిస్తుంది, అంటే అక్కడ మేము వాటర్ కూలర్లను (Water Coolers) చూసాము.

షేక్ ఇలా అన్నారు: ఆ వాటర్ కూలర్ల కారణంగా, అల్లాహ్ అక్కడ వర్షాన్ని కురిపించాడు. వారు ఉదారులు అయితే, అల్లాహ్ వారి కంటే ఎక్కువ ఉదార స్వభావం కలవాడు. ఆయన ఉదారుడు మరియు ఉదార స్వభావం గలవారిని ప్రేమిస్తాడు. వారు దయ గలవారైతే, అల్లాహ్ వారి కంటే ఎక్కువ దయ గలవాడు. అల్లాహ్ దయామయుడు మరియు ఆయన దయగల ప్రజలను ప్రేమిస్తాడు.

వారు చేసిన దానాన్ని అల్లాహ్ వృథా పోనివ్వలేదు. పైగా, ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వారికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి సదకా అనేది జీవనోపాధి పెరుగుదలకు ఒక కారణం, ఇది జీవనోపాధి ద్వారాలలో ఒక ద్వారం మరియు కష్టాలు & ఆపదల నుండి ఉపశమనం కలిగించే ద్వారం. జకాత్ కూడా కష్టాల నుండి విముక్తి పొందే మార్గమే. మీరు విన్నదంతా కష్టాల నుండి ఉపశమనం కలిగించే ద్వారాలే – ఇది జీవనోపాధి ద్వారం మరియు ఉపాధికి ఒక కారణం. కొంతమంది ప్రజలు కేవలం భౌతిక కారణాలను (material means) మాత్రమే చూస్తారు. ఈ రోజుల్లో అల్లాహ్ కరుణించిన వారు తప్ప, చాలా మంది ప్రజల మనస్సులలో ఈ ఆధ్యాత్మిక కారణాలు లేవు. అల్లాహ్ రక్షించిన వారు తప్ప, వారు ఖురాన్ చదివినా దానిని లోతుగా ఆలోచించరు.

మూలం: Means of Sustenance ‘మీన్స్ ఆఫ్ సస్టెనెన్స్’ (జీవనోపాధి మార్గాలు) – షేక్ ముహమ్మద్ ఇబ్న్ ‘అబ్దుల్-వహ్హాబ్ అల్-వస్సాబి.

Translated from English from the below link:
https://abdurrahman.org/2016/07/29/sadaqa-is-a-reason-for-the-increase-in-provision-and-it-as-a-door-from-the-doors-of-sustenance/

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44941