రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం

1739. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) తిరగలి విసరి విసరి వ్యాధిగ్రస్తులయ్యారు. (అంటే ఆమె చేతులకు కాయలు కాశాయి). ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు కొందరు (యుద్ధ) ఖైదీలు వచ్చారు. అది తెలిసి హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికెళ్లారు. కాని ఆయన లేరు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) మాత్రమే వున్నారు. అందుచేత ఫాతిమా (రధి అల్లాహు అన్హ) ఆమెనే కలుసుకొని విషయం తెలియజేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఆయనకు ఫాతిమా (రధి అల్లాహు అన్హ) వచ్చి పోయిన సంగతి తెలియజేశారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము మా పడకలపై పడుకొని ఉన్నాము. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూసి లేవడానికి ప్రయత్నించాను. కాని ఆయన నన్ను అలాగే పడుకొని ఉండమని చెప్పి మా ఇద్దరి మధ్య కూర్చున్నారు. అప్పుడు ఆయన దివ్యపాదాల చల్లదనం నా గుండెలకు తాకింది. ఆయన ఇలా అన్నారు,

“(ఫాతిమా!) నీవు నన్నడిగిన దానికంటే ఎంతో మేలయినది నీకు చెప్పనా? నీవు పడుకోవటానికి పడక మీదికి చేరినపుడు 34 సార్లు అల్లాహు అక్బర్ అనీ, 33 సార్లు సుబ్ హానల్లాహ్ అనీ, 33 సార్లు అల్ హమ్దులిల్లాహ్ అనీ పఠిస్తూ ఉండు. ఈ స్మరణ నీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్ఠమైన సంపద.”

[సహీహ్ బుఖారీ :- 62 వ ప్రకరణం – ఫజాయిలి అస్ హాబిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం), 9 వ అధ్యాయం – మనాఖిబ్ అలీ బిన్ అబీతాలిబ్ అల్ ఖురషీ – రజి]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 19 వ అధ్యాయం – ఉదయం, రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2 . సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్