హజ్జ్ & ఖుర్బానీ తర్వాత | షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | షేఖ్ నసీరుద్దీన్ జామి’ఈ

హజ్జ్ & ఖుర్బానీ తర్వాత | షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | షేఖ్  నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/eHKR0eeKYjA [18 నిముషాలు]

الحمدُ للهِ الذي هدانا لنعمة الإسلام وكفي بها نعمة، والحمد لله أن جعلنا موحدين، لا نسجد للحجر، ولا نعبد البقر. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله ﷺ تسليما كثيرا، أما بعدُ

మనం అల్లాహ్‌కు భయభక్తులు కలిగి ఉండాలి (తక్వాను అవలంబించాలి) మరియు అల్లాహ్ మనకు ఈ పుణ్యకాలాలను చేరుకునే అవకాశం కల్పించినందుకు ఆయనను ఎక్కువగా స్తుతిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కాలాలలో మంచి కార్యాలకు అనేక రెట్లు ప్రతిఫలం లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు మహా వరం. అల్లాహ్ అపారమైన అనుగ్రహాలు కలవాడు.

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు తెలిసిన ఆ తొమ్మిది (జిల్ హిజ్జా తొలి తొమ్మిది) పుణ్యదినాలను, ఆ తర్వాత లెక్కించబడే నాలుగు దినాలను (ఈదుల్ అజ్హా రోజు మరియు తష్రీక్ మూడు రోజులు) చేరుకునే అవకాశం కల్పించాడు.

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు సహాయం చేసినందువల్ల మనం అరఫా రోజున ఉపవాసం ఉండగలిగాము మరియు ఆ రోజున ఆయనను ప్రార్థించగలిగాము (దుఆ చేయగలిగాము).

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు ధనసంపదలో విశాలతను ప్రసాదించినందువల్ల మనం ఖుర్బానీ చేయగలిగాము లేదా హజ్ చేయగలిగాము.

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు ముస్లింల రెండు పండుగలను – ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హాను – చేరుకునే (జరుపుకునే) అవకాశం ఇచ్చాడు.

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు రమజాన్‌ను చేరుకునే అవకాశం కల్పించి, భద్రతతో మరియు ఆరోగ్యంతో ఉపవాసాలు పాటించే తౌఫీఖ్ ప్రసాదించాడు. అదే సమయంలో కొందరు భయభ్రాంతులతో రమజాన్‌ను గడిపారు; మరికొందరు అనారోగ్యం లేదా అశక్తత కారణంగా ఉపవాసం ఉండలేకపోయారు. కాబట్టి, ఓ అల్లాహ్! నీవు అనేక అనుగ్రహాలు కురిపిస్తున్నట్లే, మేము కూడా నీకు అపారమైన స్తోత్రాలు అర్పిస్తున్నాము.

అల్ హందులిల్లాహ్! ప్రతి పుణ్యకాలం కోసం కూడా అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఎందుకంటే వాటిలో సత్కార్యాలకు అనేక రెట్లు ప్రతిఫలం లభిస్తుంది, హోదా, అంతస్తు ఉన్నతమవుతుంది. మా ప్రభువా! నీవు మాపై కరుణ చూపి మా పశ్చాత్తాపాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నావు. నీవు నీ మహోన్నత గ్రంథం(నిసా 4:27)లో ఇలా ప్రకటించావు:

(وَاللهُ يُرِيدُ أَنْ يَتُوبَ عَلَيْكُمْ).
అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు.

అల్ హందులిల్లాహ్! సుమ్మ, అల్ హందులిల్లాహ్! సుమ్మ, అల్ హందులిల్లాహ్! ఎందుకంటే ఆయన మనల్ని తౌహీద్ (ఏకదైవారాధన) మరియు సున్నత్‌పై జీవింపజేశాడు; తౌహీద్ మరియు సున్నత్‌కు ప్రాధాన్యత ఉన్న దేశంలో నివసింపజేశాడు. అందువల్ల మన మస్జిద్‌లలో, మన ఖబ్రస్తాన్ (స్మశానం)లో, లేదా మన హజ్ ఆచరణల్లో సమాధుల పట్ల అతిశయ గౌరవం, ఖబ్రిస్తాన్లలో నిర్మాణాలు, షిర్క్ సంబంధిత ఆచారాలు, బిద్అత్‌లు లేదా పక్షపాత వర్గీయత కనిపించవు.

అల్లాహు తఆలా (హజ్జ్ 22:78)లో ఇలా సెలవిచ్చాడు:

مِّلَّةَ أَبِيكُمْ إِبْرَاهِيمَ ۚ هُوَ سَمَّاكُمُ الْمُسْلِمِينَ مِن قَبْلُ وَفِي هَٰذَا
“(ఈ ధర్మం) మీ తండ్రి ఇబ్రాహీమ్ ధర్మమే. ఆయన (అల్లాహ్) ఇంతకుముందే మీకు ‘ముస్లింలు’ అనే పేరు పెట్టాడు, మరియు ఈ (ఖుర్‌ఆన్)లో కూడా (అదే పేరుతో పిలిచాడు).”

అల్ హందులిల్లాహ్! హజ్ విజయవంతంగా పూర్తయినందుకు కూడా అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. హజ్ ముగిసి ఒక వారం గడిచిన తర్వాత, గర్వంతో కూడిన కృతజ్ఞతతో ఇలా చెప్పవచ్చు: హజ్ యథావిధిగా విజయవంతమైంది. సామాన్య రీతిలో విజయవంతమవడమే కాదు, అల్లాహ్ అనుగ్రహంతో మరెంతో అద్భుతంగా విజయవంతమైనది.

ఎందుకంటే అల్లాహ్ తన పవిత్ర గృహానికి సేవ చేస్తూ, హజ్ నిర్వహణ కొరకు అపారమైన ధనాన్ని మరియు శ్రమను వెచ్చించే వారి కృషిని ఎన్నడూ వృథా చేయడు.

فَإِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُحْسِنِينَ
“నిశ్చయంగా అల్లాహ్ సత్కార్యాలు (మేలు) చేసే వారి ప్రతిఫలాన్ని వృథా చేయడు.” (యూసుఫ్ 12:90)

అందువల్ల, అల్లాహ్ గృహానికి సేవ చేస్తూ, హాజీల సౌకర్యం మరియు భద్రత కోసం కృషి చేసే వారి శ్రమ మరియు సేవలకు అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాడు.

ఓ విశ్వాసులారా! కరుణతో మరియు దృఢత్వంతో కూడిన చేతులు హజ్ వ్యవస్థను నిర్వహిస్తాయన్న విషయం తెలుసా?

కరుణతో కూడిన చేతుల విషయానికి వస్తే, “ఖాదిముల్ హరమైనిష్ షరీఫైన్ అతిథుల కార్యక్రమం” గురించి మీరు విన్నారా? ఈ కార్యక్రమంలో రెండువేల ఐదు వందల మంది హాజీలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి, వారి అవసరాలన్నింటినీ చూసుకుంటారు. అంతేకాక, వారి హద్య్ (హజ్ ఖుర్బానీ జంతువు) ఖర్చును కూడా ఖాదిముల్ హరమైనిష్ షరీఫైన్ భరిస్తారు.

అలాగే, హాజీల సేవ మరియు భద్రత కొరకు నాలుగు లక్షల మందికి పైగా సైనిక మరియు పౌర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన విషయం మీకు తెలుసా?

మషాఇర్ (హజ్ పవిత్ర ప్రదేశాలు) మరియు ప్రవేశ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది సంఖ్య యాభై రెండు వేల మందికి చేరిందని మీకు తెలుసా? వీరందరినీ హాజీల ఆరోగ్యం మరియు వైద్య సేవల కోసం ముందు నుండే ఒక నెలపాటు ప్రత్యేకంగా శిక్షణలు ఇవ్వడం జరిగినది.

హజ్ కాలంలో సుమారు మూడు వందల శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయని మీకు తెలుసా? వాటిలో గుండెకు సంబంధించిన క్యాథెటరైజేషన్ (Catheterization) చికిత్సలు మరియు ఓపెన్-హార్ట్ శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి.

అంతేకాదు, ప్రభుత్వం -అల్లాహ్ దానికి సద్భాగ్యం ప్రసాదించుగాక- హాజీలకు సేవలను మరింత సులభతరం చేయడానికి అత్యాధునిక ఎలక్ట్రానిక్ సాంకేతికతలను వినియోగించిన విషయం మీకు తెలుసా?

రద్దీని నివారించడానికి, హజ్ బృందాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, అనుమతి లేకుండా ప్రవేశించే వారిని గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ను ఉపయోగించింది. అలాగే, మందులను అత్యంత వేగంగా చేరవేయడానికి డ్రోన్లను కూడా వినియోగించింది.

మిలియన్ల సంఖ్యలో ఉన్న జనసమూహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, హాజీలను అత్యంత క్రమబద్ధంగా మరియు సాఫీగా తరలించడం వంటి అసాధారణ విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని సుమారు 165 దేశాల నుండి వచ్చిన హాజీల ప్రశంసల ద్వారా దీనిని వినవచ్చు. వారు ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా ఈ ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారు.

కాబట్టి, ఈ యథావిధి విజయానికి అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన హాజీలందరూ భద్రంగా, కృతజ్ఞతతో, ప్రశంసలతో తమ తమ దేశాలకు తిరిగి వెళ్తున్నందుకు కూడా అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.

ప్రపంచమంతా విమానాశ్రయాలలో, తనిఖీ కేంద్రాలలో మరియు సరిహద్దు ప్రవేశ ద్వారాలలో హాజీలకు అందించిన ఆతిథ్యం, స్వాగతం మరియు వీడ్కోలు కార్యక్రమాలకు సంబంధించిన ఆనందకర దృశ్యాలను, వీడియోలను మరియు ఇంటర్వ్యూలను చూసింది.

అవును, హజ్ విజయవంతమైంది. కాబట్టి మనం ఈ మహత్తర సౌదీ రాజ్యపు సంరక్షణలో ఉన్నందుకు సంతోషించాలి. అల్లాహ్ దాని రాజులకు అపారమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఇస్లాం మరియు హరమైన్ షరీఫైన్ సేవల ద్వారా వారికి గౌరవాన్ని కలిగించుగాక. ఫిత్నాలను రగిలించే వారి చెడు నుండి వారిని రక్షించుగాక.

ఈ ద్వీపకల్పపు గద్ద ‘సఖ్రుల్ జజీరా Sakhrul Jazeera’, ఈ రాజ్య స్థాపకుడు, ఏకీకర్త, తౌహీద్ మరియు సున్నత్‌పై ఈ దేశాన్ని నిర్మించిన మలిక్ అబ్దుల్ అజీజ్ (King Abdulaziz) గారిపై అల్లాహ్ కరుణ కురిపించుగాక.      

الحمدُ للهِ يُعطِينا، ويَشكرُ لنا إن أَعطَينا، والصلاةُ والسلامُ على هادِينَا، أما بعدُ:

ఓ మక్కా నుండి హజ్ పూర్తి చేసి తిరిగి వచ్చిన హాజీలారా! మరియు అల్లాహ్ కొరకు సమృద్ధిగా ఖుర్బానీ చేసిన వారలారా!

కృతజ్ఞతతో పాటు అల్లాహ్ స్మరణ కూడా ఉండాలి. కాబట్టి మీ ప్రభువును ఎక్కువగా స్తుతించండి, ఆయనను ఎక్కువగా స్మరించండి. ఎందుకంటే మన ప్రభువు అయిన అల్లాహ్ (బఖర 2:200)లో ఇలా సెలవిచ్చాడు:

[فَإِذَا قَضَيْتُمْ مَنَاسِكَكُمْ فَاذْكُرُوا اللهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا]

“హజ్‌ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్‌ను స్మరించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్‌ను స్మరించండి.”

ఈ ఆయత్ హజ్ చేసిన వారికీ, ఖుర్బానీ చేసిన వారికీ సాధారణంగా వర్తిస్తుంది. ఇక్కడ “مَنَاسِكَكُمْ మనాసికకుమ్” అనే పదం ద్వారా హజ్ ఆచారాలు మరియు ఖుర్బానీ రెండూ ఉద్దేశించబడ్డాయి. (తఫ్సీర్ తబరీ 4/196).

అయితే, ఖర్చు చేయడానికి సామర్థ్యం లేని వారు, అంటే: ఖుర్బానీ చేయడానికి ధనం లేనివారు, హజ్ చేయడానికి మార్గం లేదా అవకాశం లేనివారి విషయానికి వస్తే — అలాంటి వారికి కూడా అల్లాహ్ వారి సత్సంకల్పాల కారణంగా హజ్ చేసినవారికి, ఖుర్బానీ చేసినవారికి ఇచ్చే ప్రతిఫలాల వంటి ప్రతిఫలాలను ప్రసాదించాలని మనం ప్రార్థిస్తున్నాము.

ఓ విశ్వాసులారా! ఎన్నో పుణ్యకాలాలు (మవాసిముల్ ఖైరాత్) ముగిసిన తరువాత కూడా ఇలా చెప్పబడుతుంది:

జిల్ హిజ్జా తొలిదశలో మనం శ్రద్ధగా ఆరాధనలు చేయడంలో అలసత్వం చూపి ఉంటే, జుముఆ (జుమ్మా) మరియు జమాఅత్ నమాజుల కోసం ముందుగానే వెళ్లడం, నడుచుకుంటూ వెళ్లడం వంటి కార్యాలకు ఎంతో గొప్ప ప్రతిఫలం ఉంది. వాటి పుణ్యం తరచూ లభించే అవకాశమూ ఉంది. (కనుక అశ్రద్ధగా ఉండకండి).

అలాగే, అరఫా రోజున ప్రభువు తన దాసులకు అత్యంత సమీపంగా ఉండే ఆ మహోన్నత సమయంలో మనం దుఆ చేయడంలో కొరత చేసి ఉంటే, ఇంకా మన ముందు దుఆల ద్వారాలు తెరిచి ఉన్నాయి; అల్లాహ్ ప్రసాదించే అనుగ్రహం కూడా కొనసాగుతూనే ఉంది. ప్రతి జుముఆ రోజున ఒక “స్వీకరించబడే ప్రత్యేక సమయం” (సాఅతుల్ ఇస్తిజాబా) ఉంటుంది. ఆ సమయంలో ముస్లిం చేసే దుఆ అల్లాహ్ అనుగ్రహంతో స్వీకరించబడుతుంది.

ఆ సమయం గురించి ఒక అభిప్రాయం ఏమిటంటే:

مَا بَيْنَ أَنْ يَجْلِسَ الْإِمَامُ إِلَى أَنْ تُقْضَى الصَّلَاةُ
ఇమామ్ మింబర్‌పై కూర్చున్న సమయం నుండి జుముఆ నమాజు పూర్తయ్యే వరకు ఉన్న సమయం.” (ముస్లిం 853).

మరొక అభిప్రాయం ప్రకారం:

آخِرَ سَاعَةٍ بَعْدَ الْعَصْرِ

అస్ర్ నమాజు తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఉండే చివరి ఘడియ.”
(అబూ దావూద్ 1048లో ప్రామాణికమైన (సహీహ్) ఆధారంతో పేర్కొనబడింది.)

కాబట్టి, ఒక పుణ్యకాలం ముగిసిపోయిందని నిరాశ చెందకుండా, అల్లాహ్ మన కోసం తెరిచి ఉంచిన ఇతర సత్కార్యాల ద్వారాలను ఉపయోగించుకోవాలి. ఆయన స్మరణ, దుఆ, జుముఆ మరియు జమాఅత్ నమాజుల ద్వారా నిరంతరం ఆయనకు చేరువ కావడానికి ప్రయత్నించాలి.

فاللهم اجعلنا منَ {الذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ.
ఫల్లాహుమ్మ జఅల్నా మినజ్ జాకిరీనల్లాహ కసీరన్ వజ్ జాకిరాత్.
ఓ అల్లాహ్! నిన్ను ఎక్కువగా స్మరించే పురుషులు మరియు స్త్రీలలో మమ్మల్ని కూడా చేర్చు.

اللهم لكَ الحمدُ كالذي تقولُ وخيرًا مما نقولُ
అల్లాహుమ్మ లకల్ హందు కల్లజీ తఖూలు వ ఖైరమ్ మిమ్మా నఖూల్
ఓ అల్లాహ్! నీవు నీ గురించి చెప్పుకున్న విధంగా, ఇంకా మేము చెప్పే స్తోత్రాల కంటే ఎంతో ఉత్తమమైన స్తోత్రాలన్నీ నీకే చెందుతాయి.

اللهم إنا عاجزونَ عن شُكرِكَ، فنُحيلُ إلى عِلمِكَ وفضلِكَ
అల్లాహుమ్మ ఇన్నా ఆజిజూన అన్ షుక్రిక్, ఫ నుహీలు ఇలా ఇల్మిక వ ఫద్లిక్
ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలకు తగిన విధంగా కృతజ్ఞతలు తెలపడానికి మేము అశక్తులము. కాబట్టి మా స్థితిని నీ జ్ఞానానికి మరియు నీ అపార కరుణకు అప్పగిస్తున్నాము.

اللَّهُمَّ وَهَبْتَنَا مَالًا، فَبَذَلْنَا مِنْهُ بِفَضْلِكَ نُسُكًا وَمَنْسَكًا
అల్లాహుమ్మ వహబ్తనా మాలన్, ఫ-బజల్నా మిన్హు బిఫద్లిక నుసుకన్ వ మన్సకా
ఓ అల్లాహ్! నీవు మాకు సంపదను ప్రసాదించావు. నీ అనుగ్రహంతోనే దానిలో కొంత భాగాన్ని ఖుర్బానీ మరియు ఇతర ఆరాధనా కార్యాల కోసం ఖర్చు చేయగలిగాము.

اللَّهُمَّ اكْتُبْنَا فِيمَنْ أُعْتِقَتْ رِقَابُهُمْ، وَكُفِّرَتْ خَطِيئَاتُهُمْ لِسَنَتَيْنِ.
అల్లాహుమ్మక్-తుబ్నా ఫీమన్ ఉతిఖత్ రిఖాబుహుమ్, వ కుఫ్ఫిరత్ ఖతీఆతుహుమ్ లిసనతైన్
ఓ అల్లాహ్! నరకాగ్ని నుండి విముక్తి పొందిన వారిలో మమ్మల్ని చేర్చు. అలాగే రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడిన వారిలో కూడా మమ్మల్ని చేర్చు.

اللَّهُمَّ احْفَظْ دِينَنَا وَبِلَادَنَا وَأَدِمْ أَمْنَنَا، وَادْحَرْ أَعْدَاءَنَا، وَأَجِبْ دُعَاءَنَا
అల్లాహుమ్మహ్-ఫజ్ దీననా వ బిలాదనా వ అదిమ్ అమ్ననా, వద్-హర్ అదాఅనా, వ అజిబ్ దుఆఅనా
ఓ అల్లాహ్! మా ధర్మాన్ని, మా దేశాన్ని రక్షించు. మా భద్రతను శాశ్వతంగా కొనసాగించు. మా శత్రువులను ఓడించు మరియు మా ప్రార్థనలను స్వీకరించు.

اللَّهُمَّ وَارْحَمْنَا وَوَالِدِينَا، وَهَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ
అల్లాహుమ్మర్-హమ్నా వ వాలిదీనా, వ హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత అయూన్
ఓ అల్లాహ్! మాపై మరియు మా తల్లిదండ్రులపై కరుణ చూపు. మా భార్యాభర్తలు మరియు మా సంతానం ద్వారా మా కళ్లకు చల్లదనాన్ని, ఆనందాన్ని ప్రసాదించు.

اللَّهُمَّ احْفَظْ وَسَدِّدْ إِمَامَنَا خَادِمَ الْحَرَمَيْنِ الشَّرِيفَيْنِ، الْمَلِكَ سَلْمَانَ بْنَ عَبْدِ الْعَزِيزِ، وَوَلِيَّ عَهْدِهِ الْأَمِينِ الْأَمِيرَ مُحَمَّدَ بْنَ سَلْمَانَ، وَارْزُقْهُمْ بِطَانَةَ الصَّلَاحِ وَالْفَلَاحِ

అల్లాహుమ్మహ్-ఫజ్ వ సద్దిద్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్ షరీఫైన్, అల్ మలిక సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, వ వలియ్య అహ్దిహిల్ అమీన్ అల్ అమీర ముహమ్మద్ బిన్ సల్మాన్, వర్జుఖుమ్ బితానతస్ సలాహి వల్ ఫలాహ్

ఓ అల్లాహ్! రెండు పవిత్ర మస్జిద్‌ల సేవకుడైన కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సఊద్ గారిని మరియు ఆయన విశ్వసనీయ యువరాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ గారిని రక్షించి, వారికి సరైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు. వారికి ధర్మపరులైన, యోగ్యులైన మరియు విజయాన్ని అందించే సహచరులను కల్పించు.

اللَّهُمَّ وَاجْزِهِمْ عَلَى خِدْمَةِ الْحَرَمَيْنِ وَرَاحَةِ الْحُجَّاجِ، وَاجْزِ جُنُودَنَا وَمُنَظِّمِي الْحَجِّ عَلَى مَسَاعِيهِمْ مَعَ ضُيُوفِ الرَّحْمَنِ

అల్లాహుమ్మజ్-జిహిమ్ అలా ఖిద్మతిల్ హరమైన్ వ రాహతిల్ హుజ్జాజ్, వజ్-జి జునూదనా వ మునజ్జిమిల్ హజ్జి అలా మసాఈహిమ్ మఅ దుయూఫిర్ రహ్మాన్

ఓ అల్లాహ్! హరమైన్ సేవకై మరియు హాజీల సౌకర్యార్థం కృషి చేస్తున్న వారికి ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించు. అలాగే అల్లాహ్ అతిథులైన హాజీల సేవలో శ్రమిస్తున్న మా సైనికులకు మరియు హజ్ నిర్వాహకులకు కూడా తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించు.

اللهم صلِ وسلمْ على عبدِكَ ورسولِكَ محمدٍ
అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మద్
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ పై నీ కరుణలను, శాంతిని మరియు ఆశీర్వాదాలను కురిపించు.

ఖతీబ్: షేఖ్ రాషిద్ బిన్ అబ్దుర్ రహ్మాన్ అల్ బిదాహ్. (అరబీ భాష)
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ హఫిజహుల్లాహ్ .
స్థలం: జామె షేఖ్ ఇబ్ను ఉసైమీన్ జుల్ఫీ, సఊది అరేబియ

అల్లాహ్ మార్గంలో వదలివేయబడిన ఆవుదూడ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

బనీ ఇస్రాయీల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు. అతను చాలా బీదవాడు. అయినప్పటికీ తన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నీతిగా, నిజాయితీగా సంపాదించే వాడు. అతను చేసిన ప్రతి పనీ అల్లాహ్ ప్రసన్నత పొందడానికే చేశాడు. ఎన్నడూ స్వార్థంకోసం, తన అభీష్టాల ప్రకారం నడుచుకోలేదు.

ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని చివరి పలుకులు, “అల్లాహ్! నా భార్యను, పసివాడైన నా కుమారుడిని, నా ఆస్తి అయిన ఆవుదూడను నీ సంరక్షణలో వదులుతున్నాను”. ఈ మాటలు పలికిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో, “ఆవుదూడను తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రమ్మన్నాడు.” అతను అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇస్రాయీల్ ప్రజల నడవడి గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలచుకోలేదు. వారు స్వార్థం, అత్యాశ నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు.

కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. అప్పుడు అతని తల్లి కుమారుడితో, “మీ నాన్నగారు ఒక ఆవు దూడను అడవిలో వదలివేయమని చెప్పారు. అల్లాహ్ పై భారమేసి వదిలేశాను. ఈ పాటికి ఆ దూడ పుష్టిగా ఎదిగి ఉంటుంది” అని చెప్పింది. ఆ కుమారుడు కాస్త ఆశ్చర్యంగా ఆ ఆవుదూడ ఎక్కడ ఉందని తల్లిని ప్రశ్నించాడు. తల్లి అతడితో, “మీ నాన్న గారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించు. అల్లాహ్ ను విశ్వసిస్తున్నానని చెప్పు. అల్లాహ్ పై  భారం వేసి ఆ ఆవుదూడను వెదుకు” అని చెప్పింది. ఆ కుమారుడు ఒక తాడును తీసుకుని అడవికి బయలుదేరాడు. అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి, “అల్లాహ్! ఇబ్రాహీమ్, యాఖుబ్ ల ప్రభువా! నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు” అని ప్రార్థించాడు. అతను తన చేతిని ఎత్తిన వెంటనే అతనికి ఒక ఆవు తన వైపు వస్తున్నట్లు కనబడింది. ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది. ఆ ఆవు మెడకు ఒక తాడు కట్టి అతను తనతో ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఆవు కూడా ఆ కుర్రాడిని తప్ప మరెవ్వరినీ తన వద్దకు రానిచ్చేది కాదు.

ఆ కుర్రవాడు కూడా తన తండ్రి మాదిరి పుణ్యాత్ముడు. సన్మార్గాన్ని అవలంబించేవాడు. కట్టెలు కొట్టడం ద్వారా జీవనోపాధి పొందేవాడు. తాను సంపాదించిన దానిని మూడు సమానభాగాలు చేసేవాడు. ఒక భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడు. ఒక భాగాన్ని తన సొంతం కోసం ఉపయోగించుకునేవాడు. ఒక భాగాన్ని దానధర్మాలకు ఉపయోగించేవాడు. రాత్రి సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకునేవాడు. రాత్రి ప్రథమ భాగంలో తన తల్లికి సహాయపడే వాడు. తర్వాతి భాగం ఆరాధనలో గడిపేవాడు. ఆ తర్వాతి సమయం నిద్రకు కేటాయించేవాడు.

ఈ కాలంలో ఒక సంపన్నుడు మరణించాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు. తండ్రి యావదాస్తి ఆ కుమారునికి లభించింది. కాని అతని బంధువులకు కొందరికి కన్నుకుట్టింది. రహస్యంగా ఆ యువకుడిని హత్య చేశారు. ఆ విధంగా ఆ యావదాస్తిని తాము కాజేయాలనుకున్నారు. మరణించిన ఆ యువకుని బంధువుల్లో ఈ హత్యతో ప్రమేయం లేనివారు ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చారు. హంతకుణ్ణి కనుగొనడానికి సహాయపడమని కోరారు. మూసా (అలైహిస్సలాం) వారికి సలహా ఇస్తూ, ఒక ఆవును కోసి దాని నాలుకను ఆ యువకుడి శరీరంపై ఉంచాలని చెప్పారు. ఆ నాలుక హంతకుని గురించి తెలుపుతుందని అన్నారు. మూసా (అలైహిస్సలాం) పరిహాసమాడుతున్నారని వాళ్ళు ఆయన్ను నిందించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “అల్లాహ్ శరణు! నేను అవివేకంగా వ్యవహరించను” అన్నారు. ఎలాంటి ఆవును కోయాలని వాళ్ళు ఆయన్ను ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, మరీ లేగదూడ కారాదు. అలా అని పూర్తిగా ఎదిగిన ఆవు కూడా కారాదు అన్నారు. మధ్యస్థంగా ఉన్న దానిని కోయాలని చెప్పారు. కాని వాళ్ళు ఆయన సలహాను పాటించే బదులు, ఆ ఆవు ఎలా ఉండాలని మరిన్ని వివరాలు అడగడం ప్రారంభించారు. “ఆ ఆవు రంగు ఎలా ఉండాలి?” అని అడిగారు. “పసుపు రంగు కలిగినదై ఉండాలి” అన్నారు మూసా (అలైహిస్సలాం). అయినా వారికి తృప్తి కలుగలేదు. మరిన్ని వివరాలు చెప్పమని అడిగారు. “ఆ ఆవు దుక్కి దున్నినది కారాదు. కాడి లాగినది కారాదు. నీళ్ళు తోడడానికి ఉపయోగించినది కారాదు. ఎలాంటి మచ్చలు ఉండరాదు” అన్నారు మూసా (అలైహిస్సలాం).

అలాంటి ఆవు కోసం వాళ్ళు వెదుకుతూ బయలుదేరారు. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు ఒకే ఒక్కటి దొరికింది. ఆ ఆవు అనాధ యువకుడి వద్ద ఉన్న ఆవు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు అమ్ముతావని ప్రశ్నించారు. ఆ యువకుడు తన తల్లితో అడిగి చెబుతానని అన్నాడు. వారంతా కలసి అతని ఇంటికి వచ్చి అతని తల్లితో మాట్లాడారు. ఆ ఆవుకు బదులుగా మూడు బంగారు నాణేలు ఇస్తామన్నారు. కాని ఆమె ఆ ప్రతిపాదనకు తిరస్కరించింది. వాళ్ళు ఆ ఆవు ధర పెంచుతూ పోయారు. కాని ఆమె అంగీకరించలేదు. చివరకు వాళ్ళు ఆమెను ఒప్పించమని యువకుడిని కోరారు. కాని అతడు అందుకు ఒప్పుకోలేదు. “నా తల్లి ఒప్పుకోకపోతే ఆవును అమ్మేది లేదు.. మీరు ఆవు ఎత్తు బంగారం ఇచ్చినా అమ్మను” అన్నాడు. ఈ మాటలు విన్న అతడి తల్లి చిరునవ్వుతో, “అంత సొమ్ము ఇవ్వండి.. ఆవు ఎత్తు బంగారం ఇచ్చి అవును తీసుకువెళ్ళండి” అంది. చివరకు వాళ్ళు ఆ గుర్తులన్నీ ఉన్న ఆవు అదొక్కటే కాబట్టి ఆవు ఎత్తు బంగారం ఇచ్చి కొనుక్కున్నారు. (2: 67-74)

అల్లాహ్, ఆ యువకుడి తండ్రి తనకు అప్పగించిన దానిని తల్లి పట్ల సేవా భావం, దానగుణం కలిగి ఉన్న ఆ యువకునికి అనుగ్రహించాడు. అల్లాహ్ ను విశ్వసించాలని కుమారుడికి బోధించిన ఆ తల్లినీ అనుగ్రహించాడు. ఈ పూర్తి వృత్తాంతం – దైవవిశ్వాసం విషయంలో ఇస్రాయీల్ ప్రజలకు, మూసా ప్రవక్తకు ఒక పాఠంగా నిలిచింది.

మరో ముఖ్యమైన పాఠం ఏమంటే, మూసా (అలైహిస్సలాం) వారికి ఒక అవును కోయాలని చెప్పారు. ప్రత్యేకమైన ఆవు అని చెప్పలేదు. కాని వాళ్ళు ఇంకా వివరాలు కావాలని ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనవసరమైన ప్రశ్నలు వేశారు. వాళ్ళు ఈ రంధ్రాన్వేషణ చేయకుండా చెప్పిన విధంగా ఒక ఆవును కోసి ఉన్నట్లయితే వారికి ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కాని అనవసరమైన ప్రశ్నల వర్షం వల్ల వారికి ఆ ఆవు చాలా ఖరీదైన ఆవుగా మారింది.

(నీతి: గుచ్చిగుచ్చి అడగడం అన్నది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది)

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్

https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/