మానవత్వం అల్లాహ్ కొరకే https://youtu.be/aS8CHrYu_xc [23 నిముషాలు] ఉర్దూ మూలం: షేఖ్ ముహమ్మద్ ముఆజ్ అబూ కుహాఫా తెలుగు అనువాదం: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ
“మానవత్వమే ముందు” అనే ఆధునిక నినాదాన్ని ఖండించడం:
నేటి సమాజంలో (ముఖ్యంగా భారతదేశం లాంటి బహుళ మతాలున్న దేశంలో) “మతం, దేవుడిపై విశ్వాసం అనేది తర్వాత… మానవత్వమే (ఇన్సానియత్) అన్నిటికంటే ముందు” అనే ఒక కొత్త సిద్ధాంతం బాగా వ్యాపించింది. దానధర్మాలు చేయడం, తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, సాటి మనుషులకు లేదా జంతువులకు సహాయం చేయడం వంటి సత్కార్యాలను కేవలం ‘మానవత్వం’ అనే కోణంలోనే చూస్తున్నారు. దీనికి మతంతో, దేవుని విశ్వాసంతో సంబంధం లేదని ప్రజలు అనుకుంటున్నారు. వక్త దీనిని తీవ్రంగా ఖండించారు. అందరితో కలిసిమెలిసి ఉండటం మంచిదే అయినప్పటికీ, ఇస్లామిక్ విశ్వాసాల (ఈమాన్) హద్దులు దాటి “మానవత్వమే గొప్పది” అని అనుకోవడం పూర్తిగా తప్పు అని ఆయన స్పష్టం చేశారు.
ఈమాన్ (విశ్వాసం) లేకుండా మానవత్వానికి పరలోకంలో విలువ లేదు:
ఇస్లాం దృష్టిలో ‘మానవత్వం’ అనేది ‘ఈమాన్’ (విశ్వాసం) కు లోబడి ఉండాలి. అల్లాహ్ ను విశ్వసించకుండా, అల్లాహ్ ప్రసన్నతను ఆశించకుండా కేవలం సమాజంలో మంచి పేరు కోసం లేదా సానుభూతితో ‘మానవత్వం’ పేరుతో చేసే ఏ మంచి పనికైనా అల్లాహ్ వద్ద ఎలాంటి పుణ్యం (ప్రతిఫలం) దక్కదు. దేవుణ్ణి నమ్మని వారు కూడా సాటి మనుషులకు సహాయం చేస్తారు, కానీ పరలోకంలో అది వారిని నరకం నుండి రక్షించలేదు (నజాత్ ఇవ్వలేదు). అబ్దుల్లాహ్ బిన్ జుదాన్ లాంటి వారు అజ్ఞాన కాలంలో పేదలకు ఎంతగానో సహాయం చేసినా, అల్లాహ్ పై విశ్వాసం లేని కారణం చేత అది అతనికి లాభించదు అని ప్రవక్త (స) చెప్పిన విషయాన్ని వక్త దీనికి ఉదాహరణగా చూపించారు.
కర్మలన్నీ అల్లాహ్ కోసమే (ఇఖ్లాస్ / చిత్తశుద్ధి) జరగాలి:
ఒక ముస్లిం జీవితంలో అతిపెద్ద సంపద అల్లాహ్ పై విశ్వాసం, ఆయనతో ఉన్న సంబంధం, మరియు చిత్తశుద్ధి (ఇఖ్లాస్). మనం చేసే ప్రతి మంచి పని వెనుక “అల్లాహ్ ను మెప్పించాలి” అనే ఏకైక ఉద్దేశ్యం ఉండాలి. దారిలో ఉన్న ఒక రాయిని పక్కకు తొలగించినా, ఎవరికైనా చిరునవ్వుతో దారి చూపించినా అది “కేవలం మానవత్వం కోసమే చేశాను” అనుకోకుండా, “నా అల్లాహ్ కు ఇది ఇష్టం, అల్లాహ్ కోసం చేశాను” అని భావించాలి. గుహలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు “మేము కేవలం నీ కోసమే చేసిన పనుల (సత్కార్యాల) ద్వారా నిన్ను వేడుకుంటున్నాము” అని అల్లాహ్ ను అడిగినప్పుడే వారి ప్రార్థన అంగీకరించబడింది.
ముస్లింల ఆత్మగౌరవాన్ని మరియు గుర్తింపును కాపాడటం:
పాశ్చాత్య లేదా ఇతర మతాల ప్రభావంతో ఇస్లామిక్ నిఘంటువులోకి చేరిన ‘మానవత్వం’ (ఇన్సానియత్) అనే పదం ముస్లింలను తమ మత విశ్వాసాల నుండి దూరం చేస్తోందని వక్త ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ వ్యక్తికి ఈమాన్ చచ్చిపోయింది కానీ మానవత్వం బతికే ఉంది” అని ముస్లింలు అనడం మానేయాలని, ఎందుకంటే ఈమాన్ లేని మానవత్వం ఆధ్యాత్మికంగా నిర్జీవమైనదని ఆయన స్పష్టం చేశారు.
ఒక అవసరం తీరాలనే ఉద్దేశ్యంతో ప్రవక్త (ﷺ) పై సలాహ్ పంపితే, ఆ అవసరం నెరవేరుతుందనేది ప్రామాణికమైన (ఆథెంటిక్) విషయమేనా?
షేఖ్ అరఫాత్ ఇబ్న్ హసన్:
అవును. ఎవరైతే అల్లాహ్ తమ అవసరాన్ని తీర్చాలని కోరుకుంటారో, వారు ప్రవక్త (ﷺ) పై తరచుగా ఎక్కువగా సలాహ్ పంపాలి. దీనికి సంబంధించి ఒక ‘సహీహ్’ (ప్రామాణిక) హదీసు ఉంది.
ప్రవక్త (ﷺ) ఒకసారి ఉబయ్ ఇబ్న్ కఅబ్ (రజియల్లాహు అన్హు) తో మాట్లాడారు, ఆయన ఎక్కువగా ప్రార్థిస్తూ మరియు (ప్రవక్త పై) సలాహ్ పంపుతూ ఉండేవారు. ఆయన (ఉబయ్) ఇలా అడిగారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా, నా దుఆ (ప్రార్థన) లో మీపై సలాహ్ పంపడానికి నేను ఎంత సమయాన్ని కేటాయించాలి?” ప్రవక్త (ﷺ) ఇలా బదులిచ్చారు: “నీ ఇష్టం (ఎంతైనా చేసుకోవచ్చు), కానీ నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే అది నీకే మరింత మంచిది.” ఉబయ్ (రజియల్లాహు అన్హు) ఆ సమయాన్ని మరింత పెంచుకుంటూ పోయి చివరకు ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా, నేను నా ప్రార్థన (దుఆ) అంతటినీ మీపై సలాహ్ పంపడానికే కేటాయిస్తాను.” (అప్పుడు) ప్రవక్త (ﷺ) ఇలా అన్నారు: “అయితే నీ కష్టాలన్నీ (విచారాలు) తీర్చబడతాయి మరియు నీ పాపాలు క్షమించబడతాయి.”
ఈ హదీసు ఇమామ్ తిర్మిజీ ప్రకారం ‘హసన్’ (ఆమోదయోగ్యమైనది).
ఒక వ్యక్తి దుఆ చేస్తూ (ప్రవక్తపై సలాహ్ పంపినప్పుడు), అల్లాహ్ వారి అవసరాన్ని నెరవేరుస్తాడని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యమని పండితులు అన్నారు — ఎందుకంటే మనిషికి విచారం (కష్టం) అనేది ఒక అవసరం తీరకపోవడం (లేదా ఒక ఆవశ్యకత) వల్లే వస్తుంది.
ఈ ప్రసంగంలో నరకవాసుల ఆహారం మరియు పానీయాల గురించి వివరించబడింది. జఖూమ్, దరీ, మరియు ఘిస్లీన్ వంటి భయంకరమైన ఆహార పదార్థాలు, అలాగే అల్ ముహ్ల్, హమీమ్, ఘస్సాఖ్ మరియు సదీద్ వంటి పానీయాలు నరకంలో పాపాత్ములకు ఎలా ఇవ్వబడతాయో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. నరకవాసుల వస్త్రాల గురించి మరియు అహంకారులకు కలిగే శిక్షల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. మనిషి ఈ లోకంలో చేసే పాపాల నుండి దూరంగా ఉండి, నరక శిక్ష నుండి తప్పించుకోవాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అల్ హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మ బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా! నరకవాసులకు ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో దాని గురించి తెలుసుకుంటూ జఖూమ్ (జముడు వృక్షం) గురించి మనం గత కార్యక్రమంలో తెలుసుకున్నాము.
ఇక రెండో రకమైన ఆహారం వారికి ఇవ్వబడేది ‘దరీ‘. దీని ప్రస్తావన సూరహ్ గాషియాలో వచ్చి ఉంది. దరీ ఒక చెట్టు, దానికి ముళ్లు ఉంటాయి. అందులో చాలా దుర్వాసన ఉంటుంది మరియు దానివల్ల ఆకలి అనేది మనిషికి దూరం కాదు. అలాంటిది ఆ రోజు నరకవాసులకు తినడానికి ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలిపాడు:
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ (లైస లహుమ్ త’ఆమున్ ఇల్లా మిన్ దరీ’. లా యుస్మిను వలా యుగ్నీ మిన్ జూ’) వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు.అది వారిని లావుగానూ చేయదు, వారి ఆకలిని కూడా తీర్చదు. (88:6-7)
ఇలాంటిది వారికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో విషయం ఏదైతే వారికి ఆహారంగా ఉంటుందో అది ‘ఘిస్లీన్‘. దీని ప్రస్తావన సూరహ్ హాక్కా లో వచ్చి ఉంది. ఘిస్లీన్ అంటే రక్తము మరియు పుండు నుండి వెళ్ళే పదార్థము. అది నరకవాసుల పుండ్ల నుండి వారికి అగ్ని తగలడం వల్ల అక్కడ నుండి ఏదైతే చీము కారుకుంటూ వస్తుందో అది. ఇది ఎలాంటి వారికి ఆహారం అవుతుంది? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ హాక్కా లో తెలుపుతూ:
فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ (ఫలైస లహుల్ యౌమ హాహునా హమీమ్. వలా త’ఆమున్ ఇల్లా మిన్ గిస్లీన్) “కాబట్టి ఈ రోజు ఇక్కడ వీడి (స్థితిపై సానుభూతి చూపే) స్నేహితుడెవడూ లేడు.గాయాల కడుగు నీరు తప్ప మరొకటేదీ వీడికి ఆహారంగా లభించదు” (69:35-36)
అల్లాహ్ మనందరినీ ఆ ఘిస్లీన్ నుండి కూడా కాపాడుగాక. ఇమామ్ ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి తెలిపారు: ఘిస్లీన్ అంటే నరకవాసుల చెమట, చీము అవన్నీ కలిపి వచ్చే పదార్థాలు అని.
అంతే కాకుండా మరో భయంకరమైన, వింటేనే వికారం కలిగేటటువంటి విషయం ఏమిటంటే ఏ వ్యభిచారిణీలను నరకంలో వేయడం జరుగుతుందో వారి యొక్క మర్మాంగాల నుండి వచ్చే చెడు, అలాంటిది కొందరి పాపాత్ములకు ఆహారంగా ఉంటుంది. అల్లాహ్ మనందరికీ అలాంటి చెడు విషయాల నుండి రక్షణ కలిగించుగాక. ఇక్కడ ఇంత చెడు ఉంటుందా అని అడ్డప్రశ్నలు వేసి మరింత విశ్వాసాన్ని పాడు చేసుకునే దానికి బదులు మనం నరకంలో తీసుకెళ్లే పాపాల నుండి దూరం ఉండటం మేలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి.
అయితే మహాశయులారా! ఈ రకరకాల ఆహారాల గురించి ఏదైతే ప్రస్తావన వచ్చిందో, జఖూమ్ గాని, ఘిస్లీన్ గాని లేదా దరీ గాని మరియు కొన్ని ఆయతులలో ‘జా గుస్సహ్’ అనే ఒకటి ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వివిధ రకమైన ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే సందర్భంలో ఇవ్వబడతాయా? వేరువేరు సందర్భాల్లో ఇవ్వబడతాయా? మరియు ప్రతి ఒక్కటి ఒక రకమైన పాపాత్ములకు ఇవ్వబడుతుందా? ఇవన్నీ వివరాలు పరలోకంలో అల్లాహ్ కు బాగా తెలుసు. ఇవన్నీ కూడా పరలోక విషయాలు వాటి వివరాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ మనం వాటి ద్వారా అర్థం చేసుకునే విషయాలు ఏమిటంటే ఏ పాపాలకు కూడా ఎలాంటి అవిశ్వాసానికి కూడా మనం గురి కాకూడదు మరియు సత్యాన్ని తిరస్కరించకూడదు. వీటన్నిటిలో ఏ ఒక్క చెడైనా గాని మనల్ని నశింపచేయడానికి, మనల్ని అవమానపరచడానికి మహా ఎక్కువగా ఉంటుంది. అందుగురించి మనం సత్యాన్ని స్వీకరించి నరకం నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి. ఇదే మన గురించి ఇందులో ఉన్నటువంటి గొప్ప బోధ.
నరకవాసుల పానీయాలు
ఇక రండి మహాశయులారా! వారికి త్రాగడానికి ఇవ్వబడే పానీయాలు ఎలాంటివి అవి కూడా కొంచెం మనం తెలుసుకుందాము. అయితే ఎప్పుడైతే వారికి దాహం కలుగుతుందో అప్పుడు కొన్ని జంతువులు దాహంతో తల్లడిల్లుతూ దూరం నుండి నీళ్లను చూస్తే పిచ్చివారిగా ఎలా పరిగెత్తుతాయో, వారు పరిగెత్తడంలో ఒకరిని ఒకరు త్రోసుకుంటూ మరియు ఎటువైపున ఏ నష్టం జరుగుతుందో ఏమాత్రం ఆలోచించకుండా ఒకే వైపున పరిగెడతారో అలా ఆ రోజు నరకవాసుల పరిస్థితి అవుతుంది.
وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا (వనసూఖుల్ ముజ్రిమీన ఇలా జహన్నమ విర్దా) అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము (19:86)
ఇంకా ఆ రోజు దాహం ఎక్కువగా ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ నరకవాసులకు స్వర్గవాసులు సేవిస్తున్న పానీయాలు కూడా చూపించడం జరుగుతుంది. అప్పుడు వారు అరుస్తారు:
నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, “మాపైన కొద్దిగా నీళ్ళయినా పోయండి లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తయినా ఇటు పడేయండి” అని ప్రాధేయ పడతారు. దానికి సమాధానంగా వారు, “ఈ రెండింటినీ అల్లాహ్ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు” అని అంటారు. (7:50)
ఇది ఎంతటి అవమానం గమనించండి. కళ్లారా చూస్తున్నాము వారు ఎంతో తీయటి నీళ్లు త్రాగుతూ ఆనందిస్తూ ఉన్నారు ఆ విషయం మనకు కనబడుతుంది. కనీసం ఒక బొట్టు నీళ్లు ఇవ్వండి అని అంటే మీకొరకు ఇది నిషిద్ధమని అక్కడ నుండి సమాధానం వస్తుంది అప్పుడు మనిషికి ఎంత బాధ కలుగుతుంది. ఆ రోజు అంత బాధ కలగకూడదు అంటే ఈ రోజు విశ్వాసం పై ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండాలి.
మహాశయులారా! నరకవాసులకు దాహం కలిగినప్పుడు ఇవ్వబడే పానీయాల విషయంలో ‘అల్ ముహ్ల్’ ఒకటి. అల్ ముహ్ల్ అంటే నూనె అడుగున నూనె యొక్క మడ్డి ఏదైతే ఉంటుందో దానిని అల్ ముహ్ల్ అంటారు. అయితే అదే ఒకవేళ బాగా కాగిన నూనె ఉండేదుంటే దాని యొక్క వేడి ఎంత ఉంటుందో, ఆ మడ్డి, మడ్డిలోని వేడి మీది నూనె కంటే మరీ ఘోరంగా ఉంటుంది. సూరహ్ కహఫ్ లో దాని ప్రస్తావన వచ్చింది.
وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ (వ ఇన్ యస్తగీసూ యుగాసూ బిమాయిన్ కల్ ముహ్ల్ యష్విల్ వుజూహ్) ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. (18:29)
ఎప్పుడైతే వారు త్రాగడానికి తమ ముఖానికి దగ్గరగా తీసుకుంటారో ముఖం యొక్క ఈ తోలు మొత్తం కాలిపోతుంది. అల్లాహు అక్బర్.
రెండో రకమైన పానీయం ‘హమీమ్‘. దీని ప్రస్తావన ఎన్నో సందర్భాల్లో వచ్చి ఉంది. ఉదాహరణకు:
لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ (లహుమ్ షరాబుమ్ మిన్ హమీమ్) వారి కొరకు మరిగే నీటి పానీయం ఉంది. (6:70)
وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ (వసుఖూ మాఅన్ హమీమన్ ఫఖత్త’ఆ అమ్’ఆఅహుమ్) మరియు మరిగే నీరు త్రాగించబడే వారికి (పోలిక ఉందా)? ఆ నీరు వారి పేగులను ముక్కలు ముక్కలు చేస్తుంది. (47:15)
హమీమ్ ఎలా ఉంటుంది దాని యొక్క వివరణ ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాం. నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో రెండో రకమైనది హమీమ్. దేనినంటారు నీళ్లు వేడికి ఎక్కి దాని యొక్క చివరి భాగం ఏదైతే ఉండగలుగుతుందో దానిని హమీమ్ అని అంటారు. ఎప్పుడైతే మనిషి అది త్రాగుతాడో కేవలం మీది శరీరం యొక్క పై భాగమే కాదు లోపలి భాగాన్ని కూడా అది చాలా చెడ్డమైన విధంగా పాడు చేస్తుంది. ఒకసారి సూరహ్ హజ్ లోని ఆయత నెంబర్ 19 మరియు 20 వినండి మరియు శ్రద్ధ వహించండి.
يُصَبُّ مِن فَوْقِ رُءُوسِهِمُ الْحَمِيمُ يُصْهَرُ بِهِ مَا فِي بُطُونِهِمْ وَالْجُلُودُ (యుసబ్బు మిన్ ఫౌఖి రుఊసిహిముల్ హమీమ్. యుస్ హరు బిహీ మా ఫీ బుతూనిహిమ్ వల్ జులూద్) సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది. దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి. (22:19-20)
అల్లాహ్ ఇలాంటి హమీమ్ నుండి మనందరినీ రక్షించుగాక.
ఇక మూడో రకమైన పానీయం అది ‘ఘస్సాఖ్‘. సూరహ్ నబా లో ‘హమీమన్ వ ఘస్సాఖ’ అని రెండు కలిపి వచ్చాయి, హమీమ్ మరియు ఘస్సాఖ్. హమీమ్ అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా! అతి వేడి. ఇక ఘస్సాఖ్ అన్నది దానికి ఆపోజిట్ విరుద్ధమైనది. చలి మరియు ఐస్ లో ఎంత ఎక్కువ చల్లదనం ఉండగలుగుతుందో దానికి మితిమీరినది. మరియు మనకు తెలుసు చల్లదనం మితిమీరిన రీతిలో ఉంటే అది కూడా మహా నష్టపరుస్తుంది. దానివల్ల కూడా మనిషి యొక్క శరీరంలో తోలు ఇదంతా కాలిపోతుంది మరియు అదంతా చిదిరిపోతుంది. విపరీతమైన చలి పడినప్పుడు పచ్చని చెట్లు కూడా నల్లగా అయినట్లు మనం చూస్తూనే ఉన్నాం.
ఈ విధంగా మహాశయులారా! నరకంలో ఒక భాగం వేడి ఉంది మరొక భాగం జమ్హరీర్ చల్లదనంలో మితిమీరినది ఉంది. అలాగే నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో కూడా హమీమ్ వేడిలో మితిమీరినదైతే ఘస్సాఖ్ చల్లదనంలో మితిమీరినది.
మహాశయులారా! నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో నాలుగో రకమైనది ‘సదీద్‘. సదీద్ అంటే రక్తము మరియు చీము ఇవన్నీ కలిపి ఏదైతే వస్తుందో దానినంటారు. ఇది కూడా కొందరి నరకవాసులకు త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది కానీ పరిస్థితి ఎలా ఉంటుంది? సూరహ్ ఇబ్రాహీమ్ ఆయత నెంబర్ 16, 17 లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలిపాడు.
وَيُسْقَىٰ مِن مَّاءٍ صَدِيدٍ يَتَجَرَّعُهُ وَلَا يَكَادُ يُسِيغُهُ (వయుస్ఖా మిన్ మాఇన్ సదీద్. యతజర్రఉహు వలా యకాదు యుసీగుహ్) అక్కడ అతడికి త్రాగటానికి చీము నెత్తురుతో కూడుకున్న నీరు ఇవ్వబడుతుంది. అతడు అతి కష్టమ్మీద ఒక్కొక్క గుక్కెడూ త్రాగుతాడు. కాని గొంతులోకి దించలేకపోతాడు. (14:16-17)
ఇక ఎవరైతే ఇహలోకంలో మత్తు సేవిస్తారో అలాంటి వారికి ఇలాంటి సదీద్ త్రాగించడం జరుగుతుంది అని హదీసుల ద్వారా తెలుస్తుంది. అయితే హదీసుల్లో సదీద్ అన్న పదం కాకుండా ‘తీనతుల్ ఖబాల్’ అన్న పదం వచ్చి ఉంది. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు మరియు చీము అని దాని వివరణ తెలిపారు.
అయితే మహాశయులారా! నరకంలో ప్రవేశించకూడదు ఇలాంటి శిక్షలు మనం పొందకూడదు అంటే ఇహలోకంలో ఇలాంటి పాపాలకు కూడా మనం దూరం ఉండాలి.
అలాగే మహాశయులారా! ఎవరైతే ఇహలోకంలో అహంకారంతో జీవిస్తారో ఇతరులను చాలా చిన్నగా చూసి తమకు తాము ఎంతో గొప్పవారని భావించుకుంటూ గర్వంతో పొగరుబోతుతనం వహిస్తారో ప్రళయ దినాన వారు ఏ స్థితిలో వస్తారో మరియు వారికి ఏమి త్రాగించడం జరుగుతుందో ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో తెలిపారు. ఆ హదీసు జామె తిర్మిజి లో ఉంది షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్ లో పేర్కొన్నారు. ‘ప్రళయ దినాన అహంకారులను చీమల పరిమాణంలో తీసుకురావడం జరుగుతుంది. అన్ని వైపుల నుండి వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది మరియు ఒక రకమైన జైలులో బందిఖానాలో వారిని తోలుకుపోవడం జరుగుతుంది. అక్కడ వారికి తీనతుల్ ఖబాల్ త్రాగించడం జరుగుతుంది. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు చీముతో కూడి ఉన్న ఒక పదార్థం అని ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.’
అయితే నరకవాసులు నరకంలో హమీమ్, ఘస్సాఖ్, ఘిస్లీన్, సదీద్, తీనతుల్ ఖబాల్ ఇవన్నీ అవి అంత చెడుగా ఉన్నప్పటికీ ఎందుకు త్రాగుతారు అని కూడా ఒక ప్రశ్న రావచ్చు. అయితే విషయం ఏమిటంటే వారికి ఎప్పుడెప్పుడు దాహం కలుగుతుందో వారికి ఎప్పుడెప్పుడు వేడి ఎక్కువ కలుగుతుందో కనీసం ఇలాంటి నీటితో మనం దాహం తీర్చుకుందాం అన్నటువంటి ఆలోచన వారికి ఉంటుంది. కానీ అది త్రాగడం వల్ల ఇంత నష్టం ఏర్పడుతుంది అని వారు ముందు ఊహించలేరు తర్వాత ఆ విషయం వారికి తెలిసి వస్తుంది. అయితే మహాశయులారా! వారు త్రాగడానికి ఏదైతే ఇలాంటి పానీయాలు ఇవ్వబడతాయో వాటిని వారు ఎలా త్రాగుతారు? దాని యొక్క ప్రస్తావన కూడా ఖురాన్ లో వచ్చి ఉంది.
فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ (ఫషారిబూన షుర్బల్ హీమ్) దప్పికగొన్న ఒంటెలు త్రాగినట్లు మీరు దానిని త్రాగుతారు. (56:55)
మహా దాహం కలిగి ఉన్న ఒంటెలు ఎలా నీళ్లు చూసిన వెంటనే పరిగెడతాయో ఆ విధంగా వారు ఆ నీరు వైపునకు పరిగెడతారు.
నరకవాసుల వస్త్రాలు
నరకవాసులకు ఎలాంటి వస్త్రాలు ధరింపజేయబడతాయో దాని ప్రస్తావన కూడా ఖురాన్ హదీసులో వచ్చి ఉంది. సూరహ్ హజ్ లో అల్లాహ్ తెలిపాడు:
فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن نَّارٍ (ఫల్లజీన కఫరూ ఖుత్తిఅత్ లహుమ్ సియాబుమ్ మిన్నార్) అందుచేత అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. (22:19)
దుస్తులు కూడా నరకంలోనివే. ఇక ఎలా ఉంటుంది వారి పరిస్థితి గమనించండి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఒక బానిస ఉన్నాడు ఒక యుద్ధంలో. తెలియని ప్రదేశం నుండి ఒక బాణం వచ్చి గుచ్చుకుంది అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రజలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా షహీద్ అయిపోయాడు అమరవీరుడు అయ్యాడు అని మాట్లాడుతుండగా ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “అతడు యుద్ధ ఫలంలో నుండి మాలే ఘనీమత్ యుద్ధ ఫలంలో నుండి అనుమతి లేకుండా ఒక చాదర్ ఏదైతే తీసుకున్నాడో అది అతనిపై అగ్ని జ్వాలల్ని లేపుతుంది దానివల్ల అతనిపై అగ్ని నిప్పులు అనేటివి వచ్చి పడుతూ ఉన్నాయి“
అలాగే సోదరులారా! ఎవరైతే తమ బంధువుల్లో ఎవరైనా చనిపోతే వారిపై శోకం చేస్తారో వారి గురించి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “నౌహ చేసేవారు శోకం చేసేవారు ఒకవేళ వారు తౌబా చేసుకోకుంటే ప్రళయ దినాన వారిని లేపడం జరుగుతుంది వారి యొక్క శరీరంపై తార్ (డాంబర్) కు సంబంధించిన షర్ట్ ఉంటుంది మరియు వారి యొక్క పైజామా అనేది గంధకముతో చేయబడినదిగా ఉంటుంది“. ఇలా తార్ డాంబర్ తో చేయబడిన షర్ట్ మరియు గంధకముతో తయారు చేయబడిన పైజామా అంటే ఎంత వేడి ఎక్కుతుందో ఎలా శిక్ష వారికి ఉంటుందో వారికి ఏ దుస్తులైతే ధరింపజేయబడుతున్నాయో అవి కేవలం వారిని దాచి పెట్టడానికి వారి యొక్క ప్రదేశాలను రక్షణ కొరకు కాదు వాటి ద్వారా కూడా వారికి ఎంతో శిక్ష అనేది లభిస్తూ ఉంటుంది.
ఈ విధంగా సోదరులారా! వారి యొక్క ఆహారం, వారి యొక్క పానీయాలు, వారి యొక్క దుస్తులు ఇవన్నీ వివరాలు ఏదైతే వచ్చాయో ఎందుకు? మనం వాటి పట్ల భయపడి మనకు మనం ఆ నరకానికి దూరం ఉంచే ప్రయత్నం ఇహలోకంలోనే చేసుకోవాలి. అల్లాహ్ మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక.
హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే! తఖ్రీజ్: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ రహిమహుల్లాహ్, షోబా తహ్రీఖ్ వతాలీఫ్, దారుస్సలామ్, లాహోర్ తెలుగు అనువాదం, సమర్పణ: ఇక్రాముద్దీన్ ముహమ్మద్ పరిశీలన: షేఖ్ నసీరుద్దీన్ జామి’ ఈ మరియు సోదరులు అబ్దుల్ ఖాదిర్ హఫిజహుముల్లాహ్
“హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!” అనే ఈ పుస్తకం, ముస్లింల జీవితంలో ఖురాన్‌తో పాటు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులు (సున్నత్) కూడా అల్లాహ్ చేత అవతరింపబడిన దివ్యజ్ఞానమే (వహీ) అని స్పష్టంగా నిరూపిస్తుంది. ప్రవక్త ధర్మవిషయంలో ఏదీ తన ఇష్టానుసారం చెప్పలేదని, అవన్నీ వహీ ద్వారానే వచ్చాయని ఖురాన్ ఆయతుల ఆధారంగా గ్రంథకర్త వివరించారు. ఖిబ్లా మార్పు, ముగ్గురు వ్యక్తుల పశ్చాత్తాపం, ఉపవాసం, జకాత్ మరియు నమాజు విధానాలు వంటి అనేక విషయాలు ఖురాన్‌లో ప్రస్తావించబడినప్పటికీ, వాటి పూర్తి వివరాలు కేవలం హదీసులలోనే లభిస్తాయని ఉదాహరణలతో సహా నిరూపించారు. కేవలం ఖురాన్‌ను మాత్రమే నమ్ముతాము అని చెబుతూ “హదీసులను తిరస్కరించే వారి” (మున్కిరీనె హదీసు) వాదనలను ఖండిస్తూ, హదీసుల ప్రామాణికత లేకుండా దైనందిన ఇస్లామిక్ విధులను ఆచరించడం అసాధ్యమని ఈ పుస్తకం ఉద్ఘాటిస్తుంది.
హదీసు సంకలనం – అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్) [వీడియో] -హదీస్ అంటే అర్ధం? వివరణ -హదీస్ ప్రాముఖ్యత -హదీస్ ప్రస్తావన ఖుర్ఆన్ లో -హదీస్ అవసరం లేదు అన్నవారికి సమాధానం -హదీసులు కంఠస్తం చేసేవారికి శుభవార్త -వహీ ఎన్ని రకాలు?అవి ఏవి? -హదీసుల పట్ల ఉత్సాహం-ఖుర్ఆన్ తో పాటు ఇంకోటి ఇవ్వబడింది అదే హదీస్
సమస్త ప్రశంసలు అల్లాహ్ కే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి మరియు దీవెనలు అల్లాహ్ ప్రవక్తపై ఉండుగాక. నా సహోదర సహోదరీమణులారా, “ఒక ఇమామ్ జీవిత చరిత్ర” అనే సిరీస్ లోని కొత్త సెషన్‌కు మీకు స్వాగతం. ఈ రోజు మనం అల్లాహ్ చేత శాశ్వతమైన గుర్తింపు మరియు జ్ఞానపరమైన దీవెనలు పొందిన ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటాము. ఆయన ప్రపంచాన్ని ప్రకాశింపజేసిన ప్రకాశవంతమైన సూర్యుడు, పండితులకు ఆదర్శమూర్తి, న్యాయకోవిదులకు నాయకుడు, ప్రవక్తల వారసుడు, రబ్బానీ పండితుడు, హదీథ్ పండితుల గర్వకారణం, హదీథ్ విశ్వాసుల నాయకుడు, మరియు గొప్ప ఇమామ్: అల్-బుఖారీ. అల్లాహ్ ఆయనపై తన కరుణ కురిపించుగాక. అల్లాహ్ గ్రంథం (ఖురాన్) తర్వాత అత్యంత ప్రామాణికమైనదిగా ప్రసిద్ధి చెందిన పుస్తకాన్ని రచించినది ఆయనే. నిజానికి, అల్-బుఖారీ గురించి మాట్లాడాలంటే ఎన్నో సెషన్లు అవసరం, ఎందుకంటే ఈ పండితుడు జ్ఞాన దిగ్గజాలలో ఒక మహా దిగ్గజం మరియు ధార్మిక నాయకులలో ఒక ప్రముఖ ఇమామ్. నేను ఇమామ్ అల్-బుఖారీ జీవిత చరిత్ర, ఆయన పెంపకం మరియు ఆయన జీవితంలోని కొన్ని అంశాల గురించి క్లుప్తంగా వివరిస్తాను.
పేరు, వంశం మరియు ఆయన తండ్రి భక్తి
ఆయన పేరు అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయిల్ ఇబ్న్ ఇబ్రహీం ఇబ్న్ అల్-ముగీరా అల్-జుఫీ. నది ఆవల ఉన్న ప్రాంతాలలో ఒకటైన బుఖారా నగరానికి చెందినవాడు కావడం వల్ల ఇమామ్ అల్-బుఖారీకి ఈ పేరు వచ్చింది. ఆయన తాత బర్దజుబా (Bardazubah). కొంతమంది పండితులు ఈ పేరును ఉచ్చరిస్తూ ‘బ’ కు ఫత్హా, ‘ర’ కు సుకూన్, మరియు ‘ద’ కు కస్రా తో పలికారు. పర్షియన్ భాషలో “బర్దజుబా” అనగా “రైతు“. ఆయన పర్షియన్ జాతీయుడు మరియు మొదట తన ప్రజల మతాన్ని అనుసరించేవారు. ఆయన ముత్తాత అల్-ముగీరా విషయానికి వస్తే, ఆయన బుఖారాకు చెందిన యమన్ అల్-జుఫీ ద్వారా ఇస్లాం స్వీకరించారు, కాబట్టి ఇస్లాం ద్వారా ఏర్పడిన అనుబంధం కారణంగా ఆయనకు ఆ పేరు ఆపాదించబడింది. పండితులు అల్-బుఖారీ తండ్రి అయిన ఇస్మాయిల్ గురించి కూడా రాశారు. ఆయన హమ్మాద్ ఇబ్న్ జైద్ మరియు మాలిక్ ఇబ్న్ అనస్ నుండి హదీథులను ఉల్లేఖించారని, మరియు ఇరాక్ ప్రజలు ఆయన నుండి ఉల్లేఖించారని వారు పేర్కొన్నారు. ఆయన ఎంతో భక్తుడు. అహ్మద్ ఇబ్న్ హఫ్స్ ఇలా అన్నారు: “అబూ అబ్దుల్లాహ్ (అల్-బుఖారీ) తండ్రి ఇస్మాయిల్ మరణశయ్యపై ఉన్నప్పుడు నేను ఆయన వద్దకు వెళ్లాను. అప్పుడు ఆయన ‘నా సంపదలో చట్టవిరుద్ధమైన (హరామ్) ఒక్క దిర్హమ్ కూడా లేదని, కనీసం అనుమానాస్పదమైన ఒక్క దిర్హమ్ కూడా లేదని నాకు తెలుసు’ అని అన్నారు.” అల్-బుఖారీ తండ్రికి ఉన్న ఈ భక్తి మరియు నీతి యొక్క గొప్ప ప్రభావాలను చూడండి.
జననం, అనాథగా మారడం మరియు దృష్టి తిరిగి రావడం (అద్భుతం)
అల్-బుఖారీ హిజ్రీ సంవత్సరం 194లో షవ్వాల్ నెల 13వ తేదీ శుక్రవారం రాత్రి బుఖారా నగరంలో జన్మించారు. అల్-బుఖారీ చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో అనాథగా పెరిగారు. ఆయన తల్లి ఆయనను అత్యుత్తమ పద్ధతిలో పెంచారు. ఇమామ్ అల్-బుఖారీ జీవితం ప్రారంభం నుండి సులభంగా లేదా సౌకర్యవంతంగా లేదు; అది ఆశ్చర్యకరమైన మరియు బాధాకరమైన సంఘటనలతో నిండి ఉంది, అందులో అల్లాహ్ యొక్క ఒక గొప్ప ఆంతర్యం దాగి ఉంది. ఆయన జీవితంలోని ప్రధాన సంఘటనలలో ఒకటి ఏమిటంటే, ఆయన చిన్నతనంలోనే తన కంటిచూపును కోల్పోయారు. ఇది ఆయన తల్లిని తీవ్రంగా బాధించింది. తండ్రి సంరక్షణలో పెరగని ఈ అనాథ బిడ్డ పరిస్థితి చూసి ఆమె ఎంతగానో దుఃఖించింది. ఒక ధార్మిక మరియు దైవభీతి గల స్త్రీ అయిన ఆమె, ఆ బాధతో నిరంతరం అల్లాహ్ ను ప్రార్థించడం ప్రారంభించింది. అప్పుడు ఆమె కలలో ఇబ్రహీం (అలైహిస్సలాం) ప్రవక్తను చూసింది. ఆయన ఆమెతో ఇలా అన్నారు: “ఓ మహిళా, నీ నిరంతర ప్రార్థనల కారణంగా అల్లాహ్ నీ కుమారుడికి కంటిచూపును తిరిగి ప్రసాదించాడు.” ఆ తల్లి వెళ్లి చూడగా తన కుమారుడు స్వస్థత పొంది, అంధత్వం తొలగిపోయి దృష్టి తిరిగి రావడాన్ని గమనించింది. అల్లాహ్ ఆయనపై మరియు అల్-బుఖారీ తల్లిపై తన కరుణను కురిపించుగాక.
రెండు తోటల యజమాని కధ: అహంకారానికి అంతం వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/Z07VIyo51W0 [27 నిముషాలు]
ఈ ప్రసంగంలో, సూరత్ అల్-కహఫ్‌లో ప్రస్తావించబడిన “రెండు తోటల యజమాని” కథ ద్వారా అహంకారం (కిబ్ర్) యొక్క వినాశకరమైన పర్యవసానాలను వివరించబడింది. సంపద మరియు సంతానం అనేవి అల్లాహ్ నుండి వచ్చిన పరీక్షలని, వాటి పట్ల గర్వపడకుండా, ‘మాషా అల్లాహ్’ అంటూ వినమ్రతతో కృతజ్ఞత చూపాలని ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. సత్యాన్ని తిరస్కరించడం మరియు ఇతరులను తక్కువగా చూడటమే అహంకారం అని, దీనికి ఉదాహరణగా ఇబ్లీస్ మరియు ఖారూన్‌ల కథలు చెప్పబడ్డాయి. అహంకారం మనిషిని స్వర్గానికి దూరం చేస్తుందని హదీసుల ద్వారా హెచ్చరించబడింది. దీనికి విరుద్ధంగా, వినమ్రత అల్లాహ్ దృష్టిలో ఒక వ్యక్తి స్థాయిని పెంచుతుంది. చివరగా, అల్లాహ్‌ను స్మరించడం, పేదలతో గడపడం, మరియు వినమ్రతను అలవర్చుకోవడం ద్వారా అహంకారం నుండి రక్షణ పొందవచ్చని సూచించబడింది.
అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వలా ఉద్వాన ఇల్లా అలజ్జాలిమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
రెండు తోటల యజమాని అహంకారం
అభిమాన సోదరులారా, రెండు తోటల యజమాని: అహంకారానికి అంతం.
ఈ రెండు తోటల యజమాని అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ కహఫ్‌లో ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఈ రెండు తోటల అతని గురించి సూరత్ కహఫ్‌లో ఆయత్ 32 నుంచి 44 వరకు ఆ ప్రస్తావన ఉంటుంది.
(ఓ ప్రవక్తా!) వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు – వారిలో ఒకతనికి మేము రెండు ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికీ మధ్య పచ్చని పంట పొలాలను కూడా వొసగాము. (18:32)
ఈ విధంగా ఈ ప్రస్తావన ఆయత్ 44 వరకు ఉంటుంది.
అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి ఈ ఉదాహరణ వినిపించు అని అంటున్నాడు. అంటే ఏంటి ఈ ఉదాహరణ? దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి రెండు అందమైన తోటలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు, ఖర్జూరపు వృక్షాలు. మధ్యలో పంట పొలాలు, నీరు ప్రవహించే నదులు. అతనికి అపారమైన సంపద, కుటుంబ బలం ఉంది.
ఈ కారణంగా ఈ వ్యక్తి తన స్నేహితునితో గర్వంగా ఇలా అన్నాడు, “నా సంపద నీకంటే ఎక్కువ. నా కుటుంబ బలం నీకంటే ఎక్కువ. ఈ తోట ఎప్పటికీ నశించదు, ఖియామత్ రోజు కూడా రాదు.” ఒకపక్కన ఈ తోట మూలంగా గర్వపడుతున్నాడు. ఎప్పటికీ ఇలాగే ఈ తోటలు, ఈ ధనం ఇలాగే ఉండిపోతుంది అనే ఒక పక్కన గర్వపడతా ఉంటే, అదే గర్వంతో “ఖియామత్ కూడా రాదు. వచ్చినా కూడా నేను ఇక్కడి కంటే మంచి ఫలమే పొందుతాను” అని గర్వంలో ఉప్పొంగిపోతున్నాడు.
ఇది స్పష్టమైన అహంకారం, కిబ్ర్, మరియు అల్లాహ్‌పై అవిశ్వాసం. ఈ ధనవంతుడు ఇలా చెప్పాడు తన స్నేహితునితో, ఆ స్నేహితుడు పేదవాడు. ఈ ఉదాహరణలో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ, ఒక వ్యక్తి ఈ అహంకారి, గర్విష్ఠి, ఇంకో వ్యక్తి పేదవాడు కానీ విశ్వాసి, అల్లాహ్‌పై నమ్మకం గలవాడు.
ఈ గర్విష్ఠి చెప్పిన మాటలు విని తన స్నేహితుడు ఇలా అన్నాడు. వినమ్రంగా హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? “నీకు ఈ తోట ఇచ్చింది ఎవరు? అల్లాహ్ మాత్రమే కదా? మరి
مَا شَاءَ اللَّهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ (మాషా అల్లాహ్ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్) ‘అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు’(18:39)
అని చెప్పాలి కదా? అల్లాహ్ చిత్తమే, శక్తి అంతా ఆయనదే, అల్లాహ్ తలిస్తేనే జరిగింది, అల్లాహ్ ఇవ్వకపోతే ఎవ్వరూ ఇవ్వలేరు అని ఎందుకు చెప్పలేదు? నేను పేదవాడిని కావచ్చు, కానీ అల్లాహ్ నిన్ను శిక్షించవచ్చు, నీ గర్వానికి, నీ అహంకారానికి, నీ తిరస్కారానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శిక్షించవచ్చు” అని ఆ పేద స్నేహితుడు వినమ్రంగా అతనికి తెలియపరిచాడు.
కానీ ఏమైంది? అహంకారానికి అంతమైంది. కొద్ది కాలంలోనే ఒక విపత్తు వచ్చింది, ఆ తోటలు పూర్తిగా నాశనం అయ్యాయి, చెట్లు పడిపోయాయి, పంటలు కాలిపోయాయి. అప్పుడు ఆ రెండు తోటల యజమాని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోటలను నాశనం చేశాడో, చెట్లను ఇది చేసేసాడో, పంటలు కాల్చేశాడో, ఆ తర్వాత కుమిలిపోతూ, చేతులు మలుచుకుంటూ, పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు:
يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا (యా లయ్తనీ లమ్ ఉష్రిక్ బిరబ్బీ అహదా) “అయ్యో! నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేది!” (18:42)
ఇది కథ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ కహఫ్‌లో ప్రస్తావించిన కథ ఇది. రెండు తోటల యజమాని, అహంకారంతో విర్రవీగిపోయాడు, నాకు ఎప్పుడూ పేదరికం రాదు, ఇలాగే ధనవంతుడినిగానే నేను ఉంటాను, నా ధనం నాతోనే ఉంటుంది, నా పంటలు, నా పొలము ఇవన్నీ నాతోపాటే ఉంటాయి, ఇంకో పక్క ఖియామత్ అనేది ఏమీ లేదు అని చెప్పిన అహంకారి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొద్ది కాలం తర్వాత, నసీహత్ చేసేప్పుడు కూడా అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను నసీహత్ కూడా చేశాడు, మంచి మాటలు చెప్పాడు. అయినా కూడా అతని అహంకారానికి ఎటువంటి ఇది రాలేదు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని తోటలను పూర్తిగా నాశనం చేశాడు. అప్పుడు ఆయన నేను షిర్క్ చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని బాధపడుతూ కుమిలిపోయాడు. కానీ ఆలస్యమైపోయింది.
ఈ కథలోని ప్రధాన పాఠాలు
[1] అహంకారం పెద్ద పాపం: మొదటి విషయం, ఇస్లాం ధర్మంలో అహంకారం పెద్ద పాపం.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
అంటే స్వర్గ ప్రవేశానికి అర్హులు ఎవరు? ఆవగింజంతైనా కూడా కిబ్ర్, గర్వం అనేది ఉండనివాడు. కొంచెమైనా కిబ్ర్, గర్వం, అహంకారం ఉంటే అటువంటి వ్యక్తి స్వర్గానికి అర్హుడు కాదు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, చిన్నచూపు చూడటం.
[2] సంపద ఒక పరీక్ష మాత్రమే: రెండవ విషయం ఏమిటి ఈ కథలో, ఈ ఉదాహరణలో? సంపద అనేది ఒక పరీక్ష మాత్రమే.
అల్లాహ్ సంపదను అనుగ్రహంగా ఇస్తాడు, కానీ అది పరీక్ష కూడా అవుతుంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరత్ అన్ఫాల్‌లో:
وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ (వ’లమూ అన్నమా అమ్వాలుకుమ్ వ అవ్లాదుకుమ్ ఫిత్నహ్) మీ సిరిసంపదలు, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. (8:28)
సంపద ఉండటం తప్పు కాదు, సంపద మీద గర్వం చేసి అల్లాహ్‌ను మరిచిపోవడం తప్పు. ఇది గమనించాల్సిన విషయం.
[3] ‘మాషా అల్లాహ్’ అనే సంస్కారం:
మూడో విషయం ఏమిటి? అల్లాహ్ తక్కువ ప్రసాదించినా, ఎక్కువ ప్రసాదించినా, మరీ ఎక్కువ ప్రసాదించినా ‘మాషా అల్లాహ్’ అనే చెప్పే సంస్కారం కావాలి.
మాషా అల్లాహ్ అంటే కేవలం నాలుకతో కాదు, దాని అర్థాన్ని తెలుసుకుంటూ, దాని భావాన్ని తెలుసుకుంటూ, దానిని నిజాయితీగా నమ్ముతూ ఉండే ఆ సంస్కారం కలిగి ఉండాలి. మనకు ఏదైనా మంచి ఉన్నప్పుడు, మంచి జరిగినప్పుడు, ఇల్లు, వ్యాపారం, పిల్లలు, ఆరోగ్యం, అంతస్తు, హోదాలు, పదవులు, సంతోషాలు, సుఖాలు ఏవైనా సరే, అవి జరిగినప్పుడు ‘మాషా అల్లాహ్, ఇది అల్లాహ్ తరఫు నుంచే’. మనలో వినమ్రత పెంచుతుంది. ఇలా జరిగితే అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది ఇటువంటి భావన. అంటే ఈ సంపాదన అల్లాహ్ నాకు ప్రసాదించాడు, ఈ జ్ఞానం అల్లాహ్ నాకు ప్రసాదించాడు, సంతానం అల్లాహ్ నాకు ప్రసాదించాడు, ఈ హోదా అల్లాహ్ నాకు ఇచ్చాడు, ఈ పదవి అల్లాహ్ నాకు ఇచ్చాడు, ఇంత బంగారం, ఇంత ధనం, ఇంత పదవులు ఇవన్నీ అల్లాహ్ నాకు ఇచ్చాడు. కొంచెం కూడా గర్వం రాకూడదు. ఇటువంటి భావన ఉంటే, ఇది మనలో వినమ్రత పెంచుతుంది, అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది.
[4] ప్రాపంచిక జీవితం తాత్కాలికం:
నాలుగో విషయం ఏమిటి ఈ కథలో? ప్రాపంచిక జీవితం తాత్కాలికం. ఈ దునియా తాత్కాలికం.
ఈ కథ మనకు చెబుతోంది, దునియా జీవితం, ప్రాపంచిక జీవితం ఒక తోట లాంటిది. ఈ రోజు పచ్చగా ఉంటుంది, రేపు ఎండిపోతుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీని గురించి ఖురాన్‌లో తెలియజేశాడు, ప్రపంచపు జీవితం వర్షం లాంటిది. كَمَثَلِ غَيْثٍ (క-మసలి గైసిన్) సూరత్ హదీద్‌లో ఉంది. ఇది వర్షం లాంటిది, పంటలు పుష్కలంగా పెరుగుతాయి, తర్వాత ఎండిపోతాయి. కొన్ని రోజుల జీవితం కోసం గర్వపడకూడదు, అల్లాహ్‌ని మరిచిపోకూడదు, అహంకారంలో విర్రవీగకూడదు.
కావున, అభిమాన సోదరులారా, అహంకారం మహా పాపం, కిబ్ర్ చాలా చెడు, అల్లాహ్‌కు అసలు ఇష్టం ఉండదు.
వినమ్రత యొక్క గొప్పతనం
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
مَنْ تَوَاضَعَ لِلَّهِ رَفَعَهُ اللَّهُ (మన్ తవాద’అ లిల్లాహి రఫ’అహుల్లాహ్) ఎవరైతే వినమ్రతతో ఉంటారో అల్లాహ్ వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తాడు.
అలాగే, అసలైన ధనవంతుడు డబ్బు ఉన్నవాడు కాదు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
لَيْسَ الْغِنَى عَنْ كَثْرَةِ الْعَرَضِ، وَلَكِنَّ الْغِنَى غِنَى النَّفْسِ (లైసల్ గినా అన్ కసరతిల్ ‘అరది, వలాకిన్నల్ గినా గినన్-నఫ్స్) సంపద ఎక్కువ ఉండటం ధనికత కాదు, కానీ నిజమైన ధనికత హృదయ సంతృప్తి.
కావున ప్రియ సోదర సోదరీమణులారా, రెండు తోటల యజమాని కథ మనందరికీ ఇది ఒక హెచ్చరిక. అహంకారం నాశనానికి దారి తీస్తుంది. అల్లాహ్‌ను మరచిన సంపద నిలవదు. వినమ్రతే నిజమైన మహిమ. ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలికం, ఆఖిరత్, పరలోకం అది శాశ్వతం. మనకు ఉన్న ప్రతి అనుగ్రహానికి ‘అల్హమ్దులిల్లాహ్‘ అని చెప్పాలి, అది చిన్నదైనా పెద్దదైనా. మన హృదయంలో అహంకారం తొలగించాలి, అల్లాహ్ ముందు వినమ్రంగా జీవించాలి, ఇలా ఉండాలి ఒక విశ్వాసి.
అహంకారం అంటే ఏమిటి?
అభిమాన సోదరులారా, సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, ఇది ఎప్పుడు అవుతుంది? ఇదే కదా కిబ్ర్ అనేది, గర్వం అనేది, అహంకారం అనేది ఇదే కదా? నాకు ఉంది, అతనికి లేదు, నేను గొప్పవాడు, వాడు చిన్నవాడు, లేనివాడు, పేదవాడు అనేది ఈ ఒక రకమైన భావన కలిగి ఉండటమే అహంకారం, కిబ్ర్ అంటారు.
దీనికి ఉదాహరణ చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్లీసును ఆదం అలైహిస్సలాం ముందు సజ్దా చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తిరస్కరించాడు. కారణం ఏమిటి? అహంకారం.
أَنَا خَيْرٌ مِنْهُ (అన ఖైరున్ మిన్హు) నేను అతనికంటే శ్రేష్ఠుణ్ణి (7:12)
అన్నాడు. కానీ ఏం జరిగింది? ఇబ్లీస్ పతనానికి కారణం అహంకారం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు అహంకారులు ఇష్టం ఉండరు.
إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ (ఇన్నహూ లా యుహిబ్బుల్ ముస్తక్బిరీన్) నిశ్చయంగా ఆయన అహంకారులను ఇష్టపడడు. (16:23)
అల్లాహ్ ముందు వినమ్రత ఈమాన్ యొక్క లక్షణం.
అలాగే ఖారూన్ ఉదాహరణ ఉంది ఖురాన్‌లో. అతను ఏమన్నాడు ఖారూన్? “ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇందీ” అన్నాడు. నా దగ్గర ఉండే ఈ హోదా, ఈ ఆస్తిపాస్తులు, ఈ ఆనందాలు, ఈ భోగభాగ్యాలు, ఈ ధనం, ఈ ధనికత ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ‘అలా ఇల్మిన్ ఇందీ’, నా జ్ఞానం వల్ల నాకు లభించింది అని అన్నాడు. ఎందుకు అన్నాడు? గర్వం, అహంకారం. నాకు ఎవ్వరూ ఇవ్వలేదు, నా జ్ఞానం ఇది, నా శక్తి ఇది, నా ప్లాన్ ఇది, నేను చేశాను, నేను సంపాదించాను, నాది మాత్రమే అని అహంకారంతో అతను విర్రవీగాడు. ఫలితం ఏమైంది? అతను తన సంపదతో పాటు నేలలో ముంచబడ్డాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి కూడా నాశనం చేసేశాడు.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అహం ఉన్నవాడు, గర్వం గలవాడు, కిబ్ర్ ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశించలేడు. హృదయంలో రాయిగింజంత అహంకారం ఉన్నవాడు జన్నత్‌లో ప్రవేశించడు. (బుఖారీ మరియు ముస్లింలో హదీస్ ఉంది ఇది). ఒక సహాబీ ఈ హదీస్ విని ప్రవక్త గారిని అడిగారు, “ఓ దైవ ప్రవక్త, మనకు మంచి దుస్తులు, మంచి చెప్పులు ఇష్టం ఉండటం కూడా అహంకారమా?”. మంచి తొడగాలి అని మంచి దుస్తులు వేసుకున్నాము, మంచి చెప్పులు వేసుకున్నాము, ఇది కూడా అహంకారం కిందికి వస్తుందా? అని అడిగారు. దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, “అల్లాహ్ అందమైనవాడు, అందాన్ని ఇష్టపడతాడు”. అన్నారు. అంటే ఇది అహంకారం కాదు. అంటే మంచి దుస్తులు వేసుకోవడం ఇది అహంకారం కాదు, దాని మూలంగా ఇతరులను చిన్నచూపు చూడటం అది అహంకారం కిందికి వస్తుంది. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను, ఇతరులను తక్కువగా చూడటం.
రెండవది వినమ్రత, దీనికి విరుద్ధం. ‘మన్ తవాద అలిల్లాహ్’ – ఎవరైతే అల్లాహ్ కోసం వినమ్రత చూపుతాడో, ‘రఫాహుల్లాహ్’ – అల్లాహ్ వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు.
మూడవది, ఖియామత్ రోజున పరిస్థితి ఏంటి? అహంకారులు ఖియామత్ రోజు చిన్న చీమల వలె లేవనెత్తబడతారు. అంటే అక్కడ వారికి ఆ గౌరవం, ఎటువంటి గౌరవం ఉండదు కదా.
ఇస్లాంలో అహంకారం, కిబ్ర్ అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా తృణీకరించడం. ఇది అత్యంత నిషిద్ధమైన పాపం. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం హృదయంలో అణుమాత్రం గర్వం ఉన్నా స్వర్గ ప్రవేశం లభించదు. ఎందుకంటే గొప్పతనం అనేది అది అల్లాహ్‌కు మాత్రమే సొంతం.
“అహంకారంతో ప్రజల నుండి ముఖం తిప్పుకోకు. భూమిపై గర్వంతో నడవకు. అహంకారానికి, గొప్పలు చెప్పుకునేవాడిని అల్లాహ్ ప్రేమించడు” అని అల్లాహ్ సూరత్ లుఖ్మాన్‌లో తెలియజేశాడు.
అలాగే సూరత్ అన్-నిసాలో ఉంది, అహంకారంతో భూమిపై గర్వంగా నడిచేవారికి కఠినమైన శిక్ష ఉంటుందని ఖురాన్ హెచ్చరించింది (సూరత్ అన్-నిసా, ఆయత్ 173లో). అలాగే సూరత్ ఆరాఫ్‌లో ఉంటుంది, అహంకారులకు స్వర్గ ద్వారాలు తెరవబడవు (సూరత్ ఆరాఫ్, ఆయత్ 40).
అలాగే సహీహ్ ముస్లింలో హదీస్ ఉంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, హృదయంలో అణుమాత్రం అహంకారం ఉన్నవాడు స్వర్గములో ప్రవేశించడు.
కావున, అహంకారం యొక్క పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి.
స్వర్గం నుండి దూరం: గర్వం ఉన్నవారు స్వర్గం పొందలేరు, అంటే స్వర్గం నుంచి దూరం.
నరక శిక్ష: అహంకారుల నివాసం నరకం.
దైవ ప్రేమకు దూరం: అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు.
అహంకారం ఎందుకు ప్రమాదం అంటే, అది ఈమాన్‌ను బలహీనపరుస్తుంది, కంజోర్ చేస్తుంది. దుఆ అంగీకారం తగ్గుతుంది, దుఆ స్వీకరించబడటం తగ్గిపోతుంది. మనుషుల మధ్య విభేదాలు పెరుగుతాయి. అల్లాహ్ కోపానికి కారణం అవుతుంది.
ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి, అది ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక వ్యక్తికి ఈ ప్రాపంచిక జీవితంలో అన్నీ ఇచ్చాడు. ప్రతీదీ ప్రసాదించాడు. అందం, ఐశ్వర్యం, హోదా, పదవులు, డబ్బులు, ధనం, రాజకీయం, రాజ్యం, ప్రతీదీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి జ్ఞానం, బలం, శక్తి అన్నీ అల్లాహ్ ఇచ్చాడు, ఈమాన్ తప్ప. ఒక వ్యక్తికి ప్రపంచంలో ప్రతి వస్తువు దక్కింది, ప్రతి సంతోషం దక్కింది ప్రాపంచిక పరంగా, ప్రతి విషయం దక్కింది, అల్లాహ్ అన్నీ ఇచ్చేశాడు. అతనికి కష్టమే తెలీదు, బాధే తెలీదు, అంత బాగుంది. ఈమాన్ అల్లాహ్ అతనికి ఇవ్వలేదు.
ఇంకో వైపు అల్లాహ్ ఒక వ్యక్తికి ఏదీ ఇవ్వలేదు. డబ్బు లేదు, అందం లేదు, ధనం లేదు, హోదా లేదు, పదవి లేదు, ఇంకా సమస్యలు, అనారోగ్యం, బలహీనత, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు చాలా ఉన్నాయి. కానీ అల్లాహ్ అతనికి ఈమాన్ ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు.
మరి ఈ ఇద్దరి వ్యక్తులలో గొప్పవాడు ఎవరు? ధనికుడు ఎవరు? సాఫల్యం పొందేవాడు ఎవడు? రెండవ వ్యక్తే. ఈ ప్రాపంచిక జీవితంలో డబ్బు లేకపోయినా, సుఖం లేకపోయినా, తాత్కాలిక సుఖం లేకపోయినా, అందం ఐశ్వర్యం లేకపోయినా, ధనం, బలం ఇది లేకపోయినా కానీ అల్లాహ్ ఈ ప్రాపంచిక జీవితంలో విశ్వాసాన్ని ఇచ్చాడు, ఈమాన్‌ను ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు. ఇదే అసలైన సంపద, ఇదే అసలైన బలం, ఇదే అసలైన వస్తువు. ఎందుకు? ఇదే మనకు పనికి వచ్చేది మరణానంతర జీవితంలో, పరలోకములో, శాశ్వతమైన జీవితంలో. ఎందుకు? ఇక్కడ ఉన్నా లేకపోయినా మరణం తప్పదు. మరణం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? చెప్పలేము. ఈ రోజు రావచ్చు, రాత్రి రావచ్చు, రేపు రావచ్చు, ఒక రోజులో రావచ్చు, నెలలో రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలీదు. కొందరు పూర్తి జీవితం 20-30 సంవత్సరాలు స్వయంగా అనుభవించకుండా బాగా కష్టపడి, త్యాగాలు చేసి, రాత్రి పగలు అనకుండా త్యాగాలు చేసి సంపాదించి కూడా పెట్టారు భార్యాపిల్లల కోసం, హఠాత్తుగా మరణించారు. సంపాదించింది ఎవరు? అనుభవిస్తుంది ఎవరు? ఇది జీవితం. ఇక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇక్కడ అసలు ఏది కావాలి? అసలు ఈమాన్ కావాలి. దాని మూలంగా మరణానంతర జీవితం, పరలోకంలో శాశ్వతంగా సుఖంగా ఉంటాము.
అందుకోసం, రెండూ ఇస్తే అల్హమ్దులిల్లాహ్, ‘దాలిక ఫద్లుల్లాహి యు’తీహి మయ్యషా’ – అల్లాహ్ కొందరికి ఈమాన్‌తో పాటు ప్రపంచాన్ని, ప్రపంచంతో పాటు దీన్‌ను కూడా అల్లాహ్ ఇస్తాడు. అది ‘దాలిక ఫద్లుల్లాహ్’, అల్హమ్దులిల్లాహ్. కానీ అల్లాహ్ పరీక్ష నిమిత్తము, ఇంకో కారణము, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రాపంచిక జీవితంలో, ఇది పరీక్షతో కూడిన జీవితం కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందం విషయంలో, బలం విషయంలో, ధనం విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, సమాజ విషయంలో, ఉద్యోగ విషయంలో, రాజకీయ విషయంలో అనేక సందర్భాలలో, అనేక విషయాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెడుతూ ఉంటాడు. అది మనము సహనంతో, ఓర్పుతో మనము దానిని పరీక్షగా తీసుకుని విధేయతగా మనము జీవించే ప్రయత్నం చేయాలి.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష నిమిత్తం మనకు డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, అందం ఇచ్చాడు, పదవిని ఇచ్చాడు, అల్హమ్దులిల్లాహ్ బాగా ప్రసాదించాడు. గర్వపడకూడదు, కొంచెం కూడా మన మనసులో గర్వం రాకూడదు. అల్లాహ్ ప్రసాదించిన వాటిని మన మనసులో ఉండే భావన ఏమిటి? ఇది అల్లాహ్ ఇచ్చాడు, పరీక్ష కోసం ఇచ్చాడు. అందుకు దానధర్మాలు చేయాలి, ఫర్జ్ జకాత్ కాక ఇంకా నఫిల్ సదకాత్‌ను కూడా చేస్తూ ఉండాలి.
అహంకారం నుండి రక్షణ మార్గాలు
అభిమాన సోదరులారా, అహంకారం నుండి రక్షణ మార్గాలు:
అల్హమ్దులిల్లాహ్, మాషా అల్లాహ్ ఎక్కువగా చెప్పడం.
“మాషా అల్లాహ్ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అనే అలవాటు చేసుకోవడం.
సజ్దా ఎక్కువగా చేయటం.
పేదవాళ్ళతో కూర్చోవడం.
మనకు ఉన్నది అన్నీ అల్లాహ్ దయ అని గుర్తుపెట్టుకోవడం.
ఇవి మనము ఈ లక్షణాలు, గుణాలు కలిగి ఉండాలి. అభిమాన సోదరులారా, అహంకారం మనిషిని ఇబ్లీస్ స్థాయికి తీసుకువెళ్తుంది, వినమ్రత మనిషిని అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. మన హృదయంలో కిబ్ర్ లేకుండా తఖ్వా, వినమ్రతతో జీవిద్దాం.
అల్లాహ్ మన హృదయాలను శుద్ధి చేసి అహంకారం నుండి రక్షించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఉపవాసంలో మూడు స్థాయిలు ఉన్నాయి: సాధారణ ఉపవాసం, ప్రత్యేక ఉపవాసం మరియు అత్యంత ప్రత్యేక ఉపవాసం.
సాధారణ ఉపవాసం విషయానికి వస్తే, ఇది ఒకరు తమ కడుపు మరియు మర్మావయవాలను వాటి కోరికలను తీర్చుకోవడం నుండి నిగ్రహించుకోవడం.
ప్రత్యేక ఉపవాసం అంటే ఒకరి చూపు, నాలుక, చేతులు, కాళ్ళు, వినికిడి మరియు కళ్ళతో పాటు మిగిలిన శరీర అవయవాలను పాపపు పనులు (Gunah) చేయడం నుండి నిగ్రహించుకోవడం.
ఇక అత్యంత ప్రత్యేక ఉపవాసం విషయానికి వస్తే, ఇది ఇహలోక వ్యవహారాల పట్ల ఆరాటపడటం మరియు ‘అల్లాహ్’ కు దూరం చేసే ఆలోచనల నుండి హృదయాన్ని దూరంగా ఉంచడం. అలాగే ‘అల్లాహ్’ నిర్దేశించిన ఇతర విషయాలన్నింటి నుండి హృదయాన్ని దూరంగా ఉంచడం. [5]
ప్రత్యేక ఉపవాసం యొక్క లక్షణాలలో ఒకటి ఏమిటంటే, ఒకరు తమ చూపును తగ్గించుకోవడం (కాపాడుకోవడం) మరియు నిషిద్ధమైన, అయిష్టమైన లేదా ఎటువంటి ప్రయోజనం లేని అసహ్యకరమైన మాటల నుండి తమ నాలుకను కాపాడుకోవడం, అలాగే మిగిలిన శరీర అవయవాలను అదుపులో ఉంచుకోవడం.
‘అల్-బుఖారీ’ ఉల్లేఖించిన ఒక ‘హదీస్’లో:
‘‘ఎవరైతే అబద్ధపు మాటలను మరియు వాటిపై ఆచరణను విడిచిపెట్టరో, వారు తమ ఆహారాన్ని మరియు పానీయాలను విడిచిపెట్టడం పట్ల ‘అల్లాహ్’ కు ఎటువంటి అవసరం లేదు.’’ [6]
ప్రత్యేక ఉపవాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, రాత్రిపూట ఆహారంతో కడుపును నింపుకోకపోవడం. బదులుగా, అతను మితంగా తింటాడు. ఎందుకంటే, నిశ్చయంగా ఆదమ్ సంతానం (మనిషి) తన కడుపు కంటే చెడ్డ పాత్రను దేనినీ నింపడు. ఒకవేళ అతను రాత్రి మొదటి భాగంలో కడుపు నిండా తింటే, రాత్రి మిగిలిన భాగంలో అతను తనను తాను సద్వినియోగం చేసుకోలేడు (ఇబాదత్ చేయలేడు). అదే విధంగా, ఒకవేళ అతను ‘సుహూర్’ సమయంలో కడుపు నిండా తింటే, మధ్యాహ్నం వరకు అతను చురుగ్గా ఉండలేడు.
ఎందుకంటే మితిమీరిన ఆహారం బద్ధకాన్ని మరియు మత్తును కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడం వల్ల ఉపవాసం యొక్క అసలు ఉద్దేశ్యం దెబ్బతింటుంది. ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే “ఆకలి రుచిని ఆస్వాదించడం మరియు కోరికలను” వదిలివేసేవారిగా మారడం.
రిఫరెన్సులు:
[5] (ఎడిటర్ గమనిక: ఇక్కడ అదనపు వివరణ అవసరం. పేర్కొన్న స్థాయిలు నిగ్రహానికి (Abstinence – స్వీయ నియంత్రణకు) సంబంధించినవి.
ఈ మూడు స్థాయిలలో మొదటిది, తప్పనిసరిగా పాటించాల్సిన నిగ్రహాన్ని (Restraint) సూచిస్తుంది. ఇది నెరవేరినప్పుడు, ఆ వ్యక్తి చట్టపరమైన (షరియా) నిబంధనలను పాటించినట్లు పరిగణించబడుతుంది మరియు ఉపవాసం పూర్తయినట్లు లెక్కించబడుతుంది [అంటే, దానిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు లేదా ‘ఖజా’ చేయాల్సిన పనిలేదు, ఆ దాసుడు నిజంగానే ఉపవాసం ఉన్నట్లు.]
మిగిలిన స్థాయిలు ఉపవాసం యొక్క విలువకు సంబంధించినవి. రెండవ స్థాయిని పాటించకపోతే, పాటించినప్పటి కంటే ఆ దాసుడికి ఉపవాసం యొక్క విలువ తక్కువగా ఉంటుంది. మూడవ స్థాయి విషయంలోనూ అంతే.
అందుకే, కావాలని తినడం మరియు సంభోగం చేయడం వల్ల ఉపవాసం భంగం అవుతుందని (చెల్లదని) చెప్పబడింది. అయితే అబద్ధం చెప్పడం, పరాయి వారిని కామంతో చూడటం వంటి ఇతర నిషిద్ధ పనులు చేయడం పాపంగా పరిగణించబడుతుంది, కానీ అవి ఉపవాసాన్ని పూర్తిగా భంగం చేయవు.
జీవనోపాధికి ఎనిమిదవ ద్వారం: అస్-సదకాత్ (స్వచ్ఛంద దానాలు):
దానధర్మాలు మరియు నఫకాత్ (క్రమం తప్పకుండా చేసే ఖర్చు) – అంటే మీ కోసం, మీ భార్య, పిల్లలు, మీ తండ్రి, మీ తల్లి, మీ అత్తమామలు, సద్వర్తనులైన పొరుగువారు, కుమారులు, కుమార్తెలు, బంధువులు, విధవలు మరియు అనాథల కోసం మీరు చేసే ఖర్చు – ఈ రకమైన దానం అల్లాహ్ దృష్టిలో చాలా గొప్పది. ఇది జీవనోపాధిని (రిజ్క్ ను) కూడబెట్టే సాధనం మరియు ఉపాధి మార్గాలలో ఒక ద్వారం.
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
“ప్రతి రోజూ ఉదయం ప్రజలు నిద్రలేచినప్పుడు ఇద్దరు దేవదూతలు దిగివస్తారు. వారిలో ఒకరు, ‘ఓ అల్లాహ్, దానం చేసేవారికి (తగిన) ప్రతిఫలాన్ని ఇవ్వు,’ అని, మరొకరు ‘ఓ అల్లాహ్, (ధనాన్ని) పట్టి ఉంచుకునేవాడిని (పిసినారిని) నాశనం చేయి‘ అని ప్రార్థిస్తారు.”
[అల్-బుఖారీ, 1374; ముస్లిం, 1010 ద్వారా ఉల్లేఖించబడినది.]
కాబట్టి, మీ శక్తి మేరకు కొంచెమైనా సరే దానం చేయకుండా అల్లాహ్ యొక్క ఏ ఒక్క రోజు కూడా గడిచిపోకుండా చూసుకోండి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ‘కనీసం ఖర్జూర పండులోని సగభాగం దానం చేసైనా అల్లాహ్ కు భయపడండి (నరకాగ్ని నుండి రక్షణ పొందండి).‘ [ముత్తఫకున్ అలై – ఏకీభవించబడినది]
మరియు అల్లాహ్ (సుబ్ హానహు వ తఆలా) ఇలా అంటున్నాడు: ‘ఫ మై యఅమల్ మిస్కాల జర్రతిన్ ఖైరై యర. వ మై యఅమల్ మిస్కాల జర్రతిన్ షర్రై యర’ — ‘ఎవరైతే ఆవగింజంత మంచి చేస్తారో వారు దానిని చూస్తారు. మరియు ఎవరైతే ఆవగింజంత చెడు చేస్తారో వారు దానిని చూస్తారు.’
మరియు అల్లాహ్ (సుబ్ హానహు వ తఆలా) ఇలా కూడా అంటున్నాడు: ‘మీరు అల్లాహ్ మార్గంలో ఏది ఖర్చు చేసినా, ఆయన దానికి ప్రత్యామ్నాయాన్ని (బదులు) ఇస్తాడు మరియు ఆయనే ఉపాధినిచ్చే వారిలో శ్రేష్ఠుడు.’
‘ఆయన దానికి ప్రత్యామ్నాయాన్ని ఇస్తాడు’ అంటే అర్థం ఏమిటి? అంటే ఆయన మీకు దానికంటే మెరుగైన దానిని ఇస్తాడు. అది మీ నుండి వెళ్ళిపోయిందని, అంతమైపోయిందని అనుకోకండి. ఇన్షా అల్లాహ్, అది అంతకంటే గొప్ప రూపంలో మీ వద్దకు తిరిగి వస్తుంది.
షేక్ మళ్ళీ ఇలా అంటున్నారు: మీరు ఏది ఖర్చు చేసినా, అల్లాహ్ మీకు దానికి బదులు ఇస్తాడు మరియు ఆయనే ఉపాధినిచ్చే వారిలో శ్రేష్ఠుడు. మరియు ఆయన ఇలా ప్రార్థిస్తున్నారు: ఓ అల్లాహ్, ఓ లోకనాథా, దానం చేసే వ్యక్తికి మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించు.
ముస్లిం గ్రంథంలో అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో దైవప్రవక్త ఇలా చెప్పారు: మీకు పూర్వం ఉన్న ప్రజలలో ఒక వ్యక్తి ఒక తోటను కలిగి ఉండేవాడు. ఆకాశం నుండి మేఘాల మధ్య ఒక దేవదూత, ‘ఫలానా వ్యక్తి తోటకి నీరు ఇవ్వు’ అని అరవడం వేరే వ్యక్తి విన్నాడు. వెంటనే ఆ మేఘం నుండి నీరు ఒక కాలువలోకి కురిసి, ఆ తోట వైపు పారింది. ఆ తోట యజమాని చేతిలో పార పట్టుకుని నీటిని మరియు మట్టిని సరిచేస్తున్నాడు. అప్పుడు ఆ బాటసారి తోట యజమానితో, ‘అల్లాహ్ నిన్ను కరుణించుగాక, నీ పేరేమిటి?’ అని అడిగాడు.
అతను ఫలానా వ్యక్తి కుమారుడనైన ఫలానా అని తన పేరు చెప్పాడు. తర్వాత, ‘నువ్వు నా పేరు ఎందుకు అడుగుతున్నావు?’ అని అడిగాడు.
దానికి ఆ బాటసారి: “మేఘాల నుండి వచ్చిన ఒక స్వరం, ‘ఫలానా వ్యక్తి (నీ పేరు చెప్పి) తోటకి నీరు ఇవ్వమని’ చెప్పడం నేను విన్నాను. అల్లాహ్ నిన్ను కరుణించుగాక, అసలు నువ్వు ఈ తోట విషయంలో ఏమి చేస్తావు?” అని అడిగాడు.
అప్పుడు ఆ తోట యజమాని ఇలా అన్నాడు: “నేను పంట పండించి, కోసినప్పుడు, అందులో మూడవ వంతు (1/3) నా కోసం మరియు నా కుటుంబం కోసం తీసుకుంటాను. మరొక మూడవ వంతు తిరిగి తోట సాగు కోసం ఖర్చు చేస్తాను. మిగిలిన మూడవ వంతు దానం (సదకా) చేస్తాను.”
దీనిని గమనించండి. సాధారణంగా వర్షం ద్వారా పండే పంటలో (ఎలాంటి కృత్రిమ నీటిపారుదల లేకుండా) పదవ వంతు (1/10) మాత్రమే దానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ స్ప్రింక్లర్లు లేదా ఇతర సాగునీటి పద్ధతుల ద్వారా అయితే పదవ వంతులో సగం (1/20) ఇవ్వాలి.
కానీ ఇతను 1/10 లేదా 1/20 కాకుండా, ఏకంగా 1/3 వంతు (మూడవ వంతు) దానం చేశాడు. అంటే అతను దానం కోసం ఎక్కువ కేటాయించాడు. అందుకే అల్లాహ్ అతని తోట కోసం ప్రత్యేకంగా వర్షాన్ని ఎలా కురిపించాడో చూడండి. అతని పొరుగువారి కంటే అతని తోటకే ప్రత్యేకంగా వర్షం కురిసింది. దీనికి అర్హత సాధించడానికి అతను ఏమి చేశాడు? అతను సదకా (దానం) చేశాడు. కాబట్టి సదకా సంపదను తగ్గించదు.
ఒకసారి మేము దావా (ఇస్లాం ప్రచారం) కోసం ఒక ప్రాంతానికి వెళ్ళాము. అల్హముదులిల్లాహ్, మేము ఎల్లప్పుడూ ప్రజలను అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త సున్నత్ వైపు పిలవడానికి, అల్లాహ్ ను, తీర్పు దినాన్ని మరియు సత్కార్యాలను గుర్తు చేయడానికి వెళ్తుంటాము. అక్కడ పర్వతాలు, చెట్లు పచ్చగా ఉండటం మేము చూసాము, మాషా అల్లాహ్, అది చాలా అందమైన దృశ్యం. వారి వ్యవసాయం చాలా బాగుంది. దానికి కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది, ఎందుకంటే వారి పొరుగున ఉన్న భూములు మాత్రం దుమ్ముతో, నిస్సారంగా ఉన్నాయి, కానీ వీరి భూమి పచ్చగా ఉంది. దారిలో మేము దానికి కారణం చూసాము. అక్కడ ప్రతి కొంత దూరానికి నీటి చల్లదనం లభిస్తుంది, అంటే అక్కడ మేము వాటర్ కూలర్లను (Water Coolers) చూసాము.
షేక్ ఇలా అన్నారు: ఆ వాటర్ కూలర్ల కారణంగా, అల్లాహ్ అక్కడ వర్షాన్ని కురిపించాడు. వారు ఉదారులు అయితే, అల్లాహ్ వారి కంటే ఎక్కువ ఉదార స్వభావం కలవాడు. ఆయన ఉదారుడు మరియు ఉదార స్వభావం గలవారిని ప్రేమిస్తాడు. వారు దయ గలవారైతే, అల్లాహ్ వారి కంటే ఎక్కువ దయ గలవాడు. అల్లాహ్ దయామయుడు మరియు ఆయన దయగల ప్రజలను ప్రేమిస్తాడు.
వారు చేసిన దానాన్ని అల్లాహ్ వృథా పోనివ్వలేదు. పైగా, ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వారికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి సదకా అనేది జీవనోపాధి పెరుగుదలకు ఒక కారణం, ఇది జీవనోపాధి ద్వారాలలో ఒక ద్వారం మరియు కష్టాలు & ఆపదల నుండి ఉపశమనం కలిగించే ద్వారం. జకాత్ కూడా కష్టాల నుండి విముక్తి పొందే మార్గమే. మీరు విన్నదంతా కష్టాల నుండి ఉపశమనం కలిగించే ద్వారాలే – ఇది జీవనోపాధి ద్వారం మరియు ఉపాధికి ఒక కారణం. కొంతమంది ప్రజలు కేవలం భౌతిక కారణాలను (material means) మాత్రమే చూస్తారు. ఈ రోజుల్లో అల్లాహ్ కరుణించిన వారు తప్ప, చాలా మంది ప్రజల మనస్సులలో ఈ ఆధ్యాత్మిక కారణాలు లేవు. అల్లాహ్ రక్షించిన వారు తప్ప, వారు ఖురాన్ చదివినా దానిని లోతుగా ఆలోచించరు.
మూలం:Means of Sustenance : ‘మీన్స్ ఆఫ్ సస్టెనెన్స్’ (జీవనోపాధి మార్గాలు) – షేక్ ముహమ్మద్ ఇబ్న్ ‘అబ్దుల్-వహ్హాబ్ అల్-వస్సాబి.
ఆస్తి వారసత్వం [PDF] [5 పేజీలు] – ఇస్లామీయ ఆరాధనలు [పుస్తకం] ఆస్తి పంపకానికి ప్రాథమిక సూత్రాలు,ఆస్తి వాటాలు, వీలునామా, మూడోవంతు కంటే ఎక్కువ ఆస్తి మీద వీలునామా చెల్లదు
ఈ ప్రసంగంలో, సలాతుద్ దుహా (చాష్త్ నమాజ్ లేదా ఇష్రాఖ్ నమాజ్ అని కూడా పిలుస్తారు) యొక్క ప్రాముఖ్యత, దానిని ఆచరించే విధానం మరియు దాని గొప్ప ప్రతిఫలాల గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ఆధారంగా, మానవ శరీరంలోని 360 కీళ్ల తరపున ప్రతిరోజూ ధర్మం (సదఖా) చేయవలసిన బాధ్యత ఉందని, అయితే కేవలం రెండు రకాతుల దుహా నమాజ్ ఆచరించడం ద్వారా ఆ బాధ్యత నెరవేరుతుందని స్పష్టం చేయబడింది. అంతేకాకుండా, ఫజ్ర్ నమాజ్‌ను జమాఅత్‌తో ఆచరించి, సూర్యోదయం వరకు అదే స్థలంలో కూర్చుని అల్లాహ్‌ను స్మరించి, ఆ తర్వాత రెండు రకాతుల దుహా నమాజ్ చేసినవారికి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుందని కూడా వివరించబడింది.
అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం సలాతుద్ దుహా, చాష్త్ నమాజ్ గురించి తెలుసుకుందాం. చాష్త్ నమాజ్, ఇష్రాఖ్ నమాజ్, సలాతుద్ దుహా ఇవన్నీ ఒకే పేర్లు. అరబీలో సలాతుద్ దుహా అని, అలాగే ఇష్రాఖ్ నమాజ్ అని లేదా చాష్త్ నమాజ్ అని అంటారు.
ఈ నమాజ్ ఎప్పుడు చేస్తారు? సూర్యుడు ఉదయించి బాగా ప్రొద్దెక్కిన తర్వాత చేయబడే నమాజ్ ఇది సలాతుద్ దుహా.
ఇవి ఎన్ని రకాతులు చేయాలి? రెండు రకాతులు చేయవచ్చు, నాలుగు రకాతులు చేయవచ్చు, ఎనిమిది రకాతులు కూడా చేయవచ్చు. ప్రతి రెండు రకాతులకి సలాం చెప్పాలి. రెండు రకాతులు చేయవచ్చు, నాలుగు రకాతులు చేయవచ్చు ప్రతి రెండుకి సలాం చెప్పాలి, ఎనిమిది కూడా చేయవచ్చు ప్రతి రెండు రకాతులకి సలాం చెప్పాలి.
సలాతుద్ దుహా యొక్క ఘనత
ఈ నమాజ్ గురించి, సలాతుద్ దుహా గురించి, ఇష్రాఖ్ లేదా చాష్త్ నమాజ్ గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. అబూజర్ రదియల్లాహు అన్హు కథనం,
قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,
يُصْبِحُ عَلَى كُلِّ سُلاَمَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ (యుస్బిహు అలా కుల్లి సులామా మిన్ అహదికుం సదఖహ్) మీలో ప్రతి కీళ్ళు తరఫు నుంచి ప్రతిరోజూ ఒక సదఖా ఇవ్వాలి.
కీళ్ళు అంటే మనిషి శరీరంలో కీళ్ళు ఉంటాయి కదా. ప్రతి కీళ్ళు తరపున సదఖా ఇవ్వాలి.
فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ (ఫకుల్లు తస్బీహతిన్ సదఖహ్) ప్రతి ‘సుబ్ హా నల్లాహ్’ అని చెప్పడం కూడా సదఖా కిందికే వస్తుంది.
وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ (వకుల్లు తహ్లీలతిన్ సదఖహ్) ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని స్మరించటం కూడా సదఖా అవుతుంది.
وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ (వకుల్లు తక్బీరతిన్ సదఖహ్) ‘అల్లాహు అక్బర్’ అని చెప్పటం కూడా సదఖా అవుతుంది.
وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ (వ అమ్రున్ బిల్ మ’రూఫి సదఖహ్) మంచిని ఆజ్ఞాపించటం, మంచి పని చేయండి అని చెప్పటం, ఇది కూడా సదఖా కిందికే వస్తుంది.
وَنَهْيٌ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ (వ నహ్యున్ అనిల్ మున్కరి సదఖహ్) చెడుని ఆపటం కూడా సదఖా కిందికే వస్తుంది.
وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنَ الضُّحَى (వ యుజ్జిఉ మిన్ జాలిక రక’ఆతాని యర్క’ఉహుమా మినద్ దుహా) వీటన్నిటికంటే సలాతుద్ దుహా రెండు రకాతులు చేయటం ఉత్తమం అన్నారు, మంచిది అన్నారు.
అంటే సుబ్ హా నల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ ఎన్నిసార్లు చెప్తామో అన్నిసార్లు సదఖా ఇచ్చినట్టు సమానం అవుతుంది. వీటన్నిటికంటే చాష్త్ రెండు రకాతులు సరిపోతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది.
ఇంకో హదీస్ లో కొంచెం వివరంగా ఉంది. దాంట్లో అది ఏముందంటే, అబూ దావూద్ లో ఉంది హదీస్ అది. బురైదా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం,
ఈ హదీస్ లో చాష్త్ నమాజ్, సలాతుద్ దుహా, ఈ నమాజ్ యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం, ఘనత ఏమిటో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది.
قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,
فِي الإِنْسَانِ ثَلاَثُمِائَةٍ وَسِتُّونَ مَفْصِلاً (ఫిల్ ఇన్సాని సలాసు మిఅతిన్ వ సిత్తూన మిఫ్సలన్) మనిషి యొక్క శరీరంలో 360 కీళ్ళు ఉన్నాయి, జాయింట్లు.
ఇలా జాయింట్లు, కీళ్ళు, మనిషి యొక్క శరీరంలో 360 ఉన్నాయి.
فَعَلَيْهِ أَنْ يَتَصَدَّقَ عَنْ كُلِّ مَفْصِلٍ مِنْهُ بِصَدَقَةٍ (ఫ’అలైహి అన్ యతసద్దఖ అన్ కుల్లి మిఫ్సలిన్ బి సదఖహ్) కావున, ప్రతి జాయింట్ కి బదులుగా సదఖా చేయటం తప్పనిసరి ప్రతిరోజూ.
అంటే మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. ప్రతి జాయింట్ కి బదులుగా ప్రతిరోజూ ఒక సదఖా ఇవ్వాలి. అంటే ప్రతిరోజూ 360 జాయింట్లకి బదులుగా 360 సదఖాలు చేయాలి, ప్రతిరోజూ చేయాలి. ఇది తప్పనిసరి. ఇది విని సహాబాలు ఆశ్చర్యంతో,
قَالُوا وَمَنْ يَسْتَطِيعُ يَا رَسُولَ اللَّهِ “ఖాలూ వ మన్ యస్తతీ యా రసూలల్లాహ్” అన్నారు. “ఓ రసూలల్లాహ్, ఈ స్థోమత ఎవరికి ఉంటుంది? ఎవరు చేయగలరు?”
ధనవంతులు, కోటీశ్వరులు వారైతే చేయగలరేమో, కానీ సాధారణమైన మనుషులు, మాలాంటి వారు, పేదవాళ్ళు ప్రతిరోజూ 360 సదఖాలు… ఆ స్థోమత మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చేయలేము కదా, అని అడిగితే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే,
النُّخَاعَةُ فِي الْمَسْجِدِ تَدْفِنُهَا (అన్నుఖాఅతు ఫిల్ మస్జిది తద్ఫినుహా) మస్జిద్ లో ఏమైనా గలీజ్ ఉంటే, ఏమైనా హానికరమైన వస్తువు ఉంటే తొలగించండి.
అది సదఖాతో సమానం అవుతుంది.
وَالشَّىْءُ تُنَحِّيهِ عَنِ الطَّرِيقِ (వష్ షైఉ తునహ్హీహి అనిత్ తరీఖ్) దారిలో ఏమైనా హాని కలిపించే వస్తువు, ముళ్ళు ఉంది, గలీజ్ ఉంది, వాటిని తొలగించండి. అది కూడా సదఖా కిందికే వస్తుంది.
فَإِنْ لَمْ تَجِدْ فَرَكْعَتَا الضُّحَى تُجْزِئُكَ (ఫఇల్లమ్ తజిద్ ఫ రక’అతద్ దుహా తుజ్జిఉక) అలా కుదరకపోతే, సలాతుద్ దుహా (చాష్త్ నమాజ్) ఈ 360 జాయింట్లకి సదఖాకి సరిపోతుంది అన్నారు.
అంటే ఎవరైతే సలాతుద్ దుహా చదువుతాడో, ఆ వ్యక్తి 360 సార్లు సదఖా ఇస్తున్నాడు అని దానికి సరిపోతుంది. అంటే ఈ హదీస్ ద్వారా మనకు ఏం బోధ పడుతుంది? ప్రతి మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. ప్రతి జాయింట్ కి బదులుగా ఒక సదఖా ప్రతిరోజూ తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ స్థోమత లేదు కాబట్టి అటువంటి వారు వేరే పుణ్యాల ద్వారా, సదఖా, దానధర్మాల ద్వారా, దారిలో నుంచి చెడుని దూరం చేయటం ద్వారా, అలాగే తస్బీహ్‌ల ద్వారా, జిక్ర్ ద్వారా (సుబ్ హా నల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్) ద్వారా, అలాగే సలాతుద్ దుహా ద్వారా సరిపోతుంది అన్నారు.
ఒక హజ్ మరియు ఉమ్రా పుణ్యం
అభిమాన సోదరులారా, సలాతుద్ దుహా గురించి ఒక్క హదీస్ చెప్పి నేను ముగిస్తాను. దాని ప్రాముఖ్యత ఏమిటి, ఘనత ఏమిటి అనేది. అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం ప్రకారం,
قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,
“ఎవడైతే ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేశాడో, ఆ ఫర్ద్ నమాజ్ తర్వాత ఎక్కడికీ పోకుండా అక్కడే కూర్చుని అల్లాహ్‌ను స్మరిస్తున్నాడో (జిక్ర్ చేసుకుంటున్నాడో), సూర్యుడు ఉదయించే వరకు, ఆ తర్వాత రెండు రకాతులు చేశాడో (అంటే సలాతుద్ దుహా, ఇష్రాఖ్ నమాజ్, చాష్త్ నమాజ్), ఆ వ్యక్తికి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుంది.”
అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు నొక్కి చెప్పారు.
అల్లాహు అక్బర్! సలాతుద్ దుహా, ఇష్రాఖ్ నమాజ్, చాష్త్ నమాజ్ యొక్క ప్రతిఫలం, ఘనత ఏమిటి? ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేసి, నమాజ్ తర్వాత ఆ స్థలంలోనే కూర్చుని, అల్లాహ్‌ను స్మరిస్తూ, జిక్ర్ చేసుకుంటూ, సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు రకాతుల దుహా నమాజ్ చేస్తే, ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా అంత పుణ్యం లభిస్తుందని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది.
ముగింపు మరియు ముఖ్య గమనికలు
అభిమాన సోదరులారా, ఈ సలాతుద్ దుహా గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి. మొదటి విషయము, సలాతుద్ దుహా, ఇష్రాఖ్ లేదా చాష్త్ నమాజ్, ఇది మస్జిద్ లో, ఇంట్లో ఎక్కడైనా చేయవచ్చు. కండిషన్ ఏమీ లేదు. ఫజ్ర్ నమాజ్ చేసుకున్నాము, కాసేపు పడుకున్నాము, ఏదో పని చేసుకున్నాము, తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత చేసుకున్నాము. అలాగే ఫజ్ర్ నమాజ్ తర్వాత ఇంటికి వచ్చేసాము, ఇంట్లో చేసుకున్నాము. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సదఖా అంత పుణ్యం వస్తుంది, ఎక్కువ పుణ్యం అల్లాహ్ ప్రసాదిస్తాడు. కాకపోతే, సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా అంత పుణ్యం రావాలంటే కండిషన్ ఏమిటి? ఫజ్ర్ నమాజ్ తర్వాత ఆ స్థలంలోనే కూర్చుని అల్లాహ్‌ను స్మరిస్తూ, జిక్ర్ చేసుకుంటూ, సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు రకాతుల ఈ దుహా నమాజ్ చేసుకుంటే సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుంది.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ నఫిల్ నమాజ్‌లు, సున్నత్ నమాజ్‌లు, ఈ దుహా, ఇష్రాఖ్ నమాజ్ పాటించే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకొని మనము జీవితం గడిపే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
You must be logged in to post a comment.