షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి? [ఆడియో, టెక్స్ట్]

షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి?
https://www.youtube.com/watch?v=1qamx6aMM3U [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

”నిశ్చయంగా షైతాన్‌ మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువు గానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవడానికే పిలుస్తున్నాడు”. (సూరా ఫాతిర్‌: 06)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
”నిశ్చయంగా షైతాన్‌ మనిషి నరాల్లో రక్తం వలె ప్రవహిస్తుంటాడు”. (బుఖారీ)


ఈ ఆడియో లో క్రింది విషయాలు వివరించబడ్డాయి:

  1. అల్లాహ్ యొక్క జిక్ర్ 
  2. షిర్క్  నుండి  & పాపకార్యాల నుండి దూరముండుట 
  3. అల్లాహ్ పై బలమైన విశ్వాసం మరియు నమ్మకం 
  4. వివిధ సందర్భాలలో దుఆలు పఠించడం 
  5. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చదివే దుఆ చదవడం 
  6. 100 సార్లు “లా ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు …” చదవడం 
  7. మితి మీరిన కోపానికి దూరముండుట, కోపం వచ్చినప్పుడు “అవూజు బిల్లాహి మినష్ షైతానిర్రజీమ్” చదువుట  
  8. సూరా అల్ ఫలఖ్ , సూరా అల్ నాస్ చదవడం 
  9. ఇంట్లో ప్రవేశించేటప్పుడు , తినేముందు, తాగేముందు బిస్మిల్లాహ్ తో ప్రారంభించడం 
  10. ఇంట్లో సురా బఖర చదవడం 
  11. నిద్ర పోయే ముందు “అయతుల్ కుర్సీ” చదవడం 
  12. నిద్ర పోయే ముందు సురా బఖర చివరి రెండు అయతులు చదవడం 
  13. మస్జిద్ లోకి ప్రవేశించేటప్పుడు చేసే దుఆ చేసుకోవడం 

ఈ ప్రసంగంలో షైతాన్ నుండి రక్షణ పొందటానికి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివిధ పద్ధతులు వివరించబడ్డాయి. ఈ అంశం రెండు భాగాలుగా విభజించబడింది: మొదటిది, షైతాన్ యొక్క చెడు ప్రేరేపణలు మరియు గుసగుసల (వస్వసా) నుండి మనల్ని మనం కాపాడుకోవడం. రెండవది, షైతాన్ లేదా జిన్నాతుల భౌతిక హాని, అనగా ఆవహించడం లేదా ఇంట్లో నివసించడం వంటి సమస్యల నుండి రక్షణ. ప్రసంగంలో అల్లాహ్ స్మరణ (ధిక్ర్), ఆయతుల్ కుర్సీ, సూరహ్ అల్-బఖరాలోని చివరి రెండు ఆయతులు మరియు ముఅవ్విదతైన్ (సూరహ్ అల్-ఫలఖ్ మరియు సూరహ్ అన్-నాస్) పఠించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పబడింది. అలాగే, ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మరియు మస్జిద్ లోకి ప్రవేశించేటప్పుడు పఠించవలసిన దుఆలు మరియు వాటి ప్రయోజనాలు వివరించబడ్డాయి. షిర్క్ మరియు బిద్అత్ చర్యలైన బాబాల వద్దకు వెళ్లడం, తాయత్తులు కట్టడం వంటి వాటి నుండి దూరంగా ఉండాలని గట్టిగా సూచించబడింది.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బద్.

సోదరులారా! ఈరోజు, షైతాన్ నుండి మనం ఎలా రక్షణ పొందాలి? అన్న శీర్షికపై, టాపిక్ పై మీ ముందు ఖురాన్ మరియు హదీసు ఆధారంగా కొన్ని విషయాలు తెలుపుతాను.

చూడండి, అల్లాహ్ త’ఆలా మనల్ని పుట్టించింది, మనం కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుటకు. కానీ, షైతాన్ వాడు మనల్ని అల్లాహ్ మార్గం నుండి దూరం చేసి నరకం వైపునకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికై షైతాన్ సాఫల్యం పొందుటకు ఎన్నో రకాలుగా మానవులను పెడమార్గం పట్టిస్తూ ఉంటాడు. ఖురాన్లో దీని గురించి ఎన్నో ఆయతులు ఉన్నాయి, కానీ ఆ వివరాల్లో నేను ఇప్పుడు వెళ్లడం లేదు. సంక్షిప్తంగా ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, షైతాన్ నుండి మనం ఎలా రక్షణ పొందగలుగుతాము.

ఉన్న ఈ టాపిక్ లో రెండు భాగాలు అనుకోండి. ఒకటి, షైతాన్ యొక్క వస్వసాల నుండి, అతని ప్రేరేపణల నుండి, అతను చెడు కార్యాలు చేయుటకు మనలో ఏ బీజమైతే నాటే ప్రయత్నం చేస్తాడో, ఎలాంటి కోరికలను పెంపొందించే ప్రయత్నం చేస్తాడో, వాటి నుండి మనం ఎలా దూరం ఉండగలుగుతాము. పుణ్యంపై, సత్కార్యంపై, అల్లాహ్ యొక్క విధేయతపై ఎలా స్థిరంగా ఉండగలుగుతాము. ఇది ఒక భాగం.

రెండో భాగం, సామాన్యంగా మనం వింటూ ఉంటాం కదా, అయ్యో ఆ మనిషికి షైతాన్ పట్టిందట, అతనిలో జిన్ చొరబడ్డదంట, “షైతాన్ పకడ్ లియా ఉసే, ఆసేబ్ హోగయా” ఉర్దూలో అంటారు కదా. లేక, ఓ వాళ్ళ ఇంటి మీద షైతాన్ వాలి ఉంది, ఎప్పుడూ ఏదో ఒక విచిత్ర కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక, ఇలాంటి అనుమానాల్లో పడ్డ తర్వాత, ఒక మనిషికి షైతాన్ వాస్తవంగా పట్టి ఉండేది ఉంటే, లేదా ఎవరి ఇంటిలోనైనా షైతాన్ నివాసం చేసి అక్కడ ఉన్న ఇంటి వారికి ఏదైనా పరేషాన్ చేస్తూ వారి జీవితం సుఖంగా జరగకుండా ఏదైనా ఇబ్బంది పాలు చేస్తే, ఖురాన్, హదీసులు మనకు అలాంటి ఇబ్బందుల నుండి దూరం ఉండటానికి ఏ మార్గం చూపుతుందో ఈ రోజుల్లో ప్రజలు తెలుసుకోకుండా చాలా దూరంగా ఉన్నారు. ఏం చేస్తారు? వెంటనే ఫలానా బాబా దగ్గరికి వెళ్దాము, ఫలానా పీర్ దగ్గరికి వెళ్దాము, ఫలానా సమాధి వద్దకు వెళ్దాము, ఫలానా తాయీజ్ వేద్దాము, లేదా ఇంటి రక్షణ కొరకు షైతాన్ నుండి ఆ ఇంటి నలువైపులా ఏదో దర్గాల కాడి నుండి చదివించుకుని వచ్చి మొళలు నాటడం, లేదా ఇంటి కడపకు ఆ మిరపకాయలు లేదా నిమ్మకాయ, లేకుంటే బూడిద గుమ్మడికాయ ఇలాంటివి తగిలించడం, లేక మరి మా చిన్నప్పుడు మేము చూసాము కొన్ని ప్రాంతాల్లో, చెత్త కుప్ప ఎక్కడైతే వేస్తారో అక్కడ ఒక గుంజ, ఒక నాటు వేసి దానికి ఒక చెప్పు, ఒక చీపురు తగిలేసేవారు. ఈ వాడ మీద ఏ ఆ రేపు రాక్షసులు వస్తున్నాయి, ఆ ఇది రాకుండా జాగ్రత్తగా ఉంటాయి. అంటే ఇలాంటి, లేదా తాయీజులు, తాయత్తులు ఇలాంటి విషయాలకు పాల్పడుతున్నారు.

అయితే సోదరులారా! ఇవన్నీ కూడా తప్పు. ఇవన్నీ కూడా మనల్ని ఇంకింత షిర్క్ లో, ఇంకింత పాపంలో, బహుశా కొన్ని సందర్భాల్లో ఏదైనా కొందరికి కొంత లాభం కనబడుతుంది కావచ్చు. కానీ, అసలైన లాభం అల్లాహ్ తో సంబంధం ఏదైతే ఉంటుందో, విశ్వాసం ఏదైతే ఉండాలో అవన్నీ కోల్పోతారు. అందు గురించి ఇక రండి, ఈ రెండు భాగాలు ఏదైతే నేను చెప్పానో వాటన్నిటికీ నేను ఈ రోజు చెప్పబోయే విషయాల్లో మీకు సమాధానం అనేది ఇన్ షా అల్లాహ్ లభిస్తుంది.

ఒక మనిషి షైతాన్ నుండి దూరం ఉండడానికి ఏం చేయాలి? లక్ష్మణ రేఖ అని ఎప్పుడైనా విన్నారా మీరు? ఏంటిది? సీత బయటికి వెళ్ళకుండా రాముడు గీసిన గీత కాదు, మన ఇళ్లల్లో మనం చీమలు రాకుండా, ఒక చాక్ పీస్ ల వస్తది ఉంటది, దానితో గీస్తాం కదా. సామాన్యంగా ఏం చూడడం జరిగింది? చీమలు రాకుండానే ఉంటాయి. చూసారా లేదా? రాత్రి దోమలు రాకుండా ఏం చేస్తారు? మఛ్ఛర్ దాని గాని, ఆ లేదా అంటే, ఆ ఆరెస్సా, టిఆర్ఎస్ ఏవో మందులు కూడా ఉంటాయి కదా అట్లాంటివి. లేక మీరు అనండి, ఎక్కడైతే అగ్ని మండుతుందో, దాని మీద నీళ్లు పోస్తే ఏమైపోతుంది? అగ్ని ఆరిపోతుందా? ఈ సామెతలు ఎందుకు ఇస్తున్నాను? ఈ సామెతలు, ఇలాంటి ఉదాహరణలు మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకు ఇవ్వడం జరిగింది. అదేమిటి? ఎక్కడైతే అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో అక్కడ షైతాన్ రావడానికి ఆస్కారం ఉండదు. ఇంతకుముందు ఉదాహరణలు, సామెతలు ఏవైతే చెప్పుకున్నామో, పెద్దలు చెప్పిన విషయాలు, కొందరి అనుభవించినవి లేకుంటే అనుభవశాలుల అనుభవాలు. కానీ, షైతాన్ మనకు దగ్గరగా రాకుండా, షైతాన్ వస్వసాలలో మనం పడకుండా, షైతాన్ మనకు ఎలాంటి హాని కలిగించకుండా మనం ఉండాలంటే, దానికి మొట్టమొదటి, అతి ముఖ్యమైనది, అతి గొప్పది, అతి పెద్ద నివారణ, చికిత్స, రేఖ, హద్దు, బందిష్, ఏదేనా పేరు పెట్టుకోండి మీరు. ఏంటది? అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్. ఎక్కడ అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో అక్కడ షైతాన్ కు ఏ మాత్రం అవకాశం దొరకదు. 

ఈ విషయం నేను ఎన్నో హదీసులు, ఎన్నో ఆయతులు ఉన్నాయి కానీ ఒక మంచి ఉదాహరణ ద్వారా ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ త’ఆలా యహ్యా అలైహిస్సలాంకు ఐదు విషయాల గురించి ఆదేశించాడు. అందులో ఒకటి ఏమిటి? “వఆమురుకుం అన్ తద్కురుల్లాహ్” అల్లాహ్ నాకు ఇచ్చిన ఆదేశం, నేను మీకు ఇస్తున్నాను, ఏమిటి? వఆమురుకుం, నేను మీకు ఆదేశిస్తున్నాను, అన్ తద్కురుల్లాహ్, మీరు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి. అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేస్తూ ఉండండి. “ఫఇన్న మసల దాలిక్”, దీని ఉదాహరణ ఎలాంటిది అంటే, “కమసలి రజులిన్ ఖరజల్ అదువ్వు ఫీ అసరిహి సిరాఅన్ హత్తా ఇదా అతా అలా హిస్నిన్ హసీనిన్ ఫ అహ్రజ నఫ్సహు మిన్హు”. ఒక వ్యక్తి పరుగుతున్నాడు, ఉరుకుతున్నాడు, అతని వెనుక అతని శత్రువులు ఉన్నారు. ఆ మనిషి శత్రువుల చేతిలో చిక్కకుండా పరుగులు తీస్తున్నాడు. చాలా వేగంగా. ముందుకు వెళ్ళిన తర్వాత చాలా బలమైన ఒక గట్టి కోటలో “అహ్రజ నఫ్సహు” తనను తాను బంధించుకుంటాడు. అక్కడ వెళ్ళి రక్షణ పొందుతాడు. ఆ కోటలో వెళ్ళిన తర్వాత, వెనుక శత్రువులు ఏదైతే పరుగెత్తుకుంటూ వస్తున్నారు కదా, ఇతన్ని పట్టుకోవడానికి, వాళ్ళు ఓడిపోతారు. అంటే ఇక పరుగు పెట్టకుండా, అల్లా ఇక ముంగట అతను చాలా మంచి బలమైన కోటలో వెళ్ళిపోయిండు. ఇక అక్కడి వరకు వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి మనకు ఎలాంటి తాకత్ లేదు అన్నట్టుగా వాళ్ళు ఓడిపోతారు. అల్లాహ్ ఏం చెప్పారు, యహ్యా అలైహిస్సలాంకి? ఈ ఉదాహరణ ఎలాంటిది?

كَذَلِكَ الْعَبْدُ لاَ يُحْرِزُ نَفْسَهُ مِنَ الشَّيْطَانِ إِلاَّ بِذِكْرِ اللَّهِ
(కధాలికల్ అబ్దు లా యుహ్రిజు నఫ్సహు మినష్-షైతాని ఇల్లా బిధిక్-రిల్లాహ్)
అదేవిధంగా, ఒక దాసుడు అల్లాహ్ స్మరణ ద్వారా తప్ప షైతాన్ నుండి తనను తాను రక్షించుకోలేడు.

మనిషి తనను తాను షైతాన్ చిక్కులో చిక్కకుండా రక్షణగా ఉండాలంటే అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ ధిక్ర్ లో ఎప్పుడైతే వచ్చేస్తాడో అతను ఒక బలమైన కోటలో ప్రవేశించినట్లు, షైతాన్ అతని మీద ఎలాంటి దాడి, షైతాన్ యొక్క యొక్క ఎలాంటి పగ అనేది తీరకుండా ఉంటుంది.

సోదరులారా! అల్లాహ్ యొక్క ధిక్ర్ లో చాలా గొప్ప శక్తి ఉంది. అందు గురించే ఖురాన్లో కూడా మనకు ఇలాంటి ధిక్ర్ లు, ఇలాంటి దుఆలు ఎక్కువగా చదువుతూ ఉండడానికి చెప్పడం జరిగింది. మనిషి దగ్గరికి షైతాన్ రావడానికి ఎన్నో పాప కార్యాలు, ఎన్నో తప్పుడు పనులు చేయడం కూడా ఒక సబబే. అందు గురించి మనిషి సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? గట్టి బలమైన విశ్వాసం మీద ఉండాలి. సూర నహల్ మీరు చదివారంటే, అల్లాహ్ త’ఆలా అందులో తెలిపాడు, ఎవరైతే విశ్వాసులో, అలాంటి వారిపై షైతాన్ తన యొక్క పన్నాగం పన్నలేడు.

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
(ఇన్నహూ లైస లహూ సుల్తానున్ అలల్లదీన ఆమనూ వ అలా రబ్బిహిమ్ యతవక్కలూన్)
విశ్వసించి, తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి (షైతానుకు) ఎలాంటి అధికారం ఉండదు (16:99)

إِنَّمَا سُلْطَانُهُ عَلَى الَّذِينَ يَتَوَلَّوْنَهُ وَالَّذِينَ هُم بِهِ مُشْرِكُونَ
(ఇన్నమా సుల్తానుహూ అలల్లదీన యతవల్లౌనహూ వల్లదీన హుమ్ బిహీ ముష్రికూన్)
అయితే వాడితో స్నేహం చేసి, వాడిని అల్లాహ్‌కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది (16:100)

షైతాన్ ఎవరితో ఉంటాడు? ఎవరితో ఉండడు? అన్న విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు ఏం తెలిసింది? షైతాన్ మనకు తోడుగా ఉండకూడదు అంటే, లేక షైతాన్ వలలో మనం చిక్కకూడదు అంటే, విశ్వాసం మరియు అల్లాహ్ పై భరోసా చాలా గట్టిగా ఉండాలి. మరి ఎవరైతే షిర్క్ పనులు చేస్తారో, స్వయంగా షైతాన్ కు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాడో, అతను షైతాన్ ను స్నేహితునిగా చేసుకున్నట్లు. ఇక మీరు ఆలోచించండి, ఇక్కడ ముఖ్యంగా షిర్క్ పదం వచ్చేసింది. ఇంకా, పాటలు వినడం, నమాజులు వదలడం ఇలాంటి కార్యాలన్నీ షైతాన్ కు ఇష్టం ఉన్నాయా, లేవా? ఇష్టం ఉన్నాయి. అలాంటి కార్యాలు మనం చేస్తే షైతాన్ కు ఇంకా దగ్గరగా అవుతాము. అందు గురించి ఇది అతి ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాలి.

అందు గురించే ఇస్లాం ధర్మంలో ఎన్నో సందర్భాల్లో మనకు కొన్ని దుఆలు నేర్పడం జరిగినాయి. ఆ దుఆలను మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే, ఇన్ షా అల్లాహ్, అల్లాహ్ యొక్క దయవల్ల షైతాన్ వలలో చిక్కకుండా ఉండగలుగుతాము.

ఉదాహరణకు, ఇంటి నుండి మనం బయల్దేరినప్పుడు. ఏదైనా పని మీద మనం బయటికి వెళ్తాం. బయట షైతాన్ మనలో చిక్కకుండా ఉండడానికి ముందు ఏం చేయాలి మనం? ఇంటి నుండి బయల్దేరునప్పుడు ఏ దుఆ అయితే ప్రవక్త గారు మనకు నేర్పారో ఆ దుఆ చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఇంటి నుండి బయల్దేరుతూ, “బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” చదువుతారో, వారికి ఏ కార్యం మీద వారు వెళ్తున్నారో అందులో అతనికి మార్గం చూపబడుతుంది, అతని గురించి అల్లాహ్ సరిపోతాడు, “వ తనహ్హా అన్హుష్-షైతాన్” షైతాన్ అతడి నుండి దూరమైపోతాడు.

చూడండి ఎంత గొప్ప లాభం ఉంది. ఇది అబూ దావూద్ లో హదీస్ ఉంది, సహీ హదీస్.

ఇక బయటికి వెళ్ళాం మనం. ఈ దుఆ పాబందీగా చదువుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ ఏ అవకాశం ఉన్నా గానీ మనం ఏం చేయాలి?

لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهْوَ عَلَى كُلِّ شَىْءٍ قَدِيرٌ
(లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్)

ఈ దుఆ మనం చదువుతూ ఉన్నామంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఒక రోజులో వంద సార్లు ఇది చదువుతారో, “కానత్ లహు అద్ల అష్ర రిఖాబ్”, అతను పది బానిసలను విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది. అతనికి గురించి వంద పుణ్యాలు రాయబడతాయి అతని గురించి. మరియు మూడో లాభం, వంద పాపాలు అతనివి తుడిచివేయబడతాయి. నాలుగవది, “కానత్ లహు హిర్ జమ్ మినష్-షైతాన్”. ఈ వంద సార్లు ఈ దుఆను చదవడం ద్వారా షైతాన్ నుండి అది అతనికి ఒక రక్షణగా ఉంటుంది. ఐదవ లాభం, ఆ రోజు అతని కంటే ఉత్తముడు, మంచివాడు ఇంకా ఎవడూ ఉండడు. ఎవరైనా ఉంటే ఎవరు? వంద సార్లు చదివిన వ్యక్తి లేదా అంతకంటే ఎక్కువ చదివిన వ్యక్తి.

కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే చెప్పారో, షైతాన్ నుండి రక్షణ కలుగుతుంది అని, అక్కడ ఇంకో విషయం చెప్పారు. ఏంటిది? పొద్దున చదివేది ఉంటే సాయంకాలం వరకు. ఈ విధంగా పొద్దున వంద సార్లు, సాయంకాలం వంద సార్లు చదవడానికి. ఇక కొందరు అజ్ఞానులు ఏమంటారో తెలుసా? ఇక ఇదేం, మనం భజన చేసుకుంటూనే ఉండాలి, ఇవే జపించుకుంటూ జపం చేసుకుంటూ ఉండాలి. అస్తగ్ఫిరుల్లాహ్. ఉన్నారా అలాంటి కొందరు మూర్ఖులు కూడా. అల్లాహ్ వారికి, మనకు అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

“లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్” వంద సార్లు చదవడానికి ఐదు నిమిషాలు కూడా పట్టవు. మరి ఎవరైనా చాలా స్లోగా చదివేది ఉంటే, ఆరేడు నిమిషాలు పట్టినా గానీ, 24 గంటల్లోకి వెళ్ళా, ఆరేడు నిమిషాలు, పది నిమిషాలు, దీని ద్వారానే అయితే మనకు పొద్దంతా షైతాన్ నుండి రక్షణ కలుగుతుందో, అలాంటి వాటికి మనం ఐదు, పది నిమిషాలు కేటాయించలేకపోతామా? గమనించండి. మళ్ళీ పోతే ఇవి ఓ మూల కూర్చుని మీరు చదివే అవసరం లేదు. నడుస్తూ నడుస్తూ చదవవచ్చు. ఎక్కడైనా ఏదైనా వెయిటింగ్ లో ఉన్నారు, అక్కడ కూర్చుని చదవండి. కానీ ఏందంటే కొంచెం మనసు పెట్టి చదవండి.

బయటికి వెళ్ళి ఏదైనా పనిలో ఉంటాము, ఏదైనా కార్యంలో ఉంటాము, ఎవరితోనైనా మాట్లాడతాము, అక్కడ ఏం జరుగుతుంది? కోపం వస్తుంది. అల్లాహ్ మనందరినీ కూడా అధర్మ కోపం నుండి కాపాడు గాక. ధర్మపరమైన కోపంలో కూడా హద్దులో ఉండే భాగ్యం కలిగించు గాక. కోపం మితిమీరినప్పుడు కూడా షైతాన్ కు మంచి అవకాశం దొరుకుతుంది. అందు గురించి సామాన్యంగా మనం ఎక్కువగా కోపంలో రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కొందరికి, కోపం దాని హద్దు మీరింది అంటే, బట్టలు చింపుకుంటాడు, ఏ వస్తువు ఉన్నా గానీ మొబైల్ ఉన్నా గానీ, గంజి ఉన్నా గానీ, చెంచా ఉన్నా గానీ తీసి విసిరేస్తాడు. ఎవరి నెత్తి మీద తలుగుతుంది, ముఖం మీద తలుగుతుంది, ఎలాంటిది ఏదీ చూడడు. అల్లాహ్ త’ఆలా మనందరినీ షైతాన్ నుండి రక్షించు గాక.

అందు గురించి ఏం చేయాలి? “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” ఎక్కువ చదువుతూ ఉండాలి. మనిషికి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” చదువుతూ ఉండాలి. ఒకసారి హజ్రత్ సులైమాన్ బిన్ సురద్ రదియల్లాహు అన్హు ప్రవక్తతో ఉన్నారు. అక్కడే కొంచెం దగ్గర్లో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. చివరికి బూతు మాటలకు దిగారు, తిట్టుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి ఎంత కోపానికి వచ్చేసాడు అంటే హదీస్ లో ఉంది, అతని చెంపలు ఉబ్బుతున్నాయి, ముఖం ఎర్రగా అయిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇన్నీ ల అ’లము కలిమతన్”. నాకు ఒక వచనం, ఒక మాట తెలుసు. ఆ మాట ఆ వ్యక్తి పలుకుతే అతని కోపం దిగజారిపోతుంది. మళ్ళీ చెప్పారు, “లౌ కాల అఊదు బిల్లాహి మినష్-షైతాన్”, ఇంకో రివాయత్ లో ఉంది “రజీమ్” అని కూడా. “దహబ అన్హు మా యజిద్”. ఒకవేళ అతను షైతాన్ నుండి అల్లాహ్ రక్షణ కోరుతూ ఉంటే, “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” చదువుతూ ఉంటే, ఏమవుతుంది? అతని కోపం చల్లారుతుంది, దిగజారిపోతుంది. అందు గురించి కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా, షైతాన్ నుండి రక్షణ కొరకు చాలా గట్టి మంచి ఆయుధం. బుల్లెట్ తగలకుండా ఏం చేస్తారు? బుల్లెట్ ప్రూఫ్. ఏదైనా అగ్ని మంటల్లో ఏదైనా పని చేస్తే అట్లాంటి పరిస్థితి వస్తే లేకుంటే అలాంటి భయం ఉండేది ఉంటే, ఏమంటారు దాన్ని? ఫైర్ ప్రూఫ్. అలాంటివి వేసుకొని వెళ్తారు కదా. షైతాన్ ప్రూఫ్ ఏంటి? షైతాన్ నుండి రక్షణ ఉండడానికి ఒకటి “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” విన్నాం కదా. ఇంకొకటి, “ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్” మరియు “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్“. ఈ రెండు సూరాలు, ప్రత్యేకంగా “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్” ఏముంది?

مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
(మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్)
గోచర, అగోచరంగా ఉండి చెడు ప్రేరేపణలు చేసేవాని కీడు నుండి. (114:4)
ఎవరి గురించి ఇది? షైతాన్ గురించి.

అయితే ఈ రెండు సూరాలు మంచిగా గుర్తుంచుకోవాలి. మరి ఈ రెండు సూరాల ఘనత ఇంతకు ముందే మనం ఒక సందర్భంలో విని ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం, ప్రతి నమాజ్ తర్వాత చదవాలి, ఒక్కొక్కసారి. “ఖుల్ హువల్లాహు అహద్” అది కూడా ఒకసారి చదవాలి. మరియు పడుకునే ముందు మూడు మూడు సార్లు చదవాలి. చేతి మీద ఊదుకోవాలి. సాధ్యమైనంత వరకు తుడుచుకోవాలి. ఇంకా పొద్దున మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు చదవాలి. ఈ విధంగా మీరు గమనించండి, కనీసం ఒక ముస్లిం పొద్దంతా “ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్”, “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్” మరియు “ఖుల్ హువల్లాహు అహద్” రోజుకు 14 సార్లు చదవాలి అన్నటువంటి ఆదేశం మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. ఎన్ని సార్లు? 14 అయినాయా? ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, పడుకునేటప్పుడు మూడు సార్లు, తొమ్మిది. ఐదు నమాజుల తర్వాత ఒక్కొక్కసారి. ఐదు + తొమ్మిది, 14. ఈ విధంగా.

షైతాన్ నుండి రక్షణ కొరకు, ఇప్పటి వరకు మనం ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత విషయాలు వినుకుంటూ వచ్చాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత, పిల్లల బాధ్యత కూడా చాలా గొప్పగా ఉంటుంది. షైతాన్ అక్కడ కూడా, ఇంకో హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, షైతాన్ షిర్క్ తర్వాత ఏ పాపంతోని ఎక్కువగా సంతోషిస్తాడో తెలుసా? భార్యాభర్తల్లో దూరం చేయడానికి. ఎవరైతే భార్యాభర్తల్లో లేకుంటే ఇద్దరు స్నేహితుల్లో మంచిగా కలిసి ఉన్న వాళ్లల్లో తెగతెంపులు వేస్తాడో, అలాంటి షైతాన్ తోని షైతాన్ యొక్క నాయకుడు చాలా సంతోషించి అతన్ని దగ్గరకు తీసుకొని అతన్ని షాబాష్ అని అంటాడు.

అందు గురించి ఇంట్లో కూడా షైతాన్ రాకుండా, షైతాన్ నుండి రక్షణ పొంది ఇంటిని, మనల్ని అన్నిటినీ కాపాడుకోవడానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని పద్ధతులు నేర్పారు. అతి ముఖ్యంగా ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చెప్పాలి, ఏం పలకాలి? ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చదువుకొని వెళ్ళాలి? కనీసం ఒక పదం చెప్పండి. ఒక్క మాటలో చెప్పండి. బిస్మిల్లాహ్, షాబాష్. కనీసం “బిస్మిల్లాహ్” అని చదవాలి.

సహీ ముస్లిం షరీఫ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎప్పుడైతే ఒక ముస్లిం ఇంట్లో ప్రవేశిస్తూ బిస్మిల్లాహ్ అంటాడో, అల్లాహ్ యొక్క పేరు తీసుకుంటాడో, అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తాడో, మరియు భోజనం చేస్తున్నప్పుడు కూడా అల్లాహ్ నామస్మరణ చేస్తాడో, షైతాన్ అంటాడు తన యొక్క చిన్న వాళ్లతోని, అసిస్టెంట్లతోని, ఈ ఇంట్లో మనకు ఉండడానికి స్థలము లేదు, తినడానికి తిండి లేదు.

అతి ముఖ్యంగా కనీసం ఈ దుఆ తప్పకుండా చదవాలి, ఈ పదం “బిస్మిల్లాహ్” అని అనాలి. ఇక ఆ తర్వాత రండి, కొన్ని విషయాలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, ఈ రోజు నుండే ఇంట్లో పాటించే ప్రయత్నం చేయండి. అల్లాహ్ ఈ సద్భాగ్యం నాకు, మీకు అందరికీ ప్రసాదించు గాక. ఇంట్లో ఎంతైనా గానీ సాధ్యమైనంత వరకు సూర బఖరా చదువుతూ ఉండే ప్రయత్నం చేయాలి. ఖురాన్లో అతి పొడుగు, దీర్ఘంగా, అతి పెద్ద సూర, సూర బఖరా. ప్రతి రోజు సూర బఖరా చదువుకుంటూ ఉంటే ఇక అన్ని పనులు, పాటలు అన్నీ వదిలేసేయాలి మౌల్వి సాబ్ అని అంటారు. అట్లా కాకుండా, ఎంతైనా గానీ కనీసం ఒక పేజీ, ఒక సగం పేజీ, చదువుతూ ఉండే అలవాటు చేసుకోవాలి. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “లా తజ్అలూ బుయూతకుమ్ మఖాబిర్”. “మీరు మీ ఇళ్లను సమాధులుగా చేసుకోకండి.”

إِنَّ الشَّيْطَانَ يَنْفِرُ مِنَ الْبَيْتِ الَّذِي تُقْرَأُ فِيهِ سُورَةُ الْبَقَرَةِ
(ఇన్నష్-షైతాన యన్ఫిరు మినల్-బైతిల్లదీ తుఖ్రఉ ఫీహి సూరతుల్-బఖరహ్)
నిశ్చయంగా, ఏ ఇంట్లో సూరతుల్ బఖరా పారాయణం చేయబడుతుందో, ఆ ఇంటి నుండి షైతాన్ పారిపోతాడు.

ఎంత గొప్ప లాభం. సూర బఖరాలోనే ఆయత్ నెంబర్ 255. ఆయతుల్ కుర్సీ అని. కనీసం ఈ సూర, ప్రత్యేకంగా పడుకునేటప్పుడు, ప్రత్యేకంగా పడుకునేటప్పుడు తప్పకుండా చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సహీ బుఖారీలో హదీస్, “ఇదా ఆవైత ఇలా ఫిరాషిక్”. నీవు నీ పడకపై పడుకోవడానికి వచ్చినప్పుడు, “ఫఖ్ర ఆయతల్ కుర్సీ”, “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” ఆయత్ కంప్లీట్ గా చదువు. “హత్తా తఖ్తిమల్ ఆయ” చివరి వరకు. “ఫఇన్నక లన్ యజాల అలైక మినల్లాహి హాఫిద్”. నీవు ఈ ఆయత్ చదివిన తర్వాత, నీ తోడుగా అల్లాహ్ వైపు నుండి ఒక రక్షకుడు ఉంటాడు. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం. కేవలం మనం చదివినందుకు అల్లాహ్ సంతోషపడి అల్లాహ్ మన యొక్క, మనల్ని కాపాడడానికి ఒక రక్షకుణ్ణి నియమిస్తాడు. “వలా యఖ్రబన్నక షైతానున్ హత్తా తుస్బిహ్”. తెల్లవారే వరకు షైతాన్ “లా యఖ్రబన్నక్”, నీ దగ్గరికి రాడు.

అల్లాహ్ నాకు, మీకు మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక. ఇంట్లో బిస్మిల్లాహ్ అని ప్రవేశించాము. ఆయతుల్ కుర్సీ చదువుకొని పడక మీద పడుకుంటున్నాము? మరి? ఇష్టమైన మంచి పాటలు వినుకుంటూ, ఫిల్మ్ లు చూసుకుంటూ పడుకుంటున్నాము. ఏమవుతుంది? చోర్ దర్వాజా ఓపెన్ చేసినట్టే కదా. జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా సోదరులారా! సూర బఖరాలోనే చివరి రెండు ఆయతులు ఉన్నాయి. సూర బఖరాలో చివరి రెండు ఆయతులు ఉన్నాయి. వాటి గురించి కూడా హదీస్ లో చాలా గొప్ప శుభవార్త, ఎంతో పెద్ద ఘనత తెలుపబడింది. అదేమిటి? సహీ తర్ గీబ్ లో హదీస్ ఉంది. తిర్మిదిలో కూడా.

إِنَّ اللَّهَ كَتَبَ كِتَابًا قَبْلَ أَنْ يَخْلُقَ السَّمَوَاتِ وَالأَرْضَ بِأَلْفَىْ عَامٍ أَنْزَلَ مِنْهُ آيَتَيْنِ خَتَمَ بِهِمَا سُورَةَ الْبَقَرَةِ وَلاَ يُقْرَآنِ فِي دَارٍ ثَلاَثَ لَيَالٍ فَيَقْرَبُهَا شَيْطَانٌ
(ఇన్నల్లాహ కతబ కితాబన్ ఖబ్ల అన్ యఖ్ లుఖస్-సమావాతి వల్-అర్ద బి అల్ఫై ఆమ్, అన్ జల మిన్హు ఆయతైని ఖతమ బిహిమా సూరతల్-బఖరహ్, వలా యుఖ్రఆని ఫీ దారిన్ సలాస లయాలిన్ ఫయఖ్రబహా షైతానున్.)

అల్లాహ్ త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించక ముందే రెండు వేల సంవత్సరాల ముందే ఒక కితాబ్, ఒక పుస్తకం రాసాడు. అందులో నుండి రెండు ఆయతులు సూర బఖరా చివరిలో అవతరింపజేశాడు. ఏ ఇంట్లో మూడు రోజుల వరకు దీని తిలావత్ జరుగుతూ ఉంటుందో, అక్కడికి షైతాన్ సమీపించడు. 

ఈ ఆయతులు ఏవి? “ఆమనర-రసూలు బిమా ఉన్ జిల ఇలైహి మిర్-రబ్బిహి వల్-ముఅమినూన్…” అంటే సూర బఖరాలోని చివరి రెండు ఆయతులు.

ఎంత గొప్ప శుభవార్తలో గమనించండి. ఈ రోజుల్లో మనం ఖురాన్ తోని డైరెక్ట్ సంబంధం పెట్టుకొని స్వయంగా మనం చదవడానికి బదులుగా ఏం చేస్తున్నాము? స్వయంగా నమాజ్ సాబ్, అన్ని ఇష్టమైన పాపాలన్నీ చేసుకోవచ్చు, వడ్డీ తినవచ్చు, లంచాలు తినవచ్చు, మంచి హాయిగా పెద్ద బిల్డింగ్ కట్టుకొని అన్ని అక్రమ సంపాదనలతో ఇంట్లో షైతాన్ రాకుండా, అరే ఓ మద్రసా కే బచ్చోంకో బులారే, ఖురాన్ పడా, ఖురాన్ ఖానీ కరా. ఆ మద్రసా పిల్లలను పిలుచుకొచ్చి ఖురాన్ ఖానీ చేస్తే, ఖలాస్ ఇక షైతాన్లన్నీ పారిపోతాయి అనుకుంటారు. సోదరులారా! ఇలాంటి దురాచారాలకు, ఇలాంటి బిద్అత్ లకు మనం పాల్పడకూడదు. మనం ఇష్టం వచ్చినట్లు జీవించుకొని, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని, మనం స్వయంగా ఐదు పూటల నమాజ్ చేయకుండా, స్వయంగా మనం ఇంట్లో ఖురాన్ చదవకుండా, మన పిల్లలకు ఖురాన్ శిక్షణ సరియైన విధంగా ఇవ్వకుండా, ఎవరో వచ్చి మద్రసాలో చదివే పిల్లవాళ్ళు వచ్చి చదివిపోతే ఇంట్లో అంతా బరకతే బరకత్ అవుతుంది, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, ఇలాంటి పద్ధతులు సరియైనవి కావు. ఇలాంటి దురాలోచనలకు దూరం ఉండాలి, దురాచారాలకు కూడా మనం దూరం ఉండాలి.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సోదరులారా ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఇంటి నుండి వెళ్లేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంట్లో పాటించేవి, లేక పాటించనివి పద్ధతులు ప్రత్యేకంగా ఇస్లాంలో మనకు ఏవైతే చూపించబడ్డాయో వాటిని మనం అవలంబించాలి. అలాగే మస్జిద్ లో వెళ్ళినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సామాన్యంగా ఒక దుఆ “అల్లాహుమ్మఫ్-తహ్లీ అబ్వాబ రహ్మతిక్” అని నేర్పారు. కానీ అదే కాకుండా ఇంకా ఎన్నో దుఆలు కూడా ఉన్నాయి. “అఊదు బిల్లాహిల్-అజీమ్, వబివజ్-హిహిల్-కరీమ్, వసుల్తానిహిల్-ఖదీమ్, మినష్-షైతానిర్-రజీమ్”.

సునన్ అబూ దావూద్ లో ఈ దుఆ కూడా ఉంది, మస్జిద్ లో వెళ్లేటప్పుడు చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఈ దుఆ చదువుకుంటారో, ఒక షైతాన్ అక్కడ ఉండి అంటాడు, ఈ రోజు పొద్దంతా ఇతన్ని నా నుండి కాపాడడం జరిగింది. షైతాన్ స్వయంగా అంటాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎవరైతే మస్జిద్ లో ప్రవేశించినప్పుడు “అఊదు బిల్లాహిల్-అజీమ్, వబివజ్-హిహిల్-కరీమ్, వసుల్తానిహిల్-ఖదీమ్, మినష్-షైతానిర్-రజీమ్” చదువుతాడో, షైతాన్ ఏమంటాడు? పొద్దంతా ఇతన్ని నా నుండి కాపాడడం జరిగింది. కొన్ని మస్జిద్ ల మీద ఈ దుఆ రాసి కూడా ఉంటుంది. లేనికాడ మీరు ప్రింట్ చేయించుకొని దాన్ని అతికించే ప్రయత్నం చేయండి. కనీసం చూసి అయినా గానీ చదవవచ్చు.

ఈ రోజు మనం హదీస్ ల ఆధారంగా, కొన్ని ఖురాన్ ఆయతుల ఆధారంగా షైతాన్ నుండి రక్షణ పొందుటకు ఏ కొన్ని మార్గాలైతే మనం విన్నామో, కొన్ని పద్ధతులు తెలుసుకున్నామో, వాటిపై ఆచరించే భాగ్యం అల్లాహ్ మనకు, మనందరికీ ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఇస్బాల్ – మగవారు దుస్తులు చీలమండలం (Ankles) క్రిందికి ధరించడం నిషిద్ధం [వీడియో & టెక్స్ట్]

ఇస్బాల్ – మగవారు దుస్తులు చీలమండలం (Ankles) క్రిందికి ధరించడం నిషిద్ధం
https://youtu.be/RpDjA_KkfMo [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

దుస్తులు చీలమండలం క్రిందికి ఉంచుట men wearing below ankles

ప్రస్తుత ప్రసంగంలో, వస్త్రాలను చీలమండలాల క్రిందకు ధరించడం (ఇస్బాల్) ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించ బడుతుందని వివరించబడింది. గర్వంతో లేదా గర్వం లేకుండా పురుషులు తమ ప్యాంటు, లుంగీ లేదా మరేదైనా వస్త్రాన్ని చీలమండలాల క్రిందకు వేలాడదీయడం నిషిద్ధమని, అలా చేసిన వారికి ప్రళయ దినాన అల్లాహ్ కరుణ లభించదని హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. అయితే, స్త్రీలకు పరదృశ్యుల నుండి తమ పాదాలను కప్పి ఉంచే నిమిత్తం, తమ వస్త్రాలను చీలమండలాల నుండి ఒక మూరెడు వరకు క్రిందకు వేలాడదీయడానికి అనుమతి ఉంది, కానీ అంతకంటే ఎక్కువ పొడవు ఉండరాదు. ఆధునిక ఫ్యాషన్ల పేరిట స్త్రీలు పొట్టి దుస్తులు ధరించడం లేదా వివాహాలలో నేలపై ఈడ్చుకుంటూ వెళ్లే పొడవాటి గౌనులు ధరించడం కూడా ఇస్లాంలో నిషిద్ధమని హెచ్చరించబడింది.

దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట. ఇక స్త్రీలు అనుకుంటున్నారు కావచ్చు, ఇందులో మాదేముందయ్యా, మగోళ్లకే కదా ఈ ఆదేశాలు? కొంచెం ఓపిక వహించండి శ్రద్ధగా వినండి.

దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట, దీన్ని ప్రజలు చాలా చిన్నదిగా, విలువ లేనిదిగా భావిస్తారు. ఏమంత పెద్ద పాపం కాదయ్య, నాకైతే గర్వ ఉద్దేశ్యం లేదు కదా అనేస్తారు. కానీ ఇది అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపాల్లో ఒకటి. అంటే, లుంగీ, ప్యాంట్ వగైరా చీల మండలం క్రిందికి ఉంచుట. కొందరి దుస్తులు నేలకు తాకుతూ ఉంటాయి. మరి కొందరివి భూమిపై వేలాడుతూ ఉంటాయి. దీనినే కొందరు ఏమంటారు? అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు చప్రాసీ పని నీకు ఇచ్చారా, నీ ప్యాంటు ద్వారా గంత గలీజు ఊడ్చుకుంటూ వెళ్తున్నావు? ఎవరైనా ప్యాంటును ఈడ్చుకుంటూ వెళ్లేవారు కోపానికి రాకండి. కొందరు అలా జోక్ గా మాట్లాడుకుంటారు అని అంటున్నాను. వాళ్ళు అలా మాట్లాడుకునే పరిస్థితి మీరు తీసుకురాకండి, మీ ప్యాంట్లు, మీ యొక్క లుంగీలు, మీ యొక్క బట్టలు, పైజామాలు గిట్ల కిందికి వ్రేలాడదీసి.

హజ్రత్ అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన హదీద్ లో ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ : الْمُسْبِلُ ( وَفِي رِوَايَةٍ : إِزَارَهُ ) وَالْمَنَّانُ ( وَفِي رِوَايَةٍ : الَّذِي لَا يُعْطِي شَيْئًا إِلَّا مَنَّهُ ) وَالْمُنَفِّقُ سِلْعَتَهُ بِالْحَلِفِ الْكَاذِبِ
“మూడు రకాల వ్యక్తులున్నారు. అల్లాహ్‌ వారితో సంభాషించడు. దయాభావంతో కన్నెత్తి చూడడు. వారిని పరిశుద్ధ పరచడు. వారికి తీవ్రమైన శిక్ష విధిసాడు. తన లుంగి (ప్యాంటు…) ను చీలమండలానికి క్రింది వరకు ఉంచేవాడు. ఉపకారం చేసి మాటిమాటికి చెప్పుకునేవాడు. దెప్పి పొడిచేవాడు. తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు” (ముస్లిం 106).

అల్లాహు అక్బర్. నాలుగు రకాల ఘోరమైన విషయాలు, చూస్తున్నారా? అల్లాహ్ మాట్లాడడు, కన్నెత్తి చూడడు, పరిశుద్ధ పరచడు, పైగా వారికి తీవ్ర శిక్ష ఉంటుంది.

ఎవరు వారు? అల్ ముస్బిల్. తన లుంగీ, ప్యాంట్, పైజామా ఏదైనా, ఏది అయినా తొడిగేది, సాక్స్ కాకుండా, ఎందుకంటే సాక్స్ కింది నుండి పైకి వస్తాయి. పై నుండి కిందికి వచ్చేటివి ఏ వస్త్రాలైనా గానీ చీల మండలానికి కిందిగా ఉన్నాయి అంటే, అతడికి ఈ శిక్ష ఉంది. ఇంకా రెండో వాడు ఎవడు? ఉపకారం చేసి, ఎవరికైనా ఏదైనా మేలు చేసి, మాటిమాటికి చెప్పుకునేవాడు, దెప్పిపొడిచేవాడు. మూడో వాడు ఎవడయ్యా? తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు.

కొందరు, నేను గర్వకారణంగా తొడగడం లేదు అని చెప్పి తన పవిత్రతను చాటుకుంటాడు. కాని అతని మాట చెల్లదు. గర్వం ఉద్దేశ్యం ఉన్నా లేకపోయినా అన్ని స్దితుల్లో అది నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ హదీసును గమనించండి:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసును గమనించండి:

مَا تَحْتَ الْكَعْبَيْنِ مِنَ الإِزَارِ فَفِي النَّارِ
(మా తహ్తల్ క’బైని మినల్ ఇజారి ఫఫిన్నార్)
“ఎవరి లుంగి (ప్యాంటు వగైరా) చీలమండలానికి క్రిందికి ఉండునో అది అగ్నికి ఆహుతి అవుతుంది”. (నిసాయీ 5330, ముస్నద్‌ అహ్మద్‌ 6/254).

ఒకవేళ గర్వంతో క్రిందికి వదిలితే. దాని శిక్ష ఇంకా పెద్దది, భయంకర మైనది. ఇదే తరహా స్పష్టీకరణ ప్రవక్తగారి ఈ ప్రవచనంలో ఉన్నది:

مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
“ఎవరైతే తన వస్త్రాన్ని గర్వంతో వ్రేలాడ దీస్తాడో ప్రళయదినాన అల్లాహ్‌ అతని వైపు కన్నెత్తి చూడడు’. (బుఖారి 3665, ముస్లిం 2085).

ఎందుకనగా అందులో రెండురకాల నిషిద్ధతలున్నాయి. ఒకటి గర్వం, రెండవది చీలమండలం క్రిందికి ధరించడం.

చీలమండలానికి క్రింద ధరించే నిషిద్ధత అన్ని రకాల దుస్తులపై ఉంది. అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రజియల్లాహు అన్హు)  ప్రవక్తతో ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

الْإِسْبَالُ فِي الْإِزَارِ وَالْقَمِيصِ وَالْعِمَامَةِ، مَنْ جَرَّ مِنْهَا شَيْئًا خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
“లుంగీని, చొక్కాను మరియు తలపాగను (చీలమండలానికి క్రిందకి) వ్రేలాడదీయుట (ఘోరపాపం). అయితే ఎవరైతే వీటిలో ఏ ఒక్కటినైనా గర్వంతో వ్రేలాడతీస్తాడో, ప్రళయ దినాన అల్లాహ్‌ అతనివైపు కన్నెత్తి చూడడు ‘. (అబూదావూద్‌ 4094, సహీహుల్‌ జామి 2770).

ఇక, కొందరు ఏమంటారు, నాకు గర్వం లేదు అని అంటారు కదా, ఆ మాట చెల్లదని ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము. వారికి ప్రత్యేకమైన శిక్ష ఉంది. అయితే రండి, మరొక హదీస్, ఇది నిసాయి లో వచ్చి ఉంది.

وارْفَعْ إِزَارَكَ إِلَى نِصْفِ السَّاقِ، فَإِنْ أَبَيْتَ فَإِلَى الْكَعْبَيْنِ، وَإِيَّاكَ وَإِسْبَالَ الْإِزَارِ، فَإِنَّهَا مِنَ الْمَخِيلَةِ، وَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمَخِيلَةَ
“నీ లుంగీని సగం పిక్కల వరకు లేపి ఉంచు, అంతపైకి కుదరదనుకుంటే చీలమండలం వరకు, చీలమండలానికి క్రిందికి ధరించడం నుండి దూరముండు, అది గర్వాహంకారంలో లెక్కించబడుతుంది మరియు అల్లాహ్ గర్వాహంకారాలను ఇష్టపడడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీకి చెప్పారు, “నీ లుంగీని సగం పిక్క వరకు లేపి ఉంచు. అంత పైకి కుదరదనుకుంటే, చీల మండలం వరకు.” చీల మండలం అంటే అందరికీ అర్థమైందా? గిట్టలు (ankles) అని అంటారు చూడండి, ఎక్కడైతే మన పాదం మొదలవుతుందో మరియు మన యొక్క పిక్క కింది కాలు భాగం పూర్తి అయి జాయింట్ ఏదైతే ఉంటుందో, రెండు వైపులా కొంచెం ఎక్కువగా వచ్చి ఉంటాయి ఆ ఎముకలు, గిట్టెలు అని కూడా కొందరు అంటారు, చీల మండలం అని అంటారు. దానిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీకి చెప్పారు, ఒకవేళ నీవు సగం పిక్క వరకు కుదరదు అనుకుంటే చీలమండలం వరకు, అంటే అది కనబడాలి. దానిపైకి ఉండాలి వస్త్రం.

وَإِيَّاكَ وَإِسْبَالَ الْإِزَارِ؛ فَإِنَّهَا مِنَ الْمَخِيلَةِ، وَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمَخِيلَةَ
(వ ఇయ్యాక వ ఇస్బాలల్ ఇజార్, ఫ ఇన్నహా మినల్ మఖీలా, వ ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ మఖీలా)
“చీల మండలానికి క్రిందికి ధరించడం నుండి నువ్వు దూరం ఉండు. ఉద్దేశ్యం నీది లేకపోయినా గాని, ఇది గర్వ అహంకారం లో లెక్కించబడుతుంది. మరియు అల్లాహ్ త’ఆలా గర్వ అహంకారాలను ఇష్టపడడు.”

ఇక స్త్రీల మాటకు వస్తారా? ఈ నిషిద్ధత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే, వారి శరీరంలో ఏ కొంత భాగం కూడా పరపురుషులకు కనబడకుండా ఉండుట తప్పనిసరి గనక, ఆమె తన పాదాలు కనబడకుండా క్రిందికి వ్రేలాడదీయవచ్చును. కానీ ఎంత? అంతకంటే ఎక్కువ ఉంటే ఆమెకు కూడా శిక్షనే మరి. ఎంత? ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజీలో ఉన్న సహీ హదీస్, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
(మన్ జర్ర సౌబహు ఖుయలాఅ లమ్ యందురిల్లాహు ఇలైహి యౌమల్ ఖియామా)
ఎవరైతే తమ యొక్క వస్త్రాలను చీలమండలానికి క్రిందిగా వేలాడదీస్తారో, హుయలా (గర్వ అహంకారాలతో), అల్లాహ్ అలాంటి వారి వైపున ప్రళయదినాన చూడడు. అక్కడ ఉమ్మె సలమా రదియల్లాహు త’ఆలా అన్హా అడిగినది, ప్రశ్నించినది:

فَكَيْفَ يَصْنَعْنَ النِّsسَاءُ بِذُيُولِهِنَّ؟
(ఫకైఫ యస్న’అన్నిసాఉ బి దుయూలిహిన్?)
“స్త్రీలు వారి యొక్క వస్త్రాలలో ఏదైతే కిందికి వేలాడి ఉంటాయో వారి పరిస్థితి ఏమిటి?”

يُرْخِينَ شِبْرًا
(యుర్ఖీన షిబ్రా)
ప్రవక్త చెప్పారు: “ఒక జానెడు వారు కిందికి వేలాడదీయవచ్చు.” ఈ జానెడు అంటే ఎక్కడి నుండి జానెడు? చీల మండలం నుండి జానెడు, ఎందుకంటే అక్కడి వరకే తొడగాలని ముందు చెప్పారు కదా.

ఈ హదీసును స్త్రీలు చాలా శ్రద్ధగా వినాలి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో లెగ్గింగ్స్ వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, చర్మానికి, తోలుకు మొత్తం అతుక్కుపోయే విధంగా, చాలా టైట్ గా ఉండే అటువంటి ప్యాంట్లు, పైజామాలు ఏదైతే స్త్రీలు తొడుగుతున్నారో, బయటికి వెళ్తున్నారో, భయపడండి అల్లాహ్ తో, గమనించండి. వారి యొక్క ఆ పైజామాలు, ప్యాంట్లు, లెగ్గింగ్స్ అన్నీ పైకి ఉంటాయి. అలాంటి వారు ప్రత్యేకంగా ఈ హదీసును వినాలి.

స్త్రీలము మేము మా పాదాలు కూడా పర పురుషులకు కనబడకుండా ఉండాలి కదా, మరి ఎవరైతే చీలమండలానికి క్రిందిగా తొడుగుతారో వారికి నరకశిక్ష ఉన్నది అని, ప్రళయ దినాన అల్లాహ్ చూడడు అని మీరు అంటున్నారు కదా ప్రవక్తా, మరి మా స్త్రీల పరిస్థితి ఏమిటి అంటే, “ఒక జానెడు వేలాడదీయండి” అని చెప్పారు. అయితే ఉమ్మె సలమా రదియల్లాహు త’ఆలా అన్హా అడిగారు:

إِذًا تَنْكَشِفُ أَقْدَامُهُنَّ
(ఇదన్ తన్కషిఫు అఖ్దాముహున్నా)
“నిలబడి ఉండి జానెడు కిందికి తీస్తే పర్లేదు, కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పాదాలు తెరచిఉంటాయి క కదా?” అప్పుడు ప్రవక్త చెప్పారు:

فَيُرْخِينَهُ ذِرَاعًا لَا يَزِدْنَ عَلَيْهِ
(ఫ యుర్ఖీనహు దిరా’అన్, లా యజీద్న అలై)
“ఒక మూరెడు వారు కిందికి ఉంచవచ్చు. అంతకంటే ఇంకా ఎక్కువ పొడుగ్గా ఉంచడం ఇది కుదరదు.” అందువల్ల వారు కూడా శిక్షలకు గురి అవుతున్నారు.

కానీ మన సమాజంలోని స్త్రీలలో రెండు రకాల ఫ్యాషన్లు వారిని నాశనానికి, వినాశనానికి గురి చేస్తున్నాయి. ఒకటి, ఆఫీసుల్లో జాబ్ చేసే స్త్రీలు అని గానీ, కాలేజీల్లో చదివే అమ్మాయిలు గానీ, స్కర్టులు వేసుకోవడం, ఇంకా ఏదేదో కొత్త కొత్త పేర్లతో ఏమేమో వేసుకోవడం, వారి యొక్క పాదాలు, చీలమండలు, సగం పిక్కలు, మోకాళ్ల వరకు కూడా కనబడి ఉండటం, ఇదొక ఫిత్నా అయిపోతుంది. ఇదొక చాలా వినాశనానికి వారు దారి తీస్తున్నారు. మరియు మరోవైపున, కొన్ని ఫంక్షన్లలో, కొన్ని ఫంక్షన్లలో, కొన్ని రకాల బట్టలు ఎలా కుట్టిస్తారంటే ఒక మీటర్, రెండు మీటర్లు, మూడు మీటర్లు వెనక్కి అది వేలాడుతూ ఉంటాయి. ఇది ఒక గర్వంగా, ఇది ఒక ఫ్యాషన్ గా, ఇది ఒక మోడల్ గా, ఆ, ఇది మా యొక్క పెళ్లికి ప్రత్యేక చిహ్నం అండి అన్నట్లుగా చెప్పుకుంటారు. కానీ ఈ హదీసు ఆధారంగా అది కూడా నిషిద్ధం. కొందరు పెళ్లికూతుర్లు ధరించే దుస్తులు మీటర్ కంటే ఎక్కువ కిందికి ఉంటాయి. ఒక్కోసారి ఎంతకంటే పొడుగ్గా ఉంటాయి, వెనక ఉన్నవారు ఎత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి కూడా యోగ్యం కావు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=6512

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

పురుషులు బంగారం వేసుకొనుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో | టెక్స్ట్]

పురుషులు బంగారం వేసుకొనుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/7NYeGuNGHnk (6 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.

అబూ మూసా అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

أُحِلَّ لِإِنَاثِ أُمَّتِي الْحَرِيرُ وَالذَّهَبُ وَحُرِّمَ عَلَى ذُكُورِهَا
బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురు షులకు నిషిద్ధం”.
(ముస్నద్ అహ్మద్: 4/393. సహీహుల్ జామి 207).

ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

أنَّ رسُولَ الله ﷺ رَأَى خَاتَمًا مِنْ ذَهَبٍ فِي يَدِ رَجُلٍ فَنَزَعَهُ فَطَرَحَهُ وَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ إِلَى جَمْرَةٍ مِنْ نَارٍ فَيَجْعَلُهَا فِي يَدِهِ فَقِيلَ لِلرَّجُلِ بَعْدَ مَا ذَهَبَ رَسُولُ الله ﷺ خُذْ خَاتِمَكَ انْتَفِعْ بِهِ قَالَ لَا وَالله لَا آخُذُهُ أَبَدًا وَقَدْ طَرَحَهُ رَسُولُ الله ﷺ

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).

ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.

ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.

  1. బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
  2. తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
  3. పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
  4. సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.

అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5351

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

స్త్రీ సుగంధం (సెంట్) పూసుకొని బైటికి వెళ్ళుట [వీడియో| టెక్స్ట్]

https://youtu.be/kfJHzMYHTnE [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఒక స్త్రీ సుగంధం పూసుకుని బయటికి వెళ్లడం ఇస్లాంలో తీవ్రంగా పరిగణించబడే పాపమని హెచ్చరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ప్రకారం, పురుషులు తన సువాసనను ఆఘ్రాణించాలని బయటికి వెళ్లే స్త్రీ వ్యభిచారిణిగా పరిగణించబడుతుందని చెప్పబడింది. ఇంట్లో సుగంధం పూసుకున్న స్త్రీ మస్జిద్ వంటి పవిత్ర స్థలానికి వెళ్లాలనుకున్నా సరే, బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా జనాబత్ స్నానం (సంపూర్ణ స్నానం) చేయాలని, లేకపోతే ఆమె నమాజ్ అంగీకరించబడదని స్పష్టం చేయబడింది. ఆధునిక కాలంలో వివాహాలు, పండుగలు, బజార్లకు, చివరకు రమదాన్‌లో తరావీహ్ నమాజ్‌కు కూడా మహిళలు బలమైన పరిమళాలను ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేయబడింది. ఈ చర్యల యొక్క తీవ్రతను అర్థం చేసుకుని, పురుషులు తమ కుటుంబంలోని స్త్రీలకు మార్గనిర్దేశం చేయాలని మరియు స్త్రీలు స్వయంగా ఈ నిషిద్ధతలకు దూరంగా ఉండాలని ఉపదేశించబడింది.

స్త్రీ సుగంధం పూసుకొని బయటికి వెళ్లుట

నేను ఆఫీసులో జాబ్ చేస్తున్నానండీ. నేను ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఫలానా ఫ్యాక్టరీలో పెద్ద మంచి పోస్ట్ ఉంది నాది. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కనీసం ఏదైనా సువాసన పూసుకోకుంటే ఎలా? నేను ఇప్పుడు ఫంక్షన్లో వెళ్లాలి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. శ్రద్ధగా వినండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు పూసుకొని ఇంటి బయటికి వెళ్లుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో చాలా ప్రబలిపోతుంది. ప్రవక్త వారి ఆదేశం ఏంటి?

أَيُّمَا امْرَأَةٍ اسْتَعْطَرَتْ ثُمَّ مَرَّتْ عَلَى الْقَوْمِ لِيَجِدُوا رِيحَهَا فَهِيَ زَانِيَةٌ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్రాణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి “ (ముస్నద్‌ అహ్మద్‌ 4/418, సహీహుల్‌ జామి 105).

అవూదుబిల్లాహ్, అవూదుబిల్లాహ్. వింటున్నారా? చూస్తున్నారా?

కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవర్, సేల్స్‌మేన్ మరియు పాఠశాలల వాచ్‌మేన్‌ల ముందు నుండి వెళ్తారు, అయితే సువాసన పూసుకున్న స్త్రీ బయటికి వెళ్లదలచినప్పుడు, ఆ బయటికి వెళ్లడం మస్జిద్ లాంటి పవిత్ర స్థలానికైనా సరే, అర్థమవుతుందా?

ఒక స్త్రీ సువాసన పూసుకొని ఉంది, ఇంట్లో ఉంది. కొంతసేపటి తరవాత అచానక్, యేకాయేక్యిగా బయటికి వెళ్లాలనిపించింది ఏదైనా పని మీద గానీ, లేదా జుమా నమాజ్ సమయం అయితుంది లేదా జుమా ఈరోజు మస్జిద్లో ఏదో పెద్ద ఆలిమ్ వచ్చి ప్రసంగిస్తున్నారు, అక్కడ స్త్రీలకు కూడా పర్దా ఏర్పాటు ఉంది, అయితే మస్జిద్కు వెళ్లాలనుకుంటుంది. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఉన్నదో, ఆ తర్వాత ఆమె బయటికి వెళ్లాలనుకుంటుందో, చివరికి ఆమె మస్జిదుకు వెళ్లాలి అని కోరినా, అక్కడికి వెళ్లేకి ముందు, బయటికి వెళ్లేకి ముందు గుస్లే జనాబత్ చెయ్యాలి. గుస్లే జనాబత్ అంటే పెద్దవారికి తెలిసిన విషయమే. స్వప్న స్థలనం వల్ల లేదా భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల ఏ స్థితిలో మనిషి ఉంటాడో దానిని జనాబత్, అశుద్ధత, నాపాకీ అంటారు. దాని వల్ల స్నానం చేయడం విధి అవుతుంది. దానికి స్నానం ఎలా చేయాలి? ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ఆ రీతిలో స్నానం చేయనంతవరకు ఆమె బయటికి వెళ్లకూడదు. కఠినంగా దీని గురించి ఆదేశం వచ్చింది. శ్రద్ధగా వినండి.

أَيُّمَا امْرَأَةٍ تَطَيَّبَتْ ثُمَّ خَرَجَتْ إِلَى الْمَسْجِدِ لِيُوجَدَ رِيحُهَا لَمْ يُقْبَلْ مِنْهَا صَلَاةٌ حَتَّى تَغْتَسِلَ اغْتِسَالَهَا مِنْ الْجَنَابَةِ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆఘ్రాణించాలని మస్టిద్‌ వస్తుందో, ఆమె జనాబత్‌ వల్ల చేసే విధంగా స్నానం చేసిరానంత వరకు ఆమె నమాజు అంగీకరింపబడదు”. (ముస్నద్‌ అహ్మద్‌ 2/444, సహీహుల్‌ జామి 2703).

అల్లాహు అక్బర్. నమాజ్ ఎందువల్ల అంగీకరింపబడదు? ఎవరైనా స్త్రీ సువాసన పూసుకొని బయటికి వస్తుంది, పురుషులు ఉంటారు, వారు కూడా ఆ సువాసన పీలుస్తారు, ఇవన్నీ తెలిసి కూడా, స్త్రీ వాటి నుండి జాగ్రత్తపడి రాకుంటే ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే సుగంధాలు ఏవైతే కొన్ని రకాలు తెలపడం జరుగుతున్నాయో, ఈ సుగంధాల విషయంలో ఇక అల్లాహ్ తోనే మొరపెట్టుకోవాలి. అల్లాహ్, మా ఈ స్త్రీలకు హిదాయత్ ఇవ్వు అని ఇలా దుఆ చేసుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపువాడు. ఎందుకనగా, ఈనాటి స్త్రీలు పెళ్లిళ్లలో, ఉత్సవాల్లో వెళ్లేముందు ఉపయోగించే సాంబ్రాణి ధూపములు, అదేవిధంగా బజారుల్లో, వాహనాల్లో అందరూ ఏకమై కలిసేచోట, చివరికి రమదాన్ మాసంలో తరావీహ్‌ల కొరకు ఏదైతే మస్జిదులో వస్తారో, ఇతర రోజుల్లో మస్జిదులో వెళ్లేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆఘ్రాణించగల, పీల్చబడే అటువంటి సుగంధములు వాడుతూ ఉంటారు. అయితే ఈ సందర్భాలు ఏవైతే ఇప్పుడు తెలపబడ్డాయో, ఇలాంటి సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు.

ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాలు ఎలా ఉండాలి? వాటి రంగు కానరావాలి. కానరావాలి అంటే పర పురుషులకు కాదు. ఇంట్లో ఉన్న స్త్రీలకు లేదా భర్తకు. కానీ సువాసన రాకూడదు. అల్లాహ్, మాలోని కొందరు మూర్ఖ ప్రజలు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములను శిక్షించకు, మా అందరికీ సన్మార్గం ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్.

విషయం అర్థమైందా? మనం మన స్త్రీలను జాగ్రత్తలో, వారి యొక్క అన్ని రకాల పరువు మానాలు భద్రంగా ఉండేందుకు, వారి యొక్క విశ్వాసం కూడా బలంగా ఉండేందుకు, ఇలాంటి నిషిద్ధతలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం మనం పురుషులము, భర్తలము చేయాలి, తండ్రులము చేయాలి. మరియు స్త్రీలు కూడా స్వయంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, భర్తలు గానీ, తండ్రులు గానీ, సోదరులు గానీ మాటిమాటికి చెప్పే అటువంటి పరిస్థితి రానివ్వకూడదు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5314

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు (خطورة الدعاء مع غير الله)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

https://www.youtube.com/watch?v=k3vxVbMjq6g [27 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.

సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:

لَهُ دَعْوَةُ الْحَقِّ
(లహు ద’వతుల్ హఖ్)
దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)

ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.

ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:

وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
(వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్)
అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)

అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్)
మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను (40:60)

వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.

ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۖ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)

దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆఉ హువల్ ఇబాదహ్)
దుఆ అసలైన ఇబాదత్.

మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.

అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ
(వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్)
అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)

సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:

وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ
(వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్)
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)

అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.

అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.

సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.

وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ
(వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్)
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”

షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?

قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ
(ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్)
“ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)

గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.

అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:

حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ

ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)

అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.

అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:

لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
(లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా)
మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)

లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా? 

అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:

فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
(ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్)
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)

ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
(వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)

إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)

(వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.

(వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.

అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. (34:22)

(ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.

అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.

ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.

ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)

وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)

(వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.

(వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.

ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.

ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.

అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.

అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.

అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5159


“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=yZS2dByYpu8
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

أَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
(సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ (స) పైన, ఆయన కుటుంబ సభ్యులపైన మరియు ఆయన సహచరులందరిపైన శాంతి మరియు శుభాలు వర్షించుగాక.)

సోదర మహాశయులారా! “విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్య శీర్షికలో, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం తౌహీద్, అల్లాహ్ ఏకత్వం విషయంలో, తౌహీద్ అంటే ఏమిటి? అందులో ముఖ్యమైన మూడు లేదా నాలుగు భాగాలు ఏవైతే మనం అర్థం చేసుకోవడానికి విభజించి తెలుసుకున్నామో.

రెండవ పాఠంలో, తౌహీద్, కలిమ-ఎ-తౌహీద్ لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) యొక్క నిజమైన భావం ఏమిటి? అందులో ఉన్న రెండు ముఖ్యమైన రుకున్‌లు, అంటే మూల సూత్రాలు నఫీ (نفي – తిరస్కరించుట) వ ఇస్బాత్ (إثبات – అంగీకరించుట), నిరాకరించుట మరియు అంగీకరించుట, వీటి గురించి ఇంకా لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) యొక్క గొప్ప ఘనత ఏమిటి అనేది కూడా తెలుసుకున్నాము.

ఇక మూడవ పాఠంలో, لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) కు ఏడు షరతులు అందులో ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటినీ మనం నమ్మడం, అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా ఆచరించడం తప్పనిసరి. ఆ ఏడు షరతులు కూడా తెలుసుకున్నాము. సంక్షిప్తంగా ఏమిటవి? ఇల్మ్ (علم – జ్ఞానం), యఖీన్ (يقين – దృఢ విశ్వాసం), కబూల్ (قبول – అంగీకారం), ఇన్ఖియాద్ (انقياد – విధేయత), ఇంకా సిద్ఖ్ (صدق – సత్యసంధత), మహబ్బత్ (محبة – ప్రేమ), ఇఖ్లాస్ (إخلاص – నిష్కల్మషత్వం). ఏడు కదా! అయితే ఎవరైనా ఈ విషయాలు ఇంకా అర్థం కాకుంటే, వెనుక పాఠాలు వినాలి అని నేను కోరుతున్నాను. అల్లాహ్ యొక్క దయవల్ల YouTube ఛానల్‌లో ‘Z Dawah’ లేదా ‘JDK Naseer’ అనే ఛానల్‌లో వెళ్లి వాటిని పొందవచ్చు.

ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల కలిమ-ఎ-షహాదత్ (كلمة الشهادة), పవిత్ర వచనం యొక్క సాక్ష్యం మనం ఏదైతే పలుకుతామో అందులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి కదా! ఒకటి لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్), రెండవది محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్). ఆరాధనలకు అర్హులు కేవలం అల్లాహ్ మాత్రమే అని నమ్ముతాము. ఇది لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో ఉంది. ఇక రెండవది, محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్).

ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం అంటామో, సామాన్యంగా వుజూ చేసిన తర్వాత أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అనాలి. ఏంటి లాభం? స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి. ఎవరైతే వుజూ చేసిన తర్వాత ఈ చిన్న దుఆ చదువుతారో అని మనకు సహీహ్ ముస్లిం షరీఫ్‌లో ఈ శుభవార్త ఉంది. అలాగే అత్తహియ్యాత్ మనం చదువుతాము కదా, అందులో కూడా أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అత్తహియ్యాత్‌లో. మరి ఈ అత్తహియ్యాత్ ప్రతీ నమాజ్‌లోని తషహ్హుద్‌లో, ప్రత్యేకంగా చివరి తషహ్హుద్, ఏ తషహ్హుద్‌లోనైతే మనం సలాం తింపుతామో, అందులో చదవడం నమాజ్ యొక్క రుకున్, నమాజ్ యొక్క పిల్లర్ లాంటి భాగం అని కూడా పండితులు ఏకీభవించారు. అయితే గమనించండి, మనం మాటిమాటికీ ఏదైతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం కూడా పలుకుతూ ఉంటామో, దాని యొక్క నిజమైన భావం తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

హృదయంతో మరియు నోటితో, మనసా వాచా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం పలుకుతూ, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు అని నమ్మాలి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసులు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు. ముఖ్యంగా ఈ రెండు విషయాలు. ఇక ఈ రెండు విషయాలు నమ్ముతున్నప్పుడు అందులో మరికొన్ని వివరాలు ఉంటాయి, వాటిని కొంచెం మనం అర్థం చేసుకుందాం.

అయితే ఇందులో ధర్మ పండితులు, ప్రత్యేకంగా ఉలమాయె అఖీదా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని మనం పలుకుతున్నాము, సాక్ష్యం పలుకుతున్నాము, నమ్ముతున్నాము అంటే అందులో నాలుగు విషయాలు వస్తాయి అని చెప్పారు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ను విశ్వసించడంలో ఎన్ని విషయాలు? నాలుగు విషయాలు.

మొదటి విషయం, ఆయన మనకు ఏ ఆదేశం ఇచ్చారో విధేయత చూపాలి, అంటే ఆజ్ఞాపాలన చేయాలి. طَاعَتُهُ فِيمَا أَمَرَ (తాఅతుహూ ఫీమా అమర్). ప్రవక్త ఏ ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని మనం పాటించాలి. అర్థమైందా? ఉదాహరణకు మీరు హదీసులు చదువుతూ ఉన్నప్పుడు, “ఆమురుకుం బి సబ్అ” (నేను ఏడు విషయాల గురించి మీకు ఆదేశిస్తున్నాను) అని సహీ బుఖారీలో వచ్చింది. అల్లాహ్‌ను తప్ప ఇంకా వేరే ఎవరినీ కూడా మీరు ఆరాధించకండి, ఐదు పూటల నమాజు పాబందీగా చేయండి, ఈ విధంగా. ఇంకా వేరే ఎన్నో ఆదేశాలు ఉన్నాయి. ప్రవక్త ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని ఏం చేయాలి? విధేయత చూపాలి. ఆజ్ఞాపాలన చేయాలి.

రెండవ విషయం, تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ విషయాలు మనకు తెలిపారో వాటన్నింటినీ మనం సత్యంగా నమ్మాలి. గత కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు తెలిపారు. తర్వాత కాలంలో రానున్న కొన్ని సంఘటనల గురించి మనకు తెలియజేశారు. ప్రత్యేకంగా ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి అని కూడా తెలిపారు. అరే, అంత పాత కాలం నాటి విషయాలు ఎలా చెప్పారు? అరే ఇలా కూడా జరుగుతుందా? అరే ప్రళయానికి కంటే ముందు ఇట్లా అవుతుందా? ఇలాంటి సందేహాల్లో మనం పడకూడదు. ప్రవక్త చెప్పిన మాట నూటికి నూరు శాతం సత్యం. అందులో అనుమానానికి, దాన్ని మనం తిరస్కరించడానికి, అబద్ధం అన్నటువంటి అందులో ఏ సంశయం లేనే లేదు. تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి. నూహ్ (అలైహిస్సలాం) ఎన్ని సంవత్సరాలు జీవించారో, వాటికి సంబంధించిన కొన్ని విషయాలు, ప్రవక్త ఇబ్రాహీంకు సంబంధించిన విషయాలు, ప్రవక్త మూసా, ఈసా (అలైహిముస్సలాతు వత్తస్లీమ్) కు సంబంధించిన కొన్ని విషయాలు, ఇంకా బనీ ఇస్రాయీల్‌లో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రవక్త మనకు తెలిపారు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? సత్యంగా నమ్మాలి. ప్రళయానికి కంటే ముందు దజ్జాల్ వస్తాడు, మహదీ వస్తాడు, ఈసా (అలైహిస్సలాం) వస్తారు, అలాగే దాబ్బతుల్ అర్ద్ అనే ఒక జంతువు వస్తుంది. అలాగే ప్రళయానికి కంటే ముందు సూర్యుడు, ప్రతిరోజూ ఎటునుండి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి, ప్రళయం రోజు పడమర నుండి. అల్లాహు అక్బర్! అది అలా ఎలా జరుగుతుంది, ప్రతిరోజూ మనం ఇట్లా చూస్తున్నాము కదా, ప్రళయానికి కంటే ముందు అట్లా ఎట్లా జరుగుతుంది అని సందేహం వహించడానికి అవకాశం లేదు. ప్రవక్త తెలిపారు, ఇలా జరిగి తీరుతుంది.

ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం నమ్ముతామో, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయని చెప్పాను? మొదటి విషయం, ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, విధేయత చూపాలి, ఆజ్ఞాపాలన. రెండవది, ఆయన ఏ ఏ విషయాలు తెలిపారో అవన్నీ సత్యం అని నమ్మాలి.

మూడవది, اجْتِنَابُ مَا نَهَى عَنْهُ وَزَجَرَ (ఇజ్తినాబు మా నహా అన్హు వ జజర్). ఆయన ఏ విషయాల నుండి మనల్ని హెచ్చరించారో, వారించారో, నిషేధించారో, “ఇది చేయకండి” అని చెప్పారో వాటికి మనం దూరంగా ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయత చూపకండి, చేతబడి చేయకండి, జూదం ఆడకండి, వ్యభిచారం చేయకండి, షిర్క్ పనులు చేయకండి, గడ్డాలు కత్తిరించకండి. ఈ విధంగా ఏ ఏ నిషేధాలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు నిషేధించి ఉన్నారో, ఖండించి ఉన్నారో, వారించి ఉన్నారో, వాటన్నిటినీ మనం వాటికి దూరంగా ఉండాలి.

నాల్గవ విషయం, وَأَلَّا يُعْبَدَ اللَّهُ إِلَّا بِمَا شَرَعَ (వ అల్లా యూ’బదల్లాహు ఇల్లా బిమా షర’అ). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఏ విధంగా ఆరాధించారో, అదే విధంగా మనం కూడా ఆరాధించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఎలా ఆరాధించాలో, మనము కూడా అలాగే ఆరాధించాలి. నమాజ్ విషయంలో గానీ, ఉపవాసాల విషయాలలో గానీ, జకాత్, హజ్ విషయాలలో గానీ, వివాహ విషయాలలో గానీ, ప్రవక్త యొక్క నడవడిక గానీ, అందుకొరకే అల్లాహ్ ఏం చెప్పాడు? لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ (లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనహ్ – నిశ్చయంగా మీ కొరకు అల్లాహ్ ప్రవక్తలో ఒక ఉత్తమ ఆదర్శం ఉంది). ప్రవక్త మీకు ఒక మంచి ఆదర్శం. మీరు ఆయన ఆదర్శాన్ని పాటించాలి.

ఇక ఈ నాలుగు విషయాలు ఏదైతే నేను చెప్పానో, ప్రతి ఒక్క దానికి ఖురాన్‌లో, హదీస్‌లో ఎన్నో దలీల్‌లు ఉన్నాయి. కానీ టైం మనకు సరిపడదు గనుక సంక్షిప్తంగా చెబుతున్నాను. విషయం అర్థమైంది కదా! మనం ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నమ్ముతున్నాము అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి అందులో? నాలుగు విషయాలు. మరొకసారి మీకు గుర్తుండడానికి: ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, ఆయన తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి, ఆయన ఏ విషయాల నుండి మనల్ని నిషేధించారో, ఖండించారో, వారించారో వాటికి దూరంగా ఉండాలి, ఆయన అల్లాహ్‌ను ఎలా ఆరాధించారో అలాగే మనం ఆరాధించాలి.

అయితే సోదర మహాశయులారా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం పలుకుతున్నామో, ఇందులో కూడా ముఖ్యమైన రెండు రుకున్‌లు ఉన్నాయి. రెండు మూల సూత్రాలు ఉన్నాయి. لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో రెండు మూల సూత్రాలు ఉన్నాయి అని చెప్పాము కదా, ఒకటి నఫీ, మరొకటి ఇస్బాత్. ఇందులో రెండు మూల సూత్రాలు ఉన్నాయి. ఒకటి ‘అబ్ద్’ (عَبْد), మరొకటి ‘రసూల్’ (رَسُول). ‘అబ్ద్’ అంటే దాసుడు. అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన అబ్దుల్లాహ్ యొక్క కుమారుడు. అబ్దుల్లాహ్ మరియు ఆమిన. ఆయన యొక్క వంశ పరంపర ఏమిటి? ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వంశ పరంపరంగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క పెద్ద కుమారుడైన ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతిలో వస్తారు. మరియు ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఆదం (అలైహిస్సలాం) సంతతిలోని వారు. ఈ విధంగా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనలాంటి ఒక మనిషి. అల్లాహ్ యొక్క దాసుడు. కానీ కొంచెం జాగ్రత్త. మనలాంటి మనిషి అన్న ఈ పదం ఏదైతే ఉపయోగించానో, ఇక్కడ భావాన్ని తెలుసుకోవాలి. లేదా అంటే మళ్ళీ కొందరు మనల్ని పెడత్రోవ పట్టించేటువంటి ప్రమాదం ఉంది.

మనలాంటి మనిషి అని ఎప్పుడైతే మనం మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అంటామో, అక్కడ దాని భావం ఏమిటి? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, మనం ఎలాగైతే ఆదం యొక్క సంతతియో, మనకు ఎలాగైతే ఆకలి, దాహము కలిగినప్పుడు తినడం, త్రాగడం, అవసరాలు తీర్చుకోవడం, పడుకోవడం, నిద్ర రావడం, ఏదైనా దెబ్బ తగిలిందంటే నొప్పి కలగడం, బాధ కలగడం, ఇలాంటి మానవ సహజ అవసరాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అవసరాలే ప్రవక్తకు ఉండినవి. ఆయన వేరే ఏ సృష్టి కాదు, మానవ సృష్టిలోనే మనలాంటి ఒక వ్యక్తి. కానీ, సర్వ మానవాళిలోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తర్వాత అందరికంటే గొప్పవారు. అర్థమైందా? కేవలం మానవుల్లోనే కాదు, జిన్నాతులో, మిగతా ఈ సృష్టి అంతటి, అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేదైతే ఉందో, ప్రతి దానిలో కెల్లా అత్యంత గౌరవనీయులు, అత్యంత అల్లాహ్‌కు ప్రియులు, అత్యంత గొప్పవారు, ఎక్కువ ఘనత గలవారు ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ప్రవక్త ముహమ్మద్ మనలాంటి మనిషి అంటే, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, సమానత్వంగా చేస్తున్నాము, మనకు ఈక్వల్‌గా చేస్తున్నాము, అలాంటి భావం రానే రాకూడదు. మనలాంటి మనిషి అంటే ఏంటి ఇక్కడ భావం? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, ఆయన కూడా అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు. మానవ జన్మ ఎత్తినవారు. మానవ అవసరాలు సహజంగా ఏవైతే ఉంటాయో తినడం, త్రాగడం, పడుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, సంతానం కలగడం, మార్కెట్‌కు వెళ్లడం, అవసరం ఉన్న సామాను కొనుక్కొని రావడం, ఈ విధంగా ఈ పనులు ఏదైతే మనం మానవులం చేసుకుంటామో, అలాంటి అవసరాలు కలిగిన ఒక వ్యక్తే. కానీ, ఆయన స్థానానికి ఎవరూ చేరుకోలేరు. ఈ లోకంలోనే మొత్తం అల్లాహ్ తర్వాత ఆయనకంటే గొప్ప ఇంకా వేరే ఎవరూ కూడా లేరు.

అబ్ద్. దీని గురించి ఖురాన్‌లో ఎన్నో పదాలు ఉన్నాయి. అబ్ద్ అన్న పదం ఖురాన్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ స్టార్టింగ్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ యొక్క చివరిలో కూడా వచ్చింది. సూరహ్ ఫుర్ఖాన్ యొక్క స్టార్టింగ్‌లో కూడా వచ్చింది. ఇంకా ఎన్నో సూరాలలో అబ్ద్ అంటే దాసుడు. అలాగే మానవుడు, మనిషి అన్న పదం కూడా, బషర్ (بشر), మనిషి అంటే బషర్ అని అరబీలో అంటారు, ఈ పదం కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఉపయోగపడింది.

ఇక రెండవ రుకున్, రసూల్. రసూల్. అంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఆయన్ని ప్రళయం వచ్చే వరకు సర్వ మానవాళి వైపునకు, సర్వ దేశాల, ఈ మొత్తం సృష్టిలో ఉన్న ప్రజల వైపునకు ఆయన్ని ప్రవక్తగా, సందేశహరులుగా, సందేశాన్ని అందజేసే వారులుగా, ఆచరించి చూపే వారులుగా, స్వర్గం వైపునకు పిలిచే వారిగా, నరకం గురించి హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

ఈ రెండిటినీ మనం తప్పకుండా నమ్మాలి మరియు ఈ ప్రకారంగానే మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సూరత్ సబా, అలాగే సూరహ్ అంబియా, ఇంకా ఎన్నో సూరాలలో, అలాగే సూరతుల్ అన్ఆమ్‌లో కూడా, సూరతుల్ ఆరాఫ్‌లో కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వ మానవాళి వైపునకు అల్లాహ్ యొక్క కారుణ్య మూర్తి, అల్లాహ్ యొక్క సందేశం అందజేసే ప్రవక్త అని చాలా స్పష్టంగా చెప్పబడినది.

ఈ రెండు గుణాలను మనం నమ్ముతాము కదా, లాభం ఏమిటి? ఈ రెండు ఉత్తమ గుణాలు, ఈ రెండు ఉత్తమ రుకున్‌లు, మూల సూత్రాలు, అబ్ద్ మరియు రసూల్, ప్రవక్త విషయంలో నమ్మడం తప్పనిసరి. ఎందుకు? ఇలా నమ్మడం ద్వారా ఆయన హక్కులో కొందరు ఏదైతే అతిశయోక్తి లేదా ఆయన హక్కును తగ్గించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఆ రెండు రకాల వారికి ఇందులో సరైన సమాధానం ఉంది.

ప్రజల్లో కొందరు ఇలా ఉన్నారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మనిషే కాదు అని అంటున్నారు. ఆయన వేరే ఒక సృష్టి అని అంటున్నారు. అది కూడా తప్పు విషయం. మరికొందరు ఆయన ఒక మనిషి, అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు అని నమ్ముతున్నారు, కానీ ప్రవక్త అని నమ్మడం లేదు, తిరస్కరిస్తున్నారు. అయితే మరొక వైపు ఏమున్నది? ఆయన్ని ప్రవక్తగా నమ్మి ఆయన హక్కులో చాలా అతిశయోక్తితో ప్రవర్తించి, ఆయన్ని అల్లాహ్ యొక్క స్థానానికి లేపేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేవలం అల్లాహ్‌తో అడిగేటువంటి కొన్ని దుఆలు, కేవలం అల్లాహ్‌తో మాత్రమే ప్రశ్నించేటువంటి కొన్ని విషయాలు, “ఓ అల్లాహ్ మాకు సంతానం కలిగించు”, “ఓ అల్లాహ్ మాకు మా రోగాన్ని దూరం చేసి ఆరోగ్యం ప్రసాదించు”, “ఓ అల్లాహ్ మా యొక్క కష్టాలను దూరం చెయ్యి” – ఇట్లాంటివి ఏవైతే కొన్ని దుఆలు ప్రత్యేకంగా కేవలం అల్లాహ్‌తో మాత్రమే అడగవలసినవి ఉంటవియో, అవి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అడుగుతున్నారు. మాకేం అవసరం ఉన్నా గానీ ప్రవక్త యొక్క దర్బార్ మీదికి వెళ్ళాము, ప్రవక్త యొక్క రౌదా వద్దకు వెళ్ళాము, అక్కడ మా అవసరాలు అన్నీ తీరిపోతాయి అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు. తప్పు విషయం. ఆయన ప్రవక్త, సర్వ మానవుల్లో కెల్లా ఎంతో ఉత్తమమైన వారు. కానీ ఆయన అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనం కూడా అల్లాహ్‌నే ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించకూడదు.

మరికొందరు మన ముస్లిములలో ఎలా ఉన్నారు? ఆయన్ని ప్రవక్తగా అని నమ్ముతూ ఎంతో గౌరవం, ఆయనకు గౌరవం ఇస్తున్నట్లుగా చెబుతారు. కానీ ఇతరుల ఇమాములను, ఇతరుల ముర్షిద్‌లను, వేరే కొందరు పీర్‌లను నమ్మి, ప్రవక్త కంటే ఎక్కువగా వారికి స్థానం కల్పిస్తారు. ఇది కూడా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చదవడానికి వ్యతిరేకం అవుతుంది సోదర మహాశయులారా.

విషయం అర్థమైంది కదా! ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఎన్ని విషయాలు వస్తాయి? ఏమేమిటి? ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం, చెప్పిన ప్రతి మాటను సత్యంగా నమ్మడం, నిషేధించిన వాటికి దూరంగా ఉండడం, ఆయన ఎలా అల్లాహ్‌ను ఆరాధించారో అలా అల్లాహ్‌ను ఆరాధించడం. ఇందులో రెండు రుకున్‌లు ఉన్నాయి, మూల సూత్రాలు ఉన్నాయి: ఒకటి అబ్ద్, రెండవది రసూల్. ఈ రెండిటినీ నమ్మడం ద్వారా ఎవరైతే ప్రవక్తను ఆయన స్థానానికి దించి తగ్గించారో వారికి కూడా ఇందులో జవాబు ఉంది, మరి ఎవరైతే ప్రవక్తను నమ్మినట్లుగా చెప్పి ఇతరులను ప్రవక్తకు పైగా, ప్రవక్త యొక్క మాటకు వ్యతిరేకంగా ఇతరుల మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, ప్రవక్త యొక్క పద్ధతి, సున్నత్‌కు వ్యతిరేకంగా ఇతరుల యొక్క ఫత్వాలను, ఇతరుల యొక్క మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, అలాంటి వారికి కూడా ఇందులో జవాబు ఉన్నది.

అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి మనం ఏదైతే సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఈ విషయాలను తెలుసుకొని ఈ ప్రకారంగా సాక్ష్యం పలికేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: