వడ్డీ (Riba) [పుస్తకం]

[డౌన్లోడ్ పుస్తకం]
[32 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

వడ్డీ (అన్ని పోస్టులు):
https://teluguislam.net/category/riba-interest-vaddi/

అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో

దివ్యఖుర్ఆన్లో సృష్టికర్త వడ్డీ సొమ్ము తినేవారిని ఉద్దేశ్యించి ఇలా సెలవిచ్చాడు:

“వడ్డీ తినేవారి స్థితి షైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. వారు ఈ స్థితికి గురి కావటానికి కారణమేమిటంటే ‘వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా’ అని వారంటారు. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. వడ్డీని నిషిద్దం (హరామ్) గావించాడు. కనుక ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కాని విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజును స్థాపించేవారికి, జకాత్ ను ఇచ్చేవారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కానీ, శోకం కానీ కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీ పై అల్లాహ్ తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడేవరకు గడువు ఇవ్వండి. లేక ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకో గలిగితే ఇదే మీ కొరకు మేలైనది. (అల్ బఖర 2 : 275-280)

దివ్యఖుర్ఆన్లోని ఈ వాక్యాలు అరేబియాలో ఇస్లామీయ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవతరించాయి. దీని తర్వాత ఇస్లామీయ ప్రభుత్వం పరిధిలో వడ్డీ వ్యాపారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది.

వడ్డీ‘ని దివ్యఖుర్ఆన్లో ‘రిబా‘గా పేర్కొనటం జరిగింది. రిబా అంటే ‘అధికం‘ లేక ‘అదనం‘ అనే అర్థాలు వస్తాయి. అరబ్బులు ఈ పదాన్ని అధిక సొమ్ము అన్న భావంలో వాడేవారు. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత గడువు వరకు రుణంగా ఇచ్చిదాన్ని పుచ్చుకునే సమయంలో అసలుతో పాటు ఒప్పందం ప్రకారం మరి కొంత అదనపు మొత్తం వసూలు చేసేవాడు. దీన్నే మన నాట ‘వడ్డీ’గా వ్యవహరిస్తాము.

ఈ వడ్డీ వ్యవస్థ ఈ శతాబ్దికి చెందింది కాదనీ, తరతరాలుగా ఇది మానవ సముదాయాల్లో వ్రేళ్లూనుకొని ఉందని తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాలు, జాతుల మాదిరిగా అరబ్బులలోనూ వడ్డీ లావాదేవీలు కొనసాగేవి. మన దేశంలోని వడ్డీ వ్యాపారులు, వడ్డీ మార్వాడీల వలెనే అరేబియాలో కూడా పెట్టుబడిదారులు వడ్డీ వ్యాపారాన్ని తమ ప్రధాన వృత్తిగా ఎన్నుకునేవారు. రుణగ్రస్తుడు నిర్ణీత గడువులో రుణం చెల్లించలేకపోతే, గడువును పొడిగించి చక్రవడ్డీ తరహాలో మరింత అదనపు సొమ్మును రాబట్టేవారు. తత్కారణంగా ఒకవైపు బాకీదారుల బాకీ నానాటికీ పెరిగిపోతుంటే మరోవైపు వడ్డీ ఆసాములు పేద ప్రజల రక్తం పీలుస్తూ కోట్లకు పడగలెత్తేవారు.

కాగా; ఈ పోకడ ఇస్లాం స్వభావ స్వరూపాలకు ఎంతకీ సరిపడదు. అది ప్రబోధించే సిద్ధాంతానికి వడ్డీ విరుద్ధమైనది. ఇస్లాం అభాగ్య జీవుల్ని ఆదుకోమనీ, పేదవారికి సహాయపడమనీ, అగత్యపరుల అక్కరలు తీర్చమనీ అంటుంది. పైగా ఈ పనులన్నీ ప్రాపంచిక పరమార్థాలతో గాకుండా అల్లాహ్ ప్రసన్నతను, పరలోక ప్రయోజనాలను ఆశించి చేయాలని ప్రబోధిస్తోంది.

సకల రుగ్మతలకు మూలమైన మద్యపానం నుండి జన సామాన్యాన్ని రక్షించడానికి దైవ గ్రంథమైన ఖుర్ఆన్ మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలు అంచెలవారీ విధానాన్ని అనుసరించినట్లే వడ్డీ అనే క్రూరాతిక్రూరమైన ఆచారాన్ని రూపుమాపడానికి యుక్తితో, సావధానంతో కూడిన వైఖరిని అనుసరించటం జరిగింది. మొదట్లో ఒక్కసారిగా వడ్డీని నిషేధిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలకు అది మింగుడు పడేది కాదేమో! అందుకే సకారాత్మకమైన పద్ధతిలో “మీరు సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, పేద ప్రజలకు సహాయం చేయండి, బలహీనులను ఆదుకోండి, అగత్యపరుల అవసరాలను తీర్చండి; దయ, జాలి, త్యాగం, దాతృత్వం వంటి ఉన్నత నైతిక సుగుణాలను అలవర్చుకోండి” అని వారిని మానసికంగా సన్నద్ధుల్ని చేయటం జరిగింది.

“మీరు ఎల్లకాలం ఇక్కడ ఉండరు. మీరు నశించినట్లే మీ సిరిసంపదలు కూడా నశిస్తాయి. కాబట్టి అశాశ్వితమైన ఈ ఆస్తిపాస్తుల్ని వెచ్చించి శాశ్వతమైన పరలోక సాఫల్యాన్ని, స్వర్గలోక సుఖాలను సంపాదించండి. ఖారూన్ వంటి ధన పిపాసకులకు పట్టిన గతిని చూసైనా గుణపాఠం నేర్చుకోండి” అంటూ ఒక్కొక్క వాస్తవాన్నీ వారి దృష్టికి తీసుకురావటం జరిగింది.

ఈ ఉపదేశాలు క్రమక్రమంగా ప్రజల మనోభావాలపై ప్రభావం చూపసాగాయి. స్వార్థమే పరమార్థంగా జీవించే ప్రజలు సొసైటీలోని సాటి సోదరుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకోసాగారు. శాశ్వితమైన స్వర్గ సుఖాల ముందు ప్రాపంచిక తళుకు బెళుకులన్నీ అల్పంగా కనిపించసాగాయి. సమాజంలో నిర్మాణాత్మకమైన ఈ కృషి జరిగిన మీదట నిర్దాక్షిణ్యమైన ఈ ‘వ్యాపారాన్ని’ నిషేధించే చట్టం ప్రవేశ పెట్టబడింది. సూరె బఖరాలోని ఈ ఆయతుల (ఆయత్ నెం. 275-280) ద్వారా ఇస్లాంలో వడ్డీ శాశ్వతంగా నిషేధించబడింది.

గతంలో జరిగిందేదో జరిగిపోయిందనీ, ఇక మీదట ఎవరయినా ఈ ఆజ్ఞను లెక్కచేయకపోతే వారు అల్లాహ్ మరియు ప్రవక్తకు బద్ద విరోధులవుతారనీ, అటువంటి వారిపై అల్లాహ్ మరియు దైవప్రవక్త తరఫున యుద్ధ ప్రకటన జరిగినట్లేనని పై వచనాలలో స్పష్టం చేయబడింది. (అల్లాహ్ రక్షించుగాక!)

వడ్డీ సొమ్ము తినేవారి గురించి ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రావటం ఆలోచించదగినది. పెద్దపెద్ద పాపాలకు పాల్పడిన వారి కోసం కూడా ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రాలేదు. మద్యం సేవించే వారున్నారు, వ్యభిచారం చేసే వారున్నారు; హత్యలు చేసేవారున్నారు. ఇవన్నీ నిషిద్ధాలే. పెద్ద పెద్ద అపరాధాలే. అల్లాహ్ సమక్షంలో ఈ పాపాలకు పాల్పడిన వారికి శిక్ష లభించడమూ తథ్యమే. కాని అల్లాహ్ తరఫున, దైవప్రవక్త తరఫున యుద్ధం ప్రకటించబడే వార్నింగ్ ఒక్క వడ్డీ సొమ్ము తినేవారి విషయంలోనే ఇవ్వబడింది. దీన్ని బట్టి ఇదెంత తీవ్రమైన, అసహ్యకరమైన పాపమో ఊహించవచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనల ద్వారా కూడా ఇది అత్యంత ఘోరమైన పాపాల జాబితాలో చేర్చబడినట్లు అవగతమవుతోంది. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీ పుచ్చుకునేవారు వడ్డీ లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులు వ్రాసేవారు ముగ్గురూ ధూత్కారులుగానే ఖరారు చేయబడ్డారు. మరి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం వడ్డీ పాపం వ్యభిచారపు పాపం కన్నా డెబ్బయిరెట్లు అధికమని తెలియవస్తోంది.

‘వడ్డీ కూడా వ్యాపారం లాంటిదేగా’ అని సందేహపడేవారికి, ‘రెండింటి ఉద్దేశ్యం లాభార్జనే కదా!’ అని ప్రశ్నించే వారికి సమాధానం కేవలం హేతుపరంగా ఇస్తే సరిపోదు. ఈ విషయాన్ని భౌతికంగానే కాక ఆధ్యాత్మిక దృష్టితో కూడా పరికించటం అవసరం.

అల్లాహ్ ఆదేశానుసారం ఈ రెండింటి (వడ్డీ-వ్యాపారం)లో భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది. పరమ ప్రభువు ఒక దానిని హరామ్ (అధర్మం) గావించగా రెండవ దానిని హలాల్ (ధర్మసమ్మతం)గా ఖరారు చేశాడు. అటువంటప్పుడు రెండూ సమానమెలా అవుతాయి? ఒక వస్తువును సృజించిన వాడే దాని లాభనష్టాలను సరిగ్గా బేరీజు వేయగలుగుతాడు. మరి ఆ సృష్టి కర్త ఒక దానిని హరామ్, మరొక దానిని హలాల్ గా చేశాడంటే హరామ్ గా ఖరారు చేసిన వస్తువులో తప్పకుండా ఏదో ‘కీడు’ ఉండి ఉండాలి. జనసామాన్యానికి ఈ సంగతి బోధపడినా, పడకపోయినా అదంతే. ఎందుకంటే సమస్త విశ్వమండలంలో ఉన్న వస్తువుల వాస్తవిక జ్ఞానం భూమ్యాకాశాలను పరివేష్ఠించి ఉన్న ఆ ప్రభువుకే బాగా తెలుసు. ఆయన జ్ఞాన పరిధికి తాకని వస్తువు అంటూ లేదు. లోకంలోని వ్యక్తులు, సమాజాలకు తమ సొంత లాభనష్టాలు, మంచీ చెబ్బరలు మాత్రమే తెలుసు. సమస్త లోకం యొక్క మంచీ చెబ్బరలను వారు గ్రహించలేరు. కొన్ని వస్తువులు ఒక వ్యక్తికో, ఒక సంఘానికో లాభదాయకంగా కనిపించవచ్చు. అయితే యావత్తు జాతి లేక యావద్దేశానికి అది హానికరం కావచ్చు.

మరొక వాక్యంలో, అల్లాహ్ వడ్డీని మట్టుపెడతాడనీ, దానధర్మాలను వికసింపజేస్తాడని చెప్పబడింది. వడ్డీతో పాటు దానధర్మాలు ప్రస్తావన రావటం ఆశ్చర్యం కల్గిస్తుంది. అయితే ఈ ప్రస్తావన ఒక ప్రత్యేక దృక్పథంతో తీసుకురాబడింది. వాస్తవానికి వడ్డీ మరియు దానధర్మాలు (సదఖాత్) పరస్పర విరుద్ధమైనవి. రెండింటి పరిణామాలు కూడా పరస్పర వ్యాఘాతమైనవి. సాధారణంగా ఈ రెండు పనులు చేసేవారి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కూడా ఒక దానితో ఒకటి సమన్వయం చెందవు.

దానధర్మాలు ఎదుటివారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయబడతాయి. వడ్డీ దీనికి భిన్నమైనది. ఎలాంటి మొహమాటం లేకుండా ఎదుటివారి నుండి వడ్డీ సొమ్ము రాబట్టడం జరుగుతుంది. రెండు పనులు చేసేవారి సంకల్పంలో వైరుధ్యం ఎందుకు ఉందంటే దానమిచ్చేవాడు పుణ్యార్జన లక్ష్యంతో, అల్లాహ్ మెప్పును పొందే ఉద్దేశ్యంతో ఇస్తాడు. ఈ పవిత్ర ఆశయం కోసం అతడు తన ఐశ్వర్యం కర్పూరంలా కరిగిపోయినా చింతించడు. కాని వడ్డీ పుచ్చుకునేవాడు!? అతడు పొద్దస్తమానం దొడ్డిదోవలో సంపదను పోగు చేసేందుకు తహతహలాడుతుంటాడు. అందుకే. అటువంటి సంపదను అల్లాహ్ అసహ్యించుకుంటాడు. ఈ కారణంగా ఈ సంపదలోని శుభం లేక వికాసగుణం (బరకత్) మటుమాయమైపోతుంది. కాగా; సదఖాలు (దానధర్మాలు) చేసేవారి ఆస్తిలో అల్లాహ్ శ్రేయో వికాసాలను పుష్కలంగా పొందుపరుస్తాడు.

వడ్డీని రూపుమాపి దానధర్మాలను వికసింపజేయడంలోని ఆంతర్యం ఏమిటీ? అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. రూపుమాపడం లేదా వికసింపజేయటం అన్నది పరలోక ప్రతిఫలం దృష్ట్యా చెప్పబడిందని కొంత మంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. అంటే వడ్డీ తినేవాడి సొమ్ము పరలోకంలో ఎంత మాత్రం అతనికి ఉపయోగపడదనీ, పైగా అది అతని పాలిట విపత్తుగా పరిణమిస్తుందని, అదే దానధర్మాలు చేసేవారికి అవి పరలోకంలో శాశ్వత అనుగ్రహాలకు, స్వర్గలోక సుఖాలకు పాత్రుల్ని చేస్తాయని పండితులు వివరించారు. సర్వసాధారణంగా విద్వాంసులు దీనిపై చేసే వ్యాఖ్య ఇలా ఉంది: వడ్డీని రూపు మాపటం, దానాలను వికసింపజేయటం పరలోకం దష్ట్యా ఎలాగూ ఉంది. అయితే దాని గుణం ఎంతో కొంత ఈ లోకంలోనే కనిపిస్తుంది.

ప్రజల కడుపులు కొట్టి సంపాదించే ఈ అధర్మమైన సొమ్ము అట్టే కాలం నిలవదు కూడా. పెద్ద పెద్ద కోటీశ్వరులు, వడ్డీ వ్యాపారులు చూస్తుండగానే దివాలా తీసి రోడ్డున పడటం చూస్తుంటాము. అంటే; వడ్డీలేని వ్యాపారాలకు నష్టం రాదని కాదు. వ్యాపారంలో లాభనష్టాలు సహజం. కాని శిఖరాగ్రాన ఉన్నవారు ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోవటం, నిన్న కోటీశ్వరుడిగా ఉండి నేడు ఒక్కొక్క రూపాయి కోసం దేవురించటం వంటి ఉదాహరణలు మనకు వడ్డీ లావాదేవీల్లో, జూదం పట్టాల అడ్డాలలోనే కనిపిస్తాయి. ఈ సొమ్ము ఎంత శీఘ్రంగా పెరిగినా దీర్ఘకాలం నిలవదు. ఈ పాడు సంపద వారసులకు అచ్చిరాదు. సాధారణంగా ఏదో ఒక విపత్తు వచ్చి కూడబెట్టిన దాన్ని కాస్తా హరించివేస్తుంది.

ఒకవేళ ఆ సంపద వృధా అవుతున్నట్టు పైకి కనిపించకపోయినా దాని లాభాలకు, శుభాలకు మనిషి దూరం అవటం తథ్యం. ఎందుకంటే అధర్మమార్గాల ద్వారా సొమ్మును కూడబెట్టే వ్యక్తి పన్నుల మినహాయింపు నుండి బయట పడేందుకు డొంకదారులు వెతుకుతాడు. స్టేటస్ కోసం వెండీ బంగారాలను, వజ్ర వైఢూర్యాలను సమీకరిస్తాడు. వాటి మూలంగా నిజానికి అతడికి చేకూరే లాభం ఏమీ ఉండదు. వజ్రవైఢూర్యాలు ఆకలి దప్పులు తీర్చవు. ఎండ వేడిమి నుంచీ, చలి తీవ్రత నుంచి అవి అతన్ని కాపాడలేవు. పైగా వాటిని భద్రపరచడానికి నానా కష్టాలు పడాలి. మానసిక ఉద్రిక్తతను అనుభవించాలి.

నిజం చెప్పాలంటే మనిషికి శాంతిని, తృప్తినీ, హాయినీ, గౌరవాన్ని ప్రసాదించే ఐశ్వర్యమే సిసలైన ఐశ్వర్యం. అతని ఐశ్వర్యం అతని జీవితానికి సార్ధకతను చేకూర్చగలగాలి. తన ఆస్తి వల్ల తనకు కలిగిన లాభమే తన సంతతికి కూడా కలగాలని మనిషి అభిలషిస్తాడు. అతని ఈ అభిలాష ఎంతో సహజం కూడా. వాస్తవానికి ఈ సుఖశాంతులు ఎవరికయినా వారి ఆస్తి వల్ల ప్రాప్తిస్తే అది కొద్ది ఆస్తి అయినప్పటికీ ఎంతో విలువైనది, శుభవంతమైనది. నిజానికి శుభము, సమృద్ధి అంటే ఇదే. మరే వ్యక్తి ఈ శుభానికి నోచుకోకుండా పోతాడో అతడి సంపద పరిమాణం రీత్యా చాలా ఎక్కువే అయినప్పటికీ యదార్థానికి అది తరిగిపోయింది.

పైకి అది పెరుగుతున్నట్లు కానవస్తుంది. కాని అది పెరుగుదల కాదు. అది బలుపు కాదు వాపు. వ్యాధి మూలంగా ఒక్కొక్కప్పుడు మనిషి శరీరం విపరీతంగా బరువు పెరుగుతుంది. వివేకవంతుడైన మనిషి ఎవరూ ఆ ‘బరువు’ ను ఆరోగ్యానికి ఆనవాలుగా భావించడు. ఎందుకంటే ఈ ‘పెరుగుదల’ వినాశానికి సంకేతం అని అతనికి తెలుసు. వడ్డీ సొమ్ము పరిస్థితి కూడా ఇంతే. వడ్డీని ఆర్జించే వాని సంపద ఎంతగా పెరుగుతున్నట్టు కానవచ్చినా దాని శ్రేయోవికాసాలకు అతడు నోచుకోకుండా పోతాడు.

ఇక్కడ కొంతమందికి సందేహం కలుగవచ్చు. నేటి వడ్డీ వ్యాపారులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారే! వారు పెద్ద పెద్ద మేడల్లో, ఎయిర్ కండీషన్డ్ భవనాలలో సేద తీరుతున్నారే! సుఖ సౌఖ్యాలనిచ్చే సకల వస్తు సామగ్రి వారి వద్దనే ఉంది కదా! అవసరానికి మించిన నౌకర్లు వారి దగ్గరే ఉన్నారు. కోరుకున్న రాజభోగాలు అన్నీ వారి స్వంతమై ఉన్నాయి. మరి అటువంటప్పుడు వాళ్ళు ఈ సొమ్ము నుండి లబ్ది పొందడం లేదని ఎలా అంటారు? అని ప్రశ్నించవచ్చు.

అయితే ఇక్కడ విస్మరించరాని విషయం ఒకటుంది. సౌఖ్య సామగ్రి వేరు ‘సౌఖ్యం’ వేరు. సౌఖ్యాన్నిచ్చే సామగ్రి కర్మాగారాల్లో తయారయి, మార్కెట్లలో అమ్ముడు అవుతుంది. కాని ‘సౌఖ్యం’ అనేది ఉంది చూశారు, అది ఏ ఫ్యాక్టరీలోనో తయారు కాదు. అది ఏ మార్కెట్టులోనో విక్రయించబడదు. అది పరమ ప్రభువు తరఫున ప్రసాదించబడే ‘దయానుగ్రహం’. అది ఎంత ఖరీదైనదంటే మనిషి తన దగ్గరున్న సర్వస్వాన్ని అర్పించి కూడా కొనలేకపోతాడు. ఒక్క నిద్ర ప్రసాదించే సుఖాన్నే తీసుకోండి. దాన్ని పొందడం కోసం మనిషి ఖరీదైన బంగళా కట్టగలడు. ఖరీదైన ఫర్నీచర్ను సమకూర్చుకోగలడు. సుతిమెత్తని పరుపులను, కళ్ళు చెదిరే కార్పెట్లును కొనగలడు. గాలి, వెలుతురు నిరంతరాయంగా ఉండే ఉద్దేశ్యంతో జనరేటర్ను కూడా తెచ్చుకోవచ్చు. కాని ఇంత చేసినా ఆ ఇంటి యజమానికి తియ్యని నిద్ర పట్టగలదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎంత మాత్రం లేదు. మీకు నమ్మకం కుదరకపోతే సౌఖ్య సామగ్రిని పుష్కలంగా సమకూర్చుకున్న వారి గురించి సర్వే చేయండి. వేలాది మంది మీకు నెగటివ్ సమాధానమిస్తారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రజల్లో 75 శాతం మంది నిద్ర మాత్రలు మింగి పడుకుంటారని నివేదికలు తెలుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిద్రమాత్రలు కూడా పని చేయమని మారాం చేస్తాయి. ఇతరత్రా సుఖాల సంగతి కూడా ఇంతే. మీరు డబ్బులు తగలెట్టి విలాస సామగ్రిని కొనుక్కురావచ్చు. కాని విలాసవంతమైన ఆ జీవితం మీకు ప్రాప్తించే ష్యూరిటీ లేదు.

ఈ పూర్వరంగంలో విషయాన్ని పరికిస్తే మీకే బోధపడుతుంది – వడ్డీ కాముకుల అంగట్లో అన్నీ ఉంటాయి గాని వారికి కావలసిన సుఖం, శాంతి, తృప్తి మాత్రం కరువైపోతాయని! వారు కోటిని కోటిన్నరగా, కోటిన్నరని రెండు కోట్లుగా మార్చాలని పరితపిస్తుంటారే తప్ప తమ ఆయురారోగ్యాల చింత కూడా వారికి ఉండదు. ఆలుబిడ్డలు వారితో కొన్ని క్షణాలైనా గడపాలని పరితపించిపోతుంటారు. కాని ఆ మధుర క్షణాల కోసం కూడా వారికి టైం దొరకదు. ఫ్లైట్ల కోసం పరుగులు తీస్తుండటం, గాల్లో విహరించటంలోనే వారి జీవిత కాలం గడచిపోతుంది. ఆ విధంగా వారు సుఖపడే సామగ్రినయితే ప్రోగు చేస్తారు. కాని సుఖాన్ని ఆస్వాదించలేకపోతారు.

పోనీ వాళ్ళు స్వయంగా సుఖపడకపోతే పోనివ్వండి. తమ ఉనికి ద్వారా వారు ఇతరులకు ప్రయోజనం ఏమైనా చేకూర్చుతారా అంటే అదీ ఉండదు. వడ్డీ సొమ్మును కూడబెట్టే అత్యాశ వాళ్ళను కఠిన మనస్కులుగా మార్చివేస్తుంది. వారి గుండెల్లోంచి దయ, జాలి, కనికారం మటుమాయమైపోతాయి. ఎంతసేపటికీ అభాగ్య జీవుల బలహీనతను సొమ్ము చేసుకుని వాళ్ళ రక్తాన్ని పీల్చి తమ శరీరాన్ని పోషించుకోవడమే వారి పరమావధి అయి ఉంటుంది. అందుచేత సొసైటీలోని ప్రజల హృదయాల్లో వారి పట్ల గౌరవభావం లేశమైనా ఉండదు. మన దేశంలోని వడ్డీ వ్యాపారస్తులను గానీ, అమెరికా బ్రిటన్ల లోని వడ్డీ కుబేరులైన యూదుల చరిత్రను గానీ తరచి చూస్తే. మీకు అవగతమవుతుంది -వారి లాకర్లలో క్వింటాళ్ళ కొద్దీ బంగారు వెండి వజ్రాలుండవచ్చుగాక! కాని ప్రపంచంలో ఎక్కడా, మానవ సముదాయాల్లో ఏ మూలన కూడా ఈ ‘అయ్యవార్ల’కు పరువు ప్రతిష్ఠ ఉన్నట్లు కనిపించదు. పైగా ఈ కుబేరుల పట్ల పేద ప్రజల్లో అసూయాద్వేషాలు ఏర్పడి వర్గ సంఘర్షణకు దారితీస్తాయి. 20వ శతాబ్దిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వర్గ సంఘర్షణలకు కారణం ఈ అసూయాద్వేషాలేనన్నది జగమెరిగిన సత్యం. కార్మిక వర్గానికీ పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య సాగిన ఈ సంఘర్షణే ప్రపంచాన్ని రెండు బ్లాకులుగా నిలువునా చీల్చివేసింది. ఒక నకారాత్మక (Negative) ధోరణి నుండి పుట్టుకు వచ్చిన సిద్ధాంతం మరో నకారాత్మక పుంతను తొక్కి భీకర రూపం దాల్చింది. తత్ఫలితంగా యావత్ప్రపంచమే రణరంగానికి, నరమేధానికి నిలయమైపోయింది. దీనికంతటికీ మూలకారణం ఏమిటీ? అత్యాశకు పోయిన ధనికులకు కనీసావసరాలకు నోచుకోని అభాగ్య జీవులకు మధ్య ఏర్పడిన అంతులేని అగాధం కాదా? ఈ అగాధానికి మూలం అక్రమ సముపార్జన కాదా?

రక్తం పీల్చే ఈ జలగల మరో ఉపమానం ఇలా ఉంటుంది – పేద ప్రజల రక్తాన్ని పీల్చి తమ వల్లు పెంచుకునే ఈ ఆసాముల సమూహం ఒకటి ఒకచోట ఒక కాలనీని నిర్మించుకుంటే, వీక్షించదలచే వారికి అది అందంగా కానవస్తుంది. అక్కడ నివసించే వారంతా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వారి వాకిళ్ళు పచ్చగా నిగనిగ లాడుతుంటాయి. మరి ఈ ఒక్క వాడను చూచి ఇది దేశప్రగతికి ప్రతిబింబం అనాలా? మంచినీ, మానవత్వాన్ని కాంక్షించేవారు ఈ ఒక్క కాలనీని చూసి మురిసిపోరు. అల్లంత దూరాన ఈ అయ్యవార్ల దోపిడీకి గురై పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజల పాట్లను కూడా వారు చూడదలుస్తారు. ఈ స్థితిని వారు ప్రగతికి ప్రతీకగా కాక మానవత్వాన్ని మంటగలిపే పోకడగా అభివర్ణిస్తారు.

తద్భిన్నంగా సదఖాలు ఇచ్చే వారినీ, దానధర్మాలు చేసే వారిని చూడండి – వారు ధనార్జన కోసం నిద్రాహారాలు మానేసి పరుగులు తీయరు. వారెంతో స్థిమితంతో ఉంటారు. తమకు లభించిన దానితోనే సంతృప్తి చెంది అందులోంచి కూడా హక్కుదారుల హక్కును తీసి ఉంచుతారు. తత్ఫలితంగా వారు ప్రశాంతంగా జీవితం గడపటంతో పాటు బడుగు ప్రజల శుభాశీస్సుల్ని అందుకుంటూ ఉంటారు. అల్లాహ్ “వడ్డీని నశింపజేసి దాన ధర్మాలను వికసింపజేయటం” అంటే ఇదే.

“మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి లేదా ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. “ అని అనబడింది.

‘వడ్డీ’ని ‘నిషిద్ధం’గా ఖరారు చేసిన తరువాత అల్లాహ్ ముస్లింలకు చేసిన సూచన ఇది. ఈ నిషేధాజ్ఞ రాకపూర్వం అరబ్బులు తమ బాకీదారుడు ఆర్థిక సమస్యల వల్ల గడువు లోపల బాకీ చెల్లించకపోతే రావలసిన వడ్డీని అసలు కింద జమ చేసుకొని వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని వసూలు చేస్తుండేవారు.

రాజాధిరాజు అయిన అల్లాహ్ ఈ విషయమై శాశ్వతంగా చట్టం ప్రవేశపెట్టి, రుణగ్రస్తుడు దారిద్ర్య స్థితికి లోనై రుణం చెల్లించలేకుండా ఉన్న పక్షంలో అతన్ని వేధించటం ధర్మ సమ్మతం కాదనీ, స్థితిమంతుడయ్యే వరకు అతనికి గడువు ఇవ్వవలసిందేనని నిర్ణయించాడు. పైపెచ్చు ఆ బాకీదారుణ్ణి పెద్ద మనస్సుతో మన్నించి వదలివేస్తే అది మీ పాలిట శ్రేయస్కరమని ప్రోత్సహించటం జరిగింది.

ఇక్కడ ఈ రకమైన ‘మాఫీ’నిసదఖా’తో పోల్చడం జరిగింది. అంటే వడ్డీని వదలి వేయటమేగాక రావలసిన అసలు విషయంలో కూడా చేతులు దులుపు కోవటం అన్నమాట! పైకి ఇది రుణదాతలకు నష్టకరంగానే అగుపిస్తుంది. కాని ఖుర్ఆన్ మాత్రం దీనిని ‘శుభకరం’గా అభివర్ణించింది. ఈ శుభం (మేలు) రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి: మూన్నాళ్ళ ఈ జీవితం ముగిసిన తరువాత అతను వదలుకున్న కొద్దిపాటి సొమ్ముకు బదులుగా శాశ్వితమైన స్వర్గానుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. రెండు: అతని మన్నింపుల వైఖరి యొక్క శుభపరిణామం ఈ లోకంలోనే కొంత అడ్వాన్సుగా అతనికి కనిపిస్తుంది. ఉదాహరణకు:- అతని దగ్గర ఉన్న సొమ్ము పరిమితమే కావచ్చు. కాని వృధా ఖర్చుల నుండి, అనూహ్యమైన విపత్తుల నుండి అల్లాహ్ అతన్ని రక్షిస్తాడు. రోగాలు, మందులు మాకుల పేరిట, డాక్టర్ల ఫీజుల పేరిట అక్రమార్కుల సొమ్ము లక్షల్లో కరిగిపోగా, సామాన్యజనులు చాలా స్వల్ప మొత్తంలోనే స్వస్థతను పొందుతుంటారు. ఇలాంటి ఉదాహరణలు కొందరికి శుష్క ప్రియాలుగా కన్పించవచ్చునేమోగాని దైనందిన జీవితంలో లెక్కకు మించిన ఇలాంటి ఉపమానాల్ని మనం చూస్తుంటాము.

దారిద్ర్య స్థితిని ఎదుర్కొంటున్న రుణగ్రస్తుని యెడల మృదు వైఖరిని అవలంబించే వారికి హదీసులలో కూడా శుభవార్త వినిపించబడింది. తబ్రానీలోని ఒక హదీసులో ఉంది :

“ఏ వ్యక్తి అయితే ఎవరికీ ఏ నీడా లభించని రోజున అల్లాహ్ కారుణ్య ఛాయ తనకు లభించాలని కోరుకుంటాడో అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రస్తుని పట్ల మృదువుగా మెలగాలి లేక అతన్ని మన్నించి వదలి పెట్టాలి”.

మరొక హదీసులో ఇలా ఉంది:-

“ఎవరయితే తన ప్రార్థనలు స్వీకరించబడాలనీ, తన కష్టాలు దూరం కావాలని కోరుకుంటున్నాడో అతడు కష్టాల్లో ఉన్న తన బాకీదారుడికి మరింత గడువును ఇవ్వాలి”.

సహీహ్ ముస్లింలోని ఒక హదీసు ఇది:

“ఎవరయితే ఒక పేద రుణగ్రస్తుడికి గడువు ఇస్తాడో అతనికి ప్రతి రోజూ అతనిచ్చిన రుణానికి సమానంగా దానధర్మాల పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఒక గడువు ముగిసే వరకూ పుణ్యం ఈ లెక్కన లభిస్తూ ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసే నాటికి రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చలేని స్థితిలో ఉండి, రుణదాత మరికొంత గడువును ఇస్తే అట్టిపరిస్థితిలో రెట్టింపు మొత్తం దానమిచ్చిన పుణ్యం ప్రాప్తిస్తుంది.” (సహీహ్ ముస్లిం, ముస్నద్ అహ్మద్)

వడ్డీ యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి దివ్య గ్రంథంలోని ఇతర వచనాలను కూడా ఇక్కడ ప్రస్తావించటం అవసరం.

“విశ్వసించిన ప్రజలారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినటం మానండి. అల్లాహ్ కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది.” (ఆలి ఇమ్రాన్ 3:130)

పై వచనంలో “ఇబ్బడి ముబ్బడిగా పెరిగే” అనే ప్రత్యేక పదం వాడబడింది. పూర్వం అరేబియాలో ఒక నిర్ణీత గడువు కొరకు వడ్డీపై అప్పు ఇచ్చి గడువు ప్రకారం అప్పు తీర్చకపోతే రుణగ్రస్తునికి మరికొంత గడువు ఇచ్చేవారు. అయితే అదనపు గడువునకుగాను అదనపు వడ్డీని విధించేవారు. మలిసారి గడువు ముగిసేనాటికి రుణం వసూలు కాకుంటే వడ్డీ శాతం మరింతగా పెంచబడేది. ఆ విధంగా ఒకవైపు రుణదాతకు ఇబ్బడిముబ్బడిగా వడ్డీ సొమ్ము వచ్చి పడుతుంటే మరోవైపు వడ్డీ భారంతో రుణగ్రస్తుని నడ్డి విరిగిపోతుండేది.

నిసా సూరాలో ఈ విధంగా సెలవీయబడింది

“యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్లనూ, వారు ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఆటంకాలు సృష్టిస్తున్నందువల్లనూ, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్లనూ, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్లనూ మేము వారి కొరకు పూర్వం ధర్మ సమ్మతములైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.” (అన్ నిసా – 160,161)

దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) గారి షరీయత్లో కూడా ‘వడ్డీ’ అధర్మంగా ఖరారయినట్టు పై రెండు వచనాల ద్వారా రూఢీ అవుతోంది. ఈ ఆదేశాన్ని ధిక్కరించి, ప్రాపంచిక వ్యామోహంలో యూదులు వడ్డీ సొమ్మును తినసాగితే అల్లాహ్ ఆగ్రహం చెంది కొన్ని హలాల్ వస్తువులు సయితం వారి కొరకు ‘హరామ్’ చేసేశాడు.

ఈ చర్చను మూడు భాగాలుగా విభజించవచ్చు.

(a) ఖుర్ఆన్ హదీసులలో వడ్డీ వాస్తవికత ఏమిటీ?
(b) వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం ఏమిటీ?
(c) వడ్డీ ఎంత నికృష్టమైనదైనా అది నేటి ఆర్థిక వ్యవస్థలో, వాణిజ్య రంగంలో అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది కదా! ఖుర్ఆన్ ఆదేశాల ప్రకారం దాన్ని విడనాడితే బ్యాంకింగ్ వ్యవస్థ నడిచేదెలా?

(అ) అరబీ భాషలో వడ్డీ కొరకు వాడబడిన పదం ‘రిబా‘. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభవించక పూర్వం కూడా అరేబియా ప్రాంతంలో ఈ పదం వ్యవహారంలో ఉంది. కేవలం వ్యవహారంలో ఉండటమే కాదు, ప్రజలు ‘రిబా’ ప్రాతిపదికన లావాదేవీలు ముమ్మరంగా జరిపేవారు. అంతెందుకు, తౌరాత్ గ్రంథం అవతరించిన కాలంలో (దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం హయాంలో) కూడా యూదులు వడ్డీ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా అది ‘హరాం’ గావించబడిందని సూరె నిసాలోని ఆయతుల ద్వారా బోధపడుతోంది. తేలిందేమంటే అరబ్బులకు ‘రిబా’ అనే పదం కొత్తకాదు. అందుచేతనే ‘రిబా’ సొమ్మును తినటం హరాం (అధర్మం) అని హిజ్రీ 8వ ఏట ఖుర్ఆన్లో ఆజ్ఞ అవతరించినపుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు దాని తఫ్సీర్ లను (వడ్డీ గురించిన వివరాలను) విడమరచి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడలేదు. ఏ విధంగా నయితే మద్యపానాన్ని నిషేధించగానే ప్రవక్త సహచరులు దాన్ని తు.చ. తప్పకుండా పాటించారో అదే విధంగా వడ్డీ (రిబా) నిషేధాజ్ఞలు రాగానే వారు వడ్డీ లావాదేవీలన్నిటినీ త్యజించారు. ఆనాటికి ముస్లిమేతర సోదరుల నుండి తమకు రావలసి ఉన్న భారీ మొత్తాన్ని సయితం ముస్లింలు వదులుకున్నారు.

చెప్పవచ్చిందేమంటే వడ్డీ నిషేధాజ్ఞలు వచ్చిన కాలంలో దానికి సంబంధించిన మతలబులు ఏమీ గుట్టుగానో లేక అనిర్వచనీయంగానో ఉంచబడలేదు. ప్రజా జీవితాల్లో పాతుకుపోయి వున్న వడ్డీ (రిబా)నే ఖుర్ఆన్ నిషిద్ధంగా ప్రకటించింది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దీనిని కేవలం ఒక నైతిక కట్టడిగా గాకుండా ‘ఒకదేశ చట్టం’గానే ప్రవేశపెట్టారు. కాకపోతే రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ చట్టం అన్వయింపుకు సంబంధించిన కొన్ని చిక్కులు ఎదురై షరియత్ కోవిదులలో ద్వంద్వాభిప్రాయాలు వినిపించాయి, అది వేరే విషయం! అయితే రిబా (వడ్డీ) హరాం అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహంగానీ, భేదాభిప్రాయంగానీ లేదు. వివరాల్లోకి పోతే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను తరచి చూడవలసి ఉంటుంది. విషయం లోతుల్లోకి పోవటం మా ఉద్దేశ్యం కాదు. వడ్డీ మూలంగా సమాజంలో జనించే ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక కీడులను స్థూలంగా పాఠకుల ముందుంచి, అల్లాహ్ ఆజ్ఞల్ని అనుసరించటంలో దాసుల ఇహపర సాఫల్యాలు ఇమిడి ఉన్నాయని తెలుపడమే ఈ చిరు పుస్తకం ఉద్దేశ్యం.

సారాంశం ఏమిటంటే (1) అప్పుగా ఇచ్చి దానిపై లాభం లేక అదనపు మొత్తం పొందజూడటం వడ్డీ అవుతుంది. (2) ఈ వడ్డీ అధర్మమని ఖుర్ఆన్ హదీసులు స్పష్టం చేయగానే మహాప్రవక్త సహచరులు నిస్సంకోచంగా దీనిని విడనాడారు. ఈ విషయంలో వారు ఎలాంటి ఊగిసలాటకు లోను కాలేదు. (3) క్రింద పేర్కొనబడిన వస్తువులు లావాదేవీలు జరిపినపుడు సరిసమానంగా ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకవేళ వాటిలో హెచ్చుతగ్గులు చేస్తే అది కూడా వడ్డీ క్రిందికి వస్తుంది. అవేమంటే; (1) బంగారం, (2) వెండి, (3) గోధుమలు, (4)జవలు, (5) ఖర్జూరం, (6) ద్రాక్ష.

నేడు ఏ వడ్డీనయితే మానవ ఆర్థికాంశానికి కీలకంగా భావించబడుతున్నదో అది ఖుర్ఆన్ హదీసుల ప్రకారం నిషిద్ధం. ఈ విషయంలో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. దీని నిషిద్ధం గురించి 7 ఖుర్ఆన్ వచనాలు, 40కి పై చిలుకు ప్రవక్త ప్రవచనాలు సాక్షిగా ఉన్నాయి.

(b) ఇక ఈ వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం లేక పరమార్థం ఏమిటి? ఏ కారణంగా దీనిపై వేటు వేయబడింది? ఏ కారణంగా ఇది శాపగ్రస్తమైన వ్యవస్థగా భావించబడింది? ఇందులో గల ఆధ్యాత్మిక లేక ఆర్థిక కీడు ఏమిటి? అన్న విషయానికి వద్దాం.

ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రశాంత మనస్సుతో అర్థం చేసుకోవాలి. అదేమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజా బాహుళ్యంలో ప్రవేశపెట్టబడిన ఏ ఒక్క వస్తువులో కూడా ఏదో ఒక్క మేలు ఉండకపోదు. ఆఖరికి పాము, తేలు లాంటి విషపూరిత జంతువుల్లో, తోడేళ్లు, సింహాల వంటి క్రూర జంతువుల్లో కూడా లోక కళ్యాణానికి ఉద్దేశించిన బాగోగులు ఎన్నో కొన్ని ఉంటాయి. మానవుడు తొక్కే అడ్డదారుల్లో, వినాశకర పోకడల్లో కూడా ఏదో ఒక లాభం తప్పకుండా దాగి ఉంటుంది. అయితే ఏ మతమైనా, మరే మానవ సమాజమైనా, ఇంకే ఇతర సైద్ధాంతిక వర్గమైనా అతి తక్కువ నష్టాలతో సరిపెట్టి అత్యధిక లాభాలనిచ్చే వస్తువునే లాభకరమైన వస్తువు లేదా మేలైన వస్తువుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు:- ఖుర్ఆన్ మద్యపానాన్ని నిషేధిస్తూ, ఇది ఘోరమైన పాపాలకు మూలమనీ, అయితే ఇందులో ప్రజల కోసం ఎంతో కొంత లాభం కూడా ఉందని చెప్పింది. కాని ఇందలి కీడు ఇందలి మేలు కన్నా చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. కాబట్టి నష్టాల ఆధిపత్యం వేటిలోనయితే ఉంటుందో వాటినల్లా నష్టకరమైనవిగానే పరిగణించి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

వడ్డీ పరిస్థితి కూడా అంతే. వడ్డీ సొమ్ము తినేవాడికి అది తాత్కాలికంగా లాభకరంగా కనిపించవచ్చు. అయితే దాని ఐహిక, పారలౌకిక అనర్థాలు అతనికి వచ్చిన లాభం కన్నా ఎన్నోరెట్లు అధికమై ఉంటాయి. ఏదేని ఒక వస్తువు తృటిలో ప్రయోజనం చేకూర్చి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిసినపుడు వివేకవంతుడైన వ్యక్తి ఎవడూ ఆ వస్తువును లాభకరమైన వస్తువుల జాబితాలో చేర్చడు. పైగా దానిని నష్టాల జాబితాలోనే వ్రాసుకుంటాడు. అదే విధంగా ఒక వస్తువు ఒక వ్యక్తికి మేలు చేకూర్చి సమాజం మొత్తానికి హాని కలిగిస్తుందని తెలిసినపుడు విజ్ఞుడైన మనిషి ఎవడూ దానిని మేలైన వస్తువుగా ఖరారు చేయలేడు. దొంగతనం లేక దొమ్మీ వల్ల ఒక వ్యక్తి లేక ఒక ముఠా లాభం పొందవచ్చు. కాని ఈ కీడు యొక్క ప్రభావం మొత్తం సమాజంపైనే పడుతుంది. సమాజమంతటా భయోత్పాతం నెలకొంటుంది. అందుచేత ఎవరూ దొంగతనాన్ని, దొమ్మీలను మంచివిగా తలపోయరు.

ఈ ఉపోద్ఘాతం తర్వాత మీరు వడ్డీ సమస్యపై దృష్టిని సారించండి. కాస్త నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. వడ్డీని ఆర్జించే వాడికి తాత్కాలిక లాభాలకన్నా అతనికి వాటిల్లే ఆధ్యాత్మిక, నైతిక దివాలా చాలా తీవ్రంగా ఉంటుందని, మంచిని, మానవత్వాన్ని కాంక్షించే మనుషుల జాబితాలో ఆ వ్యక్తికి చోటు లేకుండా పోతుంది. అతనికొక్కడికి వచ్చే లాభం సమాజాన్నంతటినీ భారీ నష్టంలో పడదోస్తుంది. కాని విచారకరమైన విషయం ఏమిటంటే లోకంలో ఏదైనా ఒక వస్తువు చెలామణిలోకి వచ్చేస్తే దాని మేళ్లు మాత్రమే ప్రజల కంటికి కనిపిస్తుంటాయి. కీడులు మాత్రం కంటికి ఆనవు.

నేటి ఆధునికయుగంలో వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి, యావత్తు ప్రపంచాన్ని చుట్టు ముట్టేసింది. అది మానవ అభిరుచి పై ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందంటే దాని వాతన పడిన వారు చేదైన దానిని తియ్యనిదిగా నమ్ముతున్నారు. సమస్త మానవాళి ఆర్థిక వినాశానికి హేతువు అయిన వస్తువు (వడ్డీ) ఆర్థిక సమస్యల పరిష్కారమార్గంగా పరిగణించబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఏ ఆలోచనాపరుడైనా లేక ఏ ఆర్థికవేత్త అయినా ఈ వడ్డీకి వ్యతిరేకంగా నినదిస్తే అతన్ని పిచ్చివాడిగా జమకట్టేస్తారు.

కాని ఒక విషయాన్ని విస్మరించరాదు – ఒక దేశంలో ఒక అంటువ్యాధి ప్రబలిపోయి దాని చికిత్స అంతగా ప్రభావం చూపకపోవటాన్ని చూసి ఏ డాక్టరైనా ఆ వ్యాధిని వ్యాధిగా పరిగణించకుండా దాన్నే ఒక ఔషధంగా,పరిష్కార మార్గంగా సూచించాడనుకోండి. ఆ డాక్టరును డాక్టరని అంటారా! అతడు డాక్టర్ కాడు. నరరూప రాక్షసుడు, ప్రవీణుడైన డాక్టర్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా వ్యాధిని వ్యాధిగానే తలపోస్తాడు. వ్యాధి నివారణను సూచిస్తాడు.

దైవ ప్రవక్తలు (అలైహిముస్సలాం) మానవ సంస్కరణకు బాధ్యులుగా ఉండేవారు. ఎవరు తమ మాటను ఖాతరు చేసినా చేయకపోయినా వారు తమ పనిని తాము చేసుకుపోయేవారు. వారు గనక ప్రజల మనోకాంక్షల కనుగుణంగా నడుచుకుంటూ పోతే నేడు లోకమంతా అవిశ్వాస భావాలతో, మిథ్యావాదులతో అంధకార బంధురంగా ఉండేది.

వడ్డీ నేటి ఆర్థిక జగతికి వెన్నెముకగా భావించబడుతూ ఉన్నప్పటికీ – యూరపుకు చెందిన కొంతమంది విజ్ఞులు ఇప్పటికే దీన్ని ప్రమాదకరమైన బిందువుగా తలపోస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కాదని, వెన్నె ముకను తొలచివేసే ఒక పురుగు అని వారు ఇప్పటికే అంగీకరించారు.

కాని శోచనీయమైన విషయం ఏమిటంటే మేధావులు, అర్థశాస్త్ర నిపుణులు కూడా ఒక్కోసారి ఆచార సంప్రదాయాల వలయంలో చిక్కుకుపోయి స్వేచ్ఛగా ఆలోచించలేకపోతారు. కాలపు క్రేజుకు తలఒగ్గి అంతరాత్మ ప్రబోధాన్ని అణచివేస్తారు.

కొద్దిమంది బలుపు కోసం కోట్లాది మంది ప్రాణులు భారీ మూల్యం చెల్లించవలసి రావటం, అనేక మానవ సముదాయాలు ఆకలి దప్పులకు, ఆర్థిక మాంద్యానికి లోను కావటం, దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న ప్రజల బ్రతుకులు మరింత నికృష్ట స్థితికి చేరటం, అదే సమయంలో గుప్పెడు మంది పెట్టుబడిదారులు సామాన్య జనుల రక్తం పీల్చి తమ కండలు పెంచుకోవటం సర్వసాధారణమైపోయింది. కడుపు మండి ఎప్పుడైనా ఈ సత్యాన్ని వాళ్ల ముందు వెల్లడిస్తే దాన్ని త్రోసి పుచ్చుతూ వారు అమెరికా, ఇంగ్లాండ్ల మార్కెట్లలో నిలబెట్టి వడ్డీ సమృద్ధిని మనకు చూపించదలుస్తారు. అక్కడ సమృద్ధి కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మేకలను భక్షించే మృగాలు బలిష్టంగానే ఉంటాయి కదా! కాని ఈ మృగాల వేటకు గురైన ప్రజల్లోకి చొచ్చుకుపోయి వారి స్థితిగతుల్ని కాస్త వీక్షించమనండి – అక్కడ ఈ మృగాల వేటకు గురైన వేలాదిమంది సామాన్య జనులు జీవచ్ఛవాల్లా పడి ఉండటం కాన వస్తుంది. ఇలాంటి ఆర్థిక ప్రక్రియను ఇస్లాం ఆరోగ్యవంతమైన ప్రక్రియగా భావించదు. గుప్పెడు మంది బడా వాణిజ్యవేత్తల బలుపుకోసం యావత్తు మానవ సమాజం చిక్కి శల్యమై పోవటం ప్రగతి అనిపించుకోదు.

(c) నేడు వడ్డీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని వ్రేళ్ళు నలువైపుల నుండీ ఆర్థిక వ్యస్థను ఆక్టోపస్ లా అల్లుకుపోతున్నాయి. మద్యం, జూదం, వ్యభిచారం వంటి చెడుగులు నాగరికత పేరిట, ఫ్యాషన్ పేరిట కొత్త మెరుగులు దిద్దుకొని ప్రజల ముందు ప్రత్యక్షమైనట్లే వడ్డీ కూడా కొత్త అవతారమెత్తి ప్రజా జీవితాలతో ఆడుకుంటోంది. నిన్నటి వరకూ దుకాణాలకే పరిమితమైన ఈ రుగ్మత నేడు సేవింగ్ స్కీములు, బ్యాంకులు, సొసైటీల రూపంలో ఆవిర్భవించింది. ఈ కొంగొత్త వ్యవస్థ వల్ల సమాజమంతటికీ లాభం చేకూరుతుందని మభ్య పెట్టడం జరుగుతోంది. డబ్బుండీ వ్యాపారం చేయలేనివారు కొందరుంటే, వ్యాపారం చేయగోరినా చాలినంత పెట్టుబడిలేని వారు కొందరుంటారు. అలాంటి వారి దగ్గరున్న డబ్బును పొదుపు పథకాల క్రింద రాబట్టం జరుగుతుంది. వారికి వడ్డీ రూపేణ ఎంతో కొంత ‘లాభం’ లభిస్తుందనుకోండి. అయితే అలా పోగైన సంపద తిరిగి బడా వ్యాపారుల చేతుల్లోకి రుణం క్రింద వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ వడ్డీ లాభాలు అటు సామాన్యులకూ ఇటు పెద్ద వర్తకులకు కూడా లాభసాటిగా ఉన్నట్లు అగుపిస్తుంది.

కాని న్యాయ దృష్టిలో ఆలోచిస్తే ఇదొక మేడిపండు తప్ప మరేమీ కాదన్న వాస్తవం బోధపడుతుంది. ముదనష్టపు వస్తువులను మృదుమధురమైనవిగా సమర్పించే కిటుకులు మన వాళ్లకు బాగా తెలుసు. సారాయి భట్టీలలో అత్యంత దుర్భరమైన స్థితిలో తయారయిన సారాయిని అందమైన హోటళ్లలో సంస్కారవంతమైన శైలిలో సమర్పించటం ఎలాంటిదో, సాని కొంపల్లో మ్రగ్గే వారిని ‘కాల్ గర్ల్’ పేరుతో స్టార్ హోటళ్లకు రప్పించటం ఎటువంటిదో ఇదీ అటువంటిదే. నైతికంగా మానవ సమాజాలను తొలచివేసే వస్తువులకు ఆధునికత పేరిట అందమైన తొడుగులు తొడిగించినంత మాత్రాన అవి విషపూరితం కాకుండా పోవు.

పొదుపు మొత్తాలపై బ్యాంకుల ద్వారా లభించే కొద్దిపాటి వడ్డీ వల్ల వారి జరుగుబాటు ఎలాగూ కాదు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు కూలీనాలీయో ఉద్యోగమో ఎలాగూ చేయక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారం మొదలెట్టి మార్కెట్టులోని వైపరీత్యాలకు తట్టుకొని నిలబడలేరు. పెద్ద తరహాలో వ్యాపారం చేద్దామంటే వారికి భారీ మొత్తంలో రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. వ్యాపార రంగంలో పరపతి ఉండి, ఓ మిలియనీరుగా చెలామణీ అవుతున్న వాడికి కోటి రూపాయిలైనా బ్యాంకుల నుండి రుణంగా లభిస్తాయి గాని ఒక సామాన్యుడికి పదివేల అప్పు కూడా పుట్టదు. ఆ విధంగా కలవాడు తన స్థాయి కన్నా పదిరెట్ల వ్యాపారం చేయగలుగుతాడు. లాభాలు కూడా అదే విధంగా జుర్రుకుంటాడు. కాని ఒక సన్నకారు వ్యాపారస్తుడు అప్పుడప్పు చేసి ఒక వేళ వ్యాపారం చేసినా అతడికి వచ్చే లాభం అతని జరుగుబాటుకు కూడా సరిపోదు. ఇదిలా ఉండగా వ్యాపార సంబంధమైన వైపరీత్యాలు గాని సంభవిస్తే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. ఆ వైపరీత్యాల్ని సృష్టించేది కూడా ఎవరో కాదు, బడా వాణిజ్యవేత్తలేనన్నది బహిరంగ రహస్యం. తేలిందేమంటే మార్కెట్టులో కొద్దిమంది పెద్ద తరహా వ్యాపారస్తులే మిగులుతారు. మూలధనమంతా క్రమక్రమంగా వారి ఇనుప్పెట్టెలకు తరలిపోతుంది.

1. సమాజమంతా వర్తకానికి దూరమై కొద్దిమంది పెట్టుబడిదారులు ఆర్థిక రంగాన్ని ఏలడం అన్యాయం కాదా?

2. మార్కెట్టులో కొద్దిమంది ఏకస్వామ్యం ఆధిపత్యం పెరిగిపోతుంది. వారు కోరినప్పుడల్లా నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచేస్తూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే క్రయవిక్రయాల వ్యవస్థ అంతా వారి గుప్పెట్లో ఉంటుంది. పరోక్షంగా వాళ్లు దేశాన్నే శాసించే స్థాయికి చేరుకుంటారు. సామాన్య ప్రజల సొమ్ముతో తెగబలిసిన ఈ ఆసాములకు ప్రజా సంక్షేమం పట్ల గాని, సామాజిక న్యాయం అంటేగాని ఎలాంటి ఆసక్తి ఉండదు.

అదే వర్తకం వికేంద్రీకరణ జరిగి, మార్కెట్టులో పరిపూర్ణమైన పోటీ విధానం అమల్లోకి వచ్చినట్లయితే పరిస్థితి తద్ఛిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న వర్తకులకు కూడా లాభాలు వచ్చి వారి ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. వేలాది మందికి జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ సమస్య కొంతలో కొంత పరిష్కృతమవుతుంది. ప్రగతి ఫలాలు అందరికీ లభించి ఆర్థిక అసమానతల అగాధం కొంతవరకైనా పూడుకుంటుంది. కాని ఈ విషయం జనసామాన్యానికి అర్థమయ్యేలా చెప్పేదెవరు? వినాశకరమైన రోగం తగిలించబడింది. ప్రచారం చేసే వారేమో దీన్ని ఒక రోగంగా గాక దివ్య ఔషధంగా ప్రచారం చేస్తున్నారు.

3. బ్యాంకుల వడ్డీ వల్ల సమాజానికి వాటిల్లే మరో ఆర్థిక అనర్థం ఏమిటో చూడండి – ఒక వ్యక్తి వద్ద లక్ష రూపాయిల మూలధనముంటే అతను బ్యాంకు నుండి రుణం తీసుకొని 10 లక్షల వ్యాపారం చేస్తాడు. ఒకవేళ అతడి వ్యాపారం అనూహ్యమైన ఒడిదుడుకులకు లోనై అతడు దివాలా తీస్తే అతడికి కలిగే నష్టం ఒక లక్ష (10 శాతం) మాత్రమే. కాని మిగిలిన 90 శాతం నష్టం ఎవరిపై పడుతుంది? సమాజంపైనే కదా! పైకి బ్యాంకుకు నష్టం వాటిల్లినట్లుగా అగుపిస్తుంది. కాని వాస్తవానికి ఆ బ్యాంకు సొమ్ము ఎవరిది? ప్రజలది కాదా? దీని ద్వారా బోధపడిందేమంటే పెట్టుబడిదారుడు లాభాలు వచ్చినంత కాలం తానొక్కడే లాభాలను ఆర్జించాడు. సమాజానికి లభించింది నామమాత్రం. కాని నష్టం వాటిల్లేసరికి 90 శాతం నష్టం సమాజంపైకి నెట్టేయబడింది.

4. వడ్డీ వ్యవస్థ వలన కలిగే మరో పరాభవం ఏమిటంటే, వడ్డీ సొమ్ముతో వ్యాపారం మొదలెట్టిన వ్యక్తి ఒకసారి నష్టాల ఊబిలో పడ్డాడంటే ఇక అతడు పైకి రాలేడు. ఎందుకంటే నష్టాన్ని భరించేటంత మూలధనం అతని వద్దనయితే లేదు. నష్టాలు వాటిల్లినపుడు అతని ఇక్కట్లు రెట్టింపు అవుతాయి. ఒకవైపు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది. రెండోవైపు అతడు బ్యాంకు రుణభారం క్రింద నలిగిపోయాడు. దాన్ని చెల్లించే దారి లేదు. కాని అదే వడ్డీ రహిత వ్యాపారంలో నష్టం వాటిల్లి ఉంటే అతడు బికారి మాత్రమే అయ్యేవాడు. కాని రుణగ్రస్తుడు అయ్యేవాడు కాదు.

ఒక్కడ ఒక సందేహం ఉత్పన్నమవటం సహజం. బ్యాంకుల ద్వారా జాతీయ సంపద ఒక చోట ప్రోగవటం వల్ల జనసామాన్యానికి ఎంతో కొంతయినా లాభం చేకూరింది కదా! పెట్టుబడిదారులకు అధిక మొత్తంలో లాభం చేకూరవచ్చుగాక, కాని సామాన్య ప్రజానీకానికి కూడా ఎంతోకొంత ముట్టింది కదా! ప్రజాధనాన్ని పొదుపు చేసే ఈ బ్యాంకు స్కీములే గనక లేకుంటే ఈ సంపద అంతా పూర్వకాలపు వ్యాపారస్తులు, జమీందార్లు ఖజానాను భూస్థాపితం చేసినట్లుగా ఈ కాలపు ప్రజలు కూడా సంపదను ఫ్రీజ్ చేసేసి నిరుపయోగం చేసేవారు కదా! అని కొందరు ప్రశ్నించవచ్చు.

దీనికి సమాధానం ఏమిటంటే ఇస్లాం వడ్డీని అధర్మంగా ఖరారు చేసి దాని ద్వారాలను మూసివేసినట్లే, సంపదను ఒకచోట ప్రోగు చేసిపెట్టే వారిపై జకాత్ అనే విద్యుక్త ధర్మాన్ని మోపి వాళ్ళు సంపదను నిరుపయోగం చేయకుండా బ్రేకువేసింది. పైగా ఆ సంపదను వెలికితీసి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టక తప్పని పరిస్థితిని సృష్టించింది. ఎలాగంటారేమో! ఇస్లాం ప్రకారం ఏ ముస్లిమైనా బంగారాన్ని గాని, నగదును గానీ నిల్వ చేస్తే అతడు ఆ సొమ్ముపై సాలీనా రెండున్నర శాతం చొప్పున జకాత్ ని తీసి సమాజంలోని అగత్యపరులకు, నిరాధారులకు ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా అతడు తన నిల్వలను పెట్టుబడిగా మార్చకుండా అట్టే పెట్టుకొని ఉంటే కొన్ని సంవత్సరాలకే ఆ ఖజానా కాస్తా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అతడు తన దగ్గరున్న మిగులును ఫ్రీజ్ చేసి ఉంచే బదులు దాన్ని వాణిజ్యంలోనో వ్యవసాయంలోనో పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే లాభాలపైన జకాత్ ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తాడు. అంటే తన దగ్గరున్న సంపద ద్వారా తాను లబ్దిపొందడంతో పాటు ఇతరులకు కూడా జకాత్ రూపంలో లాభాలను పంచిపెడతాడు.

జకాత్ చెల్లింపు ద్వారా సమాజంలోని నిరుపేదలకు, అగత్యపరులకు సాయం లభించినట్లే ముస్లింల ఆర్థిక స్థితిగతులు చక్కబడే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వర్తకాన్ని ప్రోత్సహించేందుకు జకాత్ దోహదపడుతుంది. ఎందుకంటే, నగదు సొమ్మును ఏడాది కాలం పాటు ఇనుప్పెట్టెల్లో మూసి ఉంచడం వల్ల తనకు ప్రయోజనం ఏమీ కలగకపోగా, జకాత్ రూపేణా కొంతధనం బయటకు వెళ్ళిపోతుందే అని మనిషి ఆలోచనలో పడి ఆ నగదుతో వ్యాపారం మొదలెడతాడు. వేలాది మందికి చెందిన కష్టార్జితాన్ని బ్యాంకుల ద్వారా రాబట్టి ఒక పారిశ్రామికవేత్త వ్యాపారం చేసే బదులు స్థితిమంతుడయిన ప్రతి ఒక్కడూ వ్యాపార రంగంలో అడుగుపెడతాడు. వాణిజ్యరంగంలో ఆరోగ్యవంతమైన పోటీ పెరుగుతుంది. మార్కెట్లో ఏకస్వామ్య వ్యవస్థ బదులు పరిపూర్ణపోటీ విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్ సమతౌల్యం ఏర్పడుతుంది. తత్ఫలితంగా సమాజంలోని బడుగు జీవులకు, నిరాధారులకు వెసులుబాటు లభిస్తుంది.

వడ్డీ వ్యాపారం మూలంగా వాటిల్లే ఆర్థిక అస్తవ్యస్త స్థితిని అవలోకనం చేశాము. ఇక దీని మూలంగా మానవుని ఆధ్యాత్మిక, నైతిక రంగాలపై పడే దుష్ప్రభావాన్ని చూద్దాము –

1. మానవుని గుణగణాలలో అత్యంత ముఖ్యమైనది, ఉజ్వలమైనది త్యాగగుణం మరియు దాతృ స్వభావం. స్వయంగా బాధల్ని భరించి ఇతరులకు సుఖాన్ని పంచిపెట్టడమనే భావన ఉన్నత మానవీయతకు తార్కాణం. అయితే వడ్డీ పిశాచం తిష్ఠ వేసిన సమాజాల్లో ఈ పరోపకార గుణం దాదాపు నశిస్తుంది. పరులకు ఉపకారం కాదు కదా పరులు కష్టపడి పైకొచ్చి తన సరసన నిలబడటాన్ని కూడా ఒక వడ్డీ వ్యాపారి సహించలేడు.

2. అతడు ఆపదల్లో ఉన్న వారిపై జాలి చూపకపోగా వారి ఆపదల్ని తన స్వార్థ ప్రయోజనాలకై సొమ్ము చేసుకోజూస్తాడు.

3. వడ్డీ ఆర్జన వల్ల అతనిలో పేరాశ పెరిగిపోతుంది. క్రమంగా అతని హృదయంలోని దయాదాక్షిణ్యాలు మటుమాయమవుతాయి. మంచీ-చెడుల మధ్య గల వ్యత్యాసాన్ని మరచిపోతాడు. ఆ విధంగా అతను నైతికంగా దిగజారి కడకు మానవత్వానికే దూరమైపోతాడు.

వడ్డీ మూలంగా సమాజానికి వాటిల్లే నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక అనర్థాలను వివరించారు సరే, మరయితే ఈ వడ్డీ లేకుండా వ్యవస్థ నడిచేదెలా? ఆర్థిక వ్యవస్థ అణువణువునూ ‘వడ్డీ’ పెనవేసుకొని ఉండగా దీన్ని ఒక్కసారిగా విడనాడితే వ్యాపారస్తులకు బ్రతికి బట్టకట్టే మార్గం ఏది? అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తడం సహజం.

మనం ఇక్కడ ఆవేశానికి లోనవకుండా ఒక విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలి. ఒక వ్యాధి ప్రబలిపోయి అది అంటువ్యాధిగా మారిపోయినపుడు చికిత్స దుర్లభంగా కనిపిస్తుంది. కానీ ఆ చికిత్స వృధాపోదు. ఆర్థిక సంస్కరణలు ఫలప్రదం కావడానికి సమయం పడుతుంది. దీని కొరకు వ్యక్తులు, సమాజాలు సహన స్థయిర్యాలతో వ్యవహరించవలసి ఉంటుంది. దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు.

“అల్లాహ్ ధర్మం విషయంలో మీపై ఎలాంటి లేమి (ఇబ్బంది) నీ ఉంచలేదు.”

దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే వడ్డీకి అతీతంగా మానవ సమాజాలకు ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు, కష్టనష్టాలు లేకుండా నడిపించే మార్గం తప్పక ఉంది.

సమాజంలోని నిరుపేదల అభాగ్యజీవుల పాట్లను నిరోధించే ఉపాయాలు ఇస్లాంలో ఉన్నాయి. ఇస్లాం ధర్మం పట్ల, దాని ఉపదేశాల పట్ల అనాసక్తత మూలంగా ముస్లింల స్థితిగతులు ఇలా తగలడ్డాయి గాని వారు గనక ఇస్లాం ప్రబోధనలను ఖచ్చితంగా తమ దైనందిన జీవితాల్లో ప్రవేశపెట్టుకున్నట్లయితే వారి జీవన గతే మారిపోతుంది. జకాత్, సదకాల రూపంలో వారు సక్రమంగా తమ సంపదను పంపిణీ చేసినట్లయితే నేడున్న సమస్యలు ఉండవు. ఇదంతా వారి నిర్లక్ష్య ధోరణి యొక్క పరిణామమే. నిజం చెప్పాలంటే నేడు జకాత్ విధానం దాదాపు లేదు. ముస్లింలలో చాలామంది నమాజ్ మాదిరిగానే జకాత్ జోలికిపోరు. జకాత్ ఇచ్చేవారు కూడా పాక్షికంగానే ఇస్తున్నారు. జకాత్ ను పూర్తిగా ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పోనీ వారైనా ఆ జకాత్ సొమ్మేదో సక్రమంగా పంపిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. తమ సొమ్ముల్లో ఏడాదికోసారి జకాత్ తీస్తే సరిపోదు, దాన్ని సజావుగా చెల్లించాలి, నిర్ణీత పద్దులకు మాత్రమే కేటాయించాలన్నది అల్లాహ్ ఆదేశం. జకాత్ సొమ్మును దాని హక్కుదారులకు మాత్రమే చెల్లించే నిమిత్తం సిసలైన హక్కుదారులను అన్వేషించే దాతలు ఎంత మంది ఉన్నారో మీరే చెప్పండి.

ముస్లింల మిగులు ధనం ఎంత స్వల్పంగా ఉన్నా సరే, వారిలోని ప్రతి ఒక్క స్థితిమంతుడు గనక చిత్తశుద్ధితో జకాత్ అనే విధానాన్ని వేరుపరచి సక్రమమైన పద్ధతిలో దాని హక్కుదారులకు చేరవేసినట్లయితే అసలెవరికీ ముష్టెత్తుకునే దుస్థితి దాపురించదు. చీటికి మాటికీ అప్పుల కోసం ‘అయ్యవార్ల’ వద్దకు పరుగులు తీయాల్సిన అగత్యం కూడా ఉండదు.

మరి ఈ జకాత్ నే షరీఅత్ ఆదేశాలకు లోబడి సామూహిక పద్ధతిలో వసూలు చేసి ‘బైతుల్ మాల్’ అనే సంస్థను స్థాపించినట్లయితే మరిన్ని మేళ్లు చేకూరుతాయి. అలా పెద్ద మొత్తంలో వసూలైన జకాత్ ను బైతుల్ మాల్ ద్వారా వడ్డీలేని రుణాలుగా కూడా ఇవ్వవచ్చు. జీవనోపాధి లేక రోడ్డున పడ్డ అనేక మందికి రుణాలు ఇచ్చి కుటీర పరిశ్రమల్ని స్థాపించవచ్చు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఒక ఐరోపా ఆర్థిక నిపుణుడు నిజం చెప్పాడు. అతనిలా అన్నాడు – “ముస్లింల జకాత్ వ్యవస్థ ఎంత ప్రభావవంతమైనదంటే, ముస్లింలే గనక దాన్ని సక్రమంగా పాటిస్తే ఆ జాతిలో ఒక్క దరిద్రుడు, అగత్యపరుడూ మిగలడు”.

ఈ చర్చ ద్వారా చివరకు మేము చెప్పదలచిందేమంటే; వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి పోయిన ఈ రోజుల్లో ఇక దాన్ని విడనాడే దారేలేదని తలపోయటం సరైనది కాదు. కాకపోతే ఇది ఒక్క వ్యక్తి లేక కొందరు వ్యక్తుల పని కాదు. ప్రభుత్వాలు, సామూహిక సంస్థలు చొరవ తీసుకొని వ్యవస్థను మార్చడానికి యత్నించినపుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. కనీసం ముస్లిం సమాజాలు, ముస్లిం రాజ్యాలు ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరించి వడ్డీ రహిత వ్యవస్థ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే వడ్డీ పిశాచం నుండీ ప్రజానీకాన్ని కాపాడటం దుర్లభమేమీ కాదు. వారు ఈ లక్ష్యాల్ని సాధించిననాడు ఆర్థికంగా యావత్ప్రపంచానికే ఆదర్శప్రాయం కాగలుగుతారు.

మరో విషయాన్ని మేము ముస్లింలకు ప్రత్యేకంగా విన్నవించుకోదలిచాము – వారు కనీసం రోగాన్ని రోగంగానే చూడాలి. అధర్మాన్ని (హరాం) అధర్మంగానే చూడాలి. షరీఅత్లో అధర్మమైన ఒక వస్తువును ధర్మసమ్మతం (హలాల్)గా తలపోయడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. అత్యంత విచారకరమైన విషయమేమంటే ముస్లిం సమాజాల్లో కొంత మంది మేధావులు ఈ ‘హరామ్’ ను ‘హలాల్’గా నిరూపించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇది చాలా ఘోరమైన పాపం అన్న సంగతిని వారు మరచిపోతున్నారు. అల్లాహ్ వాక్యాలతో చెలగాటమాడటం ధిక్కారవైఖరికి ప్రతీక అని వారు గ్రహించకపోతే అది వారి గ్రహచారం. కనీసం హరామ్ ను హరామ్ గా భావించటం వల్ల వారికి వాటిల్లే నష్టం ఏమీలేదు కదా!

చివర్లో మేము వడ్డీ నిషిద్ధం మరియు దానికి సంబంధించి అల్లాహ్ తరఫున చేయబడిన హెచ్చరికలను తెలిపేందుకు గాను మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాలను పొందుపరచదలిచాము. కనీసం పాపాన్ని పాపంగా తలపోసే భావన అయినా ప్రజల్లో మేల్కొనాలన్నదీ, దానికి దూరంగా ఉండటానికి ప్రజలు ఉపాయాలు ఆలోచించాలన్నది మా ఉద్దేశ్యం. ఈ హరామ్ ను హలాల్ గా పరిగణించి వారు రెట్టింపు పాపాన్ని మూటగట్టుకోకుండా ఉన్నా చాలు కొంత వరకు ఉద్దేశ్యం నెరవేరినట్లే. ముస్లింలలో చాలా మంది రాత్రిపూట తహజ్జుద్ నమాజులో, అల్లాహ్ నామస్మరణలో గడుపుతారు. కాని తెల్లవారాక వారు తమ వ్యాపార వ్యవహారాలలో తలమునకలవగానే తాము వడ్డీ అనే అధర్మమైన వ్యవహారానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేయూతనిస్తున్నామన్న సంగతి మరచిపోతారు. ఇది కడు శోచనీయమని వేరుగా చెప్పనవసరం లేదు. వడ్డీ గురించి తన అనుచర సమాజానికి మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన హెచ్చరికల్ని చదవండి.

1) “ఏడు ప్రాణాంతక వస్తువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు. ‘అవేమిటి ఓ దైవ ప్రవక్తా!’ అని సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ప్రశ్నించగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:- 1) ఒక్కడైన అల్లాహ్ (ఆరాధనలలో)కు సహవర్తునిగా వేరొక దైవాన్ని నిలబెట్టడం. 2) చేతబడి (బాణామతి) చేయడం, 3) ఏ వ్యక్తినయినా అన్యాయంగా హతమార్చడం 4) వడ్డీ తినడం 5) అనాధ సొమ్మును భక్షించటం. 6) ధర్మయుద్ధ సమయంలో యుద్ధ రంగం నుండి వెన్ను చూపి పారిపోవటం 7) సౌశీల్యవతి అయిన మహిళపై అపనింద మోపడం”. (ఈ హదీసు సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.)

2) అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఇవాళ రాత్రి నేను నా దగ్గరకొచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వాళ్లు నన్ను బైతుల్ మఖ్దిస్ వరకు గొనిపోయారు. మేము మరింత ముందుకు సాగిపోగా అక్కడ ఒక నెత్తుటి కాలువ కనిపించింది. అందులో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మరొకతను కాలువ ఒడ్డున నిలుచుని ఉన్నాడు. కాలువలో నిలుచున్న వ్యక్తి బయటకు రావటానికి యత్నించినపుడు ఒడ్డున ఉన్న వ్యక్తి అతని ముఖంపై రాయి రువ్వుతున్నాడు. ఆ దెబ్బతో అతడు మునుపున్న చోటికే పరుగెత్తుకెళుతున్నాడు. మళ్లీ అతడు కాలువ నుంచి బయట పడేందుకు ప్రయత్నించగా ఒడ్డున ఉన్నవాడు మళ్లీ రాయి రువ్వసాగుతున్నాడు. ఏమిటీ తతంగం? అని నేను నా వెంట వున్న ఇద్దరిని ప్రశ్నించగా ‘కాలువలో చిక్కుకుపోయిన వ్యక్తి వడ్డీ సొమ్ము తినేవాడు (ఇప్పుడు తన కర్మకు శిక్ష అనుభవిస్తున్నాడు) అని వాళ్లు బదులిచ్చారు.” (ఈ హదీసు సహీహ్ బుఖారీలోని కితాబుల్ బుయూలో ఉంది).

3) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వడ్డీ తీసుకునే వారినీ, వడ్డీ ఇచ్చే వారిని కూడా ధూత్కరించారు. మరికొన్ని ఉల్లేఖనాలలో వడ్డీ వ్యవహారం పై సాక్ష్యమిచ్చేవారు, తత్సంబంధితమైన దస్తావేజులు వ్రాసేవారు కూడా ధూత్కరించబడ్డారు.

సహీహ్ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా అనబడింది “వీళ్ళంతా ఈ పాపంలో సమాన భాగస్థులే”. మరి కొన్ని ఉల్లేఖనాలలో, సాక్షులు, దస్తావేజులు వ్రాసేవారు తమకు అది వడ్డీ వ్యవహారం అని తెలిసి ఉన్న పక్షంలోనే ధూత్కారానికి గురవుతారు.

4) మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. “నాలుగు రకాల మనుషులున్నారు. వారికి స్వర్గంలో ప్రవేశం లభించదు గాక లభించదని అల్లాహ్ నిర్ధిష్టంగా నిర్ణయించాడు. ఆ నలుగురు ఎవరంటే (a) మద్యపానానికి ఆలవాటు పడినవాడు. (b) వడ్డీని తిన్నవాడు (c) అనాధ సొమ్మును అన్యాయంగా స్వాహా చేసేవాడు (d) తల్లిదండ్రుల మాట విననివాడు. (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రిక్ హాకిమ్’లో ఉంది)

5) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “వడ్డీతో కూడిన ఒక్క దిర్హమ్ తిన్నవాడు ముప్ఫయి ఆరుసార్లు వ్యభిచారం చేసిన దానికన్నా ఎక్కువ పాపం చేసినట్లు లెక్క”.

మరొక ఉల్లేఖనంలో “అక్రమ ధనంతో పెరిగిన కండ కోసం అగ్నియే సబబైనది”.

దాంతో పాటు మరో ఉల్లేఖనం ఈ విధంగా ఉంది :- “ఒక ముస్లిం మాన మర్యాదల్ని మంట గలపడం వడ్డీ తినటం కన్నా ఎక్కువ పాపిష్టికరం” (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్, బ్రానీలలో ఉంది)

6) వేరొక హదీసులో ఉంది:- మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “(వృక్షం యొక్క) ఫలం నిరుపయోగం కాక ముందే దాన్ని అమ్మి వేయాలి”. ఇంకా ఇలా అన్నారు – “ఏదేని ఒక పేటలో వ్యభిచారం, వడ్డీ వ్యాపారం పెరిగిపోతే అది అల్లాహ్ ఆగ్రహాన్ని తన పైకి ఆహ్వానించినట్లే.” (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రక్ హాకిమ్ లో ఉంది.)

7) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “ఏ జాతిలోనయినా లావాదేవీలు వడ్డీ ప్రాతిపదికగా సాగితే అల్లాహ్ వారిపై నిత్యావసర వస్తువుల ధరను విపరీతం చేస్తాడు. మరే జాతిలోనయినా లంచగొండితనం ప్రబలిపోతే శత్రువును చూసి వణికిపోయే భయోత్పాత స్థితి వారిపై నెలకొంటుంది”. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్లో ఉంది)

8) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు:- షబే మేరాజ్ సందర్భంగా మేము ఏడవ ఆకాశంలో చేరినపుడు నేను నా పైన ఒక మెరుపును చూశాను. ఆ తరువాత మాకు ఒక జన సమూహం తారసిల్లింది. వారి పొట్టలు నివాస గృహాల మాదిరిగా వ్యాకోచించి ఉన్నాయి. వాటిల్లో సర్పాలు నిండి ఉన్నాయి. అవి బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ‘ఎవరు వీరు?’ అని నేను దైవదూత జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని అడిగాను. ‘వీళ్లు వడ్డీ సొమ్ము తిన్నవారు’ అని ఆయన సమాధానమిచ్చారు. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్ లో నిది)

9) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)ని ఉద్దేశ్యించి చెప్పారు – “క్షమార్హం కాని పాపాలకు దూరంగా ఉండండి. వాటిల్లో ఒకటి:- యుద్ధప్రాప్తిని తస్కరించటం, రెండు:- వడ్డీ సొమ్ము తినటం”. (తబ్రానీ)

10) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా ఉపదేశించారు: “మీరు ఎవరికయితే అప్పు ఇచ్చారో అతన్నుంచి కానుక కూడా స్వీకరించకండి”. (బహుశా అతను ఈ కానుక అప్పుకు బదులుగా ఇచ్చాడేమో. అది బహుశా వడ్డీయేమో. అందుచేత అతని కానుకను స్వీకరించే విషయంలో కూడా జాగ్రత్తపడటం మంచిది.)

దివ్యఖుర్ఆన్లోని ఏడు వచనాలు మరియు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పది హదీసుల ఆధారంగా వడ్డీ నిషిద్దం గురించి స్థూలంగా మీ ముందుంచటం జరిగింది. విషయాన్ని వివరంగా చర్చిస్తే ఓ పెద్ద గ్రంథమే తయారవుతుంది
.
ధర్మంలో హరామ్ (నిషిద్ధం) – హలాల్ (ధర్మ సమ్మతం)లు కీలకమైనవి. మోమిన్ (విశ్వాసి) అయిన వాడు హలాల్ వస్తువులను స్వీకరించి హరామ్ వస్తువులను పరిత్యజిస్తాడు. హరామ్ వస్తువుల పట్ల ఏహ్యభావం కలిగి ఉంటాడు. ఇస్లామీయ షరీఅత్ హరామ్ గా ఖరారు చేసిన వాటిలో ఏదైనా హరామే. హరామ్ వస్తువుల జాబితాలో వచ్చే కొన్నింటిని అసహ్యించుకొని మరికొన్నింటిని స్వీకరించటం అంటే ధర్మాన్ని పాక్షికంగా అవలంబించటమే.

కాగా, అల్లాహ్ విశ్వాసుల్ని ఉద్దేశ్యించి ఏమంటున్నాడో తెలుసా?!

‘యా అయ్యుహల్లజీన ఆమనుద్ ఖులూ ఫిస్సిల్మి కాప్ఫహ్’
ఓ విశ్వాసులారా ! ఇస్లాంలో ప్రవేశిస్తే (పాక్షికంగా కాదు) పూర్తి స్థాయిలో ప్రవేశించండి.

సమాప్తం

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://www.youtube.com/watch?v=QSCd4zG7zUQ [47 నిముషాలు]

ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

قَالَ اللّٰهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ

“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.

తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.

అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.

అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.

ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.

చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.

మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.

రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.

అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.

చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు

అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.

నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:

يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ

(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ)
“ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)

ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.

నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:

فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا ‎﴿١٠﴾‏ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا ‎﴿١١﴾‏ وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًا ‎﴿١٢﴾‏

(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా)
“మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)

మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.

మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.

జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి

అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:

إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ

(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్)
“మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60)
ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:

مَا سَمِعْنَا بِهَٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్)
“ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24)
అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:

وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً

(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్)
“అల్లాహ్‌యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24)
ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”

ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:

يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ

(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్)
“ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24)
ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ

(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్)
“ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25)
అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:

أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ

(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్)
“(ఓ నూహ్‌!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111)
అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.

మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ

(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్)
“నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109)
నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ

(వమా అన బితారిదిల్ ము’మినీన్)
“నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114)
నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.

నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا

(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్)
“అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14)
అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.

అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా)
“మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)

చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59)
అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.

అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

قَالُوا۟ يَٰنُوحُ قَدْ جَٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్)
“ఓ నూహ్‌! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32)
అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.

మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:

لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ

(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్)
“ఓ నూహ్‌! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116)
వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.

దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం

అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?

أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ

(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్)
“ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36)
ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?

رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ ‎﴿١١٧﴾‏ فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ ‎﴿١١٨﴾‏

(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్)
“నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118)
అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?

وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ

(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్)
“నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37)
అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.

నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:

رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا ‎﴿٢٦﴾‏ إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا ‎﴿٢٧﴾‏

(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా)
“నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27)
నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.

అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:

إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ

(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్)
“ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38)
అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.

అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:

رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ

(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్)
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28)
నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.

మహా జలప్రళయం మరియు రక్షణ

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).

మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.

ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,

بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ

(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా)
“దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41)
అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.

ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్)
“దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (23:28)
దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.

ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.

బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:

يَٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَٰفِرِينَ

(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్)
“ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42)
బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:

سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ

(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’)
“నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43)
ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.

తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:

يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ

(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక)
“ఓ నూహ్‌! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46)
ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.

إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ

(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్)
“నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46)
అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.

నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.

నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:

رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్)
“ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29)
ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:

وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ

(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్)
“ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42)
అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.

తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.

وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ

(వస్తవత్ అలల్ జూదియ్యి)
“ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44)
ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.

అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.

నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం

ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.

అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.

ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.

అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

డౌన్లోడ్ – కలామే హిక్మత్ (వివేక వచనం) -1
రచయిత : సఫీ అహ్మద్ మదనీ
[88 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

ముందుమాట – [డౌన్లోడ్ PDF]

ప్రవక్త లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర [వీడియో]

లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర
https://youtu.be/lQwtCpQfvi4 [29 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈజిప్టును వదలి తన సోదరుని కుమారునితో సహా పలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆ సోదర కుమారుడే లూత్ (అలైహిస్సలాం). ఆ పిదప లూత్(అలైహిస్సలాం) సదూమ్ పట్టణానికి వెళ్ళి పోయారు. ఈ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది. ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి. అక్కడి ప్రజలు ప్రయాణీకులను దోచుకునేవారు. బాటసారులను దోచుకుని హతమార్చే వారు. మరో పెద్ద చెడు స్వలింగ సంపర్కం. పురుషులు తమ భార్యలతో కాక పురుషులతోనే కామ వాంఛలు తీర్చుకునే వారు. ఈ అసహజ లైంగిక క్రియకు తర్వాత ‘సోడోమి‘ అనే పేరుపడింది. (సదూమ్ పట్టణం పేరు వల్ల). అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహాటంగా జరిగేది.

ఈ చెడులు పెట్రేగిపోయినప్పుడు అల్లాహ్ వారి వద్దకు లూత్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఈ చెడులను వదలుకోవలసినదిగా ఆయన వారికి బోధించారు. కాని వారు తమ చెడులలో పూర్తిగా కూరుకు పోయారు. లూత్ (అలైహిస్సలాం) బోధనల పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. అల్లాహ్ శిక్ష గురించి లూత్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించినప్పటికీ వారు తమ చెడుల్లో మునిగిపోయి ఆయన మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. ఇలాంటి బోధనలు కొనసాగిస్తే పట్టణం నుంచి తరిమేస్తామని ఆయన్ను బెదిరించారు. వారి చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూత్ (అలైహిస్సలాం) భయపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.

అపశకునం (దుశ్శకునం) [వీడియో]

అపశకునం – ఇస్లామీయ నిషిద్ధతలు & జాగ్రత్తలు
https://youtu.be/19rwK_CFVBI [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[فَإِذَا جَاءَتْهُمُ الحَسَنَةُ قَالُوا لَنَا هَذِهِ وَإِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَطَّيَّرُوا بِمُوسَى وَمَنْ مَعَهُ]

ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారుః మేము దీనికే అర్హులం అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించినపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. (అఅరాఫ్ 7: 131).

అరబ్బుల్లో ఎవరైనా ప్రయాణం లేదా మరేదైనా పని చేయదలినపుడు ఏదైనా పక్షిని వదిలేవాడు. అది కుడి వైపునకు ఎగిరిపోతే మంచి శకునంగా భావించి ఆ పని, ప్రయాణం చేసేవాడు. ఒకవేళ అది ఎడమ వైపునకు ఎగిరిపోతే అపశకునంగా భావించి ఆ పనిని మానుకునేవాడు. అయితే “అపశకునం పాటించుట షిర్క్” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచారు. (ముస్నద్ అహ్మద్ 1/389. సహీహుల్ జామి 3955).

తౌహీద్ కు వ్యతిరేకమైన ఈ నిషిద్ధ విశ్వాసంలో ఈ క్రింది విషయాలు కూడా వస్తాయిః

కొన్ని మాసాలను అపశకునంగా పరిగణించుట. ఉదాహరణకుః రెండవ అరబీ మాసం సఫర్ ను అపశకునంగా పరిగణించి అందులో వివాహం చేయక, చేసుకోకపోవుట. (మన దేశాల్లో కొందరు మొదటి నెల ముహర్రం ను అపశకునంగా పరిగణిస్తారు).

రోజులను అపశకునంగా పరిగణించుట. ఉదాహరణకుః ప్రతి నెలలోని చివరి బుధవారాన్ని పూర్తిగా అరిష్టదాయకమైనదిగా నమ్ముట.

నంబర్లలో 13వ నంబరును, పేర్లలో కొన్ని పేర్లను అపశకునంగా పరిగణించుట.

వికలాంగుడిని చూసి అపశకునంగా పరిగణించుట. ఉదాః దుకాణం తెరవడానికి పోతున్న వ్యక్తి దారిలో మెల్లకన్నువాడిని చూసి దుశ్శకునంగా పరిగణించి ఇంటికి తిరిగివచ్చుట. పై విషయాలన్ని నిషిద్ధమైన షిర్క్ పనులు. ఇలా అపశకునం పాటించేవారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహ్యించుకున్నారు. ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఉందిః

لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَه

అపశకునం స్వయంగా పాటించేవాడు, లేదా ఇతరులతో తెలుసుకొని పాటించేవాడు, కహానత్ చేసేవాడు, చేయించుకునేవాడు, చేతబడి చేసేవాడు, చేయించేవాడు మాలోనివాడు కాడు”. (తబ్రానీ ఫిల్ కబీర్ 18/162. సహీహుల్ జామి 5435).

ఎవరికైనా దుశ్శకున భావం కలిగితే వారు దాని ప్రాయశ్చితం ఈ క్రింది హదీసు ఆధారంగా చెల్లించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ رَدَّتْهُ الطِّيَرَةُ مِنْ حَاجَةٍ فَقَدْ أَشْرَكَ قَالُوا يَا رَسُولَ الله مَا كَفَّارَةُ ذَلِكَ قَالَ أَنْ يَقُولَ أَحَدُهُمْ اللَّهُمَّ لَا خَيْرَ إِلَّا خَيْرُكَ وَلَا طَيْرَ إِلَّا طَيْرُكَ وَلَا إِلَهَ غَيْرُكَ

అపశకునం ఎవరినైనా తన పని నుండి ఆపినదో అతను షిర్క్ చేసినట్లు”. ప్రవక్తా! అలాంటప్పుడు దాని ప్రాయశ్చితం ఏమిటి? అని సహచరులు అడి గారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ఈ దుఆ చదవండిః

అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక వలా తైర ఇల్లా తైరుక వ లా ఇలాహ గైరుక”. (నీ మంచి తప్ప ఎక్కడా మంచి లేదు. నీ శకునం తప్ప ఎక్కడా శకునం లేదు. నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు). (అహ్మద్ 2/220. సహీహ 1065).

అనుకోకుండా ఒక్కోసారి ఎక్కువనో, తక్కవనో అపశకున భావాలు మనస్సులో కలుగుతాయి, అలాంటప్పుడు అల్లాహ్ పై నమ్మకాన్ని దృఢ పరుచుకొనుటయే దాని యొక్క అతిముఖ్యమైన చికిత్స. అదే విషయాన్ని ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః

మనలో ప్రతి ఒక్కడు అపశకునానికి గురవుతాడు. కాని అల్లాహ్ పై గల దృఢ నమ్మకం ద్వారా అల్లాహ్ దానిని దూరం చేస్తాడు”. (అబూదావూద్ 3910, సహీహ 430).

ఇస్లామీయ నిషిద్ధతలు & జాగ్రత్తలు – పుస్తకం & వీడియో ప్లే లిస్ట్
https://teluguislam.net/2019/08/18/muharramat
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0T3CiWVFlZHZrSyBmrQJXS

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది [వీడియో]

అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది [వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/yP_BmmTDQI0 [3 నిముషాలు]

మొక్కుబడులు

అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.

ఇస్లామీయ నిషిద్ధతలు & జాగ్రత్తలు – పుస్తకం & వీడియో ప్లే లిస్ట్
https://teluguislam.net/2019/08/18/muharramat
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0T3CiWVFlZHZrSyBmrQJXS

మొక్కుబడి నియమాలు – సలీం జామి’ఈ [ఆడియో] [24 నిముషాలు]

గోరీల (సమాధుల) వద్ద అల్లాహ్ యేతరుల కోసం మొక్కుబడులు, జిబహ్ చెయ్యడం పెద్ద షిర్క్ – నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో] [6 ని][ఆడియో]

అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్ [వీడియో]

అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్ [వీడియో]
https://youtu.be/fukQG2Jz7Tw [18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్లాహ్ ఆదేశం చదవండిః

[فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ] {الكوثر:2}

నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108: 2).

అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله

అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).

జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు.

ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రభలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్త వేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).

ఇస్లామీయ నిషిద్ధతలు & జాగ్రత్తలు – పుస్తకం & వీడియో ప్లే లిస్ట్
https://teluguislam.net/2019/08/18/muharramat/
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0T3CiWVFlZHZrSyBmrQJXS

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

సూరతుల్ ఖలమ్ తఫ్సీర్ (ఖురాన్ వ్యాఖ్యానం) [వీడియో]

సూరా అల్ ఖలమ్ తఫ్సీర్ (ఖురాన్ వ్యాఖ్యానం) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3GcOICKWVoZpQJuvuEhIZ8

68:1 ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ

నూన్ – కలము సాక్షిగా! వారు (దైవదూతలు) వ్రాసే వ్రాత సాక్షిగా!

68:2 مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ

(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కావు.

68:3 وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ

నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది.

68:4 وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ

ఇంకా, నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు.

68:5 فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ

కాబట్టి (త్వరలోనే) నీవూ చూస్తావు, వారూ చూసుకుంటారు,

68:6 بِأَييِّكُمُ الْمَفْتُونُ

మీలో మతి స్థిమితం లేనివారెవరో! (అందరూ చూస్తారు.)

68:7 إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ

తన మార్గం నుండి తప్పిపోయిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గం పొందిన వారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.

68:8 فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ

కాబట్టి నువ్వు ధిక్కారుల మాట వినకు.

68:9 وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ

నువ్వు కాస్త మెత్తబడితే, తాము కూడా మెతకవైఖరి అవలంబించవచ్చునని వారు కోరుతున్నారు.

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/

అల్లాహ్ పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ పట్ల విశ్వాసం
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0Ud2-JK7Y7k [17 నిముషాలు]

ఈ ప్రసంగంలో, విశ్వాసంలోని ప్రాథమిక అంశాల గురించి వివరించబడింది. ముఖ్యంగా ‘అర్కానుల్ ఈమాన్’ (విశ్వాస మూలస్తంభాలు) లోని మొదటి అంశమైన అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి వివరంగా చర్చించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు జిబ్రీల్ అలైహిస్సలాం మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈమాన్ యొక్క ఆరు మూలస్తంభాలు వివరించబడ్డాయి: అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి చెడు విధిరాతను విశ్వసించడం. అల్లాహ్ అస్తిత్వం, ఆయన సర్వాధికారాలు (తౌహీద్ అర్-రుబూబియ్య), ఆరాధనలకు ఆయన ఒక్కడే అర్హుడు (తౌహీద్ అల్-ఉలూహియ్య), మరియు ఆయన పవిత్ర నామాలు, గుణగణాలు (తౌహీద్ అల్-అస్మా వస్సిఫాత్) అనే మూడు ముఖ్య విషయాలను తెలుసుకోవడం ద్వారా అల్లాహ్ పై సంపూర్ణ విశ్వాసం కలుగుతుందని బోధించబడింది. ఖురాన్ ఆయతుల ఆధారాలతో ఈ అంశాలు స్పష్టంగా వివరించబడ్డాయి.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి ముఖ్యాంశం, అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

చూడండి, దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో వచ్చి, “ఈమాన్ (విశ్వాసం) అంటే ఏమిటి? తెలుపండి” అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “ఈమాన్ (విశ్వాసం) అంటే అల్లాహ్ ను విశ్వసించాలి, దైవదూతలను విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించాలి, దైవ ప్రవక్తలను విశ్వసించాలి, పరలోక దినాన్ని విశ్వసించాలి, మంచి చెడు విధివ్రాతను విశ్వసించాలి.” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని చెప్పారు. దానికి దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు, “అవును, మీరు చెప్పింది నిజమే” అన్నారు.

రండి ఈరోజు మనము విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి విషయం, అల్లాహ్ పై విశ్వాసం గురించి తెలుసుకుందాం.

అల్లాహ్ ను విశ్వసించడం అంటే అల్లాహ్ ఉన్నాడు అని, అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు గొప్ప నామాలు, పేర్లు ఉన్నాయి అని విశ్వసించటం. దీని క్లుప్తమైన వివరణ ఇప్పుడు మీ ముందర ఉంచడం జరుగుతూ ఉంది.

అల్లాహ్ ఉన్నాడు అని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఇదే వాస్తవము కూడా. అల్లాహ్ ఉన్నాడు అని మనందరి ఆత్మ సాక్ష్యమిస్తుంది. సమస్యలు, బాధలు వచ్చినప్పుడు “దేవుడా” అని విన్నవించుకుంటుంది మన ఆత్మ. సృష్టిలో గొప్ప గొప్ప నిదర్శనాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉంచి ఉన్నాడు. ఆ నిదర్శనాలను చూసి, అల్లాహ్ ఉన్నాడు, సృష్టికర్త అయిన ప్రభువైన అల్లాహ్ ఉన్నాడు అని మనము గుర్తించాలి. ఉదాహరణకు, భూమి, ఆకాశాలు, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్రులు, ఇవన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినవి. అల్లాహ్ కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో, ఏ ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు అవ్వవు. వీటన్నింటినీ సృష్టించిన వాడు గొప్ప శక్తిమంతుడు, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మానవుల ద్వారా భూమి, ఆకాశాలను, సముద్రాలను, వీటిని పుట్టించడమో, సృష్టించటమో వీలుకాని పని. కాబట్టి, ఇది మానవులు సృష్టించిన సృష్టి కాదు, సృష్టికర్త, ప్రభువు అల్లాహ్ సృష్టించిన సృష్టి అని ఈ సృష్టిలో ఉన్న నిదర్శనాలు చూసి మనము అల్లాహ్ ఉన్నాడు అని గుర్తించాలి.

ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, ఒకవేళ సృష్టిలో ఉన్న నిదర్శనాలను చూసి మనము తెలుసుకోకపోయినా, మన శరీరంలో ఉన్న అవయవాలను బట్టి కూడా మనము మహాప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడని తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అవయవాలలో నుంచి ఏ ఒక్క అవయవము పాడైపోయినా, అలాంటి అవయవము ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో కూడా తయారు కాబడదు. మళ్ళీ అల్లాహ్ సృష్టించిన వేరే మనిషి శరీరం నుండి తీసుకుని మనము ఒకవేళ దాన్ని అతికించుకున్నా గానీ, అది అల్లాహ్ ఇచ్చిన అవయవం లాగా పని చేయదు. కాబట్టి మన శరీర అవయవాలే సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క గొప్పతనాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా మనము అల్లాహ్, సృష్టికర్త ఉన్నాడు అని మనం నమ్మాలి. ఇదే నిజమైన నమ్మకం.

చూడండి, ఖురాను గ్రంథం 52వ అధ్యాయం, 35వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ
(అమ్ ఖులిఖూ మిన్ ఘైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్)
ఏమిటి, వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా?” (52:35)

అంటే, ఎవరికి వారు స్వయంగా సృష్టించబడలేదు, వారిని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని ఆలోచింపజేస్తున్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అలాగే, ఖురాను గ్రంథం 51వ అధ్యాయం, 20 మరియు 21 వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
(వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మూఖినీన్)
నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి.” (51:20)

وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
(వఫీ అన్ఫుసికుమ్ అఫలా తుబ్సిరూన్)
స్వయంగా మీ ఆత్మల్లో (అస్తిత్వంలో) కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా?” (51:21)

చూశారా? మన శరీరంలోనే నిదర్శనాలు ఉన్నాయి. అవి చూసి అల్లాహ్ ను గుర్తుపట్టండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు. మొత్తానికి, సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడు. అదే విషయం మన ఆత్మ సాక్ష్యమిస్తుంది, అదే విషయం సృష్టిలో ఉన్న నిదర్శనాలు, సూచనలు మనకు సూచిస్తూ ఉన్నాయి.

ఇక, అల్లాహ్ ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మూడు విషయాలను బాగా అవగాహన చేసుకోవాలి. ఆ మూడు విషయాలు ఏమిటంటే:

మొదటి విషయం: అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టికర్త, వస్తువులన్నింటినీ ఆయనే సృష్టించాడు, అన్నింటికీ ఆయనే యజమాని, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయి అని విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ అర్-రుబూబియ్య అంటారు.

ఖురాను గ్రంథం 39వ అధ్యాయం, 62వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ
(అల్లాహు ఖాలిఖు కుల్లి షైఇన్)
అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే.”  (39:62)

జనన మరణాలను ప్రసాదించువాడు, ఉపాధి ప్రసాదించువాడు, లాభనష్టాలు కలిగించువాడు, సంతానము ప్రసాదించువాడు, వర్షాలు కురిపించువాడు, పంటలు పండించువాడు, సర్వాధికారాలు కలిగి ఉన్నవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనము తెలుసుకొని విశ్వసించాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గురించి తెలుసుకోవటానికి మరో రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని నమ్మాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ ఉలూహియ్య అంటారు.

ఆరాధనలు ప్రత్యక్షమైన ఆరాధనలు ఉన్నాయి, గుప్తమైన ఆరాధనలు ఉన్నాయి, చిన్న ఆరాధనలు ఉన్నాయి, పెద్ద ఆరాధనలు ఉన్నాయి. ఆరాధన ఏదైనా సరే, ప్రతి ఆరాధనకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని మనము తెలుసుకొని నమ్మాలి. ఆ తర్వాత ప్రతి చిన్న, పెద్ద, బహిరంగమైనది, గుప్తమైనది ఆరాధన ఏదైననూ అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆరాధనలకు అర్హుడు ఆయన ఒక్కడే కాబట్టి.

ప్రత్యక్ష ఆరాధనలు ఏవి? గుప్తమైన ఆరాధనలు ఏవి? అంటే నమాజు, ఉపవాసము, దుఆ, జంతుబలి, ఉమ్రా, హజ్, ఇవన్నీ ప్రత్యక్షంగా కంటికి కనిపించే ఆరాధనలు. గుప్తమైన ఆరాధనలు అంటే అల్లాహ్ పట్ల అభిమానం, అల్లాహ్ మీద నమ్మకం, అల్లాహ్ తో భయపడటం, ఇవి పైకి కనిపించని రహస్యంగా, గుప్తంగా ఉండే ఆరాధనలు. ఈ ఆరాధనలు అన్నీ కూడాను మనము కేవలం అల్లాహ్ కోసమే చేయాలి.

ఆరాధనల గురించి ఒక రెండు ముఖ్యమైన విషయాలు మీ ముందర ఉంచి నా మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిస్తాను. అసలు ఆరాధన ఎంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను, జిన్నాతులను ఈ ఆరాధన కోసమే సృష్టించాడు అని తెలియజేసి ఉన్నాడు.

ఖురాను గ్రంథం 51వ అధ్యాయము, 56వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియ’బుదూన్)
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.” (51:56)

చూశారా? మానవులు మరియు జిన్నాతులు అల్లాహ్ ను ఆరాధించటానికి సృష్టించబడ్డారు. మరి ఏ విషయం కోసం అయితే మానవులు సృష్టించబడ్డారో, అదే విషయాన్ని విస్మరిస్తే ఎలాగ? కాబట్టి ఆరాధన ముఖ్యమైన విషయం, మన పుట్టుక అందుకోసమే జరిగింది కాబట్టి, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉండాలి.

అలాగే, ప్రవక్తలు పంపించబడినది మరియు దైవ గ్రంథాలు అవతరింపజేయబడినది కూడా మానవులు అల్లాహ్ ను ఆరాధించటం కోసమే. మానవులు షైతాను వలలో చిక్కి, ఎప్పుడైతే అల్లాహ్ ను మరిచిపోయారో, అల్లాహ్ ను ఆరాధించటం మానేశారో, అల్లాహ్ ను వదిలి బహుదైవారాధన, మిథ్యా దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలను మళ్ళీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, అల్లాహ్ ను ఆరాధించే వారిలాగా చేయటానికి ప్రవక్తలను పంపించాడు, దైవ గ్రంథాలు అవతరింపజేశాడు.

చూడండి ఖురాను గ్రంథం 16వ అధ్యాయం, 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అని’బుదుల్లాహ వజ్తనిబుత్ తాఘూత్)

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. గా ఉండండి” అని బోధపరచాము.” (16:36)

చూశారా? ప్రవక్తలు వచ్చింది ఎందుకోసం అంటే అల్లాహ్ ఒక్కడే ఆరాధనలకు అర్హుడు, ఆయననే ఆరాధించండి, మిథ్యా దేవుళ్ళను ఆరాధించకండి అని చెప్పటానికే వచ్చారు. అందుకోసమే గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి. కాబట్టి ఆరాధన ముఖ్యమైనది. ఆరాధనలు మనము అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

ఇక, ఆరాధన స్వీకరించబడాలంటే రెండు ముఖ్యమైన షరతులు ఉంటాయండి. ఒక షరతు ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఆరాధనలు చేయాలి, దీనిని అరబీ భాషలో ఇఖ్లాస్ లిల్లాహ్ అంటారు. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారమే ఆరాధనలు చేయాలి. అరబీ భాషలో దీనిని ముతాబి’అతు సున్నతి రసూలిల్లాహ్ అంటారు. ఆరాధన స్వీకరించబడాలంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజము కాబట్టి, ప్రతి ఆరాధన అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించిన పద్ధతి ప్రకారము చేయాలి. అప్పుడే ఆ ఆరాధన స్వీకరించబడుతుంది.

ఇక, అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధిస్తే, అది బహుదైవారాధన అనిపించుకుంటుంది, దానిని అరబీ భాషలో షిర్క్ అంటారో. బహుదైవారాధన, షిర్క్, పెద్ద నేరము, క్షమించరాని నేరము. ఎట్టి పరిస్థితిలో ఆ నేరానికి పాల్పడకూడదు అని తెలియజేయడం జరిగింది.

ఇక, అల్లాహ్ ను తెలుసుకోవటానికి మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ కు పవిత్రమైన నామాలు, పేర్లు ఉన్నాయి, వాటిని ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ అంటారు. ఈ పేర్లలో అల్లాహ్ యొక్క గుణాలు తెలియజేయడం జరిగి ఉంది. కాబట్టి అందులో ఎలాంటి వక్రీకరణ చేయకుండా, మన ఇష్టానుసారంగా అర్థాలు తేకుండా, ఏ విధంగా అయితే అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారో, ఆ ప్రకారము ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి.

ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రహ్మాన్, రహీమ్ అని పేర్లు ఉన్నాయి. రహ్మాన్, రహీమ్ అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అని. అలాగే అల్లాహ్ కు సమీ’, బసీర్ అనే పేర్లు ఉన్నాయి. సమీ’ అంటే వినేవాడు, బసీర్ అంటే చూసేవాడు అని అర్థం. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రజ్జాఖ్, గఫూర్ అని పేర్లు ఉన్నాయి. రజ్జాఖ్ అంటే ఉపాధి ప్రదాత, గఫూర్ అంటే మన్నించేవాడు, క్షమించేవాడు. ఆ ప్రకారంగా, అల్లాహ్ యొక్క గుణాలను, అల్లాహ్ యొక్క లక్షణాలను తెలిపే చాలా పేర్లు ఉన్నాయి. అవి ఉన్నది ఉన్నట్టుగానే మనము విశ్వసించాలి.

ఇక, ఈ అల్లాహ్ యొక్క నామాల ద్వారా మనము అల్లాహ్ తో దుఆ చేస్తే, ఆ దుఆ తొందరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది.

ఖురాను గ్రంథం 7వ అధ్యాయం, 180 వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా)
అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి.” (7:180)

అల్లాహ్ కు ఉన్న పేర్లతో ఆయన్నే పిలవండి అని అల్లాహ్ చెప్పాడు కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు, ఉదాహరణకు మనతో పాపము దొర్లింది, మన్నించమని మనం అల్లాహ్ తో వేడుకుంటున్నామంటే, “ఓ పాపాలను మన్నించే ప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, యా గఫూర్, ఓ పాపాలను మన్నించే ప్రభువా, ఓ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, నీవు గఫూర్, పాపాలను మన్నించేవాడివి, నన్ను మన్నించు” అని వేడుకోవాలి. అలా వేడుకుంటే చూడండి, ప్రార్థనలో ఎంత విశిష్టత వస్తూ ఉందో చూశారా? ఆ ప్రకారంగా మనము వేడుకోవాలి.

ఇవి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను పూర్తిగా విశ్వసించటానికి ఈ మూడు ముఖ్యమైన విషయాలు. అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు పేర్లు ఉన్నాయి అని, ఈ మూడు విషయాలను మనం అవగాహన చేసుకుంటే అల్లాహ్ మీద మనకు సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది.

ఈ మూడింటిలో నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము, మిగతా రెండు విషయాలని మనము వదిలేశాము అంటే అప్పుడు మన విశ్వాసము అల్లాహ్ మీద సంపూర్ణము కాజాలదు. ఉదాహరణకు, మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించే సమయానికి అల్లాహ్ గురించి తెలుసుకొని ఉన్నారు. ఒక విషయం మాత్రమే తెలుసుకున్నారు: సృష్టి మొత్తానికి అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయని ఆ ఒక్క విషయాన్ని మాత్రమే వారు తెలుసుకున్నారు. కానీ ఆరాధనల విషయంలో మాత్రం వారు తప్పు చేసేవారు, విగ్రహాలను ఆరాధించేవారు. అల్లాహ్ కు గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయన్న విషయాన్ని వారు విశ్వసించే వారు కాదు. కాబట్టి వారి విశ్వాసము అసంపూర్ణము అని చెప్పబడింది, వారు విశ్వాసులు కారు అని చెప్పబడింది. కాబట్టి, అల్లాహ్ మీద మన విశ్వాసము పూర్తి అవ్వాలంటే, అల్లాహ్ గురించి ఈ మూడు విషయాల అవగాహన చేసుకుని మనము నమ్మాలి, ఆచరించాలి.

అల్లాహ్ మీద విశ్వాసం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తెలుసుకొని విశ్వసిస్తాడో అతనిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదుకుంటాడు, సహకరిస్తాడు, అతని కోరికలు తీరుస్తాడు, సమస్యలు పరిష్కరిస్తాడు. అలాగే, అల్లాహ్ ను విశ్వసించిన వ్యక్తి మంచి జీవితం గడుపుతాడు. మార్గభ్రష్టత్వానికి గురి అయ్యి పశువుల్లాగా, చాలామంది చేస్తున్న చేష్టలకు దూరంగా ఉంటాడు. అలాగే మనిషి అల్లాహ్ ను విశ్వసించటము ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ప్రసన్నత పొందుతాడు.

ఇవి అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి మనము తెలుసుకొనవలసిన ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30628


అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ:
https://teluguislam.net/allah/