ముస్లిం చేసే దానధర్మాలు | కలామే హిక్మత్

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని అబూ మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) చెప్పారు: “దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.”
సహచరులు అడిగారు – ‘ఒకవేళ అతని వద్ద లేకుంటే?!’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు :’అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాదించాలి. (దాంతో) తన స్వయానికి ప్రయోజనం చేకూర్చాలి మరియు దానం ఇవ్వాలి.’
సహచరులు సందేహంగా అడిగారు – ‘ఒకవేళ అలా చేయలేకపోతే? లేదా చేయకపోతే?’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు: ‘దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి.’
సహచరులు అడిగారు – ‘ఒకవేళ అలా చేయకపోతేనో?’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు ‘మంచిని ఆజ్ఞాపించాలి’.
సహచరులు మళ్ళీ అడిగారు ‘ఒకవేళ అది కూడా చేయలేకపోతే?!’
ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు : ‘(పరులను) నొప్పించకుండా జాగ్రత్త పడాలి. ఇది కూడా అతని పాలిట దానమే.” (బుఖారి)

“దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.” ముస్నద్ తియాసి ఉల్లేఖనంలో “ప్రతిరోజు” అనే పదం అదనంగా ఉంది. ఈ దానం శక్తిమేరకు ప్రతి ఒక్కరిపైతప్పనిసరి అవుతుంది. అంటే ప్రతి ముస్లిం నైజంలో, అతని ప్రవర్తనలో సదకా (దానం) ఒక భాగం కావాలన్నది దీని పరమార్థం. అతను ఏ స్థితిలో ఉన్నా – కలిమిలో ఉన్నా లేమి తాండవిస్తున్నా – అతనిలో దాతృ స్వభావం మాత్రం ఉండాల్సిందే అన్నది పై వాక్యం ఉద్దేశ్యం.

‘ఒకవేళ అతని వద్ద లేకపోతే’ అని ప్రవక్త గారి ప్రియ సహచరులు ప్రశ్నించారు.’దానం’ అనే ప్రస్తావన రాగానే ధన ధాన్యాదుల ద్వారా చేసే సహాయం మాత్రమేనని అసలు సహచరులు తలపోశారు. అయితే ఈ “పదం”కు ఉన్న భావం ఎంతో విస్తృతమయిందని, ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని మృదువుగా పలకరించి అతన్ని ఓదార్చటం, అతని ఆపదను కడతేర్చే సంకల్పంతో తరుణోపాయం సూచించటం కూడా “సదకా” కోవలోకే వస్తుందని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్లేషించారు.

ఈ నేపథ్యంలో ఇబ్నె అబీ హంజా ఇలా అభిప్రాయపడ్డారు :

“దాన ధర్మాలు చేయడం కేవలం శ్రీమంతులకే పరిమితం కాదని, డబ్బుఖర్చుపెట్టకుండా కూడా దానధర్మాలు చేయవచ్చని ఈ హదీసు ద్వారా ఆధారంలభిస్తున్నది.”

“అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాయించాలి.” అన్న ప్రవక్త గారి పలుకు గమనించదగినది. కష్టపడి ఉపాధిని సంపాయించటం చాలా ముఖ్యం అని దీని ద్వారా విదితమవుతుంది. కష్టపడి సంపాయించ గలిగినప్పుడే ఏ మనిషయినా తన స్వయానికై ఖర్చుచేసుకుని ఇతరుల కేదైనా సహాయం చెయ్యగలుగుతాడు. శ్రమించి సంపాదించుకుంటేనే, ఎదుటివారి ముందు చేతులు చాచి యాచించే దురవస్థ రాకుండా జాగ్రత్త పడగలుగుతాడు. పైపెచ్చు సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తూ, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ, వీలయినంత ఎక్కువగా నిరాధారులనుఆదుకోగలుగుతాడు.

“దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి” అనేది హదీసు లోని మరో వాక్యం. అటువంటి సహాయం నోటి ద్వారా కావచ్చు. చేతల ద్వారా కూడా కావచ్చు. మరోవిధంగా కూడా కావచ్చు. సహాయపడే తీరు ఎన్నో రకాలు.

“మంచిని గురించి ఆజ్ఞాపించాలి” అనేది మరో వాక్యం. వేరొక ఉల్లేఖనంలో “చెడులనుండి ఆపాలి” అని కూడా ఉంది. మంచిని ఆజ్ఞాపించటంలోనే “చెడుల నుండి ఆపటం” అనే భావం ఇమిడి ఉంది. ఖుర్ఆన్ హదీసుల వెలుగులో సమ్మతమయిన ప్రతిదీ ‘మంచి’గానే పరిగణించబడుతుంది. అలాగే ఖుర్ఆన్, హదీసులలో ఏవేవైతే ‘కూడదు’ అని అనబడ్డాయో అవి చెడుగానే పరిగణింపబడతాయి. వాటి జోలికి ప్రజలను పోనివ్వకుండా చూడటం కూడా గొప్ప సత్కార్యమే.

“(పరుల మనసు) నొప్పించకుండా జాగ్రత్త పడాలి.” నోటి ద్వారా నయినా, చేతలద్వారా నయినా లేక ఆ రెండింటి ద్వారానయినా ఎదుటివారు నొచ్చుకునేలా ప్రవర్తించరాదు. ఎట్టి పరిస్థితిలోనూ దైవ ప్రసన్నత చూరగొనటమే దీని వెనుక అసలు ప్రేరణ అయివుంటే తప్పకుండా ఇది సయితం పుణ్యకార్యంగానే పరిగణించబడుతుంది. దైవదాసులకు బాధ కలగకుండా మసలు కోవటం ఒక నిజమైన ముస్లిం యొక్క చిహ్నం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ద్వారా ఇదే భావం వ్యక్తమవుతోంది. ఆయన ఉల్లేఖించిన ప్రవచనం ఇలా ఉంది : “నిజమైన ముస్లిం అతనే – ఎవరి నోటి మరియు చేతుల బారి నుండి ముస్లింలుసురక్షితంగా ఉండగలరో.”

“ఒకవేళ అలా చెయ్యలేకపోతే,” ప్రవక్త సహచరులు పలు కోణాల నుంచి ఒకవిషయం యొక్క లోతుపాతులను తెలుసుకునేవారు. వారలా అడగటం వల్లనే “విషయం” ప్రాముఖ్యతను సంతరించుకుంది. సదకా (దానం) యొక్క విస్తృత భావం కూడా తెలిసివచ్చింది. దానధర్మాలు చేయటం, అవసరం ఉన్న వారిని ఆదుకోవటం, మంచిని గురించి ఆజ్ఞాపించటం, చెడుల నుండి ఆపటం ఇవన్నీ చెయ్యవలసిన ముఖ్య పనులేనని, వీటికిగాను దైవసన్నిధిలో ప్రతిఫలం కూడా అపారమని తెలియవచ్చింది.

ఈ హదీసు ద్వారా స్పష్టమయిన మరో విషయం ఏమిటంటే, సత్కార్యాలు వాటి ప్రాముఖ్యత, ప్రతిఫలాల దృష్ట్యా ఎన్నో స్థాయిలను కలిగి ఉంటాయి. అయితే వీటిలో అన్నిటిక న్నా ఉత్తమమయినది, మనిషి తన ధనాన్ని ఇతరులకు దానం చేయటం. ఒక ముస్లిం ఫకీరు భిక్షకుడు – దైవమార్గంలో ఖర్చు పెట్టలేకపోతే అతను, అది మినహా మిగతా సత్కార్యాలపై చొరవ చూపాలి. అల్లాహ్ ఏ ప్రాణి పైనా అతని శక్తికి మించిన భారం మోపడు. మనిషి, తాను ఏ సత్కార్యమూ చేయలేకపోతే, అతను కనీసం చెడుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.

ఈ హదీసు ద్వారా విదితమయ్యే మరో విషయం ఏమిటంటే, షరీఅత్ ఆదేశాలు -స్థితిగతుల దృష్ట్యా – స్వల్పమయిన వ్యత్యాసంతో వర్తిస్తాయి. ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం), ప్రతి ముస్లిం దానం ఇవ్వటం తప్పనిసరి అని ఖరారు చేశారు. అయితే ప్రతి ముస్లిం దానధర్మాలు చెయ్యలేడు. పైగా కొంతమందైతే దానాలు పుచ్చుకోవటం తప్ప మరో గత్యంతరం లేని స్థితిలో ఉంటారు. అటువంటప్పుడు పుచ్చుకోవడం వారి కొరకు సమంజసమే అవుతుంది. విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో మాటిమాటికీ విద్వాంసుని అడగవచ్చు అని కూడా ఈ హదీసు ద్వారా తెలియవస్తోంది. అదేవిధంగా కష్టపడి చెమటోడ్చి సంపాయించడం శ్రేష్ఠతతో కూడుకున్న విషయమని అలా సంపాయించే వాడే తనను ఆదుకోవటంతో పాటు ఇతరులను కూడా ఆదుకోగలుగుతాడని అవగతమవుతోంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ