యదార్థానికి మీ కొరకు దైవప్రవక్త (విధానం)లో అత్యుత్తమ ఆదర్శం ఉంది | కలామే హిక్మత్

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ కథనం ప్రకారం ముగ్గురు మనుషులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ధర్మపత్నుల ఇళ్ళకు వచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఆరాధనల గురించి వివరాలు అడిగి తెలుసుకోసాగారు. వారికా వివరాలు తెలుపగా, అవి కొద్దిగేనని వారనుకున్నారు. తరువాత వారిలా అనసాగారు : “మహాప్రవక్త ఎక్కడా? మేమెక్కడ? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ముందూ వెనుకటి పొరపొచ్చాలన్నీ క్షమించబడ్డాయి.” తరువాత వారిలో ఒకరు – “నేను ఇకనుండి రాత్రంతా నమాజ్లోనే గడుపుతాను” అని అంటే, మరొకరు, “నేను నిత్యం ఉపవాసం పాటిస్తాను, ఏ ఒక్క రోజు కూడా ఉపవాసం మానను” అన్నారు. ఇంకొకరు, “నేను స్త్రీలకు దూరంగా ఉంటాను, అసలెప్పుడూ వివాహమే చేసుకోను” అని ఖండితంగా చెప్పారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విషయం తెలుసుకుని ఇలా ప్రబోధించారు : “మీరీ విధంగా అంటున్నారు. వినండి – దైవసాక్షిగా! నేను మీకన్నా అధికంగా దైవానికి భయపడేవాడిని. అయితే నేను ఉపవాసం పాటిస్తాను, విరమిస్తాను కూడా. నమాజ్ చేస్తాను, నిద్రపోతాను కూడా. ఇంకా స్త్రీలను కూడా వివాహమాడతాను. ఎవరు నా విధానం పట్ల విసుగెత్తాడో అతనితో నాకెట్టి సంబంధం లేదు.” (బుఖారి)

(1) “ముగ్గురు మనుషులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ధర్మపత్నుల ఇళ్ళకు వచ్చారు.” ఆ ముగ్గురు ఎవరెవరో “ముస్నద్ అబ్దుర్రజాఖ్”లో పేర్కొనడం జరిగింది. వారిలో ఒకరు అలీ బిన్ అబీతాలిబ్, మరొకరు అబ్దుల్లాహ్ బిన్ ఉమ్ర్ బిన్ ఆస్, ఇంకొకరు ఉస్మాన్ బిన్ మజ్ఊన్ (రదియల్లాహు అన్హుమ్)లు.

(2) “మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆరాధనల గురించి వారు వివరాలు అడిగి తెలుసుకోసాగారు” అంటే భావం, దైవప్రవక్త రాత్రిపూట చేసే తహజ్జుద్ నమాజ్, వేడుకోలు (దుఆ) మరియు నఫిల్ రోజా (అదనపు ఉపవాసం)ల గురించి తెలుసుకోదలచారన్నమాట.

(3) “అది కొద్దిగేనని వారనుకున్నారు.” ఆరాధనపట్ల ప్రవక్త ప్రియ సహచరుల మక్కువకు ఇది తార్కాణం. మహాప్రవక్త అందరికన్నా ఎక్కువగా దైవధ్యానంలో గడిపేవారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అర్థరాత్రి తహజ్జుద్ నమాజ్లో గడిపితే, నెలలో సగం రోజులు నఫిల్ ఉపవాసాలు పాటించేవారు. ఇక మిగిలిన సమయాలలో కూడా ఆయన దైవనామస్మరణలో దైవస్తోత్రంలో, ప్రాయశ్చిత్తంలో గడిపేవారు. అయినప్పటికీ ఇదంతా తక్కువేనని ప్రవక్త సహచరులు తలపోశారు.

(4) “మహాప్రవక్త ఎక్కడా మేమెక్కడా?” అని వారు పోల్చుకోవటంలోని ఉద్దేశ్య మేమంటే, మహాప్రవక్త పాపమెరుగనివారు. కాగా, తాము లోపాలకు నిలయమైనవారు. తాము సామాన్య మానవులైతే, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు దైవప్రీతిని చూరగొన్న ప్రవక్తాయే. (కనుక) ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చేసేటంతటి ఆరాధన, ఉపాసనలు తమ స్థాయికి సరిపోవు. తాము మరిన్ని ఎక్కువ ఆరాధనలు చేస్తేనేగాని తమకు దైవప్రసన్నత లభించదు అని వారు తలపోశారు.

(5) “అల్లాహ్ ఆయనగారి ముందు వెనుకటి పొరబాట్లను మన్నించాడు.” అంటే ప్రవక్తగారు పాపాల జోలికి పోనివారు. నిరపరాధులు. ఒకవేళ ఆయనచేత ఏదయినా పొరబాటు జరిగిపోతే అల్లాహ్ ఆయన్ని క్షమించివేశాడు. ఆ మన్నింపు ప్రకటన ఖుర్ఆన్లో ఉంది.

“(ఓ ప్రవక్తా!) అల్లాహ్ మీ యొక్క మునుపటి వెనుకటి అపరాధాలను మన్నించాడు. మీపై తన కరుణానుగ్రహాన్ని పూర్తిచేశాడు. ఇంకా మీకు రుజుమార్గం చూపాడు.” (అల్ ఫతహ్ : 2)

(6) “నేనయితే ఇకనుండి రాత్రంతా సమాజ్లోనే గడుపుతాను” అంటే ఒక్క క్షణం కూడా రాత్రిని వృధా పోనివ్వను. నిద్రపోను. అనునిత్యం ఇలాగే చేస్తాను అని ఆ సహాబి కృతనిశ్చయం చేసుకున్నారు. రాత్రిపూట తియ్యటి నిద్రను త్యజించి తన స్మరణలో గడిపేవారి గురించి అల్లాహ్ తన గ్రంథంలో ఇలా వర్ణించాడు :

“వారి వీపులు పడకలకు వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును అత్యంత ఆశతోను, భయభక్తులతోను వేడుకుంటారు. మేము వారికి ప్రసాదించిన దాంట్లోంచి ఖర్చుచేస్తారు. వారి ఆచరణలకు ప్రతిఫలంగా ఎంత ఎక్కువ, మరెంత ఉత్తమ సామగ్రి – వారి కళ్ళకు చలువను ప్రసాదించే సామగ్రి – భధ్రపరచబడి ఉందో ఎవరికీ తెలియదు.” (సజ్దా : 16, 17)

పై ఆయత్లలో రాత్రిపూట అత్యంత ప్రీతికరమైన నిద్రను త్యాగం చేసి దైవధ్యానంలో నిలబడి, ఆయన్ని ఆశతో వేడుకున్న వారికి శుభవార్త ఇవ్వబడింది. అలా అని రేయంతా నిద్రపోకుండా అస్తమానం నమాజ్లోనే, దైవనామస్మరణలోనే గడపమని భావం ఎంతమాత్రం కాదు. కరుణామయుడయిన అల్లాహ్ తన అంతిమ ప్రవక్తను ఉద్దేశించి ఖుర్ఆన్లో ఇలా అన్నాడు :

“ఓ (దుప్పటి కప్పుకుని నిదురించేవాడా! రాత్రిపూట నమాజ్ లో నిలబడు. అయితే కొద్దిగా, లేదా సగం రాత్రి లేదా దానికన్నా కొంచెం తక్కువ సేపు ధ్యానించు. లేక దానికంటే ఇంకొంచెం ఎక్కువసేపు (నమాజ్ చేయి). ఇంకా, ఖుర్ఆన్ను బాగా ఆగి ఆగి మరీ పఠించు.” (అల్ ముజ్జమ్మిల్ : 1 – 4)

పై ఆయత్లలో, రాత్రి సాంతం నమాజ్లో గడపాలని అనబడలేదు. ఒక్కొక్కప్పుడు కొంత సేపు, మరొకప్పుడు సగం రాత్రి, ఇంకొకప్పుడు అంతకన్నా ఎక్కువ సమయం వీలునుబట్టి, శక్తినిబట్టి ఆరాధనలో గడపమని మాత్రమే నిర్దేశించడం జరిగింది. అల్లాహ్ తన ప్రవక్తకు ఇచ్చిన ఆదేశమే ప్రవక్త అనుయాయులకు కూడా వర్తిస్తుంది. అంతేగాని అందులో మరింత విపరీతానికి పోయి, తమ శరీరంపై మోతాదుకు మించిన భారం వేసి అనర్థాన్ని కొనితెచ్చుకోవలసిన అవసరం లేదని, మనిషి ఎప్పుడూ రెండు తీవ్ర వాదాలకు నడుమ మధ్యే మార్గాన్ని అనుసరించాలని బోధపడుతోంది.

(7) “నేను నిత్యం ఉపవాసం పాటిస్తాను” అంటే ప్రతి రోజూ నాగాలేకుండా ఉపవాసం పాటిస్తాను. అలా చేయటం వల్ల కామవాంఛలు అణగారిపోయి ఆంతర్యం పూర్తిగా అదుపులోకి వస్తుంది అని, అప్పుడే ప్రభువు ప్రసన్నత తనకు ప్రాప్తమవుతుందని ఆ సహాబి ఉద్దేశ్యం. అల్లాహ్ ఉపవాసి కొరకు విరివిగా ప్రతిఫలం సిద్ధం చేసి ఉంచాడు. మహనీయ ముహమ్మద్ వీలయినన్ని ఎక్కువ నఫిల్ రోజాలను పాటించేవారు. అన్నింటికన్నా అత్యుత్తమమయిన ఉపవాసం దావూద్ (అలైహిస్సలాం) గారి ఉపవాసం. అని, ఆయన (అలైహిస్సలాం) ఒకరోజు ఉపవాసం ఉండేవారని, ఆ మరునాడు ఉపవాసాన్ని విడనాడే వారని అంతిమ దైవప్రవక్త ప్రవచించారు. ప్రతిరోజూ నఫిల్ రోజాలు పాటించరాదని కూడా ఆయన నొక్కి చెప్పారు.

(8) “నేను స్త్రీలకు దూరంగా ఉంటాను. అసలెప్పుడూ వివాహమే చేసుకోను.” వివాహమాడటం వలన, భార్య సాంగత్యం వలన పురుషుడు దైవాన్ని విస్మరిస్తాడని, భార్యను సుఖ పెట్టడంలోనే నిమగ్నుడవుతాడని ఆ విధంగా అతను దైవాగ్రహానికి గురయ్యే ప్రమాదముందని సదరు సహాభి భావించారు. అందుచేత వివాహానికి, సంసార జంఝాటాలకు దూరంగా ఉండాలని ఆయన తలపోశారు. అయితే ఇదికూడా విపరీతమయిన పోకడే.

(9) “మీరీ విధంగా అంటున్నారు” మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ప్రసంగంలో ఆ ముగ్గురు సహచరుల పేర్లు ప్రస్తావించకుండా ‘మీలో కొందరు ఇలా అంటున్నారు’ అని సాధారణంగా విషయాన్ని ప్రస్తుతించి, ఆ విపరీత పోకడను ఖండించారని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది.

(10) “దైవసాక్షి! నేను మీ అందరికంటే ఎక్కువగా దైవానికి భయపడేవాడిని.” మహాప్రవక్త గారు ప్రమాణం చేసి మరీ తాను దైవభీతిపరుడినని ప్రకటించుకున్నారు. అవసరమయితే – ఎదుటివారిని మార్గభ్రష్టత నుంచి కాపాడే లక్ష్యంతో – మనిషి తనలోని సుగుణాన్ని చాటుకోవటం సబబేనని దీనిద్వారా విదితమయ్యింది.

మహాప్రవక్త అపరాధాలను అల్లాహ్ క్షమించివేసినందున ప్రవక్త గారు ఎక్కువ సేపు దైవారాధనలో గడపటం లేదేమోనని, తాము సామాన్యులమైనందున మరింత ఎక్కువ సాధన చేయవలసి ఉంటుందని ఆ ముగ్గురు సహచరులు ఊహించుకున్నారు. వాస్తవానికి వారి ఊహ సరైంది కాదు. అందుకే రసూలుల్లాహ్ గారు, తాను అందరికన్నా అధికంగా దైవానికి భయపడేవాడినని ప్రకటించుకోవలసి వచ్చింది.

(11) “నేను ఉపవాసం పాటిస్తాను. విరమిస్తాను కూడా.” అంటే నెలలో కొన్ని రోజులు ఉపవాసం ఉంటాను. కొన్ని రోజులు ఉండను అని దీని భావం. అదేవిధంగా రాత్రిపూట కొంత సమయం దైవారాధనలో గడుపుతాను. మరికొంతసేపు విశ్రమిస్తాను. ఎందుకంటే, మనిషి తన శరీరానికి విశ్రాంతినివ్వటం అవసరం. అలాగే స్త్రీలను వివాహమాడతాను. వారితో ధర్మసమ్మతమైన సంబంధం కలిగి ఉంటాను. ఇదే అసలు అల్లాహ్ సమ్మతించి ఆమోద ముద్రవేసిన మధ్యేమార్గం.

(12) “ఎవరు నా విధానం పట్ల విసుగెత్తాడో అతనితో నాకెట్టి సంబంధం లేదు.” ఇక్కడ ‘విధానం’ అంటే భావం ప్రవక్త గారు నెలకొల్పిన సంప్రదాయం (సున్నత్). అన్నపానీయాలు, వివాహాది శుభకార్యాలు, లావాలేవీలు మొదలగు విషయాలు ప్రత్యేకంగా ఆరాధన కోవలోకి రావు. అయినా ఇవన్నీ మహాప్రవక్త గారి విధానం, ఆయన ప్రవేశ పెట్టిన షరీఅత్లో ముఖ్యమైన విషయాలే. ఏ విధంగానయితే ఆరాధన విషయంలో దైవప్రవక్త పద్ధతిని అనుసరిస్తామో, అదేవిధంగా జీవితపు అన్ని విభాగాలలోనూ ప్రవక్త గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రవక్తగారి విధానం పట్ల విముఖతను ప్రదర్శించటం వాస్తవానికి నత్యధర్మం పట్ల విముఖతకు, తిరుగుబాటుకు ఆనవాలు వంటిది. ప్రవక్త గారి సంప్రదాయాన్ని త్రోసిరాజని ఇతర విధానాలను అవలంబించటం ముస్లిమైన ఏ ఒక్కడికీ తగదు. ఒకవేళ ఎవరయినా అలా చేశాడంటే అతను సాఫల్యమార్గం తప్పిపోయి, ధర్మభ్రష్టుడై పోయాడన్నమాట. అటువంటి వ్యక్తితో ప్రవక్త అనుచర సమాజానికి సంబంధం లేదు.

ఒకవేళ ఏ ముస్లిమయినా, అనివార్య పరిస్థితిలో ప్రవక్తగారి ఏ సున్నత్నయినా పాటించలేకపోతే అది వేరే విషయం. అయితే పాటించే వీలుండి కూడా ఉద్దేశ్యపూర్వకంగా పాటించకపోతే ప్రవక్త సంప్రదాయం పట్ల అతనిలో విసుగు పుట్టిందని అనుకోవలసి ఉంటుంది.

ఈ హదీసులో ప్రవక్తగారి జీవిత విధానం ఎటువంటిదో స్పష్టమయ్యింది. రాత్రంతా – ఎల్లప్పుడూ – నిద్రపోకుండా ఆరాధనలో గడిపేవాడు కూడా మహాప్రవక్త విధానాన్ని విస్మరించాడు. అలాగే రాత్రంతా దుప్పటి తన్నిపట్టి పడుకొని, దైవాన్ని అసలు స్మరించని వాడు కూడా ప్రవక్త విధానాన్ని విస్మరించాడు. ప్రతిరోజూ ఉపవాసం పాటించేవాడు కూడా ప్రవక్త సంప్రదాయాన్ని ఖాతరు చేయటం లేదు. అలాగే నఫిల్ రోజా అసలెన్నడూ పాటించని వాడు కూడా ప్రవక్త నెలకొల్పిన సున్నత్ను గౌరవించటం లేదు. అదేవిధంగా ఎవరయినా భార్యతో శాశ్వతంగా లైంగిక సంబంధం తెంచుకుంటే, లేదా పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతే అది కూడా ప్రవక్త సంప్రదాయానికి విరుద్ధమే. అలాగే ఎవరయినా భార్య పొందులో మునిగిపోయి ఆరాధనలను బొత్తిగా విస్మరిస్తే అదికూడా ప్రవక్త సంప్రదాయానికి విరుద్ధమే.

దైవప్రవక్త సంప్రదాయంలోనే మన శ్రేయోసాఫల్యాలు ఉన్నాయి. దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

“యదార్థానికి మీ కొరకు దైవప్రవక్త (విధానం)లో అత్యుత్తమ ఆదర్శం ఉంది – అల్లాహు, అంతిమ దినాన్ని విశ్వసించే, అల్లాహ్ ను ఎక్కువగా స్మరించే ప్రతి వ్యక్తికై (ప్రవక్త ఆదర్శప్రాయులు).” (అల్ అహ్ జాబ్ : 21)

అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి ప్రవక్త ఆచరణా పద్ధతిని అనుసరించాలని పై ఆయత్లో ఉపదేశించటం జరిగింది. ఇస్లాంలో సన్యాసత్వానికి తావులేదని కూడా పై చర్చ ద్వారా రూఢీ అవుతోంది.

ప్రవక్త సహచరులు తీర్పుదిన సాఫల్యాన్ని దైవ ప్రసన్నతను పొందే లక్ష్యంతో దైవప్రవక్త ఆచరణను అడుగడుగునా ఆదర్శంగా తీసుకోవటానికి పరితపించేవారని, దానికిగాను వారు విశ్వాసుల మాతలయిన ప్రవక్త ధర్మపత్నుల వద్దకు సయితం వచ్చి ప్రవక్త ఆచరణను గురించి అడిగి తెలుసుకునేవారని హదీసు ద్వారా స్పష్టమవుతోంది. అటువంటి తహ తహ మనలో కూడా ఉండాలి. ప్రవక్త దినచర్యను గురించి మనం తెలుసుకోవాలంటే హదీసు గ్రంథాలను ఎక్కువగా అధ్యయనం చేయాలి. మహాప్రవక్త సంప్రదాయానికి విరుద్ధమయిన మరే ఆచరణ అయినాసరే దానివల్ల వృధా శ్రమ తప్ప మరేమీ ప్రాప్తం కాదు.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్