అల్లాహ్ ప్రేమ | కలామే హిక్మత్

అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు :

“అల్లాహ్ తన దాసుల్లో ఎవరినయినా ఇష్టపడినపుడు జిబ్రయీల్నుపిలిచి, ‘అల్లాహ్ ఫలానా దాసుడ్ని ఇష్టపడుతున్నాడు. కనుక మీరు కూడా అతన్నిప్రేమించండి’ అనంటాడు. జిబ్రయీల్ అతన్ని ప్రేమించటం మొదలెడతారు.తరువాత ఆయన ఆకాశవాసుల్లో ప్రకటన గావిస్తూ ‘అల్లాహ్ ఫలానా దాసుడ్నిఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు కూడా అతన్ని ప్రేమించండి’ అని కోరారు.ఆకాశవాసులు అతన్ని ప్రేమించసాగుతారు. ఇంకా భూవాసులలో అతని పట్లఆదరాభిమానం కలుగజేయబడుతుంది.” (ముస్లిం)

ఈ హదీసులో అల్లాహ్ లోని ప్రేమైక గుణం ప్రధానంగా చెప్పబడింది. దైవ ప్రేమకు అర్హుడయ్యే దాసుడెవరు? దీని సమాధానం సుబాన్ (రదియల్లాహు అన్హు) గారి హదీసు ద్వారాచాలా వరకు లభిస్తుంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:

దాసుడు దైవప్రసన్నతను బడయటంలో ఎంతగా లీనమై పోతాడంటే, అల్లాహ్ తన దూతతో,‘జిబ్రయీల్! నా ఫలానా దాసుడు నన్ను మెప్పించగోరుతున్నాడు. ఓ జిబ్రయీల్!నా ఫలానా దాసుడు నన్ను ప్రసన్నుడ్ని చేయదలుస్తున్నాడు. వినండి! అతని పై నాకారుణ్యం అలుముకుంది’ అని అంటాడు. అప్పుడు జిబ్రయీల్ ‘ఫలానా దాసునిపై దైవ కారుణ్యం అవతరించుగాక!’ అని అంటారు. ఆకాశ వాసులు కూడా ‘అతనిపై దైవ కారుణ్యం వర్షించుగాక!’ అని ఎలుగెత్తి చాటుతారు.” (అహ్మద్)

దైవ ప్రసన్నతాన్వేషణ అనేది ఆయన నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను పాటించటం ద్వారా, అదనపు ఆరాధనల ద్వారా నెరవేరుతుంది. అలాగే అధర్మమయిన వాటికిదూరంగా మసలుకోవటం, నిష్ఠను ధర్మపరాయణతను అలవరచుకోవటం కూడాఅవసరం. ఈ సందర్భంలో మహాప్రవక్త ఈ ఆయత్ను పఠించినట్లు తిబ్రానీలోఉంది :

“ఎవరయితే విశ్వసించారో, సత్కార్యాలు చేశారో వారికోసంకరుణామయుడు నిశ్చయంగా త్వరలోనే ప్రేమను సృజిస్తాడు.”(మర్యమ్ – 96)

అంటే విశ్వాసుల కొరకు అల్లాహ్ హృదయాలను మెత్తబరుస్తాడు. వారి యెడల ప్రజల మనస్సులలో ప్రేమను పుట్టిస్తాడు.

యజమాని తన దాసుడ్ని ప్రేమించటమనేది ఆయన స్థాయికి తగిన విధంగా ఉంటుంది. యదార్థానికి నిజ యజమాని స్థాయికి ఎవరూ చేరుకోలేరు. అలాగే ఆయన గుణగణాలను ఎవరూ విశ్లేషించనూ లేరు. అయినప్పటికీ అంతటి శక్తిమంతుడు సద్వర్తనుడైన దాసుడ్ని ప్రేమిస్తాడనేది యదార్థం. అందులో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు.

ప్రేమ ఒక అనిర్వచనీయమైన భావన. అది కేవలం ఆచరణ లేదా ప్రవర్తన ద్వారానే వ్యక్తమవుతుంది. ఆకాశవాసులు భూవాసులు కూడా పరస్పరం ప్రేమించుకుంటారు.ఎదుటివాని శ్రేయాన్ని అభిలషించటం, విపత్తుల బారినుండి అతన్ని కాపాడటం, ఆపదలో ఆదుకోవటం ఇత్యాది విధాలుగా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఇక ఆకాశ వాసుల ప్రేమ ఎలా ఉంటుందంటే, వారు మంచివారైన దాసుల మన్నింపునకై దైవాన్ని ప్రార్థిస్తారు. వారి మనసులలో సవ్యమైన భావాలను కలిగిస్తారు.

“అతని పట్ల ఆదరాభిమానం కలుగ జేయబడుతుంది” అంటే భావం భూవాసులు కూడా అతనంటే ఇష్టపడతారని. ఈ హదీసు ద్వారా సజ్జనులను ప్రేమించడం అల్లాహ్ ప్రేమకు తార్కాణమని కూడా విదితమవుతోంది. “మీరు ధరణిలో అల్లాహ్ కు సాక్షులు” అని మహాప్రవక్త తన సహచరుల నుద్దేశించి చెప్పారు.

అల్లాహ్ ప్రేమకు ప్రతిరూపం. ప్రేమ ఆయన గుణగణాలలో ప్రముఖమైంది. దాని అన్వేషణకు పూనుకున్న వారికి, దానికోసం పరితపించిన వారికే ఆ భాగ్యం ప్రాప్తిస్తుంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ