ప్రవక్త మహనీయులు ప్రబోధిస్తూ ఉండేవారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు :
اللَّهُمَّ أَصْلِحْ لِي دِينِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي ، وَأَصْلِحْ لِي دُنْيَايَ الَّتِي فِيهَا مَعَاشِي ، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيهَا مَعَادِي وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ وَاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍّ
అల్లాహుమ్మ అస్లిహ్ లీ దీనియల్లజీ హువ ఇస్మతు అమ్రీ, వఅస్లిహ్ లీ దున్యాయల్లతీ ఫీహా మఆషీ, వఅస్లిహ్ లీ ఆఖిరతియల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతల్లీ ఫీ కుల్లి ఖైర్ ,వజ్అలిల్ మౌత రాహతల్లీ మిన్ కుల్లి షర్ర్
“ఓ అల్లాహ్! నా ధర్మాన్ని నా కోసం సవ్యంగా చెయ్యి. అది నా వ్యవహారానికి ప్రాతిపదిక. ఇంకా, నా కొరకు ప్రపంచాన్ని సజావుగా చెయ్యి. అందులో నా జీవితం ఉంది. ఇంకా, నా కొరకు పరలోకాన్ని సజావుగా చెయ్యి. దాని వైపునకే నేను మరలవలసి ఉంది. ఇంకా జీవితాన్ని నా కొరకు, అన్ని రకాల శ్రేయాలలో సమృద్ధికి మూలంగా చెయ్యి. ఇంకా, మరణాన్ని అన్ని రకాల ఆపదల నుండి విముక్తినిచ్చే సాధనంగా చెయ్యి.” (సహీ ముస్లిం 2720)
ఈ హదీసు ఐదు ప్రార్థనా వాక్యాలతో కూడుకుని ఉంది. ఈ ప్రార్థనా వచనాలను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు పలికేవారు. ఎందుకంటే ఈ ప్రార్థనా వచనాలు అత్యంత సమగ్రమైనవి, అర్థవంతమైనవి.
(1) “నా ధర్మాన్ని నా కోసం సవ్యంగా చెయ్యి” అనేది అసలు దుఆ. ఎవరికయితే ధర్మాన్ని సవ్యం చేసుకునే సద్బుద్ధి ప్రాప్తమయిందో వారికి ప్రాపంచిక, పారలౌకిక భాగ్యం కూడా లభించినట్లే. ఇంకా, అతని జీవితం శుభప్రదమైనదిగా, అతని పర్యవసానం ప్రశంసనీయంగా రూపుదాల్చింది. ధర్మం సవ్యం గావించబడటమంటే అర్థం మనిషికి సన్మార్గం ప్రాప్తమవటం, సదాచరణ చేసేవాడుగా అతను రూపొందడం అన్నమాట. దైవోపదేశం ఎటువంటి వరమంటే అది ప్రతి ఒక్కరికీ లభించదు. అల్లాహ్ అనుగ్రహం ఎవరిపై వర్షిస్తుందో వారికే అది ప్రాప్తమవుతుంది. దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు : “(ఓ ప్రవక్తా!) …. ఈ ప్రజలు, తాము ఇస్లాం స్వీకరించి మీకు ఉపకారం చేసినట్లు మాట్లాడుతున్నారు. వారితో అనండి, మీ ఇస్లాం ఉపకారం నాపై పెట్టకండి. అల్లాహ్ మీకు, మేలును చేశాడు. నిజానికి మీరు (మీ విశ్వాసంలో) సత్యవంతులైతే ఆయన మీకు విశ్వాసభాగ్యం ప్రసాదించాడు.”
తరువాత వచ్చిన నాలుగు దుఆ వచనాలు మొదటి వాక్యానికి తాత్పర్యం వంటివి. ఎవరి ధర్మం (దీన్) అయితే సజావుగా ఉందో వారి అన్నింటికన్నా పెద్ద సమస్య పరిష్కృతమైపోయింది. ఇక ఇతర సాఫల్య మార్గాలన్నీ తెరచుకున్నట్లే. ఈ మొదటి వాక్యంతో పాటు మిగిలిన నాలుగు వాక్యాలు కూడా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట వచ్చేశాయి. ఎందుకంటే అది దుఆ (ప్రార్థన, వేడుకోలు) చేసే సమయం! అల్లాహ్ ముందు అత్యంత వినమ్రతను ప్రదర్శించే సందర్భం! దాసుడు గనక దైవాన్ని అడిగితే, మాటి మాటికి అడిగితే సర్వోన్నత ప్రభువు సంతోషిస్తాడు. దాసుని నుండి ఆయన కోరేది కూడా అదే.
ఇబ్నె ఖయ్యూమ్ (రహ్మలై) ఇలా రాస్తున్నారు: దైవ సమక్షంలో వేడుకునే సమయంలో వేడుకోలు వచనాలను విస్తృతపరచటం, సుదీర్ఘం చేయటం ‘సంక్షిప్తీకరణ’ కంటే ఉత్తమం. అందుకనే ‘దుఆ’ వచనాలను మలిసారి పలకటం, పునశ్చరణ చేయటం సంప్రదాయం (మస్నూన్). ఇదీ దుఆ యొక్క ఔన్నత్యం. దుఆలో మాటిమాటికి అడిగే దాసులను అల్లాహ్ ఇష్టపడతాడు. అందుచేతనే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రార్థనలలో స్పష్టమైన పదాలు మనకు కనిపిస్తాయి. ఇమామ్ ముస్లిం, అలీ బి బిన్ అబీ తాలిబ్ ద్వారా – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించినట్లు ఉల్లేఖించారు : “ఓ అల్లాహ్! నేను నీకే విధేయుడినయ్యాను. నిన్నే విశ్వసించాను. ఇంకా నిన్నే నమ్ముకున్నాను. నిన్నే సేవించాను. నీవిచ్చిన ఆధారంతోనే వాదించాను. నువ్వే న్యాయ నిర్ణేత అని చెప్పాను. కనుక నువ్వు నా గత అపరాధాలను, జరగబోయే దోషాలను, గోచర అగోచర పాపాలను మన్నించు. నువ్వే నాకు దైవం. నువ్వు తప్ప మరో నిజ దైవం లేడు.”
ఒకవేళ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా అపరాధాలన్నింటినీ మన్నించు అని పలికినా. సరిపోయేది. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో వివరంగా విన్నవించుకున్నారు. ఇదే ఉత్తమ విధానం కూడా. ఎందుకంటే వేడుకోలు సమయంలో దాసుని తరఫున వినమ్రతా భావం, దాస్యభావం, నిస్సహాయ స్థితి వ్యక్తం కావాలి. తాను ఏ అపరాధాల మన్నింపునకై అంతగా మొరపెట్టుకుంటున్నాడో వాటిపట్ల అతని పశ్చాత్తాప భావం కూడా ప్రస్ఫుటమవటం అవసరం. ముక్తసరిగా అడిగేదానికన్నా వివరంగా అడగటాన్నే అల్లాహ్ మెచ్చుకుంటాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రార్థనలు కూడా చాలావరకు ఇలాగే (వివరంగా) ఉండేవి. ఈ పద్ధతి ద్వారానే దాసుడు తన ప్రభువుకు సన్నిహితుడవుతాడు. తద్వారానే అతనికి ఎక్కువ ప్రతిఫలం లభ్యమవుతుంది. ఇదీ సృష్టికర్త పరిస్థితి లేక విధానం.
అయితే మనిషి వ్యవహరణ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మనిషిని ఎంత ఎక్కువగా అడిగితే అంత ఎక్కువగా విసుగుచెందుతాడు. మొహం చాటేస్తాడు. అడిగే వాళ్ళ నుండి పలాయనం చిత్తగిస్తాడు. అసహ్యించుకుంటాడు. యాచకులు తనకు భారమయ్యారని భావిస్తాడు. ఎదుటివారు తనని ఎంత తక్కువగా అడిగితే అంతగా వారిని గౌరవిస్తాడు. అడగని వారిని అధికంగా ప్రేమిస్తాడు. కాని దైవం అలా కాదు. పవిత్రుడైన అల్లాహ్ ను మీరు ఎంతగా అడిగితే అంతే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు.
(2) “నా ప్రపంచాన్ని నా కొరకు సవ్యం చెయ్యి” అంటే ధర్మసమ్మతమైన (హలాల్) సంపాదనా మార్గాలను సుగమం చెయ్యమని భావం. సౌశీల్యవతి అయిన ఇల్లాలు, సద్వర్తనులయిన సంతానం ప్రసాదించమని, సజ్జనుల సహచర్యం వొసగమని, విపత్తులు, వైపరీత్యాల నుండి క్షేమంగా ఉంచమని, అన్ని రకాల పరీక్షలనుండి దూరంగా ఉంచమని భావం.
(3) “నా పరలోకాన్ని సజావుగా చెయ్యి” అంటే, సమాధి యాతన నుండి రక్షించమని, ప్రళయదినం నాటి కడగండ్ల నుండి కాపాడమని, “పుల్సరాత్”ను సులభతరం చేయమని, అపరాధాలను, అపసవ్యమైన పోకడలను, అన్యాయాన్ని పరిహరించమని, కానుకల నిలయమైన స్వర్గంలోకి ప్రవేశం కల్పించమని భావం.
(4) “జీవితాన్ని శ్రేయాల పెంపుదలకు మూలంగా చేయి” అంటే భావం ఇది నా జీవితం మంచి పనులలో గడిచిపోవాలి. జీవితంలోని ప్రతి ఘడియ ఫలవంతమైనదై ఉండాలి. జీవితం కూడా అల్లాహ్ యొక్క మహదానుగ్రహం. ఎంతోమంది మరణ ఘడియలో ఆందోళన చెందుతారు. తమకు మరికొంత వ్యవధి ఇస్తే ఫలాన ఫలాన మంచిపనులు చేసుకోవచ్చని కాంక్షిస్తారు. కాని ఆ క్షణాన్ని ఎవరూ ఆపలేరు. మరణ నిర్ణయాన్ని వాయిదా వేయలేరు. విశ్వాసి, అల్లాహ్ తనకు ప్రసాదించిన జీవితాన్ని మహాభాగ్యంగా భావించి మంచి పనులలో గడుపుతాడు. సత్కర్మల పత్రాన్ని పెంచుకుంటూ పోతాడు. కాని దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు అలా కాదు అతను ప్రతిక్షణం జీవితాన్ని దుర్వినియోగం చేస్తూ పరంలో అది తనకు భారం అయ్యేలా వ్యవహరిస్తాడు.
(5) “మరణాన్ని అన్నిరకాల యాతనల నుండి విముక్తినిచ్చే సాధనంగా చెయ్యి.” చెడులు, అపరాధాలతో నిండిన బ్రతుకుకన్నా మరణమే మేలు. ఇస్లాంలో ఆత్మ హత్యకు ఎట్టి స్థితిలోనూ అనుమతి లేదు. మరణాన్ని కోరుతూ వేడుకోవడమూ తగదు. ఈ హదీసులో ‘మరణం’ ప్రస్తావన వచ్చిందంటే, దాని భావం మరణాన్ని కోరినట్లు ఎంతమాత్రం కాదు. ఈ హదీసులో మరణం వొసగమని చెప్పబడలేదు. వచ్చే మృత్యువు ప్రపంచలోనూ మరియు సమాధి యాతన నుండి కాపాడి, అన్ని రకాల ప్రశాంతతను, సౌఖ్యాన్ని ప్రసాదించేలా చెయ్యమని మాత్రమే దీని భావం.
మహాప్రవక్త వారి ఈ వేడుకోలులోని వాక్యాల క్రమం కూడా అత్యున్నతమైనది. ప్రథమంగా ధర్మం (దీన్) సజావుగా ఉంచమని కోరటం జరిగింది. ఆ తరువాత ప్రపంచ క్షేమం, పరలోక జీవిత సాఫల్యం ఆశించటం జరిగింది. అనంతరం జీవన వ్యవహరాలలో ఉత్తమ సరళిని, మరణానంతరం జీవితంలోని మొదటి దశను ప్రస్తావించటం జరిగింది.
—
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్
Abu Hurairah (May Allah be pleased with him) reported: The Messenger of Allah Sallallaahu alaihi wa Sallam used to say:
اللَّهُمَّ أَصْلِحْ لِي دِينِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي ، وَأَصْلِحْ لِي دُنْيَايَ الَّتِي فِيهَا مَعَاشِي ، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيهَا مَعَادِي وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ وَاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍّ
Allahumma aṣliḥ lī dīn al-lathi huwa ‘iṣmatu amrī, wa aṣliḥ lī dunya-ya al-lati fīhā ma’āshī, wa aṣlih lī ākhirati al-lati fīhā ma’ādī, wa-ja’al al-ḥayāta ziyādatan lī fī kuli khayr, wa-ja’al al-mawta rāḥatan lī min kuli sharr
O Allaah, set right my religion, which is the safeguard of my affairs; and set right my world, wherein is my living; and set right my next life, to which is my return, And make life for me an increase in all good and make death a relief for me from every evil