రెండు ఉత్తమ వచనాలు | కలామే హిక్మత్

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: 

“రెండు వచనాలున్నాయి. అవి కరుణామయుని (అల్లాహ్)కి అత్యంత ప్రీతికరమైనవి. అవి నోటికి చాలా తేలికైనవే, (కాని) త్రాసులో చాలా బరువుగా ఉంటాయి. అవే ‘సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ ‘, ‘సుబ్ హానల్లాహిల్ అజీమ్.” (బుఖారి) 

1. ‘సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ’ అంటే అల్లాహ్ పవిత్రతను ఆయన స్తోత్రంతో సహా కొనియాడుతున్నాను అని అర్థం. ‘సుబహానల్లాహిల్ అజీమ్’ అంటే మహోన్నతుడైన అల్లాహ్ పవిత్రతను వర్ణిస్తున్నాను అని భావం. 

అల్లాహ్ పవిత్రత అనేది ఆయన సుగుణాలకు ప్రతీక, సకల లోపాలకు, బలహీనతలకు ఆయన అతీతుడు అనే భావం ఇందులో స్ఫురిస్తుంది. బహు దైవోపాసకులు ఏ బలహీనతలను, మరే భాగస్వామ్యాలను ఆయనకు ఆపాదిస్తారో వాటన్నింటికీ ఆయన అతీతుడు. 

విశ్వాసి ఘటించే శ్రద్ధాంజలి అల్లాహ్ ఔన్నత్యానికి, ఆయన స్థాయికి తగిన విధంగా ఉంటుంది. యదార్థానికి ఆయన అన్ని రకాల దోషాలకు దూరంగా ఉన్నవాడు. హదీసులో పేర్కొనబడిన రెండు సద్వచనాలు ఎంతో సంక్షిప్తమైనవి. సులభమైనవి. సృష్టిపై దృష్టిని సారించిన తరువాత, ఈ సువిశాల విశ్వ వ్యవస్థలోని నిర్వహణా యంత్రాంగం, అందలి పరమార్థాలపై యోచించిన తరువాత విశ్వాసి నోట అప్రయత్నంగా వెలువడే ఈ రెండు వచనాలు అనంత విశ్వ వ్యవస్థలోని అన్నింటికన్నా గొప్ప సత్యంగా, నిజమైన దైవస్తోత్రంగా రూపొందుతాయి. 

ప్రభువు ఏ విధంగా తన వ్యక్తిత్వంలో, గుణగణాలలో పవిత్రుడో అదేవిధంగా సృష్టి ఏర్పాట్లలోనూ సాటిలేనివాడు. ఆయన మానవులను ఆలోచించమని కోరాడు : 

“ఒక దానిపై ఒకటి సప్తాకాశాలను నిర్మించిన వాడు ఆయనే. మీరు కరుణామయుని సృష్టిలో ఎటువంటి సంబంధ రాహిత్యాన్ని కనలేరు. మరి మీ దృష్టిని సారించండి – మీ కేదయినా ఆటంకం కానవస్తోందా? మాటిమాటికీ దృష్టిని సారించండి, మీ దృష్టి అలసిసొలసి, ఓడిపోయి తిరిగివస్తుంది.”  (అల్ ముల్క్ : 3,4) 

దీని గురించి హాఫిజ్ ఇబ్నె హజర్ ఇలా అన్నారు : కరుణామయుడు అన్న పదాన్ని ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగిందంటే ఈ హదీసులో అల్లాహ్ యొక్క సువిశాలమైన కారుణ్యాన్ని సుబోధకం చేయడమే దీని పరమ ఉద్దేశ్యం అయి ఉంటుంది. ఆయన కరుణ ఎంత విస్తృతమైనదంటే, తన దాసులు మామూలు ఆచరణకు కూడా ఆయన పుష్కలమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. 

అల్లాహ్ కు ఈ వచనాలు అత్యంత ప్రీతికరం ఎందుకంటే, వీటి ద్వారా దాసుడు తన ప్రభువు గొప్పతనాన్ని, ఆయన ఏకత్వాన్ని, ఆయన అద్భుతాలను చాటుతాడు. బహుదైవోపాసకులు, దైవధిక్కారుల వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వారు ఒకవేళ దైవాన్ని విశ్వసిస్తున్నప్పటికీ ఆయనకు సహవర్తులుగా ఇతరుల్ని నిలబెట్టడం ద్వారా ఆయన గుణగణాలని నిర్లక్ష్యంచేసిన వారవుతారు. ఒక్కోసారి వారు దేవుని శక్తి యుక్తుల్ని సయితం అనుమానించే నిందించే విధంగా ప్రవర్తిస్తారు. అయితే నిజమైన విశ్వాసి, నికార్సయిన ఏకేశ్వరోపాసి చేసే స్తోత్రం, జిక్ (స్మరణ) ఎంతైనా ఆదరణీయమైనవి. 

దివ్య ఖుర్ఆన్లో ఎన్నో సూరాల ఆరంభం అల్లాహ్ పవిత్రతను కొనియాడటంతోనే జరిగింది. ‘హదీద్” “హష్ర”, “సఫ్” సూరాలు ఇలా ప్రారంభమయ్యాయి – 

“సబ్బహ లిల్లాహి మాఫిస్సమావాతి వ మాఫిల్ అర్జి వహువల్ అజీజుల్ హకీమ్.” 

అనువాదం : “భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ను స్తుతించాయి. ఆయన అధిపతి, వివేకవంతుడు.” 

ఇదేవిధంగా, “జుమా”, “తగాబున్” సూరాలు కూడా అల్లాహ్ పవిత్ర స్మరణతోనే మొదలయినాయి. 

3. “నోటికి చాలా తేలికైనవి” అంటే ఈ వచనాలను వల్లించడం అత్యంత సులువు. అరబీ భాషలోని కొన్ని పదాలను పలకటం సులభం కాదు. పైగా ఆ పదాలను చాలా జాగ్రత్తగా పలకవలసి ఉంటుంది. ఖిరాత్ కళా నిపుణులు అరబీ భాషలోని పదాలను రెండు రకాలుగా విభజించారు : 

(అ) షదీద్: అంటే గట్టిగా నొక్కి) పలకబడేవి. 
(ఆ) రఖ్వ : అంటే తేలిగ్గా ఉచ్చరించబడేవి. 

అయితే హదీసులోని రెండు వచనాల – సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ, సుబహానల్లాహిల్ అజీమ్ – లో ‘బ’ అనే అక్షరం తప్ప మిగిలిన అక్షరాలన్నీ “రఖ్వ” లోకే వస్తాయి. ఈ విధంగా, ఈ రెండు వచనాలు నోటికి చాలా తేలికైనవి. మహాప్రవక్త చెప్పింది సత్యమని నిరూపణయింది. 

4. “త్రాసులో చాలా బరువైనవి” అంటే తీర్పుదినం నాడు మనిషి కర్మలు తూయబడి నపుడు సత్కర్మల తక్కెడలో అవి బరువును పెంచుతాయి, నోటి ఉచ్చరణకు ఆ పచనాలు తేలికైనప్పటికీ ఫలితం రీత్యా అత్యంత బరువైనవి. ఆ బరువే పరలోకంలో పనికొచ్చేది. 

నోటిద్వారా జారిన మాటలు కూడా త్రాసులో తూయబడతాయన్న విషయం గత కాలాల్లో ప్రజలకు అర్థం కాకపోయిందేమో గాని ఉష్ణోగ్రతను, శీతోష్ణ స్థితిని సయితం కొలిచే నేటి ఆధునిక మానవుడికి ఇది వింతేమీ కాదు. ఇన్షా అల్లాహ్ తీర్పుదినం నాడు మనిషి కర్మలు, విశ్వాస పరిమాణం తప్పకుండా తూయబడతాయి. హదీసులోని శుభప్రదమైన ఆ రెండు వచనాలు పఠిస్తూ ఉండాలని పలుచోట్ల చెప్పబడింది. విధ్యుక్త ధర్మాల (ఫరాయిజ్) ను నిర్వర్తించటం మనసుకు కాస్త శ్రమగా తోచవచ్చునేమో గాని ఈ వచనాలను వల్లించడం కష్టతరమేమీ కాదు. అందుకే వీటిని పలుకుతూ ఉండటంలో పిసినారితనం కనబరచరాదు. 

ఈ రెండు వచనాలు ఇంతటి మహత్ పూర్వకంగా ఎలా రూపొందాయని ఆలోచిస్తే, పఠిత ఈ రెండు వచనాలను పఠిస్తూ పఠిస్తూ వాటి అర్థంపై యోచించటం మొదలెడతాడని, తద్వారా అతని హృదయాంతరాళంలో నిజస్వామి పట్ల గౌరవం, ప్రేమ ఏర్పడతాయని తెలుస్తోంది. తద్వారా అతని హృదయం నుంచి ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి. నిర్మలమైన మనసుతో ఇప్పుడతను ప్రభువుకు సన్నిహితుడవుతాడు. ప్రభువుకు సన్నిహితుడైన దాసుని స్థానం గురించి ఇక చెప్పవలసిందేముంది! 

“ఈ వచనాలు త్రాసులో బరువు కలిగి ఉంటాయి” అంటే భావం విశ్వాసి ఈ రెండు వచనాలను పలుకుతూనే అపరాధాలు చేస్తూ ఉండటం పరిపాటి. అయితే- హదీసులోని రెండు వచనాలు ఎంతటి మహత్తు గలవంటే ఎన్నో దుష్కర్మల కంటే అవి ఎక్కువ బరువు కల్గి ఉంటాయి. అందుచేత ఈ వచనాలను పలికే వారల్లా ఘోర అపరాధాలు చేస్తూ ఉండమని భావం ఎంతమాత్రం కాదు. సాధారణంగా ‘జిక్ర్’ (దైవనామ స్మరణ) లో గడిపే మనిషి దుష్కర్మలకు దూరంగానే ఉంటాడు. మానవ సహజమైన దౌర్బల్యం మూలంగా ఎప్పుడో ఒకప్పుడు అతని చేత తప్పు జరగవచ్చుగాని సతతం జరగదు. అదీగాక ఈ పవిత్ర వచనాలు అతని మనసులో భయభక్తులను సృజిస్తాయి. అటువంటి వ్యక్తికి అల్లాహ్ తరపున కూడా రక్షణ లభిస్తుంది. సహాయం లభిస్తుంది. కనుక అతను ధర్మ సమ్మతమయిన కోర్కెలను ధర్మ సమ్మతమయిన విధానాల ద్వారానే తీర్చుకుంటాడు. నెరవేరని మరెన్నో కోర్కెలను మనసులోనే అణచుకుంటాడు. త్యాగ భావం అలవరచుకుంటాడు. 

ఘోర అపరాధాలకు ఒడిగట్టడం విశ్వాస బలహీనతకు తార్కాణం. విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నవాడే పెద్ద పాపాలకు పాల్పడతాడని అహ్లెసున్నత్ వర్గం భావిస్తుంది. ఎన్ని అపరాధాలు చేస్తే అంతే అతని ఈమాన్ (విశ్వాసం) క్షీణిస్తూ పోతుంది. అతన్నే “ఫాసిఖ్” “ఫాజిర్” (అపరాధి, అపచారి) అనటం జరుగుతుంది. అయితే అతను గనక తనను విశ్వాసిగా చెప్పుకునేంతవరకు, ధర్మ భ్రష్టతకు పాల్పడ కుండా, షిర్క్ (బహుదైవారాధన)కు ఒడిగట్టకుండా ఉన్నంతవరకూ అతన్ని ముస్లింలలో ఒకడుగానే పరిగణించటం జరుగుతుంది. అతని వ్యవహారం పరలోకంలో అల్లాహ్ కే వదలివేయబడుతుంది. అయితే ఏకేశ్వరోపాసకుడయిన ప్రతి వ్యక్తినీ నరకం నుండి విముక్తి కలిగిస్తానని ఆయన అంటున్నాడు. అందుకే అల్లాహ్ తనగ్రంథంలో శుభవార్తను, హెచ్చరికను ఒకేచోట ప్రస్తావించాడు: 

نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ

“నేనే ఎక్కువగా మన్నించేవాడిని మరియు కరుణించేవాడినని, అయితే నా శిక్ష కూడా అత్యంత వ్యధాభరితమైన శిక్షేనని (ఓ ప్రవక్తా!) నా దాసులకు చెప్పివేయండి.” (అల్ హిజ్ర్ 15 : 49, 50) 

దాసులు తన వైపునకు మరలి రావాలని తనను అధికంగా జ్ఞాపకం చేయాలని, తన గొప్పతనాన్ని గురించి అదే పనిగా చెప్పుకోవాలని, తనను క్షమాశీలునిగా, స్వర్గ యజమానిగా చెప్పుకోవటంలో నిమగ్నులవ్వాలని, తనంటే భయపడుతూ ఉండాలని, పాపాలకు దూరంగా ఉండాలని, క్షమాభిక్ష పెట్టడంలో తాను ఎంత ఉదార స్వభావుడో నేరస్థులను పట్టుకోవటంలో కూడా అంతే కఠినుడని, కనుక తన పట్టు పట్ల తరచూ భయపడుతూ ఉండాలని అల్లాహ్ పై రెండు ఆయత్లలో దాసులకు చెబుతున్నాడు. దైవ కారుణ్యంపై ఆశలు పెంచుకోవటం, ఆయన ఆగ్రహం పట్ల భయపడుతూ ఉండటం విశ్వాసుల ముఖ్య లక్షణం. దైవప్రవక్తలు హజ్రత్ జకరియ్యా, హజ్రత్ యహ్యా (అలైహిముస్సలాం)ల గురించి ఖుర్ఆన్లో సెలవీయబడింది : 

إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ

“వారు సత్కార్యాల వైపునకు పరుగెత్తేవారు. మమ్మల్ని భయంతో ప్రార్థించేవారు, ఇంకా వారు మా ముందు వంగి ఉండేవారు.” (అంబియా 21: 90) 

పై ఆయత్ ద్వారా తెలిసేదేమంటే విశ్వాసి అత్యంత వినయ వినమ్రతలతో దైవనామాన్ని స్మరిస్తూ మంచి పనులు చేస్తూ కూడా ఆయన పట్టు పట్ల భయంతో కంపిస్తూ ఉంటాడు. దైవ నామస్మరణ, దైవారాధనలు అతన్ని ఎంతటి నిష్టాపరునిగా మలుస్తాయంటే చెడు పనులంటేనే అతనిలో అసహ్యం జనిస్తుంది. 

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ