పరలోకపు బికారి (Bankrupt in Aakhirah)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దరిద్రుడు ఎవరో మీకు తెలుసా?” దానికి సహాబాలు, ‘ఎవరి వద్ద డబ్బు, సామగ్రి లేవో అతనే దరిద్రుడు’ అని మేము భావిస్తున్నాము’ అని అన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు :

“నా అనుచర సమాజం (ఉమ్మత్)లో దరిద్రుడు ఎవరంటే, అతను ప్రళయదినం నాడు నమాజులు, ఉపవాసాలు, జకాత్ లతో పాటు హాజరవుతాడు. (కాని అతను) ఒకప్పుడు ఇతన్ని తిట్టాడు, అతనిపై అపనింద వేశాడు. మరొకప్పుడు ఇతని సొమ్మును కాజేశాడు, వేరొకప్పుడు అతన్ని కొట్టాడు. అందుచేత అతని సత్కర్మలు వారికి (ఆ బాధితులకు) ఇచ్చివేయబడతాయి. ఒకవేళ అతని సత్కర్మలన్నీ అయిపోయి అతనింకా వారికి బాకీపడితే, వారి అపరాధాలు తీసి ఇతని లెక్కలో వేయబడతాయి. ఆపైన అతన్ని అగ్నిలోకి నెట్టివేయడం జరుగుతుంది.” (ముస్లిం) :

“దరిద్రుడెవరు?” అనేది హదీసులో ముఖ్యాంశం. సహాబాల మనుస్సుల్లో పరలోక చింతనను పెంపొందించడానికి మహాప్రవక్త పలు రీతుల్లో విషయాన్ని ప్రస్తావించేవారు. ఇహలోకంలోని పదాలను పరలోక పరమార్థంతో మేళవించేవారు. సహచరులు కూడా అదే రీతిలో ఆలోచించాలి, యోచించాలన్నదే దీని ఉద్దేశ్యం. ‘దరిద్రుడెవరు?’ అని ప్రశ్నించే రీతిలో అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం). సహచరుల దృష్టిని కేంద్రీకరించే ఉద్దేశ్యంతో ఇలా అడగటం జరుగుతుంది. సహాబాలు తమకు తోచినంతవరకు ఉత్తమరీతిలోనే దరిద్రునికి నిర్వచనం చెప్పారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరలోక దరిద్రుని స్థితిని విశ్లేషించారు. ప్రపంచపు దారిద్య్రమైతే. తాత్కాలికమైనది. ఎంతో సంక్షిప్తమైన ప్రపంచ జీవితంతోపాటే అది కూడా అంతమైపోతుంది. చాలావరకు ప్రపంచంలోనే మనిషి లేమి తరువాత కలిమి కూడా పొందుతాడు. నిజమైన దరిద్రుడు, ప్రళయదినాన చేసుకున్న సత్కర్మలన్నీ కోల్పోయేవాడే. అప్పుడతని వద్ద సత్కర్మల నిధి ఉండదు. అతనికి రుణం కూడా ఎవరూ ఇవ్వరు. ఇంకా అతను, ఇతరుల వద్ద నుండి సత్కర్మల్ని ముట్టెత్తుకుని తన అవసరాన్ని నెరవేర్చుకోనూలేడు.

లోకంలో కొంతమంది పరిస్థితి ఏమంటే వారు ఒకవైపు నుండి సత్కార్యాలు చేస్తూ పోతుంటారు. కాని మరోవంక వారి దుష్కర్మల చిట్టా కూడా పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా తోటి మనుషులకు చేసే అన్యాయానికి సంబంధించిన అపరాధాల చిట్టా. తీర్పు దినంనాడు మనిషి, ఇతరుల నుండి తాను పొందవలసిన హక్కును అంత తేలిగ్గా వదలుకోడు. తప్పకుండా బదులును అపేక్షిస్తాడు. ఈ హదీసు ద్వారా బోధపడే ముఖ్యాంశం ఏమంటే మనిషి కొన్ని మంచి పనులు చేసుకున్నంత మాత్రాన సరిపోదు – అతను చెడుపనులు, అపరాధాలకు దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరమే. ఒక వంక సత్కార్యాలు చేస్తూనే మరోవంక చెడు పనులు చేసే వ్యక్తి దృష్టాంతం ఎటువంటిదంటే, ఒక రోగి ఉన్నాడు – అతను, వ్యాధి నయం కావటానికి మందులూ వాడుతున్నాడు. ఇంకోవైపు పత్యం చేయకుండా ఏదిబడితే అది తినేస్తున్నాడు. దాని పర్యవసానం నష్టం తప్ప మరేం కాగలదు? ఏవో కొన్ని దానధర్మాలు చేసి నిశ్చింతగా ఉండిపోయి, ఇక తమకేమీ ఫరవాలేదనుకుని ఏ చెడుపనికయినా వడిగట్టే వారికి ప్రళయదినాన పట్టే దుర్గతిపై అందరూ ఆలోచించాలి.

ఈ హదీసును ఉల్లేఖించిన వారు హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు), వీరు ప్రవక్త సహచరులలో ఎక్కువ హదీసుల్ని ఉల్లేఖించినవారు. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) యమన్లోని దోప్ తెగకు చెందినవారు. హిజ్రీ శకం 6వ ఏట వీరు మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. అప్పటి నుండి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవించినంతకాలం ఆయనకు తోడుండేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పలుకులన్నింటినీ ఆయన శ్రద్ధగా వినేవారు, ప్రవక్త ఆచరణను హృదయంలో పదిలపరచుకునేవారు. ఆయన ఇలా అన్నారు : “అన్సార్లు తమ తోటల్లో, ముహాజిర్లు వ్యాపార వ్యవహారాలలో నిమగ్నులై ఉండేవారు. నా చేయి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతిలో ఉండేది.”

ఒకసారి హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో, “ఓ దైవప్రవక్తా! నేను మీ పలుకులెన్నింటినో వింటున్నాను. (వాటిని) మరచిపోతానేమోనన్న భయం నాకుంది” అని విన్నవించుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు – “మీ దుప్పటిని పరచండి”. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) దుప్పటి పరిచారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతితో ఇన్ని నీళ్ళు దానిపై చల్లి, ఆ దుప్పటిని తుడుచుకొమ్మని చెప్పారు. తాను దుప్పటి తుడుచుకున్న తరువాత ఇక ఎన్నడూ మరుపు అనేదే రాలేదని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) అన్నారు.. వీరు గౌరవప్రదులయిన సహాబాలలోని వారు. 69 ఏళ్ళ వయస్సులో (హిజ్రీ 57లో) మదీనాలో తనువు చాలించారు.

పరలోకపు బికారి (Bankrupt in Aakhirah)
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English Version of this Hadith:

Abu Hurayra (May Allah be pleased with him) narrated that the Messenger of Allah (Peace Be Upon Him) once asked his companions: “Do you know who is the bankrupt one?”

The companions replied: “A bankrupt person amongst us is the one who neither has a dirham nor any possessions.”

The Prophet (Peace Be Upon Him) said: “Rather, the bankrupt person from my Ummah is the one who will come on the Day of Resurrection with a good record of Salah (Prayers), Sawm (Fasts) and Zakah (Obligatory Charity); but he would have offended a person, slandered another, unlawfully consumed the wealth of another person, murdered someone and hit someone. Each one of these people would be given some of the wrong-doer’s good deeds. If his good deeds fall short of settling the account, then their sins will be taken from their account and entered into the wrong-doer’s account and he would be thrown in the Hell Fire. {Sahih Muslim, Book 32, Hadith Number 6251}

%d bloggers like this: