విశ్వాసంలోని మాధుర్యం | కలామే హిక్మత్ 

మానవ మహోపకారి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు :

“ఎవరిలోనయితే మూడు సుగుణాలు ఉన్నాయో అతను విశ్వాసం (ఈమాన్)లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. అవేమంటే;

  1. ఇతరులందరికంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతనికి ప్రియతమమైన వారై ఉండాలి.
  2. అతనెవరిని ప్రేమించినా అల్లాహ్ కొరకే ప్రేమించాలి.
  3. అగ్నిలో నెట్టివేయ బడటమంటే అతనికి ఎంత అయిష్టంగా ఉంటుందో ధిక్కారం(కుఫ్ర్) వైపునకు పోవాలన్నా అంతే అయిష్టత ఉండాలి.” (బుఖారి)

ఈ హదీసును అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. హజ్రత్ అనస్రుదైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సేవకులుగా ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు ఈయన వయస్సు పది సంవత్సరాలు. ఈయన తల్లి ఈయన్ని దైవప్రవక్తకు సేవలు చేయమని చెప్పి అప్పగించింది. తన కుమారుని వయస్సులో, ఆస్తిపాస్తుల్లో, సంతానంలో వృద్ధి కోసం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రార్థించాలన్నది ఆమె ఆకాంక్ష. ఆమె మనోరధం ఈడేర్చడానికి మహాప్రవక్త అనస్ కోసం ప్రార్థించారు. ప్రవక్తగారు చేసిన ప్రార్థనా ఫలితంగా హజ్రత్ అనస్ కు ఇతర సహాబాల కన్నా ఎక్కువ మంది పిల్లలు పుట్టారు. ఈయన తోట ఏడాదిలో రెండుసార్లు పండేది. అయితే ఈ వృద్ధి వికాసాలతో ఝంజాటాలతో తాను విసిగెత్తి పోయానని, అల్లాహ్ మన్నింపు కొరకు నిరీక్షిస్తున్నానని అనస్ అంటూ ఉండేవారు. హిజ్రీ శకం 93లో ఆయన బస్రాలో కన్ను మూశారు. అప్పటికి ఆయనకు నూరేళ్ళు పైబడ్డాయి.

ఈ హదీసులో మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘విశ్వాసం’ లోని ఉన్నత శ్రేణిని గురించి వివరించారు. పైగా దీన్ని విశ్వాసంలోని మాధుర్యంగా, తీపిగా అభివర్ణించటం జరిగింది. ఎందుకంటే తియ్యదనాన్ని మానవ నైజం కూడా వాంఛిస్తుంది.

‘షేక్అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ “ఫతహ్ అల్ మజీద్”లో ఇలా అభిప్రాయపడ్డారు.“ఇక్కడ తీపి అది అభిరుచికి తార్కాణం. దైవధర్మాన్ని అవలంబించటం వల్ల ప్రాప్తమయ్యే తృప్తి, ఆనందం, ప్రశాంతతలకు ఇది ప్రతీక. వాస్తవానికి నిష్కల్మష విశ్వాసం ఉన్నవారే ఈ దివ్యానుభూతికి లోనవుతారు.

‘విశ్వాసంలోని తీపి’ని గురించి నవవి (రహిమహుల్లాహ్) ఏనుంటున్నారో చూడండి : దైవ విధేయతలో, భక్తీ పారవశ్యాలలో లీనమైపోయి తాదాత్మ్యం చెందటం, దైవప్రవక్త ప్రసన్నతను చూరగొనే మార్గంలో కష్టాలు కడగండ్లను ఆహ్వానించి ఓర్పుతో భరించటమే విశ్వాసంలోని తీపికి నిదర్శనం.

విశ్వాసం యొక్క ఈ ఉన్నత స్థానం ప్రాప్తమయ్యేదెలా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విషయమై మూడు షరతులను పేర్కొన్నారు.

ఇమామ్ ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఏమన్నారంటే – తృప్తికి, ఆనందానికి ప్రతీక అయిన విశ్వాస మాధుర్యం, దాసుడు తన ప్రభువును అమితంగా ప్రేమించినపుడే ప్రాప్తిస్తుంది.ఈ అమితమయిన ప్రేమ మూడు విషయాలతో పెనవేసుకుని ఉంది. ఒకటి, ఆప్రేమ పరిపూర్ణతను సంతరించుకోవటం. రెండు, దాని ప్రభావం దాసునిపై పడటం.మూడు, దానికి హాని చేకూర్చగల వస్తువులకు, విషయ లాలసకు దూరంగా ఉండటం.

ప్రేమ పరిపూర్ణతను సంతరించు కోవటం అంటే మతలబు దాసుడు ఇతరులందరికన్నా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించాలి. ఆ ప్రేమ అతనిపై ఎంత గట్టి ప్రభావం వేయగలగాలంటే, అతను ఎవరిని అభిమానించినా, ఎవరిని సమర్ధించినా, ఎవరికి తోడ్పడినా అది అల్లాహ్ కోసమే అయి ఉండాలి. తనలోని ఈ సత్ప్రవర్తనను, సాధుశీలాన్ని అపహరించే సమస్త వస్తువులను, అలవాట్లను అతను మానుకోవటమే గాకుండా వాటికి బహుదూరంగా మసలుకోవాలి. అంతేకాదు, ఆయా చెడు సాధనాలను మనసులో అసహ్యించుకోవాలి. తనను ఎవరయినా అగ్ని గుండంలో పడవేయజూస్తే ఎంతగా భయాందోళన చెందుతాడో అంతే భయాందోళన ఆ హానికరమయిన సాధనాల పట్ల కూడా చెందాలి.

“ఇతరులందరికంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతనికి ప్రియతమమైనవారై ఉండాలి” అనే హదీసులోని అంశం ప్రత్యేకంగా గమనించదగినది. ఈనేపథ్యంలో హాఫిజ్ ఇబ్నె హజర్ ఏమంటున్నారో చూడండి: తమ విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకోవాలని కాంక్షించేవారు, తమ తల్లిదండ్రుల, భార్యా భర్తల, సమస్త జనుల హక్కుల కన్నా తమపై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఎక్కువ హక్కులున్నాయని తెలుసుకుంటారు. ఎందుకంటే మార్గ విహీనతకు గురై ఉన్న తమకు సన్మార్గం లభించినా, నరకాగ్ని నుండి విముక్తి కలిగినా అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మాలంగానే కదా!”

దివ్య గ్రంథంలోనూ ఆ విషయమే నొక్కి వక్కాణించబడింది :


قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ

“ఓ ప్రవక్తా! అనండి, ‘ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీభార్యలు, బంధువులు మరియు ఆత్మీయులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు,మందగిస్తాయని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు మీకుగనక అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ఆయన మార్గంలో జిహాద్ చేయటం కంటేఎక్కువ ప్రియతమమైతే అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకునిరీక్షించండి. అల్లాహ్ హద్దులు మీరే వారికి మార్గం చూపడు.” ( అత్ తౌబా 9:24)

మనిషికి అత్యంత ప్రీతికరమైన ఎనిమిది అంశాలను అల్లాహ్ పై ఆయత్లో ప్రస్తుతించాడు. వాటి ప్రేమలో పడిపోయిన కారణంగానే మనిషి దైవనామ స్మరణపట్ల అలసత్వం, అశ్రద్ధ చూపుతాడు. అందుకే, మనిషి హృదయంలో గనక ఆ ఎనిమిది అంశాలు లేదా వాటిలో ఏ ఒక్కదానిపైనయినా సరే అల్లాహ్ పట్ల కన్నా ఎక్కువ ప్రేమ ఉంటే వ్యధా భరితమయిన శిక్షకు గురవుతాడని హెచ్చరించటం జరిగింది.అటువంటి వారు దుర్మార్గుల్లో కలసిపోతారు (అల్లాహ్ మన్నించుగాక!)

అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల అపారమయిన ప్రేమ ఉందని ఊరకే చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు, దాన్ని క్రియాత్మకంగా చాటి చెప్పాలి.అల్లాహ్ మరియు దైవప్రవక్త పట్ల ఎవరికెంత ప్రేమ ఉన్నదీ నిజానికి దైవాజ్ఞాపాలన ద్వారానే తెలుస్తుంది. దైవాజ్ఞల్నితు.చ. తప్పకుండా పాటిస్తూ, అడుగడుగునా భయభక్తులతో జీవించే వాడే యదార్థానికి దైవసామీప్యం పొందగలుగుతాడు. తన స్వామి దేన్ని ఇష్టపడతాడో, మరి దేన్ని ఇష్టపడడో ఆ సామీప్య భాగ్యంతోనే గ్రహిస్తాడు. తనను సృష్టించిన ప్రభువు ప్రసన్నత చూరగొనాలంటే, అంతిమ దైవప్రవక్తకు విధేయత చూపటం కూడా అవసరమన్న సత్యాన్ని గుర్తిస్తాడు.

అల్లాహ్ సెలవిచ్చాడు:

قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ

“ప్రవక్తా! మీరు ప్రజలకు చెప్పండి, ‘మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే, నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడు కూడాను.”(ఆలి ఇమ్రాన్ 3: 31)

అల్లాహ్ పట్ల తనకు ప్రగాఢమైన ప్రేమ ఉందని పలికే ప్రతి ఒక్కరికీ ఈ ఆయత్ నిర్ణయాత్మకమైనదని ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఇలా వ్రాశారు: ఎవరయితే అల్లాహ్ యెడల తనకు ప్రేమ ఉందని చాటుకుంటాడో, అలా చాటుకుంటూ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పద్ధతి ప్రకారం నడవడో అతను అసత్యవాది. మనోవాక్కాయ కర్మలచేత అతను ముహమ్మద్ చూపిన షరీఅత్ను అనుసరించనంత వరకూ అబద్ధాలకోరుగానే పరిగణించబడతాడు.

సహీహ్ హదీస్ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం ఒకటి ఇలా ఉంది – “నేను ఆచరించని పనిని ఎవరయినా చేస్తే అతను ధూత్కారి అవుతాడు”. ఏ వ్యక్తయినా తనకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల గల ప్రేమ పరిమాణాన్ని కొలచుకోదలుస్తే, ఖుర్ఆన్ మరియు హదీసుల గీటురాయిపై అతను తన జీవితాన్ని పరీక్షించి చూసుకోవాలి. ఒకవేళ తన దైనందిన జీవితం షరీఅత్కు అనుగుణంగా ఉందని తెలిస్తే అల్లాహ్ పట్ల, దైవప్రవక్త పట్ల ప్రేమ చెక్కు చెదరకుండా ఉన్నట్లే లెక్ట. అదే అతని ఆచరణ గనక దివ్య గ్రంథం మరియు ప్రవక్త సంప్రదాయం పరిధుల్లో లేదని తేలితే అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల తనలో ప్రేమ భావం లేదని అనుకోవాలి. అప్పుడతని ప్రథమ కర్తవ్యం ఏమంటే, తన జీవితాన్ని దైవాదేశాల పరిధిలో, దైవప్రవక్త సంప్రదాయం వెలుగులో మలచుకోవటానికి ప్రయత్నించటం.

“ఎవరిని ప్రేమించినా అల్లాహ్ కొరకే ప్రేమించాలి” : దైవ ప్రవక్తలు, సద్వర్తనులైన ప్రజలు, విశ్వాసులను ప్రేమించటం దైవం యెడల ప్రేమకు ప్రతిరూపం. వారిని ప్రేమించటానికి కారణం అల్లాహ్ వారిని ప్రేమించటమే! అల్లాహ్ దీవెనలు,సహాయం వారికి ఉండటం మూలంగానే!!

అయితే విశ్వాసులయిన మంచివారి పట్ల ఒక వ్యక్తికి గల ఈ ప్రేమాభిమానం ‘షిర్క్’ (బహుదైవోపాసన) కానేరదు. మంచి వారిని ప్రేమించినంత మాత్రాన అల్లాహ్ యెడలగల ప్రేమను విస్మరించినట్లు కాదు. ప్రేమించేవాడు, తన ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడు గనకనే తనూ ప్రేమిస్తున్నాడు. ప్రభువు ఎవరిని ఇష్టపడటం లేదో వారిని తనూ ఇష్టపడటం లేదు. తన ప్రభువు స్నేహం చేసిన వారితోనే తనూ సావాసం చేస్తున్నాడు. తన ప్రభువు పట్ల శత్రు భావం కనబరుస్తున్న వారిని తనుకూడా తన శత్రువులుగా పరిగణిస్తున్నాడు. తన ప్రభువు తనతో ప్రసన్నుడయితే పరమానంద భరితుడవుతాడు. తన ప్రభువు ఆగ్రహిస్తే ఆందోళనతో కుమిలి పోతాడు. తన ప్రభువు దేన్ని ఆజ్ఞాపించాడో దాన్నే తనూ ఇతరులకు ఆజ్ఞాపిస్తాడు. తన ప్రభువు వేటి జోలికి పోరాదని చెప్పాడో వాటి విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రభువు విధేయతలోనే ఉంటాడు. భయభక్తులు గల దాసులను, పశ్చాత్తాపం చెందేవారిని, పరిశుద్ధతను అవలంబించేవారిని, సౌశీల్యవంతులను, ఏకాగ్రతతో ఆరాధనలు చేసేవారిని అల్లాహ్ ఇష్టపడతాడు. కాబట్టి మనం కూడా అటువంటి వారిని – అల్లాహ్ ఇష్టపడుతున్నందున -ఇష్టపడాలి.

స్వామి ద్రోహానికి పాల్పడే వారిని, తలబిరుసుతనం ప్రదర్శించే వారిని, కల్లోలాన్ని రేకెత్తించేవారిని అల్లాహ్ ఇష్టపడడు. కాబట్టి అటువంటి దుర్మార్గులను మనం కూడా అసహ్యించుకోవాలి – ఒకవేళ వారు మన సమీప బంధువులైనప్పటికీ వారికిదూరంగానే మసలుకోవాలి.

“అగ్నిలో నెట్టివేయబడటమంటే ఎంత అయిష్టమో కుఫ్ర్ (ధిక్కారం) వైపునకుపోవాలన్నా అంతే అయిష్టత ఉండాలి.”

మనిషిలో ఈమాన్ (విశ్వాసం) యెడల ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉండాలంటే, దానికి విరుద్ధాంశమయిన కుఫ్ర్ (అవిశ్వాసం)ను, కుఫ్ర్ వైపునకు లాక్కుపోయే వస్తువులను తలచుకోగానే అతనిలో అసహ్యం, ఏవగింపు కలగాలి. అవిశ్వాస వైఖరిని అతను ఎంతగా ద్వేషిస్తాడో అతనిలో ఈమాన్ అంతే దృఢంగా ఉన్నట్లు లెక్క. మహాప్రవక్త ప్రియ సహచరులను గురించి అల్లాహ్ అంతిమ గ్రంథంలో ఇలాపేర్కొన్నాడు:

وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِّنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَٰكِنَّ اللَّهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ

“మీ మధ్య దైవప్రవక్త ఉన్నారన్న సంగతిని బాగా తెలుసుకోండి. ఒకవేళ ఆయన అనేక వ్యవహారాలలో మీరు చెప్పినట్లుగా వింటే, మీరే స్వయంగా నష్టపోతారు.అయితే అల్లాహ్ విశ్వాసాన్ని మీకు ప్రీతికరం గావించాడు. ఇంకా దాన్ని మీ మనసుల్లో సమ్మతమైనదిగా చేశాడు. అవిశ్వాసం, అపచారం, అవిధేయతలను ద్వేషించే వారుగా చేశాడు. సన్మార్గం పొందేది ఇటువంటివారే.” (అల్ హుజురాత్ 49 : 7)

అవిశ్వాసం, అపరాధం, అవిధేయత అంటే ప్రవక్త సహచరులలో ద్వేషం రగుల్కొనేది. తమలోని ఈ సుగుణం మూలంగానే వారు సన్మార్గ భాగ్యం పొందారు.

ఈ హదీసు ద్వారా బోధపడిన మరో సత్యం ఏమంటే, విశ్వాసం (ఈమాన్)లో పలు అంతస్థులు ఉన్నాయి. ఒకరిలో విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే, మరొకరిలో అసంపూర్ణంగా ఉంటుంది. దైవారాధన, దైవ నామస్మరణ వల్ల విశ్వాసి హృదయం నెమ్మదిస్తుంది. మనసు ప్రశాంతతను, సంతృప్తిని పొందుతుంది. ఈ ఉన్నత స్థానం కేవలం కుఫ్ర్ కు దూరంగా ఉండటంతోనే ప్రాప్తించదు. కుఫ్ర్ ను ద్వేషించినపుడే ప్రాప్తిస్తుంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ