ఈ ప్రసంగంలో, ఇస్లామీయ ఆచారమైన ‘తయమ్ముమ్’ (పొడి శుద్ధీకరణ) గురించి వివరించబడింది. ఇందులో తయమ్ముమ్ యొక్క అక్షరార్థం మరియు షరియత్ ప్రకారం దాని అర్థం, సూరహ్ అన్-నిసా మరియు సూరహ్ అల్-మాయిదా నుండి ఖురాన్ ఆధారాలు, నీరు అందుబాటులో లేనప్పుడు లేదా అనారోగ్యం వంటి నిర్దిష్ట పరిస్థితులలో తయమ్ముమ్ ఎప్పుడు అనుమతించబడుతుంది, ఏ పదార్థాలను (స్వచ్ఛమైన మట్టి మరియు దాని రకాలు) ఉపయోగించవచ్చు, దానిని ఆచరించే సరైన పద్ధతి మరియు దానిని చెల్లకుండా చేసే చర్యలు వివరించబడ్డాయి.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.
అభిమాన సోదరులారా! అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ రోజు మనం తయమ్ముమ్ గురించి తెలుసుకోబోతున్నాం.
తయమ్ముమ్ అంటే ఏమిటి?
తయమ్ముమ్ అంటే సంకల్పించటం అని అర్థం. శాబ్దిక అర్థం.
షరియత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు గానీ, ప్రయాణికుడు స్థానికంగా గానీ, వుజూ ఘుసుల్ లో మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్ని, చేతులను స్పర్శించుకోవడాన్ని కోవటం అని అర్థం.
ఈ తయమ్ముమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో సూర నిసా అలాగే సూర మాయిదాలో కూడా సెలవిచ్చాడు. తయమ్ముమ్ గురించి. సూర నిసాలో ఆయత్ ఇలా ఉంటుంది.
(వ ఇన్ కున్ తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్ అవ్ జాఅ అహదుమ్ మిన్ కుమ్ మినల్ గాఇతి అవ్ లామస్ తుమున్ నిసాఅ ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబన్ ఫమ్ సహూ బివుజూహికుమ్ వ అయ్దీకుమ్)
ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. (సూర నిసా 4:43)
మీరు ఎప్పుడైనా అస్వస్థులై అయి ఉంటే, అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే, లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే అంటే సంభోగం చేసి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో, కాలకృత్యాలు తర్వాత మలమూత్ర విసర్జన తర్వాత వుజూ తప్పనిసరి. సంభోగం తర్వాత ఘుసుల్ తప్పనిసరి. నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీరు మీ ముఖాలను చేతుల్ని స్పర్శించుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయతులో ఘుసుల్ మరియు వుజూకి బదులు నీరు లేనప్పుడు తయమ్ముమ్ అనే అవకాశాన్ని, భాగ్యాన్ని, అనుమతిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనలకి ప్రసాదించాడు.
తయమ్ముమ్ ఏ సందర్భాలలో అనుమతి ఉంది?
ఇక తయమ్ముమ్ ఏ సందర్భాలలో అనుమతి ఉంది? వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్. కాకపోతే దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలోనే అనుమతి ఉంది.
ఒకటి, నీరు లేనప్పుడు. నమాజ్ కోసం తప్పనిసరిగా వుజూ చేయాలి, నీరు లేదు. తప్పనిసరిగా ఘుసుల్ చేయాలి, నీరు లేదు.
రెండవది, నీరు ఉన్నా త్రాగటానికి సరిపోతుంది. ఎంత నీరు ఉందంటే, తాగితే వుజూకి లేదు, వుజూ చేస్తే తాగటానికి లేదు. అలాంటప్పుడు. నీరు ఉన్నా తాగడానికి సరిపోయినప్పుడు.
మూడవది, నీటి ఉపయోగం మనిషికి హానికరం. అనారోగ్యం మూలంగా, ఏదో ఒక గాయం మూలంగా ఏదైనా సరే. నీటి ఉపయోగం మనిషికి హానికరం. అటువంటి సందర్భంలో.
నాలుగవది, ఒకవేళ నీరు మంచుగా, మంచులాగా చల్లగా ఉంది. వేడి చేసే అవకాశం కూడా లేదు. అటువంటి సందర్భంలో.
అలాగే ఐదవది, నీరు ఉన్నప్పటికీ నీటికి మనిషికి మధ్య ప్రాణ శత్రువు, అడవి మృగం, మరేదైనా ప్రాణాపాయం కలిగించే వస్తువు మధ్యలో ఉంది. అటువంటి సమయంలో తయమ్ముమ్ చేయవచ్చు.
ఈ ఐదు కారణాలు సందర్భాలలో వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్ ఉంది.
ఏ వస్తువులతో తయమ్ముమ్ చేయాలి?
ఏ వస్తువులతో తయమ్ముమ్ చేయాలి? పరిశుభ్రమైన మట్టితో గానీ లేదా మట్టి కోవకు చెందిన ఇతర వస్తువులతో తయమ్ముమ్ చేయాలి. ఉదాహరణకు ఇసుక, ఎండిపోయిన బూడిద, రాయి, కంకరరాళ్ళు మొదలగునవి.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయత్ లో చెప్పిన పదం ఏమిటి?
పరిశుభ్రమైన మట్టితో అన్నాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. అంటే సయీద్ అంటే ఏమిటి? సయీద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి కావచ్చు, మట్టి లాంటి ఇతర వస్తువులు కూడా అవ్వచ్చు.
తయమ్ముమ్ చేసుకునే పద్ధతి
పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పఠించాలి. ఆ తర్వాత రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. ఆ తర్వాత చేతుల్ని ఒక్కసారి ఊదాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత చేతుల్ని మణికట్టు వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చెయ్యి పైన, కుడి చేతితో ఎడమ చెయ్యి పైన.
చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన. ఆ తర్వాత చివర్లో వుజూ చేసిన తర్వాత పఠించే దుఆ తయమ్ముమ్ తర్వాత కూడా పఠించాలి.
(అష్ హదు అల్ లాఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ జ’అల్నీ మినత్ తవ్వాబీన వ జ’అల్నీ మినల్ ముతతహ్ హిరీన్.)
ఇది తయమ్ముమ్ చేసే పద్ధతి. చాలా సింపుల్ గా, సులభంగా ఉంటుంది.
పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పలకాలి. రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన స్పర్శించుకోవాలి. ఆ తర్వాత వుజూ తర్వాత ఏ దుఆ పఠిస్తామో ఆ దుఆ పఠించాలి.
తయమ్ముమ్ దేని వల్ల భంగమైపోతుంది?
తయమ్ముమ్ దేని వల్ల భంగమైపోతుంది? ఏ కారణాల వల్ల తయమ్ముమ్ భంగమవుతుంది? తయమ్ముమ్ ని భంగపరిచే విషయాలు.
మొదటిది, ఏ కారణాల వల్ల వుజూ భంగం అవుతుందో అదే కారణాల వల్ల తయమ్ముమ్ కూడా భంగం అవుతుంది.
రెండవది, నీరు లభించినా లేదా నీరు ఉపయోగించే స్థితి ఏర్పడినా తయమ్ముమ్ భంగమైపోతుంది.
అభిమాన సోదరులారా! ఇది తయమ్ముమ్ గురించి కొన్ని విషయాలు. తయమ్ముమ్ అంటే శాబ్దిక అర్థం ఏమిటి, షరియత్ పరంగా తయమ్ముమ్ అంటే అర్థం ఏమిటి, ఏ సందర్భాలలో తయమ్ముమ్ చేయాలి, అలాగే ఏ వస్తువుతో తయమ్ముమ్ చేయాలి, తయమ్ముమ్ చేసే పద్ధతి ఏమిటి, తయమ్ముమ్ ని భంగం పరిచే విషయాలు ఇది మనం తెలుసుకున్నాం.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ కి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రతి విషయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అనుసరిస్తూ ఆయన సున్నత్ ని ధనాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహ్.
ఇతర పోస్టులు :
తయమ్ముమ్ విధానం (ప్రాక్టికల్ గా) – నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో] [26 సెకండ్లు]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మానవుల కర్మల నమోదు – [మరణానంతర జీవితం – పార్ట్ 50] https://youtu.be/acqUQX3MOKQ [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రళయదినాన విశ్వాసులకు ప్రసాదించబడే ఒక గొప్ప వరం, “హౌదె కౌసర్” గురించి వివరించబడింది. తీర్పుదినం యొక్క భయంకరమైన పరిస్థితులలో, ప్రజలు తీవ్రమైన దాహంతో ఉన్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ద్వారా ఈ ప్రత్యేకమైన కొలను (హౌద్) ప్రసాదించబడుతుంది. దాని నీరు పాలకన్నా తెల్లగా, తేనెకన్నా తియ్యగా ఉంటుంది. ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు స్వర్గంలో ప్రవేశించే వరకు మళ్ళీ దాహం గొనరు. ఈ హౌద్ వద్దకు ప్రవక్త అనుచరులు మాత్రమే చేరగలుగుతారు, మరియు వారిని ప్రవక్త తమ చేతులతో నీరు త్రాగిస్తారు. అయితే, ప్రవక్త తర్వాత ధర్మంలో కొత్త విషయాలను కల్పించినవారు (బిద్అత్ చేసినవారు) మరియు ఆయన మార్గాన్ని అనుసరించని వారు ఈ గొప్ప భాగ్యానికి నోచుకోలేరు మరియు హౌద్ నుండి దూరంగా నెట్టివేయబడతారు. ధర్మంపై స్థిరంగా ఉండి, కష్టాలలో సహనం వహించిన వారికి ఈ భాగ్యం లభిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
హౌదె కౌసర్ (కౌసర్ కొలను)
మహాశయులారా, ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన స్థితి అలుముకుంటుంది, ప్రజలందరూ చెమటలో మునిగి, దీర్ఘకాలం వల్ల వేచి చూస్తూ వేచి చూస్తూ అలసిపోయి, సిఫారసు చేయడానికి ప్రవక్తలను సైతం విన్నవించుకొని నానా రకాల బాధలకు గురి అవుతూ ఉన్న ఆ సందర్భంలో, ఎన్నో ఘట్టాలు వారి ముందు దాటుతూ ఉంటాయి. లెక్కతీర్పు తీసుకోవడం జరుగుతుంది, అది కూడా చాలా క్లిష్ట పరిస్థితి. అటువైపున త్రాసులో తూకం చేయడం జరుగుతుంది. మరోవైపు కుడిచేతిలో కర్మపత్రాలు పొందే వారు కొందరు ఉంటే, ఎడమచేతిలో కర్మపత్రాలు పొందే వారు మరికొందరు అభాగ్యులు ఉంటారు.
ఇలాంటి ఈ సందర్భంలో సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది, వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది. కనీసం ఒక చుక్క బొట్టు నీళ్లు దొరికినా ఎంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది. అలాంటి సందర్భంలో హౌదె కౌసర్ అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది.
ఆ సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌదె కౌసర్. అంటే, అది ఒక మహా విశాలమైన హౌద్. ఒక నెల మీరు ప్రయాణం చేసినా దాని పొడుగు అనేది అంతము కాదు. వెడల్పు కూడా అలాగే ఉంటుంది. మరియు దాని యొక్క నీళ్లు పాలకంటే తెల్లగా, తేనెకంటే తీపిగా ఉంటాయి. ఆ హౌద్ లో వచ్చిపడే నీళ్లు స్వర్గంలో ఉన్నటువంటి నహరె కౌసర్ (కౌసర్ నది) నుండి వస్తాయి.
మహాశయులారా, దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు అంటే, దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం. మరియు ఆ హౌదె కౌసర్, దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో, వారు స్వర్గంలో వెళ్లే అంతవరకు వారికి దాహం కలగదు.
అయితే, ఆ హౌదె కౌసర్ నీరును పొందే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అది ప్రాప్తించదు. హౌదె కౌసర్ వద్ద ఆ నీరు త్రాగడానికి ఏ పాత్రలైతే ఉంటాయో, వెండి బంగారపు పాత్రలు ఉంటాయి మరియు వాటి సంఖ్య ఆకాశంలో నక్షత్రాల్లాంటి సంఖ్య. అక్కడ ఆ హౌదె కౌసర్ వద్దకు రావడానికి ప్రతి ఒక్కరికీ పర్మిషన్, అనుమతి అనేది ఉండదు. మరియు అక్కడ ప్రతి ఒక్కరు తమిష్టానుసారం త్రాగలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత, వారి యొక్క శుభ హస్తాలతో అది ఇవ్వడం జరుగుతుంది. వారి శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
حَوْضِي مَسِيرَةُ شَهْرٍ، وَزَوَايَاهُ سَوَاءٌ (హౌదీ మసీరతు షహ్రిన్, వ జవాయాహు సవా) “నాకు అక్కడ ఇవ్వబడే హౌద్ దాని యొక్క పొడుగు ఒక నెల ప్రయాణం చేసే అంత దూరం ఉంటుంది మరియు దాని యొక్క వెడల్పు కూడా అంతే ఉంటుంది.”
مَاؤُهُ أَبْيَضُ مِنَ اللَّبَنِ، وَرِيحُهُ أَطْيَبُ مِنَ الْمِسْكِ (మాఉహు అభ్యదు మినల్లబన్, వ రీహుహు అత్‌యబు మినల్ మిస్క్) “దాని యొక్క రంగు పాలకంటే తెల్లగా మరియు దాని యొక్క సువాసన కస్తూరి కంటే ఎక్కువ సువాసన“
మరియు అక్కడ త్రాగడానికి పాత్రలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న విధంగా ఉంటాయి.
مَنْ يَشْرَبْ مِنْهَا فَلا يَظْمَأُ أَبَدًا (మన్ యష్రబ్ మిన్హా ఫలా యద్మఉ అబదా) “ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు ఎప్పటికీ దాహం గొనరు.”
మరి ఎవరైతే ఒకసారి ఆ హౌదె కౌసర్ నుండి త్రాగుతారో ప్రవక్త శుభ హస్తాలతో, వారికి ఆ తర్వాత ఎప్పుడూ దాహం ఏర్పడదు.
ఆ ప్రళయ దినం, అక్కడ ఆ దీర్ఘకాలం, ఒక మైల్ దూరాన ఉన్న సూర్యుడు, చెమటలతో, చెమటలు కారుతూ కారుతూ, దాహం పెరిగిపోతుంది. అక్కడ ఆ దాహం తీరడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంటుంది. అదే హౌదె కౌసర్.
అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభ హస్తాలతో విశ్వాసులకు ఆ నీరు త్రాగిస్తూ ఉంటారు. ఆ నీరును త్రాగిన వారే భాగ్యవంతులు. మరియు ఆ నీరు త్రాగడం నుండి తోయబడిన వారు, దూరం చేయబడిన వారే అభాగ్యులు. ఒకసారి ఈ హదీథును వినండి, భాగ్యవంతులు ఎవరో, అభాగ్యులు ఎవరో తెలుసుకొని భాగ్యవంతుల్లో చేరే ప్రయత్నం చేయండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
إِنِّي فَرَطُكُمْ عَلَى الْحَوْضِ (ఇన్నీ ఫరతుకుమ్ అలల్ హౌద్) “నిశ్చయంగా, నేను హౌదె కౌసర్ పై మీ గురించి వేచి చూస్తూ ఉంటాను“
مَنْ مَرَّ بِي شَرِبَ (మన్ మర్ర బీ షరిబ్) “ఎవరైతే నా వద్దకు వస్తారో వారు త్రాగి ఉంటారు“
ఎవరైతే నా వద్దకు వస్తారో, వారు నా శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగి ఉంటారు.
وَمَنْ شَرِبَ لَمْ يَظْمَأْ أَبَدًا (వమన్ షరిబ లమ్ యద్మఅ అబదా) “మరి ఎవరైతే త్రాగుతారో, వారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాహానికి గురి కారు.“
“హౌదె కౌసర్ వద్దకు నా దగ్గరికి కొందరు వస్తారు. నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతారు. అంతలోనే నా మధ్యలో, వారి మధ్యలో ఒక అడ్డు వేయడం జరుగుతుంది. నేను అంటాను, వారు నా వారు, వారిని రానివ్వండి. అప్పుడు చెప్పడం జరుగుతుంది, నీకు తెలియదు నీ తర్వాత వీరు నీ సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో. అప్పుడు నేను అంటాను, ఇలా నా ధర్మంలో మార్పు చేసుకున్న వారు నాకు దూరమే ఉండాలి, దూరమే ఉండాలి, దగ్గరికి రాకూడదు అని“
గమనించారా? హౌదె కౌసర్ ఆ రోజు లభించే ఆ నీరు మన కొరకు ఎంత శుభకరమైనది. కానీ అల్లాహ్ పంపిన సత్య ధర్మం, అల్లాహ్ పంపినటువంటి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనందుకు, లేదా విశ్వసించి ఆయన అడుగుజాడలలో జీవితం గడపనందుకు, ఆయన తెచ్చిన సత్య ధర్మంలో ఇష్టానుసారం మార్పులు చేసుకొని, అవి కూడా ధర్మానికి సంబంధించిన విషయాలని భావించి జీవితం గడిపేవారు ఎంత దురదృష్టానికి గురవుతారు. మరియు ఇలాంటివారే అభాగ్యులు. ఆ రోజు ప్రవక్త శుభ హస్తాల ద్వారా హౌదె కౌసర్ నీరు నోచుకొని వారు.
ఈ హౌదె కౌసర్ గురించి మరికొన్ని వివరాలు ఉన్నాయి. మహాశయులారా, హౌదె కౌసర్ గురించి సహీ ముస్లిం షరీఫ్ లోని మరో ఉల్లేఖన వినండి. ఈ హదీథులో భాగ్యవంతులు, అభాగ్యులు ఇద్దరి ప్రస్తావన ఉంది.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
“నా వద్దకు హౌదె కౌసర్ దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తారు. ఎలాగైతే ఒక వ్యక్తి ఒంటెల మందలో నుండి తన ఒంటెలను తన వైపునకు తీసుకొని వెళ్తాడో, ఆ విధంగా ప్రజలందరి మధ్యలో నుండి నా అనుచర సంఘాన్ని నేను తీసుకొని పక్కకు జరుపుతాను, హౌదె కౌసర్ వైపునకు తీసుకెళ్లడానికి. అప్పుడు సహాబాలు, సహచరులు అడిగారు, “ప్రవక్తా, తారిఫునా? ఆ రోజు అంత మందిలో, అంత పెద్ద సంఖ్యలో మీరు మమ్మల్ని గుర్తుపడతారా?” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “అవును, మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, ఓ గుర్తు అనేది ఉంటుంది, అది మరెవరికీ ఉండదు.”
గమనించండి. మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, గుర్తు అనేది ఉంటుంది, లైస లిఅహదిన్ గైరికుమ్. అది మీ తప్ప ఇంకా ఎవరికీ అలాంటి గుర్తింపు అనేది ఉండదు. అదేమిటి?
تَرِدُونَ عَلَىَّ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ (తరిదూన అలయ్య గుర్రమ్ ముహజ్జలీన మిన్ ఆసారిల్ వుదూ) “మీరు వుదూ ఆనవాళ్ల వల్ల ప్రకాశవంతమైన ముఖాలు, కాళ్ళు మరియు చేతులతో నా వద్దకు వస్తారు.”
మీలో ఐదు వేళల నమాజులు చేస్తూ ఉన్నవారు, వారు నమాజు గురించి వుదూ చేస్తూ ఉంటారు, ఆ వుదూ చేయడం వల్ల వుదూ యొక్క అవయవాలు మెరుస్తూ ఉంటాయి. అదే సందర్భంలో,
وَلَيُصَدَّنَّ عَنِّي طَائِفَةٌ مِنْكُمْ (వల యుసద్దన్న అన్నీ తాయిఫతుమ్ మిన్కుమ్) “అయితే మీలోని ఒక వర్గం వారు నా నుండి అడ్డగించబడతారు.”
ఆ సందర్భంలో ఒక వర్గం వారిని నా వద్దకు రాకుండా ఆపడం, అటు తోయడం జరుగుతుంది. ఫలా యసిలూన్. వారు నా వరకు చేరుకోరు. ఫఅఖూల్, అప్పుడు నేను అంటాను,
يَا رَبِّ هُمْ مِنْ أَصْحَابِي (యా రబ్బి హుమ్ మిన్ అస్ హాబీ) “ఓ ప్రభూ! వీరు నా అనుచరులే.”
ఓ ప్రభువా, వీరు కూడా నన్ను విశ్వసించేవారు, నా వారు అని.
فَيُجِيبُنِي مَلَكٌ (ఫయుజీబునీ మలకున్) “అప్పుడు ఒక దైవదూత నాకు సమాధానమిస్తాడు.”
وَهَلْ تَدْرِي مَاذَا أَحْدَثُوا بَعْدَكَ (వహల్ తద్రీ మాదా అహదసూ బాదక్) “నీ తర్వాత వారు ఏమేమి కొత్తవి కల్పించారో నీకు తెలుసా?”
ప్రవక్తా, నీవు చనిపోయిన తర్వాత, నీ వెనుక వారు నీవు తెచ్చిన సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేశారో నీకు తెలుసా? మరొక ఉల్లేఖనంలో ఉంది,
إِنَّهُمُ ارْتَدُّوا عَلَى أَدْبَارِهِمُ الْقَهْقَرَى (ఇన్నహు ముర్తద్దూ అలా అద్బారిహిముల్ ఖహ్ఖరా) “వారు నీ తర్వాత సత్య ధర్మాన్ని వదిలేసి వెనుదిరిగారు“
అయితే మహాశయులారా, ఈ హదీద్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏమిటి?
ఒకటి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ప్రజలందరి మధ్యలో తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు.
రెండో విషయం మనకు తెలిసింది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని గుర్తుపట్టి హౌదె కౌసర్ వైపునకు మనల్ని తీసుకెళ్లి తమ శుభ హస్తాలతో మనకు హౌదె కౌసర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే, తప్పకుండా వుదూ చేస్తూ ఉండాలి, నమాజ్ చేస్తూ ఉండాలి.
మూడో విషయం, నమాజ్, వుదూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇక నమాజు, వుదూ తర్వాత జీవితంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాన్ని పాటించాలి. ఆయన తెచ్చిన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. నమాజ్ అయితే చేస్తున్నాము కదా అని జీవిత ఇతర విషయాల్లో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని, మనకిష్టమైన ఆచారాలను ఆచరిస్తూ ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని, ఆయన ఆదర్శాన్ని విడనాడడం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందకుండా ఉండడానికి కూడా కారణం కావచ్చు. ఏమన్నారు ప్రవక్త గారు? మిమ్మల్ని నేను వుదూ యొక్క అవయవాలు మెరుస్తుండడం వల్ల గుర్తుపడతాను, కానీ అదే సందర్భంలో మీలోని కొందరిని, మీలోని ఒక వర్గాన్ని నా వద్దకు రాకుండా, వారు నా వరకు చేరకుండా ఒక అడ్డు వేసి వారిని దూరం చేయడం జరుగుతుంది. అంటే, వారి యొక్క అవయవాలు మెరుస్తున్నాయి, కానీ వారిలో మరికొన్ని ఇతర చెడులు కూడా ఉన్నాయి.
అందుకు మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శం మన జీవిత వ్యవహారంలోని ప్రతీ విషయంలో పాటించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రళయ దినాన గొప్ప వరంగా బహుకరించబడే ఈ హౌద్, దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన హదీథులు చాలా ఉన్నాయి. హదీథ్ పరిభాషలో అహాదీథె ముతవాతిరా అని అంటారు. అంటే సంకోశానికి, అంటే అనుమానానికి, సందేహానికి ఏ తావు లేనటువంటి సంఖ్యలో అన్ని హదీథులు వచ్చి ఉన్నాయి అని భావం.
మరొక విషయం, ప్రళయ దినాన కేవలం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కరికే కాదు, ఇతర ప్రవక్తలకు కూడా హౌద్ ఇవ్వబడుతుంది. వారి వారి అనుచర సంఘాలు వారి వద్దకు వచ్చి వారి శుభ హస్తాలతో కూడా వారు ఆ నీరు త్రాగుతారు. కానీ అతిపెద్ద సంఖ్యలో మన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకే ప్రజలు హాజరవుతారు. వారిని అనుసరించిన వారి సంఖ్యనే అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఎన్నో హదీథులు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకు, తిర్మిదిలోని హదీథ్, షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామేలో ప్రస్తావించారు. హదీథ్ నెంబర్ 2156.
إِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا (ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదా) “నిశ్చయంగా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఉంటుంది.”
మరో ఉల్లేఖనంలో ఉంది,
وَإِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا تَرِدُهُ أُمَّتُهُ (వ ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదన్ తరిదుహు ఉమ్మతుహు) “ప్రతి ప్రవక్తకు హౌద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ హౌద్ వద్దకు ఆ ప్రవక్త యొక్క అనుచర సంఘం హాజరవుతుంది“
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందడానికి మరొక గొప్ప అవకాశం ఎలాంటి వారికి లభిస్తుందంటే, ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉండి, ఏ కష్టాలు, ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఎదురైనా సహనం వహిస్తూ ఉంటారో, అలాంటి వారు తప్పకుండా ఈ శుభ అవకాశాన్ని పొందుతారు.
గమనించండి ఈ హదీథును. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీథ్.
إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدِي أَثَرَةً فَاصْبِرُوا حَتَّى تَلْقَوْنِي عَلَى الْحَوْضِ (ఇన్నకుమ్ సతల్ ఖౌన బాదీ అసరతన్, ఫస్బిరూ హత్తా తల్ ఖౌనీ అలల్ హౌద్) “నిశ్చయంగా, నా తర్వాత మీరు పక్షపాతాన్ని చూస్తారు. కనుక, మీరు నన్ను హౌద్ వద్ద కలిసే వరకు సహనం వహించండి.”
నా తర్వాత మీరు హక్కు గల వారికి ఇవ్వవలసిన హక్కు ఇవ్వకుండా, హక్కు లేని వారికి ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అయితే మీరు సహనం వహిస్తూ ఉండండి. ఎంతవరకు సహనం వహించాలి? మరణం వచ్చేవరకు సహనము వహించండి, నా హౌద్ వద్దకు మీరు వచ్చేంతవరకు సహనం వహిస్తూ ఉండండి. ఈ విధంగా ఈ హదీథులో మనకు అల్లాహ్ ధర్మంపై స్థిరంగా ఉండడంలో, ప్రపంచంలోని ఏదైనా ఒక హక్కు మనకు లభించకున్నా, అందులో మనం ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకుండా, ప్రవక్త ఈ శుభవార్తను అందుకొని మనం ప్రవక్త ఆదర్శాన్ని పాటిస్తూ ఉండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ పరలోకాన కలుసుకునే అంతవరకు మనం సహనం వహిస్తూ ఉంటే, తప్పకుండా ప్రవక్త శుభ హస్తాలతో ఆ నీరు మనం త్రాగవచ్చు.
అయితే మహాశయులారా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఇవ్వడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడిందో, అందులో కూడా ఆ ప్రవక్తలను ఆ కాలంలో వారు అనుసరించి ఉంటేనే వారికి అది ప్రాప్తమవుతుంది. ఇది ఒక విషయం. రెండో విషయం, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, నేను గత ప్రవక్తలను నమ్ముతున్నాను అన్నంత మాత్రాన, వారికి ఆ ప్రవక్తల నుండి కూడా హౌదె కౌసర్, అంటే వారికి లభించే హౌద్ నుండి నీరు త్రాగే అవకాశం దొరుకుతుంది అని భావించవద్దు. ఎందుకంటే ప్రతి ప్రవక్త తమ వెనుక వచ్చే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారు. తమ వెనుక వచ్చే ప్రవక్తను విశ్వసించాలి అని కూడా చెప్పారు. ఇదే విషయం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఉన్న ఏసుక్రీస్తు వారు, హజరత్ ఈసా అలైహిస్సలాం చెప్పారు,
يَأْتِي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ (యాతీ మిమ్ బాదీ ఇస్ముహూ అహ్మద్) “నా తరువాత ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఆయన పేరు అహ్మద్.” (అస్-సఫ్ఫ్ 61:6)
నా తర్వాత అహ్మద్ పేరు గల ఒక ప్రవక్త వస్తారు. ఆ ప్రవక్తను మీరు విశ్వసించండి. ఆ ప్రవక్తను మీరు నమ్మండి అని. మరియు బైబిల్ గ్రంథంలో ఆదరణకర్త అన్న పేరుతో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన వచ్చి ఉంది.
అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, మనం మా ప్రవక్తలను నమ్ముతున్నాము, అందుగురించి పరలోకంలో మేము సాఫల్యం పొందుతాము, మా ప్రవక్తల ద్వారా మేము హౌద్ నీళ్ళను పొందుతాము, ఆ పరలోకంలోని ఘట్టాలను మేము చాలా సులభతరంగా దాటిపోతాము అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. ఇది భ్రమగానే అయిపోతుంది. మరియు ఆ రోజు చాలా నష్టంలో పడవలసి ఉంటుంది. అల్లాహ్ మనందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి, వారి ఆదర్శాన్ని పాటించి, ధర్మంపై స్థిరంగా ఉండి, ఆయన తెచ్చిన ధర్మంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోకుండా, ఆయన చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
A Day with the Prophet (sallallahu alaihi wasallam) (Telugu) దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) జీవితంలో ఒక రోజు రచయిత: అహ్మద్ వాన్ డిన్ఫర్ తెలుగు అనువాదం: ముహమ్మద్ అహ్మద్ అలీ శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హదీత్ అంటే ఏమిటి? హదీత్ ఖుద్సీ అని దేన్ని అంటారు? https://youtu.be/pTJRtR-ca8c [11:20 నిముషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఉపన్యాసం హదీథ్ మరియు దాని రకాల గురించి వివరిస్తుంది. హదీథ్ అంటే ఏమిటి మరియు హదీథ్-ఎ-ఖుద్సీకి మరియు హదీథ్-ఎ-నబవికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తుంది. హదీథ్-ఎ-నబవి మూడు రకాలుగా విభజించబడింది: ప్రవక్త యొక్క మాటలను సూచించే ‘ఖౌలీ’, ఆయన చర్యలను వివరించే ‘ఫిలీ’, మరియు ఆయన ఆమోదాన్ని సూచించే ‘తఖ్రీరీ’. ఉపన్యాసంలో ప్రతి రకానికి ఖురాన్ మరియు హదీథ్ నుండి ఉదాహరణలతో సహా వివరణ ఇవ్వబడింది. సున్నత్ అనే పదాన్ని హదీథ్ కు పర్యాయపదంగా ఎలా ఉపయోగిస్తారో కూడా చర్చించబడింది, ఇందులో ప్రవక్త యొక్క శారీరక స్వరూపం మరియు సత్ప్రవర్తన కూడా ఉంటాయి. చివరగా, హదీథ్-ఎ-ఖుద్సీ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చెప్పబడిన అల్లాహ్ యొక్క మాటలు అని స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
హదీథ్ అంటే ఏమిటి? హదీథ్-ఎ-ఖుద్సీ దేనిని అంటారు? దీనిని మనం కొన్ని ఉదాహరణలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
హదీథ్ రకాలు: నబవి మరియు ఖుద్సీ
హదీథ్ రెండు రకాలు. ఒకటి అల్ హదీథున్ నబవి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్. అల్ హదీథుల్ ఖుద్సీ అంటే, అల్లాహ్ చెబుతున్నాడు, అల్లాహ్ తెలిపాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీథ్.
అల్ హదీథున్ నబవి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్ అని ఎప్పుడైతే మనం అంటామో అది మూడు రకాలుగా ఉంటుంది.
అల్ ఖౌలీ (ప్రవచనం),
అల్ ఫిలీ (క్రియ, ఆచరణ),
తఖ్రీరీ (అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఎవరైనా ఏదైనా మాట్లాడారు లేదా ఏమైనా చేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని అంగీకరించారు లేదా దానిలో ఏదైనా సరిదిద్దుబాటు ఉండేది ఉంటే దానిని సరిచేశారు, సంస్కరించారు).
ఇక అల్ హదీథున్ నబవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్ లో ఈ మూడు రకాలు అని ఏదైతే మనం తెలుసుకున్నామో, ప్రతి ఒక్క దానికి ఒక దలీల్ ఉదాహరణగా మనం తెలుసుకుందాము.
హదీథ్-ఎ-ఖౌలీ(ప్రవచనం)
మొదటిది ప్రవచనం, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట, ఆయన ప్రవచనం, ఆయన చెప్పారు అని ఏదైతే వస్తుందో.
مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ “ఎవరైతే విశ్వాసం మరియు పుణ్య ఫలాపేక్షతో రమదాన్ మాసమంతా ఉపవాసం ఉంటారో, వారి గత పాపాలన్నీ కూడా మన్నించబడతాయి.”
హదీథ్-ఎ-ఫిలీ (ఆచరణ)
ఇక అల్ ఫిలీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా ఆచరించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్రియ గురించి సహాబీ చెబుతున్నాడు, ప్రవక్త ఇలా చేశారు అని.
దీని ఉదాహరణ, దీనికి దలీల్ సహీహ్ ముస్లిం, హదీథ్ నంబర్ 226, సహీహ్ ముస్లింలోని పదాలు తీసుకోవడం జరిగింది అందు గురించి దీని ఆధారం ముందు చెప్పడం జరుగుతుంది. ఈ భావం సహీహ్ బుఖారీలో కూడా వచ్చి ఉంది, హదీథ్ నంబర్ 196. ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ కొరకు నీళ్ళు తెప్పించారని ఆయన బానిస హుమ్రాన్ చెప్పారు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు తమ రెండు అరచేతులను మూడుసార్లు కడిగారు మరియు పుక్కిలించారు, ముక్కులో నీళ్ళు ఎక్కించారు మరియు మూడు సార్లు ముఖం కడిగారు. మళ్ళీ మూడుసార్లు మోచేతుల వరకు కుడి చెయ్యి, ఆ తర్వాత మళ్ళీ ఎడమ చెయ్యి కడిగారు. మళ్ళీ తల యొక్క మసహ్ చేశారు. ఆ తర్వాత, రెండు కాళ్ళు ముందు కుడి కాలు, ఆ తర్వాత ఎడమ కాలు మూడుసార్లు కడిగారు చీలమండలాల వరకు. మళ్ళీ ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు:
رَأَيْتُ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا [ర’అయ్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ తవద్ద్’అ నహ్వ వుదూ’ఈ హాదా] “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఎట్లా వుదూ చేశానో, అదే విధంగా వుదూ చేశారు.”
ప్రవక్త చేసిన ఒక పని గురించి ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ తెలియజేశారు. ఇది హదీథ్-ఎ-ఫిలీ యొక్క ఉదాహరణ అయింది.
హదీథ్-ఎ-తఖ్రీరీ (ఆమోదం)
ఇక హదీథ్-ఎ-తఖ్రీరీ, దీని ఉదాహరణ అబూ దావూద్ లో వచ్చి ఉంది, హదీథ్ నంబర్ 334. అమ్ర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, విపరీతమైన చలి రాత్రి నాకు స్వప్నస్కలనం జరిగింది. అప్పుడు మేము దాతుస్సలాసిల్ అనే యుద్ధంలో ఉన్నాము. అయితే ఒకవేళ నేను స్నానం చేశానంటే ఈ చలిలో నన్ను నేను చంపుకున్నట్టు అవుతుంది, ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. అందుకొరకు నేను తయమ్ముమ్ చేసి ఫజర్ నమాజ్ సహాబాలందరికీ చేయించాను, ఆ యుద్ధంలో ఎవరైతే ఆయన వెంట ఆ సందర్భంలో ఉన్నారో. అయితే మదీనా తిరిగి వచ్చిన తర్వాత సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అమ్ర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ సంఘటన తెలియజేశారు.
అప్పుడు ప్రవక్త నన్ను మందలిస్తూ, “యా అమ్ర్, సల్లయ్ తబి అస్ హాబిక వ అంత జునుబ్?” (ఓ అమ్ర్, నీవు అశుద్ధ స్థితిలో ఉండి నీ మిత్రులకు, తోటి సహాబాలకు నమాజ్ చేయించావా?). “ఫ అఖ్ బర్ తుహూ బిల్ లదీ మన’అనీ మినల్ ఇగ్ తిసాల్” (స్నానం చేయడం నుండి నన్ను ఆపిన విషయం ఏమిటో, అంటే ఏ కారణం చేత నేను స్నానం చేయలేదో, పైన ఏదైతే మనం తెలుసుకున్నాము కదా, విపరీతమైన చలి ఉంది, ఆ చలిలో నేను స్నానం చేస్తే చనిపోతానన్నటువంటి భయం జరిగింది నాకు).
అయితే ఆ విషయాన్ని మొత్తం నేను ప్రవక్తకు వివరించాను. అంతేకాకుండా ఇంకా నేను చెప్పాను, ప్రవక్తా, నేను అల్లాహ్ యొక్క ఈ మాటను విన్నాను, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం సూరతున్నిసా, ఆయత్ నంబర్ 29 లో:
وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا [వలా తఖ్ తులూ అన్ఫుసకుమ్, ఇన్నల్లాహ కాన బకుమ్ రహీమా] “మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై చాలా కరుణించేవాడు.” (4:29)
అందుకొరకే, స్నానం చేస్తే చనిపోతానన్నటువంటి భయం కలిగింది గనక నేను స్నానం చేయలేదు మరియు తయమ్ముమ్ చేసి నమాజ్ చేయించాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వారు, ఏమీ అనలేదు. అయితే ఇక్కడ ఏం తెలిసింది? సహాబీ ఒక పని ఏదైతే చేశారో, అది బాగానే ఉంది అన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరించారు. అందుకొరకే దీనిని హదీథ్-ఎ-తఖ్రీరీ అని అనడం జరిగింది.
హదీథ్ మరియు సున్నత్
ఇక హదీథ్ ను సున్నత్ అని కూడా అనడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇందులో మరో నాలుగో రకం కూడా చేరుతుంది. అదేమిటి? ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆకృతి, ఆయన ఎలా ఉన్నారు అన్న విషయం, అంతేకాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సత్ప్రవర్తనలు కూడా ఇందులో ప్రస్తావించబడతాయి.
ఉదాహరణకు సహీహ్ ఇబ్నె హిబ్బాన్, హదీథ్ నంబర్ 5676, ముస్నద్ అహ్మద్ 24903 లో ఉంది, ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారిని ప్రశ్నించడం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేస్తారు అని. అప్పుడు ఆమె చెప్పారు:
كَانَ يَخِيطُ ثَوْبَهُ، وَيَخْصِفُ نَعْلَهُ، وَيَعْمَلُ مَا يَعْمَلُ الرِّجَالُ فِي بُيُوتِهِمْ “ప్రవక్త తమ దుస్తుల్లో ఎక్కడైనా ఏదైనా చినిగి ఉంటే అతుకు వేసుకునేవారు మరియు అలాగే చెప్పులు ఏదైనా కుట్టుకునే అవసరం వస్తే కుట్టుకునేవారు. ఇంకా సామాన్యంగా పురుషులు ఇంట్లో ఎలాగైతే పనులు చేసుకుంటారో, అలా చేసుకునేవారు.”
హదీథ్-ఎ-ఖుద్సీ
ఇక్కడి వరకు ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్, హదీథ్-ఎ-నబవి అని ఏదైతే అంటారో అందులో ఉన్నటువంటి నాలుగు రకాలు ఆధారాలతో సహా మనం తెలుసుకున్నాము. ఇక హదీథ్ రెండు రకాలు అని ముందు చెప్పాము కదా? ఒకటి హదీథ్-ఎ-నబవి, దాంట్లో నాలుగు రకాలు దాని వివరణ అయిపోయింది. రెండవది అల్ హదీథుల్ ఖుద్సీ. అల్ హదీథుల్ ఖుద్సీ అంటే అల్లాహ్ ఏదైనా మాట చెబుతున్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం, ఉల్లేఖించడం. దీని యొక్క ఉదాహరణ సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 7405, సహీహ్ ముస్లిం 2675, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
يَقُولُ اللَّهُ تَعَالَى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي بِي [యఖూలుల్లాహు త’ఆలా: అన ఇన్ ద దన్ని అబ్ దీ బీ, వ అన మ’అహూ ఇదా కరనీ] “అల్లాహు త’ఆలా ఇలా చెబుతున్నాడు: నేను నా దాసుని ఆలోచన, అతడు నా గురించి ఎలాంటి మంచి ఆశ ఉంచుకుంటాడో అదే విధంగా నేను అతనితో మసలుకుంటాను. మరియు అతడు ఒకవేళ నన్ను స్మరించాడంటే, నేను అతనికి తోడుగా ఉంటాను.”
ఇంకా హదీథ్ కొంచెం పొడుగ్గా ఉంది చివరి వరకు. అయితే ఇక్కడ ఈ హదీథ్ లో ఏమన్నారు ప్రవక్త గారు? అల్లాహ్ చెబుతున్నాడు అని. అయితే ఈ విధంగా హదీథ్ లో ఎక్కడైతే వస్తుందో, అక్కడ దానిని అల్ హదీథుల్ ఖుద్సీ అనడం జరుగుతుంది.
బహుశా హదీథ్ అంటే ఏమిటో కొంచెం అర్థమైంది అని భావిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఖురాన్ హదీథ్ ప్రకారంగా ధర్మ విద్య నేర్చుకునే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.
జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.
జుమా రోజు స్నానం (ఘుస్ల్) చేయడం
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ “ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ” అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”. (అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.) (సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)
عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ “ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ” అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”. (అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)
వుదూ మరియు స్నానం మధ్య ఆధిక్యత
عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم “ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ” అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.
(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).
జుమా ఆచారాలు మరియు వాటి పుణ్యఫలాలు
عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا
(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).
ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.
మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.
జుమా రోజు సువాసన పూసుకోవడం
ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.
సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).
ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.
అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు [https://youtu.be/1saC1XDHDgo [30 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
తయమ్ముమ్:
క్రింద తెలుపబడే కారణాలు సంభవించినప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.
1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పుడు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
3- ఏ నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
తయమ్ముమ్ విధానం:
మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్టుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయమ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజు మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముమ్ భంగమవుతుంది. నమాజు పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజు అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
ఈ ఆడియోలో, ప్రవక్త తయమ్ముమ్ (నీరు లేనప్పుడు చేసే శుద్ధి) గురించి వివరిస్తున్నారు. తయమ్ముమ్ అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టిపై రెండు చేతులు కొట్టి ముఖాన్ని మరియు రెండు అరచేతులను తుడుచుకోవడం. నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దాని వాడకం హానికరమైనప్పుడు తయమ్ముమ్ చేయడం విధిగా చెప్పబడింది. ఇది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉమ్మత్‌కు మాత్రమే ఇవ్వబడిన ఒక గొప్ప వరం మరియు సౌకర్యం అని, గత ప్రవక్తల అనుచరులకు ఈ సౌలభ్యం లేదని హదీసుల ద్వారా వివరించబడింది. తయమ్ముమ్ యొక్క షరతులు – నియ్యత్ (ఉద్దేశం), నీరు లేకపోవడం, మరియు పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించడం. చిన్న అశుద్ధి (హదసె అస్గర్) మరియు పెద్ద అశుద్ధి (హదసె అక్బర్) రెండింటికీ తయమ్ముమ్ సరిపోతుంది. అయితే, నీరు అందుబాటులోకి వచ్చిన వెంటనే, తయమ్ముమ్ చెల్లదు మరియు స్నానం లేదా వుదూ చేయడం తప్పనిసరి అవుతుంది.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.
తయమ్ముమ్ అంటే ఏమిటి?
తయమ్ముమ్ అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టి మీద రెండు అరచేతులను కొట్టి ముందు ముఖం మీద తర్వాత రెండు అరచేతుల మీద ఇలా తుడుచుకోవడం.
నీళ్లు లేని సందర్భంలో లేదా నీళ్లు ఉండి దాని ఉపయోగం హానికరంగా ఉన్నందువల్ల ఈ తయమ్ముమ్ చేయటం విధిగా ఉంది. అల్లాహుతాలా దీని గురించి చాలా స్పష్టంగా ఆదేశించాడు. సూరె మాయిదా సూర నెంబర్ ఐదు ఆయత్ నెంబర్ ఆరులో అల్లాహ్ ఆదేశం ఉంది.
فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా మీరు నీళ్లు పొందని స్థితిలో పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి.
فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ ఫమ్సహూ బివుజూహికుమ్ వ ఐదీకుమ్ మిన్హ్ మీ ముఖాలను తుడుచుకోండి. మీ చేతులను కూడా తుడుచుకోండి.
అయితే దీని ఆదేశం ఏంటి? విధిగా ఉంది. నీళ్లు లేని సందర్భంలో లేక నీళ్లు ఉండి మన కొరకు హానికరంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ తప్పనిసరిగా చేయాలి.
తయమ్ముమ్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రత్యేకత
అయితే ఇక్కడ ఇంకో విషయం మనకు తెలిసి ఉండటం చాలా మంచిది. అందువల్ల మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత అనేది ఇంకా ఎంతో గొప్పగా చెల్లించుకోవచ్చు. అదేమిటి?
ఈ తయమ్ముమ్ యొక్క సౌకర్యం ఇది అల్లాహ్ వైపు నుండి కేవలం మన కొరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రవక్తల అనుసరులకు, ఇంతకుముందు ప్రవక్తలను విశ్వసించిన వారికి ఇలాంటి సౌకర్యం అల్లాహ్ ప్రసాదించలేదు. ఈ సౌకర్యం అల్లాహ్ తాలా ఎవరికి ఇచ్చాడు ప్రత్యేకంగా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరులకు, ఆయనను విశ్వసించిన వారికి ప్రసాదించాడు.
ఈ విషయం బుఖారీ ముస్లింలో ఒక చాలా స్పష్టమైన హదీస్ ఉంది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు: “ఐదు విషయాలు ఉన్నాయి, నాకంటే ముందు ఏ ప్రవక్తకు అవి ఇవ్వబడలేదు.” గమనించండి. అంటే ఈ ఐదు విషయాల ప్రత్యేకత అనేది కేవలం మన ప్రవక్తకే ప్రసాదించబడినది. ఒకటి, నా శత్రువులు నా నుండి ఒక నెల దూర ప్రయాణంలో ఉంటారు కానీ వారి హృదయాల్లో అల్లాహ్ నా యొక్క భయం వేస్తాడు. రెండవది, అది మన టాపిక్ కు సంబంధించింది.
وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا వ జుఇలత్ లియల్ అర్దు మస్జిదవ్ వతహూరా సర్వభూమిని అల్లాహ్ నా కొరకు నమాజు చేయుటకు స్థలంగా, పరిశుభ్రత పొందుటకు సాధనంగా చేశాడు.
فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ فَلْيُصَلِّ ఫఅయ్యుమా రజులిమ్ మిన్ ఉమ్మతీ అద్రకత్ హుస్సలా ఫల్ యుసల్లీ. ఈ భూమిలో మీరు ఎక్కడ సంచరిస్తున్నా సరే, ఎక్కడా ఉన్నా సరే నమాజ్ టైం అయిన వెంటనే నమాజ్ చేసుకోవాలి. నీళ్లు లేవు, తహారత్ లేదు ఇలాంటి ఏ సాకులు చెప్పుకోరాదు.
మూడో విషయం,
وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي వ ఉహిల్లత్ లియల్ గనాయిమ్ వలమ్ తహిల్ల లిఅహదిన్ ఖబ్లీ. యుద్ధ ఫలం నా కొరకు హలాల్, ధర్మసమ్మతంగా చేయబడింది. నాకంటే ముందు ఎవరి కొరకు కూడా అది ధర్మసమ్మతంగా లేకుండింది.
మాలె గనీమత్, యుద్ధ ఫలం, యుద్ధ ధనం, యుద్ధం జరిగినప్పుడు ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో ఇస్లాం పై ఉన్నవారు గెలిచిన తర్వాత అవిశ్వాసుల ధనం ఏదైతే పొండేవారో దానిని మాలె గనీమత్ అని అనబడుతుంది.
నాలుగో విషయం, وَأُعْطِيتُ الشَّفَاعَةَ వ ఉ’తీతుష్షఫాఆ. ప్రళయ దినాన సిఫారసు చేసే ఈ గొప్ప భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించనున్నాడు.
ఐదో విషయం,
وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً వ కానన్నబియ్యు యుబ్అసు ఇలా కౌమిహీ ఖాస్సతన్ వ బుఇస్తు ఇలన్నాసి ఆమ్మహ్. ఇంతకుముందు ప్రవక్తలు ప్రత్యేకంగా తమ జాతి వారి వైపునకు పంపబడేవారు. కానీ నేను సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను.
ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, చనిపోయారు కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రళయం వచ్చే వరకు ప్రతి మనిషి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం తప్పనిసరి. లేకుంటే అతని అంతిమ గతి ఏమవుతుంది? నరకమే అవుతుంది. అయితే మన టాపిక్ కు సంబంధించిన విషయం ఏంటి ఇక్కడ? భూమి మస్జిద్ గా కూడా ఉంది, అది తహూర్, పరిశుభ్రతకు సాధనంగా కూడా అల్లాహ్ తాలా దానిని చేశాడు.
మూడు విషయాలు మనం విన్నాము. తయమ్ముమ్ అంటే ఏమిటి, దాని ఆదేశం ఏంటి అంటే అది విధిగా ఉంది, మూడో విషయం అది అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప వరం.
నాలుగో విషయం, ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో దీని గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి గనక, ఎవరికీ ఏ సందేహం అనేది ఉండకూడదు. తయమ్ముమ్ చేసే విషయంలో, ఎక్కడ ముస్లిం, ఒక విశ్వాసుడు ఏ ప్రాంతంలో ఉన్నా గానీ, అక్కడ అతనికి నైట్ ఫెయిల్ అయింది అని, భార్య భర్తలు ఉండేది ఉంటే వారిద్దరూ మధ్యలో సంబంధాలు జరిగాయి గనక వారిపై ఇప్పుడు స్నానం చేయడం విధిగా ఉంది, నీళ్లు లేవు అని, ఇంకా వేరే ఏ సాకులు కూడా చెప్పకుండా, నమాజ్ టైం అయిన వెంటనే నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ చేసి లేక నీళ్లు ఉండి మన ఆరోగ్యానికి, మన శరీరానికి హానికరంగా ఉంటే నీళ్లు వాడకుండా తయమ్ముమ్ చేసి వెంటనే నమాజ్ చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది యువకులు ప్రత్యేకంగా బజారుల్లో తిరగడం, ఇంకా వేరే పనుల్లో ఉండి, నమాజ్ టైంలో ఏదైనా మస్జిద్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నమాజ్ కు రారు. సాకు ఏం చెప్తారు ఎక్కువ శాతం? “నాకు తహారత్ లేదు”. ఇది చాలా ఘోరమైన పాపం.
హదసె అక్బర్ మరియు హదసె అస్గర్ (పెద్ద మరియు చిన్న అశుద్ధి)
తయమ్ముమ్ హదసె అక్బర్ (పెద్ద అశుద్ధి), హదసె అస్గర్ (చిన్న అశుద్ధి) రెండిటికీ పనిచేస్తుంది. హదసె అక్బర్ అంటే ఏంటి? స్వప్న స్కలనం కావడం (నైట్ ఫెయిల్ కావడం), లేక భార్య భర్తలు కలుసుకోవడం. ఇందువల్ల ఏదైతే స్నానం చేయడం విధిగా ఉంటుందో దానిని హదసె అక్బర్ అంటారు. సామాన్యంగా మలమూత్ర విసర్జన తర్వాత, ఏదైనా అపాన వాయువు (గాలి) వెళితే, ఇలాంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని హదసె అస్గర్ అంటారు.
ఈ రెండిటికీ కూడా తయమ్ముమ్ సరిపోతుంది. దానికి దలీల్ (ఆధారం) ఏమిటి? సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఒక చాలా పెద్ద హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రయాణ విషయంలో. అందులో ఒక తయమ్ముమ్ కు సంబంధించిన విషయం ఏంటంటే, ఒకచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసి,
فَلَمَّا انْفَتَلَ مِنْ صَلَاتِهِ إِذَا هُوَ بِرَجُلٍ مُعْتَزِلٍ لَمْ يُصَلِّ مَعَ الْقَوْمِ ఫలమ్మన్ ఫలత మిన్ సలాతిహీ ఇదా హువ బిరజులిమ్ ముఅతజిలిల్ లమ్ యుసల్లి మఅల్ కౌమ్ నమాజ్ చేసి తిరిగిన తర్వాత ఒక వ్యక్తిని చూశారు ప్రవక్త గారు. అతను ఒక పక్కకు ఉన్నాడు, అందరితో కలిసి నమాజ్ చేయలేదు.
مَا مَنَعَكَ يَا فُلَانُ أَنْ تُصَلِّيَ مَعَ الْقَوْمِ మా మనఅక యా ఫులాన్ అన్ తుసల్లి మఅల్ కౌమ్ అందరితో జమాఅత్ తో సహా, సామూహికంగా నమాజ్ ఎందుకు చేయలేదు నీవు అని ప్రవక్త వారు అతన్ని అడిగారు.
అప్పుడు అతడు ఏం చెప్పాడు?
أَصَابَتْنِي جَنَابَةٌ وَلَا مَاءَ అసాబత్నీ జనాబతున్ వలా మా నేను అశుద్ధావస్థకు గురయ్యాను, స్నానం చేయడం నాకు విధిగా అయిపోయింది. నీళ్లు లేవు.
అందు గురించి ఇంతవరకు నేను స్నానం చేయలేకపోయాను గనక, మీతో పాటు నేను నమాజ్ చేయలేదు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు?
عَلَيْكَ بِالصَّعِيدِ فَإِنَّهُ يَكْفِيكَ అలైక బిస్సయీద్ ఫఇన్నహూ యక్ఫీక్ పరిశుభ్రమైన మట్టి ఉంది కదా, అది నీకు సరిపోతుంది.
అలాగే సహీహ్ బుఖారీలోనే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సంఘటన ఉంది. అప్పటి వరకు ఆయనకు తయమ్ముమ్ విషయం తెలియదు. నమాజ్ టైం అయిపోయింది, స్నానం చేయడం విధిగా ఉంది. ఆయన ఏం చేశాడు? గాడిద మట్టిలో ఎలా పొర్లుతుందో చూశారా ఎప్పుడైనా? అతను స్వయంగా అంటున్నాడు, గాడిద ఎలా మట్టిలో పొర్లుతుందో అలా నేను మట్టిలో మొత్తం స్నానం చేసినట్టుగా లేచి నమాజ్ చేసుకొని ప్రవక్త వద్దకు వచ్చాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయం అడిగాను. ప్రవక్త గారు చెప్పారు, “అంతగా చేసే అవసరం లేదే నీకు. కేవలం రెండు చేతులు పరిశుభ్రమైన మట్టి మీద కొట్టి, మట్టి అంటి ఉంటుంది గనక అని ఒక్కసారి ఊదుకొని ముఖముపై, కుడి చేయి అరచేతితో ఎడమ చేయి అరచేతి మీద, ఈ ఎడమ చేయి యొక్క అరచేతి లోపలి భాగంతో కుడి చేయి అరచేతి పై భాగం మీద మసాజ్ చేస్తే ఒక్కసారి సరిపోతుంది.”
ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది? స్నానం చేయడం విధిగా అయిన సందర్భంలో గానీ, లేక వుదూ చేయడం విధిగా ఉన్న సందర్భంలో గానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ సరిపోతుంది.
స్నానం అంటే తెలుసు, వుదూలో మనం కొన్ని ప్రత్యేక అవయవాలు కడుగుతాము. స్నానం చేయడం విధిగా ఉంటే ఏం చేస్తాము? గోరంత కూడా ఎక్కడా పొడితనం ఉండకుండా మంచిగా స్నానం చేస్తాము. కానీ నీళ్లు లేని సందర్భంలో ఒకే ఒక తయమ్ముమ్ రెండిటికీ సరిపోతుంది. ఒకసారి స్నానానికి ఇంకొకసారి వుదూకు అని రెండు రెండు సార్లు తయమ్ముమ్ చేసే అవసరం లేదు. ఒక్కసారి తయమ్ముమ్ చేసి నమాజ్ చేసుకుంటే స్నానానికి బదులుగా మరియు వుదూకు బదులుగా సరిపోతుంది.
తయమ్ముమ్ యొక్క షరతులు (నిబంధనలు)
తయమ్ముమ్ కూడా ఒక ఇబాదత్. నమాజుకు వుదూ చేయడం షరత్ కదా. వుదూ దేనితో చేస్తాము? నీళ్లతోని. నీళ్లు లేని సందర్భంలో అల్లాహ్ మనకు ఈ సౌకర్యం కలుగజేశాడు. అందు గురించి ఇది కూడా ఒక ఇబాదత్ గనక ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.
మొదటి షరత్, మొదటిది నియ్యత్. నియ్యత్ అంటే తెలుసు కదా ఇంతకు ముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ఏదో పెద్ద మంత్రం అలా చదవడం కాదు నోటితోని. ఏ కార్యం చేస్తున్నామో, ఏ సత్కార్యం, ఏ మంచి కార్యం, ఏ ఇబాదత్, దాని యొక్క సంకల్పం మనసులో చేసుకోవాలి. ఏమని? ఈ నా యొక్క సత్కార్యం ద్వారా అల్లాహ్ యే సంతృప్తి పడాలి, అల్లాహ్ యే నాకు దీని యొక్క ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి నమ్మకం ఉండాలి, అన్నటువంటి సంకల్పం, నియ్యత్ అనేది ఉండాలి. వేరే ప్రజలకు చూపడానికి గాని, ముతవల్లాకు చూపడం గాని, ఇంకా మన సంతానానికి చూపించడానికి గాని, నేను ఒక ముస్లింగా అన్నటువంటి భావన ఇతరులకు కలిగించడం కొరకు ఇలాంటి ఏ ప్రాపంచిక ఉద్దేశాలు ఉండకూడదు.
రెండవ నిబంధన, రెండవ షరత్, నీళ్లు లేకపోవడం లేదా ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉండడం. అందుగురించి అల్లాహుతాలా సూరె మాయిదాలో ఏదైతే చెప్పాడో, అది కూడా మనకు ఒక ఆధారంగా ఉంది:
وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ వ ఇన్ కున్తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్ ఒకవేళ మీరు రోగులై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా…
హానికరంగా ఉండడం అనేదేదైతే చెప్తున్నామో, అది మనకు కొన్ని హదీసుల ద్వారా కూడా వివరంగా తెలుస్తుంది. అంతే కాకుండా ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? సూరె నిసా, ఆయత్ నెంబర్ 29లో ఉంది:
وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ వలా తఖ్తులూ అన్ఫుసకుమ్ మీకు మీరు (లేదా ఒకరినొకరు) చంపుకోకండి.
ఆత్మహత్యలు చేసుకోకండి, పరస్పరం ఒకరు మరొకరిని హత్య చేయకండి. ఇవన్నీ భావాలు దీంట్లో వస్తాయి.
إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا ఇన్నల్లాహ కాన బికమ్ రహీమా నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల చాలా కనికరం కలవాడు.
ఈ విధంగా ఈ షరతులు మనకు తెలిసినాయి, అర్థమైనాయి.
మూడో షరత్ ఏంటంటే, తయమ్ముమ్ చేయడానికి పరిశుభ్రమైన మట్టితో చేయాలి. ఈ మూడు షరతులు తయమ్ముమ్ కు సంబంధించినవి.
ఇందులో రెండు ఫర్దులు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ముఖాన్ని తుడవడం. మరొకటి? రెండు అరచేతులను.
తయమ్ముమ్ ఎప్పుడు చేయాలి?
అయితే ఏ సందర్భాల్లో తయమ్ముమ్ చేయవచ్చు అన్న విషయం మనకు ఇంతకు ముందే సంక్షిప్తంగా వచ్చింది. నీళ్లు లేనప్పుడు లేక ఉండి కూడా వాడడం నష్టంగా ఉన్నప్పుడు. దానినే మరికొంచెం వివరంగా తెలుసుకుందాం.
నీళ్లు లేకపోవడం అంటే ఏమిటి? నీళ్లు లేకపోవడం అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా నీళ్లు వుదూ చేయడానికి దొరకకపోవడం. మనం అక్కడి వరకు మన వద్ద బండి ఉంటే బండి ద్వారా వెళ్లడం గానీ, లేక కాలి నడకతో వెళ్లడం గానీ సాధ్యం ఉండి కొన్ని అడుగులు వెళ్తే అక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఛాన్స్ ఉండేది ఉంటే, నీళ్లు లేని కింద లెక్కించబడదు. ఉదాహరణకు, ఇప్పుడు ఇక్కడ మనం సౌదియాలో ఉన్నాం గనక ఇక్కడి నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఉన్నాయి అనుకోండి. మనకు ఇక్కడ దగ్గరలో లేవు, అయితే నమాజ్ టైం అయినప్పుడు మన దగ్గర ఏదైనా బండి ఉంది లేక కార్ ఉంది, లేక మన మిత్రుని దగ్గర బండి ఉంది, వేరే ఎన్నో అవసరాలకు మనం తీసుకుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాము. ఆ రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్లి ఆ నీళ్లు తీసుకురావడం మనకు కష్టంగా ఉంటుందా? ఉండదు. అయితే దాన్ని నీళ్లు లేవు అన్న విషయం అక్కడ వర్తించదు. మనం ఎక్కడి వరకు వెళ్లి నీళ్లు తీసుకోవడం సాధ్యం ఉన్నదో అక్కడి వరకు వెళ్లి తీసుకోవాలి. ఇక ఎక్కడైతే సాధ్యం కాదో అది నీళ్లు లేవు అన్న దానికి కింద లెక్కించబడుతుంది.
రెండో విషయం, మన దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం స్నానం చేస్తే లేక వుదూ చేయడం మొదలు పెడితే త్రాగడానికి మనకు నీళ్లు దొరకవు. కొన్ని కొన్ని సందర్భాల్లో కరువు ఏర్పడుతుంది, వర్షాలు ఉండవు, మన దగ్గర కూడా అలాంటి ప్రాంతం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. నీళ్లు త్రాగడానికి మాత్రమే ఉన్నాయి. వాడుకోవడానికి లేవు. అలాంటి సందర్భంలో కూడా అది నీళ్లు లేని కిందనే లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇస్లాం మనల్ని మనం నష్టపరుచుకోవడానికి ఆదేశించదు. ఇదే ఆయత్లో, ఎక్కడైతే మనం ఇంతకు ముందు సూరె మాయిదా ఆయత్ చదివామో అందులోనే అల్లాహుతాలా ముందు ఏం చెప్తున్నాడు?
مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ మా యురీదుల్లాహు లియజ్అల అలైకుమ్ మిన్ హరజ్ అల్లాహుతాలా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదల్చుకోలేదు.
وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ వ లియుతిమ్మ నిఅమతహూ అలైకుమ్ తన యొక్క కారుణ్యాన్ని మీపై సంపూర్ణం చేయడం.
ఎందుకు?
لَعَلَّكُمْ تَشْكُرُونَ లఅల్లకుమ్ తష్కురూన్ మీరు కృతజ్ఞత చెల్లించే వాళ్ళు కావాలి అని.
గమనించండి. నీళ్లు త్రాగడానికి కూడా మనకు లేకుంటే మన జీవితమే చాలా నష్టంలో పడిపోవచ్చు. అందుగురించి వాడుకోవడానికి ఉన్న నీళ్లు మొత్తానికి అయిపోయి, కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నాయి, దానిని వాడితే ఇక మనకు చాలా ఇబ్బందికి గురవుతాము, అలాంటప్పుడు కూడా నీళ్లు లేవు అన్న విషయంలోనే వర్తిస్తుంది.
మూడో రకం, నీళ్లు ఉన్నాయి చాలా. కానీ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తుంది. అయితే పిసినారితనం చేసి డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? ఎక్కడైనా ఫ్రీగా దొరికితే చూసుకుందాము. అన్నటువంటి భావన ఉంచుకొని, శక్తి ఉండి కూడా మనం కొనకుంటే అది పాపంలో పడిపోతాము. కానీ మన దగ్గర నీళ్లు కొనేంత శక్తి లేదు. ఉన్నాయి నీళ్లు కానీ కొనాల్సి వస్తుంది. కొనేంత శక్తి కూడా మన దగ్గర లేదు. కొన్నే కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి మన ఈ రోజుకు గాని, లేకుంటే ఇంకా కొన్ని రోజుల వరకు మన అతి ముఖ్యమైన తిండి ఏదైతే ఉందో దాని గురించి గడవాలి. ఇలాంటి ఇబ్బందికరమైన జీవితం ఉన్నప్పుడు కొనడం కష్టతరంగా ఉన్నప్పుడు, కడుపు నిండా భోజనం చేసుకొని డ్రింకులు తాగవచ్చు కానీ ఇక్కడ వుదూ చేసుకోవడానికి ఒక నీళ్లు, ఒక అర లీటర్ నీళ్లు కొనలేము? ఆ డ్రింకులు ఏంటి, పెప్సీలు ఏంటి అవి మన జీవనానికి అత్యవసరమైన తిండి కింద లెక్కించబడుతుందా? లెక్కించబడదు.
విషయం అర్థమవుతుంది కదా. నీళ్లు లేవు అన్న ఈ పదం అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, దాని యొక్క రూపాలు ఏంటున్నాయో అవన్నీ నేను వివరిస్తున్నాను.
రెండో విషయం, నీళ్లు ఉన్నాయి కానీ దాని ఉపయోగం మనకు నష్టకరంగా ఉంది. అంటే చలి వల్ల కావచ్చు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వేడి చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు. ఒకవేళ ఉన్నది సౌకర్యం కానీ ఎంత సేపు పడుతుందంటే, మన ఈ నమాజ్ టైం అనేది దాటిపోతుంది. అలాంటప్పుడు ఆ నీళ్లు ఉపయోగించడం వల్ల మనకు నష్టం కలుగుతుంది అన్న భయం ఉండేది ఉంటే తయమ్ముమ్ చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒకసారి ఏం జరిగింది? ఒక వ్యక్తికి నెత్తిలో గాయమైంది. ప్రయాణంలో ఉన్నాడు, నెత్తిలో గాయమైంది. చాలా చల్లని రాత్రి, అతనికి స్నానం చేయడం కూడా విధి అయిపోయింది. దగ్గర ఉన్న స్నేహితులను అడిగాడు, ఏం చేయాలి నేను? ఫజర్ నమాజ్ టైం. “లేదు లేదు నీకేంటి, తప్పకుండా నువ్వు స్నానం చేసి నమాజ్ చేయాల్సిందే” అని అన్నారు అతని స్నేహితులు. అల్లాహ్ కరుణించు గాక వారిని. ఆయన స్నానం చేశాడు కానీ అందువల్ల అతని ప్రాణం పోయింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి వద్దకు వచ్చిన తర్వాత, “మీరు మీ సోదరుని చంపేశారు. ధర్మజ్ఞానం లేనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఎందుకు అడగలేదు? అతను అలాంటి సందర్భంలో కేవలం తయమ్ముమ్ చేస్తే సరిపోయేది కదా” అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు బోధ చేశారు.
అయితే చలి వల్ల గాని, లేక మన శరీరంలో వుదూ చేసే అవయవాలకు ఏదైనా గాయమై ఉంది, అందువల్ల కూడా మనకు నీళ్లు వాడడం, ఉపయోగించడం నష్టకరంగా, హానికరంగా, ప్రాణం పోయేటువంటి భయం, లేక రోగం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ పెరిగే భయం, ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? “వ ఇన్ కున్తుమ్ మర్దా.” మీరు ఒకవేళ అనారోగ్యానికి గురియై మీకు నీళ్లు దొరకకుంటే తయమ్ముమ్ చేయవచ్చును. చూడండి, గమనించండి, ఇన్ని సౌకర్యాలు అల్లాహ్ ఇచ్చిన తర్వాత అరే జాన్దేలేరే క్యా ముస్లిం థండీ అయినా క్యా నమాజ్ పడతా? సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా మనం. ఏంటి ఈ ముతవల్లాలు, ఈ మౌల్వీ సాబులు వీళ్లకు ఏం పని పాటలు ఉండయి, కేవలం అల్లాహ్ అల్లాహ్ అంటూ నమాజులు చేసుకుంటూ ఉంటారు, మన లెక్కలో ఎక్కడ పని చేస్తారు? కానీ అదే ఈ తిండి కొరకు, కూడు కొరకు, పని గురించి ఇంతటి చల్లని వాతావరణంలో కూడా ఎవరైనా డ్యూటీ వదులుకుంటాడా? చల్లగా ఉంది ఈ రోజు డ్యూటీకి వెళ్లకూడదు అని. ఏమీ దొరకకుంటే కప్పుకునే బ్లాంకెట్ అయినా వేసుకొని డ్యూటీకి వెళ్తాడు కానీ నమాజ్ విషయం వచ్చేది ఉంటే, అల్లాహ్ యొక్క దయ అని నమాజు ఎగ్గొడతాడు. ఇంకా సౌదియాలో ఇంటి నుండి మనం మస్జిద్ కి వెళ్ళడానికి కిలోమీటర్లు నడిచిపోయే అవసరమే పడదు. అవునా కాదా? వెనకా, ముంగట, కుడి పక్కన, ఎడమ పక్కన, ఎటు చూసినా అల్లాహ్ యొక్క దయ వల్ల మస్జిద్లే మస్జిద్లు. చాలా దగ్గరలో. అయినా గానీ మనం చలి కాలంలో ఇలాంటి సాకులు చెప్పి నమాజులను వదిలేస్తే, మనం ఇంకెవరికో కాదు నష్టంలో పడేసేది. మనకు మనం నరకానికి దారి సులభం చేసుకుంటున్నాము. అందు గురించి సోదరులారా, అల్లాహ్ మనందరికీ భయపడే మరియు ఇలాంటి సౌకర్యాలు ఏదైతే అల్లాహ్ ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని అల్లాహ్ యొక్క ఆరాధన సరైన పద్ధతిలో చేసే భాగ్యం కలిగించు గాక.
అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించాలి, అదేమిటి? ఎప్పుడైతే నీళ్లు దొరుకుతాయో అప్పుడు తయమ్ముమ్ చేయడం అనేది మానేసేయాలి. నీళ్లు వచ్చిన వెంటనే. చివరికి కొందరు ఆలిములు ఏమంటున్నారో తెలుసా? నీళ్ల గురించి అన్ని రకాల ప్రయత్నం నువ్వు చేశావు, నీళ్లు దొరకలేదు, తయమ్ముమ్ చేసుకుని నమాజ్ మొదలు పెట్టావు, నీళ్లు వచ్చాయి. నమాజ్ ను తెంపేసేయ్, వుదూ చేసుకొని నమాజ్ చెయ్. అర్థమైందా?
మరో విషయం ఇక్కడ, తయమ్ముమ్ ద్వారా కూడా ఒక్కటి కంటే ఎక్కువ నమాజులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసర్ లో తయమ్ముమ్ చేశారు. ఆ వుదూను, అంటే తయమ్ముమ్ తో ఏదైతే మీకు వుదూ అయిందో దాన్ని మీరు కాపాడుకున్నారు. మూత్రానికి వెళ్ళలేదు, ఇంకా వుదూ భంగమయ్యే ఏవైతే కారణాలు మనం ఇంతకు ముందు విన్నామో అలాంటివి ఏవీ సంభవించలేదు. అయితే మగ్రిబ్, ఇషా అన్నీ చేసుకుంటూ వచ్చినా గానీ కానీ నీళ్లు వచ్చేస్తే అరె నేను అప్పుడు తయమ్ముమ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ కంటే ముందు నీళ్లు వచ్చేసాయి, అసర్ టైంలో నీళ్లు లేవు. మగ్రిబ్ వరకు నీళ్లు వచ్చేసినాయి. నా అప్పటి వుదూ ఉంది కదా, దానితోనే నేను మగ్రిబ్ చేసుకుంటాను. తప్పు విషయం. నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు తయమ్ముమ్ నీది చెల్లదు, తయమ్ముమ్ నీది నడవదు, అది expire అయిపోయినట్లు. అర్థమవుతుంది కదా. మళ్లీ కొత్తగా వుదూ చేసుకొని మీరు మగ్రిబ్ నమాజ్ అనేది చేయాలి. అంటే నీళ్లు వచ్చిన వెంటనే తయమ్ముమ్ సమాప్తం అయిపోతుంది. దాని యొక్క ఆదేశం అనేది ఇక ఉండదు. ఎందుకు? అల్లాహ్ ఏమంటున్నాడు?
فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ నీళ్లు పొందని సందర్భంలో మీరు తయమ్ముమ్ చేయండి.
నీళ్లు వచ్చిన తర్వాత? ఇక ఉండదు.
ఇంకో విషయం. స్నానం చేసే విషయంలో, అంటే స్నానం విధి అయింది, నీళ్లు లేవు. నమాజ్ టైం అయింది. ఏం చేసినాం మనం? తయమ్ముమ్ చేసుకొని నమాజ్ చేశాం. ఓకే? తర్వాత నీళ్లు వచ్చాయి. స్నానం చేయాలా చేయవద్దా? చేయాలి. ప్రశ్న అర్థమైందా? ఉదాహరణకు ఫజర్ నమాజే అనుకోండి. రాత్రి నైట్ ఫెయిల్ అయింది. నీళ్లు దొరకలేదు. లేక ఫజర్ నమాజ్ టైం గనక ఎక్ దమ్ మైనస్ డిగ్రీ వాతావరణం ఉండి, నీళ్లు వాడితే మనకు జ్వరం వచ్చేస్తుంది, నీళ్లు వాడేది ఉంటే మనకు ఇంకా ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. నీళ్లు వాడలేదు, తయమ్ముమ్ చేసుకున్నాము. పొద్దెక్కేసరికి మనకు ఆరోగ్యం బాగైపోయింది, ఇప్పుడు నీళ్లు వాడడంలో నష్టం లేదు. అప్పుడు స్నానం చేయాలా, చేయవద్దా? చేయాలి.
చాలా పెద్దగా ఉంది హదీస్ అని నేను ఇంతకు ముందు ఒక ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఏదైతే చెప్పానో, అందులో ఆ వ్యక్తి నువ్వు ఎందుకు మాతో నమాజ్ చేయలేదు అని ప్రవక్త గారు అడిగారు కదా, అతను ఏమన్నాడు? నా దగ్గర నీళ్లు లేవు, నేను జునుబీ అయిపోయాను, అశుద్ధావస్థకు గురయ్యాను. ప్రవక్త చెప్పారు, నీకు తయమ్ముమ్ సరిపోయేది. ఆ తర్వాత కొంతసేపటికి, అయితే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు అప్పటికే పంపి ఉన్నారు కొందరిని నీళ్ల గురించి. పోండి మీరు నీళ్ల గురించి వెతకండి అని. ఆ హదీస్ అంతా పొడుగ్గా ఉన్నది అంటే అందులో ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారి గొప్ప మహిమ కూడా ఉన్నది. మరి ఎప్పుడైనా గుర్తు చేయండి చెప్తాను దాని గురించి. కానీ సంక్షిప్తం ఏంటంటే నీళ్లు దొరుకుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో తమ చేతులు పెడతారు, అల్లాహ్ బరకత్ ప్రసాదిస్తాడు, అందరూ తమ తమ దగ్గర ఉన్న పాత్రలన్నీ నింపుకుంటూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు చూడండి, ఏ విషయం ఎంత ముఖ్యమైనది, అవసరమైనది ఉంటుందో దాని విషయంలో అశ్రద్ధ వహించరు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ప్రయాణంలో ఉన్నారు, ఎందరో సహచరులు ఉన్నారు, ఎందరియో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ఆ వ్యక్తిని గుర్తు చేసి, అతన్ని పిలవండి, హా నీళ్లు తీసుకెళ్ళు, తీసుకెళ్లి నువ్వు స్నానం చెయ్యి అని ఆదేశించారు.
సహీహ్ బుఖారీలో ఆ హదీస్ ఉంది, 344 హదీస్ నెంబర్. అయితే విషయం ఏం తెలిసింది మనకు? స్నానం విధిగా ఉన్నప్పుడు నీళ్లు లేవు లేక ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉంటే నమాజ్ చేసుకున్నాము తయమ్ముమ్ తోని. కానీ తర్వాత ఆ నష్టం తొలిగిపోయింది లేదా నీళ్లు మనకు దొరికినాయి, అలాంటప్పుడు ఏం చేయాలి? స్నానం అనేది చేయాలి.
కొంచెం ఈ విషయాలు ఎక్కువ శాతం చలి కాలంలో, ఇంకా వేరే ప్రయాణంలో ఉన్న సందర్భంలో, వేరే సందర్భాల్లో కూడా మనకు అవసరం పడతాయి గనక కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. అయితే, మేజోళ్లపై మసాహ్ విషయం అనేది అల్లాహ్ యొక్క దయతో మనం వచ్చే నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాము. దీని గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే తప్పకుండా ఉలమాలతో, ధర్మవేత్తలతో మనం మంచి సంబంధాలు ఉంచుకొని అలాంటి ప్రశ్నలను మనం వారితో తెలుసుకోవాలి. షరీయత్ యొక్క సమాధానం, ధర్మపరమైన సమాధానం ఏముంటుందో తెలుసుకొని దాని ప్రకారంగా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ఆడియో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలో ‘వుదూ’ (శుద్ధి) ఎలా చేసుకోవాలో వివరిస్తుంది. మొదటగా, ఆదేశించబడిన రీతిలో వుదూ మరియు నమాజు చేయడం వల్ల కలిగే గొప్ప ఫలితాన్ని, అంటే పూర్వ పాపాలు మన్నించబడతాయని హదీసుల ద్వారా తెలియజేశారు. వుదూ చేయడానికి గల ముఖ్య గమనికలైన సంకల్పం (నియ్యత్), వరుస క్రమం, నీటి ఆదా మరియు ఒక అవయవం ఆరకముందే మరొకటి కడగడం (కంటిన్యూటీ) గురించి వివరించారు. అనంతరం బిస్మిల్లాహ్ తో మొదలుపెట్టి కాళ్లు కడగడం వరకు వుదూ యొక్క పూర్తి పద్ధతిని స్టెప్-బై-స్టెప్ గా విపులకరించారు. చివరగా, వుదూ తర్వాత చదవాల్సిన దుఆ మరియు దాని వల్ల స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయనే శుభవార్తను తెలియజేశారు.
السلام عليكم ورحمة الله وبركاته، حامدا ومصليا أما بعد [అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, హామిదన్ వ ముసల్లియన్ అమ్మ బాద్]
వుదూ యొక్క ప్రాముఖ్యత
వుదూ విధానం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వుదూ చేశారో, అలాగే వుదూ చేయడం తప్పనిసరి. ప్రవక్త ఆదేశం:
ఎవరు ఆదేశించబడిన రీతిలో వుదూ చేసి, ఎవరు ఆదేశించబడిన రీతిలో నమాజు చేస్తారో, అతని పూర్వ చిన్న పాపాలు మన్నించబడతాయి. (సునన్ నసాయి: 144, ఇబ్నె మాజా: 1396).
మరో ఉల్లేఖనంలో ఉంది:
مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا [మన్ తవద్దఅ నహ్వ వుదూఈ హాజా] ఎవరు నా ఈ పద్ధతిలో వుదూ చేస్తారో (సహీహ్ బుఖారీ: 159).
ముఖ్య గమనిక
వుదూ నియ్యత్ అంటే సంకల్పం నోటితో పలకకుండా మనసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనసులో నిర్ణయించుకోవడమే నియ్యత్.
రెండవ గమనిక: వుదూ క్రమంగా చేయాలి, క్రమం తప్పకూడదు.
మూడవ గమనిక: వుదూ చేయునప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లు దుబారా అంటే వృధా ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి.
నాలుగవ గమనిక: వుదూ చేయునప్పుడు ఒక అవయవం కడిగిన తర్వాత మరో అవయవం కడగడంలో ఆలస్యం చేయకూడదు.
వుదూ పద్ధతి
వుదూ పద్ధతి ఇలా ఉంది:
ప్రారంభంలో “బిస్మిల్లాహ్” అనాలి.
తర్వాత రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి (ఫిగర్స్ చూడండి).
మూడు సార్లు నోట్లో నీళ్లు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్లు ఎక్కించి శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత మూడు సార్లు ముఖం కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నుదుటి మొదటి భాగం నుండి గడ్డం కింది వరకు. ఇక దట్టమైన గడ్డం గలవారు తమ గడ్డంలో ఖిలాల్ చేయాలి. అయితే గడ్డాన్ని షేవ్ చేయడం గాని, కట్ చేయడం గాని ప్రవక్త విధానానికి వ్యతిరేకం.
ఆ తర్వాత రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి తర్వాత ఎడమ చెయ్యి.
ఆ తర్వాత ఒకసారి తల మసాహ్ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్లి, మళ్లీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి.
ఒకసారి రెండు చెవుల మసాహ్ చేయాలి. అంటే రెండు చూపుడు వేళ్లతో చెవి లోపలి భాగాన్ని, బొటన వేలితో పై భాగాన్ని స్పర్శించాలి.
ఆ తర్వాత రెండు కాళ్లు వేళ్ల నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తర్వాత ఎడమ కాలు.
వుదూ తర్వాత చదవవలసిన దుఆ
చివరిలో ఈ దుఆ చదవాలి:
أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ [అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]
వుదూ చేసిన తర్వాత ఎవరైతే ఈ దుఆ చదువుతారో వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టం అండి. ఈ దుఆ ప్రస్తావన సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది (హదీథ్ నెంబర్: 234).
ఈ పూర్తి వుదూ విధానం ఏదైతే మీరు విన్నారో సహీహ్ బుఖారీ (హదీథ్ నెంబర్: 159) మరియు అబూ దావూద్ (హదీథ్ నెంబర్: 108) లో ఉన్నది.
అల్లాహ్ యే ప్రవక్త పద్ధతిలోనే మనందరికీ వుదూ చేసే అటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) [పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి] [PDF] [28 పేజీలు]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.