హదీథ్ పరిచయం – 2వ భాగం

 హదీథ్ రికార్డు (నమోదు) చేయటం యొక్క చరిత్ర: 

) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) కాలంలో హదీథ్ లను రికార్డు (నమోదు) చేయటం 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క కాలంలోనే హదీథ్ లను రికార్డుచేయటం మొదలైనది.

1. అబుహురైరా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులలో అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా తప్ప, నా కంటే ఎక్కువగా హదీథ్ లను ఉల్లేఖించిన వారెవరూ లేరు. ఆయన వ్రాసేవారు మరియు నేను వ్రాసేవాడిని కాదు.” బుఖారి హదీస్ 

2. అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలిపారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి నాకు తెలిసిన ప్రతి విషయం కంఠస్థం చేయటం కొరకు నేను వ్రాస్తూ ఉండేవాడిని.కాని (మక్కాలోని ఒక తెగవారైన) ఖురైషులు  (వ్రాయకుండా) నన్ను ఆపి ఇలా చెప్పారు “నీవు ప్రతి విషయం వ్రాస్తున్నావు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కూడా  మానవుడే, ఆయన కోపగించుకుంటారు మరియు ఉల్లాసంగా కూడా మాట్లాడతారు.”అప్పుడు నేను వ్రాయటం ఆపి, ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంకు తెలియజేసాను, ఆయన తన చేతితో తన నోటివైపు చూపిస్తూ ఇలా సెలవిచ్చారు “వ్రాయి! నా ఆత్మ ఎవరి అధీనంలో ఉన్నదో, అతడి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, దీని(తన నోటి)  నుండి నిజం(సత్యసందేశం) తప్ప ఇంకేమీ బయటికి రాదు.” [అబు దావుద్  & అహ్మద్.] 

3. అబు సయిద్ అల్ ఖుద్రి రదియల్లాహు అన్ హు ఇలా ఉల్లాఖిచారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సెలవిచ్చారు “నేను చెప్పేది ఏదీ వ్రాయవద్దు ఒక్క ఖుర్ఆన్ తప్ప, ఖుర్ఆన్ మినహా ఎవరైనా ఏదైనా వ్రాసినట్లైతే దానిని తుడిచి వేయవలెను.” [ముస్లిం & అహ్మద్.]

మొదటి రెండు హదీథ్ (వ్రాయటానికి అనుమతివ్వబడినదని నిరూపించేవి)లు మరియు మూడో హదీథ్ (వ్రాయటం నిషేధింపబడినదని నిరూపించేది) పరస్పరం విరుద్ధంగా ఉన్నప్పటికీ ఏకకాలంలో మూడూ నిజమైనవే ఎలా అవుతాయి?

తన సహాబాల(ప్రవక్త సహచరుల)కు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హదీథ్ లను వ్రాయటానికి అనుమతిచ్చారా లేక నిషేధించారా అనే విషయాన్ని నిర్ణయించడానికి వీలుగా ముస్లిం పండితులు కొన్ని కారణాలను ఇలా ప్రకటించారు.

1. హదీథ్ లు మరియు దివ్యఖుర్ఆన్ సందేశాలు ఒకదానిలో ఒకటి కలసి పోయి తికమక పెట్టవచ్చనే కారణంగా హదీథ్ లు వ్రాయటాన్ని జనరల్ గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించి ఉండవచ్చును.

2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కు కరక్టుగా వ్రాయగలరనే నమ్మకమన్న కొందరు సహాబాల(ప్రవక్త సహచరుల)ను మాత్రమే హదీథ్ లను వ్రాయటానికి ప్రత్యేకంగా ఆజ్ఞాపించి ఉండవచ్చను.

3. దివ్య ఖుర్ఆన్ అవతవరణ ప్రారంభదశలో  హదీథ్ లు వ్రాయటాన్ని నిషేధించి ఉండవచ్చును మరియు దివ్య ఖుర్ఆన్ అవతరణ దాదాపుగా పరిపూర్తవుతున్న దశలో అంటే ఖుర్ఆన్ నమోదవటం పూర్తవుతున్న సమయంలో  హదీథ్ లు వ్రాయటానికి ఆజ్ఞాపించి ఉండవచ్చును. అప్పటికే ఎక్కవ మంది సహాబాల (ప్రవక్త సహచరుల)కు హదీథ్ మరియు ఖుర్ఆన్ వచనాలను ఎలా గుర్తించాలో స్పష్టంగా తెలిసిపోయి ఉంటుంది.

) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం జీవిత కాలంలో వ్రాయబడిన హదీథ్ వివరములు:

1. సత్యమైన పవిత్ర గ్రంథం – ఇది అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా వ్రాసినారు. వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క అనేక హదీథ్ లను ఇందులో నమోదు చేసినారు. దీనిని తన మనమడైన ఉమర్ బిన్ షుయైబ్ కు అందజేశారు.

2. అలీ బిన్ అబితాలిబ్ (రదియల్లాహు అన్ హు) యొక్క లిఖిత పత్రం ఇస్లాంలో ఖైదీలను విడిపించే నియమాలు,  మానవ హత్యకు పరిహారంగా ఇవ్వవలసిన సొమ్ము యొక్క లెక్కలు మరియు శరీరావయవముల నష్ట పరిహారపు సొమ్ము యొక్క లెక్కలు కలిగిన ఒక చిన్న లిఖిత పత్రం.

3. సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) యొక్క లిఖిత పత్రం వాదోపవాదాల సమయంలో ప్రమాణం చేయటానికి మరియు సాక్ష్యమివ్వటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అనుమతిచ్చారని సాద్ బిన్ ఉబాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖన ఆధారంగా తిర్మిథి తెలిపినారు.

4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఉత్తరాల రూపంలో వేర్వేరు ప్రదేశాలలోని తన ప్రజాసేవకులకు, ఉద్యోగులకు పంపిన పరిపాలనా వ్యవహారాల ఆజ్ఞలు మరియు దానికి సంబంధించిన ఇస్లాం యొక్క నియమ నిబంధనలు.

5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తరాల రూపంలో చుట్టుప్రక్కల ఇతర మతాలకు చెందిన నాయకులకు, చక్రవర్తులకు పంపిన ఉత్తరాలు. వీటిలో ఇస్లాం గురించిన ఉపోద్ఘాతం మరియు ఇస్లాం స్వీకరించమనే ఆహ్వానం పంపబడినది.

6. ఇతర మతాల వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క శాంతి ఒడంబడికలు, ప్రాధాన్యమున్న ఒప్పందాలు, పవిత్రమైన వాగ్దానాలు. ఉదాహరణకు యూదు మతస్థులతో మదీనా పట్టణంలో చేసుకున్న శాంతి ఒప్పందాలు.

7. జవాబుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తమ సహాబా (సహచరు)లకు పంపిన వ్యవహారాల నిర్వహణ మరియు ఇస్లాం ధార్మిక విషయాలు.

) ఋజుమార్గంలో నడిపబడిన ఖలీఫాల

(తొలి ఇస్లామీయ రాజ్యపాలకుల) కాలంలో హదీథ్ లను రికార్డు (నమోదు) చేయటం1 హజ్రీ శతాబ్దం 600-700AD

ఈ కాలంలో హదీథ్ లను వ్రాయటం కంటే ఎక్కువగా కంఠస్థం చేయటానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు మరియు సహాబా (ప్రవక్త సహచరు)లు హదీథ్ ల గురించి తక్కువగా చర్చించేవారు. ఎందుకంటే  వారు దివ్య ఖుర్ఆన్ ను నమోదు చేసే పనికే పూర్తి సమయాన్ని కేటాయించేవారు. మొదటి ఖలీఫా అబుబకర్ సిద్ధీక్ రదియల్లాహు అన్హు కాలంలో ఇస్లామియ రాజ్యపు నలువైపుల జరిగిన పలు యుద్ధాలలో అనేక మంది ఖుర్ఆన్ ను కంఠస్థం చేసిన సహాబాలు మరణించటం వలన, మొట్టమొదటి పూర్తి ఖుర్ఆన్ లిఖితప్రతిని సాధ్యమైనంత త్వరగా తయారుచేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడినది. ఆ కాలంలో హదీథ్ ల ద్వారా ప్రస్తావింపబడిన విషయాలను కొన్ని పద్ధతుల ద్వారా సహాబాలు మరియు ఖలీఫాలు అంగీకరించేవారు. 

1. ఏదైనా ఇస్లామీయ ధార్మిక విషయం దివ్యఖుర్ఆన్ లో కనబడనప్పుడు లేదా వివరంగా లేనప్పుడు హదీథ్ లలో వెతకడం.

ఉదాహరణ: గాబేష్ ఇబ్నె థుయైబ్ రదియల్లాహు అన్ హు ఇలా తెలిపారు – ఒక ముసలమ్మ ఖలీఫా అబూబకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్ హు దగ్గరకు వచ్చి తనకు రావలసిన వారసత్వపు హక్కును ఇవ్వమని అడుగుతుంది. దివ్యఖుర్ఆన్ లో దానికి సంబంధించిన ఎటువంటి ఆదేశాలు కనబడలేదని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి కూడా ఎటువంటి ఆదేశాలు వినలేదని ఖలీఫా  జవాబిస్తారు. తర్వాత మిగిలిన సహాబాలను ఈ విషయం గురించి అడుగుతారు. అక్కడున్న వారిలో నుండి అల్ ముగీరా ఇబ్నె షోబా రదియల్లాహు అన్ హు  లేచి నిలబడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఆవిడకు 6వ వంతు ఇవ్వడం చూసానని సాక్ష్యమిస్తారు. అప్పుడు ఖలీఫా ఆ సహాబీతో ఆ సమయంలో ఇంకెవరైనాసాక్ష్యమున్నారా? అని అడుగుతారు. అక్కడున్న వారిలో నుండి ముహమ్మద్ ఇబ్నె సలామా రదియల్లాహు అన్ హు లేచి అల్ ముగీరా సాక్ష్యాన్ని ధృవీకరిస్తారు. అప్పుడు ఖలీఫా అబుబకర్ రదియల్లాహు అన్ హు ఆవిడకు ఇవ్వవలసిన 6వ భాగం ఇచ్చివేస్తారు. (అల్ థహాబీ-తథ్కిరత్ అల్ హఫ్ఫాజ్ p2)

2. దివ్య ఖుర్ఆన్ ద్వారా మరియు ఇస్లామీయ సిద్ధాంతాల ద్వారా హదీథ్ ల పై సమాలోచన చేయటం.

ఒకవేళ దివ్య ఖుర్ఆన్ ఆయత్ లకు గాని ఇస్లామీయ సిద్ధాంతాలకు గాని హదీథ్ వ్యతిరేకమౌతున్నట్లైతే, ఆ హదీథ్ ను తిరస్కరించి, తప్పుగా అన్వయించి ఉండవచ్చనే ఉద్దేశంతో దానిని ఆచరించకుండా వదిలివేయటం జరిగేది.

ఉదాహరణ: ఉమర్ బిన్ ఖత్తాబ్ మరియు వారి కుమారుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఒక హదీథ్ ను ఇలా ఉల్లేఖిస్తున్నట్లుగా ఆయేషా రదియల్లాహుఅన్హా విన్నారు-ప్రవక్త ముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు “బంధువులు శోకిస్తుండటం వలన చనిపోయినవారు శిక్షకు గురౌతారు” ఆవిడ ఇలా తెలిపారు – “అల్లాహ్ ఉమర్ పై దయ చూపుగాక, నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను, చనిపోయిన వారి కోసం ఏడుస్తున్న బంధువుల కారణంగా అల్లాహ్ ఆ చనిపోయిన విశ్వాసులను శిక్షిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఎప్పుడూ చెప్పలేదు. దీనికి సంబంధించి నేను విన్న సరైన హదీథ్ ఇలా ఉన్నది –  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ప్రకటించి ఉన్నారు – చనిపోయిన వారి కోసం ఏడుస్తున్న బంధువుల కారణంగా ఆ చనిపోయిన అవిశ్వాసుల శిక్షను అల్లాహ్ పెంచుతాడు.” బుఖారి మరియు ముస్లిం. ముస్లిం హదీథ్ లో ఆయేషా రదియల్లాహుఅన్హా ఇంకా ఇలా చెప్పారని నమోదు చేయబడినది – హదీథ్ ఉల్లేఖనలో వచ్చిన తేడా అబద్ధం వలన కాదు, కాని వినటం లో జరిగిన పొరపాటు వలన అయివుంటుంది.

హదీథ్ లలో కపటం మరియు అబద్ధం కనిపించడం:

మూడవ ఖలీఫా ఉత్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు హత్య తర్వాత ముస్లింలలో భేదాభిప్రాయాలు మొదలై, పోట్లాటలు ప్రారంభమైనవి. స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం మరియు తమ తమ అవసరాలను తీర్చుకోవటానికి కొంతమంది స్వార్థపరులు హదీథ్ ల పదాలను మార్చటం, అబద్ధపు హదీథ్ లను కల్పించటం ప్రారంభమైనది. ఈ పరిస్థితులలో నుండి వాస్తవమైన హదీథ్ లను కాపాడటానికి సహాబాలు (ప్రవక్త సహచరులు)కూడా గట్టిగా ప్రయత్నించటం మొదలుపెట్టారు. తమ ముందుకు వచ్చిన ప్రతి హదీథ్ యొక్క  సనన్(ఉల్లేఖకుల పరంపర) మరియు మతన్ (హదీథ్ లోని అసలు విషయం) లను క్షుణ్ణంగా పరిశీలించి, కపటమైన మరియు అబద్ధమైన హదీథ్ లను రద్దుచేసి, నిజమైన హదీథ్ లను సేకరించటం ప్రారంభించారు. ఈ అత్యంత బాధ్యతాకరమైన కార్యక్రమంలో అంటే హదీథ్ నిజానిజాలు పరీక్షించటం లో క్రింద పేర్కొనబడిన పద్ధతులను, నియమాలను  వారు అనుసరించారు.

1. హదీథ్ ను ఉల్లేఖించిన వారి గుణగణాల గురించి సహాబాలు ప్రశ్నించటం ప్రారంభమైనది. దీనికి పూర్వం ఉల్లేఖకులందరినీ నమ్మదగినవారుగా మరియు ప్రామాణికమైన వారుగా విశ్వసించేవారు.

2. సామాన్య ప్రజలు ఉల్లేఖకుల నుండి విన్న హదీథ్ లను వెంటనే స్వీకరించకుండా సావధానంగా పరిశీలించిన తర్వాతే విశ్వసించేటట్లుగా సహాబాలు ప్రోత్సహించారు. దైవభీతి, దైవభక్తి గల, సత్యవంతులుగా మరియు ప్రామాణికత గలవారుగా ప్రసిద్ధిచెందిన, నిష్ఠాపరులైన ఉల్లేఖకుల నుండి మాత్రమే హదీథ్ లను ప్రజలు స్వీకరించేటట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీని ద్వారా జర్ మరియు తాదీల్ సైన్స్ అంటే ఉల్లేఖకులను  విశ్వసించటానికి అవసరమైన పరీక్షలు జరపే సైన్స్ (విజ్ఞానశాస్త్రం) ఉనికి లోనికి వచ్చినది. 

3. హదీథ్ యొక్క ప్రామాణికతను నిర్ధారించటానికి దూర దూర ప్రాంతాలకు ప్రయాణించటం – సహాబాలు ఒకరి నుండి విన్న హదీథ్ లోని నిజానిజాలు తెలుసుకోవటానికి, ఎన్ని కష్టాలెదురైనా సరే అదే హదీథ్  గురించి జ్ఞానం ఉన్న మరొకరి వద్దకు కూడా ప్రయాణించి, అందులోని ప్రామాణికతను పూర్తిగా పరీక్షించేవారు.

4. ఇంకా ఒకే హదీథ్ ను గనుక వేర్వేరు యోగ్యలైన ఉల్లేఖకర్తలు తెలిపి ఉన్నట్లైతే,  సహాబాలు వాటిని పోల్చిచూసుకునేవారు. పోలిక సరిపోతేనే ఆ హదీథ్ ను స్వీకరించేవారు. పోలిక సరిపోకపోతే తిరస్కరించేవారు.

కాబట్టి ఆ కాలంలో హదీథ్ లను రెండు రకాలుగా విభజించారు.

1. ప్రామాణికమైనవి – స్వీకరింపబడిన హదీథ్ లు

2. అప్రామాణికమైనవి – తిరస్కరింపబడిన హదీథ్ లు

) 2 హజ్రీ శతాబ్ద కాలంలో (700-800AD) హదీథ్ లను అధికారికంగా నమోదు (రికార్డు) చేయటం 

పరిపక్వత (సంపూర్ణత) స్థాపితమైన కాలం

హదీథ్ సైన్స్ ఈకాలంలోనే పూర్తయినది. దీనిని క్రింది విధంగా వర్ణించవచ్చును.

1. అధికారికంగా హదీథ్ లను రికార్డు చేయటం.

అల్ బుఖారి ఇలా తెలిపారు – ముస్లింల ముఖ్య పండితుడైన అబిబకర్ ఇబ్నె హజమ్ కు అప్పటి ముస్లింల ఖలీఫా అయిన ఒమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ (100 – 102 హిజ్రీ అంటే 700 – 800 AD) ఇలా సందేశం పంపారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క నిజమైన హదీథ్ లను వెతికి ఒకచోట వ్రాయండి. ఎందుకంటే హదీథ్ వేత్తల మరణం వలన కాలక్రమంలో ఆ గొప్ప జ్ఞానసంపదను పోగొట్టుకుంటామేమో అని భయపడుతున్నాను. (అల్ బుఖారి 1:27)

కాబట్టి ముస్లిం పండితులు సరైన హదీథ్ లను సేకరించి, పుస్తకాల రూపంలో వ్రాయటం ప్రారంభించారు. వాటిలో కొన్ని క్రింద పేర్కొనబడినవి.

& మామర్ ఇబ్నె రాషిద్ హదీథ్ గ్రంథం 154 హిజ్రీ (777 AD)

& సుఫ్యాన్ అల్ థౌరి హదీథ్ గ్రంథం 161 హిజ్రీ (784 AD)

& సుఫ్యాన్ ఇబ్నె ఒయైనా హదీథ్ గ్రంథం 198 హిజ్రీ (821 AD)

& హమ్మాద్ ఇబ్నె సలామా తక్సోమి గ్రంథం 167హిజ్రీ (790 AD)

& అబ్దుల్ రజ్జాఖ్ తక్సోమి గ్రంథం 211హిజ్రీ (834 AD)

& అల్ మువత్తా(ఇమాం మలిక్)- పైవాటన్నింటిలోకి ఎక్కువ యోగ్యమైనది.

2. హదీథ్ సరైనదా కాదా అనే పరిశోధనలలో అభివృద్ది (జర్ & తాదీల్ సైన్స్) మరియు ఉల్లేఖకుల గుణగణాలను ప్రశ్నించటం

ఈ విషయంలో దిగువ పేర్కొన్న కొందరు పండితులు చాలా ప్రసిద్ధిచెందారు.

*  షౌబా ఇబ్నె అల్ హజ్జాజ్ – 160 హిజ్రీ (783 AD)

*  సుఫ్యాన్ అల్ థౌరి – 161 హిజ్రీ (784 AD)

*  అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె మహ్ది 198 హిజ్రీ (821 AD)

3. యోగ్యులుగా ప్రసిద్ధిచెందని వారి హదీథ్ ఉల్లేఖనలను తిరస్కరించటం

 4. హదీథ్ ఉల్లేఖనలను నిర్ధారించటానికి షరతులు కనిపెట్టడం   

ఈ షరతులను తయారు చేసిన మొదటి పండితుడు ఇమామ్ అల్ జొహ్రి. వీటిని పుస్తకరూపంలో వ్రాయకుండానే బోధించేవారు,

5.  అల్ రిసాలా ప్రతిప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క హదీథ్ లను స్వీకరించటానికి ఇమామ్ షాఫయి కొన్ని హదీథ్ షరతులను వ్రాసినారు. 

) 3 హజ్రీ శతాబ్దం (800-900AD) నుండి 4 హిజ్రీ శతాబ్దపు మధ్య కాలం హదీథ్ లకు స్వర్ణయుగం

ఈ కాలం సరైన హదీథ్ లను ఒకచోట సేకరించటానికి మరియు హదీథ్ విజ్ఞాన గ్రంథాలు తయారుకావటానికి సాక్ష్యంగా నిలచినది. హదీథ్ విజ్ఞానశాస్త్రం అనేక విభాగాలుగా అభివద్ధి చెందినది.  పురుష ఉల్లేఖకుల హదీథ్ లే ఉన్నటువంటి (అతి తక్కువ సంఖ్యలో మహిళా ఉల్లేఖకుల హదీథ్ ఉన్నటువంటి) పురుష హదీథ్ విజ్ఞానశాస్త్రం సమకూర్చారు. అందులో ఉల్లేఖకుల స్థితిగతులు, వారి రాజకీయ పూర్వరంగం, వ్యక్తిగత జీవితవిధానం మొదలైన అనేక విషయాలు చేర్చటం జరిగినది. ఎలాల్ అల్ తిర్మిథి అనే గ్రంథంలో ఇమామ్ తిర్మిథి హదీథ్ లకు సంబంధించిన వివిధ సమస్యలను వివరంగా చర్చించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక హదీథ్ గ్రంథాలు ఈ కాలంలోనే వ్రాయబడినాయి. అవి ఈనాటికీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలో

ü కొన్ని కేవలం విశ్వసనీయమైన(సహీహ్) హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథాలున్నాయి,

ü ఇంకొన్ని విశ్వసనీయమైన మరియు స్వీకరించగలిగే అర్హతలు గల హదీథ్ లున్న గ్రంథాలున్నాయి,

ü మరికొన్ని విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లున్న గ్రంథాలు కూడా ఉన్నాయి, వీటికి ఉదాహరణ –

& సహీహ్ బుఖారీ (విశ్వసనీయమైనది హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథం-Only Authentic hadith)

& సహీహ్ ముస్లిం (విశ్వసనీయమైన హదీథ్ లు మాత్రమే ఉన్న గ్రంథం-Only Authentic hadith)

& సునన్ దావూద్ (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)

& సునన్ అల్ తిర్మిథి (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)

& సునన్ అన్ నిసాయి (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)

& సునన్ ఇబ్నె మాజా (విశ్వసనీయమైన, స్వీకరించగలిగే అర్హతలు గల మరియు బలహీనమైన ఆధారాల హదీథ్ లు కలసి ఉన్న గ్రంథం – mix of Authentic ,Acceptable and weak hadith)

ఇంకా అనేక హదీథ్ గ్రంథాలు మరియు హదీథ్ విజ్ఞానశాస్త్ర గ్రంథాలు ఈ కాలంలోనూ, తర్వాత కాలాల్లోనూ వ్రాయబడినాయి. కాని కేవలం ఈ కాలంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలు మాత్రమే విశ్వసనీయమైనవిగా (authentic) ప్రత్యేక గుర్తింపు పొందాయి.  

) 4 హిజ్రీ శతాబ్దం మధ్య కాలం నుండి నేటి వరకు –  సంపూర్ణంగా హదీథ్ విద్య అభివృద్ధి చెందిన కాలం 

ఈకాలంలో హదీథ్ విద్య మరియు హదీథ్ సైన్స్ (విజ్ఞానశాస్త్ర) గ్రంథాలు పూర్తిగా ప్రపంచం మొత్తం వ్యాపించాయి. ఇస్లాం లో వాటి విషయ ప్రాముఖ్యతను బట్టి వివిధ అధ్యాయాలుగా (అంటే ఖుర్ఆన్ అవతరణ, విశ్వాసం, నమాజులు, దానం, ఉపవాసం, హజ్, లావాదేవీలు, ఇతర వ్యవహారాలు, శిక్షలు, జుర్మానాలు,మొదలైనవి) సమకూర్చ బడినాయి. ఇంకా వీటి సారాంశాన్ని మరియు వివరణను ఇతర పండితులు వేర్వేరు గ్రంథాలుగా తయారుచేశారు. ఉదాహరణకు –

& ఫతహ్ అల్ బారి ( సహీహ్ బుఖారి వివరణ) – ఇమామ్ ఇబ్నె హజర్ 852హిజ్రీ (1475 AD)

& అల్ మిన్ హజ్ (సహీహ్ ముస్లిం వివరణ) – ఇమామ్ అన్ నవావీ 676హిజ్రీ (1299 AD)

& హదీథ్ విజ్ఞానశాస్త్రాల పరిచయం- ఇమామ్ ఇబ్నె అల్ సలాహ్ 643హిజ్రీ (1266 AD)

& హదీథ్ విజ్ఞాన శాస్త్రాలు(వివరణ) – ఇమామ్ అల్ సియూతి

 911 హిజ్రీ (1534 AD)

హదీథ్ రకాలు 

విశ్వసనీయతను బట్టి మూడు రకాలైన హదీథ్ లు ఉన్నాయి.

1. సహీహ్ హదీథ్ లు (పూర్తిగా విశ్వసించదగినవి – Authentic)

హదీథ్ ను రికార్డు చేసిన మొదటి ఉల్లేఖకుడి (అల్ బుఖారి లేక ముస్లిం) నుండి చిట్టచివరి ఉల్లేఖకుడి వరకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వరకు ఒకరి నుండి మరొకరి మధ్య, ఉల్లేఖకుల వరుసక్రమంలో ఎటువంటి అంతరాయం (బ్రేక్) లేకుండా ఉన్న హదీథ్ లు. ఇంకా ఈ హదీథ్ లన్నీ పూర్తిగా నమ్మదగిన మరియు యోగ్యులైన ఉల్లేఖకులు తెలిపినవే. 

2. హసన్ హదీథ్ లు (స్వీకారయోగ్యమైన హదీథ్ లు – Acceptable)

హదీథ్ ను రికార్డు చేసిన మొదటి ఉల్లేఖకుడి (అల్ తిర్మథి) నుండి చిట్టచివరి ఉల్లేఖకుడి వరకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వరకు ఒకరి నుండి మరొకరి మధ్య, ఉల్లేఖకుల వరుసక్రమంలో ఎటువంటి అంతరాయం (బ్రేక్) లేకుండా ఉన్న హదీథ్ లు. వీటిని ఉల్లేఖించిన వారు కూడా పూర్తిగా నమ్మకమైనవారే కాని తక్కువ యోగ్యులు.

  1. బలహీనమైన హదీథ్ లు(స్వీకరింపలేనివి లేక  తిరస్కరింపబడినవి)

సమస్యలున్న మరియు ఉల్లేఖకుల వరుసక్రమంలో అంతరాయం (మధ్యలో ఒకరు లేక ఒకరి కన్నా ఎక్కువ ఉల్లేఖకుల పేర్లు తప్పిపోవటం) ఉన్న హదీథ్ లు. ఒకరు లేక ఒకరి కన్నా ఎక్కువ ఉల్లేఖకులు నమ్మకమైనవారు కాకపోవటం అంటే వయస్సు భారం వలన ఆలోచనాశక్తి తగ్గినవారు, రికార్డు చేసిన వ్రాతప్రతులు పోగొట్టుకున్నవారు, అసత్యవంతులుగా ప్రసిద్ధి చెందిన వారు, అపరిచిత ఉల్లేఖకులు.

ప్రశ్నలు

01.ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) కాలంలోనే హదీథ్ లను రికార్డు (నమోదు) చేయటం మొదలైనదా?

02. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హదీథ్ లను వ్రాయటానికి అనుమతిచ్చారా లేక నిషేధించారా అనే విషయాన్ని నిర్ణయించడానికి వీలుగా ముస్లిం పండితులు ప్రకటించిన కారణాలేవి?

03.ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం జీవితకాలంలోనే వ్రాయబడిన హదీథ్ ప్రతుల వివరాలు తెలుపండి.

04.మొదటి హిజ్రీ శతాబ్దంలో హదీథ్ ల నిజానిజాలు పరీక్షించటానిక ఏ పద్ధతులను అనుసరించారు?

05.మొదటి హిజ్రీ శతాబ్దంలో హదీథ్ లను ఎన్ని రకాలు గా విభజించారు?

06.రెండవ హిజ్రీ శతాబ్దంలో హదీథ్ ల ప్రాముఖ్యత ఏమిటి?

07.రెండవ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలను పేర్కొనండి?

08.హదీథ్ సరైనదా కాదా అనే పరిశోధనలలో ప్రసిద్ధిచెందిన వారి పేర్లు?

09.హదీథ్ ఉల్లేఖనలను నిర్ధారించటానికి షరతులు కనిపెట్టిన మొదటి హదీథ్ వేత్త ఎవరు?

10.హదీథ్ లను స్వీకరించటానికి ఇమామ్ షాఫయి వ్రాసిన ప్రతి పేరు?

11.హదీథ్ లకు స్వర్ణయుగమని ప్రసిద్ధి చెందిన కాలమేది?

12.3వ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన ప్రఖ్యాత 6 హదీథ్ గ్రంథాలేవి? అవి ఎటువంటి హదీథ్ లు కలిగి ఉన్న గ్రంథాలు?

13.ఏ హిజ్రీ శతాబ్దంలో వ్రాయబడిన హదీథ్ గ్రంథాలు విశ్వసనీయమైనవిగా (authentic) ప్రత్యేక గుర్తింపు పొందాయి?

14.హిజ్రీ 4వ శతాబ్దం తరువాత వచ్చిన ప్రఖ్యాత హదీథ్ గ్రంథాలేవి?

15.బుఖారీ & ముస్లిం హదీథ్ గ్రంథాలకు మరియు ఇతర హదీథ్ గ్రంథాలకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి?

16.ఎన్నిరకాలైన హదీథ్ లున్నాయి? వివరంగా తెలుపండి.

17. రదియల్లాహు అన్ హు అంటే అర్థం ఏమిటి?ఎవరి పేరు వచ్చిన ఎడల దీనిని పలుక వలెను? మూడు ఉదాహరణలు ఇవ్వవలెను.

%d bloggers like this: