Tag: islaam
మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్భాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది
1697. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :-
మేమొక జనాజా (శవం) వెంట ‘బఖీ’ శ్మశానవాటికకు వెళ్ళాము.అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా వచ్చి ఓ చోట కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తల వంచుకొని బెత్తంతో నేలను గీకసాగారు. కాస్సేపటికి “మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్భాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది.” అని అన్నారు ఆయన. ఒకతను ఈ మాట విని “దైవప్రవక్తా! అయితే మనం విధివ్రాతని భావించి కర్మలు ఆచరించకుండా ఎందుకు కూర్చోకూడదు. మనలో ఎవరైనా సౌభాగ్యుడై ఉంటే అతను ఎలాగూ సత్కర్మలు ఆచరిస్తాడు, దౌర్భాగ్యుడైతే ఎలాగూ దుష్కర్మలు ఆచరిస్తాడు కదా!” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “కాని వాస్తవం ఏమిటంటే అదృష్టవంతుడికి సత్కార్యాలు చేసే సద్బుద్ధి కలుగుతుంది, దౌర్భాగ్యుడికి దుష్కార్యాలు చేసే దుర్భుద్ది పుడ్తుంది.” అని అన్నారు. ఆ తరువాత ఆయన (దివ్య ఖుర్ఆన్ లోని) ఈ సూక్తులు పఠించారు : “ధనాన్ని దానం చేసి దైవ అవిధేయతకు దూరంగా ఉంటూ, మంచిని (సత్యాన్ని) సమర్ధించే వాడికి మేము సన్మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలుగజేస్తాము. (దీనికి భిన్నంగా) పిసినారితనం వహించి (దైవంపట్ల) నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తూ, మంచిని (సత్యాన్ని) ధిక్కరించే వాడికి మేము కఠిన మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము.” (92 : 5-10)
[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయిజ్, 83 వ అధ్యాయం – మౌఇజతిల్ ముహద్దిసి ఇన్దల్ ఖబ్ర్ వఖూవూది అస్ హాబిహీ హౌలహు]
విధివ్రాత ప్రకరణం – 1 వ అధ్యాయం – మాతృగర్భంలో మానవ నిర్మాణ స్థితి, అతని ఉపాధి, వయస్సు, కర్మలు మొదలగునవి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1.
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి
335. హజ్రత్ అబ్దుల్లా బిన్ బహీనా (రధి అల్లాహు అన్హు) కధనం :-
(ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నమాజులో రెండు రకాతులు పఠించిన తరువాత లేచి నిల్చున్నారు. ‘ఖాయిదాయె ఊలా’ ప్రకారం కూర్చోవడం మరచిపోయారు. అనుచరులు కూడా ఆయనతో పాటు పైకి లేచారు. నమాజు పూర్తయి ‘సలాం’ చేయడానికి మేము ఎదురుచూస్తున్న తరుణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అల్లాహు అక్బర్’ అంటూ కూర్చునే రెండు సార్లు సజ్దా చేశారు. ఆ తరువాత కుడి ఎడమల వైపు సలాం చేశారు.
[సహీహ్ బుఖారీ : 22 వ ప్రకరణం – సహూ, 15 వ అధ్యాయం – మాజాఅ ఫిస్సహూ….]
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 19 వ అధ్యాయం – నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది
613. హజ్రత్ హకీం బిన్ హిజామ్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది. మొదట మీ పోషణలో ఉన్న వారికి దానం చేయండి. దానమిచ్చిన తరువాత కూడా మనిషి ధనవంతుడిగా ఉండిపోతే అలాంటి వ్యక్తి చేసే దానమే ఎంతో శ్రేష్టమైనది. (దానం) అర్ధించడం మానుకున్న వ్యక్తికి అల్లాహ్ దేవురించే అవమానం నుండి కాపాడుతాడు. దాన స్వీకారాన్ని లక్ష్యపెట్టకుండా మసలుకునే వారికి అల్లాహ్ కలిమిని ప్రసాదిస్తాడు.
[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 18 వ అధ్యాయం – లా సదఖత ఇల్లా అన్ జహ్ రిగ్నీ]
జకాత్ ప్రకరణం – 32వ అధ్యాయం – ఇచ్చే చేయి ఎప్పుడూ పైనే, పుచ్చుకునే చేయి ఎప్పుడూ క్రిందనే. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి
348. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-
ఓ రోజు కొందరు పేదప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా గొప్పగొప్ప హొదా, అంతస్తులు, శాశ్వత సౌఖ్యాలు పొందగలుగుతున్నారు. వారు మాలాగా నమాజులు కూడా చేస్తున్నారు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నారు, పైగా డబ్బున్నందున హజ్, ఉమ్రా ఆచారాలు కూడా పాటిస్తున్నారు. జిహాద్ (ధర్మపోరాటం) కూడా చేస్తున్నారు. దానధర్మాలు కూడా చేస్తున్నారు” అని అన్నారు.
అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :- “సరే, నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు మీ దినచర్యగా చేసుకుంటే, మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో మీరు సమానులయిపోతారు. ఆ తరువాత మీతో మరెవరూ పోటీ ఉండరు. ఈ పద్ధతి అనుసరించే వాడుతప్ప మీరే అందరికంటే శ్రేష్ఠులయి పోతారు. ఆ విషయం ఏమిటంటే, ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి”.
హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- ఆ తరువాత (వీటి సంఖ్య విషయమయి) మాలో విబేధాలు వచ్చాయి. కొందరు సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్ అనే మాటలు ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించాలని, అల్లాహు అక్బర్ అనే మాటను ముఫ్ఫై నాలుగుసార్లు స్మరించాలని అన్నారు. అందువల్ల నేను ఈ విషయం గురించి మరోసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగాను. అప్పుడాయన “సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనే మాటలలో ప్రతిదాన్ని ముఫ్ఫై మూడుసార్లు పఠించండి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 115 వ అధ్యాయం – అజ్జిక్రి బాదస్సలాత్]
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 26 వ అధ్యాయం – నమాజు తరువాత ఏ ధ్యానం అభిలషణీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
నమాజులో ఏఏ కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి?
344. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహ్హుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్ధన) చేస్తూ ఉంటే నేను విన్నాను.
అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి. అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.
“దేవా! నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. ‘మసీహిద్దజ్జాల్’ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. జీవన్మ(*)రణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. దేవా! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుడిని అయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”
ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరు రుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితే అసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 149 వ అధ్యాయం – అద్దుఆవు ఖబ్లస్సలాం ]
(*) ‘జీవిత’ పరీక్ష అంటే, మానవ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నీ అని అర్ధం. ఉదాహరణకు – పనికిమాలిన విషయాల్లో చిక్కుకు పోవడం, మనోవాంఛలకు బలయిపోవడం మొదలైనవి. మరణ పరీక్ష అంటే, మనిషి మరణ ఘడియల్లో దైవానుగ్రహం పట్ల నిరాశ చెందడం, సద్వచనం (కలిమా) పలకలేక పోవడం, ఇస్లాం వ్యతిరేక విషయాలు మాట్లాడటం ఇత్యాదివి. రుణగ్రస్తుడవడం అంటే, అధర్మ కార్యాలు లేక అనవసరమైన పనుల కోసం చేసే అప్పు అన్నమాట. లేదా అప్పుతీర్చే సద్బుద్ధి లేకపోవడం. నిజమైన అవసరాల నిమిత్తం అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే దాంతో పాటు అప్పు తీర్చే స్తోమత కూడా ఉండాలి. ఈ దుఆ (వేడుకోలు) మొదటి భాగం దేవుని హక్కులకు, రెండవభాగం దాసుల హక్కులకు సంభందించినది.
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 25 వ అధ్యాయం – నమాజులో ఏఏ కీడు నుండి దేవుని శరణు కోరాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
నా (ఉమ్మత్) లో ఒక వర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది
1250. హజ్రత్ ముఆవియా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
నా అనుచర సమాజం (ఉమ్మత్) లో ఒకవర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది. ఎవరైనా వారిని అవమాన పరచదలిచినా లేదా వ్యతిరేకించ దలచినా వారా వర్గం (ముస్లింల) కు ఎలాంటి హాని కలిగించలేరు. ఆ విధంగా చివరికి ప్రళయం వచ్చినా అప్పుడు కూడా ఆ వర్గం వారు దైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగానే ఉంటారు.
[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 28 వ అధ్యాయం – హద్దసనీ ముహమ్మదుబ్నుల్ ముసన్నా]
పదవుల ప్రకరణం : 53 వ అధ్యాయం – నా అనుచర సమాజంలో ఒక వర్గం ఎల్లప్పుడూ ధర్మంపై స్థిరంగా ఉంటుంది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
జిల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత
ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
హజ్ నెల ప్రారంభ మైనది, మొదటి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పది రోజులలో చేసిన మంచి పనులకు అల్లాహ్ ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడు.
1250. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-
జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ, “ధైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా? అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధనప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్టుడే)” అని చెప్పారు. [బుఖారీ]
[సహీహ్ బుఖారీలోని పండుగ ప్రకరణం]
ముఖ్యాంశాలు :
జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజుల్లో హజ్ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్ చేయలేక పోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫీల్ ఉపవాసాలు ఇతర ఆరాధనా కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్నా ఉద్దేశ్యంతో జిల్ హిజ్జా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని ప్రకటించడం జరిగింది. ఇస్లాం లో ‘జిహాద్’ కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధనపడుతున్నది.
హదీసు కిరణాలు (RiyadusSaliheen) రెండవ సంపుటం
సంకలనం: ఇమాం నవవి (రహిమహుల్లః )
తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం
46. హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ జుహ్ని (రధి అల్లాహు అన్హు) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు ఆఇహి వసల్లం) మాతో కలిసి హుదైబియా ప్రాంతంలో ఉదయం నమాజు చేశారు. రాత్రి వర్షం కురిసింది. ఉదయం వరకు నేల తడిగానే ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగిసిన తరువాత అనుచరుల వైపుకు తిరిగి, “అల్లాహ్ ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగారు. “దేవునికి, దైవప్రవక్తకే బాగా తెలుసు. మాకు తెలియదు” అన్నారు అనుచరులు. అప్పుడు దైవప్రవక్త ఈ విధంగా తెలిపారు –
“అల్లాహ్ ఇలా అన్నాడు – ఈ రోజు ఉదయం నా దాసులలో కొందరు విశ్వాసులయిపోయారు, మరి కొందరు అవిశ్వాసులయిపోయారు. దేవుని దయవలన మనకు వర్షం కురిసింది అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”.
[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 156 వ అధ్యాయం – యస్తగ్ బిలుల్ ఇమామున్నాస ఇజా సల్లమ్]
విశ్వాస ప్రకరణం – 30 వ అధ్యాయం – తారాబలాన్ని నమ్మడం సత్యతిరస్కారంతో సమానం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
మితిమీరిన ముఖస్తుతి మంచిది కాదు
1888. హజ్రత్ అబూ బక్రా (రధి అల్లాహు అన్హు) కధనం :-
ఒకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఒక వ్యక్తిని పొగిడాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “నువ్వు చెడ్డపని చేశావు. నీవు పొగడ్తలతో, నీ మిత్రుని గొంతుకోశావు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట అనేకసార్లు అన్నారు. తర్వాత ఆయన ఇలా అన్నారు : “మీలో ఎవరైనా మీ సోదరుడ్ని పొగడటం చాలా అవసరమని భావించినప్పుడు ఈ విధంగా అనాలి – ‘ఇది నా అభిప్రాయం. వాస్తవ పరిస్థితి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. నేను అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరి పవిత్రతనూ నిరూపించడం లేదు. ఆ వ్యక్తి ఇలాంటివాడు, అలాంటివాడు అని అన్నానంటే ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ – ఈ మాటలయినా ఆ మనిషి గురించి మీకు వ్యక్తిగతంగా తెలిసి ఉన్నప్పుడే అనాలి. (అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని పొగడకూడదు)”.
[సహీహ్ బుఖారీ : 52 వ ప్రకరణం – అష్షహాదాత్, 17 వ అధ్యాయం – ఇజా జక్కా రజులున్ రజులన్ కఫాహు]
ప్రేమైక వచనాల ప్రకరణం : 14 వ అధ్యాయం -మితిమీరిన ముఖస్తుతి మంచిది కాదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్