ఒక అవసరం తీరాలనే ఉద్దేశ్యంతో ప్రవక్త (ﷺ) పై సలాహ్ పంపితే, ఆ అవసరం నెరవేరుతుందనేది ప్రామాణికమైన (ఆథెంటిక్) విషయమేనా?
షేఖ్ అరఫాత్ ఇబ్న్ హసన్:
అవును. ఎవరైతే అల్లాహ్ తమ అవసరాన్ని తీర్చాలని కోరుకుంటారో, వారు ప్రవక్త (ﷺ) పై తరచుగా ఎక్కువగా సలాహ్ పంపాలి. దీనికి సంబంధించి ఒక ‘సహీహ్’ (ప్రామాణిక) హదీసు ఉంది.
ప్రవక్త (ﷺ) ఒకసారి ఉబయ్ ఇబ్న్ కఅబ్ (రజియల్లాహు అన్హు) తో మాట్లాడారు, ఆయన ఎక్కువగా ప్రార్థిస్తూ మరియు (ప్రవక్త పై) సలాహ్ పంపుతూ ఉండేవారు. ఆయన (ఉబయ్) ఇలా అడిగారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా, నా దుఆ (ప్రార్థన) లో మీపై సలాహ్ పంపడానికి నేను ఎంత సమయాన్ని కేటాయించాలి?” ప్రవక్త (ﷺ) ఇలా బదులిచ్చారు: “నీ ఇష్టం (ఎంతైనా చేసుకోవచ్చు), కానీ నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే అది నీకే మరింత మంచిది.” ఉబయ్ (రజియల్లాహు అన్హు) ఆ సమయాన్ని మరింత పెంచుకుంటూ పోయి చివరకు ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా, నేను నా ప్రార్థన (దుఆ) అంతటినీ మీపై సలాహ్ పంపడానికే కేటాయిస్తాను.” (అప్పుడు) ప్రవక్త (ﷺ) ఇలా అన్నారు: “అయితే నీ కష్టాలన్నీ (విచారాలు) తీర్చబడతాయి మరియు నీ పాపాలు క్షమించబడతాయి.”
ఈ హదీసు ఇమామ్ తిర్మిజీ ప్రకారం ‘హసన్’ (ఆమోదయోగ్యమైనది).
ఒక వ్యక్తి దుఆ చేస్తూ (ప్రవక్తపై సలాహ్ పంపినప్పుడు), అల్లాహ్ వారి అవసరాన్ని నెరవేరుస్తాడని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యమని పండితులు అన్నారు — ఎందుకంటే మనిషికి విచారం (కష్టం) అనేది ఒక అవసరం తీరకపోవడం (లేదా ఒక ఆవశ్యకత) వల్లే వస్తుంది.
జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.
జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.
జుమా రోజు స్నానం (ఘుస్ల్) చేయడం
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ “ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ” అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”. (అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.) (సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)
عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ “ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ” అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”. (అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)
వుదూ మరియు స్నానం మధ్య ఆధిక్యత
عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم “ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ” అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.
(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).
జుమా ఆచారాలు మరియు వాటి పుణ్యఫలాలు
عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا
(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).
ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.
మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.
జుమా రోజు సువాసన పూసుకోవడం
ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.
సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).
ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.
అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.
ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.
మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.
మొదటి దువా: పాపాల క్షమాపణ కోసం
మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)
“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”
అని చదువుతారో,
غُفِرَ لَهُ ذَنْبُهُ (గుఫిర లహూ దన్బుహూ)
వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.
ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.
రెండవ దువా: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సిఫారసు కోసం
ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.
“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”
అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.