అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారికి హెచ్చరిక [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజెయ్యబడింది)
https://youtu.be/IjbFjYK0z3c [10 నిముషాలు]

18:4 وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).

18:5 مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.

ఈ ప్రసంగంలో, అల్లాహ్‌కు సంతానం ఉందని చెప్పేవారిని హెచ్చరించమని ఆదేశించే ఖురాన్ (సూరహ్ అల్-కహఫ్, ఆయత్ 4-5) ఆయతులపై వివరణ ఇవ్వబడింది. ఇది ఎటువంటి జ్ఞానం లేదా ఆధారం లేని తీవ్రమైన పాపమని, కేవలం అజ్ఞానంతో పలికే మాట అని వక్త నొక్కిచెప్పారు. యూదులు, క్రైస్తవులు, మక్కా ముష్రికులు గతంలో ఇలాంటి వాదనలు చేశారని ఉదహరించారు. దీనికి విరుద్ధంగా, అల్లాహ్‌కు తల్లిదండ్రులు, భార్య లేదా సంతానం లేరని, ఆయన ఏకైకుడని సూరహ్ అల్-ఇఖ్లాస్ స్పష్టం చేస్తుందని తెలిపారు. ఈ సత్యాన్ని ఇతరులకు తెలియజేయడం (దావత్) ప్రతీ ముస్లిం బాధ్యత అని, దీనికోసం కనీసం సూరహ్ అల్-ఇఖ్లాస్ మరియు ఆయతుల్ కుర్సీ యొక్క భావాన్ని తెలుసుకుని చెప్పినా సరిపోతుందని అన్నారు. అయితే, ఇతరుల వాదన ఎంత మూర్ఖంగా ఉన్నప్పటికీ, వారితో మృదువుగా, గౌరవప్రదంగా సంభాషిస్తూ దావత్ ఇవ్వాలని, ఈ పద్ధతులను తెలుసుకోవడం తప్పనిసరి అని బోధించారు.

وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
వయున్దిరల్లదీన ఖాలుత్తఖదల్లాహు వలదా
ఈ ఖురాన్ ద్వారా (యున్దిర్) హెచ్చరించాలి.

ఎవరికి హెచ్చరించాలి?

الَّذِينَ قَالُوا
అల్లదీన ఖాలూ
ఎవరైతే అన్నారో, చెప్పారో

اتَّخَذَ اللَّهُ وَلَدًا
ఇత్తఖదల్లాహు వలదా
నవూజుబిల్లాహ్. అల్లాహ్ తన కొరకు సంతానం చేసుకున్నాడు అని ఎవరైతే అంటున్నారో, అలాంటి వారిని కూడా మీరు ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించాలి.

ఇక మీరు ఈ ఆయతును గమనించండి. మనం ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నామా?

అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఈ ఖురాన్ ద్వారా మీరు వారిని హెచ్చరించండి – “మీకు జ్ఞానం లేని మాటలు అల్లాహ్ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? అల్లాహ్ ఎవరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు. అల్లాహ్ ఎవరినీ కూడా తనకు భార్యగా చేసుకోలేదు”

యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. మక్కా యొక్క ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అని అనేవారు. మరియు ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, మహేశ్వరుడు అన్నటువంటి పదాలు ఆ ఏకైక సృష్టికర్త గురించే మేము అంటున్నాము అని అంటారు. కానీ మళ్ళీ ఆ సృష్టికర్తకు సంతానాలు ఉంటాయి. ఆ సృష్టికర్తకు ఎందరో భార్యలు ఉంటారు. అంతేకాదు, వాళ్ళ యొక్క దేవుళ్ళ సంగతి ఎలా అంటే, పెద్ద దేవుడు కొన్ని సందర్భాల్లో చిన్న దేవుళ్ళపై కోపగించి వారిపై శాపం కూడా కురిపిస్తాడు మరియు శాపం పడిన వారిని కరుణించి వరాలు కూడా కురిపిస్తాడు. ఈ విధంగా ఎన్నో విచిత్ర సంఘటనలు మనం వింటూ చూస్తూ ఉన్నాము.

నిజంగా, వాస్తవంగా మనందరి సృష్టికర్త ఎవరు అంటే, అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, సంతాన భార్య లేదు, సంతానమూ లేరు, అతనికి ఏ కుటుంబము, పరివారము అని లేరు.

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ﴿١﴾ اللَّهُ الصَّمَدُ ﴿٢﴾ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ﴿٣﴾ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ﴿٤﴾
ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్-సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్

(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. (సూరా అల్ ఇఖ్లాస్)

మనందరికీ ఈ సూరా గుర్తుంటుంది కదా. దీని యొక్క అనువాదం తెలుసుకొని ప్రేమగా ఒక్కసారైనా గానీ మనం మన చుట్టుపక్క ఉన్నటువంటి బహుదైవారాధకులకు, అవిశ్వాసులకు, సత్య తిరస్కారులకు, అల్లాహ్‌తో పాటు వేరే వారిని పూజించే వారికి ఈ సూరత్ యొక్క అనువాదం మనం వినిపించాలి.

ఈ రోజుల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు. మేము మేము అవిశ్వాసులకు దావత్ ఇవ్వాలి అని అనుకుంటాము, కానీ మాకు ఎక్కువ జ్ఞానం ఏమీ లేదు. ఎలా వారికి దావత్ ఇవ్వాలి? చూడండి, దావత్ యొక్క విషయం కొన్ని సందర్భాలలో, కొన్ని సందర్భాలలో ఇది లోతైన జ్ఞానం, చాలా పటిష్టమైన ఆధారాలతో కూడిన జ్ఞానం కూడా అవసరం ఉంటుంది. మరెన్నో సందర్భాలలో కేవలం ఖుల్ హువల్లాహు అహద్ ఈ మొత్తం సూరా మరియు ఆయతుల్ కుర్సీ, ఆయతుల్ కుర్సీ మీకు గుర్తు ఉంది అంటే దాని అనువాదం చూసుకోండి. ఆయతల్ కుర్సీలో 10 విషయాలు అల్లాహ్ ఏకత్వం గురించి తెలుపబడ్డాయి. మీరు దాని యొక్క అనువాదం కనీసం తెలియజేశారు అంటే ఎంతో ఒక గొప్ప సత్యాన్ని, మీరు సత్కార్యాల్లో చాలా ఉన్నత శిఖరానికి చెందిన ఒక సత్కార్యం గురించి ప్రజలకు బోధించిన వారు అవుతారు.

అయితే ఈ లోకంలో చూడటానికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారు, ఎంతో తమకు తాము మేధావులు అనుకునేవారు నిజ సృష్టికర్త అయిన అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారంటే, ఆ తర్వాత ఆయతు నంబర్ ఐదు చదవండి.

నవూజుబిల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లాహ్. అల్లాహ్‌కు సంతానం ఉంది అని ఎవరైతే అంటున్నారో, ఈ మాట చెప్పడానికి వారి నోరు ఎలా విప్పారు?ఎందుకంటే:

مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ
మా లహుమ్ బిహీ మిన్ ఇల్మ్
వారికి దీని గురించి ఎలాంటి జ్ఞానం లేదు

وَلَا لِآبَائِهِمْ ۚ
వలా లిఆబాఇహిమ్
ఇలాంటి మాట పలికిన వారి తాత ముత్తాతలకు కూడా ఈ జ్ఞానం నిజ జ్ఞానం లేదు.

ఈ మాట ఎంత భయంకరమైనదో తెలుసా? ఎంత ఘోరమైనదో తెలుసా?

كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ
కబురత్ కలిమతన్ తఖ్రుజు మిన్ అఫ్వాహిహిమ్
వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది.

ఖురాన్‌లో వేరే కొన్ని సందర్భాలలో అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు?

تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ
తకాదుస్-సమావాతు యతఫత్తర్న
అల్లాహ్‌కు సంతానం ఉన్నది అని వారు పలికే మాట ఎంత చెండాలమైనది, ఎంత తప్పు మాట, ఎంత దారుణమైనది అంటే భూమ్యాకాశాలు బ్రద్దలైపోతాయి.

ఎందుకంటే ఈ మానవుడు మరియు జిన్నాతులలో షైతానులు తప్ప సర్వ సృష్టి అల్లాహ్ ఏకత్వాన్ని నమ్ముతుంది.

وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ద్, తౌఅన్ వ కర్హా, వ ఇలైహి యుర్జాఊన్
ఆకాశాల్లో, భూమిలో ఉన్న సమస్తము కూడా అల్లాహ్‌కు మాత్రమే వారు ఇస్లాం ముస్లింలుగా ఉన్నారు.

అస్లమ అంటే వారు విధేయులై ఉన్నారు. శిరసావహించి ఉన్నారు. అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మి ఉన్నారు. అల్లాహ్ యొక్క ఏకత్వంలో వారు ఏమాత్రం భాగస్వామి కలగజేయరు. కానీ సర్వ సృష్టిలో అతి ఉత్తముడైన ఈ మానవుడే అల్లాహ్ పట్ల ఎంతటి అబద్ధపు మాట పలుకుతున్నాడో అల్లాహ్ స్వయంగా చెప్పాడు:

إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
ఇన్ యఖూలూన ఇల్లా కదిబా
వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.

అయితే ఇక్కడ ఒక సత్యం మీరు తెలుసుకోండి. ఖురాన్ చదువుతూ ఉంటాము కానీ మనం అర్థం చేసుకో చేసుకుంటూ ఉండము. అందుకొరకే ఎన్నో విషయాలు పై నుండే మనకు దాటిపోతూ ఉంటాయి.

ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో స్వయం వారి వద్ద ఈ షిర్క్ గురించి ఎలాంటి ఆధారం లేదు. వారు చెబుతున్న ఈ మాట ఎలాంటి సత్యంతో కూడినది కాదు. అల్లాహ్‌కు వేరే భాగస్వాములు ఉన్నారు, సంతానం ఉంది అని అనడం ఇది అజ్ఞానంతో, మూర్ఖత్వంతో కూడిన మాట.

అందుకొరకే ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హా బ్ రహిమహుల్లాహ్ యొక్క మనమడు కితాబు తౌహీద్ యొక్క వ్యాఖ్యానం ఏదైతే రాశారో అందులో ఒక మాట ఇది కూడా చెబుతున్నారు ఆరంభంలోనే. – “ఎవరు ఎంత పెద్ద ప్రపంచపు చదువులు చదివినా, అల్లాహ్‌తో పాటు ఇతరులను సాటి కలుపుతున్నాడంటే అతడు అసలైన జ్ఞానానికి దూరం, అజ్ఞానంలో, మూర్ఖత్వంలో పడి ఉన్నాడు.”

కానీ ఇక్కడ వారి ఆ మాట మూర్ఖత్వంతో కూడినది. కానీ వారికి దావత్ ఇచ్చే విషయంలో, సందర్భంలో మనం ప్రతి ఒక్కరితో వారి యొక్క తగిన స్థానానిని, వారి యొక్క ఏ హోదా అంతస్తు ఉందో ఈ లోకంలో వారిని గౌరవిస్తూ, గౌరవిస్తూ అంటే వారితో ఎలా సంభాషించాలి, ఎలా మాట్లాడాలి, దావత్ ఇచ్చే విషయంలో ఎలా మనం వారిని మృదు వైఖరితో, తీపి మాటతో మాట్లాడాలి ఆ విషయాలు కూడా మనం తెలుసుకొని ఉండడం తప్పనిసరి.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)- యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1Ham7KTDLUrhABquy8NoCa

పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి [వీడియో | టెక్స్ట్]

పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి | బులూగుల్ మరాం | హదీసు 1280
https://youtu.be/K3wcOKsHcp8 [ 9 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1280. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:

“అన్యాయానికి దూరంగా ఉండండి ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూత మవుతుంది. ఇంకా పిసినారితనం నుండి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టు తనం) మూలంగానే నాశనమయ్యారు.”

సారాంశం:

ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయం చేసిన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెలుతురు , కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైన వాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్థలకు, కాఠిన్యానికి కారణభూతమవుతుంది, దుష్పరిణామాలకు దారితీస్తుంది.

ఈ ప్రసంగంలో, హదీథ్ నంబర్ 1280 ఆధారంగా ‘జుల్మ్’ (అణచివేత) మరియు ‘షుహ్’ (తీవ్రమైన పిసినారితనం లేదా దురాశ) అనే రెండు వినాశకరమైన పాపాల గురించి వివరించబడింది. ప్రళయదినాన అణచివేత చీకట్లుగా మారుతుందని, మరియు ‘షుహ్’ పూర్వపు జాతులను నాశనం చేసిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సాధారణ పిసినారితనం ‘బుఖుల్’ కు మరియు తీవ్రమైన దురాశ ‘షుహ్’ కు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. ‘షుహ్’ అనేది కేవలం తన వద్ద ఉన్నదాన్ని ఖర్చు చేయకపోవడమే కాక, ఇతరుల సంపదను అక్రమంగా పొందాలనే కోరికను కూడా కలిగి ఉంటుందని, ఇది హత్యలు, పాపాలు మరియు బంధుత్వాలను తెంచడం వంటి ఘోరాలకు దారితీస్తుందని వివరించబడింది. చివరగా, సూరత్ అల్-హష్ర్ లోని ఒక ఆయత్ ను ఉటంకిస్తూ, ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడతారో వారే నిజమైన సాఫల్యం పొందుతారని నొక్కి చెప్పబడింది.

బులూగుల్ మరాం – హదీథ్ నంబర్ 1280.

وَعَنْ جَابِرٍ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اتَّقُوا الظُّلْمَ فَإِنَّ الظُّلْمَ ظُلُمَاتٌ يَوْمَ الْقِيَامَةِ، وَاتَّقُوا الشُّحَّ فَإِنَّهُ أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ
[ఇత్తఖు జుల్మ ఫఇన్న జుల్మ జులుమాతున్ యౌమల్ ఖియామ, వత్తఖుష్షుహా ఫఇన్నహు అహలక మన్ కాన ఖబ్లకుమ్]

హజ్రత్ జాబిర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, జుల్మ్ కీ దూరంగా ఉండండి. ఎందుకంటే జుల్మ్ ప్రళయ దినాన తమస్సుకు, చిమ్మ చీకట్లకు కారణభూతమవుతుంది. ఇంకా షుహ్, పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించిన వారు దీనిని, అంటే పిసినిగొట్టుతనం మూలంగానే నాశనమయ్యారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఏ విషయంలో వినాశనం ఉన్నదో దాని నుండి మనం దూరం కాకపోతే మనమే చాలా ఘోరమైన నష్టంలో పడిపోతాము.

ఈ హదీథ్ లో జుల్మ్ గురించి వచ్చింది. ఇంతకుముందే మనం హదీథ్ నంబర్ 1279 లో దాని వివరాలు తెలుసుకున్నాం. అయితే ఇందులో మరొక విషయం ఏముంది? వత్తఖుష్షుహ్. షుహ్.

షుహ్, ఒక ఒత్తి ఉన్నది ఈ పదం, మరొకటి ఉన్నది బుఖుల్. బుఖుల్ అంటే కంజూసీతనం, పిసినారితనం. చేతిలో డబ్బులు ఉన్నాయి, అల్లాహ్ మార్గంలో, అవసరం ఉన్నవారికి, పేదవారికి దానం చేయకుండా, ఇవ్వకుండా స్వయం తన భార్యాపిల్లలపై, తల్లిదండ్రులపై ఏ మధ్య రకంలో ఖర్చు పెట్టాలో పెట్టకుండా పిసినారితనం వహించడం. ఇదేమిటి? బుఖుల్.

ఇక్కడ హదీథ్ లో వచ్చిన పదం ఏంటి? షుహ్. ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, ఈ బుఖుల్ అనేది ఎప్పుడైతే మనిషిలో మితిమీరిపోతుందో, చివరికి అతడు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు, డబ్బు, ధనం యొక్క పిశాచి ఎంతగా అయ్యాడంటే ఉన్నదానిని ఖర్చు పెట్టకుండా ఆపుకొని ఉంచుకుంటున్నాడు, అంతే కాదు, ఇంకా కావాలి, కావాలి, కావాలి అన్నటువంటి ఈ పెరాశ అనేది అక్రమంగా సంపాదించడంలో కూడా అతన్ని పడవేస్తుంది. ఇంతటి ఘోర స్థితికి ఎదిగిన వారిని అతడు షుహ్ లో పడ్డాడు అని అంటారు.

అర్థమైంది కదా? అయితే బుఖుల్ అనేది ఏదైతే ఉందో పిసినారితనం, అందులో మరింత ఓ నాలుగు అడుగులు ముందుగా ఉండడం దీనిని షుహ్ అంటారు.

మరొక భావం దీని గురించి కొందరు ధర్మవేత్తలు ఏం చెప్పారంటే, షుహ్ అన్నది మనసుతో. అటు లేనిదాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు, అందులో అడ్డమార్గాలు తొక్కవలసి వచ్చినా, పాపం చేయవలసి వచ్చినా ఏ భయం లేకుండా చేసి సంపాదించడం మరియు ఖర్చు చేసే విషయంలో అంటే ప్రాక్టికల్ గా ఖర్చు చేసే విషయంలో బఖీల్, ఆపుకొని ఉంచడం, దీన్ని బుఖుల్, ముందు దాన్ని షుహ్ అని అంటారు.

కానీ ఇక్కడ గమనించండి, ప్రవక్త వారు ఏమంటున్నారు? ఇలాంటి ఈ పిసినారితనాన్ని మీరు వదులుకోండి. ఇలాంటి ఈ పిసినారితనం మీలో రాకుండా జాగ్రత్తపడండి. ఎందుకు? ఇంతకుముందు జాతి వారి వినాశనానికి ఇది కారణమైంది. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.

ఎలా అండి ఇది? ఎలా అంటే, గమనించండి. ఈ రోజుల్లో కూడా మనం కుబేరులను చూస్తున్నాము. మిలియనీర్, బిలియనీర్, కోట్లాధిపతులను కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనిషిలో ఈ పిసినారితనం చోటు చేసుకుంటుందో, ఏం చేస్తాడు? బంధుత్వాలను లెక్క కట్టడు. ఈ విధంగా మాట్లాడతాడు.

ఇస్లాం ధర్మం పేరుతో ఎందరికీ ఎలర్జీగా ఉంది. ఏ మానవత్వం ముందండి అని అంటారు. కానీ ఇలాంటి పిసినారులు మన సమాజంలో ఎంతోమంది కనబడతారు. మానవత్వత్వం ముందు అన్న వాళ్ళు డబ్బు విషయం వచ్చేసరికి బంధుత్వాలను, స్వయం మానవులను మరిచిపోయి దానికే ఎంత ప్రాధాన్యతను ఇస్తారంటే, చివరికి హత్యలు, ఘోరమైన పాపాలు, నేరాలు చేయవలసి వచ్చినా నాలుగు పైసల కొరకు అవన్నీ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఈ విధంగా ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది.

ఈ ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది అంటే ఇహలోకంలో ఇప్పుడు చెప్పిన రీతిలో. ఇది పరలోకంలో కూడా వినాశనం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే డబ్బును, ధనాన్ని, ప్రజలకు అవసరమున్న విషయాలను, వస్తువులను ఆపుకొని స్వయం లాభం పొందుతూ, కొన్ని సందర్భాలలోనైతే పిసినారితనం ఎంతగా ఉంటుందంటే స్వయం కూడా లాభం పొందడు. స్వయం కూడా లాభం పొందకుండా డబ్బు సంపాదించడంలో ఎంత ముందుకు వెళుగుతారంటే వారి వద్ద దొంగతనం, అక్రమ సంపాదన, హత్య చేయడం మరియు మోసంతో డబ్బు కాజేసుకోవడం ఇవన్నీ ఎలాంటి పాపంగా భావించరు. ఇంకా దానిపై బంధుత్వాలను తెంచడం, ఇవన్నీ పాపాలకు గురి అవుతారు. చివరికి ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడా పరలోకంలో అతన్ని నష్టంలో పడవేస్తాయి.

ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు తన శిష్యులతో, తన దగ్గర కూర్చున్న వారితో అడిగారు, “అయ్యుహుమా అషద్ద్, అల్-బుఖుల్ అవిష్-షుహ్?” (ఈ రెండిటిలో ఏది తీవ్రమైనది, బుఖుల్ ఆ లేక షుహ్ ఆ?). నేను ఇంతకుముందే చెప్పాను కదా రెండు పదాలు ఉన్నాయని. అల్-బుఖుల్, దీని యొక్క అసలైన భావం పిసినారితనం. దానిపై మరొకటి షుహ్. ఈ రెండిటిలో చాలా చెడ్డది ఏమిటి? అని అడిగారు.

అయితే అక్కడ ఉన్నవారు విభేదాల్లో పడ్డారు. కొందరు ఇలా అంటుంటే, కొందరు అది అంటున్నారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అన్నారు, “అష్-షుహ్హు అషద్దు మినల్-బుఖుల్” (షుహ్ అనేది బుఖుల్ కంటే తీవ్రమైనది). షుహ్ అన్నది బుఖుల్ కంటే చాలా చెడ్డది. “లిఅన్నష్-షహీహ యషుహ్హు అలా మా ఫీ యదైహి ఫయహ్బిసుహూ, వ యషుహ్హు అలా మా ఫీ ఐదిన్-నాసి హత్తా య’ఖుజహూ. వ అమ్మల్-బఖీలు ఫహువ యబ్ఖలు అలా మా ఫీ యదైహి” (ఎందుకంటే ‘షహీహ్’ (షుహ్ గుణం ఉన్నవాడు) తన చేతిలో ఉన్న దానిపై పిసినారితనం చూపి దాన్ని బంధిస్తాడు, మరియు ప్రజల చేతుల్లో ఉన్న దానిపై కూడా దురాశ పడతాడు, దాన్ని తీసుకునేంత వరకు. అయితే ‘బఖీల్’ (బుఖుల్ గుణం ఉన్నవాడు) కేవలం తన చేతిలో ఉన్న దానిపై మాత్రమే పిసినారితనం చూపిస్తాడు).

షుహ్ ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్నదానిని ఆపేస్తాడు, ఇతరులకు ఇవ్వకుండా. అంతేకాదు, ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని కూడా మంచి మనసుతో చూడడు, ఎప్పుడు నా చేతిలోకి వచ్చి పడుతుందో, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుందో అని. కానీ బఖీల్ కేవలం తన వద్ద ఉన్నదానిని ఇతరులకు ఖర్చు చేయకుండా ఆపుకునేవాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఈ విధంగా దీనిని, ఈ రెండు పదాలను వివరించారు.

అయితే ఖురాన్ సూరతుల్-హష్ర్, 28వ ఖండంలో ఉంది, ఆయత్ నంబర్ తొమ్మిదిని గనక మనం చూస్తే, షుహ్ అన్నది ఎన్నో ఇతర పాపాలకు కారణమవుతుంది అని కూడా తెలుస్తుంది. అందుకొరకే దాని నుండి దూరం ఉన్నవాడే సాఫల్యం పొందుతాడని అల్లాహ్ అక్కడ మనకు తెలియజేస్తున్నాడు.

وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడ్డారో, అట్టివారే సాఫల్యం పొందేవారు.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

విశ్వాసం & విశ్వాస మాధుర్యం [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్
విశ్వాసం & విశ్వాస మాధుర్యం (Emaan & Halawatul Emaan) [34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు) – Speaker : Muhammad Abubaker Baig Omeri (Eluru)
https://youtu.be/nGEEpqhFH9c

విశ్వాసం (ఈమాన్) యొక్క లక్షణాలు, విశ్వాస మాధుర్యాన్ని రుచి చూసేందుకు అవసరమైన మూడు గుణాల గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. విశ్వాసం ఒకసారి హృదయంలో ప్రవేశించాక స్థిరంగా ఉంటుందని, కానీ మంచి పనులు మరియు పాపాలను బట్టి అది హెచ్చుతగ్గులకు లోనవుతుందని సహాబాల ఉదాహరణలతో వివరించబడింది. విశ్వాస మాధుర్యాన్ని రుచి చూడాలంటే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం; కేవలం అల్లాహ్ కొరకే ఒకరినొకరు ప్రేమించడం మరియు ద్వేషించడం; మరియు విశ్వసించిన తర్వాత అవిశ్వాసం వైపు తిరిగి వెళ్లడాన్ని అగ్నిలో పడవేయబడటమంత తీవ్రంగా ద్వేషించడం అనే మూడు లక్షణాలు అవసరమని చెప్పబడింది. హజ్రత్ అబూబక్ర్, ఉమర్, బిలాల్, మరియు హంజలా (రదియల్లాహు అన్హుమ్) వంటి సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు వారి ప్రేమ, త్యాగం మరియు విశ్వాస స్థిరత్వాన్ని తెలియజేస్తాయి.

అల్ హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద, అమ్మా బఅద్. ఫ అవూజు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమ్దిహీ వ నఫ్ఖిహీ వ నఫ్సిహీ, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ
[యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్]
(ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు మీరు ముస్లింలుగా తప్ప మరణించకండి.)

سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ
[సుబ్ హా నక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్]
(ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞానివి, వివేకవంతుడవు.)

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్లిసానీ యఫ్ఖహూ ఖౌలీ]
(ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. మరియు నా కార్యాన్ని నాకు సులభతరం చేయి. మరియు నా నాలుకలోని ముడిని విప్పు, తద్వారా వారు నా మాటను అర్థం చేసుకోగలరు.)

اللهم رب زدني علما
[అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా]
(ఓ అల్లాహ్, ఓ నా ప్రభూ, నా జ్ఞానాన్ని వృద్ధి చేయి).

ప్రియ సోదరులారా, తొలగింప బడిన షైతాన్ యొక్క కీడు నుండి రక్షింపబడుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు అల్లాహ్ తబారక వ తఆలాకే అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచాడు.

వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశముతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, హృదయాల విజేత, జనాబె ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రం సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కోటానుకోట్ల దరూద్‌లూ సలాములూ, శుభాలూ మరియు కారుణ్యాలూ కురిపింపజేయుగాక, ఆమీన్.

సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మూడో సూరా, సూరా ఆలి ఇమ్రాన్ 102వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ
[యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్]
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.

ఓ విశ్వసించినటువంటి ప్రజలారా! సోదర మహాశయులారా, ఎక్కడైతే అల్లాహ్ తబారక వ తఆలా ఈ పదాలను వినియోగిస్తున్నాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ, దాని అర్థము ఓ విశ్వసించినటువంటి ప్రజలారా అని. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, “ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి, ఏ విధంగానైతే ఆయనకు భయపడాల్సినటువంటి హక్కు ఉన్నదో. వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్, మరియు మీరు విశ్వాసులుగా తప్ప, అవిశ్వాసులుగా మీరు మరణించకండి. సోదర మహాశయులారా, ఈ వాక్యంలో ప్రస్తావించబడినటువంటి విషయము విశ్వాసుల గురించి, విశ్వాసం గురించి.

అయితే, విశ్వాసానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, విశ్వాసం ఎప్పుడైతే ఒకరిలో ప్రవేశిస్తుందో, దానిని వారి మనసుల నుంచి తీయటము, అది ఎవరి తరం కానటువంటి పని అయిపోతుంది. అబూ సుఫియాన్‌ను హిరకల్ అనేటటువంటి రాజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు:

قَالَ فَهَلْ يَرْتَدُّ أَحَدٌ مِنْهُمْ سَخْطَةً لِدِينِهِ بَعْدَ أَنْ يَدْخُلَ فِيهِ؟ قُلْتُ لاَ‏.‏ قَالَ وَكَذَلِكَ الإِيمَانُ حِينَ تُخَالِطُ بَشَاشَتُهُ الْقُلُوبَ

ఎవరైతే ఆయనను విశ్వసించారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఇస్లాంను స్వీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అందులో ప్రవేశించిన తర్వాత, అందులో ఉన్నటువంటి వారు ఎవరైనా గాని, వారు వెనక్కు మరలారా? లేకపోతే దాన్ని వదిలివేశారా?

అంటే అబూ సుఫియాన్, ఇస్లాంకు బద్ధశత్రువు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఇంకా ఇస్లాం స్వీకరించనప్పుడు, జవాబు పలుకుతూ అంటున్నాడు, “లా”, వారిలో ఏ ఒక్కరూ కూడా వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడలేదు, వారు ఏ విధంగా కూడా ఇర్తిదాద్‌కు పాల్పడలేదు, ధర్మభ్రష్టతకు పాల్పడలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు హిరకల్ రాజు అంటున్నాడు, “కధాలికల్ ఈమాన్ హీన తుఖాలితు బషాషతుహుల్ ఖులూబ్.” విశ్వాసం అంటే ఇదే, అది ఎప్పుడైతే మనిషి యొక్క హృదయంలో ప్రవేశిస్తుందో, దానిని హృదయంలో ఎలా నాటుకుంటుందంటే, దాన్ని తీయటం ఎవరివల్లా కాదు.

అదే విధంగా, విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే సోదరులారా, విశ్వాసం అన్నటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఒకే స్థాయిలో ఉండదు. కొందరిలో ఉచ్చ స్థాయికి చెంది ఉంటే, మరికొందరిలో అతి తక్కువ స్థాయికి చెందినదై కూడా ఉండవచ్చు. సహాబాల యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, వారిపై ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు చేసినా కూడా, వారిని వారి విశ్వాసం నుంచి ఏ విధంగా ఎవరూ తొలగింపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ సూరా ఇబ్రాహీం, 14వ సూరా, 46వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ
[వ ఖద్ మకరూ మక్రహుమ్ వ ఇందల్లాహి మక్రుహుమ్ వ ఇన్ కాన మక్రుహుమ్ లితజూల మిన్హుల్ జిబాల్]
వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్‌ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు.

అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వారు ఎన్ని కుట్రలు పన్నారంటే, వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈ పర్వతాలను, కొండలను వారి స్థాయి నుంచి, వారి ప్రదేశం నుంచి వారు కదపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ కొండలు, పర్వతాలు అన్నటువంటి విషయాన్ని సహాబాల యొక్క విశ్వాసంతో పోల్చటం జరిగింది. అదే విధంగా అల్లాహ్ తబారక వ తఆలా సూరతుల్ హుజరాత్, 49వ సూరా, మూడో వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

أُولَٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
[ఉలాయికల్లజీనమ్ తహనల్లాహు ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్ మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమ్]
వారే వీరు, వీరి హృదయాలను అల్లాహ్ తబారక వ తఆలా తఖ్వా, భయభక్తుల కొరకు పరీక్షించి ఉంచాడు, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయి.

విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము పెరగటము మరియు తరగటము. అంటే సోదరులారా, విశ్వాసము ఒక్కొక్కసారి మనిషి చేసేటటువంటి ఆచరణకు అది పెరుగుతూ ఉంటుంది. మరి అదే విధంగా, మనిషి చేసేటటువంటి పాప కార్యాలకు గాను విశ్వాసము తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.

అందుకనే, ఖురాన్ గ్రంథంలో ఎన్నోసార్లు, పలుసార్లు అల్లాహ్ తబారక వ తఆలా మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలన చేసుకోవలసిందిగా మనకు సెలవిస్తూ, ఖురాన్‌లో సూరా నిసా, నాలుగవ సూరా, 136వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రస్తావిస్తున్నాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, ఆయన తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం))పై అవతరింపజేసిన గ్రంథాన్నీ, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలాదూరం వెళ్ళిపోయాడు.

ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, ఏ విధంగానైతే అల్లాహ్ తబారక వ తఆలాపై విశ్వసించాలో, ఆ విధంగా విశ్వసించండి. మరియు ఆ గ్రంథంపై విశ్వసించండి ఏదైతే మీ ప్రవక్తపై అవతరింపజేయబడిందో.

కాబట్టి సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్‌లో పలుసార్లు మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా ఈ విధంగా సెలవిస్తున్నాడంటే, మూడో సూరా 102వ వాక్యం ఏ విధంగానైతే ఈ అంశంలో ప్రారంభంలో పఠించడం జరిగిందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో అంటున్నాడు:

“యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్.”

ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి ఏ విధంగానైతే భయపడాలో, మరియు అవిశ్వాసులుగా మీరు మరణించకండి, విశ్వాస స్థితిలోనే మీరు మరణించండి సుమా అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.

తబరానీలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ మాటను ఉల్లేఖించడం జరిగింది:

‏ إِنَّ الإِيمَانَ لَيَخْلَقُ فِي جَوْفِ أَحَدِكُمْ كَمَا يَخْلَقُ الثَّوْبُ فَاسْأَلُوا اللَّهَ تَعَالَى أَنْ يُجَدِّدَ الإِيمَانَ فِي قُلُوبِكُمْ ‏

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ విధంగానైతే మీ ఒంటిపై, మీ శరీరంపై దుస్తులు ఏ విధంగానైతే మాసిపోతూ ఉంటాయో, అదే విధంగా మీ విశ్వాసము కూడా మాసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు దుఆ చేస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, “అన్ యుజద్దిదల్ ఈమాన ఫీ ఖులూబికుమ్,” అల్లాహ్ తబారక వ తఆలా మీ హృదయాలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరింపజేయవలసిందిగా మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు వేడుకోండి అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అల్-జామియాలో సహీ హదీసుగా ధృవీకరించారు.

సహీ ముస్లింలో హదీస్ నెంబర్ 6966లో మనం చూసినట్లయితే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులలో ఒక సహచరుడైనటువంటి, ఒక అగ్రగణ్యుడైనటువంటి సహచరుడు హజ్రత్ హంజలా రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఒక ప్రస్తావన వస్తుంది. ఎవరండీ ఈ హంజలా అంటే? ఆ హంజలాయే ఎవరి గురించైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో, “హంజలా గసీలుల్ మలాయికా” (హంజలాను దైవదూతలు స్నానం చేయించారు). ఏ రోజైతే హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి వివాహము జరిగిందో, అదే రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించినటువంటి యుద్ధ ప్రకటనకు జవాబిస్తూ ఆయన అందులో పాల్గొని మరణించగా, షహాదత్ పొందగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “మీరు హంజలాకు శవస్నానము చేయించవలసిన అవసరము లేదు, గుసుల్ స్నానం చేయించిన అవసరము లేదు ఎందుకంటే హంజలా గసీలుల్ మలాయికా, ఎందుకంటే హంజలాకు దైవదూతలే స్వయానా గుసుల్ ఇచ్చి ఉన్నారు అని.”

అటువంటి హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ అయినటువంటి అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసినప్పుడు,

لَقِيَنِي أَبُو بَكْرٍ فَقَالَ كَيْفَ أَنْتَ يَا حَنْظَلَةُ
అబూబక్ర్ రదియల్లాహు తలా అన్హు వారు నాతో కలిశారు, కలిసిన తర్వాత ఆయన నాతో అడిగారు, “ఓ హంజలా, నీవు ఎలా ఉన్నావు?” అని.

قَالَ قُلْتُ نَافَقَ حَنْظَلَةُ
అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, నేను హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు గారితో అన్నాను, “హంజలా కపటవిశ్వాసి అయిపోయాడు” అని.

قَالَ سُبْحَانَ اللَّهِ مَا تَقُولُ
“ఓ హంజలా, ఏమంటున్నావ్? అల్లాహ్ తలా యొక్క పవిత్రతను నేను కొనియాడుతున్నాను. నీవు మునాఫిక్ అయిపోవటం ఏమిటి?” అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు,

قُلْتُ نَكُونُ عِنْدَ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم يُذَكِّرُنَا بِالنَّارِ وَالْجَنَّةِ حَتَّى كَأَنَّا رَأْىَ عَيْنٍ فَإِذَا خَرَجْنَا مِنْ عِنْدِ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم عَافَسْنَا الأَزْوَاجَ وَالأَوْلاَدَ وَالضَّيْعَاتِ فَنَسِينَا كَثِيرًا

మనము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూర్చుని ఉండగా, ఆయన సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన మనకు పరలోకం గురించి హితబోధ చేస్తున్న సమయంలో, స్వర్గము మరియు నరకము గురించి ఆయన హితబోధ చేస్తున్న సమయంలో, మా కళ్ళ నుంచి కన్నీళ్లు కారేవి, మా హృదయాలలో మా విశ్వాసము ఉవ్వెళ్లూరుతూ ఉండేటటువంటిది. కానీ, ఎప్పుడైతే మేము అక్కడి నుంచి కదిలి మా ఇళ్లకు వచ్చేసేటటువంటి వాళ్ళమో, మా యొక్క ఇళ్లలో ప్రవేశించేటటువంటి వాళ్ళం, మా భార్య, పిల్లలు, ఇంటివారు ఇందులో పడిపోయే, ఫనసీనా కసీరా (మేము చాలా వరకు మర్చిపోయాము). ఆయన చెప్పినటువంటి మాటల్లో అత్యధికంగా వాటిని మేము మర్చిపోయేటటువంటి వారము. కాబట్టి, మా ఈ పరిస్థితిని గమనించి, నేను అనుకుంటున్నాను నేను మునాఫిక్‌నై పోయాను అని అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.

అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారిని తీసుకుని, ఇలా అయితే మరి మా పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకొచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ హంజలా, ఏమయ్యింది?” అని చెప్పేసి అంటే, అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు, “నాఫఖ హంజలా యా రసూలల్లాహ్,” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హంజలా మునాఫిక్ అయిపోయాడు, కపటవిశ్వాసి అయిపోయాడు అని. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అదేమిటి? అలా ఎందుకు జరిగింది?” అంటే, హంజలా రదియల్లాహు తలా అన్హు వారు ఆ జరిగినదంతా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి జవాబు పలుకుతూ అంటున్నారు:

وَالَّذِي نَفْسِي بِيَدِهِ إِنْ لَوْ تَدُومُونَ عَلَى مَا تَكُونُونَ عِنْدِي وَفِي الذِّكْرِ لَصَافَحَتْكُمُ الْمَلاَئِكَةُ عَلَى فُرُشِكُمْ وَفِي طُرُقِكُمْ وَلَكِنْ يَا حَنْظَلَةُ سَاعَةً وَسَاعَةً

“ఆ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క సాక్షి, ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో, నేను అల్లాహ్ తబారక వ తఆలాపై ప్రమాణం చేస్తూ అంటున్నాను, మీరు ఏ విధంగానైతే నా సమక్షంలో ఉన్నప్పుడు మీ విశ్వాసం ఏ విధంగా ఉందో, అదే విధంగా గనక ఎల్లప్పుడూ మీరు ఉండగలిగితే, దైవదూతలు మీరు నడిచేటటువంటి మార్గాలలోనూ, మీరు పరుండేటటువంటి మీ పడకల పైనను వారు వచ్చి మీతో కరచాలనం చేయాలనుకునేటటువంటి వారు. కానీ ఓ హంజలా, ఈ విశ్వాసము యొక్క స్థితి ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుందంటే, అది ఒక్కొక్కసారి ఉవ్వెళ్లూరుతూ ఉంటుంది ఎప్పుడైతే దాని గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటుందో.”

కాబట్టి ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసం అన్నటువంటిది ఎప్పుడూ నిలకడగా ఉండదు, అది ఒక్కొక్కసారి, ఎప్పుడైతే మనం విశ్వాసం గురించి ప్రస్తావించుకుంటామో ఆ సమయాల్లో మన యొక్క విశ్వాసము ఉచ్చ స్థాయికి చెందుకుంటుంది, మరి అదే విధంగా ఒక్కొక్కసారి ఆ విశ్వాసము మనము చేసేటటువంటి పాప కార్యాల వల్ల కూడా అది తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.

విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించటం. విశ్వాసం యొక్క మాధుర్యం ఏమిటా అని మీరు ఆలోచించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:

عَنِ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم يَقُولُ ‏ “‏ ذَاقَ طَعْمَ الإِيمَانِ مَنْ رَضِيَ بِاللَّهِ رَبًّا وَبِالإِسْلاَمِ دِينًا وَبِمُحَمَّدٍ رَسُولاً ‏”
(సహీ అల్-ముస్లిం, కితాబుల్ ఈమాన్, హదీస్ నెంబర్ 34).

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఆ వ్యక్తి విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలడు, ఎవరైతే అల్లాహ్‌ను తన దైవంగా, ఇస్లామును తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా అంగీకరించి నడుచుకున్నటువంటి వాడు, తన ఆచరణాత్మకంగా తన జీవితాన్ని గడుపుకున్నటువంటి వాడు కచ్చితంగా విశ్వాసం యొక్క మాధుర్యాన్ని, విశ్వాసం యొక్క రుచిని అతను ఆస్వాదించగలడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.

సోదర మహాశయులారా, ఎలాగైతే మనము తినేటటువంటి రుచిని ఆస్వాదించగలుగుతున్నామో, ఏదైనా ఒక తియ్యటి పదార్థాన్ని తిని మనం దాని యొక్క తియ్యదనాన్ని రుచి చూడగలుగుతున్నాము. మరి అదే విధంగా, మనము సుగంధ ద్రవ్యాలను కూడా వాసన ద్వారా మనము వాటిని ఆస్వాదించగలుగుతున్నామో, వాటి యొక్క రుచిని మనం ఆస్వాదించగలుగుతున్నాము. మరి అదే విధంగా, ఒక తియ్యటి పలుకులను విని వింటూ కూడా మనము ఆ పలుకులలో ఉన్నటువంటి రుచిని కూడా ఆస్వాదించగలుగుతున్నామో, అదే విధంగా విశ్వాసానికి కూడా ఒక లక్షణం ఉంది, అదేమిటంటే వాస్తవానికి మనం విశ్వాసులమైతే, వాస్తవానికి మనలో ఈ లక్షణాలు ఉంటే, ఏదైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారో, మనం కచ్చితంగా, తప్పకుండా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని కూడా రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో సెలవిస్తున్నారు.

అయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలి అని అనుకుంటే, మనలో ఏ లక్షణాలు ఉంటే మనం విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము? ఏ స్థాయికి మన విశ్వాసము చేరుకుంటే మనం విశ్వాసము యొక్క తియ్యదనాన్ని, మాధుర్యాన్ని రుచి చూడగలము? అనేటటువంటి ప్రశ్న మీ మనసులలో కలుగుతుంది కాబట్టి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:

عَنْ أَنَسٍ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ ثَلاَثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاَوَةَ الإِيمَانِ

మూడు లక్షణాలు ఉన్నాయి, మూడు లక్షణాలు, మూడు గుణాలు ఉన్నాయి. ఒకవేళ మీలో గనుక ఈ మూడు లక్షణాలను మీరు పెంపొందించుకోగలిగితే, ఒకవేళ మీలో ఈ మూడు లక్షణాలు గనక ఉంటే, మీరు కచ్చితంగా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఆ మూడు లక్షణాలు ఏమిటి?

ఒకటి, ఆ మూడు లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే:

أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا
[అన్ యకూనల్లాహు వ రసూలుహూ అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా]
అల్లాహ్ మరియు ప్రవక్త వారి వద్ద అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి అనేది మొదటి లక్షణం.

ఇక, రెండవ లక్షణానికి వచ్చినట్లయితే:

وَأَنْ يُحِبَّ الْمَرْءَ لاَ يُحِبُّهُ إِلاَّ لِلَّهِ
[వ అన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహూ ఇల్లా లిల్లాహ్]

మరియు ఒక వ్యక్తి తన తోటివారితో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు మాత్రమే ప్రేమించగలిగినప్పుడు, అల్లాహ్ తబారక వ తఆలా కోసము ప్రేమించటము, అల్లాహ్ తబారక వ తఆలా కోసమే ద్వేషించటం అన్నటువంటిది రెండవ లక్షణంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు.

మూడవ లక్షణం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ అంటున్నారు:

وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ ‏”
[వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నార్]
ఎలాగైతే విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటము అతనికి అంత అయిష్టకరంగా ఉండాలి, ఎలాగైతే ఒక వ్యక్తిని అగ్నిగుండంలో పడవేయటం ఎంత అయిష్టంగా ఉంటుందో.

(ఈ హదీసు సహీ అల్-బుఖారీ, కితాబుల్ ఈమాన్, బాబు హలావతిల్ ఈమాన్‌లో దీనిని ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గారు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ద్వారా ఈ విధంగా పేర్కొనటం జరిగింది).

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలియజేసినటువంటి మూడు లక్షణాలు గనక మనలో మనం పెంపొందించుకోగలిగితే, కచ్చితంగా మనము విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అందులో, మొదటి లక్షణాన్ని మనం గమనించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ మరియు ప్రవక్త అతని వద్ద అత్యధికంగా అందరికంటే ఎక్కువగా ప్రియతములై ఉండాలి అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటి లక్షణంగా పేర్కొన్నారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, తొమ్మిదవ సూరా, సూరా తౌబా, 24వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمْ الْفَاسِقِينَ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్‌ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్‌ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్‌ అవిధేయులకు సన్మార్గం చూపడు.

అల్లాహ్ ఈ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: వారితో ఇలా అను, మీ తాతలు, తండ్రులు, కుమారులు, మీ భార్యాపిల్లలు మరియు మీరు సంపాదించేటటువంటి సంపద, మీరు ఎక్కడ నష్టపోతారనుకునేటటువంటి మీ వ్యాపారాలు, అదే విధంగా మీరు ఎంతగానో ఇష్టపడేటటువంటి మీ స్వగృహాలు, ఇవన్నీ కూడా మీకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గములో పోరాటం కన్నా ఇవన్నీ కూడా మీకు అత్యధికమైనప్పుడు, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైనటువంటి జాతికి సన్మార్గముని చూపడు అని అల్లాహ్ తబారక వ తఆలా ఈ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు.

అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాసులు అల్లాహ్ తబారక వ తఆలాను ఎంతగా ప్రేమిస్తారన్నటువంటి విషయాన్ని సెలవిస్తూ సూరా అల్-బఖరా, రెండవ సూరా, 165వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ
కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు.

ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్‌కు సాటి కల్పించుకుని, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తున్నారు. కానీ విశ్వాసులు అత్యధికంగా అల్లాహ్ తబారక వ తఆలాను ప్రేమిస్తారు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ తఆలాను ఒక విశ్వాసి అయినటువంటి వాడు అత్యధికంగా ప్రేమిస్తాడు.

అదే విధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:

عَنْ أَنَسٍ قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لاَ يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ ‏”

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “మీలో ఏ వ్యక్తి కూడా అప్పటివరకు విశ్వాసి కాలేరు, ఎప్పటివరకైతే నన్ను మీరు అత్యధికంగా ప్రేమించరో, మీ ఆలుబిడ్డల కన్నా, మీ బంధుమిత్రుల కన్నా, సమస్త మానవాళి కన్నా అత్యధికంగా మీరు ఎప్పటివరకైతే నేను మీకు ప్రియతముణ్ణి కానో, అప్పటివరకు మీరు విశ్వాసులు కారు” అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. (సహీ బుఖారీ, హదీస్ నెంబర్ 15).

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసి ఉన్నప్పుడు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ హదీసు విన్న తర్వాత అంటున్నటువంటి మాట ఏమిటంటే, “యా రసూలల్లాహ్, మీరు అన్నట్లుగానే నేను మిమ్మల్ని సమస్త మానవాళి కన్నా, బంధుమిత్రుల కన్నా, తల్లిదండ్రుల కన్నా అత్యధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా మనసు, నా ఆత్మ, నా ప్రాణం కన్నా అధికంగా కాదు” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.

فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏”‏ لاَ وَالَّذِي نَفْسِي بِيَدِهِ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْكَ مِنْ نَفْسِكَ ‏”‏‏.‏ فَقَالَ لَهُ عُمَرُ فَإِنَّهُ الآنَ وَاللَّهِ لأَنْتَ أَحَبُّ إِلَىَّ مِنْ نَفْسِي‏.‏ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏”‏ الآنَ يَا عُمَرُ ‏”‏‏.‏

అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఉమర్, నీవు ఎప్పటివరకైతే నీ ప్రాణం కంటే అధికంగా నన్ను మీరు ప్రేమించినటువంటి వారు కారో, అప్పటివరకు కూడా మీరు పూర్తి విశ్వాసి కాలేరు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే కూడా అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “అల్ ఆన యా ఉమర్,” ఓ ఉమర్ రదియల్లాహు తలా అన్హు, ఇప్పుడు మీరు పూర్తిగా విశ్వాసి అయ్యారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది.

చూశారా సోదర మహాశయులారా, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాటని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అన్నిటికంటే ముందు ఒక విశ్వాసి అత్యధికంగా అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమను అత్యధికంగా కలిగి ఉండాలి. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇతరుల కంటే అత్యధికంగా ప్రియతములు కానంత వరకు ఏ వ్యక్తి కూడా విశ్వాసి కాలేడు, మరి అదే విధంగా ఏ వ్యక్తి కూడా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడలేడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.

సోదర మహాశయులారా, తబూక్ యుద్ధంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు తమ యొక్క దానాలను తమ స్తోమత మేరకు అర్పించవలసిందిగా కోరినప్పుడు, ఎంతోమంది సహాబాలు తమ తమ స్తోమత మేరకు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో తమ తమ దానమును అర్పిస్తున్నటువంటి సమయంలో హజ్రత్ అబూబక్ర్ అస్స్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తమ ఇంటిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఊడ్చి, ఆయన ముందు సమర్పించుకుంటూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తీసుకొచ్చి పెట్టగా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ అబూబక్ర్, నీ ఇంటి వారి కొరకు నీ ఇంటిలో ఏమైనా వదిలి పెట్టావా?” అంటే, హజ్రత్ అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “నేను అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్తను నా ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను” అని హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు జవాబు పలికారు.

సోదరీ సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన యొక్క ప్రేమ, సహచరుల యొక్క జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే, ఇటువంటి సంఘటనలు మనకు వేల కొద్దీ దొరుకుతాయి సోదర మహాశయులారా. అదే విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే మూడు లక్షణాలు ఉంటాయో వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు. అందులో మొదటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాము, అదేమిటంటే అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్త పట్ల ప్రేమ, మిగతా వారందరికన్నా కూడా ఎక్కువగా ప్రియతములై ఉండటము.

అయితే సోదర మహాశయులారా, మనం అల్లాహ్ తబారక వ తఆలాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నామని నోటితో ఎన్నిసార్లు మనం ప్రకటించినా కూడా, అది కేవలం నోటి మాటే అవుతుంది గానీ, అప్పటివరకు అది నిజం కాదు, ఎప్పటివరకైతే వారు చూపించినటువంటి మార్గంలో మనం నడవమో. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో, మూడవ సూరా, 31వ వాక్యంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు:

قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”

ఇలా అను, మీకు నిజంగా అల్లాహ్ తబారక వ తఆలా పట్ల ప్రేమే ఉన్నట్లయితే, మీరు నాకు విధేయత చూపవలసిందిగా వారికి ఆజ్ఞాపించు. అల్లాహ్ తబారక వ తఆలా వారి పాపాలను క్షమిస్తాడు మరియు నిస్సందేహంగా అల్లాహ్ తబారక వ తఆలా ఎంతో క్షమాశీలి మరియు అనంత కరుణామయుడు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి, నిజంగానే మనం అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళమే అయితే, అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అత్యధికంగా ప్రేమించేటటువంటి వాళ్ళమే అయితే, ఆయన చూపినటువంటి మార్గములో మనం నడుస్తూ మన జీవితాన్ని గడుపుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది.

సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్ ఆధారంగా, అందులో మొట్టమొదటి విషయము అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిగతా వారందరికన్నా కూడా ఎక్కువ ప్రియతములై ఉండటము.

ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు, ఒక వ్యక్తి తనతో ఉన్నటువంటి వారిని కూడా అల్లాహ్ కొరకు ప్రేమించేటటువంటి వారై ఉండాలి. అదే విధంగా, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ప్రేమిస్తున్నాము. అదే విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులతో మనం ప్రేమిస్తున్నాము. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే సమస్త మానవాళి విశ్వాసులతో కూడా మనం ప్రేమిస్తున్నాము. ఇదే విషయాన్ని దైవం ప్రస్తావిస్తూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు:

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ مَنْ أَحَبَّ لِلَّهِ وَأَبْغَضَ لِلَّهِ وَأَعْطَى لِلَّهِ وَمَنَعَ لِلَّهِ فَقَدِ اسْتَكْمَلَ الإِيمَانَ

ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా కొరకు ప్రేమిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ద్వేషిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ప్రసాదిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే నిషేధిస్తారో, వీరు వాస్తవానికి తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి వారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట అబూ దావూద్‌లో ఈ విధంగా ప్రస్తావించబడింది.

కాబట్టి దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, సహాబాలు ఏ విధంగా అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ఆయన యొక్క ప్రవక్తను ప్రేమించేటటువంటి వారు మరియు వారి యొక్క ప్రేమ, వారి యొక్క ద్వేషము అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ యొక్క మార్గంలోనే ఉండేటటువంటిది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు.

సోదర మహాశయులారా, ఇక మూడో విషయానికి వస్తే, మూడో లక్షణానికి వస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, “మరి విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది వారికి ఎంత అయిష్టకరమైనదై ఉండాలంటే ఎలాగైతే వారిని అగ్నిగుండంలో పడవేయటం అయిష్టకరమై ఉంటుందో ఆ విధంగానే అవిశ్వాసానికి పాల్పడటం వారికి అయిష్టకరమై ఉంటుంది” అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.

ఈ విషయంలో హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారిని చూసుకున్నట్లయితే, హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఎప్పుడైతే ఆయన విశ్వసించారో, ఆయన విశ్వసించిన తర్వాత మలమల మాడేటటువంటి మండుటెండల్లో ఆయనను ఈడ్చి, రాళ్లమయమైనటువంటి ప్రదేశంపై ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి, ఆయన యొక్క గుండెలపై ఒక పెద్ద బండరాయిని పెట్టి, దేవుడు ఒక్కడే అన్నటువంటి విశ్వాసాన్ని నీవు విడనాడుతావా? ఇప్పుడైనా ఒప్పుకుంటావా దేవుడు ఒక్కడు కాదు అని అన్నప్పుడు, అప్పటికీ కూడా ఆయన హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు “అల్లాహు అహద్, అల్లాహు అహద్, అల్లాహు ఒక్కడే, అల్లాహు ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరూ లేరు, నేను ఇస్లాంను వదిలిపెట్టను, నా విశ్వాసాన్ని విడనాడను” అని హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఏ విధంగానైతే నిలబడిపోయారో విశ్వాసంపై, ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.

అదే విధంగా హజ్రత్ సుమయ్య రదియల్లాహు తలా అన్హా, అదే విధంగా హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అర్ద్ రదియల్లాహు తలా అన్హు, వీరు చేసుకున్నటువంటి త్యాగాలు మరియు వీరు ఏ విధంగా ఇస్లాంపై నిలకడగా ఉన్నారో, ఎలాగైతే వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం వారికి ఎంత అయిష్టకరంగా ఉండిందంటే, ఎలాగైతే వారికి జీవించి ఉండటంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే ఎక్కువగా వారు అయిష్టకరంగా భావించేటటువంటి వారు.

కాబట్టి సోదర మహాశయులారా, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసము యొక్క లక్షణాలలో ఒక లక్షణము, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడటము. అయితే ఈ విశ్వాసము యొక్క మాధుర్యాన్ని అప్పుడే మనం ఆస్వాదించగలము, అప్పుడే మనం రుచి చూడగలము, ఎప్పుడైతే మనలో ఈ మూడు లక్షణాలు కూడా ఉంటాయో, ఈ మూడు గుణాలు కూడా మనలో ఉంటాయో. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే ఈ మూడు లక్షణాలు ఉంటాయో, ఈ మూడు గుణాలు ఉంటాయో, వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకోగలరు, విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకున్నవారు విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.

అందులో మొట్టమొదటిది, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి. ఇక రెండవ విషయము, ఎవరిని ప్రేమించినా కూడా అల్లాహ్ కొరకే ప్రేమించేటటువంటి వారై ఉండాలి, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. మరి అదే విధంగా మూడో విషయాన్ని, విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది ఎంత అయిష్టకరంగా ఉండాలంటే, ఎలాగైతే నిజ జీవితంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే బాధగా, అగ్నిగుండంలో పడవేయటం కంటే అయిష్టమైనదిగా ఉండాలి అన్నటువంటి ఈ మూడు లక్షణాల్ని కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలావతుల్ ఈమాన్, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని గురించి తెలియజేస్తూ పలికినటువంటి పలుకులు ఈరోజు మనం తెలియజేసుకున్నాము.

కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలాతో దుఆ ఏమనగా, ఏ విధంగానైతే ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకున్నామో విశ్వాసము గురించి, విశ్వాసము యొక్క లక్షణాల గురించి, విశ్వాసము యొక్క రుచిని ఆస్వాదించడం గురించి, అల్లాహ్ తబారక వ తఆలా మనకు వీటన్నిటిపై ఆచరించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనలో విశ్వాసాన్ని పెంపొందించుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్.

رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
[రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అన్తస్సమీయుల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అన్తత్తవ్వాబుర్రహీమ్]

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=17476

నమాజ్ లో సుత్రా నిబంధన [వీడియో & టెక్స్ట్]

నమాజ్ చదివేటప్పుడు మనిషి తన ముందు ఏదైనా అడ్డంకిని పెట్టుకోవడాన్ని సుత్రా (తెర) అంటారు

నమాజ్ లో సుత్రా నిబంధన
https://youtu.be/jZgcgvh3Aho [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నమాజు చేసేటప్పుడు ప్రార్థన చేసే వ్యక్తికి ముందు ఉంచే అడ్డంకి అయిన ‘సుత్రా’ యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. సుత్రా అంటే ఏమిటి, దాని ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ (విధానం)లో దాని స్థానం మరియు దాని సరైన పరిమాణం గురించి చర్చించబడింది. వ్యక్తిగత మరియు సామూహిక నమాజులో సుత్రాను ఎలా ఉపయోగించాలో కూడా వివరించబడింది; సామూహిక ప్రార్థనలో, ఇమామ్ యొక్క సుత్రా జమాఅత్ మొత్తానికి సరిపోతుంది. నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి నడిచి వెళ్లడం యొక్క తీవ్రమైన పాపం గురించి మరియు ప్రార్థన చేసే వ్యక్తికి వారిని ఆపడానికి ఉన్న హక్కు గురించి కూడా ప్రసంగంలో హెచ్చరించబడింది. ఇరుకైన ప్రదేశాలలో ప్రార్థన చేసే సందర్భంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం నుండి ఉదాహరణలతో పాటు, కొన్ని మినహాయింపులు కూడా చర్చించబడ్డాయి.

أَلْحَمْدُ لِلّٰهِ
(అల్ హందులిల్లాహ్)
సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللّٰهِ
(వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్)
మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. (ఆమీన్)

సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

ఈనాటి ప్రసంగంలో మనం సుత్రా గురించి తెలుసుకుందాం.

సుత్రా అంటే ఏమిటి? ఒక వ్యక్తి నమాజు ఆచరిస్తున్నప్పుడు ఖిబ్లా వైపు నిలబడి నమాజు ఆచరిస్తున్న ప్రదేశంలో ఎంత దూరం వరకు అయితే అతను సజ్దా చేయగలుగుతాడో, అంత దూరపు ప్రదేశానికి కొంచెం ముందర ఒక వస్తువుని ఉంచుకోవటాన్ని సుత్రా అని అంటారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనా విధానాలలో ఇది కూడా ఒక సున్నతు, ఒక బోధనా విధానము. నమాజు ఒక వ్యక్తి ఒక విశాలమైన ప్రదేశంలో ఆచరించుకుంటూ ఉంటే అతను అతని ముందర ఖిబ్లా దిశలో ఒక వస్తువుని ఏదైనా, అది కర్ర కావచ్చు లేదా కుర్చీ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ఒక వస్తువుని అక్కడ ఉంచుకోవాలి.

అది ఒక రకంగా అటూ ఇటూ ఎవరైనా నడిచే వారికి ఒక సూచన లాంటిది. ఇంతటి ప్రదేశం వరకు నేను నమాజు చేస్తున్న ప్రదేశము, దీని పక్క నుంచి మీరు వెళ్ళండి, దీని లోపల అయితే నేను నమాజు చేస్తున్న ప్రదేశము అనేటట్టుగా ఒక సూచన ఉంటుంది. చూసే వ్యక్తి కూడా ఆ, ఆ ప్రదేశం వరకు అతను నమాజ్ చేసుకుంటున్నాడు అని దాని పక్క నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీనిని సుత్రా అంటారు.

మరి ఆ సుత్రా ఎంతటి వస్తువు ఉండాలి అంటే హదీసు గ్రంథాలలో తెలుపబడిన విషయం, పల్లకి వెనుక భాగంలో ఉన్న వస్తువు అంత అయితే సరిపోతుంది అని తెలుపబడింది. ధార్మిక పండితులు దాన్ని వివరిస్తూ ఏమన్నారంటే, ఒక మూర కంటే కొంచెం చిన్నదైనా సరే సరిపోతుంది అని చెప్పారు. మూర కంటే తక్కువ ఎత్తు గల వస్తువు అయినా సరే దానిని ఉంచుకొని మనిషి నమాజ్ ఆచరించుకోవాలి.

మరి సుత్రా పెట్టుకోవటం ఇది సున్నత్ అని కూడా ధార్మిక పండితులు వివరించి ఉన్నారు.

సుత్రా ఉంచుకున్న విషయాలలో మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే అతను ప్రత్యేకంగా అతని కోసము సుత్రా ఉంచుకోవాలి. ఒకవేళ సామూహికంగా మనిషి నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఇమామ్ ముందర సుత్రా ఉంచుకుంటే సరిపోతుంది, వెనుకల నిలబడిన ప్రతి వ్యక్తి ముందర సుత్రా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇమామ్ ముందర ఉంచుకోబడిన సుత్రాయే అతని వెనుక, ఆయన వెనుక నిలబడిన ముక్తదీలందరికీ కూడా సరిపోతుంది అని కూడా ధార్మిక పండితులు తెలియజేశారు.

అలాగే నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతని ముందర వేరే వ్యక్తి, పురుషుడైనా, మహిళ అయినా పడుకొని ఉంటే స్థలం లేని సందర్భంలో వారి వెనుక కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. మస్జిదులో మనం చూస్తూ ఉంటాం. కొందరు వ్యక్తులు కూర్చొని ఉంటారు. వారి వెనుక మనము కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. అలాగే ఇరుకైన గది ఉంటే అక్కడ సతీమణి ఎవరైనా కూర్చొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా, మిగిలిన కొద్ది స్థలంలోనే వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే ఆచరించుకోవచ్చు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట తహజ్జుద్ నమాజు కోసం లేచి నిలబడినప్పుడు, నేను ఖిబ్లా దిశలో పడుకొని ఉంటాను, మిగిలిన ప్రదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి నమాజ్ ఆచరించుకునేవారు. ఒక్కొక్కసారి అనుకోకుండా నా కాలు ఆయన సజ్దా చేసే స్థితికి వెళ్ళిపోతే ఆయన సజ్దా చేసేటప్పుడు అలా తట్టి నాకు సైగ చేస్తే నేను వెంటనే కాలు ముడుచుకునే దానిని అని కూడా తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఖిబ్లా దిశలో పడుకొని ఉంటే నమాజ్ ఆచరించుకునేవారు, పూర్తి నమాజ్ అయిపోయాక వితర్ నమాజ్ ఆచరించుకునే సమయానికి ఆమెకు కూడా లేపి వారు ఇద్దరూ కలిసి చివరిలో వితర్ నమాజు కలిసి ఆచరించుకునేవారు అని తెలియజేశారు. కాబట్టి పురుషుడు గాని మహిళ గాని ఖిబ్లా దిశలో పడుకొని ఉన్నా మిగిలిన ప్రదేశంలో వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే కూడా ఆచరించుకోవటానికి అనుమతి ఉంది.

ఇక్కడ రెండు విషయాలు మనము బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతను సజ్దా చేసే ప్రదేశం ఎంత దూరం వరకు అయితే ఉంటుందో, ఆ లోపు నుంచి దాటుకునే ప్రయత్నం చేయరాదు. అది ఒక పాపంగా పరిగణించబడుతుంది. దాని నష్టం ఎంత పెద్దది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి 40 రోజులు లేదా 40 వారాలు లేదా 40 నెలలు లేదా 40 సంవత్సరాలు ఒంటి కాలు మీద నిలబడిపోవడానికైనా సరే సిద్ధపడిపోతాడు గానీ ఆ పాపం చేయటానికి సిద్ధపడడు. అంత కఠినమైనది ఆ తప్పు అని చెప్పారు. కాబట్టి నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి ముందర నుంచి, అతను సజ్దా చేసే ప్రదేశం ఎంతవరకు అయితే ఉంటుందో, దాని లోపలి నుంచి దాటుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయరాదు. అది ఒక కఠినమైన తప్పుగా మనము తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి.

రెండో విషయం ఏమిటంటే, తెలియక, చూడకుండా ఎవరైనా ఒక వ్యక్తి అక్కడి నుంచి దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, నమాజ్ ఆచరించే వ్యక్తికి ఆ వ్యక్తిని చేతితో అడ్డుకునే అనుమతి ఉంది. అతను చేతితో అడ్డుకోవాలి. అతను మూర్ఖంగా ముందుకే సాగటానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటించి అతన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి, వదలకూడదు అని కూడా తెలియజేయడం జరిగింది.

ఏది ఏమైనప్పటికిని మనిషి ఒక గోడ వెనుక గాని లేదా ఏదైనా వస్తువు వెనుక గాని సుత్రాగా ఏర్పరచుకొని నమాజ్ ఆచరించుకోవాలి. ఇది ఒక విధానము, ఒక సున్నత్ విధానము మనకు తెలుపబడింది. అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధానాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

క్రింది విషయం “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లాహ్)”  అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)

సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి:

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు – గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]

ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్‌ చేయకండి.”

“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్‌ ఉంటాడు.” [40]

ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్‌ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్‌ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]

కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని  స్తంభం దగ్గర నమాజ్‌ చేయటానికి ప్రయత్నించేవారు. [42]

అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్‌ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్‌ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్‌ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్‌ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్‌ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;

“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]

ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్‌ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్‌ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్‌ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]

తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్‌ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]

ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్‌ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్‌ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్‌ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్‌ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్‌ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]

హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :

[38] బుఖారీ, అహ్మద్‌

[39] బుఖారీ, ముస్లిం

[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.

[41] అబూదావూద్‌, జవాయెద్‌ బజ్జార్‌ – 54 పేజీ, హాకిమ్‌ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.

[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అయినా, ఒంటరిగా నమాజ్‌ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్‌ ఇమామ్‌ అహ్నద్‌”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్‌ అహ్మద్‌ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.

నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అహ్మద్‌ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.

నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్‌ మాసంలో వెళ్లాను.

అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.

[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా

[44][45] బుఖారీ, అహ్మద్‌

[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్‌

[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.

[48] ముస్లిం, అబూదావూద్‌

[49] నసాయి, అహ్మద్‌ – సహీ పరంపరతో

[50] బుఖారీ,ముస్లిం, అబూ యాలా – 3/107 – తఫ్సీర్ అల్‌ మక్తబతుల్‌ ఇస్లామీ 

[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.

[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.

[53] అహ్మద్‌, దారెఖు,త్నీ  తబ్రానీ – సహీ పరంపరతో.

ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.

ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్‌: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.

ఇలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్‌ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!

54, బుఖారీ, ముస్లిం.

55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah)
https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.

ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.

మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا
ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.

అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.

అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.

అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ
అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.

అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:

الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.

ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.

ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.

అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.

అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.

మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.

ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.

అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:

قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో

అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:

قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.

అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.

అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
(హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్)
మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.

అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:

يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ
(యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్)
ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.

ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.

అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.

ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.

ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.

అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.

ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.

మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

అఖూలు ఖౌలీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16739

ఇతర లింకులు:

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ [తప్పక వినండి] [ఆడియో & టెక్స్ట్]

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ
https://youtu.be/Pj0-SewzPaA [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తిని చూసి, అతనిని చాలా ఆకలితో ఉండి ఒకటి లేదా రెండు ఖర్జూరాలు మాత్రమే తిన్న వ్యక్తితో పోల్చారు. ఎలాగైతే ఆ కొద్దిపాటి ఆహారం ఆకలిని తీర్చదో, అలాగే అసంపూర్ణమైన రుకూ మరియు సజ్దాలతో చేసే నమాజ్ ఆత్మకు పోషణ ఇవ్వదని వివరించారు. నమాజ్ అనేది విశ్వాసుల హృదయాలకు ఆహారం లాంటిదని, దానిని సంపూర్ణంగా, ఉత్తమ రీతిలో చేయడం ద్వారానే ఆత్మకు, మనస్సుకు కావలసినంత పోషణ లభిస్తుందని తెలిపారు. సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తి తన ఆత్మను పస్తులు ఉంచినట్లేనని, దానివల్ల ఆత్మ అనారోగ్యానికి గురై చివరకు “చనిపోతుందని” (ఆధ్యాత్మికంగా నిర్జీవమవుతుందని) హెచ్చరించారు. ఈ “ఆత్మ మరణం” అనేది భౌతిక మరణం కాదని, అల్లాహ్ స్మరణ, ఆరాధనల నుండి దూరం కావడం అని స్పష్టం చేశారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక వ్యక్తిని చూశారు, నమాజ్ చేస్తున్నది. కానీ ఆ వ్యక్తి ఎలా నమాజ్ చేస్తున్నాడు?

لَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(లా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
అతను రుకూ మరియు సజ్దాలను సరిగ్గా చేయడం లేదు.

يَنْقُرُ صَلَاتَهُ كَمَا يَنْقُرُ الْغُرَابُ
(యన్ఖురు సలాతహు కమా యన్ఖురుల్ గురాబ్)
కాకి ఎలా చుంచు కొడుతుందో విత్తనం ఎత్తుకోవడానికి, ఆ విధంగా అతను నమాజ్ చేస్తున్నాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

إِنَّ مَثَلَ الَّذِي يُصَلِّي وَلَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(ఇన్న మసలల్లదీ యుసల్లీ వలా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
ఎవరైతే ఈ విధంగా నమాజ్ చేస్తున్నారో, అందులో రుకూ కూడా సరిగ్గా చేయడం లేదు, సజ్దా కూడా సరిగ్గా చేయడం లేదు,

كَمَثَلِ الَّذِي يَأْكُلُ التَّمْرَةَ وَالتَّمْرَتَيْنِ
(క మసలిల్లదీ య’కులుత్తమ్రత వత్తమ్రతైన్)
అతని ఉదాహరణ, దృష్టాంతం ఎలాంటిదంటే, చాలా ఆకలిగా ఉండి కేవలం ఒక్క ఖర్జూరము లేదా రెండు ఖర్జూరపు ముక్కలు తిన్న వాని మాదిరిగా,

لَا يُغْنِيَانِ عَنْهُ شَيْئًا
(లా యుగ్నియాని అన్హు షైఆ)
ఆ ఒక్క రెండు ఖర్జూరపు ముక్కలు అతని యొక్క ఆకలిని తీర్చవు.

فَأَتِمُّوا الرُّكُوعَ وَالسُّجُودَ
(ఫఅతిమ్ముర్రుకూఅ వస్సుజూద్)
మీరు నమాజులలో రుకూ సజ్దాలు పూర్తిగా చెయ్యండి, సంపూర్ణంగా చెయ్యండి, సరిగ్గా చెయ్యండి.

ఇమామ్ ముందిరి రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను హసన్ కోవకు చెందినది అని చెప్పారు. అయితే ఇమామ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ చెప్పారు, ఈ హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఉదాహరణ, దృష్టాంతం తెలియజేశారో అది చాలా గొప్పది, చాలా ఉత్తమ రీతిలో తెలియజేశారు.

ఎలాగైతే ఆకలి ఉన్న వానికి ఒక ఖర్జూరపు, రెండు ఖర్జూరపు ముక్కలు అతని ఆకలిని తీర్చలేవో, ఇలా రుకూ సజ్దాలు సరిగ్గా చేయకుండా నమాజును తొందరపాటుతో చేసేవాడు వాస్తవానికి అతడు నమాజ్ ఏదైతే విశ్వాసుల హృదయాలకు ఆహారంగా ఉందో, ఆ ఆహారం అతడు తీసుకోని వాడవుతాడు.

వాస్తవానికి నమాజ్ అల్లాహ్ యొక్క ధిక్ర్, అల్లాహ్ తో వేడుకోలు, అల్లాహ్ సాన్నిధ్యానికి చేరవేసే, అల్లాహ్ కు చాలా దగ్గరగా చేసే సత్కార్యాల్లో గొప్ప సత్కార్యం. ఇక ఎవరైతే ఈ నమాజ్ సంపూర్ణంగా, మంచి ఉత్తమ రీతిలో చేస్తారో అతడే తన ఆత్మకు, తన మనస్సుకు కావలసినంత ఆహారం ఇచ్చిన వాడవుతాడు. మరి ఎవరైతే నమాజ్ సరియైన రీతిలో చెయ్యడో, టక్కు టిక్కు మని, ఎక్స్ప్రెస్ నమాజ్, ఇలా చూసి అలా చూసేసరికి అల్లాహు అక్బర్ అని మొదలవుతుంది, అస్సలాము అలైకుం అని పూర్తయిపోతుంది, ఇలాంటి నమాజ్ ద్వారా అతడు తన హృదయ, తన మనస్సుకు కావలసిన, తన ఆత్మకు కావలసిన ఆహారాన్ని సరిగా ఇవ్వలేదు. ఇక ఎలాగైతే మనిషికి కావలసినంత ఆహారం దొరకకుంటే చనిపోతాడో, అనారోగ్యానికి గురవుతాడో అలాగే ఎప్పుడైతే హృదయానికి, ఆత్మకు, మనస్సుకు దాని ఆహారం దొరకదో అది కూడా అనారోగ్యానికి గురి అవుతుంది మరియు అది కూడా చనిపోతుంది. మనిషి యొక్క చావు అంత నష్టమైనది కాదు, ఆత్మ చనిపోయిందంటే అది చాలా పెద్ద నష్టం.

ఏమైనా అర్థమైందా అండీ మీకు ఇప్పుడు చెప్పిన మాటలతో?

ప్రశ్న మరియు జవాబు

ఆత్మ చనిపోవడం అంటే, ఇది ఒక ఉదాహరణగా. ఆత్మ చనిపోవడం అంటే ఆత్మకు కావలసిన ఆహారం ఇవ్వకపోవడం. ప్రాపంచిక పరంగా బ్రతికి ఉన్నప్పటికీ, అల్లాహ్ యొక్క ధిక్ర్ తో, అల్లాహ్ యొక్క ఆరాధనతో, అల్లాహ్ యొక్క స్మరణతో, ఖురాన్ యొక్క తిలావత్ తో దానికి ఏ ఆహారం అవసరం ఉంటుందో, అది దానికి చేరనీయకపోవడం. ఇక్కడ ఆత్మ చనిపోవడం అంటే మనం ఫిజికల్ గా, లేదా కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ పరంగా ఏదైతే మాటలు మాట్లాడతారో ఇతని యొక్క మెదడు చనిపోయింది, ఆ మైండ్ డెత్ అని, ఆత్మ డెత్, ఇలాంటి విషయం ఇక్కడ కాదు. ఇక్కడ చనిపోవడం అంటే, “అరే ఏందిరా, నువ్వు జీవితం, ఏదైనా జీవితమా? నీదే బ్రతుకు, ఏదైనా బ్రతుకా? చనిపోయిన శవం కంటే అధ్వానం రా నువ్వు!” ఇలా మనం ఎప్పుడు అంటాము? ఆ మనిషి బ్రతికి కూడా సరియైన పనులు చేయకుంటే అంటాము కదా, ఆ విధంగా. ఇన్షా అల్లాహ్ మాట అర్థమైందని భావిస్తున్నాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=15701

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా? [వీడియో & టెక్స్ట్]

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా?
https://youtu.be/-wurwxOMX1A [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేసే సరైన పద్ధతి గురించి వివరించబడింది. సజ్దా సమయంలో ఏడు శరీర భాగాలు నేలను తాకాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఆ ఏడు భాగాలు ఏవో స్పష్టంగా చెప్పబడింది. పురుషులు మరియు స్త్రీల సజ్దా పద్ధతిలో ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇద్దరికీ ఒకే విధానం వర్తిస్తుందని నొక్కి చెప్పబడింది. ఇస్లామిక్ సజ్దాకు మరియు ఇతర సంప్రదాయాలలో కనిపించే సాష్టాంగ నమస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది, ముఖ్యంగా భంగిమ మరియు ఉద్దేశ్యం పరంగా. చివరగా, సజ్దాలో సరైన భంగిమను, అంటే అవయవాలను ఎలా ఉంచాలో దృశ్య సహాయంతో వివరించడం జరిగింది.

ప్రశ్న : సజ్దా చేసినప్పుడు ఎన్ని బాడీ పార్ట్స్ టచ్ అవ్వాలి ? పురుషుల సజ్దా, స్త్రీల సజ్దా ఒకటేనా? అలాగే సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం అనేది ఒకటేనా?

చూడండి, ఆ సజ్దాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీస్, బుఖారీలో ఉంది:

أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ
[ఉమిర్తు అన్ అస్జుదా అలా సబ’అతి ఆ’దా]
ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది.

ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది. ఆ ఏడింటిలో ముక్కు మరియు నొసటి కలిసి ఒకటి, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల వేళ్ళు భూమికి తాకి ఉండడం, ఈ ఏడు అంగములు భూమికి తాకి ఉండాలి. కావాలని, తెలిసి, ఉద్దేశపూర్వకంగా వీటిలో ఏ ఒక్కటి భూమికి తాకకున్నా, మన యొక్క నమాజ్ నెరవేరదు.

అయితే, ఈ సజ్దా యొక్క పద్ధతి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ఒకటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలు సజ్దా చేసినప్పుడు ఇలా ముడుచుకొని చేయాలి అని, పురుషులు చేసినప్పుడు ఇలాగ వెడల్పు చేయాలి అని వేరు వేరు చెప్పలేదు. అందరికీ ఒకే పద్ధతి నేర్పారు.

ఇక మీ ప్రశ్నలో రెండవ అంశం ఏదైతే ఉందో, సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం రెండూ ఒకటేనా? సజ్దా అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా? కావాలంటే దీనికి సంబంధించి ఇంతకుముందు మనం నమాజ్ యొక్క పద్ధతి అని ఏదైతే చూపించామో, అందులో కూడా వివరణ మీరు చూసి ఉండవచ్చును. ఆ ప్రకారంగా మనం సజ్దా చేయాలి. అది సజ్దా, సజ్దాలో ఏడు అంగములు స్త్రీలైనా, పురుషులైనా భూమికి తాకించాలి.

కానీ సాష్టాంగ నమస్కారం అన్నది ఏదైతే ఉందో, ఒకవేళ ఉద్దేశంగా, ఉద్దేశం ఏది, సాష్టాంగం, ఇక్కడ అష్టాంగం అని అంటున్నారా? సా అని తీసుకున్నారైతే ఏడు అని వస్తుందా? అష్ట అని ఎనిమిదిని కూడా అంటారు. అయితే ఈ ఎనిమిది అవయవాలు భూమికి తాకాలి, ఆ ఉద్దేశ పరంగా చెప్పడం జరిగిందా?

ఒకసారి యోగాలోని కొన్ని విషయాలు ఒక వ్యక్తి చూపిస్తూ, సాష్టాంగ నమస్కారం అని చూపించాడు. అందులో ఏం చేశాడు? పడుకున్నాడు. ముఖము, కడుపు ఇది మొత్తం భూమికి తాకి ఉండి, ఈ విధంగా చేతులు ఇలా ముందుకు చేసి, ఇలా అందులో అతను చూపిస్తున్నాడు. ఒకవేళ అతను అలా చూపిస్తున్నాడంటే మరి ఇది సరైన పద్ధతి కాదు. ఇస్లాం ఏదైతే చూపుతుందో, దాని ప్రకారంగా ఒకవేళ మనం చూసుకుంటే ఇది సరైన విషయం కాదు. అందుకొరకు నేను చెప్పేది ఏమిటి? మనం ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి అర్థం కావడానికి తెలుగులో, సంస్కృతంలో, వేరే భాషలో వచ్చిన ఏదైనా పదం వాడుతున్నప్పటికీ, ఇస్లామీయ ఇస్తిలాహాత్, ఇస్లామీయ పదాలను మనం తప్పకుండా వాడాలి, తప్పకుండా అర్థం చేసుకోవాలి మరియు వాటినే పలుకుతూ ఉండడం చాలా మంచి విషయం.

సజ్దా చేసే సరైన విధానం

ఇక్కడ సంక్షిప్తంగా మీకు సజ్దా విషయం చూపించడం జరుగుతుంది, గమనించండి. సజ్దా చేయు విధానంలో, అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలోకి వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలి. నొసటి, ముక్కు, చూస్తున్నారు కదా ఇక్కడ? ఇక్కడ గమనిస్తున్నారా? ఆ తర్వాత రెండు అరచేతులు. ఆ తర్వాత రెండు మోకాళ్ళు. ఆ తర్వాత రెండు పాదముల వేళ్ళు, ఎలా ఉన్నాయో ఇక్కడ గమనిస్తున్నారు కదా? ఇందులో,

سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى
[సుబ్ హా న రబ్బియల్ ఆ’లా]
మహోన్నతుడైన నా ప్రభువు పరమ పవిత్రుడు

అని చదవాలి అని, ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి.

సజ్దా చేసే సరైన విధానం

ఆ తర్వాత ఇక్కడ గమనించండి. సజ్దాలో ఈ క్రింది విషయాల్ని గమనించాలి. తొడలను పిక్కల నుండి వేరుగా ఉంచాలి, గమనిస్తున్నారు కదా? మోచేతులను ప్రక్కల నుండి వేరుగా ఉంచాలి. కడుపు తొడలకు తాకకుండా ఉండాలి, ఇక్కడ. ఇంకా మోచేతులు భూమికి తాకకుండా లేపి ఉంచాలి. చేతులు, చేతుల వ్రేళ్ళు మరియు కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లా దిశలో ఉండాలి. ఇది సజ్దా యొక్క వివరణ ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు సజ్దా చేయండి.

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు | ధర్మపరమైన నిషేధాలు – 35 [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు
https://youtu.be/RCMU6hao5aE [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ప్రధాన అంశం అల్లాహ్ పట్ల సద్భావన (హుస్న్ అజ్-జన్) కలిగి ఉండటం మరియు దురభిప్రాయం (సూ అజ్-జన్) కలిగి ఉండకుండా ఉండటం. అల్లాహ్ తన దాసుడు తన గురించి ఎలా భావిస్తాడో అలానే అతనితో వ్యవహరిస్తాడని వక్త నొక్కిచెప్పారు. అల్లాహ్ పట్ల చెడుగా భావించడం విశ్వాసుల లక్షణం కాదని, అది ఘోరమైన పాపమని పేర్కొన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు చేసిన ఉపదేశాన్ని ఉల్లేఖించారు, ప్రతి ఒక్కరూ అల్లాహ్ పట్ల మంచి అభిప్రాయంతోనే మరణించాలని చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు ఇమామ్ మావుర్దీ వంటి పండితుల అభిప్రాయాలను కూడా ఉటంకిస్తూ, అల్లాహ్ పట్ల దురభిప్రాయం కలిగి ఉండటం ఎంత పెద్ద పాపమో మరియు అది మార్గభ్రష్టత్వానికి ఎలా దారితీస్తుందో వివరించారు.

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు

35వ విషయం. అల్లాహ్ పట్ల سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), చెడు తలంపు కలిగి ఉండకు. మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో, అల్లాహ్ అతని ఆ తలంపు ప్రకారమే అతనికి తోడుగా ఉంటాడు. విషయం అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా అల్లాహ్ విషయంలో చెడు తలంపు అనేది ఉండకూడదు, అల్లాహ్ నన్ను కరుణించడు కావచ్చు, ఏ నా పని ఇది కాదు నేను ఎప్పటినుండి దుఆ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఈ విధంగా ప్రజలు అల్లాహ్ విషయంలో చెడు తలంపులు కలిగి ఉంటారు.

ఈ చెడు తలంపు కలిగి ఉండడం, سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), అల్లాహ్ గురించి ఇలా చెడుగా ఆలోచించడం విశ్వాసుల గుణం ఎంత మాత్రం కాదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చివరి ఉపదేశం

జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి కంటే ముందు మూడు రోజులు ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు స్వయంగా నేను విన్నాను అని అంటున్నారు. గమనించండి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు ఏం ఉపదేశించారు?

لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللَّهِ عَزَّ وَجَلَّ
(లా యమూతన్న అహదుకుమ్ ఇల్లా వహువ యుహ్సినుజ్-జన్న బిల్లాహి అజ్జ వజల్)
మీలో ఎవరూ అల్లాహ్ అజ్జ వజల్ పట్ల సద్భావన కలిగి ఉన్న స్థితిలో తప్ప మరణించవద్దు (ముస్లిం 2877).

మీలో ఎవరు కూడా, మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి. మరణ సమయంలో అల్లాహ్ విషయంలో చాలా మంచి తలంపు ఉండాలి. దీనికి భిన్నంగా అల్లాహ్ క్షమించడేమో అన్నటువంటి చెడు తలంపును ఎంత మాత్రం ఉండకూడదు.

చెడు తలంపు ఘోరమైన పాపం

ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, అల్లాహ్ పట్ల చెడు తలంపు విశ్వాసుల గుణం కాదు. అల్లాహ్ పట్ల చెడు తలంపు ఘోర పాపాల్లో ఒక పాపం.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) చెప్పారు:

أَعْظَمُ الذُّنُوبِ عِنْدَ اللَّهِ إِسَاءَةُ الظَّنِّ بِهِ
(అఅజముజ్-జునూబి ఇందల్లాహి ఇసాఅతుజ్-జన్ని బిహి)
ఘోరమైన పాపాల్లో ఒక పాపం అల్లాహ్ వద్ద ఏమిటంటే అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండడం.

ఇమామ్ మావుర్దీ (రహిమహుల్లాహ్) చెప్పారు:

سُوءُ الظَّنِّ هُوَ عَدَمُ الثِّقَةِ بِمَنْ هُوَ لَهَا أَهْلٌ، فَإِنْ كَانَ بِالْخَالِقِ كَانَ شَكًّا يَؤُولُ إِلَى ضَلَالٍ
సూ అజ్-జన్ (చెడు తలంపు) అంటే నమ్మకానికి అర్హుడైన వానిపై నమ్మకం లేకపోవడం. ఒకవేళ అది సృష్టికర్త (అల్లాహ్) పట్ల అయితే, అది మార్గభ్రష్టత్వానికి దారితీసే సందేహంగా మారుతుంది

సూ అజ్-జన్, చెడు తలంపు అంటే ఏంటి? ఒక వ్యక్తి దేనికి అర్హుడు కాడో, అతడు అలాంటి వాడు అని తప్పుగా భావించడం. ఇక ఈ తలంపు చెడు, ఈ చెడు తలంపు అల్లాహ్ విషయంలో ఉంది అంటే అతడు ఒక రకమైన సందేహానికి, అనుమానానికి గురి అయి, అతడు మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నాడు.

అందుకొరకు అల్లాహు తఆలా ఖురాన్లో అనేక సందర్భాలలో, సూరత్ ఫుస్సిలత్, దీని మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నంబర్ 22, 23లో, అలాగే సూరతుల్ ఫత్హ్ ఆయత్ నంబర్ 6, ఆయత్ నంబర్ 12 వీటి గురించి చాలా నష్టాలు తెలపడం జరిగింది. నేను చెప్పిన ఆ ఆయతులు మీరు చదవండి మరియు వాటి ద్వారా సరియైన జ్ఞానం అర్ధించే ప్రయత్నం చేయండి.

41:22 وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ

“మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.”

41:23 وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ

“మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు.”

48:6 وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا

అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.

48:12 بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا

అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు?
https://youtu.be/XPzalQiVVY4 [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బహుళ వివాహాల గురించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. మొత్తం 11 మంది భార్యలు ఉన్నారని, వారిలో ఇద్దరు ఆయన జీవితకాలంలోనే మరణించారని, ఆయన మరణించే సమయానికి తొమ్మిది మంది ఉన్నారని వక్త స్పష్టం చేశారు. ఈ వివాహాలు అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుమతితో జరిగాయని, దీనికి సూరతుల్ అహ్‌జాబ్‌లో ప్రమాణం ఉందని వివరించారు. ఈ వివాహాల వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన వివరించారు: స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయడం, వైవాహిక జీవితంలోనూ ఆయన ఒక ఉత్తమ ఆదర్శంగా నిలవడం, వివిధ వంశాలు మరియు వర్గాల మధ్య సంబంధాలను బలపరచడం, మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శత్రువుల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరించే తీరును తెలియజేయడం వంటివి ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొత్తం భార్యలు 11. అయితే తమ జీవితంలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో తొమ్మిది భార్యలు వారి వద్ద ఉన్నారు.

అయితే, ప్రవక్తకు నలుగురి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకునే అటువంటి అనుమతి, అర్హత స్వయంగా నిజ సృష్టికర్త అయిన మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రసాదించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లిళ్లు చేసుకున్నారు. దీని యొక్క వివరణ సూరతుల్ అహ్‌జాబ్‌లో చూడవచ్చును. సూరా నెంబర్ 33, మరి ఇందులో ప్రత్యేకంగా ఎక్కడైతే అల్లాహ్ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరి కంటే ఎక్కువగా భార్యలు చేసుకునే అటువంటి అనుమతి ఇచ్చాడో, ఆయతు నెంబర్ 28 నుండి సుమారు సుమారు 35 వరకు మరియు ఆ తర్వాత ఒక రెండు ఆయతులు కూడా మీరు చూశారంటే దీనికి సంబంధించిన ఎన్నో లాభాలు మనకు ఏర్పడతాయి.

సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం పురుషులకే ప్రవక్త కారు, స్త్రీలకు కూడాను. అయితే, ప్రవక్త వారి ఆదర్శ జీవితం పురుషులకు ఎంత అవసరమో, అలాగే స్త్రీలకు కూడా అవసరం. ఒకరి కంటే, నలుగురి కంటే ఎక్కువ భార్యల ద్వారా ఇలా ప్రవక్త వారి ఆదర్శవంతమైన జీవితాన్ని తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మంచి సహకారం ఏర్పడుతుంది.

రెండవ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన అందరి కొరకు ఒక ఉత్తమ ఆదర్శం అని ఇదే సూరతుల్ అహ్‌జాబ్‌లో కూడా అల్లాహ్ మనకు తెలియజేశాడు. అయితే, ఈ ఆదర్శం కేవలం మస్జిద్ వరకు, బయట బజారు వరకు, యుద్ధాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ లైఫ్‌లో కూడా. అంతేకాదు, ఇంకా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మానవుల్లో, సమాజంలో విద్యా రీత్యా గానీ, బుద్ధి జ్ఞానాల పరంగా గానీ, విషయాలు నేర్చుకుని ఆచరించే పరంగా గానీ, సమాజంలో ప్రజలు ఏ తారతమ్యాలు ఏర్పాటు చేసుకుంటారో దాని పరంగా గానీ వేరువేరుగా ఉంటారు గనుక, వేరువేరు వంశాలకు సంబంధించిన భార్యలు ప్రవక్త దగ్గర ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని అందరికీ తెలియజేయడానికి.

అంతే కాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా వచ్చారు. సర్వ మానవాళిలో ప్రత్యేకంగా ఆ కాలంలో బహుదైవారాధకుల రూపంలో, యూదుల రూపంలో, క్రైస్తవుల రూపంలో ఎందరో అక్కడ నాయకులు ఉన్నారు. అయితే, ఆ నాయకుల యొక్క బిడ్డలు సైతం ఎప్పుడైతే యుద్ధంలో బానిసరాళ్లుగా వచ్చారో, వారికి వారి హోదా, అంతస్తు ప్రకారంగా వారి యొక్క తండ్రులకు ఇస్లాం యొక్క గొప్పతనం తెలిసిరావాలి, ‘నా బిడ్డలు బానిసరాళ్లు అయ్యారు’ అన్నటువంటి అవమానంతో ఇస్లాం పట్ల మరింత వారి యొక్క హృదయాలలో ఏ చెడు చేసుకోకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి బిడ్డలను వివాహం చేసుకున్నారంటే, ఇస్లాం యొక్క గొప్ప నాయకుల వద్ద నా బిడ్డలు ఒక మహారాణిగా ఉన్నారు అన్నటువంటి సంతోషంతో వారు కూడా ఇస్లాంకు మరింత దగ్గరగా అయ్యారు.

ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉర్దూ తెలిసిన వారు మౌలానా సయ్యద్ సులేమాన్ మన్సూర్‌పురి రహ్మతుల్లాహి అలైహి వారి ‘రహ్మతున్ లిల్ ఆలమీన్’ పుస్తకంలో దీని యొక్క వివరాలను కూడా ఇన్షా అల్లాహ్ చూడగలుగుతారు. ఈ సమాధానం సరిపోతుందని ఆశిస్తున్నాను.

ఇతరములు: 

మద్రాస్ ప్రసంగాలు – ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు
అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వీ
https://teluguislam.net/2021/12/01/madras-prasangalu/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473