
నమాజ్ చదివేటప్పుడు మనిషి తన ముందు ఏదైనా అడ్డంకిని పెట్టుకోవడాన్ని సుత్రా (తెర) అంటారు
[8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7
సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు – గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]
ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్ చేయకండి.”
“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్ ఉంటాడు.” [40]
ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]
కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని స్తంభం దగ్గర నమాజ్ చేయటానికి ప్రయత్నించేవారు. [42]
అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;
“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]
ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]
తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]
ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]
హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :
[38] బుఖారీ, అహ్మద్
[39] బుఖారీ, ముస్లిం
[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.
[41] అబూదావూద్, జవాయెద్ బజ్జార్ – 54 పేజీ, హాకిమ్ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.
[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్ అయినా, ఒంటరిగా నమాజ్ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్ ఇమామ్ అహ్నద్”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్ అహ్మద్ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.
నేను చెప్పేదేమిటంటే – ఇమామ్ అహ్మద్ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.
నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్ మాసంలో వెళ్లాను.
అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.
[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా
[44][45] బుఖారీ, అహ్మద్
[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్
[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.
[48] ముస్లిం, అబూదావూద్
[49] నసాయి, అహ్మద్ – సహీ పరంపరతో
[50] బుఖారీ,ముస్లిం, అబూ యాలా – 3/107 – తఫ్సీర్ అల్ మక్తబతుల్ ఇస్లామీ
[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.
[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.
[53] అహ్మద్, దారెఖు,త్నీ తబ్రానీ – సహీ పరంపరతో.
ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.
ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.
ఇలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!
54, బుఖారీ, ముస్లిం.
55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.
ఇది “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)
You must be logged in to post a comment.