అనుచర సమాజం (ఉమ్మత్)పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హక్కులు | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/rights-of-the-prophet-on-ummah
[PDF [31 పేజీలు]

ఖుత్బా లోని ముఖ్యాంశాలు: 

తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు: 

  • 1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం. 
  • 2) తగిన విధంగా గౌరవించడం, 
  • 3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం. 
  • 4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం. 
  • 5) విధేయత చూపడం. 
  • 6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం. 
  • 7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం, 
  • 8) అత్యధికంగా దరూద్ పఠించడం. 

గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం. 

(1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు తన అనుచర సమాజంపై వున్న మొట్టమొదటి హక్కు ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అల్లాహ్ దాసుడిగా మరియు ఆఖరి ప్రవక్తగా విశ్వసించడం. ఈ విషయాన్నే ప్రతి ముస్లిం ‘అల్లాహ్ తప్ప మరొక నిజమైన ఆరాధ్యుడెవ్వడూ లేడు మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన దాసులు మరియు ప్రవక్త’ అని సాక్ష్యమిస్తూ స్వీకరిస్తాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“కాబట్టి మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, మేము అవతరింపజేసిన జ్యోతి (ఖురాను)ని విశ్వసించండి. మీరు చేసే ప్రతి పనినీ అల్లాహ్ కనిపెట్టుకుని ఉన్నాడు” (తగాబున్ : 8) 

అలాగే, ఇలా కూడా సెలవిచ్చాడు : 

“(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు – ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. కనుక అల్లాహు విశ్వసించండి. సందేశహరుడు, నిరక్షరాసి అయిన ఆయన ప్రవక్తను గూడా విశ్వసించండి – ఆ ప్రవక్త అల్లాహ్ ను, ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతణ్ణి అనుసరించండి. తద్వారా మీరు సన్మార్గం పొందుతారు”. (ఆరాఫ్ : 158) 

కనుక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దౌత్యాన్ని విశ్వసించి, ఆయన తెచ్చిన ధర్మాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం తప్పనిసరి. దీని పైనే ప్రతి వ్యక్తి సాఫల్యత, ముక్తి ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో విషయమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనను చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి మరియు తనను చూడకుండా విశ్వసించిన వారికి ఏడు సార్లు శుభవార్తను వినిపించారు. 

దీని గురించి అబూ ఉమామ (రదియల్లాహు అన్హు), దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు: “నన్ను చూసి విశ్వసించిన వారికి శుభవార్త వుంది. అలాగే నన్ను చూడకుండా విశ్వసించిన వారికి ఏడు సార్లు శుభవార్త వుంది.” (అస్సహీహ లిల్ అల్ బానీ : 1241) 

ఇక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)నూ, ఆయన షరీయత్తు (ధర్మ శాస్త్రం)నూ విశ్వసించని వ్యక్తి నిశ్చయంగా నరకవాసి. 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు – “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆయన (అల్లాహ్) సాక్షిగా! ఈ అనుచర సమాజపు వ్యక్తి యూదుడైనా, క్రైస్తవుడైనా నా గురించి విని, తదుపరి నాకివ్వబడిన షరీయత్తును విశ్వసించకుండా చనిపోతే అతను ఖచ్చితంగా నరకవాసుల్లో ఒకడవుతాడు.” (ముస్లిం: 153) 

ఇక్కడ తెలియాల్సిన మరో విషయం ఏమిటంటే – ప్రియతమ దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మేము అల్లాహ్ దాసులు అని ఎందుకంటామంటే – స్వయానా అల్లాహ్ యే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తన దాసుడు అని ఖరారు చేశాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“తన దాసుణ్ని రాత్రికి రాత్రే మస్జిద్ హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకు పోయిన అల్లాహ్ పరిశుద్దుడు” (బనీ ఇస్రాయీల్ : 1) 

స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా తన గురించి ఇలాగే సెలవిచ్చారు: 

“నేనొక అల్లాహ్ దాసుణ్ణి. కనుక మీరు కూడా నన్ను అల్లాహ్ దాసులు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారీ) 

కనుక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ ఇచ్చిన స్థాయి మరియు స్వయానా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన గురించి చెప్పుకున్న స్థాయినే మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ‘అల్లాహ్ దాసులు’ అని నమ్మినప్పుడే ఆయన మరియు అల్లాహల మధ్య గల తేడా బహిర్గతమవుతుంది. తద్వారా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను శ్లాఘించడంలో మితిమీరి ఆయనను అల్లాహ్ స్థాయికి చేర్చే వారిని వ్యతిరేకించినట్లు కూడా అవుతుంది. 

(2) తగిన విధంగా గౌరవించడం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ ఉమ్మత్ పై గల రెండవ హక్కు ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తగు విధంగా ఆదరించాలి మరియు హృదయ పూర్వకంగా గౌరవించాలి. అందుకే ఆయన – (సల్లల్లాహు అలైహి వ సల్లం) బ్రతికున్నప్పుడు సహాబాలకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పేరు పెట్టి పిలవడం నుండి, ఆయన సమక్షంలో బిగ్గరగా మాట్లాడుకోవడం గురించి గట్టిగా వారించడం జరిగింది మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తగు విధంగా గౌరవించాలని గట్టిగా తాకీదు చేయబడింది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“మీరు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పిలుపును, మీలో ఒండొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి” (నూర్: 63) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

“ఓ విశ్వాసులారా! మీ కంఠ స్వరాలను ప్రవక్త కంఠ స్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకొనే విధంగా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో బిగ్గరగా మాట్లాడకండి. దీని వల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమై పోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు” (హుజురాత్ : 2) 

ఈ ఆయత్ అవతరించిన సందర్భాన్ని గురించి అబ్దుల్లా బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు: బనూ తమీమ్ వర్గానికి చెందిన ఒక సమూహము ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు విచ్చేసినప్పుడు, అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)  దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో – మీరు ఖాఖ బిన్ మాబద్ (రదియల్లాహు అన్హు) ను వీరికి అమీర్ (నాయకుడు)గా నియమించండని విన్నవించుకోగా, ఉమర్ (రదియల్లాహు అన్హు)  – వద్దు, మీరు అక్రా బిన్ హాబిస్ (రదియల్లాహు అన్హు) ను అమీర్ గా నియమిస్తే బాగుంటుందని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నవించుకున్నారు. దీనిపై, అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)  మాట్లాడుతూ – మీరెప్పుడూ నన్ను వ్యతిరేకిస్తూనే వుంటారు అని అన్నారు. ఉమర్ (రదియల్లాహు అన్హు)  జవాబిస్తూ – నా ఉద్దేశ్యం మిమ్మల్ని వ్యతిరేకించడం కాదు అని అన్నారు. తదుపరి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఇద్దరి కంఠస్వరాలు పెరిగాయి. ఈ సందర్భంలోనే అల్లాహ్ “ఓ విశ్వాసులారా! మీ కంఠ స్వరాలను ప్రవక్త కంఠ స్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి….” అన్న ఆయత్ ను అవతరింపజేశాడు. 

ఇబ్నె జుబైర్ (రదియల్లాహు అన్హు) కథనం – ఈ ఆయత్ అవతరించిన తర్వాత ఉమర్ (రదియల్లాహు అన్హు)  దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో ఎంత తగ్గు స్వరంలో మాట్లాడే వారంటే, స్వయానా దైవ ప్రవక్తే (ఆయన మాటలు వినబడని కారణంగా) ఆయనను తిరిగి అడిగి తెలుసుకునే వారు. (బుఖారీ : 4845, 4847) 

సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) గొంతు సహజ సిద్ధంగా హెచ్చు స్వరంతో వుండేది. దీని గురించి అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు. ఈ ఆయతు (హుజురాత్ : 2) అవతరించిన తర్వాత ఆయన (సాబిత్ బిన్ ఖైస్) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమక్షంలో రావడం మానేశారు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఆయనను గూర్చి దర్యాప్తు చేయగా ఒక వ్యక్తి – ఓ దైవ ప్రవక్తా! మీరనుమతిస్తే నేను వెళ్ళి అతన్ని గూర్చి తెలుసుకొని వస్తాను అని అన్నాడు. (సహీహ్ ముస్లిం లోని ఉల్లేఖనంలో సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు)  వివరాలను తెలుసుకొస్తానని వెళ్లిన వ్యక్తి సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు)  అని, ఆయన సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) కు పొరుగువారు అని వుంది). తదుపరి ఆ వ్యక్తి సాబిత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు)  వద్దకు వచ్చి చూస్తే, ఆయన తన ఇంట్లో తలవంచుకుని (బాధపడుతూ అయోమయంలో) కూర్చుని వున్నారు. ఆ వ్యక్తి ఆయనతో – మీకేమైంది? అని అడగ్గా, ఆయన జవాబిస్తూ – నా పరిస్థితి చాలా క్లిష్టంగా వుంది. కారణం, నా గొంతు దైవ ప్రవక్త గొంతు కన్నా హెచ్చుగా వుంది. అందుకే నా ఆచరణ వ్యర్థమై పోయింది మరియు నేనిప్పుడు నరకవాసుల్లో చేరిపోయాను అని బాధగా అన్నారు. ఇది విని, ఆ వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకొచ్చి జరిగిందంతా చెప్పేశాడు. తదుపరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ వ్యక్తిని తిరిగి ఆయన వద్దకు పంపిస్తూ – ‘మీరు నరకవాసుల్లోని వారు కారు, స్వర్గవాసుల్లోని వారు అన్న శుభవార్తను ఆయనకు అందించు’ అని పురమాయించారు. (బుఖారీ: 4846, ముస్లిం:119) 

ఈ రెండు సంఘటనల ద్వారా మనకు – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సహాబాలు ఎంతగా గౌరవించే వారో మరియు ఆయన గౌరవాన్నత్యాలను కాపాడడానికి గాను ఆయన సమక్షంలో తమ కంఠస్వరాల గురించి ఎంతగా జాగ్రత్త పడేవారో అన్న విషయాలు తెలుస్తాయి. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవాన్నత్యాలను కాపాడే వారిని గురించి అల్లాహ్ ఇలా శుభవార్తను అందజేశాడు: 

“కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, గౌరవించి తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు” (ఆరాఫ్: 157) 

అలాగే ఇలా కూడా సెలవిచ్చాడు: 

“(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. (ఓ ముస్లిము లారా!) మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించటానికి, అతనికి తోడ్పడటానికి, అతన్ని గౌరవించటానికి, ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ వుండడానికి గాను (మేము ఈ ఏర్పాటు చేశాము ).” (ఫతహ్ : 8-9) 

సహాబాలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఏ విధంగా గౌరవించి, అభిమానించేవారో – దీని ఒక ఉదాహరణ మనకు హుదైబియా ఒప్పందం సంఘటనలో కానవస్తుంది. . 

ఉర్వా బిన్ మహద్ సఖఫీ (రదియల్లాహు అన్హు)  మక్కా నుండి ముష్రిక్కుల ప్రతినిధిగా (ఆ సమయంలో తను ఇంకా ముష్రిక్ గానే ఉన్నారు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వచ్చి, తిరిగి ఖురైషుల వద్దకు వెళ్ళిన తరువాత ఇలా పలికారు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్ సాక్షి! నేను ఇప్పటి వరకు పెద్ద రాజులను కలుసుకున్నాను. ఖైసర్, కిస్రా, నజాషీ లాంటి మహారాజులను కూడా చూశాను. కానీ అల్లాహ్ సాక్షి! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఆయన సహచరులు గౌరవించినట్లుగా ఏ మహారాజునూ అతని సహచరులు గౌరవించడం నేను చూడలేదు. అల్లాహ్ సాక్షి! ఒకవేళ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖాండ్రించి ఉమ్మేసినా, ఆయన నోటి నుంచి వెలువడే కఫం (తెమడ) కూడా (నేల మీద పడకుండా) ఆయన సహచరుల్లోని ఒకరి అరచేతిలో పడుతుంది. దానినతడు తన ముఖానికీ, ఇతర శరీరానికి రాసుకుంటాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏదైనా ఆజ్ఞ ఇస్తే, వెంటనే వారు దానిని పాటిస్తారు. ఆయన వుజూ చేస్తే, వారిలో ప్రతి ఒక్కడూ ఎలాగైనా ఆ నీటిని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఆయన సంభాషిస్తున్నప్పుడు ఆయన సహచరులు నిశ్శబ్దంగా దానిని వింటారు. ఆయన గౌరవార్ధం వారు ఆయన కళ్ళ వైపు సూటిగా కూడా చూడరు.” (సహీహ్ బుఖారీ : 2731, 2732) 

ఇస్లామీయ సోదరులారా! ఈ విషయాలు గుర్తుంచుకోండి! 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం)ను తగు విధంగా గౌరవించడంలో ఇమిడి వున్న ప్రత్యేక ఆవశ్యకతలేమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర సమాజానికి చేరవేసిన ధర్మాన్ని సంపూర్ణంగా భావించి దానిలో హెచ్చుతగ్గులు చేయడం సరికాదని విశ్వసించడం, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞాపించిన విషయాలపై ఆచరిస్తూ ఆయన వారించిన విషయాలకు దూరంగా వుండడం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సున్నత్ ను బ్రతికించడం, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తౌహీద్ (ఏకేశ్వరారాధన) సందేశాన్ని ప్రచారం చేయడం, షిర్క్ మరియు బిదాత్ లకు వ్యతిరేకంగా శ్రమించడం, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలను అలవర్చుకోవడం మరియు తప్పుడు, కాల్పనిక విషయాలను ఆయన వైపునకు మరల్చకుండా వుండడం. 

విషయానికనుగుణంగా, దృష్టిలో గట్టిగా వుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయమేమిటంటే, – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గౌరవించడం లో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిర్ణయించిన హద్దులను దాటకూడదు. ఎందుకుంటే ఆ హద్దులు దాటని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవమే అసలైనది, యుక్తమైనది మరియు విశ్వాసంలో అంతర్భాగమూను. అంతేగానీ, ఆ హద్దులను అతిక్రమించడం ఎంతమాత్రం సరికాదు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు: 

“క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ (అలైహిస్సలాం)ను ప్రశంసించడంలో హద్దులు మీరినట్లుగా మీరు నన్ను పొగడడంలో మితిమీరకండి. నేను కేవలం దాసుణ్ణి. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసులు మరియు ఆయన ప్రవక్త అని అనండి.” (బుఖారీ) 

ఈ హదీసు ద్వారా నిరూపించబడ్డ విషయమేమిటంటే – కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన అధికారాలను, ఉదా|| అవసరాలను తీర్చేవాడు, కష్టాల నుండి గట్టెక్కించేవాడు, సహాయకుడు వగైరా……. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆపాదించడం పూర్తిగా నిషిద్దమే (హరామ్) గాక, ఆయనను తగువిధంగా గౌరవించడంలో ఏర్పరచబడ్డ హద్దులను అతిక్రమించడమే అవుతుంది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“(ఓ ప్రవక్తా! వారికి ఇలా) చెప్పు – అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సైతం నా కోసం లాభం కానీ, నష్టం గానీ చేకూర్చుకొనే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది వుండే వాణ్ణి, నాకు ఏ నష్టమూ వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించే వాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ : 188) 

“ఓ ప్రవక్తా! వారికిలా చెప్పేయి – నా వద్ద అల్లాహ్ నిక్షేపాలు (ఖజానాలు) వున్నాయని నేను మీతో చెప్పటం లేదు. నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా మీతో అనడం లేదు. నాపై అవతరించబడే వహీని మాత్రమే నేను అనుసరిస్తున్నాను. (ఓ ప్రవక్తా) వారిని అడుగు – గ్రుడ్డివాడు, కళ్ళున్నవాడూ – ఇద్దరూ సమానులేనా? మీరు ఈ మాత్రం ఆలోచించలేరా?” (అన్ ఆమ్ : 50) 

(3) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రేమించడం. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క మూడవ హక్కు ఏమిటంటే – అల్లాహ్ తర్వాత అందరి కన్నా ఎక్కువగా ఆయననే ప్రేమించాలి మరియు అలాంటి ప్రేమ అల్లాహ్ సృష్టితాలలో ఎవరితోనూ ఉండకూడదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: 

“ఏ వ్యక్తిలోనయినా ఈ మూడు గుణాలు వుంటే అతను వాటి ద్వారా విశ్వాస మాధుర్యాన్ని, తియ్యదనాన్ని ఆస్వాదించ గలుగుతాడు. వాటిలో మొదటిది – అల్లాహ్ నూ ఆయన ప్రవక్తనూ అందరికన్నా ఎక్కువగా ప్రేమించడం. రెండవది – కేవలం అల్లాహ్ ను సంతృప్తి పరచడానికే ఇతరులను ప్రేమించడం. ఇక మూడవది -నరకాగ్నిలోకి ప్రవేశించడానికి ఎంతగా అయిష్టపడతాడో, (విశ్వసించిన తర్వాత) తిరస్కారం (కుఫ్ర్) వైపునకు మరలడానిక్కూడా అంతే అయిష్ట పడడం”. (బుఖారీ: 16, ముస్లిం : 43) 

“తమ సంతానం కన్నా, తమ తల్లిదండ్రుల కన్నా మరియు ఇతరులందరి కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించనంత వరకూ మీలో ఎవరు కూడా విశ్వాసులు కాజాలరు”. (బుఖారీ : 15, ముస్లిం : 44) 

అంతే కాదు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తమ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం తప్పనిసరి. 

అబ్దుల్లా బిన్ హిషామ్ (రదియల్లాహు అన్హు)  కథనం: మేమొక సారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట ఉన్నాం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉమర్ (రదియల్లాహు అన్హు)  చేతులు పట్టుకొని ఉన్నారు. ఇంతలో, ఉమర్ (రదియల్లాహు అన్హు)  ఓ దైవ ప్రవక్తా! మీరు నాకు నా ప్రాణం తప్ప ఇతర (ప్రాపంచిక) వస్తువులన్నింటి కన్నా ప్రియమైన వారు – అని పలికారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ – కాదు! నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తిమంతుని సాక్షి! మీ ప్రాణం కన్నా ఎక్కువగా నేను మీకు ప్రియం కావాలి అని అన్నారు. ఉమర్ (రదియల్లాహు అన్హు మాట్లాడుతూ – అల్లాహ్ సాక్షి! మీరిప్పుడు నాకు నా ప్రాణం కన్నా ప్రియులు అని పలికారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – ఇప్పుడు మాట కుదిరింది అని అన్నారు. (బుఖారీ : 6632) 

గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీది నిజమైన ప్రేమ యొక్క ఆచరణా స్వరూపం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు విధేయత చూపడం ద్వారానే సాధ్యమవుతుంది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“(ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు- మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించే వాడు, అపారంగా కనికరించేవాడు.” (ఆలి ఇమ్రాన్ :81) 

ఈ ఆయతు ద్వారా రుజువైనదేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో ప్రేమకు (అసలైన) కొలమానం ఆయనకు విధేయత చూపి ఆయన్ను అనుసరిచడం. ఇక ఏ వ్యక్తి అయినా తను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రేమిస్తున్నానని వాదిస్తూ, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ను కూడా అనుసరిస్తుంటాడో అతను తన వాదనలో సత్యవంతుడని అనుకోవచ్చు. కానీ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రేమిస్తున్నాని కేవలం వాదిస్తూ, ఆయన సున్నత్ ను అనుసరించకపోతే అతను తన వాదనలో అసత్యుడని నిర్ధారించుకోవాలి. 

దీనిపై ఒక కవి చాలా చక్కగా సెలవిచ్చా డు: 

“మీరు అల్లాహ్ కు విధేయత చూపుతారు మరియు అతణ్ణి ప్రేమిస్తామని కూడా వాదిస్తారు! మీ జీవితం సాక్షి! ఇదెంతో విచిత్రమైన విషయం . ఒకవేళ మీ ప్రేమ నిజమైనదై వుంటే మీరు ఆయనకు విధేయత చూపి వుండేవారు. ఎందుకంటే ప్రేమించేవాడు తన ప్రేమికునికి విధేయుడిగా వుంటాడు”. 

సహాబాలు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఎంతో ఎక్కువగా ప్రేమించేవారు. ఆయెషా (రదియల్లాహు అన్హ)  ఉల్లేఖించిన ఈ సంఘటన ద్వారా మనం దీనిని గ్రహించవచ్చు. ఆమె కథనం: 

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చి ఇలా విన్నవించుకున్నాడు – ఓ దైవ ప్రవక్తా! మీరు నాకు నా ప్రాణం కన్నా, నా సంతానం కన్నా ప్రియమైనవారు. నేను ఇంట్లో వున్నప్పుడు మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటాను. మీరు గుర్తు రాగానే ఓపిక పట్టలేక మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాను. ఇక నేను నా మృత్యువును మరియు మీ మృత్యువును గుర్తుకు తెచ్చుకున్నప్పుడు – మీరు స్వర్గంలోకి ప్రవేశించినప్పుడు మిమ్మల్ని ప్రవక్తలతో (ఉన్నత స్థానాలలోకి) పంపడం జరుగుతుంది, ఒకవేళ నేను స్వర్గంలోకి ప్రవేశింపజేయబడితే అక్కడ మీ దర్శన భాగ్యం కలుగుతుందో లేదో! అన్న సంశయంలో వున్నాను. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏమీ మాట్లాడలేదు. ఈ  లోగా జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఈ ఆయత్ ను తీసుకుని అవతరించారు: 

“ఎవరైతే అల్లాహ్ కు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్యసంధులతోనూ, షహీదులతోనూ, సద్వర్తనులతోనూ ఉంటారు. ఎంత మంచి స్నేహితులు వీరు”. (నిసా : 69)( తబ్రాని-అస్సగీర్, అల్ ఔసత్) 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధేయత, ఆయన సున్నత ను అనుసరించడమే ఆయనపై వున్న నిజమైన ప్రేమకు తార్కాణం. ఈ కారణం వల్లే ఆయన (సల్లల్లాహు అలైహివ సల్లం)ను ప్రేమించే వారికి ప్రళయం రోజు ఆయన సాన్నిధ్యం దొరుకుతుంది. ఎందుకంటే – ఆ సహచరుడు (సహాబీ) స్వర్గంలో తను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దర్శించలేనేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు దానికి జవాబుగా అల్లాహ్ – ఒకవేళ మీరు అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపితే మీకు దైవ ప్రవక్తల సాన్నిధ్యం తప్పకుండా దొరుకుతుంది అని సెలవిచ్చాడు. కేవలం ప్రేమిస్తున్నామని వాదిస్తే సరిపోదు, దాని కనుగుణంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అనుసరిస్తూ ఆయనకు విధేయత చూపడం కూడా తప్పనిసరి అని అనడానికి ఒక తార్కాణం. 

(4) అత్యుత్తమ ఆదర్శం (ఉస్వ -ఏ- హసన) పై ఆచరించడం 

తన అనుచర సమాజం (ఉమ్మత్)పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు గల నాలుగవ హక్కు ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అత్యుత్తమ ఆదర్శంగా విశ్వసించి, ప్రతి విషయంలోనూ, జీవితానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ఆయనను అనుసరించాలి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం వుంది – అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగివుండి, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు”. (అహిజాబ్ : 21) 

ఈ ఆయత్ ద్వారా తెలిసిందేమిటంటే – ఈ రెండు గుణాలు తనలో కలిగివున్న వ్యక్తే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఆదర్శాలను స్వీకరిస్తాడు. అందులో మొదటిది- ప్రళయం రోజు అల్లాహ్ తో ముఖాముఖి కలవడంపై నమ్మకం కలిగి వుంటాడు. రెండవది – అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తాడు. 

కాని (దురదృష్టవశాత్తూ) నేటి ముస్లిములలో చాలా మంది ఈ గుణాలను త్యజించి వున్నారు. అందుకే వారి హృదయాల్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదర్శానికి ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. దీనికి వ్యతిరేకంగా వారు ఇతరులెందరినో తమకు ఆదర్శంగా భావించి వారి ఆచరణలను, అభిప్రాయాలనే గ్రుడ్డిగా తమ కోసం తలమానికంగా చేసుకున్నారు. వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్! 

కానీ, సహాబాలు మాత్రం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అత్యుత్తమ ఆదర్శవంతులుగా భావించి తమ మాటలు, చేతలు – అన్ని విషయా లలోనూ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)నే అనుసరించేవారు. కేవలం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొరకే ప్రత్యేకించబడిన ఆచరణను వదిలి పెట్టేవారు. దానిక్కారణం వారు, ఆయన (సల్లల్లాహు అలైహివ సల్లం)ను హృదయపూర్వకంగా ఇష్టపడేవారు మరియు నిజమైన ప్రేమ కలిగి వుండే వారు. 

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓ సారి బంగారపు ఉంగరాన్ని ధరిస్తే, (ఇది చూసి) ప్రజలు కూడా బంగారపు ఉంగరాన్ని ధరించారు. తదుపరి దైవ ప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం)- నేను బంగారపు ఉంగరాన్ని ధరించి వున్నాను  అని చెప్పి, ఆ తర్వాత దానిని తీసేసి – ఇక నేను దీనిని ఎప్పుడూ ధరించను అని అన్నారు. దీనిపై అందరూ తమ బంగారపు ఉంగరాలను తీసేశారు. (బుఖారీ : 7298, ముస్లిం : 2061) 

కనుక, మనం కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అత్యుత్తమ ఆదర్శవంతులుగా భావించి ఆయనను సంపూర్ణంగా అనుసరించాలి. విశ్వాసాలు, ఆరాధనా విషయాలైనా, నైతికత, సత్ప్రవర్తన విషయాలైనా, ఇతర వ్యవహారాలైనా, జీవితానికి సంబంధించిన ఏ రంగంలోనయినా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడుగు జాడల్లోనే నడవాలి. కానీ, దురదృష్ట వశాత్తూ నేడు మనం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను విశ్వసించి ఆయనను ప్రేమిస్తునామని వాదించేవారి దైనందిన కార్యకలాపాలపై ఒక్కసారి దృష్టి సారిస్తే-వీరి కార్యకలాపాలకూ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కార్యకలాపాలకు భూమ్యాకాశాల వ్యత్యాసం వుందన్న విషయం స్పష్టమవుతుంది. 

విశ్వాసాల విషయానికికొస్తే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం అల్లాహ్ నే ప్రార్థిస్తూ, అతన్నే అవసరాలు తీర్చేవాడుగా, కష్టాల నుండి గట్టెక్కించే వాడుగా నమ్మేవారు. దీనికి భిన్నంగా నేటి ముస్లిములలో అత్యధికులు దైవేతరులను తమ అవసరాలు తీర్చి కష్టాల నుండి గట్టెక్కించేవారుగా భావించి వారిని వేడుకుంటున్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – లాభ నష్టాల అధికారం కేవలం అల్లాహ్ కే వుందని విశ్వసించేవారు. కానీ నేటి ముస్లిములలో చాలా మంది, మరణించిన పుణ్య పురుషులు, సజ్జనుల వద్ద ఈ అధికారాలున్నాయని భావించి వారి నుండి లాభాన్ని ఆశిస్తూ, వారంటే భయపడు తుంటారు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాధిని సజ్దా ల నిలయం (మస్జిద్)గా మార్చడాన్ని గట్టిగా వారించి, ఇలా చేసేవారిని శపించివుండగా, నేటి ముస్లిములు పుణ్యపురుషుల సమాధులను ‘మజార్ల’ లాగా తీర్చిదిద్ది తమ అవసరాలు తీర్చుకోవడానికి వీటి వైపునకు మరలుతున్నారు.

ఇక ఆరాధనల విషయాని కొస్తే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చివరి ఘడియల వరకు నమాజును స్థాపించగా నేటి ముస్లిములలో చాలా మంది ఐదు పూటల నమాజును ఆచరించరు మరియు ‘హయ్యా అలస్సలాహ్, హయ్యా అలల్ ఫలాహ్’ శబ్దం విని మస్జిద్ కు రారు. ఒకవేళ మస్జిద్ కు వచ్చినా, అందులో చాలా మంది తమ ఇష్ట ప్రకారం లేదా తమ అభిమతం (మస్లక్) ప్రకారం నమాజులు చదువుతారు. వాస్తవానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఆజ్ఞాపించివున్నారు – ‘నన్నెలాగైతే నమాజు చేస్తుండగా చూశారో, మీరు కూడా అలాగే నమాజ్ చేయండి.’ మరి మన ఇష్ట ప్రకారం లేదా అభిమతం ప్రకారం (అల్లాహ్ ను) ఆరాధించం జరుగుతుంటే ఇక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదర్శాల అనుసరణ ఎక్కడ మిగిలి వుంటుంది….!! 

అలాగే, సుగుణాలు, సత్ప్రవర్తనల విషయానికొస్తే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ప్రేమ ఆప్యాయతలను కనబరుస్తూ అందరితోనూ కలసిపోయేవారు మరియు ముస్లిములందరితోనూ చక్కగా ప్రవర్తించేవారు. కానీ నేటి ముస్లిములు గర్వాహంకారాలను ప్రదర్శిస్తూ ముస్లిం సహోదరులతో చెడ్డగా ప్రవర్తిస్తూ దర్శనమిస్తున్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ఇతరుల్ని క్షమించి వారికి హితబోధ చేసేవారు. చెడు విషయాల నుండి స్వయంగా దూరంగా ఉంటూ ఇతరులక్కూడా వీటి గురించి వారించే  వారు. కానీ, నేటి ముస్లిములు మాత్రం చిన్న చిన్న విషయాల మీద కూడా ఇతరులతో గొడవకు దిగి దర్భాషలాడుతున్నారు! 

ఇక వ్యవహారాల విషయానికొస్తే – ప్రియ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మోసం, దగా, ఇతరుల సొమ్ము కాజేయడం – వంటి వాటి నుండి గట్టిగా వారించేవారు. కానీ నేడు పరిస్థితి ఎలా వుందంటే – మోసం, దగా మరియు ఇతరుల సొమ్ము కాజేయడం వంటి చెడు కార్యాలు ముస్లిముల గుర్తింపు చిహ్నాలుగా అయిపోయాయి. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హలాల్ (ధర్మయుక్తమైన) సంపాదన గురించి ఆజ్ఞాపించి హరామ్ (నిషిద్ధ) సంపాదన గురించి గట్టిగా వారించేవారు. కానీ, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను విశ్వసించే నేటి ముస్లిములు హరామ్, హలాల్ ల మధ్య వ్యత్యాసం చూపకుండా రెండు పద్ధతుల్లోనూ ధనాన్ని అర్జిస్తూ, అర్జించిన ధనాన్ని వడ్డీలిచ్చే బ్యాంకులలో జమ చేస్తూ దర్శనమిస్తున్నారు! 

చెప్పొచ్చేదేమిటంటే- జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదర్శాలను వదలి పెట్టడం జరిగింది, వాటి స్థానంలో ఇతర జాతుల పద్ధతులు ఆచరణ యోగ్యమైన ఆదర్శపద్ధతులుగా పేరుగాంచాయి. 

చివరికి వస్త్రధారణ మరియు వ్యవహార శైలి విషయాల్లో కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదర్శాలు నేడు లోపాలు, దోషాలుగా తయారయి పోయాయి. ఇక ఎవరైనా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)(ను అనుసరిస్తూ) ఆయన లాంటి వస్త్ర ధారణ, వ్యవహార శైలి పాటించడానికి ప్రయత్నిస్తాడో, అతణ్ణి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రేమిస్తున్నామని వాదించేవారే చెడ్డ చెడ్డ పేర్లతో పిలుస్తూ జన సమూహాల మధ్య దైవ ప్రవక్త సున్నత ను పరిహసిస్తూ దర్శనమిస్తుంటారు….!! ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్! 

(5) విధేయత 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఐదవ హక్కు ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపడం మరియు ఆయన అవిధేయతకు దూరంగా వుండడం. 

ఎందుకంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధేయత (వాస్తవానికి) అల్లాహ్ విధేయత మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవిధేయత, అల్లాహ్ అవిధేయతే. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు చెందిన ఈ హక్కును గూర్చి అల్లాహ్ ఇలా సెలవిచ్చా డు: 

“అల్లాహ్ కు విధేయత చూపండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. (చెడుల పట్ల) కడు జాగ్రత్తగా వుండండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే, మా ప్రవక్త పై వున్న బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని అంద జేయడం వరకే నని తెలుసుకోండి.” (మాయిదా : 92) 

ఇంకా, ఇలా సెలవిచ్చాడు: 

“ప్రవక్తకు విధేయత చూపినవాడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే”. (నిసా : 80) 

ఈ ఆయతులో అల్లాహ్, ప్రవక్త విధేయతను తన విధేయతగా ఖరారు చేశాడు. ఇదే విషయాన్ని ఈ హదీసు కూడా సమర్థిస్తుంది: 

ఫాతిమా బిన్త్ ఖైస్ (రదియల్లాహు అన్హ)  కథనం ప్రకారం ఆమె భర్త అబూ అమ్ర్ బిన్ హఫ్స్ (రదియల్లాహు అన్హు)  ఓ సారి ఇంటి నుండి బయటకు వెళ్ళివున్నారు. ఈ తరుణంలోనే ఆయన ఆఖరి (మూడవ) తలాఖు ఇచ్చేశారు. తదుపరి ఆయన ప్రతినిధి (అయ్యాష్ బిన్ అబీ రబీయ రదియల్లాహు అన్హుని తలాఖ్ నామా (విడాకుల పత్రం)తో పాటు ఐదు ‘సా’ ల యవలు(జొ) ఇచ్చి 

ఆమె దగ్గరికి పంపారు. కానీ, ఆమెకు ఈ విషయం నచ్చలేదు. (ముస్లిం లోని ఒక ఉల్లేఖనం ప్రకారం ఆమె ఇలా అడిగారు – నా కోసం ఇంత తక్కువ ఆహార పదార్ధాలా?) దీనిపై ఆయన ప్రతినిధి జవాబిస్తూ – అల్లాహ్ సాక్షి! మా దగ్గర మీ కోసం ఇంత కన్నా ఏమీ లేదు అని అన్నారు. దీనిపై ఆమె నేరుగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి విషయమంతా తెలియజేశారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – వాస్తవానికి వారు నీకు ఎంతో కొంత ఆహార ధాన్యాలు ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు అని అన్నారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు ఇద్దత్ గడువు గడిపే నిమిత్తం ఉమ్మె షరీక్ (రదియల్లాహు అన్హ)  ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు ఇలా సెలవిచ్చారు ఉమ్మె షరీక్ (రజి అల్లాహు అన్హ ఇంటికి సహాబాలు తరచూ వస్తూ పోతుంటారు, కనుక నువ్వు ఉమ్మె మఖూమ్ (రదియల్లాహు అన్హు)  ఇంట్లో ఇద్దత్ వ్యవధి గడుపు, ఎందుకంటే ఆయన అంధులు కావడం వల్ల నీవు నీ అదనపు వస్త్రాలు తొలగించుకొనే అవకాశం వుంటుంది. ఇద్దత్ గడువు పూర్తయ్యాక నాకు కబురు పంపు. 

ఫాతిమా బిన్త్ ఖైస్ (రదియల్లాహు అన్హ) ఇలా వివరించారు – నా ఇద్దత్ గడువు పూర్తయ్యాక నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు – నా వద్దకు ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు)  మరియు అబూ జహమ్ (రదియల్లాహు అన్హు) లు పెళ్ళి ప్రస్తావన తీసుకొని వచ్చారు – అన్న విషయం చెప్పాను. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – అబూ జహమ్ (రదియల్లాహు అన్హు)  విషయానికొస్తే – అతనేమో కర్రను భుజాల మీద నుండి దించనే దించడు (అంటే ఆయన కఠిన మనస్కులు), ఇక ముఆవియా (రదియల్లాహు అన్హు)  విషయానికొస్తే -ఆయన కటిక బీదవాడు, ఆయన వద్ద ఏమీ లేదు. కనుక నువ్వు ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) ను వివాహం చేసుకో అని చెప్పారు. 

ఫాతిమా (రదియల్లాహు అన్హ) కథనం – నాకు ఉసామా అంటే ఇష్టం లేదు. కానీ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాత్రం మళ్ళీ నన్ను ఉసామా (రదియల్లాహు అన్హు)  నే వివాహమాడు అని ఆజ్ఞాపించారు. 

ముస్లింలోని ఒక ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు ఇలా ఉద్బోధించారు – అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)విధేయతే నీకు ఉత్తమం. 

తదుపరి నేను ఆయన్ను పెళ్ళి చేసుకున్నాను. నిజంగానే, అల్లాహ్ మా వివాహబంధంలో ఎంతటి మంచిని, శుభాన్ని వుంచాడంటే- ఆ కాలంలో వున్న ఇతర స్త్రీలు నన్ను చూసి ఈర్ష్య చెందేవారు. (ముస్లిం : 1480) 

ఈ సంఘటన ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – దైవ ప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధేయత లోనే మంచి, శుభాలు ఇమిడి వున్నాయి మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధేయత వాస్తవానికి అల్లాహ్ విధేయత ఎందుకంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫాతిమా (రజి అల్లాహు అన్హా) కు ఉసామా (రదియల్లాహు అన్హు) ను వివాహం చేసుకోమని ఇచ్చిన ఆజ్ఞకు సంబంధించి అల్లాహ్ దివ్య ఖురానులో ఏ ఆయతునూ అవతరింపజేయ లేదు. అయినప్పటికీ దానిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త విధేయతే నీ కోసం ఉత్తమం అని ప్రస్తావించారు. కనుక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలై వ సల్లం) విధేయత వాస్తవానికి అల్లాహ్ విధేయతే అని అనడానికి ఇదొక చక్కటి ఆధారం. 

తనకు విధేయత చూపమని అల్లాహ్ తన దాసులకు ఎక్కడైతే సెలవిచ్చాడో అక్కడే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కూడా విధేయత చూపమని ఆజ్ఞాపించాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు విధేయత చూపండి. ప్రవక్త చెప్పినట్లు వినండి. (అవిధేయత చూపి) మీ కర్మలను పాడు చేసుకోకండి.” (ముహమ్మద్ : 33) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: “ఓ విశ్వాసులారా! మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపునకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లాహ్ మనిషికీ – అతని మనసుకూ మధ్య అడ్డుగా వస్తాడనీ, మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతినీ తెలుసుకోండి”. ( అన్ ఫాల్: 24) 

నేనొకసారి మస్జిద్ లో నమాజు చదువుతుండగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అటువైపు నుండి వెళుతూ నన్ను పిలిచారు. నేను నమాజు పూర్తి చేసి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వెళ్ళగా, ఆయన నాతో- (నేను పిలవగానే) నా వద్దకు రానీయకుండా ఏ విషయం నిన్ను ఆపి వుంచింది? అని అడిగారు. “నేను నమాజు చదువుతూ వున్నాను దైవ ప్రవక్తా!” అని విన్నవించు కున్నాను. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేస్తూ ఇలా అన్నారు – “ఓ విశ్వాసులారా! మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపునకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి” అని అల్లాహ్ సెలవీయలేదా? (బుఖారీ: 4647, 4703) 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దానిని వదిలిపెట్టండి”. (హష్ర్  : 7) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞ అనేది షరీయత్తు పరమైన ఆధారము మరియు తప్పనిసరిగా అనుసరణీయము అని అనడానికి ఈ ఆయతు ఒక నిదర్శనం. 

అలాగే, ఈ హదీసు కూడా దీనిని సమర్థిస్తుంది: 

“పచ్చబొట్లు పొడిచే, పొడిపించుకొనే, సౌందర్యం నిమిత్తం తమ ముఖాలపై వెంట్రుకలు తొలగించుకొనే మరియు తమ దంతాల మధ్య ఎడబాటు కలిగించుకోవడం ద్వారా సృష్టిలో మార్పులు చేసే స్త్రీలను అల్లాహ్ శపించాడు.” 

ఈ హదీసు అసద్ తెగకు చెందిన ఉమ్మె యాఖూబ్ అని పిలువబడే ఒక స్త్రీ వద్దకు చేరింది. తదుపరి ఆమె, అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు)  దగ్గరి కొచ్చి ఇలా అడిగింది – మీరు ఫలానా, ఫలానా స్త్రీలను శపించారని నాకు తెలిసింది. 

ఆయన జవాబిస్తూ – అల్లాహ్ గ్రంథం శపించిన వారినీ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించిన వారిని నేనెందుకు శపించకూడదు? అని అడిగారు. 

ఉమ్మె యాఖూబ్: నేను దివ్య ఖురానును సంపూర్ణంగా చదివాను. 

కానీ మీరు చెప్పే విషయం నాకెక్కడా గోచరించలేదే? 

అబ్దుల్లా బిన్ మస్ వూద్: ఒకవేళ నీవు ఖురానును పూర్తిగా చదివివుంటే నీకు ఖచ్చితంగా ఈ విషయం తెలిసేది. నీవు “దైవ ప్రవక్త మీకు యిచ్చిన దానిని (సంతోషంగా) తీసుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దానిని వదిలి పెట్టండి” అన్న ఆయతు చదవ లేదా? 

ఉమ్మె యాఖూబ్: ఎందుకు చదవలేదు? (చదివాను) 

అబ్దుల్లా బిన్ మసూద్: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ పనుల నుండి వారించారు మరి. 

ఉమ్మె యాఖూబ్: మరి మీ భార్య ఈ పనులు చేస్తోందిగా! 

అబ్దుల్లా బిన్ మస్ వూద్: ఓసారి వెళ్ళి చూడు. 

తదుపరి ఆమె వాళ్ళింటికి వెళ్ళి చూడగా అక్కడ ఆమెకు అలాంటి విషయమేదీ కనబడలేదు. 

అబ్దుల్లా బిన్ మ ఊద్ (రదియల్లాహు అన్హు మాట్లాడుతూ – ఒక వేళ నా భార్య ఈ పనులలో గనక లిప్తమై వుంటే, నేనామె దగ్గరిక్కూడా వెళ్ళే వాణ్ణి కాదు, (బుఖారీ : 4886, ముస్లిం : 2125) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు : 

“కేవలం తిరస్కరించిన వారు తప్ప నా అనుచర సమాజానికి చెందిన వారంతా స్వర్గంలోకి వెళతారు. దీనిపై సహాబాలు స్పందిస్తూ – తిరస్కరించే వారు ఎవరు దైవ ప్రవక్తా! అని అడిగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – నాకు విధేయత చూపిన వాడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. నాకు అవిధేయత చూపినవాడు (స్వర్గాన్ని) తిరస్కరించాడు అని హితవు పలికారు.” (బుఖారీ: 7280) 

సహాబాలు మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధేయత 

సహాబాల హృదయాల్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధేయత, ఆజ్ఞాపాలనల పట్ల గాఢంగా నూరిపోయబడింది. దీనికి సంబంధిం చిన కొన్ని సంఘటనలకు మీ ముందు వుంచాలనుకుంటున్నాం. 

(1) అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతిలో బంగారపు ఉంగరం చూసి దానిని తీసి పడేసారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ‘మీలో ఎవరైనా నరక జ్వాలను చేతిలో పెట్టుకోవడానికి యిష్టపడతారా?” అని అడిగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అక్కణ్ణుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తితో – ‘నీ వుంగరాన్ని తీసుకుని ఇతర ప్రయోజనం పొందు’ అని అనబడింది. దీనిపై ఆ వ్యక్తి జవాబిస్తూ – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా దానిని తీసి విసిరేశారు. అల్లాహ్ సాక్షి! నేనిక యెప్పుడూ దానిని తీసుకోను – అని అన్నాడు. (ముస్లిం : 2090) 

(2) ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)  కథనం: ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు – ‘నిస్సందేహంగా, మీ తాతముత్తాతల పేర్లతో ప్రమాణం చేయడాన్ని అల్లాహ్ మీ కోసం వారించాడు.” ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత ఉమర్ (రదియల్లాహు అన్హు)  ఇలా సెలవిస్తున్నారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట-అల్లాహ్ ఈ విషయాన్ని వారించాడు – అని విన్న తర్వాత నేనెప్పుడూ ఇలా ప్రమాణం చేయ లేదు. అంటే నా పేరుతో గానీ లేదా ఇతరుల పేర్లతో గానీ! (ముస్లిం : 1646) 

(3) అబ్దుల్లా బిన్ ఆమిర్ బిన్ రబియా కథనం: ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఓ సారి సిరియా వైపునకు వెళుతూ ‘సరగ్’ అనే ప్రదేశానికి చేరుకొనే సరిగి అక్కడ ఆయనకు – సిరియాలో అంటు వ్యాధి వ్యాపించింది అన్న వార్త అందింది. దీనిపై అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) స్పందిస్తూ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని చెప్పారు – ‘మీరెప్పుడైనా ఏ దేశంలోనైనా అంటు వ్యాధి వ్యాపించిందని తెలుసుకుంటే అక్కడికి వెళ్ళకండి. కానీ, ఒకవేళ మీరు వున్న ప్రదేశంలో గనక అంటువ్యాధి వ్యాపిస్తే అక్కడనుండి పారిపోవడానికి యత్నించకండి. ” ఈ హదీసు విన్న తర్వాత ఉమర్ (రదియల్లాహు అన్హు)  సిరియా వెళ్ళకుండా, ‘సరగ్’ నుండే తిరిగి వెళ్ళిపోయారు. (బుఖారీ : 5730, ముస్లిం : 2219) 

ఉమర్ (రదియల్లాహు అన్హు)  ఎప్పుడైనా తన అభిప్రాయానికి విరుద్ధంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసు వింటే, వెంటనే తన అభిప్రా యాన్ని వదిలిపెట్టి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసు కనుగుణంగా తీర్పు చేసేవారు. దీనికి సంబంధించి- యహ్యా బిన్ సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్ కథనం: 

ఉమర్ (రదియల్లాహు అన్హు) చేతి వేళ్ళ రక్త శుల్కానికి సంబంధించి ఇలా తీర్పు చేశారు – బొటన వ్రేలి రక్తశుల్కం 15 ఒంటెలు, దాని ప్రక్క వ్రేలు మరియు మధ్య వ్రేలికి గాను రక్త శుల్కం 10 ఒంటెలు, దాని ప్రక్క వేలి రక్త శుల్కం 9 ఒంటెలు మరియు చిన్ని మేలు రక్త శుల్కం 6 ఒంటెలు. దీని తర్వాత ఆయనకు ఉమర్ బిన్ హజమ్ కుటుంబ గ్రంథంలో – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్ని చేతి వేళ్ళ రక్త శుల్కం 10 ఒంటెలుగా నిర్ధారించారు – అన్న హదీసు లభ్యమవడం చూసి తన నిర్ణయాన్ని మార్చు కున్నారు. (అర్రిసాల లిల్ ఇమామ్ అషాఫయీ – 422 పేజి) 

(4) ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్ర్ అస్వద్ (కాబా గోడలో అమర్చబడిన స్వర్గపు రాయి)ను ముద్దాడిన తర్వాత ఇలా సెలవిచ్చారు: ‘జాగ్రత్త! నీవు కేవలం ఒక రాయివి మాత్రమే మరియు (ఇతరులకు) లాభనష్టాలేవీ చేకూర్చలేవు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిన్ను ముద్దాడుతుండగా నేను చూసి వుండక పోతే, నేనెప్పుడూ నిన్ను ముద్దాడే వాణ్ణి కాను.’ 

తదుపరి ఇంకా ఇలా సెలవిచ్చారు. ‘మనమిప్పుడు రమల్ (కాబా గృహ ప్రదక్షిణలో మొదటి మూడు ప్రదక్షిణలు పురుషులు వేగంగా నడవడం) ఎందుకు చేయాలి? వాస్తవానికి ముఫ్రిక్కుల ముందు మా బలాన్ని ప్రదర్శించే నిమిత్తం అప్పుడలా చేసేవాళ్ళం. ఇప్పుడు అల్లాహ్ వారిని నాశం చేసేశాడు. అయినా సరే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన జీవితంలో ఆచరించిన దానిని వదిలి పెట్టడానికి మేమే మాత్రం ఇష్టపడం.” (బుఖారీ : 1605, ముస్లిం : 1270) 

(6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతలు 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు తన ఉమ్మత్ (అనుచర సమాజం) పై వున్న ఆరవ హక్కు ఏమిటంటే – సమస్త వ్యాజ్యాలు, అభిప్రాయ భేదాల విషయంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులను న్యాయ నిర్ణేతలుగా స్వీకరించి వాటిని శిరసావహించి వాటికి వ్యతిరేకంగా ఇతరుల అభిప్రాయాలకూ, దృక్పథాలకూ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వక పోవడం. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : “(ఓ దైవ ప్రవక్తా )! నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర వివాదా లన్నింటిలోనూ నిన్ను తీర్పరిగా చేసుకోనంత వరకూ, తదుపరి, నీవు వారి మధ్య చేసిన తీర్పు పట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకో చానికి, అసంతృప్తికి ఆస్కారం యివ్వకుండా మనస్ఫూర్తిగా శిరసా వహించనంత వరకూ – వారు విశ్వాసులు కాజాలరు”. (నిసా : 65) 

ఉర్వా బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం ఆయన తండ్రి జుబైర్ (రదియల్లాహు అన్హు) కు ఒక అన్సారీ సహచరునితో (సాబితా బిన్ ఖైస్ రదియల్లాహు అన్హు హిరా ప్రాంతంలో వున్న ఒక కాలువ విషయంలో గొడవ జరిగింది. అన్సారీ సోదరుడు తన తోట కోసం నీళ్ళను వదిలి పెట్టమని వేడుకోగా జుబైర్ (రదియల్లాహు అన్హు)  తిరస్కరించారు. యిద్దరూ తమ వ్యాజ్యాన్ని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు తీసుకొచ్చారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట్లాడుతూ – ఓ జుబైర్ ! నీవు నీ పొలానికి నీళ్ళు పట్టుకున్నాక నీ ప్రక్క వాడి తోటకు నీళ్ళను వదిలేయి అని అన్నారు. దీనిపై అన్సారీ సహచరుడు కోపగించుకొని – ఓ దైవ ప్రవక్తా! అతను మీ మేనత్త కుమారుడనే కదా మీరలా చేసింది అని అన్నాడు. ఇది విని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖం రంగు మారిపోయింది. ఆయన మాట్లాడుతూ- ఓ జుబైర్! నీ పొలానికి నీళ్ళు పట్టు, పొలం అంతా నిండనంత వరకు నీళ్ళను వదలకు అని ఆజ్ఞాపించారు. 

జుబైర్ (రదియల్లాహు అన్హు)  కథనం : దివ్య ఖుర్ఆన్ లోని – “కాదు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంత వరకూ వారు నిజమైన విశ్వాసులు కాలేరు” అన్న దైవ సూక్తి ఈ సందర్భంలోనే అవతరించిందని నా అభిప్రాయం. (సహీహ్ బుఖారీ : 2336, సహీహ్ ముస్లిం : 2357) 

సహీహ్ బుఖారీలోని మరో ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తో హజ్జె అస్వద్ (కాబా గోడలో అమర్చబడిన స్వర్గపు రాయి)ను తాకడం గురించి ప్రశ్నించాడు. ఆయన జవాబిస్తూ – నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దీనిని తాకి, ముద్దాడుతుండగా చూశాను అని అన్నారు. 

ఆ వ్యక్తి : అంటే ఒకవేళ (ప్రజల) గుంపులో ఇరుక్కుపోయినప్పటికీ దానిని తాకాలని మీ అభిప్రాయమా? మరియు ప్రజలు నాపై ప్రాబల్యం వహించినా దానిని నేను తాకాలని మీ అభిప్రాయమా? 

అబ్దుల్లా బిన్ ఉమర్: నీవు “మీ అభిప్రాయమా?” అని అంటున్నావే, ఈ మాటను యమన్ (ఒక దేశం పేరు) లో విడిచి పెట్టిరా, నాకు కేవలం తెలిసిందేమిటంటే, నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను హజ్ర అస్వద ను తాకి, దానిని ముద్దాడగా చూశాను. (బుఖారీ : 1611) 

దీని ద్వారా తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)సున్నత్ గురించి తెలిసిన తర్వాత ఇక ఎవరి అభిప్రాయానికి ఏ మాత్రం విలువ వుండదు. ఆ అభిప్రాయం సహాబీది అయినా సరే! 

కానీ, ఎంత దురదృష్టకరమైన పరిస్థితి! నేటి కాలంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పవిత్ర సున్నతులను వివరించే ప్రామాణిక హదీసులు వినిపించినప్పటికీ, వాటికి వ్యతిరేకంగా తమ తమ ఇమాముల, ఉలమాల అభిప్రాయాలను వ్యక్త పరిచే ఎంతో మంది నేడు వున్నారు! – వాస్తవానికి ఇది ఎంత పెద్ద ధైర్యమంటే – దీని గురించి ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ) అల్లాహ్ శిక్ష అవతరణకు కారణం కావచ్చన్న సందేహం వెలిబుచ్చారు. 

ఇమామ్ ఇబ్నె అబ్దుల్ బర్ర్   (రహిమహుల్లాహ్), ఉర్వా ద్వారా ఉల్లేఖించిన దాని ప్రకారం – ఆయన (ఉర్వా) ఇబ్నె అబ్బాస్ తో – మీరు అల్లాహ్ తో భయపడరా? హజ్ తమత్తుకు అనుమతిస్తున్నారు అని అడిగారు. 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ : ఓ ఉర్వా! నీవు నీ తల్లిని అడుగు. 

ఉర్వా: అబూ బక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) మ్)లు హజ్ తమత్తు చేయలేదు. 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ : అల్లాహ్ సాక్షి! అల్లాహ్ శిక్ష అవతరిస్తే గానీ మీరు దారికి రారు అని అనిపిస్తోంది. మేము మీకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసును వినిపిస్తుంటే, దానికి వ్యతిరేకంగా మీరు అబూ బక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) మ్) ల గురించి మాట్లాడుతున్నారు. 

మరో ఉల్లేఖనంలో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు)  ఇలా సెలవిచ్చారు: అతి త్వరలోనే వారు నాశనమైపోతారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని నేను చెబుతుంటే, అబూ బక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమ్)లు (ఇలా చేసారు) అని వీరు చెబుతున్నారు. – (సహీహ్ జామెటల్ బయానుల్ ఇల్మ్ వ ఫజ్లిహి లి ఇబ్నె అబ్దుల్ బి – అబుల్ ఇష్ బాల్-525వ పేజీ) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసును వ్యతిరేకించే వారిపై సహాబాల కఠిన ప్రవర్తన

(1) సాలిమ్ బిన్ అబ్దుల్లా కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)  ఓ సారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసును ఇలా ఉల్లేఖించారు- ‘ఒకవేళ మీ (ఇంటి) స్త్రీలు మిమ్మల్ని మస్జిద కు వెళ్ళడానికి అనుమతి అడిగితే మీరు వారిని నిరాకరించకండి.” 

ఇది విని అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)  కుమారుడు బిలాల్ బిన్ అబ్దుల్లా – ‘అల్లాహ్ సాక్షి! మేమైతే తప్పకుండా వారిని (స్త్రీలను) అడ్డుకుంటాం’ అని అన్నారు. ఇది విని అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) అతని వైపునకు తిరిగి అతణ్ణి చాలా చీవాట్లు పెట్టారు. ఆయన ఇంతగా 

చీవాట్లు పెట్టడం నేనెప్పుడూ చూడలేదు. తదుపరి ఆయన ఇలా సెలవిచ్చారు – ‘నేను మీకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసును వినిపిస్తుంటే నువ్వేమో అల్లాహ్ సాక్షి, మేం తప్పకుండా స్త్రీలను అడ్డుకుంటాం అని చెబుతావా?” (ముస్లిం : 442) 

మరొక ఉల్లేఖనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉమర్ (రజి అల్లాహు అన్టు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసును ఇలా ఉల్లేఖించారు – ‘స్త్రీలను రాత్రి పూట మసీదులకు వెళ్ళడానికి అనుమతిస్తూ వుండండి.” ఇది విని ఆయన కుమారుడైన వాఖిద్ ఇలా అన్నాడు – మరైతే వారు దీనిని తమ చెడు చేష్టలకు అనువుగా చేసుకుంటారు! దీనిపై అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ) అతని రొమ్ముపై గుద్ది ఇలా సెలవిచ్చారు – ‘నేను మీకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసును వినిపిస్తుంటే నీవేమో కాదని అంటావు.” (ముస్లిం) 

ఈ హదీసు ప్రయోజనాలను గురించి వివరిస్తూ ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా పేర్కొన్నారు: 

ఈ హదీసు ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – ఏ వ్యక్తి అయినా సున్నత్ పట్ల అయిష్టత వ్యక్తం చేసి దానికి వ్యతిరేకంగా దాని స్థానంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే అలాంటి వ్యక్తిని శిక్షించవచ్చు. అలాగే, తెలిసిన మరో విషయమేమిటంటే, తను పెద్దవాడైనప్పటికీ, తండ్రి తన కుమారుణ్ణి శిక్షించవచ్చు. (షరహ్ అన్నవవీ ముస్లిం) 

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఈ హదీసు కారణంగానే ఉమర్ (రదియల్లాహు అన్హు)  – తాను కఠిన మనస్కులైనప్పటికీ తన భార్యలను మసీదులకు వెళ్ళకుండా అడ్డుకునేవారు కారు. దీనిని గూర్చి ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు)  స్వయంగా సెలవిచ్చిన దాని ప్రకారం – ఉమర్ (రదియల్లాహు అన్హు) సతీమణుల్లో ఒకరు ఇషా మరియు ఫజ్ర్ నమాజులను మసీదుకు వెళ్ళి జమాత్ తో కలిసి చదివేవారు. దీని గురించి ఆమెతో – మీరు మసీదుకు వచ్చి ఎందుకు నమాజు చదువుతున్నారు? ఉమర్ (రదియల్లాహు అన్హు)  ఎంతో ఆత్మాభిమానం కలవారని మరియు ఈ విషయాన్ని ఇష్ట పడరని మీకు తెలుసుగా? అని ప్రశ్నించబడింది. దీనిపై ఆమె – మరైతే ఆయన నన్ను ఎందుకు వారించడం లేదు? అని అడిగారు. ఆమెకు జవాబిస్తూ – “మీరు అల్లాహ్ దాసీలను మసీదులకు వెళ్ళకుండా అడ్డుకోకండి” అన్న దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞ ఉమర్ (రదియల్లాహు అన్హు) కు, మిమ్మల్ని వారించకుండా ఆపుతోంది – అని అనబడింది. (బుఖారీ : 900) 

దీని ద్వారా తెలిసిందేమిటంటే – ఉమర్ (రదియల్లాహు అన్హు) స్వతహాగా తన సతీమణులు మసీదుకు వెళ్ళడాన్ని ఇష్టపడనప్పటికీ, ఆయన వారిని వారించలేదు. దీనికి కారణం ఏమిటి? కేవలం ఆయన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసు ‘మీరు అల్లాహ్ దాసీలను మసీదులకు వెళ్ళకుండా అడ్డుకోకండి’ను విని వుండడం, ఈ కారణం వల్లే ఆయన తన సతీమణులను మసీదులకు వెళ్లకుండా అడ్డుకొనే వారు కారు. . 

(2) అబ్దుల్లా బిన్ బరీరా కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ముగ్ ఫిర్ (రదియల్లాహు అన్హు)  ఒక వ్యక్తి (ఆయన బంధువు)ని చిన్న కంకర్రాళ్ళను లేపి విసురుతుండడం చూసి అతనితో – ఇలా చేయకు, ఎందుకంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని వారిస్తూ లేదా అయిష్టత వ్యక్తం చేస్తూ ఇలా సెలవిచ్చారు. ఇలా చేసి జంతువులను వేటాడనూ లేము మరియు శత్రువుపై ప్రాబల్యం కూడా వహించలేం. దీని ద్వారా ఒకరి దంతాలు విరగ్గొట్టవచ్చు లేదా కండ్లు పగల గొట్టవచ్చు. 

తదుపరి అబ్దుల్లా బిన్ ముగ్ ఫిర్ (రదియల్లాహు అన్హు)  ఆ వ్యక్తిని మరో సారి మునుపటిలాగానే కంకర్రాళ్ళు విసిరివేస్తుండడం చూసి ఇలా అన్నారు – ‘నేను నీకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని వారించారు లేదా అయిష్టత వ్యక్తం చేశారన్న హదీసు విన్పించినా నువ్వు ఈ పనిని మానుకోలేదు. కనుక నేను ఇక ఇంత…ఇంత కాలం వరకు నీతో మాట్లాడను పో.” 

మరో ఉల్లేఖనంలో ఇలా వుంది – నేను నీతో ఇక ఎప్పుడూ మాట్లాడను. 

(బుఖారీ : 5479, ముస్లిం: 1964) 

అల్లాహ్ ను ప్రార్థించేదేమిటంటే – ఆయన మనందరికీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులను గౌరవించి, వాటిని అనుసరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్ !! 

రెండవ ఖుత్బా 

(7) ఖురాను మరియు హదీసులపై ఆచరణ 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ ఉమ్మత్ పై వున్న ఏడవ హక్కు ఏమిటంటే- ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మరణానికి పూర్వం తన ఉమ్మత్ (అనుచర సమాజం)కు ఇచ్చి వెళ్ళిన రెండు వస్తువులను బాగా అధ్యయనం చేయాలి మరియు వాటి ద్వారానే సమస్త ఇస్లామీయ బోధనలను గ్రహించాలి. అవి దివ్య ఖురాను మరియు ప్రామాణికంగా నిర్ధారించ బడ్డ సున్నతులు, 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు: “నేను మీ మధ్య రెండు వస్తువులు వదిలి వెళుతున్నాను. వీటి తర్వాత (ఒకవేళ మీరు గనక వీటిని గట్టిగా పట్టుకొంటే) మీరెప్పుడూ మార్గ భ్రష్టులు కాలేరు. వాటిలో ఒకటి అల్లాహ్ గ్రంథం (దివ్య ఖురాను) కాగా రెండవది నా సున్నతు. కౌసర్ సరస్సు వద్ద నా దగ్గరకు వచ్చే వరకు ఈ రెండు (ఖురాను, సున్నత్)ఎప్పుడూ వేరుకాజాలవు.” (సహీ ఉల్ జామె : 2937) 

కనుక ప్రతి ఒక్కరిపై విధిగా వున్న విషయమేమిటంటే – ధార్మిక విషయాలన్నింటినీ దివ్య ఖురాను మరియు ప్రామాణిక హదీసుల నుండి సంగ్రహించాలి. అప్పుడే వారు మార్గభ్రష్టులు కాకుండా సన్మార్గంలో నడవ గలుగుతారు. 

(8) అధికంగా దరూద్ పఠనం 

ఉమ్మత్ (అనుచర సమాజం )పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు గల ఎనిమిదవ హక్కు ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహివ సల్లం)పై అధికంగా దరూద్ పఠించాలి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్త పై కారుణ్యాన్ని (దరూద్) పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరుకూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ వుండండి”. (అహ్ జాబ్:56) 

ఈ ఆయతు అవతరించిన తర్వాత సహాబాలు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో – ఓ దైవ ప్రవక్తా! సలామ్ చేసే పద్ధతి మాకు తెలుసు. మరి మీపై దరూద్ ఎలా పంపాలి? అని అడిగారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో – మీరు ఇలా పలకండి అని అన్నారు:

 “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్, వ అలా ఆలి ముహమ్మద్, కమాసల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్, వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్.”  (బుఖారీ : 3370) 

అన్నింటి కన్నా శ్రేష్ఠమైన దరూద్ ఇదే. దీనినే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహాబాలకు నేర్పించారు. దరూద్ యొక్క అత్యంత శుభకర పదజాలం కూడా ఇదే. ఎందుకంటే ఈ పదాలు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోటి నుండి వెలువడ్డాయి. మరి చూడబోతే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట్లాడడేదంతా వహీ (దైవ వాణి) అయివుంటుంది. దానికి విరుద్దంగా ఆయన ఎప్పుడూ మాట్లాడరు.. 

ప్రామాణిక (సహీ) హదీసులలో ఈ దరూద్ పై ఉల్లేఖించబడ్డ పదజాలంలో దేనితోనైనా మనం దరూద్ పఠించవచ్చు. 

దరూద్ పంపడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో హదీసులలో ఉల్లేఖించబడ్డాయి. ఇక్కడ మేము కొన్నింటిని వివరిస్తున్నాం: 

(1) అబూ హురైరా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఏ వ్యక్తి అయినా నాపై ఒక్కసారి దరూద్ పంపుతే, అల్లాహ్ అతనిపై 10 కారుణ్యాలు అవతరింప జేస్తాడు.” (ముస్లిం : 409) 

(2) అనస్ (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా నాపై ఒక్కసారి దరూద్ పంపితే, అల్లాహ్ అతనిపై 10 కారుణ్యాలు అవతరింపజేస్తాడు, 10 పాపాలు తుడిచేస్తాడు మరియు పది స్థానాలు పైకి లేపుతాడు.” (సహీ ఉల్ జామె: 6359) 

(3) అబూ దర్దా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఏ వ్యక్తి అయినా ఉదయం 10 సార్లు మరియు సాయంత్రం 10 సార్లు నాపై దరూద్ పంపిస్తాడో అతనికి ప్రళయం రోజు నా సిఫారసు భాగ్యం లభిస్తుంది.” (సహీ ఉల్ జా మె : 6357) 

కనుక వీలైనంత ఎక్కువగా దరూదను పఠిస్తూ వుండాలి. 

ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో ఓ దైవ ప్రవక్తా! నేను మీపై అధికంగా దరూద్ పఠిస్తూ వుంటాను. మీపై నేను ఎంత దరూద్ పఠించాలి? దీనిపై మీ అభిప్రాయమేమిటి? అని అడిగారు. ఆయన జవాబిస్తూ – ‘నీ ఇష్టమొచ్చినంత’ అని అన్నారు. 

ఉబై బిన్ కాబ్ (రజి అల్లాహు అన్హ) : నాల్గవ భాగం (పఠించనా)? 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) : నీ ఇష్టమైనంతగా, 

కానీ దీని కన్నా ఎక్కువగా పఠించగలిగితే అది నీకే మేలు, 

ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) : సగ భాగం (పఠించనా)? 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం): నీ ఇష్టమైనంతగా, కానీ దీని కాన్నా ఎక్కువగా పఠించగలిగితే అది నీకే శ్రేయస్కరం. 

ఉబై బిన్ కాబ్ : మూడింట రెండు వంతులు? 

దైవప్రవక్త : నీ ఇష్టమైనంతగా, 

కానీ దీని కన్నా ఎక్కువగా పఠించగలిగితే అది నీకే మేలు. 

ఉబై బిన్ కాబ్ : (సంపూర్ణంగా) మీపై దరూద్ నే పఠిస్తూ వుంటే? 

దైవ ప్రవక్త : అప్పుడు మీ కష్టాలు దూరం కావడానికి ఇది (ఈ ఆచరణ) చాలు మరియు (దీని వల్ల) మీ పాపాలన్ని క్షమించబడతాయి.  (తిర్మిజీ: 2456, సహీహ్ – అల్ బానీ) 

ఆఖరిగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనల్ని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులన్నింటినీ నెరవేర్చే , ఆయనకు విధేయత చూపే, ఆయనను ప్రేమించే సద్బుద్ధిని ప్రసాదించుగాక మరియు ప్రళయం రోజు ఆయన సిఫారసు మరియు ఆయన చేతుల మీదుగా కౌసర్ సరస్సు నీటిని సేవించగలిగే మహా భాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్! 

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు [వీడియో]
https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)  (మెయిన్ పేజీ)
https://teluguislam.net/muhammad/

%d bloggers like this: