దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపటం అనివార్యం
అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం]
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించిన వాటిని నెరవేరుస్తూ, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించిన వాటికి దూరంగా ఉంటూ విధేయత చూపటం ప్రతి వ్యక్తికీ తప్పనిసరి. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్త అని సాక్ష్యమిచ్చిన ప్రతి ఒక్కరి నుండీ ఈ విధంగా కోరబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధేయత చూపవలసిందిగా అల్లాహ్ అనేక సూక్తులలో ఆజ్ఞాపించాడు. కొన్ని చోట్లయితే తనకు విధేయత చూపమని ఆజ్ఞాపించిన వెంటనే, తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కూడా విధేయత కనబరచాలని ఆదేశించాడు. ఉదాహరణకు :
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
“ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయులై ఉండండి.” (అన్ నిసా 4: 59)
ఇలాంటి సూక్తులు ఇంకా ఉన్నాయి. ఒక్కోచోట కేవలం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపమని చెప్పబడింది. ఉదాహరణకు :
مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّ
“ఈ ప్రవక్తకు విధేయత చూపినవాడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే.” (అన్ నిసా 4: 80)
వేరొక చోట ఈ విధంగా సెలవీయబడింది :
وَأَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
“దైవప్రవక్త విధేయులుగా మసలుకోండి – తద్వారానే మీరు కరుణించ బడతారు.” (అన్ నూర్ 24 : 56)
ఒక్కోచోట తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు అవిధేయత కనబరిచే వారిని అల్లాహ్ హెచ్చరించాడు. ఉదాహరణకు :
فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِ أَن تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ
“వినండి! ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదిరిస్తున్నారో వారు, తమపై ఏదయినా ఘోర విపత్తు వచ్చిపడుతుందేమోనని లేదా తమను ఏదయినా బాధాకరమయిన శిక్ష చుట్టుముడుతుందేమోనని భయ పడాలి.” (అన్ నూర్ 24 : 63)
అంటే వారి ఆంతర్యం ఏదైనా ఉపద్రవానికి – అంటే అవిశ్వాసానికిగానీ, కాపట్యానికి గానీ, బిద్అత్ కు గానీ ఆలవాలం (నిలయం) అవుతుందేమో! లేదా ప్రాపంచిక జీవితంలోనే ఏదయినా బాధాకరమైన విపత్తు వారిపై వచ్చి పడుతుందేమో! అంటే – హత్య గావించ బడటమో లేదా కఠిన కారాగార శిక్ష పడటమో లేదా మరేదయినా ఆకస్మిక ప్రమాదానికి గురవటమో జరగవచ్చు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) యెడల ప్రేమను అల్లాహ్ దైవప్రీతికి తార్కాణంగా, పాపాల మన్నింపునకు సాధనంగా ఖరారు చేశాడు:
قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు.” (ఆలి ఇమ్రాన్ 3 : 31)
ఇంకా – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) యెడల చూపే విధేయతను మార్గదర్శకత్వంగా, అవిధేయతను మార్గవిహీనతగా అల్లాహ్ ఖరారు చేశాడు :
وَإِن تُطِيعُوهُ تَهْتَدُوا
“మీరు దైవ ప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది.” (అన్ నూర్ 24 : 54)
ఆ తరువాత ఇలా అనబడింది:
فَإِن لَّمْ يَسْتَجِيبُوا لَكَ فَاعْلَمْ أَنَّمَا يَتَّبِعُونَ أَهْوَاءَهُمْ ۚ وَمَنْ أَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوَاهُ بِغَيْرِ هُدًى مِّنَ اللَّهِ ۚ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
“మరి వారు గనక నీ సవాలును స్వీకరించకపోతే, వారు తమ మనో వాంఛలను అనుసరించే జనులని తెలుసుకో. అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కాకుండా తన మనోవాంఛల వెనుక నడిచే వానికన్నా ఎక్కువ మార్గభ్రష్టుడెవడుంటాడు? అల్లాహ్ దుర్మార్గులకు ఎట్టిపరిస్థితిలోనూ సన్మార్గం చూపడు.” (అల్ ఖసస్ 28 : 50)
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) లో ఆయన అనుయాయుల కొరకు గొప్ప ఆదర్శం ఉందన్న శుభవార్తను కూడా అల్లాహ్ వినిపించాడు. ఉదాహరణకు ఈ సూక్తిని చూడండి :
لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا
“నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది – అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు.” (అల్ అహ్ జాబ్ 33 : 21)
ఇమామ్ ఇబ్నె కసీర్ ( రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి సమస్త వాక్కాయ కర్మలలో, పరిస్థితులలో ఆయన్ని అనుసరించే విషయంలో ఈ సూక్తి ఒక ప్రాతిపదిక వంటిది. అందుకే కందక యుద్ధం జరిగిన రోజు అల్లాహ్ సహన స్థయిర్యాలతో వ్యవహరించాలనీ, శత్రువుల ఎదుట ధైర్యంగా నిలబడాలనీ, పోరాటపటిమను కనబరచాలనీ లోకేశ్వరుని తరఫున అనుగ్రహించబడే సౌలభ్యాల కోసం నిరీక్షించాలని ఉపదేశించాడు. మీపై నిత్యం ప్రళయదినం వరకూ దైవకారుణ్యం, శాంతి కలుగుగాక!”
అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపవలసిందిగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధానాన్ని అనుసరించవలసిందిగా ఖుర్ఆన్లో దాదాపు 40 చోట్ల ఆదేశించాడు. కాబట్టి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయతను అధ్యయనం చేయటం, దానిని అనుసరించటం మనకు అన్నపానీయాల కన్నా ముఖ్యం. ఎందుకంటే మనిషికి అన్నపానీయాలు లభించకపోతే ప్రపంచంలో మరణం సంభవిస్తుంది. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు గనక విధేయత చూపకపోతే, ఆయన సంప్రదాయాన్ని అనుసరించకపోతే పరలోకంలో శాశ్వతమయిన శిక్షను చవిచూడవలసి ఉంటుంది. అలాగే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సకల ఆరాధనలలో తన పద్ధతిని అనుసరించవలసిందిగా ఆజ్ఞాపించారు. కనుక మనం ఆరాధనలను ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసినట్లుగానే చేయాలి. ఈ నేపథ్యంలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ
“నిశ్చయంగా మీ కొరకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)లో అత్యుత్తమ ఆదర్శం ఉంది.” (అల్ అహ్ జాబ్ 33 : 21)
మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకిలా ఉపదేశించారు :
“నేను నమాజ్ చేస్తుండగా నన్ను చూసిన విధంగానే మీరు నమాజ్ చేయండి.” (బుఖారీ)
ఇంకా ఇలా అన్నారు :
“మీరు నా నుండి హజ్ క్రియలను నేర్చుకోండి.” (ముస్లిం)
ఈ విధంగా హెచ్చరించారు :
“ఎవరయినా మేము ఆజ్ఞాపించని దానిని ఆచరిస్తే, అట్టి కర్మ త్రోసి పుచ్చబడుతుంది.” (సహీహ్ ముస్లిం)
ఇంకా ఇలా చెప్పారు :
“ఎవడయితే నా విధానం పట్ల విముఖత చూపాడో వాడు నా వాడు కాడు.” (బుఖారీ, ముస్లిం)
ఈ విధంగా ఖుర్ఆన్ హదీసులలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపవలసిందిగా సూచించే ఆజ్ఞలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు అవిధేయత చూపరాదని కూడా చెప్పబడింది.
ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 181-184)
You must be logged in to post a comment.