ఈ ప్రసంగం ఇస్లాంలో పవిత్ర ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వక్త ఖురాన్‌ను ఒక దైవిక గ్రంథంగా మరియు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే కాకుండా, యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథంగా పరిచయం చేస్తున్నారు. ఇది అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటిగా చెప్పబడింది. విశ్వాసులపై ఖురాన్‌కు ఉన్న హక్కులు ఈ ప్రసంగం యొక్క ప్రధాన అంశం, ప్రత్యేకించి మొదటి హక్కు అయిన దానిపై పూర్తి మరియు అచంచలమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటంపై దృష్టి పెడుతుంది. ఈ విశ్వాసం, ఖురాన్ అల్లాహ్ యొక్క కల్తీ లేని వాక్యమని, జిబ్రయీల్ దూత ద్వారా అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేయబడిందని నమ్మడాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, అల్లాహ్ స్వయంగా ఖురాన్‌ను ఎలాంటి మార్పుల నుండి అయినా సంరక్షిస్తానని హామీ ఇచ్చాడని, ఆ వాగ్దానం 1400 సంవత్సరాలకు పైగా నిజమని నిరూపించబడిందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
అభిమాన సోదరులారా, కారుణ్య కడలి, రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఖుర్ఆన్ యొక్క హక్కులు – ఒక పరిచయం
ఈరోజు మనం ఖుర్ఆన్ హక్కులలోని ఒక హక్కు గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం మౌలిక విశ్వాసాలకి ముఖ్యమైన ఆధారాలలో ఖుర్ఆన్ గ్రంథం ప్రధానమైనది. ఈ గ్రంథం పూర్తిగా దివ్య సందేశం. ఈ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.
సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు తన దాసులపై అమితమైన ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించాడు.ఆ వరాలలో, అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనపైన కురిపించిన వరాలలో అత్యంత మహోన్నత వరం దివ్య ఖుర్ఆన్. ఈ గ్రంథం సులభమైనది. స్వార్థపరులు ఎంత ప్రయత్నించినా మార్పులు చేర్పులకు సాధ్యం కాని విధంగా పంపబడిన గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.
మానవులు మరచిపోయిన ధర్మాన్ని పునర్జీవింపజేయడానికే ఖుర్ఆన్ అవతరించింది. ఖుర్ఆన్ గ్రంథం ఏదో ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. దీనిపై అధికార పెత్తనాలు చెలాయించే హక్కు ఏ వర్గానికీ లేదు. ఇది మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఇది మానవులందరికీ మార్గదర్శకం. కనుక ఖుర్ఆన్ గ్రంథాన్ని అనుసరించేవారు తమ నిజ ప్రభువు ఆజ్ఞలను అనుసరిస్తున్నట్లే.ఇది క్లుప్తంగా నేను ఖుర్ఆన్ యొక్క పరిచయం చేశాను
ఖుర్ఆన్ యొక్క మొదటి హక్కు: విశ్వాసం (ఈమాన్)
మనపై ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. అవేమిటో మనం తెలుసుకుందాం. కానీ ఖుర్ఆన్ యొక్క హక్కులలో ఈరోజు మనం మొదటి హక్కు, అనగా ఖుర్ఆన్ పై విశ్వాసం గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. మిగతావి తర్వాత తెలుసుకుందాం.
ఖుర్ఆన్ యొక్క మొదటి హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్ పై విశ్వాసం. మనపై ఖుర్ఆన్ కు గల మొదటి హక్కు, దానిని మనం విశ్వసించాలి. మనస్ఫూర్తిగా నమ్మి, అంగీకరించి విశ్వసించాలి. ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఈ గ్రంథం, ఈ ఖుర్ఆన్ గ్రంథం, జిబ్రయీల్ దైవదూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిందని నోటితో అంగీకరించి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి.
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్ – సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.(ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. (అష్-షుఅరా 26:192-195)
దీని సారాంశం ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. జిబ్రయీల్ దైవదూత ద్వారా ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఖుర్ఆన్ వచ్చింది. సర్వ మానవుల కొరకు ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది.
అభిమాన సోదరులారా, అంటే ఈ గ్రంథం ముమ్మాటికీ సర్వలోక ప్రభువైన అల్లాహ్ తరఫున పంపబడిన గ్రంథం. దీన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని వచ్చారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. సర్వ లోకాల, సర్వ మానవుల సన్మార్గం కోసం ఖుర్ఆన్ గ్రంథం అవతరింపబడినది.
ఖుర్ఆన్ సంరక్షణ బాధ్యత అల్లాహ్ దే
ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా సురక్షితంగా ఉందని నమ్మాలి. ఖుర్ఆన్ గ్రంథంలో ఎటువంటి మార్పులు జరగలేదు, జరగవు కూడా. సురక్షితంగా ఉందని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ (ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్) నిశ్చయంగా ఈ హితోపదేశాన్ని (ఖుర్‌ఆన్‌ను) మేమే అవతరింపజేశాము. మరి మేమే దీనిని పరిరక్షిస్తాము. (అల్-హిజ్ర్ 15:9)
మేము ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. కావున దివ్య ఖుర్ఆన్ స్వార్థపరుల కుయుక్తుల నుండి, అలాగే ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నామని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చెప్పిన ఈ వాక్కు, ఈ ఆయత్ సత్యమని గత 1442 సంవత్సరాలుగా రూఢి అవుతూనే ఉంది.
సూరహ్ బఖరాలోనే రెండవ ఆయత్:
ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ (జాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్ లిల్ ముత్తఖీన్) ఈ గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. (అల్-బఖర 2:2)
ముగింపు
అభిమాన సోదరులారా, సారాంశం ఏమనగా ఖుర్ఆన్ అల్లాహ్ పంపిన గ్రంథం. ఖుర్ఆన్ జిబ్రయీల్ దైవదూత ద్వారా పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన గ్రంథం. ఖుర్ఆన్ సర్వమానవులకు సన్మార్గం చూపటానికి పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. ఇది మానవులందరి ఉమ్మడి సొత్తు. అలాగే ఖుర్ఆన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరించింది. ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులకి, చేర్పులకి తావు లేదు. మార్పులు చేర్పులు జరగలేదు, జరగవు. దానిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు.
కావున, ఖుర్ఆన్ యొక్క హక్కులలో, మనపై ఖుర్ఆన్ కు గల హక్కులలో మొదటి హక్కు ఏమిటి? ఖుర్ఆన్ ను విశ్వసించడం. దానిని మనము విశ్వసించాలి. కేవలం విశ్వసిస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకా విశ్వసించటమే కాకుండా ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
వ ఆఖిరు ద అ వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ప్రవక్తల పంపకం యొక్క ఉద్దేశ్యం, వారి పాత్ర మరియు సందేశం గురించి వివరించబడింది. అల్లాహ్ తన ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చేవారిగా మరియు హెచ్చరించే వారిగా పంపాడని, ఏకదైవారాధన వైపు ప్రజలను పిలవడానికి మరియు బహుదైవారాధన (షిర్క్) నుండి హెచ్చరించడానికి వారు వచ్చారని స్పష్టం చేయబడింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని, వారి మధ్య వచ్చిన ప్రవక్తలందరి ప్రాథమిక సందేశం ఒక్కటేనని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో వివరించబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ చేసిన ఈ ఏర్పాటును అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది.
ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు,
وَأَرْسَلَ اللَّهُ جَمِيعَ الرُّسُلِ مُبَشِّرِينَ وَمُنذِرِينَ (వ అర్సలల్లాహు జమీఅర్రుసుల్ ముబష్షిరీన వ మున్దిరీన్) అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ కూడా శుభవార్త ఇచ్చే వారిగా మరియు హెచ్చరించే వారిగా చేసి పంపాడు.
దలీల్ ఇప్పుడే ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము, కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గమనించండి. అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ చూపాడు! మనం మార్గభ్రష్టత్వంలో పడి ఉండకుండా, చనిపోయిన తర్వాత నరకంలో శిక్ష పొందకుండా, మన మేలు కొరకు అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపరను ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి షిర్క్ మొదలయ్యాక నూహ్ అలైహిస్సలాంని ఆ తర్వాత ఇంకా ఎందరో ప్రవక్తలని పంపుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పరంపరను అంతం చేశాడు.
శుభవార్త మరియు హెచ్చరిక
అయితే ఆ ప్రవక్తలందరూ శుభవార్త ఇచ్చేవారు, హెచ్చరించేవారు. ఇక రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, శుభవార్త ఏంటి అది? ఎవరి కొరకు? మూడో విషయం, హెచ్చరిక ఏమిటి? ఎవరి కొరకు?
శుభవార్త ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్తను అనుసరిస్తారో, ఇక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, అలాంటి వారికి స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ యొక్క గొప్ప వరాలు, అనుగ్రహాల యొక్క శుభవార్త.
ఇక ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించరో, అల్లాహ్ తో పాటు వేరే వారిని భాగస్వామిగా కలుపుతారో, ఎవరైతే ప్రవక్తల్ని వారి వారి కాలాలలో అనుసరించలేదో, ఇప్పుడు ప్రళయం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో అలాంటి వారికి హెచ్చరిక. దేని గురించి? నరకం నుండి. ఇంకా వేరే భయంకరమైన శిక్షల నుండి.
అందుకొరకు ఈ పాఠంలోని ఈ మొదటి అంశం ద్వారా తెలిసేది ఏమిటంటే అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరిక చేసే వారిగా ఏదైతే పంపాడో మనం శుభవార్తను అందుకునే వారిలో చేరాలి.
ఇక ఈ మాటపై దలీల్ ఏమిటి? సూరతున్నిసా లోని ఈ ఆయత్.
رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ (రుసులమ్ ముబష్షిరీన వమున్దిరీన్) మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము (4:165)
అల్లాహు త’ఆలా ప్రవక్తలని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. ఎందుకు?
لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ (లిఅల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతుమ్ బ’అదర్రుసుల్) ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము) (4:165)
ప్రవక్తలను పంపిన తర్వాత ప్రజల వద్ద అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క సాకు మిగిలి ఉండకూడదు. వారి వద్ద ఏ ప్రమాణం మిగిలి ఉండకూడదు. అంటే ఏమిటి? రేపటి రోజు ప్రజలు వచ్చి ఎప్పుడైతే అల్లాహు త’ఆలా లెక్క తీసుకుంటాడో వారి మధ్యలో తీర్పు చేస్తాడో మరియు వారు వారి యొక్క షిర్క్, ఇంకా అవిధేయత కారణాల వల్ల ఏదైతే నరకంలో వెళ్తూ ఉంటారో, అప్పుడు వారు “ఓ అల్లాహ్! మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నావు? నీవైతే మా హితోపదేశానికి, మమ్మల్ని మార్గం చూపడానికి, సన్మార్గం వైపునకు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఏ ప్రవక్తను పంపలేదు కదా, ఏ గ్రంథాన్ని అవతరింపజేయలేదు కదా” ఇలాంటి ఏ మాట చెప్పడానికి అవకాశం మిగిలి ఉండకూడదు. అందుకే అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపేసి స్వయం అల్లాహ్ ఒక హుజ్జత్, ఒక నిదర్శనం, వారిపై ఒక ప్రమాణం అల్లాహు త’ఆలా చేశాడు. ఇక ఎవరైతే సన్మార్గంపై ఉండరో, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే పాటించరో, ప్రవక్తల్ని అనుసరించరో దాని కారణంగా నరకంలో వెళితే ఇది అల్లాహ్ ది ఎంత మాత్రం తప్పు కాదు. అల్లాహ్ విషయంలో ఎలాంటి అన్యాయం చేశాడు అన్నటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే అల్లాహ్ వైపు నుండి మనం మార్గదర్శకత్వం పొందే సాధనాలన్నీ కూడా అల్లాహ్ యే ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి. కానీ మనం ఒకవేళ సన్మార్గంపై రాకుంటే అది మన తప్పు అవుతుంది.
ప్రవక్తలలో ప్రథముడు మరియు అంతిముడు
ఇక ఈనాటి పాఠంలో ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే షిర్క్ గురించి హెచ్చరిస్తూ వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. త్వరపడకండి. ఏదైనా ఆశ్చర్యం కలుగుతుందా? ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఆయన నబీ కూడా. మేము విన్నాము మరి ఇప్పుడు మొట్టమొదటి ప్రవక్త నూహ్ అని అంటున్నారు అలైహిస్సలాతో వసలామ్. అయితే ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త ఇది మాట కరెక్టే, ఇందులో అనుమానం లేదు. కానీ ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి షిర్క్ లేకుండినది. ప్రజలు బహుదైవారాధనలో పడలేదు, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. కాకపోతే కొన్ని వేరే తప్పులు ఉండినవి. కానీ షిర్క్ లాంటి పాపం నూహ్ అలైహిస్సలాం ఏ జాతిలో పుట్టారో, నూహ్ అలైహిస్సలాం పుట్టుక కంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ షిర్క్ ఎప్పుడైతే మొదలైనదో ఆ షిర్క్ ను ఖండించడానికి మళ్ళీ ప్రజలను ఏక దైవారాధన వైపునకు పిలవడానికి నూహ్ అలైహిస్సలాంను పంపడం జరిగింది. అందుకొరకే అవ్వలుర్రుసుల్, మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం అని ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా రుజువు అవుతుంది. ప్రవక్త హదీసుల్లో హదీసుష్షఫా’అ అని చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది.
ఇక ఖురాన్ ఆయత్, సూరతున్నిసాలో:
إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ (ఓ ముహమ్మద్!) మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).
అల్లాహు త’ఆలా ప్రవక్తల ప్రస్తావన కంటే ముందు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకొచ్చారు.
ఇక సోదర మహాశయులారా, నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అంతిమ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఖాతమున్నబియ్యీన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేమగా, గౌరవంగా మన ప్రవక్త అంటాము, అంటే వేరే ఎవరి ప్రవక్త కాదు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. సర్వ మానవాళి వైపునకు ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు ప్రతి దేశంలో ఉన్న వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి, ప్రవక్తగా చేసి పంపబడ్డారు.
అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ఖురాన్లో ఉంది.
وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ (వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్) అయితే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరకు అంతిమ ముద్ర. (33:40)
అలాగే అనేక సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: “లా నబియ్య బ’అదీ”, నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్తగా రాలేరు. మీరేదో ఆశ్చర్యపడుతున్నట్లు ఉన్నది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా! మరి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి కంటే ముందు వస్తారు కదా, ఆయన ప్రవక్త కదా! ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే ప్రళయానికి ముందు వస్తారో ప్రవక్త యొక్క హోదాలో రారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతీ, ప్రవక్త ధర్మాన్ని, షరీయత్ను అనుసరించే వారే కాదు ప్రజలందరినీ కూడా అనుసరించే రీతిలో పాలన చేసే వారు. అందరిపై షరీయతె ఇస్లామియా అమలు చేసే వారిగా వస్తారు.
ప్రవక్తలందరి సందేశం
ఇక ప్రవక్తలందరి ప్రస్తావన వచ్చింది కదా! అయితే వారందరినీ మొదటి ప్రవక్త నుండి మొదలుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఎంతమంది ప్రవక్తలొచ్చారో వారందరి రాక అసలైన ఉద్దేశం ఏమిటి?
يَأْمُرُهُمْ بِعِبَادَةِ اللَّهِ وَحْدَهُ (య’మురుహుమ్ బి ఇబాదతిల్లాహి వహ్ దహ్) కేవలం అల్లాహ్ నే ఆరాధించమని ఆయన వారిని ఆదేశిస్తారు
وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ (వ యన్హాహుమ్ అన్ ఇబాదతిత్తాఘూత్) మరియు త్రాగూత్ (మిథ్యా దైవాల) ఆరాధన నుండి వారిని వారించేవారు.
ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరెవరిని పూజించడం జరుగుతుందో, తాఘూత్ ల యొక్క ఇబాదత్ నుండి ఖండిస్తారు. ఇది ప్రవక్తల యొక్క రాక ముఖ్య ఉద్దేశం.
ఈ మాట, దీనికి ఆధారం సూరతున్నహ్ల్ ఆయత్ నంబర్ 36.
وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا (వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలా) ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను పంపాము (16:36)
ఆ ప్రవక్త తమ జాతి వారికి:
أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ (అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్) అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించండి. త్రాగూత్ కు దూరంగా ఉండండి (16:36)
అని చాలా స్పష్టంగా చెప్పేవారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఏ అల్లాహ్ పుట్టించాడో, పోషిస్తున్నాడో, ఈ సర్వ లోకాన్ని నడిపిస్తున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడు.
పాఠం యొక్క సారాంశం
ఈనాటి పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపాడు. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్టచివరి ప్రవక్త, ప్రవక్తల పరంపరకు అంతిమ మరియు ప్రవక్తలందరికీ ఒక ముద్ర లాంటి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మరియు ప్రవక్తలందరూ కూడా తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశించేవారు. మిథ్యా దైవాలను, అల్లాహ్ తప్ప అందరి ఆరాధనలను, తాఘూత్ యొక్క పూజను వదులుకోవాలి అని స్పష్టంగా ఖండించేవారు.
ఈ తాఘూత్ అంటే ఏమిటి? దీని గురించి మరింత వివరంగా వచ్చే పాఠంలో తెలుసుకోబోతున్నాము. వచ్చే పాఠం వినడం మర్చిపోకండి, చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ ఆరాధనపై స్థిరత్వం ప్రసాదించుగాక. ఆమీన్.
واخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته (వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్).
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి https://teluguislam.net/2023/04/19/u3mnj/
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.
మూత్ర తుంపరల నుండి జాగ్రత్త
ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.
అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)
ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.
ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.
ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?
ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.
మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.
ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.
అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?
أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ (అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్) “అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).
మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.
ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.
ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ ‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము: ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)యొక్క హక్కు ఆయన సహాబాలను గౌరవించడం
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ కు భయపడండి. మరియు ప్రతిక్షణం అల్లాహ్ యొక్క దైవభీతి మనసులో ఉంచండి. ఆయనకు విధేయత చూపండి. మరియు అవిధేయత నుండి జాగ్రత్త వహించండి.
మరియు మీరు ఈ విషయాన్ని గ్రహించండి. అహ్లే సున్నత్ వల్ జమాఅత్ యొక్క ప్రాథమిక హక్కులలో ఒకటి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సహచరులను గౌరవించడం. మరియు వారిని అనుసరించటం, వారికి విధేయత చూపటం, వారి హక్కులను తెలుసుకొని వాటిపై అమలు చేయడం, వారిని విశ్వసించడం, వారి కొరకు అల్లాహ్ ను క్షమాభిక్ష కోరడం, వారి యొక్క అంతర్గత విభేదాల గురించి మౌనం వహించటం, వారి శత్రువులతో శత్రుత్వం వహించటం, మరియు సహబాలలో ఎవరి గురించి అయినా తప్పటి ఆరోపణలు చరిత్రలో లిఖించబడినా, లేదా ఎవరైనా తప్పుడు రాతలు రాసినా, లేదా కవులు వారి గురించి తప్పుగా కవిత్వాలలో రాసిన వాటిపై అఇష్టత చూపాలి. ఎందుకంటే వారి స్థానాన్ని బట్టి వారిని గౌరవించాలి. వారి గురించి చెడు ప్రస్తావన చేయరాదు, వారి ఏ పనిలో తప్పులు వెతకరాదు, వారి గురించి మంచి ప్రస్తావన చేయాలి. వారి పుణ్య కార్యాల గురించి ప్రస్తావించాలి తప్ప వారి తప్పు ఒప్పుల విషయం గురించి మౌనం వహించాలి.
ఇస్లాం ధర్మ అత్యుత్తమ పండితులు ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) గారు ఇలా తెలియజేస్తున్నారు: అహ్లే సున్నత్ వల్ జమాఅత్ యొక్క ప్రాథమిక సూత్రాలలో ఇది కూడా ఉంది. అది ఏమిటంటే వారి హృదయం మరియు నాలుక సహబాల పట్ల ఎంతో ఉత్తమంగా, పరిశుభ్రంగా ఉంటాయి. ఈ విషయం గురించి అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు:
వారి తరువాత వచ్చినవారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు.” (59:10)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, నమాజు చేసేటప్పుడు ప్రార్థన చేసే వ్యక్తికి ముందు ఉంచే అడ్డంకి అయిన ‘సుత్రా’ యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. సుత్రా అంటే ఏమిటి, దాని ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ (విధానం)లో దాని స్థానం మరియు దాని సరైన పరిమాణం గురించి చర్చించబడింది. వ్యక్తిగత మరియు సామూహిక నమాజులో సుత్రాను ఎలా ఉపయోగించాలో కూడా వివరించబడింది; సామూహిక ప్రార్థనలో, ఇమామ్ యొక్క సుత్రా జమాఅత్ మొత్తానికి సరిపోతుంది. నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి నడిచి వెళ్లడం యొక్క తీవ్రమైన పాపం గురించి మరియు ప్రార్థన చేసే వ్యక్తికి వారిని ఆపడానికి ఉన్న హక్కు గురించి కూడా ప్రసంగంలో హెచ్చరించబడింది. ఇరుకైన ప్రదేశాలలో ప్రార్థన చేసే సందర్భంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం నుండి ఉదాహరణలతో పాటు, కొన్ని మినహాయింపులు కూడా చర్చించబడ్డాయి.
أَلْحَمْدُ لِلّٰهِ (అల్ హందులిల్లాహ్) సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللّٰهِ (వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్) మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. (ఆమీన్)
సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
ఈనాటి ప్రసంగంలో మనం సుత్రా గురించి తెలుసుకుందాం.
సుత్రా అంటే ఏమిటి?
సుత్రా అంటే ఏమిటి? ఒక వ్యక్తి నమాజు ఆచరిస్తున్నప్పుడు ఖిబ్లా వైపు నిలబడి నమాజు ఆచరిస్తున్న ప్రదేశంలో ఎంత దూరం వరకు అయితే అతను సజ్దా చేయగలుగుతాడో, అంత దూరపు ప్రదేశానికి కొంచెం ముందర ఒక వస్తువుని ఉంచుకోవటాన్ని సుత్రా అని అంటారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనా విధానాలలో ఇది కూడా ఒక సున్నతు, ఒక బోధనా విధానము. నమాజు ఒక వ్యక్తి ఒక విశాలమైన ప్రదేశంలో ఆచరించుకుంటూ ఉంటే అతను అతని ముందర ఖిబ్లా దిశలో ఒక వస్తువుని ఏదైనా, అది కర్ర కావచ్చు లేదా కుర్చీ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ఒక వస్తువుని అక్కడ ఉంచుకోవాలి.
అది ఒక రకంగా అటూ ఇటూ ఎవరైనా నడిచే వారికి ఒక సూచన లాంటిది. ఇంతటి ప్రదేశం వరకు నేను నమాజు చేస్తున్న ప్రదేశము, దీని పక్క నుంచి మీరు వెళ్ళండి, దీని లోపల అయితే నేను నమాజు చేస్తున్న ప్రదేశము అనేటట్టుగా ఒక సూచన ఉంటుంది. చూసే వ్యక్తి కూడా ఆ, ఆ ప్రదేశం వరకు అతను నమాజ్ చేసుకుంటున్నాడు అని దాని పక్క నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీనిని సుత్రా అంటారు.
సుత్రా యొక్క పరిమాణం
మరి ఆ సుత్రా ఎంతటి వస్తువు ఉండాలి అంటే హదీసు గ్రంథాలలో తెలుపబడిన విషయం, పల్లకి వెనుక భాగంలో ఉన్న వస్తువు అంత అయితే సరిపోతుంది అని తెలుపబడింది. ధార్మిక పండితులు దాన్ని వివరిస్తూ ఏమన్నారంటే, ఒక మూర కంటే కొంచెం చిన్నదైనా సరే సరిపోతుంది అని చెప్పారు. మూర కంటే తక్కువ ఎత్తు గల వస్తువు అయినా సరే దానిని ఉంచుకొని మనిషి నమాజ్ ఆచరించుకోవాలి.
మరి సుత్రా పెట్టుకోవటం ఇది సున్నత్ అని కూడా ధార్మిక పండితులు వివరించి ఉన్నారు.
వ్యక్తిగత మరియు సామూహిక నమాజులో సుత్రా
సుత్రా ఉంచుకున్న విషయాలలో మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే అతను ప్రత్యేకంగా అతని కోసము సుత్రా ఉంచుకోవాలి. ఒకవేళ సామూహికంగా మనిషి నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఇమామ్ ముందర సుత్రా ఉంచుకుంటే సరిపోతుంది, వెనుకల నిలబడిన ప్రతి వ్యక్తి ముందర సుత్రా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇమామ్ ముందర ఉంచుకోబడిన సుత్రాయే అతని వెనుక, ఆయన వెనుక నిలబడిన ముక్తదీలందరికీ కూడా సరిపోతుంది అని కూడా ధార్మిక పండితులు తెలియజేశారు.
అలాగే నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతని ముందర వేరే వ్యక్తి, పురుషుడైనా, మహిళ అయినా పడుకొని ఉంటే స్థలం లేని సందర్భంలో వారి వెనుక కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. మస్జిదులో మనం చూస్తూ ఉంటాం. కొందరు వ్యక్తులు కూర్చొని ఉంటారు. వారి వెనుక మనము కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. అలాగే ఇరుకైన గది ఉంటే అక్కడ సతీమణి ఎవరైనా కూర్చొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా, మిగిలిన కొద్ది స్థలంలోనే వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే ఆచరించుకోవచ్చు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట తహజ్జుద్ నమాజు కోసం లేచి నిలబడినప్పుడు, నేను ఖిబ్లా దిశలో పడుకొని ఉంటాను, మిగిలిన ప్రదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి నమాజ్ ఆచరించుకునేవారు. ఒక్కొక్కసారి అనుకోకుండా నా కాలు ఆయన సజ్దా చేసే స్థితికి వెళ్ళిపోతే ఆయన సజ్దా చేసేటప్పుడు అలా తట్టి నాకు సైగ చేస్తే నేను వెంటనే కాలు ముడుచుకునే దానిని అని కూడా తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఖిబ్లా దిశలో పడుకొని ఉంటే నమాజ్ ఆచరించుకునేవారు, పూర్తి నమాజ్ అయిపోయాక వితర్ నమాజ్ ఆచరించుకునే సమయానికి ఆమెకు కూడా లేపి వారు ఇద్దరూ కలిసి చివరిలో వితర్ నమాజు కలిసి ఆచరించుకునేవారు అని తెలియజేశారు. కాబట్టి పురుషుడు గాని మహిళ గాని ఖిబ్లా దిశలో పడుకొని ఉన్నా మిగిలిన ప్రదేశంలో వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే కూడా ఆచరించుకోవటానికి అనుమతి ఉంది.
నమాజు చేసే వ్యక్తి ముందు నుండి వెళ్ళడం గురించి ముఖ్య సూచనలు
ఇక్కడ రెండు విషయాలు మనము బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతను సజ్దా చేసే ప్రదేశం ఎంత దూరం వరకు అయితే ఉంటుందో, ఆ లోపు నుంచి దాటుకునే ప్రయత్నం చేయరాదు. అది ఒక పాపంగా పరిగణించబడుతుంది. దాని నష్టం ఎంత పెద్దది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి 40 రోజులు లేదా 40 వారాలు లేదా 40 నెలలు లేదా 40 సంవత్సరాలు ఒంటి కాలు మీద నిలబడిపోవడానికైనా సరే సిద్ధపడిపోతాడు గానీ ఆ పాపం చేయటానికి సిద్ధపడడు. అంత కఠినమైనది ఆ తప్పు అని చెప్పారు. కాబట్టి నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి ముందర నుంచి, అతను సజ్దా చేసే ప్రదేశం ఎంతవరకు అయితే ఉంటుందో, దాని లోపలి నుంచి దాటుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయరాదు. అది ఒక కఠినమైన తప్పుగా మనము తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి.
రెండో విషయం ఏమిటంటే, తెలియక, చూడకుండా ఎవరైనా ఒక వ్యక్తి అక్కడి నుంచి దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, నమాజ్ ఆచరించే వ్యక్తికి ఆ వ్యక్తిని చేతితో అడ్డుకునే అనుమతి ఉంది. అతను చేతితో అడ్డుకోవాలి. అతను మూర్ఖంగా ముందుకే సాగటానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటించి అతన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి, వదలకూడదు అని కూడా తెలియజేయడం జరిగింది.
ఏది ఏమైనప్పటికిని మనిషి ఒక గోడ వెనుక గాని లేదా ఏదైనా వస్తువు వెనుక గాని సుత్రాగా ఏర్పరచుకొని నమాజ్ ఆచరించుకోవాలి. ఇది ఒక విధానము, ఒక సున్నత్ విధానము మనకు తెలుపబడింది. అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధానాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
క్రింది విషయం “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లాహ్)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)
సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు – గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]
ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్ చేయకండి.”
“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్ ఉంటాడు.” [40]
ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]
కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని స్తంభం దగ్గర నమాజ్ చేయటానికి ప్రయత్నించేవారు. [42]
అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;
“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]
ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]
తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]
ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]
హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :
[38] బుఖారీ, అహ్మద్
[39] బుఖారీ, ముస్లిం
[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.
[41] అబూదావూద్, జవాయెద్ బజ్జార్ – 54 పేజీ, హాకిమ్ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.
[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్ అయినా, ఒంటరిగా నమాజ్ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్ ఇమామ్ అహ్నద్”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్ అహ్మద్ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.
నేను చెప్పేదేమిటంటే – ఇమామ్ అహ్మద్ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.
నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్ మాసంలో వెళ్లాను.
అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.
[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా
[44][45] బుఖారీ, అహ్మద్
[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్
[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.
[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.
[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.
[53] అహ్మద్, దారెఖు,త్నీ తబ్రానీ – సహీ పరంపరతో.
ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.
ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.
ఇలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!
54, బుఖారీ, ముస్లిం.
55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah) https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు] వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.
అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటి?
ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.
మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:
وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.
అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:
وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.
అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు
అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.
అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.
అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.
అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:
الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.
ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.
ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:
هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.
అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.
అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.
అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.
మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.
ధర్మవేత్తల జీవితాల నుండి ఉదాహరణలు
అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ
ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.
సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.
మూసా అలైహిస్సలాం వారి ఉదాహరణ
అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:
قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో
అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:
قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.
అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరొక ఉదాహరణ
మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.
ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఉదాహరణ
అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:
حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ (హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్) మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.
అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:
يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ (యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్) ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.
ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.
హాజిరా అలైహస్సలాం వారి ఉదాహరణ
అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.
ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.
ముగింపు: సాధనాలతో కూడిన నమ్మకం
ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.
అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.
ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.
ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.
మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.
కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.
ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హదీత్ అంటే ఏమిటి? హదీత్ ఖుద్సీ అని దేన్ని అంటారు? https://youtu.be/pTJRtR-ca8c [11:20 నిముషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఉపన్యాసం హదీథ్ మరియు దాని రకాల గురించి వివరిస్తుంది. హదీథ్ అంటే ఏమిటి మరియు హదీథ్-ఎ-ఖుద్సీకి మరియు హదీథ్-ఎ-నబవికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తుంది. హదీథ్-ఎ-నబవి మూడు రకాలుగా విభజించబడింది: ప్రవక్త యొక్క మాటలను సూచించే ‘ఖౌలీ’, ఆయన చర్యలను వివరించే ‘ఫిలీ’, మరియు ఆయన ఆమోదాన్ని సూచించే ‘తఖ్రీరీ’. ఉపన్యాసంలో ప్రతి రకానికి ఖురాన్ మరియు హదీథ్ నుండి ఉదాహరణలతో సహా వివరణ ఇవ్వబడింది. సున్నత్ అనే పదాన్ని హదీథ్ కు పర్యాయపదంగా ఎలా ఉపయోగిస్తారో కూడా చర్చించబడింది, ఇందులో ప్రవక్త యొక్క శారీరక స్వరూపం మరియు సత్ప్రవర్తన కూడా ఉంటాయి. చివరగా, హదీథ్-ఎ-ఖుద్సీ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చెప్పబడిన అల్లాహ్ యొక్క మాటలు అని స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
హదీథ్ అంటే ఏమిటి? హదీథ్-ఎ-ఖుద్సీ దేనిని అంటారు? దీనిని మనం కొన్ని ఉదాహరణలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
హదీథ్ రకాలు: నబవి మరియు ఖుద్సీ
హదీథ్ రెండు రకాలు. ఒకటి అల్ హదీథున్ నబవి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్. అల్ హదీథుల్ ఖుద్సీ అంటే, అల్లాహ్ చెబుతున్నాడు, అల్లాహ్ తెలిపాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీథ్.
అల్ హదీథున్ నబవి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్ అని ఎప్పుడైతే మనం అంటామో అది మూడు రకాలుగా ఉంటుంది.
అల్ ఖౌలీ (ప్రవచనం),
అల్ ఫిలీ (క్రియ, ఆచరణ),
తఖ్రీరీ (అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఎవరైనా ఏదైనా మాట్లాడారు లేదా ఏమైనా చేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని అంగీకరించారు లేదా దానిలో ఏదైనా సరిదిద్దుబాటు ఉండేది ఉంటే దానిని సరిచేశారు, సంస్కరించారు).
ఇక అల్ హదీథున్ నబవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్ లో ఈ మూడు రకాలు అని ఏదైతే మనం తెలుసుకున్నామో, ప్రతి ఒక్క దానికి ఒక దలీల్ ఉదాహరణగా మనం తెలుసుకుందాము.
హదీథ్-ఎ-ఖౌలీ(ప్రవచనం)
మొదటిది ప్రవచనం, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట, ఆయన ప్రవచనం, ఆయన చెప్పారు అని ఏదైతే వస్తుందో.
مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ “ఎవరైతే విశ్వాసం మరియు పుణ్య ఫలాపేక్షతో రమదాన్ మాసమంతా ఉపవాసం ఉంటారో, వారి గత పాపాలన్నీ కూడా మన్నించబడతాయి.”
హదీథ్-ఎ-ఫిలీ (ఆచరణ)
ఇక అల్ ఫిలీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా ఆచరించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్రియ గురించి సహాబీ చెబుతున్నాడు, ప్రవక్త ఇలా చేశారు అని.
దీని ఉదాహరణ, దీనికి దలీల్ సహీహ్ ముస్లిం, హదీథ్ నంబర్ 226, సహీహ్ ముస్లింలోని పదాలు తీసుకోవడం జరిగింది అందు గురించి దీని ఆధారం ముందు చెప్పడం జరుగుతుంది. ఈ భావం సహీహ్ బుఖారీలో కూడా వచ్చి ఉంది, హదీథ్ నంబర్ 196. ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ కొరకు నీళ్ళు తెప్పించారని ఆయన బానిస హుమ్రాన్ చెప్పారు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు తమ రెండు అరచేతులను మూడుసార్లు కడిగారు మరియు పుక్కిలించారు, ముక్కులో నీళ్ళు ఎక్కించారు మరియు మూడు సార్లు ముఖం కడిగారు. మళ్ళీ మూడుసార్లు మోచేతుల వరకు కుడి చెయ్యి, ఆ తర్వాత మళ్ళీ ఎడమ చెయ్యి కడిగారు. మళ్ళీ తల యొక్క మసహ్ చేశారు. ఆ తర్వాత, రెండు కాళ్ళు ముందు కుడి కాలు, ఆ తర్వాత ఎడమ కాలు మూడుసార్లు కడిగారు చీలమండలాల వరకు. మళ్ళీ ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు:
رَأَيْتُ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا [ర’అయ్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ తవద్ద్’అ నహ్వ వుదూ’ఈ హాదా] “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఎట్లా వుదూ చేశానో, అదే విధంగా వుదూ చేశారు.”
ప్రవక్త చేసిన ఒక పని గురించి ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ తెలియజేశారు. ఇది హదీథ్-ఎ-ఫిలీ యొక్క ఉదాహరణ అయింది.
హదీథ్-ఎ-తఖ్రీరీ (ఆమోదం)
ఇక హదీథ్-ఎ-తఖ్రీరీ, దీని ఉదాహరణ అబూ దావూద్ లో వచ్చి ఉంది, హదీథ్ నంబర్ 334. అమ్ర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, విపరీతమైన చలి రాత్రి నాకు స్వప్నస్కలనం జరిగింది. అప్పుడు మేము దాతుస్సలాసిల్ అనే యుద్ధంలో ఉన్నాము. అయితే ఒకవేళ నేను స్నానం చేశానంటే ఈ చలిలో నన్ను నేను చంపుకున్నట్టు అవుతుంది, ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. అందుకొరకు నేను తయమ్ముమ్ చేసి ఫజర్ నమాజ్ సహాబాలందరికీ చేయించాను, ఆ యుద్ధంలో ఎవరైతే ఆయన వెంట ఆ సందర్భంలో ఉన్నారో. అయితే మదీనా తిరిగి వచ్చిన తర్వాత సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అమ్ర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ సంఘటన తెలియజేశారు.
అప్పుడు ప్రవక్త నన్ను మందలిస్తూ, “యా అమ్ర్, సల్లయ్ తబి అస్ హాబిక వ అంత జునుబ్?” (ఓ అమ్ర్, నీవు అశుద్ధ స్థితిలో ఉండి నీ మిత్రులకు, తోటి సహాబాలకు నమాజ్ చేయించావా?). “ఫ అఖ్ బర్ తుహూ బిల్ లదీ మన’అనీ మినల్ ఇగ్ తిసాల్” (స్నానం చేయడం నుండి నన్ను ఆపిన విషయం ఏమిటో, అంటే ఏ కారణం చేత నేను స్నానం చేయలేదో, పైన ఏదైతే మనం తెలుసుకున్నాము కదా, విపరీతమైన చలి ఉంది, ఆ చలిలో నేను స్నానం చేస్తే చనిపోతానన్నటువంటి భయం జరిగింది నాకు).
అయితే ఆ విషయాన్ని మొత్తం నేను ప్రవక్తకు వివరించాను. అంతేకాకుండా ఇంకా నేను చెప్పాను, ప్రవక్తా, నేను అల్లాహ్ యొక్క ఈ మాటను విన్నాను, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం సూరతున్నిసా, ఆయత్ నంబర్ 29 లో:
وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا [వలా తఖ్ తులూ అన్ఫుసకుమ్, ఇన్నల్లాహ కాన బకుమ్ రహీమా] “మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై చాలా కరుణించేవాడు.” (4:29)
అందుకొరకే, స్నానం చేస్తే చనిపోతానన్నటువంటి భయం కలిగింది గనక నేను స్నానం చేయలేదు మరియు తయమ్ముమ్ చేసి నమాజ్ చేయించాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వారు, ఏమీ అనలేదు. అయితే ఇక్కడ ఏం తెలిసింది? సహాబీ ఒక పని ఏదైతే చేశారో, అది బాగానే ఉంది అన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరించారు. అందుకొరకే దీనిని హదీథ్-ఎ-తఖ్రీరీ అని అనడం జరిగింది.
హదీథ్ మరియు సున్నత్
ఇక హదీథ్ ను సున్నత్ అని కూడా అనడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇందులో మరో నాలుగో రకం కూడా చేరుతుంది. అదేమిటి? ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆకృతి, ఆయన ఎలా ఉన్నారు అన్న విషయం, అంతేకాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సత్ప్రవర్తనలు కూడా ఇందులో ప్రస్తావించబడతాయి.
ఉదాహరణకు సహీహ్ ఇబ్నె హిబ్బాన్, హదీథ్ నంబర్ 5676, ముస్నద్ అహ్మద్ 24903 లో ఉంది, ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారిని ప్రశ్నించడం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేస్తారు అని. అప్పుడు ఆమె చెప్పారు:
كَانَ يَخِيطُ ثَوْبَهُ، وَيَخْصِفُ نَعْلَهُ، وَيَعْمَلُ مَا يَعْمَلُ الرِّجَالُ فِي بُيُوتِهِمْ “ప్రవక్త తమ దుస్తుల్లో ఎక్కడైనా ఏదైనా చినిగి ఉంటే అతుకు వేసుకునేవారు మరియు అలాగే చెప్పులు ఏదైనా కుట్టుకునే అవసరం వస్తే కుట్టుకునేవారు. ఇంకా సామాన్యంగా పురుషులు ఇంట్లో ఎలాగైతే పనులు చేసుకుంటారో, అలా చేసుకునేవారు.”
హదీథ్-ఎ-ఖుద్సీ
ఇక్కడి వరకు ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్, హదీథ్-ఎ-నబవి అని ఏదైతే అంటారో అందులో ఉన్నటువంటి నాలుగు రకాలు ఆధారాలతో సహా మనం తెలుసుకున్నాము. ఇక హదీథ్ రెండు రకాలు అని ముందు చెప్పాము కదా? ఒకటి హదీథ్-ఎ-నబవి, దాంట్లో నాలుగు రకాలు దాని వివరణ అయిపోయింది. రెండవది అల్ హదీథుల్ ఖుద్సీ. అల్ హదీథుల్ ఖుద్సీ అంటే అల్లాహ్ ఏదైనా మాట చెబుతున్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం, ఉల్లేఖించడం. దీని యొక్క ఉదాహరణ సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 7405, సహీహ్ ముస్లిం 2675, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
يَقُولُ اللَّهُ تَعَالَى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي بِي [యఖూలుల్లాహు త’ఆలా: అన ఇన్ ద దన్ని అబ్ దీ బీ, వ అన మ’అహూ ఇదా కరనీ] “అల్లాహు త’ఆలా ఇలా చెబుతున్నాడు: నేను నా దాసుని ఆలోచన, అతడు నా గురించి ఎలాంటి మంచి ఆశ ఉంచుకుంటాడో అదే విధంగా నేను అతనితో మసలుకుంటాను. మరియు అతడు ఒకవేళ నన్ను స్మరించాడంటే, నేను అతనికి తోడుగా ఉంటాను.”
ఇంకా హదీథ్ కొంచెం పొడుగ్గా ఉంది చివరి వరకు. అయితే ఇక్కడ ఈ హదీథ్ లో ఏమన్నారు ప్రవక్త గారు? అల్లాహ్ చెబుతున్నాడు అని. అయితే ఈ విధంగా హదీథ్ లో ఎక్కడైతే వస్తుందో, అక్కడ దానిని అల్ హదీథుల్ ఖుద్సీ అనడం జరుగుతుంది.
బహుశా హదీథ్ అంటే ఏమిటో కొంచెం అర్థమైంది అని భావిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఖురాన్ హదీథ్ ప్రకారంగా ధర్మ విద్య నేర్చుకునే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం శుక్రవారం ఖుత్బా (ప్రసంగం) సమయంలో నిశ్శబ్దం పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఖుత్బా జరుగుతున్నప్పుడు ఇతరులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడం కూడా నిషేధించబడినదని, అలా చేయడం శుక్రవారం నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. శుక్రవారం నాడు త్వరగా వచ్చి, స్నానం చేసి, నఫిల్ నమాజ్ చేసి, మౌనంగా ఖుత్బా విన్నవారికి పది రోజుల పాపాలు క్షమించబడతాయని చెప్పబడింది. ఖుత్బా వినడం అనేది అజాన్‌కు సమాధానం ఇవ్వడం కంటే ముఖ్యమైనదని, ఆలస్యంగా వచ్చినవారు కూడా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసి ఖుత్బా వినడంలో నిమగ్నం కావాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.
السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.) (అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీపై వర్షించుగాక. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)
باب الإنصات للخطبة يوم الجمعة (బాబుల్ ఇన్సాతి లిల్ ఖుత్బతి యౌమల్ జుమా) (శుక్రవారం రోజు ఖుత్బాకు మౌనంగా వినడం అనే అధ్యాయం.)
జుమా రోజు ఖుత్బా జరుగుతున్న సమయంలో మౌనం వహించడం, గమ్మున ఉండడం.
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا قلت لصاحبك يوم الجمعة أنصت والإمام يخطب، فقد لغوت (అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుముఅతి అన్‌సిత్ వల్ ఇమాము యఖ్తుబు, ఫఖద్ లగౌత)
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “జుమా రోజు ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో ‘మౌనం వహించు’ అని అంటే, నీవు ఒక లగ్వ్ (వ్యర్థమైన) పని చేసినవానివి అవుతావు.”
ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో, జుమా రోజు, మనం సైలెంట్‌గా ఉండాలి, మౌనం వహించాలి. ఏ కార్యకలాపాలు చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు.
రెండో బోధ మనకిందులో, మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నాము, కొందరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారు, వారికి కూడా మనం చెప్పకూడదు. “అరే ఇలా చేయకు,” “ఓ బాయ్, ఖామోష్ రహో,” “మౌనం వహించు,” “ప్లీజ్ సైలెంట్‌గా ఉండు” అని మనం చెప్పకూడదు. ఇది ఇమామ్ యొక్క బాధ్యత, ఇమామ్ చెప్పాలి.
ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే, ఒకవేళ మనం ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా, “మీరు గమ్మున ఉండండి,” “మాట్లాడకండి,” “ప్లీజ్ సైలెంట్” అని మనం చెప్పామంటే, మనం లగ్వ్ చేసిన వాళ్ళం అయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.
లగ్వ్ అంటే ఇక్కడ ఏంటి? లగ్వ్ అంటే ఇక్కడ పనికిమాలిన, వృధా మాట. అయితే, చూడటానికి ఇక్కడ గమనించండి, గమనించండి, చూడటానికి మనం ఒక మంచి పని చేశామని అనిపిస్తుంది కదా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే, “ష్, సైలెంట్ ప్లీజ్” ఈ విధంగా మెల్లగా చెప్పేశాము. మనం ఒక మంచి పని చేశాము అనే భావన మనకు ఏర్పడింది. కానీ ప్రవక్త ఏమంటున్నారు? فقد لغوت (ఫఖద్ లగౌత) – “నీవు ఒక లగ్వ్ పని చేశావు” అని. మరియు ఇక్కడ లగ్వ్ అన్నదానికి భావం, ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహ్మతుల్లా అలై తెలిపినట్లు,
خبت من الأجر (ఖిబ్త మినల్ అజ్ర్) నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు.
بطلت فضيلة جمعتك (బతలత్ ఫజీలతు జుముఅతిక్) జుమాకు సంబంధించిన ఏ ఘనత, ఏ గొప్పతనం అయితే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం. అల్లాహు అక్బర్.
حرم فضيلة الجمعة (హురిమ ఫజీలతల్ జుమా) జుమా యొక్క ఫజీలత్ ఏదైతే ఉందో దాని నుండి అతడు మహ్రూమ్ అయిపోయాడు
అందుకొరకు సోదర మహాశయులారా, కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో, అనేకమంది మన సోదరులు, మిత్రులు ఖుత్బా అరబీలో జరుగుతుంది, మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు, ముగ్గురు, నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఇంకా మహా ఘోరమైన విషయం.
గమనించండి ఇక్కడ. ఇద్దరు మాట్లాడుకునే వారిని, “మీరు సైలెంట్‌గా ఉండండి” అని చెప్పడంలోనే పాపం ఉన్నది, జుమా యొక్క సవాబ్ (పుణ్యం) కోల్పోతున్నారంటే, ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి. ఈ హదీస్ ఏదైతే మీకు వినిపించానో, సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 934, అలాగే సహీ ముస్లిం, హదీస్ నంబర్ 851.
ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము.
عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من اغتسل ثم أتى الجمعة، فصلى ما قدر له، ثم أنصت حتى يفرغ من خطبته، ثم يصلي معه، غفر له ما بينه وبين الجمعة الأخرى، وفضل ثلاثة أيام
(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: మనిగ్తసల సుమ్మ అతల్ జుముఅత, ఫసల్లా మా ఖుద్దిర లహు, సుమ్మ అన్‌సత హత్తా యఫ్రుగ మిన్ ఖుత్బతిహి, సుమ్మ యుసల్లీ మఅహు, గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుముఅతిల్ ఉఖ్రా, వ ఫద్లు సలాసతి అయ్యామ్)
ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో, జుమా నమాజు కొరకు హాజరయ్యారో మరియు ఖుత్బా కంటే ముందు వచ్చి అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు చేశాడో (ఇది జుమా ఖుత్బా కంటే ముందు, సామాన్యంగా వీటిని మనం నఫిల్ అంటాము. జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు. కనీసం రెండు రకాతులు, కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు. ఇమామ్ ఖుత్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు), ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమామ్ ఖుత్బా మొదలు పెడతాడో అప్పటి నుండి ఖుత్బా పూర్తి అయ్యే వరకు అన్‌సత (أنصت) – సైలెంట్‌గా ఉన్నాడు, మౌనం వహించాడు, గమ్మున ఉండిపోయాడు. ఆ తర్వాత ఇమామ్‌తో నమాజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు, అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా, అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహ్‌తాలా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్.
గమనించండి, పది రోజుల పాపాలు జుమా రోజు నమాజుకు హాజరై, త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అంటే అన్ని చేసుకొని, ఇమామ్‌తో ఖుత్బా వినడంలో శ్రద్ధ వహించడం, మౌనం వహించడం, అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటి? ఒకవేళ ఎవరైనా మాట్లాడారో, మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారో అంటే వారు జుమా యొక్క సవాబును కోల్పోయారు.
ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు. వచ్చేసరికి ఏదైనా ఆలస్యం అయిపోయింది, మేము మస్జిద్‌లోకి వచ్చాము, ఇమామ్ అజాన్ ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏం చేయాలి? రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా? లేకుంటే అజాన్ అయ్యేవరకు మేము వేచి ఉండాలా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడానికి? అయితే సోదర మహాశయులారా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం, కానీ ఇమామ్ యొక్క ఖుత్బా వినడం అనేది అజాన్ యొక్క జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక, సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి, ఇమామ్ యొక్క ఖుత్బా శ్రద్ధగా వినాలి.
అల్లాహ్ మనందరికీ మన జీవితంలోని ప్రతీ సమస్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి పరిష్కారాన్ని స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.
—
494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]
జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతరములు:
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.
జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.
జుమా రోజు స్నానం (ఘుస్ల్) చేయడం
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ “ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ” అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”. (అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.) (సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)
عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ “ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ” అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”. (అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)
వుదూ మరియు స్నానం మధ్య ఆధిక్యత
عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم “ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ” అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.
(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).
జుమా ఆచారాలు మరియు వాటి పుణ్యఫలాలు
عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا
(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).
ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.
మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.
జుమా రోజు సువాసన పూసుకోవడం
ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.
సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).
ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.
అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.
మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.
మొదటి దువా: పాపాల క్షమాపణ కోసం
మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)
“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”
అని చదువుతారో,
غُفِرَ لَهُ ذَنْبُهُ (గుఫిర లహూ దన్బుహూ)
వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.
ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.
రెండవ దువా: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సిఫారసు కోసం
ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.
“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”
అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.