తాగూత్ (الطَّاغُوتِ) & దాని యొక్క రకాలు [వీడియో & టెక్స్ట్]

తాగూత్ & దాని యొక్క రకాలు
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
youtube.com/watch?v=rzm66iOZUwg [22 నిముషాలు]

ఈ పాఠంలో, వక్త ‘తాగూత్’ అనే విషయాన్ని వివరిస్తారు. అల్లాహ్‌ను కాకుండా ఆరాధించబడే ప్రతిదాన్ని ‘తాగూత్’ అంటారు. ప్రతి ఒక్కరూ తాగూత్‌ను తిరస్కరించి, అల్లాహ్‌ను మాత్రమే విశ్వసించాలని ఇస్లాం నిర్దేశిస్తుందని వక్త పేర్కొన్నారు. ఇమామ్ ఇబ్న్ అల్-ఖయ్యిమ్ నిర్వచనం ప్రకారం, ఆరాధన, విధేయత లేదా అనుసరణలో మానవుడు తన పరిధిని దాటడానికి కారణమయ్యేది తాగూత్. ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్-వహాబ్ ప్రకారం, ఐదు ప్రధాన తాగూత్‌లు ఉన్నాయి: 1. ఇబ్లీస్ (సైతాన్), 2. తన ఆరాధన పట్ల సంతోషించేవాడు, 3. తనను ఆరాధించమని ప్రజలను పిలిచేవాడు, 4. అగోచర జ్ఞానం ఉందని చెప్పుకునేవాడు, 5. అల్లాహ్ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా తీర్పు చెప్పేవాడు. చివరగా, “ధర్మానికి శిరస్సు ఇస్లాం, దాని స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం జిహాద్” అనే హదీస్‌తో వక్త పాఠాన్ని ముగించారు.

అల్హమ్దులిల్లాహ్. ఉసూలె సలాస, త్రి సూత్రాలు 23వ పాఠం. తాగూత్ యొక్క వివరణ మరియు దాని యొక్క ఆధారాలు, దాని యొక్క రకాలు.

ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ ఈ త్రి సూత్రాలు అన్న పుస్తకం యొక్క చివరి అంశాన్ని ఈ తాగూత్ యొక్క వివరణ గురించి పెట్టారు. ఆయన చెప్పారు:

وَقَدِ افْتَرَضَ اللَّهُ عَلَى جَمِيعِ الْعِبَادِ الْكُفْرَ بِالطَّاغُوتِ وَالْإِيمَانَ بِاللَّهِ
[వ ఖద్ ఇఫ్తరదల్లాహు అలా జమీఇల్ ఇబాది అల్ కుఫ్ర బిత్తాగూతి వల్ ఈమాన బిల్లాహ్]
(మరియు నిశ్చయంగా అల్లాహ్ సర్వ దాసులపై తాగూత్‌ను తిరస్కరించడం మరియు అల్లాహ్‌ను విశ్వసించడం విధిగావించాడు.)

అల్లాహు త’ఆలా సర్వమానవులపై విధిగావించాడు. ఏంటి? అల్లాహ్ విధిగా చేశాడు అందరూ కూడా తాగూత్‌ను తిరస్కరించాలి అని మరియు కేవలం అల్లాహ్‌ను మాత్రమే విశ్వసించాలి, ఆరాధించాలి అని.

ఇక ఈ తాగూత్ అన్న పదం ఇంతకుముందు కూడా వచ్చింది, సంక్షిప్తంగా అక్కడ విన్నారు కూడా. అయితే, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తాగూత్ గురించి చెప్పిన నిర్వచన మనమందరమూ కూడా తెలుసుకొని, మన జీవితంలో ఇలాంటి ఏ తాగూత్‌కు మనం బానిస కాకుండా, తాగూత్‌కు ఏ విధంగా అంకితం కాకుండా, కేవలం అల్లాహ్‌ను ఆరాధిస్తూ ఆయన ఆదేశాలను మాత్రమే పాటించాలి.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చెప్పారు,

مَعْنَى الطَّاغُوتِ
[మ’నా అత్తాగూత్]
(తాగూత్ యొక్క అర్థం)

مَا تَجَاوَزَ بِهِ الْعَبْدُ حَدَّهُ مِنْ مَعْبُودٍ أَوْ مَتْبُوعٍ أَوْ مُطَاعٍ
[మా తజావజ బిహిల్ అబ్దు హద్దహు మిమ్ మ’బూదిన్ అవ్ మత్ బూఇన్ అవ్ ముతాఇన్]
(మనిషి ఆరాధన విషయంలో గానీ, విధేయత విషయంలో గానీ మరియు అనుసరణ విషయంలో గానీ ధర్మ హద్దులను మీరి, దాటి ప్రవర్తించడం)

ఇక ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ ఆ తర్వాత చెప్పారు:

وَالطَّوَاغِيتُ كَثِيرُونَ
[వత్ తవాగీతు కసీరూన్]
(మరియు తాగూత్‌లు చాలామంది ఉన్నారు.)

وَرُءُوسُهُمْ خَمْسَةٌ
[వ రుఊసుహుమ్ ఖమ్సహ్]
(వాటిలో చాలా ముఖ్యమైనవి, భయంకరమైనవి ఐదు రకాలు)

ఇక తాగూత్ యొక్క భావం ఇబ్నె ఖయ్యిమ్ నిర్వచనలో ఆయన చెప్పినటువంటి డెఫినేషన్‌లో తెలుసుకున్న తర్వాత, ఈ ఐదు రకాలు తెలుసుకోండి. తాగూత్‌లలో చాలా ముఖ్యమైనవి. ఏంటి అవి?

ఇబ్లీస్ అల్లాహ్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రజలను అల్లాహ్ మార్గం నుండి దూరం చేయడానికి సర్వవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకొరకే అల్లాహు త’ఆలా అనేక సందర్భాల్లో మనకు షైతాన్ యొక్క స్నేహం నుండి, షైతాన్ యొక్క విధేయత నుండి, షైతాన్ యొక్క ఆరాధన నుండి ఖండించాడు.

సూరత్ యాసీన్ మృతులపై చదవాలి అని అంటారు, ఇది సహీ హదీస్‌తో రుజువైన విషయం కాదు. అందులో బ్రతికి ఉన్న వారి కొరకు ఎన్నో గొప్ప నిదర్శనాలు, సూచనలు ఉన్నాయి. అందులో మన అంశానికి సంబంధించి ఒక ఆయత్‌ను గమనించండి, అల్లాహ్ అంటున్నాడు:

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لَّا تَعْبُدُوا الشَّيْطَانَ
[అలమ్ అ’హద్ ఇలైకుమ్ యా బనీ ఆదమ అల్లా త’బుదుష్ షైతాన్]
(ఓ ఆదం సంతతివారలారా! షైతాన్‌ను ఆరాధించవద్దని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా?)

ఓ మానవులారా, మీతో వాగ్దానం తీసుకోబడిన విషయాన్ని మర్చిపోయారా? మీరు షైతాన్‌ను ఏ మాత్రం ఆరాధించకూడదు అని మీతో వాగ్దానం తీసుకోబడినది, దాన్ని గుర్తు చేసుకోండి, పాటించండి. ఆ వాగ్దానాన్ని గుర్తు చేయడానికే అల్లాహు త’ఆలా ప్రవక్తల్ని పంపుతూ వచ్చాడు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ధర్మాన్ని స్పష్టపరిచాడు. ప్రళయం వరకు అందరూ కూడా ఈ ఇస్లాం ధర్మాన్ని ప్రవక్త అనుసరణను అవలంబించడం తప్పనిసరి.

మొదటి తాగూత్ ఎవరు? ఇబ్లీస్. సూరె ఆరాఫ్, ఇంకా వేరే ఎన్నో సూరాలు చదవండి. సూరె ఆరాఫ్‌లో ఆ ఇబ్లీస్ అల్లాహ్‌తో వాగ్దానం చేస్తూ చెప్తున్నాడు, “నేను మానవుల యొక్క కుడి వైపు నుండి, ఎడమ వైపు నుండి, ముందు నుండి, వెనక నుండి వచ్చి నేను నీ మార్గం నుండి, సన్మార్గం నుండి వారిని దూరం చేస్తాను” అని. అల్లాహు అక్బర్. అయితే మనం ఏం చేయాలి? ఇబ్లీస్ అతి పెద్ద తాగూత్ అని తెలిసిన తర్వాత మనం అతని యొక్క అనుకరణ నుండి, విధేయత నుండి, అతని యొక్క ఆరాధన నుండి దూరం ఉండాలి. మీరంటారు షైతాన్‌ను ఎవరు ఆరాధిస్తారండీ? ముస్లింలు అయితే అల్లాహ్ నే కదా ఆరాధించేది? కానీ అల్లాహ్ ఆరాధనలో భాగస్వామిగా చేయడం షైతాన్‌కు ఇష్టం.

إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا
[ఇన్ యద్ఊన మిన్ దూనిహీ ఇల్లా ఇనాసన్, వ ఇన్ యద్ఊన ఇల్లా షైతానమ్ మరీదా]
(వారు ఆయనను వదిలి కేవలం స్త్రీలను మాత్రమే ప్రార్థిస్తున్నారు. వాస్తవానికి వారు తిరస్కార షైతాన్‌ను మాత్రమే ప్రార్థిస్తున్నారు.)

సూరతున్నిసాలో వచ్చి ఉంది గమనించండి. ఖురాన్ చదవండి మంచిగా. మనం అల్లాహ్ ఆదేశాలలో ఏ లోపం చేస్తున్నామో, అతని ఆరాధనలో ఏ భాగస్వామ్యం చేస్తున్నామో, వాస్తవానికి ఇది షైతాన్ యొక్క ఆరాధన అయిపోతుంది అన్న విషయం మనం పట్టించుకుంటలేము. అందుకొరకే అనేకమంది ఎక్కడెక్కడో తలలు వంచుకుంటూ, బలిదానాలు చేసుకుంటూ, మొక్కుబడులు చేసుకుంటూ, దువాలు ఎవరెవరితో అడుగుతూ ఇంత భయంకరమైన షిర్క్‌కు పాల్పడుతున్నారు, తమకు తాము ఇంకా స్వర్గం మాదే, మేమే పక్కా ముస్లింలమని అనుకుంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. అతి పెద్ద తాగూత్, ఇబ్లీస్.

مَنْ عُبِدَ وَهُوَ رَاضٍ
[మన్ ఉబిద వహువ రాదిన్]
(ఎవరినైతే పూజించడం జరుగుతుందో మరియు అతడు ఆ పూజను ఇష్టపడి ఉన్నాడో)

ఇది కూడా చాలా భయంకర విషయం. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు వేరే వాళ్ళల్లో, వేరే మతస్థుల్లో ఉన్నారు అది వేరే విషయం, వేరే వాళ్ళ విషయం అంటే ఇక్కడ, వారికి కూడా మనం బోధించాలి, వారు అసలే సన్మార్గం నుండి దూరంగా ఉన్నారు. కానీ ముస్లింలు అని అనుకునే వాళ్ళల్లో కూడా ఎందరో పీరీలను, బాబాలను మొక్కుతున్నారు. వారికి సజ్దా చేస్తున్నారు. ఆ సజ్దా వారికి చేయడం షిర్క్‌లో వస్తుంది మరియు వారు దాని పట్ల సంతోషపడి ఉన్నారు.

ఇక్కడ విషయం గమనించాలి. ఎవరినైతే ఆరాధించడం జరుగుతుందో మరియు వారు దాని పట్ల ఇష్టం కలిగి ఉన్నారో, అలాంటి వారే తాగూత్‌లోకి వస్తారు. ఖురాన్‌లో ఎప్పుడైతే సూర అంబియాలో ఆయత్ అవతరించినదో:

إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ حَصَبُ جَهَنَّمَ
[ఇన్నకుమ్ వమా త’బుదూన మిన్ దూనిల్లాహి హసబు జహన్నమ్]
(మీరు మరియు మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కూడా నరకం పాలవుతారు)

అప్పుడు ఈ ఆయత్ అవతరించినప్పుడు ముష్రికులు సంతోషపడ్డారు. సరే సరే, ఎందరో క్రైస్తవులు ఈసాను కూడా మొక్కుతున్నారు, ఈసాను కూడా ఆరాధిస్తున్నారు, ఆయన కూడా నరకంలో పోతారు, ఎందరో యూదులు ఉజైర్‌ను ఆరాధిస్తున్నారు, ఆయన కూడా నరకంలో పోతారు, మేము కూడా పోతాము. అల్లాహు త’ఆలా ఆయత్ అవతరింపజేశాడు:

إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا الْحُسْنَىٰ أُولَٰئِكَ عَنْهَا مُبْعَدُونَ
[ఇన్నల్లజీన సబఖత్ లహుమ్ మిన్నల్ హుస్నా ఉలాఇక అన్హా ముబ్ అదూన్]
(నిశ్చయంగా ఎవరి గురించి అయితే ముందే మా మాట వచ్చేసిందో మరియు వారు పుణ్యాత్ముల్లో ఉన్నారో, వారు ఇలాంటి నరక శిక్ష నుండి దూరం ఉంటారు)

ఎందుకంటే ఈసా అలైహిస్సలాం గానీ, హజ్రత్ ఉజైర్ గానీ, ఇంకా పుణ్యాత్ములు ఎవరైతే నిజంగా అల్లాహ్ యొక్క విశ్వాసులు, వలీలు ఉన్నారో వారు వారిని ఎవరో ఆరాధిస్తున్నారు కానీ వారు దీని పట్ల ఇష్టం కలిగి లేరు. వారు తమ జీవితంలో అల్లాహ్ యేతర ఆరాధనలన్నిటినీ కూడా ఖండించారు. సూర మాయిదాలో ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాంని అడుగుతాడు, అందరి ముందు:

أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ
[అ అంత ఖుల్త లిన్నాసిత్తఖిజూనీ వ ఉమ్మియ ఇలాహైని మిన్ దూనిల్లాహ్]
(నీవు ప్రజలతో నన్నూ, నా తల్లినీ అల్లాహ్‌ను వదిలి ఇద్దరు ఆరాధ్యులుగా చేసుకోమని చెప్పావా?)

అల్లాహ్‌కు తెలుసు అంతా కూడా కానీ అందరి ముందు ఈసా నోట పలికించాలి అని. ఓ ఈసా, నీవు నన్ను మరియు నా తల్లిని అల్లాహ్‌ను వదిలి ఆరాధించండి అని చెప్పావా? అప్పుడు ఈసా అలైహిస్సలాం ఎంత వినయ విధేయతతో, ఎంత వినయ వినమ్రతతో, లేదు ఓ అల్లాహ్ నేను ఎలా చెప్పగలను ఇలాంటి మాట. ఒకవేళ నేను చెప్పి ఉంటే నీకు తెలిసే ఉంది. అల్లాహ్‌కు కూడా తెలుసు ఈసా అలైహిస్సలాం చెప్పలేదు కానీ అందరి ముందు ఈసా అలైహిస్సలాం నోట ఈ సత్యాన్ని వెలిబుచ్చాలి, ఏ క్రైస్తవులు అయితే అల్లాహ్‌ను వదిలి ఈసా అలైహిస్సలాంను ఆరాధిస్తున్నారో, వారికి కూడా స్పష్టంగా తెలియాలి ఈసా అలైహిస్సలాం చెప్పని మాట మేము ఆచరిస్తున్నాము అని. అర్థమైందా రెండవ రకం?

ఎవరైతే స్వయం తన ఆరాధన వైపునకు ఆహ్వానిస్తున్నాడో, అలాంటి వాడు కూడా తాగూత్. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో అలాంటి వారు కూడా కొందరు ఉన్నారు.

అగోచర జ్ఞానం యొక్క ఆరోపణ చేయడం. ఈ రోజుల్లో కొందరు జ్యోతిషులు మరి కొందరు ఇతరుల భవిష్యత్తు గురించి తెలుపుతామని ఏదైతే ఆరోపిస్తారో, వాస్తవానికి ఇలాంటి వారిని కూడా ప్రజలు నమ్ముతారు. అల్లాహ్‌పై కలిగి ఉండవలసినటువంటి నమ్మకం వారిపై వారికి ఉంటుంది. అందుకొరకే ఇలాంటి ఆరోపణలు చేసే వారు కూడా తాగూత్‌లో వస్తారు.

అల్లాహ్ అవతరించిన సత్య ధర్మాన్ని వదలి వేరే చట్టాల ద్వారా, శాస్త్రాల ద్వారా తీర్పులు చేయడం. ఇందులో మూడు స్టేజీలు ఉంటాయి. మూడో స్టేజీ కుఫ్ర్ వరకు చేర్పించేది. మరియు

تَحْكِيمٌ بِغَيْرِ مَا أَنْزَلَ اللَّهُ
[తహ్కీమ్ బి గైరి మా అన్జలల్లాహ్]
(అల్లాహ్ అవతరింపజేయని దానితో తీర్పు చేయడం)

అల్లాహ్ అవతరింపజేయని విషయంతో తీర్పు చేయడం ప్రజల మధ్యలో ఇది చాలా భయంకరమైన విషయం.

ఈ ఐదు రకాల తాగూతుల ప్రస్తావన ఖురాన్‌లో వేరువేరు సందర్భాల్లో వచ్చి ఉంది. అన్ని రకాల తాగూతులను మనం వదలాలి అని ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ప్రవక్త తమ జాతి వారికి చెప్పారు. ఆ దలీల్, ఆధారం నిన్ననే మనం 22వ పాఠంలో విన్నాము, సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 36 ఆధారంగా.

ఇక సూరతుల్ బఖరాలోని ఈ ఆయత్‌ను గమనించండి:

فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ
[ఫమన్ యక్ఫుర్ బిత్తాగూతి వ యు’మిమ్ బిల్లాహి ఫఖదిస్ తమ్సక బిల్ ఉర్వతిల్ ఉస్ఖా]
(ఎవరైతే తాగూత్‌ను తిరస్కరిస్తారో, కేవలం అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో అలాంటి వారే బలమైన కడియాన్ని పట్టుకున్న వారు.)

షేఖ్ ఇబ్న్ ఉసైమీన్ రహిమహుల్లాహ్ చెప్పారు, అల్ ఉర్వతుల్ ఉస్ఖా అంటే ఇస్లాం ధర్మం.

ఇక మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ ఏదైతే చదువుతూ ఉంటామో వాస్తవానికి, ఫమన్ యక్ఫుర్ బిత్తాగూతి వ యు’మిమ్ బిల్లాహ్ యొక్క వివరణ, వాస్తవం, దాని యొక్క భావం ఈ కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సద్వచనంలో ఉంది. ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్, ఎవరైతే తాగూత్‌ను తిరస్కరిస్తారో అంటే, అల్లాహ్‌ను వదలి ఎవరెవరినైతే ఆరాధించడం జరుగుతుందో అదంతా కూడా తప్పు, నేను తిరస్కరిస్తాను, ఇది లా ఇలాహ అన్నటువంటి సెంటెన్స్‌లో ఉంది. దీనినే మనం ఇంతకు ముందు తిరస్కారం అని తెలుసుకున్నాము. వెంటనే ఇల్లల్లాహ్, వ యు’మిమ్ బిల్లాహ్. అంటే ఏమిటి? నమ్మడం, ఒప్పుకోవడం, రుజువు చేయడం. ఈ అర్హత ఎవరైనా కలిగి ఉంటే కేవలం అల్లాహ్ మాత్రమే. ఆయనే అద్వితీయుడు, ఏకైకుడు, ఎలాంటి భాగస్వామి లేనివాడు అని.

ఇక ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకాన్ని ఒక హదీస్ ద్వారా సమాప్తం చేస్తున్నారు. సుబ్ హా నల్లాహ్. ఎంత గొప్ప హదీస్, మూడే మూడు అందులో సెంటెన్సులు ఉంటాయి చిన్నగా.

رَأْسُ الْأَمْرِ الْإِسْلَامُ، وَعَمُودُهُ الصَّلَاةُ، وَذِرْوَةُ سَنَامِهِ الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ
[ర’సుల్ అమ్ రి అల్ ఇస్లామ్, వ అమూదుహు అస్సలాహ్, వ జిర్వతు సనామిహి అల్ జిహాదు ఫీ సబీలిల్లాహ్]
(ధర్మానికి శిరస్సు ఇస్లాం, దాని స్తంభం నమాజ్ మరియు దాని శిఖరాగ్రం అల్లాహ్ మార్గంలో జిహాద్.)

ఈ మూడు పదాలపై ఏదైతే ఈ పుస్తకం సమాప్తం చేశారో, వాస్తవానికి పూర్తి పుస్తకం మరియు ప్రత్యేకంగా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి తాగూత్ యొక్క వివరణకు దలీల్‌గా కూడా ఉంది మొదటి విషయం ఇందులో, మరియు పుస్తకం యొక్క సమాప్తం ద్వారా ముస్లిం వ్యక్తికి ఒక మంచి మార్గదర్శకత్వం ఇందులో చేయడం జరిగినది. సర్వమానవాళికి కూడా ఒక గొప్ప ఇందులో ఉపదేశం ఉన్నది.

అదేమిటంటే, ర’సుల్ అమ్ రి అస్సలాహ్, దీన్, ధర్మం అని ఏదైతే మనం అంటామో, దాని యొక్క తల ఇస్లాం. ధర్మం యొక్క తల ఇస్లాం అనంటే, శాబ్దికంగా అంటే కేవలం పదాలలో ఈ భావం ఏదైతే చెప్పడం జరిగిందో అంత తొందరగా అర్థం కాదు కదా, శ్రద్ధగా వినండి. ఎలాగైతే మన ఈ పూర్తి శరీరం ఒక ధర్మం లాంటిదైతే, ఇందులో తలను తీసేస్తే ఏమైనా ప్రయోజనకరమా? చూడడానికి ఈ ఐదు, ఐదున్నర, ఆరు ఫీట్ల మన శరీరంలో ఒక ఫీట్ కూడా బహుశా ఉండదు కావచ్చు కదా తల. కానీ మిగతా అంత ఎక్కువ శాతం ఉన్నా గానీ ఏదైనా లాభమా? అలాగే ఎవరు ఎంత ధర్మాన్ని అవలంబిస్తున్నారు, నేను చాలా గొప్ప ధార్మికుడిని, నేను చాలా ధర్మ ప్రేమికుడిని అని ఎంత చెప్పుకున్నా, ఒకవేళ ఇస్లాం లేకుంటే ఫలితం ఏంటి? ఇక్కడ ప్రశ్న వస్తుంది ఇస్లాం అంటే ఏ ఇస్లాం అని చెప్తున్నారు? 11వ పాఠంలో వివరణ జరిగింది, ఒకసారి తిరిగి వినండి కొంచెం, యూట్యూబ్‌లో ఫాస్ట్ చేసుకొని కూడా వినవచ్చు కదా, అలా వినండి.

الاِسْتِسْلَامُ لِلَّهِ
[అల్ ఇస్తిస్లాము లిల్లాహ్]
(అల్లాహ్‌కు లొంగిపోవడం)

కేవలం మనసా సంపూర్ణంగా విశ్వాసంతో అల్లాహ్‌కే లొంగిపోవుట.

وَالْاِنْقِيَادُ لَهُ
[వల్ ఇన్ఖియాదు లహు]
(ఆయనకు విధేయత చూపడం)

ఆయనకే సంపూర్ణ విధేయత చూపుట.

وَالْبَرَاءَةُ مِنَ الشِّرْكِ وَأَهْلِهِ
[వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి]
(షిర్క్ నుండి మరియు దాని అనుచరుల నుండి దూరంగా ఉండటం)

షిర్క్ మరియు షిర్క్ వాసుల నుండి సంబంధం లేకుండా ఉండుట. ఇందులో లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ రెండు సాక్ష్యాలు కూడా వస్తాయి. వాటి యొక్క షరతులు, వాటి యొక్క రుకున్‌లు, వాటి యొక్క నిజమైన భావం అంతా వస్తుంది. ఆ ప్రకారంగా ఇస్లాం ఎవరిలోనైతే లేదో, వారు తమకు తాము ఎంత ధార్మికులము అని అనుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక

وَعَمُودُهُ الصَّلَاةُ
[వ అమూదుహు అస్సలాహ్]
(మరియు దాని స్తంభం నమాజ్)

ఈ ఇస్లాం ధర్మం, ఈ మొత్తం భవనం యొక్క పిల్లర్ దేనిపై ఉంది? నమాజ్ పై ఉంది. ఎలాగైతే ఇప్పుడు మనం కూర్చుండి ఉన్నటువంటి ఈ మస్జిద్ గానీ, ఇల్లు గానీ మీరు ఎక్కడైతే ఉన్నారో, అక్కడ ఒక కప్పు ఉంది, దానికి సపోర్ట్‌గా పిల్లర్‌లు ఉన్నాయి కదా? అవి ఒక గోడలైనా లేకుంటే వాస్తవంగా ఏదైనా సిమెంట్ మరియు రాళ్లతో కూడినటువంటి కంక్రేట్‌తో కూడినటువంటి పిల్లరే గానీ, లేదా ఎవరైతే చిన్న కుటీరాల్లో ఉంటున్నారో, కనీసం ఒక బొంగు, ఒక నిట్టాడు ఏదైనా ఉంటుంది కదా, అది లేకుంటే ఇల్లు ఉంటుందా? అది లేకుంటే కప్పు మొత్తం కింద కూలిపోదా? అలాగే ఎవరైతే తమకు తాము ముస్లింలు అనుకుంటున్నారో, మహా ధార్మికులము అని అనుకుంటున్నారో కానీ నమాజ్ పై పాబందీ లేకుంటే, ఐదు పూటలు సామూహికంగా పురుషులు మస్జిద్‌లో నమాజ్ చేయకుంటే, ఈ నమాజ్ లేనిది ఆ ఇస్లాం భవనం లేనట్లే. నమాజ్ పాబందీ చేయండి, నమాజ్‌ను విడనాడకండి.

ఇక ఆ తర్వాత

وَذِرْوَةُ سَنَامِهِ الْجِهَادُ
[వ జిర్వతు సనామిహి అల్ జిహాద్]
(మరియు దాని శిఖరం జిహాద్)

అని చెప్పారు. సినామ్ దేన్ని అంటారు? ఒంటె తెలుసు కదా, దాని యొక్క వీపుపై ఏదైతే ఎత్తుగా ఉంటుందో దానినే అరబీలో సినామ్ అని అంటారు. మొత్తం ధర్మాన్ని ఒక ఒంటెగా మరియు జిహాద్ ఫీ సబీలిల్లాహ్‌ను ఆ ఒంటెపై ఉండేటటువంటి ఆ కోహాన్, ఆ సినామ్ అని ఏదైతే చెప్పడం జరుగుతుందో జిహాద్ అలాంటిది. అంటే ఏమిటి? మనం ఈ ప్రపంచంలో ముస్లింలుగా మంచి బలంగా మరియు గౌరవంగా బ్రతకాలి, స్వర్గంలో చేరాలి అంటే ఎల్లవేళల్లో జిహాద్ చేస్తూ ఉండాలి.

ఇక్కడ జిహాద్ అంటే శత్రువులు ఏదైతే తప్పుడు భావం చెబుతున్నారో, ఆ భావం భావించి భయపడిపోకండి. జిహాద్ అన్నటువంటి చాలా మంచి ఉత్తమమైన విషయం, ఈ జిహాద్ కేవలం పోరాడడమే కాదు, రక్తపాతంలో దిగడం కాదు, ఇది మనస్సు నుండి నుండి మొదలై, నోటి నుండి, మన యొక్క ధనం నుండి మొదలై అవసరం ఉన్నప్పుడు ప్రాణంతో కూడా. మన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేసి చేయబడుతుంది కానీ ప్రాణం ఒడ్డించి, మన ప్రాణాన్ని తెగించి, మన ప్రాణం ఇందులో వెచ్చించి ఏ జిహాద్ అయితే చేయడం జరుగుతుందో, సర్వసామాన్యంగా ప్రజలు దీనినే జిహాద్ అనుకుంటారో, అంతకంటే ముందు మూడు రకాల జిహాద్ ఉంటుంది. అప్పుడు ఈ జిహాద్‌ యొక్క అవసరం పడినప్పుడే నిజమైన ముస్లిం ముందుకు అడుగేస్తాడు. ప్రతి జిహాద్ యొక్క లాభం ఏంటి? ఎప్పటివరకైతే ఈ జిహాద్ కొనసాగుతూ ఉంటుందో, అప్పటి వరకు ఇస్లాంపై మనం స్వతంత్రంగా ఆచరిస్తూ ఉండవచ్చు. మనం నిజమైన ముస్లింలుగా జీవిస్తూ గౌరవంగా, బలంగా ఉండవచ్చు.

కేవలం ఈ అసలైన జిహాద్ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో తప్పుడు ప్రచారాల ద్వారా దీని యొక్క రూపు మాపడం జరిగింది. అసలైన జిహాద్ ఏంటి? మనస్సుతో, నోటితో, మన ఆచరణతో మరియు మన యొక్క ధనంతో, చివరికి అవసరం ఉన్నప్పుడు ప్రాణ త్యాగాలతో కూడా చేసేటటువంటిది జిహాద్.

ఎప్పటివరకైతే ఇస్లాంలో సరియైన రీతిలో మనం ఆచరించమో మరియు ఈ జిహాద్ గురించి పాటు పడుతూ ఉండమో, ఇహలోకంలో కూడా ఇస్లాం ప్రకారం జీవించడం కష్టమవుతూ, ఇతరుల యొక్క చిత్రహింసలకు గురి అవుతూనే ఉంటాము. మన చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకమైన జిహాద్ టాపిక్ పై మరెన్నో వివరాలు ఇన్షా అల్లాహ్ వేరే సందర్భంలో విందాము.

అల్లాహ్ మనందరికీ ఈ హదీస్‌ను అర్థం చేసుకుని, ఈ చివరి పాఠాన్ని అర్థం చేసుకుని, ఉసూలె సలాస త్రీ సూత్రాల యొక్క ఈ పాఠాలను మరీ మరీ వింటూ, మన యొక్క సంబంధం కేవలం అల్లాహ్‌తో బలంగా ఉంచుకొని, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే చేస్తూ, అందరినీ అల్లాహ్ ఆరాధన వైపునకు పిలుస్తూ ఉండే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=40208

త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి
https://teluguislam.net/2023/04/19/u3mnj/