దుఆ విశిష్ఠత & నియమాలు – సలీం జామి’ఈ [వీడియో | టెక్స్ట్]

దుఆ విశిష్ఠత & నియమాలు
https://youtu.be/lrwdFEJwxlg [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ‘దుఆ’ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, నియమాలు, మరియు విశిష్టతల గురించి చర్చించబడింది. దుఆ అనేది అల్లాహ్‌తో ప్రత్యక్ష సంభాషణ అని, ఆయనతో బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ఒక సువర్ణ మార్గమని, మరియు ఆరాధనలలో అత్యంత విలువైనదని ఇది నొక్కి చెబుతుంది. పాపాలు చేసిన వారి దుఆను అల్లాహ్ స్వీకరించడు, పుణ్యాత్ముల దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడు వంటి అపోహలను ప్రసంగికుడు సరిదిద్దుతాడు. ఆదం, నూహ్, ఇబ్రాహీం, మూసా, మరియు ముహమ్మద్ (వారిపై శాంతి కలుగుగాక) వంటి వివిధ ప్రవక్తల ప్రార్థనల నుండి ఉదాహరణలను ఖుర్ఆన్ మరియు హదీసుల నుండి ఉదహరిస్తూ, విశ్వాసి జీవితంలో దుఆ యొక్క లోతైన ప్రాముఖ్యతను మరియు శక్తిని వివరిస్తాడు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదా ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ]

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా, ఈనాటి ఈ ప్రసంగంలో మనం దుఆ, ప్రార్థన నియమాలు మరియు విశిష్టత గురించి ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మిత్రులారా, భక్తుడు భగవంతునితో తన సంబంధం దృఢపరుచుకోవడానికి, దౌర్జన్యానికి గురవుతున్న అభాగ్యులు ఆ పరిస్థితి నుండి బయటపడుటకు, వ్యాపారి తన సంపాదనలో శుభం మరియు వృద్ధి పొందుటకు, అన్ని సమస్యలను అందరూ పరిష్కరించుకొనుటకు లోక రక్షకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందజేసిన సువర్ణ మార్గం దుఆ.

దుఆ అంటే అల్లాహ్‌ను వేడుకోవటం, అల్లాహ్‌ను ప్రార్థించటం. దీనిని మనము ఉర్దూ మరియు అరబీ భాషలో దుఆ అంటూ ఉంటాము కాబట్టి ప్రసంగంలో నేను ఎక్కడైనా దుఆ అని ప్రస్తావిస్తే దాని అర్థం అల్లాహ్‌ను వేడుకోవటం మరియు అల్లాహ్‌ను ప్రార్థించటం అనే అర్థం మీరు తెలుసుకోవాలి.

అల్లాహ్‌ను వేడుకోవాలని, అల్లాహ్‌తో దుఆ చేయాలని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లోని 40వ అధ్యాయం, 60వ వాక్యంలో తెలియజేశాడు.

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
మీ ప్రభువు ఇలా అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)

ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులను ఆయనను వేడుకోవాలని, ఆయనను ప్రార్థించాలని ఆదేశిస్తున్నాడు. కాబట్టి, భక్తులు ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మనిషి, ప్రతి భక్తుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను వేడుకోవాలి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను ప్రార్థించాలి.

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు భరోసా కల్పిస్తున్నాడు. కొంతమంది సందేహపడవచ్చు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అయితే పైన ఆకాశాల పైన ఉంటాడు కాబట్టి మనము ఆయనకు వేడుకుంటే ఆయన మన మాటలను, మన ప్రార్థనలను వింటాడా అని సందేహపడవచ్చు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు భరోసా కల్పిస్తున్నాడు, ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయం 186వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ
(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును ఆలకిస్తానని వారికి చెప్పు. (2:186)

కాబట్టి అభిమాన సోదరులారా, ఎప్పుడైతే భక్తుడు అల్లాహ్‌ను వేడుకుంటాడో, అతని ప్రార్థనను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వినటానికి, ఆమోదించడానికి, అతనికి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేసి ఉన్నారు. అది కూడా మనం తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు:

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
[అద్దుఆ’ఉ హువల్ ఇబాదా]
మనిషి చేసే ఆరాధనలలో దుఆ చాలా ముఖ్యమైనది. అసలు ఆరాధన అంటేనే దుఆ, దుఆ అంటేనే ఆరాధన అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించారు.

ఇక్కడ మనం మరొక విషయం అర్థం చేసుకోవచ్చు, అదేమిటంటే ప్రార్థన ఆరాధనలోని ముఖ్యమైన భాగము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారంటే, ఏ భక్తుడైతే ఆరాధనలో ఎక్కువగా దుఆలు చదువుతాడో అతను అంతే విలువైన ఆరాధన చేస్తున్నాడని అర్థం. ఉదాహరణకు నమాజ్ ఉంది. ఒక వ్యక్తి నమాజ్ లోని దుఆలన్నీ నేర్చుకొని ఆ నమాజ్ ఆరాధన ఆచరిస్తున్నాడు. మరొక వ్యక్తి నమాజ్ లోని సగం దుఆలు మాత్రమే నేర్చుకొని ఆ నమాజ్ ఆరాధన ఆచరిస్తున్నాడు. ఇద్దరిలో ఎవరు ఉత్తముడు, ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంటే ఏ వ్యక్తి అయితే దుఆలు అన్నీ, ప్రార్థనలు అన్నీ నేర్చుకొని నమాజ్ ఆరాధన చేస్తున్నాడో, అతను మంచి విలువైన నమాజ్ ఆరాధన చేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవడానికి అర్హుడవుతాడు. ఇదే విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది.

అలాగే మరోచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఈ విధంగా తెలియజేశారు:

لَيْسَ شَيْءٌ أَكْرَمَ عَلَى اللَّهِ مِنَ الدُّعَاءِ
అల్లాహ్ వద్ద దుఆ కంటే విలువైనది మరొకటి లేదు.

చూశారా? దుఆ సాధారణమైన విషయం అనుకుంటారు. కాదు అభిమాన సోదరులారా, దుఆ అల్లాహ్ వద్ద చాలా విలువైనది, చాలా పవిత్రమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే దుఆ యొక్క విశిష్టత మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రతి మనిషి యొక్క విధివ్రాత అతను జన్మించక ముందే వ్రాయబడి ఉంది. అయితే, విధివ్రాతను మార్చగలిగే శక్తి కేవలం దుఆకు మాత్రమే ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:

لَا يَرُدُّ الْقَضَاءَ إِلَّا الدُّعَاءُ
విధివ్రాతను కేవలం దుఆ ద్వారానే మనము మార్చుకోగలము. మన విధివ్రాత మారాలి అంటే మనము దుఆ చేయాలి. ఒక దుఆ ద్వారా మాత్రమే మన విధివ్రాత మారగలుగుతుంది. వేరే ఏ మార్గము ద్వారా కూడా మన విధివ్రాతను మనము మార్చుకోలేము.

అలాగే, మరో విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. అదేమిటంటే:

إِنَّهُ مَنْ لَمْ يَسْأَلِ اللَّهَ يَغْضَبْ عَلَيْهِ
ఏ వ్యక్తి అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను వేడుకోడో ఆ వ్యక్తితో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆగ్రహిస్తాడు.

అల్లాహు అక్బర్. చూడండి, ఒక మనిషి మరో మనిషి వద్ద వెళ్లి సహాయం కోరాడు. ఒకసారి సహాయం చేస్తాడు. రెండుసార్లు, మూడుసార్లు సహాయం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అతనితో వెళ్లి సహాయం అడిగితే మనిషి కోపం చూపిస్తాడు. సారికి నా దగ్గరికే వస్తున్నావు అని మనిషి ఏమైతాడు అంటే, సహాయం అడిగే వ్యక్తి సహాయం అడిగితే కోపగించుకుంటాడు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అలా కాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుడు సహాయం కోరినప్పుడల్లా సంతోషిస్తాడు. భక్తుడు అల్లాహ్‌తో సహాయం కోరకపోతే, దుఆ చేయకపోతే, వేడుకోకపోతే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఆ విషయం నచ్చదు, ఆ భక్తునితో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆగ్రహిస్తాడు.

అయితే అభిమాన సోదరులారా, అల్లాహ్‌ను వేడుకోవటం, అల్లాహ్‌తో దుఆ చేయటం భక్తుల లక్షణము. భక్తులలో ఉత్తమమైన భక్తులు ఎవరంటే ప్రవక్తలు. ప్రవక్తల లక్షణము కూడా అల్లాహ్‌తో దుఆ చేయటం, అల్లాహ్‌ను వేడుకోవటం. ఖుర్ఆన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు అని, వారి దుఆ స్వీకరించబడింది అని తెలియజేసి ఉన్నాడు. ఉదాహరణకు మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం.

ఆదం అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లో ప్రస్తావించాడు. ఆదం అలైహిస్సలాం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారు?

رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
“ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు గనక నీవు మమ్మల్ని క్షమించకపోతే, మాపై కరుణించకపోతే మేము పూర్తిగా నష్టపోయిన వారిలో చేరిపోతాము.” (7:23)

అలాగే నూహ్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు. ఆయన ఏమని దుఆ చేశారు?

رَّبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِمَن دَخَلَ بَيْتِيَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ
“ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులనూ, స్త్రీలనూ క్షమించు. (71:28)

ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థించారు. ఆయన ఏమని ప్రార్థించారు అంటే:

رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَمِن ذُرِّيَّتِي ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءِ
“ఓ నా ప్రభూ! నన్నూ, నా సంతానాన్ని నమాజును నెలకొల్పేవారిగా చేయి. మా ప్రభూ! నా ప్రార్థనను స్వీకరించు. (14:40)

అలాగే, మూసా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్‌తో దుఆ చేశారు. ఆయన ఏమని దుఆ చేశారంటే:

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي هَارُونَ أَخِي
“ప్రభూ! నా వక్షాన్ని నా కోసం విశాలపరచు, నా పనిని నాకు సులభం చేయి, నా నాలుక ముడిని విప్పు, జనులు నా మాటను అర్థం చేసుకునేందుకు. నా వారిలో నుండి నాకు ఒక సహాయకుణ్ణి నియమించు. నా సోదరుడైన హారూనును. (20:25-30)

అలాగే, జకరియా అలైహిస్సలాం వారి గురించి మనం చూసినట్లయితే, జకరియా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు.

رَبِّ لَا تَذَرْنِي فَرْدًا وَأَنتَ خَيْرُ الْوَارِثِينَ
“ప్రభూ! నన్ను ఒంటరిగా వదలి పెట్టకు. నీవే సర్వోత్తమ వారసుడవు.” (21:89)

అలాగే, అయ్యూబ్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్‌తో దుఆ చేశారు.

أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
“నాకు బాధ కలిగింది. నీవు కరుణించే వారందరిలోకీ అధికంగా కరుణించేవాడవు.” (21:83)

మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూచినట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వేళలా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను దుఆ చేస్తూ ఉండేవారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే సమయం వరకు ప్రతి చోట, ప్రతి సందర్భంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేసేవారు.

ఇక రండి అభిమాన సోదరులారా, దుఆ గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. దుఆ చేయడం ప్రవక్తల లక్షణమే కాదు, మన సజ్జన పూర్వీకులు సలఫ్ సాలిహీన్ మరియు గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో వారందరి యొక్క లక్షణం ఏమిటంటే వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు, ప్రార్థించారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు క్లుప్తంగా చెప్తున్నాను.

మనము ధార్మిక పండితుల నోట వింటూ ఉంటాం, ఒకసారి ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వర్షం పడుతూ ఉంటే వర్షం నుండి తమను తాము కాపాడుకోవడానికి ఒక గుహలోకి వెళ్లిపోయారు. అనుకోకుండా కొండచరియలు విరిగిపడి ఒక పెద్ద రాయి వచ్చి గుహ యొక్క ముఖద్వారం వద్ద వచ్చి అడ్డుపడిపోయింది. వీరు గుహలోనే ఉండిపోయారు. గుహ నుంచి బయటికి రావడానికి వేరే మార్గం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏ ఆయుధాన్ని వారు ఉపయోగించారు? ఎలా వారు బయటికి పడగలిగారు అంటే ఆ లోపల ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ప్రార్థించారు. ముందు ఒక వ్యక్తి ప్రార్థించాడు, ఆ తర్వాత మరొక వ్యక్తి ప్రార్థించాడు, ఆ తర్వాత మరొక వ్యక్తి ప్రార్థించాడు. ఆ విధంగా ముగ్గురు గుహలో నుంచి అల్లాహ్‌ను ప్రార్థిస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ రాయిని తొలగించేశాడు, వారు ప్రాణాలతో బయటపడ్డారు.

అలాగే, మనము చూచినట్లయితే యూనుస్ అలైహిస్సలాం. యూనుస్ అలైహిస్సలాం వారికి, చాలా పెద్ద కథ, క్లుప్తంగా చెప్తున్నాను. నా అంశానికి సంబంధించిన విషయం మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. యూనుస్ అలైహిస్సలాం వారికి సముద్రంలో పడవేయడం జరిగింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగేసింది. చేప కడుపులో ఆయన ఉంటూ అల్లాహ్‌ను దుఆ చేశారు. ఓ అల్లాహ్ నన్ను కాపాడు, నన్ను మన్నించు అని

لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ
[లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్]

ఈ దుఆ ఆయన చేప కడుపులో నుంచి చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేప కడుపులో ఉన్న ఆయన దుఆను, ప్రార్థనను విని ఆయనకు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి ఆ చేప కడుపులో నుంచి సముద్రం ఒడ్డున వచ్చేటట్టు చేసేశాడు.

ఈ విధంగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. చెప్పొచ్చే విషయం ఏమిటంటే, మన సజ్జన పూర్వీకులు క్లిష్టమైన పరిస్థితుల్లో అల్లాహ్‌ను దుఆ చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆను స్వీకరించి వారిని కష్టాల నుండి గట్టెక్కించాడు. కాబట్టి మనము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను తలుచుకోవాలి, అల్లాహ్‌ను వేడుకోవాలి, అల్లాహ్‌తో దుఆ చేయాలి. ఆయన మనకు కష్టాల నుండి గట్టెక్కించడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను, అదేమిటంటే చాలామంది ప్రజలు ఒక అపోహకి గురై ఉన్నారు. ఏంటి ఆ అపోహ? కొంచెం శ్రద్ధగా వినండి. చాలామంది ఏమనుకుంటారంటే, పాపాలు చేసిన వారి దుఆను అల్లాహ్ స్వీకరించడు, పుణ్యాత్ముల దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడు. ఈ విధంగా కొంతమంది భావిస్తారు. మేము పాపాలు బాగా చేసామండి కాబట్టి మనము ఏ దుఆ చేసినా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించడు, పుణ్యాత్ములు పాపాలు చేయని వారు వారు ఏ దుఆ చేసినా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆమోదిస్తాడు అని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. ఇది నిజమేనా? అలా జరుగుతుందా? రండి మనము ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా ఈ విషయాన్ని ఇన్ షా అల్లాహ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

పాపాలు చేసిన వారి కోసం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేయింబవళ్ళు ఎదురుచూస్తూ ఉంటాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఉదయం పాపాలు చేసిన వ్యక్తులు రాత్రి పశ్చాత్తాపం చెంది అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారేమో అని రాత్రి మొత్తం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎదురుచూస్తాడు. రాత్రి పాపాలు చేసిన వారు ఉదయం పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకుంటారేమో అని ఉదయం మొత్తం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎదురుచూస్తాడు. ఆ విధంగా రేయింబవళ్ళు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నా భక్తులు పాపక్షమాపణ కోరుకుంటారేమో అని, పాపాలు చేసిన వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అభిమాన సోదరులారా. కాబట్టి పాపాలు చేసిన వారి దుఆలు స్వీకరించబడవు అని అనుకోవటం భ్రమ మాత్రమే. అల్లాహ్ వారి పాపాలు మన్నించడానికి ఎదురుచూస్తున్నాడు. కాబట్టి పాపాలు చేసిన వాళ్ళు సైతం అల్లాహ్‌తో దుఆ చేయాలి, అల్లాహ్‌తో క్షమాపణ వేడుకోవాలి.

పాపాలను చేసేవాళ్ళలో పెద్ద పాపిష్టుడు ఎవడండీ? పాపాలు చేసేవాడు కాదు, చేయించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? షైతాన్. షైతాన్ కంటే పెద్ద పాపిష్టుడు ఎవడైనా ఉన్నాడా? అంత పెద్ద పాపిష్టుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థన చేశాడు, దుఆ చేశాడు. ఏమని దుఆ చేశాడు? ఖుర్ఆన్ లో ఆ ప్రస్తావన ఉంది. అతను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో అడిగాడు.

قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
“అల్లాహ్ నాకు నీవు ప్రళయం వరకు సజీవంగా ఉంచు” అని అల్లాహ్‌తో దుఆ చేశాడు.

పాపిష్టులలోనే పెద్ద పాపి, పెద్ద పాపిష్టుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తున్నాడు, ఓ అల్లాహ్ నాకు ప్రళయం వరకు నీవు సజీవంగా ఉంచు అంటున్నాడు. అల్లాహ్ ఏం చేశాడు? నువ్వు పాపిష్టుడివి, నేను నీ ప్రార్థన స్వీకరించను, నీ దుఆ స్వీకరించను అన్నాడా? సూర హిజ్ర్ 36 వ వాక్యంలో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:

قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
నువ్వు కోరుకున్నట్లుగానే నీకు నేను ప్రళయం వరకు వ్యవధి ఇచ్చేస్తున్నాను, నీకు ప్రళయం వరకు మరణం రాదు పో అని చెప్పేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. చూశారా? కాబట్టి, పాపి, పాపాలు చేసిన వారి దుఆలు స్వీకరించబడవు అని అనుకోవటం తప్పు అభిమాన సోదరులారా.

ఇక రండి, రెండో విషయం. పుణ్యాలు చేసే పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ స్వీకరించబడిపోతాయా? అలాంటిది ఏమైనా ఉందా అంటే రండి ఆ విషయం కూడా మనము ఖుర్ఆన్, హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకుందాం. పుణ్యాత్ములలో, భక్తులలో గొప్ప భక్తులు ఎవరండీ? ప్రవక్తలు. పైగంబర్లు, ప్రవక్తల కంటే గొప్ప భక్తులు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో?

ప్రవక్తలలో గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు. నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తున్నారు. ఏమని దుఆ చేస్తున్నారు?

رَبِّ إِنَّ ابْنِي مِنْ أَهْلِي
ఓ అల్లాహ్ నా ఇంటి సభ్యుడు, నా కుమారుడు నా కళ్ళ ఎదుటే మునిగిపోతున్నాడు, కాపాడు అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏం చేశాడు? నూహ్ అలైహిస్సలాం వారి ప్రార్థనను తిరస్కరించేశాడు. ఓ నూహ్,

إِنَّهُ لَيْسَ مِنْ أَهْلِكَ
అతను నీ కుమారుడే కాదు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయటం తగదు. ఇంకొకసారి అలాంటి వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ప్రవక్తల జాబితాలో నుంచి నీ పేరు చెరిగిపోతుంది జాగ్రత్త అన్నాడు.

అల్లాహు అక్బర్. కాబట్టి నూహ్ అలైహిస్సలాం లాంటి గొప్ప ప్రవక్త, గొప్ప భక్తుడు దుఆ చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన ఒక దుఆను తిరస్కరిస్తున్నాడు కాబట్టి, పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ స్వీకరించేస్తాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనం అనుకోవటం తప్పు.

ఇంకొక ఉదాహరణ మనం చూచినట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఉదాహరణ కూడా ఉంది, కాకపోతే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అదేమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్‌తో మూడు కోరికలు కోరారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరండీ? భక్తులలో, మానవులలోనే గొప్ప వ్యక్తి, ప్రవక్తలలోనే గొప్ప ప్రవక్త, ప్రపంచం మొత్తంలో ఆయన కంటే గొప్ప భక్తుడు, ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. అలాంటి గొప్ప భక్తుడు, అలాంటి గొప్ప ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో మూడు కోరికలు కోరితే, రెండు కోరికలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీర్చేశాడు, మూడవ కోరిక మాత్రము ఇది కుదరదు అని చెప్పేశాడు. అవేమిటంటే, అదంతా చెప్పుకుంటూ పోతే ఎక్కువ సమయం అయిపోతుంది కాకపోతే ఇది మీరు తెలుసుకోండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో కోరారు: ఓ అల్లాహ్ నా అనుచర సమాజం తుఫానులతో చెరిగిపోకూడదు అంటే అల్లాహ్ ఒప్పుకున్నాడు. నా అనుచర సమాజం కరువుకి గురికాకూడదు అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒప్పుకున్నాడు. నా అనుచర సమాజం పరస్పరం గొడవలు చేసుకోకూడదు అంటే ఇది కుదరదు అని చెప్పేశాడు. చూశారా? కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్‌తో దుఆ చేస్తే, వారి దుఆలలో ఒక దుఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరస్కరిస్తున్నాడు కాబట్టి, పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడని అనుకోవటం కూడా తప్పే.

మరి వాస్తవం ఏమిటంటే, పాపిష్టులైనా పుణ్యాత్ములైనా ఎవరి దుఆ స్వీకరించాలి, ఎవరి దుఆ తిరస్కరించాలనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే అధికారం ఉంది. ఆయన తలచుకుంటే పాపిష్టుల దుఆ కూడా స్వీకరించగలుగుతాడు, పుణ్యాత్ముల దుఆ కూడా స్వీకరించగలుగుతాడు. కాబట్టి, ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, మేమంతా పాపిష్టులము మా దుఆలు అల్లాహ్ దగ్గర ఆమోదించబడవు, కాబట్టి పుణ్యాలు చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో చూడండి, వారితో దుఆ చేయిద్దాం అని చెప్పి వెతుకుతారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కేవలం పుణ్యాలే చేసిన వాళ్ళు దొరకరు. ప్రతిచోట ప్రజలు పాపాలు చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా చివరకు? సజీవంగా ఉన్నవారిని వదిలేసి, మరణించిన వారి వద్దకు వెళ్ళిపోతారు. వారి గురించి రకరకాల కట్టుకథలు వ్రాయబడి ఉంటాయి అక్కడ. ఏమని అంటే, ఆయన అంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప భక్తుడు, ఇలాంటి ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేశాడు అని చెప్పేసి, చాలా విషయాలు అక్కడ రాయబడి ఉంటే, వారిని గొప్ప భక్తులు అని, పాపాలకు అతీతులు అని, పాపాలు చేయని వారు అని వారిని నమ్మి వెళ్లి వాళ్ళ దగ్గర ఇక వారిని సంతృప్తి పరచడానికి అక్కడ వెళ్లి లేనిపోని పనులన్నీ చేస్తూ ఉంటారు. గుండు కొట్టించుకోవడం అంట, తలనీలాలు సమర్పించుకోవడం అంట, అన్నాలు తినిపించడం అంట, అలాగే దుప్పటి కప్పడం అంట, చాదర్ ఎక్కించడం అంట, అలాగే రకరకాల కార్యాలన్నీ అక్కడ వెళ్లి చేస్తూ ఉంటారు అభిమాన సోదరులారా. సమాధుల వద్ద, జెండా మానుల వద్ద, ఇవన్నీ అక్కడ వెళ్లి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే, మేము పాపిష్టులము, మా దుఆ అల్లాహ్ స్వీకరించడు, వాళ్ళు గొప్ప భక్తులు వారి దుఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే స్వీకరిస్తాడు అని ఈ భ్రమలో పడిపోయి ఇలాంటి పాపాలన్నీ, ఇలాంటి చేరని తప్పులన్నీ చేస్తూ ఉంటారు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి భావన నుండి బయటికి రండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే భక్తుడు రెండు చేతులు ఎత్తి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో వేడుకుంటాడో, దుఆ చేస్తాడో, అతని రెండు చేతుల్ని ఖాళీగా పంపించడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సిగ్గుపడతాడు, నాకు తగిన విషయము కాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భావిస్తాడు. కాబట్టి అభిమాన సోదరులారా, అలాంటి అల్లాహ్‌తో దుఆ చేయండి. ఏ అల్లాహ్ అయితే మీకు ఖాళీ చేతులు ఇంటికి పంపించడానికి సిగ్గుపడతాడో, ఆ అల్లాహ్‌తో దుఆ చేయండి. ఆయన ఎదురు చూస్తున్నాడు, నా భక్తులు నన్ను అడిగితే వారి మొరలను, వారి దుఆలను నేను స్వీకరించానని ఆయన ఎదురు చూస్తున్నాడు. అభిమాన సోదరులారా, అపోహలు వదలండి, అల్లాహ్‌ను నమ్మండి, అల్లాహ్‌ను విశ్వసించండి, అల్లాహ్ కారుణ్యాన్ని అర్థం చేసుకోండి, అల్లాహ్‌ను వేడుకోండి అభిమాన సోదరులారా. ఆయన అందరి మొరలను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు.

అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అల్లాహ్‌ను అర్థం చేసుకొని, అల్లాహ్‌ను ఎల్లవేళలా ప్రార్థించే వారిలాగా మార్చుగాక ఆమీన్.

أقول قولي هذا أستغفر الله لي ولكم ولسائر المسلمين فاستغفروه إنه هو الغفور الرحيم
[అఖూలు ఖౌలీ హాదా అస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్]

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17068

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


ఏయే సందర్భాల్లో మనం షైతాన్ నుండి అల్లాహ్ యొక్క రక్షణ, శరణు కోరాలి? [ఆడియో]

బిస్మిల్లాహ్

సంక్షిప్త సమాధానం [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

షైతాన్ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1WI3oPPksxhRYB2rWksuak

షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి?
https://teluguislam.net/2019/12/21/protection-from-shaitan/

1- ఖుర్ఆన్ తిలావత్ ప్రారంభించినప్పుడు. (నహ్ల్ 16:98)

2- మనిషికి తప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు. (ఆరాఫ్ 7 :200, 201, మూమినూన్ 23 :97,98, ఫిస్సిలత్ 41 :36)

3- నీ ప్రభును ఎవడు సృష్టించాడు అన్న చెడు ఆలోచన షైతాన్ కలగజేస్తే వెంటనే ఈ తప్పుడు ఆలోచనను మానుకోని, అల్లాహ్ శరణు కోరాలి. (బుఖారీ 3276, ముస్లిం 134).

4- నమాజులో ఖింజబ్ అనే షైతాన్ ద్వారా ఎక్కువ ఆలోచనలు కలిగినప్పుడు. (ముస్లిం 2203).

5- మనిషి చాలా కోపానికి గురి అయినప్పుడు. (బుఖారీ 6115)

6- మనిషి చెడు స్వప్న చూసినప్పుడు. (బుఖారీ3292, ముస్లిం2261)

7- మస్జిదులో ప్రవేశించునప్పుడు. అఊజు బిల్లాహిల్ అజీం, వబివజ్ హిహిల్ కరీం, వసుల్తానిహిల్ ఖదీం, మినష్షైతానిర్రజీం. (అబూ దావూద్ 466)

8- గాడిద గాండ్రింపు విన్నప్పుడు, కుక్క మొరిగినప్పుడు. (బుఖారీ 3303, ముస్లిం 2729).

9- ప్రయాణంలో ఏదైనా ప్రాంతంలో మజిలీ చేసినప్పుడు. అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (ముస్లిం 2708).

10- మరుగుదొడ్లో ప్రవేశించినప్పుడు. బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్. (తిర్మిజి 606, బుఖారీ 142)

11- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయి పెట్టి, 3సార్లు బిస్మిల్లాహ్, 7 సార్లు అఊజు బిఇజ్జతిల్లాహి వఖుద్రతిహీ మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్. (ముస్లిం 2202).

12- ఉదయం సాయంకాలం మరియు నిద్రించేకి ముందు దుఆలలో. … అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వషర్రిష్ షైతాని వ షిర్కిహీ. (అబూ దావూద్ 5067).

13- నిద్రలో భయాందోళనలకు గురవుతే. అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ గజబిహీ వఇఖాబిహి వషర్రి ఇబాదిహి వమిన్ హమజాతిష్షయాతీన్, వరబ్బి అఁయ్యహ్ జురూన్. (అబు దావూద్ 3893).

14- పిల్లలకు ఇలా దుఆ ఇవ్వాలి. అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మహ్ మిన్ కుల్లి షైతానివ్ వహామ్మహ్ వమిన్ కుల్లి ఐనిన్ లామ్మహ్. (బుఖారీ 3371).

మొక్కుబడి నియమాలు – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

మొక్కుబడి నియమాలు – Rulings of An-Nadhr (Vows)
https://youtu.be/d3XZ5Pz3iOw [24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

  • మొక్కుబడి అంటే ఏమిటి? దాని నిర్వచనం
  • మొక్కుబడి ఆరాధన క్రిందికి వస్తుందా?
  • ఖురాన్ & సున్నత్ లో మొక్కుబడి కి సంబంధించిన కొన్ని ఉదాహరణలు
  • మొక్కుబడి చేసుకుంటే అది తప్పనిసరిగా నెరవేర్చాలా?
  • ధర్మ సమ్మతమైన వాటినే మొక్కుబడి చేసుకోవాలి
  • అధర్మ మైన విషయాలకు మొక్కుబడి చేసుకోకూడదు, ఒకవేళ చేసుకొంటే అది నెరవేర్చకూడదు, పరిహారం చెల్లించుకోవచ్చు
  • తన అధీనంలో లేని వాటి మీద మొక్కుబడి చేసుకోరాదు.
  • అర్థరహితమైన మొక్కుబడులు చేసుకోరాదు
  • చనిపోయిన వారి మొక్కుబడులు వారి తరపున బ్రతికున్నవారు, వారసులు పూర్తిచేయాలా?
  • అల్లాహ్ కు తప్ప వేరెవరికీ మొక్కుబడులు చేసుకోకూడదు
  • మొక్కుబడి అల్లాహ్ రాసిన రాతను, ఖదర్ ను మార్చదు
  • మొక్కుబడిని ఒక వ్యాపారం లాగా చేయకూడదు. అల్లాహ్ తో షరతు పెట్టి మొక్కుబడి చేయకూడదు. “ఓ అల్లాహ్ ఈ పని జరిగితే ఉపవాసం ఉంటాను.” ఇలాగ మొక్కుబడులు చేసుకోకూడదు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మొక్కుబడి నియమాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొక్కుబడి అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, అరబీ భాషలో మొక్కుబడిని నజర్ అంటారు. ధార్మిక పండితులు మొక్కుబడి యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా తెలిపి ఉన్నారు.

أَنْ تُوْجِبَ عَلَى نَفْسِكَ مَا لَيْسَ بِوَاجِبٍ لِحُدُوْثِ أَمْرٍ
(అన్ తూజిబ అలా నఫ్సిక మా లైస బివాజిబిన్ లిహుదూసి అమ్ రిన్)

అంటే, నీపై తప్పనిసరి కాని ఒక కార్యాన్ని, ఆ పని నేను చేస్తాను అని సంకల్పం చేసుకున్న కారణంగా, నీపై ఆ పని చేయడం తప్పనిసరి అయిపోతుంది కదా? అలా అనుకోవటాన్ని మొక్కుబడి అంటారు, అని ధార్మిక పండితులు మొక్కుబడి యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా తెలియజేశారు.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్లాం ధర్మంలో చాలా రకాల ఆరాధనలను ఉంచి ఉన్నాడు. ఆ ఆరాధనలలో ఒక ఆరాధన మొక్కుబడి చేసుకోవటం. మొక్కుబడి కూడా ఒక ఆరాధన అని ఖురాను మరియు హదీస్ గ్రంథాలలో మనకు తెలుపబడి ఉంది. ఉదాహరణకు మనము చూచినట్లయితే, సూర బఖరాలోని 270వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు,

وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ
(వమా అన్ఫఖ్ తుం మిన్ నఫఖతిన్ అవ్ నజర్తుం మిన్ నజ్రిన్ ఫఇన్నల్లాహ యఅలముహు)
మీరు దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్‌కు దాని గురించి పూర్తిగా తెలుసు.

అంటే, భక్తులు చేసుకుంటున్న మొక్కుబడిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తిగా గమనిస్తున్నాడు అని మొక్కుబడి గురించి ఈ వాక్యంలో ప్రస్తావించబడింది.

అభిమాన సోదరులారా, మనం ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలను చదివినట్లయితే ఒక విషయం మనకు తెలుస్తుంది, అదేమిటంటే, మొక్కుబడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వం గతించిన ప్రవక్తల శాసనాలలో కూడా మొక్కుబడి ఉండేది.

ఉదాహరణకు, మన ప్రియ ప్రవక్త ఈసా అలైహిస్సలాం, ఏసుక్రీస్తు వారి అమ్మమ్మ, ఆవిడ పేరు హన్నా అని గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఆవిడ భర్త పేరు ఇమ్రాన్ అని కూడా వ్రాయబడి ఉంది. ఆవిడ గర్భం ధరించినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో మొక్కుబడి చేసుకుందట. ఏమని మొక్కుబడి చేసుకుందట?

رَبِّ إِنِّى نَذَرْتُ لَكَ مَا فِى بَطْنِى مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّىٓ
(రబ్బీ ఇన్నీ నజర్తులక మాఫీ బత్నీ ముహర్రరన్ ఫతకబ్బల్ మిన్నీ)

ఓ అల్లాహ్, నా గర్భంలో ఉన్న శిశువుని నీ పుణ్యక్షేత్ర సేవ కొరకు నేను అంకితం చేసేస్తానని మొక్కుబడి చేసుకుంటున్నాను ఓ అల్లాహ్, నీవు నా ఈ మొక్కుబడిని స్వీకరించు, అని ఆ రోజుల్లోనే ఏసుక్రీస్తు(ఈసా) అలైహిస్సలాం వారి అమ్మమ్మ మొక్కుబడి చేసుకుందని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఖురాన్‌లో తెలియజేశాడు.

అలాగే, ఆవిడ తర్వాత, ఈసా అలైహిస్సలాం, ఏసుక్రీస్తు వారి తల్లి, మర్యం అలైహస్సలాం గురించి మనం చూసినట్లయితే, ఆవిడ కూడా మొక్కుబడి చేసుకునిందని, ఆవిడకు ఆ మొక్కుబడి చేసుకోమని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా మర్యంలో మర్యం అలైహస్సలాం వారి చరిత్రను తెలుపుతూ, ఎప్పుడైతే మర్యం అలైహస్సలాం ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా, ఎలాంటి తప్పు పని చేయకుండా, అల్లాహ్ ఆజ్ఞతో ఎప్పుడైతే ఆవిడ గర్భం ధరించిందో, గర్భం ధరించిన తర్వాత ఆవిడ ఏకాంతంలో ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. ఏకాంతంలో ఆవిడ ఉంటున్నప్పుడు, పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఆవిడ మనుసులో చాలా కంగారు పడ్డారు. అయ్యో, ఇక త్వరలోనే నాకు బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని నేను సమాజంలోకి వెళితే, ప్రజలు నాలుగు రకాలుగా నన్ను నిలదీస్తారు. అప్పుడు లేనిపోని నిందలు కూడా నా మీద వేస్తారు. ఆ మాటలు వినలేను. ఆ రోజు రాకముందే నేను ఈ ప్రపంచంలో నుంచి లేకుండా వెళ్ళిపోతే బాగుండు కదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి మర్యం అలైహస్సలాం వారికి ఏమని చెప్పాడంటే,

 فَإِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ أَحَدًا فَقُولِي إِنِّي نَذَرْتُ لِلرَّحْمَٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ الْيَوْمَ إِنسِيًّا
(ఫఇమ్మా తరయిన్న మినల్ బషరి అహదన్ ఫఖూలీ ఇన్నీ నజర్తు లిర్రహ్మాని సౌమన్ ఫలన్ ఉకల్లిమల్ యౌమ ఇన్సియా)
ఏమనిషైనా నీకు తారసపడితే, ‘నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను’ అని చెప్పు.”

దైవదూత వచ్చి మర్యం అలైహస్సలాం వారితో అంటున్నాడు, చూడండి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఉండండి. మీకు ఆకలి వేస్తే ఇదిగో ఈ ఖర్జూరపు చెట్టు ఉంది కదా, ఆ ఖర్జూరపు చెట్టుని ముట్టుకోండి, ఖర్జూరపు పండ్లు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు భుజించండి. ఇదిగో ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి కదా, ఆ నీటిని త్రాగండి, మీ దాహాన్ని తీర్చుకోండి. ఒకవేళ ఎవరైనా పురుషులు ఇటువైపు మీతో తారసపడితే, అప్పుడు వారు మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మీరు వాళ్లకి ఏమని సమాధానం ఇవ్వాలంటే “నేను కరుణామయుడైన అల్లాహ్ నామం మీద ఉపవాసం ఉంటానని మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడిని నేను అమలుపరుస్తూ ఈ రోజు ఉపవాస వ్రతంలో ఉన్నాను కాబట్టి ఎవరితో నేను ఈ రోజు మాట్లాడలేను” అని సైగ చేసేయండి, అని దైవదూత మర్యం అలైహస్సలాం వారికి తెలియజేశాడు.

అంటే ఇక్కడ ఈసా అలైహిస్సలాం వారి అమ్మమ్మ మొక్కుబడి చేసుకున్నట్టు, అలాగే ఈసా అలైహిస్సలాం వారి తల్లి మర్యం, ఆవిడ కూడా మొక్కుబడి చేసుకున్నట్టు, ఇద్దరు కూడా మొక్కుబడి చేసుకున్నట్టు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో మనకు తెలియజేశాడు. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వం గతించిన ప్రవక్తల శాసనాలలో కూడా మొక్కుబడి ఉండేది. ఆ రోజుల్లోని భక్తులు కూడా మొక్కుబడి చేసుకునేవారు అని మనకు తెలుస్తుంది.

ఇక మీరు ప్రశ్నించవచ్చు, ఏమండీ, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో ఉన్న వాళ్ళము కదా, మాకు వేరే ప్రవక్తల శాసనాలతో పని ఏమిటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మొక్కుబడి ఉందా లేదా? అది చెప్పండి అని మీరు అడగవచ్చు. అభిమాన సోదరులారా, అటువైపే నేను వస్తున్నాను. రండి, ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మొక్కుబడి గురించి అల్లాహ్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని చెప్పారో తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మొక్కుబడిని ఉంచాడు. ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి తప్పనిసరిగా చెల్లించుకోవాలని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో ఆదేశించి ఉన్నాడు. చూడండి, ఖురాన్‌లోని సూరా హజ్ 29వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

ثُمَّ لْيَقْضُوا۟ تَفَثَهُمْ وَلْيُوفُوا۟ نُذُورَهُمْ وَلْيَطَّوَّفُوا۟ بِٱلْبَيْتِ ٱلْعَتِيقِ
(సుమ్మల్ యఖ్జూ తఫసహుం వల్ యూఫూ నుజూరహుం వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్)

హజ్ చేయడానికి వెళ్తారు కదండీ? కాబా పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ హజ్ ఆచరించాలని హాజీలు వెళ్తారు కదండీ? ఆ హాజీల గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే, ఆ తరువాత వారు, అనగా హజ్ చేసేవారు, తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించుకోవాలి. మొక్కుబడులను చెల్లించుకోవాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో ఆదేశిస్తున్నాడు.

అలాగే అభిమాన సోదరులారా, స్వర్గానికి వెళ్ళే వాళ్ళు భక్తులు, వాళ్ళు ఉత్తములు. అలాంటి సజ్జనుల లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే, స్వర్గవాసులు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ప్రపంచంలో ఏదైనా మొక్కుబడి చేసుకుని ఉంటే ఆ మొక్కుబడి తప్పనిసరిగా చెల్లించేవారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి యొక్క లక్షణాలను కూడా మనకు తెలియజేశాడు. చూడండి, సూరా దహర్‌లోని ఏడవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజ్జనుల లక్షణాలను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే,

يُوفُونَ بِٱلنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُۥ مُسْتَطِيرًا
(యూఫూన బిన్నజ్రి వయఖాఫూన యౌమన్ కాన షర్రుహు ముస్తతీరా)

సజ్జనులు ఏమి చేస్తారంట? వారు తమ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు, కీడు నలువైపులా విస్తరించే రోజు గురించి భయపడుతూ ఉంటారు. అంటే, పరలోక దినం గురించి వాళ్ళు భయపడుతూ ఉంటారు. మొక్కుబడులు చేసుకుంటే ఆ మొక్కుబడులను తప్పనిసరిగా వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. ఇది సజ్జనుల లక్షణము అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇక్కడ తెలియజేశాడు.

అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో కూడా మొక్కుబడి ఉంది. మొక్కుబడి చెల్లించుకోవటం సజ్జనుల లక్షణమని మనకు ఈ వాక్యాల ద్వారా తెలిసింది కాబట్టి, ఇక మొక్కుబడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలియజేస్తున్నాను, అవి కొంచెం జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకుని ఆచరించే ప్రయత్నం చేయండి.

మొదటి నియమం ఏమిటంటే, మొక్కుబడి చేసుకునే వాళ్ళు ధర్మ సమ్మతమైన విషయాల మీదే మొక్కుబడి చేసుకోవాలి. ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పేరు మీద నేను ఒక జంతువు జబా చేసి అన్నం తినిపిస్తాను లేదా నలుగురికి దాహం తీర్చడానికి నీటి సౌకర్యం కల్పిస్తాను, ఈ విధంగా ఏదైనా ఒక సత్కార్యాన్ని, ధర్మ సమ్మతమైన కార్యాన్ని నేను చేస్తాను అని మొక్కుబడి చేసుకోవచ్చు. ధర్మ సమ్మితమైన విషయాల మీద మాత్రమే మొక్కుబడి చేసుకోవాలని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

مَنْ نَذَرَ أَنْ يُطِيعَ اللَّهَ فَلْيُطِعْهُ
(మన్ నజర అన్ యుతీఇల్లాహ ఫల్ యుతిఅ)
అల్లాహ్ ఆదేశాలను పాటించడానికి ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఆ మొక్కుబడిని చెల్లించాలి.

అలాగే మొక్కుబడికి సంబంధించిన మరొక నియమం ఏమిటంటే, అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదు. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తి నేను నలుగురికి సారాయి తాపిస్తాను అని మొక్కుబడి చేసుకోవడం. అభిమాన సోదరులారా, ఇస్లాంలో సారాయి సేవించటం స్వయంగా త్రాగటము కూడా నిషేధమే, ఇతరులకు త్రాపించటము కూడా నిషేధమే, లేదా సారాయిని ఒకచోట నుండి మరొక చోటికి తరలించడానికి సహాయపడటము కూడా నేరమే, అది కూడా నిషేధమే. కాబట్టి అల్లాహ్ నిషేధించిన కార్యాన్ని నేను చేస్తాను అని మొక్కుబడి చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلا يَعْصِهِ
(మన్ నజర అన్ యఅసియహు ఫలా యఅసిహి)
అల్లాహ్ ఆదేశాలను ధిక్కరించడానికి ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే అతను అల్లాహ్ ఆదేశాలను ధిక్కరించరాదు, అలాంటి మొక్కుబడి చేసుకోరాదు అని తెలియపబడింది.

అభిమాన సోదరులారా, మీరు ఒక్క విషయం ఇక్కడ ప్రశ్నించవచ్చు. ఏమండీ, ఒక వ్యక్తి అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్నాడు. కాకపోతే ఆ అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదని తరువాత అతనికి తెలిసింది. ఇప్పుడు అతను ఏమి చేయాలి? అతనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా అంటే, అభిమాన సోదరులారా, అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్న వాళ్ళు మొక్కుబడి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ పరిహారం చెల్లించుకోవచ్చును. పరిహారం ఏమిటంటే, 10 మందికి అన్నం తినిపించాలి లేదా 10 మందికి బట్టలు తొడిగించాలి లేదా ఒక బానిసను విముక్తుడిని చేయాలి లేదా మూడు రోజుల ఉపవాసం ఉండాలి. ప్రమాణం చేసిన తర్వాత ప్రమాణాన్ని భంగపరిస్తే కూడా ఇదే పరిహారం ఇవ్వాలి, అదే పరిహారము అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్న వాళ్ళు కూడా పరిహారం చెల్లించుకోవాలి.

ఇక రండి అభిమాన సోదరులారా, మొక్కుబడికి సంబంధించిన మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే, తన ఆధీనంలో లేని విషయాల మీద మొక్కుబడి చేసుకోకూడదు. అలాగే మనం చూస్తున్నట్లయితే చాలా మంది, నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ కార్యం పూర్తి చేస్తే, నేను ఇన్ని కిలోల బంగారాన్ని దానం చేస్తాను అని మొక్కుబడి చేసుకుంటారు. వాస్తవానికి అన్ని కిలోల బంగారం వాళ్ళ వద్ద లేదు. వారి ఆధీనంలో, వారి శక్తి సామర్థ్యానికి మించిపోయిన విషయాల గురించి మొక్కుబడి చేసుకోరాదు.

అలాగే, అర్థరహితమైన మొక్కుబడులు కూడా చేసుకోకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఇలాగే ఒక సంఘటన జరిగింది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్ మీద నిలుచుని ప్రసంగిస్తూ ఉంటే, ఒక సహాబీ ఎండలో నిలబడి ప్రసంగాన్ని వింటూ ఉన్నాడు. అందరూ లోపల వచ్చి కూర్చుని ఉన్నారు, ఆయన ఒక్కడు మాత్రం ఎండలోన నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరండి అతను? ఎందుకు అక్కడ ఎండలో నిలబడిపోయాడు? లోపలికి ఎందుకు రావట్లేదు? పిలవండి అతనికి అని అడిగితే, అప్పుడు కూర్చుని ఉన్న సహాబాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసే విషయం ఏమిటంటే, ఓ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన పేరు అబూ ఇస్రాయీల్, ఆయన ఈ రోజు మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు అంటే, ఈ రోజు నేను నీడలోకి రాను ఎండలోనే ఉంటాను, అలాగే ఈ రోజు నేను ఎవరితో మాట్లాడను, అలాగే ఈ రోజు నేను రోజు మొత్తం నిలబడే ఉంటాను కానీ కూర్చోను, అలాగే ఈ రోజు నేను ఆహారం భుజించను, ఉపవాసంలో ఉంటాను. ఆ విధంగా అతను మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి ఓ దైవ ప్రవక్త, అతను కూర్చోవట్లేదు, అతను అలాగే నిలబడి ఉన్నాడు, నీడలోకి రావట్లేదు, ఎండలోనే నిలబడి ఉన్నాడు అని చెబితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అన్నారు.

مُرُوهُ فَلْيَتَكَلَّمْ، وَلْيَسْتَظِلَّ، وَلْيَقْعُدْ، وَلْيُتِمَّ صَوْمَهُ
(మురూహు ఫల్ యతకల్లెం వల్ యస్తజిల్ వల్ యఖ్అద్ వల్ యుతిమ్మ సౌమహు)

ఇదేంటండి? మీరు వెంటనే అతనికి ఆదేశించండి. అతను మాట్లాడనని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది అర్థరహితమైన మొక్కుబడి. అతనికి మాట్లాడమని చెప్పండి. అలాగే ఈ రోజు మొత్తం నేను నీడలోకి రాను అని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది కూడా అర్థరహితమైన మొక్కుబడి. అతనికి వెంటనే నీడలోకి రమ్మని ఆదేశించండి. ఈ రోజు మొత్తం నేను కూర్చోను, నిలబడే ఉంటాను అని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది కూడా అర్థరహితమైన మొక్కుబడి. అతనికి ఆదేశించండి, వచ్చి వెంటనే కూర్చోమని చెప్పండి. అయితే ఈ రోజు నేను ఉపవాసం ఉంటాను అని అన్నాడు కదా, ఇది మాత్రం ధర్మ సమ్మితమైన విషయమే కాబట్టి ఉపవాసాన్ని పూర్తి చేయమని చెప్పండి. ఉపవాసం పూర్తి చేయమని చెప్పండి కానీ నిలబడతాను అన్నాడు కదా, అది మాత్రం తగదు, కూర్చోమని చెప్పండి. ఈ రోజు నేను నీడలోకి రాను అన్నాడు కదా, అది మాత్రం తగదు, నీడలోకి రమ్మని చెప్పండి. ఈ రోజు నేను మాట్లాడను అని చెప్పాడు కదా, అది కూడా తగదు, మాట్లాడమని చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, తన ఆధీనంలో లేని విషయాల మీద, అర్థరహితమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోకూడదు.

అలాగే, మొక్కుబడి గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన పూర్వీకులు లేదా మన తల్లిదండ్రులు, మన బంధువులలో ఎవరైనా మొక్కుబడి చేసుకున్నారు కానీ మొక్కుబడి చెల్లించక మునుపే మరణించారు. మొక్కుబడి చేసుకున్నారు కానీ మొక్కుబడి చెల్లించక మునుపే మరణించారంటే, మరణించిన వారి యొక్క వారసులు వారి మొక్కుబడులను చెల్లించాలి.

ఉదాహరణకు, జుహైనా తెగకు సంబంధించిన ఒక మహిళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లి హజ్ చేస్తానని మొక్కుబడి చేసుకుంది కానీ హజ్ చేయకుండానే మరణించింది. నేను నా తల్లి తరఫు నుంచి ఆ మొక్కుబడి చెల్లించవచ్చునా? అని ఆ మహిళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమమ్మా, నీ తల్లి ఇతరుల వద్ద ఎవరి దగ్గరైనా బాకీ తీసుకుని ఉంటే, ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ బాకీ నీవు తీరుస్తావా, తీర్చవా? ఆ తప్పనిసరిగా తీర్చుతాను ఓ దైవ ప్రవక్త అన్నప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ తల్లి అల్లాహ్ పేరు మీద హజ్ చేస్తానని మొక్కుబడి చేసుకుని, అల్లాహ్‌కు బాకీ అయిపోయింది కాబట్టి, మీ తల్లి తరఫు నుంచి ఆ అల్లాహ్ మీద చేసుకున్న బాకీని నీవు తీర్చవమ్మా అన్నారు.

కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మన పెద్దలు ఎవరైనా మొక్కుబడి చేసుకున్నారు, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న విషయాన్ని మనకు తెలియజేశారు. ఆ తర్వాత మొక్కుబడి చెల్లించకుండానే వాళ్ళు మరణించారంటే, వాళ్ళ వారసులమైన మనము వాళ్ళ తరఫు నుంచి మొక్కుబడులను తప్పనిసరిగా చెల్లించాలి.

అలాగే అభిమాన సోదరులారా, చివరి యొక్క ముఖ్యమైన నియమం ఏమిటంటే, మొక్కుబడి ఒక ఆరాధన అని నేను ముందుగానే ప్రారంభంలోనే తెలియజేశాను కాబట్టి, ఈ మొక్కుబడి కేవలం అల్లాహ్ దగ్గర మాత్రమే చేసుకోవాలి. అల్లాహ్ తప్ప ఇతరుల ఎవరి వద్ద కూడా మొక్కుబడి చేసుకోకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేశాడు, అదేమిటంటే

وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ
(వఖజా రబ్బుక అల్లా తఅబుదూ ఇల్లా ఇయ్యాహు)
నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయనను తప్ప మరెవరికీని ఆరాధించకూడదు.

అల్లాహ్‌కు తప్ప ఎవరినీ ఆరాధించకూడదు అని అల్లాహ్ ఆదేశించి ఉన్నాడు. అలాగే మరోచోట

وَٱعْبُدُوا۟ ٱللَّهَ وَلَا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًٔا
(వఅబుదుల్లాహ వలా తుష్రికూ బిహీ షైఅన్)
అల్లాహ్‌ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి అని ఆదేశించి ఉన్నాడు.

ఇక మొక్కుబడి ఒక ఆరాధన కదండీ? ఇది అల్లాహ్ దగ్గర కాకుండా ఒక దర్గా దగ్గరనో లేదా ఒక చెట్టు దగ్గరనో లేదా ఒక పుట్ట దగ్గరనో ఎవరైనా మొక్కుబడి చేసుకుంటున్నాడు అంటే అతను అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పిస్తున్నాడు. కాబట్టి మొక్కుబడులు చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, సమాధుల దగ్గర చేసుకోకూడదు, కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే చేసుకోవాలి.

ఇక చివరిగా ఒక విషయాన్ని తెలిపి ఇన్షా అల్లాహ్ నా మాటను ముగిస్తున్నాను, అదేమిటంటే మొక్కుబడి చేసుకుంటే అభిమాన సోదరులారా, మొక్కుబడి అల్లాహ్ రాసిన రాతను ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు. ఇది మనం గమనించాలి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే మొక్కుబడి చేసుకుంటే ప్రాణాపాయం తప్పిపోతుంది, లేదా ఇంకేదో జరిగిపోతుంది, లేదా ఇంకేదో జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. మొక్కుబడి ఒక ఆరాధన, ధర్మ సమ్మితమైన విషయాల పైన ఆ మొక్కుబడి చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మొక్కుబడి చెల్లించాలి, ఇవన్నీ ఆదేశాలు ఉన్నాయి, కానీ ఒక భక్తుడు గమనించాల్సిన, తెలుసుకోవలసిన, విశ్వసించవలసిన విషయం ఏమిటంటే మొక్కుబడి అల్లాహ్ రాసిన వ్రాతను ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

فَإِنَّ النَّذْرَ لَا يَرُدُّ مِنْ قَدَرِ اللَّهِ شَيْئًا
(ఫఇన్నన్నజర లా యరుద్దు మిన్ ఖదిరిల్లాహి షైఆ)
అల్లాహ్ రాసేసిన విధి వ్రాతను మొక్కుబడి ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రకమైన అయిష్టాన్ని కూడా ఒక సందర్భంలో తెలియజేశారు. ఏమన్నారంటే

وَإِنَّمَا يُسْتَخْرَجُ بِالنَّذْرِ مِنَ الْبَخِيلِ
(వఇన్నమా యుస్తఖ్రజు బిన్నజ్రి మినల్ బఖీల్)

పిసినారులు ఉంటారు కదండీ, దైవ మార్గంలో ఖర్చు చేయాలంటే వాళ్ళు వాళ్ళ చేతులు లేయవు. పిసినారులు ఉంటారు కదండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు “పిసినారుల జోబులో నుంచి డబ్బు బయటికి తీయించడానికి ఒక మార్గము ఈ మొక్కుబడి” అన్నారు. అల్లాహు అక్బర్.

కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తుడు విశ్వసించవలసిన విషయం ఏమిటంటే, మొక్కుబడి విధివ్రాతను మార్చలేదు. పిసినారుల జబ్బు నుంచి కొంత డబ్బు దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఒక మార్గము మాత్రమే.

అభిమాన సోదరులారా, మరొక దురభిప్రాయం మన సమాజంలో ఎలా ఉందంటే, మొక్కుబడిని సరైన రీతిలో చేసుకోరు, ఒక వ్యాపారం లాగా చేస్తారు. ఎలాగంటే, ఫలానా నా పని జరిగితే నేను ఫలానా కార్యాన్ని చేస్తాను. ఫలానా నా కోరిక తీరితే నేను ఇన్ని రకాతుల నమాజు చదువుతాను, లేదంటే ఇన్ని ఉపవాసాలు ఉంటాను, లేదంటే ఒక జంతువుని జబా చేసి సదఖా చేస్తాను, ఈ విధంగా షరతు పెట్టేస్తారంట మాట. ఆ షరతు పూర్తి అయితేనే ఆ పని చేస్తారు లేదంటే ఆ పని చేయరు. ఇది సరైన విధానం కాదు. ఇది అల్లాహ్‌తో ఒక రకమైన వ్యాపారం ఆడుతున్నట్టు. అంటే ఆ పని చేయకపోతే నీవు నమాజులు చదవవా? ఆ పని పూర్తి కాకపోతే నీవు ఉపవాసాలు ఉండవా? ఆ పని పూర్తి కాకపోతే నువ్వు ఖుర్బానీలు చేయవా? అంటే అల్లాహ్‌తో నువ్వు షరతు పెడుతున్నావు, అంటే ముందు అల్లాహ్ నీ పని చేయాలి, తర్వాత నీవు అల్లాహ్ పని చేస్తావు. ఇది సరైన విషయం కాదు అభిమాన సోదరులారా.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన కార్యాలను పూర్తి చేస్తున్నప్పుడు మనం సంతోషంగా అల్లాహ్ నువ్వు నా ఈ కార్యాన్ని పూర్తి చేస్తున్నావు కాబట్టి నేను సంతోషంగా నీకు కృతజ్ఞత తెలుపుతూ మొక్కుబడి చేసుకుంటున్నాను, నేను ఈ విధంగా ఈ పని చేస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుని వెంటనే ఆ పని అమలు పరచాలి. అది సరైన విధానము.

కాబట్టి చివరిలో నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, ఇప్పటివరకు మొక్కుబడి గురించి మనం ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా తెలుసుకున్న నియమాలను సరిగా అర్థం చేసుకుని, దైవ మార్గంలో అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాల ప్రకారము నడుచుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

వఖూలు హౌలి హాజా అస్తగఫిరుల్లాహ లీ వలకుం వలిస్సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్రహీం.

ఈ పోస్ట్ లింక్:
https://teluguislam.net/?p=17005

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


ఖుర్బానీ ఆదేశాలు & ఘనత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్


వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/repdu4saKmM [46 నిముషాలు]

ఈ ప్రసంగంలో వక్త ఇస్లాంలో ఖుర్బానీ యొక్క అర్థం, ప్రాముఖ్యత మరియు దానికి సంబంధించిన విధివిధానాలను వివరంగా తెలియజేశారు. ఖుర్బానీ ఎప్పుడు చేయాలి, అర్హమైన పశువులు మరియు వాటి వయస్సు, పశువులో భాగస్వామ్య పద్ధతులు వంటి నిబంధనలను ఖురాన్, హదీసుల ఆధారంగా స్పష్టం చేశారు. అలాగే, అఖీఖా మరియు ఖుర్బానీ కలిపి చేయవచ్చా, మరణించిన వారి పేరిట ఖుర్బానీ ఇవ్వవచ్చా, అప్పు చేసి ఖుర్బానీ చేయవచ్చా వంటి పలు సందేహాలను నివృత్తి చేశారు. ఖుర్బానీ పశువు మాంసాన్ని, చర్మాన్ని ఎలా పంపిణీ చేయాలో వివరిస్తూ, ఖుర్బానీ మాంసం, రక్తం కాకుండా కేవలం మనలోని భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అల్లాహ్ కు చేరుతాయని ఉద్ఘాటించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. ఈనాటి ప్రసంగంలో మనం ఖుర్బానీ ఆదేశాలు తెలుసుకుందాం. ముందుగా ఖుర్బానీ అంటే ఏమిటి? తెలుసుకుందాం.

ఖుర్బానీ అంటే జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి జుల్ హిజ్జా నెల 13వ తేదీన సూర్యాస్తమయానికి ముందు వరకు రేయింబవళ్ళలో ఎప్పుడైనా నిర్ధారిత పశువులను అల్లాహ్ ప్రసన్నత కోసం జిబాహ్ చేయడాన్ని ఖుర్బానీ అంటారు.

ఈ ఖుర్బానీకి ఉన్న ఘనత, విశిష్టత ఏమిటంటే… ఖురాన్ లోని 108వ అధ్యాయము రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
(ఫసల్లి లిరబ్బిక వన్ హర్)
కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. (108:2)

అలాగే ఖురాన్ లోని 6వ అధ్యాయము 162వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(ఖుల్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)

ఓ ప్రవక్తా! ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే.(6:162)

ఈ రెండు ఆయతులలో ఒక విషయాన్ని గమనించారా? ఈ రెండు ఆయతులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండు ముఖ్యమైన ఆరాధనల ప్రస్తావన చేసి ఉన్నాడు. ఒకటి నమాజు అయితే, రెండవది ఖుర్బానీ. నమాజుతో పాటు ఖుర్బానీ ప్రస్తావన కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు ఆయతులలో చేసి ఉన్నాడు. నమాజ్ ఎంత గొప్ప ఆరాధన అన్న విషయము మనందరమూ తెలుసుకొని ఉన్నాము. అలాంటి గొప్ప ఆరాధనతో పాటు ఖుర్బానీ యొక్క ప్రస్తావన చేయడం వల్ల ఖుర్బానీ కూడా గొప్ప ఆరాధన, అల్లాహ్ కు ఇష్టమైన కార్యము అనే విషయము ఈ రెండు వాక్యాల ద్వారా మనము గ్రహించాలి.

ఖుర్బానీ యొక్క విశిష్టతను ఈ విధంగా కూడా మనము అర్థం చేసుకోవచ్చును. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనం చూచినట్లయితే, ఆయన ప్రతి సంవత్సరము ఖుర్బానీ చేశారు. ఆయన తన కుటుంబీకుల తరఫున ఖుర్బానీ చేయటమే కాకుండా, ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారికి కూడా ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుండి కూడా ఆయన ఖుర్బానీ చేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆయన ఆయన కుటుంబీకుల సభ్యుల తరపున ఖుర్బానీ చేసుకోవటంతో పాటు, అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుంచి కూడా ఖుర్బానీ చేశారు. అందరికీ ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన కృషి చేశారు అంటే ఆ ఖుర్బానీ ఎంత విశిష్టమైనదో మనము ఇట్టే అర్థం చేసుకోవచ్చు మిత్రులారా.

అలాగే ఖుర్బానీ ఎంత ముఖ్యమైన ఆరాధన అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ఉల్లేఖనం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిస్తూ ఇలా తెలియజేశారు: “స్తోమత ఉండి కూడా ఎవరైతే ఖుర్బానీ చేయుటలేదో, వారు మన ఈద్ గాహ్ పండుగ నమాజు ఆచరించే స్థలం దరిదాపులకు కూడా రావద్దు” అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా మామూలు విషయాల గురించి ఆయన ఆగ్రహించరు, వారించరు. ఆయన ఆగ్రహిస్తున్నారు, వారిస్తున్నారు అంటే అది చాలా ముఖ్యమైన విషయమై ఉంటుంది. ఆ ప్రకారంగా స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు ఆచరిస్తున్న స్థలానికి, దాని దరిదాపులకు కూడా రావద్దు అని కఠినంగా ఆయన వారిస్తున్నారు అంటే ఖుర్బానీ ఎంత విశిష్టత గలదో ఎంత ముఖ్యమైన ఆరాధనయో మనము ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఖుర్బానీ అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యము తెలుసుకోవాలంటే… ఖురాన్ లో 22వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ
(వ లికుల్లి ఉమ్మతిన్ జఅల్నా మన్సకల్ లియజ్ కురుస్మల్లాహి అలా మా రజకహుమ్ మిమ్ బహీమతిల్ అన్ ఆమ్)

తమకు అల్లాహ్‌ ప్రసాదించివున్న పశువులపై అల్లాహ్‌ పేరును స్మరించటానికిగాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్థారించాము“. (22:34)

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి అనుచర సమాజానికి ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అంటే ప్రతి అనుచర సమాజానికి ఆ ఆరాధన చేయమని అల్లాహ్ ఆదేశించి ఉన్నాడు అంటే అది అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యమై ఉంటే అల్లాహ్ ఆ విధంగా ఆదేశించి ఉంటాడు కదా?

మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా విని ఉన్నాము. ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కుమారులు హాబీల్ మరియు ఖాబీల్ వద్ద పెళ్లి విషయంలో గొడవ జరిగినప్పుడు, ఖుర్బానీ చేయమని తండ్రి ఆదేశించగా వారిద్దరూ ఖుర్బానీ సమర్పించారు. ఒకరి ఖుర్బానీ స్వీకరించబడింది, ఒకరి ఖుర్బానీ తిరస్కరించబడింది. అదంతా మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో వివరంగా తెలుసుకొని ఉన్నాము ఇక్కడ అదంతా ప్రస్తావించే ఆస్కారము లేదు. కాకపోతే తద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం వారి కుమారులు ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద మానవుల చరిత్ర మొదలైన దశలో ప్రారంభంలో వారు ఈ భూమి మీద జీవించారు. ఆ ప్రకారంగా మానవులు ఈ భూమి మీద జీవించిన ప్రారంభము నుండే ఖుర్బానీ ఆదేశాలు మానవులకు ఇవ్వబడి ఉన్నాయి అన్న విషయం మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఆ తర్వాత ప్రతి అనుచర సమాజానికి కూడా అల్లాహ్ ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అన్న విషయము కూడా మనకు బోధపడుతుంది.

ఈ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాల ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసుల ద్వారా ఖుర్బానీ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనకు అర్థమవుతుంది. ఇవి కాక వేరే ఉల్లేఖనాలు ఉన్నాయి, అవి బలహీనమైనవి, కాబట్టి వాటి ప్రస్తావన నేను ఇక్కడ చేయుటలేదు. చాలామంది పండితులు బలహీనమైన వాక్యాలు, బలహీనమైన ఉల్లేఖనాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు… ఖుర్బానీ చేయగానే ఆ ఖుర్బానీ రక్తము భూమి మీద పడకముందే అల్లాహ్ వద్ద ఆమోదం పొందుతుంది, ఆ రక్తపు చుక్క భూమి మీద పడకముందే ఖుర్బానీ ఇచ్చే వ్యక్తుల పాపాలు మన్నించబడతాయి, ఖుర్బానీ ఇచ్చే పశువు చర్మం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలు ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖాతాలో లిఖించబడతాయి… ఇలాంటి ఉల్లేఖనాలు ఉన్నాయి కదండీ, అవన్నీ బలహీనమైన ఉల్లేఖనాలు అని ధార్మిక పండితులు నిర్ధారించి ఉన్నారు కాబట్టి వాటిని నేను ఇక్కడ ప్రస్తావించుటలేదు.

ఇక రండి, ఖుర్బానీ అంటే ఏమిటి, ఖుర్బానీ విశిష్టత ఏమిటి అని మనము తెలుసుకున్న తర్వాత, ఖుర్బానీ ఆదేశం ఏమిటి? ఇస్లామీయ శాసనంలో ఖుర్బానీకి ఉన్న విలువ ఏమిటి? అంటే అది ఫరజా లేదా సున్నతా?

ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తపరచి ఉన్నారు. కొంతమంది ధార్మిక పండితులు ఖుర్బానీ సున్నత్ అని తెలియజేసి ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించారు కాబట్టి అది సున్నత్ అని కొంతమంది ధార్మిక పండితుల అభిప్రాయం.

మరి కొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, స్తోమత ఉన్న వారిపై ఖుర్బానీ చేయటం విధి, తప్పనిసరి, వాజిబ్ అంటున్నారు. వారి ఈ వాదనకు ఆధారం ఏమిటంటే, ఖురాన్ లోని 108వ అధ్యాయము 2వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఫసల్లి లిరబ్బిక వన్ హర్” (నీ ప్రభువు కొరకు నమాజు ఆచరించు, నీ ప్రభువు కొరకు ఖుర్బానీ చెయ్యి) ఖుర్బానీ చెయ్యి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి, ఆయన ఆదేశం ప్రకారము స్తోమత ఉన్నవారు ఖుర్బానీ చేయటం తప్పనిసరి వాజిబ్.

అలాగే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు చేసే స్థలం దరిదాపులకు రావద్దు అని వారించారు అంటే, ఖుర్బానీ చేయటం స్తోమత ఉన్న వారిపై వాజిబ్, తప్పనిసరి అని ఆ వాక్యము మరియు ఉల్లేఖనం ద్వారా వారు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇక రండి, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు, వాక్యాలు దృష్టిలో పెట్టుకుని చూచినట్లయితే, మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…

పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు, ఆవు, ఎద్దు, ఒంటె (ఆడది అయినా మగది అయినా) – ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఈ ఎనిమిది పశువులు కాకుండా వేరే పశువులు కూడా ఉన్నాయి, అవి కూడా హలాల్ ధర్మసమ్మతమే, అయినప్పటికినీ వాటి ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలుపుతున్నారు. ఎందుకంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులలో సహాబాలు ఎవరైనా కానీ, ఈ ఎనిమిది పశువులు తప్ప వేరే పశువుల ఖుర్బానీ చేయలేదు. కాబట్టి మనము కూడా వారు చేసిన పశువులనే ఖుర్బానీ చేయాలి అని బోధిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

అయితే, ఈ ఎనిమిది పశువులలో ఏ పశువు ఖుర్బానీ ఉత్తమమైనది? ఇక్కడ కూడా ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయం వ్యక్తపరిచి ఉన్నారు.

కొంతమంది ఏమంటున్నారంటే పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది, ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరము పొట్టేలు ఖుర్బానీ చేసి ఉన్నారు కాబట్టి పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది అని అంటున్నారు.

మరి కొంతమంది ధార్మిక పండితులు పశువు, ఖుర్బానీ రూపంలో ఇవ్వబడుతున్న పశువు, దాని మాంసము, తద్వారా ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక లిస్ట్ వారు తెలియజేశారు. ఆ లిస్ట్ ప్రకారంగా:

  1. ఒకటి, ఒంటె ఒక వ్యక్తి తరఫు నుంచి ఇవ్వబడుతూ ఉంటే ఆ ఖుర్బానీ ఉత్తమమైనది.
  2. తరువాత ఆవు లేదా ఎద్దు ఒక వ్యక్తి తరఫున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది రెండవ ఉత్తమమైన ఖుర్బానీ.
  3. పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఇవి ఒక వ్యక్తి తరపున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది మూడవ ఉత్తమమైన ఖుర్బానీ.
  4. ఆ తర్వాత ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు, పది వ్యక్తులు లేదా పది కుటుంబాలు ఒక ఒంటెలో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది నాలుగవ ఉత్తమమైన ఖుర్బానీ.
  5. ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు కలిసి ఒక ఆవులో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది ఐదవ ఉత్తమమైన ఖుర్బానీ అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు. ఇంక అసలు విషయము అల్లాహ్ కు తెలుసు.

ఇక రండి, ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ధార్మిక పండితులు తెలియజేసిన విషయం: ఖుర్బానీ కోసం ఇవ్వబడుతున్న పశువు తాజాగా, బాగా లావుగా, కొమ్ములు కలిగిన, ఖసీ చేయబడిన పశువు అయి ఉండటం మంచిది అని తెలియజేశారు.

అలాగే, ఖుర్బానీ ఇవ్వబడుతున్న పశువుల వయస్సు ఎంత ఉండాలి? ఎంత వయస్సు గల పశువుని ఖుర్బానీ ఇవ్వవచ్చు? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు స్పష్టమయ్యే విషయం చూడండి:

  • ఒంటె 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఒంటె ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
  • ఆవు లేదా ఎద్దు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఆవు లేక ఎద్దు ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
  • పొట్టేలు, గొర్రె విషయం గురించి చూడండి. పొట్టేలు మరియు గొర్రె పాల పళ్ళు ఊడిన తర్వాత వచ్చిన పళ్ళు ఉంటాయి కదండీ, అలా పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె అయి ఉండాలి. ఒకవేళ పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె దొరకని యెడల సంవత్సరము దాని దరిదాపుల వయస్సు కలిగిన పొట్టేలు, గొర్రె ఉన్నా గాని ఖుర్బానీ కోసం చెల్లుబాటు అవుతుంది.
  • ఆ తర్వాత మేక మరియు మేకపోతు విషయం గురించి దైవ ప్రవక్త వారు తెలియజేశారు. అది తప్పనిసరిగా పళ్ళు వేసినదై ఉండాలి. అంటే పాలు పళ్ళు ఊడిన తర్వాత వస్తాయి కదండీ పళ్ళు, ఆ పళ్ళు వేసినదై ఉండాలి మేక, మేకపోతు. పళ్ళు వేయని మేక, మేకపోతు అయితే ఖుర్బానీ ఎట్టి పరిస్థితిలో చెల్లదు. దొరకట్లేదు అని పళ్ళు ఊడని మేక, మేకపోతు ఖుర్బానీ మాత్రం చెల్లదు. అది పొట్టేలు, గొర్రెకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది.

ఇకపోతే, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు కాదు? ఏ పశువుల ఖుర్బానీ చెల్లదు?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: కుంటి పశువు ఖుర్బానీ చెల్లదు. అలాగే ఒక కంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక కన్ను కనిపించుటలేదు, ఒక కంటితోనే చూస్తూ ఉంది అంటే ఒంటికంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. వ్యాధి బారిన పడిన పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక పశువు వ్యాధి బారిన పడిపోయింది, అలా వ్యాధి బారిన పడిపోయిన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు. అలాగే బాగా బలహీనమైపోయి, ఎముకలు కనిపిస్తున్న బలహీనమైన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా స్పష్టమవుతుంది.

ఈ ఉల్లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ధార్మిక పండితులు తెలియజేశారు, ఇవి కాకుండా వేరే ఏమైనా స్పష్టంగా కనిపించే లోపాలు ఉన్నా అలాంటి పశువు ఖుర్బానీ చెల్లదు అన్నారు. ఉదాహరణకు మనం చూచినట్లయితే కొన్ని పశువులకు తోక కత్తిరించేసి ఉంటారు. కొన్ని పశువులకు చెవులు కత్తిరించేసి ఉంటారు. అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది లోపము. అలా స్పష్టంగా కంటికి లోపం కనిపిస్తూ ఉంటే అలా లోపము ఉన్న పశువు ఖుర్బానీ చెల్లదు. చిన్న లోపం ఉంది అది కంటికి స్పష్టంగా కనిపించుటలేదు అంటే అది సమస్య కాదు, దాని ఖుర్బానీ చెల్లుతుంది. స్పష్టంగా కంటికి కనిపించే అంత పెద్ద లోపము ఉంటే అప్పుడు ఆ పశువు ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక రండి, ఏ పశువులో ఎంతమంది భాగస్తులు కాగలరు? అనే విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…

ఒంటెలో 10 మంది భాగస్తులు కావచ్చు, 10 కుటుంబాలు కూడా భాగస్తులు కావచ్చు. ఆవు లేదా ఎద్దులో 7 వ్యక్తులు భాగస్తులు కావచ్చు లేదా 7 కుటుంబాలు భాగస్తులు కావచ్చు.

పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు… వీటిలో మాత్రము ఒక వ్యక్తి మాత్రమే ఖుర్బానీ ఇస్తాడు లేదా ఒక కుటుంబీకులు మాత్రమే (ఒక కుటుంబం తరఫున మాత్రమే) ఖుర్బానీ ఇవ్వబడుతుంది. పొట్టేలు, గొర్రె, మేక మరియు మేకపోతులో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలు, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు భాగస్తులు అవ్వడానికి అనుమతి లేదు.

“ఒక కుటుంబం తరపున ఒక పొట్టేలు, ఒక మేక సరిపోతుంది” అని చెబుతున్నారు, ఒక కుటుంబం అంటే ఎంతమంది? అనే సందేహం రావచ్చు. ఇక్కడ వివరణ ఈ విధంగా ధార్మిక పండితులు తెలియజేశారు: ఒకే వ్యక్తి సంపాదన మీద ఎంతమంది అయితే జీవితం గడుపుతూ ఉంటారో, ఒకే వ్యక్తి పోషణలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉంటారో, వారందరూ కూడా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఉదాహరణకు ఇంట్లో తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు, ఆ తండ్రి, భార్యలు, బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఇతరులు ఎవరూ సంపాదించుటలేదు, తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు. అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న వారందరినీ పోషిస్తున్నారు, వారందరి బాధ్యత ఆయన ఒక్కరే మోస్తున్నారు అంటే వారు ఎంతమంది ఉన్నా సరే అప్పుడు ఆ ఒక్క పశువు తరపు నుండే ఆ పూర్తి కుటుంబం తరపున ఖుర్బానీ అయిపోతుంది.

కానీ, ఒకవేళ ఒకే తండ్రికి చెందిన ఇద్దరు లేకంటే ఎక్కువ మంది కుమారులు ఒకే ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వేరువేరుగా సంపాదించుకుని, ఎవరి సంపాదన వారు వేరువేరుగానే ఉంచుకుంటున్నారు అనేటట్లయితే అప్పుడు అది ఒక కుటుంబంగా పరిగణించబడదు. సంపాదన ఎవరైతే వేరుగా పెట్టుకుంటున్నాడో అతను సపరేటుగా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికినీ సంపాదన వేరుగా ఉంచుకున్న వారందరూ కూడా వేరే వేరే కుటుంబీకులే, వారు ప్రతి ఒక్కరు ఎవరైతే సంపాదన వేరు వేరుగా ఉంచుకుంటున్నారో వారు వారు వేరువేరుగా ఖుర్బానీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. ఈ విషయము మనము బాగా అర్థం చేసుకోవాలి.

మనం చూచినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవిత కాలంలో ఖుర్బానీ చేసేటప్పుడు ఒక పశువుని జిబాహ్ చేస్తూ “ఓ అల్లాహ్ ఇది నా తరపున మరియు నా కుటుంబీకుల తరపున” అని ఖుర్బానీ చేసేవారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు సహాబాలు కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరపున నా కుటుంబీకుల తరపున” అని పూర్తి కుటుంబం తరపున ఒక పశువుని ఖుర్బానీ ఇచ్చేవారు.

అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారితో ఈ విధంగా అడగడం జరిగింది: “దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రజలు ఏ విధంగా ఖుర్బానీలు చెల్లించుకునేవారు?” అంటే, అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “మనలోని ప్రతి వ్యక్తి తన తరపున తన కుటుంబం తరపున ఒక పశువుని జిబాహ్ చేసి స్వయంగా తినేవాడు ఇతరులకు కూడా తినిపించేవాడు” అని ఆయన బదులిచ్చారు. ఆ ప్రకారంగా ప్రవక్త మరియు సహాబాల విధానం ఏమిటంటే ఒక కుటుంబం తరఫున ఒక పశువుని జిబాహ్ చేసి వారు స్వయంగా మాంసం భుజించి ఇతరులకు కూడా తినిపించేవారు. ఆ ప్రకారంగా ఒక పశువు ఒక కుటుంబం తరపున ఖుర్బానీ ఇవ్వబడేది అనేది మనకు స్పష్టమవుతుంది.

మిత్రులారా, ఇక్కడ కొంతమంది అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే, బిడ్డలు పుట్టినప్పుడు ఏడు రోజులలో చేయవలసిన అఖీఖా ఏడు రోజులలో చేయకుండా, తరువాత ఖుర్బానీ సమయం వచ్చినప్పుడు ఒకే పశువులో ఖుర్బానీ మరియు అఖీఖా రెండు అయిపోయేలాగా ఉపాయము పన్నుతూ ఉంటారు. ఉదాహరణకు ఆవు లేక ఎద్దు ఉందనుకుందాం. అందులో ఏడు భాగాలు అవకాశం ఉంది కదండీ. ఒక భాగం ఖుర్బానీ కోసం, ఒక భాగం అఖీఖా కోసం తీసుకుంటూ ఉంటారు. అలా ఉపాయం పన్నిన వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకే పశువులో ఖుర్బానీ, ఒకే పశువులో అఖీఖా చెల్లదు. ఇది ఏ ప్రామాణికమైన ఆధారంలో కూడా లేదు. అఖీఖా కోసము ఒక ప్రత్యేకమైన పశువును జబాహ్ చేయవలసి ఉంటుంది. ఖుర్బానీ పశువులో అఖీఖాను తీసుకుని వచ్చి జొప్పించే ప్రయత్నము చేయరాదు, ఇది అతి తెలివి ఉపయోగించటము అలా చేయటం సమంజసము కాదు.

అలాగే చాలామంది కొత్తగా వాదిస్తూ ఉంటారు. అంత డబ్బు పెట్టి పశువు తీసుకుని ఖుర్బానీ చేసి మాంసం మెక్కటం ఎందుకు, అదే డబ్బుతో పేదలకు దానం చేయొచ్చు కదా అని వాదిస్తూ ఉంటారు. వాళ్ళ వాదన వ్యర్థమైనది. ఇస్లాంలో అల్హమ్దులిల్లాహ్ ఫర్జ్ సదఖా, ఫర్జ్ దానం (జకాత్) అని ఒకటి ఉంది. అలాగే నఫిల్ సదఖా, నఫిల్ దానము కూడా ఉంది. వాటి గురించి ప్రత్యేకంగా అల్లాహ్ వాక్యాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ముస్లింలు జకాత్ మరియు ఇతర సదఖాలు చేస్తూ ఉంటారు, నిరుపేదలకు అందిస్తూ ఉంటారు, అవి చేయమని ప్రోత్సహించాలి. ఖుర్బానీ ఆపి సదఖా చేయమని చెప్పాల్సిన అవసరము లేదు అన్న విషయం వారు గ్రహించాలి. ఖుర్బానీ ఒక ప్రత్యేకమైన ఆరాధన, సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేయబడుతుంది. ఆ ప్రకారంగా ఖుర్బానీ చేసుకొని ఖుర్బానీ పుణ్యము మనము సపరేటుగా పొందాలి. ఆరాధనలు జీవితాంతము సంవత్సరము మొత్తము ఎప్పుడైనా ఎక్కడైనా మనము చేసుకొని పుణ్యం సంపాదించుకోవచ్చు ఆ విషయం కూడా వారు గ్రహించాలి.

అలాగే ఒక వ్యక్తి బాగా చూసి ఎలాంటి లోపాలు లేని ఒక పశువుని కొన్నాడు. కొన్న తర్వాత కొద్ది రోజులకు ఏదో ఒక సంఘటన కారణంగా అందులో లోపం ఏర్పడింది. మరి అలాంటప్పుడు అతను ఏం చేయాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు: అతని వద్ద స్తోమత ఉంటే ఆ పశువు అమ్మేసి లోపము లేని మంచి సురక్షితమైన పశువుని ఒకటి కొని ఖుర్బానీ చేయటము ఉత్తమం. ఒకవేళ అతని వద్ద స్తోమత లేదు అంటే, సమయము లేదు లేదా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయి, ఇక అతను ఆ పశువుని అమ్మి వేరే పశువు కొనలేడు అనేటట్లయితే, అదే పశువుని అతను జబాహ్ చేయవచ్చు, ఖుర్బానీ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కొనేటప్పుడు అందులో ఎలాంటి లోపము లేదు కాబట్టి, అతని ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది అని తెలియజేసి ఉన్నారు. అలాగే ఖుర్బానీ కోసము పశువు కొన్న తర్వాత ఆ పశువు దొంగలించబడింది లేదా తప్పిపోయింది కనిపించనే లేదు ఆ తర్వాత. మరి అలాంటప్పుడు వారేం చేయాలి? స్తోమత ఉంటే మరొక పశువు కొని ఖుర్బానీ చేయాలి, స్తోమత లేకపోతే వారికి ఖుర్బానీ పుణ్యము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా దక్కుతుంది.

అలాగే మిత్రులారా, ఇప్పుడు ఖుర్బానీ సమయం ఏమిటి, ఎప్పుడు ఖుర్బానీ చేయాలి? ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం.

ఖుర్బానీ ఎప్పుడు చేయాలి అంటే, పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. ఒకవేళ తొందరపడి ఎవరైనా జుల్ హిజ్జా 10వ తేదీన పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే, అది హలాల్ ధర్మసమ్మతమే కానీ అతనికి ఖుర్బానీ పుణ్యము దక్కదు. అతను మామూలు రోజుల్లో మాంసం కోసము పశువుని జిబాహ్ చేసుకొని మాంసం తింటారు కదండీ, అలా అతనికి అది ధర్మసమ్మతమైన మాంసం మాత్రమే అతనికి హలాల్ దక్కుతుంది. ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి దక్కదు. అతను మళ్ళీ మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత జిబాహ్ చేసుకుంటే అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.

ఒకవేళ ఎవరైనా మర్చిపోయి పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే? అతనికి కూడా ఖుర్బానీ పుణ్యము దక్కదు. ఆ పశువు అతని కోసం హలాల్ ధర్మసమ్మతమే, అతను ఆ పశువు మాంసాన్ని తినవచ్చు. కానీ ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి ఇవ్వబడదు. అతను మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత మళ్ళీ జిబాహ్ చేసుకోవాలి, అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.

అయితే, జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి చేయబడే ఖుర్బానీ (ఆ రోజు, అంటే 10వ తేదీన చేయబడే ఖుర్బానీ) ఉత్తమమైనది. ఆ తర్వాత 11, 12, 13 తేదీలలో కూడా ఖుర్బానీ చేసుకోవచ్చు. 10వ తేదీన చేసే ఖుర్బానీ ఎక్కువ పుణ్యము మరియు ఎక్కువ గౌరవప్రదమైనది అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.

ఇక, ఖుర్బానీ చేసే విధానం ఏమిటి అంటే, పశువుని జిబాహ్ చేసే ముందు కత్తి బాగా పదును పెట్టుకోవాలి. పశువు ముందర కత్తి నూరరాదు. అలాగే పశువుని జిబాహ్ చేసేటప్పుడు ఎడమ వైపుకి పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఆవు, ఎద్దు, పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఉంటే వాటిని పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఒంటె అయితే నిలబెట్టి అతని గొంతు మరియు మునుపటి కాళ్ళ మధ్యలో ఒక ప్రదేశంలో నహర్ చేస్తారు. అలా నిల్చోబెట్టి ఒంటెకు మాత్రమే నహర్ చేయాలి. ఇతర పశువులకు మాత్రము పడుకోబెట్టి జిబాహ్ చేయాలి.

జిబాహ్ చేస్తున్నప్పుడు పశువు ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఎవరైతే జిబాహ్ చేస్తున్నారో, ఖుర్బానీ చేస్తున్నారో వారు కూడా వారి ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టుగా చూసుకోవాలి. జిబాహ్ చేస్తున్న వ్యక్తి అవసరార్థం తన కాలు పశువు శరీరం మీద ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. అలాగే జిబాహ్ చేస్తున్న వ్యక్తి పదునైన కత్తిని తీసుకొని తొందరగా జిబాహ్ చేయాలి.

ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో వారే స్వయంగా తమ స్వహస్తాలతో ఆ పశువుని జిబాహ్ చేయాలి. ఒకవేళ వారి వల్ల కావట్లేదు అనేటట్లయితే ఇతరులతో కూడా ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చు. అలాగే మహిళలు కూడా వారి ఖుర్బానీ వారు వారి స్వహస్తాలతోనే జిబాహ్ చేసుకోవచ్చును. ఒకవేళ వారి వల్ల కుదరదు అనేటట్లయితే ఇతరుల చేత కూడా వారు ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చును.

ఖుర్బానీ పశువుని జిబాహ్ చేసేటప్పుడు:

بِسْمِ اللَّهِ اللَّهُ أَكْبَرُ
(బిస్మిల్లాహి అల్లాహు అక్బర్)
అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు.

అని పఠించడంతో పాటు,

اللَّهُمَّ إِنَّ هَذَا مِنْكَ وَلَكَ، اللَّهُمَّ تَقَبَّلْ مِنَّا
(అల్లాహుమ్మ ఇన్న హాజా మిన్ క వలక అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నా)
ఓ అల్లాహ్! ఇది నీ వైపు నుంచే, నీ కోసమే. ఓ అల్లాహ్! మా నుండి దీనిని స్వీకరించు. అని కూడా పఠించవచ్చును.

మరొక ఉల్లేఖనంలో,

إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
(ఇన్నీ వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్జ హనీఫన్ వ మా అనా మినల్ ముష్రికీన్)

నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్‌ చేసేవారిలోని వాణ్ణి కాను.” (6:79)

అని ఒక దుఆ ఉంది కదండీ, ఆ పూర్తి దుఆ కూడా పఠించవచ్చును అని తెలుపబడింది.

జిబాహ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని పశువులు బెదిరిపోయి తప్పించుకుని పారిపోతాయి. తర్వాత చేతికి చిక్కవు. అవి పారిపోతూ ఉంటే అలాంటప్పుడు ఏమి చేయాలంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, ఎలాగైతే పశువుని షికారు చేస్తారో (వేటాడుతారో) బాణాల ద్వారా లేదా ఇతర పరికరాల ద్వారా, ఆ విధంగా పదునైన బాణంతో గాని లేదా వేరే పరికరాలతో గాని అల్లాహ్ నామము స్మరించి ఆ పారిపోతున్న పశువుని గాయపరచాలి. అదే గాయంలో ఒకవేళ అది మరణిస్తే, అతని ఖుర్బానీ అయిపోయినట్లే. ఒకవేళ అది మరణించకముందే చేతికి దక్కితే, అప్పుడు దాన్ని జిబాహ్ చేసేయాలి, తద్వారా అతని ఖుర్బానీ పూర్తి అవుతుంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక రండి, ముఖ్యమైన విషయం. ఖుర్బానీ చేసిన తర్వాత ఆ పశువు మాంసము మరియు చర్మము ఏమి చేయాలి? దీని సమాధానం ఏమిటంటే, ఖుర్బానీ చేయబడిన పశువు మాంసము వారు స్వయంగా తినవచ్చును, ఇతరులకు కూడా తినిపించవచ్చును, భవిష్యత్తు కోసము దాన్ని భద్రపరుచుకోవచ్చును (ఎండబెట్టి అయినా సరే వేరే విధంగానైనా సరే).

ఖురాన్ లో 22వ అధ్యాయము 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
(ఫకులూ మిన్ హా వ అతయిముల్ ఖానిఅ వల్ ముఅ తర్)
వాటి మాంసాన్ని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. (22:36)

అడిగేవారు అంటే ఎవరు? అడగని వారు అంటే ఎవరు? నిరుపేదలు చేతులెత్తి అడిగేవారు, వారికి ఇవ్వండి. ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, వారు చేతులెత్తి అడగరు, అలాంటి వారికి కూడా ఇవ్వండి అని అక్కడ పేర్కొనబడింది. ఆ ప్రకారంగా ఖుర్బానీ ఇవ్వబడిన పశువు మాంసము మన కోసము కూడా కొంచెం ఉంచుకుని, బంధుమిత్రులకు కొంచెం పంచి, నిరుపేదలకు కూడా పంచి ఆ విధంగా ఖుర్బానీ మాంసాన్ని మనము పంచుకొని మనం స్వయంగా కూడా తింటే మంచిది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

అయితే, ఈ విధంగా మూడు భాగాలు చేయాలి, ఆ మూడు భాగాలు సరైన పరిమాణంలోనే ఉండాలి, కొంచెం కూడా హెచ్చుతగ్గులు అవ్వకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా పుణ్యం కోసము పూర్తి మాంసము అనాధలకు, పేదలకు లేదా ఇతరులకు పంచాలనుకుంటే పూర్తి మాంసము పంచేయవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. అలాగే ఎక్కువ మాంసము అవసరాల కోసం ఉంచుకుని కొద్ది మాంసం మాత్రము పంచాలనుకుంటే అనుమతి ఉంది, కానీ అది భక్తికి విరుద్ధమైన విషయం. ఎందుకంటే, మన కోసమే మనం ఆలోచించుకుంటున్నాం, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించుటలేదు, పేదవారి గురించి మనం ఆలోచించటలేదు అంటే అది విశ్వాస లోపానికి నిదర్శనం, భక్తికి విరుద్ధమైన విషయం కాబట్టి అలా చేయటం సమంజసం కాదు. అందరి గురించి ఆలోచించాలి. బంధుమిత్రుల గురించి ఆలోచించాలి, పేదల గురించి ఆలోచించాలి, మన కుటుంబ సభ్యుల గురించి కూడా మనము శ్రద్ధ తీసుకోవాలి.

అలాగే ఖుర్బానీ పశువు మాంసము ముస్లిమేతరులకు ఇవ్వవచ్చునా అంటే, ఇవ్వవచ్చును. నా సలహా ఏమిటంటే ఈ రోజుల్లో ముస్లిమేతరులలో ముస్లింల పట్ల అపోహలు సృష్టిస్తున్నారు దుష్టశక్తులు. విషం కక్కి ముస్లింలకు వ్యతిరేకంగా వారి మెదడులలో బాగా నూరి పోస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అపోహలు తొలగిపోవడానికి, వారిలో ఉన్న అనుమానాలు దూరం అవ్వటానికి, మనము స్వయంగా రెండు అడుగులు ముందుకు వేసి మన సమీపంలో ఇరుగు పొరుగులో ఉంటున్న మన ముస్లిమేతర సోదరులకు వెళ్లి సగౌరవంగా ఆహ్వానించి ఈ ఖుర్బానీ పశువు మాంసము అందజేయాలి.

అలాగే మరొక ముఖ్యమైన విషయం, మనం ఏ ప్రదేశంలో అయితే ఉంటున్నామో ఆ ప్రదేశంలో ఉన్న ముస్లిమేతరుల సోదరుల మనోభావాలు గాయపడకుండా ఉండటానికి ఆ ప్రదేశంలో ఉన్న ధార్మిక పండితులు ఖుర్బానీ విషయంలో ఏ నియమాలు అయితే బోధిస్తున్నారో ఆ నియమాలకు అనుగుణంగా ఖుర్బానీ చేసుకోండి, ఇది శ్రేయస్కరమైన విధానము.

అలాగే మిత్రులారా, ఖుర్బానీ పశువు చర్మము ఏమి చేయాలి? ఆ చర్మము మనము స్వయంగా ఉపయోగించుకోవటానికి అవకాశము ఉంటే ఉపయోగించుకోవచ్చును. మనకు ఉపయోగించుకోవటం రాదు అంటే ఇతరులకు దానం చేసేయాలి. లేదా అమ్మేసి వచ్చిన సొమ్ముని దానం చేసేయాలి అంతేగాని పశువుని జిబాహ్ చేసిన తర్వాత ముక్కలు చేసి ఇవ్వటానికి వచ్చిన కసాయికి కూలీ రూపంలో మాత్రము ఇవ్వటానికి అనుమతి లేదు. కూలీ రూపంలో జేబు నుంచి డబ్బు చెల్లించండి, కానీ ఆ ఖుర్బానీ ఇవ్వబడిన పశువు చర్మాన్ని కూలీ రూపంలో కసాయికి ఇవ్వటానికి అనుమతి లేదు, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం.

ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పిన మాటను ముగిస్తాను. అదేమిటంటే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చునా లేదా? అంటే ధార్మిక పండితులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు.

ఎవరైతే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చును అని చెబుతూ ఆధారాలు చూపిస్తున్నారో వారు చూపిస్తున్న ఆధారాలన్నీ బలహీనమైనవి. ప్రామాణికమైన ఆధారాలలో ఎక్కడా ఆ విషయం బోధపడలేదు.

ఇక ఎవరైతే ఖుర్బానీ ఇవ్వటానికి అనుమతి ఉంది అని చెబుతూ వేరే మార్గాలు చూపిస్తున్నారో వారేమంటున్నారంటే, ఒకవేళ మరణించిన వ్యక్తి మరణించే ముందు “నేను మరణించిన తర్వాత నా తరపున ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేస్తూ ఉండండి” అని వసీయత్ (హితవు) చేసి ఉంటే, అప్పుడు అతని తరపున ఖుర్బానీ చేయడానికి అనుమతి ఉంటుంది అని కొంతమంది ఒక రకమైన అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

మరి కొంతమంది అయితే అది కూడా ఒక దానం కదండీ, అది చేయవచ్చును అంటున్నారు.

అయితే మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మిత్రులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు కుమారులు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తెలు మరణించారు. సొంత కుటుంబ సభ్యుల్లో ఇంతమంది మరణించి ఉన్నా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సంవత్సరము కూడా “మరణించిన నా సతీమణి ఖదీజా పేరున నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమారుల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమార్తెల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను” అని చేయలేదు. కాబట్టి మరణించిన వ్యక్తుల పేరిట ప్రత్యేకంగా ఖుర్బానీ చేయడానికి అనుమతి లేదు.

కాకపోతే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని మనము పాటిస్తే, ఇన్ షా అల్లాహ్ బ్రతికి ఉన్న వారికి మరణించిన వారికి అందరికీ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది. అది ఎలాగంటే చూడండి: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు ఏమని దుఆ పటించేవారు అంటే,

اللَّهُمَّ تَقَبَّلْ مِنْ مُحَمَّدٍ، وَآلِ مُحَمَّدٍ
(అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ ముహమ్మద్ వ ఆలి ముహమ్మద్)
ఓ అల్లాహ్! నేను ఇస్తున్న ఈ ఖుర్బానీ నా తరఫున మరియు నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసేవారు.

ఇక ఆయన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్నవారు ఉన్నారు, మరణించి ఉన్నవారు ఉన్నారు. ఆ ప్రకారంగా ఆయన తరఫున, ఆయన కుటుంబీకుల్లో బ్రతికి ఉన్న, మరణించిన వారందరి తరపున ఖుర్బానీ అయ్యింది, అందరికీ ఖుర్బానీ పుణ్యము బహుశా ప్రాప్తమయింది అని ధార్మిక పండితులు ఆశాభావం వ్యక్తపరుస్తూ ఏమంటున్నారంటే, మనము కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసుకుంటే మన తరఫున ఖుర్బానీ అయిపోతుంది, మన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్న, మరణించి ఉన్న వారందరి తరఫున కూడా ఖుర్బానీ అయిపోతుంది. అందరికీ కూడా ఇన్ షా అల్లాహ్ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

చివరిలో ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, అప్పు చేసి మరీ ఖుర్బానీ చేయవలసిందేనా? అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అప్పు చేసి మరి తప్పనిసరిగా ఖుర్బానీ చేయమని ఆదేశించలేదు కానీ, మనకు అల్లాహ్ శక్తి ఇచ్చి ఉంటే… ఖుర్బానీ ఒక మూడు నాలుగు రోజుల్లో మాత్రమే అవుతుంది, మిగతా రోజుల్లో ఖుర్బానీ అవ్వదు. అయితే అనుకోకుండా ఆ సమయానికి మన వద్ద డబ్బు లేదు అనేటట్లయితే అప్పటికప్పుడు ఎక్కడినుంచైనా డబ్బు తీసుకొని తర్వాత ఇన్ షా అల్లాహ్ మనము చెల్లించుకోగలము అనే ధైర్యము ఉంటే అప్పుడు అప్పు తీసుకుని ఖుర్బానీ చేసుకోవటం మంచిది, ఉత్తమం. చూడండి డబ్బులు లేకపోయినా స్నేహితులకు పార్టీలు ఇస్తాం బాకీలు చేసి, వేరే చాలా కార్యాలు చేస్తాం. మరి పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో ఎందుకు వెనకడుగు వేయాలి? బేకారు విషయాలలో ధైర్యము చేస్తాం పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో మాత్రము కంగారుపడతామంటే ఇది సరికాదు మిత్రులారా. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇస్తాడు నేను బాకీ చెల్లించుకోగలను అని అల్లాహ్ మీద నమ్మకంతో అప్పు చేసి ఖుర్బానీ చేయాలనుకుంటే చేసుకోవచ్చును, అది మంచిదే అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.

అలాగే ఏ వ్యక్తి అయితే ఖుర్బానీ చేయాలని సంకల్పించుకున్నాడో అతను జుల్ హిజ్జా మాసం ప్రారంభము నుండి ఖుర్బానీ ఇచ్చేంత వరకు కూడా వెంట్రుకలు కత్తిరించరాదు, గోర్లు కత్తిరించరాదు, చర్మము కత్తిరించరాదు. ఒకవేళ మర్చిపోయి ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న వ్యక్తి మధ్యలో గోర్లు కత్తిరించేసాడు లేదా చర్మం కత్తిరించేసాడు అంటే అతను అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి, ఎలాంటి కఫ్ఫారా పరిహారము చెల్లించాల్సిన అవసరమైతే లేదు.

అలాగే ఖుర్బానీ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసము ఇఖ్లాస్ తో చిత్తశుద్ధితో చేయాలి. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు. అలాగే పిసినారితనము కూడా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చూస్తూ ఉంటాం సమాజంలో చాలామంది ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్లు, షావుకార్లు కూడా ఖుర్బానీ విషయంలో పిసినారితనము చూపిస్తూ ఏదో ఒక సాధారణమైన చిన్న పశువు తీసుకొని ఖుర్బానీ చేసేసి చెల్లించేద్దాము అని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వారు పిసినారితనం ప్రదర్శిస్తూ ఉంటారు, సంవత్సరంలో ఒక్కసారి చేయబడే ఖుర్బానీ విషయంలో పిసినారితనము ప్రదర్శించకండి.

సంతోషంగా అల్లాహ్ మార్గంలో ధనము ఖర్చు పెట్టండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మనము ఇస్తున్న ఖుర్బానీ పశువు యొక్క మాంసము అవసరము లేదు, రక్తము అవసరము లేదు, మనము అల్లాహ్ చిత్తము కోసము సంతోషంగా ఖుర్బానీ చేస్తామా లేదా అనేది అల్లాహ్ చూస్తున్నాడు.

لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ
(లయ్యనాలల్లాహ లుహూముహా వలా దిమావుహా వలాకిన్ యనాలుహుత్ తఖ్వా మిన్ కుమ్)
వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్‌కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్‌వా) మాత్రం ఆయనకు చేరుతుంది. (22:37)

అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు కాబట్టి, పిసినారితనము ప్రదర్శించకుండా సంతోషంగా పశువు కొని మంచి పశువు కొని అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ చేయాలి.

అలాగే రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది డబ్బు ఖర్చు చేస్తారు, మంచి పశువుని కొంటారు, కాకపోతే “నేను ఇంత మంచి పశువుని కొన్నాను” అని ఆ పశువు మెడలో దండలు వేసి ఊరిలో ఊరేగింపు చేస్తూ ఉంటారు, ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ప్రదర్శనా బుద్ధితో అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఫోటోలు దింపి, దండలు వేసి, ఇంకా ఏమేమో హంగులు చేసి ఆ ఫోటోలను ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, ఇంకా వీడియోలు తీసి యూట్యూబ్ లలో ఎక్కడెక్కడో వారు ప్రసారం చేస్తూ ఉంటారు. తద్వారా మనిషిలో చిత్తశుద్ధి అనేది లేకుండా పోతుంది. ప్రదర్శనా బుద్ధి అక్కడ వచ్చేస్తుంది, దీనినే ఇస్లామీయ పరిభాషలో రియాకారీ అంటారు. రియా ఉద్దేశంతో, ప్రదర్శనా ఉద్దేశంతో, ప్రదర్శనా బుద్ధితో చేసిన ఏ పుణ్యకార్యము అల్లాహ్ స్వీకరించడు, ఈ ఖుర్బానీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొద్ద స్వీకరించబడదు.

కాబట్టి ఖుర్బానీ చేస్తున్నవారు అటు పిసినారితనము ప్రదర్శించకుండా, ఇటు ప్రదర్శనా బుద్ధిని కూడా ప్రదర్శించకుండా చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఖుర్బానీ చేయాలి. అలాగే ధర్మసమ్మతమైన హలాల్ సంపదతోనే ఖుర్బానీ పశువు కొని ఖుర్బానీ చేయాలి. హరామ్ సంపదతో పశువు కొని ఖుర్బానీ చేస్తే ఆ ఖుర్బానీ ఆమోదించబడదు. హరామ్ సంపదతో ఏ పుణ్యకార్యము చేసినా అది ఆమోదించబడదు, స్వీకరించబడదు.

ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు సూచనలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరికీ హలాల్ సంపదతో, చిత్తశుద్ధితో, సంతోషంగా మంచి పశువుని అల్లాహ్ ప్రసన్నత కోసం ఖుర్బానీ ఇచ్చే భాగ్యం అల్లాహ్ ప్రసాదించుగాక. ఎవరెవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్తోమత ఇచ్చారో వారందరూ ఖుర్బానీ చేసుకునే భాగ్యం అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. ఎవరికైతే స్తోమత లేదో వారందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్బానీ చేయటానికి అర్హత, స్తోమత ప్రసాదించుగాక. ఆమీన్ తకబ్బలల్లాహు మిన్నా వమిన్ కుమ్ వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16954

ఖుర్బానీ ఆదేశాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3FDVDGQYnF0UMyD7YjGNZm

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


యవ్వనం గొప్ప అనుగ్రహం – Youth is a Great Blessing [ఆడియో]

బిస్మిల్లాహ్
యవ్వనం గొప్ప అనుగ్రహం – Youth is a Great Blessing
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


దైవభీతితో కన్నీరు పెట్టడం – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah)
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.

వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
(వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా)
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)

అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.

అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.

అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.

అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ
“లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా”
దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే

(وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ).
“వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనాహు”

ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.

మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

(عَيْنٌ بَكَتْ مِنْ خَشْيَةِ اللهِ، وَعَيْنٌ بَاتَتْ تَحْرُسُ فِي سَبِيلِ اللهِ).
“ఐనన్ బకత్ మిన్ ఖశియతిల్లాహ్ వ ఐనున్ బాతత్ తహ్రుసు ఫీ సబీలిల్లాహ్”

ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.

రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”

ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.

ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!

అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.

అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?

ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!

ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!

అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.

అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.

ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.

కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.

أَقُولُ قَوْلِي هَٰذَا وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ فَاسْتَغْفِرُوهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16913


ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


అన్నదానము మహా పుణ్యకార్యము [ఆడియో]

బిస్మిల్లాహ్
అన్నదానము మహా పుణ్యకార్యము – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
Feeding the Poor is a great virtuous act

[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకాతు & సదఖా (మెయిన్ పేజీ)
https://teluguislam.net/five-pillars/zakah

కరోనా మహమ్మారిని జయించడం ఎలా? [వీడియో]

బిస్మిల్లాహ్
కరోనా మహమ్మారిని జయించడం ఎలా? (How to win over Corona Virus?)

[55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

కరోనా & రక్షణ సాధనాలు (యూట్యూబ్ ప్లేలిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1PVuZzzd5UqkE0pdMGfkFO

కరోనా వైరస్ (మెయిన్ పేజీ)
https://teluguislam.net/corona/

రమజాన్ తర్వాత ధర్మం పై నిలకడ, సత్కార్యాల సంరక్షణ [ఆడియో]

బిస్మిల్లాహ్
రమజాన్ తర్వాత సత్కార్యాల సంరక్షణ – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఆడియో వినటంతో పాటు క్రింది ఈద్ ఖుత్బా కూడా తప్ప చదవండి.
ఆడియో లో చెప్పిన చాలా విషయాలు , క్రింది ఖుత్బా లో చాలా చక్కగా వివరించబడ్డాయి

ఈదుల్ ఫిత్ర్ ఖుత్బా – జాదుల్ ఖతీబ్

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సమాజ సంస్కరణ ఎలా జరుగుతుంది? [ఆడియో]

బిస్మిల్లాహ్
సమాజ సంస్కరణ ఎలా జరుగుతుంది?- వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7