ప్రయాణపు ఆదేశాలు(Rulings of Travel in Islam)
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం: అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [55 పేజీలు]
విషయ సూచిక :
- వీడ్కోలు
- ఒంటరి ప్రయాణం అవాంచనీయం
- మంచి స్నేహితం గురుంచి వెతకాలి
- స్త్రీ ఒంటరిగా ప్రయాణించ కూడదు
- ప్రయాణపు దుఆ
- ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి
- ఎక్కడైనా మజిలీ చేస్తే చదవండి
- తక్బీర్, తస్బీహ్
- అధికంగా దుఆ చేయాలి
- నగరంలో ప్రవేశించినప్పుడు చదవండి
- ముస్లింలకు భాద కలిగించకుండా ఉండాలి
- దారి హక్కులు నెరవేర్చాలి
- అవసరం తీరిన వెంటనే తిరిగి రావాలి
- తిరిగి వచ్చాక ముందు మస్జిదులో రెండు రకాతులు చేసుకోవాలి
- వచ్చినవారిని కౌగలించు కొనుట
- ప్రయాణికుని ఫలితం
- ప్రయాణ సౌకర్యాలు
- ఎంత దూరంలో ఖస్ర్ చేయాలి
- పరిశుభ్రత ఆదేశాలు
- తయమ్ముం విధానం
- మేజోల్ల పై మసా
- అజాన్ ఆదేశాలు
- నమాజు ఆదేశాలు
- ఇమామత్ ఆదేశాలు
- ‘జమ్అ బైనస్సలాతిన్’ ఆదేశాలు
- నమాజు తర్వాత జిక్ర్
- విమానంలో నమాజు
- జుమా నమాజు ఆదేశాలు
- ప్రయాణంలో ఉపవాసాలు (రోజాలు)
[పూర్తి పుస్తకం క్రింద చదవండి]
సాంప్రదాయాలు & పద్ధతులు
వీడ్కోలు
ప్రయాణికుడు తన ఇంటివారికి, స్నేహితులకు ఇలా వీడ్కోలు చెప్పాలిః
అస్తౌదిఉకల్లాహల్లజీ లా తజీఉ వదాఇఉహూ
اسْتَوْدِعُكَ اللهَ الَّذِي لاَ تَضِيعُ وَدَائِعُه
(నేను నిన్ను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను. అతనికి అప్పగించినవి వృధా కావు (వాటిలో నష్టం జరగదు). (ఇబ్ను మాజ 2825, ).
వారు (ఇంటివారు, స్నేహితులు) అతనికి ఇలా వీడ్కోలు చెప్పాలిః
అస్తౌదిఉల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ అమలిక.
أَسْتَوْدِعُ اللهَ دِينَكَ وَأَمَانَتَكَ وَخَوَاتِيمَ عَمَلِكَ
(నీ ధర్మం, నీ అమానతు మరియు నీ అంతిమ ఆచరణలన్నియూ అల్లాహ్ కు అప్పగిస్తున్నాను). (అబూ దావూద్ 2600, తిర్మిజి 3443, ఇబ్ను మాజ 2826).
ఒంటరి ప్రయాణం అవాంఛనీయం
అనవసరంగా మరియు ఎవరైనా తోడు ఉండే అవకాశం ఉన్నప్పటికీ మనిషి ఒంటరిగా పయనించడం అవాంఛనీయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగాః
لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي الْوَحْدَةِ مَا أَعْلَمُ مَا سَارَ رَاكِبٌ بِلَيْلٍ وَحْدَهُ
ఒంటరి ప్రయాణం(లో ఉన్న నష్టం) గురించి నాకు తెలిసినట్లు ప్రజలకు తెలిసి ఉంటే ఏ ప్రయాణికుడు రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించడు. (బుఖారి 2998).
ఇందులో ఓ రకమైన భయం ఉంది. మరేదైనా సంభవించినప్పుడు -అల్లాహ్ తర్వాత- ఏ సహాయకుడు లేకుండా అవుతుంది.
మంచి స్నేహితం గురించి వెదకాలి
ప్రయాణికుడు అతనికి తోడుగా ఉండుటకు దైవభీతిగల, ఉత్తమమైన, మంచిని వాంఛించే, చెడును అసహ్యించే మిత్రుడిని వెదకాలి. ఇద్దరిలో ప్రతీ ఒకరు మరొకరి పట్ల సహనశీలిగా ఉండాలి. మరొకరి ఘనత, గౌరవాన్ని గుర్తించాలి.
స్త్రీ ఒంటరిగా ప్రయాణించకూడదు
దూరపు ప్రయాణమైనా, దగ్గరి ప్రయాణమైనా మరియు ఏరోప్లేన్ లోనైనా లేదా బస్సు, ట్రైన్, మరే రకమైన వాహనంలో అయినా సరే తన భర్త లేదా “మహ్రమ్” లేకుండా ఒంటరిగా ప్రయాణించడం యోగ్యం కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారుః
(لَا تُسَافِرِ الْـمَرْأَةُ إِلاَّ مَعَ ذِي مَحْرَمٍ)
“ఏ స్త్రీ అయినా “మహ్రమ్” లేకుండా ప్రయాణం చేయకూడదు”. (బుఖారి 1862).
అనేక మంది ఆడవాళ్ళు ఏరోప్లేన్ ప్రయాణం ఒంటరిగా చేయడంలో అజాగ్రత్తకు గురి అయ్యారు. ఇందులో ధార్మిక వ్యతిరేకం ఉందని వారు గ్రహించాలి. మరియు భయంకరమైన సంక్షోభం ఉంది. ఎందుకనగా స్వయంగా స్త్రీ ఒక పరీక్ష, ఉపద్రవం. ఆమె ఒంటరిగా ఉండడమే నిషిద్ధకార్యానికి సబబు. ఆమె ఒంటరితనాన్ని అదృష్టంగా భావించి షైతాన్ ప్రేరేపణలు కలగజేసి, ఆమె వైపునకు పురికొలుపుతాడు. ప్రయాణం ఎలాంటిదైనా, ప్రయాణం అనేబడే ప్రతీ ప్రయాణం స్త్రీ ఒంటరిగా చేయడం యోగ్యం కాదు. స్త్రీ ప్రయాణం కొరకు ఉపయోగపడే సాధనం గురించి కాదు, అసలు ప్రయాణము చేయవచ్చా లేదా అనేది యోచింపదగినది.
“మహ్రమ్” అంటే ఒక స్త్రీకి రక్త సంబంధం లేదా పాల సంబంధంగల వివాహ నిషిద్ధమైన బంధువు. అతడు యుక్త వయస్సుగల, బుద్ధి- జ్ఞానంగల, ముస్లిం పురుషుడు అయి యుండాలి. (ఉదాహరణకుః తండ్రి, పెదనాన్న, బాబాయి, కొడుకు, స్వంత సోదరులు, సోదరసోదరీల కుమారులు వగైరాలు).
ప్రయాణపు దుఆ
ప్రయాణికుడు (వాహనం ఎక్కి వెళ్తూ) ఈ దుఆ చదవాలి:
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, సుబ్ హానల్లజీ సఖ్ఖర లనా హాజా వమా కున్నా లహూ ముఖ్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్ అల్లా హుమ్మ ఇన్నా నస్అలుక ఫీ సఫరినా హాజల్ బిర్ర వత్తఖ్వా వ మినల్ అమలి మా తర్జా అల్లాహుమ్మ హవ్విన్ అలైనా సఫరనా హాజా వత్విఅన్నా బుఅదహూ అల్లాహుమ్మ అంతస్ సాహిబు ఫిస్సఫరి వల్ ఖలీఫతు ఫిల్ అహ్ లి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ వఅసాఇస్ సఫరి వ కఆబతిల్ మంజరి వ సూఇల్ మున్ ఖలబి ఫిల్ మాలి వల్ అహ్ల్.
الله أكبر ، الله أكبر ، الله أكبر ، سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا
هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُونَ اللَّهُمَّ إِنَّا نَسْأَلُكَ فِي سَفَرِنَا هَذَا الْبِرَّ وَالتَّقْوَى وَمِنْ الْعَمَلِ مَا تَرْضَى اللَّهُمَّ هَوِّنْ عَلَيْنَا سَفَرَنَا هَذَا وَاطْوِ عَنَّا بُعْدَهُ اللَّهُمَّ أَنْتَ الصَّاحِبُ فِي السَّفَرِ وَالْخَلِيفَةُ فِي الْأَهْلِ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ وَعْثَاءِ السَّفَرِ وَكَآبَةِ الْمَنْظَرِ وَسُوءِ الْمُنْقَلَبِ فِي الْمَالِ وَالْأَهْلِ
ప్రయాణము నుండి తిరిగి వచ్చేటప్పుడు పై దుఆతో పాటు ఇది కూడా చదవాలి.
ఆయిబూన తాయిబూన ఆబిదూన లిరబ్బినా హామిదూన్.
آيِبُونَ تَائِبُونَ عَابِدُونَ لِرَبِّنَا حَامِدُونَ
(అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు, పరిశుద్ధుడైన అల్లాహ్ యే దీనిని (ఈ వాహనాన్ని) మా ఆధీనంలోకి ఇచ్చాడు. లేకపోతే మేము దీనిని ఆధీనపరచుకోలేకపోయేవారము. నిస్సందేహంగా మేము మా ప్రభువు వైపునకు మరలవలసిన వారము. ఓ అల్లాహ్! మేము ఈ ప్రయాణంలో సత్కార్యాలు చేసే, భయభక్తులతో మెలిగే, నీ ప్రసన్నత లభించే కార్యాల బుద్ధిని కోరుకుంటున్నాము. అల్లాహ్! ఈ ప్రయాణాన్ని మాకు సులభతరం చెయ్యి. దీని దూరాలను దగ్గర చెయ్యి. ఓ అల్లాహ్! నీవే ఈ ప్రయాణంలో మాసన్నిహితుడివి. నీవే మా ఇంటివారిని, మా ధనాన్ని కనిపెట్టుకు ఉండేవాడివి. ఓ అల్లాహ్! నేను నీ శరణు కోరుతున్నాను; ప్రయాణంలోని కష్టాల నుండి, అయిష్టకరమైన దృష్యాల నుండి. నా సంపద, నా ఆత్మీయులు మరియు నా సంతానానికి నేను తిరిగి వెళ్ళేటప్పటికీ హాని కలగకుండా కూడా నీ శరణే కోరుతున్నాను).
తిరిగి వచ్చేటప్పటి దుఆ భావం:
(తిరిగివెళ్ళేవారము, పశ్చాత్తాపంతో మన్నింపు కోరేవారము, మా ప్రభువునే ఆరాధించేవారము, ఆయన్నే స్తుతించేవారము).
ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి
ప్రయాణికులు తమలో ఒకరిని తమ నాయకునిగా ఎన్నుకోవడం సున్నత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ సఈద్ ఖుద్రీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హుమాలు ఉల్లేఖించారుః
إِذَا خَرَجَ ثَلَاثَةٌ فِي سَفَرٍ فَلْيُؤَمِّرُوا أَحَدَهُمْ
“ముగ్గురు వ్యక్తులు కలసి ప్రయాణంలో వెళ్ళినప్పుడు వారు తమలో ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవాలి”. (బుఖారి 2608).
దీని ఉద్దేశ్యం అతను వారిని కలిపి ఉంచాలి. వారి మేలు కొరకు పాటుపడాలి. వారు అతని విధేయత పాటించాలి. అతడు ఏదైనా అవిధేయతకు గురి చేసే ఆదేశం ఇస్తే మాత్రం దానిని పాటించకూడదు.
ఎక్కడైనా మజిలీ చేస్తే చదవండి
ఏదైనా చోట మజిలీ చేసినప్పుడు ఈ దుఆ చదవడం అభిలషణీయం.
అఊజు బికలిమా తిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (ముస్లిం 2708).
أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ
(అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల ద్వారా నేను అల్లాహ్ సృష్టించిన ప్రతిదాని కీడు నుండి శరణు వేడుకుంటున్నాను).
ఈ దుఆ చదివిన వారు ఆ ప్రాంతం నుండి వెళ్ళే వరకు వారికి ఏ విధమైన నష్టం కూడా కలగదు.
తక్బీర్, తస్బీహ్
ప్రయాణికుడు తన దారిలో ఎత్తు ప్రదేశం నుండి వెళ్తూ అల్లాహు అక్బర్ అనడం, దిగువ ప్రదేశం నుండి వెళ్తూ సుబ్ హానల్లాహ్ అనడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారుః
“మేము ఎత్తు ప్రదేశం నుండి వెళ్తున్నప్పుడూ తక్బీర్ అనేవారము మరియు దిగువ ప్రదేశం నుండి వెళ్తున్నప్పుడూ తస్బీహ్ అనే వారము”.
అధికంగా దుఆ చేయాలి
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీసు ఆధారంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం కూడా ప్రవక్త సంప్రదాయమే.
ثَلَاثُ دَعَوَاتٍ مُسْتَجَابَاتٌ دَعْوَةُ الْمَظْلُومِ وَدَعْوَةُ الْمُسَافِرِ وَدَعْوَةُ الْوَالِدِ عَلَى وَلَدِهِ
“ముగ్గురి దుఆలు అంగీకరించబడతాయి; బాధితుని అర్తనాదం. ప్రయాణికుని దుఆ. తండ్రి తన సంతానానికిచ్చే శాపం”. (తిర్మిజి 3448).
నగరంలో ప్రవేశిస్తూ చదవండి
ప్రయాణికుడు ఏదైనా గ్రామం, నగరంలో ప్రవేశించినప్పుడు ఈ దుఆ చదవడం సంప్రదాయం.
అల్లాహుమ్మ రబ్బస్ సమావాతిస్ సబ్ఇ వమా అజ్లల్ న, వ రబ్బల్ అర్జీనస్సబ్ఇ వ మా అఖ్లల్ న, వ రబ్బష్షయాతీని వ మా అజ్లల్ న, వ రబ్బర్రియాహి వ మా జరైన, ఫఇన్నా నస్అలుక ఖైర హాజిహిల్ ఖర్యతి వ ఖైర అహ్లిహా వ నఊజు బిక మిన్ షర్రిహా వ షర్రి అహ్లిహా వ షర్రి మా ఫీహా. (నిసాయి కుబ్రా, బైహఖీ, హాకిం).
اللَّهُمَّ رَبَّ السَّمَوَاتِ السَّبْعِ وَمَا أَظْلَلْنَ وَرَبَّ الأَرَضِينِ السَّبْعِ وَمَا أَقْلَلْنَ وَرَبَّ الشَّيَاطِينِ وَمَا أَضْلَلْنَ وَرَبَّ الرِّيَاحِ وَمَا ذَرَيْنَ فَإِنَّا نَسْأَلُكَ خَيْرَ هَذِهِ الْقَرْيَةِ وَخَيْرَ أَهْلِهَا وَنَعُوذُ بِكَ مِنْ شَرِّهَا وَشَرِّ أَهْلِهَا وَشَرِّ مَا فِيهَا
(సప్తాకాశాలకు మరియు అవి నీడ చేసినవాటికి ప్రభువైన, సప్తభూములకు మరియు అవి మోసుకొని ఉన్న ప్రతీ దానికి ప్రభువైన, షైతానులకు మరియు వారు మార్గభ్రష్టత్వంలో పడవేసిన వాటికి ప్రభువైన, గాలులకు మరియు అవి లేపుకపోయే వాటికి ప్రభువైన ఓ అల్లాహ్! మేము నీతో ఈ పట్టణ మేలును, పట్టణవాసుల మేలును కోరుతున్నాము. దీని కీడు నుండి, దీని వాసుల కీడునుండి మరియు అందులో ఉన్న కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాము).
ముస్లింలకు బాధ కలిగించకుండా ఉండాలి
ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడానికి పూర్తిగా ప్రయత్నించాలి. అది మితిమీరిన వేగం, రెడ్ సిగ్నల్ దాటిపోవడం, ఇతరులను అన్యా- యంగా క్రాస్ చేయడం లాంటి ఇతర చేష్టలను వదలుకొని. అల్లాహ్ ఈ ఆదేశాన్ని చదవండిః
[وَالَّذِينَ يُؤْذُونَ المُؤْمِنِينَ وَالمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُبِينًا] {الأحزاب:58}
“ఎవరైతే, ఏ తప్పూ చేయని విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాప భారాన్ని తమ మీద మోపుకున్నట్లే”. (అహ్ జాబ్ 33: 58).
దారి హక్కులు నెరవేర్చాలి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం దారి హక్కులు ఇవి:
غَضُّ الْبَصَرِ وَكَفُّ الْأَذَى وَرَدُّ السَّلَامِ وَأَمْرٌ بِالْمَعْرُوفِ وَنَهْيٌ عَنْ الْمُنْكَرِ
“దృష్టిని క్రిందికి ఉంచుకొనుట, బాధ కలిగించకుండా ఉండుట, సలాంకు జవాబు పలకుట, మంచిని ఆదేశించుట మరియు చెడును ఖండించుట”. (బుఖారి 2465, ముస్లిం 2121).
అవసరం తీరిన వెంటనే తిరిగి రావాలి
ఏ అవసరానికైతే ప్రయాణం చేశారో అది తీరిన వెంటనే ఇంటికి తిరిగి రావడానికై త్వరపడుట మంచి విషయం. ప్రవక్త ఆదేశం:
السَّفَرُ قِطْعَةٌ مِنْ الْعَذَابِ يَمْنَعُ أَحَدَكُمْ طَعَامَهُ وَشَرَابَهُ وَنَوْمَهُ فَإِذَا قَضَى نَهْمَتَهُ فَلْيُعَجِّلْ إِلَى أَهْلِهِ
“ప్రయాణం ఒక విధమైన శిక్ష. దాని వల్ల మనిషి నిద్రా అన్నపానీయాలకు దూరమవుతాడు. అందువల్ల ప్రయాణీకుడు తన పని ముగిసిన వెంటనే తన భార్యపిల్లల వద్దకు చేరుకోవాలి”.
తిరిగి వచ్చాక ముందు మస్జిదులో రెండు రకాతులు చేసుకోవాలి
ప్రయాణం నుండి తిరిగి వచ్చాక, ముందు మస్జిదుకు వెళ్ళి రెండు రకాతుల నమాజు చేయడం ప్రవక్త ﷺ సంప్రదాయం. కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
فَإِذَا قَدِمَ بَدَأَ بِالْمَسْجِدِ، فَصَلَّى فِيهِ رَكْعَتَيْنِ
“ప్రవక్త ﷺ ప్రయాణం నుండి తిరిగి వచ్చాక, ముందు మస్జిదుకు వెళ్ళి రెండు రకాతులు చేసేవారు”. (బుఖారి 4418, ముస్లిం 716).
వచ్చినవారిని కౌగలించు కొనుట
ప్రయాణం నుండి వచ్చినవారి కొరకు లేచి నిలబడుట, వారిని కౌగలించుకొనుట, వారి దర్శనానికి వెళ్ళుట అభిలషణీయం. ప్రవక్త ﷺ సహచరులు ప్రయాణం నుండి వచ్చినవారిని కౌగలించుకునేవారు. (తబ్రానీ ఔసత్, బైహఖీ, సహీహ 2647). దీని వల్ల ప్రేమ, ఆప్యాయత, సత్సంబంధాలు పెరుగుతాయి. మనస్సులు ఏకమవుతాయి. వీటి అవసరం ఈ కాలంలో మనకు చాలా ఎక్కువగా ఉంది.
ప్రయాణికుని ఫలితం
తన దాసులపై ఉన్న అల్లాహ్ యొక్క దయలో ఒకటేమిటంటే; మనిషి స్థానికంగా, ఆరోగ్యంగా ఉండి పాటిస్తూ వచ్చిన (నఫిల్) సత్కార్యాలు అనారోగ్యం మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు (పాటించక పోయినప్పటికీ, అతను పాటిస్తున్నట్లు) అతని లెక్కలో వ్రాయబడతాయి.
ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
إِذَا مَرِضَ الْعَبْدُ أَوْ سَافَرَ كُتِبَ لَهُ مِثْلُ مَا كَانَ يَعْمَلُ مُقِيمًا صَحِيحًا
“దాసుడు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు అతను స్తానికుడై ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి పుణ్యఫలితాలే అతని కొరకు వ్రాయబడతాయి”. (బుఖారి 2996).
ప్రయాణ సౌకర్యాలు
ముస్లింల సౌలభ్యానికై ఇస్లాం ధర్మం ఏ ప్రయాణ సౌకర్యాలను తెలియజేసిందో వాటిని ప్రయాణికుడు వినియోగించుకోవడం మంచిది. అవి అతను తనుండే నివాస ప్రాంతాన్ని వీడినప్పటి నుండి మొదలవుతాయి.
ఆ సౌకర్యాలు ఇవిః ఖస్ర్ (నాలుగు రకాతుల ఫర్జ్ నమాజు రెండు రకాతులు చేయుట). జమ్అ (రెండు నమాజులు ఒకే సమయంలో చేయుట). మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై మసా (స్పర్శ) చేయుట. నఫిల్ నమాజు వాహనంలో చేయుట.
జుమా నమాజు విధిగా లేకపోవుట. అవసరముంటే ఫర్జ్ ఉపవాసాలు కూడా ఉండకపోవుట. (వీటి వివరాలు తర్వాత పేజీల్లో వస్సున్నాయి).
ఎంత దూరంలో ఖస్ర్ చేయాలి
ప్రయాణం అనబడే దూరంలో వెళ్ళినప్పుడు నాలుగు రకాతుల నమాజు ఖస్ర్ చేసి రెండు చదవడం, మరియు జొహ్ర్, అస్ర్ కలిపి చేయడం, మగ్రిబ్, ఇషా కలిపి చేయడం ధర్మసమ్మతం. ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఖస్ర్ మరియు జమ్అ చేయవచ్చునని ఇస్లాం ధర్మంలో ఏ నిర్ణీత కిలోమీటరుల లెక్క చెప్పబడలేదు.
అయితే అధిక ధర్మవేత్తల ఏకాభిప్రాయం ప్రకారం 80కి.మీ. దూరం ప్రయాణంలో ఖస్ర్ చేయాలి. అంతకు తక్కువ ప్రయాణంలో ఖస్ర్ చేయరాదు. నిస్సందేహంగా ఇది చాలా పటిష్టమైన మరియు ఉత్తమమైన పద్ధతి.
పరిశుభ్రత ఆదేశాలు
(ఏ విషయం సంభవిస్తే వుజూ చేయడం విధిగా అవుతుందో దానిని ‘హదసె అస్గర్‘ అని అంటారు. ఉదాహరణకుః మల మూత్ర విసర్జన, అపానవాయువు వగైరాలు. మరే విషయం వల్ల స్నానం చేయడం విధిగా అవుతుందో దానిని ‘హదసె అక్బర్‘ అని అంటారు. ఉదాహరణకుః భార్యభర్తల సంభోగం, స్వప్నస్ఖలనం వగైరా).
నమాజు కొరకు వుజూ తప్పనిసరి. మరియు హదసె అక్బర్ వల్ల స్నానం చేయడం తప్పనిసరి. ఇందులో ఏ మాత్రం అలక్ష్యం చేయుట యోగ్యం లేదు. అయితే ప్రయాణంలో ఉన్న వ్యక్తి నమాజు సమయం అయినప్పుడు నీళ్ళు పొందనిచో;
1- నీళ్ళు లభించవచ్చు అన్న ఆశ లేదా నమ్మకం ఉంటే నమాజును దాని చివరి సమయం వరకు ఆలస్యం చేయవచ్చును. కాని సమయం దాటవద్దు.
2- నీళ్ళు లభించే ఏ ఆశగానీ, నమ్మకంగానీ లేదా నీళ్ళు దొరికే ఏ సూచన లేనప్పుడు తొలిసమయం లోనే తయమ్ముం చేసుకొని నమాజు చేసుకొనుటయే ఉత్తమం.
3- తయమ్ముం చేసి నమాజు మొదలు పెట్టిన తర్వాత నీళ్ళు లభిస్తే నఫిల్ నమాజు సంకల్పంతో ఈ నమాజును పూర్తి చేయాలి. తర్వాత వుజూ చేసుకొని, ఫర్జ్ నమాజు చేయాలి. ఒకవేళ మొదలు పెట్టిన ఫర్జ్ నమాజు చేసుకున్న తర్వాత నీళ్ళు లభిస్తే నమాజు అయినట్లే. దానిని తిరిగి మరోసారి చేయనక్కర లేదు.
4- బాటసారిపై (స్వప్నస్ఖలనం వల్లగానీ, లేదా భార్యభర్తలు కలుసుకోవడం వల్లగానీ) స్నానం విధిగా అయి, విపరీతమైన చలి కారణంగా ప్రాణానికి హాని కలిగే భయంతో నీళ్ళు ఉపయోగించే స్థితిలో లేనప్పుడు, లేదా నీళ్ళ జాడలో నమాజు సమయం దాటిపోయే భయం ఉన్నప్పుడు తయమ్ముం చేయుట యోగ్యం. అలాగే నీళ్ళు చాలా తక్కువ ఉండి, స్నానానికి సరిపడనప్పుడు స్నానం ఉద్దేశ్యంతో తయమ్ముం చేసుకోవాలి. ఉన్న నీళ్ళతో వుజూ చేసుకోవాలి.
విపరీతమైన చలి భయం ఉండడం అసలు సబబు కాదు, ఆ చలి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న అనుమానమో, లేదా పూర్తి నమ్మకమో ఉండి, కనీసం నీళ్ళు వేడి చేసుకుందామన్నా ఏ సాధనం లేకపోవడం, లేదా సాధనం ఉండి కూడా వేడి చేయడంలో నమాజు సమయం దాటిపోతుందన్న భయం ఉన్నప్పుడే తయమ్ముం చేయుట యోగ్యమగును.
5- నీళ్ళు తక్కువ ఉండి, వుజూ కొరకు సరిపడనప్పుడు ఉన్న నీళ్ళతో వుజూ మొదలు పెట్టి, నీళ్ళు సరిపడే అంత వరకు వుజూ చేసి మిగిత అవయవాలపై మసా (స్పర్శ) చేయాలి.
తయమ్ముం విధానం
హదసె అస్గర్ అయినా హదసె అక్బర్ అయినా ప్రతీ దానికి తయమ్ముం పద్ధతి ఇదిః రెండు అరచేతులను భూమికి ఒకసారి తాకించి, ముందు ముఖంపై తర్వాత రెండు అరచేతుల వెలుపలి భాగంపై మసా చేయాలి. అయితే ఎవరైనా హదసె అక్బర్ వల్ల తయమ్ముం చేసి ఉంటే నీళ్ళు లభించిన తర్వాత స్నానం చేయడం విధిగానే ఉంటుంది.
మేజోళ్ళపై మసహ్
1- బాటసారి మూడు రేయింబవళ్ళు తన మేజోళ్ళపై మసా చేయవచ్చును. మొదటిసారి మసా చేసినప్పటి నుండి మూడు రోజుల పరిమితి మొదలవుతుంది.
2- ఒక మనిషి స్థానికంగా ఉండి మసహ్ మొదలుపెట్టి, మళ్ళీ ప్రయాణానికి బయలుదేరితే బాటసారిగా పరిగణించబడతాడు గనక మూడు రోజులు మసహ్ చేయాలి.
3- మరెవరైనా ప్రయాణంలో ఉండి మసహ్ మొదలుపెట్టి మళ్ళీ తన నివానానికి వచ్చేస్తే స్థానికుల ప్రకారం ఒక రోజు ఒక రాత్రి లెక్కతో మసహ్ చేయాలి.
అజాన్ ఆదేశాలు
1- “నమాజు సమయం అయిన వెంటనే మీలో ఒకరు అజాన్ ఇవ్వాలి” అన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం బాటసారుల బృందంపై అజాన్ మరియు ఇఖామత్ ఇవ్వడం విధిగా ఉంది. అలాగే ఒంటరిగా ఉన్న వ్యక్తి కూడా అజాన్ ఇవ్వాలి. ఇక ఎవరైతే సామూహిక నమాజు జరిగే మస్జిదులో నమాజు చేస్తున్నాడో అతనికి ఆ మస్జిదులో ఇవ్వబడిన అజానే సరిపోతుంది.
2- అజాన్ మరియు ఇఖామత్ చెప్పకుండా లేదా ఇఖామత్ మాత్రమే చెప్పి చేయబడిన నమాజు సహీ అగును. కాని ఆ బృందం వారందరూ స్వచ్ఛమైన పశ్చాత్తాపంతో అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి. మరోసారి ఇలా చేయకూడదు. ఏ ధర్మవేత్తల వద్ద అజాన్ విధిగా ఉందో వారు ఇలాంటి ఆదేశమిచ్చారు. అయితే ఇదే బలమైన, నిజమైన మాట.
3- బాటసారి రెండు నమాజులను కలిపి చేసినప్పుడు ఒక్క అజాన్ ఇచ్చి రెండు నమాజులకు వేరు వేరు రెండు సార్లు ఇఖామత్ చెప్పవలెను.
నమాజు అదేశాలు
1- ఖిబ్లా దిశ తెలుసుకొనుట ప్రయాణికునిపై విధిగా ఉంది. అందుకై అతను సర్వవిధాల ప్రయత్నం చేయాలి. ఎవరినైనా అడిగాలి, లేదా దానిని కనుగొనే కొన్ని నూతన పరికరాల ద్వారా మరియు ఇంకే విదంగానైనా తెలుసుకోవాలి. మరెవరైతే ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా ఖిబ్లా కాని దిశలో నమాజు చేస్తాడో అతడు తిరిగి అదే నమాజు మరల చేయాలి. ఎందుకనగా అతను పాటించవలసిన హక్కును విడనాడాడు. ఎడారిలో ఉన్న వ్యక్తి సర్వ విధాల ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత ఆ దిశ కాదు అని తెలిస్తే అతను తన నమాజు తిరిగి చేయ వలసిన అక్కర లేదు. కాని ఎడారిలో కాకుండా గ్రామం, నగరంలో ఉన్న వ్యక్తి ఖిబ్లా దిశ తెలిసిన తర్వాత తిరిగి అదే నమాజు మరల చేయాలి.
2- ప్రయాణంలో సున్నతె ముఅక్కద చేయుట సంప్రదాయం కాదు. కాని ఫజ్ర్ సున్నతులు మరియు విత్ర్ నమాజ్, చాష్త్ నమాజ్, తహజ్జుద్ నమాజ్, మరికొన్ని; తహియ్యతుల్ వుజూ, తహియ్యతుల్ మస్జిద్ మరియు సూర్య, చంద్ర గ్రహణ నమాజుల్లాంటివి స్థానికంగా ఉన్నప్పుడు చదివినట్లే ప్రయాణంలో కూడా చదవాలి.
3- ఒక నమాజు సమయం ప్రవేశించిన తర్వాత పయణమైన వ్యక్తి తన ఊరి బైటికి ఇండ్లు కనబడనంత దూరం వెళ్ళినప్పటి నుండి ఖస్ర్ మరియు జమ్అ చేయవచ్చును.
4- ఖస్ర్ నాలుగు రకాతుల నమాజులోనే చేయాలి. ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజుల్లో ఖస్ర్ చేయరాదు.
5- నమాజు చేయునప్పుడు ఖస్ర్ సంకల్పం చేయాలన్న నిబంధన (షరతు) లేదు. ఎందుకనగా ప్రయాణంలో ఖస్ర్ చేయడమే అసలైన, సరియైన పద్ధతి. అందుకే సంకల్పం అవసరం లేదు. ఎలాగైతే స్థానికంగా ఉండి నమాజు చేస్తున్నప్పుడు పూర్తి నమాజు అన్న సంకల్పం చేయరో. ఒకవేళ సంకల్పం చేసుకుంటే చాలా ఉత్తమం. (అది మనస్సులోనే చేసుకోవాలి. నోటితో కాదు. ఎందకనగా నోటితో ఏవైనా పదాలు పలికి సంకల్పం చేయడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల సంప్రదాయం కాదు).
6- ఒకవేళ బాటసారి ముఖ్తదీగా (సామూహిక నమాజులో ఇమాం వెనక ఉండి) నమాజు చేస్తూ పూర్తి నమాజుకై సంకల్పిస్తే మరియు అతని ఇమాం ఖస్ర్ చేస్తే అతను కూడా తన ఇమాం మాదిరిగా ఖస్ర్ చేసుకోవాలి.
7- ఒకవేళ బాటసారి ఖస్ర్ సంకల్పం చేస్తే మరి అతని ఇమాం పూర్తి నమాజు చేయిస్తే అతను కూడా పూర్తి నమాజు చేయడం విధిగా ఉంది.
8- బాటసారి ఏ ఇమాం వెనక నమాజు చేస్తున్నాడో అతను బాటసారియా? లేదా స్థానికుడా? అన్న విషయం తెలియనప్పుడు అతను ఇమాంను అనుసరిస్తూ పోవాలి.
9- బాటిసారి ఇమాంగా ఉన్నా, లేదా ఒంటరిగా ఉన్నా అతను బాటసారి అన్న విషయం మరచిపోయి పూర్తి నమాజు చేయాలని సంకల్పించి, తర్వాత నమాజు మధ్యలో గుర్తుకు వస్తే అతను ఖస్రే చేయాలి. ఎందుకనగా అతని కొరకు సరియైన పద్ధతి ఇదే. ఒకవేళ అతను పూర్తి చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు.
10- అజ్ఞానం కారణంగా ఎవరైనా బాటసారి మగ్రిబ్ కూడా ఖస్ర్ చేయబడుతుందని అనుకోని రెండు రకాతులు చేసుకుంటే అతని ఆ నమాజు వ్యర్థం. దానిని తిరిగి చేయుట విధిగా ఉంది.
11- ఖస్ర్ సంకల్పం చేసిన బాటసారి మరచిపోయి మూడో రకాతు కొరకు నిలబడిన తర్వాత గుర్తుకు వస్తే వెంటనే కూర్చోవాలి. తర్వాత సజ్దా సహ్ వ్ చేయాలి.
12- ప్రయాణంలో ఇమాం సంక్షిప్తంగా నమాజు చేయించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులది ఇదే పద్ధతి ఉండినది.
13- బాటసారి ఏదైనా ఊరిలో మజిలి చేస్తే ఎప్పటి వరకు అక్కడి అజాన్ వింటూ ఉంటాడో మస్జిదులో సామూహికంగా నమాజు పాటించడం తప్పనిసరి. కాని అతను ఏదైనా ఊరి నుండి దాటుతూ ఉన్నప్పుడు అజాన్ వింటే మస్జిదులో సామూహికంగా నమాజు చేయడం తప్పనిసరి ఏమీ లేదు. ఒకవేళ అతను ఏదైనా అవసరానికి బండి దిగినా సరే.
గమనిక:
* స్థానికంగా ఉండి చేయవలసిన నమాజు చేయలేదని ప్రయాణంలో ఉన్నప్పుడు గుర్తొచ్చినా లేదా ప్రయాణంలో ఏదైనా తప్పిపోయిన నమాజు స్థానికంగా ఉన్నప్పుడు గుర్తొచ్చినా అతను దానిని పూర్తిగానే చేయాలి. అదే అతని విషయంలో ఉత్తమమైన, బాధ్యతరహితమైన విషయం.
* ఒక ప్రయాణంలో మరచిపోయిన నమాజ్ మరో ప్రయాణంలో గుర్తుకువస్తే ఖస్ర్ చేయాలి.
ఇమామత్ అదేశాలు
1- స్థానిక ఇమాం వెనక బాటసారి నమాజు చేయవచ్చును. ఇద్దరి సంకల్పాలు, నమాజులు వేరు వేరు అయినా ఏమీ నష్టం లేదు. ఎలా అనగా ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ఇషా నమాజు ప్రవక్త వెనక చేసేవారు, మళ్ళీ తాను ఉండే వాడలోకి వెళ్ళి అక్కడ తన జాతివారికి ఇషా నమాజు చేయించేవారు. అయితే ఈ నమాజు అతనిది నఫిల్ మరియు అతని వెనక ఉన్నవారిది ఫర్జ్ అయి ఉండేది. (బుఖారి 711, ముస్లిం 465).
2- సంపూర్ణ నమాజు చేయించే స్థానిక ఇమాం వెనక ఉండి ఖస్ర్ చేయడం సరియైనది కాదు. నమాజు ఆరంభంలో చేరినా, లేక చివరలో చేరినా సరే. ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:
إِنَّمَا جُعِلَ الْإِمَامُ لِيُؤْتَمَّ بِهِ
“ఇమాం నియామకం ఆయన్ని (ముఖ్తదీలు) అనుసరించడానికే జరుగుతుంది”. (బుఖారి 378, ముస్లిం 411)([1]).
నోట్: ఏమిటి విషయం బాటసారి ఒంటరిగా నమాజు చేసుకుంటే ఖస్ర్ చేసి రెండు రకాతులే చేయాలి కాని (స్థానిక) ఇమాం వెనక ముఖ్తదీగా ఉంటే నాలుగు రకాతులు చేయాలి అని ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారిని అడిగితే ‘సరియైన సంప్రదాయం ఇదే’ అని సమాధా- నమిచ్చారు. (ముస్నద్ అహ్మద్, ఇర్వాఉల్ గలీల్ 571 లో షేఖ్ అల్బానీ ఈ హదీసును సహీ అని అన్నారు.
3- తప్పుడు విషయం: కొందరు బాటసారులు స్థానిక ఇమాం నాలుగు రకాతుల నమాజు చేయిస్తున్నప్పుడు మూడవ రకాతులో వచ్చి కలసి, అతనితోనే సలాం త్రిప్పి రెండు రకాతులతోనే సరిపుచ్చుకుంటారు. ఇది తప్పు. అతను ఇమాంతో సలాం త్రిప్పకుండా నిలబడి మిగితా రెండు రకాతులు చేసుకోవాలి. ఒకవేళ అతను ఆ రెండు రకాతులే చేసి వెళ్తే, అతను ఆ నమాజు మళ్ళీ చేయాలి.
4- ఇమాం బాటసారి కావచ్చు అన్న భావనతో అతనితో కలసి రెండు రకాతులు చేసిన తర్వాత, కాదు అతను స్థానికుడు అని తెలిస్తే అతనితో పూర్తి నమాజు చేయాలి. ఒకవేళ నమాజులో ప్రవేశిస్తూ ఇమాం ఏ సంకల్పం చేశాడో నాది అదే సంకల్పం అని నిశ్చయించుకుంటే, ఇమాం ఖస్ర్ చేస్తే ఇతను ఖస్ర్ చేయాలి. అతను పూర్తిగా చేస్తే పూర్తిగా చేయాలి. ఇలా నమాజు సహీ అవుతుంది.
5- మగ్రిబ్ నమాజు చేయిస్తున్న ఇమాంతో బాటసారి ఇషా నమాజు సంకల్పంతో కలిస్తే నాలుగు రకాతులు సంపూర్ణంగా చేయుట విధిగా ఉంది. అంటే ఇమాం మూడు రకాతులు చేసి సలాం త్రిప్పిన తర్వాత అతను నిలబడి నాల్గవ రకాతు చేసుకోవాలి.
6- బాటసారి ఇమాంగా ఉండి నమాజు చేయిస్తుంటే అతని వెనక స్థానికుడు ముఖ్తదీగా ఉండి నమాజు చేయడం యోగ్యం. అయితే ఇమాం ఖస్ర్ చేసి సలాం త్రిప్పిన తర్వాత ఇతను పూర్తి నమాజు చేసుకోవాలి.
7- బాటసారి స్థానికులకు నమాజు చేయిస్తున్న- ప్పుడు ఖస్ర్ చేయాలి. అతను సలాం త్రిప్పిన తర్వాత ‘మీరు నమాజు పూర్తి చేసుకోండి’ అని వెనకున్నవారికి చెప్పాలి. ఒకవేళ నమాజుకు ముందే ఈ విషయం తెలియజేస్తే మరీ మంచిది, వారికి అనుమానం, ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
8- జొహ్ర్ నమాజు చేయని వ్యక్తి మస్జిదులో ప్రవేశించే సరికి అచ్చట ఇమాం అస్ర్ నమాజు చేయిస్తున్నది చూస్తే అతను జొహ్ర్ సంకల్పంతో ఇమాంతో కలవాలి. వారితో జొహ్ర్ నమాజు చేసుకున్న తర్వాత (వెనక వచ్చినవారు ఎవరైనా ఉంటే వారితో కలసి, ఎవరు లేని యడల ఒంటరిగానే) అస్ర్ నమాజు చేసుకోవాలి.
9- ఒకడు, లేదా కొందరు బాటసారులు రమజానులో తరావీహ్ నమాజు చేయిస్తున్న స్థానికుడైన ఇమాం వెనక వచ్చి కలుస్తే వారు ఈ క్రింది రెండింటిలోని ఏదైనా ఒక పద్ధతి అనుసరించాలి.
j అది వారి స్వగ్రామం అయితే వారు ఇషా నమాజ్ సంపూర్ణంగా చేసే ఉద్దేశంతో ఇమాంతో కలవాలి. ఇమాం సలాం తింపిన తర్వాత మిగిలిన రకాతులు చేసుకోవాలి.
k ఒకవేళ వారు ప్రయాణంలో ఉంటే వారు ఇషా నమాజ్ ఖస్ర్ చేసే ఉద్దేశంతో ఇమాంతో కలవాలి. వారు స్వయంగా మరో జమాఅతు చేయకూడదు. అలా చేసినచో ముందు నుండే అదే మస్జిదులో తరావీహ్ చేయుచున్నవారికి అంతరాయం, కలత ఏర్పడును.
గమనిక: ఒకే సమయంలో ఒక మస్జిదులో రెండు జమాఅతులో జరగడం ధర్మసమ్మతం కాదు. దీని వల్ల ముస్లిముల అనైక్యత మరియు వారి మధ్య భిన్నత్వం ఏర్పడును. సామూహిక నమాజు విధిగావించబడింది కేవలం వారి ఐక్యత కొరకే.
‘జమ్అ బైనస్సలాతైన్’ అదేశాలు
1- జొహ్ర్ నమాజును అస్ర్ నమాజుతో కలిపి మరియు మగ్రిబ్ నమాజును ఇషా నమాజుతో కలిపి చేయుటనే ‘జమ్అ బైనస్ సలాతైన్’ అని అంటారు. అది ‘జమ్అ తక్దీమ్‘ చేయవచ్చు, లేదా ‘జమ్అ తాఖీర్‘ చేయవచ్చు[2]. ఈ రెండిటిలో తనకు సులభంగా ఏది ఉండునో అది చేయవచ్చును. ఎలా చేసినా సరిపోవును. అయితే ఫజ్ర్ నమాజును మరో నమాజుతో కలిపి చేయరాదు. అలాగే జుమా నమాజు కూడా అని సర్వ సామాన్యంగా ధర్మవేత్తల వద్ద ఆధిక్యత పొందిన మాట ఇదే.
నోట్: ‘జమ్అ తక్దీమ్’ అంటే జొహ్ర్ సమయంలో జొహ్ర్, అస్ర్ నమాజులు కలిపి చేయడం, మగ్రిబ్ సమయంలో మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చేయడం. ‘జమ్అతాఖీర్’ అంటే అస్ర్ సమయంలో జొహ్ర్, అస్ర్ నమాజులు కలిపి చేయడం. ఇషా సమయంలో మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చేయడం.
2- ‘జమ్అ’ చేస్తున్నప్పుడు ఒక్క అజాన్ ఇచ్చి, ప్రతి నమాజుకు వేర్వేరు ఇఖామత్ ఇవ్వాలి.
3- ‘జమ్అ’ సమయం, మొదటి నమాజు సమయం ప్రారంభం నుండి రెండవ నమాజు సమయం అంతమయ్యే వరకు ఉంటుంది[3]. అంటే బాటసారి తొలి సమయంలో, దాని మధ్యలో లేదా సమయం అంతం అయ్యేకి కొంచెం ముందు వరకు కూడా ‘జమ్అ’ చేయవచ్చును. కాని జొహ్ర్, అస్ర్ నమాజులు (సూర్యస్తమయానికి ముందు) సూర్యుడు పసుపు రంగులో మారే వరకు, మరియు మగ్రిబ్, ఇషా నమాజులు అర్థ రాత్రి గడిసే వరకు ఆలస్యం చేయడం ధర్మసమ్మతం కాదు[4].
నోట్ : అర్థరాత్రి అంటే రాత్రి 12 గంటలు అన్న భావన సరి కాదు. సూర్యాస్తమయం నుండి ఉషోదయం వరకు గల పూర్తి సమయంలో సగభాగం ఎన్నింటికి పూర్తవుతుందో ఆ సమయం. ఉదాహరణకుః సూర్యాస్తమయం సా. 6 గం., ఉషోదయం తెల్లవారుజామున 4 గం.కు అయితే, రాత్రి 11 గం.కు అర్థరాత్రి అవుతుంది.
4- ‘జమ్అ తాఖీర్’ చేసే ఉద్దేశంతో ప్రయాణం కొనసాగిస్తూ, రెండవ నమాజు సమయం ప్రారంభం కాక ముందే తన స్వగ్రామంలో చేరుకుంటే, రెండవ నమాజును మొదటి నమాజుతో కలిపి చేయకూడదు. ప్రతి నమాజు దాని సమయంలో ‘ఖస్ర్’ చేయకుండా సంపూర్ణంగా చేయాలి. మొదటి నమాజు సమయం అతి తక్కువగా ఉన్నా సరే ప్రతి నమాజు దాని సమయంలోనే చేయాలి. ఎందుకనగా ‘ఖస్ర్’ మరియు ‘జమ్అ’ చేయుటకు కారణం ప్రయాణం, ప్రయాణం ముగిసినప్పుడు ‘ఖస్ర్’, ‘జమ్అ’ చేయరాదు.
5- ‘జమ్అ తాఖీర్’ ఉద్ధేశంతో ప్రయాణం కొనసాగిస్తూ రెండవ నమాజు సమయం ప్రారంభం అయిన తర్వాత తన స్వగ్రామం లో చేరుకుంటే రెండు నమాజులు కలిపి చేసినా సంపూర్ణంగా చేయాలి. ఖస్ర్ చేయకూడదు. ఎందుకనగా ప్రయాణం ముగిసింది, సబబు కూడా అంతం అయింది.
6- ‘జమ్అ తాఖీర్’ ఉద్దేశంతో ప్రయాణం కొనసాగిస్తూ నిర్దేశ స్థలానికి (స్వగ్రామం కాదు) చేరుకున్నప్పుడు మొదటి నమాజు సమయం అంతం అయి రెండవ నమాజు సమయం ప్రారంభం కావడానికి సమీపించినప్పుడు ఈ క్రింది విధానాల్లో ఏదో ఒకటి పాటించవచ్చును.
(a) ఒకవేళ అతను మస్జిదుకు దూరంగా, అజాన్ వినలేకుండా ఉంటే, రెండవ నమాజు సమయం ప్రారంభం అయ్యే వరకు వేచి ఉండడం ఉత్తమం, అప్పుడు రెండు నమాజులు ‘జమ్అ’, ‘ఖస్ర్’ చేయాలి. ఒకవేళ అతను రెండవ నమాజు సమయం ప్రారంభం కాక ముందే నమాజు చేసుకుంటే ధర్మసమ్మతమే.
(b) లేదా రెండవ నమాజు యొక్క అజాన్ అయిన తర్వాత, ఇఖామత్ కు ముందు మస్జిదు లో ప్రవేశిస్తే, అతను మొదటి నమాజు ‘ఖస్ర్’ చేసుకోవాలి. రెండవ నమాజ్ జమాఅతుతో చేసుకోవాలి.
(c) మస్జిదులో ప్రవేశించినప్పుడు అక్కడ ప్రజలు రెండవ నమాజు చేస్తూ ఉంటే, అతను మొదటి నమాజు నియ్యతుతో వారితో కలవాలి. దీని వివరణ ఇమామత్ ఆదేశాలు అనే అంశంలోని 8వ నంబర్లో చదివి ఉన్నారు.
7- రెండవ నమాజు సమయం ప్రారంభం కాక ముందే తన స్వగ్రామానికి చేరుకుంటానని బాటసారికి తెలిసినప్పటికీ ‘జమ్అ’ చేయడం ధర్మసమ్మతమే. ‘జమ్అ’ చేసిన తర్వాత రెండవ నమాజు యొక్క అజాన్ కు ముందు లేదా నమాజ్ సమయంలో తన స్వగ్రామానికి చేరుకుంటే, మరోసారి ఆ నమాజు చేయనవసరం లేదు.
8- బాటసారి ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ‘జమ్అ’ చేయడం ధర్మసమ్మతమే. అయితే ఎక్కడైనా మజిలీ చేసినప్పుడు, ఏలాంటి అవసరం, ఇబ్బంది లేకుండా ఉంటే ‘జమ్అ’ చేయకపోవడమే మంచిది, ఒకవేళ ‘జమ్అ’ చేస్తే అది యోగ్యమగును.
9- తప్పిపోయిన నమాజులు గుర్తు వచ్చిన తర్వాత చేయునప్పుడు మరియు ‘జమ్అ బైనస్సలాతైన్’ చేయునప్పుడు క్రమపద్ధతిని పాటించుట తప్పనిసరి. మరచిపోయి లేదా తెలియనందు వల్ల, లేదా ప్రస్తుతం ముందు ఉన్న నమాజు సమయం దాటిపోతుందన్న భయం వల్ల క్రమపద్ధతి పాటించలేకపోయినచో పాపం లేదు.
ప్రస్తుత నమాజు చేస్తున్నప్పుడు, తప్పిపోయిన నమాజు లేదా దానికి ముందు గడిసిపోయిన నమాజు చేయలేదని గుర్తు వచ్చినప్పుడు, ప్రస్తుత నమాజు పూర్తి చేయాలి ఆ తర్వాత తప్పిపోయిన నమాజులు చేసుకోవాలి.
10- బాటసారి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ‘జమ్అ తక్దీమ్’ చేసిన వెంటనే విత్ర్ నమాజు సమయం ప్రవేశించినట్లే, అంటే విత్ర్ నమాజు చేయుటకు ఇషా నమాజు సమయం ప్రారంభం కావాలని వేచించే అవసరం లేదు.
11- మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ‘జమ్అ తాఖీర్’ చేయాలనుకున్న బాటసారి, ఏదైనా ప్రాంతంలో ఇషా నమాజు సామూహి- కంగా జరుగుతున్నది చూసినచో, మగ్రిబ్ నమాజు నియ్యతుతో వారితో కలవాలి; ఒకవేళ ఇమాం రెండవ రకాతులో ఉండగా కలుస్తే వారితో మూడు రకాతులు చేసినట్లగును, అందుకు ఇమాంతోనే సలాం తింపాలి. ఒకవేళ మూడవ రకాతులో కలుస్తే, ఇమాం సలాం తింపిన తర్వాత ఒక రకాతు చేసుకోవాలి. ఒకవేళ ఇమాంతో మొదటి రకాతులోనే కలుస్తే, ఇమాంతో మూడు రకాతులు చేసి, ఇమాం నాలుగో రకాతు కొరకు నిలబడినప్పుడు అతను కూర్చుండి తషహ్హుద్ దుఆలు చదివి, సలాం తింపి, మళ్ళీ ఇషా నమాజు నియ్యతుతో అదే ఇమాంతో కలవాలి. ఇమాం సలాం తింపిన తర్వాత తప్పిపోయిన రకాతులు చేసుకోవాలి. ఈ విధంగా రెండు నమాజులు జమాఅతుతో (సామూహికంగా) చేసినట్లుగును.
నమాజు తర్వాత జిక్ర్
‘జమ్అ’ చేయునప్పుడు ముందు మొదటి నమాజు తర్వాత జిక్ర్, దాని పిదప రెండవ నమాజు తర్వాత జిక్ర్ చేయడం మంచిది మరియు ఉత్తమం. కాని రెండవ నమాజు తర్వాతే జిక్ర్ చేసినా సరిపోవును. మొదటి నమాజు తర్వాత జిక్ర్ అట్లే అందులో లెక్కించబడును.
విమానంలో నమాజు
విమానంలో నమాజు రెండు రకాలుగా ఉంటుందిః
1- నఫిల్ నమాజ్: బాటసారి నిలబడి, కూర్చుండి ఏ స్థితిలోనైనా ఈ నమాజు చేయవచ్చును, రుకూ, సజ్దాలు సైగతో ఏ దిశలో ఉండి చేసిన సరే, ఖిబ్లా దిశలోనే ఉండుట తప్పనిసరి ఏమీ లేదు. అలాగే కార్లో మరియు ఇతర వాహనాల్లో కూడా. కాని వీలైనంత వరకు మొదటి తక్బీరె తహ్రీమ సందర్భంలో ఖిబ్లా దిశలో ఉండుట ఉత్తమం.
2- ఫర్జ్ నమాజులుః ‘జమ్అ’ చేయు నమాజులైతే, వాటి విషయంలో మూడు స్థితులు.
(a) విమానం ఎక్కే ముందు లేదా దిగిన తర్వాత ‘జమ్అ తక్దీమ్’, లేదా ‘జమ్అ తాఖీర్’ వాటి సమయంలో చేసే వీలు ఉంటే అలా చేయాలి.
ఉదాహరణకుః మొదటి నమాజు సమయం ప్రారంభం కాక ముందు విమానం ఎక్కి, మొదటి నమాజు సమయం దాటిన తర్వాతే విమానం నుండి దిగవలసి ఉంటుంది అన్న నమ్మకం ఉంటే, దిగిన తర్వాత ‘జమ్అ తాఖీర్’ చేయాలి. అంటే జొహ్ర్ అస్ర్ తో కలిపి చేసుకోవాలి. మగ్రిబ్ ఇషాతో కలిపి చేసుకోవాలి.
(b) నమాజు సమయం ప్రారంభం కాక ముందే విమానం ఎక్కి, విమానం దిగే సరికి ‘జమ్అ’ చేయగలిగే రెండు నమాజుల సమయాలు కూడా దాటిపోతాయని, లేదా ఫజ్ర్ నమాజు అయి ఉంటే దాని సమయం కూడా దాటిపోతుందన్న భయం ఉంటే, విమానంలో నమాజు చేయుటకు అనుకూలమైన స్థలం కెటాయించబడి ఉంటే అక్కడే ఖిబ్లా దిశలో నిలబడి నమాజు చేసుకోవాలి. అనుకూలమైన స్థలం లేనిచో, దారిలో చేసుకోవాలి. అదీ సాధ్యం కానప్పుడు తన సీట్లోనే నిలబడి నమాజు చేసుకోవాలి, అయితే రుకూలో పూర్తిగా వంగలేక పోతే, వంగినట్లు చేయాలి. ఇక సజ్దా చేయుటకు తన సీటులో కూర్చొని సైగ చేయాలి. ఏ దిశలో ముఖం చేసినా పర్వా లేదు. కాని ఎట్టి పరిస్థితిలో కూడా నమాజును దాని సమయం దాటి చేయడం ధర్మసమ్మతం కాదు.
(c) విమానంలో నమాజు చేయుటకు స్థలం కెటాయించబడి, నమాజు సమయం అయి, అక్కడ నమాజు చేసుకోవడం సాధ్యమైతే ఖిబ్లా దిశలో నిలబడి చేసుకోవాలి. రుకూ, సజ్దాలు సామాన్య రీతిలో చేయాలి.
3- విమానాశ్రయం తన సిటీకి దూరంగా ఉంటే, టికెట్ ఓకే (కన్ఫర్మ్) అయి ఉంటే, బాటసారి అందులో ‘ఖస్ర్’ చేయవచ్చును. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకుండా, వేటింగ్ లో ఉంటే ‘ఖస్ర్’ చేయరాదు, ఎందుకనగా అతను ముందుకు ప్రయాణం చేస్తాడన్న నమ్మకం లేదు.
4- ఒకవేళ విమానాశ్రయం సిటీలోనే ఉంటే బాటసారి అందులో ‘ఖస్ర్’ చేయకూడదు. టికెట్ కన్ఫర్మ్ అయి ఉన్నా లేకపోయినా, ఎందుకనగా ఇంకా అతను తన సిటీ కట్టడాలు కనబడని దూరంలో వెళ్ళ లేదు.
జూమా ఆదేశాలు
(a) జుమా రోజు (జుమా ప్రసంగం ఆరంభంలో ఇచ్చే) అజాన్ కంటే ముందు ప్రయాణం కొరకై వెళ్ళవచ్చును. అజాన్ అయిన తర్వాత, జుమా నమాజుకంటే ముందు వెళ్ళుట ధర్మసమ్మతం కాదు. కాని క్రింద ఇవ్వబడిన కారణాలుంటే వెళ్ళవచ్చునుః
(b) జుమా నమాజు చేసే వరకు వేచి ఉంటే, తోటి ప్రయాణికులు బయలుదేరుతారని, లేదా విమానం వెళ్లిపోతుందని, లేదా బస్సు, రైలు బండి బయలు దేరుతుందన్న భయం ఉంటే,
(c) దారిలో చేసుకునే వీలు లభిస్తుందన్న ఆశ ఉంటే,
1- జుమా రోజు పండుగ అయితే, బాటసారి పండుగ నమాజు చేసుకొని ఉంటే, అతను జుమా రోజు అజాన్ అయిన తర్వాత, నమాజుకు ముందు ప్రయాణానికి వెళ్ళవచ్చును. అప్పుడు అతను జొహ్ర్ నమాజు ఖస్ర్ చేయవచ్చును.
2- బాటసారి ప్రయాణములో ఉన్నప్పుడు జుమా రోజు వస్తే, లేదా ఏదైనా చోట మజిలీ చేశాడు, కాని అక్కడ జుమా నమాజు స్థాపించేవారే లేరు, లేదా ఎక్కడో అజాన్ వినబడని దూరంలో మస్జిద్ ఉండి పోవడానికి వీలు లేనప్పుడు అతనిపై జుమా విధిగా ఉండదు. అతను జొహ్ర్ నమాజు ఖస్ర్ చేసుకోవచ్చు, అలాగే అస్ర్ నమాజుతో కలిపి చేసుకోవచ్చు.
3- బాటసారి ఏదైనా చోట మజిలీ చేశాడు, అక్కడ జుమా నమాజు జరుగుతుంది, అజాన్ కూడా వినబడుతుంది. అలాంటప్పుడు అతనిపై జుమా విధి అగును. సామాన్య ఆధారాలతో ఇదే విషయం రుజువైంది. కాని అతను ఏదైనా ఊరి నుండి దాటుతూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే, ఏదైనా చిన్న అవసరానికి అక్కడ దిగినందుకు జుమా అజాన్ వింటే, అతని పై జుమా విధి కాదు, అయినా అతను జుమా చేసుకుంటే అది అతనికి సరిపోతుంది.
పొరపాటుః కొందరు ప్రయాణికులు ఏదైనా ప్రాంతంలో బసచేస్తే అక్కడ జుమా జరగకున్నా, వారు స్వయంగా జుమా చేసుకుంటారు. అయితే ఇది సరియైన విషయం కాదు. వారిపై విధిగా ఉన్న నమాజు జొహ్ర్, అది చేయడమే వారిపై విధిగా ఉంది.
4- బాటసారి జుమా చేసినచో, దానితో అస్ర్ నమాజును ‘జమ్అ’ చేయరాదు. అస్ర్ నమాజు సమయం ప్రారంభం అయిన తర్వాతే అస్ర్ చేయవలెను. ఎందుకనగ జుమా నమాజుతో మరో నమాజును కలిపి చేయరాదు. ఎవరిపై జుమా విధిగా లేదో, లేదా తానున్న చోట జుమా స్థాపించబడదో అలాంటి వ్యక్తి జొహ్ర్, అస్ర్ ‘జమ్అ’, ఖస్ర్ చేయవచ్చును.
5- బాటసారి అయినా, స్థానికుడైనా జుమా నమాజు యొక్క కనీసం ఒక రకాతు కూడా ఇమాంతో పొందనిచో అతను జొహ్ర్ నమాజు చేసుకోవాలి. బాటసారి అయితే ఖస్ర్ చేయవచ్చును. స్థానికుడైతే పూర్తి నాలుగు రకాతులు చేసుకోవాలి. కనీసం ఒక రకాతైనా పొందినచో జుమా చేసుకోవాలి. ఎలా అనగ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
مَنْ أَدْرَكَ رَكْعَةً مِنْ الصَّلَاةِ فَقَدْ أَدْرَكَ الصَّلَاةَ
“నమాజులోని ఒక రకాతును పొందిన వ్యక్తి నమాజును పొందినట్లే”. (బుఖారి 580, ముస్లిం).
6- బాటసారి జుమా రోజు ఖుర్ఆనులోని సూరె కహఫ్ పారాయణం చేయడం అభిలషణీయం. దానికి సంబంధించిన ఆధారాల వల్ల. మరియు అది జుమా రోజు యొక్క సున్నతులో లెక్కించబడుతుంది, జుమా నమాజు యొక్క సున్నతు (సంప్రదాయం)లో కాదు
ప్రయాణంలో ఉపవాసాలు
1- కష్టంగా ఉన్నా, లేకపోయినా బాటసారి ఉపవాసం విడనాడవచ్చును. కష్టం ఉన్నప్పుడైతే ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసానుసారం:
هِيَ رُخْصَةٌ مِنْ اللهِ فَمَنْ أَخَذَ بِهَا فَحَسَنٌ وَمَنْ أَحَبَّ أَنْ يَصُومَ فَلَا جُنَاحَ عَلَيْهِ
“ఇది అల్లాహ్ తరఫున ఒక రాయితీ, దానితో ప్రయోజనం పొందిన వ్యక్తి మేలే చేశాడు. ఇక ఎవరు ఉపవాసం ఉండాలనుకున్నారో అతను ఉండవచ్చు, ఏలాంటి అభ్యంతరం లేదు”. (ముస్లిం 1121).
2- బాటసారి ఉపవాసం విడనాడే రెండు స్థితులుః
(a) ఎవరైనా బాటసారి ఉపవాసం ఉండి, పగటిపూటనే ఉపవాసం విరమించాలనుకుంటే ధర్మసమ్మతమే.
(b) ఎవరైనా స్థానికంగా ఉపవాసం ఉండి, మళ్ళీ ప్రయాణంలో వెళ్తే, అతను తన ఊరి కట్టడాలు దాటక ముందే ఉపవాసం వదలుకోకూడదు.
3- బాటసారి ఉపవాసం లేని స్థితిలో తన ఊరిలో చేరుకుంటే, అతను తినత్రాగడం మానుకోవలసిన అవసరం లేదు, కాని తాను ఉపవాసం లేని విషయం వెల్లడించుట మంచిది కాదు, తెలియనివాళ్ళు అతని గురించి చెడుగా ఊహించే అవకాశం ఉంటుంది.
4- ప్రయాణంలో ఉపవాసం వదలివేయడం అనేది క్రమబద్ధంగా ఉండవలసిన ఉపవాసాల క్రమబద్ధతను భంగపరచదు. అంటే ఎవరైనా పొరపాటుగా చేసిన హత్యకు పరిహారంగా ఉపవాసం ఉంటున్నారో, వారు అవసర నిమిత్తం ప్రయాణం చేసినందున ఏ లోపం జరగదు.
5- తానున్న విమానాశ్రయంలో సూర్యాస్త- మయం అయిన తర్వాతే ఇఫ్తార్ చేసిన వ్యక్తి, విమానం గాలిలో లేచాక సూర్యుడిని చూస్తే, మళ్ళీ తినత్రాగడం మానుకునే అవసరం లేదు.
6- సూర్యాస్తమయానికి కొంచెం ముందు విమానంలో పయనించాడు, (విమానం, పైకి లేచాక) సూర్యుడు కనబడతున్నప్పుడు ఇఫ్తార్ చేయకూడదు, మగ్రిబ్ నమాజు చేయకూడదు. అతను గగనములో ఉన్న చోట సూర్యాస్తమయం అయినదని తెలిసినప్పుడే ఇఫ్తార్ చేసి, నమాజు చేయాలి. అతనున్న విమానం ఏదైనా పట్టణం మీదుగా వెళ్తుందని, ఆ పట్టణవాసులు ఇఫ్తార్ చేశారని తెలిసినా, తాను సూర్యుడిని చూస్తున్నంత వరకు ఇఫ్తార్ చేయకూడదు.
7- టికిట్ కన్ఫర్మ్ ఉన్న వ్యక్తి, చాలా దూరంలో ఉన్న విమానాశ్రయానికి బయలుదేరుతూ, తన ఊరు దాటిన తర్వాత ఉపవాసం విడనాడి, నమాజు ఖస్ర్ చేశాడు, విమానాశ్రయం చేరుకున్నాక విమానం ఆలస్యంగా ఉందని, లేదా ఏదైనా కారణం వల్ల అది రద్దు అయిందని తెలిసి అతడు ప్రయాణం చేయలేకపోతే అతని నమాజు అయినట్లే, అలాగే అతను ఉపవాసం మానుకోవడం కూడా తప్పేమీ కాదు, ఇక మళ్ళీ తినత్రాగడం నుండి ఆగవలసిన అవసరం లేదు. ఎందుకనగా అతని ప్రమేయంతో కావాలని చేసుకున్నదేమీ కాదు, అతను చేసింది ధర్మానుసారం చేశాడు.
8- ప్రయాణం కారణంగా లేదా మరే కారణంగా రమజాను ఉపవాసాలు వదిలిన వ్యక్తి, తాను విడనాడిన ఉపవాసాలు తర్వాత పాటించాలి.
అల్లాహ్ అందరినీ క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానం చేర్చుగాక! ఆమీన్
పాద సూచిక (ఫుట్ నోట్స్) :
[1] ఏమిటి విషయం – బాటసారి ఒంటరిగా నమాజు చేసుకుంటే ఖస్ర్ చేసి రెండు రకాతులే చేయాలి కాని (స్థానిక) ఇమాం వెనక ముఖ్తదీగా ఉంటే నాలుగు రకాతులు చేయాలి అని ఇబ్ను అబ్బాస్ ؓ గారిని అడిగితే ‘సరియైన సంప్రదాయం ఇదే’ అని సమాధానమిచ్చారు. (ముస్నద్ అహ్మద్, ఇర్వాఉల్ గలీల్ 571 లో షేఖ్ అల్బానీ ఈ హదీసును సహీ అని అన్నారు.
[2] ‘జమ్అతక్దీమ్’ అంటే జొహ్ర్ సమయంలో జొహ్ర్, అస్ర్ నమాజులు కలిపి చేయడం, మగ్రిబ్ సమయంలో మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చేయడం.
‘జమ్అతాఖీర్’ అంటే అస్ర్ సమయంలో జొహ్ర్, అస్ర్ నమాజులు కలిపి చేయడం. ఇషా సమయంలో మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చేయడం.
[3] నమాజుల సమయ పట్టిక తెలుసుకొనుటకు మా ప్రచురితమైన “శుద్ధి – నమాజు” అన్న పుస్తకం చదవండి.
[4] అర్థరాత్రి అంటే రాత్రి 12 గంటలు అన్న భావన సరి కాదు. సూర్యాస్తమయం నుండి ఉషోదయం వరకు గల పూర్తి సమయంలో సగభాగం ఎన్నింటికి పూర్తవుతుందో ఆ సమయం. ఉదాహరణకుః సూర్యా- స్తమయం సా. 6 గం., ఉషోదయం తెల్లవారుజామున 4 గం.కు అయితే, రాత్రి 11 గం.కు అర్థరాత్రి అవుతుంది.
సంభందిత పోస్టులు:
25.349808
55.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
You must be logged in to post a comment.