ఈదుల్ ఫిత్ర్ ఖుత్బా – జాదుల్ ఖతీబ్

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1) పండుగ ఎవరి కోసం? 
2) (ఉపవాసాల) నిర్ణీత సంఖ్య పూర్తయ్యాక అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపడం. 
3) దుఆ స్వీకారము. 
4) సదాచరణలపై స్థిరంగా వుంటూ అవిధేయతకు దూరంగా వుండడం. 
5) పండుగ దినాల్లో ధర్మయుక్తమైన కార్యాలు. 
6) పండుగ దినాల్లో చెడు కార్యాలు చేయడం. 

[డౌన్ లోడ్ PDF]

ఇస్లామీయ సోదరులారా! 

ఈ రోజు ఈదుల్ ఫిత్ర్  రోజు. ఎంతో ఆనందకరమైన రోజు. 

ఈ రోజు ఎవరికి ఆనందకరమైనదంటే – ఎవరైతే శుభప్రద రమజాన్ మాసపు ఉపవాసాలన్నింటినీ పాటించారో మరియు సరైన షరీయత్తు పరమైన కారణం లేకుండా వాటిని విడిచిపెట్టలేదో ఆ వ్యక్తికి. ఎందుకంటే, అలాంటి వ్యక్తి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు: “ఎవరైనా విశ్వాసస్థితిలో, అల్లాహ్ ద్వారా పుణ్యఫలాన్ని ఆశిస్తూ రమజాన్ మాసపు ఉపవాసాలు పాటిస్తారో, అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ, ముస్లిం) 

నిశ్చయంగా ఈ రోజు ఎవరికి ఆనందకరమైనదంటే – ఎవరైతే ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తూ క్రమం తప్పకుండా తరావీహ్ నమాజ్ చదివారో ఆ వ్యక్తికి. ఎందుకంటే, అలాంటి వ్యక్తి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా విశ్వాస స్థితిలో, అల్లాహ్ సంతృప్తిని అశిస్తూ రమజాన్ మాసంలో ఖియాం చేశారో, అతని గత పాపాలు మన్నించ బడతాయి.” (బుఖారీ: 37, 2008, ముస్లిం: 759) 

రమజాన్ ఉపవాసాలు పాటించి, దానిలో ఖియాం చేసిన అదృష్టవంతు లైన నా ముస్లిం సోదరులారా! మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీకు పాపాల మన్నింపును గురించిన శుభవార్త వినిపించేశారు. ఈ రోజు మీ అందరికీ ఎంతో సంతోషకరమైన దినం. మీరు ఉపవాసాలన్నీ పాటించారు. దీనికి తోడు తరావీహ్ నమాజ్ కూడా చదివారు. అల్లాహ్ వీటన్నింటినీ స్వీకరించు గాక! 

ఈ రోజు నిజంగానే ఎవరు సంతోషపడాలంటే – ఎవరైతే లైలతుల్ ఖద్ర్ ఆరాధన పుణ్యఫలాన్ని ఆశిస్తూ ఆఖరి పదిరోజులు బేసి రాత్రులలో ఎంతో శ్రమించి, ఈ రాత్రులలో ప్రత్యేకంగా ఖియాం చేసారో వారు (సంతోషపడాలి). ఎందుకంటే, వీరి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా విశ్వాస స్థితిలో, పుణ్యఫలాన్ని ఆశిస్తూ, లైలతుల్ ఖద్ర్ ఖియాం చేశారో అతని గతపాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ: 2014, ముస్లిం: 760) 

ఈ రోజు నిజంగానే పండుగ రోజు ఎవరికంటే, ఎవరైతే రమజాన్ మాసంలో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెంది, అల్లాహ్ ను సంతృప్తి పరచారో (వారికే ఈ రోజు పండుగ రోజు). 

ఈ రోజు నిజంగానే సంతోషకరమైన దినం ఎవరి కంటే, ఎవరైతే శు భప్రద రమజాన్ మాసాన్ని పొందారో మరియు దానిలో అల్లాహు కు క్షమాపణలు వేడుకొని తమ పాపాలను మన్నింపజేసుకున్నారో (వారికి నిజంగానే ఈ దినం (సంతోషకరమైనది). 

నిశ్చయంగా, అత్యంత దురదృష్టవంతుడెవరంటే, రమజాన్ లాంటి మహోన్నత మాసాన్ని పొంది కూడా తన పాపాలను మన్నింప జేసుకోలేక పోయాడో (అతనే అత్యంత దురదృష్టవంతుడు). 

ఒక వ్యక్తి పండుగ రోజు విశ్వాసులు నాయకుడు (అమీరుల్ మోమినీన్) అలీ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహుఅన్హు) సన్నిధికి రాగా, ఆయన ఎండిన రొట్టెను జైతూన్తో కలిపి తింటూ వుండడం చూసాడు. అతను- ఓ విశ్వాసుల నాయకా! పండుగ రోజు మీరు ఈ ఎండిన రొట్టెను (భుజిస్తున్నారు? అని అడిగాడు. అలీ (రదియల్లాహు అన్హు) జవాబిస్తూ – “ఓ ఫలానా వ్యక్తీ! పండుగ, మంచి బట్టలు తొడిగి, సరీద్ (మంచి ఆహారం) తినే వారిది కాదు. పైగా ఎవరి ఉపవాసాలు స్వీకరించబడ్డాయో, ఎవరి ఖియాములైల్ ఆమోదించ బడిందో, ఎవరి పాపాలు మన్నించబడ్డాయో మరియు ఎవరి శ్రమకు గౌరవం దక్కిందో వారిదే అసలైన పండుగ. మా కోసమైతే ఈ రోజూ పండుగే, రేపు కూడా పండుగే మరియు అల్లాహ్ అవిధేయతకు దూరంగా వున్న ప్రతి రోజూ పండుగే” అని అన్నారు. 

అలాగే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: “పండుగ – ఉత్తమ వస్త్రాలు ధరించిన వారిది కాదు, పైగా ప్రళయదినం గురించి భయపడేవారిదే పండుగ”. 

ఇస్లామీయ సోదరులారా! 

రమజాన్ మాసంలో అల్లాహ్ ఎవరికైతే ఉపవాసం పాటించే, ఖియాం చేసే, ఖుర్ఆన్ పారాయణం చేసే, దానధర్మాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించాడో వారు ఈ రోజు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఒకవేళ అల్లాహ్ వారికి సద్బుద్ధిని ప్రసాదించి వుండకపోతే, వారిదంతా చేయగలిగే వారు కారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

అల్లాహ్ మిమ్మల్ని సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే కాని మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష.” (బఖర 2:185) 

దీనితో పాటు, ఆయన మన ఉపవాసాలను, మన ఖియాంను మరియు ఇతర ఆరాధనలను స్వీకరించమని వేడుకుంటూ వుండాలి. 

సలఫుస్సాలిహీన్ (గతించిన మొదటి మూడు తరాల సజ్జనులు) ఆరు నెలల దాకా ఇలా ప్రార్థించేవారు: “ఓ అల్లాహ్! మాకు రమజాన్ మాసాన్ని పొందే అదృష్టాన్నివ్వు. తదుపరి రమజాన్ మాసం వెళ్ళిపోయాక వారు ఇలా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్ ! ఈ నెలలో మేము చేసిన ఆరాధనలన్నింటినీ నీవు (దయతో) స్వీకరించు.”

దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ తన దాసుల లక్షణాలను వివరిస్తూ ఒక దాని గురించి ఇలా వివరించాడు: వారు ఆరాధనలు పాటించిన తర్వాత, అవి అల్లాహ్ సన్నిధిలో తిరస్కరించబడతాయేమోనని భయపడుతూ వుంటారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّ الَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ وَالَّذِينَ هُم بِآيَاتِ رَبِّهِمْ يُؤْمِنُونَ وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ أُولَٰئِكَ يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَهُمْ لَهَا سَابِقُونَ

నిశ్చయంగా ఎవరు తమ ప్రభువు పట్ల భీతితో భయపడుతున్నారో, మరెవరు తమ ప్రభువు ఆయతులను విశ్వసిస్తున్నారో, ఎవరు తమ ప్రభువుకు సహవర్తులను కల్పించకుండా వుంటారో, ఇంకా (అల్లాహ్ మార్గంలో) ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో, వారే త్వరత్వరగా మంచి పనులు చేసుకుంటూ పోతున్న వారు. వాటి కోసం వారు పోటీపడతారు”. (మూమినూన్ 23:57–61) 

ఈ ఆయత్లలో అల్లాహ్ వివరించిన లక్షణాలను ముస్లిములందరూ అలవర్చుకోవాలి. వాటిలో ఒకటి, ఒకవైపు ఆరాధిస్తూ మరో వైపు ఆ ఆరాధన అల్లాహ్ సమక్షంలో రద్దు గావించబడుతుందేమోనని భయపడుతూ వుండాలి. ఈ భయంతోనే ఆయనతో, వాటిని దయతో స్వీకరించమని వేడుకుంటూ వుండాలి. 

ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఆమె దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను- “(అల్లాహ్ మార్గంలో) ఇవ్వవలసిన దానిని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో” అన్న ఆయత్ గురించి ప్రశ్నిస్తూ, దీని అర్థం మద్యపానం, దొంగతనాలు చేసేవారా? అని అడిగారు. దైవప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – “ఓ సిద్దీఖ్ కూతురా! నువ్వనుకుంటున్నట్లు వీళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ చెప్పబడింది ఉపవాసాలుండి, నమాజ్ చేస్తూ, దానధర్మాలు చేసే వారి గురించి. ఈ సత్కార్యాలు చేశాక వారు అవి అల్లాహ్ సమక్షంలో రద్దు గావించబడతాయేమోనని భయపడుతూ వుంటారు” అని అన్నారు. 

ప్రియ సోదరులారా! 

కొంతమంది రమజాన్ మాసంలోనయితే బాగానే ఆరాధిస్తారు. ఐదు పూటల నమాజులను క్రమం తప్పకుండా నెలకొల్పుతారు. ఖుర్ఆన్ పారాయణం చేస్తారు, అల్లాహ్ స్మరణతో తమ పెదవులను తడిగా వుంచుతారు, దుఆలు చేస్తారు, దాన ధర్మాలలో అధికంగా పాలుపంచుకుంటారు. 

కానీ, రమజాన్ మాసం వెళ్ళగానే ఈ సత్కార్యాల్లో ఎన్నింటినో త్యజిస్తారు. చివరికి ఐదు పూటలు నమాజ్ విషయంలో కూడా అశ్రద్ధను, సోమరితనాన్ని కనబరుస్తారు. కానీ, ఈ వ్యవహార సరళి సరైనది కాదు. ఎందుకంటే, రమజాన్ మాసానికి ప్రభువైన అల్లాహ్ షవ్వాల్ మరియు ఇతర మాసాలకు కూడా ప్రభువు. రమజాన్ మాసంలో మనం ఏ అల్లాహ్ ను ఆరాధిస్తామో, ఆ అల్లాహ్ యే మనకు మరణం వచ్చే వరకూ ఆయనను ఆరాధిస్తూ వుండమని ఆజ్ఞాపించాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ السَّاجِدِينَ وَاعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ الْيَقِينُ

నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన్ను స్తుతిస్తూ వుండు. సాష్టాంగ పడేవారిలో చేరిపో. నిశ్చయమైనది (అనగా మరణం) వచ్చే వరకూ నీ ప్రభువును ఆరాధిస్తూ వుండు”. (హిజ్ర్ 15 : 98,99) 

ఈ ఆయతులలో సంబోధించబడింది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అయినప్పటికీ ఈ ఆజ్ఞ ఆయన అనుచర సమాజానికి కూడా వర్తిస్తుంది. అందుకే ముస్లిం సమాజమంతా అల్లాహ్ ఆరాధనలో స్థిరంగా వుంటూ రమజాన్ మాసం గడిచిపోయిన తర్వాత కూడా దాని నుండి ముఖం త్రిప్పుకోకూడదు. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు, క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ చేసే ఆచరణ అంటేనే ఇష్టం. 

ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ కు – ధర్మంలో క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ పాటించే ఆచరణ అంటేనే ఇష్టం”. (బుఖారీ: 43, ముస్లిం: 785) 

సౌబాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “మీరు (ఆచరణలలో) నిలకడను పాటించండి. మీరు ఎంత ప్రయత్నించినా దాని శక్తి కలిగి వుండలేరు. మీ శ్రేష్టమైన ఆచరణ నమాజ్ చదవడం అని గట్టిగా నమ్మండి. ఎల్లప్పుడూ వుజూతో వుండేవాడే నిజమైన విశ్వాసి”. (ఇబ్నె మాజ: 277, సహీహ్ – అల్బానీ) 

తౌహీద్ మరియు సదాచరణలపై స్థిరంగా వుండే వారికి శుభవార్తలు తెలుపుతూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَلَكُمْ فِيهَا مَا تَشْتَهِي أَنفُسُكُمْ وَلَكُمْ فِيهَا مَا تَدَّعُونَ نُزُلًا مِّنْ غَفُورٍ رَّحِيمٍ

మా ప్రభువు అల్లాహ్ మాత్రమే అని పలికి, దానిపై స్థిరంగా వున్న వారి వద్దకు దైవదూతలు దిగి వచ్చి (ఇలా అంటూ వుంటారు) – మీరు భయపడకండి, దుఃఖించకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా వుంటూ వచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. మీ మనసు కోరినదల్లా, మీరు అడగినదల్లా అందులో మీకు లభిస్తుంది. క్షమాశీలి, దయాశీలి (అయిన అల్లాహ్) తరఫున లభించే ఆతిథ్యమిది”. (హామీమ్ అస్సజ్దహ్ 41: 30-32) 

అందుకే తౌహీద్ మరియు సదాచరణల విషయంలో స్థిరంగా వుంటూ నిలకడను ప్రదర్శించాలి. దానితో పాటు ఇలా ప్రార్థిస్తూ కూడా వుండాలి:

رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِنْ لَدُنْكَ رَحْمَةً إِنَّكَ أَنْتَ الْوَهَّابُ 

మా ప్రభూ! సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్పదాతవు”. (ఆలి ఇమ్రాన్ 3: 8) 

అలాగే ఈ దుఆ కూడా చేస్తూ వుండాలి: “ఓ హృదయాలను త్రిప్పేవాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై నిలకడగా వుంచు”. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ దుఆను ఎక్కువగా చేసేవారు. 

ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గర వున్నప్పుడు ఎక్కువగా ఈ దుఆను చేసేవారు. నేనొకసారి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో – ఓ దైవప్రవక్తా! మీరు ఈ దుఆ ను ఎక్కువగా చదువుతూ వుంటారు. కారణం ఏమిటి? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ- “ఓ ఉమ్మె సలమా! మనిషి హృదయం అల్లాహ్ యొక్క రెండు వ్రేళ్ళ మధ్య వుంది. ఇక ఎవరిని సన్మార్గంలో వుంచాలో, ఎవరిని మార్గభ్రష్టులుగా చేయాలో ఆయన ఇష్టం” అని వివరించారు. 

ప్రియ సోదరులారా! 

సత్యార్యాల్లో నిలకడ అంటే – రమజాన్ మాసంలో ఎలాగైతే మీరు ఫర్జ్ ఆచరణలతో పాటు నఫిల్ ఆచరణలలో ఒకరినొకరు మించిపోవడానికి ప్రయత్నం చేసేవారో, అలాగే మిగతా మాసాల్లో కూడా వాటిని త్యజించకుండా చేస్తూ వుండాలి. 

ఇలా, ఫర్జ్ ఆచరణలలో మొట్టమొదటిది రేయింబవళ్ళలోని ఐదు పూటల నమాజ్. వీటిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా 5 పూటలు, మస్జిద్లో సామూహికంగా చేస్తూ వుండాలి. ఎందుకంటే ప్రళయం రోజు ఆచరణలలో అన్నిటికన్నా ముందుగా లెక్కతీసుకోబడేది నమాజు గురించే. 

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

“ప్రళయం రోజు అన్నింటికన్నా ముందుగా, దాసుని నమాజ్ గురించి లెక్క తీసుకోబడుతుంది. ఒకవేళ నమాజ్ సరిగా తేలితే, మిగతా ఆచరణలన్నీ సరిగా తేలుతాయి. ఒకవేళ నమాజ్ సరిగా తేలకపోతే మిగతా ఆచరణలు కూడా సరిగా తేలవు”. 

మరో ఉల్లేఖనంలో ఇలా సెలవిచ్చారు:

“అతని నమాజ్ చూడబడుతుంది. అది గనక సరిగావుంటే అతను సఫలీకృతుడవుతాడు. ఒకవేళ అది సరిగా లేకపోతే అతను అవమాన పరచబడి నష్టపోతాడు”. (తబ్రానీ – ఔసత్, అస్సహీహ: 1358)  

ఫర్జ్ నమాజులతో పాటు, రమజాన్ మాసంలో ఏ విధంగానైతే నఫిల్ నమాజులను చదివేవారో వాటిని కూడా పాటిస్తూ వుండాలి. ప్రత్యేకించి ఫర్జ్ నమాజ్ కు ముందు మరియు తర్వాతి సున్నతులు, చాప్త్ నమాజు. అలాగే రమజాన్ మాసంలో తరావీహ్ రూపంలో చదివే రాత్రి నమాజు. దీనిని కూడా త్యజించకుండా పాటిస్తూ వుండాలి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ నమాజు ప్రయోజనాలను వివరిస్తూ ఇలా సెలవిచ్చారు:

మీరు రాత్రి నమాజును (ఖియాం) తప్పకుండా చేస్తూ వుండండి. ఎందుకంటే, ఇది మీకు ముందు గతించిన సజ్జనుల పద్ధతి. రాత్రి ఖియాం అల్లాహ్ కు దగ్గరగా చేరుస్తుంది. పాపాలను తుడిచేస్తుంది, చెడు కార్యాల నుంచి ఆపుతుంది, శారీరక వ్యాధులను నిరోధిస్తుంది”. (అహ్మద్, తిర్మిజీ, సహీహ్ ఉల్ జామె లిల్ అల్బానీ: 4079) 

రమజాన్ మాసంలో ఎలాగైతే ఫర్జ్ ఉపవాసాలు పాటించారో అలాగే రమజాన్ తర్వాత నఫిల్ ఉపవాసాలు పాటించండి. ఎందుకంటే ప్రళయం రోజు ఫర్జ్ ఆచరణలలో ఏదైనా కొరత ఏర్పడితే దానిని నఫిల్ ఆచరణలద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక నఫిల్ ఉపవాసాల్లో ప్రత్యేకించి షవ్వాల్ మాసపు ఆరు ఉపవాసాలు వున్నాయి. వీటి గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.

ఏ వ్యక్తి అయినా రమజాన్ మాసపు ఉపవాసాలుండి, తదుపరి షవ్వాల్ మాసంలో గనక 6 రోజులు ఉపవాసం వుంటే అతను సంవత్సరమంతా ఉపవాసం ఉన్నట్లే”. (ముస్లిం: 1164) 

రమజాన్ మాసపు ఉపవాసాలు మరియు షవ్వాల్ మాసపు ఆరు ఉప వాసాలను కలిపి పూర్తి సం॥పు ఉపవాసాలుగా ఎందుకు ఖరారు చేయబడిందంటే – ఒక పుణ్యం అల్లాహ్ వద్ద పది పుణ్యాలకు సమానం. ఇలా రమజాన్ మాసపు ఉపవాసాలు 10 నెలల ఉపవాసాలకు సమానం. అలాగే షవ్వాల్ మాసపు 6 రోజుల ఉపవాసం, 60 రోజులు (2 నెలలు) ఉపవాసానికి సమానం.

వీటితో పాటు, వారంలోని ప్రతి సోమవారం మరియు గురువారాల్లో ఉపవాసముండడం కూడా సున్నత్. దాని మహత్యం గురించి కూడా వివరించబడింది. దీనితో పాటు ప్రతి నెలా, ‘అయ్యామె బీజ్’ (13, 14, 15 వ రోజులు) లలో కూడా ఉపవాసముండడం ఉత్తమం. ఈ రోజుల్లో ఉపవాసం ఉండడం గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబూ హురైరా (రదియల్లాహు అన్హు)కు ప్రత్యేకించి వసీయతు చేసి వున్నారు. 

రమజాన్ మాసంలో ఎలాగైతే ఖుర్ఆన్ పారాయణం చేసేవారో అదే విధంగా మిగతా రోజుల్లో కూడా దానిని వదలిపెట్టకుండా కొనసాగించాలి. ఒక విషయం గుర్తుంచుకోండి! ఖుర్ఆన్ పారాయణం, దానిపై ఆలోచించడం, దాని ప్రకారం ఆచరణ వీటిని వదలిపెట్టే వారికి వ్యతిరేకంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రళయం రోజు ఫిర్యాదు చేస్తూ ఇలా సెలవిస్తారు:

وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا

అప్పుడు దైవ ప్రవక్త, నా ప్రభూ! నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖుర్ఆన్ను వదిలిపెట్టారు అని పలుకుతాడు”. (అల్ ఫుర్ఖాన్ 25: 30) 

అందుకే ఆ దినపు అవమానం నుండి తప్పించుకోవాలంటే, ఖుర్ఆన్ ను మన జీవనశైలిగా మార్చుకొని, దాని పారాయణం చేస్తూ, దాని గురించి ఆలోచిస్తూ దాని ప్రకారం ఎల్లప్పుడూ ఆచరిస్తూ వుండాలి. 

ఇస్లామీయ సోదరులారా! 

కొంతమంది రమజాన్ మాసం గడిచాక, ఆరాధనలను త్యజించడంతో పాటు రమజాన్ కు ముందు వారు చేస్తూ వున్న చెడు కార్యాలను మళ్ళీ చేయడం మొదలు పెడతారు. ఇది కూడా ఎంతో అపాయకరమైన విషయం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا ۚ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

(ఓ ముహమ్మద్!) నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వు, నీతోపాటు (పశ్చాత్తాప భావంతో) మరలివచ్చిన వారూ గట్టిగా (స్థిరంగా) నిలబడి ఉండండి. హద్దు మీరకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలన్నింటినీ చూస్తున్నాడు”. (హూద్ 11: 112) 

ఈ ఆయతులో అల్లాహ్ – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మరియు ఆయనతో పాటు పశ్చాత్తాపం చెందిన విశ్వాసులకు అల్లాహ్ ధర్మంపై స్థిరంగా వుండమని ఆజ్ఞాపించాడు. తదుపరి విశ్వాసులకు, ధర్మంపై స్థిరంగా వుండకుండా ముఖం త్రిప్పుకొని, అల్లాహ్ అవిధేయతకు ఒడిగడుతూ తలబిరుసులుగా మారిపోవడాన్ని గట్టిగా వారించాడు. అంతేగాక, వారిని- అల్లాహ్ మిమ్మల్ని చూడటం లేదని అనుకోకండి, పైగా అతను మీ ప్రతి కదలి కనూ, కర్మలన్నింటినీ చూస్తున్నాడు – అని హెచ్చరించాడు. 

ప్రియ సోదరులారా! 

రమజాన్ మాసం తర్వాత చెడు కార్యాల వైపునకు తిరిగి మరలడం – రమజాన్ మాసంలో మీరు ఎన్నో సార్లు అల్లాహ్ చేసిన వాగ్దానానికి విరుద్ధం. రమజాన్ మాసంలో మీరు మాటిమాటికి అల్లాహ్ వైపునకు తిరుగుతూ ఆయనతో – మళ్ళీ మేము చెడు కార్యాల వైపునకు మరలమని గట్టిగా వాగ్దానం చేస్తున్నాం. నీ ఆదేశాలకనుగుణంగా ఆచరిస్తూ అవిధేయతకు దూరంగా వుంటాం అని వేడుకున్నారు. 

అందుకే, అల్లాహ్ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి! మరియు సన్మార్గంపై స్థిరంగా వుండండి! 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَاَوْفُوا بِعَهْدِ اللهِ إِذَا عَهَدُتُمْ وَلَا تَنْقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللهَ عَلَيْكُمْ كَفيلاً اِنَّ اللهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ ) 

“మీరు పరస్సరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అల్లాహ్ కు ఇచ్చిన మాటను నిలుపుకోండి. ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగ పరచకండి. (ఎందుకంటే) మీరు అల్లాహ్ ను మీ సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయనకు తెలుసు”. బాగా గుర్తుంచుకోండి! (నహ్ల్: 91) 

సత్కార్యాల తర్వాత చెడు వైపునకు మరలడం, తదుపరి మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడకపోవడం – తమ సత్కార్యాలను చేజేతులా వ్యర్థం చేసున్నట్లే. మరి తమ కష్టాన్ని తానే నీరు గార్చి, తన శ్రమను తానే మట్టిలో కలిపే వ్యక్తి బుద్ధిమంతుడు (తెలివైనవాడు) కాలేడు. 

అందుకే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. 

وَلَا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِنْ بَعْدِ قَوَةِ انْكَانا 

“తన నూలును గట్టిగా వడికిన తర్వాత, తనే స్వయంగా ముక్కలు ముక్కలుగా త్రెంచి వేసిన స్త్రీ మాదిరిగా అయిపోకండి”. (నహ్ల్: 92) అంటే ఒక స్త్రీ రాత్రంతా కష్టపడి నూలు వడికింది, తదుపరి తనే తన చేతులతో దానిని ముక్కలు ముక్కలుగా తెంచేసింది. ఆమెనెవరైనా తెలివైనదని అంటారా? అందరూ ఆమెను మూర్ఖురాలు అనే అంటారు. 

అందుకే అల్లాహ్ తన దాసులను – ఆ స్త్రీ లాగా మారి, చెడు కార్యాలలోకి దిగి తమ పుణ్యాలను తన చేతులతోనే వృథా చేసుకోవడాన్ని గట్టిగా వారించాడు. అల్లాహ్ మనందరినీ చెడు కార్యాల నుండి దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! 

పండుగ రోజుల్లో వినోదం 

పండుగ రోజుల్లో వినోదం సరైనదే. కానీ షరతు ఏమిటంటే, దీనిలో షరీయత్తుకు విరుద్ధంగా ఏ కార్యం జరగకూడదు. అందుకే, ముస్లిములందరూ ఈ తరుణంలో తమ ఇంటి వారిని, బంధువులను, మిత్రులను కలిసి షరీయత్తు హద్దులకు లోబడి అనందం వ్యక్తం చేయాలి. 

ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం: అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)  నా దగ్గరికి విచ్చేశారు. ఆ సమయంలో అన్సారీ యువతులలోని ఇద్దరు యువతులు ‘బుఆస్’ దినం నాడు అన్సారీలు చదివిన కవితలు పాడుతున్నారు. వాస్తవానికి వారు పాటలు పాడే వాళ్ళు కారు. కానీ ఆ రోజు పండుగ రోజు. అబూ బక్ర్ (రదియల్లాహు అను) – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంట్లోనే షైతాను మాట మారుమ్రోగుతుందా? అని అడిగారు. దానిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ -‘ఓ అబూ బక్ర్! ప్రతి జాతికి ఒక పండుగ వుంటుంది. మరి ఈ రోజు మన పండుగ’ అని అన్నారు. (బుఖారీ: 454, ముస్లిం: 892) 

సహీహ్ ముస్లింలోని మరో ఉల్లేఖనంలో, ఆయెషా (రదియల్లాహు అన్హా) ఇలా వివరించారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మినా’లో వున్న రోజుల్లో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)  ఆయన వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు డప్పు వాయిస్తూ పాడుతున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుప్పటి కొప్పుకొని నడుంవాల్చి వున్నారు. అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) (ఆ యువతులను) కోపగించుకున్నారు. దీనితో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ముఖాన్ని దుప్పటి నుంచి బయటకు తీసి – ఓ అబూ బక్ర్! వారిని వదలిపెట్టండి (అంటే పాడుకో నివ్వండి), ఎందుకంటే ఈ రోజులు పండుగ రోజులు’ అని హితవు పలికారు. 

అలాగే, ఆయెషా (రదియల్లాహు అన్హా) ఇలా వివరించారు: పండుగరోజు కొందరు నల్లజాతీయులు మస్జిద్కు వచ్చారు మరియు (యుద్ధానికి ఉపయోగించే) ఆయుధాలతో ఆటను ప్రదర్శించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా కుటీరం యొక్క ద్వారం వద్ద కొచ్చి స్వయంగా దీనిని 

 వీక్షిస్తూ నన్ను కూడా పిలిచారు. నేను రాగానే ఆయన తన దుప్పటిని ద్వారానికి అడ్డుగా పెట్టారు. తద్వారా నేను పరదాలో వుంటూ వారి ఆటను వీక్షించవచ్చు అని. ఇలా నేను ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భుజంపై నా తలపెట్టి వారి ఆటను వీక్షించాను. తదుపరి నేను అలసిపోవడం చూసి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో-ఇక చాలా? అని అడిగారు. నేను – అవును అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – సరే, నువ్వు లోపలికి వెళ్ళిపో అని అన్నారు. (బుఖారీ: 454, ముస్లిం: 892) 

ఈ హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే, పండుగ రోజుల్లో వినోదం ధర్మసమ్మతమే. కానీ వినోదం పేరుతో సంగీతం, పాటలు వినడం, టీవీలలో సినిమా హాళ్ళలో సినిమాలు, నాటకాలు చూడడం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే పాటలు మరియు సంగీతం వాయిద్యాలు అన్నీ నిషేధం. ఖాళీ సమయాన్ని ఇలాంటి విషయాల్లో గడపడం మహా పాపం. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَمِنَ النَّاسِ مَن يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّخِذَهَا هُزُوًا ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ وَإِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا وَلَّىٰ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا كَأَنَّ فِي أُذُنَيْهِ وَقْرًا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ

జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి తప్పించడానికి, దాన్ని వేళాకోళం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో వున్నాడు. పరాభవం పాలు చేసే శిక్ష వున్నది ఇలాంటి వారి కోసమే. వాడి ముందు మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాడు అహంకారంతో, తాను వాటిని అసలు విననే లేదన్నట్లుగా, తన రెండు చెవులలోనూ చెవుడు వున్నట్లుగా ముఖం త్రిప్పుకుని పోతాడు. కాబట్టి నువ్వు వాడికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను వినిపించు”. (లుఖ్మాన్ 31: 6,7) 

ఈ ఆయతు లో ‘లహ్వల్ హదీస్‘ అంటే పాటలు మరియు సంగీతం అని అర్ధం. ఎంతోమంది సహాబాలు దీని అర్థాన్ని ఇలాగే వివరించారు. అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహుఅన్హు) అయితే ప్రమాణం చేసి మరీ ‘లహ్వల్ హదీస్’ అంటే ‘పాటలు‘ అని అర్థం అని అన్నారు. 

ఇక ఎవరైనా, పాటలు వింటూ, వినిపిస్తూ, సంగీత నాట్య కార్యక్రమాలలో పాలుపంచుకుంటాడో లేదా ఇంట్లో కూర్చుని ఈ కార్యక్రమాలను వీక్షిస్తుంటాడో అలాంటి వ్యక్తికి ఈ ఆయత్ లో వివరించినట్లు వ్యధాభరితమైన శిక్ష వుంది. వల్ ఇయాజ్ బిల్లాహ్ ! 

అలాగే, అబూ మాలిక్ అష్రీ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“నా అనుచర సమాజంలోని కొందరు తప్పకుండా మద్యపానం చేస్తారు. మద్యం పేరును మార్చుకుంటారు. వారి తలల వద్ద సంగీత వాయిద్యాలు వాయించబడతాయి, పాటలు పాడే యువతులు పాడుతూ వుంటారు. అల్లాహ్ వారిని భూమిలోకి దిగత్రొక్కుతాడు మరియు వీరిలో ఎంతో మందిని కోతులుగానూ, పందులు గానూ చేసేస్తాడు”. (ఇబ్నెమాజ : 4020, సహీహ్ – అల్బానీ) 

ఈ హదీసులో, నాట్యం మరియు ఇతర కార్యక్రమాలలో పాలుపంచుకునే వారికి లేదా వీటిని టీవీ, కంప్యూటర్లలో వీక్షించే వారికి స్పష్టమైన హెచ్చరిక వుంది. 

అబూ అమిర్ లేదా అబూ మాలిక్ అష్రీ(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

నిశ్చయంగా నా ఉమ్మత్ (అనుచర సమాజం)లో వ్యభిచారం, సిల్కు వస్త్రాలు, మద్యం మరియు సంగీతాన్ని హలాల్ (ధర్మసమ్మతం) అని భావించేవారు వస్తారు”. (బుఖారీ: 5590) 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) – ఈ నాలుగు విషయాలను హలాల్ చేసుకొనే వారు వస్తారని భవిష్యవాణి చేశారు. వాస్తవానికి ఈ నాలుగు విషయాలు ఇస్లామ్ లో హరామ్ (నిషేధం). ఈ రోజుల్లో వీటిని హలాల్ గా చేసుకున్న వారు ఎంతో మంది వున్నారు. 

ఇక పాటల విషయానికొస్తే, దీనిని పాపకార్యమని అనుకోకపోవడమే కాకుండా, నేటి సోకాల్డ్ నాగరికులు దీని ధర్మయుక్తత (హలాల్)పై ఫత్వాలు (ధార్మికతీర్పులు) కూడా జారీ చేసేస్తారు. ఏ ఆధారమూ లేకుండా కేవలం మనుష్యుల అభిరుచులు మరియు తమ కోరికలను పూర్తి చేయడానికి వారిలా చేస్తారు. 

అంతేకాక, దీని కోసం వీరు – కొందరు విద్యావంతుల బలహీన ప్రవచనాలను ఆసరాగా తీసుకుని, ఇబ్నెమాజ్ ను గ్రుడ్డిగా అనుసరిస్తూ సహీహ్ బుఖారీ లోని ఈ హదీసును బలహీనమైనదని నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మరి చూడబోతే, పాటలు మరియు నాట్యం హరాం అన్న విషయంలో ఇమాములందరూ ఏకాభిప్రాయం కలిగి వున్నారు. 

వీటి నిషేధం గురించి మేము వివరించిన ఆధారాలు ఒక బుద్ధిమంతునికి సరిపోతాయి. వీటితో పాటు మరో ఆధారం మీ ముందు వుంచుతాను. దీని ప్రకారం డోలు వగైరాలు నిషేధించబడ్డాయి అని స్పష్టంగా తెలుస్తుంది. 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.

నిశ్చయంగా అల్లాహ్ మీపై మద్యం, జూదం, డోలును నిషేధం చేశాడు మరియు ఆయన ఇలా కూడా సెలవిచ్చారు – మత్తు కలిగించే ప్రతి వస్తువూ హరామ్“. (అబూ దావూద్: 3696, సహీహ్ – అల్బానీ) 

ఈ స్పష్టమైన ఆధారాలతో, ఎవరి మనసులోనూ ఏ విధమైన అనుమానం ఇక మిగిలి వుండకూడదు. అందరూ పాటలు మరియు సంగీతం హరామ్ (నిషేధం) అని గట్టిగా నమ్మాలి. కానీ దురదృష్టవశాత్తూ నేడు ఆ సోకాల్డ్ నాగరికుల ఫత్వాలను ఆధారంగా చేసుకొని సంగీతాన్ని కొందరు మనస్సును సంతృప్తిపరిచే, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొనే సాధనంగా భావిస్తున్నారు. మరి చూడబోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) – సంగీత వాయిద్యాలు వ్యాపించినప్పుడు, పాటలు సర్వసాధారణమై పోయినప్పుడు, మద్యపానాన్ని హలాల్ భావించినప్పుడు అల్లాహ్ యొక్క వ్యధాభరితమైన శిక్ష అవతరిస్తుందని భవిష్యవాణి చేసి వున్నారు. 

సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

ప్రళయానికి ముందు ఆఖరి కాలంలో జనాలను భూమిలోకి దిగత్రొక్కబడ వేయడం జరుగుతుంది. వారిపై రాళ్ళవర్షం కురిపించబడుతుంది, వారి స్వరూపాలు మార్చివేయబడతాయి”. ‘ఇలా ఎప్పుడు జరుగుతుంది?’ అని ఆయనతో అడగబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – “సంగీత వాయిద్యాలు వ్యాపించబడినప్పుడు, పాటలు పాడే యువతులు సర్వసాధారణమైపోయినప్పుడు, మద్యాన్ని హలాల్ భావించినప్పుడు” అని అన్నారు. (సహీఉల్ జామె లిల్ అల్బానీ: 3665) 

ఇస్లామీయ సోదరులారా! 

పాటలూ, వాయిద్యం – ఇవి ఎలా సరైనవి కాగలగుతాయి? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీటిని శపించబడ్డ విషయాలుగా ఖరారు చేశారు. 

అనస్ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “రెండు శబ్దాలు ఇహలోకంలోనూ, పర లోకంలోనూ శపించబడ్డాయి. సంతోషపడే సమయంలో పాటల శబ్దం మరియు దుఃఖ సమయంలో (గొంతు చించుకొని) ఏడిచే శబ్దం కలిగిస్తుంది“. (సహీహ్ ఉల్ జామె లిల్ అల్బానీ : 3695) 

అబ్దుల్లా బిన్ మద్ (రదియల్లాహు అన్హు) ప్రకారం:

పాట కపటత్వాన్ని ‘నీరు పంటను మొలకెత్తించినట్లే, పాట కపటత్వాన్ని మొలకెత్తిస్తుంది“. 

చెప్పొచ్చే సారాంశం ఏమిటంటే, పండుగ రోజుల్లో తప్పకుండా ఆనందాన్ని వ్యక్తం చేయండి. కానీ మేము వివరించిన ఆధారాలను దృష్టిలో వుంచుకొని పాటలు, సంగీతం వంటి విషయాలకు దూరంగా వుండడం ఎంతైనా అవసరం. 

పండుగ రోజుల్లో చేయబడే కొన్ని చెడు కార్యాలు 

పండుగ దినాలలో ప్రత్యేకించి కొన్ని చెడులు కానవస్తాయి. వాటి గురించి కూడా వివరించడం ఎంతైనా అవసరం. ఆ చెడు కార్యాలలో కొన్ని ఇవి: 

1) వస్త్రాలను చీలమండ క్రింది వరకు వ్రేలాడదీయడం, గర్వం, గొప్ప తనాన్ని ప్రదర్శించడం. 

పండుగ రోజుల్లో ఎంతో మంది ధరించే వస్త్రాలు చీలమండ క్రింది వరకు వ్రేలాడుతూ వుంటాయి. మరి చూడబోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దీని గురించి ఇలా సెలవిచ్చారు:

మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ ప్రళయం నాడు ఏ మాత్రం సంభాషించడు, వారి వైపు కన్నెత్తి కూడా చూడడు, వారిని పరిశుద్ధ పరచడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష వుంటుంది”. 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ మాటను మూడుసార్లు పలికారు. అబూజర్ (రదియల్లాహు అను) – నిశ్చయంగా వారు పరాభవం పాలు చేయబడి, ఎంతగానో నష్టపోతారు. ఓ దైవప్రవక్తా! వాళ్ళు ఎవరు? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – “తన లుంగీ / ప్యాంట్ ను క్రిందికి వ్రేలాడదీసేవాడు, సహాయం చేసి దెప్పిపొడిచేవాడు, అసత్య ప్రమాణం చేసి (సరుకులు) అమ్మేవాడు” అని అన్నారు. (ముస్లిం: 106)

అబూ హురైరా (రదియల్లాహు అను) కథనం: ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

చీలమండ క్రింద వుండే వస్త్రం నరకాగ్నిలో వుంటుంది”. (బుఖారీ: 5787) 

ఈ రెండు హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే – వస్త్రాలను చీలమండ క్రిందికి వ్రేలాడ దీయడం హరామ్ మరియు మహా పాపం. 

అందుకే ఏ వస్త్రమైనా చీలమండ క్రిందికి వ్రేలాడదీయబడి వుంటే – అది షల్వార్ దైనా, దుప్పటి అయినా, పైజామాదైనా, ప్యాంటుదైనా (లుంగీదైనా), దానిని చీలమండ పై వరకే వుండాలి. దీనితోపాటు గర్వం కూడా కలిగి వుంటే అలాంటప్పుడు ఇది మరింత పెద్ద పాపకార్యం అవుతుంది. 

 దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

ఒక వ్యక్తి తన లుంగీని (క్రింది వరకు వ్రేలాడ దీసి) ఈడ్చుతున్నాడు. అల్లాహ్ అతన్ని భూమిలోకి దిగత్రొక్కాడు. ఇలా అతను ప్రళయం వరకు భూ గర్భంలోకి పోతూనే వుంటాడు”. (బుఖారీ: 5790) 

మరో ఉల్లేఖనంలో ఈ హదీసు పదాలు ఇలా వున్నాయి:

ఒక వ్యక్తి తన పొడుగాటి వెంట్రుకలను దువ్వుకొని, అందమైన వస్త్రాలు ధరించి, నిక్కుతూ వెళుతూ గర్వాతిశయానికి లోనై వున్నాడు. ఈ తరుణంలోనే అకస్మాత్తుగా అల్లాహ్ అతన్ని భూమిలోకి దిగత్రొక్కాడు. ఇలా అతను ప్రళయం వరకు భూ గర్భంలోకి పోతూనే వుంటాడు”. (బుఖారీ: 5789, ముస్లిం: 2088) 

మరి చూడబోతే, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ

జనుల ముందు (గర్వంతో మొహం త్రిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు”. (లుఖ్మాన్ 31: 18)

 ‘గర్వం’ ఎంత పెద్ద అపరాధమంటే, ఒకవేళ ఎవరి మనసులోనైనా ఆవగింజంత గర్వం వున్నా అతను గనక తౌబా చేయకుండా మరణిస్తే స్వర్గంలోకి ప్రవేశించలేడు.”. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “హృదయంలో ఆవగింజంత గర్వం వున్నా, ఆ వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించ లేడు”. దీనిపై ఓ వ్యక్తి- ఓ దైవప్రవక్తా! నిశ్చయంగా ఒక వ్యక్తి తన బట్టలు, బూట్లు అందంగా వుండాలని కోరుకుంటాడు. (మరి ఇది కూడా గర్వానికి సూచనేనా?) అని అడిగాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “నిశ్చయంగా అల్లాహ్ సౌందర్యవంతుడు, సౌందర్యాన్ని ఇష్టపడతాడు. (వాస్తవానికి) గర్వం అంటే – సత్యాన్ని త్రోసిపుచ్చడం మరియు ఇతరులను అల్పులుగా భావించడం” అని వివరించారు (ముస్లిం: 91) 

అందుకే, పండుగ దినాల ఆనందోత్సాహంలో డాబులు, గర్వం మిళితం కాకూడదు. పైగా, ప్రజలతో చిరునవ్వుతో, వినయవిధేయతలతో కలవాలి మరియు ఇంటివారితో, బంధువులతో, మిత్రులతో మన ప్రేమను, ఆనందాన్ని పంచుకోవాలి. 

2) గడ్డం గొరికించుకోవడం లేదా దానిని చిన్నదిగా చేసుకోవడం. 

ఎంతోమంది సాధారణంగా గడ్డాన్ని గొరికించుకోవడమో లేదా దానిని చిన్నదిగా కత్తిరించుకోవడమో చేస్తుంటారు. పండుగ రోజుల్లో అయితే దీనిని ప్రత్యేకించి చేస్తూ వుంటారు. కానీ వాస్తవానికి ఇలా చేయడం హరామ్. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరు ముష్రిక్కులను (బహుదైరాధకులు) వ్యతిరేకిస్తూ వుండండి, గడ్డాలను పెంచండి. మరియు మీసాన్ని కత్తిరించండి”. (బుఖారీ: 5892, 5893, ముస్లిం: 259) 

మరో ఉల్లేఖనంలో ఇలా సెలవిచ్చారు:

మీరు మీసాన్ని కత్తిరించండి, గడ్డాన్ని పొడిగించండి, అగ్ని పూజారులను వ్యతిరేకించండి”. (ముస్లిం: 260) 

కానీ, నేడు చాలా మంది ముస్లిములు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా మీసాలను పెద్దవిగా చేసి గడ్డాన్ని పూర్తిగా గొరికించుకోవడమో లేదా చిన్నగా కత్తిరించు కోవడమో చేస్తున్నారు. ఇలా వారు ముష్రిక్కులకు, అగ్ని పూజారులకు అనుగుణంగా వ్యవహరిస్తు న్నారు. వాస్తవానికి వాళ్ళను వ్యతిరేకించమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞాపించి వున్నారు. 

3) పరాయి స్త్రీలతో కరచాలనం చేయడం. 

ఎంతో మంది, ప్రత్యేకించి పండుగ రోజుల్లో ఇతరుల ఇళ్ళకు వెళ్లినప్పుడు అక్కడ పరాయి స్త్రీ తో కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతారు. మరి చూడబోతే, మన ధర్మం అపరిచిత (పరాయి) స్త్రీలతో కరచాలనం చేయడానికి అనుమతించదు. 

మాఖిల్ బిన్ యసార్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

మీతో ఏ వ్యక్తికైనా అతని తలపై ఇనుప సూదితో కొడుతూ వుంటే – ఇది అతనికి తనకు ధర్మ సమ్మతం కాని స్త్రీని ముట్టుకోవడం కన్నా మేలైనది”. (అస్సహీహ : 226) 

అందుకే, మన ప్రియప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీలతో ‘బైత్’ (ప్రమాణం) తీసుకున్నప్పుడు కేవలం నోటితో తీసుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ స్త్రీ తోనూ కరచాలనం చేయలేదు. (ముస్లిం: 1866) 

4) పరాయి స్త్రీలతో ఏకాంతంలో సంభాషించడం

ప్రత్యేకించి, పండుగ రోజుల్లో ఎంతో మంది పరాయి స్త్రీలతో ఏకాంతంలో సంభాషిస్తూ వుంటారు. కానీ, మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దీనిని వారించి వున్నారు. ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

మీరు (పరాయి) స్త్రీల వద్దకు వెళ్ళడం నుండి దూరంగా వుండండి“. 

దీనిపై ఒక అన్సారీ – ఓ దైవ ప్రవక్తా! మరి మీరు భర్త సోదరుని (మరిది) వద్దకు వెళ్ళడం గురించి ఏమంటారు? అని అడిగాడు. 

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) “మరిది అయితే మృత్యువు (లాంటివాడు)” అని వివరించారు.(బుఖారీ: 5232, ముస్లిం: 2083) 

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

మీలో ఏ వ్యక్తి కూడా ఇతర స్త్రీ తో ఏకాంతంలో సంభాషించకండి. ఒకవేళ ఆమెతో పాటు ఎవరైనా ‘మహ్రమ్’ వుంటే అది వేరే విషయం. అలాగే ఏ స్త్రీ అయినా ‘మహ్రమ్’ లేకుండా ప్రయాణం చేయకూడదు”. (బుఖారీ: 2862, ముస్లిం: 1341) 

5) స్త్రీలు పరదా (బురఖా) లేకుండా తిరగడం. 

ప్రత్యేకించి పండుగ రోజుల్లో ఎంతో మంది స్త్రీలు పరదా లేకుండా బయటికొస్తారు. అందంగా సింగారించుకొని బజార్లలో, మార్కెట్లలో, పార్కులలో వస్తూ పోతూ ఎంతో మందిని పరీక్షకు గురి చేస్తారు. మరి చూడబోతే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీని నుండి గట్టిగా వారించారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

మీరు మీ ఇండ్లల్లోనే ఆగి వుండండి. పూర్వపు అజ్ఞానకాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి”. (అబ్: 33) 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

స్త్రీ- సతర్ (దాచిపెట్టే వస్తువు) లాంటిది. అందుకే ఆమె ఇంటి నుండి బయలుదేరినప్పుడు పైతాను ఆమెను కనిపెడుతూ వుంటాడు. ఆమె తన ఇంట్లో వున్నప్పుడు అల్లాహ్ కారుణ్యానికి అత్యంత సమీపంలో వుంటుంది”. (ఇబ్నె హిబ్బాన్: 5599, తిర్మిజీ: 1773, మిష్కాత్: 3109) 

పరదా పాటించకుండా, పలుచటి వస్త్రాలు ధరించి ఇండ్ల నుండి బయటి కొచ్చే స్త్రీలను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “వారు స్వర్గంలో ప్రవేశించలేరు” అని గట్టిగా హెచ్చరించారు. 

అబూ హురైరా (రదియల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

రెండు రకాల నరకవాసులను నేను చూడలేదు. అందులో ఒకరు ఎవరంటే ఆవుల తోకల్లాంటి కొరడాలతో ప్రజలను గెదిమేవారు. ఇక రెండవ వారు ఎవరంటే, వస్త్రాలు ధరించినప్పటికీ నగ్నంగా కనబడే స్త్రీలు. ప్రజల మనస్సులను తమ వైపుకు ఆకర్షింపజేస్తూ గర్వంతో నిక్కుతూ నడుస్తారు. వారి శిరస్సులు ఒంటెల మూపురము లాగా ఒక వైపునకు వంగి వుంటాయి. ఇలాంటి స్త్రీలు స్వర్గంలోకి ప్రవేశించలేరు. స్వర్గపు సువాసన సైతం పొందలేరు. వాస్తవానికి స్వర్గపు సువాసన చాలా దూరం నుండి వస్తూ వుంటుంది”. (ముస్లిం: 2128) 

అలాగే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు:

“ఏ స్త్రీ అయినా తన సువాసనను అనుభవింప చేయాలన్న ఉద్దేశ్యంతో కొందరి దగ్గరి నుంచి వెళితే, అలాంటి స్త్రీ అశ్లీల (చెడు నడత గల) స్త్రీ.” 

6) బంధువులు, బీదవారి హక్కులను దృష్టిలో వుంచుకోవడం. 

పండుగ రోజుల్లో ఎంతో మంది బాగా తింటారు. అందమైన వస్త్రాలు ధరిస్తారు మరియు తమ సంతోషాన్ని వ్యక్తం కూడా చేస్తారు. కానీ తమ బంధువులనూ, బీదవారినీ మరిచిపోతారు. కానీ ఇస్లాం మనకు సంతోషాలలో బంధువులనూ, బీదవారిని కూడా చేర్చడాన్ని ప్రోత్సహిస్తుంది. మన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

మీరు మీ కోసం ఇష్టపడేదే, మీ సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకు (పరిపూర్ణ) విశ్వాసులు కాలేరు”. (బుఖారీ: 13, ముస్లిం: 45) 

బంధుత్వాన్ని నెరవేర్చటం గురించి అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఏ వ్యక్తి అయినా తన ఉపాధిలో వృద్ధి మరియు దాని అంతం (మరణం)లో ఆలస్యం కావాలనుకుంటే, అతను బంధుత్వాన్ని నెరవేర్చాలి”. (బుఖారీ: 5986, ముస్లిం: 2557) 

బంధుత్వాన్ని నెరవేర్చటం గురించి చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకవేళ వారి బంధువులు దానిని నెరవేర్చితే తాము కూడా దానిని నెరవేర్చాలి. కానీ, ఈ దృక్పథం సరైనది కాదు. బంధుత్వాన్ని నెరవేర్చటం యొక్క సరైన దృక్పథం ఏమిటంటే, ఒకవేళ బంధువు, బంధుత్వాన్ని నెరవేర్చకపోయినా తను మాత్రం దానిని నెరవేర్చాలి. ఒకవేళ వారు చెడుగా ప్రవర్తిస్తే, వారితో మంచిగా ప్రవర్తించాలి. ఒకవేళ వారు ఇవ్వకపోయినా వారికి ఇస్తూ వుండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, బంధువు, బంధుత్వాన్ని నెరవేర్చినా, నెరవేర్చకపోయినా, రెండు పరిస్థితుల్లోనూ మనిషి తన శాయశక్తులా తన బంధువుతో బంధుత్వాన్ని నెరవేరుస్తూ వుండాలి. 

అబ్దుల్లా బిన్ అమ్ బిన్ ఆస్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

బంధుత్వాన్ని నెరవేర్చేవాడంటే ఒకరు నెరవేర్చిన దానికి బదులుగా నెరవేర్చేవాడు కాదు. పైగా బంధుత్వాన్ని నెరవేర్చే వాడంటే – ఒకరు నెరవేర్చకపోయినా తను మాత్రం బంధుత్వాన్ని నెరవేర్చుతూ వుండేవాడు“. (బుఖారీ: 5991) 

అందుకే, పండుగ సంతోషాలలో బంధువులను, బీద వారిని కూడా చేర్చుతూ వుండాలి. 

ఇస్లామీయ సోదరులారా! 

ఆఖరుగా మీకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఒక సున్నత్ ను గుర్తుకు తెప్పిస్తాం. అదేమిటంటే, పండుగ నమాజు అనంతరం దారిని మార్చి తిరిగి వెళ్ళడం. అబూ హురైరా (రదియల్లాహు అన్హు)కథనం: 

“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పండుగ రోజు (నమాజ్ కోసం) బయటి కొచ్చినప్పుడు ఒక దారిలో వెళ్ళేవారు, తదుపరి (నమాజు అనంతరం) వేరే దారిలో తిరిగి వచ్చేవారు”. (తిర్మిజి : 541, సహీహ్ – అలా ్బనీ) 

అందుకే, ఏ దారిలోనైతే వచ్చారో ఆ దారిలో కాకుండా వేరేదారిలో తిరిగి వెళ్ళండి మరియు పండుగ సంతోషాలలో ఒకరినొకరు చేర్చండి. కలిసినప్పుడు ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్క‘ అన్న పదాలతో ఆరాధనల స్వీకరణకు గాను ఒకరినొకరు దుఆలు చేసుకోండి. సహాబాలు కూడా ఇలాగే చేసేవారు. 

జుబైర్ బిన్ నఫీర్ కథనం: 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలు పండుగ రోజు కలిసినప్పుడు, ఒకరినొకరు ఇలా అనేవారు – తఖబ్బలల్లాహు మ మిన్నా వ మిన్క (అల్లాహ్ మీవి మరియు మావి (సదాచరణలను) స్వీకరించుగాక)!” 

అల్లాహ్ మనందరి ఆరాధనలను స్వీకరించుగాక! మరియు వాటిని, మన కోసం పరలోకపు నిల్వగా చేయుగాక! ఆమీన్!! 

ఈ ఖుత్బా క్రింద పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

%d bloggers like this: