అల్లాహ్ కు దగ్గర కావాలనుకుంటున్నారా? అల్లాహ్ ప్రేమించేవారిలో, ఇష్టపడేవారిలో చేరాలనుకుంటున్నారా? మరి అల్లాహ్ సామీప్యం పొందడానికి మార్గాలు ఏమిటి? అల్లాహ్ సామీప్యం పొందితే కలిగితే గొప్ప ప్రయోజనాలు ఏమిటి? తప్పక విని ప్రయోజనం పొందండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్
అల్లాహ్ సామీప్య మార్గాలు
https://youtu.be/CiCtBSNqJAI [38 నిముషాలు]
వక్త: అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, అల్లాహ్ సామీప్యాన్ని (వసీలా) ఎలా పొందాలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ప్రసంగం ప్రారంభంలో, విశ్వాసులు అల్లాహ్ సామీప్యాన్ని అన్వేషించాలని సూచించే ఖురాన్ ఆయతును ఉదహరించారు. అల్లాహ్ సామీప్యం పొందడానికి పది ముఖ్యమైన మార్గాలు వివరించబడ్డాయి: సమయానికి నమాజ్ చేయడం, ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ మరియు నఫిల్ నమాజులు అధికంగా చేయడం, అల్లాహ్ పట్ల విధేయత చూపడంలో ఉత్సాహం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్), అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండటం, చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందడం, ఖురాన్ ను పారాయణం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం, సజ్జనులతో స్నేహం చేయడం, మరియు పేదవారికి దానం చేయడం. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడిగా మారి, అతని ప్రార్థనలు అంగీకరించబడతాయని మరియు ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడని నొక్కి చెప్పబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్.
ఫ అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
కరుణామయుడు, కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.
سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ
(సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్)
“(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)
వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కృతజ్ఞత, ఆయన దయతో ఈరోజు మనమంతా ఒక కొత్త అంశాన్ని తీసుకొని సమావేశమై ఉన్నాము. అల్లాహ్ తో దుఆ ఏమనగా, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఏవైతే వాక్యాలు మనకు వినబడతాయో వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మాకు ప్రసాదించు గాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ ఒకేచోట సమావేశపరుస్తున్న వారందరికీ అల్లాహ్ త’ఆలా మంచి ఫలితాన్ని ఇహపరలోకాలలో ప్రసాదించు గాక. ఆమీన్.
అల్లాహ్ సామీప్య మార్గాలు
ప్రియమైన మిత్రులారా! ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్.
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడు.
ఈరోజు మన అంశం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్య మార్గాలు. అల్లాహ్ సామీప్యం ఎలా పొందగలము? వాటి యొక్క మార్గాలు ఏమిటి? దాని ఫలితంగా మనకు అల్లాహ్ త’ఆలా కల్పించే భాగ్యాలు ఏమిటి? దీనిపై ఈరోజు సవివరంగా మీ ముందు ఉంచబోతున్నాను.
సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనల్ని అందరినీ సృష్టించారు. సరైన మార్గం కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు సూచించాడు. సర్వ జనుల్లో అనేకమంది అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. కొంతమందికి కొన్ని విషయాల వల్ల ప్రేమ, మరి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆకర్షణ, మరికొంతమందికి కొన్ని విషయాల పట్ల సంతుష్టి ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఏమి చెబుతున్నాడంటే, ఓ విశ్వాసులారా! నా యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి.
అల్లాహ్ యొక్క సామీప్యం ఎంతో ఉన్నతమైన స్థానం. విలువైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానానికి, ఆ విలువైన స్థానానికి మనిషి చేరుకోగలిగితే, ఇక అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ త’ఆలా ను ఆ మనిషి ఏది కోరుకుంటాడో, ఆ దాసుడు ఏది కోరుకుంటాడో దాన్ని అల్లాహ్ త’ఆలా ప్రసాదిస్తాడు. ఆ విలువైన స్థానం, ఆ విలువైన సామీప్యాన్ని పొందడానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు సూచించారు. ఆ సామీప్యం మనిషికి దొరికినట్లయితే ఆ మనిషి యొక్క విలువ కూడా పెరిగిపోతుంది. అతని భక్తి కూడా పెరిగిపోతుంది. అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాల్లో ఉంటాడు.
అయితే ఆ సామీప్యం మనకు ఎలా లభిస్తుంది? దాని కోసం మనం ఎన్నుకోవలసిన మార్గాలు ఏమిటి? ఇది మీరు, మేము చెప్పుకుంటే వచ్చేది కాదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! మీకు ఏ దేవుడైతే, ఏ అల్లాహ్ అయితే మీకు ప్రవక్తగా చేసి పంపించాడో అతని సాక్షిగా నేను చెబుతున్నాను. అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశం ఏమిటో నాకు వివరించండి.
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “షహాదతైన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.” దాన్ని “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్.” నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరి నిజమైన ఏ దేవుడు లేడు. అలాగే నేను సాక్ష్యమిస్తున్నాను మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని తర్వాతే మిగతా విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఆ వ్యక్తి దాన్ని విశ్వసించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అంటున్నాడు, రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మాపై విధించిన విషయాలు ఏమిటో చెప్పండి.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదేశించారు. రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై విధించిన విషయం ఏమిటంటే, ఐదు పూటల నమాజు విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! ఇంకేమైనా ఉందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఐదు పూటల నమాజు తర్వాత నీకిష్టమైతే ఇంకా ఎక్కువైనా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశంలో ఇంకేమైనా చేయవలసి ఉంటే అది కూడా చెప్పండి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాన్ మాసములో ఉపవాసాలు ఉండుట, పూర్తి మాసంలో ఉపవాసాలు ఉండుట. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేమైనా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ పూర్తి మాసం తర్వాత నీకు ఇష్టమైతే మిగతా రోజుల్లో కూడా నువ్వు ఉపవాసాలు ఉండవచ్చు.
మీకు అందజేసిన ఆదేశాల్లో ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాత్ చెల్లించటం, సంవత్సరానికి ఒకసారి జకాత్ చెల్లించటం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చాలా క్లుప్తంగా వివరించారు. అన్ని విషయాలు విన్న ఆ వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అన్నాడు, ఓ ప్రవక్తా! ఏవైతే మీరు నాకు వినిపించారో, ఏవైతే సందేశం నాకు ఇచ్చారో ఆ సందేశంలో నేను రవ్వంత కూడా ఎక్కువ చేయను, రవ్వంత కూడా తగ్గించను. ఏదైతే నేను నాపై విధిగా ఉందో అది మాత్రమే నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను, ఇంకా తక్కువ చేయను అని ఆ వ్యక్తి పలకరించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెళ్తుండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే ఈ మనిషి అన్నాడో, ఏదైతే ఈ మనిషి వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని సరిగ్గా నెరవేరిస్తే ఇతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇచ్చారు.
ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా! ఇది బుఖారీ, ముస్లింలో ఉంది, ఈ ఒక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువు. కానీ మనం కాస్త గ్రహించట్లేదు. ఒకవేళ మనం గ్రహిస్తే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన విషయాల్లో ఏవైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో అవి మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త వినిపించారు, ఈ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని. అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి మనిషికి కావలసినది ఏమిటంటే, అత్యంత విలువైన, అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే అతనిపై విధిగా చేశాడో దాన్ని అమలు పరచటం. అల్లాహ్ త’ఆలా విధిగా చేయనిది మనము ఎంత చేసుకున్నా అది విధికి సమానంగా ఉండదు. ధార్మిక పండితులు, ధార్మిక విద్వాంసులు అనేక విషయాలు దీనికి సంబంధించి చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడానికి మార్గాలు అన్నమాట.
1. మొట్టమొదటిది: సమయానికి నమాజ్ చేయడం
మొట్టమొదటిదిగా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి కావలసింది ఏమిటంటే, ‘అదావుస్ సలాతి ఫీ అవ్ఖాతిహా’. నమాజుని దాని యొక్క సమయంలో ఆచరించటం.
ఫజర్ నమాజ్ ఫజర్ సమయంలో, జోహర్ నమాజ్ జోహర్ సమయంలో, అసర్ నమాజ్ అసర్ సమయంలో, మగ్రిబ్ నమాజ్ మగ్రిబ్ సమయంలో, ఇషా నమాజ్ ఇషా సమయంలో. ఏ నమాజ్ ఏ సమయంలో అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో ఆ నమాజ్ ని ఆ సమయంలో విధిగా భావించి ఆచరించాలి. కొంతమంది ఫజర్ నమాజ్ ని హాయిగా పడుకొని జోహర్ నమాజ్ తో కలిపి చదువుతారు. ఇది అల్లాహ్ తబారక వ త’ఆలాకి నచ్చదు. సమయాన్ని తప్పించి నమాజ్ ఆచరించటం అనేది విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేయలేదు. కనుక అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో, ఎప్పుడు చేశాడో దాన్ని ఆ ప్రకారంగానే అమలు చేయటం. ఇస్లాం ధర్మంలో రెండో మౌలిక విధి నమాజ్ ది ఉంది. మొదటిది షహాదతైన్, ఆ తరువాత నమాజ్ అన్నమాట. నమాజ్ ని దాని సమయంలో పాటించటం, ఆచరించటం ఉత్తమం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, మనిషి చనిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్ వద్ద అతనితో ప్రశ్నించబడేది నమాజే. నమాజ్ గురించి అతను సమాధానం ఇవ్వగలిగితే మిగతా విషయాల్లో అతను విజయం, సాఫల్యం పొందుతాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సామీప్యం పొందడానికి కావలసినది విధిగా చేసి ఉన్న నమాజులని సమయం ప్రకారం ఆచరించటం, పాటించటం.
2. సున్నత్ మరియు నఫిల్ నమాజులు
ఇక రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ప్రవక్తా! స్వర్గంలో నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అయితే నువ్వు ఎక్కువగా నమాజ్ ఆచరించు. విధిగా ఉన్న నమాజులని ఆచరించిన తర్వాత సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను ఇలాంటి నమాజులను ఎక్కువగా ఆచరించటం వలన అల్లాహ్ యొక్క సామీప్యం మనకు లభిస్తుంది. ఎంతవరకు అయితే మనిషి అల్లాహ్ యొక్క భక్తిని తన హృదయంలో, తన మనసులో పెంపొందించుకుంటాడో, అల్లాహ్ తబారక వ త’ఆలా అతనికి తన సామీప్యానికి దరికి తీసుకుంటాడు. కనుక సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను, అలాగే రాత్రిపూట ఏకాంతంలో చదివే తహజ్జుద్ నమాజులను కూడా వదలకూడదు. ఈ నమాజులు మన స్థాయిని పెంచుతాయి. అల్లాహ్ సన్నిధిలో మన యొక్క విలువ పెరుగుతుంది.
3. అల్లాహ్ పట్ల విధేయత
ఆ తర్వాత మూడో మార్గం ఏమిటంటే అల్లాహ్ యొక్క విధేయతను పాటించడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. విధేయత అంటే ఇతాఅత్. ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ పని చేయమని, ఆ పని చేయమని అల్లాహ్ త’ఆలా మాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను శిరసా వహించటానికి ఇతాఅత్ అంటాము. ఆ ఇతాఅత్ చేయటానికి మనము ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. ఉత్సాహం కలిగి ఉండాలి. ఉత్సాహం లేకుండా ఏదీ మనిషి చేయలేడు, ఇష్టం లేకుండా ఏది మనిషి చేయలేడు. అల్లాహ్ విధేయత పట్ల మనిషి ఉత్సాహం కలిగి ఉంటే ఆ విశ్వాసంలో కలిగే రుచే వేరుగా ఉంటుంది. ఇది మూడో మార్గం అన్నమాట.
4. అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్)
ఇక నాలుగో మార్గం ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలాని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అంటే జిక్ర్. జిక్ర్ అంటే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామము యొక్క జపము. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దుఆలతో నామాలతో, జపాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. మనిషి కూర్చొని ఉన్నా, నమాజ్ తర్వాత అయినా, ఏదైనా వస్తువు మన చేతి నుండి కింద పడిపోయినా, ఏదైనా వస్తువు మనకు ఆకర్షణను కలిగించినా, అనేక విధాలుగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి. దీని ద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తద్వారా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం మనకు లభిస్తుంది.
5. ఉపవాసం
ఇక ఐదోది ఏమిటంటే, అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండుట. ఉపవాసం అనేది ఎవరికీ కానవచ్చేది కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనిషి ఉపవాసం ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక రోజు ఉపవాసం ఉండినట్లయితే, అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాల దూరంగా నరకాగ్ని నుండి ఉంచుతాడు. ఇది కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరం వరకు తప్పిస్తాడు. ఆ విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ఉపవాసాలు చూపించారు. వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుట, ఒక మాసములో, ఒక నెలలో మూడు రోజులు, 13, 14, 15 వ తేదీలలో ఉపవాసాలు ఉండుట. అలాగే అరఫా రోజున ఉపవాసం ఉండుట, ముహర్రం రోజులో 9, 10 ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండుట. రమజాన్ మాసములో విధిగా చేయబడిన ఒక నెల ఉపవాసాలు ఉండుట. ఈ విధంగా అనేక ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉపదేశించారు. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో విశ్వాసము, ఈమాన్ పెరుగుతుంది. దాని మూలంగా అతను అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందగలుగుతాడు.
6. పశ్చాత్తాపం (తౌబా)
ఇక ఆరోది ఏమిటంటే పశ్చాత్తాపం, ‘అత్తౌబతు అనిల్ మ’ఆసీ’. పశ్చాత్తాపం. ఏవైతే మనము చెడు కర్మలు చేసి ఉన్నామో, నేరాలు చేసి ఉన్నామో, దాని పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. అల్లాహ్ త’ఆలాతో ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా వైపు మరలుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ త’ఆలాతో క్షమాపణ, మన్నింపు కోరుతూ ఉండాలి. దీని మూలంగా మన యొక్క పాపాలు అల్లాహ్ తబారక వ త’ఆలా తుడిచి పెడతాడు. దాని ద్వారా మన యొక్క ఈమాన్ పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం మనకు కలుగుతుంది. మనిషి ఏ సమయంలో ఎలాంటి పాపం చేస్తాడో అతనికే తెలుసు. కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అతను పాపాలు చేస్తాడు, ఆ పాపాలు అతనికి గుర్తు ఉండవు. కనుక అల్లాహ్ తబారక వ త’ఆలాతో దుఆ ఏమని చేయాలంటే, ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, తెలియక చేశానో అన్నిటినీ నువ్వు క్షమించు అని అల్లాహ్ త’ఆలాతో మన్నింపు కోరుతూ ఉండాలి.
పశ్చాత్తాపం చేయటానికి, క్షమాపణ కోరటానికి, మన్నింపు కోరటానికి గడువు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, రాత్రిళ్ళలో ఎవరైతే పాపాలు చేస్తారో, నేరాలు చేస్తారో అతని కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా పగలు తన రెండు హస్తాలను చాచి, ఓ నా భక్తులారా! ఎవరైతే రాత్రిళ్ళలో మీరు పాపాలు చేసి ఉన్నారో, నేరాలు చేసి ఉన్నారో, నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ సమయంలో ఎవరైతే అల్లాహ్ తబారక వ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతారో, అల్లాహ్ త’ఆలా వారిని క్షమిస్తాడు, మన్నించి వేస్తాడు. అదే విధంగా పగటి పూట ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, వారి కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా రాత్రి తన హస్తాలు చాచి, ఓ నా దాసులారా! మీరు పగటిపూట ఏమైనా నేరాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, రండి, క్షమాపణ కోరండి, మీ పాపాలను నేను తుడిచి వేస్తాను, మన్నించి వేస్తాను. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పాపం పట్ల పశ్చాత్తాపం చెందితే మళ్ళీ బహుశా నాతో పాపం జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పశ్చాత్తాపం చెందకూడదు. జీవితంలో చివరి కాలంలో, శేష జీవితంలో నేను పాపాల నుండి విముక్తి పొందటానికి అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరాలి అనే భావన అతనిలో కలిగి ఉంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు, పొరపాటు. మనిషి అన్న తర్వాత చిన్న పాపాలు గాని, పెద్ద పాపాలు గాని, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా క్షమిస్తూనే ఉంటాడు. గఫూరుర్ రహీం. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఎల్లప్పుడూ తమ పాపాల పట్ల అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతూ ఉండాలి.
7. ఖురాన్ పారాయణం
ఇక ఏడో మార్గం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా అవతరింపజేసిన ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అల్లాహ్ తబారక వ త’ఆలా మహత్తరమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. మన సాఫల్యం కోసం, పరలోకంలో మనం విజయం సాధించాలనే ఉద్దేశ్యముతో అల్లాహ్ త’ఆలా మన కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈనాడు మన స్థితి కాస్త గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది, అదేమిటంటే ఖురాన్ చదవటం వచ్చిన వాళ్ళు అయినా సరే, ఖురాన్ చదవటం రాని వాళ్ళు అయినా సరే సమానమయ్యారు. ఖురాన్ చదవటానికి వారి వద్ద సమయం లేదు. ఖురాన్ నేర్చుకోవడానికి వారి వద్ద సమయం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం. నిజమైన గ్రంథం. ఈ భూమండలంలో ఏదైనా నిజమైన గ్రంథం, అల్లాహ్ యొక్క దైవ గ్రంథం ఉండినట్లయితే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. అసలైన స్థితిలో అలాగే భద్రంగా ఉంది.
ఎంత అభాగ్యులు వారు, ఎవరైతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాగిస్తున్నారో. చాలా దురదృష్టవంతులు. అల్లాహ్ యొక్క గ్రంథం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మనలో విశ్వాసం దాన్ని చదవడానికి, దాన్ని పారాయణం చేయడానికి, కంఠస్థం చేయడానికి ఎలా తహతహలాడాలంటే అంత ఉత్సాహంతో ఉండాలి. ఖురాన్ గ్రంథం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ఎవరైతే ఒక అక్షరం చదువుతాడో దానికి బదులుగా అల్లాహ్ తబారక వ త’ఆలా పది పుణ్యాలు లభింపజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలు, పదాలు అనేక అక్షరాలతో కూడి ఉన్నాయి. అది చదవంగానే అల్లాహ్ తబారక వ త’ఆలా వారికి ఎంతో విలువైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాని మూలంగా వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం వారికి లభిస్తుంది. కనుక ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, ఒక సూరా వచ్చినా, మొత్తం ఖురాన్ వచ్చినా, నిరంతరంగా చదువుతూ ఉండాలి.
అల్లాహ్ తబారక వ త’ఆలా సూరె ఫుర్ఖాన్ లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రళయ దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సన్నిధిలో అంటారు, “యా రబ్బీ ఇన్న హాజల్ కౌమీత్తఖజూ ఖురాన మహ్జూరా”. ఓ నా ప్రభువా! ఈ నా జాతి వారు ఖురాన్ గ్రంథాన్ని చదవటం విడిచిపెట్టారు. కనుక ఈ స్థితి రాకుండా మనం ఏం చేయాలంటే, ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దాని దాని కారణంగా మనకు మేలు జరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం దొరుకుతుంది.
8. దరూద్
ఎనిమిదో మార్గం ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ త’ఆలా మన సన్మార్గం కోసం పంపించాడు. ఆయన్ని ప్రవక్తగా చేసిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై పెద్ద ఉపకారమే చేశాడు. ఆయన చెప్పకపోతే, ఆయన మార్గాన్ని సూచించకపోతే నిజమైన మార్గం మనకు దొరికేది కాదు. అర్థమయ్యేది కాదు. కనుక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ చదువుతూ ఉండాలి.
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.
ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చదివే దరూద్, పంపే దరూద్ అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించి ఉన్నారు, మీలో ఎవరైతే నాపై ఎక్కువ దరూద్ పంపుతారో, చదువుతారో అతను నాకు సమీపంగా ఉంటాడు. అల్లాహ్ సామీప్యం పొందడానికి ఈ దరూద్ కూడా మనకు తోడ్పాటు అవుతుంది.
9. మంచివారితో స్నేహం
అలాగే తొమ్మిదో మార్గం ఏమిటంటే, మంచి వ్యక్తులతో స్నేహం కలిగి ఉండాలి. స్నేహం అన్నది కేవలం ప్రపంచంలో మనం చెప్పుకుంటా స్నేహం కాదు. సద్వర్తుల స్నేహం. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో, ఎల్లప్పుడూ అల్లాహ్ ని గుర్తు చేస్తూ ఉంటాడో, అల్లాహ్ యొక్క విధేయతను పాటిస్తూ ఉంటాడో, అల్లాహ్ తో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారి యొక్క స్నేహాన్ని మనము చేసుకోవాలి. మనము ఇటువంటి వారిని స్నేహించము. మన జీవిత కాలంలో మనకున్న స్నేహాలు, స్నేహితులు వేరు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే సూచిస్తున్నాడో అది వేరు. కనుక గుర్తుంచుకోవాలి, స్నేహం చేసేటప్పుడు మనలో ఉన్న గుణం ఏమిటి, అది మన స్నేహం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక మంచి మనిషి అల్లాహ్ తో భయపడేవాడు, అల్లాహ్ పట్ల సంతుష్టుడయ్యేవాడు, అల్లాహ్ యొక్క దాసులతో ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు. కనుక మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. దాని మూలంగా వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న కర్మలు మనకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాని ద్వారా మన విశ్వాసం కూడా, ఈమాన్ కూడా పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సన్నిధిలో మనము కూడా ఒక సామీప్యాన్ని పొందగలుగుతాం.
10. దానం చేయడం
పదోది ఏమిటంటే, దానము చేయటం, పేదవారిపై దానము చేయటం. దానం చేయడాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా ఎంతో మెచ్చుకుంటాడు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఏదైతే మీకు నేను ప్రసాదించి ఉన్నానో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టండి పేదవారిపై. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఏదైతే అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించి ఉన్నాడో, అది కొంత అయినా ఎంతైనా సరే, అందులో నుంచి ఖర్చు పెట్టి అల్లాహ్ ప్రసన్నత కోరటం అనేది ఇక్కడ మాట. ఎల్లప్పుడూ అల్లాహ్ తబారక వ త’ఆలా కోసం, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనము దానధర్మాలు చేస్తూ ఉండాలి. దీని మూలంగా అల్లాహ్ యొక్క సామీప్యం మనకు దొరుకుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలు ఎంతో శ్రమపడి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క ప్రసన్నత కోరేవారు. ఒక సందర్భంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రవేశపెట్టారు. వారి స్థితిని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తో అన్నారు, ఓ అబూబకర్! ఇవన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంట్లో ఏమి పెట్టుకున్నావు? ఆయన అన్నారు, ప్రవక్తా! నేను ఇంట్లో అల్లాహ్ మరియు ప్రవక్తను వదిలేసి వచ్చాను.
ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు అల్లాహ్ ప్రసన్నత కోసం అనేక విధాలుగా ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలని.
ఈ పది సూత్రాలు, పది మార్గాలు ఉన్నాయి అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి.
అల్లాహ్ సామీప్యం యొక్క ఫలితం
అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే, అప్పుడు అల్లాహ్ తబారక వ త’ఆలా మా యొక్క ప్రతి మాటను వింటూ ఉంటాడు, మేము కోరేదానికి అల్లాహ్ తబారక వ త’ఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ‘లవ్ అఖ్సమ అలల్లాహి ల అబర్రహ్’. అల్లాహ్ సామీప్యం పొందినవాడు ఎప్పుడైనా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు.
అదే విధంగా మరో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం పొందినవాడు అల్లాహ్ యొక్క స్నేహితుడు అవుతాడు, వలీ అవుతాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క వలీతో ఏదైనా విషయం పట్ల హాని కలిగించినట్లయితే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు, అతను తోనే అతనితో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాను. అల్లాహ్ మిత్రుల పట్ల, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన వారి పట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఏం చెప్తున్నాడంటే, అతనిని నేను మెచ్చుకుంటాను, అతనిని నేను ఇష్టపడతాను, అతను ఏ చేతిలోనైతే పట్టుకుంటుంటాడో ఆ చేతిని నేను అయిపోతాను. ఏ కాలి ద్వారా అయితే అతను నడుస్తూ ఉంటాడో ఆ కాలును నేను అయిపోతాను. ఏ కళ్ళ ద్వారా అతను చూస్తూ ఉంటాడో ఆ కళ్ళు నేను అయిపోతాను. అని ఎంతో ప్రేమతో, ఎంతో ప్రసన్నతతో అల్లాహ్ తబారక వ త’ఆలా చెప్తున్నాడు.
అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే మన యొక్క ప్రతి మాట అల్లాహ్ తబారక వ త’ఆలా వింటాడు. మేము ఏది కోరితే అల్లాహ్ తబారక వ త’ఆలా అది మాకు ప్రసాదిస్తాడు.
కనుక చివరిగా అల్లాహ్ తబారక వ త’ఆలా తో దుఆ ఏమనగా, ఏవైతే మనం విన్నామో ఆ మాటలని గుర్తించి సరైన మార్గంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు ప్రసాదించు గాక. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏవైతే విధిగా చేసి ఉన్నాడో వాటిని ఆచరించి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17147


You must be logged in to post a comment.