జ్యోతిష్యం (Astrology) [వీడియో & టెక్స్ట్]

జ్యోతిష్యం (Astrology)
https://youtu.be/8-736OAwe1A [5 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో జ్యోతిష్యం మరియు భవిష్యవాణి యొక్క నిషేధం గురించి చర్చించబడింది. భవిష్యత్తు మరియు అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ప్రవక్తలకు కూడా ఆ జ్ఞానం లేదని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. జ్యోతిష్కులను సంప్రదించడం మరియు వారి మాటలను విశ్వసించడం ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుందని, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించడంతో సమానమని హెచ్చరించబడింది.

ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 14వ ఎపిసోడ్ లో జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం.

జ్యోతిష్యం అంటే ఇతరుల భవిష్యత్తు గురించి చెప్పడం. కొందరు తమకు కానరాని వాటి గురించి, భవిష్యత్తు గురించి జ్ఞానం ఉందని అంటారు. ఇటువంటి వారిని జ్యోతిష్కుడు, మాంత్రికుడు అని అంటారు.

జ్యోతిష్యం చెప్పడం గురించి ఇస్లాంలో నిషేధించబడింది. అలాగే జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళటం కూడా పాపమే. భవిష్యత్తు మరియు కానరాని విషయాలు అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.

ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అన్ఆమ్ లో ఇలా తెలియజేశాడు,

وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ
(వ ఇందహూ మఫాతిహుల్ గైబి లా య’అలముహా ఇల్లా హువ)
“అగోచర విషయాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ వాటిని ఎరుగరు.” (6:59)

అంటే అగోచర జ్ఞానం, ఇల్మె గైబ్ గురించి అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు. దైవ ప్రవక్తలకు కూడా తెలియదు.

అభిమాన సోదరులారా, ఈ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అ’అరాఫ్ లో ఇలా తెలియజేశాడు,

قُل لَّا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. (7:188)

ఓ దైవ ప్రవక్తా, నువ్వు చెప్పు, అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశిస్తున్నాడు, ఓ దైవ ప్రవక్తా నువ్వు చెప్పు, (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. అల్లాహ్ యే కోరితే తప్ప, స్వయంగా నాకు నేను ఏ లాభమూ చేకూర్చుకోలేను, ఏ నష్టమూ నివారించుకోలేను.”

అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా లాభం చేయటం, నష్టం చేకూర్చటం అనే అధికారం లేదు. అలాగే, నాకే గనక,

وَلَوْ كُنتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే. (7:188)

అని ఈ ఆయత్ లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఎన్నో సందర్భాలలో సమస్యలు వచ్చాయి, నష్టం జరిగింది. ఒకవేళ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి అగోచర జ్ఞానం ఉండి ఉంటే, ఇల్మె గైబ్ తెలిసి ఉంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ కష్టాలు వచ్చేవి కావు.

కావున, జ్యోతిష్యం అనేది తర్వాత జరగబోయే విషయాలు, అగోచర జ్ఞానం ఉందని, కానరాని విషయాలు చెప్తారని, ఆ విద్య ఉందని, అది నమ్మటము, అలా చెప్పటము, అది ఇస్లాం ధర్మంలో హరామ్, అధర్మం. ఇది కేవలం ఇల్మె గైబ్ అనేది అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.

అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జ్యోతిష్యం గురించి ఇలా తెలియజేశారు,

مَنْ أَتَى كَاهِنًا، أَوْ عَرَّافًا، فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ صلى الله عليه وسلم
“ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటల్ని నమ్మితే, జ్యోతిష్యుని దగ్గరికి పోయి ఆ జ్యోతిష్కుడు చెప్పే మాటలు నమ్మితే, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన వాటిని తిరస్కరించిన వాడవుతాడు.”

అంటే ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని నమ్ముతాడో, అతను చెప్పిన మాటల్ని నమ్ముతాడో, ఆ వ్యక్తి వాస్తవానికి ఏం చేస్తున్నాడు, అంతిమ దైవ ప్రవక్తపై అల్లాహ్ ఏది అవతరింపజేశాడో, వహీని, ఖుర్ఆన్ ని దాన్ని తిరస్కరించినట్టు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో స్పష్టంగా తెలియజేశారు.

అభిమాన సోదరులారా, కావున మన సమాజంలో అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం, పోయి చేతులు చూపించి, ఏదో చూపించి, నష్టం జరుగుతుందని, రాబోయే కాలంలో ఏం జరుగుతుందని వివరించుకుంటారు. ఇది హరామ్, ఇస్లాం ధర్మంలో దీన్ని ఖుర్ఆన్ మరియు హదీసులో చాలా కఠినంగా ఖండించడం జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ పాపం నుంచి కాపాడు గాక. సరైన మార్గాన్ని చూపించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

ధర్మ సమ్మతమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ధర్మ సమ్మతమైన వసీలా [వీడియో]
https://youtu.be/aOiweVwQqFA [14 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్‌కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్‌కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్‌తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ
(అల్ హందులిల్లాహి వహ్ దహు)
అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు)
ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:

وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ
(వబ్తగూ ఇలైహిల్ వసీల)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.

అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.

అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.

ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.

ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)

మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.

ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.

ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.

మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:

فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ
(ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక)
అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)

ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.

నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:

أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
(అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్)
నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)

అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.

అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:

قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي
(ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ)
“నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)

అభిమాన సోదరులారా, ఇది ఐదవది.

ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.

దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.

కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.

  • మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
  • రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
  • మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
  • నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
  • ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
  • ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.

ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

అల్లాహ్ యేతరులపై ప్రమాణం (ఒట్టు) చేయడం ధర్మ సమ్మతమేనా? [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం ధర్మ సమ్మతమేనా?
https://youtu.be/FpPJtYzHKHQ [12 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఉపన్యాసంలో, ఇస్లాంలో ప్రమాణం (ఒట్టు) చేయడానికి సంబంధించిన నియమాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. అల్లాహ్ యేతరులపై, అంటే ప్రవక్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కాబా లేదా ఇతర సృష్టితాలపై ప్రమాణం చేయడం ఇస్లాంలో ఘోరమైన పాపం మరియు షిర్క్ (బహుదైవారాధన) అని స్పష్టం చేయబడింది. అవసరమైతే, కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే నిజాయితీతో ప్రమాణం చేయాలని, లేకపోతే మౌనంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హదీసుల ద్వారా తెలియజేయబడింది. అబద్ధపు ప్రమాణాలు చేయడం, ముఖ్యంగా అల్లాహ్ పేరు మీద చేయడం కూడా మహా పాపమని హెచ్చరించబడింది. అంతిమంగా, ఈ షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండాలని మరియు అల్లాహ్ బోధనలను మాత్రమే అనుసరించాలని ఉద్బోధించబడింది.

అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్

అభిమాన సోదరులారా! “ధర్మ అవగాహనం” అనే ఈ ఎపిసోడ్ లో మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం,

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమా, కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

కొన్ని సందర్భాలలో మనకు ప్రమాణం చేసే అవసరం వస్తుంది. మనము చెప్పే మాట సత్యమని, నిజమని చెప్పటానికి, మనం చెప్పే మాటను బలపరచటానికి, లేదా అవతలి వ్యక్తి మా మాటను నమ్మటం లేదని వారిని నమ్మించటానికి, లేదా ఏదో ఒక సందర్భంలో గొడవపడితే, “నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను, అలా చేయలేదు, ఇలా చేశాను” అని రుజువు చేయటానికి, లేదా ఏదో ఒక వాగ్దానం నెరవేర్చటానికి, బలపరచటానికి, “అల్లాహ్ సాక్షిగా నేను ఈ పని చేస్తాను” అని ఇలా కొన్ని కారణాల వల్ల మనిషి ప్రమాణం చేస్తాడు.

మనం సమాజంలో చూస్తాము, కొంతమంది సృష్టిరాశుల మీద ప్రమాణం చేస్తారు. అది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్త మీద ప్రమాణం, కాబతుల్లా మీద ప్రమాణం, మస్జిద్ సాక్షిగా మస్జిద్ మీద ప్రమాణం, దైవదూతల మీద ప్రమాణం, తాత ముత్తాతల మీద ప్రమాణం, ఆత్మల మీద ప్రమాణం, తల మీద ప్రమాణం, “నా తలపైన పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను,” “నా బిడ్డ తలపైన చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” “అమ్మ తలపైన పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” ఫలానా సమాధి మీద ప్రమాణం చేస్తున్నాను, వారి నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను, ఇలా అనేక విధాలుగా సృష్టి రాశులపై, దైవేతరులపై, అల్లాహ్ పైన కాకుండా, అల్లాహ్ మీద కాకుండా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, గురువులు, సమాధులు, కాబా, మస్జిద్ ఏదైనా సరే దైవేతరుల మీద ప్రమాణం చేయటం ఇది ఇస్లాం పరంగా అధర్మం. ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ అని మనకు తెలుస్తుంది ఖురాన్ మరియు హదీసులు పరిశీలిస్తే.

ప్రమాణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడైతే అప్పుడు, ఎవరి మీద అంటే వారి మీద చేయకూడదు, తప్పు, చాలా తప్పు.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ اللَّهَ تَعَالَى يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ
(ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం అన్ తహ్లిఫూ బి ఆబాయికుం ఫమన్ కాన హాలిఫన్ ఫల్ యహ్లిఫ్ బిల్లాహి అవ్ లియస్ముత్)
నిశ్చయంగా అల్లాహ్, మీరు మీ తండ్రి తాతల మీద ప్రమాణం చేయడాన్ని నిషేధించాడు. కనుక ఎవరైనా ప్రమాణం చేయదలిస్తే అల్లాహ్ మీదనే చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. (ముత్తఫకున్ అలై – బుఖారీ మరియు ముస్లిం)

ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథములో ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని అల్లాహ్ వారించాడు.” ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం – అల్లాహ్ ఖండించాడు, అల్లాహ్ నిషేధించాడు, అల్లాహ్ వారించాడు మీరు మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని, అంటే చేయవద్దండి అని అర్థం.

ఫమన్ కాన హాలిఫన్ – ఒకవేళ ప్రమాణం చేయదలచుకుంటే ఆ అవసరం వచ్చింది. ఏదో ఒక తగాదాలో, గొడవలో, ఏదో ఒక సందర్భంలో, విషయంలో తప్పనిసరిగా ప్రమాణం చేసే అవసరం వచ్చింది, ప్రమాణం చేయదలచుకుంటున్నారు, అటువంటి సమయంలో ఫల్ యహ్లిఫ్ బిల్లాహ్ – అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయండి, అవ్ లియస్ముత్ – లేకపోతే ఊరుకోండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే, ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, ఊరుకుండాలి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, యొక్క ప్రవచనం ఇది.

అలాగే ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ
(లా తహ్లిఫూ బిత్తవాగీ వలా బి ఆబాయికుం)
మీరు తాగూత్ (దైవేతర శక్తులు) మీద ప్రమాణం చేయకండి, మీ తండ్రి తాతల మీద కూడా ప్రమాణం చేయకండి.

మీరు మీ తాత ముత్తాతల మీద, మీరు మీ, మీరు విగ్రహాల మీద, దైవేతరుల మీద ప్రమాణం చేయకండి. “తవాగీ” ఇది బహువచనం తాగూత్ కి. తాగూత్ అంటే అల్లాహను తప్ప ఎవరిని ఆరాధిస్తున్నామో అది తాగూత్ అవుతుంది. అల్లాహ్ కాక ఎవరిని ఆరాధన దైవాలుగా భావించుకున్నారు, అది తాగూత్ కిందికి వస్తుంది. సమాధి పూజ చేస్తే సమాధి తాగూత్, ఒక చెట్టుకి పూజిస్తే ఆ చెట్టు తాగూత్. చనిపోయిన ప్రవక్తలను, ఔలియాలను, పుణ్య పురుషులను పూజిస్తే అది తాగూత్. అల్లాహ్ ను కాక ఎవరిని పూజిస్తే అది తాగూత్ అవుతుంది. అంటే, లా తహ్లిఫూ బిత్తవాగీకి అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఏ వస్తువు పైనా, ఏ వ్యక్తి పైనా, ఏ ఇతరుల మీద కూడా ప్రమాణం చేయకండి. వలా బి ఆబాయికుం – మీ తాత ముత్తాతల మీద కూడా ప్రమాణం చేయకండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, అంతేకాదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا
(మన్ హలఫ బిల్ అమానతి ఫలయ్స మిన్నా)
ఎవరైతే అమానత్ (విశ్వసనీయత/నిజాయితీ) మీద ప్రమాణం చేస్తాడో, అతను మా పద్ధతిని అనుసరించిన వాడు కాదు.

ఎవరైతే నిజాయితీ మీద ప్రమాణం చేస్తాడో, వాడు ముస్లిం పద్ధతిని అనుసరించట్లేదు అని అర్థం. ఫలయ్స మిన్నా – మావాడు కాదు, మాలోని వాడు కాదు.

అభిమాన సోదరులారా, అంతే, ఇది ఎంత చిన్న విషయం కాదు. మనం చూస్తూ ఉంటాము మాటిమాటికీ, చీటికిమాటికి ప్రమాణం చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ప్రమాణం చేసేస్తాం. అది కూడా దైవేతరుల పైన మీద – అమ్మ మీద ఒట్టు, నా బిడ్డ మీద ఒట్టు, నా తల మీద ఒట్టు, తలపైన చెయ్యి పెట్టుకొని, పిల్లలపైన చెయ్యి పెట్టుకొని. ఇది మహా పాపం. అధర్మం, అన్యాయం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.

చివరికి నిజాయితీ మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ పేరు మరియు ఆయన గుణగణాల తప్ప, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క గుణగణాల తప్ప ఇతర ఏ విషయం మీద కూడా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం అది. “నా నిజాయితీ మీద, నీ నిజాయితీ మీద, వారి నిజాయితీ మీద ఒట్టు, ప్రమాణం చేసి చెప్తున్నాను” అంటే నిజాయితీ ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం. మరి ఆ ఆదేశం మీద ఒట్టు, ప్రమాణం చేస్తే, అది అల్లాహ్ యొక్క గుణగణాలకి పోల్చినట్లు అవుతుంది.

అభిమాన సోదరులారా, ప్రమాణం అనేది, ఒట్టు అనేది దీనికి అరబీలో, ఉర్దూలో “ఖసమ్” అంటారు. ఇది కేవలం అల్లాహ్ మీదనే. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తగాబున్, ఆయత్ 7లో ఇలా సెలవిచ్చాడు:

قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ
(ఖుల్ బలా వ రబ్బీ లతుబ్’అసున్న)
(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు” (64:7)

అంటే చనిపోయిన జీవితం, మరణానంతర జీవితం, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు లేపుతాను, మీరు లేపబడతారు. ఆ విషయం చెప్పటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు, ఖుల్ – ఓ ప్రవక్తా, ఇలా అను. బలా వ రబ్బీనా ప్రభువు సాక్షిగా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఏం నేర్పించాడు? ప్రమాణం చేయగలిగితే, ఆ అవసరం పడితే, చేయాలనుకుంటే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి. ఖుల్ బలా వ రబ్బీ – ఓ ప్రవక్తా, వారితో ఇలా అను, “నా ప్రభువు సాక్షిగా లతుబ్’అసున్న – మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు.” అంటే కొందరికి విశ్వాసం ఉండదు, మరణానంతర జీవితంపై. అది వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ అది. మీరు చనిపోయిన తర్వాత లేపబడతారు. సుమ్మ లతునబ్బ’ఉన్న బిమా అమిల్తుం – మీరు ఏం చేశారో మీ కర్మలు, మంచి చెడు మొత్తం మీ ముందర ఉంచడం జరుగుతుంది. అల్లాహ్ చూపిస్తాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పాపం చేశాడా, పుణ్యం చేశాడా, తక్కువ, ఎక్కువ, న్యాయం, అన్యాయం మొత్తం మన జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు చూపిస్తాడు మరియు మన ఆ కర్మల పరంగానే మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో తెలియజేశాడు. అంటే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. దైవేతరుల మీద, అల్లాహ్ యేతరుల మీద ప్రమాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ
(మన్ హలఫ బి గైరిల్లాహి ఫఖద్ అష్రక)
ఎవరైతే అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేశాడో, అతను షిర్క్ చేశాడు.

అల్లాహు అక్బర్! ప్రమాణం అనేది అంత పెద్దది. ఒక ముఖ్యమైన విషయంలో ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. అది కూడా ప్రమాణం నిజం ఉండాలి, సత్యం ఉండాలి. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన కూడా చేయకూడదు. ఇతరులకి మోసం చేయటానికి కొందరు ఒక వస్తువు అమ్మటానికి అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన చేస్తారు. ఇది కూడా మహా పాపం. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ మీద కూడా చేయకూడదు. నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం అనే విషయంలో ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్, కుఫ్ర్, బిద్అత్ నుండి కాపాడుగాక, రక్షించుగాక! అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రములు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు, ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి? [ఆడియో]

భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు,
ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి?
https://youtu.be/HORMsPWKEDQ [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, భర్త నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయెత్తులు వేసుకుంటూ, దర్గాల వద్దకు వెళ్తూ షిర్క్ చేస్తున్నప్పుడు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారం జీవించాలనుకునే భార్య అతని నుండి ఖులా (విడాకులు) తీసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. దర్గాలకు వెళ్లడం, తాయెత్తులు ధరించడం వంటివి షిర్క్ వరకు తీసుకెళ్లే తీవ్రమైన పాపాలని, ఖురాన్ ఆయతుల ఆధారంగా వివరించబడింది. ముఖ్యంగా అల్లాహ్ ను కాకుండా ఇతరులను ప్రార్థించడం, ఇతరులకు సజ్దా చేయడం స్పష్టమైన షిర్క్. అలాగే, నమాజును నిర్లక్ష్యం చేయడం లేదా వదిలివేయడం కూడా చాలా పెద్ద పాపమని, అది కుఫ్ర్ వరకు వెళ్ళవచ్చని హెచ్చరించబడింది. భర్త ఈ పాపాలనుండి పశ్చాత్తాపపడకపోతే, భార్య ఖులా తీసుకోవడం ధర్మసమ్మతమని పండితులు అభిప్రాయపడతారని, అయితే ఓపికతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చని, కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇవ్వబడింది.

భర్త ఏ మాత్రం నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయీజులు వేసుకుంటూ దర్గాల వద్దకు వెళ్తూ ఉంటాడు. భార్య ఇస్లాం యొక్క ప్రేమికురాలు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది. అయితే ఆ భర్త, ఆ భర్త నుండి ఖులా తీసుకోవడానికి, వేరుకోవడానికి ఇస్లాంలో ఏదైనా అనుమతి ఉందా అని మీరు అడిగారు.

వాస్తవానికి చూసేది ఉంటే, మనిషి దర్గాలకు వెళ్లి అక్కడ అల్లాహ్ కు చేయబడే అటువంటి కొన్ని ఆరాధనలు అక్కడ చేస్తున్నాడు, తాయీదులు వేసుకుంటున్నాడు, ఇవి రెండూ కూడా షిర్క్ వరకు తీసుకెళ్లే పాపాలు.

దర్గా కాడికి వెళ్లి డైరెక్ట్ దర్గా వారితో దుఆ చేస్తే, దర్గా వారికి సజ్దా చేస్తే, అల్లాహ్ అలాంటి పరిస్థితి నుండి మనందరినీ కాపాడుగాక, షిర్క్ చేసినవాడైపోతాడు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు.

وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ
(వస్ జుదూ లిల్లా హిల్లాజి ఖలకహున్)
వాటిని సృష్టించిన అల్లాహ్‌కే సాష్టాంగపడండి. (41:37)

భూమి ఆకాశాలు, సూర్య చంద్రాలు ఇంకా ఈ సృష్టి అంతటినీ సృష్టించిన ఆ ఏకైక అల్లాహ్ కు మాత్రమే మీరు సజ్దా చేయండి.

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ కాల రబ్బుకుముద్ ఊని అస్తజిబ్ లకుం)
మీ ప్రభువు అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)

మీ ప్రభువు మీతో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను మాత్రమే అర్థించండి, నాతో మాత్రమే దుఆ చేయండి, నేను మీ దుఆలను అంగీకరిస్తాను.

ఇంత స్పష్టమైన ఆయతులు ఉన్నప్పటికీ మనిషి దర్గాల కాడికి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే స్పష్టమైన షిర్క్ కు గురి అవుతున్నాడు. ఇక ఆ మనిషి అల్లాహ్ ను నమ్ముతూ, ప్రవక్తను నమ్ముతూ, పరలోక దినాన్ని నమ్ముతూ నమాజులు చేస్తూ ఇదే పెద్దలు చేసిన్లు మా ఊర్లో, నేను ఎక్కడా ఇంకా బయటికి వెళ్ళలేదు ఏమీ వేరేది చూడలేదు, దీనినే నిజమైన ఆరాధన అనుకుంటున్నాను అన్నటువంటి భ్రమలో ఉండి ఉంటే, అల్లాహ్ అలాంటి వ్యక్తితో ఎలా మసులుకుంటాడో కరుణాకటాక్షాలతో లేదా ఇంకా వేరే ఏదైనా పరీక్ష తీసుకుంటాడా అది వేరే విషయం. కానీ ఈనాటి కాలంలో నెట్ ద్వారా, మొబైల్ ల ద్వారా సత్యం అనేది ఎంత ప్రస్ఫుటమవుతుంది, అయినా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇలాంటి షిర్క్ పనికి లోనవుతూ ఉంటే ఇది చాలా భయంకరమైన విషయం.

భార్య వాస్తవానికి ఇస్లాం ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది అంటే ముందు భర్తను ఇలాంటి షిర్క్ పనుల గురించి ప్రేమగా, మంచి విధంగా, ఆధారాలు చూపుతూ ఇవి తప్పు అని తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి.

దీనిపై ఇంకా తాయీదులు వేసుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో దర్గాల వద్ద నుండి వేరే కొందరు మౌల్సాబుల నుండి ఏదైతే తాయీదులు ఇవ్వడం జరుగుతున్నాయో, సర్వసాధారణంగా ప్రజలు ఆ తాయీదుల మీదనే మొత్తం నమ్మకం ఉంచుతున్నారు. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎందరితోనో మనం మాట్లాడి, ఎంతో ప్రేమగా దీని గురించి చెప్పి తీయించాలని ప్రయత్నం చేస్తే, అయ్యో వద్దండి వద్దండి ఇది తీసేస్తుంటే ఖలాస్ ఇక నా ప్రాణం పోతది, లేదు నాకు మళ్లీ కడుపునొప్పి మొదలైపోతది, ఇక ఇది తీసేది ఉంటే నేను మళ్ళీ అనారోగ్యానికి గురైపోతాను అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం ఒక చిన్న సబబుగా అల్లాహ్ యే షఫా ఇచ్చేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం లేదు. దీనిమీదనే, ఈ తాయీదుల మీదనే నమ్మకం ఉన్నది. మరి ఇలాంటి ఈ నమ్మకాన్ని కూడా పెద్ద షిర్క్ లో పడవేసేది అని ఖురాన్ హదీస్ ఆయతుల ద్వారా ధర్మ పండితులు చెప్పి ఉన్నారు.

దీనికంటే కరేలా నీమ్ చడా అన్నట్టుగా ఇంకా ఘోరమైన విషయం మీరు తెలిపింది ఏమిటంటే ఆ భర్త నమాజుకు ప్రాముఖ్యత ఏమీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. అదేమిటంటే నమాజుకు ఏదైనా ఎప్పుడైనా బద్ధకంతో వెళ్లకపోతే అదే చాలా ప్రమాదకరమైన విషయం అని ఖురాన్ హదీసులో చెప్పడం జరిగింది.

ఉదాహరణకు మీరు గమనించండి, ఒక చిన్న సూరాలో అంటే సూరతుల్ మాఊన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

فَوَيْلٌ لِلْمُصَلِّينَ
(ఫ వైలుల్ లిల్ ముసల్లీన్)
వయిల్ (అధోలోకం) ఉన్నది ఆ నమాజీల కొరకు, (107:4)

الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ
(అల్లజీనహుం అన్ సలాతిహిం సాహూన్)
ఎవరయితే తమ నమాజుల పట్ల ఏమరుపాటుగా ఉంటారో, (107:5)

ఎవరైతే నమాజు బద్ధకంగా చేస్తున్నారో, టైం యొక్క సమయపాలన లేకుండా, రుకున్ వాజిబాత్ ఇంకా సున్నత్ ప్రకారంగా చేయకుండా, ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాడు లేదా అంటే వదిలేస్తున్నాడు, ఇలా బద్ధకంగా చేసే వారి గురించే వినాశకరమైన వైల్ ఉన్నది అని అల్లాహ్ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరైతే దానికి ప్రాముఖ్యతనే ఇవ్వరో, అయ్యో నమాజ్ చదవాలి అన్నటువంటి మనసులో ఒక తపన లేనే లేదో వారు ఇంకా ఎంత భయంకరమైన పాపములో పడి ఉన్నారో గమనించండి.

అయితే ఇలాంటి భార్య అతని నుండి ఆ భర్త నుండి ఖులా తీసుకోవచ్చా? ఎంతోమంది ధర్మపండితులు చెప్పే విషయం ఏమిటంటే ఇలాంటి షిర్క్ మరియు నమాజును వదిలేటువంటి కుఫ్ర్ పని నుండి అతను తోబా చేయకుంటే తప్పకుండా భార్య ఖులా తీసుకోవాలి.

కానీ మన చోట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ భార్య ఇంకా దావత్ ఇస్తూ, భర్తకు నచ్చజెప్పుతూ ఓపిక కొంచెం వహించింది అంటే ఒకరకంగా మంచిది కావచ్చు. కానీ అలాగే ఉండిపోవడం, ఆ భర్త అంటే ఆమె పిల్లల యొక్క తండ్రి యొక్క శిక్షణలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు అనే విషయంలో భార్య తప్పకుండా భయపడాలి. అల్లాహ్ తో అధికంగా దుఆ చేయాలి, అధికంగా దుఆ చేయాలి. అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. ఇస్లాంపై స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక.


తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

సర్వ సత్కార్యాలను నశింపజేసే దుష్కార్యం [ఆడియో]

సర్వ సత్కార్యాలను నశింపజేసే దుష్కార్యం [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/LP5FGVGsz_o [7 నిముషాలు]

అల్లాహ్ కి సాటి కల్పించటం (షిర్క్) 

అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారికి హెచ్చరిక [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజెయ్యబడింది)
https://youtu.be/IjbFjYK0z3c [10 నిముషాలు]

18:4 وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).

18:5 مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.

ఈ ప్రసంగంలో, అల్లాహ్‌కు సంతానం ఉందని చెప్పేవారిని హెచ్చరించమని ఆదేశించే ఖురాన్ (సూరహ్ అల్-కహఫ్, ఆయత్ 4-5) ఆయతులపై వివరణ ఇవ్వబడింది. ఇది ఎటువంటి జ్ఞానం లేదా ఆధారం లేని తీవ్రమైన పాపమని, కేవలం అజ్ఞానంతో పలికే మాట అని వక్త నొక్కిచెప్పారు. యూదులు, క్రైస్తవులు, మక్కా ముష్రికులు గతంలో ఇలాంటి వాదనలు చేశారని ఉదహరించారు. దీనికి విరుద్ధంగా, అల్లాహ్‌కు తల్లిదండ్రులు, భార్య లేదా సంతానం లేరని, ఆయన ఏకైకుడని సూరహ్ అల్-ఇఖ్లాస్ స్పష్టం చేస్తుందని తెలిపారు. ఈ సత్యాన్ని ఇతరులకు తెలియజేయడం (దావత్) ప్రతీ ముస్లిం బాధ్యత అని, దీనికోసం కనీసం సూరహ్ అల్-ఇఖ్లాస్ మరియు ఆయతుల్ కుర్సీ యొక్క భావాన్ని తెలుసుకుని చెప్పినా సరిపోతుందని అన్నారు. అయితే, ఇతరుల వాదన ఎంత మూర్ఖంగా ఉన్నప్పటికీ, వారితో మృదువుగా, గౌరవప్రదంగా సంభాషిస్తూ దావత్ ఇవ్వాలని, ఈ పద్ధతులను తెలుసుకోవడం తప్పనిసరి అని బోధించారు.

وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
వయున్దిరల్లదీన ఖాలుత్తఖదల్లాహు వలదా
ఈ ఖురాన్ ద్వారా (యున్దిర్) హెచ్చరించాలి.

ఎవరికి హెచ్చరించాలి?

الَّذِينَ قَالُوا
అల్లదీన ఖాలూ
ఎవరైతే అన్నారో, చెప్పారో

اتَّخَذَ اللَّهُ وَلَدًا
ఇత్తఖదల్లాహు వలదా
నవూజుబిల్లాహ్. అల్లాహ్ తన కొరకు సంతానం చేసుకున్నాడు అని ఎవరైతే అంటున్నారో, అలాంటి వారిని కూడా మీరు ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించాలి.

ఇక మీరు ఈ ఆయతును గమనించండి. మనం ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నామా?

అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఈ ఖురాన్ ద్వారా మీరు వారిని హెచ్చరించండి – “మీకు జ్ఞానం లేని మాటలు అల్లాహ్ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? అల్లాహ్ ఎవరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు. అల్లాహ్ ఎవరినీ కూడా తనకు భార్యగా చేసుకోలేదు”

యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. మక్కా యొక్క ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అని అనేవారు. మరియు ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, మహేశ్వరుడు అన్నటువంటి పదాలు ఆ ఏకైక సృష్టికర్త గురించే మేము అంటున్నాము అని అంటారు. కానీ మళ్ళీ ఆ సృష్టికర్తకు సంతానాలు ఉంటాయి. ఆ సృష్టికర్తకు ఎందరో భార్యలు ఉంటారు. అంతేకాదు, వాళ్ళ యొక్క దేవుళ్ళ సంగతి ఎలా అంటే, పెద్ద దేవుడు కొన్ని సందర్భాల్లో చిన్న దేవుళ్ళపై కోపగించి వారిపై శాపం కూడా కురిపిస్తాడు మరియు శాపం పడిన వారిని కరుణించి వరాలు కూడా కురిపిస్తాడు. ఈ విధంగా ఎన్నో విచిత్ర సంఘటనలు మనం వింటూ చూస్తూ ఉన్నాము.

నిజంగా, వాస్తవంగా మనందరి సృష్టికర్త ఎవరు అంటే, అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, సంతాన భార్య లేదు, సంతానమూ లేరు, అతనికి ఏ కుటుంబము, పరివారము అని లేరు.

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ﴿١﴾ اللَّهُ الصَّمَدُ ﴿٢﴾ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ﴿٣﴾ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ﴿٤﴾
ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్-సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్

(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. (సూరా అల్ ఇఖ్లాస్)

మనందరికీ ఈ సూరా గుర్తుంటుంది కదా. దీని యొక్క అనువాదం తెలుసుకొని ప్రేమగా ఒక్కసారైనా గానీ మనం మన చుట్టుపక్క ఉన్నటువంటి బహుదైవారాధకులకు, అవిశ్వాసులకు, సత్య తిరస్కారులకు, అల్లాహ్‌తో పాటు వేరే వారిని పూజించే వారికి ఈ సూరత్ యొక్క అనువాదం మనం వినిపించాలి.

ఈ రోజుల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు. మేము మేము అవిశ్వాసులకు దావత్ ఇవ్వాలి అని అనుకుంటాము, కానీ మాకు ఎక్కువ జ్ఞానం ఏమీ లేదు. ఎలా వారికి దావత్ ఇవ్వాలి? చూడండి, దావత్ యొక్క విషయం కొన్ని సందర్భాలలో, కొన్ని సందర్భాలలో ఇది లోతైన జ్ఞానం, చాలా పటిష్టమైన ఆధారాలతో కూడిన జ్ఞానం కూడా అవసరం ఉంటుంది. మరెన్నో సందర్భాలలో కేవలం ఖుల్ హువల్లాహు అహద్ ఈ మొత్తం సూరా మరియు ఆయతుల్ కుర్సీ, ఆయతుల్ కుర్సీ మీకు గుర్తు ఉంది అంటే దాని అనువాదం చూసుకోండి. ఆయతల్ కుర్సీలో 10 విషయాలు అల్లాహ్ ఏకత్వం గురించి తెలుపబడ్డాయి. మీరు దాని యొక్క అనువాదం కనీసం తెలియజేశారు అంటే ఎంతో ఒక గొప్ప సత్యాన్ని, మీరు సత్కార్యాల్లో చాలా ఉన్నత శిఖరానికి చెందిన ఒక సత్కార్యం గురించి ప్రజలకు బోధించిన వారు అవుతారు.

అయితే ఈ లోకంలో చూడటానికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారు, ఎంతో తమకు తాము మేధావులు అనుకునేవారు నిజ సృష్టికర్త అయిన అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారంటే, ఆ తర్వాత ఆయతు నంబర్ ఐదు చదవండి.

నవూజుబిల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లాహ్. అల్లాహ్‌కు సంతానం ఉంది అని ఎవరైతే అంటున్నారో, ఈ మాట చెప్పడానికి వారి నోరు ఎలా విప్పారు?ఎందుకంటే:

مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ
మా లహుమ్ బిహీ మిన్ ఇల్మ్
వారికి దీని గురించి ఎలాంటి జ్ఞానం లేదు

وَلَا لِآبَائِهِمْ ۚ
వలా లిఆబాఇహిమ్
ఇలాంటి మాట పలికిన వారి తాత ముత్తాతలకు కూడా ఈ జ్ఞానం నిజ జ్ఞానం లేదు.

ఈ మాట ఎంత భయంకరమైనదో తెలుసా? ఎంత ఘోరమైనదో తెలుసా?

كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ
కబురత్ కలిమతన్ తఖ్రుజు మిన్ అఫ్వాహిహిమ్
వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది.

ఖురాన్‌లో వేరే కొన్ని సందర్భాలలో అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు?

تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ
తకాదుస్-సమావాతు యతఫత్తర్న
అల్లాహ్‌కు సంతానం ఉన్నది అని వారు పలికే మాట ఎంత చెండాలమైనది, ఎంత తప్పు మాట, ఎంత దారుణమైనది అంటే భూమ్యాకాశాలు బ్రద్దలైపోతాయి.

ఎందుకంటే ఈ మానవుడు మరియు జిన్నాతులలో షైతానులు తప్ప సర్వ సృష్టి అల్లాహ్ ఏకత్వాన్ని నమ్ముతుంది.

وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ద్, తౌఅన్ వ కర్హా, వ ఇలైహి యుర్జాఊన్
ఆకాశాల్లో, భూమిలో ఉన్న సమస్తము కూడా అల్లాహ్‌కు మాత్రమే వారు ఇస్లాం ముస్లింలుగా ఉన్నారు.

అస్లమ అంటే వారు విధేయులై ఉన్నారు. శిరసావహించి ఉన్నారు. అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మి ఉన్నారు. అల్లాహ్ యొక్క ఏకత్వంలో వారు ఏమాత్రం భాగస్వామి కలగజేయరు. కానీ సర్వ సృష్టిలో అతి ఉత్తముడైన ఈ మానవుడే అల్లాహ్ పట్ల ఎంతటి అబద్ధపు మాట పలుకుతున్నాడో అల్లాహ్ స్వయంగా చెప్పాడు:

إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
ఇన్ యఖూలూన ఇల్లా కదిబా
వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.

అయితే ఇక్కడ ఒక సత్యం మీరు తెలుసుకోండి. ఖురాన్ చదువుతూ ఉంటాము కానీ మనం అర్థం చేసుకో చేసుకుంటూ ఉండము. అందుకొరకే ఎన్నో విషయాలు పై నుండే మనకు దాటిపోతూ ఉంటాయి.

ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో స్వయం వారి వద్ద ఈ షిర్క్ గురించి ఎలాంటి ఆధారం లేదు. వారు చెబుతున్న ఈ మాట ఎలాంటి సత్యంతో కూడినది కాదు. అల్లాహ్‌కు వేరే భాగస్వాములు ఉన్నారు, సంతానం ఉంది అని అనడం ఇది అజ్ఞానంతో, మూర్ఖత్వంతో కూడిన మాట.

అందుకొరకే ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హా బ్ రహిమహుల్లాహ్ యొక్క మనమడు కితాబు తౌహీద్ యొక్క వ్యాఖ్యానం ఏదైతే రాశారో అందులో ఒక మాట ఇది కూడా చెబుతున్నారు ఆరంభంలోనే. – “ఎవరు ఎంత పెద్ద ప్రపంచపు చదువులు చదివినా, అల్లాహ్‌తో పాటు ఇతరులను సాటి కలుపుతున్నాడంటే అతడు అసలైన జ్ఞానానికి దూరం, అజ్ఞానంలో, మూర్ఖత్వంలో పడి ఉన్నాడు.”

కానీ ఇక్కడ వారి ఆ మాట మూర్ఖత్వంతో కూడినది. కానీ వారికి దావత్ ఇచ్చే విషయంలో, సందర్భంలో మనం ప్రతి ఒక్కరితో వారి యొక్క తగిన స్థానానిని, వారి యొక్క ఏ హోదా అంతస్తు ఉందో ఈ లోకంలో వారిని గౌరవిస్తూ, గౌరవిస్తూ అంటే వారితో ఎలా సంభాషించాలి, ఎలా మాట్లాడాలి, దావత్ ఇచ్చే విషయంలో ఎలా మనం వారిని మృదు వైఖరితో, తీపి మాటతో మాట్లాడాలి ఆ విషయాలు కూడా మనం తెలుసుకొని ఉండడం తప్పనిసరి.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)- యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1Ham7KTDLUrhABquy8NoCa

అత్యంత పెద్ద నేరం, పాపం? – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

అత్యంత పెద్ద నేరం, పాపం?
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0m0vDeE36Cw [21 నిముషాలు]

ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం మరియు నేరం అనే అంశంపై దృష్టి సారించారు. సాధారణంగా ప్రజలు హత్య లేదా అత్యాచారం వంటి నేరాలను అతిపెద్దవిగా భావిస్తారని, కానీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం, అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడమే (షిర్క్) అన్నింటికన్నా పెద్ద పాపమని వక్త వివరిస్తారు. షిర్క్ యొక్క తీవ్రమైన పరిణామాలను, అంటే చేసిన మంచి పనులన్నీ వృధా కావడం, స్వర్గం నిషేధించబడటం మరియు నరకంలో శాశ్వత శిక్ష వంటి వాటిని ఖురాన్ ఆయతుల ద్వారా ఉటంకిస్తారు. ఇంకా, షిర్క్ రెండు రకాలుగా ఉంటుందని వివరిస్తారు: షిర్క్-ఎ-అక్బర్ (పెద్ద షిర్క్), ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, మరియు షిర్క్-ఎ-అస్గర్ (చిన్న షిర్క్). చిన్న షిర్క్‌లో అల్లాహ్ తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయడం, తాయెత్తులు కట్టడం, మరియు రియా (ప్రదర్శన కోసం ఆరాధనలు చేయడం) వంటివి ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలియజేస్తారు. ప్రతి ముస్లిం ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలని, తన ఆరాధనలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని వక్త ప్రబోధిస్తారు.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్ లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ]
(ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కొరకు విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను సులభంగా అర్థం చేసుకునేటట్లు చెయ్యి.) (20:25-28)

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం, షిర్క్ ఒక పెద్ద నేరం.

అభిమాన సోదరులారా, సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి? పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ధర్మజ్ఞానము లేని వారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే, ప్రజల ప్రాణాలు హరించటం పెద్ద నేరం అని సమాధానం ఇస్తారు. మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలాత్కారాలు చేయటం, అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానం ఇస్తారు. అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయటం, లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు.

నిజం ఏమిటంటే, ఇవన్నీ పెద్ద నేరాలే. కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది. అది బలాత్కారాలు చేయడం కంటే కూడా పెద్ద నేరము, లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము, ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము. ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు, చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకొని ఉన్నారు. ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులారా, షిర్క్! బహుదైవారాధన. అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పించటం. ఇది పాపాలన్నింటిలో, నేరాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము.

అరే! అది అంత పెద్ద పాపం అని మీరు ఎలా చెప్పగలరండీ అని మీరు ప్రశ్నిస్తారేమో? ఇది నా మాట కాదు. నేను నా తరఫున ప్రకటిస్తున్న విషయము కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు.

మనం చూసినట్లయితే, సూరా లుఖ్మాన్‌లోని 13వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
[ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్]
నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం (31:13)

అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు. యా రసూలల్లాహ్, అయ్యు జంబి అక్బరు ఇందల్లాహ్? అల్లాహ్ దృష్టిలో పెద్ద నేరము ఏమిటి? అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపము ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. నీకు పుట్టించిన ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ఇతరులను సాటి కల్పించడం, సహవర్తులుగా నిలబెట్టడం, ఇది నేరాలన్నింటిలో, పాపాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు.

అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రశ్నించారు. ఏమన్నారంటే, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్? ఏమండీ నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము, ఘోరాలలోనే పెద్ద ఘోరము, నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, బలా యా రసూలల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తప్పనిసరిగా దాని గురించి మాకు మీరు తెలియజేయండి అనగా, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, అల్ ఇష్రాకు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టటం, ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము, పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు.

అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబిఖత్. ఏడు ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు. ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం, షిర్క్ చేయటం, ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు.

అభిమాన సోదరులారా! అటు అల్లాహ్ వాక్యము ద్వారా, ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది, అది ఏమిటంటే షిర్క్ చేయటం, బహుదైవారాధన చేయటం, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, ఇది ఘోరమైన నేరం, పెద్ద పాపము అని స్పష్టమయ్యింది.

ఇక రండి, ఈ షిర్క్ చేస్తే, ఈ పాపానికి ఎవరైనా ఒడిగడితే అతనికి జరిగే పరిణామం ఏమిటి? అతనికి జరిగే నష్టం ఏమిటి? అది కూడా మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు. ఎవరైతే షిర్క్‌కు పాల్పడతారో వారి కోసము స్వర్గం నిషేధించబడుతుంది. వారి నివాసం నరకమైపోతుంది. మనం చూసినట్లయితే ఖురాన్‌లోని సూరా మాయిదా 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు. (5:72)

అలాగే అభిమాన సోదరులారా, షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే, అతని సత్కార్యాలు అన్నీ, అతని కర్మలన్నీ, అతని పుణ్యాలు అన్నీ తుడిచివేయబడతాయి. ఖురాన్‌లోని సూరా జుమర్ 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

అల్లాహు అక్బర్. స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడు, ఒకవేళ నీవు గనుక షిర్క్‌కు పాల్పడినట్లయితే, నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకే, అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహా ప్రవక్తకే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడంటే, మీలాంటి, నాలాంటి, మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.

కాబట్టి ఇదే విషయము ఖురాన్‌లోని సూరా అన్ఆమ్ 88వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. (6:88)

ఇక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే, ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షిర్క్‌కు పాల్పడినట్లయితే, బహుదైవారాధనకు గురైనట్లయితే, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించినట్లయితే, వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టమవుతుంది, అదేమిటంటే అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా, సాటిగా నిలబెడతాడో, అతని సత్కార్యాలు అన్నీ అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి.

అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతివేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేమిటంటే సూరా నిసాలోని 48వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్క్‌ను అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు మనిషి చేసి ఉంటే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమించగలడేమో గానీ, షిర్క్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి, అభిమాన సోదరులారా, షిర్క్ పెద్ద నేరము అని, షిర్క్ క్షమించరాని నేరము అని, షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరమైపోతాడు, నరకానికి చేరుకుంటాడని, అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఇంతవరకు విన్న విషయాలలో మనము అర్థం చేసుకున్నాము.

ఇక రండి, షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే, షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరులారా. ఒకటి షిర్కె అక్బర్, రెండవది షిర్కె అస్గర్. షిర్కె అక్బర్ అంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా, అల్లాహ్ దగ్గర చేయవలసిన కార్యాలు అల్లాహ్ వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే, అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్కె అక్బర్ అవుతుంది. మరి షిర్కె అస్గర్ అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.

షిర్కె అస్గర్ రెండు రకాలు. చిన్న షిర్క్ రెండు రకాలు. ఒకటి బహిర్గతంగా కనిపించే షిర్క్, రెండవది కనిపించకుండా రహస్యంగా ఉండే షిర్క్.

బహిర్గతంగా కనిపించే చిన్న షిర్క్ ఏమిటి అంటే అభిమాన సోదరులారా, ఒకటి అల్లాహ్‌ను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయటం. అల్లాహ్‌ను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ జెప్పాలంటే చాలామంది ఏమంటుంటారంటే, నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా తల్లి సాక్షిగా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల సాక్షిగా, నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే అభిమాన సోదరులారా, ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు. ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలే గానీ ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది, చిన్న షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు వినండి, ఆయన తెలియజేశారు: మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర ఔ అష్రక. ఎవరైతే అల్లాహ్ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రుకు పాల్పడినట్లు లేదా షిర్క్‌కు పాల్పడినట్లు.

అలాగే అభిమాన సోదరులారా, చిన్న షిర్క్ యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే, తాయెత్తులు వేలాడదీయటం. చాలామంది చేతుల్లో, మెడలలో, నడుము మీద, కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకొని ఉంటారు. అభిమాన సోదరులారా, తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు, నిషేధమైన కార్యము. ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది, అతను కూడా చిన్న షిర్క్ చేసినట్లు అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లే.

ఇది చిన్న షిర్క్‌లో బహిర్గతంగా కనిపించే షిర్క్.

ఇక రండి అభిమాన సోదరులారా, చిన్న షిర్క్‌లో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక షిర్క్ ఉంది, అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎక్కువగా ఈ షిర్కె అస్గర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండీ, దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన పలుకులు వినండి, అఖ్వఫు మా అఖాఫు అలైకుం అష్షిర్కుల్ అస్గర్. ఖాలూ యా రసూలల్లాహ్ వమష్షిర్కుల్ అస్గర్? ఖాల అర్రియా. అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ చిన్న షిర్క్ గురించి భయమేస్తుంది. దైవ ప్రవక్త ఆ షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, ప్రదర్శనా బుద్ధితో పని చేయటం.

అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, దానధర్మాలు చేస్తున్నాడు, జకాతు చెల్లిస్తున్నాడు, ఉమ్రా హజ్జులు ఆచరిస్తున్నాడు, అయితే అతను అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు గానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముడ్ని, భక్తుడ్ని అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు. ఇలా చేస్తే అభిమాన సోదరులారా, షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది. ఎందుకంటే సత్కార్యాలు, ఆరాధనలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయరాదు. ఎవరైనా ప్రదర్శనా బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లాహ్ ప్రసన్నత కోరుకోవట్లేదు గానీ ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా.

అయితే మన బాధ్యత ఏమిటి? ఇప్పటివరకు మనం షిర్క్ గొప్ప షిర్క్ పెద్ద నేరమని తెలుసుకున్నాము. షిర్క్ రెండు రకాలు, షిర్క్ పెద్దది ఒకటి, చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము. అలాగే పెద్ద షిర్క్‌కి, చిన్న షిర్క్‌కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే అభిమాన సోదరులారా, పెద్ద షిర్క్ చేసిన వారికి నరకశిక్ష విధించబడుతుంది, వారు స్వర్గం నుంచి దూరమైపోతారు, వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి. అయితే చిన్న షిర్క్‌కు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడవు, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాత్కాలిక శిక్షలు వేసి మళ్లీ శిక్షలు ముగిసిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటారో కేవలం ఆ సత్కార్యాలు, ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్‌కి పాల్పడకూడదు. అందుకోసమే మనం చూచినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో, వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్‌కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు.

ఖురాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రస్తావించి ఉన్నాడు. సూరా లుక్మాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుని పిలిచి ఏమంటున్నారంటే, “ఓ కుమారా, నీవు షిర్క్‌కు పాల్పడవద్దు. ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము, ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షిర్క్‌కు పాల్పడవద్దు” అని తెలియజేశారు.

అదేవిధంగా ప్రవక్తలు, ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి, అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధించకండి, అల్లాహ్‌కు ఇతరులను సహవర్తులుగా సాటిగా కల్పించకండి, మీకు నిలువునా చీల్చేసేసినా సరే, మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన, షిర్క్ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అని తెలియజేసి ఉన్నారు.

కాబట్టి అభిమాన సోదరులారా, మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహ్‌నే ఆరాధించాలి, అల్లాహ్ మీదే నమ్మకం ఉంచాలి, ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి. అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడి, అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలు చేయడానికి మల్లా మనందరికీ భాగ్యము కల్పించు గాక.

అఖూలు ఖౌలి హాజా అస్తగ్ ఫిరుల్లాహ్ లీ వలకుం వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17133

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?[ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?
https://youtu.be/OFeb-uCup0Q [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత ప్రవక్తలు రారని స్పష్టం చేయబడింది. అయితే, అల్లాహ్ యొక్క ‘ఔలియాలు’ (స్నేహితులు) వస్తూనే ఉంటారని ఖురాన్ లో ఉందని, కానీ వారిని ఆరాధించడం, వేడుకోవడం లేదా వారి సమాధుల వద్ద మొక్కుబళ్ళు చెల్లించడం ఘోరమైన షిర్క్ అని వివరించబడింది. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఔలియాలుగా చేసుకోవద్దని, కేవలం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ ను మాత్రమే అనుసరించాలని సూరతుల్ ఆరాఫ్, సూరతుర్ రఅద్ వంటి ఆయత్ ల ఆధారంగా నొక్కి చెప్పబడింది.

సమాధానం: వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు అంతిమ, చిట్టచివరి ప్రవక్త అని చాలా స్పష్టంగా ఉంది. మరియు ఇక మీరు అడిగిన ప్రశ్న, అల్లాహ్ యొక్క ఔలియాల గురించి ఖురాన్ లో లేదా?

అల్లాహ్ యొక్క ఔలియాల ప్రస్తావన ఖురాన్ లో అనేక సందర్భాలలో ఉంది. కానీ, అల్లాహ్ ను వదిలి ఆ ఔలియాలను మనం వేడుకోవడం లేదా అల్లాహ్ తో పాటు ఆ ఔలియాలతో దువాలు చేయడం, దీని ప్రస్తావన లేదు. ఏముంది ఖురాన్ లో? ఉదాహరణకు మీరు సూరతు యూనుస్ చూశారంటే,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న అవ్లియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్)
వినండి! నిశ్చయంగా అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయమూ ఉండదు, వారు దుఃఖించరు కూడా.

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు ఎవరంటే, విశ్వసించి, దైవభీతితో ఉండేవారు.

ఇప్పుడు నేను తిలావత్ చేసిన రెండు ఆయతులు సూరత్ యూనుస్ 62, 63.

వినండి. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఔలియా, (అలా వినండి, ఇన్న నిశ్చయంగా, ఔలియా అల్లాహ్, అల్లాహ్ యొక్క ఔలియా, వలీలు), లా ఖవ్ఫున్ అలైహిమ్, వారికి ఎలాంటి భయము లేదు. వలా హుమ్ యహ్జనూన్, వారు ఎలాంటి చింతించనవసరము లేదు.

అల్లజీన ఆమనూ, ఎవరు ఆ ఔలియాలు? విశ్వసించిన వారు.
వ కానూ యత్తఖూన్, వారు పాపాలకు దూరంగా ఉండేవారు, భయభీతితో, అల్లాహ్ యొక్క భయభీతితో తమ జీవితం గడిపేవారు.

ఇక వారికి ఎలాంటి రందీ లేదు, ఎలాంటి చింత లేదు, బాధ లేదు, వారు భయపడవలసిన అవసరం లేదు అని అల్లాహ్ చెప్పాడు కదా, మరి ఏముంది వారికి? అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నెంబర్ 64 లో,

لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
(లహుముల్ బుష్రా ఫిల్ హయాతిద్ దున్యా వ ఫిల్ ఆఖిరహ్)
ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో వారి కొరకు శుభవార్తలు ఉన్నాయి.

అయితే గమనించారా? ఔలియా అల్లాహ్ ల యొక్క ప్రస్తావన ఖురాన్ లో ఉంది. వారి యొక్క ఘనత అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు.

కానీ ఈ రోజుల్లో మన ముస్లిం సోదర సోదరీమణులలో ఎంతో మంది అల్లాహ్ తో పాటు ఇతర ఔలియాలను ఏదైతే వేడుకుంటున్నారో, దువా చేస్తున్నారో, వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి అల్లాహ్ కు చేయవలసిన కొన్ని ఆరాధనలు, ఉదాహరణకు మొక్కుబడులు చెల్లించడం గానీ, మరికొన్ని దర్బారుల, దర్గాల వద్ద జంతువులను బలి ఇవ్వడం గానీ, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించు గాక కొన్ని దర్బారులు ఉదాహరణకు పాకిస్తాన్ లో ఖలందర్ షా దర్గా అని ఉంది, అక్కడ తవాఫ్ కూడా చేస్తారు. నవూజుబిల్లాహ్ సుమ్మ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, మనం ఎలాగైతే తవాఫ్ హజ్రే అస్వద్ నుండి మొదలుపెట్టి అక్కడే పూర్తి చేస్తామో, అలా అక్కడ కూడా వారు ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుండి ప్రారంభం చేస్తారు. ఇలాంటి ఘోరమైన షిర్క్ పనులు ఏవైతే జరుగుతున్నాయో, అల్లాహ్ దివ్య గ్రంథం ఖురాన్ లో వీటిని ఖండించాడు.

ఉదాహరణకు మీరు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ మూడు చూశారంటే,

اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ఇత్తబిఊ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఊ మిన్ దూనిహీ అవ్లియా, ఖలీలమ్ మా తజక్కరూన్)
మీ ప్రభువు వైపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన దానిని మీరు అనుసరించండి. దానిని వదిలి మీరు ఔలియాల వెంట పడకండి. మీరు చాలా తక్కువ గుణపాఠం నేర్చుకుంటున్నారు.

హితోపదేశం ఈ ఖురాన్, హదీసుల ద్వారా ఏదైతే తీసుకోవాలో, దాని నుండి మీరు చాలా తక్కువ హితోపదేశం పొందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించారా?

అయితే స్వయంగా ఆ ఔలియాలు, ఎవరైతే అల్లాహ్ యొక్క నిజమైన ఔలియాలు ఉన్నారో, వారి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. అందులో అనుమానం లేదు. కానీ ఆ ఔలియాలలో ఏ ఒక్క వలీ, ఇక్కడ గుర్తుంచుకోండి నిజమైన వలీ అయితే, ఏ ఒక్క వలీ కూడా మీరు నా సమాధి వద్దకు రండి, నా యొక్క దర్గాల వద్దకు రండి, నన్ను ఆరాధించండి, నాతో దువా చేయండి, నా వద్ద మొక్కుబడులు మీరు చెల్లించండి, ఇలాంటి ఏ ఒక్క మాట చెప్పలేదు.

ఒక్కసారి గనక మీరు సూరతుర్ రఅద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 16 లో గమనిస్తే,

قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا
(ఖుల్ మర్ రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, ఖులిల్లాహ్. ఖుల్ అఫత్తఖజ్తుమ్ మిన్ దూనిహీ అవ్లియాల లా యమ్లికూన లి అన్ఫుసిహిమ్ నఫ్ అన్ వలా దర్ర)
వారితో ప్రశ్నించండి, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? వారితో చెప్పండి, అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు వారికి ఈ ఆదేశం ఇవ్వండి, ఈ హెచ్చరిక చేయండి, వారికి తెలపండి, చెప్పండి వారితో, అల్లాహ్ ను కాదని మీరు వేరే వారిని ఔలియాలుగా చేసుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్లు? వారు స్వయం తమకు ఏ లాభం చేకూర్చలేరు, వారిపై వచ్చి పడిన ఏ నష్టాన్ని వారు దూరం చేసుకోలేరు.

ఔలియా అల్లాహ్, వారిని మనం విశ్వసించాలి. ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యమైన వలీలు ఉన్నారో, వారు అల్లాహ్ యొక్క సత్య వలీలు అని నమ్మాలి. కానీ, ఈ రోజుల్లో వలీల పేరు మీద ఏ దందాలు జరుగుతున్నాయో వాటిని స్వయంగా ఖురాన్ ఖండించినది అన్న విషయం కూడా తెలుసుకోవాలి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=16057

రుఖ్ యా (మంత్రాలు), తాయత్తుల ఆదేశాలు | ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ

8 వ అధ్యాయం
మంత్రాలు (రుఖ్ యా)
మరియు తాయత్తుల విషయంలో వచ్చిన ఆదేశాలు 
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.


باب ما جاء في الرقى والتمائم

8వ అధ్యాయం: రుఖ్ యా (మంత్రాలు), తాయత్తుల ఆదేశాలు

في الصحيح عن أبي بشير الأنصاري رضي الله عنه أنه كان مع رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ في بعض أسفاره، فأرسل رسولاً: أن لا يُبقين في رقبة بعير قلادة من وَتَر، أو قلادة إلاَّ قُطِعت.

అబూ బషీర్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఆయన ఓ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చాటింపు చేసే వ్యక్తిని ఈ వార్త ఇచ్చి పంపారు: “తమ ఒంటె మెడలో ఎవరూ కూడా తీగతో తయారైన పట్టా ఉంచకూడదు. ఒక వేళ ఉంటే తెంపేసెయ్యాలి”. (బుఖారీ 2843, ముస్లిం 2115).

وعن ابن مسعود رضي الله عنه قال: سمعت رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يقول: إن الرُّقى والتّمائم والتِّوَلَة شرك.

ఇబ్ను మస్ ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను. “మంత్రాలు, తాయత్తులు, తివల (భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయుట) షిర్క్“. (అబూ దావూద్ 3883). 

وعن عبد الله بن عُكيم مرفوعاً: من تعلّق شيئاً؛ وُكِل إليه.

అబ్దుల్లాహ్ బిన్ ఉకైం రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఉల్లేఖించిన హదీసులో ఉంది: “ఎవరు ఏదైనా వస్తువు వేసుకుంటే అతన్ని దాని వైపునకే అప్పగించబడుతుంది“. (తిర్మిజి 2072).

తాయత్తు అంటే: దిష్టి తగలకుండా తమ సంతానానికి ధరింపజేయబడే వస్తువులు. ఇది ఖుర్ఆన్ నుండి ఉంటే కొందరు పూర్వ ధర్మవేత్తలు యోగ్యమని చెప్పారు. మరి కొందరు యోగ్యం కాదని, నివారించబడింది అని చెప్పారు. నివారించినవారిలో ఇబ్నె మస్ ఊద్ రజియల్లాహు అన్హు ఉన్నారు.

మంత్రాలను ‘అజాయిం’ అని అంటారు. దిష్టి తగిలినప్పుడు, విష పురుగులు కాటేసినప్పుడు మంత్రిచవచ్చును కాని షిర్క్ అర్థమునిచ్చే పదాలు ఉండకూదడు.

తివల అంటే: భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు చేయబడే ఇంద్రజాలం. 

وروى أحمد عن رُوَيْفع قال: قال لي رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يا رُوَيْفِع، لعل الحياة ستطول بك؛ فأخبر الناس: أن من عقد لحيته، أو تقلّد وَتَراً، أو استنجى برجيع دابة أو عظم؛ فإن محمداً بريء منه.

రువైఫిఅ యొక్క హదీసు ఇమాం అహ్మద్ ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా తెలిపారు: “ఓ రువైఫిఅ! బహుశా నీవు దీర్ఘకాలం బ్రతికి ఉంటావేమో, అయితే ప్రజలకు నీవు ఈ విషయం తెలుపు: గడ్డమును ముడి వేసేవారితో, లేక తీగలు మెడలో వేసుకునేవారితో, పశువుల పేడ, ఎముకలతో మలమూత్ర విసర్జన తర్వాత పరిశుద్ధ పరుచుకునేవారితో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలాంటి సంబంధం లేదు”.

وعن سعيد بن جبير قال: “من قطع تَمِيمَة من إنسان؛ كان كعدل رقبة” رواه وكيع.

సఈద్ బిన్ జుబైర్ ఇలా చెప్పారు: ‘ఒక వ్యక్తి ధరించిన తాయత్తును తీసే వారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభించును’. (ఇమాం వకీఅ ఉల్లేఖనం).

وله عن إبراهيم قال: “كانوا يكرهون التّمائم كلها؛ من القرآن وغير القرآن”.

ఇమాం వకీఅ ఇబ్రాహీం నఖ్ఈతో ఉల్లేఖించారు: “వారు (అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ శిష్యులు) అన్ని రకాల తాయుత్తులను అసహ్యించుకునేవారు (నిషిద్ధంగా భావించేవారు). అవి ఖుర్ఆన్ కు సంబంధించినవైనా, లేదా ఖుర్ ఆన్ కు సంబంధం లేనివైనా.”

1. మంత్రము (రుఖ్య), తాయత్తు యొక్క వివరణ తెలిసింది. 

2. తివల యొక్క భావం తెలిసింది. 

3. ఎలాంటి వ్యత్యాసం లేకుండా పైన పేర్కొన్న మూడూ విషయాలు కూడా షిర్క్ గా పరిగణింపబడుతాయి. (ఇందులో వివరణ ఉంది, క్రింద వస్తుంది).

4. దిష్టి తగిలినప్పుడు లేదా తగలకుండా లేదా విషపురుగు కాటేసినప్పుడు షిర్క్ పదాలు కాకుండా ఖుర్ఆన్, హదీసుతో రుజువైన దుఆలతో రుఖ్య చేయుట (మంత్రించుట) షిర్క్ కాదు. (అన్ని రకాల రోగాలకు రుఖ్య చేయవచ్చును).

5. ఖుర్ఆన్ ఆయతులతో వ్రాయబడిన తాయత్తు విషయములో పండితుల బేధాభిప్రాయం ఏర్పడినది. (వాస్తవమేమిటంటే అది కూడా యోగ్యం కాదు. ఎలా అనగా మంత్రం షిర్క్ అని తెలిపిన తరువాత యోగ్యమైనదేదో ప్రవక్త స్వయంగా తెలిపారు. కాని తాయత్తు విషయంలో అలా తెలుపలేదు. అందుకే ఇందులో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు మాటనే నిజమైనది). 

6. పశువులకు దిష్టి తగలకుండా తీగలు, ఇంకేవైనా వేయుట కూడా షిర్క్ కు సంబంధించినవే. 

7. అలాంటివి వేసినవారిని కఠినంగా హెచ్చరించబడింది. (فإن محمداً بريء منه)

8. ఒక వ్యక్తి మెడ నుండి తాయత్తు తీయుట ఎంత పుణ్యమో తెలిసింది.

9. ఇబ్రాహీం నఖ్ఈ మాట, పైన తెలిపిన మాటకు విరుద్ధం ఏమీ కాదు. ఎలా అనగా; ఈయన ఉద్దేశం అబుల్లాహ్ బిన్ మస్ ఊద్ శిష్యులు అని. 

తమాయిమ్ తమీమా యొక్క బహువాచనం, మన భాషలో తాయత్తు అని అంటాము, వాటి వైపే ప్రజల మనస్సు అంకితం అయిపోతుంది. దీని వివరణ దీనికంటే ముందు ఏడవ ధ్యాయంలో తెలిపిన మాదిరిగానే ఉంటుంది.

తాయత్తులు వేసుకొనుట షిర్క్ అని తెలిసింది. అయితే ఇందులో కొన్ని షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్). ఉదా: షైతాన్ తో లేక సృష్టిరాసులతో సహాయం కోరడం జరుగుతుంది,  అల్లాహ్ ఆధీనంలో మాత్రమే ఉన్నదాని గురించి ఇతరులతో అడగడం జరుగుతుంది, కనుక పెద్ద షిర్క్ లో పరిగణించబడుతుంది. ఈ విషయం మరీ వివరంగా తరువాత అధ్యాయాల్లో వస్తుంది.

తాయత్తుల్లో మరి కొన్ని నిషిద్ధం, ఎందుకనగా అవి షిర్క్ వైపునకు తీసుకెళ్తాయి. ఉదా: అర్ధం లేని పేర్లతో, పదాలతో ఉన్న తాయత్తులు.

ఇక ఏ తాయయత్తుల్లో ఖుర్ఆన్ ఆయతులు, లేదా హదీసులో వచ్చిన దుఆలుంటాయో, ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు గనక వాటిని విడనాడడమే ఉత్తమం. ఈ పద్ధతి నిషిద్ధమున్న వాటి ఉపయోగమునకు దారి తీస్తుంది. అపరిశుద్ధ స్థలాల్లో పోక తప్పదు గనక, వాటిని వేసుకున్నవాడు వాటి గౌరవ మర్యాదను పాటించలేడు. (ఇవి పాటించినవానికి సయితం అనుమతి లభించదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వలేదు).

మంత్రం విషయంలో ఉన్న వివరాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఖుర్ఆన్, హదీసు నుండి ఉంటే మంత్రించేవాని గురించి అభిలషనీయమే. ఎందుకనగా ఇది కూడా ఒక ఉపకారం, పుణ్యం క్రింద లెక్కించబడుతుంది గనుక యోగ్యం కూడా. కాని మంత్రం చేయించుకునే వ్యక్తి స్వయంగా అడగక ఉండడమే మంచిది. మంత్రించడమైనా లేక ఇంకేదైనా అడగక ఉండడం మానవుని సంపూర్ణ నమ్మకం, బలమైన విశ్వాసం యొక్క నిదర్శన. అడగడంలో అతనికి లాభం మరియు అది యోగ్యం అయినప్పటికీ అడగక పోవడం మంచిది అనబడుతుంది. ఇందులోనే వాస్తవ తౌహీద్ యొక్క రహస్యం ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆచరించేవారు చాలా అరుదు. మంత్రంలో అల్లాహ్ యేతరులతో స్వస్థత కోరి, వారితో దుఆ చేయబడితే అది పెద్ద షిర్క్. ఎందుకంటే: దుఆ, మొర అల్లాయేతరులతో చేయరాదు గనక. ఈ వివరాలన్నీ జాగ్రత్తగా తెలుసుకో! అందులో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను గమనించకుండా అన్నిటి గురించి ఒకే రకమైన తీర్పు చేయకు. జాగ్రత్తగా ఉండు! 


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

తౌహీద్ మరియు “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము – ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ

6 వ అధ్యాయం
తౌహీద్ మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓ

ఈ ప్రజలు మొర పెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు.”
(బనీ ఇస్రాయీల్ 17 : 57). 

وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِۦٓ إِنَّنِى بَرَآءٌۭ مِّمَّا تَعْبُدُونَ

“ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతి వారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. “మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది… (జుక్రుఫ్ 43: 26).

ٱتَّخَذُوٓا۟ أَحْبَارَهُمْ وَرُهْبَـٰنَهُمْ أَرْبَابًۭا مِّن دُونِ ٱللَّهِ وَٱلْمَسِيحَ ٱبْنَ مَرْيَمَ وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوٓا۟ إِلَـٰهًۭا وَٰحِدًۭا ۖ لَّآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَـٰنَهُۥ عَمَّا يُشْرِكُونَ

“వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు…” (తౌబా 9: 31).

وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادًۭا يُحِبُّونَهُمْ كَحُبِّ ٱللَّهِ ۖ ۗ

“కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు…” (బఖర 2:165)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:

‘ఎవడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం మరొక్కడు లేడు) అని, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణం సురక్షితంగా ఉండును. అతని లెక్క (ఉద్దేశం) అల్లాహ్ చూసుకుంటాడు’. (ముస్లిం).

తరువాత వచ్చే పాఠాల్లో ఇదే వివరణ ఉంది. 

ముఖ్యాంశాలు: 

1. ఇందులో ముఖ్య విశేషం : తౌహీద్ (ఏక దైవ విశ్వాసం) మరియు షహాదత్ (లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం) యొక్క వ్యాఖ్యానం ఉంది. దాన్ని అనేక ఆయతుల ద్వారా స్పష్టం చేయడం జరిగింది 

2. బనీ ఇస్రాయీల్ లోని వాక్యం (17:57) – మహాపురుషులతో మొరపెట్టుకునే ముష్రికుల ఆ కార్యాన్ని రద్దు చేస్తూ, ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అని చెప్పబడింది. 

3. సూరె తౌబాలోని వాక్యం. “యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ను గాక తమ పండితులను, సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారని అల్లాహ్ తెలిపాడు”. ఇంకా “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించవలసిన ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింద”నీ తెలిపాడు. అయితే వారు తమ పండితుల, సన్యాసులతో మొరపెట్టుకోలేదు. వారి పూజా చేయలేదు. కాని పాపకార్యాల్లో వారి విధేయత పాటించారు. 

4. “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది? అన్న అవిశ్వాసులకు ఇబ్రాహీం మాట. తమసత్య ప్రభువును ఇతర మిథ్య ఆరాధ్యులతో స్పష్టమైన పద్దతిలో వేరు జేరు. 

ఇలా అవిశ్వాసులతో అసహ్యత, విసుగు మరియు అల్లాహ్ తో ప్రేమయే “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పరమార్థము అని అల్లాహ్ తెలిపాడు. అందుకే ఆ వాక్యం తరువాతనే ఈ వాక్యం ఉంది. 

ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచి వెళ్ళాడు, బహుశా వారు దాని వైపునకు మరలుతారని. (జుఖ్ రుఫ్ 43: 28). 

5. మరొకటి బఖరలోని వాక్యం. అందులో ప్రస్తాంవించబడిన అవిశ్వాసుల గురించి, “వారు నరకము నుండి బయటికి వెళ్ళేవారు కారు” అని అల్లాహ్ తెలిపాడు. వారు నియమించుకున్న వారిని అల్లాహ్ ను ప్రేమించవలసినట్లు ప్రేమిస్తారు. వారు అల్లాహ్ ను కూడా ప్రేమించువారు అని దీనితో తెలుస్తుంది. కాని వారి ఈ ప్రేమ వారిని ఇస్లాంలో ప్రవేశింపజేయలేకపోయింది. ఇది వీరి విషయం అయితే, ఎవరయితే తమ నియమించుకున్న వారిని అల్లాహ్ కంటే ఎక్కువ, లేక కేవలం వారినే ప్రేమించి, అల్లాహ్ ను ఏ మాత్రం ప్రేమించరో, వారి సంగతి ఎలా ఉంటుంది….? ఆలోచించండి! 

6. “ఎవరు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యదైవం మరొక్కడు లేడు) చదివి, అల్లాహ్ తప్ప పూజింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణాలు సురక్షితంగా ఉండును. అతని వ్యవహారం అల్లాహ్ చూసుకుంటాడు” అన్న ప్రవక్త ప్రవచనం “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావాన్ని తెలిపే దానిలో ముఖ్యమైనది. కేవలం నోటి పలుకుల ద్వారానే అతని ధన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పలేదు. ఆ పదాలు, దాని భావం తెలుసుకున్నవాని గురించే ఆ ఘనత లేదు. లేక దాన్ని కేవలం ఒప్పుకున్న వానికే రక్షణ లేదు. లేక అతడు కేవలం అల్లాహ్ తోనే మొరపెట్టుకుంటున్నందుకని కాదు. అతడు దాన్ని పలుకడంతో పాటు మిథ్యా దైవాలను తిరస్క.రించనంతవరకు అతని ధనప్రాణాలకు రక్షణ లేదు. ఇంకా అతడు అందులో సందేహపడితే, ఆలస్యం చేస్తే కూడా రక్షణ లేదు. ఈ విషయం ఎంతో ముఖ్యమైనది, గొప్పదైనది!. ఎంతో స్పష్టంగా తెలుపబడింది! వ్యెతిరేకులకు విరుద్ధంగా ఎంతో ప్రమాణికమైన నిదర్శన ఉంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

వాస్తవానికి తౌహీద్ యొక్క భావం ఏమనగా: “అల్లాహ్ అద్వితీయుడని అతని గుణాలతో తెలుసుకొని, నమ్ముట. కేవలం అయన్ని మాత్రమే ఆరాధించుట.” 

ఇది రెండు రకాలు: 

ఒకటి: అల్లాహ్ యేతరుల ఉలూహియత్ (ఆరాధన)ను తిరస్కరించుట. అది ఎలా అనగా; సృష్టిలోని ప్రవక్త, దైవదూత, ఇంకెవరయినా ఆరాధనకు అర్హులు కారని, వారికి ఏ కొంత భాగం కూడా అందులో లేదని తెలుసుకొని విశ్వసించుట. 

రెండవది: ఉలూహియత్ కు అర్హుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకి సాటి మరొకడు లేడని విశ్వసించుట. కేవలం ఇంతే సరిపోదు. ధర్మాన్ని కేవలం అల్లాహ్ కే అంకితం చేసి, ఇస్లాం, ఈమాన్, ఇహాసాన్ ను పూర్తి చేసి, అల్లాహ్ హక్కులతో పాటు అల్లాహ్ దాసుల హక్కులను అల్లాహ్ సంతృప్తి, దాని ప్రతిఫలం పొందడానికే పూర్తి చేయుట. 

దాని సంపూర్ణ భావంలో మరొకటి: అల్లాహ్ యేతరుల ఆరాధన నుండి అసహ్యత, విసుగు చెందుట. అల్లాహ్ ను గాక ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించినట్లు వారిని ప్రేమించుట, అల్లాహ్ కు విధేయత చూపినట్లు వారికి విధేయత చూపుట “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావానికి విరుద్ధమైనది


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl