అగోచర జ్ఞానంలో షిర్క్ (భాగస్వామ్య) ఖండన
1.షిర్క్(భాగ స్వామ్యం) ఖండన
అల్లాహ్ దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు:
وَعِندَهُۥ مَفَاتِحُ ٱلْغَيْبِ لَا يَعْلَمُهَآ إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِى ظُلُمَـٰتِ ٱلْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِى كِتَـٰبٍ مُّبِينٍ
అగోచరాల తాళం చెవులు అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అల్లాహ్ కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలియదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలియకుందా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా – పచ్చిది, ఎండినది ఏది పడినా – స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. (దివ్యఖర్‌ఆన్ 6 : 59)
అల్లాహ్ మానవునికి బాహ్య వస్తువుల గురించి తెలుసుకోడానికి కొన్ని అవయవాలు ప్రసాదించాడు. ఉదాహరణకు: చూడటానికి కళ్లు, వినడానికి చెవులు, వాసన కోసం ముక్కు, రుచి కోనం నాలుక, వెతకటానికి చేతులు, అర్థం చేనుకోవడానికి బుద్ధిని ప్రసాదించాడు. ఈ అవయవాలన్నిటిపై మానవుడికి అధికారాన్ని ప్రసాదించాడు. తాను తలచుకున్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు: ఏదైనా వస్తువులను చూడకూడదనుకున్నప్పుడు కళ్లు మూనుకుంటాడు. చూడాలనుకున్నవ్పుడు కళ్లు తెరిచిఉంచుతాడు. ప్రతి అవయవాన్ని ఇలాగే ఊహించుకోండి. అదే విధంగా గోచర విషయాలు తెలుసుకోడానికి తాళం చెవులు ఇచ్చాడు. ఉదాహరణకు తాళం తెరవాలో లేదో? తాళం చెవి ఉన్న వాడి అధికారంలోనే ఉంటుంది. ఇలా బాహ్య వస్తువుల గురించి తెలుసుకోవాలో, తెలుసుకోకూడదో? అంతా మానవుడి అదుపులోనే ఉంది.
2.అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్‌కు మాత్రమే ఉంది
దీనికి భిన్నంగా అగోచర విషయాలు తెలుసుకోవడం మానవుడి చేతుల్లో లేదు. దాని తాళం చెవులు అల్లాహ్ తన వద్ద ఉంచుకున్నాడు. మహా వ్యక్తులకుగానీ, అల్లాహ్ సామీప్యం పొందిన దైవదూతలకుగానీ తమకు ఇష్టం వచ్చినప్పుడు అగోచర విషయాలు తెలుసుకోవాలనుకునే, ఇష్టంలేనప్పుడు వదలి పెట్టే అధికారం లేదు. అల్లాహ్ తన ఇష్టానుసారం ఎప్పుడైనా ఎవరికైనా అగోచర విషయాలు కావాలనుకున్నంతగా తెలుపుతాడు. అగోచర విషయాలు తెలుపడం అల్లాహ్ ఇష్టంపై మాత్రమే ఆధారపడి ఉంది. వేరే వారి ఇష్టంపై ఆధారపడి లేదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకునేవారు. కాని ఆ విషయం ఆయన తెలుసుకోలేకపోయేవారు. అల్లాహ్ తలచుకున్నప్పుడు వాటిని వెంటనే తెలిపేవాడు. దైవదౌత్య కాలంలో కపటులు మాతృమూర్తి ఆయిషా( రదియల్లాహు అన్హా) పై అపనింద మోపారు. ఆ విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్గం)కు తీవ్రంగా బాధ కలిగించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ నల్లం) చాలా రోజుల వరకు ఆ విషయాన్ని శోధించారు. కాని ఏ విషయమూ తెలుసుకోలేక పోయారు. తర్వాత అల్లాహ్ కోరినప్పుడు వహీ అవతరింప జేసి కపటులు అబద్ధాల కోరులని, ఆయిషా (రదియల్లాహు అన్హా) పరమ పవిత్రురాలని తెలియజేశాడు.
కనుక ప్రతి ముస్లిం అగోచరాల ఖజానాల తాళం చెవులు అల్లాహ్ తన వద్దనే ఉంచుకున్నాడని, వాటికి ఎవరినీ కోశాధికారిగా చేయలేదని విశ్వసించాలి. ఆయన స్వయంగా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అతని చేయిని అడ్డుకునే సాహసం ఎవరికుంది?
3.అగోచర జ్ఞానం ఉందని చెప్పేవాడు, అబద్ధాలకోరు
దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, అగోచరం తెలుస్తుందని, గడిచిన వాటి గురించి, భవిష్యత్తు గురించి తనకు తెలుసునని వాదించేవాడు అబద్ధాలకోరు. అలాంటి వాడు దైవత్వ ప్రకటన చేస్తున్నాడు. ఎవరయినా ప్రవక్తలను, మహాత్ములను, జిన్నులను, దైవదూతలను, ఇమాములను, సజ్జనులను లేదా పీరులను, అమరవీరులను, సిద్ధాంతిని, జ్యోతిష్కుడిని, పండితులను, భూతాలను అలా భావిస్తే ముష్రిక్కులు (బహు దైవారాధకులు) అనబడతారు. వారు పైన పేర్కొన్న ఆయతు (దివ్య ఖుర్‌ఆన్ 6 : 59) లను తిరస్కరిస్తున్నారు. అనుకోకుండా ఎవరయినా జ్యోతిష్యుడి మాట నిజమయితే దాని వల్ల అతను అగోచర జ్ఞాని కాలేడు. ఎందుకంటే అతను చెప్పే చాలా విషయాలు అబద్ధాలు కనుక! అగోచర జ్ఞానం తెలుసుకోవడం వారికి సాధ్యమయ్యే విషయం కాదు. వారి అంచనా ఒక్కోసారి నిజం కావచ్చు. మరికొన్ని సార్లు తప్పు కావచ్చు. జ్యోతిష్యం, కనికట్టు, ఖుర్‌ఆన్‌తో శకునాలు చూడటం కూడా అలాంటిదే. వహీ (దైవవాణి) మాత్రం ఎప్పుడూ అబద్ధం కాదు. అది మాత్రం వారి అధీనంలో లేదు. అల్లాహ్ తన ఇష్టప్రకారం తాను తలచుకుంది తెలుపుతాడు. వేరే వారి ఇష్టంపై వహీ ఆధారపడి లేదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
قُل لَّا يَعْلَمُ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ٱلْغَيْبَ إِلَّا ٱللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ
“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర విషయాల జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి చెప్పు”. (దివ్యఖర్‌ఆన్ 27: 65)
అగోచర విషయాలు తెలునుకోవడం ఎవరి తరమూ కాదు. వారు ఎంతటి వారయినా లేదా దైవదూత అయినా సరే. దీనికి స్పష్టమయిన ఆధారం ఏమిటంటే, ప్రళయం వన్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు కాని అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అన్ని విషయాలు తెలుసుకోవడం వారికి సుసాధ్యమే అయితే ప్రళయం ఏ రోజు వస్తుందో కూడా తెలుసుకునేవారే.
4.అగోచరాల జ్ఞానం
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ ٱللَّهَ عِندَهُۥ عِلْمُ ٱلسَّاعَةِ وَيُنَزِّلُ ٱلْغَيْثَ وَيَعْلَمُ مَا فِى ٱلْأَرْحَامِ ۖ وَمَا تَدْرِى نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِى نَفْسٌۢ بِأَىِّ أَرْضٍ تَمُوتُ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٌۢ
నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగడు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలియదు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు (అని తెలుసుకోండి). (దివ్యఖర్‌ఆన్ 31 : 34)
అగోచరాల జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. ఆయన తప్ప అగోచరాల జ్ఞాని ఎవరూ లేరు. ప్రళయం సంభవించడం తథ్యం, మానవులందరికీ ఈ విషయం తెలుసు. కాని అది ఎప్పుడు రాబోతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వేరే విషయాల గురించి ఏం చెప్పగలరు. ఉదాహరణకు: విజయం, పరాజయం, స్వస్థత, అస్వస్థత ఇలాంటి విషయాల జ్ఞానమూ ఎవరికీ లేదు.ఇవి ప్రళయమంత ముఖ్య మైనవి కాకపోయినా అవి ఎప్పుడు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. అదే విధంగా వర్షం ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. దానికోసం ప్రత్యేకంగా ఒక కాలం కూడా ఉంది. అయినా వర్షం పడుతుందో లేదో తెలియదు. వేరే కాలాల్లోనూ వర్షం పడుతుంటుంది. చాలా మంది దీనిని కోరుతుంటారు కూడా. ఒకవేళ దాని సమయం ఎలాగైనా తెలుస్తుందనుకుంటే దాని గురించి ఎవరికైనా తప్పనిసరిగా తెలుస్తుంది. ఉదాహరణకు : ఒక వ్యక్తి జననం, మరణం లేదా సంతానం కలగడం కలగకపోవడం లేదా ధనవంతుడవ్వడం పేదవాడవ్వడం లేదా విజయం సాధించడం, పరాజయం పాలవ్వడం ఈ విషయాలు ఎవరికైనా ఎలా తెలుస్తాయి? మాతృ గర్భంలో ఉన్నది కూడా ఎవరికీ తెలియదు.” [ ఆధునిక వైద్యశాస్త్రం పుట్టబోయే నంతానం ఏదో ప్రసవ సమీప కాలంలో మాత్రమే చెప్పగలుగుతుంది.]
గర్భంలో ఉన్నది ఒకరా లేదా ఇద్దరా? అందులో ఉన్నది ఆడా, మగా? సంపూర్ణంగా ఉన్నారా లేదా లోపంతో ఉన్నారా? అందంగా ఉన్నారా అంద విహీనంగా ఉన్నారా? నిపుణులు ఈ విషయాలన్ని అసంపూర్తిగానే తెలుపుతారు. కాని ఎవరికీ పూర్తిగా పరిస్థితులు తెలియవు. అలాంటప్పుడు మానవ అంతర్గత విషయాల గురించి ఎలా తెలుసుకోగలరు? ఉదాహరణకు: వారి భావాలు, సంకల్పాలు, కోరికలు, వారి విశ్వాస కాపట్య స్థితి. తాను రేపు ఏం చేస్తాడో తనకే తెలియనప్పుడు ఇతరుల గురించి ఎలా తెలుసుకోగలడు? మనిషికి అతను ఎవ్పుడు మరణిస్తాడో తెలియనప్పుడు మరణించబోయే రోజు సమయం ఎలా తెలుస్తుంది? ఏది ఏమైనప్పటికీ అల్లాహ్ తప్ప మరెవరూ భవిష్యత్తు విషయాలను తమ అధికారంతో తెలుసుకోలేరు. కనుక అగోచర విషయాల జ్ఞానులమని వాదించేవారు అబద్ధాలకోరులు. కనికట్టు, జ్యోతిష్యం, శకునాలు చూడటం, రాశిఫలాలు అన్నీ అబద్దాలే. ఇవన్నీ షైతాన్ పన్నాగాలు. ముస్లిములు ఎన్నటికీ వీటిలో చిక్కుకోకూడదు.
ఎవరైనా “నాకు అగోచర విషయాల జ్ఞానం లేదు, వాటిని తెలుసుకోవడమూ నా వల్ల కాదు, అల్లాహ్ నాకు తెలుపుతున్న విషయాలు తప్ప వేరే విషయాలు చెప్పడం నా అధికారంలో లేదు” అని ఎవరయినా అంటే ఇందులో రెండు విషయాలకు అవకాశం ఉంది. అతను నిజం చెప్పవచ్చు లేదా అబద్ధమూ చెప్పవచ్చు. ఉదాహరణకు: sixth sense షర్హే సద్ర్ (మనో వికాసం), దైవికంగా తోచినమాట.
5.అల్లాహ్‌ను తప్ప వేరే వారిని మొరపెట్టుకోకండి
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُوا۟ مِن دُونِ ٱللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُۥٓ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ وَهُمْ عَن دُعَآئِهِمْ غَـٰفِلُونَ
“ అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?” (దివ్యఖుర్‌ఆన్ 46:5).
ముష్రిక్కులు పరమ మూర్ఖులు. అల్లాహ్ లాంటి శక్తిమంతుణ్ణి, వివేకవంతుణ్ణి విడిచిపెట్టి ఇతరులను మొరపెట్టుకుంటున్నారు. వారు వీరి మొరలను ఆలకించలేరు. వారికి ఎటువంటి శక్తిసామర్థ్యాలూ లేవు. వీరు ఇలాగే ప్రళయం వరకు మొరపెట్టుకున్నా వారు ఏమీ చేయలేరు. ఎవరయితే మహాత్ములను మొరపెట్టుకుంటూ, మా అవసరాలను తీర్చమని మీరు అల్లాహ్‌తో దుఆ చేయండి?’ అనడం కూడా షిర్క్‌గానే పరిగణించబడుతుంది. మేము అవసరాలను తీర్చమని అల్లాహ్‌నే కదా వేడుకున్నాం? ఈ మహాత్ములు కేవలం వారధులు మాత్రమే. అది షిర్క్ ఎలా అవుతుంది? అని వారు భావించవచ్చు.అసలు విషయం ఏమిటంటే; వారు దూరంగా ఉన్న వ్యక్తిని (పుణ్యాత్ముణ్ణి) మొరపెట్టు కున్నారు. కనుక ఇది షిర్క్ అవుతుంది. ఎందుకంటే పుణ్యాత్ములు దూరం నుండి దగ్గర నుండి కూడా వింటారని వారిని విశ్వసించారు. కాని అది అల్లాహ్ ఔన్నత్యం. అల్లాహ్ దివ్యఖుర్‌ఆన్ 46 : 5 లో “వీరి మొరలను ఆలకించలేరు. వీరు ఎంత మొర పెట్టుకున్నా, చివరకు ప్రళయం వరకు మొరపెట్టుకున్నా వారు వినలేరు’ అని స్పష్టంగా వివరించాడు.
6.లాభనష్టాలు కేవలం అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
అల్లాహ్ దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు:
قُل لَّآ أَمْلِكُ لِنَفْسِى نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ ٱلْغَيْبَ لَٱسْتَكْثَرْتُ مِنَ ٱلْخَيْرِ وَمَا مَسَّنِىَ ٱلسُّوٓءُ ۚ إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేధు. నాకే గనక అగోచర విషయాలు తెలిసి ఉంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి, ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (దివ్యఖుర్‌ఆన్ 7: 186)
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్తలకు నాయకులు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా గొప్ప గొప్ప మహిమలు ప్రస్ఫుటమయ్యాయి. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ధార్మిక విషయాలు నేర్చుకున్నారు. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మార్గంలో నడవడం వల్ల ఔన్నత్యం పొందారు. అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్గం)కు ప్రజల ముందు తన స్థితి ఎలాంటిదో వివరించమని ఆదేశించాడు; “నాకు ఎలాంటి శక్తిలేదు. నేను అగోచర విషయాల జ్ఞానిని కూడా కాను. నేను నా స్వయానికి లాభంగానీ, నష్టంగానీ చేకూర్చు కోలేను. దీంతోనే నా శక్తి ఏపాటిదో మీరు అంచనావేయవచ్చు. అలాంటప్పుడు నేను ఇతరులకు లాభనష్టాలు ఎలా చేకూర్చగలను? ఒకవేళ నేను అగోచరాల జ్ఞానిని అయి ఉంటే పని చేయక ముందే దాని పర్యవసానాన్ని తెలుసుకునేవాడిని. నేను చేయబోయే పని వల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే ఆ పనిని ప్రారంభించేవాడినికాను. అగోచర విషయాల జ్ఞానం కలిగి ఉండటం అల్లాహ్ గొప్పతనం. నేను కేవలం ప్రవక్తను మాత్రమే. చెడుల పర్యవసానాన్ని హెచ్చరిస్తూ మంచి పనుల శుభవార్తలను అందదేయడమే ప్రవక్తల పని. విశ్వాసం ఉన్న హృదయాలకే ఈ విషయం లబ్ది చేకూర్చగలుగుతుంది. నమ్మకం కలిగించడం అల్లాహ్ పని“
7.ప్రవక్తల అసలు మిషన్
ప్రవక్తల, పుణ్యాత్ముల గొప్పతనం ఏమిటంటే; వారు అల్లాహ్ మార్గాన్ని తెలుపు తారు. తమకు తెలిసిన మంచి, చెడుల గురించి ప్రజలకు తెలియజేస్తారు. వారి సందేశ ప్రచారంలో అల్లాహ్ ఆకర్షణను ఉంచాడు. వారి సందేశం వల్ల అనేక మంది రుజుమార్గంలో వచ్చి చేరారు. ఒకవేళ అల్లాహ్ వారికి విశ్వంలో అధికారం చేసే శక్తి ఇచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు. అవి మహత్యాలు మాత్రమే. అల్లాహ్ ఎవరినైనా హతమార్చడం లేదా సంతానం కలిగించడం, ఆపదల నుండి రక్షించటం, మొరలను ఆలకించడం, జయాపజయాలు కలిగించడం. ధనవంతునిగా చేయడం, నిరుపేదగా మార్చడం లేదా రాజుగా చేయడం, ఎవరినైనా బిచ్చగాణ్జీ చేయడం లేదా అధికారినో, మంత్రినో చేయడం. ఎవరి హృదయంలో నైనా విశ్వాసం కలిగించడం, ఎవరి హృదయం నుండైనా విశ్వాసాన్ని లాక్కోవడం. ఎవరికైనా ఆరోగ్యాన్ని ప్రసాదించడం, మరెవరైనా అస్వస్థతకు గురిచేయడం – ఇదంతా అల్లాహ్ గొప్పతనమే. అల్లాహ్ తప్ప ఈ పనులు ఎవరూ చేయలేరు. ఇంతకు మించి అందరూ నిస్సహాయులే. నిస్సహాయతలో అందరూ సమానులే. ప్రవక్తలు గాని పుణ్యాత్ములుగాని ఏ విషయాలలోనైనా ఏమైనా చేసినా అవి కేవలం అల్లాహ్ సహాయంతో మాత్రమే చేయగలరు.
8.ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు
అదే విధంగా అల్లాహ్ తలచుకుంటే అగోచరాల జ్ఞానం వారికి ఇవ్వవచ్చు. తద్వారా ఎవరి హృదయంలో ఏముందో తెలునుకోవచ్చు. ఏ అగోచర విషయా న్నైనా తెలునుకోవచ్చు. అయితే ఫలానా వారికి సంతానం కలుగుతుందా? లేదా? వ్యాపారంలో లాభం కలుగుతుందా లేదా? పోరాటంలో విజయం పాందుతారా? పరాజయం పాలవుతారా? ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియవు. అప్పుడప్పుడు ఏదైనా విషయం అంచనా వేసుకుని లేదా రుజువులను బట్టి చెబితే అది చెప్పినట్టుగానే జరగనూ వచ్చు. అదే విధంగా అప్పుడప్పుడు పెద్దలు చెప్పేమాటలు కూడా నిజమవుతాయి. ఒక్కోసారి అబద్ధాలూ కావచ్చు. కాని వహీ లేదా దైవిక జ్ఞానోదయం అబద్ధంకాదు. ఇంకా వహీ ప్రవక్తల అధీనంలో ఉండదు.
9.’అగోచర జ్ఞానం’ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం
రబీఅ బిన్తె ముఅవ్విజ్ బిన్ అఫ్రా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం: (పెళ్ళికూతురిగా) నాకు వీడ్కోలు పలికే సమయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా వద్దకు వచ్చారు. నా మంచంపై నాకు చాలా దగ్గరగా మీరు కూర్చున్నంత దగ్గరగా కూర్చున్నారు. మా (కుటుంబీకుల) పిల్లలు కొందరు దఫ్ (డప్పు) వాయిస్తూ బద్ర్ మృతుల సంఘటనను ఆలపించ సాగారు. అందులో ఒకరు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు” అన్నారు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి న నల్లం) వారిని వారిస్తూ ‘ఆ విషయాన్ని విడిచి మిగతాది ఆలపించండి’ అని హిత బోధచేశారు. ( హదీసు గ్రంథం బుఖారీ: 5147)
రబీఅ అన్సారియ్య వివాహ సందర్భంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు దగ్గరగా కూర్చున్నారు. బాలికలు గీతం ఆలపిస్తూ “మా ప్రవక్తకు రేపటి విషయాలు కూడా తెలుసు” అని పాడారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని అ మాట అనకండని వారించారు.
మనిషి ఎంత పెద్ద వాడయినా అతని విషయంలో అతను అగోచరజ్ఞాని అని విశ్వసించకూడదు. కవులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ నల్లం)ను పొగుడుతూ భూమ్యాకాశాల ఎత్తుకు ఎత్తడం, అతిశయం కోసం అన్నామని అనడం సమంజసం కాదు. ఇలా చేయడం తప్పు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనను పొగుడుతూ ఇలాంటి కవితలు పాడుతున్న బాలికలనే వారించారు. అలాంటప్పుడు అన్నీ తెలిసిన కవులకు, పెద్దలకు ఇలాంటి కవితలు పాడమని ఎలా అనుమతించగలరు.
10.మాతృమూర్తి అయేషా (రదియల్లాహు అన్హా) ఉద్బోధ
అయేషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “ఆ ఘడియకు సంబంధించిన జ్ఞానం” అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. (దివ్యఖుర్‌ఆన్ 31: 34) అనే ఆయత్‌లో తెలిపిన ఐదు విషయాల సమాచారం ప్రవక్త (నల్లల్లాహు అలైహి వ సల్లం)కు తెలుసని ఎవరైతే చెప్పాడో అతను ప్రవక్తపై ఘోరమైన అపనిందమోపాడు. (హదీసు గ్రంథం : బుఖారి : 3287)
అంటే ఆ అయిదు విషయాలు దివ్యఖుర్‌ఆన్ (31: 34)లో ఉన్నాయి. దాని గురించి వివరించడం జరిగింది. అగోచర విషయాలు ఆ అయిదు విషయాల్లోనే ఉన్నాయి. కనుక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అగోచర విషయాల జ్ఞానం ఉందని తెలిపేవాడు ఆయనపై తీవ్రమైన నిందమోపాడు.
11.అల్లాహ్ తప్ప అగోచర విషయాలు తెలిసినవారు ఎవరూ లేరు
ఉమ్మె అలా అన్సారీ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “అల్లాహ్ సాక్షి! నేను దైవ ప్రవక్త అయినప్పటికీ నా విషయంలో ఏం జరుగుతుందో, మీ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు”. ( హదీసు గ్రంథం: బుఖారీ : 7018)
అంటే అల్లాహ్ తన దాసుల విషయంలో ఈ ప్రపంచంలో గానీ, పరలోకం లోగానీ, సమాధిలోగానీ ఎలా వ్యవహరిస్తాడన్నది ఎవరికీ తెలియదు. ప్రవక్తలకు, పుణ్యాత్ములకు కూడా తెలియదు. తమ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఇతరుల పరిస్థితి కూడా వారికి తెలియదు. ఒకవేళ ఎవరికైనా ఎప్పుడైనా ఫలానా వ్యక్తి విషయంలో మేలు జరుగుతుందని దైవికంగా తోచిన మాట ద్వారా తెలిస్తే అది ఒక సంక్షిప్త సమాచారం. అంతకు మించి అతను ఎక్కువగా తెలునుకోలేడు.
సారాంశం:
గోచరాలను తెలుసుకోవడానికి అల్లాహ్ మానవుడికి కొన్ని వనరులు ఇచ్చి వాటిని వినియోగించే శక్తిని ప్రసాదించాడు. కాని అగోచరాల తాళం చెవులు మాత్రం అల్లాహ్ వద్ద వున్నాయి. అతను తన ఇచ్చ ప్రకారం అందులో నుండి ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం తెలుపుతాడు. అత్యవసర సమయాల్లో ప్రవక్తలకు కూడా తెలుపుతాడు.
అగోచరజ్ఞానవాది మరియు అతన్ని ధ్రువీకరించేవాడు ఇద్దరూ బహుదైవాదరాధ కులే. ఎందుకంటే అగోచరాలు కేవలం అల్లాహ్ చేతిలోనే వున్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం నిర్దారితమైతే అది కేవలం యాదృచ్చికమే.
అగోచరాల చిన్నా-పెద్ద విషయాలు అల్లాహ్ పరిధిలోనే వున్నాయి. మానవుడు ఎప్పుడైన్నా ఎటువంటి వరుసలతోనైనా వాటి వరకు చేరలేడు. జ్యోతిష్యం, తాంత్రిక విద్య, శకునాలు మొదలగునవి షైతాన్ కుట్రలు.
అంతర్గత -బహిర్గత, దూర-సమీప ప్రార్థనలను ఆయనే వింటాడు. సహాయం చేస్తాడు. వేరేతరులను ఈ విధంగా అర్థించడం బహుదైవారాధన. వారు ప్రళయం వరకు కూడా వినలేరు.
అగోచరాల జ్ఞాన గుణం అల్లాహ్ సొంత గుణం. ప్రవక్తలు మరియు అంతిమ ప్రవక్త అగోచరాల జ్ఞానులు కారు. లేకపోతే వారు తమను, తమ అనుచరులను కష్టాల నుంచి రక్షించేవారు: దైవప్రవ క్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం శుభ వార్తాహరులు మరియు హెచ్చరించేవారు మాత్రమే.
ప్రవక్తల అసలు పని శుభవార్తలందించడం, హెచ్చరించడం మాత్రమే. వారు కూడా దాసులు మాదిరిగా అల్లాహ్ ముందు నిస్సహాయులు, అశక్తులు, విశ్వంలో అధికారం చేయడం కేవలం అల్లాహ్ సొంత గుణం,
ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు. వారు బుద్ధి మరియు అంచనాల ఆధారంగా ఏ విషయాన్నీ చెప్పరు. అల్లాహ్ వారికి వహీ (దైవవాణి) ద్వారా పంపిన సరైన విషయాలనే తెలుపుతారు.
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం , 4 వ అధ్యాయం నుండి తీసుకోబడింది:
విశ్వాస ప్రదాయిని(తఖ్వియతుల్ ఈమాన్)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్ ఇస్మాయీల్ (రహిమహుల్లాహ్)
ప్రకాశకులు: గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంధాలయం, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆం.ప్ర