కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్‌) పొందటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్‌) పొందటం :

కొత్తగా కనిపెట్టిన బిద్అతు(కల్పితాచారం)లలో ‘సృష్టితాల‘ నుండి “శుభం” పొందగోరటం కూడా ఒకటి. ఇది కూడా విగ్రహారాధనలో ఒక భాగమే. ఈ వల పన్నటం ద్వారా ఎంతోమంది బ్రతకనేర్చిన స్వార్ధపరులు అమాయక వ్యక్తుల జేబులు ఖాళీ చేస్తుంటారు.

బరకత్‌” అంటే ఏదైనా వస్తువులో శుభం, సమృద్ధి స్థిరంగా ఉండటం అని భావం.

ఇలాంటి శుభం లేక సమృద్ధి కొరకు ప్రార్థించాల్సింది అల్లాహ్ నే . ఎందుకంటే ఆ వస్తువును ప్రసాదించిన వానికే బరకత్ పొందుపరిచే శక్తి ఉంటుంది. ఆ పని అల్లాహ్‌ మాత్రమే చేయగలడు. ఎందుకంటే శుభాన్ని అవతరింపజేసేవాడు, దానిని స్థిరపరిచేవాడు అల్లాహ్‌ మాత్రమే. మనుషులకు, వేరే ఇతర సృష్టితాలకు బరకత్‌ని ప్రసాదించే శక్తిగానీ, బరకత్‌ అనే దానికి ఉనికినిచ్చే శక్తిగానీ, దానిని నిలిపి ఉంచే శక్తిగానీ ఉండదు.

కాబట్టి స్థలాల నుండి, చిహ్నాల నుండి, చనిపోయిన వ్యక్తుల నుండి “శుభం” (తబర్రుక్‌) పొందటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఆ వస్తువుకు శుభం చేకూర్చే శక్తి స్వత సిద్ధంగా ఉందని మనిషి గనక నమ్మాడంటే అది ‘షిర్క్‌‘ అవుతుంది. ఒకవేళ అతను ఫలానా వస్తువును సందర్శించటం, దానిని తాకటం, దానిని తన శరీరంపై స్పర్శించటం అల్లాహ్‌ తరపున బరకత్‌ ప్రాప్తికి సాధనమని నమ్మితే అది షిర్క్‌ కాదుగానీ, షిర్క్‌కు దోహదపడే ఒక సాధనమవుతుంది.

ఇక ప్రవక్త ప్రియ సహచరుల విషయానికి వస్తే వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కేశముల ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి లాలాజలం ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుజూ చేసిన నీళ్ల ద్వారా బరకత్‌ (శుభం) పొందేందుకు పోటీపడేవారు. అయితే ఇదంతా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) జీవించి ఉన్నంతవరకే జరిగింది. దీనికి ఆధారం ఏమిటంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత, సహచరులు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధి ఉన్న గదిలోకి వెళ్ళి శుభం పొందలేదు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్‌ చేసిన వివిధ స్థలాలకు వెళ్ళి, లేదా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) విశ్రాంతి పొందిన స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి “శుభం” పొందలేదు. కాబట్టి ఔలియాల (అల్లాహ్‌ ప్రియతములైన వ్యక్తుల) స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి శుభం పొందగోరటం ధర్మసమ్మతం కాదు.

అలాగే ప్రవక్త సహచరులు తమలోని గొప్ప వ్యక్తుల నుండి కూడా శుభం పొందేవారు కారు. ఉదాహరణకు : హజ్రత్ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హుమా), ఇంకా ఆ కోవకు చెందిన మరెందరో సహాబీల జీవిత కాలంలోగానీ, వారు మరణించిన తరువాత గానీ వారి నుండి శుభం పొందేందుకు యత్నించలేదు. వారు హిరా గుహ వద్దకు వెళ్ళి నమాజ్‌ చేయటంగానీ, దుఆ చేయటంగానీ చేయలేదు.అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)తో సంభాషించిన తూర్‌ పర్వత సందర్శన నిమిత్తం వెళ్ళటంగానీ, అక్కడ నమాజ్‌ చేయటం గానీ చేయలేదు. దైవప్రవక్తల సమాధులున్నాయని అనుమానించ బడుతున్న పర్వతాల వద్దకు, స్థలాల వద్దకు కూడా వారు వెళ్ళలేదు.

అలాగే మదీనా నగరంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నిత్యం నమాజ్‌ చేసే స్థలంలోనే నిలబడటంగానీ, మక్కాలో ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్‌ చేసీన స్థలాలలో తొలికాలపు మహనీయులు నిలబడటం గానీ, ఆ స్థలాలను తాకటంగానీ, ముద్దాడటం గానీ చేసేవారు కారు.

కాస్త ఆలోచించండి! మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి శుభప్రదమైన అడుగులు పడిన స్థలాలను, ఆయన నమాజ్‌ చేసిన స్థలాలనే తాకటం, ముద్దుపెట్టుకోవటం ఆయన అనుయాయులకు ధర్మసమ్మతం కానపుడు వేరేతరులు సంచరించిన, ఆరాధనలు చేసిన స్థలాలను, ప్రదేశాలను ముద్దాడటం ఎంత వరకు సమ్మతం? ఎంతవరకు సహేతుకం?

ఆ స్థలాలలో దేనినయినా తాకటం లేదా ముద్దుపెట్టుకోవటం మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) షరీయత్‌ ప్రకారం ధర్మసమ్మతం కాదన్న విషయం ఇస్తామీయ విద్వాంసులకు బాగా తెలుసు. (ఇఖ్తెజ  అస్సిరాతల్‌ ముస్తఖీమ్‌ – 2/795-802. డా. నాసిరుల్‌ అఖల్‌ పరిశోధన).


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 224-226)

%d bloggers like this: